ధ్యాయేత్ సదా హృదయ పద్మ సుఖాసనస్థామ్
సచ్చిన్మయీం సకలధర్మ సమన్వయాం తామ్ ।
శ్రీరామకృష్ణ చరితామృత పుణ్యపూరాం
శ్రీ శారదాం త్రిజగదాం జననీం శరణ్యామ్ ॥
హృదయపద్మంలో కొలువై ఉన్నదీ, సత్యమే మూర్తీభవించినదీ, సకల ధర్మ సమన్వయమూర్తిగా భాసిల్లుచున్నదీ, శ్రీరామకృష్ణుల అమృత జీవనంతో పరిపూర్ణ మైనదీ, త్రిలోక జననిగా, ఆశ్రయదాయినిగా విరాజిల్లుతూన్న శారదామాతను సదా ధ్యానిద్దాం.
– స్వామి అభేదానంద
1. శ్రీకృష్ణ వ్యాకులతలో మాతృదేవ
గురుదేవుల మహాసమాధి తదనంతరం, ఆ దుఃఖంలో మాతృదేవి ఎలా మాకు అనుగ్రహాన్ని, ఆశీర్వాదాలను అందించారో వివరించలేను. బృందావనంలో మాతృదేవి సాన్నిధ్యంలో గడిపిన రోజులలో ఆమె ఎంతటి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొని ఉండేవారో మేం ప్రత్యక్షంగా చూసివున్నాం.
ఒక రోజు మాతృదేవి సమాధి స్థితిలో మగ్నులై ఉన్నారు. ఆమెతో ఉంటున్న భక్తురాండ్రు భగవన్నామాన్ని చెవులలో ఉచ్చరిస్తూ ఆమెను మామూలు స్థితిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ తరువాత నేను వెళ్లి గురుదేవుల దివ్య నామాన్ని బిగ్గరగా ఉచ్చరించినప్పుడే మాతృదేవి మెల్లమెల్లగా మామూలు స్థితిలోకి రాగలిగారు. ఆ భావపారవశ్య స్థితిలో మాతృదేవి పలుకులు, గొంతు, ఆహారం తినే తీరు, నడిచే విధం అన్నీ అచ్చం గురుదేవులను పోలి ఉన్నాయి. ప్రగాఢ ధ్యాన స్థితిలో ధ్యాతా, ధ్యేయమూ ఏకం చెందుతారని వినివున్నాం. శాస్త్రాలు దీనిని తాదాత్మ్య భావనగా అభివర్ణిస్తాయి.
శ్రీకృష్ణుని ఎడబాటును భరించలేని గోపికలు ఆయన స్మరణలోనే మగ్నులై పోయి, తమ వ్యక్తిత్వాలను కోల్పోయి, శ్రీకృష్ణుని మాదిరే ప్రవర్తించసాగారని భాగవతం వచిస్తూన్నది. మాతృదేవి కూడా తమ వ్యక్తిత్వాన్ని పూర్తిగా విస్మరించి, గురుదేవులతో ఏకమై అచ్చం ఆయన మాదిరే ప్రవర్తించారు. సమాధి స్థితి నుండి కిందికి దిగివచ్చినప్పుడు ఆమెను నేను కొన్ని నిగూఢమైన ప్రశ్నలు అడిగాను. అందుకు మాతృదేవి, గురుదేవుల మాదిరే సమాధానమిచ్చారు. గురుదేవులు సమా ధానమిచ్చే అదే వైఖరిలో, ఆయన సూచించే సోదాహరణలను, దృష్టాంతాలను చూపి సరళంగా మాట్లాడారు.
అలా మాతృదేవి గురుదేవులతో ఏకమై ఉండడం మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది. వారిద్దరూ విభిన్న రూపాలు దాల్చినా, నిజానికి ఒక్కరే అని మేం గ్రహించాం. ‘భగవంతుడా, నువ్వే స్త్రీని, నువ్వే పురుషుడవు’ అని శాస్త్రాలు వచిస్తు న్నాయి కదా! తమకూ, మాతృదేవికీ ఎలాంటి వ్యత్యాసమూ లేదని గురుదేవులే స్వయంగా అనేకసార్లు చెప్పివున్నారు.
ఈ స్థితిలో మాతృదేవి రెండు రోజులు గడిపారు ఆ తరువాత ఆమెలో గొప్ప మార్పు కనిపించింది. ఆమెలో నెలకొనివున్న ఎడబాటు, వేదన మాయమై, సదా ఆనందపారవశ్యంలో తేలిపోయారు.
కొన్ని సందర్భాలలో నిష్కళంకయైన చిన్న బాలికలా ప్రవర్తించేవారు. బృందా వనంలోని అనేక దేవాలయాలను దర్శించాలనీ, యమునాతీరంలో కృష్ణుడు, గోపి కలతో క్రీడ సలిపిన స్థలాలకు వెళ్లాలనీ మాతృదేవి చిన్నబాలికలా తమ అభిలాషను వ్యక్తంచేశారు. శ్రీకృష్ణుని కలుసుకోవడానికి ఆమె చూపిన ఆరాటం, కృష్ణ నామాన్ని వారు ఉచ్చరించిన తీరూ మాకు రాధను జ్ఞప్తికి తెచ్చాయి. బృందావనంలో బసచేసిన రోజులలో మాతృదేవి తమను రాధగానే భావించుకొన్నారని, ఆమె భక్తురాండ్రు తెలిపారు. నిరంతరం ధ్యానం, జపం, పారవశ్యస్థితిలో సదా మాతృదేవి నెలకొని ఉన్నారు.
హరిద్వార్ వరకు మేం మాతృదేవితో పయనించాం. హరిద్వార్‌లో ఆమె మనోస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక మామూలు యాత్రికురాలిలా గంగాతీరంలోని దేవాలయాల నన్నిటిని దర్శించారు. కాని హిమాలయాలను దర్శించినప్పుడు చేష్టలుదక్కి నిలబడిపోయారు.
కాని బృందావనాన్ని మాత్రమే మాతృదేవి అధికంగా ప్రేమించారు. అందు వలన త్వరలోనే బృందావనానికి తిరిగి వచ్చేశారు. మాతృదేవి బృందావనంలో గడిపిన రోజులలో, ఆమె సాన్నిధ్యంలో ఉన్నప్పుడే కృష్ణుని మహత్వం నాకు అవ గతమయింది.