“మాతృదేవి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆమె నన్ను ఎన్నడూ విస్మరించరు” అంటూ మాతృదేవి పుత్రికలు పలువురు అనుకోవడం కద్దు. వారిలో నేను కూడా ఒకతెను. మాతృదేవి మా ఇంటికి సమీపంలోనే ఉండేవారు. ఆమెను దర్శించాలనే ఆలోచన అప్పుడప్పుడు నాకు రాకపోలేదు. కాని ఏదో ఒక రకమైన సిగ్గు అడ్డుగా వచ్చేది. ఎన్నో రోజుల తరువాత వెళ్లినప్పటికీ ప్రతి ఒక్కరిలోను ‘మాతృదేవి నన్ను ఎన్నడు విస్మరించరు’ అనే అనుభవం కలగడం పరిపాటి.
ఆమె ప్రేమ ప్రతి క్షణమూ విభిన్న రూపాలలో వ్యక్తిమయ్యేది. ఫలానా వ్యక్తి ఏకైక కుమారుడు సన్న్యాసం పుచ్చుకొన్నాడు. ఆతడి తల్లి విలపిస్తూ తన బాధను మాతృదేవికి వెళ్లబోసుకొంది. మాతృదేవి కళ్లు కూడా చెమ్మగిల్లాయి. “ఆహా, అదేకదా! ఏకైక కుమారుడు, ప్రాణానికి ప్రాణంగా ఉండేవాడు. అతడు సాధువు అయిపోతే తల్లి ఎలా భరించగలదు?” అన్నారు మాతృదేవి.
మరొకసారి ఒక ఆవిడ వచ్చింది. ఆమె ఇద్దరు కుమారులు సన్న్యాసం పుచ్చుకోగోరి బ్రహ్మచర్యవ్రతం చేగొన్నారు. ఆ స్త్రీ మాతృదేవి వద్దకొచ్చి, “అమ్మా, పిల్లలకు మంచి జరగాలి. అదొక్కటే తల్లి అభిలాష. ఈ సంసార జీవితంలో ఏముంది? ఎంతో ఉన్నత జీవితాన్ని నా పిల్లలు కోరుకొన్నప్పుడు, ఒక తల్లికి అంతకంటే ఆనందాన్ని ఇచ్చేది మరేముంటుంది?” అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు:
“నువ్వు సరిగ్గా చెప్పావమ్మా! ఎంతో ఉన్నత జీవితాన్ని నీ పిల్లలు కోరు కొన్నప్పుడు, తల్లిగా నీకు అంతకంటే పరమానందాన్ని చేకూర్చేది మరేం ఉండ గలదు?”
ఇద్దరూ భక్తురాండ్రే. కాని ఇద్దరికీ మాతృదేవి ఇచ్చిన జవాబు భిన్నమైనది.
మాతృదేవి దర్శనార్థం వచ్చే భక్తులలో వివిధ రకాలవారు ఉన్నారు. మాతృదేవి మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొంటున్న సమయంలో కొందరు వస్తారు. ఆమె తమ విశ్రాంతిని విరమించుకొని వారిని ఆప్యాయంగా పలకరిస్తారు. స్వయంగా మాతృ దేవియే స్వహస్తాలతో ఇవ్వకపోతే పచ్చి మంచినీళ్లు కూడా ముట్టమనే వ్రతం పాటించి కొందరు రావడం కద్దు. వెంటనే ఆమె వంట ఇంట్లోకి వెళ్లేవారు. మాతృ దేవికి పాదపూజ చేసిన తరువాతే తింటామనే పట్టుదలతో కొందరు వస్తారు. అందుకూ మాతృదేవి తక్షణమే సమ్మతించేవారు. కాలాకాలాలను గురించి ఆమె పట్టించుకొనేవారు కారు.
ఒక సందర్భంలో మాతృదేవి దర్శనానికి కాషాయాంబరధారియైన ఒక స్త్రీ వచ్చింది. అప్పుడు మాతృదేవి మంచం మీద పడుకొని ఉన్నారు. మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకోవాలనే అభిలాషతో వచ్చిన ఆ స్త్రీ, మాతృదేవి పాదాలు తాకి ప్రణమిల్లబోయింది. కాని మాతృదేవి తక్షణమే లేచి, “ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? పాదాలు తాకి నమస్కరించకు. కాషాయం ధరించిన సన్న్యాసినివి నువ్వు. నా పాదాలు తాకి నన్నెందుకు దోషురాలినిగా చేస్తావు?” అని అడిగారు.
ఆ స్త్రీ: మీరు మంత్రదీక్ష ప్రసాదిస్తారని గంపెడాశతో వచ్చాను.
మాతృదేవి: తొందరపడితే జరుగుతుందా అమ్మా? సమయం కలిసివచ్చి నప్పుడు మన ప్రమేయం లేకుండా అంతా జరిగిపోతుంది. ఇంతదాకా నువ్వు మంత్రదీక్ష పుచ్చుకోలేదా? నీకు కాషాయం ఇచ్చింది ఎవరు? ఏకాగ్ర చిత్తంతో వారినే ఆశ్రయించు. సముచిత తరుణంలో అంతా సిద్ధిస్తుంది.
ఆ స్త్రీ: కాషాయ వస్త్రాలు ఎవరూ ఇవ్వలేదు, నాకు నేనుగానే ధరించాను. నేను అనుష్ఠిస్తూన్న సాధనల ద్వారా ప్రశాంతత లభించడం లేదు.
మాతృదేవి: నేడు నా ఆరోగ్యం బాగాలేదు. నీతో ఎక్కువసేపు మాట్లాడలేదని చింతించకు. కాని, అమ్మాయీ! ఒక విషయం యోచించు! కాషాయవస్త్రాలు ధరిం చడం సామాన్యమైన విషయం కాదు. ఇదుగో, ఈ మఠాలలో ఉంటున్న వీరంతా గురుదేవుల కోసం సర్వసంగపరిత్యాగం చేసి వచ్చారు. వీరికి మాత్రమే కాషాయం ధరించే అధికారం ఉంది. వచ్చిపోయే వారంతా కాషాయం ధరించడమా?
ఈ రీతిలో మాట్లాడిన పిదప మాతృదేవి ఆప్యాయంగా ఆమెకు సెలవిచ్చారు. కాని తమ పాదాలు తాకి ప్రణమిల్లడానికి మాత్రం ఆమె సమ్మతించలేదు.
ఒకసారి అనారోగ్యంగా ఉన్నప్పుడు మాతృదేవి జన్మదినోత్సవం వచ్చింది. ఆమె పాదపద్మాలను పూజించి ఆరాధించటానికి పలువురు భక్తులు వచ్చారు. పదేపదే జ్వరం వస్తూవుండడం వలన మాతృదేవి ఎంతో అలసిపోయి ఉన్నారు. అయినప్పటికీ ఆసనంపై కూర్చున్నారు. ముఖాన్ని కొంగుతో కప్పుకొని, తమను పూర్తిగా మరుగుపరచుకొన్నారు. వందలాదిమంది భక్తులు వచ్చి అర్చించారు. ప్రీతిపూర్వకంగా అన్నిటిని స్వీకరించారు. త్వరత్వరగా ప్రణామాలు చేసినప్పటికీ ఎంతసేపు పట్టింది. అంతా ప్రణమిల్లాక మాతృదేవి లేచారు. ఎందుకో ఆ దృశ్యం నేటికీ నా మనస్సులో చెక్కుచెదరక నిలిచిపోయివుంది.
అనేక సమయాల్లో మాతృదేవి మాటలు, ప్రవర్తన వంటివి గురుదేవులను పోలివుండేవి. తమకు కంఠంలో వ్రణం వచ్చినప్పుడు గురుదేవులు వచ్చేపోయేవారి నందరిని దానిని గురించి అడిగేవారు. అదేవిధంగా మాతృదేవి తమకు అనారోగ్యంగా ఉన్నప్పుడు, “ఇదేం వ్యాధి? ఇది నిజంగా నయమయ్యేట్లు తోచడం లేదు. ఏకంగా నన్ను పడకబెట్టేసింది! ఇక నేనేం చేయగలను చెప్పు తల్లీ!” అని అందరినీ అడిగే వారు.
గురుదేవులతో శశధర తర్కచూడామణి, “మీరు మనస్సును వ్యాధిగ్రస్తమైన చోట ఏకాగ్రం చేస్తే వ్యాధి నయమవుతుంది” అని అన్నారు. అప్పుడు గురుదేవులు, “మీరు పండితులై ఉండీ అలా మాట్లాడుతున్నారేమిటి? సచ్చిదానంద పరమాత్మునికి అర్పించిన మనస్సును ఈ ఎముకలు, మాంసంతో తయారైన శరీరం వైపుకు మళ్లించడమా?” అని ఎదురు ప్రశ్న వేశారు.
మాతృదేవి కూడా ఇలాగే జవాబిచ్చేవారు. ఎవరైనా మాతృదేవితో, “అమ్మా, ఒక్కసారి ‘ఈ వ్యాధి నయమౌగాక!’ అని చెప్పుకోండి. తక్షణమే నయమవుతుంది” అని చెబితే, వెంటనే మాతృదేవి, “అలా చెప్పగలనా అమ్మాయీ! గురుదేవుల సంకల్పానుసారమే జరుగుతుంది. దీన్లో నేను చెప్పడానికి ఏముంది?” అనేవారు. ఈ జవాబు తప్ప మరే జవాబూ ఆమె నుండి వచ్చేది కాదు. ఎన్నిసార్లు అడిగినా ఈ జవాబు మాత్రమే ఆమె నుండి వచ్చేది.
సోదరి నివేదితకు మాతృదేవి పట్ల ఎంతో భక్తిప్రపత్తులుండేవి. ఒక రోజు మాతృదేవితో కలిసి దక్షిణేశ్వరానికి వెళ్లి తిరిగి వస్తున్నప్పుడు సాయంత్రమయి పోయింది. అప్పుడామె మాతో ఇలా అన్నారు:
“మీరు పడవలో ప్రయాణం చేస్తున్నారు. హఠాత్తుగా పెద్ద గాలివాన వచ్చి పడవ మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందనుకోండి. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఎంతో భయం వేస్తుంది. అంతే కదా! కాని ఆ సమయంలో మీలో ఎటువంటి ఆలోచన రావాలని నేను ఆశిస్తున్నానో తెలుసా? పరిపూర్ణంగా, మనస్ఫూర్తిగా బాధ్యతనంతా భగవంతునికి అప్పగించాలి. చిన్నపిల్లవాడిలా ఆయన వద్ద పూర్తిగా శరణు పొందాలి. ఎలాంటి ప్రమాదం ఎదురైనా తల్లి ఒళ్లో ఒదిగిన బిడ్డ చిరునవ్వు నవ్వుతూ ఉండేటట్లు కలత చెందకుండా ఉండాలి. ‘ఏదైనా జరగనీ! మాతృదేవి ఉన్నారు. నేను దేన్ని గురించీ కలత చెందను. ఏం జరిగినా జంకను!’ అంటూ నిశ్చింతగా ఉండాలి.”
మాతృదేవి గురించిన మాటలకు అంతమే లేదు. అందువలన మాతృదేవి అమృత వచనాన్ని ఒకటి చెప్పి, ముగిస్తాను.
“అమ్మాయీ, భగవంతుడు మనస్సులోని సంపద వంటివాడు. నువ్వు ఎక్క డున్నా మనస్ఫూర్తిగా ఆయనను ప్రార్థించు. ఆయనను ఎవరు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారో వారికి ఆయన సొంతమవుతాడు.”