భవానీపూర్ నుండి నేను, నా భర్తా కుమారుడూ మాతృదేవి దర్శనార్థం ఉద్బోధన్ వెళ్లాం. అప్పుడు మేడ మీది మధ్యగది తలుపు వద్ద నిలబడి మాతృదేవి ఎవరితోనో మాట్లాడుతున్నారు. నేను నమస్కారం చేయగానే, “ఎక్కడ నుండి వస్తున్నావమ్మా?” అని అడిగారు. మేం చిరకాల పరిచయస్థులమన్నట్లుగా ఆమె మాతో మెలగారు. “మా ఇల్లు ఢాకాలో ఉంది” అన్నాను నేను. ఇంతలో గోలాప్ మా వచ్చి “రాంబాబు, నితాయ్బాబు వచ్చారు” అని చెప్పారు. అప్పుడు కపిల్ మహరాజ్ మాతో, “మీరు కాసేపు వేచివుండండి. బలరాంబాబు కుమారుడు, అల్లుడు వచ్చారు. మాతృదేవి వారితో మాట్లాడిన పిదప మీరు మాట్లాడవచ్చు” అని చెప్పారు. ఈలోపు నితాయ్బాబు అక్కడకు వచ్చాడు. ఆయనతో ఒకటి రెండు మాటలు మాట్లాడిన తరువాత, నాకు రెండు రసగుల్లాలు ఇచ్చి, పూజామందిరంలో రాంబాబును కలుసుకోవడానికి ఆమె వెళ్లారు.
ఆయనతో మాట్లాడి తిరిగి వచ్చాక నా చేతిలో రసగుల్లాలు అలాగే ఉండడం చూసి మాతృదేవి, “వాటిని ఎందుకు తినలేదమ్మా? అది ప్రసాదం. వాటిని తిను” అని చెప్పారు. ఇంతలో ఒక భక్తురాలు వచ్చి, “ఉన్న అన్ని మిఠాయిలనూ అందరికీ పంచిపెట్టేశారు. ఇక మేం ఏం తినాలి?” అని మాతృదేవిని అడిగింది. ఆ మాట విని నాకు సిగ్గేసింది. వెంటనే ఆమెతో, “ఇవిగో ఈ రసగుల్లాలు తీసుకోండి” అన్నాను. అందుకు ఆమె, “వద్దమ్మా. నీ గురించి అనలేదు. నీ కిచ్చిన దానిని నే నెలా పుచ్చుకొంటాను?” అన్నది. అప్పుడు మాతృదేవి కల్పించుకొని, “ఇదంతా వీరితో చెప్పకు. మనస్సు బాధపడుతుంది. ఈ రోజు ఎక్కువమంది భక్తులు రావడం వలన, ప్రతి ఒక్కరికీ రెండే మిఠాయిలు ఇచ్చినా, మిఠాయిలు కొరవడ్డాయి. ఎంతో ప్రయాసపడి ఇక్కడకు వచ్చారు. వారితో ఇలా మాట్లాడవద్దు” అని ఆమెతో చెప్పారు. పిదప మాతృదేవి మరీ మరీ చెప్పడంతో నేను ఆ రసగుల్లాలు తిన్నాను. త్రాగడానికి నీరు కూడా ఆమే తెచ్చి ఇచ్చారు. “రసగుల్లాల పాకంనేల మీద పడింది. దాన్ని తడిగుడ్డతో తుడిచివేసి, చేతులు కడుక్కో” అన్నారుమాతృదేవి. నేను అలానే చేశాను. పిదప, “నాకు ఒక్క కుమారుడు…” అంటున్నప్పుడే, అతడు అక్కడకు వచ్చాడు. “ఇతడే నా కుమారుడు” అని మాతృదేవికి అతణ్ణిపరిచయం చేశాను. అతడు నమస్కరించి వెళ్లిపోయిన తరువాత మాతృదేవి నాతోమాట్లాడసాగారు.
మాతృదేవి: నీ కుమారుడికి వివాహమయిందా?
నేను: లేదమ్మా.
మాతృదేవి: ఏకైక పుత్రుడు కదా! ఎందుకింకా వివాహం జరిపించలేదు?
నేను: అతడు వివాహం చేసుకోవడానికి ఇష్టపడడం లేదు.
మాతృదేవి: ఆహా! ఈ రోజుల్లో యువకులకు ఇలా మాట్లాడడం నాగరికమైపోయింది. ఎందుకు వివాహం చేసుకోకూడదు? వివాహం చేసుకొంటే ఆధ్యాత్మికజీవితం గడపలేమా? అంతా మనస్సుకు సంబంధించినదే కదా! గురుదేవులునన్ను వివాహం చేసుకోలేదా? కనీసం అతడు మంత్రదీక్ష అయినా పుచ్చుకొన్నాడా?
నేను: ఆ! మీ వద్దే పుచ్చుకొన్నాడు.
మాతృదేవి: మంచిది. అలా అయితే ఎందుకు వివాహం చేసుకోకూడదు?నేనే అతడికి చెబుతాను. ఒకవేళ యాతనలు పడకుండా జీవించగోరుతున్నాడేమో!యాతనలను, క్లేశాలను అనుభవిస్తూ భగవంతుణ్ణి వదలక గట్టిగా పట్టుకొన్నవాడేతప్పక ఆయనను పొందగలడు. అయితే ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి?
నేను: అమ్మా! వాడికి ఏది మంచిదో నాకు తెలియదు. అది మీకే బాగాతెలుసు. అందువలన మీరు ఎలా చెబితే అలా చేస్తాం. నా కంటూ ఎలాంటి అభిప్రాయమూ లేదు.
మాతృదేవి: చూడమ్మా! అత్యున్నత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవారు మాత్రమే సన్న్యాసులై సమస్త బంధాలనూ ఛేదించుకుపోగలుగుతారు. కొందరు సుఖభోగాలను అనుభవించడానికే జన్మిస్తారు. సుఖదుఃఖాలను పూర్తిగా అనుభవించివేయడమేమంచిదని నేనంటాను. గురుదేవుల సహచరుల విషయం మాత్రం వేరు.
నేను: అమ్మా, అతడు మీ బిడ్డడు. అతడి మంచి చెడులన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి! ఏం చేయాలో దాన్ని చేయండి.
మాతృదేవి: నేను చెబుతున్నాను, అతడు వివాహం చేసుకోనీ! అన్నిటినీ పూర్తిగా అనుభవించనీ! లేకుంటే ఎక్కణ్ణుండి ఏ కోర్కె అంకురిస్తుందో ఎవరి కెరుక! కానీ ఒక్క విషయం తెలుసుకో – గురుదేవులు ఒక వ్యక్తిని పట్టుకొన్నారంటే, ఆ వ్యక్తికి ఇక పతనం ఉండదు. నువ్వు స్థిమితంగా ఉండు. గురుదేవులు అనుగ్రహించిన సిద్ధమంత్రం* అతడికి ప్రసాదించాను. అతడికి ఏదైనా కీడు వాటిల్లుతుందా ఏమిటి?
ఆ తరువాత నన్ను, “ఇక్కడ ప్రసాదం తీసుకొన్న తరువాతే కదా బయలుదేరుతావు?” అని అడిగారు. అవునని నేను జవాబు చెప్పిన తరువాత ఆమె లోపలకు వెళ్లి విషయం చెప్పి తిరిగివచ్చారు.
మాతృదేవి: నువ్వు మంత్రదీక్ష ఎవరి నుండి పుచ్చుకొన్నావు? గురుదేవుల గురించి నీకు ఎవరు చెప్పారు?
నేను: దేవభోగ్లో వసించిన నాగమహాశయుణ్ణి మేం కలుసుకొనేవారం.ఆయన నుండే గురుదేవుల మహత్వాన్ని గురించి మేం విన్నాం. ఆయన ఉత్కృష్టమానసిక స్థితిని గమనించిన పిదప గురుదేవులనూ, మిమ్మల్నీ చూడాలనే బలీయమైనకోర్కె జనించింది. గురుదేవులను దర్శించుకొనే భాగ్యం లేకపోయింది. కానీ మీ అనుగ్రహంతో మిమ్మల్ని దర్శించుకోగలిగాం. గురుదేవులను దర్శించుకోవాలనేకోర్కె కూడా మీ దర్శన భాగ్యంతో ఈడేరింది. ఇంత దాకా నేను ప్రత్యక్షంగామంత్రదీక్ష పుచ్చుకోలేదు.
మాతృదేవి: నువ్వు స్వప్నంలో పొందావు కదా!
నేను: అవునమ్మా! స్వప్నంలో మిమ్మల్ని దర్శించాను. మీరు మంత్రం కూడాప్రసాదించారు.
మాతృదేవి: మంచిది. ఆ మంత్రం జ్ఞాపకముందా? ఏదీ నాకు చెప్పు చూద్దాం.
నేను బీజాన్ని ఉచ్చరించగానే మాతృదేవి, “మంచిది, మంచిది. నువ్వు ఈచోటుకు చెందినదానవు. నిజానికి నువ్వు భాగ్యశాలివి” అన్నారు.
నేను: అమ్మా! మరేదన్నా చెప్పగోరుతున్నారా?
మాతృదేవి: లేదు. ఈ బీజమంత్రాన్నే జపించు. ఆ మంత్రం మూలంగానే నీకు శ్రేయస్సు కలుగుతుంది. ఇది తథ్యం. అవునూ, నువ్వు ఎవరితో కలిసివచ్చావు?
నేను: నా భర్తతో.
మాతృదేవి: ఆయన ఎక్కడున్నారు? ఏం పని చేస్తున్నారు?
నేను: రాంబాబుగారి జమీలో మేనేజరుగా పనిచేస్తున్నారు.
మాతృదేవి: అబ్బో! నువ్వు ఒక మేనేజర్ భార్యవా? ఇంతదాకా ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఓ రాధూ, ఓ మాకూ, రండి! వచ్చి మేనేజర్ భార్యకు నమస్కరించండి.
మాతృదేవి అలా అనడంతో నేను ఆశ్చర్యబోయి, “అమ్మా! మీరు ఏమంటు న్నారు? నేను కాయస్థ కులస్థురాలను. బ్రాహ్మణ స్త్రీలు నాకు నమస్కరించడమా?” అని అన్నాను. అందుకు మాతృదేవి, “ఇలా మాట్లాడవద్దు. నువ్వు ఒక భక్తురాలివి. భక్తులకు కులాలు ఉండవు. నీకు నమస్కరించడం వలన వాళ్లకు శ్రేయస్సు కలుగుతుంది” అన్నారు.
రాధూ, మాకూ రాగానే నేను వాళ్ల పాదాలు పట్టుకొన్నాను. అది చూసి మాతృదేవి, “పోనీలే! ఆమె మిమ్మల్ని నమస్కరింపనివ్వదు. ఆమె భక్తురాలు కదా! అందువల్లే అందరిలోనూ భగవంతుణ్ణి చూస్తూంది” అని చెప్పారు.
తదనంతరం నన్ను, “సరే, దేవభోగ్లో దుర్గాచరణ్ (నాగమహాశయ్) నుండి నువ్వు ఏం విన్నావు? ఆయనతో నీకెలా పరిచయం కలిగింది?” అని అడిగారు.
నేను: నా భర్త ద్వారానే. మొదటి పరిచయంలోనే నాగమహాశయ్ నా భర్తను ఎంతగానో ఆకర్షించారు. ఆ తరువాత మేమిద్దరం పలుమార్లు ఆయనను దర్శించాం. ఆయన కూడా ఎంతో దయతో మా ఇంటికి వచ్చారు. ఆయన మాతో ఇలా చెప్పారు: “నేను సున్న. సర్వస్వమూ నాకు గురుదేవులే! శ్రేయస్సు పొందగోరితే నిండు మనస్సుతో ఆయనకు శరణాగతులు కండి. నేను పుణ్యం చేసుకొన్నవాణ్ణి. అందుకే గురుదేవుల పాదపద్మాలు దర్శించుకొనే భాగ్యం కలిగింది. సాక్షాత్తూ శివాంశమైన స్వామీజీని కూడా దర్శించాను. జగజ్జనని అవతారమైన మాతృదేవిని దర్శించి ఆమె అనుగ్రహాన్ని కూడా పొందగలిగాను. ఇంకేమి చెప్పను? మనఃశరీరాలను ఆత్మతో సహా మాతృదేవి, గురుదేవుల పాదపద్మాలకు సమర్పించి శరణు పొందండి. మీకు శ్రేయస్సు ఒనగూరుతుంది.”
మాతృదేవి: ఆహా! ఆయనను గురించి నేను ఏం చెప్పగలను? ఆయన నన్ను సాక్షాత్తూ జగజ్జననిగానే పరిగణించారు.
తరువాత ఆమె నాగమహాశయుడు తమను దర్శింప వచ్చినప్పుడు జరిగిన విశేషాలన్నిటినీ వివరంగా చెప్పారు.
కాసేపయ్యాక విస్తళ్ళు వేశారు. అప్పుడు మాతృదేవి నాతో, “రా! ప్రసాదం తీసుకుందాం” అన్నారు. ఆమెతో పాటు భోజనశాలకు వెళ్లగానే, “అదిగో అక్కడ, నాకు ఎదురుగా కూర్చో” అని చెప్పారు. మాతృదేవి భోజనానికి కూర్చొని అన్నంలో వెన్న కలిపి మూడు ముద్దలు తిన్నారు. పిదప నాతో, “ఇదిగో, ప్రసాదం అరచేతిలో పుచ్చుకో” అని చెప్పారు. నేను కుడిచేతిని చాచినప్పుడు, “ఇలాగా ప్రసాదం పుచ్చుకోవడం? రెండు అరచేతులు చాచి పుచ్చుకో” అన్నారు. నేను రెండు అర చేతులూ చాచగానే, వెన్నతో కలిపిన అన్నమంతా నా చేతుల్లో పెడుతూ, “ప్రసాదం ఉన్న చేతులను శిరస్సుకు స్పృశించి, ఆ పిదప ఆరగించు” అని చెప్పారు. నేను ఆశ్చర్యపోతూ, “అమ్మా, నేను కాయస్థ కులానికి చెందినదాన్ని. భోజనం చేసే టప్పుడు మీరు నన్ను తాకారు. ఇప్పుడు మీరెలా భోజనం చేయగలరు?” అని అడిగాను. అందుకు మాతృదేవి, “మీలో కుల వివక్షణను చూడడమెందుకు? మీరంతా నా బిడ్డలు. ప్రసాదం తిను” అని అన్నారు. అప్పుడు ఎంతో సిగ్గుపడుతూ భోజనానికి ఉపక్రమించాను. మాతృదేవి ఎంతో సంతోషంగా భోజనం చేయసాగారు. మధ్య మధ్యలో నాకు ఏం కావాలో అడిగారు కూడా.
మాతృదేవి: ఏమమ్మా, మీ ప్రాంతాల్లో తీర్థస్థలం ఏదీ లేదా?
నేను: లేదమ్మా. చెప్పుకోదగ్గ తీర్థస్థలం ఏదీ లేదు. కానీ పర్వదినాల్లో బ్రహ్మ పుత్రానదిలో స్నానం చేయడం కద్దు. దానిని ‘బ్రహ్మపుత్రా స్నాన్’ అంటారు.
మాతృదేవి: అవును, ఆ విషయం నేను విన్నాను. ఈసారి నన్ను కూడా తీసుకువెళ్లు. మీ ఊరు చూసినట్లూ ఉంటుంది, తీర్థయాత్ర చేసినట్లూ ఉంటుంది.
నేను: తూర్పు వంగదేశానికి ఆ భాగ్యం కలుగుతుందా?
మాతృదేవి: ఎందుకు దక్కదు? అక్కడ గురుదేవుల భక్తులు అనేకులు ఉన్నారు. నరేన్ వెళ్లాడు, శరత్ వెళ్లాడు, ఇంకా పలువురు వెళ్లారు. ఎక్కడ జనం గురుదేవులను ఆరాధిస్తారో అక్కడకు నేను వెళ్లకుండా ఉండగలనా?
పప్పుపులుసు, చచ్చడితో భోజనం వడ్డించారు. “వీరికి చేపల పులుసు వడ్డించండి” అన్నారు మాతృదేవి.
నేను: వద్దమ్మా. ఇప్పటికే కడుపు నిండిపోయింది. చేపలు వద్దు.
మాతృదేవి: నువ్వేమంటున్నావు తల్లీ? నీ భర్త జీవించే ఉన్నప్పుడు చేపలు ఎందుకు వద్దంటున్నావు?* ఎందుకు నువ్వు పాదాలకు పారాణి పెట్టుకోలేదు?
నేను: మా ప్రాంతాల్లో పాదాలకు పారాణి పెట్టుకోం. నుదుట కుంకుమ, చేతులకు శంఖుగాజులు సుమంగళికి చిహ్నాలు.
మాతృదేవి: కావచ్చు. కానీ ఈ ప్రాంతాల్లో శంఖుగాజులు, కుంకుమ నాగరికత కోసమే! ఇక్కడ ఇనుప గాజులు, పారాణి సుమంగళికి చిహ్నాలు.
పాలు, ఒక మామిడిపండు, ఒక మిఠాయి మాతృదేవికి సమర్పించారు. మామిడి పండు రసం తీసి, దానిని పాలు, మిఠాయితో కలిపి కాస్త పుచ్చుకొన్నారు. మిగిలినది ప్రక్కన ఉంచి, “ఇది నీ కుమారుడి కోసం” అని చెప్పారు. భోజనం ముగించి చేతులు కడుక్కోవడానికి లేస్తూ విస్తరి తీసివేయబోయాను. కానీ ఇంతలో గబగబా లక్ష్మి వచ్చి విస్తరి తీసివేయబోయింది. నేను ఒక వైపు, లక్ష్మి మరోవైపు విస్తరిని లాక్కొనబోవడంతో అక్కడ గడబిడ జరిగింది. అది చూసి మాతృదేవి నాతో, “నువ్వు వదిలిపెట్టు. లక్ష్మి తీస్తుంది. వయస్సులో అందరికంటే పెద్దదానివి. చిన్నవాళ్లు ఉన్నప్పుడు నువ్వెందుకు విస్తరి తీయాలి?” అని చెప్పారు. గత్యంతరం లేక వదలిపెట్టేశాను.
మాతృదేవితో చేతులు కడుక్కొనే చోటికి వెళ్లాను. బిందె నుండి చెంబుతో నీరు తీసి ఆమే నా చేతులపై పోయబోయారు. మాతృదేవి నీళ్లు పోస్తే నేను చేతులు కడుక్కోవడమా? “అమ్మా! ఇది నా వల్ల కాదు” అన్నాను. “ఎందుకు కాదు? నేను చెప్పినట్లుగా నడుచుకొంటే నీకు మంచి జరుగుతుంది. రా, త్వరగా చేతులు కడుక్కో. నీ వెనుక పలువురు కాచుకొని ఉన్నారు. కావాలంటే చెంబును నుదుటకు తాకించి పిదప నీళ్లు వాడుకో” అని చెప్పారు. మార్గాంతరం లేక ఆమె ఆజ్ఞను శిరసావహించాను.
చేతులు కడుక్కొని వెళ్ళబోతుంటే, “ఇదేమిటి! కాళ్లు కడుక్కోకుండా వెళ్లిపోతున్నావే!” అన్నారామె. “తరువాత కడుక్కొంటాను” అన్నాను. “వద్దు. ఇదిగో నీళ్లు పోస్తున్నాను” అన్నారు మాతృదేవి. నేను అగమ్యగోచర స్థితిలో పడ్డాను. మాతృదేవి వెనుక నిలబడి, “అమ్మా! ఇలా చేయడం నా వల్ల కాదు” అన్నాను. అందుకు ఆమె, “ఏమిటి? ఏమైంది. కాస్త నీరు తలపై చల్లుకో. నీ మంచికే చెబు తున్నాను” అని చెప్పారు. గత్యంతరం లేక ఆమె చెప్పినట్లే చేశాను. ఆమె నిర్దేశం మేరకు ఆమెను అనుసరించి ఆమె గదికి వెళ్లాను.
గదిలోకి వెళ్లగానే మాతృదేవి దేన్నో చూసి విస్తుబోయి ఒక క్షణం ఆగారు. మరుక్షణంలోనే, “ఓహ్! నువ్వేం చేస్తున్నావు? ఆ అబ్బాయి తినడానికి ఏం మిగి లింది?” అన్నారు ఎవరినో ఉద్దేశించి! లోపల చూడగా, మాతృదేవి నా కుమారుని కోసం కేటాయించి ఉంచిన ప్రసాదాన్ని ఒక భక్తురాలు ఆనందంగా తింటూ, “అన్నిటినీ ఆమె పిల్లలే తింటారట. మేం పస్తులుండి చావాలట!” అని అనడం కనిపించింది. అది చూసి నేను నవ్వు ఆపుకోలేకపోయాను. లక్ష్మి, ఇతర భక్తు రాండ్రు కూడా వచ్చి పరిస్థితి చూసి నవ్వసాగారు. మాతృదేవి మాత్రం ఆందోళనతో అట్లే నిలబడిపోయారు. పిదప ఆమె ఒక వ్యక్తిని భోజన పదార్థాలు ఏవైనా మిగిలివున్నాయేమో కనుగొని రమ్మని వంట గదికి పంపారు. అన్నం, పప్పుపులుసు, చచ్చడి మిగిలివున్నాయని అతడు తిరిగివచ్చి చెప్పాడు. వెంటనే ఆమె వాటిలో కొంత భాగం అక్కడకు తీసుకురమ్మని కబురుచేశారు.
వంటమనిషి అవి తీసుకురాగానే వాటిని కలిపి, తాము దాన్లో కాస్త తిని మిగి లింది మూసిపెడుతూ, “ఇది వాడి కోసం” అని చెప్పారు. ‘చేతులు కాళ్లు కడుక్కోవ డానికి ఆమే స్వయంగా నీళ్లు పోస్తున్నారు, మా కోసం రెండుసార్లు భోజనం చేస్తున్నారు. అలాంటప్పుడు మేం ఆమెకు ఎలా సేవ చేయాలి?’ అనే ఆలోచనలో పడ్డాను. ఏమీ పాలుబోక ఆమెతో పూజగదిలోకి వెళ్లాను.
మాతృదేవి పూజగదిలోకి వెళ్లాక నాతో, “తలుపు మీద నా తువ్వాలు వ్రేలాడుతోంది. దాన్ని తెచ్చి నా పాదాలు తుడిచేయి” అని చెప్పారు. ఈ మాట వినగానే నా మనస్సు ఆనందంలో ఓలలాడింది. నేను తువ్వాలు తీసుకురాగానే, “నేను మంచం మీద కూర్చుంటాను. మోకాళ్ల దాకా బాగా తుడువు” అని ఆమె నాతో చెప్పారు. నేను తుడుస్తూ ఆమె పాదపద్మాలకు పలుమార్లు శిరసా నమస్క రించాను. చిన్నగా నవ్వుతూ మాతృదేవి, “ఇక చాలమ్మా, ఆపు” అన్నారు.
ఇంతలో లక్ష్మి తాంబూలం తెచ్చి, నవ్వుతూ “నువ్వు ఎంత భాగ్యశాలివమ్మా! అడక్కుండానే మాతృదేవి నిన్ను అనుగ్రహించారు. ఇదిగో ఈ తాంబూలం కూడా పుచ్చుకో” అన్నది. నా కళ్లు ఆర్ద్రమైనాయి. మాతృదేవి తాంబూలం పుచ్చుకొని నాకిచ్చారు. తరువాత, “ఇదిగో, ఈ చాపను నేల మీద పరచు. దాని మీద ఈ దుప్పటి పరచి, ఈ మూడు దిండ్లను ఉంచు” అని చెప్పారు.
మెత్తను పరచగానే మాతృదేవి పడుకొన్నారు. నేను ఆమె ప్రక్కన కూర్చుని ఆమె పాదాలు ఒత్తసాగాను. అప్పుడు మాతృదేవి, “నువ్వు కూడా కాసేపు పడుకో” అన్నారు. నేను సిగ్గుపడ్డాను. “నా దిండు మీదనే తల ఉంచి పడుకో” అని ఆమె అనగానే, “వద్దమ్మా. నేను నిద్రిస్తే నా పాదాలు మిమ్మల్ని తాకుతాయేమో! అందువల్ల నేను పడుకోను” అని చెప్పాను. అందుకు ఆమె, “అదేం మాటలమ్మా! నేను చెబు తున్నాను, నువ్వు పడుకో!” అన్నారు. గత్యంతరం లేక పడుకొన్నాను.
మాతృదేవి: నిన్ను చూడటం నా కెంతో ఆనందంగా ఉంది. అత్తగారి ఇంటి నుండి చాలాకాలం తరువాత వచ్చిన కుమార్తెను చూసి ఉప్పొంగే తల్లిలా నా మనస్సు పొంగిపోతూన్నది. మంచిది. ఎప్పుడు తిరిగి వెళతావు?
నేను: ఈ సాయంత్రమే తిరిగి వెళ్లిపోవాలమ్మా! నన్ను మరచిపోకండమ్మా! నేను మీ పేదరాలైన కుమార్తెనని జ్ఞాపకముంచుకోండి.
ఇలా అంటున్నప్పుడు నా కళ్లు అశ్రుపూరితాలయ్యాయి. నేను విలపించ సాగాను.
మాతృదేవి: ఇదేమిటమ్మా! ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు పేద రాలవు కావు. నువ్వు నా రాజకుమార్తెవు. నేను నీకు మంత్రదీక్ష ఇచ్చివున్నాను. నువ్వు ఆందోళన చెందడానికి ఏమీ లేదు. నీ బాగోగులన్నీ నేను చూసుకొంటాను. దేనికీ నువ్వు కలత చెందవద్దు.
సాయంత్రం నాలుగు గంటలకు రాధూ బడి నుండి తిరిగివచ్చింది. ఉపాహారం తిన్న తరువాత రాధూతో మాతృదేవి, “రాధూ, ఇలారా! తల దువ్వుతాను” అన్నారు. అందుకు రాధూ, “వద్దు. నేనే దువ్వుకొంటాను” అని చెప్పింది. అయినా మాతృదేవి దువ్వెన పుచ్చుకొని ఆమె వద్ద కెళ్లారు. కాని రాధూ ఆ దువ్వెన పుచ్చుకొని మాతృ దేవిని కొట్టసాగింది. “పిచ్చిపిల్ల! ఈమెతో ఎలా వేగాలి?” అన్నారు మాతృదేవి. ఆ సమయంలో యోగీన్ మా వచ్చి మాతృదేవికి ప్రణమిల్లింది. మాతృదేవిని రాధూ కొడుతూ ఉండడం చూసి, “ఇదేం చోద్యం! మన మాతృదేవిని ఈమె కొట్టడమా? ఈమెకు రెండు తగిలిస్తాను” అన్నదామె. అప్పుడు మాతృదేవి, “ఇక ఈ బాధ సహించలేను. శరత్ను పిలుస్తాను” అన్నారు. యోగీన్ మా శరత్ మహరాజ్తో విషయం తెలిపారు. వెంటనే శరత్ మహరాజ్ క్రింది నుండి గబగబా అక్కడకు వచ్చి, “ఏయ్ రాధూ! మాతృదేవిని కొట్టకు” అని బిగ్గరగా అరచారు. అంతే! మంత్ర ముగ్ధమైన పాములా ఆమె నిశ్చలమైపోయింది. అప్పుడు కుసుమ్ వచ్చి, “రాధూ, రామ్మా! నేను తల దువ్వుతాను” అన్నది. రాధూ బుద్ధిమంతురాలిలా ఆమెతో వెళ్లింది.
ఆ సమయంలో రాధూ తల్లి సురబాల అక్కడకు వచ్చి మాతృదేవితో, “మీ శిష్యుడొకరు చేతిలో ఏదో పట్టుకొచ్చాడు. అది కనుక వస్త్రం అయితే దానిని నాకివ్వండి. దోమతెర పై భాగానికి ఉపయోగించుకొంటాను” అని చెప్పింది. నిజా నికి వచ్చింది నా కుమారుడు! పళ్లు, మిఠాయిలు, ఒక చీర తీసుకువచ్చాడు. అతడు ప్రణమిల్లగానే మాతృదేవి, “ఆహా! ఎంత బాగుంది ఈ చీర. మంచి మిఠా యిలు. గోలాప్, వీటిని పక్కన ఉంచు. పూజ గది తెరవగానే గురుదేవులకు నివే దన చేద్దాం! అబ్బాయీ, నీ ముఖం వాడిపోయినట్లుంది. కాళ్లు చేతులు కడు క్కొని ఏదైనా తిను. దీర్ఘాయుష్మాన్భవ! నాయనా, నీలో భక్తి పెంపొందుగాక! కానీ నువ్వు వివాహం చేసుకోవాలి సుమా!” అని అతడితో చెప్పారు. నా కుమారుడు మాతృదేవికి ప్రణమిల్లి క్రిందికి వెళ్లిపోయాడు. గోలాప్ మా కూడా ప్రసాదం పళ్లెం పుచ్చుకొని క్రిందికి వెళ్లింది. అప్పుడు రాధూ తల్లి, “ఆ చీరను నా కివ్వండి. దాంతో దోమ తెర పైభాగం కుట్టుకొంటాను” అంటూ మాతృదేవిని వేధించసాగింది. అందుకు మాతృదేవి, “అదెలా కుదురుతుంది? ఆ అబ్బాయి మనస్సు గాయపడు తుంది” అని అన్నారు. ఇలా అంటూ కుసుమ్తో, “ఆ చీర తీసుకురా. నేను కట్టు కొంటాను” అని చెప్పారు. అది విని యోగీన్ మా ఇలా అంది: “వీరెంత భాగ్యవం తులు. వీరు ఎవరో కూడా తెలియదు. వచ్చిన రోజునే మాతృదేవి అనుగ్రహాన్ని ఎంతగా చూరగొన్నారు! నువ్వు భాగ్యశాలివమ్మా! నీకు నమస్కరించాలనిపిస్తోంది.” ఆ మాటలు విని ‘ఈమె ఏమంటున్నది?’ అనుకొని కుంచించుకుపోయాను. అప్పుడు మాతృదేవి, “వీరు తూర్పు వంగదేశం నుండి వచ్చారు. ప్రగాఢ విశ్వాసం గలవారు. ఇటువంటి వారిని చూసినంత మాత్రానే శ్రేయస్సు కలుగుతుంది” అని చెప్పారు.
నేను తువ్వాలుతో మాతృదేవి పాదాలను మళ్లీ తుడిచాను. మాతృదేవి కొత్త చీర ధరించి ఉపాసన చేసే ఆసనంలో కూర్చొని గురుదేవులను, “భగవంతుడా, వీరి సంక్షేమాన్ని చూసుకోండి. వీరు మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తు న్నారు. ఎంతో శ్రమపడి సుదూరం నుండి మీ కోసం వచ్చివున్నారు” అంటూ ప్రార్థించారు.
మాతృదేవి: నువ్వు ఏమన్నా అడగదలచుకొన్నావా?
నేను: ఈ ప్రాంతంలోని యువ వితంతువులు చేపలు తినడం నాకు ఆశ్చర్యంగా ఉంది. మా ప్రాంతంలో అది నిషిద్ధం.
మాతృదేవి: ఇదంతా ఏమిటో తెలుసా? ఇది స్థానిక సంప్రదాయం. మా ప్రాంతాన యువ వితంతువులు చేపలు తినవచ్చు, అంచుగల చీరలు, నగలు ధరించడానికి ఎలాంటి అడ్డంకులూ లేవు. వారికి కూడా వీటి పట్ల కోర్కె ఉండడం సహజమే కదా! కట్టుబాట్లు విధిస్తే రహస్యంగా చేపలు తింటారు. సమాజ నిషేధాజ్ఞ లకు వ్యతిరేకంగా తాము వ్యవహరిస్తున్నామని గ్రహించినప్పుడు వారే వాటిని మానుకొంటారు.
నేను: అమ్మా! సుఖభోగాలపట్ల ఉన్న కాంక్షను వదలుకోవడం సాధ్యమేనా?
మాతృదేవి: సరిగ్గా అడిగావు. అది తొలగిపోదు అమ్మాయీ! కానీ పెరిగి పెద్దవారయ్యాక నలుగురిని చూసి నిజం గ్రహించి తమ ప్రవర్తనను తలచుకొని సిగ్గుపడతారు. ఇతరులతో దెబ్బలాడితే, వీరిని ఇతరులు ఈ కారణం చూపించే తీవ్రంగా వ్యాఖ్యానిస్తారు. అందువల్ల మెల్లగా వారే దాని నుండి బయటపడతారు.
నేను: అమ్మా! మీరు బ్రాహ్మణులై ఉండీ ఎలా రెండుసార్లు అన్నం తిన్నారు?
మాతృదేవి: అదేమిటమ్మా? ఎప్పుడు రెండుసార్లు తిన్నాను.
నేను: కాసేపటి క్రితం నా కుమారుడికి ప్రసాదం ఇస్తున్నప్పుడు!
మాతృదేవి: పిల్లల శ్రేయస్సు కోసం నేను ప్రతిదీ చేస్తాను. దాన్లో దోషం లేదు. ప్రసాదం అయితే ఐదుసార్లు తిన్నా తప్పు లేదు. ప్రసాదాన్ని మామూలు అన్నంతో పోల్చకూడదు. ఈ అల్ప విషయాల గురించి ఆలోచిస్తూ మనస్సును పాడుచేసుకోకు. వీటిని గురించి తలచుకొంటూవుంటే భగవంతుణ్ణి మరచిపోవలసి వస్తుంది. లోకులు ఏమనుకొన్నాసరే నీకు ఏది సరి అనిపిస్తుందో దాన్ని భగవంతుణ్ణి తలచుకొంటూ చేయి! ‘లోకులను కేవలం కీటకాలుగా భావించు’ అనేవారు గురు దేవులు. దీని అర్థం ఎవరినీ గౌరవించకూడదని కాదు. అల్పుల, దుష్టుల గురించి మాత్రమే ఇక్కడ గురుదేవులు ప్రస్తావించారు.
నేను ఇంటికి తిరిగి వెళ్లవలసిన సమయం ఆసన్నమయింది. నా కోసం బండి సిద్ధంగా ఉంది. మాతృదేవి అశ్రునయనాలతో నా తలను స్పృశించి ఆశీర్వ దిస్తూ, “మళ్లీ రా!” అన్నారు. నాకు వెళ్లడానికి మనస్కరించలేదు. మాతృదేవి పాదాలను పట్టుకొని విలపించసాగాను. “విలపించకమ్మా! నేను నీ సొంతమే కదా! మళ్లీ రా!” అన్నారు మాతృదేవి.
నేను మొదటిసారి, చివరిసారి మాతృదేవిని దర్శించింది అదే. ఆమె ఆశీస్సులు, ప్రేమపూరిత సాంత్వన వచనాలు నా జీవిత పెన్నిధిగా మిగిలిపోయాయి.