వాయురనిలం అమృతం అథ ఇదం భస్మాంతం శరీరమ్ ।
ఓం క్రతో స్మర కృతం స్మర క్రతోస్మర గతం స్మర ॥
ఏం చేశారు?
పంచభూతాల నుండి రూపొందిన శరీరం మళ్లీ పంచభూతాలలోనే కలసి పోయింది. మాతృదేవి ఏం చేశారు, మనకు వారసత్వంగా దేన్ని వదలిపోయారు అన్న విషయం పర్యాలోచించవలసిన తరుణం ఆసన్న మైంది. ఆమె ఏం చేశారు? కాలావశ్యకతను ఈడేర్చ డానికే ఆమె అరుదెంచారు. అందువలననే అవతార పురుషులైన శ్రీరామకృష్ణులతో ఆమె జీవితం ముడిపడింది. ఆయనకు సహధర్మ చారిణిగా ఉంటూనే సమున్నత దివ్యాదర్శాన్ని పాటించి చూపారు. ఇందు మూలంగా ఒక స్త్రీ జీవితంలో సహధర్మచారిణి అనే దశకు ఉన్నత గౌరవాన్ని తెచ్చిపెట్టారు. తమ జీవితం ద్వారా వేదకాల ఆదర్శాన్ని పునరుద్ధరించి ప్రస్తుత మహిళాలోకానికి ఆదర్శప్రాయంగా భాసించారు. శ్రీరామకృష్ణుల నిర్యాణానంతరం అసాధారణ పరిస్థితులలో కుటుంబ పెద్దగా బాధ్యత వహిస్తూ, అదే సమయంలో వేలాది మందికి మంత్రదీక్షను ప్రసాదించి వారికి దివ్యమయ మార్గాన్ని చూపిం చారు. రామకృష్ణ సంఘ జననిగా, గురువుగా విరాజిల్లుతూ సన్న్యాసులకు మార్గ గాములయ్యారు. గురుదేవుల కృపాశక్తిగా ఇంతదాకా లోకం కనీవినీ ఎరుగని మూర్తీభవించిన మాతృత్వంగా అలరారుతున్నారు. ఈ వివరాలన్నీ ఇప్పటిదాకా చూశాం. మాతృదేవి జీవించారు. మన జీవితాలకు వారసత్వంగా ఏం విడిచి వెళ్లారు? ఆమె సందేశం ఏమిటి?
మాతృదేవి మన కిచ్చిన వారసత్వం
భగవాన్ శ్రీరామకృష్ణుల అవతార కార్యాన్ని కొనసాగించిన మాతృదేవి సందేశమూ నిశ్చయంగా ఆయన సందేశం లాంటిదే కదా! మానవ జీవిత పరమ గమ్యం భగవత్సాక్షాత్కారం, ముక్తి పొందడం. “నాయనా! లోకంలో నెలకొన్న సుఖం ఎలాంటిదో నువ్వు చూడ లేదా? సంసార దుఃఖాలతో నా నరనరాలు దహించుకు పోతున్నాయి. భగవంతుడు మాత్రమే సత్యం, తక్కిన దంతా అసత్యం. జీవిత పరమావధి భగవంతుణ్ణి పొందడమే! భగవచ్చింతనలో లయించిపోవాలి” అనే వారు మాతృదేవి. ఆమె మాత్రమే కాదు, శ్రీరామకృష్ణుల శిష్యు లందరూ ఈ మాటనే వక్కాణించారు. కాని ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని గురుదేవుల నుండి గ్రహించి, సాధనలు అనుష్ఠించి, దాన్ని తమ దైనందిన జీవితంలో ప్రతిఫలింప చేసి, తమ రంగును అలది అందరికీ పంచిపెట్టారు. అందుకే వారంతా ఒకే సత్యాన్ని నానారకాలుగా వ్యక్తం చేసి, అందించారు, వివిధ మార్గాలు చూపిం చారు. గురుదేవుల కృపాశక్తియైన మాతృదేవి కూడా దీన్లో తమ వైశిష్ట్యాన్ని చాటి చూపారు.
మానవుడే మాధవు డవుతాడు
భగవంతుని చేరుకోవడం, భగవదనుభూతి అని చెప్పడంలోని అర్థం, ‘భగవంతుడు ఎక్కడో సుదూరంలో ఉన్నాడు. మనం అక్కడకు వెళ్లి ఆయనలో లీనమవాలి’ అని కాదు. ‘తత్త్వమసి’ అంటే ‘అది నువ్వే’ ; ఇప్పటికే మనలో ప్రతి ఒక్కరమూ దివ్యత్వం సంతరించు కొనే ఉన్నాం, దివ్యత్వ పరిపూర్ణమయులమే. దాన్ని అభి వ్యక్తం చేయాలన్నదే మన ఋషుల సందేశం. మాతృదేవి కూడా ఇదే వచించారు. కానీ తమ ప్రత్యేక ధోరణిలో సరళంగా, పరమాద్భుతంగా వ్యక్తం చేయడం ఈ క్రింది సంభాషణ తెలుపుతుంది.
శిష్యుడు: అమ్మా! సహజ స్థితిలోని మనిషికీ, భగవంతునికీ తేడా ఏమిటి?
మాతృదేవి: మనిషే దేవుడవుతాడు.
సాధనలు అనుష్ఠించాలి
మనిషి తనను దైవస్థితికి ఉద్ధరించుకోవడమే భగవదనుభూతి అన్నదే
మాతృదేవి ఉవాచ. కానీ ‘మనిషే దేవుడవుతాడు’, ‘నేను దివ్యత్వ పరిపూర్ణుణ్ణి’ అనే చిలుక పలుకులతో ఏమీ జరగదు. మాతృదేవి సంభాషణ కొనసాగింది:
మాతృదేవి: అందుకోసం (మనిషి దేవుడవడానికి) సాధనలు అనుష్ఠించాలి. సాధనానుష్ఠానాలతో సకలం సిద్ధిస్తుంది.
మాతృదేవి ప్రధానంగా రెండు కోవల సాధనలను సూచించేవారు. 1. జపధ్యానాదులు 2. సేవ – సాధన.
జపధ్యానాదులు
సాధన జీవితంలో మాతృదేవి జపధ్యానాలకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. ఉదయం, సాయంత్రం, సంధ్యాసమయాలలో, నిర్దిష్ట సమయాల్లో ఇష్ట దైవం ముందు కూర్చుని శక్తిమేరకు ఆరాధించాలి, జపం చేయాలి. అంటే గురువు ప్రసాదించిన మంత్రాన్ని భక్తి ప్రపత్తులతో పదేపదే ఉచ్చరించాలి. జపానికి మాతృదేవి అగ్రతాంబూలం ఇచ్చేవారు. “ప్రచండ వాయువు మేఘ సమూహాలను ఛిన్నా భిన్నం చేసేట్లు పావన భగవన్నామం మనోమాలిన్యాలను తొలగించి వేస్తుంది.” జపం ఒక సాధన. మనం ప్రయత్నించి అభ్యసించాలి. ధ్యానం ఒక స్థితి. జపం ద్వారానో, ఇతర మార్గాల మూలంగానో మనసు పావనమైనప్పుడు, భగవంతుని కృపతో దానంతట అదే సిద్ధించే స్థితి. అంత సులభంగా ఈ స్థితి అందరికీ చేకూరదు. అందుకే మాతృదేవి ఇలా అనేవారు: “ధ్యానానికి యుక్తమైన మనోస్థితి లభిస్తే మంచిది. కాని ధ్యానం కోసం ఎన్నడూ మనస్సును నిర్బంధ పెట్టకు. నిజానికి ధ్యానం సహజంగా చేకూరవలసిన స్థితి. ధ్యానం కుదరకపోతే జపం చేయి. రోజూ పదిహేను వేలు, ఇరవై వేలు జపం చేస్తే తప్పక మనస్సు ఏకాగ్రమవుతుంది. ఇది నా జీవితానుభవం.”
కొన్ని నిబంధనలు
ఇవి కాకుండా శిష్యుల మనోపరిపక్వత, స్వభావాదులకు అనుగుణంగా పూజ, ప్రాణాయామం, ఏకాంతవాసం, శరణాగతిలాంటి పలు మార్గాలను మాతృ దేవి చూపించారు. వీటి వివరాలన్నిటిని ‘శ్రీ శారదాదేవి వచనామృతం’ పుస్తకంలో చూడవచ్చు. కానీ అనుష్ఠించే సాధన ఏదైనా కొన్ని ముఖ్యమైన నిజాలను మనం జ్ఞాప కంలో ఉంచుకోవడం తప్పదు. మాతృదేవి వచించిన నిబంధనలలో కొన్ని:
1. సాధన ఏ ప్రయోజనార్థం చేస్తున్నామో స్పష్టంగా గ్రహించుకోవాలి. ఏమీ తెలియకుండానే, కొందరు మంత్రదీక్ష పుచ్చుకొంటారు. తెలిసి పుచ్చుకొన్న వారిలో సైతం క్రమేణా లక్ష్యం పల్చబడిపోతుంది. తరువాత అది జపమయినా సరే, ధ్యానమయినా సరే కేవలం యాత్రికంగా జరిగిపోతుంది. భగవంతుణ్ణి పొందడం లక్ష్యం, ఆయన మనతోనే ఉంటున్నాడనే విశ్వాసం – ఈ రెండు సదా మనకు ఉండకుంటే సాధనలలో విజయం సిద్ధించదు. మాతృదేవి ఇలా అనేవారు: “భగవంతుడు నా సొంతమనే విశ్వాసం ఎందరికి ఉంది? ఈ సాధన, ఆ సాధన అంటూ గత్యంతరం లేదనే భావనతోనే అనుష్ఠిస్తారు. ఎందరు భగవంతునికై అన్వేషిస్తారు? కాబట్టి ప్రప్రథమంగా సాధనలో విశ్వాసమూ, స్పష్టతా ఉండాలి.
2. ఆ విధంగా లక్ష్యం మన కళ్ల ఎదుట మెదలుతూ ఉండాలంటే సక్రమమైన అభ్యాసమూ, స్వీయ విచారణా అవసరం. నీ కర్తవ్యాలను నిర్వర్తించేతీరాలి. వాటిని త్రోసిపుచ్చరాదు. కానీ ప్రార్థన, జపధ్యానాలు అత్యంత ఆవశ్యకాలు. ఉదయ సాయంత్రాలలోనైనా వీటిని అనుష్ఠించాలి. సక్రమమైన అభ్యాసం పడవకు చుక్కానిలాంటిది. సాయంత్రం సాధనలకై కూర్చునేటప్పుడు, ముందుగా ఆ రోజు చేసిన మంచీ చెడు పనులను జ్ఞాపకం చేసుకోవాలి. పిదప ఆ నాటి మనోస్థితిని మొదటి రోజు మనోస్థితితో పోల్చి చూసుకోవాలి. ఆ తరువాతనే జపం ప్రారంభించాలి. స్వీయ విచారణ అవసరమనే మానసిక శాస్త్రవేత్తల శాస్త్రీయ అభిప్రాయం బలపడడానికి ఎంతో ముందే మాతృదేవి ఈ అంశాన్ని సరళ రీతిలో, స్పష్టంగా వక్కాణించి ఉండడం గమనార్హం.
3. మనం అనుష్ఠించే సాధన ఏదయినా అది మనకు వాస్తవికమైనదిగా ఉండాలని మాతృదేవి ముఖ్యంగా సూచించేవారు. సాధన సమయంలో మనం ఆరాధించే లేదా ధ్యానించే ఇష్టదైవం కేవలం విగ్రహమనో, చిత్రపటమనో భావించరాదు. వాటిలో వాస్తవంగానే మన ఇష్టదైవం వెలసి ఉండడం మనకు స్ఫురించాలి. సజీవ దైవానికే ప్రార్థన, ఆరాధన, జపధ్యానాదులన్నీ చేస్తున్నామనే విశ్వసించాలి. “భగవంతుడు మనకు పరమ ఆప్తుడు, మన సొంతం. ఇదే మనిషికీ భగవంతునికీ మధ్యనున్న నిరంతర బాంధవ్యం. ఈ బాంధవ్యం ఎంత ప్రగాఢమవుతుందో భగవంతుడు అంత సన్నిహితుడు అవుతాడు” అనేవారు మాతృదేవి.
4. ఇక ప్రారబ్ధ కర్మ. దీనిని ఎవరూ తప్పించుకోలేరు. ఆధ్యాత్మిక జీవితంలో అడుగిడగానే అనుభూతి కలగాలని మనం ఆశిస్తాం. ఆశించడంలో తప్పులేదు కానీ ప్రారబ్ధ కర్మను ఏం చేయాలి? దాన్ని అనుభవించేది ఎవరు? ప్రారబ్ధ కర్మ మాత్రమే కాదు, ఈ జన్మలో కూడా సాధనామయమైన ఉన్నత ఆధ్యాత్మిక జీవితంలోకి రాక మునుపే మనలో అనేకుల జీవితాలు కూడా అంతంతమాత్రమే. అందువల్ల సాధకుడు వీటి నన్నిటినీ గుర్తించడం ఎంతో అవసరం. ప్రారబ్ధ కర్మ తొలగిపోయిన తదనంతరమే మనం అనుష్ఠించే జపధ్యాన ప్రార్థనాదులు ఆధ్యాత్మిక అనుభూతులను ఇవ్వనారంభిస్తాయి. కానీ ఒక్క విషయం. నిజానికి సాధనలు అనుష్ఠించే వారి జీవితంలో ప్రారబ్ధకర్మ ఉద్ధృతం తగ్గిపోతుంది. దీనినే మాతృదేవి ఇలా వివరించేవారు: “ప్రతి ఒక్కరూ ప్రారబ్ధ కర్మను అనుభవించే తీరాలి. ఎవరూ దాని ఉద్ధృతను తప్పించుకోలేరు. కానీ జపం దాని ఉద్ధృతిని అడ్డుకొంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రారబ్ధకర్మానుసారం తన కాలును కోల్పోవలసివుంటే, అతడి కాలులో ఒక ముల్లు అయినా గుచ్చుకొని తీరుతుంది.”
5. కాలం – ఇది మాతృదేవి తెలిపే మరో ముఖ్యమైన అభిప్రాయం. ప్రార్థన ఫలించే దాకా ఓర్పుతో వేచివుండాలి. అంతవరకు ఎదురయ్యే పరీక్షలను ప్రశాంతంగా భరించాలి. ఇవి ఆధ్యాత్మిక జీవిత ప్రాథమిక నియమాలు. దీన్లో విజయవంతుడైన వ్యక్తే భగవదనుభూతి పొందుతాడు. మనం పరీక్షలతో కొట్టు మిట్టాడడమూ, కష్టాలు అనుభవించడమూ భగవంతునికి ఇష్టమని మనం అర్థం చేసుకోరాదు. మన హృదయాంతరాళాలలో ఎన్నో కోర్కెలు, ఉద్వేగాలు పరిభ్రమిస్తూ మనలను సతమతపరుస్తున్నాయి. వాటి కించిత్తు పరిమాణం సైతం మనకు అవగతం కాదు. నిజం చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితం పట్ల మనకు ఎప్పుడైతే అభిరుచి జనిస్తుందో, అప్పుడే భగవంతుని కృపాశక్తి మనలో పనిచేయడం ప్రారంభిస్తుంది. కాని మనస్సును కుదుటపరచి ఆధ్యాత్మికానుభూతికి సంసిద్ధపరచడం అంత తేలికయైన విషయం కాదు. కనుక ఓర్పు వహించి వేచివుండడం ఎంతో అవసరం. భగవదనుభూతిని అనుగ్రహించమని కోరిన శిష్యునికి మాతృదేవి ఇలా చెప్పారు: “నాయనా! మనోస్థైర్యాన్ని కోల్పోకుండా ప్రార్థనను ఆలంబన చేసుకో. సముచిత తరుణంలో అంతా సిద్ధిస్తుంది. ప్రాచీన ఋషులు, మునులు యుగాల పర్యంతం కఠోర తపస్సులు చేశారు. కానీ మెరుపు మెరిసే లోపుగానే నీకు భగవత్సాక్షాత్కారం కలగాలి! అంతే కదా! ఈ జన్మలో కాకుంటే, రాబోయే జన్మలో, అదీ కాకపోతే ఆ తరువాతి జన్మలో. భగవదనుభూతి సామాన్యమైన విషయమా?” ఆ శిష్యుడు వెళ్లిపోయిన తరువాత, “సంసారంలో కూరుకుపోయి ఉన్నాడు. నా దగ్గరకొచ్చి, భగవత్సాక్షాత్కారం కావాలి అంటున్నాడు. సుదీర్ఘకాలం తపస్సు చేసిన ఋషిపుంగవులకే భగవత్సాక్షాత్కారం లభించలేదు. ఈ రోజుల్లో వీళ్లు జపతపాదులు ఏవీ అనుష్ఠించరు. కాని భగవంతుణ్ణి తక్షణమే దర్శించాలి. ఇటువంటి వారికి నేను సాయం చేయలేను” అని మాతృదేవి వ్యాఖ్యానించారు.
5. ఎన్నో నియమనిష్ఠలను గూర్చి ఏకరువుపెట్టవచ్చు. కానీ వీటినన్నిటిని ప్రక్కన ఉంచితే, మనిషికి భగవదనుభూతిని కలిగించేది ఒకటి ఉంది. అదే భగవంతుని కృప. అది మాత్రం దక్కితే, ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఈ సత్యాన్ని వ్యక్తం చేయడం మాతృదేవి విస్మరించరు. “అవసరమైనది భగవంతుని కృపా కటాక్షం మాత్రమే. అందుకోసమే ప్రార్థించాలి. ప్రారబ్ధ కర్మానుసారమే ప్రాణులు ప్రవర్తిస్తాయి, దుఃఖాలు అనుభవిస్తున్నాయి. కానీ భగవంతుడు సంకల్పిస్తే, ప్రారబ్ధకర్మ అనుభవించవలసిన కాలవ్యవధిని తగ్గించి, సత్వరమే అనుభూతిని అనుగ్రహించగలడు” అని వచించేవారు మాతృదేవి.
సేవ – ధన
“కాని ఎందరు ఇరవై నాలుగు గంటల పర్యంతం జపధ్యానాదులు అనుష్ఠించగలరు?” అని మాతృదేవే వ్యాఖ్యానించేవారు. ఆధునిక కాల ప్రజల మనోస్థితులను, వేగిరాన్ని ఎరిగివున్నవారు కదా! కనుక సేవ – సాధన మనలో పలువురి జీవితాలలో జరిగే వాటిని గూర్చి చెబుతూ అందుకు పరిహారం కూడా తెలుపుతున్నారు: “మొదట్లో అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. నళినిలా తలాతోకా అంతుబట్టక గెంతులేస్తారు. తరువాత అంతా పోతుంది. ఉన్న కాస్త ప్రశాంతతను కూడా కోల్పోయి పనికిమాలిన ఆలోచనలతో సతమతమవుతూంటాం. అందువల్ల సదా పనుల్లో నిమగ్నులయి ఉండండి. మనస్సును చిందరవందర పరచకుండా ఏకాగ్రం చేసి ఏదైనా పనిలో నిమగ్నులై ఉండండి.” ఈ రీతిలో నిరంతరం మనస్సు పనులలో నిమగ్నమైనప్పుడు, అది రెండు రకాలుగా పనిచేసి మనలను భగవదనుభూతి వైపుగా తోడ్కొని వెళుతుందని మాతృదేవి చెప్పేవారు: “ఎప్పుడూ చురుగ్గా ఏదో పనిలో నిమగ్నమై ఉండాలి. పనీపాటా లేకుండా ఎప్పుడూ ఉండ కూడదు. ఎందుకంటే సోమరితనం నానారకాల దురాలోచనలను మనస్సులో కల్పిస్తుంది. కనుక ఎడతెరపి లేకుండా పనులలో నిమగ్నమవడం వలన మొదటి స్థితిలో మనస్సులో దురాలోచనలు రాకుండా అరికట్టబడతాయి. రెండవ స్థితిలో, పనిచేయడం మూలంగా కర్మబంధాలను చేధించుకోవడం సాధ్యమవుతుంది. ఏ పనీ చేయని స్థితిలో కర్మను అధిగమించి పోగలమనుకోవడం పొరపాటు. పనులు చేస్తూవున్నకొద్దీ మనస్సులో అంచెలంచెలుగా పరిపూర్ణ వైరాగ్యం ఉదయిస్తుంది.” ఈ వైరాగ్యమే మనలను భగవదనుభూతి స్థితికి తోడ్కొని వెళుతుంది.
పనులు అన్నప్పుడు మాతృదేవి సూచించేది, నిత్యం చేసే పనులని గుర్తుంచుకోవాలి. చిన్న పని అయినా, పెద్ద పని అయినా మనస్ఫూర్తిగా చేయాలి; ఆరాధనాపూర్వకంగా, వినమ్రతాభావంతో నిర్వర్తించాలి. ఇల్లు ఊడ్చి చీపురు కట్టను విసరివేసిన ఒక భక్తునితో మాతృదేవి ఇలా అన్నారు: “ఏమిటి? పని పూర్తికాగానే ఇష్టమొచ్చినట్లు విసరివేయడమా? విసరివేయడానికి ఎంతసేపు పడుతుందో దాన్ని యథాస్థానంలో ఉంచడానికీ అంతేసేపు పడుతుంది. చిన్న వస్తువే కదా అని దాన్ని నిర్లక్ష్యం చేయవచ్చా? నువ్వు దేనిని పరిపోషిస్తావో, అదే నిన్ను పోషిస్తుంది. ఆ చీపురుకట్ట మళ్లీ నీకు ఉపయోగపడదా? అంతేకాదు, అది కూడా ఈ కుటుంబంలో ఒకటి. ఆ విధంగా చూసినా కూడా దానికంటూ ఒక చోటు ఉంది. ఒక వస్తువుకు ఇవ్వవలసిన మర్యాద ఇవ్వవలసిందే! చీపురుకట్టను కూడా మర్యాదగా దాని స్థానంలో ఉంచాలి. ఎంత చిన్నపనియైనా మనస్ఫూర్తిగా, మర్యాదామన్ననలతో నిర్వర్తించాలి.
ఎంత అద్భుత వచనాలు! అమిత వేగంతో పరుగెత్తుతున్న మన జీవితం లోని ప్రతిక్షణాన్నీ ఈ రకంగా మార్చుకోగలిగితే, భగవదనుభూతికి అదెంత చక్కని సాధనగా పరిణమిస్తుంది! ఇలా పనిచేయడంతోపాటు ఉదయం, సంధ్యాసమయా లలో భగవత్ చింతన కూడా తప్పక చేయాలి. “నీ పనులను, కర్తవ్యాలను నిర్వర్తి స్తున్నావు. అవి నీ మనస్సును మంచి స్థితిలో ఉండేలా చేస్తాయి. అయినా ప్రార్థన జపధ్యానాదులను ఉదయ సాయంత్రాలలో నియమంగా అనుష్ఠించాలి. అలా కాకుంటే సరిగా చేస్తున్నావో లేదో ఎలా తెలుసుకోగలవు?” అనేవారు మాతృదేవి.
చేసే ప్రతి పనినీ ఇలా మనస్ఫూర్తిగా, మర్యాదామన్ననలతో, భగవదారాధ నగా చేసినప్పుడు జీవితమే సాధనమయమవుతుంది. ఇదే సేవా–సాధన. మాతృ దేవి జీవితమే ఇందుకు చక్కని ఆదర్శప్రాయమై ఉండడాన్ని 13 వ అధ్యాయంలో విపులంగా చూశాం. వృద్ధాప్యంలో, డస్సిపోయిన స్థితిలోను ఒక రోజు మాతృదేవి గోధుమ పిండి సిద్ధం చేస్తూవుండడం చూసిన శిష్యుడొకడు ఉండబట్టలేక, “అమ్మా! ఈ వయస్సులో కూడా ఇవన్నీ మీరెందుకు చేస్తున్నారు?” అని మాతృ దేవిని అడిగాడు. అందుకు మాతృదేవి, “నాయనా! ఎప్పుడూ మనస్ఫూర్తితో పనులు నిర్విర్తించడం మంచిది” అని జవాబిచ్చారు. కాసేపు మౌనం వహించి, “జీవితాంతం ఇలా పనులలో నిమగ్నురాలనై ఉండాలని నన్ను ఆశీర్వదించు నాయనా!” అన్నారు. అటువంటి సాధనాపద్ధతిని విపులీకరించడానికి తమ దివ్యా దర్శమయ జీవితాన్ని మానవాళికి వారసత్వ వరప్రసాదంగా వదలిపెట్టి వెళ్లా రనడం అతిశయోక్తి కాదు.
మాతృత్వం – విశిష్ట సందేశం
కాని మాతృదేవి స్త్రీలకు విశిష్ట సందేశమివ్వడానికే అవతరించారు. పురు షులతో పోటీ పడడం మానుకొని స్త్రీలు మాతృత్వాభిముఖంగా పురోగమించాలి; దీనివలన పురుషులు కూడా ఆరాధించే స్థితిని స్త్రీలు చేరుకోగలరనే యథార్థాన్ని మనసా స్మరించు స్వయంగా ఆచరించి చూపి తమ విశిష్ట సందేశంగా వదలివెళ్లారు. ఈ అమోఘ సాధనను అనుష్ఠించడానికే తమను గురుదేవులు వదలి వెళ్లినట్లు మాతృదేవి వక్కాణించడం మునుపే చూసివున్నాం. ఆ సాధనను విజయవంతంగా పూర్తిచేసిన సంతృప్తి మాతృదేవిలో ఎప్పుడూ కానవచ్చేది. “నా జీవితం ఆదర్శమయ జీవి తంగా రూపుదిద్దుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువగానే జీవించి చూపాను” అంటూ ఒక సందర్భంలో ఆమె వ్యక్తం చేశారు. ఇందుమూలంగా తమ జీవితాన్ని కాలావశ్యకమైన ఆదర్శప్రాయ జీవితంగా తీర్చిదిద్దుకొన్నారని రూఢి అవుతున్నది. శ్రీరామకృష్ణులు తీవ్ర సాధనలు అనుష్ఠించారని తామూ అలాంటి సాధనలను అనుష్ఠించలేదు. తమకు అవసరమైన నేతృత్వాన్ని మాత్రం ఆయన నుండి స్వీకరించి, సరళమూ అదేసమయంలో దృఢమూ అయిన మార్గాన్ని ఆవిష్కరించుకొని పురోగమించి, స్త్రీత్వపు పరిపూర్ణత అయిన మాతృ త్వపు పరాకాష్ఠను అందుకొన్నారు. ఆ ‘సరళమూ, దృఢమూ’ అయిన మార్గం ఏది అనే ప్రశ్నకు ఒక్క మాటలో ‘తపస్సు’ అని జవాబు చెప్పాలి.
స్త్రీలకు తగిన తపస్సూ, దాని మూడు పరిమాణాలు
మాతృదేవి ఉన్నతోన్నత స్థితిని పొందడానికి తపస్సు ముఖ్య కారణమని చూశాం. కానీ ఆమె అడవులకెళ్లి కఠోర తపస్సు ఏదీ చేయలేదు. ఇక్కడ కూడా మాతృదేవి విశిష్టత గమనార్హం. విశిష్టతే కాదు, స్త్రీలకు యుక్తమైన తపశ్చర్యను ప్రప్రథమంగా రూపొందించిన ఘనత ఆమెదే! ఇది మాతృదేవి మహిళాలోకానికి ప్రసా దించిన కానుకలలో అతిముఖ్యమైనది. మాతృదేవి సూచిం చిన తపస్సు మూడు పరిమాణాలను సంతరించుకొన్నది. 1. స్వీకరణ. 2. సర్దుకు పోవడం. 3. అత్యున్నత సత్యంతో సంబంధం.
స్వీకరణ
మనకంటూ ఏర్పడిన జీవితాన్ని సుఖదుఃఖాలతోను, కొరతలతోను యథాతథంగా స్వీకరించాలి. మన చుట్టుప్రక్కల ఉన్నవారి జీవితాలతో మన జీవితాలను పోల్చుకోరాదు. ఈ జీవితంలో మనకు దక్కిన పాత్రను సముచితంగా పోషించాలి. నాటకంలో ఒక స్త్రీ రాణి వేషధారిణి, మరొక స్త్రీ భిక్షగత్తె వేషధారిణి. భిక్షగత్తె పాత్రలోని స్త్రీ, రాణి వేషంతో తనను పోల్చుకోకుండా, తన పాత్ర నైజాన్ని ఎరిగి నటిస్తే ఉత్తమ నటి బహుమానం కూడా దక్కించుకోవచ్చు. నాటకంలోని పాత్రకంటూ ఎటువంటి ప్రత్యేక గౌరవమూ లేదు; నటనా కౌశలమే అక్కడ రాణిస్తుంది. జీవితమనే నాటకం కూడా అలాంటిదే. సంపన్నురాలు, అందగత్తె, సమాజంలో గొప్ప అంతస్తుగల వ్యక్తి అని ఎవరినీ మహనీయులు గౌరవించరు. జీవితాన్ని గడిపే తీరే ఒక స్త్రీ శ్రేణిని నిర్ణయిస్తుంది. కనుక భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని ప్రేమతోను, వినమ్రతతోను స్వీకరించాలి.
మాతృదేవి జీవితంలో ప్రతి ఘట్టంలోను అది ప్రతిబింబించింది. జీవితంలోనుచేసిన ఎటువంటి పరిస్థితి నుండి సైతం ఆమె వైదొలగలేదు. దుఃఖాలన్నింటిని తపస్సులుగా స్వీకరించి జీవితం గడిపినందువల్ల ప్రతి ఘట్టంలోను మునుపుకంటే శక్తిమంతురాలై విరాజిల్లారు. దీనిని ఆమె ఎలా సాధించగలిగారు? జీవితాన్ని యథాతథంగా స్వీకరించిన తీరు వల్లనే. తన దుఃఖాలను ఏకరువుపెట్టి వాపోతున్న ఒక భక్తురాలితో మాతృదేవి, “సుఖదుఃఖాలతో కూడుకొన్నదే జీవితం. కాని దుఃఖం లేకపోతే సుఖం విలువను గ్రహించగలమా? అంతేకాదు. సదా సర్వవేళలా ఒక వ్యక్తి సుఖంగా, కేవలం సుఖంగా జీవితం గడపడం సాధ్యమా? అదే విధంగా ఒక వ్యక్తి దుఃఖాలతోనే క్రుంగిపోవడమూ జరగదు. మనం చేసే ప్రతి పనీ ఒక పర్యవసానాన్ని కల్పిస్తుంది. అందుకు తగ్గట్లు పరిస్థితులు ఏర్పడతాయి. దుఃఖాలు వచ్చే తీరుతాయి; కాని అవి అట్లే ఉండిపోవు. వంతెన క్రిందుగా పోతున్న నీటి ప్రవాహంలా అవి కూడా దూరంగా కదలిపోతాయి” అని చెప్పి, ఆమెను అనునయించారు.
ఇలా అనునయించినప్పటికీ నిజంగా దుఃఖమంటే ఏమిటో మాతృదేవి అద్భుతంగా నిర్వచించారు: “నిజం ఏమిటో తెలుసా? భగవంతుడు మన కిచ్చిన వరప్రసాదం దుఃఖం. అది ఆయన అవ్యాజ కరుణకు ప్రతీక అని నా విశ్వాసం.” అందుకే జీవితం తమకు ప్రసాదించిన దుఃఖాల నన్నిటినీ తపస్సులుగా మాతృదేవి స్వీకరించారు. ఆ కారణంగా ఆమె దుఃఖాతీత స్థితిని చేరుకోగలిగారు – “అనేకులు నా వద్దకొచ్చి ఆవేదన, ఆవేదన అంటూ బాధపడతారు. ఆ మాటలు విన్నప్పుడు నా మనస్సులో, ‘వీరంతా ఎందుకిలా వాపోతున్నారు? ఆవేదన అంటే ఏమిటో నాకు తెలియదు. నేను మాత్రం దివ్యత్వం సంతరించుకొని పుట్టానా ఏమిటి?’ అనే ఆలోచన మెదలడం కద్దు” అనేవారు మాతృదేవి. దక్షిణేశ్వరంలో నివసించిన రోజుల్లోను, కామార్పుకూర్లో వసించిన రోజుల్లోను, ఆ తరువాత తమ పుట్టింటి వారితో గడిపిన కాలంలోను మాతృదేవి అనుభవించిన కష్టాలూ దుఃఖాలూ వర్ణనాతీతం. వాటన్నిటినీ మాతృదేవి దుఃఖాలుగా పరిగణించలేదు. ఎందుకంటే అవన్నీ మాతృదేవికి భగవంతుడు ప్రసాదించిన కానుకలు కనుక దుఃఖాతీత సమున్నత ఆధ్యాత్మిక స్థితిని పొందడంలో అవి ఆమెకు దోహదపడ్డాయి.
స్వీకరణ అని మనం చెబుతున్నప్పుడు దానికి మరొక వైపు కూడా ఉంది. జీవితాన్ని దుఃఖాలతోపాటు ఎలా స్వీకరించాలో చూశాం. కాని ఈ లోకంలో మనం మాత్రమే నివసిస్తున్నామా? దుఃఖాలు కూడా మనకు మాత్రమే పరిమిత మైనవా? మన చుట్టూ ఉన్నవారిని తేరిపార చూస్తే, మన దుఃఖాలు లెక్కలోకి రావనే మేరకు సర్వత్రా దుఃఖం నిండివుండడం కనిపిస్తుంది. ఇతరుల దుఃఖాలను కూడా కరుణార్ద్రహృదయంతో పరికించి, వారందరికీ మన శక్తి మేరకు చేయూత నిచ్చి, ఆదరించాలి. మాతృదేవి కరుణాకటాక్ష వీక్షణాలు పరపడమే కాదు, ఆమె కరుణాసాగరంగానే రూపొందారు అనడం అతిశయోక్తి కాదు. “ఆహా! దుఃఖ శోకాలను ఒక వ్యక్తి అనుభవించవలసి ఉంది. అందుకే కన్నీటితో నన్ను ఆశ్ర యించిన వారందరికీ నేను ముక్తిని ప్రసాదిస్తాను. ఆతడికి చేరవలసింది ప్రసా దిస్తాను. నన్ను నిద్రించమనీ, విశ్రాంతి తీసుకోమనీ చెబుతారు. నాకు నిద్ర ఎక్కడ? ఎలా నిద్రించగలను? నిద్రలో గడిచిపోయే సమయంలో జపం చేసుకో వచ్చు. అది జీవులకు ఎంతో శ్రేయస్సును కలిగిస్తుంది. ‘ఆహా! ఈ చిన్ని దేహానికి బదులుగా నాకు పెద్ద దేహం ఉండివుంటే పరులకు ఇంకా ఎంతో మంచి చేయ వచ్చు కదా!’ అని అప్పుడప్పుడు అనుకొనేదాన్ని” – లోకంలోని దుఃఖాలను చూసి మాతృదేవి ఇలా స్పందించేవారు. ఆమెలో పొంగిపొరలిన ఈ అవ్యాజ కరుణ వెల్లువలో ఒక బిందువును మనం సేకరించుకోగలిగితే చాలు. మనం అందరి పట్లా ఆదరణతో వ్యవహరించగలం. ఈ విధంగా మనమూ ఇతరులను సుఖ దుఃఖాలతోను, లోటుపాట్లతోను స్వీకరించగలిగినప్పుడు మన భావనలు విస్తృ తిస్తాయి. ఆధ్యాత్మిక సాధనల ఉద్దేశం భావనల విస్తృతి అని చూశాం. స్త్రీలకు యుక్తమైన ఈ తపస్సు ఆ విస్తృతిని ఇలా ప్రసాదిస్తుంది.
సర్దుకుపోవడం
స్త్రీలకు యుక్తమైన తపస్సులో రెండవ పరిమాణం సర్దుకుపోవడం. మాతృ దేవి జీవితంలో మనం చూసే అద్భుతమైన పుట ఇది. ఎన్ని రకాల వ్యక్తుల మధ్య ఆమె జీవితం గడిపారో మనకు బాగా తెలుసు. ఇంత మందితోను సర్దుకుపోయారు. ఎవరితోను ఆమెకు ఎలాంటి సమస్యా తలెత్తలేదు. దీనిని ఆమె ఎలా సాధించారు? ఆమె సంతరించు కొన్న సద్గుణాల వల్లనే. వాటిలో కొన్నింటిని ఇక్కడ పరికిద్దాం.
మొదటిది సహనం. స్త్రీలు మాత్రమే కాదు, పరిపూర్ణ స్థితిని చేరుకోవాలని అభిలషించే వారందరూ సంతరించుకోవలసిన గుణం. ఇల్లయినా కార్యాలయ మైనా, సమాజంలో ఏ రంగమయినా సరే, సమస్యలలో భేదాభిప్రాయాలో లేని చోటంటూ ఉండదు. అలా ఏదైనా తలెత్తితే కొట్లాటకు సిద్ధపడకుండా కాస్త సహనాన్ని పాటించాలి. కాస్త నిదానించి సమస్యను పరిశీలించాలి. ఆశ్చర్యపరచే నిజం ఏమిటంటే నూటికి తొంభై తొమ్మిది పరిస్థితులలో తప్పు మనదే అయి వుంటుంది. కాస్త ఓర్పు కనబరచి ఆ తప్పును అంగీకరించడం ద్వారా విరో ధాన్ని, విభేదాలను తొలగించుకొని స్నేహభావంతో జీవించవచ్చు. మాతృదేవి ప్రకారం “సహనం ఉన్నత ఆధ్యాత్మిక సాధన. సహనం కంటే ఉత్కృష్టమైన గుణం లేదు.”
తరువాతిది మాధుర్యం. మనం పైన చూసిన పరిస్థితిలో తప్పు ఎదుటి వ్యక్తిదే అనుకొందాం. ఆ సంగతి పెద్దగా అరుస్తూ పోట్లాడుకొనే తీరులో చెప్ప నక్కరలేదు. తీయని మాటలతో వివరించవచ్చు కదా! “నిజాన్ని అయినా కటువుగా చెప్పరాదు. కటువుగా మాట్లాడడం వల్ల మనిషి స్వభావం తీయదనాన్ని కోల్పోయి కటువుగా మారిపోతుంది. మితభాషణమూ, తీయదనమూ ఆతడి నుండి వీడ్కోలు పుచ్చుకొంటాయి” అనేవారు మాతృదేవి.
ఆ తరువాత గుణం మృదుత్వం. స్త్రీత్వం అంటేనే మృదులమైన జీవితం అమర్చుకోవడమే. మాతృదేవి జీవిత పర్యంతం మాటలు, చేతలు, అంతెందుకు ఆమె ప్రవర్తన మృదులంగా ఉండేవి. ‘లజ్జను మేలిముసుగుగా ధరించినవారు’* అని ఆమె స్తుతి వచిస్తూన్నది. ఒక సందర్భంలో ఎంతో ఆడంబరమైన దుస్తులు, ఆభరణాలు ధరించి, తలనిండా పువ్వులు పెట్టుకొని ఒక స్త్రీ మాతృదేవిని చూడ వచ్చింది. ఆమె వెళ్లిపోయిన తరువాత మాతృదేవి ఇలా అన్నారు: “భగవంతుని పాదపద్మాలకు అర్పించినప్పుడే ఒక పువ్వుకు మహత్త్వం ఒనగూరుతుంది. లేక పోతే చెట్టునే వాడిపోవడం దానికి ఘనత. ఎవరైనా పువ్వును పుచ్చుకొని వాసన చూస్తూ ‘ఆహా! ఏం సువాసన!’ అని అన్నప్పుడు నేను తల్లడిల్లిపోతాను. బహుశా మరుక్షణమే ఆ వ్యక్తి ఆ పువ్వు క్రిందపడేసి, తొక్కి తిరిగికూడా చూడకుండా వెళ్లి పోవచ్చు. ఒక్క విషయం చెప్పదలచుకొన్నాను. స్త్రీకి నిజమైన భూషణం ఏదో తెలుసా? లజ్జ!”
స్త్రీకి అనువైన తపస్సులో సర్దుకుపోవడమనే పరిమాణపు ప్రధాన గుణం ఇతరులలోని దోషాలను చూడకపోవడం. ఇదే మాతృదేవి చివరి ఉపదేశమై ఉండడం చూశాం. ఇట్టి ఉత్కృష్ట గుణం వల్లనే మాతృదేవి దొంగలు, దుష్టులు, దుశ్శీలురు వంటి అందరినీ అక్కున చేర్చుకోగలిగారు. ఒక రోజు గోలాప్మా ఎందుకో ఒక పనిమనిషిని చీవాట్లు పెట్టింది. అందుకు కారణం ఏమిటని అడిగినప్పుడు ఆమె, “అవును! మీతో చెప్పి ఏం ప్రయోజనం? మీరు ఎవరి దోషాలనూ చూడరు కదా!” అని చెప్పింది. అందుకు మాతృదేవి, “పోనీలే! ఇతరుల దోషాలు చూసి విమర్శించడానికి ఎందరో ఉన్నారు. నేను ఒక్కదాన్ని అలా చేయకపోతే లోకం ఏమీ నాశనం కాదు” అని అన్నారు. ఇతరుల దోషా లను చూడరాదనడానికి మాతృదేవి పై వివరణ అద్భుతం – “ఇదిగో చూడు. ఇతరుల దోషాలను, లోటుపాట్లను ఏకరువు పెడుతూవుంటే, వారి కేమైనా కీడు వాటిల్లుతుందా? అలా జరగదు. అందుకు బదులుగా నిన్ను నువ్వు చెరుపు కొంటావు. ఎందుకో తెలుసా? సమస్తమూ మనసే. పవిత్రత, పాపంలాంటి ఆలో చనలు అన్నీ మనస్సులో నుండే జనిస్తాయి. ఇతరుల తప్పులనో, దోషాలనో చూడడానికి మునుపు నీ మనస్సులో ఆ తప్పుల జ్ఞాపకాలను పదిలపరచుకోవాల్సి ఉంది. ఇది నీకు హానినే కలిగిస్తుంది.”
ఇవే కాకుండా సరళత, నమ్రత లాంటి సుగుణాలను కూడా మాతృదేవి ఎంతగానో ఆరాధించారు. ఇలాంటి ఉదాత్త గుణాలను సంతరించుకోవడం రెండు రకాలుగా పని చేస్తుంది. మొదట, సుగుణాలు మనలో ఉన్నప్పుడు సర్దుకుపోవడం దానంతట అదే జరిగిపోతుంది. మన చుట్టూ ఉన్నవారిపట్ల బాంధవ్యం ఆరోగ్యవంతమైనదిగా రూపొందుతుంది. రెండవది: ఇటువంటి గుణాలు స్త్రీలో విశ్వాసాన్ని పాదుగొలుపుతాయి. స్త్రీలలో సహనమూ, మేధస్సు, ధృతి మొదలైన గుణాలుగా తానే ఉన్నట్లు గీతలో శ్రీకృష్ణుడు వచిస్తున్నాడు* ఈ సద్గుణాలను ఒక స్త్రీ సంతరించుకొన్నప్పుడు ఆమెలో భగవంతుడు విరాజిల్లుతాడు. అంటే ఆమెలో దివ్యత్వం పరిపూర్ణంగా అభివ్యక్తమవుతుంది. పురుషులు స్త్రీల పట్ల మర్యాద వహించాలి. వారందరిలో జగజ్జననిని చూడాలన్నప్పుడు స్త్రీలు తమను అలాంటి స్థితికి ఉద్ధరించుకోవాలి. తపస్సులోని ఈ పరిమాణం స్త్రీలకు దీనిని ప్రసాదిస్తుంది.
నడి సముద్ర కెరటాలలో చిక్కుకొని అల్లాడిపోతున్న ఒక వ్యక్తికి ఒక చిన్నదీవి. కనిపిస్తుంది. ఆ దీవిని చేరుకొంటే అతడికి ఇక ఈ బాధ తప్పుతుంది. అతడి చుట్టూ ఉవ్వెత్తున అలలు లేచిపడవచ్చు. కానీ అవి అతణ్ణి ఏ విధంగానూ బాధించవు. ప్రతి వ్యక్తి జీవితంలోను ఇలాంటి ఒక దీవి అవసరం ఉంది. సమస్యలు, కలతలు, బాధలు, దుఃఖాలు మొదలైన వాటితో నానా అవస్థలూ పడుతున్నప్పుడు ఆతడు సేద తీర్చుకోవడానికి ఒక చోటు అవసరం. ఆ చోటే భగవంతుడు. ఇతరుల కంటే, ఇతర సాధనాల కంటే భగవంతుడే సేదతీర్చుకొనే ఉత్కృష్టమైన చోటుగా ఉన్నాడు. కన్నీటితో ఆయన సన్నిధానంలో మన సమస్యలను ప్రార్థనా రూపంలో వెలిబుచ్చినప్పుడు మనస్సులో ప్రశాంతత నింపుతాడు. దాంతో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని కాదు. ఆ సమస్యలతో మనం కృంగిపోకుండా, వాటిని అధిగమించగలిగేటట్లు ఆయన మనలో శక్తిని జనింపచేస్తాడు. కనుక ప్రతి వ్యక్తీ తన జీవితంలో భగవంతునికి చోటు కల్పించి, ఆయనను మన దైనందిన జీవితంలో అభిన్న భాగంగా చేసుకోవడం అనివార్యం. అప్పుడు మాత్రమే మనం ఆయనతో సంసర్గం కల్పించుకోగలం. “ఎవరో నిన్ను రక్షిస్తూవున్నారని ఎన్నడూ మరువవద్దు” అనేవారు మాతృదేవి. ఇలా ఉన్నత సత్యమైన భగవంతునితో మనం చేరువ కావడానికి దోహదం చేస్తుంది ప్రార్థన. ఇటువంటి ప్రార్థనాయుతమైన జీవితం మనకందరికీ, ముఖ్యంగా స్త్రీలకు ఆవశ్యకమని మాతృదేవి వక్కాణించి ఉన్నారు. మాతృదేవి జీవితమే ప్రార్థనకు ప్రతిరూపంగా భాసించడం మనం చూశాం.
ఈ మూడు పరిమాణాలతో కూడుకొన్న తపోమయ జీవితమే మాతృదేవి చూపిన ‘మృదువైన, దృఢమైన మార్గం. నేటి స్త్రీ లందరూ ఈ మార్గాన్ని అనుసరించి జీవించగలగాలి. మాతృదేవి గడిపి చూపించిన జీవితాన్ని ఆదర్శంగా గ్రహించి జీవించగలిగితే స్త్రీలు నిజమైన మాతృమూర్తులుగా రూపొందుతారు. మాతృత్వం వికసిస్తే, ‘ఇల్లు బాగుపడుతుంది, ఇల్లు బాగుపడితే దేశం బాగుపడుతుంది.’
మనం చేయగలమా?
“మాతృదేవి ఒక అవతారమూర్తి. ఆమె జీవించినట్లు మనం ఎలా జీవించ గలం?” అని ప్రశ్నించవచ్చు. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనార్హం. మొదట్లో మనం మాతృదేవిని తరచు ఒక అవతారమూర్తిగా అభి వర్ణించింది ఇప్పటికే మనం ఆరాధిస్తూన్న దేవీస్వరూపాల జాబితాలో చేర్చడానికి కాదు. దివ్యమూ, అమానుషమూ అయిన కొన్ని సంఘ టనలు మాతృదేవి జీవితంలో చోటుచేసుకొన్నాయి. వాటినన్నిటిని ఆమె జీవిత చరిత్రలో పొందుపరచడం మన కర్తవ్యం. కనుక వాటిని గురించి తెలిపాం. కానీ మునుపే మనం చెప్పినట్లు ఈ సంఘటనలన్నింటిని పరిగణించకుండా పరికిం చినా కూడా మాతృదేవి గడిపిన జీవితం ముకుళిత హస్తాలతో ప్రణమిల్లవలసిన మహోన్నత జీవితం అనడం నిర్వివాదాంశం. కనుక ఒక అవతారమూర్తిగా ఆరా ధించడంతోపాటు ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శమహిళగా కూడా స్వీకరించాలి. మాతృదేవికి కూడా ఇదే ఇష్టం. కాకుంటే, “నా జీవితం ఆదర్శప్రాయంగా రూపు దిద్దుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువగానే నేను జీవించాను” అంటూ ఉద్ఘాటించి ఉండేవారా?
కాబట్టి, ‘మనం ఆమెను అనుసరించగలమా?’ అనే ప్రశ్నకు ‘అనుస రించగలం’ అనడానికి బదులుగా ‘అనుసరించగలగాలి’ అనడమే సబబైన జవాబు. స్త్రీ–పురుష, మంచి – చెడ్డ, కుల మత జాతి వివక్షత చూపకుండా లోకాన్ని అక్కున చేర్చుకొన్నారు, మహిళా లోకానికి దేదీప్యమానమైన జ్యోతిగా ప్రకాశించారు – అంటూ భావోద్వేగంతో మాతృదేవిని కీర్తించడంతో మాత్రం ఆగి పోకుండా, ఆ మాతృత్వ భావన మనందరిలో వికసించడానికి మన శాయశక్తులా ప్రయత్నించాలి. అప్పుడే మాతృదేవిని కీర్తించడంలో సార్థకత ఉంటుంది. ఆమె గడపిన జీవితాన్ని చూసి మన శక్తిమేరకు ఆ విధంగా మన జీవితాలను గడప డానికి కృషిచేయాలి. ఎందుకంటే “పరిపూర్ణ స్థితిని పొందిన ఋషులు తమ జీవితాలలో చాటిచూపిన సత్యాన్ని మనం సాధనగా అనుష్ఠించాలి. అప్పుడు ఆ సత్యాన్ని మనం కూడా చేరుకోవచ్చు”* అనే మహాత్ములు వచించి వెళ్లారు. ఆ ప్రయత్నంలో పాల్గొనడం ద్వారా ప్రతి స్త్రీ – స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు సైతం ఆమెను ఆరాధించారు.
మాతృదేవి సందేశం
ఈ అధ్యాయం ప్రారంభంలో, “మాతృదేవి వారసత్వంగా మనకు ఏం వదలి వెళ్లారు?” అనే ప్రశ్నను లేవదీసి, అనేక దృక్కోణాలలో అందుకు జవాబుకై ప్రయత్నించాం. కానీ మనం పొందింది ఆ ప్రశ్నకు సమా ధానమా? కాదు, కానే కాదు. ఇది మనకు తెలిసిన సమా ధానం, అంతే! వివిధ కాలఘట్టాలనూ, విభిన్న మనస్సులనూ పరికించినప్పుడు మాతృదేవి పావన జీవితం ఇంకా ఎన్నో సందేశాలను ఒసగుతుంది. కనుక మాతృదేవి నిజమైన సందేశం ఏమిటనే ప్రశ్నకు ‘మాతృదేవి’ అన్నదే సరి అయిన సమాధానం. ఆమే ఆమె సందేశం. దీన్లోని భావం ఏమిటి? ఆమె మనకు ఒసగే సందేశం ఏమిటని తెలుసుకోగోరితే ఆమెనే ఆశ్రయించాలి. మన ఎలాంటి ప్రయత్నమయినా విజయవంతం కావాలంటే మన భావనలోని మూడు స్థితులూ కలిసి దాన్లో పాల్గొనాలి. కనుక మాతృదేవిని ఆశ్రయించే మన ప్రయత్నంలో కూడా ఈ మూడు స్థితులూ కలిసి పనిచేయాలి.
మొదటిది, చింతనా స్థితి (thinking) : మాతృదేవి దివ్యస్వరూపాన్ని, ఆమె పావన జీవితాన్ని పదేపదే చింతన చేయాలి, ప్రగాఢంగా చింతన చేయాలి –
పవిత్రం చరిత్రం యస్యాః పవిత్రం జీవనం తథా ।
పవిత్రతా స్వరూపిణ్యై తస్మై కుర్మో నమో నమః ॥
ఇటువంటి పావనమయ జీవితాన్ని చింతన చేస్తూవున్నప్పుడు మన మనస్సు పావనమవుతుంది.
రెండవది, ఉద్వేగ స్థితి (feeling) : ఫలానా వారిని గురించి గాఢంగా చింతన చేయగోరితే వారికీ మనకూ ఒక ప్రేమానుబంధం ఉండాలి. అంటే మనం మాతృదేవిని ప్రేమించాలి, అభిమానించాలి. ఆమెను ప్రేమించడం ఎలా? ఇందుకు జవాబు ఆమే ఇచ్చారు. ఆమె ఒక చిన్నారితో సంభాషించిన హృద యాన్ని స్పందింపచేసే ఆ ఘట్టాన్ని చూద్దాం.
ఒకసారి మాతృదేవి జయరాంబాటికి బయలుదేరుతున్నారు. అప్పుడప్పుడు ఆమె వద్దకు వచ్చే ఒక చిన్నారి ఆ సమయంలో అక్కడకు వచ్చింది. మాతృదేవి ఆ చిన్నారిని ఇలా అడిగారు.
మాతృదేవి: అమ్మాయీ! చాలారోజుల నుంచి నన్ను చూడడానికి నువ్వు వస్తున్నావు కదా! నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా?
చిన్నారి: అవును. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను.
మాతృదేవి: ఎంతగానో అంటే ఎంత?
ఆ చిన్నారి తన చేతులను చాచగలిగినంత చాచి, ‘ఇంత’ అని చెప్పింది.
మాతృదేవి: సరే. నేను ఇక్కడ లేకుండా జయరాంబాటికి వెళ్లిపోయినా నువ్వు నన్ను ప్రేమిస్తారా?
చిన్నారి: అవును. మీరు వెళ్లిపోయినా ఎప్పటిలా మిమ్మల్ని ప్రేమిస్తాను. మిమ్మల్ని మరచిపోలేను.
మాతృదేవి: అదెలా నాకు తెలుస్తుంది?
చిన్నారి: దాన్ని ఎలా తెలుపగలను?
మాతృదేవి: దాని కొక దారి ఉంది. నీ ఇంట్లోని అందరినీ ప్రేమించావంటే అదే నన్ను ప్రేమించినట్లవుతుంది.
చిన్నారి: సరే. అందరినీ అలాగే ప్రేమిస్తాను.
మాతృదేవి: మంచిది. అందరినీ సమానంగా ప్రేమించాలి. ఒకరిని ఎక్కు వగా, మరొకరిని తక్కువగా ప్రేమించకూడదు. అందరిపట్ల నీ ప్రేమ సమంగా ఉండాలి.
చిన్నారి: అందరినీ సమానంగా ఎలా ప్రేమించగలను?
మాతృదేవి: దానికీ ఒక దారి ఉంది. నువ్వు ప్రేమించే వారి నుండి ఏదీ ఆశించకు, వారిని ఏదీ కోరవద్దు. నువ్వు ఏదైనా కోరావనుకో, కొందరు ఎక్కువ ఇవ్వవచ్చు, కొందరు తక్కువ ఇవ్వవచ్చు. ఎక్కువ ఇచ్చిన వారిని ఎక్కువగాను, తక్కువ ఇచ్చిన వారిని తక్కువగాను ప్రేమించవలసి వస్తుంది. కనుక నీ ప్రేమ అందరిపట్ల సమానంగా ఉండదు. కాబట్టి నువ్వు ప్రేమించే వారి నుండి ఏదీ ఆశించవద్దు. అలా చేసినప్పుడు నువ్వు అందరినీ సమానంగా ప్రేమించగలుగు తావు.
ఎంత అద్భుత మార్గం! తమను ప్రేమించాలంటే చుట్టూ ఉన్నవారి పట్ల అభిమానంతో మెలగాలి అని ఎంత మార్దవంగా తెలిపారు మాతృదేవి. దీన్ని మనం చేయగలిగినప్పుడే ఆమెను గురించి చింతన చేస్తున్నామని చెప్పడంలో అర్థం ఉంటుంది. పవిత్రతా, ప్రేమస్వరూపిణీ అయిన మాతృదేవి గురించి చింతన చేస్తున్నామని, ఇతరులను ప్రేమించడం ద్వారా మనం వ్యక్తం చేయాలి.
మూడవది, ఆచరణ స్థితి (willing) : మాతృదేవి జీవించి చూపిన దాన్లో కొంత అయినా మన జీవితాలలో ఆచరించాలి. సేవా సాధన, మాతృత్వం, తపస్సు – ఇవన్నీ మన జీవితంలో అభిన్న భాగాలైపోవాలి.
ఇలా భావనలోని మూడు స్థితులూ సంగమించి పనిచేసినప్పుడు మాతృదేవి కచ్చితంగా మనందరిలో నెలకొని, తమ అవ్యాజ కరుణను వర్షిస్తారు. తాము చెప్పదలచినవి వెలిబుచ్చుతారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు.
మాతృదేవి మహోన్నత జీవిత చరిత్ర ముగింపుకు వచ్చాం. చెప్పదలచిన దంతా చెప్పామా అనుకొని వెనక్కు చూసినప్పుడు జవాబు చెప్పడానికి మనస్సు తటపటాయిస్తుంది. ఎందుకంటే, ‘లేదు’ అనే కదా జవాబు చెప్పాలి. ఈ పుస్త కాన్ని చదివిన వారిలో ఎవరైనా, ‘నాకోసమే దీన్లో ఒక విషయం పొందుపరచబడి ఉంది’ అని భావిస్తే అది మాతృదేవి అవ్యాజ కరుణ గావించిన అద్భుతమే తప్ప మరేమీ కాదు. మాతృదేవి కృపాకటాక్షాలకై ప్రార్థిస్తూ, ప్రణామాలర్పిద్దాం!
సోదరి నివేదిత మాతృదేవికి వ్రాసిన ఉత్తరం
కేంబ్రిడ్జ్ డిసెంబర్
11, 1910
ప్రియమైన అమ్మా,
ఈ రోజు ఉదయం (శ్రీమతి) సారా ఆరోగ్యం కుదుటపడాలని ప్రార్థించ డానికి నేను చర్చ్‌కు వెళ్లాను. అక్కడ సమావేశమై ఉన్నవారు ఏసు తల్లి మేరీని స్మరిస్తూన్నారు. హఠాత్తుగా నాకు మీ జ్ఞాపకం వచ్చింది. ప్రేమ ఉట్టిపడే మీ ముఖారవిందం, ఆప్యాయత తొణికిసలాడే చూపులు, పావనమైన తెల్లటి దుస్తులు, రెండు చేతులకు ధరించిన బంగారు గాజులు – ఈ దృశ్యం అలాగే నా మనో నేత్రం ముందు ప్రత్యక్షమైంది. మీ సాన్నిధ్యం మాత్రమే సారా మనస్సుకు ప్రశాం తిని, ఆప్యాయతను ప్రసాదించగలవని అప్పుడు నాకు స్ఫురించింది. మీకొక విషయం తెలుసా? శ్రీరామకృష్ణులకు సంధ్యా ఆరాత్రికం నిర్వహిస్తున్నప్పుడు నేను మీ గదిలో కళ్లు మూసుకొని ధ్యానం చేస్తూవుండేదాన్ని. అదెంత మూర్ఖత్వమో ఇప్పుడు తెలుస్తున్నది. మీ పాదారవిందాల వద్ద ఒక పసిపాపగా ఉంటే అదే చాలునని అప్పుడు నాకెందుకు అవగతం కాలేదు? అమ్మా, మీరు ప్రేమమయ మూర్తులు. మీది కట్టలు తెంచుకొనే నదీ వెల్లువలాంటి లౌకిక ప్రేమ కాదు; మృదువుగా పరివ్యాపించే గంభీర ప్రశాంతత వంటిది అది. అందరికి శ్రేయస్సును ఒసగుతుంది అది; వైరమే ఎరుగని, ఎవరికీ హాని కలిగించని, మృదుమాధు ర్యంతో కూడిన కాంతిపుంజం అది.
ఆ ఆదివారం! ఆహా, ఎంతటి మహిమాన్వితమైన రోజు! కొన్ని నెలలకు మునుపు గంగానదిలో ప్రయాణానికి ముందుగా, మీ వద్దకు పరుగెత్తుకొంటూ వచ్చానే, అదే రోజు! ఆ రోజు మీరు నన్ను సాదరంగా ఆహ్వానించిన క్షణంలో, నాకు అనుగ్రహించిన ఆశీస్సులతో పొందిన అద్భుత ముక్తి అనుభవాన్ని ఎలా వర్ణించగలను? ప్రియమైన అమ్మా, మీకు అద్భుతమైన గీతాన్నో, కవితనో రచించి పంపాలని ఉంది. కాని మీ సాన్నిధ్యంలో అదొక చిరు సవ్వడిలా, వట్టి కేకలా ఉంటుందేమోనని భావిస్తున్నాను. నిజానికి మీరు భగవంతుని అపురూప సృష్టి! ప్రపంచంపట్ల గల కరుణతో శ్రీరామకృష్ణులు తమ అనుంగు బిడ్డలకై విడిచిపెట్టి వెళ్లిన ప్రేమమయ పాత్ర మీరు. కొన్ని సందర్భాలలో మీతో సొంత బిడ్డలా ఆడుకున్నా, మీ దివ్యసమక్షంలో నిశ్చింతగా, ప్రశాంతంగా కూర్చుని ఉండవలసిన వారమే మేము. ‘భగవంతుని అద్భుతా’ లన్నీ నిజానికి ప్రశాంతంగానే ఉంటాయి. అవి మన ఎరుక లేకుండానే మన జీవితాల్లో చొరబడతాయి. గాలి, సూర్యుని వెలుగు, అందమైన పచ్చిక బయళ్లు, గంగానది – మీలా మూర్తీభవించిన ప్రశాంతతలే కదా!
మీ ప్రశాంత ఆచ్ఛాదనను సారాకు ప్రసాదించండి. రాగద్వేషాలకు అతీతమైన, అత్యంత ఉన్నతమైన ప్రశాంతతకు మారురూపుగా భాసించేదే కదా మీ స్మరణ! తామరాకు మీది నీటి బిందువులా, లోకాన్ని స్పృశించకుండా భగవంతునిలో ధ్వనించే మధురమైన భాష కదా అది!
నా ప్రాణానికి ప్రాణమైన అమ్మా,
సదా మీ తుంటరి బిడ్డ,
నివేదిత.
ధ్యానం
ధ్యాయేచ్చిత్త సరోజస్థాం సుఖాసీనాం కృపామయీమ్ ।
ప్రసన్నవదనాం దేవీం ద్విభుజాం స్థిరలోచనామ్ ॥
ఆలులాయితకేశార్ధ వక్షఃస్థలవిమండితామ్ ।
శ్వేతవస్త్రావృతార్ధాంగాం హేమాలంకారభూషితామ్ ॥
స్వక్రోడన్యస్తహస్తాం చ జ్ఞానభక్తిప్రదాయినీమ్ ।
శుభ్రాం జ్యోతిర్మయీం జీవపాపసంతాపహారిణీమ్ ॥
రామకృష్ణగతప్రాణాం తన్నామశ్రవణప్రియామ్ ।
తద్భావరంజితాకారాం జగన్మాతృస్వరూపిణీమ్ ॥
జానకీరాధికారూపధారిణీం సర్వమంగళామ్ ।
చిన్మయీం వరదాం నిత్యాం శారదాం మోక్షదాయినీమ్ ॥
శ్రీ శారదాదేవి స్తోత్రమ్
ప్రకృతి పరమాం అభయాం వరదాం
నరరూపధరాం జనతాపహరాం
శరణాగత – సేవక – తోషకరీం
ప్రణమామి పరాం జననీం జగతాం.
మానవరూపం దాల్చిన పరాశక్తివీ, భయభ్రాంతులు పొందిన జనులకు అభయం ఒసగి ఆశ్రయమిచ్చే తల్లివీ, వరాల నొసగే వరప్రదాయినివీ, జనుల హృదయ తాపాలనుతొలగించే తల్లివీ, శరణుజొచ్చిన నీ భక్తుల హృదయాలలో ఆనందాన్ని వర్థిల్ల చేసేదానివీ అయిన ఓ పరతత్త్వమా, జగజ్జననీ నీకు వందనాలు.
గుణహీనసుతాన్ అపరాధయుతాన్
కృపయాద్య సముద్ధర మోహగాతాన్
తరణీం భవసాగర – పారకరీం
ప్రణమామి పరాం జననీం జగతాం.
గుణహీనులూ, అపరాధులూ, మోహగతులూ అయిన మా బోటి సంతానం పైన నీ కరుణను వర్షించి అనుగ్రహించి కాపాడు. నీ బిడ్డలను సంసారసాగరాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు చేర్చే నావవు నువ్వే కదా తల్లీ! అట్టి ఓ పరతత్త్వమా, జగజ్జననీ నీకు వందనాలు.
విషయం కుసుమం పరిహృత్య సదా
చరణాంబురుహామృత శాంతి – సుధామ్
పిబ భృంగమనో భవ రోగహరాం
ప్రణమామి పరాం జననీం జగతాం.
మనస్సు అనే ఓ భృంగమా! ప్రాపంచిక విషయ భోగాలనే పువ్వులపై వ్రాలడం వదలిపెట్టి, భవరోగాలకు దివ్యఔషధమయిన అమ్మ పాదపద్మాలలోని శాంతి సుధామృతాన్నే సదా గ్రోలుతూవుండు.
ఓ పరతత్త్వమా, జగజ్జననీ నీకు నమస్కారాలు.
కృపాం కురు మహాదేవి
సుతేషు ప్రణతేషు చ;
చరణాశ్రయదానేన
కృపామయి నమోఽస్తుతే.
నీ మ్రోల సాగిలబడి మ్రొక్కుచున్న నీ బిడ్డలమైన మా పట్ల నీ కారుణ్యాన్ని ప్రసరించు తల్లీ!
ఓ కృపామయీ! నీ పాదాల చెంత మాకు ఆశ్రయమిచ్చి మమ్మల్ని రక్షించు! నీకు మా నమస్కారాలు.
లజ్జాపటావృతే నిత్యం శారదే జ్ఞానదాయికే,
పాపేభ్యో నః సదా రక్ష కృపామయి నమోఽస్తుతే.
ఓ తల్లీ! శారదాదేవీ! సదా నీవు లజ్జ అనే మేలిముసుగును ధరించి ఉంటావు.
జనులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే దానివి నువ్వే.
ఓ కృపామయీ! మమ్మల్ని పాపాల నుండి కాపాడు. నీకు మా నమస్కా రాలు.
రామకృష్ణ గత ప్రాణాం తన్నామశ్రవణ ప్రియాం,
తద్భావ రంజితాకారాం ప్రణమామి ముహుర్ముహుః.
ఓ తల్లీ! శారదా! నీ జీవిత సర్వస్వం శ్రీరామకృష్ణులలోనే ప్రతిష్ఠితమయి ఉన్నది. ఆయన నామం వినడం నీకు ఎంతో ఇష్టం. శ్రీరామకృష్ణుల దివ్య ఆధ్యా త్మిక భావాలతో నిండి నిబిడీకృతమయి విరాజిల్లుతూన్నది నీ వ్యక్తిత్వం. అట్టి శారదాదేవికి పదేపదే మా నమస్కారాలు.
పవిత్రం చరితం యస్యాః పవిత్రం జీవనం తథా,
పవిత్రతా స్వరూపిణ్యై తస్యై కుర్మో నమో నమః.
ఏ తల్లి జీవిత చరిత్ర పరమపవిత్రమో, ఏ తల్లి జీవనమంతా పావన మయమో, మూర్తీభవించిన పవిత్రతగా ఏ తల్లి విరాజిల్లుచున్నదో, అటువంటి దివ్యజనని శ్రీ శారదాదేవికి పదేపదే నా వందనాలు.
దేవీం ప్రసన్నాం ప్రణతార్తి – హంత్రీం
యోగీంద్రపూజ్యాం యుగధర్మపాత్రీం,
తాం శారదాం భక్తి విజ్ఞానదాత్రీం
దయాస్వరూపాం ప్రణమామి నిత్యం.
తన పాదాల మ్రోల శరణు జొచ్చిన భక్తుల దుఃఖాలను ఉపశమింపజేసే తల్లి శారదామాత. (ఫలహారిణి కాళీ పూజా సమయంలో) యోగీంద్రుడైన శ్రీరామ కృష్ణుల పూజలందుకొన్న జగజ్జనని శారదాదేవి. శ్రీరామకృష్ణులతో కలసి ఆధునిక కాలానికి అనుగుణమైన యుగధర్మాన్ని శారదాదేవి ఆవిష్కరించి ఉన్నారు. ఆమె కరుణా స్వరూపిణి. భక్తి, విజ్ఞానాలను మనకు ప్రసాదించే తల్లి ఆమే.
ప్రసన్నురాలయ్యే శారదాదేవికి నేను సతతం నమస్కరిస్తున్నారు.
స్నేహేన బధ్నాసి మనోఽస్మదీయం
దోషానశేషాన్ సగుణీకరోషి,
అహేతునా నో దయసే సదోషాన్
స్వాంకే గృహీత్వా యదిదం విచిత్రం.
మా మానసములను నీ ప్రేమ పాశాలతో కట్టివేసి నువ్వు మా దోషాలను సైతం సుగుణాలుగా తీర్చిదిద్దుతావు. కరుణామూర్తివయిన నువ్వు మేం దోష యుతులమయినా లెక్కింపక అహేతుక దయతో మమ్మల్ని నీ ఒడిని జేర్చుకొని కాపాడుతూంటావు. ఇది ఎంత విచిత్రం!
ప్రసీద మాత ర్వినయేన యాచే
నిత్యం భవ స్నేహవతీ సుతేషు
ప్రేమైక బిన్దుం చిరదగ్ధచిత్తే
విషించ చిత్తం కురు నః సుశాంతమ్.
ఓ తల్లీ! నేను సవినయంగా నిన్ను ప్రార్థిస్తున్నాను. నా ప్రార్థనను మన్నించి అనుగ్రహించు! ఆ ప్రార్థన ఏమంటే–
నీ బిడ్డలమయిన మా పట్ల సదా ప్రేమను వర్షించు. చిరకాలంగా పరి తాపం చెంది దహించుకుపోతున్న నీ బిడ్డల తప్తహృదయంలో ఒక్క ప్రేమ బిందు వును వర్షించి ఆ తప్తహృదయాన్ని చల్లబరచి శాంతింపజేయి!
జననీం శారదాందేవీం
రామకృష్ణం జగద్గురుం,
పాదపద్మే తయోః శ్రిత్వా
ప్రణమామి ముహర్ముహుః.
(స్వామి అభేదానంద కృతం)
జగజ్జననియైన శారదాదేవి,
జగద్గురువయిన శ్రీరామకృష్ణులు–
వీరి పాదపద్మాలను ఆశ్రయించి, వారికి పదేపదే నేను నమస్కరిస్తున్నాను.