బేలూరు మఠం, 1916
నవరాత్రి (దుర్గాపూజ) ఉత్సవాలలో సప్తమి రోజు. మధ్యాహ్నం మఠానికి వేంచేసిన మాతృదేవి ఉత్తరం వైపు ఉద్యానగృహంలో బస చేశారు. అష్టమినాడు ఉదయం తొమ్మిది గంటలకు మఠానికి వచ్చి దుర్గాదేవిని దర్శించారు. వంట గది ప్రక్కనున్న హాలులో సాధువులు, బ్రహ్మచారులు కాయగూరలు తరుగుతున్నారు. ఆ దృశ్యం చూసి మాతృదేవి, “నా సంతానం చక్కగా కాయగూరలు తరుగుతున్నారే!” అని వ్యాఖ్యానించారు. అందుకు జగదానందస్వామి, “దేవిని ఆనందింపచేయడమే లక్ష్యం. అది సాధనానుష్ఠానాల ద్వారా సిద్ధిస్తే ఏం, కాయగూరలు తరగడం వల్ల ప్రాప్తిస్తే ఏం?” అని అన్నారు.
మరొక రోజు మాతృదేవిని చూడడానికి వెళ్లాను.
నేను: అమ్మా! కొందరు మీకు ప్రణామాలర్పిస్తున్నప్పుడు మీరు ఎంతో బాధకు గురయ్యేవారని విన్నాను.
మాతృదేవి: అవును నాయనా! కొందరు ప్రణమిల్లుతున్నప్పుడు తేలు కుట్టినట్లనిపించేది. కానీ ఎవరితోనూ ఏదీ చెప్పను. అందుకే మీతో కూడా ఏదీ చెప్పను.
నేను: అమ్మా! మీ లాంటి తల్లి నాకు లభించినప్పటికీ, జీవితంలో గొప్పగా సాధించినది ఏదీ లేదు కదా అని భయం వేస్తోంది.
మాతృదేవి: భయమెందుకు నాయనా? మీ అందరి వెనుకా గురుదేవులున్నారు. ఇది సదా మనస్సులో జ్ఞాపకం ఉంచుకో! నేను కూడా ఉన్నాను. తల్లిగా నేనున్నప్పుడు నువ్వు భయపడవచ్చా? గురుదేవులు ఒకసారి నాతో, ‘నీ వద్దకు ఎవరైతే వస్తారో, వారి అంతిమ ఘడియల్లో నేను వచ్చి వారి చేతులు పుచ్చుకొని తీసుకొని వెళతాను’ అని చెప్పారు. మిమ్మల్ని తీసుకువెళ్లడానికి గురుదేవులు వచ్చే తీరతారు.
ఒకసారి గురుదేవులకు నైవేద్యం అర్పిస్తున్నప్పుడు ఆయన చిత్రపటం నుండి ఒక కాంతి పుంజం వెలువడి నైవేద్యం మీద ప్రసరించడం చూశాను. దాని గురించి మాతృదేవిని అడిగాను.
నేను: అమ్మా! నేను చూసింది యథార్థమేనా లేక భ్రాంతా?
మాతృదేవి (చిన్నగా నవ్వి): భ్రాంతి కాదు నాయనా! అంతా యథార్థమే!
నేను: మీకు తెలుసా? మీరు కూడా అలా చూస్తుంటారా?
మాతృదేవి: అవును.
నేను: గురుదేవులకూ మీకూ నైవేద్యం అర్పిస్తున్నాం. దానిని ఆయనా, మీరూ స్వీకరిస్తారా?
మాతృదేవి: అవును.
నేను: దానిని ఎలా అవగతం చేసుకోవాలి?
మాతృదేవి: ఎందుకు? పండ్లు, పువ్వులు, జలం మొదలైనవి భగవంతునికి భక్తితో సమర్పిస్తే ఆయన వాటిని స్వీకరిస్తారని నువ్వు గీతలో చదవలేదా?*
ఈ జవాబు విని ఆశ్చర్యపోయిన నేను, “అలా అయితే మీరు భగవంతుడా?” అని అడిగాను. ఇది విని మాతృదేవి నవ్వసాగారు. మేమూ ఆ నవ్వుతో జత కలిపాం.