ఒక ఆదివారం నాడు మాతృదేవిని దర్శించాలనే బలీయమైన ఆకాంక్షతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఇంటి నుండి ఉద్బోధన్కు బయలుదేరాను. ఎండ కారణంగా బాగా చెమటలు పోస్తున్నాయి. బయటకు ఎక్కడకో వెళ్లిన మాతృదేవి అప్పుడే తిరిగి వచ్చారని, అందువలన ఆమెను దర్శించుకోవడం ఆలస్యమవుతుందని తెలుసుకొన్నాను. కాని నాలో సహనం లోపించినందున ఆమెను చూడడానికి దూసుకొని ముందుకెళ్లాను. మేడమెట్లు పక్కన నిలబడివున్న శరత్ మహరాజ్ నన్ను ముందుకు పోకుండా ఆపారు. అప్పుడు నేను యువకుణ్ణి. తక్షణమే ఆయనతో, “ఆమె మీకు మాత్రమే మాతృదేవియా?” అంటూ, చేతులతో ఆయనను ప్రక్కకు తోసి, పైకి వెళ్లిపోయాను.
అప్పుడు మాతృదేవి విసనకర్రతో విసురుకొంటూ కనిపించారు. నేను ప్రణమిల్లగానే కుశలప్రశ్నలు వేశారు.
మాతృదేవి: నీకు ఇంతగా చెమటలు పోస్తున్నాయేమిటి?
నేను: తీక్ష్ణమైన ఎండలో నడిచివచ్చాను కదా! ఇంతకీ మీ రెక్కడికి వెళ్లారమ్మా?
మాతృదేవి: కాళీఘాట్‌కు. ఇప్పుడు కాస్త ప్రసాదం తీసుకో, తరువాత మాట్లాడవచ్చు.
ప్రసాదం తిన్న తరువాత మాతృదేవితో మాట్లాడసాగాను.
నేను: అమ్మా, ఆత్మజ్ఞానం సంతరించుకొన్న మనిషి, భగవంతుడు – వీరి మధ్యగల వ్యత్యాసం ఏమిటి?
మాతృదేవి: మనిషే దేవుడవుతాడు. పాటుపడితే అంతా సాధ్యమే.
నేను: ఎలా పాటుపడాలి?
మాతృదేవి: గురుదేవులు చెప్పినట్లు త్రోసిపుచ్చవలసిన వాటిని త్రోసిపుచ్చి, స్వీకరించవలసిన వాటిని స్వీకరించి, ఇష్టదైవాన్ని ఏకాగ్ర చిత్తంతో ప్రార్థిస్తే అంతా సుసాధ్యమే.
ఆ సమయంలో ఒకరిద్దరు భక్తురాండ్రు వచ్చారు. అందువలన మాతృదేవితో ఎక్కువసేపు మాట్లాడలేకపోయాను. బయలుదేరే ముందు మాతృదేవికి ప్రణమిల్లాను.
నేను: అమ్మా, మెట్లెక్కి పైకి వస్తున్నప్పుడు పెద్ద తప్పు చేశాను. శరత్ మహ రాజ్‌ను పక్కకు త్రోసి వచ్చాను. ఇప్పుడు ఆయనకు మొహం ఎలా చూపను? నన్ను క్షమించండి.
మాతృదేవి: బిడ్డలు ఏం తప్పు చేస్తారు? ఇతరులలో తప్పులు చూసేవారు కారు నా బిడ్డలు. అందువలన నువ్వు కలతచెందకు.
క్రిందికి వచ్చినప్పుడు శరత్ మహరాజ్‌ను చూశాను. ఆయనకు ప్రణామం చేసి, క్షమించమన్నాను. ఆయన నా తల మీద చేయివేసి, “ఇటువంటి పరితప్తతే అవసరం” అంటూ నన్ను కౌగిలించుకొన్నారు. ఆ తరువాత, “ఇక మీదట నిన్నెవరూ ఆపరు” అంటూ వాగ్దానం చేశారు. ఆ తరువాత ఎప్పుడు నన్ను చూసినా విరగ బడి నవ్వేవారు.
మ రొక ఆదివారం రోజు నేను మాతృదేవి దర్శనానికి వెళ్లేసరికి, అప్పటికే పలువురు భక్తులు వచ్చివున్నారు, కొందరు వస్తూన్నారు. నేను ప్రణమిల్లగానే, “కాస్త కూర్చో” అన్నారు మాతృదేవి. నేను ప్రసాదం తింటూ కూర్చున్నాను.
నేను: అమ్మా, నా మనస్సులో ఉన్నదంతా మీకు వెల్లడించగోరుతున్నాను. కాని సరైన సమయం ఆసన్నం కావడం లేదు.
మాతృదేవి: నా బిడ్డల సమస్యలన్నింటినీ ఆలకించాలి కదా! ఏదో ఒకటి రెండు విషయాలు మాత్రం అడుగు.
నేను: అమ్మా, కాశీ సందర్శనం వలన పుణ్యం లభిస్తుంది. కాని పేదలు వెళ్లలేరు కదా! వారికి ఆ పుణ్యం ఎలా లభిస్తుంది?
మాతృదేవి: దక్షిణేశ్వరానికో, బేలూరు మఠానికో వెళితే అదే పుణ్యం లభిస్తుంది. కాని నిజమైన విశ్వాసం ఉండాలి. కాశీలో వెలసివున్న వారే దక్షిణేశ్వరంలోను, బేలూరు మఠంలోను వెలసివున్నారు.
నేను: అమ్మా, మాకు మార్గాంతరమేమిటి?
మాతృదేవి: భయమెందుకు? గురుదేవుల అనుగ్రహానికి పాత్రులైన వారికి, ఆయనతో సంసర్గం కలిగివున్నవారికి అవసరమైనవన్నీ ఆయనే సమకూర్చిపెడతారు.
నేను: అమ్మా, జపధ్యానాదులకు ఎటువంటి నియమాలు పాటించాలి?
మాతృదేవి: నీ ఇష్టానుసారం అనుష్ఠించు. కాని మనస్సు భగవంతునిపై లగ్నమై ఉండాలి. అలా చేస్తే అన్నీ సిద్ధిస్తాయి. నువ్వెందుకు కలత చెందుతావు?
నేను: అమ్మా, నేను కలత చెందడంలేదు. కాని మీ ముఖతా వినగోరి అలా అడిగాను.
మాతృదేవి: అందరూ నీ వెనుక ఉన్నారు – గురుదేవులు ఉన్నారు, నన్ను ప్రత్యక్షంగా చూస్తున్నావు.
నేను: అమ్మా! గురువులను, స్వామీజీని దర్శించుకొనే భాగ్యం కలగలేదు.
మాతృదేవి: భక్తిపూర్వకంగా ప్రార్థించు, వారంతా వస్తారు. ఈ సమయంలో జన్మించిన మీరందరూ భాగ్యశాలురని నేను చెబుతున్నాను. వారి లీలలు మీరిప్పుడు చూడగలుగుతున్నారు. భక్తి శ్రద్ధలనే నేత్రాలతో చూడగలిగితే సర్వం అవగతమవు తుంది.
నేను: అమ్మా, అన్నీ మనిషి ఇచ్ఛమేరకే జరుగుతాయా? ఆతడి ఆకాంక్షలన్నీ ఈడేరతాయా?
మాతృదేవి: ఉదాత్తమైన ఆకాంక్షలు మాత్రమే నెరవేరతాయి.
మాతృదేవి సోదరుల ఇళ్లు