నాకు మొదట ఆడపిల్ల పుట్టి, చనిపోయింది. ఆ తరువాత కవల ఆడపిల్లలు పుట్టి కొద్ది రోజుల్లోనే చనిపోయారు. అందువల్ల నేను సహజంగానే దుఃఖంలో మునిగిపోయాను. ఆ సమయంలోనే నా స్నేహితురాలైన సరళ నన్ను మాతృదేవి వద్దకు తీసుకువెళ్లింది.
అది 1915 వ సంవత్సరం. సరళ అప్పుడు సోదరి నివేదిత పాఠశాలలో ఉంటున్నది. ఆమె నన్ను తీసుకొని వెళ్లింది. అప్పుడు మాతృదేవి పూజ చేస్తున్నారు. వసారా నుండే ఆమెను చూడగలిగాను. అదే మాతృదేవిని ప్రప్రథమంగా నేను దర్శించడం. మాతృదేవి ప్రగాఢ ధ్యానమగ్నురాలై ఉన్నారు. చెప్పుకోదగ్గ అందగత్తె కారు ఆమె. కానీ ఆమె ముఖంలో దివ్యతేజస్సు భాసిల్లుతోంది. అవ్యాజ కరుణా మృతం ఆమె ముఖం నుండి జాలువారుతోంది.
కాసేపటి తరువాత మాతృదేవి కళ్లు తెరిచారు. పువ్వులు, నైవేద్యం సమర్పించి ఏకాగ్రచిత్తులై పూజ చేశారు. ఆమె పూజ ముగించి వసారాలోకి వచ్చిన పిదప మేం వెళ్లి ఆమెకు ప్రణమిల్లాం. “ఈమె ఎవరు?” అని మాతృదేవి సరళను అడిగారు. నా తల్లితండ్రుల గురించి చెప్పి, “ఈ మధ్యనే ఈమె కవల ఆడపిల్లలు చనిపోయారు. ఎంతో దుఃఖంలో ఉంది. అందుకే మీ వద్దకు తీసుకు వచ్చాను” అంది సరళ. కారుణ్యపూరిత స్వరంతో “ఓహ్! నా తల్లీ!” అంటూ మాతృదేవి నా తలను స్పృశించి, ఆశీర్వదించి, “వీలు దొరికినప్పుడల్లా ఇక్కడకు వస్తూవుండు” అన్నారు. గోలాప్ మాను పిలిచి ప్రసాదం ఇవ్వమన్నారు. చేతులు కడుక్కొని చరణా మృతం పుచ్చుకోమన్నారు. కాసేపయ్యాక మేం బయలుదేరాం. “మళ్లీ రా అమ్మాయీ! గురుదేవులు నీకు మనశ్శాంతి చేకూరుస్తారు. మళ్లీ రా” అన్నారు మాతృదేవి.
సంధ్యా సమయంలో మాతృదేవి, “దుర్గా దుర్గా, శివ శివ, లక్ష్మీనారాయణ, హరిబోల్ హరిబోల్, గురుదేవా గురుదేవా, రాధాశ్యాం, గంగా గంగా, బ్రహ్మవారీ* , గోవింద గోవింద, జై మా జగదంబా” అంటూ భగవన్నామాలను ఉచ్చరించేవారు.
ఒక రోజు భక్తుడొకరితో మాతృదేవి, “సదా గురుదేవుల ఉపదేశాలు జ్ఞాపకం ఉంచుకో. మనస్సు దానంతట అదే ప్రశాంతతను పొందడం చూస్తావు” అని చెప్పారు. మాతృదేవి ఈ ఉపదేశాన్ని నేను సదా జ్ఞాపకం ఉంచుకొన్నాను. జీవితంలో దుఃఖమూ కష్టమూ ఎదురైనప్పుడల్లా మాతృదేవి ఈ ఉపదేశాన్ని మననం చేసు కొంటాను. అందువలన ప్రశాంతత, శక్తీ పొందుతున్నాను.
ఒక రోజు నేను వెళ్లేసరికి మాతృదేవి గదిలో పలువురు భక్తురాండ్రు కూర్చొని ఉన్నారు. నన్ను చూడగానే వికసిత వదనంతో ఆమె, “రా అమ్మాయీ రా! ఈ రోజు నీ కుమార్తెను తీసుకురాలేదా? ఇంట్లో అంతా క్షేమమే కదా?” అని అడిగారు.
నేను: అవునమ్మా. అందరూ కులాసాగానే ఉన్నారు. నా కుమార్తెను తీసుకువస్తే మీకు ఇబ్బందిగా ఉంటుంది, ఇతరులకు విసుగ్గా ఉంటుంది. అందువలన మీతో ఎక్కువసేపు గడపలేకపోతున్నాను. అందుకే తీసుకురాలేదు.
మాతృదేవి: ఇవేం మాటలమ్మా! నాకు ఇబ్బందా? అలా ఏమీ నాకు అనిపిం చడం లేదు. చిన్న పిల్లలకు చిలిపి చేష్టలు తప్పవు కదా! రాధూను చూస్తున్నావు కదా! ఆమె చిలిపి చేష్టలు తక్కువా ఏమిటి? ఆమె తల్లి పూర్తిగా ఒక పిచ్చిది. మొండితనం, కొట్లాట అన్నీ నా పైనే చూపిస్తుంది. ఎంత మొండితనం! ‘పంచదార తడిగా ఉంటే ఆరబెట్టి తింటాను, పొడిగా ఉంటే తడిపి తింటాను’ అన్నట్లుగా ఉంది ఆమె మొండితనం! ఏదో రకంగా మొండితనం తగ్గిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలుపెడుతుంది. నన్ను ఎంతగా కొట్టి ఉంటుందో తెలుసా? ఈమె నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం చూసి మా అమ్మ, ‘సొంత కడుపున ఎవరూ పుట్టింది లేదు. ఎవరో కన్న పిల్లల నుంచి కలిగే ఇబ్బందుల నన్నిటినీ సహించి నువ్వు ఎలా నవ్వులు చిందిస్తూ ఉండగలుగుతున్నావు?” అని అనేవారు; ఎంతో కోపగించుకొనేవారు.
మాతృదేవి కాసేపు మౌనంగా ఉండిపోయారు.
ఒక భక్తురాలు: అమ్మా! ఒకవేళ ఇప్పుడు మీ అమ్మగారు బ్రతికివుంటే ఇంకా ఎంత ఆందోళన చెందేవారో కదా! ప్రస్తుతం ఎందరో పిల్లలు ‘అమ్మా, అమ్మా’ అంటూ మీ వద్దకొచ్చి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు! మేం మీ కడుపున పుట్టలేదు. మేము మీ బిడ్డలం కామా?
ఈ మాటలు విని మాతృదేవి నిటారుగా కూర్చున్నారు. గంభీరముద్ర వహిం చారు. పిదప కాస్త బిగ్గరగా ఇలా అన్నారు:
“ఏమంటున్నావు? మీరు నా కడుపున పుట్టలేదా? మరి ఎవరి కడుపున పుట్టారు? నా బిడ్డలు కారా? మరి ఎవరి పిల్లలు? నేను తప్ప మరో తల్లి ఉందా ఏమిటి? స్త్రీ లందరిలోనూ నేనే ఉన్నాను. తల్లులందరిలోనూ నేనే నెలకొని ఉన్నాను. ఎక్కణ్ణుంచి ఎవరు వచ్చినా, అందరూ నా బిడ్డలే. ఇది ముమ్మాటికీ నిజం. దీన్ని అర్థం చేసుకో. ‘అమ్మా’ అని సంబోధిస్తూ వచ్చేవారందరూ నా బిడ్డలే!
“నరేన్, రాఖాల్, శరత్, యోగీన్, నిరంజన్, గిరీష్బాబు, నివేదిత – వీరి నందరినీ చూసి మా అమ్మ కూడా ఈ నిజాన్ని గ్రహించింది. వారంతా నన్ను అమ్మా అని సంబోధించడం చూసి మా అమ్మ ఎంతో ఆనందించేవారు! ‘ఆహా! నా ప్రార్థనను నా తల్లి దుర్గ ఇప్పుడు ఆలకించింది! నా శారదకు ఎందరు బిడ్డలమ్మా! వారు నన్ను అమ్మమ్మా అని పిలిచినప్పుడు నా హృదయమే ద్రవించి పోయేది! వారు ధీమాగా నా వద్దకొచ్చి అన్నం పెట్టమన్నప్పుడు, మాట్లాడేటప్పుడు నా కెంత ఆనందంగా ఉంటుందో తెలుసా! అది వర్ణనాతీతం’ అనేవారామె. వారందరికీ మరమరాలు, లడ్డూలు వంటివి ఆనందంగా పంచిపెట్టేవారు. వారూ కే రింతలు కొడుతూ సంతోషంగా తినేవారు. అది చూసి పొంగిపోయిన సంతోషంతో మా అమ్మ నవ్వేవారు. ఆమె ముఖంలో ఎటువంటి తృప్తి తాండవించేదో తెలుసా! అప్పుడు ఇంతమంది ఆడవారు లేరు. జయరాంబాటికి ఇంతమంది స్త్రీలు వచ్చేవారు కారు. జయరాంబాటికి స్త్రీలు రావడం ప్రారంభమయ్యేసరికి మా అమ్మ గతించింది. ఏదిఏమైనా తాను చనిపోవడానికి ముందుగా నా మాతృత్వాన్ని చూసిన మా అమ్మ సంతోషంగానే వెళ్లిపోయింది.”
మాతృదేవిని ఈ ప్రశ్న అడిగిన భక్తురాలు తప్పకుండా మాసికంగా క్షోభ చెంది ఉంటుందనే చెప్పాలి. మాతృదేవి మాట్లాడడం ఆపగానే ఆమె మాతృదేవి పాద పద్మాలు పట్టుకొని విలపించసాగింది. అప్పుడు మాతృదేవి ఆమె తల నిమురుతూ, “అమ్మాయీ! అన్నింటినీ అవగతం చేసుకొనే తరుణం ఇంకా ఆసన్నం కాలేదు. అందుకే కదా నా బిడ్డలు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. సముచిత సమయం రాగానే అన్నీ అర్థం అవుతాయి” అని చెప్పారు. అసలు విషయం ఏమిటంటే, ‘మేం మీరు కన్న బిడ్డలం కాము’ అని చెప్పడం మాతృదేవి జీర్ణించుకోలేకపోవడమే!
ఆ భక్తురాలు తనను క్షమించాల్సిందిగా మాతృదేవిని పదేపదే వేడుకొన్నది. క్షమాగుణంతో మూర్తీభవించివున్న మాతృదేవి కూడా నవ్వుతూ ఆమెకు అర్థ మయ్యేలా అంతా వివరించారు. ఈ దృశ్యం చూసి కంట తడిపెట్టనివారు అక్కడ ఎవరూ లేరు.
కాసేపయ్యాక మాతృదేవి ఇలా అన్నారు:
“ఇలా చూడమ్మా! సమస్తాన్నీ అంత సులువుగా గ్రహించడం సాధ్యమా? సంసార జీవితంలో ఎన్ని కష్టాలో చూడు. ఈ క్లేశాలను చూసే కదా భగవంతుడు మళ్లీ మళ్లీ దిగివస్తాడు. కానీ అవతార పురుషుడుగా దిగివచ్చిన భగవంతుణ్ణి ఎందరు తెలుసుకోగలుగుతారు? ఎంతమంది గ్రహించగలరు? వారు నిష్క్రమించిన తరువాతే క్రమంగా గ్రహించగలుగుతారు.”
తాము జగజ్జనని అవతారమని మాతృదేవి సూచనగా తెలుపుతున్నారా? ఆమె లోకానికి మాతృదేవి అని ఇప్పుడు అందరూ అర్థం చేసుకోలేకున్నారు. క్రమ క్రమంగా అర్థం చేసుకోగలరా?
తరువాత ఆ రోజు మరే సంభాషణా జరగలేదు. ఒకింత సేపయ్యాక మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నాను.
నాలుగైదు రోజులు వరుసగా మాతృదేవిని చూడకపోతే మనస్సు ఏదోలా అయిపోయేది. ఒక రోజు నా కుమార్తె శాంతిని తీసుకొని మాతృదేవి ఇంటకి వెళ్లాను. అప్పుడు ఆమె కాళ్లు చాపుకొని నేల మీద కూర్చొని ఉన్నారు. ఒక భక్తురాలు ఆమె పాదాలు ఒత్తుతూవుంది. నన్ను చూడగానే “రా అమ్మాయీ! ఈ రోజు శాంతి కూడా వచ్చిందే!” అన్నారు నవ్వుతూ. శాంతి, మాతృదేవికి ప్రణమిల్లగానే ఆమె చుబుకాన్ని స్పృశించి ఆశీర్వదించారు మాతృదేవి. ఆ తరువాత ఇలా అన్నారు:
“పిల్లల్లో భగవంతుని సాన్నిధ్యం ఉంటుంది. వారిలో భగవంతుని అభివ్యక్తీకరణ ఎక్కువ. ఎందుకంటే వారంతా కల్లాకపటం లేనివారు, కల్మషరహితులు, పవిత్రులు. అందువల్లే గురుదేవులు, ‘చిన్నపిల్లవాని మనస్సుతో పిలిస్తే దేవి పరుగెత్తుకొంటూ వస్తుంది’ అనేవారు.”
ఇలా అని ఆమె మౌనం వహించారు. ఆమె అంతర్ముఖులైనట్లు కనిపించారు. కాసేపు తరువాత మళ్లీ ఇలా అన్నారు:
“ఆహా! గురుదేవులు అలాగే ఉండేవారు. సమస్తాన్నీ మరచి, ‘అమ్మా, అమ్మా’ అంటూ దేవిని పిలిస్తే ఆమె పరుగున వస్తుందని తమ స్వీయ అనుభవం ద్వారా లోకానికి నిరూపించి చూపారు. మీ రందరూ మాతృమూర్తులు, మీరే చెప్పండి. మీరు ఒక పనిలో లీనమైపోయి పనిచేస్తూన్నప్పటికీ మీ బిడ్డ, ‘అమ్మా అమ్మా’ అంటూ ఏడుస్తూ పిలిస్తే, మీరు కేవలం చూస్తూ ఉండిపోతారా? ఆ పనిని అలాగే వదలిపెట్టి పరుగెత్తుకొంటూ వచ్చి బిడ్డను రెండు చేతులూ చాచి ఎత్తుకొని హృదయా నికి హత్తుకోరా?”
మాతృదేవి ఇలా చెప్పడం విని మేమందరమూ నవ్వాం. ఆమె కూడా నవ్వి, “ఏం, ఏం నేను సరిగ్గా చెప్పలేదా?” అని అడిగారు. మేమూ నవ్వుతూ, “సరిగ్గానే చెప్పారమ్మా” అన్నాం.
ఇంటి పనుల ఒత్తిడి వలన మాతృదేవి వద్దకు తరచూ వెళ్లలేకపోయాను. అందువలన మనస్సు ఎంతో ఆవేదనకు గురైంది. ఒక రోజు ఇది గమనించి మాతృదేవి, నాతో ఇలా అన్నారు:
“అమ్మాయీ! ఎందుకు కలత చెందుతావు? సంసార భారాన్ని కూడా గురు దేవులే కదా ఇచ్చారు! సంసారపు పనులను చేయడం మీ కర్తవ్యం. పనులు పూర్తయినప్పుడే కదా ఇక్కడకు రావడం సాధ్యం. సుధీర, సుమతి, సరళ – వీరందరినీ చూశావు కదా! వీరుగూడా అంతేకదా! పనులు పూర్తిచేసుకొనే కదా ఇక్కడకు వచ్చేవారు. కోరినంత మాత్రాన అంతా జరిగిపోతుందా తల్లీ! కోర్కెలు ఈడేరడం మన చేతుల్లో లేదు, భగవత్సంకల్పానుసారమే అంతా జరుగుతుంది.”
నాలుగైదు రోజులు గడిచాక మాతృదేవి దర్శనానికి వెళ్లాను. నాడు సెలవు రోజు. ఒంటరిగానే వెళ్లాను. అప్పటికే మాతృదేవి గదిలో చాలామంది ఉన్నారు. నేను ప్రణమిల్లగానే నవ్వుతూ నా చుబుకం స్పృశించి, “కూర్చో అమ్మా” అన్నారు మాతృదేవి. సరళ, సుధీర కూడా ఉన్నారు. తమ పక్కన కూర్చోడానికి వారు చోటిచ్చారు.
“ఆ రోజు మాతృదేవిని ఏదో అడగాలన్నావు కదా! ఏమిటది?” అని నన్ను అడిగింది సుధీర. అందుకు నేను, “అదేమంత ముఖ్యమైన విషయం కాదు. నాడు మాతృదేవి పిల్లలను గురించి చెప్పారు. కొందరు పిల్లలు మందకొడిగా ఉంటారు. వారిలో ఉత్సాహాన్ని పెంపొందించడం ఎలా? వారిని కూడా మామూలు పిల్లల్లా పెంచడమెలా? ఈ విషయాలు అడగదలచుకొన్నాను” అని చెప్పాను.
అది విని మాతృదేవి నవ్వుతూ ఇలా అన్నారు:
“ఇదేం చోద్యం అమ్మా! మీరందరూ మాతృమూర్తులు కదా! పిల్లల మనస్తత్వం ఎలా గ్రహించాలో నేను మీకు నేర్పాలా? అసలు విషయం ఏమిటంటే – వారితో సహజంగా మెలగాలి, సరళంగా మాట్లాడాలి. సమవయస్కులైన పిల్లలతో ఆడుకో నివ్వాలి. ఎక్కువగా తిట్టకూడదు, కసురుకోకూడదు. ఎక్కువగా గద్దించడం వలనా, కొట్టడం వలనా పిల్లలు మరింత మందకొడిగా తయారవుతారు; మీకు దూరమవు తారు. చెప్పవలసింది ప్రేమగా చెబితే వారు సులభంగా గ్రహిస్తారు. వారు ఏమైనా ప్రశ్నించినప్పుడు గదమాయించో, బెదిరించో అడ్డు తగలరాదు. గదమాయించడమో, భయపెట్టడమో చేస్తే వారు ఏదీ వినరు. అలా చేస్తే వారి మనస్సులు కూడా స్వాభావికంగా వికసించకపోవడం కద్దు.”
ఒక రోజు ఒక భక్తురాలు మాతృదేవిని ఇలా అడిగింది: “అమ్మా! కామినీ కాంచన పరిత్యాగాన్ని గురుదేవులు పదే పదే వక్కాణించివున్నారు. సంసార జీవితం గడుపుతున్న వారంతా భార్యాబిడ్డలను, బంధుగణాన్ని వదలుకుంటే వారి గతి ఏమవుతుంది? సంసార జీవితం గడుపుతున్నందు వలన గురుదేవులు మమ్మల్ని ప్రేమించక వదలివేస్తారా? గృహస్థుడు – సన్న్యాసి, ఆడ–మగ – ఇలా అందరినీ సృజించింది ఆయనే కదా! మాకు ఆయన కృపాకటాక్షం లభించకుండాపోతుందా?”
ఈ ప్రశ్నతో మాతృదేవి ఒకింత గంభీరంగా ఇలా అన్నారు:
“అదేం మాటలమ్మా? సంసారంలో ఉంటే గురుదేవుల ప్రేమ, ఆప్యాయత, అనుగ్రహం లభించదా? ఇటువంటి ఆలోచన నీకెలా వచ్చింది? ఇది సత్యదూరం. సన్న్యాసుల కంటే గృహస్థుల గురించే ఆయన ఎక్కువగా ఆరాటం చెందారు. ‘వారు దుఃఖంలో అలమటిస్తున్నారు. ఎన్నెన్నో కష్టాలు భరిస్తున్నారు. సంసారం నుండి బయటపడాలని తపించిపోతున్నారు. కానీ పాపం బయటపడలేకున్నారు. అనేకులు భగవంతునికై పరితపిస్తున్నారు. కానీ సంసారమనే వలలో చిక్కుకొని బయటపడలేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు’ అనేవారు గురుదేవులు. ఆయన ఎలా ప్రార్థించేవారో నీకు తెలుసా! “గృహస్థుల దుఃఖం అంతులేనిది. అందుకే నేను జగజ్జననిని, ‘అమ్మా! వారి మనస్సులను భక్తితో నింపు. వారు ప్రశాంతతను పొందనీ!’ అనేవారు. ‘ఒక చేతితో భగవంతుణ్ణి పుచ్చుకో, మరొక చేతితో ఇంటి పనులు చక్కదిద్దుకో’ అంటూ ఆయన బోధించడం నువ్వు కథామృతంలో చదవ లేదా?
“సన్న్యాసులు భగవంతుని కోసం సర్వస్వమూ త్యజించి సంసారం నుండి వైదొలగినవారు. వారికి సంసారం పట్ల ఎటువంటి అనురక్తీ ఉండదు. గృహస్థుల విషయం అలాంటిదా! ఎంత మాయ, ఎంత మోహం, ఎంత బాధ్యత, ఎన్నికర్తవ్యాల నడుమ వారు జీవితం గడపవలసి వస్తుంది. వారి భుజస్కంధాలమీద వేయి కిలోల భారం మోపబడింది. అందువల్లే గురుదేవులు గృహస్థులకై అంతగా ఆరాటం చెందారు. ఆయనకు స్త్రీ పురుష భేదం లేదు. భక్తుల కోసం ఎంతగా ఆరాటం చెందారో అంతగా భక్తురాండ్ర నిమిత్తమూ ఆరాటపడ్డారు. గురుదేవులు మిమ్మల్ని ఎంతగానో అభిమానిస్తున్నారమ్మా! ఈ సంగతి సదా జ్ఞాపకముంచుకో!”
ఒక రోజు ఒక భక్తురాలు మాతృదేవిని ఇలా ప్రశ్నించింది: “అమ్మా! మేంసంసారులం. కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలను, ఇష్టాలను తీర్చడంతోనే అలసిపోతున్నాం. గురుదేవులను స్మరించడానికి ఐదు నిమిషాలు కూడా తీరికలేకున్నది. మా గతి ఏమిటి? ఆయన కృప మాకు లభించదా?”
మాతృదేవి: తప్పక లభిస్తుందమ్మా! ఆయన అంతర్యామి. అందరి హృదయాల లోనూ ఆయన నెలకొని ఉన్నారు. నువ్వు మనసారా ప్రార్థిస్తే ఆయన తప్పకదానిని అర్థం చేసుకొంటారు. అంతేకాదు; కుటుంబంలో పని అని చెప్పావు. ఆపనులు నువ్వా చేస్తున్నావు? ఆయనే కదా చేయిస్తున్నది! కుటుంబం కూడా ఆయనదే కదా! ఆయన సంకల్పం లేకుండా ఏదైనా జరుగుతుందా? చెట్టు ఆకుకూడా ఆయన సంకల్పం లేకుండా కదలదు! ‘కృష్ణుడు సంకల్పించకపోతే ఏ పనీ జరగదు.’ నీ మనస్సులో ఈ వ్యాకులత తలెత్తిందే, అది కూడా ఆయన సంకల్పం వల్లే జరిగిందని గ్రహించు! ఆయనను ఎవరు ప్రేమిస్తారో, వారిని ఆయన కాపాడతాడు. నువ్వు ఆయనను ప్రేమించినా ప్రేమించకున్నా ఆయన నిన్ను ప్రేమిస్తారు.
“మీరు ఆయనను కించిత్తు స్మరించినా చాలు, ఒకింత ధ్యానించినా చాలు!కానీ మనఃప్రాణాలను జోడించి చేయండి. వ్యాకులతతో ఆయనను ప్రార్థించండి!ఆయనను స్మరించండి! ఆయనను ధ్యానించండి! రోజు గడచిపోయే వేళ రెండు కన్నీటి చుక్కలు రాల్చి నామజపం చేయండి! ఈ రెండు చుక్కల కన్నీరు కాకపోతేమీ దగ్గర మరేం ఉన్నది చెప్పండి చూద్దాం! వేరే ఉన్నవన్నీ ఆయనవే! ఈ రెండు కన్నీటి బిందువులే మీవి! వాటిని ఆయనకు అర్పించండి. అలా అర్పించారంటే ఆయన మీ స్వాధీనంలో ఉంటారు. భయమెందుకమ్మా? గురుదేవులు ఈసారి అవతరించడం మీ కోసమే! భగవంతుణ్ణి చేరుకోవడానికి మీకు ఇంత సుగమమైనమార్గం చూపించి వెళ్లారు ఆయన!”
ఒక రోజు మాతృదేవి దర్శనార్థం వెళ్లాను. మనస్సు ఎంతో అయోమయ స్థితిలో ఉంది.
నేను: అమ్మా, ఎంత ప్రయత్నించినా మనశ్శాంతి లభించడం లేదు. సంసారా నలంలో దహించుకుపోతున్నాను. మీ వద్ద కొచ్చి మాట్లాడినప్పుడే మనశ్శాంతి పొందుతున్నాను.
నా కళ్లు ఆర్ద్రమవడం చూసి మాతృదేవి ఇలా అన్నారు:
“జరిగేదంతా గురుదేవుల అనుగ్రహం వల్లే జరుగుతోందని నువ్వెందుకు మరచిపోతున్నావమ్మా? ఇదిగో నా వద్దకు వచ్చావు – ఇదీ ఆయన సంకల్పమే కదా! భగవంతుణ్ణి ప్రేమించు. పిల్లలకు కూడా భగవంతుణ్ణి ప్రేమించడం నేర్పించు. ‘భగవంతుడు నా వాడు’ అనే భావనలో ఆయనను ప్రేమించడం పిల్లలను నేర్చుకోనీ!
“పూర్వజన్మ కర్మల మేరకే ప్రతివ్యక్తీ ఈ ఇలలో జన్మిస్తున్నాడు. అందుకే కొందరు చిరుప్రాయం నుండే భగవంతుణ్ణి కోరుకోవడం చూస్తున్నాం. కొందరు పెరిగి పెద్దయ్యాక దారి తప్పవచ్చు. అంతా స్వీయకర్మ ఫలితమే! కానీ ఆయన అనుగ్రహముంటే, తాను లిఖీంచింది తానే చెరిపివేస్తాడు. ఆయన వ్రాసింది ఆయనే తుడిపివేస్తాడు. అందుకే కదా ఆయన ‘కపాల మోచనుడు’ అని పేర్కొనబడ్డాడు. అంతా ఆయన చలవే! అందువల్ల ఆయనకు నిన్ను నువ్వు అర్పించుకో.”