కైల్వారులో
మాతృదేవి 1886 వ సం ॥ ము బృందావన యాత్ర సాగించడమూ, 1888 లో గయ, బుద్ధ గయ మొదలైన తీర్థ స్థలాలను సందర్శించడమూ చూశాం. 1893 డిసెంబరులో బలరాంబోసు కుమార్తె చనిపోయింది. ఆ దుఃఖాన్ని బలరాంబోసు భార్య భరించలేకపోయింది. అందువల్ల స్థల మార్పుకోసం ఆమెను బీహారులోని కైల్వారు అనే చోటికి పంపా లని అనుకున్నాడు బలరాం. కానీ మాతృదేవి తనతోపాటు వస్తే మాత్రమే తాను కైల్వారుకు వెళతానని పట్టుపట్టిందామె, అందువల్ల మాతృదేవి కూడా ఆమెతో పాటు వెళ్లారు. వారితోపాటు గోలాప్ మా, శరత్, యోగిన్, శారదాప్రసన్న ప్రభృ తులూ వెళ్లారు. కైల్వారు ప్రకృతి సౌందర్యం మాతృదేవిని ముగ్ధులను చేసింది. జింకలతో కూడిన అడవి ప్రాంతమది. కాస్త అలికిడి వినిపించినా బాణంలా దూసుకెళ్లే జింకలు వారికి ఎంతో ఆహ్లాదం కలిగించాయి. తాటిచెట్ల నుండి రసం సేకరించడానికి చిన్న కుండలు కట్టి ఉంచుతారు. నక్కలు వచ్చి ఆ రసం తాగేసి వెళ్లిపోయేవి. వాటిని తరిమిగొట్టడానికి ఆ గ్రామస్థులు ఒక వినోదమైన పథకం పన్నేవారు. కుండలు మొదలైన మట్టిపాత్రలను తలపై తలక్రిందులుగా ఉంచుకుని సమీపంలోని గుంటలలో దాక్కుంటారు. నక్కలు వచ్చేటప్పుడు ఒక రకమైన శబ్దం చేస్తూ వాటిని తరిమేవారు. వీటిని చూసి పసిపిల్లలా మురిసిపోయారు మాతృదేవి. ఒకటి రెండు నెలలు అక్కడ గడిపిన తర్వాత అందరూ 1894 ప్రారంభంలో కల కత్తాకు తిరిగి వచ్చేశారు.
బాలగోపాలుని మారాం
1894 లో కాశీక్షేత్రానికీ, బృందావనానికీ మళ్లీ రెండవమారు తీర్థయాత్రకు బయలుదేరారు. ఈసారి వారితోపాటు శ్యామసుందరీ దేవి, మాతృదేవి సోదరులు, స్వామి యోగానంద, యోగిన్ మా, గోలాప్ మా తది తరులు బయలుదేరారు. మాతృదేవి బృందావనం నుండి తిరిగి వచ్చేటప్పుడు బాలగోపాలుని చిన్న విగ్రహాన్ని ఒకదానిని తీసుకొచ్చారు. దానిని జయరాంబాటి ఇంట్లో ఒక అలమారులో ఉంచారు. ఒక రోజు మాతృదేవి పరుపుమీద పడుకుని ఉన్నప్పుడు చిన్నారి కృష్ణుడు పాకుతూ వచ్చాడు. మాతృదేవి ప్రక్కన కూర్చొని, “అవును, నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు. కానీ ఆహా రమూ, పూజా లేకుండా ఉంచేశావు. నువ్వే నన్ను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకొంటారు?” అని అడిగి కనుమరుగయ్యాడు. వెంటనే మాతృదేవి లేచి, అల మారలో ఉంచిన బాలకృష్ణుని విగ్రహం తీసుకుని, చుబుకం స్పృశించి, గురు దేవుల పటం పక్కవుంచి కొన్ని పుష్పాలు అర్పించారు. ఆ తర్వాత గురుదేవులతో పాటు బాలకృష్ణునికి కూడా రోజూ ఆరాధన చేయసాగారు.
పూరీ జగన్నాథం
తర్వాత 1904 నవంబరులో మాతృదేవి మళ్లీ పూరీజగన్నాథం వెళ్లారు. శ్యామాసుందరి, సురబాల, రాధూ, మాతృదేవి సోదరుడైన కాళీ, ఆతని కుటుంబం వారు, స్వామి ప్రేమానంద, ఇంకా గురు దేవుల శిష్యులు పలువురు వారితోపాటు వెళ్లారు. పూరీలో కొన్ని రోజులు బసచేశారు. అప్పుడు మాతృదేవికి కాలులో ఒక కురుపు లేచింది. అది ఎంతో బాధాకరంగా పరిణమించింది. దానిని తాకడానికి కూడా ఆమె ఎవ రినీ అనుమతించడం లేదు. అది చూసిన స్వామి ప్రేమానంద మాతృదేవి శిష్యు డయిన ఒక వైద్యునితో ఆలోచించారు. ఆ ప్రకారమే ఎవరికీ, మాతృదేవికి కూడా తెలియకుండా ఆ కురుపుకు శస్త్ర చికిత్స చేయాలని తీర్మానించుకున్నారు. మరు సటి రోజు ఎప్పటిలా వైద్యుడయిన శిష్యుడు వచ్చాడు. ప్రణమిల్లడానికి మాతృదేవి పాదాలను సమీపించిన ఆతడు, ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకున్న కత్తిని తీసి జాగ్రత్తగా ఆ కురుపును కోశాడు. అంతే! మాతృదేవి భరించలేని నొప్పితో కేకపెట్టారు. ప్రక్కనే ఉన్నవారు నిశ్చేష్టులయ్యారు. ఆ పని చేసిన వైద్యుని మీదా, అందుకు తోడుగా ఉన్న ప్రేమానంద మీదా మాతృదేవికి పట్టరాని కోపం వచ్చింది. కానీ కురుపు చిట్లి చీము పూర్తిగా బయటికి వచ్చేసిన తర్వాత నొప్పి బాగా తగ్గిపోయింది. మాతృదేవి కూడా సంతోషంగా ఇద్దరికీ ధన్యవాదాలు చెప్పారు. నొప్పి తగ్గిపోయినందువల్ల జగన్నాథస్వామి ఆలయాన్ని, ఇతర ఆలయా లను చక్కగా దర్శించుకున్నారు; ఆలయానికి ఒడ్డున వున్న సముద్రంలో రెండు సార్లు స్నానం కూడా చేశారు. చక్కని శీతోష్ణతి గల స్థలంగా పేరుగాంచిన అక్కడ మాతృదేవి రెండు నెలలు గడిపి తిరిగి వచ్చారు.
విష్ణుపూర్
కామార్పుకూర్ నుండి ఇరవై ఎనిమిది మైళ్ల దూరంలోని విష్ణుపూర్‌కు కూడా ఒకసారి మాతృదేవి వెళ్లారు. విష్ణుపూర్ ఒకప్పుడు సస్యశ్యామలమయిన రాజధానిగా ఉండేది. దానిని పాలించిన భక్తిపరులైన వైష్ణవ రాజులు అక్కడ చక్కని దేవాలయాలను నిర్మించారు. వాటిలో అనేక ఆలయాలు పట్టించుకొనే వారు లేకుండా శిథిలాలయ్యాయి. గురుదేవులు ఈ ఊరును, ఈ దేవాలయాలను ఎంతో పవిత్రమయినవిగా భావించారు. “విష్ణుపూర్ మరుగుపడిన మరొక బృందావనం. నువ్వు ఒక్కసారి అడ్కడికి వెళ్లిరా” అంటూ మాతృదేవితో అన్నారు కాబట్టి ఆయన మాట ప్రకారం విష్ణుపూర్‌కు ఆమె వెళ్లివచ్చారు.
దక్షిణ భారతంలో
మాతృదేవి పవిత్ర పాదపద్మాలు మోపడానికి దక్షిణభారతం, ప్రత్యేకంగా తమిళనాడు ఎంతగానో నోచుకున్నాయి. తమిళనాడులోని ప్రఖ్యాత శివ క్షేత్రమయిన రామేశ్వరం దర్శించుకోవాలని మాతృదేవికి కోరిక ఉండేది. గురుదేవుల శిష్యుడూ, చెన్నై శ్రీరామకృష్ణ మఠ అధ్యక్షులూ అయిన స్వామి రామకృష్ణానంద మాతృదేవిని రమ్మని పలుమార్లు ఆహ్వానించారు. కానీ ఏ కారణం వల్లనో ఈ యాత్ర వాయిదాపడుతూ వచ్చింది. చివరకు 1910 సంవత్సరాంతంలో మాతృదేవి బయలుదేరారు. ఎప్పటిలా సురబాల, రాధూ, గోలాప్ మా, బ్రహ్మచారులు సుకుల్, కృష్ణలాల్, ఇంకా పలువురు భక్తులు మాతృదేవి పరివారంలో ఉన్నారు. ఒరిస్సాలో కోట్టార్ అనే చోట బలరాంబోసుకు ఇల్లు, పొలంపుట్రా ఉన్నాయి. అక్కడ మాతృదేవి రెండు నెలలు గడిపారు. పలువురు భక్తులకు మంత్రదీక్ష కూడా ప్రసాదించారు.
అక్కణ్ణుండి మద్రాసుకు బయలుదేరారు మాతృదేవి. ఈ దక్షిణ భారత యాత్ర మాతృదేవికి ఎనలేని ఆనందం కలుగజేసింది. చిల్కా సరస్సు తీరప్రాంతంలో ఉదయం రైలు వెళుతున్నప్పుడు మితమైన చలితోపాటు వీచిన చలిగాలులూ, గాలుల శ్రుతికి తాళం వేస్తున్నట్లుగా ఆ సరస్సు చిన్న అలలూ, అలలతో పాటు ఉత్సాహంతో ఈదుతున్న చేపలూ, ఆ చేపలను పట్టుకోవడానికి తమ పొడవాటి ముక్కులను నీటిలోకి చాపి నడుస్తూ వచ్చే కొంగలూ, ఎప్పుడైన ఉపరితలానికి వచ్చిన చేపలను పట్టుకోవాలనే తహతహతో పైన ఎగురుతున్న పక్షులూ, మాతృదేవి మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలిగించాయి. మెల్లమెల్లగా సూర్యుడు ఉదయించడంతో దృశ్యంలో మార్పు వచ్చింది. నీటి విస్తీర్ణం నుండి పైకెగసిన మంచు మండలంతోటి పొగ, అంతటినీ ఆవరించి ఆ దృశ్యాన్ని ఒక కలలోని దృశ్యంగా మార్చేసింది. ఇలా మారుతున్న దృశ్యాలను తిలకింపచేస్తూ పరుగులు తీస్తూంది రైలుబండి. మాతృదేవి మనోస్థితి వర్ణనాతీతం. ఒక క్షణం, ప్రకృతి సౌందర్యాన్ని చూసి పసిపాపలా చప్పట్లు కొడుతూ ఆనందిస్తున్నారు. మరుక్షణం, ప్రకృతి మహత్త్వం భగవంతుని ఆధిక్యాన్ని చాటిచెబుతున్నప్పుడు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు.
రైలు బండి బర్హాంపూర్ చేరుకుంది. స్వామి రామకృష్ణానంద ఏర్పాటు ప్రకారం అక్కడ భక్తుడొకడు మాతృదేవిని తన ఇంటికి తీసుకెళ్లాడు. పలువురు భక్తులు వచ్చి మాతృదేవికి ప్రణమిల్లారు. మర్నాడు అక్కణ్ణుండి బయలుదేరారు. రైలుబండి విశాఖపట్నం దాటుతున్నప్పుడు బారులుతీరిన చిన్నచిన్న గుట్టలను చూసిన మాతృదేవి, “చూడు చూడు! అద్భుత చిత్రంలా ఎంత అందంగావుందో!” ఆశ్చర్యపోతూ అన్నారు.
మద్రాసులో
మద్రాసులో రైలు నిలయంలో స్వామి రామకృష్ణానంద భక్తులతోపాటు వేచివున్నారు. జయజయ ధ్వానాలతో మాతృదేవికి స్వాగతం పలికారు. మాతృ దేవిని రైలు స్టేషను నుండి మఠానికి తీసుకురావడానికి ఒక కారు ఏర్పాటు చేశారు. రైలు బండి వచ్చేదాకా ఎండలో ఉండడం వల్ల కారులో వేడిగా ఉంది. అందువల్ల మాతృదేవి అందులో కూర్చోవడానికి ముందుగా స్వామి రామకృష్ణానంద తమ అంగ వస్త్రాన్ని నీటిలో తడిపి కూర్చొనే సీటును తుడిచి, దానిని చల్లబరచారు. మాతృదేవి బసచేయడానికి అనువైన చోటు కూడా ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేసి తగిన వసతులన్నీ చేశారు.
మైలాపూరు మఠానికి ఎదురుగా ఉన్న ‘సుందర్ నివాస్’ అనే ఒక ఇంట్లో* మాతృదేవి బస చేయడానికి ఏర్పాట్లు చేశారు. దాదాపు ఒక నెల రోజులు మాతృ దేవి మద్రాసులో ఉన్నారు. మఠానికి సమీపంలోని కపాలీశ్వర ఆలయాన్ని, తిరు వల్లిక్కేణి పార్థసారథి ఆలయాన్ని దర్శించారు. సాయం సమయాలలో సముద్ర తీరం, కోట, అప్పటికి నిర్మాణంలోవున్న చేపల ప్రదర్శనశాల మొదలైనవి చూశారు. మద్రాసులోనే మాతృదేవి మొదటి సారిగా రిక్షాలో ప్రయాణం చేశారు.
ఇక్కడ కూడా అసంఖ్యాక భక్తులు మాతృదేవిని దర్శించుకోవడానికి వచ్చారు. పలువురికి మంత్రదీక్ష ప్రసాదించారు. భాష సహాయం లేకుండానే మాతృదేవి భక్తులకు మంత్రదీక్ష ప్రసాదించిన తీరు ఒక అద్భుతం. భక్తులతో సాధారణంగా మాట్లాడుతున్నప్పుడు ఒక అనువాదకుని సాయం కోరిన మాతృ దేవి, మంత్రదీక్ష సమయంలో ఎవరి సహాయమూ లేకుండా తామే వారితో మాట్లాడారు. ఈ విషయం ముందే చూశాం. ఒక రోజు బడి పిల్లలు మాతృదేవి సమక్షంలో తమిళంలో పాటలు పాడి, వయోలిన్ వాయించారు. మాతృదేవి ఎంతో ఆనందించి వారి నందరిని ఆశీర్వదించారు.
మథురైలో
రామేశ్వర యాత్రలో రామకృష్ణానంద స్వామి, రాంలాల్ కూడా పాల్గొ న్నారు. మద్రాసు నుండి అందరు రైలు ద్వారా మధురై చేరుకొన్నారు. అక్కడ మీనాక్షీ ఆలయం దర్శించడంతోపాటు తిరుమలై నాయకర్ మహల్, మారియమ్మన్ తెప్పకొలను మొదలైన స్థలాలను చూశారు.
రామేశ్వరంలో
మధురైలో ఒక రోజు ఉన్న తర్వాత, మర్నాడు రామేశ్వరం చేరుకున్నారు. అక్కడ మాతృదేవి మూడు రోజులు బస చేశారు. రామనాథపురం మహారాజు, స్వామి వివేకానంద శిష్యుడూ, రామేశ్వర ఆలయ ధర్మకర్త కూడా. తన గురునాథుని గురువైన మాతృదేవి రాకను తెలుసుకున్న రాజా మాతృదేవిని ఆహ్వానించడానికీ, ఆలయ దర్శనానికీ చక్కని ఏర్పాట్లు చేశాడు. రాజా ఆజ్ఞానుసారం మాతృదేవీ ఆమెతోపాటు వచ్చిన వారం దరూ గర్భగృహంలోకి వెళ్లి చక్కగా దైవాన్ని దర్శించుకోగలిగారు. అక్కడ వెలసిన శివలింగానికి మాతృదేవి తమ స్వహస్తాలతో అభిషేకం చేసి ఆరాధించారు. రామకృష్ణానంద స్వామి ఏర్పాటు చేసి ఇచ్చిన నూట ఎనిమిది బంగారు బిల్వ దళాలతో పరమేశ్వరుని అర్చించారు.
సామాన్యంగా అంగం మీది కవచాన్ని తొలగించరు. మాతృదేవి గంగా జలంతో అభిషేకం చేయాలని కోరినప్పుడు, ఆ కవచాన్ని తొలగించారు. అభిషేకం ముగిసిన తర్వాత మాతృదేవి మైమరచిన స్థితిలో, “నేను ఉంచినట్లే ఉంటున్నారు” అని అన్నారు. తక్షణం తమాయించుకొని ఇటూ అటూ చూసి, “అర్థం లేని మాటలన్నీ ఇప్పుడు నా నోట వస్తున్నాయి” అన్నారు. కానీ ఆమె అన్న మాటలు పక్కన నిలబడివున్న బ్రహ్మచారి కృష్ణలాల్కు వినబడ్డాయి.
ఈ సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత కోల్పారా నుండి మాతృదేవి శిష్యుడైన కేదార్ బాబు కలకత్తాకు వచ్చి మాతృదేవిని దర్శించాడు. మాట వరు సకు ఆమె రామేశ్వర దర్శనం గురించి అడిగాడు. అప్పుడు కూడా మాతృదేవి, “నాయనా! పరమేశ్వరుడు ఆ రోజు నేను ఉంచి వెళ్లినట్లే ఉన్నాడు” అని అన్నారు. అప్పుడు అటువైపుగా వెళుతున్న గోలాప్ మా ఈ మాటలు వింది. ఆమెకు మాతృ దేవి మాటల అర్థం తెలిసిపోయింది. వెంటనే ఆమె, “మాతృదేవి మైమరచిన స్థితిలో చెప్పిన ఈ మాటల ద్వారా తాము ఎవరన్నదీ వ్యక్తం చేశారు” అని అంటూ ‘అప్పుడు నేను వదలిపెట్టినట్లే ఉంది’ అంటూ మాతృదేవి చెప్పిన మాట లకు భావమేమిటో కూడా వివరించింది; రామావతారంలో మాతృదేవి సీతగా అవతరించారు. లంకలో యుద్ధం పూర్తయ్యాక సీతారాములు అయోధ్యకు తిరిగి పోతున్నప్పుడు సముద్రతీరపు మట్టితో శివలింగం తయారుచేసి శ్రీరాముడు శివుణ్ణి పూజించాడు. అప్పుడు మాతృదేవియైన సీతకూడా ప్రక్కనే ఉన్నారు. ఇప్పుడు కవచం తొలగింపబడిన స్థితిలో ఆ శివలింగాన్ని చూడగానే మాతృదేవికి గడచిన తమ అవతార జ్ఞాపకాలు స్మృతిపథంలో మెదలినపుడు, “నేను ఎలా వదలిపెట్టి వెళ్లానో అలాగేవుంది” అని అన్నారు. ఇలా గోలాప్ వివరించడం విన్న మాతృదేవి, “ఇదేమిటి! శివలింగాన్ని చూసినప్పుడు నాకు కలిగిన ఆనందాన్నే అలా వ్యక్తపరిచాను. కానీ నువ్వు దానికి ఇలా కథలు జోడించి చెబుతున్నావు కదా!” అంటూ తాము అన్న మాటల భావాన్ని గోప్యపరచేందుకు ప్రయత్నిం చారు.
తమ రామేశ్వరం అనుభవాలను కాలాంతరంలో మాతృదేవి శిష్యులతో ఇలా చెప్పారు: “రామేశ్వరంలో నేను రామలింగస్వామిని పూజించడానికి నూట ఎనిమిది బంగారు బిల్వ పత్రాలను శశి తయారుగావుంచాడు. నేను ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న రామనాథపురం మహారాజు ఆలయాన్నీ, స్వామికి అలంకరించే ఆభరణాలనూ, ఖజానానూ చూపించమని ఆజ్ఞాపించారు. అంతే కాకుండా, ఆభరణాలలో నాకు ఏదైనా నచ్చితే దానిని నాకు ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించాడు. అవన్నీ నా కెందుకు? అందువల్ల. ‘నాకు కావలసిన వన్నిటిని శశి చూసుకుంటున్నాడు’ అని అన్నాను. వారు బాధపడతారేమోనని ప్రక్కన వున్న రాధూను చూపిస్తూ, “ఈమెకు ఏదైనా నచ్చితే ఇవ్వండి” అన్నాను. వెంటనే ఆలయ అధికారులు వజ్ర, వైడూర్యాలతో తయారుచేసిన ఆభరణాలను ఆమెకు చూపించి ఆమెకు ఏది కావాలంటే దానిని తీసుకోమన్నారు. ఆభరణాలు చూసిన తర్వాత నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. ‘అయ్యో! ఈమె వీటిలో దేనిని తీసుకోకూడదు!’ అని అనుకుంటూ, గురుదేవులను, ‘భగవంతుడా! రాధూకు ఈ ఆభరణాల మీద కోర్కె కలుగకూడదు’ అంటూ ప్రార్థించాను. చాలాసేపు ప్రతి ఆభరణాన్ని పరిశీలించిన రాధూ చివరికి తనకు అవేవీ వద్దనీ, పోగొట్టుకున్న పెన్సిలుకు బదులుగా కొత్త పెన్సిలు ఒకటి కొనివ్వమని అడిగింది. నేను ఊపిరి పీల్చుకొన్నాను. ఆలయం నుండి బయటికి రాగానే ఒక అంగడిలో ఆమెకు ఒక పెన్నిలు కొనిచ్చాను.”
రామేశ్వరం సమీపంలోని పుణ్యస్థలం ధనుష్కోటి. మాతృదేవి అక్కడికి వెళ్లలేకపోయారు. కానీ అక్కడి సంప్రదాయానుసారం వెండితో ఒక విల్లును, బాణాన్ని తయారుచేసి ఒక వ్యక్తి మూలంగా కానుకగా పంపించారు.
బెంగళూరులో
మాతృదేవి రామేశ్వరం నుండి తిన్నగా మద్రాసు చేరుకుని గురుదేవుల జన్మదిన ఉత్సవాలలో పాల్గొన్నారు. 1911 మార్చి నెల ఆఖరులో స్వామి రామ కృష్ణానందతోపాటు బెంగళూరు వెళ్లారు. అప్పటికే అక్కడ రామకృష్ణ మఠం కొనసాగుతూ వుంది. అప్పుడు అక్కడ అధ్యక్షుడుగా ఉంటున్న స్వామి నిర్మలానంద మాతృదేవికి స్వాగతం పలికారు. మాతృదేవి మఠంలో బస చేశారు. ఆమెతోపాటు వచ్చిన వారందరు మఠం ఆవరణలో అమర్చిన డేరాలో బస చేశారు. ప్రజలకు ముందుగానే మాతృదేవి రాక తెలియజేయకపోయినా, మాతృదేవి దర్శనానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కాలాంతరంలో మాతృదేవి, “ఆ! బెంగుళూరులో జనసందోహం! నేను రైలు బండి నుండి దిగానే పుష్పవర్షం కురిపించారు. నేను నడచివెళ్లిన దారంతా వృక్షాలే! గురుదేవుల ఉపదేశాలు సర్వత్రా వ్యాపించాయి. అందువల్లనే అక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు” అంటూ తమ స్మృతులను తెలిపారు. బెంగు ళూరులో ఒక వారం రోజులు గడిపారు.
ఒక రోజు మధ్యాహ్నం మాతృదేవి ఆశ్రమానికి సమీపంలోని కవిపురంలోని గుహాలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నారు. తిరిగి వచ్చినప్పుడు ఆశ్రమం ద్వారం వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో నిలబడివున్నారు. మాతృదేవి బండి నుండి దిగిన దక్షిణ భారతంలో వెంటనే వారందరూ సాష్టాంగపడి ప్రణమిల్లారు. మాతృదేవి హృదయం ద్రవించి పోయింది, కళ్లు చెమ్మగిల్లాయి. మైమరచిన స్థితిలో అక్కడే చాలాసేపు నిలబడి చేతులెత్తి ఆనంద పారవశ్యంలో అందరినీ ఆశీర్వదించారు. భక్తుల హృదయాలు పరమానందభరితమయ్యాయి.
మాతృదేవిని దర్శించుకోవడానికి ప్రజలు తండోపతండాలుగా ఉదయం, సాయంత్రం తరలిరాసాగారు. మాతృదేవి సాన్నిధ్యంలో ప్రశాంతంగాను, ఆనందం గాను కూర్చొన్నారు. భాష తెలియని కారణంవల్ల వారిని అనునయపరచడానికి కూడా కొన్ని మాటలు చెప్పలేకపోయినందుకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు. దీనిని చూసిన భక్తులు, “అమ్మా! మీరు మాట్లాడనేవద్దు. మాటలు ఎందుకు తల్లీ! మిమ్మల్ని చూస్తూ కూర్చొనివుండడంతోనే మా హృదయాలు ఆనందంతో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి!” అని అన్నారు.
ఒక రోజు సాయంత్రం మాతృదేవి ఆశ్రమ ప్రాంగణంలోని ఒక చిన్న గుట్ట మీద కూర్చొని సూర్యాస్తమయ సౌందర్యాన్ని తనివితీర చూస్తున్నారు. అప్పుడు కొందరు సన్న్యాస శిష్యులు కూడా ఆమెతో ఉన్నారు. ఆ రోజు ప్రకృతి సౌందర్యం వర్ణనాతీతంగా ఉంది. నీలాకాశంలో తెల్లటి మేఘాలు తేలుతూ వున్నాయి, వాటిపై సంధ్యాసూర్యుడు తన కిరణాలను ప్రసరించి ఆకాశాన్ని అత్యంత అందంగా రూపొందించాడు. ఈ ప్రకృతి శోభను చూడగానే ప్రకృతికి ఆధారమయిన పరమాత్మ వర్ణనాతీతమయిన సౌందర్యమూ, మహత్త్వమూ స్ఫురిం చిందో ఏమో మాతృదేవి ప్రగాఢ ధ్యానంలో మగ్నులైపోయారు. ఈ విషయం విన్న స్వామి రామకృష్ణానంద, “మాతృదేవి పర్వతరాజ పుత్రి అయ్యారు” అంటూ మాతృదేవి కూర్చొన్న గుట్ట* మీదకు దూసుకువచ్చారు. స్థూలకాయులయినవారు ఎంతో శ్రమతో ఆ గుట్టమీదికి ఎక్కవలసి వచ్చింది. వారి పాదాలపై తమ తలనుంచి దేవీ మాహాత్మ్యంలోని శ్లోకాలను వల్లిస్తూ, “కరుణించు తల్లీ!” అంటూ ప్రార్థించారు. యాచించే బిడ్డను అనునయించే తల్లిలా మాతృదేవి ప్రేమతో ఆయన తలను నిమిరారు. మాతృదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన స్వామి పులకించిపోయారు.
కలకత్తాకు తిరుగు ప్రయాణం
బెంగుళూరు నుండి మద్రాసుకు వచ్చి ఒకటి రెండు రోజులు గడిపిన తర్వాత మాతృదేవి కలకత్తాకు పయనమయ్యారు. దారిలో ఆంధ్రదేశంలోని రాజ మండ్రిలో బసచేసి, గోదావరీనదిలో పుణ్యస్నానం చేసి, తర్వాత పూరీ జగన్నాథం వెళ్లి రెండు రోజులు గడిపి జగన్నాథ స్వామిని దర్శించుకొని, 1911 ఏప్రిల్ 11 వ తేది కలకత్తా చేరుకున్నారు. అక్కణ్ణుండి బేలూరు మఠం వెళ్లారు.
బేలూరు మఠంలో
దక్షిణ భారతాగ్రంలోని రామేశ్వరం వెళ్లివచ్చిన తమ మాతృదేవికి బేలూరు మఠంలో సాధువులు, బ్రహ్మచారులు, భక్తులందరు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు. మాతృదేవి తెల్లటి చీరతో శరీరా న్నంతా పూర్తిగా కప్పుకుని నిదానంగా పాదంమీద పాదం మోపుతూ సజీవ దివ్య విగ్రహంలా మఠ ద్వారం నుండి గురుదేవుల ఆలయానికి నడుచుకుంటూ వెళ్లారు. శిష్యురాండ్రూ, భక్తురాండ్రూ ఆమెను పరివేష్టించి వచ్చారు. మాతృదేవి వెళ్లే దారికి ఇరువైపుల భక్తులు నిలబడి దేవీ మాహాత్త్యం పారాయణం చేసుకుంటూ వచ్చారు. టపాకాయలు కాల్చారు. సుశ్రావ్యంగా పాటలు పాడుకుంటూ కొందరు భక్తులు మాతృదేవిని వెంబడించారు.
ఆలయ సమీపానికి మాతృదేవి వచ్చినప్పుడు, మాతృదేవిని చూసిన ఆనంద పరవశ్యంలో స్వామి బ్రహ్మానంద బాహ్యస్మృతిని కోల్పోయి సమాధి స్థితికి వెళ్లి పోయారు. చాలాసేపటి తర్వాత మాతృదేవి మంత్రాలను ఆయన చెవులలో ఉచ్చ రించిన తర్వాతే ఆయనకు బాహ్యస్మృతి కలిగింది.
మళ్లీ కాశీయాత్ర
ఆ తర్వాత మాతృదేవి ఒకే ఒకసారి మాత్రమే ప్రయాణం చేశారు. అది 1912 వ సం ॥ ఆమె కాశీకి వెళ్లడం, ఆమెతోపాటు స్వామి బ్రహ్మానంద ప్రభృ తులూ, సన్న్యాసులూ, మాతృదేవి బంధువులూ, భక్తులూ పలువురు వెళ్లారు. కాశీలో శ్రీరామకృష్ణ అద్వైత ఆశ్ర మానికి సమీపంలో అప్పుడే కట్టిన, “లక్ష్మీ నివాస్” అనే ఇంట్లో మాతృదేవి బస చేశారు. ఈసారి మాతృదేవి కాశీలో రెండున్నర నెలలు గడిపారు. అందువల్ల సావకాశంగా కాశీలోని ముఖ్యమైన ఆలయాలకు, ఇతర చోట్లకు వెళ్లివచ్చారు. కాశీకి వచ్చిన మూడవ రోజు అన్నపూర్ణా విశ్వనాథులను దర్శించుకొన్నారు.
తర్వాత శ్రీరామకృష్ణ సంఘ ప్రారంభకాలం నుండి ఆదర్శప్రాయమయిన వైద్యసేవలు అందించుచున్న రామకృష్ణ మిషన్ సేవాశ్రమానికి వెళ్లారు. ఆ ఆశ్రమంలోని విభిన్న వైద్య సదుపాయాలను, ఆశ్రమం ఆదర్శప్రాయమైన పద్ధతిలో దక్షిణ భారతంలో పేదలకు చేస్తున్న వైద్య సేవలను ప్రత్యక్షంగా చూసి సంతోషించారు. ఆశ్రమం ఖర్చులకు డబ్బు ఎలా వస్తూవుంది, ఎవరు దానిని ప్రారంభించారు అనే విషయా లన్నిటి నీ ఎంతో శ్రద్ధగా విన్నారు. బయలుదేరేటప్పుడు, దానిని నడిపించే తమ సన్న్యాస సంతానంతో, “ఇక్కడ గురుదేవులు నివసిస్తూన్నారు, ఆయనతోపాటు సంపదకు అధినేత్రి అయిన లక్ష్మీదేవి సకల హంగులతో నివసిస్తున్నది. ఈ చోటు చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడే ఉండిపోవాలని అనిపిస్తూంది” అని అన్నారు. తమ నివాసానికి వెళ్లిన వెంటనే ఒక పది రూపాయల నోటును తమ కానుకగా ఆశ్రమానికి పంపించారు.*
కాశీలోని ప్రసిద్ధమయిన ఆలయాలు అన్నింటిని దర్శించుకున్నారు మాతృ దేవి. అక్కడ నెలకొనివున్న “వైద్యనాథేశ్వరుడు, తిలబండేశ్వరుడు లాంటి మూర్తులు మట్టి నుండి స్వయంభువుగా ఉద్భవించినవారు” అన్నారు. కేదర నాథుని ఆలయానికి వెళ్లినప్పుడు “హిమాలయంలో ఉన్న కేదారనాథుని ఆల యమూ, కాశీలోని కేదారనాథుని ఆలయమూ పరస్పర సంబంధం గలవి. ఇక్కడ వెలసిన స్వామిని దర్శించినవారు హిమాలయాలలో కొలువైవున్న కేదారనాథుని దర్శించినవారవుతారు. ఇక్కడ పరమేశ్వరుడు సజీవమూర్తిగా ఉంటున్నాడు” అన్నారు.
కాశీకి సమీపంలోని సారనాథ్‌కు కూడా మాతృదేవి వెళ్లారు. మొదట ఇది బౌద్ధుల ప్రధాన క్షేత్రంగా ఉండేది. మాతృదేవి అక్కడికి వెళ్లినప్పుడు కొందరు పాశ్చాత్యులు అక్కడి బుద్ధుని స్మృతి చిహ్నాలను చూసి, వాటి అందంలోనూ గాంభీర్యంలోనూ మైమరచి నిలబడివున్నారు. “ఇదిగో, వీరంతా గత జన్మలో ఈ బౌద్ధ విహారాలను నిర్మించినవారు. తాము నిర్మించిన వాటినే చూస్తూ ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు” అన్నారు.
సారనాథ్ నుండి కాశీకి తిరిగి వచ్చేటప్పుడు ఒక ఘోర ప్రమాదం నుండి మాతృదేవి తప్పించుకున్నారు. మాతృదేవితోపాటు వెళ్లిన బ్రహ్మానంద స్వామి అక్కడ నుండి తిరిగి వచ్చేటప్పుడు మాతృదేవి వచ్చిన బండిలో తాము కూర్చొని మాతృదేవిని తాను వచ్చిన బండిలో కూర్చోమని అర్థించారు. బండ్లు బయలు దేరాయి. కొంతసేపట్లో బ్రహ్మానంద స్వామి కూర్చొనివున్న బండికి పూన్చిన గుఱ్ఱం పిచ్చిపట్టిన దానిలా దౌడుతీసి ఒక చోట ఢీకొంది. బండి ఛిన్నాభిన్నమై బ్రహ్మానందస్వామికి కూడా స్వల్పంగా గాయాలయాయి. ఈ సంఘటన గురించి మాతృదేవి చెబుతూ, “ఈ ప్రమాదంలో అసలు నేను చిక్కుకొని ఉండాలి. రాఖాల్ ముందుగానే పసికట్టి దానిని తానే తీసుకున్నాడు” అన్నారు.
కాశీలో అత్యంత ప్రసిద్ధులయిన ఇద్దరు మహాత్ములను మాతృదేవి దర్శిం చారు. వారిలో ఒకరు గంగా తీరంలో నివసిస్తున్న నానక్ సన్న్యాసి. మరొకరు చమేలిపురి. ఈయన గురుదేవుల అద్వైత గురువయిన తోతాపురి సంప్రదా యానికి చెందినవాడు. ఆయనతో గోలాప్ మా, “మీకు ఎవరు భోజనం పెడు తున్నారు?” అని అడిగింది. అందుకు ఆ సాధువు, “ఎవరు పెడతారు? నా తల్లి అయిన అన్నపూర్ణే పెడుతున్నది. మరెవరు నాకు అన్నం పెడతారు?” అన్నాడు. ఈ జవాబు విన్న మాతృదేవి ఎంతో సంతోషించారు. ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే తమ శిష్యులతో, “వృద్ధులయిన ఆ సాధువు ముఖం నా కళ్ల ముందే కనబడుతూవుంది. కల్లాకపటంలేని చిన్నారి బిడ్డలా ఎలాంటి అద్భుతమయిన ముఖం!” అన్నారు. మరుసటి రోజు చమేలిపురికి తీపి పదార్థాలు, కమలాపండ్లు, ఒక శాలువ పంపించారు. కాశీలోని ఇతర మహాత్ములను కూడా దర్శించమని మాతృదేవి శిష్యులు వారితో అన్నారు. అందుకు మాతృదేవి, “నేను చమేలి పురిని దర్శించాను. ఇక ఇతరులను దర్శించవలసిన అవసరం ఏముంది? ఇక ఏ మహ నీయుడు ఇక్కడ ఉంటున్నారు?” అన్నారు.
1913 జనవరి 16 వ తేది మాతృదేవి కాశీ నుండి కలకత్తాకు తిరిగి వచ్చారు.