వీడని బంధం
“నాతోబాటు జీవితాంతం నువ్వు జీవించాలి గాక! రా, మనం వివాహం చేసుకొందాం. సుఖాన్ని ఆశిస్తూ నేను ప్రాణిగ్రహణం చేస్తున్నాను”* అంటూ అగ్నిసాక్షిగా ఒక పురుషుడు ఒక స్త్రీని పాణిగ్రహణం చేసే వీడని బంధం వివాహబంధం మానవ బాంధవ్యాలలో అత్యున్నతస్థానాన్ని పొందివుంది. గిరగిరా తిరుగుతూపోయే ప్రపంచ చక్రపు నిరాటంక మనుగడకు ప్రకృతి విధించిన బంధమే అది! శ్రేష్ఠులైన వారసు లను ప్రసాదించే ఒక పవిత్ర యజ్ఞమనే భావనతోనే వివాహాన్ని మన ప్రాచీనులు పరిగణించారు. ఈ ఆదర్శం నుంచి వైదొలగినప్పుడు వివాహం పవిత్రతను కోల్పో తుంది. నిమ్నస్థితికి దిగజారుతుంది. ప్రస్తుత సమాజంలో ఆ స్థితే చోటుచేసు కొంది. దారితప్పిన సమాజానికి ఆదర్శప్రాయమైన మార్గాన్ని చూపడమే శారదా శ్రీరామకృష్ణుల అవతార ఉద్దేశమని ప్రారంభంలోనే చెప్పివున్నాం.
కామరహిత ప్రేమ
శారదాదేవీ, శ్రీరామకృష్ణులూ కామవాంఛ తమ జీవితాలలో ప్రవేశించ రాదనే విషయంలో ఎంతో అప్రమత్తత వహించారు. చరిత్ర ఇంతదాకా కనీవినీ ఎరుగని ఆధ్యాత్మిక సాధనలను పన్నెండు సంవత్సరాలు నిరంతరాయంగా అనుష్ఠించి శ్రీరామకృష్ణులు తమను పూర్తిగా భగవంతుని పరికరంగా మలచుకొని, అర్పించుకొన్నారు. ఆయన మనస్సేకాక దేహం సైతం దివ్యత్వాన్ని సంతరించుకొన్నది. ఆయనలో విషయ వాంఛలు అణుమాత్రమైనా ఉండడానికి ఆస్కారమే లేదు. కానీ శారద ఇప్పుడిప్పుడే సాధనాపథంలో అడుగిడుతున్నది. ఆమె మనస్సు ఎలాంటి స్థితిలో ఉందోనన్న సంశయం ఆయనకు కలిగింది. ఒక రోజు తమ సంశయాన్ని నేరుగా ఆమెకే, “అవును శారదా! నన్ను లౌకిక లంపటంలోకి లాగడానికే నువ్వు వచ్చావా?” అంటూ వ్యక్తంచేశారు. తక్షణమే సూటిగా వచ్చింది జవాబు: “కానే కాదు. నేనెందుకు మీ జీవితాన్ని పాడుచేయాలి? మీ సాధనలో సాయపడడానికే వచ్చాను” అంది శారద. ఆమె జవాబులో లేశమైనా లౌకికత లేదు. శ్రీరామకృష్ణుల మనస్సు తేలికపడింది. “ఆమె అంత పావని కాకపోయివుంటే, నేను కూడా ఇంద్రియ వివ శుడనై, లౌకిక జీవితంలో మునిగిపోయి ఉండనని నిశ్చయమేమిటి? వివాహా నంతరం కాళీమాతను నేను, ‘అమ్మా! ఈమె మనస్సులో నుండి కామగంధాన్ని పూర్తిగా తొలగించివేయి’ అంటూ ప్రార్థించాను. నా ప్రార్థన నూటికి నూరుపాళ్లూ ఈడేరడం శారద జీవితంలో కనిపించింది” అంటూ కాలాంతరంలో జ్ఞాపకం తెచ్చుకొని శ్రీరామకృష్ణులు చెప్పేవారు.
శ్రీరామకృష్ణుల ప్రశ్నకు శారద ఠక్కున జవాబు చెప్పినప్పటికీ, ఆ ప్రశ్న ప్రశ్నగానే ఆమెలో నిలిచిపోయింది. ఒక రోజు రాత్రి శ్రీరామకృష్ణుల పాదాలు ఒత్తుతూ ఆమె, “అవును, నన్ను మీరెలా చూస్తున్నారు?” అని అడిగింది. తక్షణమే శ్రీరామకృష్ణులు, “ఎందుకు? మాతగానే! ఆనందస్వరూపిణియైన జగజ్జనని స్వరూపంగానే నిన్ను చూస్తున్నాను. ఆలయంలో విగ్రహ రూపంలోని ఆమే, ఈ దేహాన్ని కనిన తల్లిగా నహబత్తులో! ఇప్పుడు ఆమే నా పాదాలు ఒత్తుతున్నది” అని అన్నారు. శారదకు అంతా అర్థమైపోయింది. ఈయనకూ పిచ్చికీ ఎలాంటి సంబంధం లేదనే కాక, మనస్సులో స్పష్టతగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ వ్యక్తి ఈయన మాత్రమే అని కూడా ఆమెకు చక్కగా అవగతమయింది.
శారదా రామకృష్ణులలో ఏవైనా సంశయాలు ఉండిన పక్షంలో అవన్నీ పటాపంచలైపోయినాయి. కలసి ఉంటున్న రోజులలో పరస్పరం సహాయం చేసుకొంటూ ఉన్నత జీవితం గడపాలనే తీర్మానంతో ఇద్దరూ జీవించసాగారు. శారద పగటివేళ నహబత్తులోనూ, రాత్రిపూట శ్రీరామకృష్ణుల గదిలోనూ గడి పింది. ఒకే గదిలోనే కాక ఒకే పరుపు మీదే ఇద్దరూ శయనించారు కూడా.
ఆదర్శ జీవితం
ఇక్కడ మనం కాస్త యోచించాలి. శ్రీశారదాదేవి జీవిత చరిత్రకారులలో ఒకరైన శ్రీమత్ గంభీరానంద స్వామి ఇలా వ్రాస్తున్నారు: “మానవ జీవితానికి అతీతంగా నిలిచిన ఎటువంటి దంపతులను గురించి వ్రాయడానికి మనం ప్రయత్నిస్తున్నామో పాఠకులకు అవగతమై ఉంటుంది. ఇది ఎంత ప్రయాసతో కూడిన ప్రయత్నమో చెప్పనవసరం లేదు. ఇంద్రియ సుఖాలకూ, శారీరక సంపర్కాలకూ వారు అతీతంగా జీవిం చారు. ఆ పవిత్రాత్ముల జీవితాలను నిజానికి కొంతైనా అవగతం చేసుకోవాలంటే, మనమూ మన లౌకిక చింతనలను, జీవితం గురించి మన నిర్ణయాలనూ, విషయ సుఖాల పట్ల లాలసనూ కొంత దూరంగా ఉంచే తీరాలి.” ‘త్వచ్చరణయోః సపర్యా మర్యాదా తరళ కరణానాం అసులభా’ – మనోనిగ్రహరహితులు దేవి పాదాలను సమీపించి పూజ చేయలేరు అంటున్నది సౌందర్యలహరి.*
ఈ నియమాన్ని పాటించి మనమూ ఈ ఉన్నత జీవితం గురించి ఒకింత యోచిద్దాం. వారు ఎందుకు ఈ విధంగా జీవించాలి? కచ్చితంగా లోకానికి ఆదర్శప్రాయంగా ఉండడానికే.* ఎలాంటి ఆదర్శం? శారీరక సుఖమే జీవిత సర్వస్వం కాదన్నదే ఆ ఆదర్శం. దీనినే వేదకాల పునరాగమనంగా పేర్కొనాలి.
వేదకాల ఆదర్శం
భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు సాటిలేనివి. “అమృతపుత్రులారా!” అంటూ మానవాళిని ఆహ్వానిస్తూ, “అంధకారానికి అతీతంగా ఉన్న సూర్యదీప్తితో ప్రకాశించే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకొన్నాను. ఆయ నను ప్రత్యక్షం చేసుకోవడం వల్ల మాత్రమే మానవుడు మృత్యువుకు అతీతమైన మహోన్నత స్థితిని చేరుకొంటాడు. ఇది తప్ప మరో మార్గం లేదు”* అంటూ భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడమే ఉన్నత ఆదర్శంగా స్వీకరించింది మన ఋషులే! స్త్రీకైనా పురుషుడికైనా ఆదర్శం అదే! జీవితంలో ప్రతిదీ ఆ ఆదర్శం వైపుగానే కార్యోన్ముఖమవ్వాలి. ప్రతి వ్యక్తీ తన జీవితానికి అవసరమైన కూడు గుడ్డ నీడలను ఈ ప్రపంచం నుండి గ్రహిస్తున్నాడు. ఆ ఋణాన్ని తీర్చడం అతడి కర్తవ్యం. అందునిమిత్తమే అతడు సంతానోత్పత్తికి పాల్పడతాడు. తద్ద్వారా ఈ ప్రపంచ చక్రం నిరాటంకంగా తిరగడానికి అతడు ఒక పరికరమవుతాడు. అందుకే వివాహం. స్త్రీ పురుషుల ఇద్దరి ఆదర్శమూ పార మార్థిక జీవితమే! మధ్యలో కర్తవ్యపు ఆహ్వానమే వివాహమనే పవిత్రబంధమూ, తద్ద్వారా సత్సంతానోత్పత్తి. ఇదే వేదకాల ఆదర్శమై ఒప్పారింది.
కాలప్రవాహంలో ఆ ఆదర్శం క్షీణింపసాగింది. అందుకు తోడు పరాయి సంస్కృతుల తాకిడితో అంతా తలక్రిందులయింది. ఫలితంగా మన దేశానికి పట్టిన గతి అందరికీ తెలిసిందే! ఈ పరిస్థితిలో మార్పుతెచ్చి వేదకాల వివాహ ఆదర్శాన్ని పునరుజ్జీవింప చేయడం కాలావశ్యకతగా పరిణమించింది. ఆ ఆవశ్యకతను తీర్చడానికే శారదా రామకృష్ణుల వివాహం.
శ్రీరామకృష్ణుల పరీక్ష
శారదా శ్రీరామకృష్ణులు పరస్పర సహాయంతో గృహస్థ జీవితాన్ని పార మార్థిక జీవితంగా తీర్చిదిద్దుకోవాలని ఉద్దేశించినట్లు ఇంత క్రితమే చూశాం. శారద మూలంగా జీవితంలో తమనొక అగ్నిపరీక్షకు గురి చేసుకో నెంచారు శ్రీరామకృష్ణులు. సంప్రదాయానుసారం ఆయన సన్న్యాసం స్వీకరించారు. ఆయన వివాహితుడని తెలుసుకొన్నప్పుడు ఆయన గురువు తోతాపురి ఇలా అన్నారు: “ఒక వ్యక్తిలో స్త్రీ పురుష భేదభావం నిలిచివున్నంత దాకా ఆతడి పావనత్వం పరిపూర్ణతను సంతరించుకొన్నదని పరిగ ణించం. ఈ దశను అతిక్రమించి సర్వత్రా పరబ్రహ్మస్వరూపుడైన భగవంతుణ్ణి దర్శించే వ్యక్తి మాత్రమే బ్రహ్మజ్ఞాని, బ్రహ్మంలో స్థిరంగా నెలకొన్నవాడని పరిగ ణించాలి. అటువంటి వ్యక్తికి భార్య ఆటంకమే కాదు.” ఈ అభిప్రాయాన్ని తమ జీవితంలో ప్రత్యక్షంగా పరీక్షించి చూడగోరారు శ్రీరామకృష్ణులు.
ఒక రోజు రాత్రి శారద, శ్రీరామకృష్ణుల ప్రక్కన మంచం మీద నిద్రిస్తున్నది. అప్పుడు శ్రీరామకృష్ణులు తమ మనస్సులో ఇలా వివేచింపసాగారు: “ఓ మనసా! ఇదొక స్త్రీ శరీరం. లోకులు దీన్ని గొప్ప భోగవస్తువుగా ఎంచుతారు. దీన్ని అనుభ వించడానికి పడిగాపులు కాస్తారు. కానీ దీని కోసం పోతే దేహచైతన్య భావనలోనే కూరుకుపోతారు. దాన్ని అతిక్రమించి సచ్చిదానందఘనుడైన పరమాత్మను అను భూతి చేసుకోలేరు. ఓ మనసా! లోపల ఒక భావనకు ఆశ్రయమిచ్చి, బయట తద్విరుద్ధ వైఖరి ప్రకటించకు. నిజం చెప్పు. నీకు ఈ శరీరం కావాలా? భగవం తుడు కావాలా? నువ్వు దీనినే కోరే పక్షంలో నీ ముందే ఉంది, అందుకో.” ఇలా వివేచిస్తూ శారద దేహాన్ని స్పృశించాలనే భావన మనస్సులోకి వచ్చీ రాకమునుపే ఆయన మనస్సు కుదించుకుపోయి ప్రగాఢ సమాధిలో లీనమైపోయింది. ఆ రాత్రి అది మామూలు భావభూమికి దిగిరాలేదు. మరునాడు భగవన్నామాన్ని పదే పదే ఉచ్చరించిన తరువాత ఎంతో ప్రయత్నం మీదట ఆయనకు బాహ్యస్మృతి తెప్పించగలిగారు.
శారద, శ్రీరామకృష్ణులు గడపిన అత్యున్నత జీవితంలోని ఒక అంశాన్ని పై సంఘటన మనకు తెలియచేస్తున్నది. దేహభావనే అక్కడ లేదు. ఈ ఉన్నతతమ జీవితంలో ఇద్దరికీ సమపాలు ఉండడాన్ని మనం కాదనలేం. శారదాదేవి జీవిత చరిత్ర రచించిన శ్రీ తపస్యానందస్వామి ఇలా వ్రాసివున్నారు: “శ్రీరామకృష్ణుల పావన జీవితంలో శారదాదేవి పాత్రను లోకం ఇంకా అవగతం చేసుకోలేదు. కామగంధరహిత పావన జీవితాన్ని శ్రీరామకృష్ణులు గడపడానికి అత్యున్నత స్థితి, పవిత్రతలే కారణంగా చూపబడుతున్నాయి. అది సరి కాదు. శారదాదేవికి కూడా దాన్లో సగపాలు ఉంది. ఆయనకున్నటువంటి ఉన్నతస్థితి, పవిత్రత ఆమెలో కొరవడి ఉంటే ఆమె ఎలా ఈ ఆదర్శాన్ని స్వీకరించగలుగుతుంది? ఆయన ఆదర్శ మయ జీవితానికి ఎలా సహాయకురాలై విరాజిల్లి ఉంటుంది?”
శారద పొందిన అనుభవాలు
ఈ అద్భుత దంపతులు ఒకే గదిలో, ఒకే మంచం మీద పడుకొన్నారని చెప్పాం. వారికి రాత్రుళ్లు ఎలా గడిచాయి? శ్రీరామకృష్ణులు వరుసగా దివ్యస్థితు లలో నెలకొని ఉండేవారు. భయాశ్చర్యాలతో శారద ఆయ నను చూస్తూ ఉండిపోయేది. ఆ రోజులను గురించి కాలాం తరంలో మాతృదేవి ఇలా చెప్పడం కద్దు: “గురుదేవులు పొందిన దివ్యస్థితులను మాటల్లో వివరించలేను. పారవశ్య స్థితిలో ఒకప్పుడు ఏడ్చేవారు, ఒకప్పుడు నవ్వేవారు, ఒకప్పుడు ప్రగాఢ సమాధిమగ్నులయ్యేవారు. కొన్ని రాత్రుళ్లు పూర్తిగా స్పృహ లేకుండా ఉండేవారు. సంభ్రమాశ్చర్యాలతో నా శరీరం వణకిపోయేది. పారవశ్యస్థితి అంటే ఏమిటో అప్పటికి నా కింకా తెలి యదు. ఎప్పుడు తెల్లవారుతుందోనని ఆందోళనతో నిరీక్షించేదాన్ని. ఒక రోజు సమాధిస్థితి చాలాసేపు కొనసాగినప్పుడు, భయపడి హృదయ్ను రప్పించాను. ఆతడు వచ్చి గురుదేవుల చెవిలో భగవన్నామాన్ని పలుమార్లు ఉచ్చరించాడు. ఆ తరువాత కాసేపటికి కొంచెం బాహ్యస్మృతిలోకి రాసాగారు. నా పరిస్థితిని అర్థం చేసుకొన్న గురుదేవులు, ఫలానా సమాధి స్థితిలో ఫలానా మంత్రం తమ చెవులలో ఉచ్చరించాలని నాకు నేర్పారు. ఆయన నేర్పినట్లే ఫలానా సమాధి స్థితికి చెందిన మంత్రాలను ఉచ్చరించి ఆయన బాహ్యస్మృతి పొందిన తరువాతే నా భయాం దోళనలు తొలగిపోయేవి. కానీ ఆయన ఎప్పుడు సమాధిమగ్నులవుతారో తెలియ నందున, కొన్ని సమయాలలో రాత్రంతా మేల్కొని ఉండేదాన్ని. నా ఈ అగమ్య గోచర పరిస్థితిని గురుదేవులు క్రమంగా అర్థం చేసుకొన్నారు. నెలలు గడచినప్ప టికీ వారి సమాధి స్థితులకు అనుగుణంగా నేను సర్దుకుపోలేకపోతున్నానని గ్రహించి, ఆ తరువాత తమ గదిలో ఉండడానికి నన్ను అనుమతించలేదు; తమ తల్లితోబాటు నహబత్తులోనే ఉండమన్నారు.”
ఈశ్వరీ –ఈశ్వరకోటులు
అవతార పురుషులు తాము ఒక్కరుగా అవతరించరు. వారి అవతార ఉద్దేశ కార్యం కొనసాగడానికి వారితోపాటు కొందరు ఆచార్యులు కూడా ఏతెంచుతారు. అటువంటి వారి పుట్టుక, సమావేశం, ఉద్యమం మొదలైన వన్నీ ఏదో నాటకంలా తోస్తుంది. రంగస్థలంతోపాటు సంభాషణాదులన్నీ ముందుగానే సమకూరి సిద్ధంగా ఉంటాయి. వారు రంగస్థలం మీదకు వచ్చి తమ పాత్రను కచ్చితంగా పోషించి వెళ్లిపోతారు. రామ, కృష్ణ, బుద్ధ, శంకర, చైతన్యుల జీవితాలలో ఎవరి జీవితాన్ని పరికించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది. యుగావతారులైన శ్రీరామకృష్ణుల జీవితంలో ఈ విషయం మరింత స్పష్టంగా తెలియవస్తుంది. ఇలా తమతోపాటు వచ్చిన వారిని శ్రీరామకృష్ణులు ఈశ్వరకోటులు, సాధారణ జీవులని రెండు కోవ లుగా వర్గీకరించారు. సాధారణ జీవులుగా వర్గీకరింపబడిన వ్యక్తులు పరిపక్వమైన ఉన్నత స్థితిలోని జీవులు. అవతారపురుషులతోపాటు జన్మించి, వారి పావన సాంగత్యంలో తీవ్రసాధనలు అనుష్ఠించి, ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు చవి చూసి ఉన్నతి పొందుతారు. మరొక కోవకు చెందిన ఈశ్వరకోటులు అప్పటికే ఉన్నతిని పొందినవారు. ఊర్ధ్వలోకాలలో నివసించేవారు. భగవంతుని ఆనతిని శిరసావహించి మానవాళి శ్రేయస్సు నిమిత్తమే ఈ లోకానికి వస్తారు. వారు సాధించవలసిందంటూ ఏదీ ఉండదు. వారి త్యాగం, తపస్సు, పారమార్థిక సాధనలు మొదలైనవన్నీ మానవాళి శ్రేయస్సు కోసమే! అది చూసి మనుషులు తమ జీవితాలను కూడా ఉన్నతంగా మలచుకోవడానికే! వీరిని గురించి శ్రీరామకృష్ణులు ఇలా చెప్పేవారు: “సామాన్యంగా పువ్వు పూచిన తరువాతే పిందె వేస్తుంది. కానీ గుమ్మడి, బూడిదగుమ్మడి లాంటి తీగలు ఇందుకు విరుద్ధం. వీటికి మొదట పిందె, తరువాతనే పువ్వు. ఈశ్వరకోటులు కూడా ఇలాంటి వారే! పొంద వలసింది ముందుగా పొందుతారు. ఆ తరువాతే ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠి స్తారు.” తమ సన్న్యాస శిష్యులలో వివేకానంద స్వామి, బ్రహ్మానందస్వామి, ప్రేమానందస్వామి, యోగానందస్వామి, నిరంజనానంద స్వామి, గృహస్థ శిష్యుడైన పూర్ణచంద్రుడు – ఈ ఆరుగురినీ ఈశ్వరకోటులుగా ఆయన సూచించారు.
ఈశ్వరకోటుల పరిస్థితే ఇలా అయినప్పుడు ఇక ఈశ్వరి? అవతారపురుషు నితోపాటు వారి శక్తిగా జన్మించిన శారద ఏం సాధనలు అనుష్ఠించాలి? కానీ మానవదేహం దాల్చి జన్మించినప్పుడు కించిత్తు అజ్ఞానం ఉండడం సహజమే కదా! రాముడు సాక్షాత్తూ భగవంతుడు. అయినా మానవుడిగా జన్మించినప్పుడు ఆయన విలపించడాన్ని సూచిస్తూ, “పంచభూతాల వలలో చిక్కువడి బ్రహ్మమే విలపిస్తు న్నది” అనేవారు శ్రీరామకృష్ణులు. ఇక్కడ శారదది కూడా అదే స్థితి. తానెవరు, ఇక్కడకు వచ్చింది ఎందుకు అనే సంగతినే ఆమె మరచిపోయింది. అది జ్ఞాపకం చేయడం శ్రీరామకృష్ణుల కర్తవ్యమయింది.
మొదటి సమావేశంలోనే శ్రీరామకృష్ణులు శారదకు ఉన్నత జీవిత ఔన్నత్యాన్ని చక్కగా వివరించి ఒక బిడ్డ కోసం ఆశించకుండా లోకమాతగా విరాజిల్లే సమున్నత స్థితిని విడమరచి చెప్పి, ఆ ఆదర్శాన్ని ఆమెలో పాదుకొనేలా చేయడం మనం చూశాం. ఆమె ఆ భావనలోనే మగ్నమై ఉండడం, ‘నేను మిమ్మల్ని సంసారంలోకి దింపడానికి రాలేదు’ అన్న ఆమె జవాబు నుండి మనం గ్రహించవచ్చు. తరువాతి ప్రాతిపదికకు ఆమె సిద్ధంగా ఉండడం గుర్తించి శ్రీరామ కృష్ణులు ఆమెను తమ గదిలోనే ఉండమని, తమ ఉన్నత ఆధ్యాత్మిక స్థితులను ప్రత్యక్షంగా దర్శించేలా చేశారు. ఆ స్థితులను తాను కూడా పొందాలనే అభిలాష ఆమెలో జనించినప్పుడు, అందుకు ఆమెను అర్హురాలినిగా చేయడానికి, అంటే ఆమె స్వస్వరూపాన్ని గుర్తుచేయగోరారు. అందుకు సందర్భం కోసం ఎదురుచూడ సాగారు. అటువంటి సదవకాశంగా షోడశీపూజ వచ్చింది.
ర్ండు సంశయాలు
ఈ సందర్భంలో మనలో సహజంగా కలిగే రెండు సంశయాలను ఒకింత పరికించి, షోడశీపూజ అనే చరిత్రాత్మక విశేష సంఘ టనను చూద్దాం.
మొదటి సంశయం: సాక్షాత్తూ జగన్మాతయే శారదగా అవతరించి ఉంటే ఆమె జీవితం మనబోటి సామాన్యులకు ఎలా ఆదర్శప్రాయమై ఉండగలదు? మనం ఆమెను ఆరాధించవచ్చు. ఆమె ఆచరించినవన్నీ మనం ఆచరించగలమా? లేదు. ఆమె ఆచరించినవన్నీ మనం ఆచరించలేమనడం కంటే ఆచరించనక్కర లేదనడం సముచితం. ఆమెది ఆదర్శమయ జీవితం. దాని పూర్తి విస్తృతిని మనిషి తన స్వల్పబుద్ధితో అవగతం చేసుకోవడం సాధ్యమా అన్నదే ప్రశ్నార్థకమై నప్పుడు, ఆమె గడిపినటువంటి జీవితాన్ని మనం ఎలా గడపగలం? ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మాత్రమే మనమిక్కడ జ్ఞాపకముంచుకోవాలి. మనబోటి మానవమాత్రులైన తల్లితండ్రులకు కుమార్తెగా జన్మించిన శారదాదేవి జీవితంలో మూడు దశలు మనం చూడవచ్చు – దేవి, గురువు, తల్లి. ఆమె లోకానికిజగజ్జనని అయింది, జగద్గురువయింది, మాత అయింది. మన చిన్న పరిధిలో మన ఇంటికి పెద్దగా, మార్గదర్శిగా, తల్లిగా – ఈ పదాల నిజమైన అర్థంలో – ఉండడానికి ప్రయత్నించవచ్చు కదా! అందుకు ఆమె జీవితం దోహదపడ వచ్చుకదా! శ్రీరామకృష్ణులు కూడా ఈ విషయంగా, “నేను పదహారణాలు, పూర్తి రూపాయి. అంటే అన్నింటినీ సమగ్రంగా ఆచరించాను. మీరు దాన్లో ఒక్క అణా కైనా ప్రయత్నించవచ్చు కదా!” అనడం కద్దు. శారదాదేవి జీవితం మనకు ఆదర్శప్రాయమని ఈ దృష్ట్యా గ్రహించాలి.
రెండవ సంశయం: సత్సంతానోత్పత్తి వైవాహిక జీవిత కర్తవ్యాలలో ఒకటిగా పేర్కొని ఉన్నాం. ఈ కర్తవ్యం శారదాదేవి జీవితంలో నిర్వహింపబడలేదు కదా? ఇది పూర్తిగా తప్పుడు అభిప్రాయం. జన్మనిచ్చిన బిడ్డను మాత్రమే సంతతిగా పరిగణిస్తే, సంతతి అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. రాజ కీయం, విజ్ఞానం, కళ ఆదిగాగల అన్ని శాఖలలోనూ ఒకరిని అనుసరించేవారే సంతతి అవుతారు. శారదాదేవి జీవితాన్ని మనం పరికిస్తే గృహస్థులు, సన్న్యాసులు అంటూ సంతతి సముదాయాన్నే ఆమె విడిచి వెళ్లారు. అంతెందుకు, శ్రీరామకృష్ణ సంఘాధ్యక్షులైన సన్న్యాసులలో నలుగురు ఆమె ప్రత్యక్ష శిష్యులే! అందువలన సత్సంతానోత్పత్తి అనే వైవాహిక కర్తవ్య నిర్వహణ కూడా ఆమె సమగ్రంగా చేశారని తేటతెల్లమవుతున్నది.
ప్రస్తుతం శారదాదేవి జీవితంలో ఒక ముఖ్య ఘట్టంలో ఉన్నాం. షోడశీ పూజ మూలంగా దేవి అనే సోపానాన్ని ఆమె అధిరోహిస్తున్నారు. ఆ పావన ఘట్టాన్ని ఇప్పుడు చూద్దాం.