అవతార పురుషుల కీర్తి ఆచంద్రతారార్కం
తెలిసో తెలియకో సమస్త జీవరాశులూ ఆనందాన్నే అన్వేషిస్తున్నాయి. మనిషికి సంబంధించినంత వరకు ఆనందాన్వేషణ అత్యంత ప్రాథమికమైన అన్వేషణలలో ఒకటి. మనిషి గాలి పీల్చుకోవడం (శ్వాసించడం) కూడా అందుకే అని వచిస్తున్నది తైత్తిరీయ ఉపనిషత్తు.* కానీ ఆనందం లభించడమేమో గగన కుసుమమే! అలా అయితే లేనిదాని కోసం వెతకి వెతకి వేసారిపోయామా? లేదు. ఆనందాన్ని మనం పొంద వచ్చు. కానీ ఎందుకు పొందలేకపోతున్నాం? వెతక వలసిన చోటును విడిచిపెట్టి మరెక్కడో తిరుగాడుతున్నాం. కనుకనే అది మనకు దక్కడం లేదు. మన లోపలే ఉన్న ఆనందాన్ని* బాహ్యప్రపంచంలో, దాని ఆకర్షణలలో వెతకితే అదెలా లభి స్తుంది? వేదాంతం వక్కాణించే ఈ సత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితం తరిస్తుంది. అర్హుడైన ఒక వ్యక్తి తన యువప్రాయంలోనే ఈ సత్యాన్ని మనకు విపులీకరించి అవగతమయ్యేట్లు చేశాడంటే, అంతకంటే కావలసింది ఏముంది? శారద ఈ విషయంలో ధన్యురాలు. కట్టుకొన్న భర్తే స్వయంగా గురువై ఈ విషయం ఆమెకు తెలియజెప్పాడు. తమ మూడవ సమావేశాన్ని గుర్తు తెచ్చుకొని కాలాంతరంలో, “ఆనాటి నుండి నాలో ఆనంద పూర్ణకుంభం పొంగిపొరలుతూన్నట్లుగా అనిపిం చేది. ఆ అనుభూతి వర్ణనాతీతం” అంటూ ఉన్నప్పుడు ఆ ఆనందం ఆమెలో ద్యోతకమయ్యేది.
మూడవ సమావేశం
వివాహానంతరం శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగివెళ్లి కఠోర ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించారని ఇంతకు మునుపే చెప్పుకొన్నాం. తత్పర్యవసానంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా ఆయన జీర్ణ కోశం పాడయింది. ఆరోగ్యం పుంజుకోవడం కోసం ఆయన కామార్పుకూర్కు వెళ్లారు. ఆయన రాక కామార్పుకూర్ వాసులకు ఎంతో ఆనందం కలిగించింది. బాల్యం నుండే ఆయన పట్ల జనం ఎంతో అభిమానంతో ఉండేవారు. ఇప్పుడు ఆయన వారి సాన్నిధ్యంలో ఉండడంతో వారి ఆనందం అనిర్వచనీయం. అందువలన పనులన్నిటినీ చకాచకా పూర్తిచేసుకొని పురుషులూ, స్త్రీలూ అంతా ఆయన చుట్టూ గుమిగూడేవారు. కథలతో, దృష్టాంతాలతో, ఉప మానాలతో తమదైన బాణీలో ఆయన సరళంగా సులభంగా అర్థమయ్యే రీతిలో పారమార్థిక జీవిత ఆవశ్యకతను విపులంగా చెప్పేవారు. ఇలా కామార్పుకూర్లో ఆ పూరింట ఒక ఆనందభరితమైన సంత వెలసింది. ఈ ఆనందంలో పాలుపంచు కోవడానికీ, దానిని పరిపూర్ణం గావించడానికీ శారద అక్కడకు తోడ్కొని రాబడింది.
అప్పటి శారద మనోవైఖరి
శారద తన భర్తను కలుసుకోవడం అది మూడవసారి. కానీ ఎదిగిన అమ్మా యిగా ఇప్పుడే మొట్టమొదటసారి కలుసుకోవడం. అది 1867 వ సంవత్సరం. అప్పుడామె వయస్సు పద్నాలుగేళ్లు. శారదా శ్రీరామ కృష్ణుల వివాహం ఒక దివ్య నాటకానికి నాంది అని ముందే చెప్పాం. ఈ సమాగమంతోనే ఆ నాటక ప్రథ మాంకం ఆవిష్కృతమైంది. ఇప్పుడు శారదలో ప్రప్రథమ పారమార్థిక బీజం నాట బడింది. పద్నాలుగేళ్లే ఉన్న బాలిక ఇందుకు తగినదేనా? శారద విషయంలో ‘అవును’ అనే జవాబివ్వాలి. జీవితపు ఉన్నత ఆదర్శమూ, బాధ్యతలూ గ్రహించే పెద్దరికమూ ఆమెలో పాదుకోసాగాయి. భారతీయ స్త్రీత్వానికే ప్రత్యేకమైన, పరిమితమైన భర్తను దైవంగా ఆరాధించే ఆదర్శం ఆమెలో అంకురింపసాగింది.
మాతృత్వ బీజం
స్త్రీత్వం మాతృత్వంతో పరిపూర్ణమవుతుంది. మాతృత్వ ఆదర్శం ఇమిడి ఉన్నందువల్లనే వివాహం పవిత్రతను సంతరించుకొన్నది. మాతృత్వాన్ని ఆశ్ర యించకుండా స్త్రీత్వమే ఉండలేదు. శారద కూడా ఇందుకు ప్రతికూలం కాదు. ‘అమ్మా’ అంటూ పిల్లలు తనను పిలవా లని ఆ మాతృహృదయం పరితపించింది. ఆ తపనను గురించి మాతృదేవి కాలాంతరంలో, “గొడ్రాలైన స్త్రీ ఎలాంటి మంగళకార్యం చేయడానికీ అర్హురాలు కాదు అంటూ పలువురు చెప్పడం నేను విన్నాను. అది నా మనస్సును పీడిం చింది. అలా అయితే ఒక బిడ్డ కూడా ‘అమ్మా’ అంటూ పిలవడానికీ నేను నోచుకో లేదా? అంటూ పరితపించాను” అని అన్నారు. కానీ మాతృత్వమనే పూర్తి పరి మాణాన్ని శారద గ్రహించలేదని శ్రీరామకృష్ణులు గ్రహించారు. అందువల్ల కాళికాదేవితో, ‘అమ్మా! ఈమె మనస్సు నుండి కామాన్ని కూకటివేళ్లతో పెకలించి వేయి’ అని మనఃస్ఫూర్తిగా ప్రార్థించారు. అంతటితో ఆగకుండా సందర్భం దొరిక్ నప్పుడల్లా ప్రపంచ పరిస్థితిని ఆమెకు వివరంగా చెప్పేవారు. నిజానికి భక్తి వైరా గ్యాలు మాత్రమే ఒక వ్యక్తి పొందదగిన సంపద అంటూ సూచించేవారు. శారదతో పాటు పుట్టిన వారిలో పలువురు మరణించినప్పుడు ఆమె తల్లి తండ్రులు పడిన ఆవేదననూ; అంతెందుకు, ఆమే అనుభవించిన శోకాన్నీ జ్ఞాపకం చేసేవారు. “ఎందుకు ఈ గొడవలన్నీ? కుక్కలలా నక్కలలా బిడ్డలను కనడమూ, తర్వాత నెత్తీ నోరూ బాదుకోవడమూ ఎందుకు? నీకు తెలియనిదా ఏమిటి? ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ లేకుండానే నువ్వు మహారాణిలా ఉంటున్నావు. జీవిత మంతా ఇలాగే ఉండు” అన్నారు. కానీ శారద ఇందుకు ఎలాంటి సమాధానమూ చెప్పలేదు. ఒక రోజు ఉదయం శారద ఇంటిని పేడతో అలికి శుభ్రం చేస్తూవుంది. శ్రీరామ కృష్ణులు వేపపుల్లతో పళ్లు తోముకుంటూ సరదాగా ఏవేవో కబుర్లు చెప్పసాగారు. మధ్యలో, “మొదటి బిడ్డ పుట్టగానే నూతన వస్త్రాలు లేవు, ఆభరణాలు లేవు అంటూ ఎంతో సతాయిస్తారు. కానీ ఆ బిడ్డ చనిపోనీ! మిగిలేది కన్నీళ్లే!” అన్నారు. ఎప్పటిలా శారద ఎలాంటి బదులూ చెప్పకుండా తన పనిలో నిమగ్నమైపోయింది. శ్రీరామకృష్ణులు అంతటితో వదలక ఆమెను పురమాయించడానికా అన్నట్లు బిడ్డలు చనిపోవడం గురించే చెప్పసాగారు. ఆ తర్వాత శారద ఉండబట్టలేక, “ఏమిటి! పుట్టిన బిడ్డలంతా చచ్చిపోతారా?” అంటూ మెల్లగా అయినా దృఢంగా అడిగింది. అంతే! శ్రీరామకృష్ణులు, “అయ్యో! నాయనా! అసలు విషయం తెలుసుకోకుండా త్రాచుపాము తోకను కదా తొక్కేశాను! అమాయకురాలు, సరళమైనది అని అను కున్నానే! కానీ ఈమె చూడు ఎలా ఘాటుగా సమాధానం చెప్పేసిందో! ఆహా!” అన్నారు. శారద వెంటనే అక్కడ నుండి లేచి వెళ్లిపోయింది! ఆమె మాటలను శ్రీరామకృష్ణులు సరదాగా తీసుకొన్నా ఆమెలో పెల్లుబుకుతున్న మాతృత్వాన్ని ఆయన స్పష్టంగా గమనించారు. ఈమె కేవలం ఒక రిద్దరు పిల్లలకు తల్లి అవడం కోసం జన్మించలేదు, లోకాని కంతటికీ తల్లిగా వ్యవహరిస్తూ, మాతృత్వపు ఔన్న త్యాన్ని ప్రపంచానికంతా చాటి చెప్పడానికోసమే ఈమె జన్మించింది అనే విష యాన్ని ఆమెకు స్ఫురింపచేసే తరుణం కోసం వేచి ఉన్నారాయన.
అలాంటి సందర్భం త్వరలో రానే వచ్చింది. కుమార్తె, అల్లుడు ప్రాపంచిక రీతిలో గృహస్థ జీవితాన్ని గడపడం లేదని తెలుసుకున్న శ్యామసుందరి ఒక రోజు, “అమ్మా అంటూ పిలిచే ఒక బిడ్డను నా కుమార్తె నుదుట బ్రహ్మ వ్రాయ లేదేమో!” అంటూ వాపోయింది. అత్తగారి లోటును అర్థం చేసుకున్న శ్రీరామ కృష్ణులు, “ఎందుకిలా ఆవేదన పడుతున్నారు? ఒక్క బిడ్డ ఏమిటి, భవిష్యత్తులో వేలాది బిడ్డలు మీ కుమార్తెను ‘అమ్మా! అమ్మా’ అంటూ పిలిచే చప్పుళ్లతో ఆమె చెవులు తూట్లు పడతాయి! వేచి చూడండి!” అన్నారు. శ్యామ సుందరి అప్పుడు ఈ మాటలను ఏ మేరకు అర్థం చేసుకున్నదో మనకు తెలియదు. కానీ ఈ మాట లన్నీ అక్షర సత్యాలవడం మనం చూడనున్నాం, ప్రస్తుతం ప్రత్యక్షంగానే చూస్తూ వున్నాం.
‘ఒక బిడ్డ కాదు, వేయి మంది బిడ్డలు నిన్ను అమ్మా అంటూ పిలుస్తారు’ అన్న శ్రీరామకృష్ణుల పలుకులు ఆయన ఆశించిన మార్పును శారదలో కలిగించి ఉండాలి. ఆ తర్వాత జీవితాన్ని వినూత్న దృక్పథంతో శారద చూడడం మొదలు పెట్టింది. ఆ దృక్పథంలో ఆమెకు ప్రప్రథమంగా తారసపడింది దివ్యమయులైన తన పతి. ఇలా ఆనందంలో తన్మయులవుతూవున్న మరొక వ్యక్తిని ఆమె ఎన్నడూ చూసింది లేదు. “ఆయన ముఖం వాడి ఉండడం నేను ఎన్నడూ చూడలేదు. సదా సర్వవేళలా ఆనందంగా ఉంటారు. ఆయనతోపాటు ఉంటున్నది బాలురైనా, వృద్ధు లైనా ఎవరయినాసరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే, వారి సంతోషానికీ, ఆనందా నికీ కొదవ ఉండేది కాదు.” అంటూ కాలాంతరంలో మాతృదేవి చెప్పేవారు. ఈ ఆనందం కోసం వారు బాహ్య ప్రపంచాన్ని ఆశ్రయించలేదు. అలా అయితే ఆ ఆనందం ఆయన అంతరంగంలోనే ఉంది. మన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అందు వల్ల తానుకూడా ఆ ఆనందాన్ని తనలో వెతకి దానిని పొందాలని నిశ్చయించు కొంది.
శ్రీరామకృష్ణులు ఇచ్చిన తర్ఫీదు
ఆధ్యాత్మిక జీవితాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకొని శ్రీరామకృష్ణులు, శారదకు తర్ఫీదు నిచ్చారని కాదు. ఆధ్యాత్మికతకు మాత్రమే కాకుండా గృహస్థ జీవితానికి కూడా ఆమె ఆదర్శంగా నిలవాల్సి ఉన్నందున ఆమెకు సాంసారిక విషయాలలో కూడా సరిపడినన్ని బోధనలు చేశారు. దీపానికి ఎలా తిరి పెట్టాలి, తమలపాకు లను ఎలా మడవాలి, బంధువులతో ఎలా మెలగాలి, ప్రయాణ సమయంలో ఎలా ప్రవర్తించాలి మొదలైన ప్రతి జీవిత కోణాన్నీ స్ప్పశించింది ఆయన తర్ఫీదు.
కానీ ఇంటి విషయాల్లో శ్రీరామకృష్ణులు శారదకు ఎందుకు తర్ఫీదు నిచ్చారని కాస్త యోచించాలి. శారద పుట్టింది, పెరిగింది గ్రామంలో, గ్రామ పరిసరాల్లో. అతి చిన్నతనంలోనే కుటుంబాన్ని, సోదరీ సోదరులను పోషించ సాగింది. గృహ నిర్వహణ బాధ్యత గ్రామీణ స్త్రీలకు స్వతహాగా అలవడుతుంది. అత్యంత సామర్థ్యంగల శారదకు ఇవన్నీ కరతలామలకమని వేరుగా చెప్పాల్సినపని లేదు. అందుకోసం ఒక అవతార పురుషుడు దిగి రావలసిన అవసరమూ లేదు. అలా అయితే సంసారంలోని ప్రతి అంశమూ ఆమెకు తర్ఫీదు ఇచ్చినట్లు వ్రాసి ఉందే! అవును, ఆయన గార్హస్థ్యం గురించి నేర్పించారు. కానీ కొద్దిగా మార్పుతో నేర్పించారు. గార్హస్థ్యాన్ని యథాతథంగా నేర్పించకుండా పారమార్థిక బాణిలో నేర్పించారు శ్రీరామకృష్ణులు.
మాతృదేవి సందేశ బీజంలో ఒకటి ఇక్కడే శ్రీరామకృష్ణులు నాటారు
శ్రీరామకృష్ణుల జీవితాన్ని ఒక పారమార్థిక విజ్ఞాన సర్వస్వంగా పేర్కొన వచ్చు. పారమార్థికతలోని ప్రతి అంశాన్నీ తనలో నింపుకొన్న ఆయన, శిష్యులను ఎన్నుకుని, ఏ శిష్యుడు తన అంశంలో దేనిని చక్కగా జీవించి చూపించగలుగుతాడో దానిని మాత్రం ఆతడిలో ప్రవేశపెట్టి, ఆతని పరిపక్వతకు తగినట్లుగా శిష్యుణ్ణి పెంపొందేలా చేశారు. ఇక్కడ శారద జీవితంలో అత్యంత ముఖ్యమయిన ఆదర్శాన్ని ఆమెలో పాదుగొల్పారు. అదే గార్హస్థ్యాన్ని పారమార్థికపరంగా మార్పుచేయడం, అంటే మన నిత్యకర్మలను, మనం చేస్తున్న పనులనన్నిటినీ పారమార్థిక జీవితానికి సాధనగా మార్చడం. ఈ విషయాన్ని మున్ముందు వివరంగా చూద్దాం!
శారద ఒక సామాన్య బాలిక కాదు. కొన్ని ఆదర్శాల కోసం ఆమె జన్మిం చింది. ఆమెకు ఆవశ్యకమయినదంతా రాజుకొనేలా చేయడం మాత్రమే. సరిగా దానిని మాత్రమే చేశారు శ్రీరామకృష్ణులు. 1. ఆనందం నీలోనే నెలకొని ఉంది. దాని కోసం బాహ్యంగా వెతకవద్దు. 2. ఒక బిడ్డకు మాత్రం కాదు, వేలాది బిడ్డలకు తల్లివి కావలసిన దానవు. 3. గార్హస్థ్యాన్నే పారమార్థికపరంగా పరివర్తిం చుకో. ఈ మూడు ముఖ్యమైన సందేశాలను శారదకు ఈ సమావేశంలో ఇచ్చినట్లు చూస్తున్నాం. వర్షపు చినుకు కోసమే వేచివున్న ఆలిచిప్ప, ఒక వర్షబిందువు పడగానే మూసుకుని, సముద్రం అడుగుకు వెళ్లి ఆ బిందువును ముత్యంగా మార్చే ప్రయత్నంలో లీనమవుతుంది. అదే విధంగా శారద కూడా శ్రీరామకృష్ణుల నుండి ప్రస్తుతానికి పొందవలసింది పొందిన తర్వాత తనలో మునిగిపోసాగింది.
ఆమెకు అన్నిటినీ వినవలసిన అగత్యం లేదు
జీవిత వికాసానికి ఆవశ్యకమైన వాటిని మాత్రమే శారదకు ఇవ్వడంలో శ్రీరామకృష్ణులు శ్రద్ధ వహించారు. ఒక రోజు ఆయన చుట్టూ కొందరు స్త్రీలు కూర్చొనివున్నారు. వారిలో శారద కూడా ఉంది. ఆధ్యాత్మిక జీవిత ఔన్నత్యాన్నీ, భగవంతుని చేరుకోవడం ఎలా? అనే విషయాల గురించి ఆయన చెబుతున్నారు. అందరూ మైమరచి వింటున్నారు. అలా వింటూనే శారద నిద్రలోకి జారుకుంది. అప్పుడు ఆ బృందంలోని ఒకామె, “ఇలాంటి అద్భుతమైన విషయాలనన్నిటినీ వినకుండా ఈమె ఇలా నిద్రపోతున్నదే! ఆమెను లేపండి!” అంది. వెంటనే శ్రీరామ కృష్ణులు అడ్డుపడి, “వద్దు, వద్దు, ఆమెను లేపవద్దు. అన్నిటినీ వినవలసిన అగత్యం ఆమెకు లేదు. నేను చెప్పేవాటి నన్నిటనీ వింటే ఈమె ఈ ఇలలో ఉండజాలదు. రెక్కలను విప్పి పైకెగిరిపోతుంది” అన్నారు. తన ప్రధాన శిష్యుడయిన నరేంద్రునికి కొద్దిగా మాయను జోడించమని శ్రీరామకృష్ణులు కాళీ మాతను ప్రార్థించేవారు. లేకపోతే నరేంద్రుడు లోకహితం కోసం పని చేయక ఒక్కసారిగా భగవంతునిలో కలిసిపోతాడు అని భయపడ్డారు ఆయన. అలాంటి భయమే ఇప్పుడు శారదను గురించి కూడా ఆయనలో కలిగివుండాలి.
వేడుక – వినోదాలు
మనం ఇంతవరకు చెప్పిన వాటి నుండి ఒక బెత్తం పుచ్చుకొని కళ్లు చిట్లిస్తూ విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయునిలా శ్రీరామకృష్ణులు ప్రవర్తించారని అనుకోకూడదు. ఆయన యథార్థాలను గ్రహింప చేసే పద్ధతే వేరు. శిష్యునికి తెలియకుండానే ఆతడి మనస్సులో ముద్రింపజేసే ఆయన సామర్థ్యం అసాధారణమైనది. వేడుకలకూ, వినోదాలకూ లోటు ఉండదు. దీనిని వండాలి, దానిని వండాలి అంటూ మారాం చేయడమూ; దీన్లో ఉప్పు లేదు, దాన్లో మసాలా తక్కువయింది అంటూ గొడవ చేయడమూ; తర్వాత విరక్తి భావంతో, “ఏం తిని ప్రయోజనమేమిటి? పొట్ట కేవలం మలం గిడ్డంగి లాంటిది. ఎప్పుడూ పొంగిపోతూనే ఉంటుంది” అంటూ తన విరేచనాల గురించి బిడ్డలా విసుక్కోవడమూ – ఇవన్నీ, కామార్పుకూరు రోజులు అనగానే, తదనంతర రోజుల్లో మాతృదేవి స్మృతిపథంలో మెదిలినవి. “ఒక రోజు” అంటూ మాతృదేవి నవ్వుతూ అన్నారు: “గురుదేవులు భోజనానికి కూర్చున్నారు. సామా న్యంగా కామార్పుకూర్లో లక్ష్మి తల్లీ, నేనూ వంట చేసేవారం. ఆమె బాగా వంట చేస్తుంది. ఆమె వండినవీ, నేను వండినవీ వడ్డించాం. ఆమె వండిన వంటకాలను ఆరగించి గురుదేవుల, ‘ఆహా! హృదూ! ఇది రామదాసు వైద్యుని చికిత్స లాంటిది, చాలా బావుంది’ అన్నారు. తర్వాత నేను వండినవి తిని, ‘ఓహో! ఇది శ్రీనాథ్సేన్ చికిత్స లాంటి వంట. అరకొర” అన్నారు. అందుకు హృదయ్, “నిజమే. కానీ మీరు అరకొర అంటున్నారే, ఆ అరకొర వైద్యుడే మీకు సదా సేవలు చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తి. శరీరం ఒత్తమని చెప్పినా కూడా తటపటాయించక వెంటనే చేసే వ్యక్తి. రామదాసు వైద్యుణ్ణి అంత సులభంగా మీరు సమీపించగలరా? ఖర్చు ఎంతవుతుందో తెలుసా? మీకు అవసరమైనప్పుడు ఆయన రావడం కూడా కుదరని పని. అంత మాత్రమే కాదు, సామాన్యంగా జనం అరకొర వైద్యులనే ఆశ్రయిస్తారు. ఎందుకంటే వాళ్లు మాత్రమే జనం చెప్పినట్లు నడుచుకుంటారు కనుక” అన్నాడు. గురుదేవులు కూడా దానిని ఆమోదిస్తూ “నిజం, ముమ్మాటికీ నిజం. ఆమె సదా తయారీగా ఉంటుంది” అన్నారు.
ఒక రోజు శారద, మరొక స్త్రీతో కలసి వీథి నాటకం చూడడానికి పక్క గ్రామానికి వెళ్లాలనుకొంది. శ్రీరామకృష్ణులు ఎందుకో అది ఇష్టపడలేదు. అందువల్ల ఎవరూ వెళ్లలేదు. ఆ కారణంగా వారిద్దరూ బాధపడి ఉంటారని గురుదేవుల మరో ఏర్పాటు చేశారు. ఆయన అప్పటికే ఆ వీథి నాటకాన్ని ఒకసారి చూశారు. ఒక్కసారి ఏదైనా ఆయన చూస్తే చాలు – అవన్నీ అలాగే ఆయన మనస్సులో ముద్రితమైపోతాయి. అందువల్ల ఆ నాటకాన్ని ఆయనే స్వయంగా నటించి చూపించి, అందులో వచ్చే పాత్రల సంభాషణలూ, పాటలూ, నటనా ఆర్భాటంగా చేసి చూపించేశారు. ప్రత్యక్షంగా వెళ్లి చూడలేదనే లోటు వారికి తెలియకుండా చేసేశారట!
బంగారం కన్నా, మరే ఆభరణాలకన్నా, మన స్త్రీలు ధరించి ఆరాధింప దగినవి సద్గుణాలే! స్త్రీత్వానికి అత్యంత ఉన్నతమైన ఆభరణంగా ఆరాధింపబడేది సరళత. సరళతవల్ల సాధింపజాలనిది ఈ లోకంలో ఏదీ లేదు. అందువల్ల సర ళతే అత్యంత పదునైన ఆయుధం అంటూ మహాభారతం శ్లాఘిస్తూంది. శారద జీవితాంతం సరళతనే ఆభరణంగా చేసుకున్నారు. అంతేకాక, అది ఆమె జీవితం గానే పరిణమించింది. ఆమె మాట, నడక, చూపులలో సరళత తొణికిసలాడేది. ఆమె మాటలు పువ్వులు వెదజల్లినట్లు – అంత మృదువుగా ఉండేవని కాలాంత రంలో ఆమె శిష్యులు చెప్పారు. ఒక పరుషమైన మాట కూడా ఆమె నోట వెలు వడదు.
స్త్రీత్వానికి ఆభరణం సరళత
శ్రీరామకృష్ణులు ఈసారి కామార్పుకూరుకు వచ్చినప్పుడు, ఆయనకు తాంత్రిక సాధనలు నేర్పించి, గురువు స్థానం వహించిన భైరవీబ్రాహ్మణి కూడా ఆయనతోపాటు వచ్చింది. అత్యంత ఉన్నత స్థితిలో నెల కొనివున్న ఆ ఆధ్యాత్మిక సాధకురాలు తూర్పు వంగదేశా నికి చెందిన వ్యక్తి. ఉద్దండ పండితులున్న మహాసభలో శ్రీరామకృష్ణులు ఒక అవతార పురుషులని శాస్త్ర ప్రమాణాలను చూపించి, నిరూ పించింది. అందువల్ల శ్రీరామకృష్ణులు ఆమెకు శిష్యుడే అయినా ఆయనను భైరవీ బ్రాహ్మణి ఎలా గౌరవించిందో మనం ఊహించుకోవచ్చు. మొదట్లో శ్రీరామ కృష్ణులు తమ భార్యకు ఉపదేశించడాన్నో, ఆమెతో సన్నిహితంగా మెలగడాన్నో అంతగా పట్టించుకోలేదు భైరవి. కానీ రోజులు గడిచేకొద్దీ, ఆమె పోకడలో మార్పు రాసాగింది. శిష్యుని బ్రహ్మచర్య జీవితానికి భంగం వాటిల్లుతుందేమోనని శంకిం చిన భైరవి, ఆయనకు ఈ విషయంగా హెచ్చరిక చేసింది. శ్రీరామకృష్ణులలో తాను ఆశించిన మార్పు రాకపోవడంతో ఆమెకు నిస్పృహ కలిగింది. ఇది కాస్తా కోపంగా పరిణమించి అందరి మీద కోపగించుకోసాగింది. చీటికీమాటికీ అందరి మీదా కస్సు బుస్సు మనేది. ఆమె కోపమంతా శారద మీద అని చెప్పకుండానే గ్రహించవచ్చు కదా! శారద పట్ల ఎప్పుడూ కఠినంగానే ప్రవర్తించేది భైరవి. ఆమెను సొంత అత్తగారిలా భావించి సేవలు చేయమని శ్రీరామకృష్ణులు శారదకు చెప్పారు. సహజంగానే సరళురాలైన శారద, భైరవి బెదరింపులను ప్రశాంతంగా సహించింది.
భైరవి తూర్పు వంగ దేశానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆ ప్రాంతపు ప్రజలలా ఆహారంలో కారం ఎక్కువగా తింటుంది. ఇలా కొన్ని వంటకాలను చేసి వాటిని లక్ష్మి తల్లికి, శారదకు పంపించింది భైరవి. వాటిని రుచి చూచిన లక్ష్మి తల్లి, “థూ థూ, గొడ్డుకారం!” అంటూ ఆమె ముఖం మీదనే చెప్పేసింది. కానీ కారం ప్రభావంతో కళ్లల్లో ధారలుగా నీరు స్రవిస్తున్నా భయం కారణంగా, “వంటకాలు బాగున్నాయి” అంది శారద. భైరవి కూడా పరవశించిపోయి లక్ష్మి తల్లితో, “నా కోడలిని చూడు. నా వంటకాలు బాగున్నాయని చెప్పింది, ఆమె సమర్థురాలు, నీకు నా వంటకాలేవీ నచ్చవు. ఇకపై నీకు నేనేమీ ఇవ్వను! వెళ్లిపో!” అనేసింది. కాలాంతరంలో మాతృదేవి నవ్వుతూ ఈ ఉదంతం గురించి చెప్పేవారు.
రోజులు గడిచేకొద్దీ భైరవి చీదరింపు, అహంకారం హద్దులు మీరసాగింది. అందరిపైనా ఛీత్కరించుకోవడం, కేకలు వేస్తూ తన జీవితాన్ని నరకప్రాయంగా చేసుకుని, చుట్టూవున్న వారికి కూడా నరకయాతన కలిగించింది. శ్రీరామకృష్ణులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉండిపోయారు. శారద సరళత అనే పదునైన ఆయుధాన్ని చేపట్టి, మౌనంగా అన్నిటినీ సహించింది. త్వరలోనే భైరవి తన తప్పును గ్రహించింది. శ్రీ శారదా రామకృష్ణులు ప్రత్తి, నిప్పు లాంటి వారనీ, సన్నిహితులయితే వారి జీవితం వినాశనమవుతుందని భైరవి భావించింది. కానీ వారిద్దరూ అగ్ని గోళాలు, ఒకరి నొకరు సమీపిస్తే ఇంకా ప్రజ్వలంగా ప్రకాశిస్తారు గాని, నశించరని అర్థం చేసుకొంది. తన తప్పిదాన్ని గ్రహించి అందరికీ క్షమార్పణ లర్పించి, కామార్పుకూరు నుండి సెలవు తీసుకొని కాశీకి వెళ్లి తన అంతిమ కాలాన్ని తీవ్రమైన సాధనలలో గడిపింది.
మళ్లీ జయరాంబాటికి
సుమారు ఏడు నెలలు కామార్పుకూరులో గడిపి శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వ రానికి బయలుదేరారు. ఆనందభరితమైన సంత ముగింపునకు వచ్చినట్లు అనిపించింది. ఇన్ని రోజులు పరమానందసాగరంలో ఓలలాడిన శారద కూడా తన శరీరాన్ని మాత్రం భారంగా మోసుకుంటూ జయరాంబాటికి వెళ్లి ప్రశాంతంగా జీవితాన్ని పునఃప్రారంభిం చింది. తన హృదయంలో ఆనంద పూర్ణకుంభాన్ని ప్రతిష్ఠించి వెళ్లిన ఆ దివ్య పురుషునితో ఆమె మనస్సు మాత్రం వెళ్లిపోయింది. మళ్లీ ఎప్పుడు ఆయనను చూడగలనా అనే తహతహతో ఎదురుచూడసాగింది.