1910
దాదాపు పదహారు సంవత్సరాల క్రితం ఒక రోజు చెన్నై నుండి వెలువడే ‘హిందూ’ దినపత్రికలో శ్రీశారదాదేవి చెన్నైకు వేంచేస్తున్నారనే వార్త చదివి నా తల్లితండ్రులు ఆమె దర్శనానికి నన్ను తమ వెంట తీసుకొని వెళ్లిన మధుర స్మృతులు నాకు జ్ఞాపకానికి వస్తున్నాయి.
ఆ సమయంలో నేను ఏమీ తెలియని బాలుణ్ణి. భగవాన్ శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానందుల పేర్లను మాత్రం విన్నానుగాని, వారి మహత్త్వం గురించీ, మాతృదేవి మహత్త్వం గురించీ ఏమీ తెలియదు. స్వామి వివేకానంద వేదాంతంలో నిష్ణాతులనీ, ఆయన ప్రసంగాలు మన హైందవ మతంలోని అనేక సంశయాలను నివృత్తిచేసి, మతంపట్ల ఆసక్తిని పెంపొందించేవిగా ఉండేవని మా నాన్న చెప్పగా ఒకింత విన్నాను.
నేను, నా తల్లితండ్రులు కుతూహలం కొద్దీ మాతృదేవిని చూడడానికి వెళ్లామే గాని, భక్తిప్రపత్తులతో కాదు. అయినా మైలాపూర్ శ్రీరామకృష్ణ మఠం సమీపంలోని ఒక ఇంట్లో బసచేసిన మాతృదేవిని చూసినప్పుడు మా మనస్సులు ఆమె అమృత కటాక్షవీక్షణకు ఆకర్షింపబడ్డాయి. అందువలన అప్పుడప్పుడు మాతృదేవిని దర్శించు కోవాలనే ఆకాంక్ష మా మనస్సుల్లో పెల్లుబికింది. ఆ సమయంలో, ‘ఎందుకు ఇలా పిచ్చివాళ్లలా అక్కడకు వెళుతున్నాం?’ అనే భావన మాలో మెదల్లేదు. ఇప్పుడు ఆలోచించి చూస్తే, మాకూ మాతృదేవికీ ఏం సంబంధం ఉన్నదో తెలియదు. ఆమెకు ఆంగ్లం, తమిళం, సంస్కృతం తెలియదు. మాకు వంగ భాష కించిత్తు కూడా తెలియదు. మాతృదేవి దివ్యత్వంతో, సద్గుణశోభిత ముఖారవిందంతో, సదా చిరునవ్వుతో భాసిస్తూ కనిపించేవారు. కాని నేను సగటు మనిషిలోవున్న అనేక లోటుపాట్లతో, కించిత్తు అయినా పారమార్థిక అభిలాష లేని బాలుణ్ణి. అయి నప్పటికీ ఏదో ఒక విశేషమైన సంబంధం ఉండివుండాలి. ఆ సంబంధాన్ని విధి సంబంధమనే చెప్పాల్సి ఉంటుంది.
ఈ విధంగా మాతృదేవి చెన్నైలో బసచేసి ఉన్నన్ని నాళ్లు ప్రతి రోజు ఆమెను దర్శించుకొని, ఆమె అనురాగానికి పాత్రులమయ్యాం. కొన్ని రోజులలో మాతృదేవి నుండి విడిపోవలసిన తరుణం ఆసన్నమైంది. కాని ఈ సందర్భంలో చెన్నై శ్రీరామ కృష్ణ మఠ అధ్యక్షులైన స్వామి రామకృష్ణానందగారి ఆదరణకు పాత్రులమైనందున, మాతృదేవి వెళ్లిపోవడం మమ్మల్ని అంతగా ఆవేదనకు గురిచేయలేదు. నా తల్లి తండ్రులు మాతృదేవి నుండి మంత్రోపదేశం పుచ్చుకొన్నారు. మాతృదేవి మా ఇంటికి ఏతెంచి, మా ఆతిథ్యం స్వీకరించిన పర్వదినాన్ని మేం ఎన్నటికీ మరువలేం.
తరువాత ఐదారేళ్లు దొర్లిపోయాయి. మాతృదేవి మహత్వాన్ని అంతగా ఎరుగని కారణంగా ఆమె వీడ్కోలు నాకు అంతగా బాధ అనిపించలేదు. అయినా నా తల్లి తండ్రులకు మాతృదేవిని దర్శించుకోవాలనే ఆకాంక్ష కలిగింది. భగవాన్ శ్రీరామ కృష్ణుల జీవిత చరిత్రనూ, మాతృదేవి జీవిత చరిత్రనూ చదివేకొద్దీ, ఆమె అనుగ్ర హించిన దివ్యమంత్రాలను జపించేకొద్దీ ఆ కోర్కె వారిలో తీవ్రతరమైంది. కాని మా నాన్నకు ఉద్యోగ విరమణ కానందువలన, నా చదువు పూర్తికాగానే మా అమ్మను తీసుకొని మాతృదేవి దర్శనార్థం వెళ్లిరమ్మన్నారు.
కలకత్తా మఠంవారు మాకు తోడుగా పంపిన వ్యక్తితో కలిసి నేను, మా అమ్మ మాతృదేవి అవతరించిన జయరాంబాటికి బయలుదేరాం. విష్ణుపూర్ రైల్వే స్టేషన్ నుండి దాదాపు ఇరవై మైళ్ల దూరంలో ఉంది జయరాంబాటి. అదొక కుగ్రామం. ప్రస్తుతం అదొక తీర్థస్థలంగా రూపొందింది. మాతృదేవి అక్కడ చాలా కాలం వసించినందువలన ఆమె పేరిట ఒక ఆలయం నిర్మింపబడింది. కాని మా అమ్మకు ఆ రోజుల్లోనే ఆ గ్రామం ఒక పుణ్యతీర్థంగా కనిపించింది. ఆమె గురువు మాతృదేవి అక్కడ వసిస్తున్నారు కదా!
గ్రామం చిన్నదే అయినా, దాని శోభ మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంది. మాకు తోడుగా వచ్చిన బ్రహ్మచారి విరూపాక్ష పరమ భక్తుడు. ఆ గ్రామంలోని చెరువును చూపించి, “ఇందులోనే మాతృదేవి స్నానం చేసేవారు. ఇది ఎంతో పవిత్రమైనది” అంటూ ఆ చెరువుకు నమస్కరించాడు. మాతృదేవి పూజలు సలిపిన సింహవాసినీ దేవాలయంలోకి వెళ్లి ప్రణమిల్లాడు. మాతృదేవిని చూసిన తక్షణమే భక్తిపారవశ్యంలో చేతులు జోడించుకొని నిలబడేవాడు. మాతృదేవి పట్ల మా అమ్మకు గల భక్తిప్రపత్తులను గ్రహించిన నాకు ఈ బ్రహ్మచారి భక్తి ఎంతో ఆశ్చర్యం కలిగిం చింది. భక్తి అంటే ఇదే అని తెలియని నాకు, బ్రహ్మచారి విరూపాక్ష భక్తిప్రపత్తులు, నన్ను మాతృదేవి పట్ల భక్తిప్రపత్తులు సలిపేట్లు చేసిందంటే అతిశయోక్తి కాదు.
ఆ గ్రామస్థులలో అనేకులు మాతృదేవిని చూడడానికి తరచు వచ్చేవారు. మాతృదేవి కూడా వారితో ఆనందంగా మాట్లాడేవారు. నాకు వంగభాష రానందు వలన వారి మధ్య జరిగే సంభాషణలు అర్థం చేసుకొని ఆనందించలేకపోయేవాణ్ణి. అందువలన మాతృదేవి సోదరునితో మాట్లాడేవాణ్ణి. ఆయనకు కూడా వంగభాగ తప్ప మరే భాష తెలియదు. అయినప్పటికీ బ్రహ్మచారి విరూపాక్ష సాయంతో మేం మాట్లాడుకోగలిగాం.
మేం మూడు రాత్రులు మాతృదేవి స్వగ్రామంలో గడిపాం. ఒక రోజు సమీపంలోని కామార్పుకూర్కు వెళ్ళివచ్చాం. అది భగవాన్ శ్రీరామకృష్ణులు అవత రించిన స్థలం. వెళ్లే దారిలో శ్రీరామకృష్ణులు ధ్యానంచేసి పలుమార్లు సమాధ్యవస్థను పొందిన తోటను (ప్రస్తుతం శ్రీరామకృష్ణ – శారదా కళాశాల నెలకొనివున్న చోటు), ఆయన స్నానం చేయడం వలన పావనత్వాన్ని సంతరించుకొన్న (హాల్దార్పు కూర్) చెరువును, ఆయన ఆరాధించడంతో ఖ్యాతిగాంచిన శివాలయాన్ని దర్శించాం. ఆయన పుట్టిన ఇల్లు ఇప్పుడు చెక్కుచెదరక అట్లే ఉంది. ఆయన పుట్టిన స్థలాన తులసి వనం ఉంది (ప్రస్తుతం శ్రీరామకృష్ణుల ఆలయం నెలకొనివుంది). ఆయన ఇంట్లో గురుదేవుల అన్న కుమారుడు నివసిస్తున్నారు. ఆయన మాకు భగవాన్ శ్రీరామకృష్ణులు పూజించిన రఘువీరుని సాలగ్రామం చూపించారు. ‘నేను కూడా ఈ రఘువీరుని పూజిస్తూ ఇక్కడే ఎందుకు ఉండిపోకూడ’ దనే ఆలోచన చటుక్కున నాలో మెదలింది. అప్పుడు శ్రీరామకృష్ణుల వచనం ఒకటి నాకు జ్ఞప్తికి వచ్చింది. ఒక భక్తుడు తనకు వివాహమయిందని చెప్పినప్పుడు ఆయన, ‘అలా అయితే కర్తవ్యానుసారం ప్రవర్తించు. సంసారంలో ఉంటూనే భగవంతుణ్ణి ఆరాధించాలి’ అని అన్నారట.
మర్నాటి ఉదయం మాతృదేవి సోదరునితో మాట్లాడుతూ అరుగు మీద కూర్చునివున్నాను. అప్పుడు బ్రహ్మచారి విరూపాక్ష వచ్చి, “మాతృదేవి మిమ్మల్ని పిలుస్తున్నారు” అని చెప్పాడు.
నేను లోపలకు వెళ్లాను. మాతృదేవి నన్ను ఒక ఆసనం మీద కూర్చోమని, శ్రీరామ పట్టాభిషేకం చిత్రపటం ఒకటి చూపుతూ, “ఇలా సీతారాములను ధ్యానించు” అని సైగ ద్వారా చెప్పారు. అప్పుడు ఆమె ముఖారవిందం కారుణ్యంతో పొంగిపోతూ భాసిల్లింది. నేను కూర్చుని ఉన్నాను. మాతృదేవి నా ఎడమ చెవిలో రెండు అద్భుత మంత్రాలను ఉపదేశించారు. కామార్పుకూర్లో నేను తలచుకొన్న విషయాన్ని మాతృదేవి ఎలా గ్రహించగలిగారో నాకు అంతుబట్టలేదు. ఉపదేశం క్షణంలో పూర్తయింది. అంగన్యాసం లేదు, కరన్యాసం లేదు. బ్రహ్మచారి విరూపాక్షను పిలిచి, ఆయన ముఖతా, “ఈ మంత్రాలను నిరంతరం జపిస్తూ ధ్యానించు. దీని కోసం నిర్ణీత సమయాన్ని కేటాయించుకోకు. మరే మంత్రాలూ నీకు అవసరం లేదు. దీని మూలంగానే నీకు సకల శ్రేయస్సులూ కలుగుతాయి” అని చెప్పించారు.
మాతృదేవి ఉపదేశం మేరకు ఆ దివ్యమంత్రాలను జపించడానికి ఎన్ని ఆటంకాలు ఏర్పడ్డా, జపం చేయడంలో నాకు సమధికోత్సాహం లేకపోయినా, ఒక్క విషయం మాత్రం నా మనస్సు నుండి తొలగిపోలేదు. తరచు సుఖదుఃఖాల నడుమ నా మనోనేత్రాన మాతృదేవి ప్రేమస్వరూపం నిలిచేది. ఒక్కమాట కూడా పలుకని ఆమె ముఖారవిందం నుండి వర్షించే కారుణ్యాన్ని నేను ఎలా మరచిపో గలను? మాతృదేవి నుండి మంత్రోపదేశం లభించడం ఎంతో అరుదని భావించి, అందుకోసం యాచించడానికి సైతం ధైర్యం లేకుండా, అరుగు మీద కూర్చునివున్న నన్ను పిలిచి, అమిత వాత్సల్యంతో తమ పక్కన కూర్చోబెట్టుకొని నాకు దివ్య మంత్రాలను అనుగ్రహించి, ఆశీర్వదించిన ఆ కారుణ్యమయ స్వరూపిణి దివ్య ముఖారవిందం నా మనోనేత్రాన నిలిచిపోయి, నన్ను పరమానంద సాగరంలో ముంచివేస్తూన్నది! ఈ లోకంలో కావలసింది ఇక ఏముంటుంది?