ఉద్బోధన్, 1914
మాతృదేవిని దర్శించుకోవాలనే ఆరాటం నాకు చాలా కాలంగా ఉండేది. కానీ సందర్భం లభించలేదు. అప్పుడే మాతృదేవి కలకత్తాకు వచ్చివున్నారనే సమా చారం నాకు అందింది. లలిత్ అనే పదిహేనేళ్ల అబ్బాయితో కలిసి ఉద్బోధన్కు వెళ్లాను. మాతో కలిసి లలిత్ అమ్మ, అతడి సోదరులు వచ్చారు. పంజూ కూడా మాతో వచ్చాడు. లలిత్ తప్ప మాతృదేవిని మాలో ఎవరమూ ఇంతవరకూ చూడ లేదు.
ఉద్బోధన్ చేరుకోగానే కంట పడ్డ అందరినీ, “మాతృదేవి ఉన్నారా?” అని ఉద్వేగంగా అడుగుతూ తిన్నగా లోనికి పోసాగాం. ఒకవేళ మాతృదేవి లేకపోతే – అనే భయం పట్టుకొంది. ఇంతలో లలిత్ బండి దిగి తిన్నగా మేడ మీదకు వెళ్లిపోయాడు. నేను కూడా అతణ్ణి అనుసరించాను. వెంటనే అతడు తిరిగి వచ్చి, “మాతృదేవి ఉన్నారు” అని చెప్పాడు. మనస్సు నుండి పెద్ద భారం దిగినట్లనిపిం చింది.
లోపలకు వెళ్లగానే మేలిముసుగులో ముఖం కాస్త కప్పుకొని ఒక స్త్రీమూర్తి నిలబడి ఉండడమూ, ఆమెకు కొందరు స్త్రీలు ప్రణమిల్లడమూ మేం చూశాం. మాతృదేవి ఆమే అని తెలిసిపోయింది. తక్షణమే ఆమె వైపుగా పరుగుతీశాను. ఆమెను సమీపించిన తరువాత ఏం చేశానో నాకు జ్ఞాపకం లేదు. అంత ఉద్రిక్తత నాలో అప్పుడు చోటు చేసుకొన్నది. నన్ను చూడగానే భక్తురాండ్రు వైదొలగారు.
నేను వెళ్లి మాతృదేవి పాదాలు పుచ్చుకొని కూర్చున్నాను.
మాతృదేవి: అమ్మాయీ! నువ్వు ఎక్కణ్ణుంచి వస్తున్నావు? ఎందుకు వచ్చావు?
నేను: ఎందుకు వచ్చానో నాకు తెలియదమ్మా? మీరు పిలిచివుంటారు, అందుకే వచ్చాను.
ఇంతలో లలిత్ అమ్మ, ప్రభృతులు వచ్చారు. “వీరేనా మాతృదేవి?” అని లలిత్ అమ్మ అడిగింది. అవునన్నాను. వెంటనే అందరూ మాతృదేవికి ప్రణమిల్లారు.
పిదప మాతృదేవి పూజగదిలోకి వెళ్లి మంచం మీద కూర్చున్నారు. మేం కూడా వెళ్లి గురుదేవులకు ప్రణమిల్లి, మాతృదేవి ముందు కూర్చున్నాం. “అమ్మా! గురుదేవుల గురించి ఏదైనా చెప్పండి. మేం సంసారులం. మాకు ఏవైనా ఉపదేశాలివ్వండి” అని లలిత్ తల్లి అడిగింది.
మాతృదేవి: గురుదేవుల నుండి విన్నది తప్ప నాకు మరేమీ తెలియదు. అయినా శ్రీరామకృష్ణ కథామృతం చదవండి. ఎన్నో ఉపదేశాలు దాన్లో ఉన్నాయి.
లలిత్ మాతృదేవికి ప్రణమిల్లి ఆమె అనుగ్రహం కోసం ప్రార్థించినప్పుడు పొరపాటున అతడి కాలు నేతి జాడీపై పడింది. “అయ్యో! ఎంత అపచారం చేశాను. భక్తితో ఎవరో దీనిని మాతృదేవికి ఇచ్చి ఉంటారు. దాని మీద నా కాలు పడింది!” అంటూ అతడు విలపించసాగాడు. అది చూసి గోలాప్ మా, “కాలు తగిలినందుకు బాధపడకు. అదేమంత అపచారం కాదు. కాళ్లను కూడా భగవంతుడే కదా సృజించాడు. అవీ మన శరీరంలోని అంగాలే కదా!” అంటూ అనునయించారు. ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖమూ, ఈ మాటలూ మమ్మల్ని ఎంతో ఆనందపరి చాయి. లలిత్, మాతృదేవికి ప్రణమిల్లి దీవించమని అభ్యర్థించాడు. అప్పుడు మాతృదేవి, “గురుదేవులు నిన్ను దీవిస్తారు” అంటూ తమ చేత్తో అతడి తలను తాకి ఆశీర్వదించారు. పిదప లలిత్ కిందికి వెళ్లాడు.
అప్పుడు మధ్యవయస్కుడైన ఒకాయన, పదహారు పదిహేడేళ్ల ఒక యువతిని తోడ్కొని వచ్చి మాతృదేవితో, “అమ్మా! ఈమె నా కుమార్తె. ఈమెకు ఒక ఆడపిల్ల. ఈ రోజు ఉదయం ఆ పిల్ల చనిపోయింది. దుఃఖంతో బాధపడుతున్న ఈమెకు కాస్త మనశ్శాంతి లభిస్తుందనే ఉద్దేశంతో మీ వద్దకు తీసుకొని వచ్చాను” అని చెప్పాడు.
మాతృదేవి ఎంతో ఆప్యాయంగా, “రామ్మా రా” అంటూ పిలిచారు. ఆ యువతి, మాతృదేవి పక్కన కూర్చొని ఆమె పాదాలు స్పృశింప ప్రయత్నించింది. అప్పుడు మాతృదేవి, “ఇప్పుడు నన్ను తాకడమా? నీకు మైల కదా!” అంటూ కాస్త జరిగి కూర్చున్నారు. ఇది ఆ యువతికి మరింత దుఃఖాన్ని కలిగించింది. ఆమె దూరంగా జరిగి కూర్చుంది.
ఆ తరువాత మాతృదేవి ఎంతో ప్రేమగా ఆ యువతితో ఇలా అన్నారు: “ఆహా! నా తల్లీ! ఎంతో దుఃఖంతో బాధపడుతూ మనశ్శాంతికై నన్ను ఆశ్రయించావు. నేను కూడా నిన్ను బాధపెట్టానా? మైల అయినా ఫరవాలేదు. రా, వచ్చి నా పాదా లను తాకి నమస్కరించు.” పిదప మాతృదేవి ఆ యువతి పక్కనే కూర్చున్నారు. కళ్ల వెంట అశ్రువులు స్రవిస్తూంటే మాతృదేవి పాదాలపై ఆమె తల ఉంచి ప్రణమిల్లింది. మాతృదేవి కూడా తమ చేతులతో ఆమె తలను నిమురుతూ ఆశీర్వదించారు. ఆ తరువాత మృదువుగా ఇలా అన్నారు:
“అమ్మాయీ! నీకు ఏం చెప్పను? నాకు ఏమీ తెలియదు. గురుదేవుల ఛాయాచిత్రాన్ని దగ్గర ఉంచుకో. ఆయన ఉనికి నిజం, ఆయన నీ వద్ద ఉన్నారని జ్ఞాపకం ఉంచుకో. కన్నీటితో నీ బాధలను ఆయనకు విన్నవించు. వ్యాకులతతో, ‘గురుమహరాజ్! మీ పాదపద్మాల వద్ద నాకు ఆశ్రయం ఇవ్వండి. నాకు మనశ్శాంతి ప్రసాదించండి’ అని ప్రార్థించు. ఇలా నిరంతరం ప్రార్థిస్తూవుంటే నీ మనస్సు దానంతట అదే ప్రశాంతతను సంతరించుకొంటుంది. కష్టాలు ఎదురైనప్పుడల్లా ఆయనకు విన్నవించు.”
ఆ తరువాత మమ్మల్ని చూసి, “ఈ రోజే ఆ దుఃఖ ఘటన జరిగింది, ఈ రోజే మనస్సు సాంత్వన పొందుతుందా ఏమిటి?” అని అన్నారు. అంతసేపూ ఆ యువతి తండ్రి వాకిలి వద్దే నిలబడివున్నాడు. తండ్రీ కూతుళ్లిద్దరూ మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నారు.
అందరూ వెళ్లిపోయాక మాతృదేవితో నేను మాట్లాడసాగాను.
నేను: అమ్మా! మీరు అనుమతిస్తే ఒక విషయం చెప్పగోరుతున్నాను.
గోలాప్: చెప్పమ్మా. నీ మనస్సులోని విషయం దాచిపెట్టక మాతృదేవికి చెప్పు. మాతృదేవి వద్ద సిగ్గెందుకు?
నేను: గురుదేవులనూ, మిమ్మల్నీ ఒక రోజు కలలో చూశాను. మీరు నాకు మంత్రదీక్ష ప్రసాదించారు కానీ అది పూర్తి కాలేదు. అప్పటి నుండి మిమ్మల్ని దర్శించుకోవాలని ఎంతో ఆరాటపడుతున్నాను.
మాతృదేవి: మంచిది. నీకు ఈ రోజే మంత్రదీక్ష ఇస్తాను. అందుకు నీ భర్త అంగీకరిస్తాడా?
నేను: నా భర్తతో ఈ విషయం చెప్పినప్పుడు, ‘నాకు ఎలాంటి ఆక్షేపణా లేదు. ప్రస్తుతం నేను దీక్ష పుచ్చుకోగోరడం లేదు. కానీ నువ్వు తీసుకోవచ్చు’ అని చెప్పారు.
మాతృదేవి: నీ భర్త ఎక్కడ ఉంటున్నాడు?
నేను: రాయపూర్‌లో.
మాతృదేవి (నీటి కుళాయిని చూపుతూ): వెళ్లి చేతులు, కాళ్లు కడుగుకొని రా.
నేను: అమ్మా, నేనింకా స్నానం చేయలేదు.
మాతృదేవి: అదేం ఫరవాలేదు.
నేను వెళ్లి కాళ్లు, చేతులు కడుగుకొని పూజగదిలోకి వెళ్లాను. మాతృదేవి రెండు ఆసనాలు వేయించారు. గురుదేవుల చిత్రపటానికి ఎదురుగా తాము కూర్చొని, నన్ను తమ కుడి పక్కన కూర్చోమన్నారు. ఆ తరువాత మంత్రదీక్ష ప్రసాదించారు. దీక్ష కార్యం పూర్తయ్యాక గురుదక్షిణ సమర్పించమన్నారు. కానీ ఈ విషయం గురించి నాకు ఏమీ తెలియదు. అందువలన ఆమే లేచి పువ్వులు, పండ్లు మొద లైనవి తెచ్చి నా చేతికిచ్చారు. రెండు చేతుల్లోను వాటిని ఉంచుకొని, “నా పూర్వ జన్మలలోను, ఈ జన్మలోను తెలిసో తెలియకో చేసిన పాపపుణ్యాలన్నింటిని మీకు సమర్పిస్తున్నాను” అని చెప్పమన్నారు. నేను అలాగే చెప్పి, పండ్లు మొదలైన వాటిని ఆమెకు సమర్పించాను. మాతృదేవి తమ రెండు చేతులూ చాపి వాటిని అందుకొన్నారు.
అమ్మా! గతిలేని, దిక్కులేని, అధమురాలైన నా పట్ల కనబరచిన ఈ అవ్యాజ కరుణను ఎలా వర్ణించను తల్లీ! మీ కారుణ్యం, ఆప్యాయతానురాగాలు నా ప్రాణ మనశ్శరీరాలను దోచుకొన్నాయి! నేను చూసింది అపూర్వం! నేను విన్నది అపూర్వం! నా మనశ్శరీరాలను, ప్రాణాన్ని మీ పాదపద్మాల వద్ద సమర్పించి ధన్యురాలనైనాను.
ఆ రోజంతా మాతృదేవి సాన్నిధ్యంలోనే గడిపాను. అనేక విషయాలు చెబుతూ మాతృదేవి నాతో, “నువ్వు వయస్సులో చిన్నదానవు. మంత్రదీక్ష పుచ్చుకోవాలనే ఉద్దేశం నీ కెలా కలిగింది?” అని అడిగారు.
నేను: ఏం చెప్పనమ్మా! ఎందుకో సంసార జీవితం పట్ల అంతగా అనురక్తి కలగడం లేదు. సదా ఏదో అశాంతి నెలకొంటూనే ఉంది. ఈ రోజు మనశ్శాంతి కలిగింది. జీవితం కూడా శాశ్వతం కాదు. అంతా రెండు రోజుల ముచ్చటే, సమస్తం అనిత్యమే అని తెలుస్తూనే ఉంది. అటువంటప్పుడు దాన్లో నా మనస్సు ఎలా పాల్గొనగలదు?
ఇంటి నుండి బండి రాగానే మాతృదేవికి ప్రణమిల్లి సెలవు పుచ్చుకొన్నాను.