జయరాంబాటికి మేం నలుగురం వెళ్లాం. మధ్యాహ్నం పన్నెండున్నర గంట లకు ప్రసాదం పుచ్చుకోవడం కోసం వసారాలో కూర్చున్నాం. వాత నొప్పుల కార ణంగా మాతృదేవి కాస్త కుంటుకుంటూ నడిచారు. అయినప్పటికీ అందరికీ తామే స్వయంగా వడ్డించారు.
నేను: అమ్మా, ఇక్కడ పలువురున్నారు కదా! మీరే స్వయంగా ఎందుకు వడ్డించాలి.
మాతృదేవి: నాయనా, బిడ్డలకు స్వహస్తాలతో వడ్డించి తినిపించకపోతే తల్లి మనస్సు చల్లబడుతుందా?
మర్నాటి ఉదయం స్నానం చేయడానికి నేను చెరువు వద్దకెళ్లాను. దారిలో నేను చూసిన దృశ్యం నన్ను ఆశ్చర్యంలో ముంచివేసింది. ఒక పెద్ద బిందెను చంక నెత్తుకొని మాతృదేవి చెరువునుండి నీళ్లు తీసుకువస్తున్నారు. ఇంతమంది ఉండగా మీ రెందుకు ఇవన్నీ చేస్తున్నారని అడిగినప్పుడు, “నాయనా, ఇందువలన నా కెలాంటి శ్రమా లేదు. ఇవన్నీ నాకు అలవాటయిపోయాయి” అని ఆమె జవాబిచ్చారు.
మరుసటి రోజు ఉదయం కామార్పుకూర్కు వెళ్లి గురుదేవుల జీవితంతో ముడిపడివున్న స్థలాలను సందర్శించాము. మాణిక్రాజా మామిడి తోటలో చాలాసేపు గడిపాం. అందువలన తిరిగి రావడానికి రాత్రి చాలా పొద్దుపోయింది. పాండుజ్యే చెరువును చేరుకొనే సరికి దూరంలో ఎవరో ఒక వ్యక్తి చేత లాంతరు పుచ్చుకొని నిలబడి ఉండడం కంటబడింది. దగ్గరకు వెళ్లి చూడగా మేం చూసిన దృశ్యం మమ్మల్ని ఆశ్చర్యచకితులను చేసింది. అపార కరుణా పారావారమైన మాతృదేవియే సాక్షాత్తు లాంతరు పుచ్చుకొని అక్కడ నిలబడి ఉన్నారు. “అమ్మా! మీరా ఇక్కడ?” అని మేం అడిగినప్పుడు మాతృదేవి ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో, “నాయనా, మీరు బయటి ఊరివాళ్లు. పైగా చిమ్మచీకటి. దారి తప్పవచ్చు. అందువలన నా మనస్సు ఎంతో ఆందోళనకు గురైంది. ఒకరితో, ‘లాంతర పుచ్చుకొని కాస్త చూసిరా’ అని చెబితే, అతడు నా మాట పట్టించుకోలేదు. అందుకే లాంతరు పుచ్చు కొని నేనే వచ్చేశాను. మీ కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉన్నాను” అని చెప్పారు. ఆ మాటలు విని మేం నిశ్చేష్టులమై, శిలాప్రతిమలా నిలబడిపోయాం – ఈ మాతృ మూర్తి కారుణ్యానికి సాటి ఉందా?