కలకత్తాలో మాతృదేవిని దర్శించిన రోజు నా జీవితంలో చిరస్మరణీయమైన రోజు. అది 1895 వ సంవత్సరం. అప్పుడు నేను పాఠశాల విద్యార్థిని. స్వామి యోగానంద, స్వామి త్రిగుణాతీతానందల మూలంగానే నేను మాతృదేవిని గురించి తెలుసుకొన్నాను. అప్పుడప్పుడు మాతృదేవి దర్శనానికి వెళ్లేవాణ్ణి.
ఒక రోజు స్వామి వద్ద నుండి వచ్చిన జాబును మాతృదేవికి చదివి విని పిస్తున్నారు స్వామి త్రిగుణాతీతానంద. మఠంలోని సాధువులకు వ్రాసిన జాబు అది. మాతృదేవి ఖర్చుల గురించి ఆ జాబులో స్వామీజీ ప్రస్తావించి ఉన్నారు. మాతృదేవి, గోలాప్మా, యోగీన్మా తదితరులకు ఆ జాబును చూపించమనీ, శ్రీరామకృష్ణుల సందేశాన్ని ప్రచారం చేయాలనీ దాన్లో తెలిపివున్నారు. కాసేపు అందరూ మౌనంగా ఉండిపోయారు. మాతృదేవి చెప్పిన విషయాన్ని గోలాప్మా కాస్త బిగ్గరగా ఇలా చెప్పారు:
“గురుదేవుల పరికరమే నరేంద్రుడు. తమ బిడ్డలూ, భక్తులూ తమ తమ కర్తవ్యాలను నిర్వహించడానికీ, మానవాళి శ్రేయస్సుకూ ఆయనే నరేంద్రుణ్ణి ఇలా వ్రాయడానికి పురిగొల్పారు. నరేన్ వ్రాసింది అక్షర సత్యం. ఇప్పటి నుండే దానిని అమలుపరచాలి.”
ఒక రోజు మాతృదేవి, నన్ను, “నువ్వు ఎవరి బిడ్డవు?” అని అడిగారు. మాతృదేవి గొంతును మొట్టమొదటిసారి అప్పుడే విన్నాను. “నేను మీ బిడ్డను” అని జవాబిచ్చాను.
ఆ జవాబు విని ప్రక్కనే ఉన్న గోపాలేర్మా, మాతృదేవితో, “నా గోపాల్* తన మాయాశక్తితో ఎందరో అద్భుతమైన బిడ్డలను నీ వద్దకు తీసుకువస్తాడు చూస్తూవుండు” అని చెప్పారు.
అదొక అద్భుతమైన సన్నివేశం. నా ముందు మాతృదేవి అనుగ్రహం వర్షించే దివ్యమూర్తిలా నిలబడి ఉన్నారు. మామూలుగా ఉండే మేలిముసుగు లేదు. అందు వలన ఆమె దివ్యవదనారవిందాన్ని దర్శించగలిగాను. పరిపూర్ణమైన ప్రశాంతత, అనుగ్రహ దృక్కులు, దివ్యకారుణ్యకాంతులు ఆమె ముఖారవిందాన ద్యోతకమవు తున్నాయి. మాతృవాత్సల్యం ఉట్టిపడే ఆమె కృపాదృక్కులు నాపై సారించినప్పుడు, అవి నా హృదయంలో చొచ్చుకుపోయి నన్ను పరమానందభరితుణ్ణి చేశాయి. మన ఏకైక బాంధవుడూ, మన యావచ్ఛక్తీ ఆ భగవంతుడే అనే విశ్వాసం నాలో వ్రేళ్లూనింది. భావోద్వేగంతో కొన్ని పువ్వులను మాతృదేవి చరణ కమలాలకు అర్పించాను.
“నీ తల్లితండ్రులతో ఉంటున్నావా?” అని అడిగారు మాతృదేవి. “లేదమ్మా! నా కెవరూ లేరు. ఏడాది వయస్సులోనే తల్లితండ్రులను కోల్పోయాను” అని చెప్పాను. “ఎంత ఘోరం! కలత చెందకు నాయనా! ప్రాపంచిక బంధాలు శాశ్వతాలు కావు. నేడు అవే సర్వస్వంగా తోస్తాయి. రేవు మాయమైపోతాయి. నీకు నిజమైన బాంధవ్యం ఉన్నది భగవంతునితోనే, గురుదేవులతోనే! తరచు వస్తూవుండు. ప్రసాదం పుచ్చుకొనివెళ్లు” అన్నారు మాతృదేవి ఎంతో ఆప్యాయంగా.
నా కళ్లు చెమ్మగిల్లాయి. “అమ్మా, నాకు మీరున్నారు. దివ్యజననియైన మీరే నాకు తల్లిగా భాసిల్లారు. ఇది నా మహద్భాగ్యం. మీ అనుగ్రహమూ, దీవెనలే నాకు కావలసినవి” అన్నాను నేను.
“నాయనా! ఇప్పటికే గురుదేవులు నీ మీద ఆశీస్సుల వృష్టి కురిపించారు. పాఠశాలలో సెలవు ఉన్నప్పుడల్లా ఇక్కడకు వచ్చి బసచేయి. ఇదుగో ప్రసాదం పుచ్చుకో. యోగీన్, రాఖాల్ ప్రభృతుల నందరినీ వెళ్లి కలుసుకో. వారి సత్సాంగత్యం నిన్ను ఉన్నతునిగా తీర్చిదిద్దుతుంది. నీ మనస్సులోని బాధలన్నీ సమసిపోతాయి” అన్నారు మాతృదేవి.
ఒక రోజు మాతృదేవి ఒక భక్తురాలితో ఇలా చెప్పారు:
“ప్రగాఢ విశ్వాసమూ, స్థిరచిత్తమూ లేనివారు కొందరు మంత్రదీక్ష కోసం వస్తున్నారు. వారి వ్యక్తిత్వమూ, వారి వ్యవహరించే తీరు నుంచి వారి గతాన్ని గురించి పూర్తిగా తెలుసుకోగలను. ఇప్పటికే మంత్రదీక్ష పుచ్చుకొన్నారా అని అడిగినప్పుడు కొందరు అవునని జవాబిస్తారు. వెంటనే నేను, ‘ఏం ఆశ్చర్యం! మళ్లీ మంత్రదీక్ష కోసం వచ్చారా? మీ గురువు ప్రసాదించిన మంత్రంపట్ల మీకు విశ్వాసం లేదు. మంత్రం అంటే భగవంతుని పావన నామమే కాని మరేమీ కాదు. మంత్రదీక్ష కోసం మళ్లీ ఎందుకొచ్చారు?’ అని అడుగుతాను. వెంటనే వాళ్లు విలపించడం మొదలుపెడతారు. ‘నన్ను క్షమించండి’ అంటూ మళ్లీ మంత్రదీక్ష కోసం అభ్యర్థిస్తారు. ఎవరి కన్నీటినీ నేను చూడలేను. వెంటనే గురుదేవులను ప్రార్థిస్తాను. వారి విశ్వాసాన్ని ప్రగాఢం చేయమని కోరతాను. పిదప ఆయన నిర్దే శించినట్లు వారు అప్పటికే గ్రహించిన మంత్రంతో పాటు నేను కూడా మంత్రం ప్రసాదిస్తాను. నేను అదనంగా ఇచ్చిన మంత్రం వారిలో నూతన శక్తిని పెంపొందింప చేస్తుంది. భగవన్నామంలో వారి విశ్వాసాన్ని బలపరుస్తుంది.”
ఇది విన్న ఆ భక్తురాలు, “అమ్మా, మీ అనుగ్రహమూ, దీవెనల వలన వారు రక్షింపబడతారు” అని చెప్పింది. వెంటనే మధ్యలో మాతృదేవి, “కాదు, కాదు. ఆ విధంగా అనబోకు. నేను ఏమీ కాను, సమస్తమూ గురుదేవులే! ఆయనే అనుగ్ర హించి వారిని ఆశీర్వదిస్తారు. నేను కేవలం ఆయన పరికరాన్ని మాత్రమే” అన్నారు.
ఒక రోజు సాయంత్రం మాతృదేవి దర్శనానికి వెళ్లాను. అప్పుడక్కడ స్వామి యోగానంద, దేవేంద్ర మజుందార్‌తో మాట్లాడుతూ కనిపించారు. దేవేంద్ర గురుదేవుల గృహస్థ శిష్యుడు. ఇద్దరూ గురుదేవులను గురించి మాట్లాడుతూండడం వింటూ మైమరచిపోయి అలాగే కూర్చుండిపోయాను. రాత్రి బాగా ప్రొద్దుపోయాక దేవేంద్ర సెలవు పుచ్చుకొని వెళ్లిపోయాడు.
అంతదాకా మాతృదేవిని దర్శించుకోలేదనే సంగతి జ్ఞప్తికి వచ్చింది. ఈ విషయం యోగానంద స్వామితో చెప్పాను. ఆయన గోలాప్మాతో ఈ విషయం చెప్పి నప్పుడు, “మాతృదేవి పడుకొన్నారు” అని ఆమె చెప్పేశారు. నేనెంతో నిస్పృహ చెందాను. “ఇక ఏం చేయలేం. మాతృదేవి నిద్రకు ఉపక్రమించారు. రేపు ఉదయం రా” అన్నారు యోగానందస్వామి.
అంతలో గోలాప్మా నన్ను కేకవేసి, “త్వరగా రా. మాతృదేవి మెలకువగానే ఉన్నారు” అని చెప్పారు. ఆనందపారవశ్యంలో ఒక్క పరుగున వెళ్లాను. మాతృదేవికి ప్రణమిల్లినప్పుడు, “ఎందుకు ఇంత ఆలస్యమయింది?” అని అడిగారు. నేను జరి గింది చెప్పాను. మాతృదేవి చిన్నగా నవ్వుతూ, “ఓహో! గురుదేవులను, ఆయన దివ్యజీవనాన్ని గురించి మాట్లాడుతూవున్నావా? అందుకే మీ అమ్మను మరచిపోయివుంటావు” అని అన్నారు. నేనేమీ బదులు చెప్పలేకపోయాను. ఆ తరువాత మాతృ దేవి నన్ను దీవించి, “ఇక ఇంటికి తిరిగి వెళ్లు, రాత్రి బాగా ప్రొద్దుపోయింది” అని చెప్పారు. మాతృదేవి కరుణార్ద్రహృదయాన్ని తలచుకొంటూ ఇల్లు చేరాను.
ఒక రోజు నేను మాతృదేవితో, “అమ్మా! ధ్యాన సమయంలో మనస్సు ఏకాగ్రం కావడంలేదు. మనస్సు చంచలమై, విచ్చలవిడిగా సంచరిస్తూంది” అని చెప్పాను. అది విని మాతృదేవి చిన్నగా నవ్వుతూ, “ఓ! అదేం పెద్ద విషయం కాదు. కళ్లకు, చెవు లకు ప్రత్యేక స్వభావాలు ఉన్నట్లే, అది మనస్సు స్వభావం. నిరంతరం జపధ్యానాలు అనుష్ఠించు. భగవంతుని పావన నామం ఇంద్రియాల శక్తి కంటే ఎంతో శక్తివంత మైనది. పద్ధతి ప్రకారం జపధ్యానాదులు అనుష్ఠిస్తే అంతా చక్కబడుతుంది. నిన్ను నడిపించేవారు గురుదేవులు! ఆయనను సదాసర్వదా స్మరిస్తూవుండు. తప్పులను తలపోస్తూ కలత చెందకు” అని చెప్పారు.
“అమ్మా, పద్ధతి ప్రకారం జపధ్యానాలు అనుష్ఠించాలని నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించాను. అందుకు మాతృదేవి ఇలా అన్నారు:
“నీ అభ్యాసంలోను, మాటలలోను, చేతలలోను నిజాయితీగా వ్యవహరించు. నువ్వు ఎంత ప్రసిద్ధుడవో అప్పుడు గ్రహిస్తావు. సకల జీవరాశుల పైనా భగవంతుని ఆశీస్సులు సదా వర్షిస్తూనే ఉంటాయి. అందుకై ఆయనను ప్రత్యేకంగా ప్రార్థించనక్కర లేదు. పద్ధతి మేరకు ధ్యానించడం నేర్చుకో, ఆయన అవ్యాజ అనుగ్రహం నీకు అవగతమవుతుంది. సత్యనిష్ఠ, ప్రేమ, నిజాయితీ – వీటినే భగవంతుడు మననుండి అపేక్షిస్తాడు. కేవలం వాగాడంబరాన్ని ఆయన పట్టించుకోడు. నిర్ణీత వేళల్లో సాధనలు అనుష్ఠించాలి. నీ యావచ్ఛక్తితో మనస్సును ఏకాగ్రం చేసి, ఆయన పావన నామాన్ని జపించు. మంత్ర జపం చేయి. నిజమైన పరితప్తతతో ప్రయత్నిస్తే, ఇతర ఆలోచనలన్నింటినీ నెట్టివేసి, నీ హృదయాంతరాళాలనుండి ప్రార్థిస్తే ఆయన తప్పక ఆలకిస్తాడు. ఆయన అనుగ్రహంతో ఆ ప్రార్థనలు నెరవేరతాయి.”
మాతృదేవి పాదపద్మాలను స్పృశించి, ప్రణామం చేసి కిందికి వచ్చాను. మాతృదేవి చెప్పినట్లు గోలాప్మా నాకు ప్రసాదం ఇచ్చారు. దానిని పుచ్చుకొని ఇంటికి బయలుదేరాను.