మాతృదేవి చివరి రోజులలో ఒక రోజు. ఫాల్గుణ మాసం మొదటివారం. ఉదయం వెళ్లినప్పుడు గదిలో ఇంకెవరూ లేదు. అప్పుడు వారు దక్షిణంలో ఉన్న చివరి గదిలో ఉంటున్నారు. ఆ రోజుల్లో వారి ఆరోగ్యం కాస్త నయంగావుంది. పగటి వేళలో నేల మీద పరుపు పరిచి పడుకొనేవారు. నేను ప్రణమిల్లగానే ఇంట్లో అందరి క్షేమసమాచారాలూ విచారించారు.
నేను: అమ్మా! మీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఇంత బలహీనంగా మును పెన్నడూ మిమ్మల్ని చూసింది లేదు.
మాతృదేవి: అవును నాయనా! చాలా బలహీనంగానేవుంది. ఈ శరీరం ద్వారా గురుదేవులు ఏమేం చేయాలని సంకల్పించుకున్నారో అవన్నీ జరిగిపోయినట్లు తోస్తున్నది. ఇప్పుడు మనస్సు సదా ఆయననే కోరుకుంటూవుంది. మరేదీ ఇష్టపడడం లేదు. ఈ విషయాన్నే తీసుకో– రాధూను ఎంతగా ప్రేమించాను, ఆమె సంరక్షణకు ఎన్ని అవస్థలుపడ్డాను! ఇప్పుడు అంతా తలక్రిందులయిపోయింది. ఆమె నా వద్దకు వస్తేనే నాకు ఏమిటోలా ఉంటుంది. ‘ఈమె ఎందుకు ఇక్కడికి వచ్చి నా మనస్సును దిగువకు లాగడానికి ప్రయత్నిస్తూవుంది?’ అని అనిపిస్తోంది. గురుదేవులు తమ కార్యం కోసం వీటన్నిటి మూలంగా నా మనస్సును దిగువస్థితిలో ఉంచారు. లేకపోతే వారి నిర్యాణానంతరం నేను జీవించివుండడం సాధ్యమేనా?
నేను: అమ్మా ఇలాంటి మాటలు మమ్మల్ని ఎంతగానో బాధపెడుతున్నాయి! మీరు వెళ్లిపోతే ఇక మాకు మార్గాంతరమేమిటి? మాకు త్యాగం లేదు, తపస్సు లేదు. ఇక వైరాగ్యమంటారా – అది కించిత్తు కూడా లేదు! మీరూ లేకుండా ఈ మాయాప్రపంచంలో మేం ఎలా జీవించగలం? మనస్సు చంచలమైనప్పుడు మీ దగ్గరకు వస్తే దాని నుండి బయటపడడానికి మార్గం లభిస్తుంది. మీరు లేకపోతే మేం ఎక్కడికి వెళ్లాలి? మాకు ఇక గతే లేదు.
మాతృదేవి (గంభీరంగా) : ఏమిటి? మీకు గతి లేదా? గురుదేవులు మీకు దారి చూపడం లేదా? ఎందుకు ఇంతగా ఆరాటపడతావు? మిమ్మల్నందరినీ ఆయన పాదారవిందాలకు సమర్పించాను కదా! మీరు ఆ పరిధి లోపలే చుట్టిరావాలి. వేరెక్కడికి పోతారు. మిమ్మల్ని ఆయన సదా పరిరక్షిస్తున్నారు.
నేను: గురుదేవుల అనుగ్రహం గురించి ఆలోచన అప్పుడప్పుడు మెదలుతూ ఉంటుంది. కాని దానిని పూర్తిగా అర్థంచేసుకోవడం సాధ్యపడలేదు. విశ్వాసం ఉంది, సంశయం కూడా కలుగుతున్నది. మిమ్మల్నయితే ప్రత్యక్షంగా చూస్తున్నాను. మంచీ చెడులన్నిటినీ మనస్సు విప్పి చెప్పగలను. మీరు కూడా దారి చూపిస్తున్నారు. అందువలన మీ రక్షణలో ఉంటున్నాననే ప్రగాఢ విశ్వాసం ఉంది.
మాతృదేవి: రక్షించేది గురుదేవులొక్కరే అని సదా మనస్సులో ఉంచుకో. దీనిని మరచిపోతే అంతా తలక్రిందులవుతుంది. ఈ రోజు నీ కుటుంబం గురించీ, తల్లి గురించీ అడిగి వివరాలన్నీ తెలుసుకున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు తండ్రి లేనివాడివని ముందే గణేన్ నుండే తెలుసుకొన్నాను. నీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటున్నారు, నువ్వు వచ్చేస్తే కుటుంబాన్ని మీ తల్లి పోషించగలదా లేదా కూడా తెలుసుకుని, ‘పోనీలే! ఈ అబ్బాయి మంచి నిర్ణయం తీసుకొన్నాడు. ఈ మంచి దారిలో పయనించడానికి గురుదేవులు పెద్ద ఆటంకాలన్నిటినీ తొలగించి ఆశీర్వదిస్తారు’ అని అనుకున్నాను.
తల్లికి పరిచర్యలు చేయడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. అందులోనూ మానవాళికే సేవ చేయడానికి వచ్చిన మీరందరూ తప్పకుండా తల్లిని ఆరాధించి తీరాలి. మీ నాన్న డబ్బు కూడబెట్టి వెళ్లారు. లేకపోతే నువ్వు ఉద్యోగం చేసి మీ తల్లిని పోషించాలని నీకు చెప్పేదానను. గురుదేవుల అనుగ్రహంతో నీకు ఇలాంటి బాధ్యత లేకుండా పోయింది. ఇంటి నిర్వహణ ఒక స్త్రీ చేతిలో ఉండడం వలన, పరాయివారు ఆమెను మోసపుచ్చకుండా ఉండడానికి తక్కిన ఏర్పాట్లు మాత్రం నువ్వు చేస్తే చాలు. నీకు సంబంధించినంత వరకు ఇదే నీకు పెద్ద ఊరట కదా!
సరైన మార్గంలో డబ్బు సంపాదించడం ఎంతో కష్టం. డబ్బు మనస్సును మలినపరుస్తుంది. సాధ్యమైనంత వరకు సత్వరమే లావాదేవీలు ముగించమని అందుకే నీకు చెబుతున్నాను. కాస్త కాస్తగా ఎక్కువకాలం డబ్బు లావాదేవీలను చూస్తూవుంటే చాలు, నీ ఎరుకే లేకుండా దానిపట్ల ఆకర్షణ వచ్చేస్తుంది. డబ్బు అలాంటి వస్తువు! ‘నాకు డబ్బు మీద ఎలాంటి వ్యామోహమూ లేదు. ఒకసారి వదలించుకుంటే ఇక వదలించుకున్నట్లే. అనుకున్న క్షణం దాని నుండి నేను విడివడగలను’ అని నువ్వు అనుకోవచ్చు. అలా కాదు నాయనా! ఎప్పుడూ అలా అనుకోకు. అది నీకు తెలియకుండానే నీ గొంతుపట్టుకుని నొక్కేస్తుంది. ప్రత్యేకంగా ఈ విషయం నీకు చెబుతున్నాను. ఎందుకో తెలుసా? నువ్వు కలకత్తాకు చెందిన వాడవు. డబ్బుతో ఆట్లాడుకునేవాడవు. వీలయినంత తొందరగా నీ తల్లికి కావలసిన ఏర్పాట్లు చేసి కలకత్తా నుండి వెళ్లిపోవాలి.
నీ తల్లిని ఏ తీర్థస్థలాలకో తీసుకొని వెళ్లగలిగితే మంచిది. మామూలు తల్లీ కొడుకు అనే బంధం మరచి ఇద్దరూ భగవంతుణ్ణి అన్వేషింపవచ్చు. భర్తను కోల్పోయి దుఃఖీస్తున్న నీ తల్లికి ఈ సమయంలో నువ్వు ఇది ఏర్పాటు చేయగలిగితే ఎంతో మంచిది. నీ తల్లి కూడా పెద్దదయిపోయింది. నీ నిర్ణయాన్ని ఆమెకు చెప్పు. ఆమెతో కలిసి మాట్లాడు.
వెళ్లేదారిన పుణ్యం వెతకడంలో నీ తల్లికి సహాయపడగలిగినప్పుడే నిజంగా నువ్వు ఒక కుమారుడమా, తన తల్లిపట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించినవాడమా అవుతావు. నిన్ను పెంచి పెద్దచేయడానికి ఆమె ఎంత పాటుబడి ఉంటుంది? తన రక్తాన్ని పాలుగా మార్చేకదా నీకు పట్టించింది! దానిని త్రాగేకదా నువ్వు మనిషివయ్యావు. నీకు చెందినంత వరకు ఆమెకు సేవ చేయడమే మహోత్తమమైన ధర్మం. కానీ భగవదన్వేషణలో ఆమె ఒక అడ్డంకిగా ఉంటే అప్పుడు విషయం వేరు.
ఒకసారి నీ తల్లిని ఇక్కడికి తీసుకురా. ఆమె ఎలాంటి మనిషో నేను చూస్తాను. మంచిమనిషి అనిపిస్తే ఒకటి రెండు మాటలు మాట్లాడతాను. కానీ జాగ్రత్తగా ఉండు. తల్లికి పరిచర్యలు చేస్తున్నాననే నెపంతో సంసారంలో చిక్కుకోకు. నీ తల్లి ఒక వితంతువు. ఒక వితంతువు జీవించడానికి ఏమేం కావాలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి; అంతమాత్రమే! అంతకు మించి లేదు! ఇందుకు అంతగా డబ్బు ఎందుకు? ఈ ఏర్పాట్లకు డబ్బు కొంత ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినా దానిని త్వరగా తెమల్చడానికి ప్రయత్నించు. గురుదేవులు డబ్బును అసలు తాకలేరుకూడా. ఆయన పవిత్రనామాన్ని స్వీకరించి నువ్వు బయటికి వచ్చి ఉన్నావు. అందువలన ఆయన మాటలను సదా జ్ఞాపకముంచుకో. లోకంలో అన్ని అనర్థాలకూ మూలకారణం ధనమే. నువ్వు చిన్నవాడివి. చేతిలో డబ్బుంటే మనస్సు దానిపట్ల ఆసక్తి చెందుతుంది. జాగ్రత్తగా మసలుకో!
నేను: ఒకసారి మా అమ్మను మీ దగ్గరికి తీసుకురావాలనే అనుకున్నాను. కానీ మీ ఆరోగ్యం దృష్ట్యా ఆ ఆలోచన మానుకున్నాను.
మాతృదేవి: అలా చేయకు నాయనా! ఒకసారి మీ అమ్మను తీసుకురా! ఎంతమందో వస్తూనే ఉన్నారు కదా! శరీరమంటే రోజురోజుకు క్షీణిస్తూనే ఉంటుంది. ఉదయం తీసుకురాగలవు కదా! ఆలస్యంగా రావద్దు, లోపలికి రానివ్వరు.
నేను: అమ్మా! మీ మాటలు వినడానికి బాధగా ఉన్నాయి. మీ మాటల ధోరణి చూస్తే మీరు ఎక్కువ రోజులు శరీరాన్ని నిలుపుకోవడానికి ఇష్టపడనట్లు తోస్తున్నది.
మాతృదేవి: శరీరం ఉండడం, లేకపోవడం నా చేతుల్లో లేదు. అది ఆయన ఇచ్ఛ. అందుకోసం మీ రెందుకు కలవరపడాలి? నా దగ్గర మీరు ఎంతసేపు ఉంటున్నారు? మఠంలోనూ, బయటనే కదా మీ సమయమంతా గడుస్తూవుంది. నాతో మాట్లాడడానికీ నా సమీపంలో ఉండడానికీ ఎంత మందికి ఆస్కారం దొరకుతుంది? మీ రందరూ ఎప్పుడు ఎక్కడున్నారనే సంగతి కూడా నాకు తెలియ జేయడంలేదు.
నేను: మీతోపాటు ఉండే ఆస్కారం దొరకదనడం నిజమే. కానీ మీరు ఇక్కడ ఉంటున్నారు. మనస్సులో బలహీనత ఏర్పడినప్పుడు మీ సాన్నిధ్యానికి వస్తే మనస్సు నూతనోత్సాహాన్ని సంతరించుకుంటుందని మాకు బాగా తెలుసు.
మాతృదేవి: గురుదేవులు బహుశా ఈ శరీరాన్ని తోసిపుచ్చారనుకో – అప్పుడు మాత్రం నాకు విశ్రాంతి దొరకుతుందని అనుకుంటున్నావా? నేను ఎవరెవరి బాధ్యతలను స్వీకరించానో వారిలో ఒక్కరు మిగిలివున్నా నాకు విశ్రాంతి లేదు. నేను వారితో పాటు ఉండాలి. వారందరి బాధ్యతలూ స్వీకరించాను కదా!
మంత్రదీక్ష ఇవ్వడమనేది చిన్నపిల్లలాడుకునే ఆటా ఏమిటి? భుజస్కంధాలపై ఎంత భారం మోయాల్సి వస్తుందో! వారి కోసం ఎంత కలత చెందాలి! నీ విష యాన్నే తీసుకో! నీ తండ్రి మరణించాడు. అందువలన నా మనస్సు కూడా బాధ పడుతున్నది. గురుదేవులు నా తనయుడికి మళ్లీ ఒక పరీక్ష పెట్టారనిపిస్తున్నది. ఈ ఆవేదన నుండి నువ్వు ఎలా బయటపడతావో అనే నా మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది! అందుకే నీతో ఇంతగా మాట్లాడాను.
మీరందరూ ఇవన్నీ అర్థం చేసుకోగలుగుతారా ఏమిటి? అలా అర్థం చేసుకొని ఉండివుంటే నా ఆవేదన ఎంతగానో తగ్గివుండేది. గురుదేవులు ఒక్కొక్కరితో ఒక్కొక్కవిధంగా క్రీడిస్తున్నారు. పర్యవసానాలను నేను భరించాల్సి వస్తుంది, నాకు చెందినవారుగా స్వీకరించిన వారిని వదలివేయలేను కదా!
నేను: అమ్మా! మీరు లేకపోతే మేం ఎవరి దగ్గరకు వెళ్లగలం, మాకు ఏమవుతుందోనని ఆలోచించినా కూడా మనస్సు వణకిపోతున్నది.
మాతృదేవి: ఎందుకు? రాఖాల్–టాకల్ అంటూ నా తనయులు ఎంతోమంది ఉన్నారు. వారందరూ సామాన్యులా? నువ్వు రాఖాల్ను ఎంతో ప్రేమిస్తావు. కావలసిన దానిని ఆతణ్ణి అడుగు. నువ్వు అడగడానికి మాత్రం ఇంకా ఏముంది? ఎక్కువగా ప్రశ్నలు వేయడం మంచిది కాదు. ఒకదాన్నే జీర్ణం చేసుకోలేరు, ఇందులో పది విషయాలడిగి, దానినీ దీనినీ ఆలోచించి మనస్సు కెందుకు చాంచల్యం కలిగిస్తావు? నువ్వు దేనిని సంపాదించావో దానిలో గాఢంగా మునిగిపో! జపధ్యానాలు చేయి. సత్సంగం చేయి. ఎలాంటి కారణంగానైనా అహంకారం తలెత్తనివ్వకు. రాఖాల్ మనస్సు ఎలా చంటిపిల్లవాడి మనస్సులాంటిదో చూశావా? శరత్ను చూడు! ఎంత పనిచేస్తున్నాడు! ఎన్ని సమస్యలను మౌనంగా ఎదుర్కొంటున్నాడు! సన్న్యాసిగావుండి కూడా ఆతడు ఇవన్నీ ఎందుకు చేయాలి? వాళ్లు తలచుకుంటే రాత్రింబవళ్లు భగవంతుని స్మరణలో మనస్సును లయింపజేయగలరు. మీ శ్రేయస్సు కోసమే వాళ్లు తమ మనస్సును దిగువ ఉంచుకుని ఉన్నారు. వీళ్ల జీవితాలను నీ ఆదర్శంగా చేసుకో. వాళ్లకు సేవ చేయి. “నేను ఎవరి తనయుణ్ణి? ఎవరిని శరణు పొందాను” అనే విషయాన్ని ఎల్లప్పుడూ యోచిస్తూవుండు. మనస్సులో దురాలోచనలు వస్తే, “మాతృదేవి తనయుడినైన నేను ఇలాంటి పని చేయనగునా?” అని మనస్సుకు నచ్చజెప్పు. మనస్సు శక్తిమంతమవడమూ, ప్రశాంతమవడమూ నువ్వే చూస్తావు.