1898 వ సం ॥ ఏప్రిల్ 22 వ తేదీ. త్రిగుణాతీతానంద స్వామితో 10/2 బోస్పారా వీథిలోని ఇంటికి వెళ్లాను. అప్పుడు సమయం ఒంటిగంటన్నర అయ్యుంటుంది. అది ఎవరి ఇల్లో, ఎవరు వస్తున్నారో, ఎవరు వెళుతున్నారో నాకు తెలియదు. క్రింది భాగంలో కొన్ని గదులు ఉన్నాయి. వాటిలో ఒక గదిలో ఒక సాధువు పడుకొని ఉన్నాడు. ఆయన త్రిగుణాతీతానంద స్వామిని, నా గురించి అడిగాడు.
“ఇతడు నీ తమ్ముడా?”
“అవును.”
“మాతృదేవి విశ్రాంతి తీసుకొంటున్నారు. పూజామందిరం తెరవగానే చెబుతాను.”
ఈ ‘మాతృదేవి’ ఎవరో నాకు తెలియదు. శ్రీరామకృష్ణుల గురించి ఒకింత విని ఉన్నాను. కాని మాతృదేవికి, ఆయనకు ఉన్న సంబంధం ఏమిటో నాకు తెలి యదు.
ఇంతలో యోగానందస్వామి వచ్చి మిఠాయి ప్రసాదం ఇస్తూ, “ఇది మాతృదేవి ప్రసాదం” అని చెప్పారు. ఇలా పలుమార్లు మాతృదేవి నామధేయాన్ని వింటున్నప్పుడు, ‘మాతృదేవి’ ఈయన తల్లిగారై ఉంటారనుకొన్నాను.
విశ్రాంతి సమయం గడిచింది. అప్పుడు సాయంత్రం నాలుగు గంటలయింది. మేడ మీద పాత్రను ఉంచిన శబ్దం వినవచ్చింది. వెంటనే యోగానందస్వామి, “ఇక మీరు వెళ్లవచ్చు. మాతృదేవి మేల్కొన్నారు. పూజామందిరం తెరిచారు” అని చెప్పారు. త్రిగుణాతీతానంద స్వామి వెళ్లలేదు. మేడ మెట్లు చూపిస్తూ నన్ను మేడ మీదకు వెళ్లమన్నారు.
నేను మేడమీదకు వెళ్లాను. ముందు గదిలో, అంటే పడమటి గదిలో ఎవరూలేరు. తిరిగి చూస్తే, తూర్పువైపు గదిలో ఒక స్త్రీ కూర్చొని ఉన్నారు. ఆమె నన్ను చూడగానే, “నువ్వు శారదా తమ్ముడివి కదా! మఠానికి వెళుతూ ఉంటావా? అది మంచి పని. ఇదిగో కాస్త మిఠాయి తిను” అంటూ మిఠాయి ప్రసాదం, మంచి నీరు ఇచ్చారు. తిని, తిరిగి వెళ్లిపోబోయాను. వెంటనే ఆమె నన్ను పిలిచి, “నమ స్కారం చెయ్యలేదే?” అన్నారు. నాకు సిగ్గువేసింది. తక్షణమే ఆమెకు ప్రణమిల్లడానికి వెళ్లాను. కానీ ఆమె ముందుగా గురుదేవులకు నమస్కరించమన్నారు. అలాగే ప్రణమిల్లాను. ఆ తరువాత మాతృదేవి నా చుబుకాన్ని స్పృశించి, దీవించారు.
మఠానికి వెళుతున్నప్పుడు త్రిగుణాతీతానంద స్వామితో, మాతృదేవిని గురించి వివరాలు అడిగాను. ఆ తరువాతే ‘మాతృదేవి’ అంటే ఆమే అని తెలుసుకొన్నాను. “నేను మీ తమ్ముణ్ణి అని మీరే స్వయంగా లేదా ఎవరి ద్వారానన్నా మాతృదేవికి తెలిపారా?” అని అడిగాను. “లేదు” అన్నారు స్వామి.
రెండవసారి మాతృదేవిని ఒక చిరస్మరణీయమైన రోజు దర్శించాను. అదిమే, 15 వ తేదీ, ఆదివారం. ఆ రోజు వేకువనే లేచి, మాతృదేవి పూజ కోసం మఠం నుండి పువ్వులు సేకరించి తీసుకువెళ్లాను. మాతృదేవి ఇంటి క్రింద భాగంలో కూర్చొని ఉన్న యోగానంద స్వామి, “నువ్వు చిన్నవాడివే కదా! తిన్నగా మాతృదేవి వద్దకు వెళ్లు” అని చెప్పారు. (అప్పుడు నాకు 18 ఏళ్లు) మాతృదేవి పూజాసనం మీద కూర్చొని ఉన్నారు. నేనిచ్చిన పువ్వులు అందుకొన్నారు. ప్రక్కనే ఉన్న మరో ఆసనం మీద నన్ను కూర్చోమని చెప్పి, “ముందు పూజ పూర్తి చేస్తాను” అని చెప్పారు.
పూజ పూర్తి కావడానికి అరగంట పట్టింది. ఆ తరువాత నా వంక చూస్తూ, “మంత్రం పుచ్చుకొంటావా?” అని అడిగారు. నా మనస్సులో మంత్రదీక్ష పుచ్చు కోవాలనే ఉత్సాహం ఉండివుండవచ్చు. కానీ నేను ఆ విషయం ఎవరితోనూ వ్యక్తం చేయలేదు. నా మనస్సులోని విషయం ఆమెకు ఎలా తెలిసిందబ్బా? ఎలాగో తమ పాదపద్మాల వద్ద నాకు కూడా చోటు కల్పించారు. ప్రక్కనున్న దోరగా పండిన పండును నాకిచ్చి, “దీన్ని నాకివ్వు నాయనా!” అని చెప్పారు. ఆమె వస్తువే ఆమెకు గురుదక్షిణగా సమర్పితమైంది.
ఆ తరువాత అప్పుడప్పుడు మాతృదేవి వద్దకు వెళ్లిరాసాగాను.
యోగానందస్వామి అంతిమ దినాలవి. తీవ్ర రోగంతో బాధపడుతూ, మాట్లాడే శక్తిని కూడా క్రమంగా కోల్పోతున్నారు. మాతృదేవి ప్రథమ శిష్యుడూ, సేవకుడూ ఆయనే. సహజంగానే మాతృదేవి ఆయన పట్ల ఎంతో ఆప్యాయంగా ఉండే వారు.
ఒక రోజు ఉదయం. మామూలుగా మాతృదేవి పూజ కోసం పువ్వులు తీసు కొని మేడ మీదకు వెళ్లాను. అప్పుడు మాతృదేవి కాళ్లు చాపుకొని పశ్చిమాభిముఖంగా మౌనంగా కూర్చొని ఉన్నారు. ఆమె కళ్ల వెంట కన్నీరు వరదలై ప్రవహిస్తోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న స్వామి గురించి ఆలోచిస్తూ ఆమె కన్నీరు మున్నీరవుతున్నారని అర్థమైంది. నా చిన్న బుద్ధికి స్ఫురించినట్లు మాతృదేవిని అర్థం చేసుకొన్నాను. ఈ సంగతి ఆమె గ్రహించినట్లున్నారు!
మాతృదేవి: నా కుమారుడు యోగేన్కు ఏమవుతుంది నాయనా?
నేను: ఏమవుతుంది? నయమవుతుంది. మీరెందుకు ఆందోళన చెందుతారు?
మాతృదేవి: కానీ నేను చూసింది మరోలా ఉంది.
నేను: ఏం చూశారు?
మాతృదేవి: యోగేన్ను తీసుకు వెళ్లడానికి గురుదేవులు వచ్చారు. ఉదయం చూశాను.
ఇలా అంటూ మాతృదేవి విలపించసాగారు. తాను చెప్పిన విషయం ఎవరికీ చెప్పవద్దన్నారు. ఆమె మాటను శిరసావహించి ఆ విషయం ఇంతదాకా ఎవరికీ చెప్పలేదు. కానీ ఎందుకో తెలియదు, ఇది వ్రాస్తున్నప్పుడు మాత్రం నాకు తెలియ కుండానే బయటకు వచ్చింది.
ఆ రోజు మధ్యాహ్నం యోగానందస్వామి మహాసమాధి చెందారు. అప్పుడు ఆయన ముఖమండలాన అపురూపమైన తేజస్సు భాసిల్లింది. అది చూడగానే కృష్ణలాల్ బిగ్గరగా విలపించసాగాడు. ఆ ఏడుపు వినగానే మేడ మీద ఉన్న మాతృ దేవి కూడా బిగ్గరగా విలపించడం మొదలుపెట్టారు. ఆమె కాస్త పెద్దగా మాట్లాడడం సైతం ఇంత దాకా నేను విన్నదిలేదు. కానీ ఈ రోజు బిగ్గరగా విలపించారు. నేను రివ్వున మేడ మీదకు వెళ్లి మాతృదేవి పాదాలు పుచ్చుకొని, ప్రశాంతంగా ఉండమని వేడుకొన్నాను. కానీ నా వేడుకోలు ఫలించలేదు. “నువ్వు పో, వెళ్లిపో. నా యోగీన్ నన్ను విడిచి వెళ్లిపోయాడు” అంటూ మళ్లీ విలపించసాగారు.
భక్తులు వెళ్లినప్పుడు వంట, వారి బసకు తగిన ఏర్పాట్లు చేయడం, భోజనం వడ్డించడం మొదలైనవన్నీ మాతృదేవే చూసుకొనేవారు. విభిన్న ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు తగ్గట్లు ఆ ప్రాంతీయ ఆహారం వండేవారు. ఇవన్నీ గమనించి నేను ఒక రోజు ఆమెతో, “అమ్మా! మా కోసం మీరింత శ్రమపడవలసివస్తోందే!” అన్నాను. అందుకు ఆమె, “పిల్లలకు అమ్మ చేసిపెట్టకపోతే మరెవరు చేస్తారు?” అని అన్నారు.
ఒక రోజు మధ్యాహ్నం మాతృదేవి తమ గదిలో విశ్రాంతి తీసుకొంటూ మాట్లాడుతున్నారు. మాతృదేవి శిష్యులొకరిని గురించి అడిగాను. ఆయనను గురించి మఠంలో విని ఉన్నాను. ఇప్పుడు మాతృదేవినే సూటిగా అడగాలని అనుకొన్నాను. గదిలో మరెవరూ లేరు.
నేను: ఫలానా వ్యక్తి మిమ్మల్ని దర్శించుకోవడానికి రాలేకపోయాడే!
మాతృదేవి: నాకు ప్రణమిల్లడానికి వచ్చిన అతడు ఒక కత్తి తీసుకొని తన తలను నరుక్కోబోయాడు.
నేను: అతడు చేసింది తప్పే. కానీ అందుకు కారణం అంత అనుచితమైనది కాదని నేను అనుకొంటున్నాను. సాధనలలో అంతరాయం కలిగింది. జపధ్యానాలలో మనస్సు లీనం కాలేదు. అందువలన మీరిచ్చిన ప్రాణాలను మీ పాదపద్మాల వద్దే అర్పించడానికి ప్రయత్నించాడు.
మాతృదేవి: మూర్ఖుడిలా మాట్లాడకు. నా ముందు బలి చేసుకోవడానికి నేనే మైనా రాయినా లేక కాళిఘాట్లోని కాళికాదేవినా? ఆనాటి నుండి అతణ్ణి ఇక్కడకు రావడం మాన్పించాను.
నేను: అప్పుడు మీరు ఎంతో భయానకంగా కనిపించారు. పిదప శాంత స్థితికి వచ్చారు. అంటే, ముందుగా మీ భయంకర స్వరూపం చూపించారు. తద నంతరం ఇప్పుడున్న ప్రేమమయరూపాన్ని సంతరించుకొన్నారు.
మాతృదేవి (నవ్వుతూ): మరీ ఎక్కువగా మాట్లాడకు! పిల్లలందరూ చెప్పారు కనుక అతడు మళ్లీ ఇక్కడకు రావడానికి అనుమతించాను. ఒంటరిగా రాడు. మరెవరితోనో కలసివచ్చి ప్రణమిల్లి వెళతాడు.
తమ జీవితంలో జరిగిన అనేక సంఘటనలను గురించి మాతృదేవి ఒకరోజు నాతో చెప్పారు. తేలోభేలో బందిపోటు సంఘటన కూడా దాన్లో చోటుచేసుకొంది. కొంతసేపు ఆ సంఘటన గురించి ముచ్చటించారు.
నేను: అమ్మా! ఆ సంఘటనల గురించి మళ్లీ చెప్పకండి. గురుదేవుల జీవిత చరిత్ర చదివిన వారందరికీ ఈ సంఘటన తెలుసు. నేను తెలుసుకోగోరిన సంగతి మాత్రం చెప్పండి.
మాతృదేవి: అదేమిటి?
నేను: ఆ బందిపోట్లు మిమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయారట కదా!
మాతృదేవి: ఏదో కాళీరూపాన్ని చూసినట్లుగా తరువాత చెప్పారు.
నేను: అలా అయితే వారికి మీరు కాళీరూపం చూపించారా? దాచకుండా చెప్పండమ్మా.
మాతృదేవి: నేనెందుకు చూపించాలి? చూసినట్లుగా వాళ్లు చెప్పారు.
నేను: అలా అయితే సరే. మీరు చూపించారు. ఆయన మరి ఏ ఇతర స్త్రీ లోనూ ఇలా చూడలేదే? మీలో మాత్రమే ఎందుకు అలా చూడాలి? మీరు అంగీ కరించినా లేకపోయినా మీరు చూపించారని చెప్పడానికి వేరే నిదర్శనం అక్కరలేదు.
మాతృదేవి (నవ్వుతూ): నువ్వు ఎలా కావాలంటే అలా అనుకో!
నేను: కానీ, అమ్మా! నేను మాత్రం మిమ్మల్ని కాళీగానో, గీళీగానో చూడదలచు కోలేదు. మిమ్మల్ని ఇలాగే చూడగోరతాను – మీరు తల్లి, నేను తనయుణ్ణి.
మాతృదేవి: మంచిదే. నేను కూడా బ్రతికిపోయాను. నాలుకను బయటకు చాపుకొని నిలబడవలసిన అవసరం లేదు కదా!
ఒక రోజు ఉదయం మేడ మీదకు వెళ్లినప్పుడు మాతృదేవి ప్రక్కన గోలాప్ మా నిలబడి ఉన్నారు. మమ్మల్ని చూసి మాతృదేవి ఇలా అన్నారు:
“గోలాప్ మా మతిమరపు ఇంకా ఆమెను వదలిపోలేదు. అందువలన ఎన్నో గందరగోళాలు! అయినప్పటికీ ఆమె అలాగే ఉంది. ‘చచ్చినా స్వభావం మారదు’ అంటుంది. మతిమరపు మూలంగా ఆమె బండి క్రిందపడింది, ఎలాగో బ్రతికింది.
నేను: అదేమిటమ్మా?
మాతృదేవి: ఆ రోజు రహదారిలో కేదార్ ఇంటి ముందు నిలబడి ఉన్నప్పుడు అది జరిగింది. రహదారిని దాటుతున్నప్పుడు కాస్త అటూ ఇటూ చూసి వెళ్లాలి కదా! కళ్లు మూసుకొని దాటబోయింది! ఒక గుర్రపుబండి ముందుకెళ్లి నిలబడింది. గుర్రం రెండు కాళ్లు పైకెత్తింది. దాని కాళ్ల క్రింద ఆమె చిక్కుకొనేది. అంతలో ఎక్కణ్ణుండో ఒక వ్యక్తి పరుగునవచ్చి ఆమెను అవతలకు లాగి, కాపాడడంతో బ్రతికి బయటపడింది.
ఇదే విధంగా మరో రోజు చేత చెంబు పుచ్చుకొని స్నానానికి వెళ్లింది. ఆమె చెంబును నువ్వు చూశావు కదా! ఆ చెంబును తీరంలో పెట్టి స్నానానికి గంగలో దిగింది. ఇంతలో గంగలో పోటుపాటు వచ్చి చెంబు కొట్టుకుపోయింది. చెంబు నీళ్లపై తేలుతూ ఉండడం చూసి గోలాప్ మా దాని వెనుకే వెళ్లింది. అది చూసి తీరంలో ఉన్న జనం నవ్వుకోసాగారు. ఆమె అదేమీ పట్టించుకొనే స్థితిలో లేదు. చివరికి ఎవరో వచ్చి చెంబును చేజిక్కించుకొని ఆమె కిచ్చారు.
అందుకే ఆమెతో ఇలా చెబుతూ ఉంటాను: ఈ లోకంలో జీవించాలంటే కాస్త అటూ, ఇటూ దృష్టి సారించి జీవించాలి. మతిమరపు విడిచిపెట్టాలి. అప్ర మత్తంగా మెలగాలి. అప్పుడే కదా ఇతరులతో కలసి జీవించడం సాధ్యమవుతుంది! నా వద్ద కొచ్చి ‘ఆ, ఊ’ అంటూ విలపించడం వలన ప్రయోజనం ఏమిటి?
గోలాప్మాకు ఏం జరిగింది, ఆమె ఎందుకు మాతృదేవి వద్ద కొచ్చి విలపిం చారు మొదలైన విషయాలు నాకు తెలియవు. కానీ మాతృదేవి ఉపదేశం మాత్రం విన్నాను.
ఒక రోజు మాతృదేవి, గురుదేవుల మహాసమాధి గురించి, ఆయన నిర్యాణా నంతరం సైతం తమ వద్ద కొచ్చి గాజులు తీసివేయవద్దని చెప్పిన వైనం గురించి చెబుతున్నారు.
నేను: గురుదేవులు సదా మీకు దర్శనమిస్తారా అమ్మా? ఇప్పుడు కూడా మీ చేతుల మీదుగా ఆహారం స్వీకరిస్తున్నారా?
మాతృదేవి: మేం వేర్వేరు అనుకుంటున్నావా?
ఇలా అంటూ మాతృదేవి చటుక్కున నాలుక కరచుకొంటూ, “ఎంతమాట అనేశాను!” అన్నారు.
ఒకసారి మాతృదేవి అనారోగ్యం కారణంగా పథ్యం తీసుకొంటున్నారు. ఆమె ఆరోగ్యం మెరుగుపడినప్పటికీ ఒకటి రెండు రోజులు పథ్యం కొనసాగించారు. ఒకరోజు ఆమె ఆకుకూర – చచ్చడి* తినగోరారు. నాతో ఆ విషయం చెప్పారు. “ఇప్పుడే తెస్తాను” అంటూ వెళ్లబోయాను. అప్పుడు మాతృదేవి, “ఎలా తీసుకు వస్తావు? ఎవరైనా చూస్తే!” అన్నారు. “అదేమీ పెద్ద విషయం కాదు. వంటవాణ్ణి అడిగి రహస్యంగా తెస్తాను. అతడూ ఎవరికీ చెప్పడు” అంటూ వెళ్లిపోయాను. కాసేపటికల్లా ఒక ఆకులో చచ్చడి తీసుకొచ్చాను. మాతృదేవి ఎంతో ఆనందంగా తినసాగారు. కాడలను కూడా ఎంతో ఇష్టంగా తింటూ పీచును విస్తరిపై ఉంచారు. అంతా తినేటప్పటికి హఠాత్తుగా గోలాప్ మా అక్కడకు వచ్చారు. ఆమెను చూడగానే నేను విస్తరిని ఎత్తేసి, పీచును నోట్లో పెట్టుకొని మింగేశాను. విస్తరిని వెనుక దాచాను. కానీ మాతృదేవి నములుతూండడం చూసి గోలాప్ మా, “అమ్మా! ఏం తింటు న్నారు?” అని అడిగారు. “ఆకుకూర, కాడలు” అంటూ నిజం చెప్పేశారు. “ఆకుకూర కాడలా? ఎలా తిన్నారు? వాటిని ఎవరు తెచ్చారు? ఇదంతా తప్పకుండా ఆశూ పనే అయ్యుంటుంది! అది సరే, ఒక శూద్రుని చేతుల మీదుగా, అందులోనూవండిన ఆహారాన్ని మీరు ఎలా తిన్నారు?” అంటూ ప్రేలాపించసాగింది. అంతావిని, “మూర్ఖంగా వాగకు! ఎవరు శూద్రుడు? అతడు భక్తుడు, నా బిడ్డ. భక్తులకుకుల వ్యత్యాసాలున్నాయా?” అని అన్నారు మాతృదేవి.
మాతృదేవి జవాబుతో ఆమె కాస్త దిగ్భ్రమ చెందింది. కానీ మరుక్షణంలోనే ఆమె చూపు పీచును వెదకడంలో నిమగ్నమైంది. అది కనబడకపోవడంతో, “పీచు ఎక్కడ? దాన్ని వీడు మింగేసినట్లున్నాడు!” అన్నది. మాతృదేవి మెల్లగా నవ్వారు.అప్పుడు గోలాప్ మా, “ఓ భగవంతుడా! ఇక నేను మాత్రం ఎందుకు ఊరక ఉండిపోవాలి?” అంటూ మిగిలిన పీచును నోట్లో వేసుకొని వెళ్లిపోయారు. పాపం, అది కూడా శూద్రుడు తాకినవే అని ఆ బ్రాహ్మణి ఎంచలేదు. అంతటి నిష్కాపట్యంగలవ్యక్తి ఆమె.
మాతృదేవి 1910 వ సం ॥ లో దక్షిణ భారతదేశ యాత్ర చేసిన సందర్భంలో ఒరిస్సాలోని కోటార్ అనే చోట బస చేశారు.
మాంసాహారియైన భక్తుడొకడు మాతృదేవి మాంసాహారం తినరని వినితాను కూడా అది మానుకొన్నాడు. ఒక రోజు గోలాప్ మా భోజనం వడ్డిస్తున్నప్పుడు అతడికి కూడా విస్తరిలో చేప వంటకం వడ్డించింది. అతడు దానిని వద్దన్నప్పుడు, “ఇది నీ కోసం మాతృదేవియే స్వయంగా పంపించారు” అని చెప్పినా, అతడుతినడానికి నిరాకరించాడు. గోలాప్ మా, ఈ విషయం మాతృదేవికి చెప్పగానే, స్వయంగా మాతృదేవియే వచ్చి అతడి విస్తరిలో చేప వంటకం వడ్డించారు. పిదప ఆ భక్తుడితో, “నువ్వు ఏం చెప్పదలుచుకొన్నా సాయంత్రం చెప్పు! ఇప్పుడు తిను” అంటూ వెళ్లిపోయారు. ఆ భక్తునికి మరో గత్యంతరం లేకపోయింది. సాయంత్రం ఆమే, అతణ్ణి తమ వద్దకు పిలిపించారు.
మాతృదేవి: నువ్వెందుకు చేపలు తినడం మానేశావు?
భక్తుడు: మీరు ఎందుకు తినడం లేదు?
మాతృదేవి: ఒక్క నోటితో మాత్రమే నేను ఆరగిస్తున్నానా? నువ్వు అలా అనుకొంటున్నావా? మూర్ఖునిలా ప్రవర్తించకు. నేను చెబుతున్నాను, నువ్వు చేపలు తినాలి.
భక్తుని సంశయం తీరిపోయింది.
కోటార్లో మరొక రోజు. ఆ రోజు సరస్వతీపూజ పర్వదినం. మంగళవారం సాయంత్రం. నా జీవితంలో మరపురాని రోజు. నేను వెళ్లినప్పుడు మాతృదేవి వసారాలో కూర్చొని ఉన్నారు. నా రాకను ఆమె గమనించలేదు. ప్రశాంతంగా నేను వేచి ఉన్నాను. కాలం గడుస్తూ ఉంది కానీ ఆమె నన్ను చూడలేదు. సందే హంగా ఉండి పరిశీలించి చూశాను.
వాతం కారణంగా ఎప్పటిలా కాళ్లు చాపుకొని కూర్చొని ఉన్నారు. శరీరం నిటారుగా ఉంది. కళ్లు తెరచివున్నా చూపు మాత్రం బాహ్యంగా దేని మీదా లేదు. ఆమెను ఇబ్బంది పెట్టరాదని ప్రశాంతంగా అలాగే నిలబడ్డాను. పది పదిహేను నిమిషాలు గడచిపోయాయి. హఠాత్తుగా మాతృదేవి నన్ను, “ఎప్పుడు వచ్చావు?” అని అడిగారు.
నేను: ఇప్పుడే! మీరు ఎంతసేపటి నుండి ఇక్కడ ఉన్నారమ్మా?
మాతృదేవి: బందీలా ఉండడం ఇష్టం లేదు. అందువల్లే మిట్టమధ్యాహ్నం అందరూ విశ్రమించిన తరువాత నేను ఇక్కడకొచ్చి ఏకాంతంగా కూర్చున్నాను.
అప్పుడు మాతృదేవి పలికిన మాటలు యథాతథంగా ఇక్కడ పొందుపరుస్తు న్నాను. వాటి భావమేమిటో నాకు అవగతం కాలేదు. అజ్ఞానావృతమైన బుద్ధితో మనం ఏం అర్థం చేసుకోగలుగుతాం?
మాతృదేవి: మళ్లీ మళ్లీ రావలసివుంది. దీని నుండి విముక్తి లేదా? ఎక్కడ శివుడుంటే అక్కడ శక్తి – శివ శక్తులు ఒక్కటిగా వస్తారు. మళ్లీ మళ్లీ అదే శివుడు, మళ్లీ మళ్లీ అదే శక్తి. తప్పించుకోవడానికి వీలు లేదు. కానీ ఈ లోకం దీనిని అవ గతం చేసుకోలేదు. ఈ లోకం నిమిత్తం గురుదేవులు ఎన్ని కష్టాలు అనుభవించారు! ఎన్ని తపస్సులు చేశారు! ఆయన తపస్సు చేసింది లోకుల కోసమే! సామాన్యులు తపస్సు చేయగలరా? వారిలో వేగమూ, శక్తీ ఎక్కడున్నాయి? అందువల్లే కదా గురుదేవులు సమస్తమూ అనుష్ఠించాల్సి వచ్చింది! ఆ పాట నీకు తెలుసా?
నేను: ఏ పాట అమ్మా?
మాతృదేవి: పేదవాని లోకంలో పేదగా వచ్చాడు నా ప్రభువు – ఆ పాటే. నిజానికి నా బిడ్డలూ పేదలే. ఒకమారు వాళ్లు అమ్మా అని పిలిస్తే ఊరకొని ఉండడం సాధ్యమా? వెంటనే దైవం వచ్చే తీరాలి.
నేను: ఆ దైవమే చైతన్యులుగా వచ్చారా?
మాతృదేవి: అవును నాయనా అవును. ఆ దైవమే పదే పదే వస్తున్నాడు. ఒకే చంద్రుడు నిత్యం ఉదయించడం లేదా! భగవంతుడు తప్పించుకోలేడు – ఆయన పట్టుబడ్డాడు. సమస్త ప్రాణికోటి ఆయనకు చెందినదే. ఆయన చూసుకోకుంటే మరెవరు చూసుకొంటారు? పక్కింటి వ్యక్తి చూసుకొంటాడా? ‘ఎప్పుడు నన్ను ప్రార్థిస్తావో అప్పుడు నేను నీ వద్దకు వస్తాను’ – దీన్ని జ్ఞాపకం ఉంచుకో, ఎన్నటికీ విస్మరించకు. ప్రార్థిస్తే ఆయన వస్తాడు. కల్పవృక్షం కదా ఆయన!
నేను: నాకు తెలిసినదంతా నా మాతృదేవి ఒక్కరే.
మాతృదేవి: అమ్మా అంటూ పిలవడాన్ని నేర్పింది గురుదేవులే కదా! ‘అమ్మా’ అనే మాటకు మునుపు అంత ప్రాచుర్యం ఉండేదా ఏమిటి? ఆయన సృష్టి –ఆయనే సృష్టిస్తున్నాడు, ఆయనే మ్రింగడమూ చేస్తున్నాడు. మ్రింగుతున్నాడంటే ఏమిటి? ముక్తి ప్రసాదిస్తున్నాడు. అంతా ఆయన లీల, ఆయన దివ్యక్రీడ!
ఆ సమయంలో రాధూ వచ్చింది. రెండు తమలపాకు చిలుకలను తెమ్మని ఆమెకు చెప్పారు మాతృదేవి. ఆమె తెచ్చి ఇచ్చిన పిదప, మాతృదేవిని కూడా లోపలకు రమ్మని గొడవ చేసింది. “ఇలా చూడు కాస్త ఏకాంతంగా ఉండాలని వచ్చాను. నువ్వు వెళ్లు. నేను కాసేపట్లో వస్తాను” అన్నారు. ఆమె కోపంగా లోపలకు వెళ్లిపోయింది. మాతృదేవి నాకొక చిలుకనిచ్చి మళ్లీ చెప్పసాగారు.
మాతృదేవి: పదే పదే జన్మనెత్తుతున్నాను, కొండంత దుఃఖాన్ని భరిస్తున్నాను, ఎన్ని రోజులని ఇంతటి దుఃఖాలను భరించగలను? ఈ బాధలు ప్రాణులకుమాత్రమేనా? భగవంతునికి కూడా ఉంటాయా! ఇక్కడ కూర్చొని ఈ విషయమే ఆలోచిస్తున్నాను. ఈ బాధలకు అంతమే లేదు. గురుదేవులు కూడా ఎంత కష్ట పడ్డారు? ఎవరు దీన్ని గ్రహించగలరు?
నేను: గురుదేవులు మాత్రమేనా? మీరూను.
మాతృదేవి: ఛీ! ఇలా అనవచ్చా? మూర్ఖుడా! నేను ఆయన బానిసను. ‘నేను బండిని, నువ్వు చోదకుడవు; నేను గృహాన్ని, నువ్వు గృహ యజమానివి.నువ్వు ఎలా చేయిస్తావో నేను అలా చేస్తాను’ అని నువ్వు చదవలేదా? సమస్తమూ గురుదేవులే. ఆయన తప్ప మరేదీ లేదు. భగవంతుని వద్ద ప్రాణులు చేసిన అప్పుతీరనే తీరదా అని కొన్ని సమయాలలో అనిపిస్తుంది. తీరదు! ఎన్ని తపస్సులు చేసినా ఆయన వద్ద చేసిన అప్పు తీర్చలేం. ఎందుకంటే, జీవులు కూడా ఆయనకు చెందినవారే కదా అనిపిస్తుంటుంది.
నేను: అందుకేనా మంత్రదీక్ష కోసం వచ్చే అందరికీ మీరు మంత్రదీక్ష ప్రసాదిస్తున్నారు?
మాతృదేవి: ఎంత శోకం! ఎంత తాపం! ఎంతటి బాధలు! వీటితో దహించుకుపోయి ఇక్కడకు వస్తున్నారు. గురుదేవులు కాకుంటే మరెవరు వారి యాతనా జ్వాలలను చల్లార్చగలరు? యాతనలను నయం చేసే దివ్యౌషధం కదా ఆయన!వారందరి కంటే అధికంగా బాధలు పడింది ఆయనే కదా! అందువల్లే వారి బాధలను గురుదేవులు అవగతం చేసుకోగలుగుతున్నారు.
ఇంతలో లోపల నుండి రాధూ బిగ్గరగా పిలిచింది. వెంటనే మాతృదేవి, “కూర్చో! రాధూకు భోజనం పెట్టి వస్తాను” అని నాతో చెప్పి లోపలకు వెళ్లారు. ‘గురుదేవులు మాత్రమేనా, మీరూ ఎన్ని కష్టాలు పడవలసి వస్తోంది’ అని చెప్ప దలుచుకొన్నాను. కానీ మాతృదేవి ఆలోచనా సరళికి భంగం కలిగించరాదని ఊర కున్నాను. ఆమె చెప్పింది వింటూ ఉందామనుకొన్నాను.
కాసేపట్లో మాతృదేవి తిరిగివచ్చారు.
మాతృదేవి: ఏం చెబుతున్నాను?
నేను: గురుదేవుల గురించి!
మాతృదేవి: ఒకసారి నేను ఏం చూశానో తెలుసా? గురుదేవులే సమస్తమూ అయినట్లుగా దర్శించాను! ఎటువైపు చూసినా ఆయనే! గ్రుడ్డిమనిషీ ఆయనే, కుంటివ్యక్తీ ఆయనే, ఆయన తప్ప మరెవరూ లేరు. సృష్టి ఆయనదే, ఆయనే సర్వమూ అయివున్నారనే విషయం అప్పుడే నేను గ్రహించాను. నిజానికి బాధలు అనుభవించేది జీవులు కారు, ఆయనే అనుభవిస్తున్నారు. అందువల్లే కదా ఎవరు వచ్చి విలపించినా, వారిని లేవనెత్తవలసి వచ్చింది. ఆయన సంపత్తితోనే ఆయనకు సేవ చేస్తున్నాను.
నన్ను నిద్ర పొమ్మంటున్నారు. నిద్రేమిటి! నేను నిద్రించగలనా? నిద్రపోవడం మానుకొని ఆ సమయంలో కూడా జపం చేయగలిగితే జీవులకు ఉన్నతగతి కలుగుతుందనిపిస్తున్నది. ఈ చిన్ని దేహానికి బదులుగా పెద్ద దేహం ఉండివుంటే ఇంకా ఎందరికో మేలు ఒనరించవచ్చునని తోస్తూన్నది.
బారులుతీరి చీమలు పోతున్నాయి. రాధూ వాటిని చంప ప్రయత్నించింది. నాకు ఏం కనిపించిందో తెలుసా? అక్కడ చీమలు కనపడలేదు. అవన్నీ గురుదేవులు – చేతులు, కాళ్లు, ముఖం, కళ్లు అన్నీ ఆయనవే. రాధూను వారించాను. సమస్త జీవులూ ఆయనకు చెందినవే కదా! పెద్దగా నేను ఏం చేయగలను? ఎందరిని కాపాడగలను? అందరి బాధ్యతనూ ఆయన నాకు అప్పగించారు, వారందరినీ కాపాడగలిగితే ఎంత బాగుంటుంది!
ఇంతలో ఆలయంలో శంఖనాదం వినవచ్చింది. గంటలు మ్రోగాయి. మాతృదేవి ఏదో కల నుండి మేల్కొన్నట్లు లేచి, ఇలా అన్నారు:
“సంధ్యా సమయమైంది. గురుదేవుల సాయంకాల పూజ చేయాలి. ఇంతసేపూ ఏదేదో వాగాను.”
నేను: అమ్మా! నేడు మీరు చెప్పినవన్నీ ఎంతో ముఖ్యమైన విషయాలు.
మాతృదేవి (నవ్వుతూ): అన్నీ వ్రాసి పెట్టుకొంటున్నావా ఏమిటి?
నేను: అవునమ్మా. మీరు జయరాంబాటిలోను, నేను కలకత్తాలోను ఉన్నప్పుడు సమయం చిక్కినప్పుడు వీటినన్నీ తిరగేస్తాను.
మాతృదేవి బయలుదేరేటప్పుడు ఆమెకు ప్రణమిల్లాను. నన్ను ఆశీర్వదించారు. వెళుతున్నప్పుడు నవ్వుతూ, “తల్లీ – తనయుడు, తల్లీ – తనయుడు” అంటూ వెళ్లి పోయారు. నా బసకు తిరిగి వచ్చాను. ‘తల్లీ – తనయుడు, తల్లీ – తనయుడు’ అన్న మాటలే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూన్నాయి.