అవతార పురుషుల కీర్తి ఆచంద్రతారార్కం
యశస్సు, కీర్తి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి తాత్కాలికమైనది, మరొకటి ఆచంద్రతారార్కమైనది. విద్య, కళలు, విజ్ఞానం, సేవ, మతం – ఇలా ఏ రంగాన్ని తీసుకొన్నా వాటిలో కొందరు నిష్ణాతులు వస్తారు, తాము జీవించి ఉన్నప్పుడే కొందరి జీవితాలలో స్ఫూర్తిని కలి గిస్తారు, కొందరికి ఆరాధ్యనీయులవుతారు, ఆ తరువాత నిష్క్రమిస్తారు. నిష్క్రమణానంతరం వారి ఆదర్శాలు కొంతకాలం ప్రాచుర్యంలో ఉంటాయి, కొందరిని జనం తమ నేతగా గుర్తుంచుకొంటారు. కానీ అది జాతీయ పతాకానికి మనం కనబరచే గౌరవంలాంటిది మాత్రమే. వారి జీవితాలు ఇతరు లకు ఆదర్శప్రాయం కాజాలదు. వారిలా తమ జీవితాలను తీర్చిదిద్దుకోవడానికి ఎవరూ ఉత్సుకత చూపరు. కాలక్రమంలో జనం వారిని పూర్తిగా మరచిపోవడం కూడా కద్దు. ఈ కోవకు చెందిన నేతలూ, వారి యశస్సూ తాత్కాలికాలు.
మరొక కోవకు చెందినవారున్నారు. వీరు జీవించి ఉన్నప్పుడు ఏ కొద్ది మందో వీరిని అవగతం చేసుకోగలుగుతారు. వారి జీవితాలు నిరాడంబరంగా, గుర్తింపునకై ఎటువంటి ప్రకటనలూ లేకుండా గడుస్తాయి. కానీ నిష్క్రమణానం తరం వీరి ఆదర్శాలూ, ఉపదేశించిన సనాతన సత్యాలూ విశ్వరూపం దాల్చి లోకాన్ని ఆవరిస్తాయి. కాలక్రమంలో కోట్లాదిమంది జీవితాలను ఆదర్శప్రాయంగా మలుస్తాయి. వీరి యశస్సు ఆచంద్రతారార్కం. కాలం ఆ యశస్సును కించిత్తు కూడా తగ్గించలేదు. ఇటువంటి మహాపురుషుడుగా ఇటీవలి కాలంలో మన మధ్య అవతరించిన వారే భగవాన్ శ్రీరామకృష్ణులు!
గురుదేవుల గురించీ, ఆయన మహజ్జీవితం గూర్చీ అనేక పుస్తకాలు వెలు వడ్డాయి, ఇంకా వెలువడుతూనే ఉన్నాయి. కానీ ఆయన నేటికీ సమగ్రంగా ఎవ రికీ అవగతం కానివారుగానే ఉన్నారనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అవును, మిత్రులారా! ఆయనను ఇకపైన లోకం సమగ్రంగా అవగతం చేసుకోవా ల్సిన అగత్యముంది. కాలగతిలో ఏతెంచిన ఎందరెందరో దీర్ఘదర్శులనూ, వారి జీవితాలనూ చరిత్ర మన ముందు ఉంచింది. ‘ఎవరి నీడన నేను జీవించానో, ఎవరి పాదపద్మాల మ్రోల కూర్చుని అంతా నేర్చుకొన్నానో ఆ శ్రీరామకృష్ణులకూ, ఆయన దివ్యప్రకాశానికీ దీటైన మరొక జీవితాన్ని నేను చూడలేదు. సాటిలేని మహజ్జీవితంతో ఆయన తృప్తిచెంది ఆ జీవితానికి భాష్యాన్ని తెలిపే బాధ్యతను ఇతరుల మీద వదలివేశారు’ అన్నారు స్వామి వివేకానంద.
ఆయన జీవిత చరిత్రలు అనేకం వెలువడినందువలన ఇక్కడ ఆయన జీవిత విశేషాలను వివరంగా పొందుపరచడం లేదు. శ్రీ శారదామాత జీవితం ఏ రీతిలో ఆయన జీవితంతో సమ్మిశ్రితమై ఒక వినూత్న సందేశాన్ని లోకానికి అందించిందో ఆ విషయాన్ని మాత్రం శక్తిమేరకు ఇక్కడ తెలుపబోతున్నాం.
ఎవరీయన?
‘ఇదేమిటని కొందరు విస్తుబోయి చూస్తున్నారు; ఇదొక అద్భుతమని కొందరు మాట్లాడుకొంటున్నారు; మరికొందరు దీనిని విని ఆశ్చర్యపోతున్నారు; ఇంకా కొందరు విని అవగతం చేసుకోలేని అయో మయంలో ఉన్నారు.’* శ్రీరామకృష్ణుల జీవితం చదివిన వారందరికీ ఇటువంటి అనుభవమే కలుగుతుంది. ఆయన భక్తుడా? అవును. ఆయన జ్ఞానియా? అవును. ఆయన సంసారియా? అవును. సన్న్యాసియా? అవును. పురుషుడా? అవును. స్త్రీయా? అవును. నిరక్షరాస్యుడా? అవును. సర్వజ్ఞుడా? అవును. శైవుడా? అవును. వైష్ణవుడా? అవును. శాక్తేయుడా? అవును. వేదాంతియా? అవును. ఇలా పరస్పర విరుద్ధాలన్నీ ఆయనలో లీనమై ఉన్నాయి. ‘ఆయన అసంఖ్యాక భావాలకు ఆలవాలం. అది సర్వతోముఖంగా బహిర్గతం కావ డానికి అనువైన సువిశాల హృదయులు ఆయన. బహుశా బ్రహ్మజ్ఞానాన్ని సైతం కొలిచి చెప్పగలరు. కానీ మా గురుదేవుల మనస్సు లోతును కనుగొనడం అసాధ్యం’ అంటారు స్వామి వివేకానంద. శ్రీరామకృష్ణులు అంతుబట్టని మానవా తీతులు.
శ్రీరామకృష్ణులను అవతారవరిష్ఠులుగా, అంటే అవతారాలలో ఉత్కృష్టు లుగా అభివర్ణించారు వివేకానంద స్వామి. శిష్యులు తమ గురువును సాక్షాత్తూ పరబ్రహ్మంగా ఆరాధించడాన్ని హిందూమతం వేనోళ్ల శ్లాఘిస్తుంది. కానీ నిజానికి అవతారమంటే సాక్షాత్తూ భగవంతుడు దిగిరావడమన్నది అపూర్వంగా జరిగే సంఘటన. రాజ్యంలో ఎక్కడైనా అల్లర్లు చెలరేగితే వాటిని అణచడానికి సైనికులను ముందు పంపిస్తాడు రాజు. సైనికులు అల్లర్లను అణచలేని పక్షంలో సేనాధిపతిని పంపుతాడు. ఆతడు కూడా విఫలుడైతే మంత్రిని పంపడం జరుగుతుంది. అప్ప టికీ పరిస్థితి అదుపులోకి రాకపోతే స్వయంగా తానే అక్కడకు వెళ్లి పరిస్థితిని తరచి చూసి చక్కబరచి తిరిగివస్తాడు. అలా స్వయంగా మహారాజే రావడం లాంటిదే అవతారం. సైనికుడు, సేనాధిపతి లాంటివారే మహాత్ములను పోలిన మనోస్థితి గల మహనీయులు. “ఈసారి మహారాజే రావడం తటస్థించింది. కానీ మారువేషంలో వచ్చాడు. ఆయన ఇలాంటి మనిషి అని ఒకరిద్దరు గుర్తించి తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించగానే ఆయన నిష్క్రమిస్తాడు” అని శ్రీరామకృష్ణులు కూడా చెప్పివున్నారు.
అవతారమనడానికి ముఖ్య ఆనవాలు
ఒక సామాన్యుని, మహాత్ముని, అవతారపురుషుని ఆనవాలుపట్టడం మనం తెలుసుకొని ఉండాలి. అవతార పురుషులు ఈ లోకానికి ఒక సందేశం నిమిత్తం వస్తారు. వారి జీవిత కాలంలో కొద్దిమంది మాత్రమే వారిని గుర్తించగలుగుతారు. కానీ వారు నిష్క్రమించిన తరువాత వారి జీవిత చరిత్రా, సందేశమూ నూత్న వేగం సంతరించుకొని లోకాన్ని ఆవరించివేస్తాయి. ఆధ్యాత్మిక రంగంలో మాత్రమే కాదు, మత సమాజ రాజకీయ ఆర్థిక కళా విజ్ఞాన రంగాలన్నిటిలోను చొచ్చుకుపోయి వాటికి కొత్త నిర్వచనాన్నీ స్థాయినీ కలిగిస్తాయి. శ్రీరామకృష్ణుల జీవితం అలాంటిదే. ప్రస్తుతం ఆయన పేరిట జరుగుతున్న కార్యకలాపాలన్నిటినీ చూసిన వారంతా ఈ నిజాన్ని గ్రహించుకోగలరు.
శ్రీరామకృష్ణుల మూడు పరిమాణాలు
స్వామి వివేకానంద ద్వారానే శ్రీరామకృష్ణ పరమహంసను అవగతం చేసుకోవడానికి ప్రయత్నించాలని చెబుతారు. కానీ స్వామీజీ తమ ప్రసంగాలలో శ్రీరామకృష్ణుల గురించి కారణాంతరాల వలన ప్రస్తావించ లేదు. అట్టడుగున ఉన్న ఆ భావోద్వేగపు ఊట ఆయన రచించిన గీతాలలో ఎడతెగక ప్రవహించింది. శ్రీరామ కృష్ణుల గూర్చి అనేక విషయాలు స్వామీజీ గీతాల మూలంగా మనం తెలుసుకో వచ్చు. స్వామీజీ విరచిత గీతాలనూ, ఆయన చేసిన ప్రసంగాలనూ తరచి పరికిస్తే ఆయన శ్రీరామకృష్ణులను మూడు కోణాలలో అభివర్ణించినట్లు మనకు తెలియ వస్తుంది. వీటినే శ్రీరామకృష్ణుల మూడు పరిమాణాలుగా పేర్కొన్నాం. అవి: 1 పరి పూర్ణులు (నరదేవః) 2. గురుదేవులు (గురువరః) 3. అవతార శ్రేష్ఠుడు (అవ తార వరిష్ఠః).
శ్రీరామకృష్ణులు: పరిపూర్ణులు
“మన జాతి శ్రేయస్సు కోసమూ, మన ధర్మం శ్రేయస్సు కోసమూ ఈ మహోన్నత ఆదర్శ పురుషుణ్ణి మీ ముందు ఉంచుతున్నాను” అన్న స్వామీజీ వచ నాలలో ‘పరిపూర్ణులు’ అనే పరిమాణం సూచితమవు తున్నది. ఎందుకంటే ఆదర్శ పురుషుడు అన్నప్పుడు మనం అనుసరించదగ్గ వ్యక్తియై ఆతడు ఉండాలి. శ్రీరామకృష్ణుల ఈ పరిమాణాన్ని మాత్రమే మనం అనుసరించి నడవగలం. ‘నేను పూర్తి పదహారు అణాలకు జీవించి చూపాను. మీరు ఒక్క అణా మేరకైనా చేయండి’ అని శ్రీరామ కృష్ణులు అన్నప్పుడు, తమ పరిపూర్ణత్వ పరిమాణాన్నే తెలుపుతున్నారు.
మనిషి గుణగణాలుగా మన శాస్త్రాలు శ్లాఘించే పవిత్రత, త్యాగము, అంతర్జ్ఞానం, కరుణ, నిజాయతీ, సరళత్వం, నమ్రత, వీటిలో దేనినైనాసరే తీసు కుని ధైర్యంగా అనుష్ఠించే మనస్సు – అంటూ అన్ని లక్షణాలూ పరిపూర్ణంగా ఉన్నంత మాత్రాన ఆయనను మనం ఆదర్శ పురుషునిగా పరిగణించడం లేదు, ఎందుకంటే నిజాయతీ, సరళత ఇవన్నీ కేవలం లక్షణాలే కానీ జీవితం కాదు. ఈ కాలానికి ఆవశ్యకమయిన నూతన జీవిత విధానాన్ని ఆయన స్వయంగా జీవించి చూపినందువలననే ఆయనను పరిపూర్ణ మనిషిగానూ, ఆదర్శపురుషుని గానూ వివేకానంద స్వామి లోకానికి చాటిచూపించారు.
వేదకాల జీవన విధా నాన్ని పుష్టిచేశారు శ్రీరామకృష్ణులు
సన్న్యాసాశ్రమ ధర్మాన్ని అంగీకరించే అన్ని మతాలూ సన్న్యాసిని ఆదర్శ పురుషునిగా ఆరాధిస్తాయి. భారత దేశంలో సర్వసంగపరిత్యాగం చేసి ఒక గుహలో జీవిస్తున్న సన్న్యాసి, మహారాజు కన్నా గొప్పగా గౌరవింపబడతాడు. గుహలో జీవనం గడుపుతున్న సన్న్యాసి పరిపూర్ణ మనిషిగా ఉండవచ్చు కానీ ఆయన ఒక ఆదర్శ పురుషుడుగా ఉండజాలడు. ఆయనను ఆదర్శంగా తీసుకుని జనసామాన్యం తమ జీవితాలను మలచుకోలేదు. అదే సమయంలో, ప్రాపంచిక జీవితానికి మాత్రమే ప్రాముఖ్యమిచ్చే ప్రస్తుత సమాజంలో త్యాగం, సర్వసంగపరిత్యాగ మహత్త్వం తగ్గుతూండడం కాదనలేని నిజం. అందువలన సన్న్యాస ధర్మాన్ని అంటిపెట్టుకోకుండా ఆధ్యాత్మిక జీవనం కొనసాగించలేమా అనే ప్రశ్న మనిషి హృదయంలో తలెత్తింది. తప్పకుండా జీవించగలమని చెబుతూ అలాంటి ఒక జీవితాన్ని అనుసరించి చూపడానికే శ్రీరామకృష్ణ పరమహంస అవత రించారు.
శ్రీరామకృష్ణులు కావాలనుకొనివుంటే వివాహం చేసుకోకుండా ఉండవచ్చు. కానీ ఆయన వివాహం చేసుకున్నారు. భార్యను వర్జించకుండా సన్న్యాస ధర్మాన్ని కూడా పాటించారు. తద్ద్వారా సన్న్యాస ఆదర్శాలను కించపరచకుండా, అదే సమయంలో సంసార ఆదర్శానికి కూడా తగిన స్థానం ఒసగే ఒక నూతన మార్గాన్ని ఆవిష్కరించారు. ఇక్కడ సన్న్యాసధర్మ తీవ్రత, ఏకాంతత వర్జింపబడ్డాయి; సంసార ధర్మ తీవ్ర ఇంద్రియ సుఖాలు, ధనాశ వర్జింపబడ్డాయి. ఈ మధ్యమ పంథా ఆధు నిక మానవునికి తగినట్లుగా అమరడంలో ఆశ్చర్యమేమీ లేదు కదా!
నిజానికి దీనిని ఒక నూతన మార్గంగా పేర్కొనడం సబబు కాదు. మన వేద కాల ఋషుల ఇలాంటి జీవితాన్ని గడిపారు. ప్రస్తుతం మనకు కనిపించే గార్హస్థ్యమూ, సన్న్యాసమూ అనే విభాగం వేద కాలంలో లేదు. ఇదంతా బుద్ధుని తదనంతర కాలంలో ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. వేదకాల ఋషులలో పలు వురు మధ్యమ పంథానే అనుసరించారు. దీనినే వివేకానంద స్వామి, “ప్రాచీన భారతదేశంలో వందలాది ఋషులు ఉండేవారు. భవిష్యత్తులో లక్షలాది ఋషులు ఉండబోతున్నారు. ఈ విషయాన్ని ఎంత త్వరగా మనమందరమూ విశ్వసిస్తే మన దేశానికి అంత మంచిది. లోకానికీ మంచిది” అంటారు. శ్రీరామకృష్ణులు ఈ వైదిక ధర్మాన్ని పునరుద్ధరించి ఆధునిక కాలానికి యుక్తమైనదిగా చేశారు.
శ్రీరామకృష్ణులు విధివిహితంగా సన్న్యాసం స్వీకరించినవారు. కానీ భార్యను త్యజించలేదు. అర్చక వృత్తిని చేపట్టి చివరి వరకు ఏడు రూపాయలు నెల జీతంగా పుచ్చుకున్నారు. చక్కని గదిలో నివసించారు. చక్కని ధోవతి, చొక్కా, పాదరక్షలూ వాడారు. నూనె రాసుకుని స్నానం చేసేవారు. తమలపాకు చిలుకలు నమిలేవారు. సమాజంలో ప్రముఖులను కలుసుకున్నారు. ఇలా ఒక నగరంలోని సామాన్య పరిస్థితిలోనూ పవిత్రులుగా, పుణ్య పురుషులుగా జీవించడం సాధ్యమే అని స్వయంగా ఆచరించి చూపారు. సామాన్య మనిషి కూడా సంసారం నుండి విడవడ కుండానే ఉన్నత జీవితం గడపవచ్చుననడానికి ఆయన జీవితమే మహోన్నత ఆదర్శంగా పరిణమించింది.
పరిపూర్ణ మనిషి పరి మాణంలో మాతృదేవి పాత్ర
కానీ ఇలాంటి ఆదర్శాన్ని ఒక స్త్రీ స్వీకరించి ఇలాంటి జీవితాన్ని ఆచరించ వచ్చునని ప్రదర్శించినప్పుడే అది పరిపూర్ణ జీవితం కాగలదు. అందుకోసం అవత రించినవారే మాతృదేవి. ఆమె శ్రీరామకృష్ణులలా కఠోర తపస్సులు ఏవీ ఆచరించలేదు. కానీ సరళమైన మనస్సు, పాత్ర భర్తకు హృదయపూర్వకమయిన సేవ, జపం, ధ్యానం లాంటి అందరూ అనుసరించదగిన సాధనల మూలంగానే ఉన్నత స్థితిని చేరి, అలాంటి ఆదర్శ జీవితాన్ని ఆచరించి చూపించారు. తన్మూలంగా సంసారం లోని స్త్రీలకు ఆమె ఆదర్శ మహిళగా రూపొందారు.
శ్రీరామకృష్ణులు –గురుదేవులు
స్వామీజీ దృష్టిలో రెండవ పరిమాణం గురుదేవుడు. అంటే ఉన్నతమయిన గురువు అన్నమాట. ‘గురుం భవ వైద్యం’ – సంసారమనే ఘోరమైన వ్యాధికి దివ్యౌషధమే గురువు అంటూ వారిని వర్ణిస్తారు. అంటే ఈయనకు, ఆయనకు, ఈ దేశానికి, ఆ దేశానికి అంటూ కాకుండా ప్రాపంచికమనే వ్యాధితో బాధపడే అంద రికీ వైద్యుడయిన గురువుగా శ్రీరామకృష్ణులను అభివర్ణించారు స్వామీజీ. కేవలం చిలుక పలుకులతో ఎవరూ లోకానికి గురువు కాలేరు. లోకంలో ఎందరున్నారో వారందరి మనస్తత్త్వాలూ భిన్నమయినవి. జగద్గురువు అన్నప్పుడు వారందరికీ యుక్తమైన ఆధ్యాత్మిక మార్గాన్ని చూపగలిగే సమర్థత కలిగి ఉండాలి. అటువంటి మార్గాన్ని మానవాళికి చూపిస్తున్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు వినూత్న విశ్వాసాన్ని రగిలించారు. ఆంగ్లేయుల విద్యావిధానం వలన యథార్థమైన బుద్ధిని కోల్పోయి, మన పారంపర్యాలు, సంస్కృతి, ఆధ్యాత్మికత ఇవన్నీ కేవలం మూఢ నమ్మకాలేనా అనే సంశయంతో నలిగిపోతున్న మనిషి హృదయ పద్మం వికసించ డానికి విశ్వాసమనే సూర్యకిరణం కావలసివచ్చింది. అలాంటి విశ్వాస సూర్యకిరణా లను వ్యాపింపజేయడానికి ఉదయించింది శ్రీరామకృష్ణుల దివ్యవాణి: “అవును, నేను భగవంతుణ్ణి చూశాను! కావాలనుకుంటే మీరు కూడా ఆయనను దర్శింప వచ్చు.” ఈ మాటల మూలంగా మానవ హృదయంలో విశ్వాసమనే బీజాన్ని నాట డంతో పాటు మళ్లీ మరోసారి వేదాల, శాస్త్రాల యథార్థత నిరూపింపబడింది.
ప్రస్తుతం మనం సర్వత్రా చూస్తున్నాం కదా! జీవితంలో ఎలాంటి పట్టూలేని ఒక స్థితి! ఇందుకు కారణం జీవితంలో మనిషి ఎలాంటి ఉన్నత లక్ష్యమూలేకపోవడమే. డబ్బు, సుఖభోగాలను మాత్రమే లక్ష్యంగా చేసుకోసాగాడు మనిషి. కానీ అవి అతణ్ణి వదిలేసుకున్నాయి. జీవితమంటే ఇదేనా! ఇలా చూపించి చూపించి మైమరపించే ఈ సుఖభోగాలు తప్ప జీవితంలో సాధించదగింది ఏమీ లేదా అని అంగలారుస్తున్న మనిషికి శ్రీరామకృష్ణుల విశ్వాస వెలుగు కిరణం వచ్చి దారి చూపిస్తున్నది.
అందువలన గురుదేవులు లేక గురువు అనే పరిమాణంలో మొదటి అంశంగా మనం చూసేది ఆయన చూపించే విశ్వాసమనే కాంతి కిరణం.
కానీ కేవలం విశ్వాసంతో దేనినీ సాధించలేం. అది వేరూనడానికి స్థిర చిత్తం ఆవశ్యకం. దానిని సమకూర్చేది ఆయన సందేశం. ‘అమృత పుత్రులారా’ అంటూ మానవాళిని ఆహ్వానించిన ఋషులవాణికి ప్రతిధ్వనిలా ఉవ్వెత్తున లేచింది శ్రీరామకృష్ణవాణి – ‘ఓ మానవా! నువ్వు భగవంతుని స్వరూపం’. శ్రీరామ కృష్ణుల ఈ అద్భుత సందేశ మహత్త్వం ఏమిటంటే, ఇది దేశం, మతం, జాతి, భాష లాంటి తారతమ్యాలన్నిటి కీ అతీతమై, “నువ్వు భగవంతుని స్వరూపం” అనే సత్యాన్ని మనిషైన ప్రతి ఒక్కడూ స్వీకరించి అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఆతను హిందువు కావచ్చు, కాకపోవచ్చు. ఆతడు దివ్యత్వాన్ని పొందడం, దివ్యత్వాన్ని పంచిపెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మతం ప్రసక్తే రాదు.
అలా అయితే ఇక మతంతో పనిలేదని ఆయన అభిమతమా? కాదు. మతమనేది మనిషికి ముఖ్యావసరాలలో ఒకటని ఆయన ఎరిగివున్నారు. కానీ అన్ని మతాలలోనూ మంచి, అదే సమయంలో ఒకింత చెడు ఉండడం ఆయన గ్రహిం చారు. కనుక ఏ మతాన్నీ తోసిపుచ్చక, లోటుపాట్లు చూపించక, వాటిలోని మంచిని మాత్రం గ్రహించమని ఆయన ఉపదేశించారు. ఒక వ్యక్తి ఆంతరిక పురోగమనానికి ఏది అవసరమో, అది ఏ మతంలో ఉన్నాసరే, దానిని అనుస రించవచ్చు. తాను పరిపూర్ణ, దివ్యుడనని గ్రహించడానికి హిందూమతంలోని ఒక మార్గం తోడ్పడగలదని ఒకడు అనుకుంటే, ఆతడు దానిని అనుసరించవచ్చు. క్రైస్తవంలోని ఒక విభాగం ఆవశ్యకమయితే దానినీ అనుసరించవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మతం కన్నా మనిషికే ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ విషయాన్ని ఎంతవరకు మనిషి గ్రహించి స్వీకరించాడో మనకు తెలియదు. కానీ బాహ్య ప్రపంచంలో మాత్రమే ఆనందం ఉందనే నిర్విరామ పరుగులో మునిగివున్న మానవ సమాజాన్ని ఈ తారక మంత్రం మాత్రమే రక్షించ గలుగుతుంది. శ్రీరామకృష్ణుల ఈ సందేశాన్నే వివేకానందస్వామి తన బోధనలకు మూలాధారంగా చేసుకున్నారు.
జగద్గురువు స్థితి: శ్రీరామకృష్ణుల సందేశం
జగద్గురువు అనే పరిమాణంలో శ్రీరామకృష్ణులు మనిషికి వ్యక్తిగతంగా ఇచ్చిన సందేశం ‘నువ్వు పరిపూర్ణ దివ్యుడవు’ అన్నదే. సమాజానికి ఒసగింది మత సమస్యలకు పరిష్కారం. మతం మనిషిని సన్మార్గునిగా చేయాలనే పరిస్థితి మారి, ప్రస్తుతం మతాలే మనిషికి సమస్యగా మారిన పరిస్థితి ఏర్పడుతున్నది. మత సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారాన్ని సూచించారు శ్రీరామకృష్ణులు. ఈ పరి ష్కారం కోసం ఆయన తననే ఒక పరిశోధనా క్షేత్రంగా మలచుకున్నారు. హిందూ మతంలో ప్రతి ఒక్క సంప్రదాయంవారి సాధన పద్ధతులనూ, ఇతర ముఖ్య మతాలైన క్రైస్తవ, ఇస్లాం మతాలనూ అనుసరించి వాటిలో ప్రతి దాని నుండి పరమ సత్యమైన భగవంతుని చేరుకున్నారు. ఇది ఆ దారులన్నీ సత్య మయినవనే ఆయనకు ఋజువు చేశాయి. అందువల్ల ‘మతాలెన్నో మార్గాలన్ని’ అనే చక్కని ఆదర్శాన్ని నెలకొల్పారు. దీనిని సరిగా అర్థం చేసుకుని అనుసరించి నప్పుడు మత సమస్యలకు ఆస్కారమే ఉండదు. ప్రతి ఒక్కటీ నిజమైన దారియై ఉన్నప్పుడు, ఏది ఉన్నతమైనది, ఏది కాదు? హిందువు ముస్లింగా మారాలా? ముస్లిం క్రైస్తవుడుగా మారాలా? అక్కరలేదు. ఈ ఆదర్శాన్ని మాత్రం లోకం స్వీకరిస్తే మత సమస్యలకు ఇక ఆస్కారమే ఉండదు.
నూతన సన్న్యాస సంప్రదాయం
ఆధ్యాత్మికత, మతంలాంటి వాటికే కాకుండా, కళలు, విజ్ఞానం, రాజ కీయం, సంస్కృతి వంటి అన్ని శాఖల్లోనూ వాటికి పట్టుగొమ్మలుగా సన్న్యాసులే ఉంటూ వచ్చారు. దండయాత్రలు, కరవు, వరదలు వాటిల్లి దేశానికి క్లిష్ట దశ వచ్చినప్పుడల్లా సన్న్యాసులే ఆ దేశ సంప్రదాయాలను కాపాడుతూ వచ్చారు. చరిత్రాధ్య యనంతో, ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అందువలన జగ త్తుకు తాను తీసుకువచ్చిన కొత్త సందేశాన్ని కాపాడడానికీ, దానిని ప్రజల మధ్య వ్యాప్తి చేయడానికీ సాధువుల సంప్రదాయం ఒక దానిని శ్రీరామకృష్ణులు నెలకొల్ప వలసి వచ్చింది. అందుకోసం వివేకానంద స్వామి ఆధ్వర్యంలో యువకులు కొంద రికి తర్ఫీదు నిచ్చి వారిచే సన్న్యాసం స్వీకరింపజేశారు శ్రీరామకృష్ణులు. ఈ కొందరు యువకులు నూతన ఆదర్శాలతో కాలావశ్యకమైన ఒక సన్న్యాస సంప్ర దాయంగా రూపుదిద్దుకున్నారు.
ఇలా శ్రీరామకృష్ణులను గురుదేవులనే పరిమాణంలో వ్యక్తిగతంగా మనిషికీ సమాజానికీ, సన్న్యాస సంప్రదాయానికీ సందేశాల నిచ్చిన మూడు ముఖ్యమైన స్థితులలో చూడగలుగుతున్నాం.
‘గురుదేవుడు’ అనే పరిమాణంలో మాతృదేవి పాత్ర
ఈ పరిమాణంలో మాతృదేవి పాత్ర మహత్త్వపూర్ణ మయినది. గురుదేవుల నిర్యాణానంతరం మాతృదేవి గురుదేవిగా ఈ బాధ్యతను స్వీకరించారు. మంత్రదీక్ష అనే మహత్తరమైన ప్రక్రియ మూలంగా ఆమె, ‘నువ్వు దైవత్వ సంపూర్ణడవు” అనే సందేశాన్ని మానవ జాతికి అందించారు. గొప్ప – బీద; పండితుడు – పామరుడు; స్త్రీ–పురుషుడు; చిన్న – పెద్ద; హిందు – క్రైస్తవ, ముస్లిం అనే విచక్షణ లేకుండా తన కారుణ్య హస్తాలతో అందరినీ అక్కున చేర్చు కొన్నారు. ఇలాంటి ఒక ప్రేమ సాగరాన్ని లోకం ఇంత దాకా చూసివుండ లేదనే చెప్పాలి. “భక్తుల మధ్య జాతి, కుల భేదాలు లేవు. వారు ‘భక్త జాతి’ కి చెందినవారు” అనేవారు మాతృదేవి.
ఇంకా చెప్పాలంటే గురుదేవులు నెలకొల్పిన సన్న్యాస సంప్రదాయం ఒక సంఘంగా రూపుదిద్దుకోవడంలో మాతృదేవి మహత్తరమైన పాత్ర వహించారు. ‘సంఘ జనని’ అంటే, ‘రామకృష్ణ సంఘాన్ని నెలకొల్పినవారు’ గా మాతృదేవి ఆరాధింపబడుతున్నారు.
శ్రీరామకృష్ణులు :అవతార వరిష్ఠులు
స్వామీజీ చూపించే మూడవ పరిమాణం శ్రీరామకృష్ణులు అవతార వరిష్ఠులు అనే అంశం. ఉపన్యాసాలలోనూ, పాటలలోనూ ఈ విషయాన్ని ఘంటా పథంగా చెప్పారు స్వామీజీ. గురుదేవుల జీవిత కాలంలో వైష్ణవచరణ్, గౌరీకాంతుడు, పద్మలోచనుడు, భైరవీ బ్రాహ్మణి లాంటి పలువురు మేధావులు ఆయనను కలుసు కున్నారు. శాస్త్రాలు వచించే అవతార పురుషునికి ఉండవలసిన సకల లక్షణాలూ ఆయనలో చోటు చేసుకున్నాయని గుర్తించిన వారందరూ ఆయనను అవతార పురుషునిగా ఆరాధించారు. అంత మాత్రమేకాదు. ఒక గొప్ప పండిత సభను ఏర్పాటు చేసి ఈ విషయాన్ని నిరూపించివున్నారు. ఇక ప్రస్తుతమో – ఆయన అవతార పురుషునిగా, దైవంగా ఆరాధింపబడుతున్నారు.
వివేకానంద స్వామి దృష్టిలో శ్రీరామకృష్ణులు అవతార పురుషులు మాత్రమే కాదు, అవతార వరిష్ఠులు. “శ్రీరామకృష్ణులు అతి సమీప కాలంలో ఉద్భవించిన వారు. అవతార వరిష్ఠులు కూడా! ఆయనలో ప్రేమ, జ్ఞానం, త్యాగం, విశాల దృక్పథం, మానవ జాతికి సేవ చేయాలనే ఆకాంక్ష – ఇవన్నీ ఆయనలో పరి పూర్ణంగా ఉండినవి. ఆయనకు సాటి ఎవరు? ఆయనను స్వీకరించని వారి జన్మ వ్యర్థమే” అంటా రాయన.
ఒక అవతార పురుషుని ముఖ్యమైన గుర్తుగా స్వామీజీ పేర్కొనేది ముక్తిని ప్రసాదింపగల సామర్థ్యం. “అవతార పురుషులు కపాల మోచనులు. అంటే విధినే మార్చగలవారు. ఉన్నత స్థితిని చేరుకున్న మహాత్ములు సైతం ఈ కార్యం చేయలేరు. ఇతరుల పాపాలను స్వీకరించగలవారు – అవతార పురుషులు మాత్రమే. మామూలు గురువులు చేయలేరు” అంటారాయన. ఇలా మానవ జాతిని ఉద్ధరించడానికి అవతరించారు శ్రీరామకృష్ణులు!
ఈ పరిమాణంలో మాతృదేవి పాత్ర
మానవ జాతిని ఉద్ధరించి, ముక్తిని ప్రసాదించాలని కంకణం కట్టుకున్న గురుదేవుల కరుణా ప్రవాహమే, ఆయన కృపాశక్తిగా, మాతృదేవిగా మూర్తీభవించి అవతరించింది. అవతార స్థితిలో గురుదేవులూ, మాతృ దేవీ భిన్నం కాదు. గురుదేవుల ఉద్ధరణశక్తే మాతృదేవి. ఈ శక్తియే మాతృదేవిలో, ‘లోకాన్ని ఆవహించిన మాతృత్త్వం’ గా అభివ్యక్తమైంది. దీనినే మాతృదేవి, ‘మాతృత్వాన్ని లోకానికి చాటి చెప్పడానికే గురుదేవులు నన్ను వదలి వెళ్లారు’ అని చెప్పేవారు. అందువలన గురుదేవులు, అవతార వరిష్ఠుడు అనే ఈ పరిమాణంలో ‘ఆయన కృపాశక్తియైన మాతృత్వాన్ని’ లోకానికి చూపెట్టడంగా మాతృదేవి పాత్ర వహించారు.
ఇలా శ్రీరామకృష్ణుల మూడు పరిమాణాలలోనూ, అంటే మూడు విధాలైన కార్యక్రమాలలోనూ మాతృదేవి పాత్ర మహత్త్వపూర్ణ మయినది. అందువల్లనే వారిరువురూ ఒకటిగా చేరాల్సి వుండింది. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలకు ఒక ప్రారంభంగా నెలకొన్నదే శ్రీ శారదా–రామకృష్ణుల వివాహం.