ఈ వివాహ ఆదర్శం
శ్రీ శారదా – రామకృష్ణుల వివాహం ఒక దివ్య నాటకానికి నాంది. దీనిని పదేపదే ఎందుకు చెబుతున్నామంటే ఈ వివాహానికి లౌకిక రీతిలో ఎలాంటి అర్థమూ లేదు. విషయ సుఖమో, పుత్ర ప్రాప్తియో ఈ వివాహ లక్ష్యం కాబోదు, కాదు కూడా. ఎందుకంటే వివాహ సమయంలో శారద వయస్సు కేవలం ఐదేళ్లు కనుక! ప్రేమ, కామమనే విషయాలే అర్థం కాని లేత వయస్సు. ఇక శ్రీరామ కృష్ణులో శరీరం, హృదయం, ప్రాణం యావత్తునూ దేవి పాదపద్మాలలో సమ ర్పించి, ఆమె సాక్షాత్కార భాగ్యం పొందినవారు. ఆ దేవిని తప్ప దేనినీ ఆశించని వారు. అందువల్ల గత అధ్యాయాలలో చెప్పినట్లు ఉన్నత ఆదర్శాల కోసమే ఈ వివాహం జరిగివుండాలి. ఈ విషయాన్ని యథార్థం చేస్తూ జరిగిన రెండు సంఘ టనలను మనం చూడబోతున్నాం.
రామకృష్ణులను శారద ఎంపిక చేసుకోవడం
శ్రీరామకృష్ణుల జన్మస్థలమైన కామార్పుకూరుకూ, జయరాంబాటికీ దగ్గర లోని కుగ్రామం సిహోర్. అక్కడి శాంతినాథ్ శివాలయం ఎంతో ప్రసిద్ధమైంది. ఆలయం పెద్దది కాకున్నా అందమైనది. అక్కడ జరిగే వార్షికోత్సవం కూడా ఎంతో పేరుగాంచింది. భజనలు, కీర్తనలు, కథాకాలక్షేపం, వీథి నాటకాలతో జరుపుకొనే ఆ ఉత్సవాలకు కామార్పుకూరు, జయరాంబాటి లాంటి సమీప గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేవారు. అలాంటి ఒక సందర్భంలో జయరాంబాటి నుండి శారద కుటుంబం, చిన్నారి శారదతో ఈ ఉత్సవానికి రావడం తటస్థించింది. కీర్తనలు వినడానికి ఒక కీర్తన బృందంలో వెళ్లి కూర్చున్నారు. అప్పుడు బంధు వయిన ఒక వృద్ధురాలు శారదను తన ఒళ్లో కూర్చోపెట్టుకుని మామూలుగా ముసలమ్మలు ప్రశ్నించేలా, “అమ్మా! శారదా! నువ్వు ఎవరిని కట్టుకుంటావామ్మా?” అని అడిగింది. చిన్నారి శారద ఆ ప్రశ్నను ఎలా అర్థం చేసుకుందో మనకు తెలియదు. కానీ తన లేత చేతులను చాపి ఆ గుంపులోని ఒక యువకుణ్ణి చూపించింది. అంతే – ప్రశ్న అడిగిన ముసలమ్మకు ఎందుకు అడిగానా అనిపిం చింది. ఇతర బంధువులు కూడా ఈ సంఘటనను చూసి కాస్త చలించిపోయారనే చెప్పాలి. ఎందుకంటే ఆమె సూచించింది మరెవ్వరినో కాదు – సాక్షాత్తూ శ్రీరామ కృష్ణులనే!
ఆ రోజుల్లో ఆయన లౌకికుల దృష్టిలో ‘పిచ్చి గదాయ్’ గా కనబడ్డారు. బ్రతకడం నేర్వని అమాయకుడు. హఠాత్తుగా ధరించిన గుడ్డలను తీసివేసి తిరుగు తూండేవారు. హఠాత్తుగా ‘అమ్మా! అమ్మా!’ అంటూ ఆక్రోశిస్తారు. నేలమీద పడి దొర్లి, ముఖాన్ని నేలకేసి రాసుకుంటూండేవారు. మొత్తానికి పిచ్చివానిలా జీవించే ఒక వ్యక్తిని ఈ చిన్నారి చూపించిందే అని అందరూ బాధపడ్డారు.
శారదను శ్రీరామకృష్ణులు ఎంపిక చేయడం
శ్రీరామకృష్ణుల జీవితంలో ఇరవయ్యో ఏట నుండి ముప్పై ఒకటో ఏడు దాకా (1856–1867) సాధన కాలంగా పేర్కొంటారు శారదానందస్వామి.* ఈ కాలఘట్టంలో ఆయన ఆధ్యాత్మిక తుపానులో చిక్కి అల్లల్లాడిపోయారనే చెప్పాలి. ఒకటి తర్వాత ఒకటిగా ఎన్నో సాధనలతో, దాని నంటిపెట్టుకొన్న ఎన్నో అను భూతులతో ఆయన జీవితం తీవ్రమయిన మార్పులకు లోనైంది. బాహ్య జీవితమనేది ఒకటి ఉందనే ధ్యాస కూడా లేకుండాపోయింది. తిండి, గుడ్డ లాంటి దేనిమీదా ఆయన మనస్సు పోయేది కాదు. సదా సర్వవేళలా ఆయన జగజ్జననితోపాటు జీవించారు. ఒక్క క్షణం కూడా ఆమెను వదలి ఉండలేకపోయారు. నేల మీద పడి దొర్లి ‘అమ్మా, అమ్మా’ అని ఆక్రోశించేవారు. మళ్లీ జగజ్జనని దర్శనం లభించేదాకా, ఆమె వచ్చి తనను ఒడిలోకి తీసుకునే దాకా విలపించేవారు. వారి ఆంతరిక జీవితాన్ని చూడజాలని సామాన్యులు ఆ బాహ్య జీవితాన్ని చూసి, ఆయన పిచ్చివాడని తీర్మానించారు. తాము అర్థం చేసుకోజాలని ఒక విషయాన్ని అవివేకం, పిచ్చి అని తీర్మానించడం లోకం నైజం కదా! అందువలన శ్రీరామకృష్ణులను పిచ్చివానిగా తీర్మానించడంలో వింత లేదు!
ఈ వార్త కామార్పుకూరులో శ్రీరామకృష్ణుల తల్లి అయిన చంద్రమణీదేవికి అందింది. జీవితంలో అనేక శోధనలకు గురియైన వ్యక్తి ఆమె. ఈ వృద్ధాప్యంలో తన అనుంగు బిడ్డను గురించిన ఈ వార్త ఆమెకు అశనిపాతమైంది. వెంటనే శ్రీరామకృష్ణులను కామార్పుకూరుకు రప్పించి రకరకాల చికిత్సలు చేయించింది. కామార్పుకూర్కు వచ్చిన తర్వాత ఆయన దివ్యోన్మాదం కొంత ఉపశమించింది. తాను చేయించిన చికిత్సల ఫలితంగానే ఆయన కోలుకున్నట్లు మాతృ హృదయం ఆనందించింది. కానీ మళ్లీ పరిస్థితులు తారుమారవవని హామీ ఏముంది? ఆయనను ఈ మామూలు స్థితిలోనే నిలుపుకోవాలంటే ప్రాపంచిక బంధంతో ముడివేయాలి. అందుకు వివాహం ఒక్కటే తరుణోపాయమని తల్లీ, బంధువులూ తీర్మానించారు.
వధువు కోసం వెదకడం మొదలుపెట్టారు. శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిస్తే మొండికెత్తవచ్చునని ఆయనకు తెలియకుండానే మంచి సంబంధాలు వెతకసాగారు. ఏ కారణంగానో ఏ సంబంధమూ కలిసిరాలేదు. దాంతో అందరూ ఆందోళన చెందారు. అప్పుడు ఒక రోజు శ్రీరామకృష్ణులు పారవశ్య స్థితిలో, “వధువు కోసం అక్కడా ఇక్కడా వెతకి ప్రయోజనం లేదు. జయరాంబాటిలో రామచంద్రుని ఇంట్లో నా కోసం ఒక అమ్మాయి గడ్డితో చుట్టబడి* పరిరక్షింప బడుతూవుంది, అక్కడికి వెళ్లి విచారించండి” అన్నారు.
శ్రీరామకృష్ణుల మాటలలో ఆయన తల్లికీ, అన్నగారికీ అంతగా నమ్మకం కుదరలేదు. అయినా జయరాంబాటికి మనిషిని పంపి విషయం తెలుసుకొన్నారు. పిల్లకు ఐదేళ్లు, అయినా చంద్రమణి వివాహానికి సమ్మతించింది. కన్యాశుల్కం కూడా చంద్రమణి పేదరికానికి తగ్గట్లు కొంత తక్కువగానే ఇచ్చారు.
వివాహమూ, దానితోపాటు జరిగిన
బాల్య వివాహమనేది ఆ కాలంలో సంప్రదాయమే. అతి చిన్నతనంలోనే వివాహం జరిగిపోయినా, బాలిక యుక్తవయస్కురాలయ్యాకనే భార్యా భర్తలు కలిసి ఉండేవారు. అందువల్ల శారదకు ఐదేళ్లప్పుడే వివాహం జరిగిందనే విషయం మనకు ఆశ్చర్యంగా ఉండదు. కానీ వరుని వయస్సు ఇరవై మూడు అన్నప్పుడే అక్కడ దైవత్వం సంఘటనలు హస్తాలను మనం వెదకవలసివుంది. ఎలాగో వివాహం గురించి సంప్రతింపులన్నీ ఒకటి రెండు రోజులలో ముగిసాయి. అబ్బాయి ఇంటి వారు కన్యాశుల్కంగా మూడు వందల రూపాయ లిచ్చారు. 1859, మే నెలలో ఒక శుభ ముహూర్తంలో శ్రీ శారదా రామకృష్ణుల వివాహం ఎంతో నిరాడంబరంగా జరిపోయింది. కామార్పుకూరు నుండి శ్రీరామ కృష్ణులతోపాటు ఆయన అన్న రామేశ్వర్ వెళ్లాడు. వివాహానంతరం ఆ రోజు సాయంత్రం అందరూ కామార్పుకూరుకు తిరిగివెళ్లిపోయారు. శారదను ఆమె పిన తండ్రి అయిన ఈశ్వర ముఖర్జీ తమ భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లారు. ఆమెను అమిత ప్రేమతో ఆహ్వానించింది చంద్రమణి.
ఒకటి రెండు రోజులు ప్రశాంతంగా గడిచాయి. అప్పుడు ఒక సమస్య తలెత్తింది. పేదరికం కారణంగా పెళ్లికూతురికి కొత్త నగలు పెట్టలేకపోయింది చంద్రాదేవి. అయినా ఉత్సాహంతో కొన్ని నగలను అరువుగా తెచ్చి శారదకు అలంకరించింది. ఇప్పుడు ఆ నగలను వారికి వాపసు చేయాలి. కానీ శారద ఆ నగలను తనవిగానే భావించి పొంగిపోయింది. వాటిని ఆ అమ్మాయి నుండి ఎలా తీసుకోవాలి? చంద్రమణికి ఏమీ పాలుబోలేదు. తల్లి సమస్యను అర్థం చేసు కున్నారు శ్రీరామకృష్ణులు. శారద నిద్రపోతున్నప్పుడు ఆమెకు తెలియకుండా నగల నన్నిటినీ తీసి తల్లికి అందచేశారు. ఉదయం మేల్కొన్న శారద తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. చెవులు, ముక్కు, మెడ – అన్నీ తాకి చూపిస్తూ, అక్కడ ఉండిన నగలన్నీ ఎక్కడ అంటూ ఏడుస్తూ అడిగింది. చంద్రమణీదేవి అమిత ఆవేదనతో శారదను అక్కున చేర్చుకొని కన్నీరు కారుస్తూ, “అమ్మా! శారదా! ఇవేం గొప్ప నగలు! వీటికన్నా చాలా మంచినగలను ఎన్నిటినో నీకు గదాయి చేయిస్తాడు చూడు!” అంటూ అనునయించసాగింది. ఎలాగో శారద తాత్కాలికంగా ఉపశ మనం పొందింది. కానీ సరిగ్గా ఆ రోజే ఈశ్వర ముఖర్జీ కామార్పుకూరుకు రావాలా? విషయం తెలిసిన ఆయన మండిపడి వెంటనే శారదను తన భుజాల మీద ఎత్తుకొని జయరాంబాటికి వెళ్లిపోయాడు. దాంతో చంద్రమణీదేవి చలించి పోయింది. అయినా శ్రీరామకృష్ణులు ఏమీ జరగనట్లుగా తల్లి ఆవేదనను చూచి, “అమ్మా! నువ్వు ఎందుకు ఆవేదన పడుతున్నావు? వారు ఏమైనా చెప్పనీ, ఏమైనా చేయనీ! జరిగిపోయిన వివాహాన్ని ఎవరు రద్దు చేయలేరు కదా!” అంటూ అనునయపరిచారు. తర్వాత ఎలాగో పరిస్థితి చక్కబడింది.
శ్రీరామకృష్ణులు సుమారు రెండేళ్లు కామార్పుకూరులో ఉన్నారు. ఈ మధ్య 1860 డిసెంబరులో శారదకు ఏడో ఏట ఒకసారి శ్రీరామకృష్ణులు జయరాంబాటి వెళ్లారు. కానీ ఒకటి రెండు సంఘటనలు తప్ప ఆ రెండవ సమావేశంలో జరిగిన దేదీ శారదకు జ్ఞాపకం లేదు.
ఆ రోజు శ్రీరామకృష్ణులు వచ్చినప్పుడు శారద ఉండబట్టలేకపోయింది. ఏడేళ్ల బాలికయైనా ఆమె గ్రామంలో పుట్టి పెరిగినందువల్ల భర్త దేవునితో సమానమని పరిగణించే మన సంస్కృతి, సంప్రదాయం ఆ చిరుతప్రాయంలోనే ఆమెలో ఊరిపోయింది. అందువల్ల ఎవరూ నేర్పించకుండా తానుగా పరుగెత్తు కుంటూ వెళ్లి భర్తను ఆహ్వానించి, ఉపచరించి, ఆయన పాదాలను కడిగి ఆసీనుని చేసి, విసనకర్రతో విసరసాగింది. శారద ఇలా ప్రవర్తించడం చూసి అందరూ కుతూహలపడ్డారు. ఆమె స్నేహితురాండ్రు ఇది చూసి ఆమెను వేళాకోళం పట్టిం చారు.
ఇంతలో శ్రీరామకృష్ణులకు కుమారుని వరుస బంధుమా, ఆయనతోనే ఉంటూ శుశ్రూషలు చేస్తూ వస్తూన్న హృదయ్ ఒకసారి లజ్జాస్వరూపిణి అయిన శారద ఎంతగా వారించినా వినక ఆమె పాదాలను పూలతో పూజించాడు. ఈ సంఘటనలన్నిటితో మొత్తానికి శారద గృహం కోలాహలంగా తయారయింది. ఈ ఆనంద ఉత్సాహాలను చూసి దీనిని పెళ్లి రోజుగా శారద అనుకోకూడదని శ్రీరామ కృష్ణులు శారదను పిలిచి, “ఇదిగో చూడు! ఎవరన్నా అడిగితే ఏడవ ఏటనే నీకు పెళ్లి అయిందని చెప్పేయకు! నీకు ఐదేళ్లప్పుడే పెళ్లి జరిగిపోయింది” అని బోధించారట!
ఇవన్నీ మాతృదేవి తమతో గురుదేవుల రెండవ సమావేశం గురించి కాలాంతరంలో జ్ఞాపకం చేసుకున్న సంగతులు.
కొన్ని రోజులకే శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్లిపోయారు. భార్య, సంసారం వీటన్నిటిని పూర్తిగా విస్మరించి మళ్లీ తీవ్రంగా పారమార్థిక సాధనలలో లీనమైపోయారు. శారద జీవితం ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగింది. ఆ తర్వాత శారద తన పదుమూడవ, పదునాల్గవ ఏట కామార్పుకూరులో మెట్టి నింటికి వెళ్లి కొన్ని రోజులుండి తిరిగి వచ్చింది. రెండవసారి వెళ్లినప్పుడు సుమారు ఒకటిన్నర నెల అక్కడ గడిపింది. కానీ రెండు సందర్భాల్లోనూ శ్రీరామకృష్ణులుగానీ, చంద్రమణిగానీ అక్కడ లేరు, అప్పుడు వారు దక్షిణేశ్వరంలో ఉన్నారు. అందువల్ల శ్రీరామకృష్ణుల అన్నగారైన రామేశ్వర్, ఆయన భార్య, ఇతర బంధువులతో గడిపి శారద మళ్లీ తిరిగి జయరాంబాటికి వెళ్లిపోయింది.