మాతృత్వమనే సమగ్ర పరిమాణం
భారతదేశ, ఇతర దేశాల సంస్కృతీ, విజ్ఞానమూ, మతమూ, పారమార్థికతా అంటూ ఏ అంశాన్ని అయినా అధ్యయనం చేసేవారు ఒక అద్భుతమయిన నిజాన్ని గ్రహించగలుగుతారు. ఏ అంశంలోనైనా పూర్ణ త్వాన్ని ఆశించింది హైందవ మానసం: ‘ఓ ఒక్కదానిని తెలుసుకుంటే సమస్తాన్నీ తెలుసుకోగలుగుదుమో’* ఆ ఒక్కదానిని, అంటే పూర్ణత్వాన్ని కోరుకొనే చింతనాస్పందనను ఉపనిషత్తుల కాలం నుండే మనం చూడవచ్చు. ఈ చింతనాసరళిని మనం మాతృదేవి జీవితంలో ప్రవేశపెడతాం – ఏ పరిమాణాన్ని అర్థం చేసుకొన్నా మాతృదేవి జీవితాన్ని కొంతైనా అర్థం చేసుకున్న వార మవుతాం.
మాతృదేవి ఒక భక్తురాలు, జ్ఞాని, కర్మయోగి, దేవిగా విరాజిల్లారు. ఇవన్నీ అత్యంత ఉన్నతమయినవే. కానీ మాతృదేవి ప్రత్యేక మహిమాన్వితం వీటిలో లేదు. ఎందుకంటే మీరాబాయి, ఆండాళ్ లాంటి భక్తురాండ్రూ, అక్క మహాదేవి లాంటి జ్ఞానులూ, అహల్యాబాయి, ఝాన్సీరాణి లాంటి కర్మవీరాంగనలూ, సీత లాంటి దివ్యమహిళలూ, దైవ స్థితికి తమను ఉద్ధరించుకొన్న ఎందరో స్త్రీలు చరిత్రలో మనకు తారసపడతారు. కానీ మాతృదేవి ఇవన్నిటిగా ఉన్నారు; అంతేకాక వారి అన్ని పరిమాణాలనే ముత్యాలను అల్లుకుంటూ నిలిచింది వారి మాతృత్వం. ఈ విషయంలోనే ఆ ప్రత్యేకత. ఆమె ప్రతి మాటలోనూ, చేతలోనూ, అంతెందుకు, వారి జీవితంలోని ప్రతి క్షణమూ మాతృత్వ భావనతో అలరారింది. ప్రతిఫలం ఎదురు చూడని నిస్వార్థమైన, సకల జీవులకూ అభయమిచ్చి రక్షించే, ప్రేమకరుణ అనురాగం లాంటి అలలు సదా చెలరేగుతున్న మాతృత్వమనే హద్దులు లేని మహా సముద్రమై ఉన్నారు మాతృదేవి. అందువల్ల మాతృదేవి మాతృత్వమనే సంపూర్ణ పరిమాణాన్నీ, అది మనకిచ్చే సందేశాన్ని కొంతవరకైనా అర్థం చేసుకొనగలిగితే, ఆమె కాలావశ్యకతను పూర్తి చేయడానికి అవతరించారని అప్పుడప్పుడు తెలిపిన దాన్లోని యథార్థం విశదమవుతుంది.
మాతృత్వం – ఒక ఉత్కృష్ట ఆధ్యాత్మిక సాధన
స్త్రీత్వం మాతృత్వం వైపుగా పరిణతి పొందాలి. ఈ మార్గాన్ని వీడి పోవడమే ప్రస్తుత సమాజ పతనానికి కారణమని మొదటి అధ్యాయంలో వివరంగా చూశాం. మాతృత్వం అంతటి మహత్త్వపూర్ణమయినదా? అవును, ఎందుకంటే ఈ లోకంలోని బంధుత్వాలలో మాతృత్వం మాత్రమే పరిధులను దాటుకుంటూ వ్యాపింప గలుగుతుంది. భార్య అనే బంధుత్వాన్ని తీసుకుందాం. భార్య అనే స్థితిలో ఆమె ఒక వ్యక్తిని మాత్రమే ప్రేమించగలుగుతుంది. ఇలానే ఇతర బాంధవ్యాలను పరిశీలించి చూస్తే అవన్నీ ఒక నిర్ణీత పరిధిలో ఆగిపోతాయి. మాతృత్వమనే ఉత్కృష్టమయిన గుణం మాత్రమే ఆడ, మగ, మతి, భాష, జాతి ఇత్యాది అన్ని మానవ సరిహద్దులను అతిక్రమించి లోకాన్నే కౌగిలిలో చేర్చుకోగలుగుతుంది.
పారమార్థిక సాధనల ధ్యేయం భావనల పరివ్యాప్తి. మానవ హద్దులను అతిక్రమించి భావనలను విస్తృతించి, పరమ భావనా స్వరూపమయిన భగవంతుని దరిచేర్చడమే సాధనల ధ్యేయం. భక్తి, జ్ఞాన, యోగ, కర్మ అనే పారమార్థిక మార్గాలు ప్రతి ఒక్కటీ దీనిని ఒక్కొక్క రీతిలో ఈడేర్చుతాయి. ఒక ఇంటికి పెద్దగా, ఒకరిద్దరు బిడ్డలకు తల్లియైన ఒక స్త్రీ తన భావనలను విస్తృతింప చేసుకొంటూ లోకాన్నే మాతృత్వమనే ఉత్కృష్ట ప్రేమతో అక్కున చేర్చుకునే క్రియాశీలత ఆమెను పారమార్థిక ఉన్నత స్థితులకు తీసుకుపోతుంది. ఈ మాతృత్వ సాధనకు అత్యంత ఉన్నతమయిన పరిపక్వతా, మనో పరిశుద్ధత ఆవశ్యకమనడం నిర్వివాదాంశం. అందువల్లనే గురుదేవులు, “మాతృత్వాన్ని చిట్టచివరి తత్త్వం” అన్నారు. కానీ స్త్రీలకు దీనిని పాటించే విధానం సహజసిద్ధమూ, సరళమూ అయింది, దీనినే మాతృదేవి జీవించి చూపించారు.
మాతృదేవి మాతృత్వ పరిమాణం
అందరు స్త్రీలలా అమ్మా అని పిలవడానికి బిడ్డలు కావాలనే కోరిక నెల కొన్న తొలి రోజుల్లో మాతృదేవిలో మాతృత్వమనే బీజం మొలకెత్త సాగిందని చూశాం. ఆమె భర్తా, గురువూ అయిన శ్రీరామకృష్ణులు లౌకిక దృష్టిగల ఆ మాతృత్వ భావనను విస్తరింపచేసి, అలౌకిక, పారమార్థికపరమైనదిగా మార్చారు. ఇలా వికసించి, వ్యాపించసాగిన మాతృదేవి మాతృత్వ భావన ‘నేను లోకమాతను’ అని ఉద్ఘాటించేటంతగా పరిపూర్ణ స్థితికి ఎదిగింది.
ఆమెను చూచిన వారందరూ, “మరి దేనికంటే కూడా ఆమె నా తల్లి. ఈ జన్మలో మాత్రమే కాదు, వరుసగా రానున్న జన్మ లన్నిటిలోనూ ఆమే నా తల్లి” అని ముందు గ్రహించారు. ఆమెను ఆశ్రయించిన అందరికీ తాము ఒక ప్రేమ మూర్తియైన తల్లి అనే సత్యాన్ని తప్పక జ్ఞాపకం తెచ్చే స్వరూపం ఆమెది. అందువల్ల సిగ్గో, సంకోచమో లేకుండా అందరూ అనురాగంతో ఆమెను ఆశ్రయించారు. తమ లోటుపాట్లను, కష్టాలను సంకోచించ కుండా ఆమెకు చెప్పుకొని సాంత్వనపొందారు. మాతృదేవి సమక్షంలో తమ మనస్సులు ఎగిరి విస్తృతించడం గ్రహించారు; ప్రశాంతతను, ఆనందాన్ని అనుభవించారు; సామాన్య వ్యక్తి కంటే పూర్తిగా భిన్నమయిన ఒక ఉన్నతమైన శక్తి సమక్షంలో ఉన్నామనే భావన పొందారు. తమ దుఃఖాలకూ, సందేహాలకూ పెద్ద జాబితా రాసుకుని ఆమెను ఆశ్రయించినవారు, ఆమె సమక్షంలో కూర్చున్నప్పుడు అవి కరిగిపోవడం చూశారు. సంశయంతో ఆవేదనపడే ప్రజలకు విశ్వాసాన్ని ప్రసాదించడానికి, బలహీనుల హృదయాల్లో ఉత్సాహాన్నీ, ఉద్వేగాన్నీ రగల్చడానికీ తగిన శక్తిని మాతృదేవి తాము వెళ్లిన ప్రతిచోటికీ తీసుకెళ్లారు. దుష్టులు సైతం ఆమె సమక్షంలో తాను ఆమె ఆదరణకూ ప్రేమకూ పాత్రులయినట్లు భావించారు.
భక్తులకు, శిష్యులకు మాతృదేవి
మాతృదేవి మాతృత్వం, భక్తులందరికీ ధారాళంగా మంత్రదీక్ష ప్రసాదించడంలో మాత్రమే కాకుండా దైనందిన జీవితంలో వారిపట్ల చూపిన అవ్యాజకరుణ, ఓర్పు, ఆదరణ ద్వారా విరాజిల్లింది. లోకాన్నంతటినీ తమ ఒడిలో చేర్చుకొనే మాతృత్వం ఆమెలో భాసిల్లి విస్తృతించడంతో, ఆమెను ఆశ్రయించిన ప్రతి వ్యక్తీ, తమ సొంత తల్లి కనబరిచే అనురాగం, కొన్ని సమయాల్లో వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమను మాతృదేవి నుండి పొందారనడం అతిశయోక్తి కాదు. జయరాం బాటిలో ఉంటున్నప్పుడు, తమ ఆరోగ్యం బాగున్న రోజుల్లో స్వయంగా ఆమే వంట చేసేవారు, వడ్డించేవారు; ఎంగిలి విస్తళ్లను కూడా తీసేవారు. భక్తులు వాడుతున్న దుప్పట్లను వారికి తెలియకుండా తామే ఉతికి పెట్టేవారు. చాలా దూరం నుండి కాలినడకన వచ్చిన వారికి విసనకర్రతో విసురుతూ సేదతీర్చే వారు. వారి కాళ్లను వేడి నీళ్లతో కడిగేవారు. ఈ సేవలను స్వీకరించడానికి భక్తులు నిరాకరిస్తే, హృదయాన్ని స్పందింపచేసే అనురాగపూరిత పలుకులతో, “మీ రందరికీ అలా ఏం చేసిపెడుతున్నాను? మీకందరికి అమ్మను కానా! బిడలను అన్ని విధాలుగా లాలించి పోషించడం అమ్మ కర్తవ్యం కాదా! బిడ్డలు అశుద్ధం చేస్తే దానిని కడిగి, శుభ్రం చేయడం తల్లి కర్తవ్యం కదా!” అని చెబుతూ తమ ప్రేమాతృత వృష్టిలో ముంచేస్తారు. జయరాంబాటికి వచ్చే భక్తులలో ఆరోగ్యం బాగాలేని వారికోసమో, ఉదయం టీ తాగితేకానీ ఏ పనీ చేయలేని వారికోసమో మాతృదేవి పలువురు ఇళ్లకు వెళ్లి పాలు సేకరించి తేవడం సర్వసాధారణమైన సంఘటన.
అస్వస్థులైన వారిని కన్నతల్లిలా ప్రక్కన ఉండి ప్రేమగా చూసుకొనేవారు. ఒకసారి శిష్యుడొకడు తన చేతికి పుళ్లు వచ్చి చేతులతో తినలేకపోయినప్పుడు, ఆ పుళ్లు ఆరే దాకా మాతృదేవి తామే స్వయంగా ఆతనికి తినిపించారు. శిష్యులు వస్తారని వారికోసం తినుబండారాలను చేసి ఉత్సాహంగా ఉంచేవారు. భక్తులకూ, శిష్యులకూ భోజనం పెట్టడం మాతృదేవికి ఎంతో ఆనందం. ఆమె కలకత్తాలో ఉన్నప్పుడు, భోజన సమయంలో ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, వారికి భోజనం పెట్టకుండా పంపేవారు కారు. ఇలా హఠాత్తుగా పలువురిని భోజ నానికి పిలిచేవారు మాతృదేవి, “ ‘అమ్మా’ అని పిలుస్తూ ఎవరైనా వచ్చారంటే, ఆతడికి అది ఇవ్వ, ఇది ఇవ్వు అంటూ ఆహ్వానించడం మీకు పరిపాటి అయి పోయింది” అంటూ గోలాప్ మా చెప్పడం కద్దు.
భోజన సమయంలో కాకుండా, తక్కిన సమయాల్లో వచ్చిన వారికి కూడా తీపి, పండ్లు, నీళ్లు, తాంబూలం అంటూ ఏదో ఒకటి ఇచ్చే పంపేవారు. మాతృ దేవి ఇచ్చింది సామాన్యమైన వస్తువయినా, హృదయంలో ఉప్పొంగే ప్రేమతో ఇవ్వడంవల్ల, వాటిని తీసుకున్న వారి మనస్సుల్లో శాశ్వతంగా ఆమె నిలిచిపోయే వారు. అట్లే భక్తులు మాతృదేవికి ఇచ్చేవి కూడా అతి మామూలు వస్తువులు. అయినా వాటిని సంతోషంతోనూ, ఆప్యాయంగానూ పుచ్చుకొనేవారు.
స్వామి శారదానంద మాతృదేవికి తీపి తినుబండారాలు పంపడం కద్దు. అలా పంపించే వాటిలో ఒక వంతు సింహవాహిని ఆలయానికి, ఒక వంతు ధర్మ ఠాకూర్ ఆలయానికి ఒక వంతు బంధువులకు, ఇరుగు పొరుగులకు, మిగిలింది భక్తులకు పంచిపెట్టేవారు. తమకంటూ ఏదీ ఉంచుకోరు. ఎందుకంటే ఆమె తల్లి కాబట్టి. ఇవ్వడమే కాని తనకంటూ ఏదీ ఉంచుకోవడం తల్లి నైజం కాదు కదా!
ఒకసారి శిష్యుడొకడు ప్రక్క గ్రామానికి వెళ్లవలసి వచ్చింది. పని ముగించుకుని, మధ్యాహ్నం బాగా ఆలస్యంగా తిరిగి వచ్చినప్పుడు, అంతదాకా మాతృదేవి కూడా భోజనం చేయకుండా, ఆతడి కోసం భోజనం తీసివుంచి వేచివుండడం చూశాడు. ఆతడికి ఎంతో బాధ కలిగింది. కానీ మాతృదేవి ప్రేమతో, “ఇంత సేపయినా నువ్వు భోజనం చేయలేదు. నేను మాత్రం ఎలా తినగలను?” అన్నారు. శిష్యుని కళ్లు ఆర్ద్రమయ్యాయి.
బయటి ఊళ్ల నుండి జయరాంబాటికి వచ్చే భక్తులను కనీసం రెండు మూడు రోజులైనా ఉండి వెళ్లవలసిందిగా ప్రాథేయపడేవారు మాతృదేవి. “ఇక్కడికి రావడం ఎంతో శ్రమ. ఇక్కడికి రావడం కంటే కాశీ, గయకు వెళ్లడం ఎంతో సులభం” అనేవారు ఆమె. కొన్ని సందర్భాల్లో పది పన్నెండు మంది హఠాత్తుగా వచ్చేవారు. అదీ వేళకాని వేళల్లో. వారందరికీ ప్రేమతో ఆతిథ్యమిచ్చేవారు. ఇలా వేళకాని వేళల్లో వచ్చే భక్తుల కంటూ ప్రత్యేకంగా కొన్ని తినుబండారాలను కేటాయించి ఉంచేవారు. వాటిని వారికి పెట్టి కొన్ని రోజులుండమని ప్రాథేయపడేవారు.
కొందరు భక్తుల కోసం మాతృదేవి ఎన్నో శ్రమలను పడవలసి వచ్చేది. చాలా దూరం నుండి వచ్చిన భక్తుడొకడు మాతృదేవి అన్నప్రసాదాన్ని ఆరబెట్టి ఇంటికి తీసుకెళ్లాలని ఆశించాడు. మాతృదేవి కూడా ఆ భక్తుని తృప్తి కోసం మధ్యాహ్న భోజనం తర్వాత కొంత అన్నాన్ని ఒక పెద్ద పళ్లెరంలో ఉంచి ఆరబెట్టారు. తర్వాత భక్తునితో, “నాయనా! కాకులు తన్నుకుపోకుండా చూసుకో” అని అన్నారు. “సరేనమ్మా, ఇప్పుడే వచ్చేస్తాను” అంటూ వెళ్లిన భక్తుడు అసలు ఆ విషయాన్నే మరచిపోయి, హాయిగా పడుకుని నిద్రపోయాడు. మధ్యాహ్నం మూడు గంటలకు మేల్కొన్నప్పుడే ఆతడికి అన్నప్రసాదం గురించి జ్ఞాపకంవచ్చింది. వెంటనే లేచి పరుగెత్తాడు. అక్కడ చూసిన దృశ్యం ఆతణ్ణి నిశ్చేష్టుణ్ణి చేసింది. మాతృదేవి అంతసేపూ, ఆ ఎండలో, అన్నప్రసాదానికి కాపలాకాస్తూ కూర్చొనేవున్నారు. “ఇది నీ ప్రసాదం. కాకులు ఎత్తుకు పోకూడదని ఇక్కడే కూర్చొన్నాను” అన్నారు మాతృదేవి.
మరొక సంఘటన: శివరాత్రి పర్వదినం నాడు ఉద్బోధన్లో అందరూ ఉపవాసం చేస్తున్నారు. అక్కడ పని చేస్తున్న చంద్రమోహన్ అనే వ్యక్తి, తనకు ఇష్టం లేకపోయినా, పుణ్యాన్ని పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో ఉపవాసం ఉన్నాడు. ఏమీ తినకపోవడంతో ఆతడి ముఖం కళావిహీనమయింది. ఆతణ్ణి చూడగానే మాతృదేవికి అంతా అవగతమయింది. ఏమైనా తినమని ఆతడికి చెప్పారు. అందువల్ల పుణ్యాన్ని పోగొట్టుకోవలసి వుంటుంది కదా అన్నాడు. వెంటనే మాతృదేవి, “భయపడకు! నేను వ్రతం ఉంటాను. ఆ పుణ్యమంతా నీకే చెందుతుంది” అని చెబుతూ ఆమె ఆ రోజు ఉపవాసం ఉండి, అతణ్ణి భుజింపచేశారు.
భక్తులు సెలవు పుచ్చుకొనే సమయం మాతృదేవికి తీరని శోకాన్ని కలి గించేది. చాలా దూరం నుంచి వచ్చి ఒకటి రెండు రోజులలో తిరిగి వెళ్లిపోయే తన కుమార్తెను చూసి తల్లి ఎలా దుఃఖీస్తుందో అలా వారిని కన్నీళ్లతో సాగనంపే వారు. కీళ్ల నొప్పులతో నడవలేని స్థితిలో కూడా కొంతదూరం వారితోపాటు వెళ్లి వచ్చేవారు. కనుచూపు మేరదాకా కన్నీళ్లతో వారివైపు చూస్తూనే నిలబడి ఉండే వారు. ప్రారంభకాలంలో మాతృదేవి కలకత్తా వచ్చినప్పుడు గంగాతీరంలో ఒక అద్దె ఇంట్లో ఉండేవారు. అప్పుడు కూడా తమను చూడవచ్చిన భక్తులు సెలవు పుచ్చుకొని పడవలో ఎక్కి వెళ్లిపోవడాన్ని కనుమరుగయ్యే దాకా చూస్తూనే నిలబడి ఉండేవారు. వర్షం పడినా, ఎండ కాచినా లెక్కచేయకుండా ఇలా బయటే నిలబడేవారు.
తల్లి బిడ్డకు సూటిగా నిప్పు ఇవ్వడం వంగదేశంలో అమంగళమని నమ్మకం. మాతృదేవి ఎవరికైనా నిప్పు అందించవలసివస్తే క్రింద పెట్టిన తరువాత ఆ నిప్పును క్రింద నుంచి తీసుకోమని చెప్పేవారు. ఇలా మాతృత్వం మాతృదేవి సుగుణ సంపత్తిగా మాత్రమే కాకుండా మాతృదేవి ఏకైక భావనగా విరాజిల్లింది.
నిరాశ్రయులకు మాతృదేవి
పేదలకూ, నిరాశ్రయులకు మాతృదేవి హృదయంలో ప్రత్యేక స్థానముండేది. సంపన్నుడైన వ్యక్తి ఒకరు తన వీలునామాలో బేలూరు మఠానికి ధనమూ, వస్తువులూ వ్రాసినట్లు తెలిపారు. ఆ మాట వినగానే మాతృదేవి. “అది సరే. ఆతడు పేదలకు అనాథలకు ఏమైనా కేటాయించాడా?” అని అడిగారు. మాతృదేవి హృదయం వారికోసం పరితపించేది. భవానీ తల్లి జయరాంబాటిలో ఉండేది. వృద్ధాప్యంలో అనారోగ్యంతో నానాబాధలూ అనుభవిస్తున్న ఆమెను కాపాడేవారు ఎవరూ లేకపోయారు. ఆమెకు మాతృదేవే శరణమయ్యారు. చివరి రోజు దాకా ఆమెను మాతృదేవే కాపాడారు. దుఃఖంతో మాతృదేవిని ఆశ్రయించినవారు ఆహారం, గుడ్డ, డబ్బు – వీటిలో ఒకటి పొందకుండా వెళ్లింది లేదనడం అతి శయోక్తి కాదు. అంత మాత్రమే కాదు. తమను చూసుకొనే వారు లేకుండా నిరా దరణకు గురియైన శోకతప్తులైన పేదలకు కూడా మాతృదేవి శరణాగతి నిచ్చారు.
అదే గ్రామంలో బెనర్జీ కుటుంబానికి చెందిన ఒక స్త్రీ ఉండేది. ఆమెకు చెవిలో క్షయవ్యాధి సోకింది. చెవి నుండి వచ్చే దుర్గంధ కారణంగా ఆమె కుటుంబం వారు కూడా ఆమెను దరిజేర నివ్వకుండా దూరంగా ఉంచేశారు. ఆమె దుర్భర దుస్థితిని విన్నారు మాతృదేవి. ఒక రోజు కోల్పారా ఆశ్రమం నుండి వచ్చిన ఒక శిష్యునితో ఈ విషయం ఆవేదనతో చెప్పారు. ఆ శిష్యుడు ఆమెను కోల్పారా ఆశ్రమానికి తీసుకెళ్లి చికిత్స చేయించగోరాడు. అది విన్న మాతృదేవి ఎంతో సంతోషించారు; వెంటనే ఆశ్రమాధ్యక్షుని నుండి అనుమతి పొందవలసిన ఆవశ్యకతను గురించి చెప్పారు మాతృదేవి. మర్నాడు ఆశ్రమాధ్యక్షుని అనుమతితో ఆమెను తీసుకెళ్లడానికి వచ్చాడు శిష్యుడు. అప్పుడు మాతృదేవి పొందిన సంతో షాన్ని ఆ శిష్యుడు తన జీవితంలో అంతదాకా ఆమెలో చూసింది లేదు. మాతృ దేవి పొందిన ఆనందం వర్ణనాతీతం! నిస్వార్థ ప్రేమ ఎలావుంటుందో అప్పుడు తెలుసుకున్నాడు ఆ శిష్యుడు!
ఒకసారి మాతృదేవి శిష్యుడూ, గురుదేవుల దివ్యజీవితాన్ని ‘శ్రీరామకృష్ణ పుంధీ’ అనే కావ్యంగా రచించి గానం చేసిన అక్షయకుమార్ సేన్ మాతృదేవికి పనిమనిషి ద్వారా కొన్ని కాయగూరలు పంపించాడు. ఆ పనిమనిషి రాత్రి బాగా ప్రొద్దుపోయాక వచ్చినందువల్ల మాతృదేవి అక్కడే ఉండి మర్నాడు వెళ్లమన్నారు. ఆమెకు మలేరియా జ్వరం ఉంది. రాత్రికి జ్వరం ఉద్ధృతమై, పడకలోనే వాంతులు చేసింది. తెల్లవారి ఆమె గదికి వెళ్లిన మాతృదేవి పరుపంతా వాంతులమయంగా ఉండడం చూశారు. వెంటనే ఆమెకు సాయమందించి, ఆమె పరుపును శుభ్రం చేసి, ఆ గదిని కూడా శుభ్రపరిచారు. అప్పుడు ఇంట్లో తక్కినవాళ్లు కూడా ఉన్నారు. వారితో చెప్పివుంటే వారే శుభ్రం చేసేవారు. దానితోపాటు ఆ పని మనిషి కూడా ఎడాపెడా చీవాట్లు తినివుండేది. వారి బారి నుండి ఆ పేదరాలిని కాపాడడానికే వృద్ధాప్యంలో కూడా మాతృదేవి తామే ఆ పని చేశారు.
దుష్టులకు కూడా తల్లే
మాతృదేవి సాటిలేని మాతృప్రేమ వెల్లువగా ఎలా ప్రవహించిందో పలు రీతుల్లో చూశాం. ఆ దివ్య ప్రేమ బంధువులు, శిష్యులు, భక్తులతో ఆగలేదు, దుష్టులకూ, దుశ్శీలురకూ కూడా ఆమె తల్లిగా వున్నారు. “మంచి పిల్లవాడికి నేను తల్లిని, అదేలా దుష్టునికీ నేను తల్లినే; మంచి అమ్మాయికి నేను తల్లిని, అదేలా దుశ్శీలకు కూడా నేనే తల్లిని” అనేవారు మాతృదేవి. వారి లోటుపాట్లను మాతృదేవి ఏవ లోకమాత గించుకోరు; ఎలాంటి తప్పునయినా క్షమించగలిగేవారు. తాము అనుభవిస్తున్న కష్టాలనూ ఆవేదనలనూ మనస్సు విప్పి చెబితే పొంగిపొరలే ఆమె కారుణ్యం తమను కాపాడుతుంది, వారి దివ్యత్వం తమ ఆవేదనలను తొలగిస్తుంది అని తప్పు చేసినవారూ, తప్పుడుదారులు పట్టినవారూ స్పష్టంగా గ్రహించారు. ఇది మాతృదేవి మాతృత్వ పరిమాణంలో మరొక కోణం. సమాజ నియమాల హద్దులు ఆమె మాతృత్వం ముందు చెరిగిపోవడం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ మాతృత్వం వికసించిన కొన్ని సంఘటనలను చూద్దాం.
ఒకసారి గురుదేవుల శిష్యుడొకరు మాతృదేవితో ఒక యువశిష్యుని దుష్ప్ర వర్తన గురించి చెబుతూ, ఆతణ్ణి అక్కడికి రానివ్వకూడదని విన్నవించాడు. అందుకు మాతృదేవి, “నా బిడ్డ మురికిలోనో, బురదలోనో పడిపోతే, ఆతణ్ణి చక్కగా శుభ్రం చేసి నా ఒడిలో తీసుకోవడం నా కర్తవ్యం!” అని అన్నారు.
దుశ్శీల అయిన ఒక స్త్రీ తన పాపాలకు ఎంతో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకోవడానికి మాతృదేవిని ఆశ్రయించి తన పాపకృత్యాలను గురించి చెప్పి కంట తడిపెట్టింది. మాతృదేవి ఆమెను అనురాగంతో కౌగలించుకుని, “అమ్మాయీ! గడచిన కాలం గురించి కన్నీళ్లు కార్చకు! పాపం చేయాలని ప్రేరేపించే నీ మనస్సు పోకడను అరికట్టాలి, జయించాలి” అని చెబుతూ ఆమెకు మంత్రదీక్ష కూడా ప్రసాదించి పంపారు.
మాతృదేవి శిష్యుడయిన ఒక యువకుడు అప్పుడప్పుడు మాతృదేవి దర్శ నార్థం వచ్చేవాడు, ఆతడు తన గ్రామంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తూ వచ్చాడు. ఆతడికి ఒక వితంతువుతో సంబంధం ఏర్పడింది. అందువల్ల ఆతణ్ణి అక్కడకు అనుమతించరాదని పలువురు మాతృదేవికి విన్నవించారు. ఆ యువ కుడి దుష్ప్రవర్తనకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు. కానీ వారందరూ చెప్పినవన్నీ మాతృదేవి స్వీకరించలేకపోయారు. అత్యంత ఆవేదనతో, “నేను ఆతడి తల్లిని, నా దగ్గరకి రావద్దని నేను ఎలా వారించగలను? అలాంటి మాటలు నా నోటి నుండి ఎన్నడూ రావు” అని చెప్పేశారు. ఆ యువకుడు మాతృదేవి దర్శనానికి వస్తూనే వున్నాడు. ఒక రోజు ఆ వితంతువును కూడా తనతోపాటు తీసుకొచ్చాడు. ఒక వ్యక్తి జీవితం దారి తప్పించినందుకు ఆమెను చీదరించుకున్నారు. కానీ ఇతర స్త్రీల పట్ల చూపించే అదే ప్రేమను ఆమె పట్ల కూడా చూపారు.
పద్మ వినోద్
పద్మవినోద్ చరిత్ర హృదయాన్ని స్పందింపచేస్తుంది. ఆతడి అసలు పేరు వినోద్ విహారీ సోమ్. యువకుడయిన ఆతను చదువు పూర్తిచేసి నాటక రంగంలో ప్రవేశించాడు. ఎలాగో తాగుడుకు అలవాటు పడిన ఆతడి జీవితం పతనమవసాగింది. స్వామి శారదానంద అవ్యాజ ప్రేమపూరిత హృదయంలో ఆతడికి కాస్త చోటు లభించింది. మెల్లమెల్లగా ఆతను స్వామికి సన్నిహితుడయ్యాడు. ఆయనను ‘మిత్రమా’ అని పిలిచేవాడు. నాటకం ముగించి ఆతను ఇంటికి తిరిగిరావడానికి అర్ధరాత్రి దాటిపోయేది. తాగి తడ బడుతూ ఆతడు ఉద్బోధన్ దాటి వెళ్లేటప్పుడు ‘మిత్రమా, ఓ మిత్రమా’ అంటూ స్వామిని మరీ మరీ పిలిచేవాడు. కానీ తలుపు తెరిస్తే మాతృదేవికి నిద్రాభంగం కలుగుతుందని అతడు ఎంతగా అరిచినా తలుపులు తెరవవద్దని స్వామి ముందే హెచ్చరించివున్నారు. ఆతడు కూడ కొంతసేపు వేచివుండి, తర్వాత వెళ్లిపోయే వాడు. ఒకరోజు రాత్రి ఆతడికి ఏమి తోచిందో తెలియదు. మిత్రుని పిలిచి ప్రయో జనం లేదని నిర్ణయించుకొని పాట మూలంగా దీనంగా మాతృదేవినే పిలవ సాగాడు–
కరుణాసాగరం నా తల్లి
లేచి తలుపులు తీయవమ్మా
చీకటిలో ఏదీ తెలియక
హృదయం ఆరాటపడడం ఎరుగవా!
ఉద్వేగంతో బిగ్గర స్వరంతో
ఎన్నోసార్లు పిలిచాను
కరుణా సాగరంగా మనస్సున్నా
ఇప్పుడు ఎందుకు అది కరగదు?
బిడ్డను వెలుపలే వదిలేసి
నువ్వు మాత్రం నిద్రింపవచ్చా?
అమ్మా అమ్మా అంటూ అరచి అరచి
అలసిపోయాను నా తల్లీ!
రాగం తాళం పల్లవీ అంటూ
శ్రుతిచేర్చి గానం చేసి
ఎన్నిసార్లు పిలిచినా నీ
నిద్రపోనంటున్నదే!
క్రీడలలో మునిగి తేలుతూ
రోజూ కాలం వృథా చేస్తున్నాను
అని అనుకున్నవో ఏమో
ముఖాన్ని తిప్పుకున్నావో ఏమో!
ఒకసారి నీ కడగంటి చూపుతో
కరుణాపూరితంగా చూశావంటే
మళ్లీ క్రీడలో మునగను
నిన్ను వదలి ఇక వెళ్లను.
చెడుదారులు పట్టిన నాలాంటి
బిడ్డల భారమును కూడ
ప్రేమ స్వరూపమైన నా తల్లీ
నువ్వు గాక మరెవరు భరిస్తారు?
ఉద్వేగంతో వినోద్ పాడి ముగించడమూ, మేడమీద మాతృదేవి గది కిటికీ తలుపులు తెరచుకోవడమూ ఒకేసారి జరిగాయి. వినోద్ మేడ వైపుగా చూశాడు. కరుణాపూరిత నయనాలతో మాతృదేవి నిలబడివుండడం కనబడింది. మాతృదేవిని చూడగానే ఉద్వేగంతో మాటలు తడబడగా, “అమ్మా, నా తల్లీ! తీసేశావా! ఈ తనయుని పిలుపు నీకు వినబడిందా తల్లీ! ఇదిగో నా నమస్కారం స్వీకరించు” అంటూ దారిమీద పడి దొర్లసాగాడు. అక్కడి దుమ్మును ధూళిని మాతృదేవి పాదధూళిగా భావించి దానిని తలమీద కూడ ఉంచుకున్నాడు. తర్వాత మళ్లీ
మనసా అమ్మను జాగ్రత్తగా నీ
హృదయంలో పదిలపరచుకో
నువ్వు మాత్రం ఆమెను చూసుకో
మరెవరినీ అక్కడికి వదలకు!
అంటూ ఉత్సాహంగా పాడాడు. తర్వాత మాతృదేవిని చూస్తూనే,
నేను మాత్రం ఆమెను చూస్తాను
నా ‘మిత్రుడు’ చూడకుండా ఉండనీ
అని పాడుకుంటూ వెళ్లిపోయాడు.
మర్నాటి ఉదయం మాతృదేవి వినోద్‌ను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత కూడా అతను ఎప్పుడైనా ఇలా ‘అమ్మా’ అంటూ పిలిస్తే అది అర్ధరాత్రి అయినా లేచి మాతృదేవి కిటికీ తెరచి ఆతణ్ణి ఆశీర్వదించే వారు. దానిని ఒక వ్యక్తి వారించినప్పుడు, “ఇదిగో చూడు, ఆతడు కూడా నా తనయుడే. ఆతని దీనాలాపాలు విని నేను ఉదాసీనంగా ఉండలేను” అని చెప్పే శారు.
కానీ అంతలో తాగుడు శ్రుతి మించి ఆతడు అవసాన దశకు చేరు కున్నాడు. హఠాత్తుగా జీర్ణకోశం ఉబ్బిపోయి ఆసుపత్రిలో చేర్చారు. మాతృదేవి ఆతడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుంటూనేవున్నారు. తుదిఘడియలు సమీ పించినప్పుడు ఆతడు ‘శ్రీరామకృష్ణ కథామృతం’ చదవమన్నాడు. అది వింటూనే గురుదేవుల పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ ప్రాణాలు వదిలాడు. ఈ విషయం విన్న మాతృదేవి కన్నీళ్లు కారుస్తూ, “ఆతను కూడా గురుదేవుల తనయుడే కదా! ఇన్ని రోజులు బురదలో దొర్లాడు, ఇప్పుడు తనకు చెందిన స్థానమయిన ఆయన ఒడిలో చేరిపోయాడు” అన్నారు.
కులమతాలకు అతీతమైన మాతృత్వం
మాతృదేవి మాతృత్వం ఒకవైపు దుశ్చరితులనూ, చెడుదారులు పట్టిన వారినీ ఆదరించింది. మరొకవైపు కులమత భేదాలకు అతీతంగా అందరిపట్లా సమంగా ప్రసరించింది. ఆ కాలంలో కుల కట్టుబాట్లను గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న సంఘటనను చూస్తూనే చాలు. మాతృదేవి ఇంట్లో ఒకసారి జగద్ధాత్రీ పూజ జరిగినప్పుడు ఊరిపెద్దలు అనేకులు ఆ పూజలో పాల్గొన్నారు. మాతృదేవి సోదరుడయిన కాళీ అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాడు. అప్పుడు బ్రాహ్మ ణేతరుడైన సాధువు ఒకరు హోమప్రసాదాన్ని కాళీ నెత్తిమీద బొట్టుగా దిద్దాడు. అంతే, ఈ చర్య కుల కట్టుబాటును అతిక్రమించిన చర్యగా భావించి, అక్కడ సమావేశమైన బ్రాహ్మణులందరూ కోపంతో వెళ్లిపోయారు. మాతృదేవి ఎంత బ్రతి మాలినా ప్రయోజనంలేకపోయింది. వారు వెళ్లిపోవడం మాత్రమే కాదు, కట్టు లోకమాత బాటును అతిక్రమించినందుకు మాతృదేవి ఇంటికి ఇరవై రూపాయల జరిమానా కూడా విధించారు.*
కానీ వీటన్నిటి మూలంగా మాతృదేవి మాతృత్వ భావనకు ఆటంకం ఏర్ప డిందా అంటే లేదు. ఆ సమాజం ఎవరిని నిమ్నజాతివారనీ, బ్రాహ్మణుల సమక్షం లోకే రాకూడదని నిరోధించిందో వారికి కూడా మాతృదేవి వద్ద స్థానం ఉండేది. వారినీ ఇంటికి ఆహ్వానించి తాము భోజనం చేసిన పళ్లెం నుండి ఆహారం ఇచ్చే వారు. ఆ తర్వాత చేతులు కూడా కడుక్కోకుండా మళ్లీ భోజనం చేసేవారు. బ్రాహ్మణేతరుడైన తమ శిష్యుడొకడు వండిన ఆహారాన్ని గురుదేవులకు నివేదించి, తాముకూడా దానిని తిన్నారు. అంతే కాదు. మాతృదేవి పినతండ్రి అయిన నీల మాధవ్ శవవాహకులలో ఒక వ్యక్తి బ్రాహ్మణేతరుడు. బ్రాహ్మణుని శవాన్ని నిమ్న జాతి వ్యక్తి మోయడమా అనే సమస్య తలెత్తింది. వెంటనే మాతృదేవి, “నిమ్నజాతి వాడా! భక్తులలో ఎవరూ అలాలేదు. భక్తులు ఏ జాతికీ చెందినవారు కారు” అంటూ ఆ సమస్యను పరిష్కరించారు. ఆ రోజుల్లో, అందులోనూ కుగ్రామంలో, ఇటువంటి వాటిని గొప్ప సంస్కర్తకూడా ఊహించలేడు.
‘అంటరానివారు’ అంటూ పరిగణింపబడిన వారిని కూడా మాతృదేవి పవిత్ర ప్రేమ తన ఒడిలోకి చేర్చుకుంది. జయరాంబాటిలో ఒక పాకీవాడు మాతృ దేవి అవ్యాజ ప్రేమ పట్ల ఆకర్షితుడై అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చే వాడు. ఒకసారి ఆతడు నీళ్ల కుండలకు క్రిందవుంచే కుదుర్లను తయారుచేసి కొన్నిటిని తీసుకొచ్చాడు. వాటిని ఇంటి వసారాలో ఉంచమన్నారు మాతృదేవి. వసారాలోకి వచ్చిన ఆతణ్ణి సురబాల చూసింది. అంతే, గయ్యని అరుస్తూ గందర గోళం సృష్టించింది. మాతృదేవి వెంటనే వెళ్లి సురబాలను మందలించి, ఆతడికి తినుబండారాలు ఇచ్చి, ప్రేమగా సాగనంపారు.
మాతృదేవి ఇటువంటి చర్యలు ఆ కాల బ్రాహ్మణ సమాజంలో ఆచార విరుద్ధమైనవి. శాస్త్ర సంప్రదాయం పట్ల గల ద్వేషం వల్లనో ఏదో విప్లవం లేవ దీయాలనే ఉద్దేశంతోనో మాతృదేవి వీటిని చేయలేదు. మాతృత్వం భావన కార ణంగా మాత్రమే ఆమెకు కూడా తెలియకుండా అవి జరిగిపోయాయి.
జయరాంబాటిలో మాతృదేవికి ఇల్లు నిర్మిస్తున్నప్పుడు, పక్క గ్రామంలోని మహమ్మదీయులను కూడా కూలీలుగా నియమించారు. వారందరూ పట్టుపురు గులు పెంచుతూ బాగానే జీవిస్తున్నారు. కానీ ఆంగ్లేయుల పోటీవల్ల తమ వృత్తిని కోల్పోయి, చివరకు గత్యంతరంలేక బందిపోటు దొంగలుగా తయారయ్యారు. ఇలాంటి వారిని కూలీలుగా నియమించడం గ్రామ ప్రజలలో సంచలనం ఏర్పర చింది. కానీ మాతృదేవి దానిని లెక్కచేయలేదు. కాలక్రమంలో మాతృదేవి దివ్య ప్రేమ పట్ల ఆకర్షితులై వారు కూడా భక్తులుగా మారిపోయారు.
వారిలో ఒకడు ఒక రోజు కొన్ని అరటి పండ్లను తీసుకువచ్చి మాతృదేవి కిస్తూ, “అమ్మా! వీటిని నేను గురుదేవుల కోసం తీసుకొచ్చాను. ఆయనకు నైవేద్యం చేస్తారా?” అని అడిగాడు. ఆతడు ప్రేమతో తెచ్చిన అరటి పళ్లను మాతృ దేవి సంతోషంగా తీసుకున్నారు. అప్పుడు ప్రక్కనే వున్న భక్తురాలు ఒకామె, “అమ్మా! ఈ దొంగ తెచ్చింది గురుదేవులకు నైవేద్యం చేయడానికి తీసుకున్నారే?” అని అడిగింది. అందుకు మాతృదేవి ప్రశాంతంగా, “దొంగ ఎవడో, మంచివా డెవడో నాకు తెలుసు. తప్పు చేయడం మానవ స్వభావం. కానీ తప్పుచేసిన వారిని కూడా సరైన దారికి మళ్లించడం ఎంత మందికి సాధ్యం?” అని అడిగారు.
ఈ మహమ్మదీయులలో మనం మునుపు పేర్కొన్న అంజద్ ఒకడు. ఆతడు మాదక ద్రవ్యాలకు బానిస అయినాడు; అంతకన్నా ఘోరం వాడొక దొంగ; దొంగతనం చేసి చెరసాలకు వెళతాడు. కొన్ని నెలలలో విడుదలయి మళ్లీ వస్తాడు. మాతృదేవిని చూడడానికి వస్తాడు. వచ్చేటప్పుడు ఏవైనా పండ్లు తీసుకు వస్తాడు. మాతృదేవి కూడా వాటిని అనురాగంతో తీసుకుంటారు. మాదకద్రవ్యాల అలవాటుతో ఆతడి శరీరం వేడెక్కిపోయినందువల్ల, తాను ఉంచుకున్న నారాయణ తైలం లాంటివి ఇచ్చి తలకు రాసుకోమని మాతృదేవి ఆప్యాయంగా చెప్పేవారు. ఆతణ్ణి ఇంట్లోకి పిలిచి ప్రేమగా మాట్లాడేవారు. ఇంట్లోవారు, గ్రామస్థులు దీనిని ఎంతగా నిరసించినా అంజద్‌ను ఇంట్లోకి అనుమతించేవారు. అంజద్ మాతృదేవి వద్ద నుండి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ దొంగలిస్తాడు, చెరసాలకు వెళతాడు, లోకమాత విడుదలయి మళ్లీ మాతృదేవిని చూడడానికి వస్తాడు. ఇలా గడిచింది ఆతడి జీవితం. కానీ ఆమె మాతృత్వం వీటినన్నిటిని అతిక్రమించి ఆతణ్ణి తమ అక్కున చేర్చుకుంది. మహమ్మదీయులను ప్రేమతో తమ ఒడిలో చేర్చుకోవడంలో మాతృదేవి మాతృత్వ పరిమాణపు మరొక వైపు మనం చూస్తున్నాం.
జాతి దేశ భాషల నధిగమించిన మాతృత్వం
ఒకసారి దుర్గాపూజ సమయంలో మాతృదేవి ఒక శిష్యుని పిలిచి తమ సోదరుల పిల్లలకు నూతన వస్త్రాలు కొనుక్కురమ్మన్నారు. స్వాతంత్ర్య పోరాటం జరుగుతున్న సమయమిది. దేశభక్తి గల ఆ శిష్యుడు తక్కువ వెలతో స్వదేశీ గుడ్డలు కొనుక్కొని వచ్చాడు, కానీ మాతృదేవి ఇంట్లోని స్త్రీలకు అవి నచ్చలేదు. విదేశీ గుడ్డలే కావాలని పట్టుపట్టారు. వారు చెప్పింది విని ఆ శిష్యుడు కోపంతో, “మీరడిగేవన్నీ విదేశీ గుడ్డలు, వాటిని నేను ఎలా కొనుక్కొని రాగలను?” అన్నాడు. అది గమనించిన మాతృదేవి, “నాయనా! వారు కూడా (విదేశీయులు కూడా) నా సంతానమే కదా! అందరినీ నేను స్వీకరించాలి. ఎవరి నయినా నేను త్రోసిపుచ్చగలనా? వీరు కోరిన గుడ్డలే తీసుకురా” అన్నారు. అప్పుడు మాతృదేవి ఆతనిలో అలా చెప్పినా ఆ తర్వాత విదేశీ వస్తువులను కొన వలసి వచ్చినప్పుడు మరొకరిని పంపేవారు. ఇతరుల యిష్టానిష్టాలను కూడా గౌరవించేవారు మాతృదేవి! స్వాతంత్ర్య పోరాటం న్యాయసమ్మతమైనదనే మాతృదేవి అభిప్రాయం. కానీ అందుకోసం విదేశీయులను ద్వేషించాలి, వారు తయారుచేసే వస్తువులను బహిష్కరించాలి అనే సంకుచిత పరిధిలో ఆమె మాతృ ప్రేమ బందీ కాలేకపోయింది.
ఇలా విదేశీయులు కూడా తమ సంతానమే అని మాతృదేవి చెప్పడం ప్రస్తుతం మనకు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు. కానీ ఆమె అలా చెప్పింది, విదేశీయులతో మాట్లాడడం కూడా మహాపాపంగా భావించే రోజులని మనం గుర్తించాలి. మాతృదేవి కేవలం ఉద్వేగంవల్ల అలా పలుకలేదు. ప్రగాఢ భావన వలన, విశ్వాసం వలన వెలువడిన మాటలవి! సందర్భం దొరికినప్పుడల్లా మాతృదేవి ఇలాంటి భావనను వ్యక్తంచేసి నిర్లిప్తంగా ఉండలేరు. స్వామి వివేకా నంద పాశ్చాత్య దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత పలువురు విదేశీయులు శ్రీరామకృష్ణుల ఉపదేశాలను ఆలకించి వాటిని శ్రద్ధతో పాటిస్తున్నట్లు శిష్యు డొకడు చెప్పాడు. అది విన్న మాతృదేవి, “ఆ ప్రజలందరు కూడా నా సంతానమే కదా!” అని వ్యాఖ్యానించారు. కాలాంతరంలో సోదరి నివేదిత, మిసెస్ ఓల్బుల్, సోదరి క్రిస్టైన్, సోదరి దేవమాత ప్రభృత విదేశీ భక్తురాండ్రు వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి సహజ రీతిలో వారితో మెలిగారు; వారితోపాటు భోజనం చేశారు; ఒకే గదిలో పడుకుని నిద్రించారు. ఇలా జాతి, మత, భాష విభేదాలకు అతీతంగా తమ విదేశీ శిష్యులను, “నా సంతానం” అంటూ మాతృదేవి ఆమోదించడం రామకృష్ణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా భావించారు స్వామి వివేకానంద.
మానవత్వ విజయం
ప్రస్తుత మహిళలు మాతృత్వమనే ఆదర్శాన్నే తమ ఉన్నతికి మార్గంగా మలచుకోవాలని ప్రారంభం నుండే మనం చెబుతూ వచ్చాం. ఇక్కడ మాతృత్వం సమాజ కట్టుబాట్లను అధిగమించడం కళ్లకు కట్టినట్లుగా చూశాం. సంస్కర్తగా మాతృదేవి ఎప్పుడూ, “దీనిని నిర్మూ లించాలి, దానిని ధ్వంసం చేయాలి” అంటూ నినాదాలు చేయలేదు. కానీ మాతృత్వమనే సున్నిత ఆయుధం మూలంగానే మనిషి నిర్మించిన సరిహద్దు గోడలను కూల్చి, మానవులంతా ఒకే కులం అనే సత్యాన్ని చాటిచెప్పారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, వారి మాతృత్వ వెల్లువలో కట్టుబాట్లన్నీ తాముగా కొట్టుకు పోయాయి.
ఇక్కడ మనం కాస్త యోచించాలి. ఒక కుగ్రామంలో జన్మించి, విద్యా గంధంలేని ఒక మహిళ, ఎలాంటి పటాటోపమూ లేకుండా మాతృత్వ భావన మూలంగా ఈ లోకాన్నే ఆకట్టుకోగలిగారు. ఇలాంటి మాతృత్వాన్ని తమలో పెంపొందించుకుని, తమ బిడ్డలు మాత్రమే కాకుండా, తమ కుటుంబాన్ని ఒక స్త్రీ పెనవేసుకోగలిగితే ఆ కుటుంబంలో ఎలాంటి ఒక అద్భుత పరిణామం నెల కొంటుంది! ఇదే కదా అత్యున్నత సాధన! ఇదే కదా ప్రస్తుత ఆవశ్యకత! ఈ సందేశాన్ని పరపి వెళ్లిపోయినందువల్లనే మాతృదేవి కాలావశ్యకతను తీర్చడానికే అవతరించారని మనం పేర్కొన్నాం.
పక్షులు, జంతువులు సైతం నా సంతానమే
కానీ మాతృదేవి మాతృత్వ భావన మానవ జాతిని ఆకట్టుకోవడంతోటే ఆగిపోలేదు. అది ఇంకా విస్తృతించి ప్రాణులనన్నిటిని పెనవేసుకుంది. స్వామి అరూపానంద స్మృతులు మాతృదేవి మాతృత్వ పరిమాణం లోని ఈ అంశాన్ని మనకు తెలుపుతాయి. ఒక రోజు మాతృదేవి స్వామితో ఇలా మాట్లాడారు.
స్వామి: అమ్మా! మీరందరికీ తల్లా?
మాతృదేవి: అవును.
స్వామి: ఈ పక్షులకూ, మృగాలకూ కూడానా?
మాతృదేవి: అవును.
మరొకసారి బ్రహ్మచారి రాసబిహారితో, “మానవులకు మాత్రమే కాకుండా, మృగాలు, పక్షులు, పురుగులు, కీటకాలు మొదలైన సకల ప్రాణులకూ తల్లిని నేనే” అన్నారు.
తల్లి ఆవును వదలివెళ్లిన దూడ ఆకలితో ‘అంబా’ అని ఆక్రందించగానే మనస్సు ద్రవించి ఆ దూడ వద్దకు పరుగెత్తేవారు. చాలాసేపు దాని పక్కన కూర్చొని, అనురాగంతో నిమురుతూ కుడితి (బియ్యం ఇత్యాది ధాన్యం కడుగు నీరు) పట్టించేవారు.
మాతృదేవి ఇంట ఒక చిలుక ఉండేది. ఆప్యాయంగా దానిని చూసుకొనే వారు. ప్రతి రోజు దాని పంజరాన్ని శుభ్రం చేసి దానికి ఆహారం పెట్టి ‘గంగారాం’ అంటూ ప్రేమగా పిలుస్తూ, ‘గంగారాం మాట్లాడు’ అనేవారు. ఆ చిలుక కూడా వెంటనే, ‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే, హరే కృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే” అంటూ పలికేది. బ్రహ్మచారి ఒకతను నేర్పించగా ‘అమ్మా, అమ్మా’ అని కూడా పలికేది. అలి పిలిస్తే ఆ చిలుకకు ఆకలి అని అర్థం. దాని పిలుపు వినగానే మాతృదేవి, “ఇదిగో, ఇక్కడే ఉన్నా నాయనా! ఇక్కడే ఉన్నా” అంటూ చప్పున వెళ్లి దానికి ఆహారం ఇచ్చేవారు.
మానవత్వ హద్దులు
భక్తులనూ, శిష్యులనూ అట్లే నిరాశ్రయులనూ దుశ్చరితులనూ, పతితు లనూ, తన ఒడిలోకి తీసుకున్నప్పుడు ఆమె మాతృత్వం మంచివాడు – చెడ్డవాడు అనే తారతమ్యాన్ని అతిక్రమించేది. మహ్మదీయులను కూడా స్వీకరించినప్పుడు జాతి మత సరిహద్దులనూ అధిగమించింది. ‘విదేశీయులందరూ కూడా నా సంతానమే’ అన్నప్పుడు దేశ, భాష, జాతుల సరిహద్దులను అధిగమించి మానవ జాతినంతా తన అక్కున చేర్చు కుంది. ఇంకా ముందుకు వెళ్లి పక్షులనూ, మృగాలనూ కూడా స్వీకరించి సమస్త ప్రాణులను తనవొడిలోకి చేర్చుకుంది. కానీ అంతటితో ఆగలేదు. ఇంకా విస్తృ తించి దాని సరిహద్దును స్పృశించింది. ‘మాతృత్వం చిట్టచివరి తత్త్వ’ మన్నారు గురుదేవులు. మాతృదేవి మాతృత్వం కూడా ఆ చిట్టచివరి తత్త్వమయిన భగ వంతుని తమ మాతృత్వ హద్దులో ఇముడ్చుకుంది. శిష్యుడొకడు మాతృదేవితో, “అమ్మా! గురుదేవులను మీరు ఎలా చూస్తారు?” అని అడిగాడు. మాతృదేవి కాసేపు మౌనం వహించి తర్వాత ప్రశాంతంగా ఇలా అన్నారు:
‘నేను ఆయనను నా బిడ్డగా చూస్తాను.”
బహుశా రెండవ సమావేశం నుండే మాతృదేవికి గురుమా, ఆరాధ్య దైవమూ, ఆమె సర్వస్వంగా ఉన్న వారు గురుదేవులు. ప్రస్తుతం భౌతికంగా లేక పోయినా, మాతృదేవికి శాశ్వతంగా ఉన్న వారు గురుదేవులు, “ఆయనే మహే శ్వరుడు, మహేశ్వరి” అంటూ భక్తులతో మాతృదేవి చెప్పివున్నారు. ఆ గురు దేవులనే ఆమె తమ బిడ్డగా చూస్తున్నారు.
మరొకసారి సన్న్యాస శిష్యుడు ఒకరు మాతృదేవిని ఇలా అడిగాడు:
శిష్యుడు: అమ్మా! మమ్మల్నందరినీ ఏ విధంగా చూస్తున్నారు?
మాతృదేవి: నారాయణునిగా!
శిష్యుడు: నారాయణునిగా చూసినప్పుడు మమ్మల్ని మీ బిడ్డలుగా చూడలేరు.
మాతృదేవి: ఎందుకు చూడలేను? నారాయణుని గాను, బిడ్డలుగాను నేను మిమ్మల్ని చూస్తున్నాను.
మహేశ్వరీ మహేశ్వరులుగా ఉన్న గురుదేవులను తన బిడ్డగానూ; నారా యణునీ, బిడ్డలనూ ఒక్కటిగా చూశారంటే, ఇక మాతృదేవి మాతృత్వానికి హద్దు లను మీరు ఊహించుకోండి. ఇలాంటి సరిహద్దును తాకదగిన మాతృత్వం దిశగా పురోగమించడం ఆపుకొని స్త్రీత్వం మరొక కార్యం ఏదైన సాధించవలసివుందా? విభిన్న ఉన్నత సాధనలన్నీ దీన్లో ఇమిడివున్నవే కదా!
ఎవరు అర్థం చేసుకున్నారు?
గడచిన కొన్ని అధ్యాయాలలో మాతృదేవి పలువిభిన్న పరిమాణాలను, ఈ అధ్యాయంలో మాతృత్వమనే ఆమె పరిపూర్ణ పరిమాణాన్ని ఒకింత చూశాం. దాని భావం మనం మాతృదేవిని అర్థం చేసుకున్నామని కాదు. సముద్రంలో తేలుతున్న మంచుపర్వతాన్ని చూసి ఆనందిస్తాం. దానిపై సూర్యకిరణాలు ప్రసరించి ప్రతిఫలించి నప్పుడు అది చూపించే వివిధ వర్ణజాలంతో దృష్టిని, అభిప్రాయాన్ని కోల్పోయి తన్మయులైపోతాం. కానీ నీటిమట్టానికి పైన కనబడేది నిజమైన మంచుపర్వతం లోని స్వల్ప భాగమే. దాని పూర్తి పరిమాణాన్ని చూడాలంటే సముద్రంలో దూకి బాగా లోతుకు పోవాలి, తీరంలో నిలబడి ఉంటే చాలదు. ఈ అధ్యాయాల్లో మనం చూసింది కూడా ఇలా మాతృదేవి అనే మహాశక్తిలోని కించిత్తు భాగమే. అందులోనూ మన ప్రయత్నం, మొదటి అధ్యాయంలో చూసినట్లు ఆమె పరి లోకమాత మాణాలను కొలవడానికయిన ప్రయత్నం కానేకాదు. ‘అది చూపించే వెలుగు కిర ణాలలో చలి కాచుకునే’ ప్రయత్నం మాత్రమే. ఆమె పాదపద్మాలను ఆశ్రయించి నప్పుడు మాత్రమే, ఆమె ఎవరన్నది మనం గ్రహింపగలుగుతాం. అందువల్ల ప్రేమానంద స్వామి వెలిబుచ్చిన ఒక అద్భుతమయిన అభిప్రాయంతో ఈ అధ్యాయం పూర్తిచేసి మాతృదేవి చరిత్రను కొనసాగిద్దాం.
‘నిజానికి ఈ లోకాన్ని పరిపాలించే మహారాజులా చక్రవర్తులా తలవ్రాతల నంతా లీలావినోదంగా చేసే పరాశక్తే మన మాతృదేవి. కానీ ఆమె కుగ్రామంలో పేడతో ఇంటి గచ్చును అలకడం, వంట పాత్రలను తోమడం, ధాన్యం దంపడం, భక్తులు తిన్న ఎంగిలాకులను ఎత్తడం లాంటి పనులు చేసే ఒక సాధారణ స్త్రీగా తమను మరుగుపరచుకొన్నారు. ఈ పనులను ఆమె స్వీకరించడానికి కారణం గృహస్థులు తమ జీవితాలను ఎలా మలచుకోవాలో బోధించడానికి మాత్రమే. ఆమె ఎల్లలెరుగని ఓర్పు, కరుణ, ‘నేను’ అని ఎరుగని సరళత సంతరించు కొన్నారు.
‘ఆమెను ఎవరు అర్థం చేసుకొన్నారు? దివ్యత్వ బాహ్యచిహ్నాలేవీ ఆమెలో కానరావు. గురుదేవుల విషయంలో ఆయన నుండి అభివ్యక్తమయ్యే అపారమైన జ్ఞానం, ఆయన దైవత్వాన్ని చాటి చెప్పింది. కానీ మాతృదేవి వద్దో? దాని ప్రకాశం కూడా బయట కనబడకుండా అంతర్గతంగా ఉండిపోయింది. ఆహా ఎంత మహత్వమయిన శక్తి! జీర్ణించుకోలేని విషాన్నంతా మేం మాతృదేవి వద్దకు పంపు తున్నాం. ఇక మాతృదేవి, వారి నందరిని తమ ఒడిలో చేరదీసుకొంటున్నారు. సరిహద్దు రహితమైన మహాశక్తి! పరిధి ఎరుగని కరుణ! ఆమె అందరినీ ఆశ్రయ మిస్తున్నారు: వారందరి పాపాలనూ జీర్ణించుకుంటున్నారు. సుఖం – దుఃఖం, జయం – అపజయం; కాటకం, జబ్బు, యుద్ధం – విప్లవం – అంటూ సర్వత్రా ఆమె అపార కరుణను యోచించి చూడు! ఓ మాతృదేవీ – నీకు పాదాభివంద నాలు!