దక్షిణ భారతదేశ యాత్రాసందర్భంలో కొట్టార్లో బసచేసివున్న మాతృదేవిని దర్శించడానికి కటక్ నుండి వెళ్లాను. మొదటి రోజు మాతృదేవికి ప్రణమిల్లాను. రెండవ రోజు ఆమే నన్ను పిలిపించారు. లోపలకు వెళ్లగానే కూర్చోమన్నారు.
మాతృదేవి: నువ్వు మంత్రదీక్ష పుచ్చుకొంటావా?
నేను: మీకు ఇష్టమైతే పుచ్చుకొంటాను. నాకు ఏమీ తెలియదు.
మాతృదేవి: మంచిది. ఇలా కూర్చో. ఏ దేవుని మంత్రం కావాలి?
నేను: అది కూడా నాకు తెలియదు.
మాతృదేవి: పోనీలే. ఇదిగో ఇదే నీ మంత్రం.
నేను: అమ్మా! యోగం నేర్చుకోవడానికి మరో గురువును ఆశ్రయించవచ్చా?
మాతృదేవి: ఆశ్రయించవచ్చు. అనేక విషయాలు నేర్చుకోవడానికి పలువురు గురువులను ఆశ్రయించడంలో తప్పు లేదు. కానీ దీక్షా గురువుగా మరెవరినీ స్వీక రించకూడదు.
ఒక రోజు కొందరు మిత్రులతో కలిసి జయరాంబాటికి వెళ్లాను. దారిలో తెల్లని తామర పువ్వులను చూసి కొన్ని పువ్వులను సేకరించాను. మాతృదేవి పాద పద్మాలకు ఆ పువ్వులను సమర్పింపగోరాను. కానీ మాతృదేవి, “దేవీ పూజకు తెల్ల తామరలు పనికిరావు” అనేశారు. ఆ తరువాత ఎర్ర తామర పువ్వులు తెచ్చి మాతృదేవి పాదారవిందాలకు అర్పించాను.
ఒక రోజు మాతృదేవి ఎవరితోనో ఇలా అంటున్నారు: “నన్ను హద్దు మీరి వేధించకు. నేను చటుక్కున ఎవరినీ ఏమీ అనను. కానీ అలా అన్నాననుకో, నిన్ను కాపాడడం ఇక ఎవరి తరమూ కాదు.”
ఒక రోజు మాతృదేవిని, “అమ్మా! ఈ ప్రభుత్వం వారు నిష్కారణంగా యువకులను ఖైదు చేస్తున్నారు. ఇదంతా ఎక్కడికి దారితీస్తుందో కదా?” అని అడిగాను. అందుకు మాతృదేవి, “ఇది చాలా అన్యాయం. వీటికంతా వారు త్వరలో జవాబు చెప్పే తీరాలి. ఇక ఎంతో కాలయాపన కాదు. త్వరలో అంతా సరిపోతుంది” అని చెప్పారు.
నా గురుభాయి ఒకరు రామకృష్ణ గాయత్రీ మంత్రాన్ని మరిచిపోయారు. దానిని గురించి నన్ను అడిగినప్పుడు, అలా మంత్రాన్ని ఒకరు మరొకరికి చెప్ప వచ్చునా అని మాతృదేవికి ఉత్తరం వ్రాశాను. ఆ సమయంలో మాతృదేవి మద్రాసు (చెన్నై)లో ఉన్నారు. నా జాబుకు మాతృదేవి ఇలా జవాబిచ్చారు: “మంత్రం ఎవరి తోనూ చెప్పకూడదు. కానీ గురుభాయితో చెప్పవచ్చు. దాన్లో తప్పు లేదు.”
నేను: అమ్మా, మీతో కాస్త మాట్లాడాలి.
మాతృదేవి: మాట్లాడు.
నేను: అమ్మా! నా కెప్పుడు అనుగ్రహం లభిస్తుంది?
మాతృదేవి: గురుదేవులను ప్రార్థించు నాయనా! ఆయన అనుగ్రహిస్తారు. సత్సంగం చేయి, తపస్సాధనలు అనుష్ఠించు. గురుదేవులను ప్రార్థిస్తే సమస్తం జరుగుతుంది.
నేను: మీరే ఏదైనా చేయండి, నా కేమీ జరగడం లేదు. నేను గురుదేవులను చూసింది లేదు. ఆయనను ఎలా ప్రార్థించాలి? మీరే ఆయనతో చెప్పండి.
మాతృదేవి: జపధ్యానాదులు అనుష్ఠించకుంటే ఏదీ సిద్ధించదు. సాధనలు అనుష్ఠించే తీరాలి.
నేను: జపం చేయడంలో నాకు కించిత్తు ఇష్టం కూడా లేదు. ఎటువంటి పురోగతీ కనిపించడం లేదు. కామ క్రోధ మోహాలు మునుపటిలాగే ఉన్నాయి. మనస్సు ఒకింత కూడా పరిశుద్ధం కావడం లేదు.
మాతృదేవి: పరిశుద్ధమవుతుంది నాయనా! మంత్ర జపం నిరంతరం చేస్తూవస్తే క్రమేణా మనస్సు పరిశుద్ధమవుతుంది. సాధనలు అనుష్ఠించకుండా పురోగతి ఎలా సాధ్యం? మూర్ఖంగా దేనినీ చేయకు. సమయం దొరికినప్పుడు మంత్రజపం చేయి. గురుదేవులను ప్రార్థించు.
నేను: లేదమ్మా! అందుకు అవసరమైన శక్తి నాలో లేదు. జపానికి కూర్చుంటే మనస్సు చెదరిపోతుంది. ఎలాంటి దురాలోచనలూ మనస్సులో జనించకుండా ఆశీర్వదించండి. లేకపోతే మీరు ప్రసాదించిన మంత్రాన్ని తిరిగి మీరే తీసుకోండి. శిష్యుడు మంత్రజపం చేయకుంటే ఆ పాపం గురువుకు చుట్టుకుంటుందని అంటారు. అనవసరంగా మీకు శ్రమ కలిగించడం నాకు ఇష్టం లేదు.
మాతృదేవి: ఇవేం మాటలు! మీ అందరి గురించి చింతన చేసి చేసే నేను ఆవేదన చెందుతున్నాను. మీ అందరినీ గురుదేవులు ఎప్పుడో అనుగ్రహించారే!
ఈ మాటలు పలుకుతున్నప్పుడు మాతృదేవి కళ్లు చెమ్మగిల్లాయి. ఉద్వేగంతో చెబుతున్నట్లు నాతో, “పోనీలే, నువ్వు ఇక మంత్రజపం చేయవద్దు” అన్నారు. అంటే నా కోసం తామే చేస్తారన్నట్లు స్ఫురించింది. కానీ మాతృదేవి చెప్పిన మాటలు నా కప్పుడు అర్థం కాలేదు. తప్పుగా అర్థం చేసుకోవడం వలన, మాతృ దేవి వచనాలు వినగానే నా తల గిర్రున తిరగసాగింది. మాతృదేవితో ఉన్న అనుబంధం అంతా తెగిపోయినట్లు అనిపించింది. కనుక ఉద్విగ్నభరిత స్వరంతో, “అమ్మా! అన్నిటినీ తెంచేశారా? ఇక నా గతి ఏమిటి? పాతాళానికి క్రుంగిపోవలసిం దేనా?” అని అడిగాను.
మాతృదేవి (నొక్కిచెబుతూ): నా బిడ్డ పాతాళానికి పోవడమా? ఇక్కడికి ఎవరైతే వస్తున్నారో, ఎవరు నా సంతానమో వారికి ముక్తి విధాయకం. నా సంతా నాన్ని పాతాళానికి నెట్టడానికి విధి సైతం సాహసించదు సుమా!
నేను: అమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు?
మాతృదేవి: నీ బాధ్యతలన్నీ నా కప్పగించి నిశ్చింతగా ఉండు. ఎక్కడికి వెళ్లాక తిరిగి రాలేమో అక్కడికి మిమ్మల్ని సముచిత తరుణంలో తోడ్కొని వెళ్లడానికి మీ కూడా ఒకరు ఉన్నారని మరచిపోకు.
నేను: అమ్మా, మీ సమక్షంలో ఉన్నంతసేపు అన్నీ బాగానే ఉంటాయి. ఎటు వంటి చీకూ చింతా ఉండదు. కానీ ఇంటికి వెళ్లిన మరుక్షణమే అన్ని దురాలోచనలూ చెలరేగుతున్నాయి. దుష్ట స్నేహాలూ, దుష్కార్యాలూ మొదలవుతాయి. ఎంత ప్రయ త్నించినప్పటికీ వీటి బారి నుండి బయటపడలేకపోతున్నాను.
మాతృదేవి: గతజన్మ సంస్కారాల మూలంగానే ఇలా జరుగుతుంది. బలవం తంగా వాటిని తరిమివేయగలమా? సత్సాంగత్యం చేయి, సజ్జనుడవవడానికి ప్రయ త్నించు, క్రమేణా అంతా చక్కబడుతుంది. గురుదేవులను ప్రార్థించు. నేను కూడా ఉన్నాను కదా! ఈ జన్మలోనే ముక్తి లభిస్తుందని తెలుసుకో. భయమెందుకు? సముచిత తరుణంలో ఆయనే సమస్తమూ చేసిపెడతారు.