జయరాంబాటి, మే / జూన్ 1910
మేంకొందరు మిత్రులం మాతృదేవి దర్శనార్థం వెళ్లాం. మాతృదేవి ఛాయాచిత్రాన్ని మేమంతా చూసేవున్నాం. మాలో ఒకరు అప్పటికే ఒక సన్న్యాసి వద్ద మంత్రదీక్ష పుచ్చుకొని ఉన్నాడు. ‘ఆ సన్న్యాసి ప్రసాదించిన మంత్రంతోనే నీకు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుం’ దని చెప్పి, మాతృదేవి ఆతడికి మంత్రదీక్ష ఒసగలేదు. తక్కిన అందరికీ మంత్రదీక్ష ప్రసాదించారు. అందరమూ అక్కడే భోజనం చేశాం.
భోజనానంతరం నేను, భాను అత్తయ్య అరచేయి పరిశీలించి, “అత్తయ్యా, నువ్వు ఇంకా ఇరవై ఐదేళ్లు బ్రతుకుతావు” అని చెప్పాను. ఆమె తిన్నగా మాతృదేవి వద్దకెళ్లి ఈ విషయం చెప్పేసింది. వెంటనే మాతృదేవి నన్ను పిలిచి, “ఫరవాలేదే! నీకు హస్తసాముద్రికం తెలుసా? నా వాత రోగం నయమవుతుందో లేదో కాస్త చూసి చెప్పు నాయనా!” అని అన్నారు.
నేను విస్తుబోయాను. నిజానికి నాకు హస్తసాముద్రికం తెలియదు. తమాషా కోసం భాను అత్తయ్యతో అలా చెప్పాను. ఇప్పుడు మాతృదేవికి ఏం చెప్పాలి?
భక్తు లందరి పాపాలు స్వీకరించినందునే మాతృదేవికి ఆ రుగ్మత వాటిల్లిందని విన్నాను. అందువలన ఆమెతో, “మీకు మా కారణంగానే ఆ రుగ్మత సంక్రమించింది. మేం ఉన్నంత దాకా మీకు ఆ రుగ్మత ఎలా నయమవుతుంది?” అని చెప్పాను.
అంతే! అప్పటిదాకా నిలబడివున్న మాతృదేవి ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యక్తంచేస్తూ, “భగవంతుడా! నువ్వేమంటున్నావు!” అంటూ చతికిలపడ్డారు. నా మూర్ఖత్వానికి నన్ను నేనే నిందించుకొంటూ, “అమ్మా! రుగ్మత నయం కావాలని నిజం గానే కోరుకొంటున్నారా?” అని అడిగాను. “అవును” అన్నారామె. “అలా అయితే తప్పకుండా నయమవుతుంది” అన్నాను.
ఈ మాట వినగానే మాతృదేవి ముఖం వికసించింది. “ఎంత భక్తో చూడు! నా ఇచ్ఛ మేరకు అంతా జరుగుతుందని విశ్వసిస్తున్నాడు” అని అన్నారు.
ఇంటికి తిరిగి వెళుతున్న రోజు నేను మాతృదేవికి ప్రణమిల్లి కొన్ని సందేహాల గురించి అడిగాను.
నేను: అమ్మా! జప సంఖ్యను నేను సరిగా లెక్కించలేకపోతున్నాను. వ్రేళ్లతో లెక్కించడం ప్రారంభిస్తే నామోచ్చారణలో ఆటంకం కలుగుతున్నది. రెండూ జరిగితే మనస్సు ఎక్కడికో పరుగులు తీస్తోంది.
మాతృదేవి: వ్రేళ్లు, నాలుక స్తంభించిపోయి మనస్సులో మాత్రమే అన్నీ జరిగి పోవడం త్వరలో నువ్వు చూస్తావు.
బయలుదేరేటప్పుడు మాతృదేవికి ప్రణమిల్లి, “అమ్మా, వెళతాను” అన్నాను. వెంటనే మాతృదేవి, “వస్తాను అని చెప్పు నాయనా! వెళతాను అని చెప్పకు!” అని అన్నారు.
కాశీ, 1912
మాతృదేవి జన్మదినోత్సవాలు ఈ ఏడాది కాశీ అద్వైత ఆశ్రమంలో జరిపారు. పూజ, హోమం మొదలైనవి నిర్వర్తించారు. హోమం ముగింపులో భక్తులు ఆహుతు లిచ్చారు. నేను వెళ్లినప్పుడు ఒక వ్యక్తి, “మీరు ఆహారం తిన్నారు. కనుక ఆహుతి ఇవ్వకూడదు” అని అభ్యంతరపెట్టాడు. నేను తప్ప తక్కిన వారంతా ఆహుతు లర్పించారు.
తరువాత ఎవరో భక్తురాలు ఈ విషయం చెప్పినప్పుడు మాతృదేవి, “వారు నా ప్రసాదమే కదా తిన్నారు. అదెలా భోజనం చేయడమవుతుంది? వారు ఆహుతి అర్పించి ఉండవచ్చు” అని వ్యాఖ్యానించారు. ఈ సంగతి తరువాత నాకు తెలియ వచ్చింది.
1913
కుటుంబ సమేతంగా మాతృదేవి దర్శనానికి వెళ్లాను. “శివపూజ చేయాలని ఎంతో అభిలాషగా ఉందమ్మా” అని నా భార్య, మాతృదేవితో చెప్పింది. అందుకు మాతృదేవి, “నువ్వు చిన్నదానవు. అవన్నీ నువ్వు చేయలేవు. తరువాత సమయం దొరికినప్పుడు పద్ధతి ప్రకారం నేర్చుకొని శివపూజ చేయవచ్చు! ప్రస్తుతం అత్తమామ లను సేవించు” అని చెప్పారు.
జయరాంబాటి, 1913
కృష్ణాష్టమి నాడు కొందరు మిత్రులతోపాటు మాతృదేవి దర్శనానికి వెళ్లాను. మాలో ఒకరు ఒక చిన్నబిడ్డను కూడా తీసుకువచ్చారు. కోయల్పారా చేరుకొనేటప్ప టికే సాయంత్రం దాటింది. అక్కడ బస చేయడానికి అనుమతి లభించనందున చీకట్లోనే ప్రయాణం కొనసాగించాం. గాఢాంధకారం. పైగా దారిలో వర్షం కూడా పట్టుకొంది. దారంతా బురదమయం! ఎలాగో నానాయాతనలూ పడి రాత్రి బాగా ప్రొద్దుపోయాక జయరాంబాటి చేరుకొన్నాం. అందువల్ల మా రాక గురించి మాతృ దేవికి తెలియజేయలేదు.
మర్నాడు ఉదయం మాతృదేవి దర్శనార్థం వెళ్లినప్పుడు, “మిమ్మల్ని గురుదేవులే రక్షించారు. ఆ వానలో, బురదలో ఎన్ని పాములను త్రొక్కుకుంటూ వచ్చారో ఆ దేవుడికే ఎరుక! మీరు ఇలా అవస్థపడి రావడం నా కెంతో బాధగా ఉంది. ఆలో చనారహితంగా, దుస్సాహసంతో ఇలా చేయడం మంచిది కాదు” అని ఆమె చెప్పారు.
నేను: మిమ్మల్ని దర్శించుకోవాలనే వ్యాకులతతోనే ఇలా చేశాం. సెలవులు కూడా తక్కువ రోజులే ఉన్నాయి.
మాతృదేవి: మీ వ్యాకులతేమో బాగుంది కానీ నాకు ఎంతో బాధ కలిగించింది.
ఉద్బోధన్, డిసెంబర్ 24, 1915
నేడు మాతృదేవిని దర్శించుకోవటానికి వెళ్లినప్పుడు పూజ గురించి నా సందేహాన్ని అడిగాను.
నేను: అమ్మా! గురుదేవులకు అన్నం నివేదించవచ్చా?
మాతృదేవి: ఆ, నివేదించవచ్చు.
నేను: చేపలు నివేదించవచ్చా?
మాతృదేవి: అలాగే చేయవచ్చు. ఆయన మంత్రం ఉచ్చరిస్తూ నైవేద్యం సమర్పించాలి.
అప్పుడు జరుగుతున్న యుద్ధం గురించి ప్రస్తావన వచ్చింది.
నేను: ఈ యుద్ధం కారణంగా ఎటు చూసినా దుఃఖమూ, ఆవేదనే! తిండికి, కట్టుగుడ్డకు మొహంవాచి ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు.
మాతృదేవి: ఇంత జరిగినా ప్రజలకు బుద్ధిరావడం లేదే!
నేను: అమ్మా! ఈ యుద్ధం వలన మనకు మేలు జరుగుతుందా?
మాతృదేవి: ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో గురుదేవులు వేంచేస్తారు. ఇంకా ఏం జరుగనున్నదో!
నేను: అమ్మా! మనఃస్ఫూర్తిగా ప్రార్థిస్తే గురుదేవులు ఆలకిస్తారా? మీకు తెలుపకుండా ఆయనను ప్రార్థించవచ్చునా?
మాతృదేవి: గురుదేవుల ఉనికి సత్యమైనప్పుడు ఆయన మీ ప్రార్థనలు ఆల కించే తీరతారు.
గురుదేవులు జన్మగృహం, కామార్పుకూర్