మాతృదేవి స్వరూపం
“సుకుమారమైన యువప్రాయంలోని ఒక కన్నెలాంటి స్వరూపం గలవారు మాతృదేవి. ఆమె పలుకులు ప్రేమను, కరుణను చిందించేవి. వర్ణనాతీతమైన ఒక దివ్య తేజస్సు ఆమె చూపు నుండి ప్రసరించి అందరినీ స్పృశిస్తూంటుంది. ఆమెను దర్శించిన ప్రతివ్యక్తీ, ‘వీరేనా తల్లి’ అని అనిపించేలా ఉంది స్వరూపం” అంటూ మాతృదేవి నలభైయవ ఏట ఆమెను దర్శించిన సన్న్యాస శిష్యుడొకడు చెప్పాడు. యువప్రాయంలో తాము చాలా అందంగా ఉండినట్లు మాతృదేవి కూడా అన్నారు. స్వామి ప్రేమానంద తల్లి మాతృదేవి అందం పట్ల ముగ్ధురాలై, “అమ్మా! ఇలాంటి కళ్లను ఆకట్టుకునే అందాన్ని, మనస్సును ఆకర్షించే తియ్యదనాన్ని ఎక్కడ నుంచి సంపాయించారు?” అని అడిగింది. చూసేవారిని నమస్కరింపజేసే దివ్యసౌందర్యం ఆమెది. ఆ కాలంలో మాతృదేవి ధ్యానంలో కూర్చొనివున్నప్పుడు ఆమె నుండి ఒక దివ్య తేజస్సు ప్రసరించేదని సురబాల చెప్పడం కద్దు.
కానీ రాధూ మాతృదేవి జీవితంలో ప్రవేశించిన తర్వాత ఇవన్నీ పూర్తిగా మారిపోయాయి. మాయ చీకటి శక్తి కదా! అందువల్లనో ఏమో, ఆమె దివ్యమేని రంగు కూడా ఎర్ర రంగు నుండి పాలిపోయి కాలాంతరంలో నల్లబడింది. ఇంకా నానారుగ్మతల తాకిడి వలనా, ఎడతెగని కఠిన శ్రమవలనా మాతృదేవి ఆధ్యాత్మిక సౌందర్యపు బాహ్యప్రకాశమయిన దేహసౌందర్యం పూర్తిగా కనుమరుగైపోయింది. “మనం వెదుక్కుంటూ వచ్చిన మాతృదేవి వీరే” అంటూ ప్రతి ఒక్కరినీ స్పందింపచేసిన దివ్య సౌందర్యం కాలాంతరంలో ఆమెలో కొరవడిందనే చెప్పాలి. గ్రామీణ స్త్రీలతోపాటు ఆమె నిలబడివున్నప్పుడు ఆమెకూ ఇతరులకూ మధ్య అంతగా తేడా కనబడనంతగా ఆమె స్వరూపం మారిపోయింది. కానీ స్వరూపాన్ని మించిన ఏదో ఒకటి మాతృదేవిని ఇతరుల నుండి విలక్షణంగా చూపేది.
మాతృదేవిని సామాన్య ప్రజల నుండి భిన్నంగా చూపించింది వారి బాహ్య సౌందర్యమో, స్వరూపమో కాదు; అత్యంత సూక్ష్మమయిన ఆత్మసౌందర్యమూ, ప్రశాంతత నిండిన గాంభీర్యమే ఆమెను ఇతరుల నుండి ప్రత్యేకంగా చూపింది. ఈ ప్రత్యేకతను కూడా ఆమెతో సన్నిహితంగా మెలగినవారు మాత్రమే గ్రహించ గలిగారు. పైపైకి కనబడే స్వరూపమూ, సరళమైన ఆచారవ్యవహారాలూ చూసిన కొత్తవారు, ఆమెను సామాన్య స్త్రీలకంటే భిన్నంగా చూడలేకపోయారు.
ఒకసారి మాతృదేవి కాశీలో ఉన్నప్పుడు మార్వాడీ స్త్రీ ఒకామె ఆమె దర్శనార్థం వచ్చింది. అప్పుడు మాతృదేవికి ప్రక్కన గోలాప్ మా కూర్చొనివుంది. గోలాప్ మా బాగా పొడుగ్గా, గాంభీర్యంగా కనబడతారు. ఆ స్త్రీ ఆమెనే మాతృ దేవిగా భావించి ఆమెకు ప్రణమిల్లడానికి వెళ్లింది. గోలాప్ మా ఆమెను వారిస్తూ, మాతృదేవిని చూపుతూ, “వారే మాతృదేవి. వారికి ప్రణమిల్లు” అని చెప్పింది. మాతృదేవి ఆ రోజు ఎందుకో కాస్త వేడుక చూడాలని అనుకున్నారేమో! అందు వల్ల ఆ స్త్రీతో తమాషాగా ఆమె వెదుక్కుంటూ వచ్చిన వ్యక్తి గోలాప్మాయే అని చెబుతూ, ఆమెకు ప్రణమిల్లమన్నారు. ఆ స్త్రీ గోలాప్మాకు ప్రణమిల్లడానికి వచ్చింది. గోలాప్ మా హడలిపోయి, మాతృదేవికి ప్రణమిల్లమంది. మాతృదేవి మళ్లీ గోలాప్మా వైపే చేయిచూపారు. ఇలా కొంతసేపు ఒకరినొకరు చూపించు కున్నారు. చివరకు గోలాప్ మా ఆతురతతో ఆ స్త్రీ వైపు తిరిగి, “నీకేమన్నా బుద్ధుందా? సామాన్య వ్యక్తి ముఖానికీ, మహనీయురాలైన వ్యక్తి ముఖానికీ వ్యత్యాసం కనిపించడం లేదా?” అంటూ అరిచింది. గోలాప్ మా మాటలు విన్న తర్వాత ఆ స్త్రీ మాతృదేవికి నమస్కరించింది. మాతృదేవి కూడా ఎంతో ఆప్యా యంగా ఆమెను చేరదీశారు, ఆశీర్వదించారు.
పువ్వులాంటి మృదుత్వం, దానితోపాటు పర్వత శిఖరం లాంటి గాంభీర్యం, సాధారణ గ్రామీణ స్త్రీ లాంటి సరళత, దాని వెనుక ఎల్లలులేని సముద్ర వైశాల్యం, వీటి నన్నిటిని మంచిన కరుణను ప్రసరించే చూపులు మేళవించినది మాతృదేవి స్వరూపం. అందులో ఎన్నెన్ని పరిమాణాలో కదా! అవి మనకు వదలి వెళ్లిన గుణ పాఠాలు కూడా ఎన్నెన్నో కదా! వారిని ఒక గురుదేవిగా, కుటుంబ పెద్దగా ఇంతకు మునుపే చూశాం. ఇవి రెండూ మాతృదేవి అనే మహాసముద్రం లోని రెండు అలలు మాత్రమే. అందులో లేచే అలలను ఎవరు లెక్కించగలరు? అలాంటి అసంఖ్యాకాలైన అలలు ఎల్లప్పుడు చెలరేగుతూవున్న మహాసముద్ర మయిన మాతృదేవిలోని కొన్ని పరిమాణాలను ఇప్పుడు చూద్దాం. మాతృదేవిలో దివ్యత్వం, మానవత్వం అనే రెండు పరిమాణాలు ఒకటితో ఒకటి ముడివడి ఉన్నాయి. వీటిలో ఒకదాన్ని వదలి మరొకదాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నిస్తే పరిపూర్ణజ్ఞానం పొందలేం. కానీ మనం గ్రహించడానికి వీలుగా రెంటినీ విభ జించవలసివుంది.
దివ్యత్వం
జన్మతః మాతృదేవిలో దివ్యత్వం నెలకొని ఉండడం మనం చూస్తున్నాం. కానీ ఆమె తానుగా దీనిని చాలా అరుదుగా వ్యక్తం చేసివున్నారు. కొన్ని సమ యాల్లో తన్ను లక్ష్మీదేవిగా చెప్పుకున్నారు. తాము లోకా నికి తల్లి అనీ, తాము ఎలాంటి వారికైనా ముక్తిని ప్రసా దించగలననీ అప్పుడప్పుడు నొక్కివక్కాణించి ఉన్నారు. అలాంటి ఒకటి రెండు సంఘటనలు చూద్దాం.
నేను కాళిని
గురుదేవులు నిష్క్రమించిన కొన్ని రోజుల తర్వాత గురుదేవుల అన్నగారి కుమారుడైన శివరాంతోపాటు మాతృదేవి కామార్పుకూర్ నుండి జయరాంబాటికి వెళుతున్నారు. మాతృదేవి ముందు నడుస్తూవుంటే శివరాం సామానులతో మాతృదేవి వెనుక నడుస్తూ వస్తున్నాడు. జయరాంబాటి చేరుకోవడానికి ఇంకా కొంతదూరం వుంది. అప్పుడు హఠాత్తుగా శివరాం ఆగిపోయాడు. అది గమనించిన మాతృదేవి తమతోపాటు నడవమన్నారు.
శివరాం: పిన్నీ! నాకు ఒక నిజం తెలియాలి! అది నువ్వు చెప్పినప్పుడే నేను నీ వెంట వస్తాను.
మాతృదేవి: ఏమిటది?
శివరాం: నిజంగా నువ్వెవరు?
మాతృదేవి: నేను ఇంకెవర్ని? నీ పిన్నిని.
శివరాం: అలా అయితే నువ్వు వెళ్లవచ్చు. బహుశా జయరాంబాటిని సమీ పించాం. ఇక నేను తోడు రావలసింది లేదు.
మాతృదేవి: ఇదేం మూర్ఖత్వం! నేను ఎవరని నువ్వు అనుకొంటున్నావు? నేను ఒక సామాన్య వ్యక్తిని, నీ పిన్నిని.
శివరాం: చాలా మంచిది. నువ్వు వెళ్లవచ్చని అప్పుడే చెప్పేశాను కదా!
ఇలా అంటూ అతడు అక్కడే నిలబడిపోయాడు. ఆతడు పట్టుదలగా ఉండడం చూసిన మాతృదేవి, “కొందరు నన్ను కాళి అంటారు” అన్నారు.
శివరాం: నిజంగానే నువ్వు కాళివేనా?
మాతృదేవి: అవును.
నన్ను తలచుకో
కామార్పుకూర్లో ఒకసారి మాతృదేవి దర్శనార్థం వైకుంఠుడనే వ్యక్తి వచ్చాడు. ఆతడు సెలవు తీసుకుని వెళుతున్నప్పుడు, మాతృదేవి తమను మరచి పోయి, “వైకుంఠా! నీకేమైనా కష్టం కలిగితే నన్ను తల చుకో” అంటూ మరుక్షణమే తడబడుతూ “గురుదేవులను తలచుకో” అన్నారు. ప్రక్కనేవున్న లక్ష్మీదేవి వెంటనే, “మాతృదేవి నోటి నుండి ఏ మాటలు మొదట వచ్చాయో, అవే నిజం. అందువల్ల ఆమెనే సదా తలచుకోండి” అంది. మాతృదేవి లక్ష్మీదేవి మాటలను ఖండించలేదు.
నా అంశలు
ఒకసారి స్వామి కేశవానంద మాతృదేవితో, “అమ్మా! మీ దర్శనం చేసు కున్న తర్వాత, ఇక ఎవరూ షష్టి, శీతలా లాంటి దేవతలను పూజించరు” అన్నాడు. అందుకు మాతృదేవి, “వారిని ఎందుకు పూజించకూడదు? వారందరూ నా అంశలే కదా!” అన్నారు.
శివ – శక్తి
ఒరిస్సాలోని కోట్టాలో బలరాం ఇంట్లో మాతృదేవి బసచేసి ఉన్నారు. మధ్యాహ్న సమయం. భోజనం తర్వాత అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాస్త ఏకాంతమయిన చోట మాతృదేవి కాళ్లు చాపుకుని కూర్చొనివున్నారు. కళ్లు బాగా తెరుచుకొనే ఉన్నారు. కానీ అవి బాహ్యంగా దేనినీ చూస్తున్నట్లుగా లేవు; అంతర్లోకంలో మగ్నమైవున్నాయి. అప్పుడు లోపలికి వచ్చిన ఒక శిష్యుడు మాతృదేవి స్థితిని చూసి ప్రశాంతంగా అక్కడే కూర్చున్నాడు. దాదాపు పదిహేను నిమిషాల తర్వాత మాతృదేవికి కాస్త బాహ్యస్మృతి కలిగింది. అలాంటి అర్ధబాహ్య స్థితిలోనే, శిష్యునితో, “నువ్వెప్పు డొచ్చావు?” అని అడిగారు. తర్వాత, “లోపలే కట్టుబడివుండడం నాకు ఇష్టం లేదు. అందువల్ల ఇక్కడ కూర్చొనివున్నాను. ఇప్పుడు మధ్యాహ్నం. అందరూ నిద్ర పోతున్నారు” అన్నారు మాతృదేవి. తర్వాత కొంతసేపు ప్రశాంతంగావుండి, అంత ర్ముఖమయిన ఆ స్థితిలోనే ఇలా అన్నారు: “ఓ భూమికి ఈ ఎడతెగని ప్రయా ణాలు! దీని నుండి తప్పించుకోవడం సాధ్యం కాదా? శివుడు ఎక్కడున్నా అక్కడ శక్తి కూడా ఉంటుంది. వారిద్దరూ ఎప్పుడూ కలిసేవుంటారు. ఇప్పుడు మళ్లీ అదే శివుడు, మళ్లీ అదే శక్తి, తప్పించుకోవడానికి లేదు. అయినా జనం దీనిని అర్థం చేసుకోలేరు.”
బిల్వ అర్చన
మాతృదేవి దక్షిణేశ్వరంలో ఉన్నారు. ఒకసారి యోగిన్ మాతో, “యోగిన్, ఈ రోజు నువ్వు పూజకు వాడిపోయిన బిల్వపత్రాలను ఉపయోగించావా?” అని అడిగారు. అందుకు ఆమె, “అవును” అని అన్నప్పుడు, “ఉదయం నేను ధ్యానంలో కూర్చొనివున్నప్పుడు నువ్వు వాడిపోయిన బిల్వపత్రాలను నా……” అంటూ చెప్పడం మొదలుపెట్టినవారు, “నా మీద ఉంచడం చూశాను” అంటూ పూర్తిగా చెప్పకుండా ఆపేశారు.
నేను పరాశక్తిని
ఒకసారి ఒక సాధువు మాతృదేవికి సాష్టాంగ ప్రణామం చేసి ఆమె పాద పద్మాలను తన తలపై ఉంచుకున్నాడు. అది చూసి మాతృదేవి, “నాయనా! శిరస్సులో వేయిరేకుల తామర పువ్వులో శివుని రూపంలో గురుదేవులు కొలువై ఉంటారు. అక్కడ పాదం సోకడం సముచితం కాదు” అన్నారు. వెంటనే ఆ సాధువు, “అమ్మా! గురుదేవులు శివు డయితే మీరెవరు?” అని అడిగినందుకు, వెంటనే మాతృదేవి “నేను మరెవరిగా వుండగలను? నేను పరాశక్తినే” అన్నారు.
తమ ఛాయాచిత్రాన్ని పూజించడం
కోల్పారా ఆశ్రమంలో మాతృదేవి ప్రప్రథమంగా పూజను ప్రారంభించి నప్పుడు గురుదేవుల ఛాయాచిత్రంతో పాటు తమ ఛాయాచిత్రాన్ని ఉంచి పూజించారు. ఆమె తమ ఛాయాచిత్రాన్ని ఉంచి, పూజించడం ఇక్కడ మాత్రమే జరిగిందని అని చెప్పడం గమనార్హం.
అందరూ అర్థం చేసుకోలేరు
కానీ మాతృదేవి దివ్యత్వాన్ని అందరూ అర్థం చేసుకోలేకపోయారు. మాతృదేవితోనే ఒకరు, “అమ్మా! మేము మిమ్మల్ని దేవిగా చూడలేకపోతున్నామే!” అని అన్నారు. అందుకు మాతృదేవి, “నాయనా! అందరూ దానిని గ్రహించగలరా? కొలను మెట్లమీద ఒక రత్నం పడివుంది. స్నానానికి వెళ్లే ప్రతి వ్యక్తి పాదమూ దానిమీద పడింది. అందరూ దానిని మామూలు రాయిగా భావించి పాదాలను తోము కోవడానికే వాడుకున్నారు. చివరకు ఒక రత్నాల వ్యాపారి వచ్చినప్పుడు ఆ రాయిని చూడగానే రత్నం అని తెలుసుకుంటాడు” అన్నారు. దాని నిజాన్ని తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ కూడా అది ఉపయోగపడింది. ఉపయోగ పడిన తీరులోనే భేదమంతా! అదేలా ఎవరికి దివ్యనేత్రాలుంటాయో వారు మాత్రమే దివ్యత్వాన్ని చూడగలరు. కానీ మాతృదేవి తమ దివ్యత్వాన్ని గురించి తెలుసుకున్న వారికీ, తెలుసుకోనివారికీ సొంతంగానే ఉన్నారు. కానీ ఇరుతరఫుల వారు పొందిన ఫలితంలోనే భేదముంది.
భక్తుల అనుభవాలు
ఇంతదాకా మనం చూసినవి మాతృదేవి తమ దివ్యత్వాన్ని తామే వ్యక్తం చేసిన కొన్ని క్షణాలు. కానీ ఈ విషయంలో భక్తులా శిష్యులా అనుభవాలు కోకొల్లలు. అవి వ్యక్తిగతమైనవనడానికి ఉదాహరణగా ఒక ఘటన చూద్దాం:
బాంకురా అనే ఊళ్లోని రామకృష్ణ మఠానికి స్వామి హరిప్రేమానంద మాతృదేవితోపాటు వెళ్లారు. అక్కడ ఒక రోజు సాయంత్రం ఆయనకు కలిగిన అద్భుత అనుభవాన్ని ఆయన ముఖతా విందాం.
“ఆ సాయం సమయం మరచిపోలేనిది. మాతృదేవి ఒక బల్లమీద కూర్చొని ఉన్నారు. నెల, తేది అవన్నీ నాకు జ్ఞాపకం లేదు. నేను మాతృదేవి పాదపద్మాల మ్రోల కూర్చొని, పాదపద్మాలను ఒత్తుతున్నాను. ఆ పాదాలు బాగా ముడతలతో శుష్కించిపోయాయి. ఆ పాదాలను చూడగానే నా మనస్సులో, “మాతృదేవి నిజంగా జగన్మాతేనా? దేవి పాదాలు ఇంత కళావిహీనంగా, నరాలు కనబడేటట్లు శుష్కించి ఉంటాయా?’ అనే సందేహం కలిగింది. కానీ బయటకు వ్యక్తం చేయ లేదు. పాదపద్మాలను ఒత్తుతూనేవున్నారు.
“అప్పుడు మెల్లమెల్లగా దృశ్యంలో మార్పు వచ్చింది. ఆ పాదాలు వృద్ధు రాలైన స్త్రీ శుష్కించిన పాదాలలా కాకుండా ఒక యువతి పాదాలుగా గోచరిం చాయి. అందమయిన పాదాలు, వాటిపై పారాణి, అర్ధచంద్రుని లాంటి గోళ్లు – యివన్నీ ప్రక్కనే ఉన్న దీపం వెలుతురులో స్పష్టంగా కనబడ్డాయి. ఆ పాదపద్మా లలో బంగారు గొలుసులు, వజ్ర వైడూర్యాలు పొదిగిన నూపురము ప్రకాశిం చాయి. ఈ పాదాలెవరివి? నేను ఎవరి పాదాలను పట్టుకొనివున్నానని దిగ్భ్రమ చెందాను.
“కళ్లను ఒకసారి నులుముకొని చూశాను. సందేహమేలేదు. నోటమాటలు రావడం లేదు. పాదాల మీద కేంద్రీకృతమైన దృష్టిని పైకి మళ్లించాను. బంగారు కాంతులతో మెరిసిపోతూ జగద్ధాత్రీదేవి ఆసీనురాలైవుంది – మూడు నేత్రాలు, ఆయుధాలు ధరించిన నాలుగు చేతులు, అనేక ఆభరణాలు. వజ్రవైడూర్యాలు పొదిగిన కిరీటం ఆమె నుండి ఉత్పన్నమయిన ప్రకాశం నాలుగు దిశలనూ నింపివేస్తూవుంది. ఇంతకు మంచి చూడలేని స్థితికి వచ్చిన నేను భావోద్వేగంతో, ‘అమ్మా, అమ్మా’ అంటూనే బాహ్యస్మృతిని కోల్పోయాను.
“ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నానో నాకు తెలియదు. మళ్లీ బాహ్యస్మృతి కలిగే టప్పటికి మాతృదేవి నా వీపు నిమురుతూ, ‘హరీ, ఓ హరీ! నీకేమయింది? లే, లే’ అంటున్నారు. నేను లేచాను. మాతృదేవి – వయస్సు మళ్లిన, శుష్కించిన అదే మాతృదేవి – అక్కడ నిశ్చలంగా కూర్చొనివున్నారు.”
మానవాతీత సంఘటనలు
దివ్య సంఘటనలలా మానవాతీత సంఘటనలు కూడా మాతృదేవి జీవి తంలో కోకొల్లలు. ఉదాహరణకు ఒకటి రెండు సంఘటనలు మాత్రం పరికిద్దాం.
కాళీపాదఘోష్ విద్యావంతుడు. మంచి జీతం వచ్చే ఉద్యోగం చేస్తున్నాడు. అయినా తాగుడు మొదలైన దుర్వ్యసనాల వలన ఇంటిని నరకం చేశాడు. ఆతని భార్య తన భర్తకు ఏదైన మంచి దారి చూపమని కన్నీళ్లతో గురుదేవులను ప్రార్థించింది. గురుదేవులు ఆమెను మాతృదేవి వద్దకు పంపిం చారు. మాతృదేవి అప్పుడు పూజలో ఉన్నారు. మొదట తటపటాయించినా, ఆ తర్వాత ఆమె కన్నీళ్లు మాతృదేవి మనస్సును కరిగించింది. అందువల్ల తాము పూజించిన ఒక బిల్వదళం తీసి ఆమె కందిస్తూ, “భయపడకమ్మా! ఈ బిల్వ దళాన్ని నీతో తీసుకెళ్లు, ఇది నీ శోకాన్ని బాపుతుంది” అన్నారు. ఆమె దానిని భక్తితో తీసుకువెళ్లింది. త్వరలో ఆమె భర్త పరివర్తన పొంది గురుదేవుల భక్తులలో ఒకడయ్యాడు.
కొందరి వ్యక్తులలోని దుర్గుణాలను మాతృదేవి తమ మనోబలంతో తొల గించి ఉన్నారు. ఒక యువకుని వంచించి నాశనం చేయడానికి ప్రయత్నిస్తూన్న ఒక స్త్రీ మనస్సును మార్చారు. మరొక స్త్రీ తన ఇచ్ఛకు మారుగా తన భర్త ఆధ్యాత్మిక జీవితం చేపట్టాడని పగబట్టి ఆతణ్ణి నాశనం చేయాలనే భయంకర స్థితికి వచ్చేసింది. అలాంటి స్త్రీ జీవితాన్ని ఆధ్యాత్మికమయంగా రూపొందించి, భర్తపట్ల చెక్కుచెదరని ప్రేమ ఏర్పడేటట్లు చేశారు. తాగుడుకు అలవాటుపడిన ఒక డాక్టరుకు మంత్రదీక్ష ప్రసాదించి, ఆయనకు సన్మార్గం చూపారు.
‘భక్తుల భారాన్ని నేను మోస్తాను’ అంటూ గీతలో (9.22) భగవంతుడు చెప్పింది నిరూపించడానికో అన్నట్లు జరిగిన ఒక సంఘటనను ఇక్కడ వివరిస్తున్నాం. వానాకాలంలో ఒక రోజు. కొన్ని సరుకులు కొనుక్కురావడానికి కొంతదూరంలోని బజారుకు స్వామి మహాదేవానందను పంపారు మాతృదేవి. సరకులన్నీ కొనుక్కున్నాడు. ఒక కూలీని పెట్టుకోమని మాతృదేవి చెప్పినందువల్ల తామే ఆ బరువును మోసుకుని తిరుగుముఖం పట్టాడు. ఆయన మోయలేని బరువు. పైగా వానాకాలం. దారంతా బురదమయం, జారుతున్నది. అందువల్ల తడబడుతూ ఎలాగో నడుస్తున్నాడు. ఒక దశలో ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. అప్పుడు ఆశ్చర్యంగా హఠాత్తుగా తాను మోస్తున్న బరువు తగ్గిపోయింది. అసలు బరువే లేనట్లు ఆతను ఉల్లాసంగా, చేతులు ఆడించుకుంటూ నడిచే వ్యక్తిలా సులభంగా నడవగలిగాడు. ఈ అద్భుతం ఎలా జరిగింది అని ఆలోచిస్తూ వచ్చి ఇల్లు చేరాడు స్వామి. అక్కడ చూసిన దృశ్యం ఆతణ్ణి ఆశ్చర్యచకితుని చేసింది. మాతృదేవి ఏదో పెద్ద బరువును మోస్తున్నట్లు వసారాలో నడుస్తున్నారు. కళ్లు ఎర్రబారి, గాఢంగా నిట్టూరుస్తూ, “ఒక కూలీని పెట్టుకోమని నేను ఎందుకు చెప్పకుండాపోయాను?” అని అంటున్నారు. ఆ స్వామి వెళ్లి బరువును కిందికి దించగానే, “నువ్వు ఒక కూలీని పెట్టుకోవలసింది నాయనా! నేను చెప్పకపోతే ఏం? ఇంత బరువా మోసుకువచ్చేది!” అంటూ ఆప్యాయంగా కసురుకొన్నారు. తన బరువును మాతృదేవి మోశారని గ్రహించిన ఆ స్వామి ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
మరొక సంఘటన. ఇది కోల్పారా ఆశ్రమం సాధువు ఒకాయన జీవితంలో ఆతను సన్న్యాసం పుచ్చుకోవడానికి ముందుగా జరిగింది. ఒక రోజు హఠాత్తుగా మాతృదేవి ఆయనను పిలిచి వెంటనే బేలూరు మఠానికి వెళ్లి సన్న్యాస దీక్ష తీసుకోమన్నారు. ఏమైనా విశేషమైన రోజులలోనే సామాన్యంగా సన్న్యాస దీక్ష ఇవ్వడం పరిపాటి. అలాంటి రోజులేవీ సమీపంలో లేనందువల్ల ఆ శిష్యుడు కాస్త జంకాడు. అందుకు మాతృదేవి “విశేషమయిన రోజులు లేకపోయినా ఫరవాలేదు. నువ్వు వెంటనే వెళ్లు. రాఖాల్ను సంప్రదించు. ఆతను నీకు సన్న్యాస దీక్ష ప్రసా దిస్తాడు” అంటూ ఆతణ్ణి వెంటనే బేలూరు మఠానికి పంపించారు. స్వామి బ్రహ్మా నందకు కూడా ఆశ్చర్యం వేసింది. అయినా మాతృదేవి పంపించారు కాబట్టి ఆయన ఆ బ్రహ్మచారికి సన్న్యాస దీక్ష ప్రసాదించాడు. కాలం గడిచింది. ఒక రోజు అనుకోకుండా ఆయన జాతకం దొరికింది. ఒక వ్యక్తి ఆ జాతకాన్ని ఒక జ్యోతిష్కునికి ఇచ్చి చూడమన్నాడు. ఆ జ్యోతిష్కుడు ఆ జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించాడు. తర్వాత, “ఏమిటి! నాతో ఆట్లాడుకుంటున్నారా? చనిపోయిన ఒక వ్యక్తి జాతకం తెచ్చి చూపించి నా సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారా?” అని గద్దించాడు. జాతకం చూపించిన వ్యక్తికి మతిపోయింది. బ్రతికివున్న ఒక సాధువు జాతకమే అది అని ఎంతగా నచ్చజెప్పినా ఆ జ్యోతిష్కుడు నమ్మలేదు. ఆ జాతకునికి ఫలానా వయస్సులో గండం ఉందనీ, దాని నుండి తప్పించుకోవడానికి వీలులేదని వాదిస్తూ చివరకు ఆ జాతకం చూడనని చెప్పేశాడు. ఈ విషయం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆ జ్యోతిష్కుడు సూచించిన వయస్సులో జరిగిన సంఘ టనలను జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు ఒక విషయం స్పష్టమయింది – ఆ వయస్సు లోనే మాతృదేవి ఆతణ్ణి తక్షణమే బేలూరు మఠానికి పంపించి సన్న్యాస దీక్షను తీసుకునేలా చేశారు. ఆ సన్న్యాస దీక్ష మూలంగా ఆయనను మరణగండం నుండి రక్షించారు మాతృదేవి అని అందరికీ స్పష్టమయింది.
ఇలాంటి అనేక సంఘటనలను మాతృదేవి జీవితంలో మనం చూడవచ్చు. గురుదేవులు, మాతృదేవి, వారి పారంపర్యంలో వచ్చిన రామకృష్ణ ఉద్యమ ప్రస్తుత గురుపుత్రులూ తమ జీవితాలలో సంభవించే మానవాతీత ఘటనలకు ప్రాధాన్యం ఇచ్చింది లేదు. ఎందుకంటే వారందరూ ప్రజల శ్రేయస్సుకోసం వచ్చినవారు. ఇలాంటి సంఘటనల మూలంగా తమను సామాన్య ప్రజల నుండి దూరం చేసు కోవడానికి వారు ఇష్టపడలేదు. ఇవన్నీ సహజంగా వారి జీవితాల్లో చోటు చేసు కున్నాయి. వారందరూ మనుష్యులతో పాటు తోటి మనిషిగా గడిపిన జీవితమే మనకు ముఖ్యం. అదే మనలను ఉన్నత స్థితులకు తీసుకుపోగలుగుతుంది. కనుక మాతృదేవి మానవ పరిమాణాన్ని ఇప్పుడు చూద్దాం.