సగటు స్త్రీకి కలిగే అవకాశాలే శారదకు కూడా లభించాయి
శారద పుట్టింది, పెరిగింది అతిసామాన్యమైన పేదకుటుంబంలో. కనుక లౌకిక జీవితానికి సంబంధించినంత వరకు ఒక సగటు స్త్రీకి కలిగే అవకాశాలే ఆవిడకు కూడా లభించాయి. అందులోనూ పేదకుటుంబంలో ప్రథమ సంతానంగా జన్మించినందున ఆమె తల్లి మాదిరే ప్రవర్తించవలసివచ్చింది. కడగొట్టు సంతానానికి లభించే చిన్నచిన్న సౌకర్యాలు కూడా ప్రథమ సంతానం కోల్పో వలసి వస్తుంది. శారద జీవితంలో కూడా మనం ఈ విషయం గమనించవచ్చు. చిన్నతనం నుండే తల్లికి వంటలో సాయం చేయడం, చెల్లి తమ్ముళ్ల ఆలనాపాలనా వంటి అన్ని పనులూ ఆమే చేసేది.
జంధ్యాలు వడకి వాటిని అమ్మడం రామచంద్ర చేపట్టిన వృత్తులలో ఒక టని ముందే మనం తెలుసుకొన్నాం. అందుకోసం ఆయన ప్రత్తిని పండించే వాడు. ప్రత్తి పంటపొలానికి వెళ్లేటప్పుడు శ్యామసుందరి, శారదను తోడ్కొని వెళ్లేది. ఒక మూలన ఆమెను విడిచిపెట్టి తాను ప్రత్తి కాయలను సేకరించేది. కాస్త ఎదిగిన తరువాత శారద కూడా ప్రత్తి కాయలు సేకరించి, జంధ్యాలు వడక డంలో తల్లితండ్రులకు సాయపడి, కుటుంబ ఆర్జన పెంచడంలో యథోచితంగా తన పాలు నిర్వహించింది.
తల్లి ఇతర పనులలో మునిగివున్నప్పుడు, వంటపనీ తోబుట్టువులను లాలించడమూ శారద చేసే ముఖ్యమైన పనులు. చెరువుకు వెళ్లి ఆమే నీళ్లు తీసుకువచ్చేది. పనిలో పనిగా ఈత కూడా నేర్చుకొంది. కాలాంతరంలో కామార్పు కూర్లో అప్పుడప్పుడు బసచేసినప్పుడు ఈతతోపాటు, పాటలు, కుట్టుపని మొద లైనవి కూడా నేర్చుకొంది. ఇంట్లో ఇతరత్రా పనులు కూడా చూసుకొనేది. ఆ రోజులను గురించి ముచ్చటిస్తూ కాలాంతరంలో ఇలా అన్నారు:
“మరీ చిన్నతనంలోనే నేను వంట చేయడం మొదలుపెట్టాను. పెద్ద కుండ లను పొయ్యిమీద పెట్టడం, దించడంలో నాన్న సాయపడేవారు. చెల్లినీ తమ్ముళ్లనూ నేను చూసుకొనేదాన్ని. వారిని తీసుకొని గంగానదికి స్నానానికి వెళ్లే దాన్ని. గంగానది అంటే – మా గంగానది – అంటే ఆమోదర్ వాగు గురించే చెబుతున్నాను. వెళ్లేటప్పుడు అక్కడ తినడానికి మరమరాలు తీసుకువెళ్లేవాళ్లం. బట్టలు ఉతుకుకొని, స్నానం చేసిన తరువాత ఒడ్డున కూర్చుని మరమరాలు తినేవాళ్లం. తదనంతరం అంతా కలిసి ఇంటికి తిరిగిపోయేవాళ్లం. అదేమిటో తెలియదు, గంగ అంటే నాకు అలాంటి ప్రత్యేకమైన అనుబంధం ఉండేది.
“కొన్ని సమయాల్లో మెడ లోతు నీళ్లలో దిగి పశువుల కోసం గ్రాసం కోసే దాన్ని. పొలాలలో పనిచేసేవారికి మరమరాలు తీసుకువెళ్లి ఇచ్చేదాన్ని. ఒకసారి మిడతలు గుంపులు గుంపులుగా వచ్చి పంటనంతా ధ్వంసం చేసేశాయి. అప్పుడు పొలాలన్నీ తిరిగి నేల రాలిన ధాన్యాన్ని సేకరించాను.”
తన అక్కయ్యను గురించి కాళీకుమార్ కాలాంతరంలో ఇలా వ్యాఖ్యానిం చాడు: “మమ్మల్ని అక్కయ్య ఎంత బాగా చూసుకొన్నదో కదా! ఎన్ని కష్టాలుపడి పని చేసింది. వడ్లు దంచడం, జంధ్యాలు వడకడం, పశువులకు గ్రాసం పెట్టడం, వంట చేయడం అంతా ఆమే! ఇంటి పనులన్నీ ఆవిడే చేసేదని ఒక్క మాటలో చెప్పవచ్చు.”
శారద నిర్వర్తించే ఈ పనులు, వయస్సుకు మించిన ఇలా బాధ్యత వహిం చడం కొన్ని సమయాలలో ఇంటిల్లిపాదికీ ఆశ్చర్యం కలిగించేదనడం అతిశయోక్తి కాదు. ఆవిడ ఒక్కతే ఎలా ఇన్ని పనులు చేయగలుగుతున్నదోనని వారు విభ్రాంతు లయ్యేవారు.
శారద చదువు
భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ఎన్నడూ పుస్తక విద్య మూలంగా నిర్ణయించబడలేదు. పారంపర్యంగానో, గురువు ద్వారానో లేదా మరేదో ఒక మార్గంలోనో ఆ వికాసాన్ని ప్రజలు పొందుతూవచ్చారు. స్త్రీల పరంగా చూస్తే ఈ విషయం మరింత యథార్థమవు తుంది. సామాన్యంగా హైందవ కుటుంబాలలో నెలకొని ఉండే ఆధ్యాత్మిక వాతావరణం, తల్లితండ్రులు బిడ్డలను పోషించడానికి చేసే సేవాత్యాగాలు – వీటితోపాటు దేవాలయ ఉత్సవాలు, అక్కడ నిర్వహించే హరికథలు, పురాణ ఇతిహాసోపన్యాసాలు, వీథిగాయకులు పాడే అర్థవంతమైన పాటలు – ఇవన్నీ వారికి ఆంతరికంగా ఉన్నతిని కలిగిస్తూ వారి హృదయాలను పరిపక్వం చేస్తూం టాయి. అందువలన పుస్తక విద్య నిరాకరింపబడినా, ఏకాంతంగా జీవించినా స్త్రీలు ఏ రకంగానూ జ్ఞానసముపార్జనలో తీసిపోలేదు.
స్త్రీలు పాఠశాలకు వెళ్లడం అపచారంగా పరగణించబడిన ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకోవాలని ధైర్యంగా ప్రయత్నించింది శారద. చెల్లీ తమ్ముళ్లను చూసు కోవడంలోనే ఆమె కాలమంతా గడిచిపోయేది. లభించే ఏ స్వల్ప వ్యవధిలోనో తమ్ముళ్లతో వీథిబడికి వెళ్లేది. ఈమె ఏం సాధించగలుగుతుందిలే అనుకొనో ఏమో ఎవరూ ముందుకువచ్చి ఆమెను ప్రోత్సహించలేదు. శారదలోని ఉత్సాహం వివా హానంతరం కూడా సన్నగిల్లలేదు. తమ చదువును గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పారు:
“కామార్పుకూర్లో ఉంటున్నప్పుడు నేనూ, లక్ష్మి వంగ భాషలోని ప్రాథమిక పాఠాలను చదువనారంభించాం. అప్పుడు హృదయ్కు వచ్చింది కదా కోపం! ‘స్త్రీలైన మీరు చదవడం, వ్రాయడం చేస్తున్నారా ఏమిటి? ఆ తరువాత నాటకాలూ కథలూ చదవాలని కలలుగంటున్నారా?” అంటూ, నా వద్దనున్న పుస్తకాన్ని లాగే శాడు. కానీ లక్ష్మి తన పుస్తకాన్ని ఇవ్వలేదు. ఏమైనా ఆమె ఆ ఇంటి ఆడపడుచు కదా! పోటాపోటీగా ఆమె అతడితో సమఉజ్జీగా పోరాడగలిగింది! నేనేం చేయ గలను? అయినా నేను వదలలేదు. ఒక అణా పెట్టి రహస్యంగా ఒక పుస్తకం కొను క్కొన్నాను. లక్ష్మి బడికి వెళ్లేది. బడి నుండి తిరిగి వచ్చాక నాకు నేర్పించేది. కానీ పెద్దగా నేనేం సాధించలేదు. నిజానికి నేను ఏదో కొంత నేర్చుకొంది దక్షిణేశ్వరం లోనే. గురుదేవులు అప్పుడు చికిత్స పొందుతూ శ్యాంపుకూర్లో ఉన్నారు. నేను ఒంటరిగా ఉన్నాను. భవముఖర్జీ కుటుంబానికి చెందిన ఒకామె ఆలయ కొలనులో స్నానం చేయడానికి వచ్చేది. అప్పుడు ఆమె నాతో చాలాసేపు గడిపేది. ఆమె నుండే ఏదో కాస్త చదవడం, వ్రాయడం నేర్చుకొన్నాను. నేర్పించడమే కాక నేను నేర్చుకొంటున్నానా లేదా అని కూడా ఆమె పరీక్షించేది. ఆలయం నుండి నాకు వచ్చే ఆకుకూర, కూరగాయలు, ఇతర వస్తువులలో కొంత ఆమెకు ఇచ్చేదాన్ని.”
సామాన్యమైన గుణగణాలు
పందొమ్మిదవ శతాబ్దంలో ఒక సగటు పల్లెటూరి బాలిక నుండి మనం ఏం ఆశించవచ్చునో అట్లే బాలికయైన శారద మెలగింది. ఇతరుల పట్ల ఆప్యాయత, బాధ్యత, కుటుంబ నిర్వహణా సామర్థ్యమూ – వీటికి ఆమెలో కొరతలేదు. ఆడుకొంటున్నప్పుడు ఇతర పిల్లలతో పోట్లాడడం, తగాదాపడడం లాంటి గుణాలు ఆమెలో మచ్చుకైనా లేవు. ఇతరులు పోట్లాడుకోవడం చూస్తే వారి మధ్య రాజీ చేసేది. ఈ లోకాన్నే కుటుంబంగా పరిగణించవలసి నందువలననేమో కుటుంబ ఆటలపట్ల ఆమె ఎక్కువ ఆసక్తి కనబరచేది. కానీ వాటిలో ఆమే ఇంటికి పెద్దగా వ్యవహ రించేది. ఇలా సర్వసామాన్యమైన బాలికగా కానవచ్చినా, ఒక్క విషయంలో ఆమె తన ప్రత్యేకతను ప్రదర్శించింది. ఆ విషయానికి సంబంధించినంత వరకు పసి పాపగా ఉన్నప్పటి నుండే ఆమె ఒక ప్రహేళికగానే ఉండిపోయింది – అది ఆమె దివ్యత్వం!
అవతార పురుషుల బాల్యం
లోకంలో జన్మించే వారిని రెండు కోవలుగా వర్గీకరిస్తుంది హిందూమతం. ఈ లోకంలో జన్మించి ఇక్కడి నుంచే శ్రేయస్సును సంతరించుకొని ధన్యులయ్యే వారు ఒక కోవకు చెందుతారు. మరొక కోవకు చెందిన వారు ఈ లోకంలో జన్మించి లోకశ్రేయస్సునే కల్పించి నిష్క్రమిస్తారు. వీరి జీవితాలను పరిశీలిస్తే లోకం నుంచి వీరు దేనినీ సంగ్రహించలేదనీ, వారికి అవసరమైన దేదీ ఈ లోకంలో లేదనే విషయం తేటతెల్లమవుతుంది. మొదటి కోవకు చెందినవారు అతిసామాన్యులు. రెండవ కోవకు చెందినవారు అవతార పురుషులు. విధిలేక సామాన్యులు జన్మి స్తారు. కానీ అవతార పురుషులు లోకశ్రేయస్సు కోసం మాత్రమే, తమ ఇచ్ఛ మేరకు జన్మిస్తారు.
తమ జీవితం గురించిన రహస్యం వారికి చిన్ననాటి నుండే జ్ఞాపకంలో ఉంటుందా? అవును. చిన్నతనం నుండే అప్పుడప్పుడు ఈ సత్యం వారి మనస్సులో స్ఫురిస్తూ ఉంటుంది. తరువాత ఆధ్యాత్మిక సాధనల మూలంగా మనస్సు పరిపక్వతను సంతరించుకొన్నప్పుడు ఆ సత్యం వారికి సదా ద్యోతక మవుతూనే ఉంటుంది.* నిజానికి వారిని అవతార పురుషులనడం కంటే, వారు తమను మరుగుపరచుకొని సామాన్యుల్లా జీవిస్తుంటారే, అదే మనకు ఎంతో ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ విషయం శారద చిన్నతనంలో కానవస్తుంది. మానవ ముసుగు ఆవలనున్న ఆమెలోని దివ్యత్వం వ్యక్తమైనప్పుడు దానిలో ఎంత వేగం!
పూజాదికాలలో శారద ఆసక్తి
బొమ్మలు చేయడం, ఆడుకోవడం శారదకు చిన్నతనం నుండే ఎంతో ఇష్టం. దేవతారూపాలను స్వయంగా తానే రూపొందించి, పువ్వులతో వాటిని అలంకరించి పూజించడంలో ఆమె ఎంతో ఆనందించేది. కాళీ, మహాలక్ష్ములు ఆమెకు నచ్చిన దేవతలు. బంకమట్టితో ఆ దేవతల ప్రతిమలను రూపొందించి, పువ్వులతో వాటిని అలంకరించి, నిండు మనస్సుతో ఆమె పూజ చేయడం కనులపండువగా ఉండేది. ఒకసారి జగద్ధాత్రి పూజాసమయంలో దేవి సమక్షంలో కూర్చుని, దేవితో తాదాత్మ్యం చెంది మైమరచిపోయి, బాహ్యప్రపంచాన్ని విస్మరించి చాలాసేపు అలాగే కూర్చుండి పోవడం తటస్థించింది.
శ్యామాతో తనను గురించి శారద చెప్పింది
ఇంటి పనులతోనే శారదకు దాదాపు రోజంతా గడిచిపోతున్నట్లుగా చూశాం. ఆమెతో ఎవరూ, “ఇది చేయి, అది చేయి” అని చెప్పాల్సిన పనే లేదు. చేయవలసినదంతా ఆమె గమనించి బాధ్యతాయుతంగాచేసుకుపోయేది. ఇది శ్యామసుందరికి ఎంతో గర్వ కారణం. “ఈమె మాత్రం ఈ రకంగా ఉండనట్లయితే పనీ, పిల్లలూ అంటూ నేను ఎంతగా అల్లాడిపోయేదాన్నో! కుమార్తె అంటే కుమార్తే” అని చెప్పుకొని గర్వపడేది. కానీ ఆ కుమార్తె ఒక్క పలుకు, ఒక్క సైగ, ఒక్క చూపు కొన్ని సమయాలలో శ్యామాను గందరగోళంలో ముంచెత్తేది. ఈమె నా కుమార్తేనా? లేక ఈమెకు నేనూ, ఈ లోకమూ బిడ్డలమా? ఈ గందరగోళం గురించి కుమార్తెనే అడిగివేసేది: “అమ్మా, శారదా! నువ్వు ఎవరి వమ్మా? నిన్ను అర్థం చేసుకోలేకపోతున్నానే! నిజం చెప్పు తల్లీ!” మామూలుగా శ్యామా ఇలా అడిగితే శారద గంభీరంగా మందహాసం చేసేది. కొన్ని సమయా లలో, “ఇదేమిటి వింతగా ఉందే! నేను ఎవరిని? ఇక నేను మరెవరై ఉండాలట? హఠాత్తుగా నాకు నాలుగు చేతులు మొలుచుకొచ్చాయా ఏమిటి?” అంటూ తెగేసి నట్లు బదులు చెప్పి మాట మార్చివేసేది. శ్యామసుందరి కూడా దాంతో అప్పటికి అంతా మరచిపోయేది. ఇలా ఎన్నోసార్లు జరిగింది.
ఒకసారి శ్యామసుందరి, శారద మాటలు పట్టించుకోకుండా ఇలా అంది: “అమ్మా, నువ్వు ఎవరైనా సరే, ఎన్ని జన్మలెత్తినా అన్ని జన్మలలోనూ నువ్వే నాకు కుమార్తెగా జన్మించాలి!” ఆ మాటలు విని శారద, “ఏమిటేమిటి? ఏమన్నావు? ఇంకా నువ్వు నన్ను కిందికి లాగాలనుకొంటున్నావా? మళ్లీ వచ్చి నీ పిల్లల నంద రినీ చూసుకోవాలి. ఇదే కదా నీ ఉద్దేశం” అంది చిరుకోపంతో.
నాలా మరొకతె
చిన్నతనంలో ఇన్ని పనులు శారద ఎలా చేయగలిగిందోనని విస్మయం చెందడం చూశాం. ఈ విషయం గురించి కాలాంతరంలో మాతృదేవి ఇలా చెప్పేవారు: “నిజం చెప్పనా! నా చిన్నతనంలో అచ్చం నాలాంటి బాలిక ఒకతె ఎప్పుడూ నాతో ఉండేది. నేను వెళ్లే ప్రతి చోటికి ఆమె కూడా నాతో వచ్చేది. నాతో మాట్లాడేది, నవ్వేది, వేడుకలు వినోదాలు తమాషా చేసేది. నా పనులలో పూర్తిగా నాకు సహాయం చేసేది. కానీ మరెవరైనా వస్తేమటుకు మాయమైపోయేది. నాకు పది పదకొండేళ్లు వచ్చే దాకా ఇలాగే జరిగింది.” శారద పశుగ్రాసం కోయడానికి వెళ్లేది. చెరువులో దిగి కొంచెం కోసి గట్టు మీద ఉంచేది. ‘ఆ అమ్మాయి’ మరికొంత గ్రాసాన్ని సిద్ధంచేసి ఉంచేదట.
అష్ట సఖులు
చిన్నతనంలో శారద జీవితంలో అనేకసార్లు జరిగిన మరొక మానవాతీత సంఘటనను ప్రస్తుతం పరికిద్దాం. పూర్వాపర్యక్రమంలో ఇది తరువాత రావలసి ఉంది; శారద వివాహం తరువాత ఇది జరిగింది. ఆమెకు అప్పుడు పదమూడు ఏళ్లు ఉండవచ్చు. ఆ సమయంలో కామార్పుకూర్లో అత్తగారి ఇంట్లో ఉంది. ఇంటి పెరటి తలుపులు తీస్తే సన్నని దారి. సామాన్యంగా స్త్రీలు ఈ దారినే ఉపయోగించేవారు. ఆ దారి గుండా కాస్త దూరం పోతే హాల్దార్పుకూర్ చెరువు వస్తుంది. స్నానానికీ, త్రాగునీటికీ ఆ చెరువు పైనే ఆధారపడేవారు. లజ్జాస్వరూపిణియైన శారద ఇతరుల కంట పడకుండా ఉండాలని తెల్లవారుజామునే స్నానానికి బయలుదేరింది. తలుపు తెరిచి బయటకు రాగానే, ‘ఇంత చీకటి లో ఎలా ఒంటరిగా వెళ్లాలి?’ అనే ఆలోచన వచ్చింది. పోవాలా వద్దా అని తటపటాయిస్తూండగా హఠాత్తుగా ఎక్కణ్ణుండో ఎనిమిది మంది స్త్రీలు వచ్చారు. శారద కూడా ఇక వెనుకాడక బయలుదేరింది. వెంటనే ఆ స్త్రీలలో నలుగురు శారద ముందు నడవసాగారు. తక్కిన నలుగురు ఆమెను వెంబడించారు. ఇలా అందరూ వెళ్లి స్నానం చేసి, అదే విధంగా తిరిగివచ్చారు. శారద ఇల్లు చేరుకోగానే ఆ ఎనిమిది మంది మాయమైపోయారు. కామార్పు కూర్లో శారద ఉన్నన్ని రోజులూ ఇదే విధంగా జరిగింది. ‘వీరెవరు?’ అనే ఆలో చన శారదకు రాకపోలేదు. కానీ ఆమెకు ఏదీ అంతుబట్టలేదు. వారిని దాని గురించి అడగనూ లేదు.*
వివాహం
కాలక్రమంలో శారదకు పదకొండేళ్లు వచ్చేదాకా చూశాం: కానీ ఈ కాల ఘట్టంలో జరిగిన ఎంతో ముఖ్యమైన సంఘటన గురించి ఇంతదాకా ప్రస్తా వించలేదు. అదే శారద వివాహం. శారదలా లోకశ్రేయస్సుకై జన్మించిన మహాత్ముల జీవితాలలో ఒక మామూలు సంఘటన కూడా కారణం లేకుండా, అంతరార్థం లేకుండా జరగదు. అందువల్ల ఆమె వివాహమనే ఈ సంఘటనను మామూలు ఘటనగా భావించరాదు. ఈ వివాహం జర గడంలోని అనేకానేక అంతరార్థాలను అవగతం చేసుకో గోరితే శ్రీరామకృష్ణుల దివ్యమయ జీవితాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ‘అగ్ని, దాని దాహక శక్తి’* లా శారద జీవితం గురుదేవుల జీవితంతో అభిన్న మైనది కనుక!