ఉద్బోధన్
నేను గ్రామీణురాల్ని.. మొట్టమొదటిసారిగా కలకత్తాకు వచ్చి మాతృదేవి దర్శనార్థం వెళ్లినప్పుడు నా ఆరోగ్యం అంత బాగాలేదు. బండిలోనే వెళ్లాను. దారిలో తల తిరిగి వాంతి వచ్చేలా అనిపించింది. ఎలాగో ఉద్బోధన్కు చేరుకొని మెట్లెక్కి పైకి వెళ్లాను. అప్పుడు ఒక పొడవైన గదిలో మాతృదేవి నిలబడి ఉన్నారు. ఆమె స్నానానికి వెళ్లబోతున్నట్లుంది. ఆమె వాకిలిపై ఒక చేయి వేసి నా కోసమే వేచి వున్నట్లు నిలబడి ఉన్నారు. నన్ను చూడగానే చిరునవ్వుతో, “ఎక్కడి నుండి వస్తున్నా వమ్మా? ఎందు కోసం వచ్చావు?” అని అడిగారు.
నేను: మాతృదేవి దర్శనార్థం వచ్చాను.
మాతృదేవి: అమ్మాయీ! నేనే మాతృదేవిని. ఆ గదిలో గురుదేవులున్నారు. ఆయనకు ప్రణమిల్లి, ఇక్కడకు వచ్చి కూర్చో. నేను స్నానం చేసి వస్తాను.
స్నానం చేసి వచ్చాక మాతృదేవి నన్ను అనేక విషయాల గురించి అడిగారు. ఆమె వద్ద మంత్రదీక్ష తీసుకోవాలనే కోర్కె వ్యక్తం చేశాను. అందుకు సమ్మతించిన మాతృదేవి నాకు అనేక ఉపదేశాలిచ్చారు.
మాతృదేవి: అమ్మాయీ! ఏకాదశి రోజుల్లో నువ్వు ఏం తింటావు?
భక్తురాలు: ఇంతకు మునుపు సగ్గుబియ్యం జావ తాగేదాన్ని. కానీ ఇప్పుడు కల్తీచేసి అమ్ముతున్నారని తెలిసి ఆ జావ కూడా పుచ్చుకోవడం లేదు.
మాతృదేవి: మరీ అంత కటిక ఉపవాసం చేయవద్దు. కాస్త జావ పుచ్చుకో. అది శరీరాన్ని చల్లబరుస్తుంది. వ్రతాలతో శరీరాన్ని కట్టెలా చేసుకొన్నావు. అంత వద్దు. ఆరోగ్యం పాడయితే సాధనలు ఎలా చేయగలవు? అవును, నువ్వు అభ్యంగన స్నానం చేస్తావా?
భక్తురాలు: నా భర్త మరణానంతరం మానుకొన్నాను.
మాతృదేవి: నూనె రాచుకోవడం వలన మెదడు చల్లబడుతుంది. నూనె వాడు.
భక్తురాలు: చాలాకాలంగా వాడనందున, దానిని తాకడానికే నాకు అస హ్యంగా ఉంటుంది. నూనె వాడలేనమ్మా!
గోలాప్ మా: వయస్సులో చిన్నదానివి. వ్రతాలూ అవీ ఇవీ అంటూ ఆరోగ్యం పాడుచేసుకొన్నావు.
గౌరీ మా: అవునూ శిరోజాలను ఎందుకు కత్తిరించివేశావు?
భక్తురాలు: మా ప్రాంతాల్లో వితంతువులు శిరోజాలు ఉంచుకోవడం నిషిద్ధం.
గౌరీ మా: శిరోజాలు లేకుంటే చూపు మందగిస్తుంది. శరీరాన్నే శ్రీకృష్ణునికి అర్పించినట్లు చెబుతున్నావు, మరి శిరోజాలు మాత్రం నీవా?
యోగీన్ మా: ఈ దేహం భగవంతుని దేవాలయం. దాన్ని చక్కగా ఉంచు కోవడం మంచిది.
మాతృదేవి: అమ్మాయీ! నువ్వు మంచిపనే చేశావు. శిరోజాలుంటే ఒకింత అలంకరించుకోవాలని అనిపిస్తుంది. అందుకోసం వాటిని జాగ్రత్తగా సంరక్షించు కోవాలి. శిరోజాల అలంకారాన్ని అధిగమించి ఇక్కడకు వచ్చావు. దేని నిమిత్తం ఇన్ని కఠోర వ్రతాలు అనుష్ఠించావో దాన్ని పొందావు. ఇకపై ఇటువంటి కఠోర వ్రతాలు చేపట్టకు! రేపు నీకు మంత్రదీక్ష ఇస్తాను. ఉదయం ఎనిమిది గంటలప్పుడు ఇక్కడకు రా. దీక్ష పుచ్చుకొనే రోజు గంగలో స్నానం చేసి, కాళీమాత దర్శనం చేసుకోవడం మంచిది.
‘అమ్మా! మిమ్మల్ని దర్శించుకోవడంతో కాళీమాత దర్శనం పూర్తయింది. మీ పాదపద్మాలను తాకి పవిత్రురాలినయ్యాను’ అని మనసులో అనుకొన్నాను. తరువాత మాతృదేవికి ప్రణమిల్లి తిరిగి వచ్చాను.
మర్నాడు మంత్రదీక్ష కోసం వెళ్లినప్పుడు కాస్త ఆలస్యమైంది. నేను కూర్చో బోతున్నప్పుడు మాతృదేవి, “అమ్మాయీ! కామినీకాంచనాలను త్యజించిన గురు దేవులను శరణుజొచ్చావు. నీ కొంగున ముడివేసి ఉంచిన డబ్బును తీసి విడిగాపెట్టి వచ్చి కూర్చో” అని చెప్పారు.
బండి బాడుగ కోసం రెండు రూపాయలు చీర కొంగులో ముడివేసి ఉంచాను. వాటిని తీసి గోడ ప్రక్కనపెట్టి వచ్చి కూర్చున్నాను.
మంత్రదీక్ష సమయంలో నా తల మీద చేయి ఉంచి మాతృదేవి ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు:
“భయపడకు. ఇప్పుడు నువ్వు పునర్జన్మనెత్తావు. ఇంతకు మునుపు నువ్వు చేసిన సమస్త కర్మఫలాలనూ నేను గైకొన్నాను. ఇప్పుడు నువ్వు పవిత్రురాలవు, పాపరహితవు.”
తదనంతరం మంత్రదీక్ష ఇవ్వడం పూర్తయింది.
భక్తురాలు: జప ఫలాన్ని వదలుకోవడానికి ఏదైనా ప్రత్యేక మంత్రం ఉందా అమ్మా?
మాతృదేవి: వదలుకోవడం అనరాదు, సమర్పించడమనాలి.
కొంత ప్రసాదం ఇస్తూ మాతృదేవి నాతో, “మంత్రదీక్షానంతరం గురువుతో చాలాసేపు ఉండకూడదు. ఈ రోజు వెళ్లి, రేపు వచ్చి ఇక్కడ ప్రసాదం భుజించు” అని చెప్పారు. నేను సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాను.
మర్నాడు పగటి వేళ మాతృదేవిని దర్శించుకొని అక్కడే ప్రసాదం భుజించాను. పిదప మాతృదేవి ప్రక్కన కూర్చున్నాను.
మాతృదేవి: నీకు చదవనూ, వ్రాయనూ తెలుసా? రోజూ కాసేపు గీతాధ్య యనం చేయి, శ్రీరామకృష్ణ కథామృతం కూడా చదవాలి. ఆయనను గురించి ఎన్నో పుస్తకాలు వెలువడ్డాయి. వాటిని కూడా చదవాలి.
భక్తురాలు: అమ్మా! నా మనస్సు కుటుంబ వ్యవహారాల వైపు కించిత్తు కూడా పోవడం లేదు. ఎంతో కష్టంతో వాళ్లతో బ్రతుకుతున్నాను. ఆ సంగతి మీకు తెలియంది కాదు. నన్ను అటువంటి లౌకిక వ్యక్తుల మధ్య వదలిపెట్టకండి. ఇదే నా ప్రార్థన.
మాతృదేవి: అమ్మాయీ! కుటుంబ జీవితం పెద్దగా నిన్ను ఏం చేయగలదు? నీ వరకు కుటుంబంలో జీవించడమూ, చెట్టు క్రింద జీవించడమూ ఒక్కటే. కుటుంబ జీవితం భగవంతునికన్నా వేరైనదా ఏమిటి? భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. నువ్వు స్త్రీవి, ఎక్కడకు వెళ్లగలవు? ఆయన ఎక్కడ ఎలా ఏ స్థితిలో ఉంచుతాడో అక్కడే సంతృప్తితో నివసించు. భగవంతుణ్ణి పొందగోరాలి, ఆయనను పొందాలి – ఇదే లక్ష్యం. ఆయనను నువ్వు ప్రార్థిస్తే, నీ చేతులు పుచ్చుకొని ఆయనే ముందుండి నిన్ను నడిపిస్తాడు. ఆయనను శరణుజొచ్చి నువ్వు జీవించ గలిగితే దేనికీ భయపడవలసిన అగత్యం ఉండదు.
మరొక విషయం: గురుశిష్యులు కలిసి జీవించడం మంచిది కాదు. ఎందు కంటే గురువు దైనందిన జీవితాన్ని పరిశీలించే శిష్యుడు ఆయనను సామాన్య వ్యక్తిలా ఎంచడం కద్దు. ఇది శిష్యునికి చేటవుతుంది. గురువు ఇంటికి సమీపంలోవిడిగా శిష్యుడు వసించి రోజు కొకసారి వచ్చి ఆయనను దర్శించుకొని, ఆయనసాంగత్యంలో ఆనందిస్తూ ఉపదేశాలు స్వీకరించడం మంచిది. అదే సమయంలో శిష్యుడు అప్పుడప్పుడు గురువును కలుసుకోని పక్షంలో ఆయన బోధించింది మరచిపోవచ్చు. రోజూ ఇక్కడకు వస్తూ ఉండు.
మాతృదేవి చేసిన ఈ ఉపదేశం నా శేషజీవితానికి స్పష్టమైన జీవన విధానాన్నినిర్దేశించి చూపింది. నేను కుటుంబ జీవనాన్నే గడపాలి, సన్న్యాస జీవితం నాకునిర్దేశింపబడలేదని గ్రహించినప్పుడు నా కళ్ల వెంట స్రవించిన కన్నీటిని ఆపుకోలేకపోయాను. ఎంతగానో విలపించాను. నన్ను పలువిధాలుగా అనునయించారుమాతృదేవి.
మాతృదేవి: అమ్మాయీ! నేను కూడా జీవితపర్యంతం కుటుంబ జీవనమేగడుపుతున్నాను. నువ్వు పిన్నవయస్కురాలవు. ఆధ్యాత్మిక సముపార్జనకై అక్కడికీ ఇక్కడికీ తిరగడం ప్రమాదభరితం. ఎక్కడ ఏ స్థితిలో ఎలా నువ్వు జీవించినాలౌకిక కళంకం నిన్ను స్పృశించదని నేను చెబుతున్నాను. గురుదేవులు ఉన్నారు, దేనికీ భీతి చెందకు, కలత చెందకు.
ఒక రోజు నివేదితా పాఠశాల నుండి సుధీర కొందరు విద్యార్థినులనుమాతృదేవి దర్శనార్థం తీసుకువచ్చింది. అప్పుడు ఒక భక్తురాలు నన్ను చూపుతూమాతృదేవితో, “అమ్మా! ఈమెను కూడా మాతోపాటు ఉండనివ్వండి. పిల్లలకునేర్పిస్తుంది, మాతో కలిసి ఉండవచ్చు” అని చెప్పింది.
నేను బసచేసే విషయం గురించీ, నా జీవన విధానం గురించీ ఎవరితోనూ ఎప్పుడూ ప్రస్తావించ లేదు. ఆ భక్తురాలు అలా చెప్పడం నాకు ఏదోలా అనిపించింది.ఆమెతో మాతృదేవి ఇలా అన్నారు:
“అందరూ ఒకే పనికై లోకంలోకి రావడంలేదు. మీరు చదువుకోండి, విద్యార్థినులకు చదువు నేర్పించండి. ఇది మీ పని. ఇవన్నీ చేయడానికి ఈమెరాలేదు. నేర్పించడం, నేర్చుకోవడం మంచి పనే! సందేహం లేదు. కానీ అందరికీ అది యుక్తం కాబోదు.”
వాళ్లు వెళ్లిపోయిన తరువాత, “స్త్రీలకు నేర్పించడం సామాన్యమైన విషయమా ఏమిటి?” అని అన్నారు.
నాభర్త మరణానికి ఒక ఏడాది క్రితం ఒక రోజు నేను బొప్పాయి కోస్తున్నప్పుడు, దాని పాలు నా చేతి మీద పడి నస పెట్టసాగింది. కాసేపటికల్లా వాచిపోవడమే కాక చేతి వేలి చర్మం చిట్లసాగింది. అది అలాగే పుండుగా మారి ఎన్ని చికిత్సలు చేసినా నయం కాలేదు. ఇలాగే పన్నెండేళ్లు గడిచిపోయింది. మాతృదేవి వద్దకు వచ్చి ఒక సంవత్సరకాలమైనా నేను దానిని ఆమెకు చూపించలేదు, కనీసం చెప్పలేదు కూడా! కానీ ఒక రోజు ఎలాగో ఈ సంగతి ఆమె గ్రహించారు. వెంటనే నాతో, “ఏమమ్మా! ఇన్ని రోజుల నుండి నువ్వు ఇక్కడకు వస్తున్నావు గదా! నీ చేతివ్రేలికి ఇటువంటి వ్యాధా? నీ తల్లిగా ఉంటూ కూడా నేను ఈ విషయం గమనించలేకపోయానే! నా మనస్సు ఎంతో క్షోభిస్తోంది” అని అన్నారు. నేను అంతా వివరంగా చెప్పాను. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“ఇప్పుడు నేను సదా అంతర్ముఖమై ఉంటున్నాను. అందువల్ల నిన్ను కని పెట్టలేకపోయాను. ఈ చేత్తో నువ్వు పూజ చేయడం వల్లనే వ్యాధి నయం కాకుండా ఉంది. పోనీలే! నాతో రా! గురుదేవులను అర్చించిన పువ్వులు, చరణామృతం ఇస్తాను. వెంటనే మనం వెళ్లకుంటే పువ్వులను తీసి గంగలో వేసేస్తారు. త్వరగా రా.”
మాతృదేవితో పూజామందిరానికి వెళ్లాను. అక్కడ ఉన్న కమండలం చూపుతూ, “ఇదిగో! ఈ కమండలంలో నీ చేతిని ముంచి తీయి” అని చెప్పారు. నేను అలానే చేశాను. ఆ తరువాత ఆమె ఇలా అన్నారు:
“అంతా నయమైపోతుంది. సాధ్యమైనంత వరకు చేపలు, మాంసం, ఉల్లి పాయలు, వెల్లుల్లి తరగడం మానుకో. ఒక్కసారిగా అలా చేయలేకపోవచ్చు. వాటిని తరిగేటప్పుడు మళ్లీ ఒకవేళ నీ చేతిచర్మం చిట్లవచ్చు. పోనీలే, గురుదేవుల పూజ నిత్యం చేస్తూవుండు! చేతి చర్మం చిట్లినప్పుడు గురుదేవుల చరణామృతాన్ని లేపనంగా వాడు. వెంటనే నయమవుతుంది. అవునూ, నువ్వు బొప్పాయి తరిగిన రోజున చేతిగోళ్లు కత్తిరించుకొన్నావా?”
నేను: జ్ఞాపకం లేదు.
మాతృదేవి: అలాగే జరిగి ఉంటుంది. గోళ్లు కత్తిరించుకొన్న రోజునే బొప్పాయి పాలు పడడం వలన నీ చర్మం చిట్లి ఉంటుంది.
మధ్యాహ్నం మాతృదేవి ఇతర భక్తురాండ్రతో ఇలా అన్నారు:
“ఇదిగో చూడండి. మీరైనాసరే, మీ భర్తలో, పిల్లలో ఎవరైనాసరే క్షవరం చేసుకొనే కత్తితో గోళ్లు కత్తిరించుకోకండి. తద్వారా భయంకరమైన రోగం దాపురించే అవకాశాలున్నాయి. ఈమెను చూడండి. ఈమె చేతికి ఇలాంటి రోగమే సోకింది. గురుదేవుల కృపతో అది నయమవుతుంది.”
ఇంట్లో కూడా చేపలు ఇత్యాది వాటిని తరక్కుండా ఉండలేను. వెంటనే చర్మం చిట్లేది. కానీ గురుదేవుల చరణామృతాన్ని లేపనంగా పూయగానే అది తగ్గిపోయేది. చివరకు ఆ రోగం పూర్తిగా నయమయింది. ఆ తరువాత ఒక రోజు మాతృదేవి వద్దకొచ్చి, “అమ్మా! వ్యాధి నివారణార్థం నేను మిమ్మల్ని ఆశ్రయించ లేదు. ఈ వ్యాధిని నయం చేసినంత అలవోకగా నన్ను విడిచిపెట్టలేరు” అని చెప్పాను. నా మాటలు విని మాతృదేవి నవ్వుతూ, “నీ శరీరం కూడా నాదే కదా! నీకు అనారోగ్యంగా ఉంటే నేను కూడా బాధపడాలి కదా!” అని అన్నారు.
నా శారీరక రుగ్మత గురించి గాని, ఆర్థిక కష్టం గురించి గాని లేదా మరే ఇతర సమస్య గురించి గాని మౌఖీకంగా గాని లేదా మానసిక్ంగా గాని మాతృదేవికి తెలుపరాదని దృఢ్ంగా సంకల్పించుకొన్నాను. మాతృదేవి ఈ సమస్యలను పరిష్కరించి నాకు వీడ్కోలు ఇచ్చివేస్తారేమోననే భయమే ఇందుకు కారణం. అందువలన ఆమెను దర్శించినప్పుడల్లా నా సాధనలను గురించే ప్రస్తావించేదాన్ని. ఆ రీతిలోనే ఒక రోజు ఇలా మాట్లాడాను:
నేను: నేను సాధనలు అనుష్ఠిస్తున్నాను. కానీ ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నానో లేదో తెలియడం లేదు.
మాతృదేవి: నేను నీ గురువును. నువ్వు పురోగమిస్తున్నావో లేదో నాకు తెలుసు. అది నీకెలా అవగతమవుతుంది? సమస్తమూ పొందుతావు, సమస్తమూ పొందుతావు. సాధన సమయంలో ఎదురయ్యే అనేక అంతరాయాలు ఆంతరికమైనవే; బాహ్యమైనవి తక్కువ. కానీ ఎలాంటి అంతరాయాలు ఎదురైనా జపం చేస్తూ, ధ్యానధారణలు అభ్యసించేకొద్దీ అవి క్రమంగా ఒకటి వెంట ఒకటిగా వైదొలగుతాయి. నీ కర్తవ్యం పాటించు. మనస్సులోని మాలిన్యాలు అలాగే ఉన్నాయా, తొలగి పోయాయా అనుకొని కలతచెందకు. కొబ్బరి మట్టను చూశావు కదా! సముచిత సమయంలో అది తనంతట తానుగా రాలిపోతుంది. బలవంతంగా దానిని పీకి వేయగోరితే ఎంతో శ్రమించవలసి వస్తుంది. అదే విధంగా సరైన సమయంలో అన్నీ జరుగుతాయి.
నేను: అమ్మా! నేను ఎందువల్ల జపధ్యానాలలో లీనం కాలేకపోతున్నాను?
మాతృదేవి: సాధ్యమైనంతవరకు అనుష్ఠిస్తూనే ఉన్నావు కదా! అంతా సవ్యంగానే జరుగుతూవుంది. అమ్మాయీ! ఇంత చిన్నవయస్సులోనే వైధవ్యం ప్రాప్తించినప్పటికీ ఇక్కడకు నువ్వు రావడం గొప్ప విషయం. నువ్వు ఎంతో శ్రమించనక్కరలేదు. సాయంత్రం భగవంతుని సన్నిధిలో రెండుసార్లు ప్రణమిల్లితే చాలు! ఒక్క మార్గాన్ని గట్టిగా అనుసరిస్తే చాలు. మరేదీ చేయనవసరంలేదు. నీ విషయంలో అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి.
‘దైవాన్నీ, పెద్దలనూ దర్శించడానికి రిక్తహస్తాలతో వెళ్లకూడదు’ అనేవారు మాతృదేవి. అందువలన రోజూ ఆమెను దర్శింప వెళ్లేటప్పుడు ఏదో ఒకటి తీసుకు వెళ్లేదాన్ని. ఒక రోజు మాతృదేవి ఇలా అన్నారు:
“నువ్వు అంతగా ఉన్నదానివి కావు. రోజు ఎందుకమ్మా ఇవన్నీ తీసుకు వస్తావు? ఒక ఉసిరికాయ తీసుకురా, అది చాలు. మీ అందరి నోళ్ల గుండా నేను భుజిస్తున్నాను కదా! మీరు తింటే నేను తిన్నట్లే! గురుదేవుల సామ్రాజ్యంలోకి వచ్చి ఎంతో ఆరగించాను!”
నారెండవ సోదరునికి తీవ్రమైన వ్యాధి. శస్త్రచికిత్స చేయాల్సి ఉంది. శస్త్ర చికిత్స చేసినా బ్రతకడం కష్టమని డాక్టర్ చెప్పేశాడు. అతడి చికిత్స కోసం కుటుంబ సభ్యులందరూ కలకత్తాకు వచ్చారు. ఒకరోజు అతణ్ణి తీసుకొని మాతృదేవి వద్దకు వెళ్లాను. అతడు మాతృదేవికి ప్రణమిల్లి, సెలవు పుచ్చుకొని వెళ్లిపోయిన తరువాత నేను ఆమెతో మాట్లాడాను.
నేను: ఇతణ్ణి తలచుకొంటేనే నాకు ఎంతో ఆరాటంగా ఉందమ్మా! అందుకే కుటుంబ జీవనం నుండి వైదొలగాలని అనుకొంటాను. ఇతడికి ఏమైనా జరుగరానిది జరిగితే యావత్తు కుటుంబ భారం నా మీద పడుతుంది! అలా ఏదైనా జరిగే పక్షంలో నేను దాన్లో లీనమైపోవాల్సిందే! మీ పాదారవిందాలను ఆశ్రయించినప్పటికీ తప్పించుకోలేను. నేను ఏం చేయాలి?
మాతృదేవి: ఆ శస్త్ర చికిత్స మూలంగా నీ సోదరుడు బ్రతికి బట్టకట్టినా ఎప్పుడో ఒక రోజు మరణించక తప్పదు! ఇక అతడు బ్రతికినప్పటికీ పెద్దగా నీకు ఒరగబోయేది ఏమీ లేదు. అందువలన ఎందుకంత ఆందోళన చెందుతావు?
మాతృదేవి అన్న ఆ మాటలను బట్టి అతడు బ్రతకడం కష్టమని నాకు అనిపిం చింది. కానీ మరుక్షణమే మాతృదేవి ఇలా అన్నారు: “భయపడకు, గురుదేవులున్నారు! శస్త్రచికిత్స చేసే గదిలో గురుదేవుల ఛాయాచిత్రం ఉంచు. ఆయన కాపాడతారు.”
ఇంటికి తిరిగివచ్చి మాతృదేవి మాటలను యథాతథంగా కుటుంబ సభ్యులకు చెప్పాను. “ఇక భయపడవలసింది లేదు. సజీవదైవం పాదాలను అతడు స్పృశిం చాడు. అందువలన ఎలాంటి భయమూ లేదు” అన్నారు వారందరూ. శస్త్రచికిత్స విజయవంతమై నా సోదరుడు ఇంటికి తిరిగివచ్చాడు.
ఒక రోజు మధ్యాహ్నం వేళ మాతృదేవిని దర్శించడానికి ఒక వితంతువు వచ్చింది. ఆమె మెడలో తులసిమాల ఉంది. దేవుని పవిత్ర నామాలు అద్దకం వేసిన చీర ఆమె కట్టుకొని ఉంది. ఆమె రావడానికి ఒకింతసేపు ముందు మాతృదేవి హఠాత్తుగా గంభీరముద్ర వహించారు. ఆమె మాతృదేవికి ప్రణమిల్లడానికి ముందుకు వచ్చింది. అప్పుడు మాతృదేవి, “పాదాలు తాకకుండా, నేలను తాకి నమస్కరిస్తే చాలు!” అని చెప్పారు. కానీ ఆమె మాతృదేవి మాటలను ఉపేక్షించి పాదాలు తాకి నమస్కరించింది. అక్కడున్న శ్రీరామకృష్ణుల ఛాయాచిత్రం చూసి ఆశ్చర్యపోతూ నాతో, “చూశావా! ఎంత అందంగా ఉందో!” అన్నది. వెంటనే ఆమెతో మాతృదేవి, “నువ్వు చూపిన ఆ ఛాయాచిత్రాన్ని ఆమె రోజూ పూజిస్తోంది” అని చెప్పారు.
వితంతువు (నన్ను చూపుతూ): ఈమె మీ కూతురా?
మాతృదేవి: అవును, కుమార్తే!
వితంతువు: మీకు ఎందరు పిల్లలు?
మాతృదేవి: లోకంలోని వారంతా నా పిల్లలే!
వితంతువు: మీరు కన్న పిల్లలెందరు?
మాతృదేవి: నా భర్త సర్వసంగపరిత్యాగి.
దీని భావం ఆమెకు అవగతం కాలేదు. అందువల్ల ఏవేవో ప్రశ్నలు అడగ సాగింది. నేను సహనం కోల్పోసాగాను. అప్పుడు మాతృదేవి, “ఇవన్నీ ఈమెకు వివరంగా చెప్పు. ఇక నా వల్ల కాదు” అని నాతో చెప్పారు.
నేను ఆ వితంతువుతో, “మాతృదేవిని గురించి మీకు ఏమీ తెలిసినట్లులేదు. ఇక్కడకు వచ్చేవారు కేవలం దర్శనానికీ, ప్రణమిల్లడానికీ మాత్రమే రావడం లేదు. మాతృదేవి గురించి అనేక పుస్తకాలు వెలువడివున్నాయి. వాటిని చదవండి. మీరు చెప్పదలచుకొన్నది నాతో చెప్పండి. మాతృదేవిని ఇబ్బంది పెట్టకండి” అని చెప్పాను.
కానీ ఆమె నా మాటలేవీ పట్టించుకోకుండా మాతృదేవితో, “నా కుమార్తె మీ వద్దకు వస్తూ ఉండేది. ఒకరోజు పెద్ద ముల్లంగులు కూడా తెచ్చింది” అని చెప్పింది. అందుకు మాతృదేవి, “ఎందరో ఎన్నెన్నో తెచ్చి ఇస్తూ ఉంటారు. అవన్నీ నేను గుర్తుపెట్టుకొని ఉండగలనా? నీ కుమార్తె ఎవరో నాకు తెలియదు” అని అన్నారు.
ఆ వితంతువు వెళ్లిపోయిన పిదప మాతృదేవి, “అమ్మాయీ! కాసిని మంచినీళ్లు తెచ్చి నా పాదాలు కడుగు. విసనకర్రతో కాస్త విసురు” అని నాతో చెప్పారు. నేను అలాగే చేశాను.
నాకు పరిచయస్థురాలైన ఒక స్త్రీ, మాతృదేవిని దర్శించాలనుకొంది. కానీ ఆమె భర్తకు అది నచ్చలేదు. ఒక రోజు భర్త కార్యాలయానికి వెళ్లిపోయాక ఆమె నా వద్దకు వచ్చి, తనను మాతృదేవి వద్దకు తీసుకు వెళ్లమనీ, భర్త తిరిగి వచ్చేలోగా ఇంటికి వెళ్లిపోతాననీ చెప్పింది. అందుకు నేను, “ఇప్పుడు మాతృదేవి విశ్రాంతి తీసుకొనే వేళ. ఇప్పుడు కనుక వెళితే ఆమెను చూడడం కుదరదు” అని ఆమెతో చెప్పాను. కానీ ఆమె పట్టుబట్టి, “ఫరవాలేదు, మనం వెళ్లి చూద్దాం” అన్ని నన్ను ఒత్తిడి చేసింది. దాంతో మేం బయలుదేరవలసి వచ్చింది.
మేం మాతృదేవి ఇంటికి వెళ్లినప్పుడు గోలాప్ మా భుజిస్తోంది. నన్ను చూడ గానే కోపంగా, “ఏం మనిషివి నువ్వు? ఈమెను కూడా తీసుకుని ఈ వేళప్పుడు ఎందుకొచ్చావు? ఈ సమయంలో మాతృదేవి విశ్రాంతి తీసుకొంటారని నీకు తెలియదా?” అంది. అప్పుడు నేను “తిట్టకండి! మాతృదేవి మేలుకోకుండా ఆమె వద్దకు వెళ్లేటంత మూర్ఖురాల్ని కాను” అని చెప్పాను.
కాసేపటికి మాతృదేవి నన్ను పిలిచారు. లోపలకు వెళ్లినప్పుడు పరుపు ప్రక్కన ఆమె నిలబడి ఉండడం చూశాను. నాతో వచ్చిన స్త్రీని చూపిస్తూ, “ఈమె ఎవరు?” అని మాతృదేవి అడిగారు. పిదప నాతో, “ఈ వేళప్పుడు వచ్చినందుకు గోలాప్ మా కోప్పడిందా? ఇది గురుదేవుల సామ్రాజ్యం. ఇక్కడ ఎలాంటి నియమ నిబంధనలూ వర్తించవు. ఇక్కడి తలుపులు అందరి కోసం సదా తెరువబడే ఉంటాయి. ఎవరికి ఎప్పుడు అవకాశమూ, తీరికా లభిస్తుందో అప్పుడు వారు ఇక్కడకు రావచ్చు. దేన్నీ మనస్సులో పెట్టుకోకమ్మా!” అన్నారు అనునయంగా. పిదప మాతృదేవికి ప్రణమిల్లి మేం సెలవు పుచ్చుకొన్నాం.
వెళ్లేటప్పుడు గోలాప్ మాతో, “చూశారా! ఎంత వ్యాకులతతో మాతృదేవిని దర్శించడానికి లోకులు వస్తున్నారో! ఆమెను మాత్రమే ఏమిటి, మిమ్మల్ని కూడా దర్శించగోరుతున్నారు. కానీ మీరు మాతృదేవి ద్వారపాలిక కదా! అందువలన వచ్చేవారినందరినీ బయటకు గెంటివేస్తూంటారు. ఒకరిద్దరికి మాత్రమేనా, అందరికీ ఆమె మాతృదేవియే సుమా!” అని చెప్పాను. అందుకు గోలాప్మా నవ్వుతూ, “ఫరవాలేదే, నువ్వే గెలిచావు” అంది. గోలాప్ మా, గౌరీ మా, లక్ష్మివంటి వారు మా పట్ల కనబరిచే అనురాగం వర్ణనాతీతం.
ప్రమదాదేవి అనే కలకత్తా నివాసియైన వైద్యురాలు నాకు బంధువు. బ్రహ్మసమాజస్థురాలైన ఈమె, మాతృదేవిని దర్శించాలనుకొంది. ఆమెను నేను మాతృదేవి వద్దకు తీసుకు వెళ్లవలసి వచ్చింది. మేం అక్కడకు వెళ్లిన కొంతసేపటికి, అక్కడే ఉన్న సరళతో, “అనారోగ్యంగా ఉన్న ఆ పిల్లవాణ్ణి ఈమెకు చూపించు” అని మాతృదేవి చెప్పారు. నేను, డాక్టరు విస్మయం చెందాం. ప్రమద డాక్టర్లు ధరించే దుస్తులు ధరించలేదు, వైద్యపరికరాలు ఏవీ తీసుకురాలేదు. “నేను డాక్టర్నని మాతృదేవి ఎలా కనుగొన్నారు?” అంటూ విస్తుపోతూ అడిగింది.
కాసేపయ్యాక మాతృదేవి ప్రసాదం పంచిపెట్టారు. అక్కడున్న అందరికీ పంచి పెట్టిన మాతృదేవి, డాక్టరుకు మాత్రం పెట్టలేదు. నేను సందిగ్ధావస్థలో పడ్డాను. అప్పుడు నాతో డాక్టరు, “అందరికీ ప్రసాదం ఇచ్చిన మాతృదేవి నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు?” అని అడిగింది. అందుకు ఏం జవాబు చెప్పగలను? మాతృదేవి నాకు ఇచ్చిన ప్రసాదాన్ని ఆమెకు ఇచ్చే సాహసం చేయలేకపోయాను. అందువలన ఆమెతో, “నువ్వే మాతృదేవిని అడుగు” అని మాత్రం చెప్పాను.
కాసేపు గడిచాక డాక్టరు, మాతృదేవి వద్ద కెళ్లి, “అమ్మా! అందరికీ ప్రసాదం పంచిపెట్టారు. నాకు మాత్రం ఎందుకు ఇవ్వలేదు?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “అమ్మాయీ! నువ్వు బ్రహ్మసమాజస్థురాలవు.* నువ్వు! అడగకుండా నేను ప్రసాదం ఎలా ఇవ్వగలను?” అని చెప్పారు. మాతృదేవి, డాక్టరుకు ప్రసాదం ఇవ్వకపోయినా, ఆమె కోసం ఒక రసగుల్లా ప్రత్యేకంగా తీసి ఉంచారు. డాక్టరు అడిగిన వెంటనే రసగుల్లా తీసి ఇచ్చారు.
నా అత్త, తక్కిన బంధువులు ఊరికి తిరిగి పోతున్నప్పుడు నేను వారితో వెళ్లలేదు. ఊరికి వెళ్లగానే మామయ్య నాకు ఉత్తరం వ్రాశారు: “నువ్వు మాతో రాకపోవడం మాకు ఎంతో బాధ కలిగించింది. కానీ సాక్షాత్తూ దేవి పాదపద్మాలకు నిన్ను నువ్వు అర్పించుకొని జీవిస్తున్నావనే భావన నాకెంతో ఆనందాన్ని కలిగిస్తూ న్నది. ఎన్నడైనా నువ్వు ఇక్కడకు రాగోరితే, ఆవేదనలకు ఆలవాలమైన మనస్సును మాతృదేవి పాదపద్మాల వద్ద అర్పించి వేసి రా! అప్పుడు మాత్రమే నీకు ఎలాంటి బాధా కలుగదు.”
ఈ లేఖను మాతృదేవికి చదివి వినిపించాను. అది విని ఆమె ఇలా అన్నారు: “ఏమిటి? మనస్సు కేవలం ఆవేదనలకు మూలస్థానం మాత్రమేనా? భగవదనుభూతి కోసం ప్రయత్నిస్తున్నావు కదా! ఆ ప్రయత్నంలో ఆ మనస్సునే కదా వెంట తీసుకొని వెళ్లాలి! భగవదనుభూతి పొందిన స్థితిలో మనస్సు వంటిది ఏదీ అక్కడ ఉండదు. ప్రస్తుతం మనస్సు సహాయం ఎంతో అవసరం. మనిషికి సన్మార్గం చూపించేది పవిత్రమైన మనస్సే కదా!
“దుష్ట మనస్సు దిశను మళ్లించాలి. అప్పుడు ఆ మనస్సే ఇష్టదైవాన్ని అవ గతం చేసుకోవడానికి పరికరంగా మారుతుంది. పోనీలే, వీటిని గురించి మీరు కలత చెందవలసిన పనిలేదు, గురుదేవులున్నారు. ఆయన మీ చేతులు పుచ్చుకొని నడిపిస్తారు. ఎల్లవేళలా ఆయన మీతో ఉంటారు.”
మాతృదేవి ఈ వచనాలు ఎంతో శక్తిమంతమైనవి. జీవితంలో ఎన్నోసార్లు ఈ వచనాల శక్తి నాకు అనుభవైకవేద్యమే!
ఒక భక్తురాలు: అమ్మా, చైతన్య మహాప్రభువు అవతార పురుషుడు కాదని అనేకులు చెబుతున్నారు. ఇది నిజమేనా?
మాతృదేవి: చెప్పేవాళ్లు చెబుతారు. దానికేమిటి? దేహధారణ చేసి మనలా జీవించే ఒక వ్యక్తిని అవతార పురుషునిగా అవగతం చేసుకోవడం అంత సులభం కాదు. ఆయనను అందరూ అవతార పురుషునిగా గ్రహించి ఉంటే, దివ్యప్రేమను ప్రచారం చేయడానికి ఆయన దెబ్బలు తిని ఉండేవాడా?
ఇలా పలుకుతున్నప్పుడు మాతృదేవి కళ్లు ఆర్ద్రమైనాయి. కొంతసేపటి తరువాత ఆమె కొనసాగించారు:
“అవతార పురుషులను అందరూ గుర్తించగలరా? ఏదో ఒకరిద్దరికి మాత్రమే అది సాధ్యం. మానవాళి మేలు కోసం వారు ఎంత పాటుపడతారు, ఎన్ని కష్టాలు అనుభవిస్తారు! గురుదేవుల నోట రక్తం స్రవిస్తూన్నప్పటికీ ఆయన భక్తులతో మాట్లా డడం మానలేదు. వారికి ఎలా మేలు కలుగుతుందా అని సదా ఆయన చింతన చేసేవారు.
“అవన్నీ అలా ఉంచు. అవతార పురుషుల గురించి మీరెందుకు కలత చెందాలి? ఒక వ్యక్తికి సంబంధించినంత వరకు, అతడి సొంత గురువు అవతార పురుషుని కంటే అధికుడు – ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో!”
ఒక రోజు రాధూ స్నానం చేసి తల దువ్వుకొంటోంది. తువ్వాలుతో శిరోజా లను అదిమిపెట్టి, వాటిని ఉంగరాలు ఉంగరాలుగా చేయడానికి ప్రయత్నిస్తూంది. అది చూసి మాతృదేవి ఆమెతో ఇలా అన్నారు:
“నువ్వు ఏం చేస్తున్నావు? ఈ అలంకారాలతో అందం వచ్చేస్తుందనుకొంటు న్నావా? అలా చేసుకోవడం తప్పు. ఇదంతా వికృతంగా నాకు తోస్తుంది. నేను శిరోజాలను ముడి కూడా వేసుకొని ఎరగను. ఎప్పుడైనా గౌరి వస్తే తల దువ్వి జడవేస్తుంది. జడను కూడా ఎక్కువసేపు ఉంచుకోలేను. విప్పేసి, శిరోజాలను విర బోసుకుంటాను. మీరేమో అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు.”
ప్రక్కనే ఉన్న గోలాప్ మా ఈ మాటలు విని, “అమ్మా! మీరు నిజంగా ముక్త కేశి* ! అందువలననే మీరు విరబోసుకొన్న కేశాలతో దర్శనమిస్తున్నారు” అని చెప్పింది.
ప్రేమానంద స్వామి పరమపదించి కొన్ని రోజులయింది. బేలూరు మఠంలో దుర్గాపూజ చేయలేదు. కానీ కాశీలో పూజ జరుగుతుంది. నేను వెళ్లగానే మాతృదేవి మాట్లాడనారంభించారు.
మాతృదేవి: అమ్మాయీ! ఈ రాత్రే నువ్వు కాశీకి బయలుదేరు. ఇక్కణ్ణుండి కొందరు సన్న్యాసులు, బ్రహ్మచారులు వెళుతున్నారు. నీ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఒక నెల రోజులు కాశీలో బసచేయి.
నేను: కాశీకి వెళ్లడం వల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ ఉండడమే నాకు ఇష్టం.
మాతృదేవి: ఏమంటున్నావు? విశ్వనాథుడు వెలసిన స్థలం అది.
నేను: ఇది కూడా అన్నపూర్ణ నెలకొన్న స్థలం కదా!
మాతృదేవి (నవ్వుతూ): అయినా నువ్వక్కడ కొన్ని రోజులు గడిపితే నీ ఆరోగ్యం కుదుటబడుతుంది.
నేను కాశీకి బయలుదేరాను. ఆ సమయంలో కాశీలో ఒక రకమైన విషజ్వరం వ్యాపించి ఉంది. అక్కడి సన్న్యాసులు, “ఇక్కడ భయంకరమైన విషజ్వరం వ్యాపిం చింది. ఆరోగ్యం కుదుటబడాలని వచ్చిన మీరు జ్వరపీడితులు కాకుంటే మంచిది” అని చెప్పారు. పూజ పూర్తయ్యాక నాతో వచ్చిన వారంతా తిరిగి వెళ్లిపోయారు. నేను అక్కడే బస చేశాను.
అందరూ భయపడ్డట్లే నాకు విషజ్వరం సోకింది. మఠంలోని సన్న్యాసులు నా చికిత్స కోసం డాక్టరును రప్పించి, ఇతర సౌకర్యాలు కల్పించి నన్ను చక్కగా చూసుకొన్నారు. ఒక రోజు మాతృదేవి నాకు కలలో కనిపించి, “భయపడకు. నేనున్నాను, నిన్ను చూసుకొంటాను!” అని చెప్పారు. ఆ తరువాత నెమ్మదిగా జ్వరం తగ్గుముఖం పట్టింది. కొన్ని రోజులలో నేను బాగా కోలుకొన్నాను.
ఒక నెల రోజులు కాశీలో గడిపిన తరువాత నేను కలకత్తాకు తిరిగివచ్చాను. నన్ను చూడగానే మాతృదేవి, “అమ్మాయీ! బ్రతికి బయటపడ్డావు. నీ ఆరోగ్యం కుదుటపడడానికే నిన్ను కాశీకి పంపాను. అక్కడ విషజ్వరం సోకి నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతిన్నది” అన్నారు నవ్వుతూ.
నాకు పదవ ఏట వివాహమైంది. పదిహేనేళ్లప్పుడు వితంతువునయ్యాను. “అమ్మా! మీ పాదపద్మాలను శరణుజొచ్చాను. నన్ను కాపాడడం మీ బాధ్యత” అంటూ మాతృదేవిని ఆశ్రయించాను. “భయపడకు. గురుదేవులు నీ చేయి పుచ్చుకొని దారి చూపుతారు” అంటూ ఆమె అభయప్రదానం చేశారు. ఆమె ముఖతః వెలువడ్డ దివ్యవచనాలు ఒక్కటి కూడా వమ్ము కాలేదు.
ఇప్పుడు నాకు దాదాపు అరవై ఏళ్లు. మాతృదేవి అమృత చరణాలు నా శిరస్సును స్పృశించాయి. నా తల, చేతులు ఆమె పాదపద్మాలను స్పృశించాయి. ఈ విధంగా నేను ఎంతో అదృష్టవంతురాలనయ్యాను. “భయపడకు. గురుదేవులు నీ చేయి పుచ్చుకొని దారి చూపుతారు” అన్న మాతృదేవి అభయ వచనాలే నా ఈ సుదీర్ఘ జీవనయానంలో అండగా నిలిచాయి. ఎలాంటి కోర్కే నన్ను ప్రలోభ పెట్టలేదు. ఆనందం, ఆనందం – దీనినొక్కటే నేను చవిచూశాను. మంత్రదీక్ష పుచ్చుకొనే సమయంలో ఒసగిన కొన్ని ఉపదేశాలు మినహా నేను నా జీవితం ఎలా గడపాలి, ఏం చేయాలి అనే విషయాల గురించి మాతృదేవి నాకు ఏమీ చెప్పలేదు. “నీకు అవసరమైనది గురుదేవులే చేస్తారు” అని మాత్రమే నాకు అప్పుడప్పుడు గుర్తు చేసేవారు. దీన్ని అంత సులువుగా మనం అవగతం చేసుకోలేం. కానీ మాతృదేవి చెప్పిందే ముమ్మాటికీ నిజం. గురుదేవులనూ, మాతృదేవినీ సదా సర్వవేళలా తలచుకోలేకపోయినా, వారు తమ బిడ్డలను ఆపదల నుండి, అపాయాల నుండి సదా కాపాడుతూనే ఉంటారు. వారి కృపాకటాక్షం లేనిదే మనం ఎంత ప్రయత్నించినప్పటికీ లౌకిక బంధాల నుండి విడివడలేమని చక్కగా అర్థం చేసుకొన్నాను.