ఒక సందర్భంలో స్వామి ప్రేమానంద ఇలా అన్నారు: “మాతృదేవిని ఎవరు అవగతం చేసుకోగలిగారు? ఎవరు అర్థం చేసుకోగలిగారు? జై మా! జై మా!” ఆయన నుండే ఈ క్రింది సంఘటన గురించి విన్నాను.
ఒకసారి స్వామీజీ బేలూరు మఠం నుండి మాతృదేవి దర్శనార్థం పడవలో వెళుతున్నారు. ఆయనతో స్వామి తురీయానంద కూడా ఉన్నారు. అది వర్షాకాలం. గంగానది నీరు కలుషితమై ప్రవహిస్తూన్నది. అప్పుడు స్వామీజీ 102° జ్వరంతో బాధపడుతున్నారు. పడవ పయనిస్తూన్నది. పడవ నుండి కాస్త వంగి స్వామీజీ కలుషితమైన ఆ గంగాజలాన్ని రెండు దోసిళ్లతో తీసుకొని త్రాగి తలపై జల్లుకొన్నారు. అది చూసి స్వామి తురీయానంద అలా చేయడం మూలంగా జ్వరం ప్రకోపిస్తుందని స్వామీజీతో చెప్పారు. అందుకు స్వామీజీ ఇలా జవాబిచ్చారు: “సోదరా! మాతృదేవి దర్శనార్థం వెళుతున్నాను. మనశ్శరీరాలలో కించిత్తు కళంకం కూడా ఉండరాదు. అలా ఉంటే సర్వనాశనమే. అందుకే నా మనస్సు భయంతో వణకిపోతున్నది.”
తూర్పు వంగదేశంలోని ఒక భక్తసమాజంలో పూజగది ఒకటి ఉంది. గురుదేవుల, మాతృదేవుల చిత్తరువులను అందులో ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. స్వామీజీ జన్మతః బ్రాహ్మణులు కారు. అందువలన ఆయన చిత్తరువును ఉంచడానికి తటపటాయించారు. ఆ విషయం విని మాతృదేవి ఉద్వేగపూరితురాలైనారు. కుల దురభిమానాన్ని పటాపంచలు చేసేలా గంభీర స్వరంతో ఆమె ఇలా అన్నారు:
“ఎక్కడ నరేన్‌ను ఆరాధించరో, అక్కడి పూజను గురుదేవులు స్వీకరించరు.”
ఇదే విధంగా తూర్పు వంగదేశంలోని మరొక భక్త సమాజంలోనూ జరిగింది. వారు తటపటాయించడానికి మరో కారణం ఉంది. గురువు ప్రక్క శిష్యుని చిత్తరువును ఉంచి పూజించవచ్చునా అనే సంశయం వారికి కలిగింది. దీని గురించి వారు మాతృదేవిని అడిగారు. అది విని మాతృదేవి గంభీర ముద్ర వహించారు. కాసేపు మౌనంగా ఉండిపోయారు. బహుశా తమ ప్రశ్నే ఆమెకు నచ్చలేదనుకొని వారు భయపడ్డారు. మౌనం వీడి గంభీర స్వరంతో మాతృదేవి ఇలా అన్నారు: “గురుదేవులు కనుక ఉండివుంటే ఇలా జరగనిచ్చేవారా?” ఆమె మాటలు విని తమ సంశయం న్యాయసమ్మతమైనదే అని వారు భావిస్తున్న సమయంలో మాతృదేవి మళ్లీ ఇలా అన్నారు:
“గురుదేవులు ఉండివుంటే నరేన్‌ను తమ ప్రక్కన ఇలా కూర్చోపెట్టుకొనేవారా? తమ ఒడిలో కదా కూర్చోపెట్టుకొని ఉండేవారు! ఆయన కంటిపాప కదా నరేన్!”
ఇలా అంటూ ఉండగా మాతృదేవి కళ్లు ఆర్ద్రమైనాయి. అక్కడున్న వారందరి కళ్లు చెమ్మగిల్లాయి.
ఒక రోజు స్వామి అభేదానంద, మాతృదేవి దర్శనార్థం వచ్చారు. మాతృదేవిపై తాను రచించిన ఒక స్తుతిని* గానంచేసి ఆమెకు వినిపించాలని ఆయన అభిలషిం చారు. ఈ విషయం మాతృదేవికి విన్నవించినప్పుడు ఆమె ఆశ్చర్యపోతూ, “ఏం స్తుతి?” అని అడిగారు. అందుకు స్వామి అభేదానంద వినమ్రంగా, “అమ్మా! మీ మీద రచించిన స్తుతి” అని చెప్పారు. ఆ మాట విని ఒకింత ఆశ్చర్యపోయిన మాతృదేవి, “నాయనా! నా గురించి ఒక స్తుతా?” అని అడిగారు.
స్వామి అభేదానంద ఆ స్తుతిని గానం చేశారు. ప్రశాంతంగా కూర్చొని మాతృదేవి ఆ స్తుతిని ఆలకించారు. ఆ స్తుతిలోని ‘రామకృష్ణ గత ప్రాణాం’ అనే పదాలను విన్నతోడనే ఆమె శరీరం నిశ్చలమైపోయింది. ‘తన్నామ శ్రవణ ప్రియాం’ అనే పదాలను వింటూ ఉండగానే ఆమె కళ్లు అశ్రుపూరితాలయ్యాయి. “తత్భావ రంజితాకారం’ అనే పదాలను ఆలకించగానే మాతృదేవి శ్రీరామకృష్ణమయంగా మారిపోయారని స్వామి అభేదానంద చెప్పారు. ‘అప్పుడు మాతృదేవి అక్కడ లేరు. గురుదేవులే ఆసీనులై ఉన్నారు. అలా కాకపోతే మాతృదేవియే బహుశా గురుదేవులుగా రూపాంతరం చెందివుండవచ్చు’ అని చెప్పారాయన. ఆయన మరేమి చూశారో, వాటి గురించి ఏమీ చెప్పలేదు.
పాడడం పూర్తికాగానే మాతృదేవి ఎంతో సంతోషించి స్వామి అభేదానందను, “నాయనా! నీ నాలుక మీద సరస్వతి తాండవించుగాక!” అని ఆశీర్వదించారు.
1912 నవంబరు. కాశీ. ఒక రోజు సాయంత్రం శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్రమానికి వెళ్లాను. అక్కడ శ్రీ మహేంద్రనాథ గుప్తా ఏదో పుస్తకం చదువుతూ కనిపించారు. కొందరు ఆయన చుట్టూ కూర్చొని వింటుండగా, స్వామి తురీయానంద పచార్లు చేస్తూ వింటున్నారు.
‘శ్రీ మ.’ నన్ను చూడగానే అలవాటు ప్రకారం, “ఓహో, ఎప్పుడు వచ్చారు? కూర్చోండి. తరువాత మాట్లాడుకోవచ్చు” అని అన్నారు. నేను కూర్చున్నాను. కాసేపటికి పఠనం పూర్తయింది. “గోపికా గీతం చదివారా?” అని నన్ను అడిగారు. “పద్ధతి ప్రకారం చదవలేదు. అక్కడక్కడ కాస్త చదివాను” అని జవాబిచ్చాను. “చదవండి. అద్భుతమైన గ్రంథం” అన్నారాయన.
తరువాత నాతో, “రోడ్డుకు అటువైపువున్న లక్ష్మీనివాస్ అనే ఇంట్లో మాతృదేవి బసచేసి ఉన్నారు. వెళ్లి దర్శనం చేసుకురండి” అని చెప్పారు.
అప్పుడు సాయంత్రమయింది.
దారిలో రాస్‌బిహారి మహరాజ్‌ను చూశాను. ఆయన నాతో, “మాస్టరుగారిని (‘మ’ ను) కలుసుకొని వస్తున్నారు కదా! ఆయనలో ఏమైనా మార్పు మీకు కనిపించిందా?” అని అడిగారు. నాకేమీ అర్థం కాలేదు. అప్పుడు రాస్‌బిహారి మహరాజ్ నాకు ఇలా విడమరచి చెప్పారు: “మాస్టరుగారి ప్రియతమ కుమార్తె ఒకరు నేడు కలరా సోకి బొంబాయిలో మరణించింది. కాసేపటి క్రితమే తంతి వచ్చింది. చూడండి, నేనొక బ్రహ్మచారిని, సంసార జీవితాన్ని త్యజించి వచ్చాను. అయినప్పటికీ నా బంధువులు ఎవరైనా మరణించారనే వార్త తెలిస్తే, కించిత్తు కూడా బాధపడకుండా ఇలా పుస్తకపఠనం చేస్తూ కూర్చోవడం నాకు అసాధ్యం. మాస్టరు గృహస్థులు, మేం సన్న్యాసులం! అయినప్పటికీ ఆయన ఎంతటి సమున్నత స్థితిలో ఉన్నారో దీనినిబట్టి అర్థంచేసుకోండి.”
నేను ఆశ్చర్యంతో అవాక్కయి, నిశ్చేష్టుణ్ణైపోయాను. పిదప రాస్‌బిహారి మహారాజ్ మాతృదేవి బసచేసివున్న చోటుకు ఎలా వెళ్లాలో వివరంగా చెప్పారు. నాతోపాటు ఇద్దరు యువకులు కూడా మాతృదేవి దర్శనార్థం వచ్చారు.
రాస్‌బిహారి మహరాజ్ సూచించిన ఇంటికి వెళ్లాం. అక్కడ మాతృదేవిగాని, ఇతరులెవరుగాని లేరు. ఆయన చెప్పిన ఇంటికే వెళ్లాం. కానీ ఒక్కరు కూడా కనిపించలేదు. అప్పుడే నా దృష్టి ఒక మూలకు వెళ్లింది. అక్కడ దళసరి వస్త్రం పూర్తిగా కప్పుకొని, తనను మరుగుపరచుకొన్న ఒక వ్యక్తి ఆకారం గోచరించింది. మాలో మేం కాస్త బిగ్గరగా మాట్లాడుకొన్నాం. కానీ ఆ వ్యక్తిలో ఎటువంటి చలనమూ కనిపించలేదు. ఆ వ్యక్తి మాతృదేవే అని అప్పుడు నాకు అర్థమైపోయింది.వెంటనే వెళ్లి ప్రణమిల్లాను. పాదాలే కనిపించలేదు. అందువలన పాదాలనుస్పృశించాలనే ఆకాంక్షను వదలిపెట్టి కిందికి దిగి వచ్చేశాను. నాతోపాటు ఆఇద్దరు యువకులు కూడా దిగి వచ్చేశారు. మాతృదేవిని బాగా దర్శించుకోలేకపోయాననే వ్యథ మనస్సును పీడిస్తూవుంది. కాశీవిశ్వనాథుణ్ణి, గంగను దర్శించడానికి బయలుదేరాను.
దారిలో ‘శ్రీ మ.’ కనిపించారు. నా భుజాల మీద చేతులు వేసి, “ఏమిటి? మాతృదేవిని దర్శించావా?” అని అడిగారు. “అవును మాస్టర్! ఒక గుడ్డ బొమ్మనుదర్శించాను. కాస్త దూరం నుండే ప్రణమిల్లగలిగాను” అంటూ జరిగినదంతాబాధతో చెప్పాను.
శ్రీ మ.: అవునూ! మీరు ఒంటరిగా వెళ్లారా లేక ఎవరినైనా వెంట తీసుకువెళ్లారా?
నేను: ఇద్దరు యువకులు నాతో వచ్చారు.
శ్రీమ: వారు మీకు పరిచయస్థులా?
నేను: లేదు. బహుశా మీరు మాట్లాడింది విని మాతృదేవిని దర్శింప వచ్చి ఉండవచ్చు.
అది విని ‘శ్రీ మ.’ బిగ్గరగా నవ్వారు.
శ్రీ మ.: మీకు మాతృదేవి దర్శనం ఎందుకు లభించలేదో తెలుసా? సహవాసదోషం వల్లనే. మీరు మాతృదేవి దర్శనార్థం వెళ్లారు. వాళ్లు పరమహంసదేవులసతీమణిని చూడటానికి వెళ్లారు. పరమహంసదేవులు సామాన్యమైన వ్యక్తా? ఆయనసతీమణిని అంత సులభంగా చూడడం సాధ్యపడుతుందా?
నేను కూడా నవ్వాను. అప్పుడు ‘శ్రీ మ.’ ఇలా అన్నారు:
“రేపు ఉదయం గంగలో స్నానం చేసి, పువ్వులు, పళ్లు తీసుకొని వెళ్లండి.కానీ ఒంటరిగా మాత్రమే వెళ్లండి.” ఏదో రహస్యం చెబుతూన్నట్లు అతి మెల్లగాచెప్పారు.
ఆ తరువాత, “ఎవరైనా మిమ్మల్ని అనుసరిస్తున్నట్లు తోస్తే, మరేదైనా చుట్టుదారిలో వెళ్లండి, ఒంటరిగా మాత్రమే!” అని చెప్పారు.
అదే విధంగానే మర్నాటి ఉదయం వెళ్లాను. లక్ష్మీనివాస్‌ను చేరుకొన్నప్పుడుతలుపు వద్దే మాతృదేవి నిలబడి కనిపించారు. మేలిముసుగులో ముఖం కనీకనపడనట్లుగా ఉంది. నిన్నటికీ ఇప్పటికీ ఎంత తేడా! మాతృదేవి వీరేనా అనే సంశయం నాలో తలెత్తింది. ఆమెనే ఈ విషయం అడిగాను.
నేను: మాతృదేవి మీరేనా అమ్మా?
మాతృదేవి: అవును నాయనా! నీ మాతృదేవిని నేనే.
నేను: నా మాతృదేవియా?
మాతృదేవి: అవును, మీ అందరి మాతృదేవిని.
నేను: మా అందరి మాతృదేవియా!
మాతృదేవి: అవును నాయనా! నేను లోకానికంతటికీ మాతృదేవిని.
మాతృదేవికి ప్రణమిల్లబోయాను. ఆమె నన్ను వారిస్తూ, “కాస్త వేచివుండు నాయనా!” అంటూ, “కృష్ణలాల్, ఓ కృష్ణలాల్” అని పిలిచారు. ఆయన రాగానే, “ఈయన తెచ్చిన పువ్వులు, ఇతర సామగ్రి పూజగదిలో ఉంచు. నేను గంగలో స్నానం చేసి వచ్చాక పూజ ప్రారంభిస్తాను” అని చెప్పారు.
కృష్ణలాల్ మహరాజ్‌కు పూజ సరంజామా అందించి మాతృదేవికి ప్రణ మిల్లడానికి వెళ్లాను. మళ్లీ ఆమె నన్ను వారిస్తూ, “కాసేపు వేచివుండు నాయనా!” అంటూ కృష్ణలాల్ మహరాజ్‌తో, “ఒక చెంబులో గంగాజలం తీసుకురా” అని చెప్పారు. ఆయన గంగాజలం పట్టుకొచ్చాక, “ఇతడు చేతులు కడుగుకొనడానికి కాసిని నీళ్లు ఇవ్వు” అన్నారు. అలాగే చేతులు కడుగుకొని మహదానందంగా మాతృదేవికి ప్రణమిల్లాను.
కానీ మాతృదేవి గంగాజలంతో చేతులు కడుగుకొనమని చెప్పడం నా మనస్సులో ఏదో మూల కలత పెట్టసాగింది. ‘నేను అంతటి పాపాత్ముడనా? అందుకే నన్ను పవిత్రుణ్ణి చేసి ఆ తరువాత ప్రణమిల్లడానికి అనుమతించారా?’ అనే ఆలోచన నాలో చెలరేగింది. అందరి హృదయాలలోనూ నెలకొని వారిని నడి పించేవారు మాతృదేవియే కదా! నా మనస్సులో చెలరేగిన ఆలోచనను కూడా ఆమె గ్రహించేశారు. మెల్లగా నవ్వారు. పిదప నాతో, “గురుదేవుల పూజ నిమిత్తం పూజాద్రవ్యాలు తెచ్చావు. అదే చేతులతో నా పాదాలను స్పృశించరాదు. అందుకే నాయనా నిన్ను చేతులు కడుగుకోమన్నాను” అని చెప్పారు.
నేను మరేం మాట్లాడలేకపోయాను. మాతృదేవికి ప్రణమిల్లి తిరిగి వచ్చాను. ఆమె వద్ద మంత్రదీక్ష పుచ్చుకోగోరాను. ఆ విషయం గురించి అడిగినప్పుడు, “నాయనా! ఇది అన్నపూర్ణ విశ్వనాథులు పాలించే స్థలం. ఇక్కడ మంత్రదీక్ష ఇచ్చే అధికారం లేదు. కలకత్తాలో మంత్రదీక్ష పుచ్చుకోవచ్చు. నేను అక్కడకు ఎప్పుడు వస్తానో ముందుగా తెలుసుకో” అని చెప్పారు.
మాతృదేవి నుండి మంత్రదీక్ష పుచ్చుకోవడం సాధ్యపడకపోవడంతో మనస్సు ఆవేదన చెందింది. అలాగే విశ్వనాథుని దర్శనానికి వెళ్లాను. దారిలో మళ్లీ శ్రీ మ కనిపించి, నా భుజాల మీద చేతులువేసి, “ఏమిటి, మాతృదేవిని దర్శించావా?” అని అడిగారు. జరిగిందంతా పూసగ్రుచ్చినట్లు ఆయనకు వివరించి చెప్పాను. నా ఆవేదనను కూడా తెలిపాను. అప్పుడాయన కాస్త బిగ్గరగా, “సూర్యచంద్రులు పాతాళంలోకి క్రుంగిపోవచ్చు, భూమి అపసవ్య దిశలో తిరగవచ్చు. కానీ మాతృదేవి మాట వృథాకాదు” అని అన్నారు.
నా మనస్సులో నూతనోత్సాహం పెల్లుబికింది. నా చెవులలో ఆ మాటలు ఇంకా మార్మోగుతూనే ఉన్నాయి. ‘సూర్యచంద్రులు పాతాళంలోకి క్రుంగిపోవచ్చు, భూమి అపసవ్యదిశలో తిరగవచ్చు. కానీ మాతృదేవి మాట వృథా కాదు.’
మంత్రదీక్ష పుచ్చుకొనే రోజు రానేవచ్చింది. మాతృదేవి పూజగదిలో ఆసీనులై ఉన్నారు. ప్రక్కనున్న ఆసనం మీద నన్ను కూర్చోమన్నారు. గురుదేవుల నుండి స్వీకరించిన జ్యోతిర్మయమైన మంత్రాన్ని నాకు ప్రసాదించారు. మాతృదేవి నోట ఆ మంత్రం వెలువడగానే నాలో ఒక రకమైన పారవశ్యం ఉప్పొంగింది. పూజామంది రంలో అమరివున్న గురుదేవులమూర్తిని చూపిన పిదప గోడపై వ్రేలాడుతున్న తమ ఛాయాచిత్రాన్ని చూపి, “వీటిని ధ్యానించినా చాలు నాయనా” అని ఆమె చెప్పారు. ఆమెకు ప్రణమిల్లి బయటకు వచ్చాను.
బయటకు వచ్చినప్పుడు, ‘ఆహా! మాతృదేవి నా తల మీద చేతులుంచి దీవించలేదే!’ అని అనుకొన్నాను. ఇంతలో వెనుక నుండి ఒక బ్రహ్మచారి వచ్చి, “మాతృదేవి మిమ్మల్ని పిలుస్తున్నారు” అని చెప్పాడు. లోపలకు వెళ్లగానే మాతృదేవి తమ చేయి నా తల మీద ఉంచి ఆశీర్వదిస్తూ, “ఇప్పుడు తృప్తిగా ఉందా!” అని అన్నారు. ఉద్వేగంతో మాతృదేవి పాదపద్మాలపై వ్రాలిపోయి, ప్రణమిల్లి, సెలవు పుచ్చుకొన్నాను.