గురుదేవులను దర్శించిన కొంత కాలానికి ఒక రోజు దక్షిణేశ్వరం వెళ్లాను. వెళ్లే హడావిడిలో నాలుగు మెతుకులు తిన్నాను. ఈ విషయం విని గురుదేవులు, “హా! నువ్వు భోజనం చేయలేదా? వెళ్లు. నహబత్తులో అన్నం, కూర అన్నీ ఉన్నాయి. వెళ్లి భోజనం చేసిరా” అని అన్నారు. అక్కడే నేను మాతృదేవిని ప్రప్రథమంగా చూశాను.
రాముని తల్లివంటివారు అప్పటికే ఒకటి రెండుసార్లు మాతృదేవిని దర్శించి ఉన్నారు. నహబత్తుకు వెళ్లగానే వారు మాతృదేవితో నేను భోజనం చేయలేదనే విషయం చెప్పారు. మాతృదేవి వెంటనే అక్కడున్న అన్నం, కూర, లూచీ మొదలైన వాటిని నాకు పెట్టారు. ఆ మొదటి సమావేశంలోనే మాతృదేవితో నాకు ఒక బంధం ఏర్పడింది.
దక్షిణేశ్వరానికి మళ్లీ వెళ్లినప్పుడు మాతృదేవి రాంలాల్ వివాహం కోసం కామార్పుకూర్కు బయలుదేరుతూ కనిపించారు. చాలారోజుల దాకా మాతృదేవిని చూడలేనని నా మనస్సు ఆవేదన పడింది. బయలుదేరేటప్పుడు నమస్కరించడానికి గురుదేవుల వద్దకు ఆమె వెళ్లింది. ఉత్తరం వైపు వసారాలోకి వచ్చి ఆయన నిలబడగా. ఆమె ఆయనకు నమస్కరించారు. పాదాలను స్పృశించాక మాతృదేవి తమ చేతులను తలపై ఇడుకొన్నారు. “జాగ్రత్తగా వెళ్లి రా. పడవలోనూ, రైలులోనూ ఏదీ మరచిపోకు సుమా!” అని అన్నారు గురుదేవులు. మాతృదేవిని, గురుదేవులను ప్రక్కప్రక్క నిలబడి ఉండగా అప్పుడే చూశాను. ఇద్దరినీ కలిసి చూడాలనే ఆకాంక్ష నా మనస్సులో చాలాకాలంగా ఉండేది. ఆ కోర్కె అప్పుడు ఈడేరింది.
మాతృదేవి పడవలో బయలుదేరారు. పడవ కంటికి కనిపించేవరకు చూస్తూ నిలబడ్డాను. పడవ కనుమరుగైనాక నహబత్తుకు వెళ్లాను. సామాన్యంగా పశ్చిమ వసారాలో దక్షిణాభిముఖంగా కూర్చొని ధ్యానం చేయడం మాతృదేవికి పరిపాటి. అక్కడకు వెళ్లి కూర్చున్నాను. తెరలు తెరలుగా ఏడ్పు వచ్చింది. నా దగ్గును, ఏడు పును అటుగా వెళుతున్న గురుదేవులు వినివుంటారు. అందువలన తమ గదికి వెళ్లాక నన్ను తోడ్కొని రమ్మని కబురు పంపారు.
నేను వెళ్లగానే గురుదేవులు, “ఆమె వెళ్లిపోవడం నీకు ఎంతో బాధగా ఉంది కదా!” అని అడిగారు. నా వ్యథ ఉపశమించడానికేమో అన్నట్లు ఆయన తన సాధనలను గురించి చెప్పసాగారు. చివరకు, “వీటిని గురించి ఎవరికీ చెప్పకు” అని అన్నారు. సామాన్యంగా నాకు తగని బిడియం. కాని ఆ రోజు గురుదేవుల సాన్నిధ్యంలో ఉండి ఆయనతో మాట్లాడగలిగాను.
దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు గడిచాక మాతృదేవి మళ్లీ దక్షిణేశ్వరానికి వచ్చారు. ‘తిండి తిప్పలకు నేనెంతో ఇబ్బంది పడుతున్నాను’ అని గురుదేవులు, మాతృదేవికి ఉత్తరం వ్రాయించి, ఆమెను రప్పించారు. మాతృదేవి దక్షిణేశ్వరానికి రాగానే, ఆమెతో ఇలా చెప్పారు: “అందమైన, విశాల నేత్రాలుగల ఒక స్త్రీ ఆ రోజు వచ్చిందే, ఆమె నిన్ను అమితంగా అభిమానిస్తున్నది. నువ్వు వెళ్లిన రోజు నహబత్తుకు వెళ్లి నీ ఎడబాటుకు వెక్కివెక్కి ఏడ్చింది.” అందుకు మాతృదేవి, “అవును. ఆమె పేరు యోగీన్” అని చెప్పారు.
నేను దక్షిణేశ్వరానికి వెళ్లినప్పుడు, అక్కడ జరిగిన విషయాలన్నీ మాతృదేవి నాకు చెప్పేవారు. కొన్ని విషయాలలో నన్ను సంప్రతించేవారు. నేను ఆమెకు జడ వేసేదాన్ని. నేను జడవేసే తీరు అమ్మకు ఎంతో నచ్చేది. ఆ కారణంగా నాలుగైదు రోజుల దాకా ఆ జడను విప్పకుండా, అలాగే ఉంచుకొనేవారు. స్నానం చేసేటప్పుడు కూడా విప్పే ప్రయత్నం చేసేవారు కారు. “ఓ! అది యోగీన్ అల్లిన జడ. అలాగే ఉండనివ్వు. ఆమె వచ్చిన తరువాత విప్పుకుంటాను” అని ఆమె అనడం కద్దు.
ఏడెనిమిది రోజులకు ఒకసారి నేను దక్షిణేశ్వరానికి వెళ్లేదాన్ని. ఇంట్లో శివ పూజ చేసే నిమిత్తం, దక్షిణేశ్వరంలో బిల్వపత్రాలు సేకరించుకు వచ్చేదాన్ని. అవి వాడిపోయినప్పటికీ, వాటితోనే పూజించేదాన్ని. ఒకరోజు మాతృదేవి నాతో, “యోగీన్, వాడిపోయిన బిల్వదళాలతో పూజచేయడం నీకు అలవాటా?” అని అడిగారు.
నేను: అవునమ్మా! ఆ విషయం మీకెలా తెలుసు?
మాతృదేవి: వాడిపోయిన బిల్వదళాలతో నువ్వు పూజచేయడాన్ని ఈ ఉదయం నేను ధ్యానంలో చూశాను.
ఒకరోజు నహబత్తులో మాతృదేవి తమలపాకు చిలకలు చుడుతున్నారు. నేను ఆమె ప్రక్కన కూర్చుని గమనిస్తున్నాను – కొన్నిట్లో ఏలకులు పెట్టి చుడుతున్నారు. కొన్నింట్లో వక్కలు, సున్నం మాత్రమే పెడుతున్నారు.
నేను: అమ్మా! కొన్నింట్లో మసాలా, ఏలకులు వేటినీ చేర్చడం లేదే! ఇవి ఎవరికి? అవి ఎవరికి?
మాతృదేవి: యోగీన్! ఇవి (మసాలా, దినుసులు చేర్చినవి) భక్తులకు. వారిని బాగా ఆదరించి, నా సొంత వారిగా చేసుకోవాలి. మిగిలినవి (మసాలా దినుసులు చేర్చనివి) ఆయనకు (గురుదేవులకు). ఆయన ఇప్పటికే నా సొంతం కదా!
మాతృదేవి బాగా పాడతారు. ఆమె, లక్ష్మి ఇద్దరూ ఒక రోజు రాత్రి మెల్లని స్వరంలో పాడారు. గురుదేవులు ఆ గానాన్ని విన్నారు. “గత రాత్రి మీరు బాగా పాడారు” అని మర్నాడు ఆయన చెప్పారు.
దక్షిణేశ్వరంలో మాతృదేవికి రోజంతా పని ఉండేది. అసలు తీరిక ఉండేది కాదు. భక్తుల నిమిత్తం దాదాపు ఒకటిన్నర కిలోల పిండితో చపాతీలు చేయవలసి వచ్చేది. ఇక తమలపాకు చిలకల గురించి ప్రత్యేకించి చెప్పాలా? గురుదేవులకు మీగడ ఎంతో ఇష్టం. అందుకోసం పాలను బాగా మరగ కాచేవారు. కాయగూరలతో సూప్ తయారుచేసేవారు. గురుదేవుల తల్లి జీవించి ఉన్నంత వరకూ ఆయన కూడా ఆమెతో పాటు నహబత్తులోనే భోజనం చేసేవారు. తదనంతరం తమ గదిలో భుజించడం మొదలుపెట్టారు. భక్తులు లేని రోజులలో మాతృదేవి ఆయనకు నూనె రాసేవారు.
ఒక రోజు గోలాప్ మా వచ్చినప్పుడు గురుదేవులు తనకు తినడానికి ఏదైనా తెమ్మని ఆమెతో చెప్పారు. అప్పటి నుండి రోజూ గోలాప్మా వారు తినడానికి ఆహారం తీసుకురాసాగింది. అందువలన కనీసం ఆహారం తీసుకువెళ్లేటప్పుడయినా గురుదేవులను చూసే అవకాశం మాతృదేవికి లేకుండాపోయింది. సాయంత్రం తరువాత కూడా గోలాప్ మా చాలాసేపు గురుదేవుల గదిలో ఉండడం తటస్థించేది. కొన్ని సందర్భాలలో ఆ నహబత్తుకు తిరిగి వెళ్లేసరికి ఆమెకు రాత్రి పదిగంటలయ్యేది. ఆమె వచ్చేదాకా మాతృదేవి ఆమె కోసం ఆహారంతో సిద్ధంగా నహబత్తు వసారాలో పడిగాపులు కాయవలసివచ్చేది. మాతృదేవికి ఇది ఎంతో ఇబ్బందీ, అసౌకర్యం కలిగించేది. ఒక రోజు ఇలా నిరీక్షిస్తూన్న మాతృదేవి, “ఇక నేను వేచివుండలేను. ఈ భోజనాన్ని ఏ కుక్కో, పిల్లో తింటే తిననీ” అని చెప్పారు. ఈ విషయం గురు దేవులకు తెలియవచ్చింది. మర్నాడు ఆయన గోలాప్ మాతో, “చూడు, నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండిపోతే ఆమెకు ఎంతో ఇబ్బంది కలుగుతోంది. భోజనం సిద్ధం చేసి నీకోసం వేచివుండాల్సి వస్తోంది” అని చెప్పారు. అందుకు గోలాప్ మా, “మాతృదేవి నన్ను తమ సొంత కుమార్తెగా అభిమానిస్తున్నారు. సొంత కుమార్తెగా భావించే పిలుస్తున్నారు. అందువలన ఆమె దీనిని ఇబ్బందిగా భావించరు” అని జవాబిచ్చింది. గురుదేవుల వద్దకు వెళ్లే ఆస్కారాన్ని కోల్పోవడంతో మాతృదేవి ఎంత బాధపడ్డారో గోలాప్ మా గ్రహించలేకపోయింది. కాని గురుదేవులు గ్రహించగలిగారు.
ఒక రోజు మాతృదేవితో, గోలాప్ ఇలా చెప్పింది: “ ‘గురుదేవులు ఎంత గొప్ప సన్న్యాసి! కాని మాతృదేవి మాత్రం దుద్దులు మొదలైన నగలు ధరించి ఆర్భా టంగా ఉంటారు. ఇది సబబేనా?’ అని మన్మోహన్ తల్లి అంటున్నది.’ ”
మర్నాడు నేను దక్షిణేశ్వరానికి వెళ్లినప్పుడు బంగారు గాజులు తప్ప మాతృదేవి మరే నగలూ ధరించకుండా కనిపించారు. నేను విస్తుబోయి, “అమ్మా, ఇదేమిటి?” అని అడిగాను. అందుకు మాతృదేవి, “గోలాప్మా ఇలా చెప్పింది….” అని అన్నారు. విషయం అవగతం చేసుకొని మాతృదేవికి నేను ఎంతో నచ్చచెప్పిన తరువాతే ఆమె దుద్దులను, ఒకటి రెండు నగలను ధరించారు. నగలనన్నింటినీ ధరించే సందర్భం ఆ తరువాత ఆమెకు రాలేదు. ఎందుకంటే ఒకింత కాలంలోనే గురుదేవులు వ్యాధిగ్రస్థులయ్యారు కనుక.
ఒక రోజు రాత్రి ఎవరో పిల్లనగ్రోవి ఊదుతున్న నాదం వినవచ్చింది. అది విన్న మాతృదేవి పారవశ్య స్థితిని పొందారు. మధ్య మధ్యలో నవ్వసాగారు. కుటుంబ జీవనం సాగిస్తున్న నేను ఆ సమయంలో ఆమెను స్పృశించడం, ఆమె సమీపంలో ఉండడం భావ్యం కాదని ఎంచి మంచం మీద ఒక మూలకు ఒదిగి కూర్చుండిపోయాను. మాతృదేవి మామూలు స్థితికి రావడానికి చాలాసేపు పట్టింది.
ఒక రోజు బలరాంబోసు ఇంటి మేడ మీద ధ్యానం చేసుకొంటున్న మాతృదేవి హఠాత్తుగా సమాధి మగ్నులైనారు. చాలాసేపు గడిచిన తరువాత మామూలు స్థితి లోకి వచ్చి ఇలా అన్నారు:
“యోగీన్! ఎక్కడికో చాలాదూరం నేను ప్రయాణం చేశాను. అక్కడ అందరూ ఆప్యాయతానురాగాలతో నన్ను ఆహ్వానించారు. నా రూపం అపరిమిత సౌందర్యాన్ని సంతరించుకొంది. గురుదేవులు కూడా అక్కడ ఉన్నారు. ఆయన ప్రక్కన నన్ను కూర్చోబెట్టారు. నాలో పొంగిపొరలిన ఆనందం వర్ణనాతీతం. కాస్త దేహస్మృతి రాగానే, ఈ దేహం విడిగా పడివుండడం చూశాను. ‘ఛీ! ఈ శరీరపుగూటిలో ప్రవేశించాలా!’ అని అనిపించింది. మళ్లీ దాన్లో ప్రవేశించడానికి నా మనస్సు సుతరామూ ఇష్టపడలేదు. చాలాసేపు గడచిన తరువాత మళ్లీ నేను నా దేహంలోకి ప్రవేశించగలిగాను. బాహ్యస్మృతికూడా వచ్చింది.”