తొలి జీవితం
కలకత్తాకు పశ్చిమాన 60 మైళ్ల దూరంలో, బాంకురా జిల్లాలో నెలకొని ఉన్న కుగ్రామమే జయరాంబాటి. శ్రీశారదామాత ఈ గ్రామంలోనే 1853 వ సం ॥ డిసెంబర్ 22 వ తేదీన పుణ్యదంపతులైన శ్యామసుందరీదేవి, శ్రీరామచంద్రముఖర్జీ లకు ప్రథమ సంతానంగా జన్మించారు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగే సామాన్య బాలి కలలా చంటిపిల్లలను లాలించడం, పాడి ఆవుల సంరక్షణ, పొలాలలో పనిచేస్తూన్న తండ్రీ తదితరులకు భోజనం పట్టుకెళ్లడం లాంటి ఇంటి పనిపాటలలో ఆమె తొలి జీవితం గడిచిపోయింది. ఆమె బడికి వెళ్లి చదువుకోలేదు. కానీ తదనంతర కాలంలో స్వయంకృషితో కొంత వ్రాయనూ చదవనూ నేర్చుకొన్నారు. కుటుంబ సంస్కారమూ, గురుదేవులైన భగవాన్ శ్రీరామకృష్ణులతో కాలాంతరంలో లభించిన సాంగత్యమూ, సహజంగానే సంస్కారయుత ఉన్నత స్థితిలో నెలకొనివున్న మాతృదేవికి స్వాభావికమైన విద్యగా పరిణమించాయి.
గురుదేవులతో
ఐదేళ్లప్పుడు మాతృదేవి, గురుదేవులకు సహధర్మచారిణియైనారు. అప్పుడు గురుదేవుల వయస్సు ఇరవై మూడేళ్లు. వివాహం జరిగినప్పటికీ మాతృదేవి తమ పందొమ్మిదవ ఏట తరువాతనే ఆయన సాన్నిధ్యంలో జీవించడం తటస్థించింది. ఆ మధ్యకాలంలో ఒకటి రెండుసార్లు జయరాంబాటిలోను, గురుదేవులు జన్మించిన కామార్పుకూర్లోను ఆయన సాన్నిధ్యం పొందగలిగారు. పోతే 1872 నుండి 1885 వరకు, అంటే పదమూడు సంవత్సరాలు ఆమె దక్షిణేశ్వర కాళికాలయంలో గురుదేవులతో కలిసి జీవించారు. ఆ రోజుల్ని మాతృదేవి పరమానందంతో గడి పారనడం అతిశయోక్తి కాబోదు. గురుదేవుల సేవ, ఆయనకూ, ఆయన దర్శనార్థం వచ్చే భక్తులకూ వంటావార్పూ, ఆయన నేతృత్వంలో ఆధ్యాత్మిక సాధనలు – ఇలా ఆ కాలం గడిచిపోయింది.
దక్షిణేశ్వర కాళికాలయంలో శ్రీరామకృష్ణులకై ఒక గదిని యాజమాన్యం వారు కేటాయించారు. ఆ గది నుండి దాదాపు 75 అడుగుల దూరంలో నహబత్తుగా పేర్కొనబడే వాద్యమండపం ఉంది. పటంలో చూసినప్పుడు ఒక భవంతిలా అగు పించే ఆ మండపం నిజానికి చాలా చిన్నది. షడ్భుజాకారంలో కట్టబడిన ఈ భవంతి ప్రతి భుజం దాదాపు 3 అడుగులు. గోడల మధ్య నున్న గరిష్ఠ దూరం సుమారు ఎనిమిది అడుగులు. ఆ గది వైశాల్యం 50 చదరపు అడుగుల కంటే కాస్త తక్కువ. చుట్టూ నాలుగడుగుల వసారా ఉంది. ఆ వసారా వెదురు చాపలతో మరుగుపరచబడి ఉండేది. మాతృదేవి ఆ మండపంలో క్రింది గదిలో నివసించారు. ఈ చిన్నగది మాతృదేవి నివసించడానికి మాత్రమే కాకుండా, సామాన్లు నిల్వచేయ డానికీ, వంటావార్పుకూ, అతిథుల సేవకూ ఉపయోగపడేది. సహనానికి మారు పేరుగాను, సర్దుబాటు గుణానికి ఆవాసంగాను మాతృదేవి విరాజిల్లారు.
ఆ రోజుల్లో మాతృదేవి వెడల్పాటి ఎర్రంచు చీరను ధరించేవారు. నుదుట కుంకుమ పెట్టుకొనేవారు. ఆమె దీర్ఘమైన నల్లటి జడ దాదాపు పాదాలను స్పృశించేది. బంగారు అడ్డిగ, గుండ్రటి నాసికాభరణం, చేతులకు గాజులు, చెవులకు దుద్దులు ధరించేవారు.
నిత్యం మాతృదేవి వేకువనే నిద్ర లేచేవారు. సూర్యోదయానికి మునుపే, జనం తిరుగాడడానికి ముందే స్నానం లాంటి కాలకృత్యాదులు పూర్తిచేసేవారు. పిదప తెల్లవారే దాకా జపధ్యానాలు అనుష్ఠించేవారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెలుపలకు వచ్చేవారు కారు. తదనంతరం జనం తిరుగాడడం ఉండదు కనుక అప్పుడు బయటకు వచ్చి సుదీర్ఘమైన, అందమైన తమ కురులను ఆరబెట్టు కొనేవారు. ఒకసారి ఆలయ అధికారి ఒకరు, “శారదామాత ఇక్కడ నివసిస్తున్నట్లు విన్నాం గానీ ఆమెను ఒక్క రోజు కూడా మేం చూడలేదు” అన్నాడు. ఆ మేరకు మాతృదేవి ఇతరులెవ్వరి కంటా పడకుండా అక్కడ జీవించారు.
ఇతరులు ఎవరైనా గురుదేవులతో ఉన్నప్పుడు ఆయనను చూడడానికి సైతం ఆమె వెళ్లేవారు కారు. గురుదేవుల గది సదా భక్తిపాటలతో, నృత్యంతో, ఆనందపార వశ్యంతో పొంగిపొరలుతూ ఉండేది. మాతృదేవి ఆ దృశ్యాలను నహబత్తు వసారాలో వెదురు చాపల మరుగున నిలబడి తిలకించడం కద్దు. ఎడతెగకుండా చాలాసేపు నిలబడే ఉండడం వలనా, సముచిత వసతులు లేని చోట నివసించడం వలనా మాతృదేవికి కాళ్ల నొప్పులు కలిగేవి. ఆ తరువాత గురుదేవులు, సమీపంలో వసిస్తున్న పరిచయస్థులైన స్త్రీలను వెళ్లి కలుసుకోమని మాతృదేవితో చెప్పారు. అది మాతృదేవికి కాస్త గాలిమార్పుకూ, నడకకూ ఒక అవకాశం కల్పించింది.
సేవ – సాధన
గురుదేవులకూ, ఆయన భక్తులకూ వంటావార్పూ చేయడంలోనే మాతృదేవికి ఎంతో సమయం గడిచిపోయేది. గురుదేవుల జీర్ణకోశం ఎంతో సున్నితం. ఆ కార ణంగా కాళికాలయ ప్రసాదం ఆరగించడం ఆయనకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. అందువలన మాతృదేవి స్వయంగా వంటచేసి ఆయనకు వడ్డించేవారు. ఆయన శక్తి మేరకు ఆరగించేటట్లు ఆమె శ్రద్ధ వహించేవారు. గురుదేవుల గది పరిశుభ్రం చేయడం, ఆయన దుస్తులను ఉతకడం వంటి పనులనూ మాతృదేవి చేసేవారు. గురుదేవుల మాతృమూర్తియైన చంద్రమణీదేవి తన అంతిమ కాలాన్ని దక్షిణేశ్వరంలోని అదే నహబత్తులోని మేడ మీది గదిలో గడిపారు. ఆమెకు కూడా వలసిన సేవలను మాతృదేవి ఏ కొరతా లేకుండా నిర్వర్తించేవారు. భక్తుల సంఖ్య పెరిగేకొద్దీ మాతృదేవికి వంటపని కూడా అధికమయ్యేది. భక్తులలో పలువురు రాత్రి కూడా బసచేసేవారు. కొందరు రోజంతా ఉండేవారు. వారికీ వంట చేసిపెట్టే బాధ్యతను మాతృదేవి తామే స్వీకరించారు. రోజూ సుమారు నాలుగు కిలోల గోధుమ పిండిని బాగా పిసికి చపాతీలు, వాటితో తినడానికి పప్పూ ఆమె తయారుచేసేవారు. అనేక తమలపాకు చిలకలు కూడా చుట్టిపెట్టేవారు.
గురుదేవుల దర్శనార్థం భక్తురాండ్రు కూడా వచ్చేవారు. వారు మాతృదేవితో పాటు నహబత్తులోనే బస చేసేవారు. వచ్చిన వారికి ఉపచారాలు చేయడమూ, బస చేసేవారికి తగిన వసతులు కల్పించడమూ తన బాధ్యతగానే మాతృదేవి స్వీకరించే వారు. భక్తురాండ్రలో కొందరు మాతృదేవితో ఎంతో చనువుగా మెలగడమే కాకుండా, కాలాంతరంలో ఆమె జీవితంలో విశిష్ట పాత్రను పోషించారు. వారిలో గోలాప్ మా, యోగీన్ మా ప్రత్యేకంగా పేర్కొనదగ్గవారు.
1874 వ సం ॥ లో మాతృదేవి తండ్రి గతించారు. తల్లీ, సోదరులు పేద రికంలో మ్రగ్గిపోయారు. మాతృదేవి పుట్టింటి భారమంతా తల్లి శ్యామసుందరీదేవిపై పడింది. వడ్లు దంచి కొంత ఆదాయం ఆమె సంపాదించసాగింది. పుట్టింటికి కూడా మాతృదేవి తమ సేవలను యథాశక్తి అందించారు. జయరాంబాటిలో బసచేసి నప్పుడల్లా వడ్లు దంచే పనిలో తల్లికి, మాతృదేవి తోడ్పడేవారు. ఇంట్లో జగద్ధాత్రి పూజ చేయడం ప్రారంభించిన తరువాతే వారి స్థితి మెరుగుపడింది.
పరులను ప్రేమించడం, వారికి సేవ చేయడం మనిషిగా జన్మించిన ప్రతి వ్యక్తి కర్తవ్యం. దానినే ప్రతిఫలాపేక్ష లేకుండా భగవంతుని కోసం చేసేటప్పుడు అది ఒక ఆధ్యాత్మిక సాధన అవుతుంది. తమకంటూ కేటాయింపబడిన పనులను, అంటే సేవాధర్మాన్ని ఈ రకంగా సేవ–సాధనగా నిర్వర్తిస్తూ నారీలోకానికి ఒక ఆదర్శ మహిళగా మాతృదేవి భాసిల్లారు.
సేవ–సాధన తప్ప మాతృదేవి ఇతర ఆధ్యాత్మిక సాధనల గురించి పూర్తి వివరాలు లభించడం లేదు. కానీ నిత్యం ఉదయమూ, రాత్రీ ఆమె జపధ్యానాలు అనుష్ఠించేవారు. మాతృదేవి తమ్ముడి కుమార్తెయైన నళినితో ఒక సందర్భంలో ఆమె, “వయస్సులో ఉన్నప్పుడు నేను ఎంత పని చేసేదాన్నో! అయినా ప్రతి రోజు ఒక లక్ష నామజపం చేయడానికి సమయాన్ని కేటాయించుకొనేదాన్ని” అని చెప్పారు.
దీనిని మాతృదేవి ఎలా సాధించగలిగారు? ఆమే కాలాంతరంలో స్వామి మాధవానందతో ఇలా చెప్పారు. “ఏం చేస్తాం నాయనా! మేం స్త్రీలం, ఇంటి పనులు ఎప్పుడూ ఉండనే ఉంటాయి; వీటిని వదలి ప్రత్యేకించి జపం చేయడం సాధ్యం కాదు. వంట చేయడానికి పొయ్యి రగిలిస్తాను. బియ్యం బాగా ఉడికి అన్నం తయారయ్యే వరకు జపం చేసుకొంటాను. ఆ తరువాత కూర చేయాలి. అది తయారయ్యే వరకు మళ్లీ జపం చేసుకొంటాను. వంటపని పూర్తి కాగానే మళ్లీ జపం చేసుకొంటాను. నేను చేయగలిగింది ఇంత మాత్రమే. అటువంటప్పుడు గొప్పగా ఆధ్యాత్మిక సాధన నేనెలా చేయగలను?” గృహకృత్యాలూ, కార్యాలయపు పనీ అంటూ బొంగరంలా గిరగిర తిరిగే స్త్రీలకు ఇది ఎంత సముచిత మార్గం!
ఇదే కాకుండా యోగాభ్యాసంలో సైతం మాతృదేవికి ఆసక్తి ఉంది. షడ్చక్రాలు, కుండలిని వంటి వాటిని తామే చిత్రాలు గీసి మాతృదేవికి శిక్షణ నిచ్చారు గురు దేవులు. కనుక మాతృదేవి అధికంగానే సాధనలు అనుష్ఠించారన్నది ముమ్మాటికీ నిజం. అదేవిధంగా సమాధిస్థితి లాంటి అత్యున్నత ఆధ్యాత్మిక అనుభూతులను కూడా మాతృదేవి చవిచూశారు.
దక్షిణేశ్వరంలో గడిపిన రోజులలోనే గురుదేవుల ఆదర్శాన్ని మాతృదేవి పుణికి పుచ్చుకొన్నారు. గురుదేవుల వద్ద పొందిన శిక్షణ, ఆధ్యాత్మిక సాధనలవల్ల ఆమెలో గర్భితంగా ఉండిపోయిన మాతృత్వం బహిర్గతమైంది. గురుదేవుల మూలంగా ప్రారంభం కానున్న ఉద్యమానికి నేతృత్వం వహించడానికి వలసిన పరిపక్వత ఆమెలో పెంపొం దింది. పవిత్రతా స్వరూపిణిగా, సహనానికి ప్రతిరూపంగా, మూర్తీభవించిన ప్రశాంత స్వరూపిణిగా, నిరాడంబరమూర్తిగా అదే సమయంలో దివ్యగాంభీర్యాలు ఉట్టిపడే రీతిలో, వినమ్రశీలిగా, ఆధ్యాత్మికానుభూతి సంపన్నురాలిగా, మిత్ర శత్రు భేదం లేని ప్రేమ శిఖరంగా, సర్వులనూ ఆదుకొనే మాతృమూర్తిగా శారదామాత విరాజిల్లారు.
గురుదేవుల నిర్యాణానంతరం
1886 వ సం ॥ ఆగస్టు 16 వ తేదీ గురుదేవులు మహాసమాధి చెందారు. హైందవ వితంతువులా మాతృదేవి కూడా మంగళకరాలైన బంగారు గాజులనుతీసివేసి, తాము ధరించిన చీర ఎరుపు అంచును చింపివేయడానికి యత్నించారు.అప్పుడు గురుదేవులు మాతృదేవికి సాక్షాత్కరించి, “ఏం చేస్తున్నావు? నేను ఎక్కడకువెళ్లిపోయాను? ఒక గది నుండి మరొక గదిలోకి వెళ్లాను. అంతకంటే మరేమీకాదు” అని చెప్పారు. గురుదేవులు జనన మరణాలకు అతీతులని ఈ అనుభవంమూలంగా మాతృదేవి గ్రహించారు. తాను నిత్య సుమంగళి అని గ్రహించిన మాతృదేవి, గురుదేవుల మహాసమాధి అనంతరంకూడా గాజులను, సన్నని అంచుచీరను ధరిస్తూనే వచ్చారు.
గురుదేవుల మహాసమాధి అనంతరం మాతృదేవి బృందావనానికి తీర్థయాత్రచేశారు. గురుదేవుల శిష్యులలో కొందరు, ఆయన అన్నగారి కుమార్తె లక్ష్మి, గోలాప్ మా ప్రభృతులు ఆమెతో కలిసి వెళ్లారు. కాశీ, అయోధ్య వంటి పుణ్యక్షేత్రాలనుదర్శించిన తరువాత బృందావనం చేరుకొని, అక్కడ ఒక సంవత్సరకాలం గడిపారు.అప్పటికే బృందావనంలో నివసిస్తూన్న యోగీన్ మా కూడా మాతృదేవి బృందంలోచేరింది.
బృందావనంలో మాతృదేవి జీవితం పూజ, ధ్యానం, ఆధ్యాత్మిక అనుభూతులతో వెల్లివిరిసింది. ఈగల, దోమల కాట్లతో ముఖమంతా వ్రణమైపోయినప్పటికీ, ఆ ఎరుకే లేకుండా ఆ రోజుల్లో మాతృదేవి, యోగీన్ మా ధ్యానంలో లీనమై ఉండే వారు.
బృందావనంలో వెలసివున్న అనేక దేవాలయాలను మాతృదేవి దర్శించారు.అనేక మైళ్ల వైశాల్యంగల బృందావనాన్ని కాలినడకనే ఆమె ప్రదక్షిణ చేశారు.రాధారమణ ఆలయాన్ని దర్శించి, “భగవాన్, ఇతరులలో తప్పులు ఎంచే నైజాన్నినాలో నుండి తొలగించివెయ్యి. ఇతరులలో లోపాలు నేనెన్నడూ చూడకుండా ఉండేటట్లు నన్ను అనుగ్రహించు” అని హృదయం ద్రవించే రీతిలో ఆమె ప్రార్థించారు.మాతృదేవి జీవితంలో ఈ సుగుణం, అన్ని సుగుణాలకూ శిఖరాగ్రంగా అమరిందనడం అతిశయోక్తి కాదు. తప్పులు ఎన్నడం ఒకరిని మరింత దిగజారుస్తుందేగాని, ఉన్నత స్థితికి కొనిపోదని ఆమె తరచూ వచించేవారు.
తపోమయ జీవితం
గురుదేవులు తమ అవసాన దశలో మాతృదేవితో ఇలా చెప్పారు: “నా తదనంతరం నువ్వు కామార్పుకూర్కు వెళ్లు. అన్నం, ఆకుకూర మాత్రమే లభించినా వాటితోనే సరిపెట్టుకొని జీవించు. భగవంతుని పవిత్ర నామాన్ని జపిస్తూ సమయాన్నివెళ్లబుచ్చు.” అందువలన బృందావన యాత్రానంతరం మాతృదేవి కామార్పుకూర్కువెళ్లారు. తినడానికి కొద్దిపాటి వడ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. వాటినే దంచి బియ్యం చేసుకొన్నారు. తానే తోటలో శ్రమించి పండించిన ఆకుకూర, అన్నంతోభోజనం పూర్తయిందనిపించేవారు. ఉప్పు కొనడానికి కూడా మాతృదేవి వద్ద అప్పుడు డబ్బు ఉండేది కాదు.
మాతృదేవి బాగోగులు చూసుకోవలసిన గురుదేవుల కుటుంబ సభ్యులు ఆమెను పట్టించుకోలేదు. గురుదేవులకు సహాయ భత్యంగా దక్షిణేశ్వరాలయయాజమాన్యం ప్రతి నెలా ఏడు రూపాయలు ఇచ్చేది. ఆయన నిర్యాణానంతరం ఆపైకం మాతృదేవికి పంపసాగారు. కాని గురుదేవుల అన్నగారి కుమారుడైన రాంలాల్ఆ పైకం మాతృదేవికి అందకుండా ఆపించాడు. ఇంటి వ్యవహారంలో కూడా అడ్డుపడి, గురుదేవుల వాటాగా పూరిపాకను మాత్రం మాతృదేవికి కేటాయించి, అన్ని బాధ్యతల నుండి తప్పుకొన్నాడు. శివరాం, లక్ష్మి ప్రభృత కుటుంబ సభ్యులుమాతృదేవికి ఎలాంటి సహాయమూ అందించలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.వారిద్దరూ అప్పుడు దక్షిణేశ్వర కాళికాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్న రాంలాల్పోషణలో ఉండడమే అందుకు కారణం. అందువలన మాతృదేవి ఏకాకిగా పూరిపాకలో వసించవలసి వచ్చింది.
ఈ రీతిగా మాతృదేవి తమ బంధువుల తృణీకరణానికి గురియై ఏకాంతంలోమ్రగ్గిపోవడం చాలదన్నట్లు, గ్రామస్థుల నిందకు, అపహాస్యానికి, వ్యతిరేకతకులోనైనారు. భర్తను కోల్పోయిన స్త్రీ ఎర్రంచుగల చీరను ధరించడం, చేతికి బంగారుగాజులు ధరించడం వంటివి నాటి సమాజం జీర్ణించుకోలేని అంశాలు. అందువలన ఆమె గ్రామస్థుల నిందాలాపాలకు గురికావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.
కాని మాతృదేవి వీటినన్నిటిని యథాతథంగా స్వీకరించింది. తమ పరిస్థితికి ఎవరినీ తప్పుబట్టలేదు. విధిని ఛీత్కరించలేదు. భగవంతునిపై నింద మోపలేదు.ఎలాంటి ఆదరణా లేని తన నిస్సహాయ స్థితిని గురించి ఎవరికీ వెల్లడించలేదు.భగవంతుని పట్ల అచంచల విశ్వాసం వహించి, సహనంతో జీవితాన్ని గడుపుతూ, తమ జీవితాన్నే తపోమయంగా ఆమె మలచుకొన్నారు.
గురుదేవుల చిన్నతనంలో ఆయనను అభిమానించిన ప్రసన్నమయి మాత్రమే మాతృదేవికి ఓదార్పుగా, సహాయంగా నిలిచింది. ఆవేదన, కష్టాలు ఎదురైనప్పుడల్లామాతృదేవికి, గురుదేవుల దివ్యదర్శనం కలిగేది. ప్రసన్నమయి ఆదరాభిమానాలు, గురుదేవుల దివ్యదర్శనం మాత్రమే గ్రామస్థుల వ్యతిరేకతలో ఆమెకు ఓదార్పు నిచ్చేవి.
ఈ దుర్భర పరిస్థితి ఎక్కువ రోజులు కొనసాగలేదు. మాతృదేవి తల్లియైన శ్యామసుందరీదేవికి తన కుమార్తె అనుభవిస్తూన్న అష్టకష్టాల గురించి తెలియ వచ్చింది. ఆమె ఈ విషయం తన కుమారుడైన ప్రసన్నునికి తెలిపింది. అతడి ద్వారా ఈ విషయం తెలుసుకొన్న గోలాప్ మా వెంటనే మాతృదేవికి సహకరించే బాధ్యతను స్వీకరించింది. గురుదేవుల శిష్యులకు మాతృదేవి దుర్భర స్థితిని తెలిపి, డబ్బు సమకూర్చింది. మాతృదేవిని కలకత్తాకు వచ్చి నివసించమని గురుదేవుల భక్తుల తరఫున వేడుకోవడం జరిగింది. కాని యువ వితంతువైన తాను అన్యుల మధ్య నివసిస్తే ఊళ్లో జనం ఏమనుకొంటారోనని ఆమె సంకోచించారు. తదనంతరం గురుదేవుల శిష్యుల మనస్సులను ఆనందమయం చేస్తూ ఆమె 1888 వ సం ॥ ఏప్రిల్ నెలలో కలకత్తాకు తరలి వెళ్లారు.
ఆధ్యాత్మిక కార్యకలాపం
గురుదేవులు జీవించి ఉన్నప్పటి నుండే మాతృదేవి ఆధ్యాత్మిక కార్యకలాపం ప్రారంభమైనదని చెప్పవచ్చు. గురుదేవులను శరణుజొచ్చిన పలువురు మహిళలు మాతృదేవిని ఆశ్రయించారు. ఆమె నుండి వారు ఎంతో ప్రేరణ పొందారు. తమ శిష్యుడైన శారదా (కాలాంతరంలో స్వామి త్రిగుణాతీతానంద) అనే యువకుణ్ణి మాతృదేవి వద్ద మంత్రదీక్ష పుచ్చుకోమని గురుదేవులు చెప్పారు. దీక్షను ప్రసాదించడం తమ జీవితంలో ఎంతో ప్రధానమైన ఆధ్యాత్మిక కార్యకలాపంగా మాతృదేవి ఎన్ను కొన్నారు. “నేను ఈ మంత్రాలను సాక్షాత్తు గురుదేవుల నుండి పుచ్చుకొన్నాను. ఈ మంత్రాల వలన నిశ్చయంగా పరిపూర్ణ స్థితిని పొందవచ్చు” అని ఆమె చెప్పే వారు.
గురుదేవుల కీర్తి, బోధనలూ వ్యాపించేకొద్దీ, మాతృదేవి వద్దకు వచ్చే భక్తుల సంఖ్య అధికమవసాగింది. దీక్షను ప్రసాదించడంలో మాతృదేవి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు కారు. దీక్ష పుచ్చుకోవడానికి ముందుగానే ఏర్పాట్లు జరిగిన వారికి సామాన్యంగా గురుదేవుల నిత్యపూజ అనంతరం ఆమె దీక్షను అనుగ్రహించే వారు. కాని అనేక సందర్భాలలో పరిస్థితులనూ, సమయాలనూ పట్టించుకోకుండా దీక్షను ప్రసాదించడమూ కద్దు.
మాతృదేవి ఛాయాపటాన్ని కూడా చూడనివారు, ఆమెను కలలో దైవంగా దర్శించి ఉన్నారు. తమ కలలో మాతృదేవి వద్ద మంత్రదీక్షను పుచ్చుకొన్నవారు కొందరున్నారు. వారు ఆమెను ప్రత్యక్షంగా కలుసుకొని మంత్రదీక్ష పుచ్చుకొన్నప్పుడు, కలలో ఆమె వద్ద ఏ మంత్రాన్ని స్వీకరించారో, అదే మంత్రాన్ని ఆమె తమకు ఇవ్వడం వారికి అనుభవైకవేద్యం.
సామాన్యంగా మంత్రదీక్ష ఇవ్వడానికి మాతృదేవికి ఒకటి రెండు నిమిషాలే పట్టేవి. ఆధ్యాత్మికంగా ఆమె అత్యున్నత స్థితిలో ఉన్నందున దీక్షకు సముచిత మంత్రం ఆమెకు చటుక్కున స్ఫురించడమే ఇందుకు కారణం. దీన్ని గురించి ప్రస్తావిస్తూ మాతృదేవి ఒక సందర్భంలో ఇలా చెప్పారు: “కొందరికి నేను ఉపదేశింపదలచుకో గానే నా మనస్సులో, ‘ఇది చెప్పు, అది చెప్పు’ అని స్ఫురించేది. కొందరికి మంత్రోప దేశం చేస్తూన్నప్పుడు నా మనస్సులో ఏదీ స్ఫురించేది కాదు. మౌనంగా అట్లే కూర్చుండిపోయేదాన్ని. చాలాసేపు దీర్ఘంగా ఆలోచించిన పిదప వారికి తగిన మంత్రం నా మనోనేత్రం ముందు కానవచ్చేది.”
సంఘ జనని
సన్న్యాసులకూ, గృహస్థులకూ మంత్రదీక్ష అనుగ్రహించి వారిని ఆధ్యాత్మిక పథంలో పయనింపజేయడంతోపాటు మరో ముఖ్యమైన బాధ్యతను కూడా మాతృదేవి స్వీకరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన రామకృష్ణ సంఘ బాధ్యతే అది.
మాతృదేవి 1888 వ సం ॥ ఏప్రిల్‌లో గయకు వెళ్లారు. అక్కడ, బుద్ధగయలో హైందవ సన్న్యాసుల మఠం ఒకటి చూశారు. సన్న్యాసులు బస చేయడానికీ, భోజ నానికీ తగిన ఏర్పాట్లు అక్కడ చేయబడి ఉన్నాయి. కాని అదే సమయంలో గురు దేవుల సన్న్యాస శిష్యులు నివసించడానికి తగిన స్థలం లభించక పేదరికంతో అలమటిస్తున్నారు. తమ బిడ్డల బీదస్థితిని ఈ సాధువుల స్థితితో పోల్చి చూసిన మాతృదేవి మనస్సు ఎంతో ఆవేదనకు గురైంది.
దీనిని గురించి ఆమె ఇలా చెప్పేవారు: “ఓ! వీరి కోసం గురుదేవులను కన్నీరుమున్నీరై ఎంతగా ప్రార్థించానో తెలుసా? ఆ తరువాతే ఆయన కృపాకటాక్షంతో ఈ మఠం (బేలూరు మఠం) వెలసింది. గురుదేవుల నిర్యాణానంతరం ఆయన సన్న్యాస శిష్యులు తమ ఇల్లూవాకిళ్ల నన్నిటిని త్యజించి ఒక అద్దె ఇంట్లో బస చేశారు. తపోమయ జీవనం సాగిస్తూ ఏకాకులై అటూ ఇటూ తిరుగాడారు. ఇది నాకు ఎంతో మనోవేదనను కలిగించింది. నేను గురుదేవులను, ‘భగవంతుడా! మీరు ఈ దివిపైకి వేంచేశారు. వారిలో కొంతమందితో క్రీడించారు. తరువాత నిష్క్రమించారు. ఇంతటితో సమస్తం ముగిసిపోయిందా? అదే నిజమైతే మీరు ఈ ఇలలోకి వచ్చి ఇన్ని కష్టాలకు ఎందుకు గురియైనారు? వీథుల వెంట తిరిగి భిక్ష సేకరించి, దాన్ని భుజించి చెట్టు నీడన పడి ఉన్న సాధువులను అనేకులను నేను బృందావనంలోనూ, కాశీలోనూ చూశాను. అటువంటి సాధువులకు ఈ దేశంలో కొరత లేదు! మీ పేరిట సర్వస్వమూ త్యజించిన నా బిడ్డలు ఆహారార్థం బిచ్చమెత్తు కోవడాన్ని నేను సహించలేను. మీకు నా ప్రార్థన ఇదే: మీ పేరు చెప్పుకొని తమ సర్వస్వాన్ని త్యజించిన వారికి సామాన్యమైన తిండీ బట్టా లభించాలి. వారు మీ ఉపదేశాలను, ఆదర్శాన్ని కేంద్రంగా చేసుకొని ఒకేచోట అంతా కలసి నివసించాలి. ప్రాపంచిక జీవనంతో దుఃఖీతులైన జనం వారిని ఆశ్రయించి, మీ బోధనలు విని ఓదార్పు పొందాలి. అందుకోసమే కదా మీరు అవతరించింది! వారు ఇలా ఇల్లూ వాకిలీ లేక సంచరించడాన్ని నేను సహించలేకపోతున్నాను’ అని ప్రార్థించాను. ఆ తరువాతే నరేన్ క్రమక్రమంగా దీనినంతా రూపొందించాడు.”
గురుదేవుల యువశిష్యులు బారానగర్‌లో ప్రారంభించిన రామకృష్ణ మఠానికి, తమ ప్రార్థన మూలంగా మొదటి బీజం నాటింది మాతృదేవియే. ఆ కారణంగానే శారదామాతను ‘సంఘ జనని’ అని కీర్తిస్తున్నారు. రామకృష్ణ ఉద్యమ పరివ్యాప్తిలో మాతృదేవి పాత్ర ఎంతో ప్రాధాన్యం సంతరించుకొంది. తొలి దశలో మాతృదేవి నేతృత్వంలోనే గురుదేవుల శిష్యులు మెలగారు. చారిత్రక ప్రాముఖ్యాన్ని పొందిన ఈ సంఘానికి సారథిగా ఒక మహిళను ఆరాధించడం మహిళా లోకానికే గర్వకారణం!
కుటుంబ పరిధిలో
కామార్పుకూర్ విడిచి వచ్చాక పుట్టింటితో మాతృదేవి సన్నిహిత సంబంధం ఏర్పరచుకొన్నారు. ఇంటికి పెద్ద శారదామాత. అందువలన కుటుంబ బాధ్యతలను తామే చేపట్టారు. మాతృదేవి కుటుంబం: తల్లి శ్యామసుందరీదేవి, తమ్ముళ్లు ప్రసన్న కుమార్, వరద ప్రసాద్, కాళికుమార్, అభయచరణ్. మాతృదేవి సోదరులు లౌకికులు. ఆమె ఆదరాభిమానాలు పొందడానికి వారు పరస్పరం పోటీ పడేవారు.
ధనం కోసం పోట్లాడుకొనే సంతోషరహితమైన కుటుంబ పరిస్థితులు ఒక వైపు, తమ సర్వస్వాన్ని త్యజించిన సన్న్యాస శిష్యులూ, మాతృదేవి పట్ల ఎనలేని భక్తిప్రపత్తులు గల భక్తబృందం మరొక వైపు! ఇలా పరస్పర విరుద్ధమైన పరిస్థితుల్లో మాతృదేవి జీవితం కొనసాగింది.
మాతృదేవి ఆఖరి తమ్ముడు అభయచరణ్ గుణవంతుడు. డాక్టరు చదువు కొంటున్న అతడు హఠాత్తుగా మరణించాడు. మరణించేటప్పుడు అతడి భార్య సురబాల గర్భిణి. ఆమెకు అంతగా మతిస్థిమితం ఉండేది కాదు. అభయచరణ్ తన భార్యనూ, పుట్టబోయే బిడ్డను ఆదుకోవాలని మరణ సమయంలో మాతృదేవి వద్ద వాగ్దానం చేయించుకొన్నాడు. ఆమె కూడా అందుకు సమ్మతించారు. అంతగా మతిస్థిమితం లేని ఆమెకు జన్మించిన బిడ్డయే రాధు. సహజంగానే మొండిపట్టు, వక్రబుద్ధిగల ఈమె మాతృదేవికి జీవితాంతం ఒక భారంగా ఉండిపోయిందంటే అతిశయోక్తి కాదు.
మాతృదేవి మరొక తమ్ముడైన ప్రసన్నకుమార్‌కు నళిని, మాకూ అని ఇద్దరు ఆడపిల్లలు. రాధు, ఆమె తల్లి, నళిని, మాకూ మాతృదేవినే ఆశ్రయించి జీవిం చారు.
తమ్ముళ్ల స్వార్థపరత్వం, వాళ్లు వెళ్లబోసుకొనే అసూయ, సంప్రదాయాన్ని పాటించాలనే నళిని పట్టుదల, రాధు వక్రబుద్ధి, ఆమె వెర్రిబాగుల తల్లి అంతా కలిసి మాతృదేవికి దుర్భర వేదనను కలిగించేవారు. ఇటువంటి భరించలేని పరిస్థితుల్లోనూ మాతృదేవి తాముగా స్వీకరించిన బాధ్యతలను సహనంతోనూ, ఏవగించుకోకుండానూ నిర్వహించారు. ఇలాంటి భయంకరమైన కుటుంబ వాతావరణంలోనే మాతృదేవి జీవితం గడిచింది. ఇటువంటి పరిస్థితులలో సైతం ఆమె సహనం కోల్పోకుండా, కలత చెందకుండా, వైరాగ్యంతో జీవించిన తీరుతెన్నులు ఎల్లరకూ ఆదర్శప్రాయమై ఒప్పారుతాయి.
మాతృదేవి నిరాడంబర జీవన సరళి
మాతృదేవి జీవితంలో ప్రాధాన్యం వహించే ప్రదేశాలు నాలుగు. అవి: దక్షిణేశ్వరం, ఉద్బోధన్, జయరాంబాటి, కోల్పారా.
దక్షిణేశ్వరంలో నివసిస్తూన్న రోజుల్లో మాతృదేవిని బయటి ప్రపంచం ఎరుగదు. గురుదేవుల సన్నిహిత శిష్యురాండ్రు కొందరు మాత్రమే ఆమె జీవితంలో పాలు పంచుకొన్నారు.
మొదటి రోజులలో మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు భక్తుల ఇళ్లలోను, అద్దె ఇళ్లలోను వసించేవారు. తరువాత కాలంలో ఆమె నివాసానికి ఉద్బోధన్ భవనం నిర్మించబడింది. మాతృదేవి సేవకులలో ఒకరూ, రామకృష్ణ మిషన్ ప్రధాన కార్యదర్శీ అయిన స్వామి శారదానంద 1909 వ సం ॥ లో ఈ ఉద్బోధన్ను కట్టించారు. రామకృష్ణ మఠ వంగ మాసపత్రిక ‘ఉద్బోధన్.’ దీని మూలంగా ఆ ఇల్లు కూడా ఉద్బోధన్గానే పేర్కొనబడింది. మేడ మీద మాతృదేవీ, ఆమె కుటుంబమూ, భక్తురాండ్రూ వసించేవారు. క్రింది భాగంలో సన్న్యాసులు వసించేవారు. పత్రిక కార్యాలయాన్ని కూడా క్రింది భాగంలోనే నెలకొల్పారు.
ఉద్బోధన్లో మాతృదేవిని కలుసుకోవడానికి భక్తులు నిర్ణీత వేళల్లోనే అనుమతింపబడేవారు. అప్పుడు కూడా ఆమె పూర్తిగా మేలిముసుగు కప్పుకొని కూర్చొని ఉండేవారు. అందువలన అమ్మతో కాస్త సన్నిహితంగా మెలగాలని, సేవలు అందించాలని ఆశించేవారు జయరాంబాటికి వెళ్లి మాతృదేవిని దర్శించుకో వలసి వచ్చేది.
జయరాంబాటిలో ఉన్నప్పుడు సులభంగానే ఆమెను సమీపించవచ్చు. సదా ఆమె ముఖాన్ని మేలి ముసుగుతో కప్పుకొని ఉండరు. అక్కడ ఆమె తమ సోదరుల ఇంట్లో బసచేసేవారు. వాటిని ఇళ్లు అనడం కంటే పూరిపాకలు అనడం సబబు. తదనంతర కాలంలో మాతృదేవికంటూ ఒక ఇల్లు కట్టించారు. ఆ నూతన గృహంలో మాతృదేవి 1916 వ సం ॥ మే నెలలో అడుగుపెట్టారు.
తరువాతి ప్రదేశం కోల్పారా. కలకత్తాకు వచ్చే దారిలో, జయరాంబాటికి ఇది ఏడు కిలో మీటర్ల దూరంలో ఉంది. తొలి రోజుల్లో మాతృదేవి కేదార్నాథ్ సర్కార్ అనే భక్తుని ఇంట్లో బస చేసేవారు. తరువాత కాలంలో ఆ ఇల్లే మఠంగా రూపుదిద్దుకొంది. రాధూకు అనారోగ్యం కారణంగా కొంత ఏకాంతమైన చోటు కావాల్సి వచ్చినప్పుడు అక్కడకు దాదాపు ఒక కిలో మీటరు దూరంలో ఒక గదిని కట్టించారు. అదే జగదంబ ఆశ్రమం. ఇక్కడ కూడా మాతృదేవి బస చేశారు, భక్తులను కలుసుకొన్నారు.
మాతృదేవి జయరాంబాటి, ఉద్బోధన్ లేదా మరెక్కడ ఉన్నా, దక్షిణేశ్వరపు రోజులలాగే వేకువజామున మూడింటికే నిద్ర లేచేవారు. లేవగానే ముందు గురు దేవుల చిత్రపటాన్ని చూసేవారు. ఏ వేళలోనూ గురుదేవులను వదలి ఉండడానికి ఇష్టపడరు కనుక ఆమె పూజా గృహంలోనే నిద్రించేవారు. ఆ తరువాత ఇతర పనులు చూసుకోవడానికై అక్కడ నుండి వెళ్లడానికి తనకు అనుమతి ఇవ్వమని ఆయనను ప్రార్థించేవారు. ఉదయం ఆరు గంటల దాకా పడక మీద కూర్చొనే జప మాల తిప్పుతూ జపం చేసుకొనేవారు. పిదప గురుదేవులను పీఠం మీద ఆసీనులను చేసి ఆయనకు ఉదయకాల నైవేద్యం అర్పించేవారు. జయరాంబాటిలో ఉన్నప్పుడు ఇంటిని ఊడ్చి శుభ్రపరచేవారు. వంటకు కావలసిన కూరగాయలు తరిగేవారు. ఆ సమయంలో తమతోపాటు వసిస్తున్న వారితో మాట్లాడేవారు. ఆరోగ్యం బాగున్నన్ని రోజులు పాత్రలు తోమడం, చెరువు నుండి నీరు తీసుకురావడం, వడ్లు దంచడం లాంటి శ్రమతో కూడుకున్న పనులు చేసేవారు. పూజకు కావలసిన పువ్వులు సేకరించడమూ, పండ్లను కోయడమూ మామూలుగా ఆమే చేసుకొనేవారు. కొన్ని సందర్భాలలో ఆమె తమ్ముని కుమార్తెలుగాని, భక్తులుగాని ఈ పనులలో సాయ పడేవారు. ప్రతిరోజు గురుదేవుల నైవేద్యానికి, భక్తులకు ఇవ్వడానికి వందకు పైగా తమలపాకు చిలకలు చుట్టేవారు.
ఉదయం ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల లోపు గురుదేవులకు నిత్యపూజ ముగించేవారు. మంత్రదీక్ష నిమిత్తం వచ్చిన వారికి మంత్రదీక్ష ప్రసా దించేవారు. తరువాత గురుదేవులకు నివేదించిన పండ్లు, తీపి పదార్థాలను భక్తులకు, ఇంట్లో వారికి పంచిపెట్టేవారు. పది గంటల లోపు పూజ ముగించాలనే విషయంలో మాతృదేవి ఎంతో కచ్చితంగా ఉండేవారు. పూజ బాధ్యతను స్వీకరించిన సన్న్యాస శిష్యులు ఇంతకంటే ఎక్కువగా ఆలస్యం చేయడాన్ని ఆమె ఇష్టపడే వారు కారు. ఎందుకంటే పూజ పూర్తిచేసి ప్రసాదం తీసుకొన్న తర్వాతనే అందరూ భోజనం చేయాలి కనుక. పూజ పూర్తయ్యాక కొంత తీపినో, గురుదేవుల ప్రసా దంలో మిగిలిన పండ్లనో ఆరగించి మాతృదేవి ఉదయం అల్పాహారాన్ని ముగించేవారు.
ఆ తరువాత వంట ఇంట్లోకి వెళ్లి వంటమనిషిని భోజనానికి, ఆమె సొంత పనులు చూసుకోవడానికి పంపించివేసి, వంటపని తామే చూసుకొనేవారు. ఇంట్లో ఏది వండుతారో దానినే గురుదేవులకు నివేదించేవారు. ఆయనకు ఇష్టమైన కూర గాయలు వండితే ఆమె ఎంతో సంతోషించేవారు. గురుదేవులకు ప్రత్యేకంగా వండేటప్పుడు వంటలో ఉప్పు, లవంగాలు మొదలైన సుగంధద్రవ్యాలు, తక్కువగా కారమూ వేసేవారు. పగలు పదకొండు గంటలకు స్నానంచేసి గురుదేవులకు వంటకాలను నివేదనం చేసేవారు. ఆ తరువాత ఇంట్లోని వారంతా కలిసి కూర్చుని భోజనం చేసేవారు.
మాతృదేవి నిద్రాహారాలు ఎంతో స్వల్పం. రాత్రి పదకొండు గంటలకు పడు కొని, వేకువన మూడు గంటలకే నిద్రలేచేవారు. వెన్నెల రాత్రుల్లో అంతకంటే ముందే మేల్కొనేవారు. రోజూ ఆమె ముమ్మార్లు ఆహారం తీసుకొనేవారు. ఉదయం తీసుకొనే ఆహారం, రాత్రి భోజనం తక్కువగా ఉండేవి. కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండడం వలన, శీతలం కలిగించే పదార్థాలను ఎప్పుడో ఒక్కసారి స్వల్పంగా తీసుకొనేవారు. తీపి పదార్థాలను ఇష్టంగా తినేవారు. మామిడిపళ్లు, కాస్త పుల్లనివి ఆమెకు ఎంతో ఇష్టం.
మొదట్లో మాతృదేవి స్వయంగా అందరికీ భోజనం వడ్డించి, వారు భోజనం చేశాక తాము భోజనానికి కూర్చునేవారు. అందుచేత ఆమె భోజనం ఎంతో ఆలస్యమయ్యేది. తదనంతర కాలంలో భక్తులు ప్రత్యేకించి ప్రార్థించడంతో, అంతా భోజనానికి కూర్చున్నారో లేదో సక్రమంగా అందరికీ వడ్డించారో లేదో స్వయంగా పరిశీలించిన తరువాత ఆమె కూడా భోజనానికి కూర్చునేవారు. భోజనం ముగించిన భక్తులు మాతృదేవి ప్రసాదం కోసం ఎదురుచూసేవారు. ఆమె తమ విస్తరాకులో ఉన్న పాలన్నం, తీపి పదార్థాలు కలిపి, చిన్న ఉండలుగా చేసి వారికి పంపేవారు. తరువాత కాసేపు భక్తులతో ముచ్చటించేవారు.
మధ్యాహ్నం మూడు గంటల దాకా విశ్రాంతి తీసుకొని గురుదేవులను నాలుగు గంటలకు మేల్కొల్పేవారు. కొంతసేపు గదిలో కూర్చొని జపమాల లేకుండా జపం చేయడమో లేదా భక్తులతో ముచ్చటించడమో జరిగేది. సాయంత్రం గది బయటకు వచ్చి వసారాలో కూర్చొనేవారు. వంటపని ఎక్కువగా ఉంటే వంటమనిషికి సాయం చేసేవారు. సాయంత్రం ఆరతి తదుపరి గురుదేవులకు నివేదనం చేసిన తీపి పదార్థాలలో కొంచెం స్వీకరించి, పడక మీద కూర్చొని ప్రగాఢ ధ్యానంలో లీనమైపోయేవారు. గురుదేవులకు రాత్రి తొమ్మిదింటికి ఆహారం నివేదించేవారు. తొమ్మిదిన్నరకు భక్తులు భోజనం చేసేవారు. లూచీ అనబడే చిన్న పూరీలు రెండు లేక మూడు, కొద్దిగా కూర, కాసిని పాలు మాతృదేవి పుచ్చుకొనేవారు. రాత్రి పదకొండు గంటలకు నిద్రకు ఉపక్రమించేవారు.
మాతృదేవి రోజుకు నాలుగుసార్లు దంతధావనం చేసేవారు. కొబ్బరి మట్టలను, పొగాకును కలిపి భస్మం చేసి, ఆ పొడిని పళ్ల పొడిగా వాడేవారు.
కలకత్తాలో కూడా ఆమె జీవన సరళి ఇలాగే ఉండేది. స్నానం మాత్రం కొంత ముందుగా చేసేవారు. రెండు రోజుల కొకసారి గోలాప్ మాతో కలిసి గంగలో స్నానం చేసేవారు. గోలాప్ మా, యోగీన్ మా ఆమెతోపాటే ఉండి, ఇంటి పనులు చూసుకొనేవారు. అందువలన జయరాంబాటిలో ఉన్నప్పటి కంటే కలకత్తాలో ఉన్నప్పుడు ఇంటిపని తక్కువగా ఉండేది. మాతృదేవికి సాధ్యం కానప్పుడు, గురు దేవులకు నివేదనం చేయడం తప్ప, ఇతర పూజాకార్యాన్నంతా సన్న్యాస శిష్యులు చూసుకొనేవారు.
పని ఒత్తిడి తక్కువగా ఉన్నప్పటికీ కలకత్తాలో మాతృదేవి జీవితం ఎంతో శ్రమభరితంగానే సాగింది. మంత్రదీక్ష నిమిత్తమూ, నిత్యజీవితంలో తాము పడుతున్న బాధలను గురించి చెప్పి ఓదార్పు పొందడానికీ జనం వస్తూనే ఉండేవారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశ్రాంతికోసం ఆమె పడుకోవడానికి ప్రయత్నించేవారు. ఆ సమయంలోకూడా, సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లిపోయే భక్తురాండ్రు ఆమె చెంతచేరి ఏవో ప్రశ్నలు వేసేవారు. వాటికి మాతృదేవి పడుకొనే జవాబులు ఇచ్చేవారు.
సాయంత్రం ఐదున్నర తరువాత భక్తులు (పురుషులు) మాతృదేవి దర్శనార్థం అనుమతించబడేవారు. అప్పుడు భక్తురాండ్రు ప్రక్క గదిలోకి వెళ్లిపోయేవారు. భక్తులు వచ్చేటప్పుడు మాతృదేవి శరీరాన్నంతా కప్పుకొని ఒక మంచం మీద కూర్చొనేవారు. భక్తులెవరైనా మాతృదేవి ఆరోగ్యం గురించో, మరో విషయం గురించో అడిగితే ఆమె సంజ్ఞల ద్వారానో లేదా హీనస్వరంలోనో బదులు చెప్పేవారు. దేనిని గురించియైనా వివరంగా మాట్లాడదలిస్తే ఇతరులందరూ వెళ్లిపోయేటంత వరకు ఆ వ్యక్తి వేచి ఉండేవాడు. ఆ భక్తుడు పరిచయస్థుడైతే మాతృదేవి ఆతడి ప్రశ్నలకు ప్రత్యక్షంగా బదులు చెప్పేవారు. కాకపోతే ఆమె హీనస్వరంలో చెప్పిన జవాబును శిష్యులు బిగ్గరగా చెప్పి, వినిపించేవారు. మంగళ, శనివారాలలో, పండుగ రోజుల్లో మాతృదేవి దర్శనానికి జనం పెద్దసంఖ్యలో వచ్చేవారు. ఆ రోజు లలో మాతృదేవి ఎంతో శ్రమపడవలసి వచ్చేది. కొన్ని సందర్భాలలో గంటల తరబడి కూర్చోవలసి వచ్చేది.
వస్త్రధారణలో మాతృదేవి ఎంతో నిరాడంబరంగా ఉండేవారు. సనాతన వంగ సంప్రదాయానుసారం చీరను శరీరమంతా చుట్టుకొని ధరించేవారు. రవికెనో, కుట్టిన మరో వస్త్రాన్నో, పాదరక్షలనో ఆమె ధరించేవారు కారు. గొడుగునుకూడా ఆమె ఉపయోగించి ఎరుగరు. వర్షం పడుతున్నప్పటికీ తడుస్తూనే వెళ్లేవారు; పిదప తడిసిన దుస్తులను మార్చుకొనేవారు. పసిపిల్లలా సరళ స్వభావురాలైన మాతృదేవి, వస్త్రధారణలో, ఆహారంలో, మడి తదితర ఆచార వ్యవహారాదులలో అంతే సరళంగాను, నిరాడంబరంగాను వ్యవహరించేవారు.
మహాసమాధి
1919 వ సంవత్సరాంతం నుండి మాతృదేవి ఆరోగ్యం క్రమేణా దిగజార సాగింది. తరచుగా జ్వరం రాసాగింది. ముందుగా గ్రామంలో లభ్యమయ్యే అన్ని వైద్యాలనూ చేయించారు. కాని ఎలాంటి ప్రయోజనమూ కనిపించకపోవడంతో, ఎంతో అపాయకర పరిస్థితిలో మాతృదేవిని కలకత్తాకు తోడ్కొని వచ్చారు. ఆమె ‘కాలాహజార్’ అనే జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారణ చేశారు. ఆ కాలంలో ఈ వ్యాధికి తగిన మందు కనుగొనబడలేదు.
1920 వ సం ॥ జూలై నెల 20 వ తేదీ వరకు, అంటే తమ తుదిశ్వాస విడిచే దాకా మాతృదేవి ఈ వ్యాధితో బాధపడ్డారు. ఆ రోజుల్లో మాతృదేవి ఒక సారి స్వామి శారదానందను పిలిచి, “శరత్! నేను వెళ్లిపోతున్నాను. యోగీన్, గోలాప్ ప్రభృతులు ఉన్నారు. వారినందరినీ చూసుకో నాయనా!” అని చెప్పారు.
మాతృదేవి నిర్యాణానికి ఐదు రోజులకు ముందు, అన్నపూర్ణ తల్లి అనే భక్తు రాలు ఆమెను చూడడానికి వచ్చింది. మాతృదేవి లేని భవిష్యత్కాలం గురించి యోచిస్తూ ఆమె కన్నీరు మున్నీరై విలపించడం చూసి, వారు, “నువ్వు గురుదేవులను చూశావు. అటువంటప్పుడు ఎందుకు భయపడతావు? నీకొక విషయం చెబుతాను తల్లీ! నువ్వు మానసిక శాంతి కోరుకొంటే ఇతరులలో తప్పులు ఎంచవద్దు. అందుకు మారుగా నీలోని తప్పులను చూసుకో. ఈ ప్రపంచాన్ని నీ సొంతంగా చూడడం అలవరచుకో. ఈ లోకంలో అన్యులు ఎవరూ లేరు. ఈ ప్రపంచం యావత్తూ నీ సొంతమే,” అని బోధించారు.
మాతృదేవికి శ్వాసించడం ఎంతో భారమైపోయింది. ఇలా కొంత కాలం గడి చింది. హీనస్వరంలో మళ్లీ ఆమె, “వచ్చిన వారందరికీ, రాని వారందరికీ, ఇకపై రాబోతున్న వారందరికీ, ఈ నా బిడ్డలందరికీ నా ప్రేమాభిమానాలను తెలియచెయ్యి. నా ఆశీర్వాదాలు వారికెప్పుడూ ఉంటాయి” అని చెప్పారు.
ఇదే మాతృదేవి మానవాళికి ఒసగిన అంతిమ సందేశం.
1920 వ సం ॥ జూలై 20 వ తేదీ అర్ధరాత్రి ఒకటిన్నరకు మాతృదేవి శారదామాత మహాసమాధి పొందారు. మరుసటి రోజు మాతృదేవి దివ్య కాయాన్ని ఊరేగింపుగా బేలూరు మఠానికి తీసుకువెళ్లారు. అక్కడ గంగాతీరంలో దహనం చేశారు. ఆ స్థలంలోనే ఇప్పుడు ఒక అందమైన దేవాలయం వెలసివుంది.
ఈ లోకంలోకి మనుష్యులు వస్తూనే ఉన్నారు. అంతంలేని ఈ మానవ ప్రవాహంలో మాతృదేవి తేజోవిరాజమానంగా ప్రకాశిస్తూన్నారు. మాతృదేవి నిష్కళంక నైజం కఠిన హృదయాలను సైతం ద్రవింపచేస్తుంది. ఆమె పరులలో తప్పులు ఎంచి ఎరుగరు. ఆమె అవ్యాజ ప్రేమకు అర్హతానర్హతల తారతమ్యం లేదంటే అతిశయోక్తి కాదు. ఆమె దృక్పథంలో శ్రేష్ఠ సన్న్యాసీ, పాపీ ఇద్దరూ సమానులే. ఇద్దరూ మాతృ దేవికి అనుంగు బిడ్డలే. మానవాళిని మాతృప్రేమతో చేరదీసుకొన్న విశాల హృదయం ఆమెది. లోకుల శ్రేయస్సు కోసం కృషి చేయడాన్ని, శ్రమించడాన్ని భాగ్యంగా పరిగణించిన మనోవైఖరి మాతృదేవిది.
ఎనలేని తన మాతృప్రేమ పరిధిలోకి మానవాళిని ఆకర్షించి, అత్యంత మధురమైన స్త్రీత్వపు ఆప్యాయతానురాగాలను వారికి చవిచూపారు. స్త్రీత్వం ఆరా ధింపబడే చోట, మాతృత్వ త్యాగం పరిఢవిల్లే చోట, దంపతులు పారమార్థిక జీవితం గడిపేచోట, తమ దైనందిన కర్తవ్యాలను నిర్వహిస్తూ మనుష్యులు ఆదర్శ జీవితం గడిపే చోట మాతృదేవియైన శ్రీ శారదామాత నేటికీ, కాదు కాదు, ఎల్లప్పటికీ విరాజిల్లుతూనే ఉంటారు.