సన్న్యాస పారంపర్యం
‘సమాజ బాధత్యలకు ప్రాధాన్య మిస్తూ మన దేశ చరిత్రలో వెలసిన ప్రప్రథమ సన్న్యాసుల సంఘ’ మని శ్రీరామకృష్ణ సన్న్యాస సంఘాన్ని గురించి కాలాంతరంలో నివేదిత వ్రాసింది. చరిత్రలో అత్యంత ప్రాధాన్యాన్ని సంత రించుకున్న ఇలాంటి ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తిగా ఒక స్త్రీని ఆరాధించడం మహిళా లోకానికే మహత్వాన్నిచ్చే విషయం కదా! మాతృ దేవిని సంఘ జననిగా ఇంతకు క్రితమే చూశాం. ఈ అధ్యాయంలో ఆమె ఎలా రామకృష్ణ ఉద్యమానికి సారథ్యం వహించారో చూడనున్నాం. వ్యక్తిగతమైన పెరుగుదలకయినా, సమాజ పెరుగుదల కయినా, ఈ ఉద్యమ పాత్ర మహత్త్వ పూర్వకంగా ఉండబోతున్నదని ఎరిగిన మాతృదేవి దాని పురోభివృద్ధి పట్ల అమిత శ్రద్ధ తీసుకున్నారు. చరిత్రలో అది ఎంత ప్రముఖ స్థానం వహింపనున్నదో మాతృదేవి గ్రహించి ఉన్నారనడానికి ఈ క్రింది సంఘటన ఒక ఉదాహరణ.
కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు స్వామి వివేకానంద సోదరి నివే దిత ఆధ్వర్యంలో నివారణ కార్యక్రమం ప్రారంభించారు. కానీ వారు అనుకొన్నంత నిధులు ఆ నివారణ కార్యక్రమానికి వసూలు కాలేదు. అందువల్ల అవసరమయితే బేలూరు మఠాన్నే విక్రయించి నివారణ కార్యక్రమం కొనసాగించవలసిందేనని తన సోదర సన్న్యాసులతో ఆయన చెప్పారు. ఈ విషయం మాతృదేవికి తెలిసింది. స్వామీజీ తమ అభిప్రాయాన్ని కాస్త ఉద్రేకపూరితులైవున్నప్పుడు చెప్పారు. బహుశా ఆయనకు ఇలాంటి ఉద్దేశం నిజంగానే ఉండి ఉండకపోవచ్చు. కానీ అలాంటి ఆలోచనను కూడా మాతృదేవి ఆహ్వానించలేరు; “ఇవేం మాటలు? బేలూరు మఠాన్ని విక్రయించబోతున్నాడా? ఆ మఠం నా పేరిట సంకల్పించబడింది. గురు దేవుల పేరిట స్థాపింపబడింది. అలాంటప్పుడు విక్రయించే హక్కు ఆతడికి ఎక్క ణ్ణుండి వచ్చింది? ఒక నివారణ కార్యక్రమంతోనే బేలూరు మఠ ఆదర్శాలు పూర్తి అయిపోవలసిందేనా? ఏఏ ఆదర్శాల కోసం అది స్థాపితమైందో తెలుసా? గురు దేవులు అసంఖ్యాక భావాలకు ఆలవాలమై ఉన్నారు. అవన్నీ ఈ మఠం మూలం గానే లోకమంతటా వ్యాప్తిగాంచనున్నవి. యుగాల పర్యంతం ఇలాగే ఇది జరగబో తున్నది” అన్నారట మాతృదేవి. రామకృష్ణ ఉద్యమ ముఖ్యత్వాన్ని ఎరిగివున్నందు వల్ల దాని అభివృద్ధిలో ఎంతో శ్రద్ధ తీసుకున్నారు మాతృదేవి. అర్హులైన యువకు లకు, ఎలాంటి అవరోధాలూ ఖాతరుచేయక సన్న్యాస దీక్ష ప్రసాదించి వారిని రామకృష్ణ సాధువుల పారంపర్యంలో చేర్చుకొన్నారు.
పోలీసుల సంశయం
మఠంలో యువకులు చేరడానికి తల్లితండ్రుల అవరోధం ఒకవైపు ఉండనే వుంది. కానీ ప్రభుత్వం, సమాజం వలన కలిగిన అవరోధం కృంగదీసేదిలా వుంది. ఆ రోజుల్లో దేశమంతటా చెలరేగిన స్వాతంత్ర్య ఉద్యమంలో యువకులు తీవ్రంగా పాల్గొన్నారు. వారిలో కొందరు స్వామి వివేకానంద దుందుభిని విని ఆకర్షితులై రామకృష్ణ మఠంలో చేరారు. ఆధ్యాత్మిక ఆదర్శాన్ని స్వీకరించి మఠంలో చేరిన తర్వాత వారందరూ తమ పాత సంబంధాలను పూర్తిగా వదలుకున్నారు. కానీ ఆంగ్లేయ ప్రభుత్వం వారినందరినీ సంశయంతో చూడసాగింది. అందువల్ల బేలూరు మఠం, కోల్పోరా ఆశ్రమం, జయరాంబాటిలో మాతృదేవి ఇల్లు తీవ్రమయిన పోలీసుల నిఘాకు లోనయ్యాయి. అక్కడికి వచ్చిపోయేవారి పేర్లన్నీ నమోదు చేయబడ్డాయి. కానీ మాతృదేవి దేనినీ పట్టించుకోలేదు. తమను ఆశ్రయించిన వారి కందరికీ ఆశ్రయ మిచ్చారు, మంత్రదీక్ష నిచ్చారు. కొన్ని సందర్భాలలో ఎంతో శ్రమకోర్చి వారిని ఒక రాత్రి జయరాంబాటిలో బస చేయనిచ్చి, మర్నాడు మంత్రదీక్ష నిచ్చి, ఎవరికీ తెలియకుండా వేరే చోట్లకు పంపేవారు. ఒకసారి పోలీసుల నిఘాలోని ఒక వ్యక్తి మాతృదేవిని ఆశ్రయించాడు. ఆతణ్ణి అక్కడ ఉండనివ్వడానికి ఎవ్వరూ సమ్మతించ లేదు. కానీ మాతృదేవి పట్టుదలతో, “జరగవలసింది గురుదేవుల సంకల్పం ప్రకారం జరిగే తీరుతుంది. నా తనయుడు నాతోపాటు ఉంటాడు” అన్నారు. ఇత రులు నిజాన్ని వివరించి, పోలీసుల వల్ల ఏర్పడే కష్టనష్టాలను తెలిపి, ఆతణ్ణి అక్కడ ఉండనివ్వవద్దని చెప్పినప్పుడు, ఆ యువకుని పట్లగల కారుణ్యం కార ణంగా మాతృదేవి కళ్లు ఆర్ద్రమయ్యాయి – ఆ తరువాత ఎవరూ ఏమీ చెప్పలేక పోయారు. తర్వాత ఆ భక్తుడు తానూ, తన స్నేహితుడూ పోలీసుల వలన నానా బాధలను గురించి చెప్పినప్పుడు మాతృదేవి విలపించడం మొదలుపెట్టారు.* రామకృష్ణ మఠ ప్రారంభకాలపు సన్న్యాసులలో పలువురు ఇలాంటి మాతృదేవి అవ్యాజ ప్రేమను చవిచూసినందువల్లనే మఠంలో చేరగలిగారు.
కుటుంబం వారి అవరోధం
యువకులను ఇలా సన్న్యాసులుగా మార్చడం మాతృదేవి ఇంట్లోనివారికి నచ్చలేదు. సోదరులు, మరదళ్లు మాతృదేవికి ఎదురు తిరిగారు. ఈ విషయంలో మాతృదేవి వారినెవరినీ పట్టించుకోకుండా దృఢంగా నిల బడ్డారు. ఒకసారి ఒక యువకుడు సన్న్యాసదీక్ష కోసం తహతహ చెందడం చూసి మాతృదేవి ఆతణ్ణి ప్రోత్స హించారు. అది చూసి నళిని “అత్త ధోరణి చూడు! ఆతడు బి.ఏ. చదువు కొంటున్న యువకుడు. ఎంత ఖర్చుపెట్టి తల్లితండ్రులు ఆతణ్ణి చదివించి వుంటారు. ఆతడు డబ్బు సంపాదించి వృద్ధులైన తల్లితండ్రులను ఆదుకోకుండా మఠంలో చేరబోతున్నాడట! అందుకు అత్త మద్దతు పలుకుతున్నారు!” అంది. మాతృదేవికి నళిని మాటలు రుచించలేదు. “ఇదిగో చూడు! నీకు ఆతణ్ణి గురించి ఏం తెలుసు? ఆతడు కాకి కాదు కోయిల. కోయిల ఎదిగిన వెంటనే తన నిజ మైన తల్లిని గుర్తుపడుతుంది. వెంటనే పెంపుడు తల్లి అయిన కాకిని వదలిపెట్టి కోయిల తల్లితో కలిసిపోతుంది”* అన్నారు. ఆ యువకుడు తర్వాత సన్న్యాసి అయ్యాడు.
ఒక వివాహిత యువకునికి మాతృదేవి సన్న్యాసదీక్ష నిచ్చారు. ఈ సంగతి తెలుసుకొన్న ఆ యువకుని తల్లి ఆగ్రహంతో వచ్చి మాతృదేవి చేసిన పనిని అధిక్షే పించింది. మాతృదేవి ఆ యువకుని తల్లి ఆరోపణ లన్నిటిని మౌనంగా విని, “ఆతడు ఇలా వ్యవహరించడంలో తప్పేమీలేదు. నిజానికి ఆతడు సరైన దారినే ఎంచుకున్నాడు. కుటుంబ భృతికోసమైన ఏర్పాట్ల నన్నిటిని చేసిన తర్వాతే సన్న్యాసం తీసుకొన్నాడు” అని చెప్పేశారు.
మరొక యువకునికి మాతృదేవి సన్న్యాసం ప్రదానం చేసినప్పుడు ఆతడి బంధువు ఒకామె, “మళ్లీ అదే కథ, ఇదిగో మరొకరిని కూడా సన్న్యాసిగా మార్చే శారు” అంది. వెంటనే మరొక స్త్రీ, “ఆ యువకుని తల్లితండ్రులు ఎన్ని ఆశలతో ఆతణ్ణి పెంచివుంటారు! అవన్నీ పటాపంచలయిపోయాయి! వివాహం కూడా ఒక కర్తవ్యమే కదా! అత్త ఇలాగే సన్న్యాసులను రూపొందిస్తూవుంటే మహామాయ తప్ప కుండా ఆగ్రహిస్తుంది” అంది. ఈ మాటలు విన్న మాతృదేవి, “అమ్మాయి! ఇదిగో చూడు! ఇంద్రియ సుఖాలపట్ల తీవ్రమైన లాలస ఉన్న వ్యక్తి నేను చెప్పానని వెంటనే సన్న్యాసం తీసుకుంటాడా ఏమిటి? కానీ ఎవరైన పుణ్యశీలి, ‘భగవంతుడే నిజం, ప్రపంచం మాయ, లీలా వినోదం’ అనే సత్యాన్ని గ్రహించినప్పుడు ఆతడికి నేను కాస్త సాయం చేయాలికదా! వీరందరు నా దివ్య తనయులు. పువ్వులాంటి పవిత్రతతో లోకంలో జీవిస్తారు. దీనికన్నా మహాభాగ్యం మరొకటి ఉందా? గృహస్థులు పడే బాధలు చూసినప్పుడు నా నరనరాలు దహించిపోతున్నాయి” అన్నారు.
త్యాగమూర్తులైన తనయులు
సన్న్యాసాన్ని మాతృదేవి ఈ దృక్పథంలోనే చూశారు. మాతృదేవి ప్రసాదించే బ్రహ్మచర్య, సన్న్యాస దీక్షలు కూడా ఇలాంటి తల్లీ–తనయుల బాంధవ్య సమన్విత మైనవే. మీద నిలబడింది. మంత్రదీక్షలా ఇక్కడ కూడా సంప్రదాయాలకూ, క్రతువులకూ ప్రాధాన్యం లేదు. సన్న్యాస ఆదర్శం, రామకృష్ణ సంఘ ప్రాతిపదిక, దాని లక్ష్యం, ఆచరణ విధానం, సన్న్యాసుల జీవన విధానం ఇత్యాదులు వివరించి ఆ దీక్షలకు తగినట్టి ధవళ వస్త్రాలు లేదా కాషాయవస్త్రాలు ప్రసాదించేవారు మాతృ దేవి. తర్వాత, “భగవంతుడా! వీరందరూ సన్న్యాస ఆదర్శాన్ని కచ్చితంగా అనుస రించేటట్లు కాపాడండి. వీరు కొండల్లో, అరణ్యాల్లో ఎక్కడవున్నా ఒక పిడికెడు అన్నం లభించేలా ఆశీర్వదించండి” అంటూ గురుదేవులను ప్రార్థించేవారు. హోమం మొదలైనవి బేలూరు మఠానికి వెళ్లి నిర్వర్తించమని చెప్పేవారు. గృహస్థు లకు తమ బంధువులని చెప్పుకోవడానికి పలువురు ఉంటారు. లోకాన్ని త్యజించి, గురుదేవులను మాత్రమే ఆశ్రయించి మఠంలో చేరిన సన్న్యాస తనయులకు తామే తల్లి, తండ్రి, గురువు అయ్యారు మాతృదేవి. అంతమాత్రమేకాదు, గురుదేవుల అవతార కార్యంలో ఈ సన్న్యాస తనయుల పాత్ర ముఖ్యమయినది కనుక వారితో పాటు ఒక విశేషమైన అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు మాతృదేవి. “భగవంతుని కోసం సర్వస్వమూ త్యజించిన వీరందరితోపాటు కాకుండా నేను మరెవరితో ఉండగలుగుతాను?” అంటూ తరచు చెప్పేవారు. ఒక రోజు తమ బంధువులను సూచిస్తూ మాతృదేవి అరూపానందస్వామితో, “వారినందరిని నేను ప్రత్యేకంగా చూసుకోవాల్సివుంది, లేకపోతే నేను వారికి ఏదో అన్యాయం చేస్తూన్నట్లు అను కొంటారు. ఉన్నదాంట్లో శ్రేష్ఠమైనది వారికి ఇవ్వాలి, సదా సర్వవేళలా వారిని పట్టించుకోవాలి. లేకపోతే గొడవ పెడతారు. కానీ మీరందరు నా తనయులు. నేను ఏం చేసినా అది మీకందరికీ తృప్తిగానే ఉంటుంది. మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఉన్నప్పటికీ మీరు ఏమీ అనుకోరు. నిజానికి మీరు మాత్రమే నాకు చెందినవారు, రాధూ తదితరులు కాదు. మీకందరికీ నేను అత్యంత ఆకర్షితురాలినయినా దాన్లో మాయలేదు. ఈ ఆకర్షణే నన్ను పదేపదే భూమికి లాక్కొంటూ వస్తూవుంది” అన్నారు.
మాతృదేవి ఇంటికి పెద్ద. బ్రహ్మచారులు, సన్న్యాసులు, స్త్రీలు ఆమెతో పాటు ఉండేవారు. కానీ సన్న్యాసుల జీవితాలలో స్త్రీలో, గృహస్థులో ప్రవేశించకుండా ఉండాలనే విషయంలో మాతృదేవి అమిత శ్రద్ధ వహించారు. ఒక రోజు ఉద్బో ధన్లో రాధూ పాంజేబులు (కాళ్లకు వేసుకొనే గజ్జ గొలుసులు) ధరించి వేగంగా పరుగెత్తింది. అది చూసి మాతృదేవి, “ఏయ్ రాధూ! నీకు సిగ్గు అనేదే లేక పోయిందా ఏమిటి! క్రింద నా సన్న్యాస తనయులు ఉంటున్నారు. వారందరు కేవలం లీలావినోదం కోసం ఇక్కడికి వచ్చి జీవనం గడపడం లేదు. ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించడానికి ఇల్లూ వాకిలీ వదలి వచ్చారు. వారి వ్రతానికి భంగం వాటిల్లితే దాని పర్యవసానం ఏమవుతుందో తెలుసా? నువ్వు పాంజేబులు వేసుకుని పరుగెడుతూ ఉన్నావు! వారందరూ ఏమనుకుంటారు? వాటిని వెంటనే తీసివేయి” అంటూ గట్టిగా చెప్పారు. గత్యంతరంలేక పాంజేబులను తీసివేసింది రాధూ.
ఒకసారి ఒక భక్తురాలు నడచి వెళ్లేటప్పుడు ఆమె పమిట కొంగు బ్రహ్మ చారి వరదుని మీద పడింది. అది చూసి మాతృదేవి ఆమెతో, “ఏమిటమ్మా ఇది! ఇంత ఉదాసీనంగా నడుస్తున్నావు! వారందరూ బ్రహ్మచారులు; నమస్కరింపదగ్గ వారు. ఆతడికి నమస్కరించు” అంటూ ఆమెను ఆతనికి నమస్కరింపచేశారు.
అంతేకాదు. స్త్రీలు అప్పుడప్పుడు సన్న్యాసులు నివసించే మఠానికి వెళ్లడం కూడా మాతృదేవికి నచ్చదు. “అమ్మాయీ! నీ మనస్సులో చెడు ఆలోచనలు ఏవీ లేకపోవచ్చు, కానీ వారి మనస్సులో నీ కారణంగా చాంచల్యం చెలరేగితే అందుకు నువ్వు బాధ్యురాలవవుతావు అని మరచిపోకు” అని హెచ్చరించేవారు.
సన్న్యాస మహత్వాన్ని మాతృదేవి ఎలా పరిరక్షించారో ఈ సంఘటనల మూలంగా మనం కొంత అర్థం చేసుకోవచ్చు. గోలాప్ మా మాతృదేవితో పాటే సంఘ గురువు ఉంటూ ఆమెకు సేవలు చేస్తూవుండేవారని చూశాం. ఆమె ఒక సందర్భంలో ఒక బ్రహ్మచారితో ఏర్పడ్డ అభిప్రాయ భేదం వల్ల కోపోద్రిక్తురాలై, “ఆతడు ఇక్కడుంటే నేను ఉండలేను. నేను బయలుదేరుతున్నాను” అంటూ వెళ్లిపోవడానికి సిద్ధ పడింది. ఈ సంగతి మాతృదేవికి తెలిసింది. మాతృదేవి కాస్త గట్టిగా, “ఆమె ఎవరు? కేవలం కుటుంబ స్త్రీ. కావాలంటే ఆమె వెళ్లిపోవచ్చు. ఆ బ్రహ్మచారి నా కోసం సర్వస్వమూ త్యజించి ఇక్కడ ఉంటున్నాడు కదా!” చెప్పారు.
అందువల్ల సన్న్యాసులు ఎలా ప్రవర్తించినా మాతృదేవి ఊరకుంటారని దీని అర్థం కాదు. సన్న్యాసుల విషయంలో కూడా మొదట్లో ఆమె మాతృదేవి, తర్వాతే గురువు అనే విషయం యథార్థం. కానీ తల్లి ప్రేమతోపాటు తండ్రి నిష్కర్షా కలిపే మాతృదేవి వారిని తీర్చి దిద్దారు. సాధన విషయంలో సామాన్యంగా మాతృదేవి మామూలు భక్తులపట్ల చూపించే సౌమ్యత సన్న్యాసుల పట్ల చాలా అరుదుగా కనబరుస్తారు. మామూలు భక్తులతో చెప్పేలా, “నీ శక్తిమేరకు సాధన చేయి” అంటూ ఆమె సామాన్యంగా తమ సాధు సంతానానికి చెప్పరు. సన్న్యాసులు కూడా ఆమె ఆప్యాయతను చవిచూశారు. వారికి కూడా అభయప్రదానం చేశారు మాతృదేవి. కానీ వారు ఏ కొంతయినా సదా సాధన చేస్తూవుండేలా చూసుకునే వారు. ఒకసారి మాతృదేవి సన్న్యాస శిష్యుడొకడు హృషీకేశ్ కెళ్లి తపోమయ జీవితం చేపట్టాడు. అక్కణ్ణుండి మాతృదేవికి ఒక ఉత్తరం వ్రాశాడు. అందులో, “అమ్మా! నాకు గురుదేవుల దర్శనం తగిన సమయంలో లభిస్తుందని చెప్పారు కదా! కానీ ఇంతదాకా నాకు ఆ భాగ్యం కలుగలేదే!” అంటూ వాపోయాడు. అందుకు బదులుగా మాతృదేవి తన శిష్యునితో ఆతనికి ఇలా వ్రాయమన్నారు: ‘నీ కోసమో లేక నువ్వు అక్కడకు వెళ్లినందువల్లనో, గురుదేవులు హృషీకేశ్కు వెళ్లలేరు’ అంటూ వ్రాయి. ఆతడు ఒక సన్న్యాసి. భగవంతుని అన్వేషించుకుంటూ సాధనలు చేయడంకంటే ఆతడికి వేరే పనేమిటి? భగవంతుడు ఇష్టపడినప్పుడు భక్తునికి దర్శనమిస్తాడు.
సన్న్యాస శిష్యులతో తల్లీ–తనయుల సంబంధంలో కూడా ఒక పరిధిని ఉంచుకున్నారు మాతృదేవి. వారందరు తమ పట్ల అనురాగం పెంచుకోవడం ఆమెకు నచ్చదు. ఒక సన్న్యాస శిష్యుడు తాను కొన్ని నెలలుగా మాతృదేవిని చూడ నందువల్ల ఎంతో బాధపడుతున్నట్లు వ్రాశాడు. అది మాతృదేవికి నచ్చలేదు. “ఆతడు ఎందుకు అలా ఆవేదన చెందాలి? మాయ సంకెళ్ల నన్నిటిని ఒక సన్న్యాసి ఛేదించాలి, అవి బంగారు సంకెళ్లయినా సరే, సన్న్యాసికి అనురాగం కూడదు. ‘మాతృదేవి ప్రేమ’ అనే ఆలోచన, అది తనకు దొరకలేదే అనే ఆవేదన– ఇవన్నీ మూఢత్వంతో కూడుకున్నవి. శిష్యులు నా చుట్టూ తిరిగి రావడం నాకు నచ్చదు. ఎలాగైనా నాకు ఉంటున్నది మానవ రూపం. దానిని దైవంగా గుర్తించడం అంత సులభం కాదు” అన్నారు మాతృదేవి.
సన్న్యాసులు గృహస్థులతో ఎక్కువగా సంసర్గం ఉంచుకోవడం మాతృదేవి అనుమతించరు. ఒకసారి మాతృదేవి శిష్యుడొకడు గిరీశ్తోపాటు కాశీకి వెళ్లాలని అనుకున్నాడు. ఆతని ప్రయాణ ఖర్చులన్నీ గిరీశ్ భరించేట్లు ఏర్పాటు. అది విన్న మాతృదేవి, “నువ్వు ఒక సన్న్యాసివి. నీ ప్రయాణ ఖర్చులను మరోవిధంగా చూసు కోలేవా? గిరీశ్ సంసారి. నువ్వెందుకు ఆయనతోపాటు ప్రయాణం చేయాలి? మీరందరూ ఒకే రైలుపెట్టెలో ఉంటారు. అతడు తనకోసం ఏమైనా చేయమని నీతో చెప్పవచ్చు. సన్న్యాసివయిన నువ్వు ఆతని ఆజ్ఞానుసారం నడచుకోవాలా?” అన్నారు.
మాతృదేవి సన్న్యాస శిష్యులలో ఒకరు సన్న్యాస నిబంధనలను పాటింప జాలక మళ్లీ గత జీవితాన్నే అభిలషించాడు. అప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: “మట్టి పాత్రలో సింహం పాలను ఉంచగలమా? ప్రాపంచిక వ్యక్తుల ఇళ్లలో వరు సగా తిన్నందువల్ల ఆతడి మనస్సు దారి తప్పిపోయింది.”
ఇలా మాతృదేవి అప్పుడప్పుడూ తమ సన్న్యాస సంతాన్ని మార్గదర్శకంగా నడిపించిన తీరు నుండి ఆమె రామకృష్ణ సంఘ ఆదర్శాలుగా దేనిని పుణికిపుచ్చు కొన్నారో తెలుసుకోగలుగుతున్నాం.
గురుదేవులే ఆదర్శం
“గురుదేవులు సకల దేవ దేవీ స్వరూపులు. సర్వమంత్రస్వరూపులు. యథా ర్థంగా, సత్యంగా ఆయన మూలంగా సకల దేవతలనూ ఆరాధింపవచ్చు. లోకం లోని క్లేశాలనూ, ఆవేదనలనూ తొలగించడానికే ఆయన అవతరించారు” అన్నదే మాతృదేవి నిశ్చితాభిప్రాయం. అందువల్ల ఆమెను పదిలంగా పట్టుకోవడం ఆమెను ఆర్తితో ప్రార్థించడంవల్ల ఆధ్యాత్మిక జీవితంలో సమస్తమూ ప్రాప్తిస్తుందని ఘంటాపథంగా చెప్పేవారు – “గురుదేవులను ఒక్కసారియైనా ఆర్తితో ప్రార్థించినవారు దేనికీ జంకవలసింది లేదు. ఆధ్యాత్మిక జీవితసారం ప్రేమభక్తి. గురుదేవులను నిరంతరం ప్రార్థించడం వల్ల మాత్రమే ఆ భక్తి లభిస్తుంది.” రామకృష్ణ సంఘ సన్న్యాసులకు గురుదేవులనే ఆదర్శంగా నిలిపారు మాతృదేవి. “మన లక్ష్యం గురుదేవులే, గురుదేవులు సంఘ గురువు మాత్రమే. నువ్వు ఏమయినా చేయి, కానీ గురుదేవులను పదిలంగా పట్టుకున్నా వంటే దారితప్పిపోవు” అనేవారు మాతృదేవి.
లక్ష్యమనే మాటను రెండు విధాలుగా వివరించవచ్చు. 1. వెళ్లి చేరుకోవల సిన చోటు. 2. ఆ చోటును చేరుకోవడానికి అనుసరించవలసిన జీవన శైలి. సన్న్యాసుల లక్ష్యం గురుదేవులని చెప్పినప్పుడు మాతృదేవి ఈ రెంటినీ సూచిం చారు. గురుదేవులను ఆర్తితో ప్రార్థించాలి, ఆయనను ఆశ్రయించే జీవించాలి. అదే సమయంలో గురుదేవులు, “నేను మూస తయారు చేశాను. మీ జీవితాలను అందులో పోతపోసుకోండి” అనేవారు కదా! అలా పోతపోసుకోవడంలో సన్న్యాసు లను ప్రోత్సహించేవారు. గురుదేవుల ఈ ఉపదేశం పలు పరిమాణాలు గలది. సన్న్యాసుల వరకు ఈ ఉపదేశ భావాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే కామినీ కాంచన త్యాగం; అంటే కామం, ధనం – ఈ రెండింటిని త్యజించడం. త్యాగ పరిమాణాన్ని కాలానికి తగ్గట్లు రూపుదిద్దినవారు గురుదేవులు. కోర్కెలన్నిటికీ మూలకారణమైనవి ఈ రెండే అని సూచిస్తూ వాటిని త్యజించమని ఉద్బోధించా రాయన. ఆయన కృపాశక్తి అయిన మాతృదేవి కూడా ఈ రెండింటి విషయంలో సన్న్యాస సంతానం పట్ల చాలా నిష్కర్షగా వ్యవహరించేవారు. మాతృదేవి సరళం గానే దీనిని వివరించేవారు. “ధనం వుందే, దానితో నువ్వు ఎక్కువగా సంసర్గం కల్పించుకొంటే ప్రలోభంలో పడిపోతావు. ‘ధనమా! అది ఎలాంటిదైనా దాన్ని వదలుకోవడం నాకు సాధ్యమే అని నువ్వు అనుకోవచ్చు. అలా వీలుకాదు నాయనా! అలాంటి మూర్ఖపు ఆలోచనలకు ఎన్నడూ చోటివ్వకు. నీ మనస్సులో ఎక్కడో ఒక చోట ఒక రంధ్రముంటుంది. దాని ద్వారా నీకు తెలియకుండానే అది మెల్లగా లోపలికి ప్రవేశించి నిన్ను అగాధమైన గోతిలోకి నెట్టేస్తుంది. ధనాశ మెల్ల మెల్లగా ఇంకా అనేక విషయాలపట్ల కోర్కెలను లేవనెత్తుతుంది.”
కామం గురించి చెబుతూ, “ఒక సాధువు సన్న్యాస ఆదర్శాన్ని ఎన్నటికీ కించపరచకూడదు. ఆతడు వెళ్లే దారిలో స్త్రీ బొమ్మ ఉందనుకొందాం. దాని ముఖం చూడాలని తన పాదాలతో కూడ ఆ బొమ్మను తిప్పకూడదు” అనేవారు.
కామం, ధనాశ అనే రెండింటితోపాటు మాతృదేవి నొక్కివక్కాణించేవి. గర్వం, అహంకారం. “కాషాయ వస్త్రాలు ధరించడం పలు సమయాల్లో అహం కారానికి దారి తీస్తుంది. ‘ఈతడు నాకు నమస్కరించలేదు’, ‘ఆతడు నాకు మర్యాద చూపలేదు’ అంటూ సన్న్యాసులలో అహంకారం పెచ్చుపెరుగుతుంది, వాటినన్నిటిని ఆలోచించి చూచేటప్పుడు నాలా తెల్లగుడ్డలు వేసుకోవడం ఎంతో మేలనిపిస్తుంది” అనేవారు మాతృదేవి.
సాధనల ఆవశ్యకత
భగవదనుభూతినే ఆదర్శంగా తీసుకుని గురుదేవులను ఆశ్రయించి సన్న్యాసులందరూ ఏ క్షణమూ తమ ఆదర్శాన్ని మరచిపోకూడదనే విషయంలో మాతృదేవి ఎంతో జాగ్రత్త వహించారు. అలా మరవ కుండా ఉండడానికి ఎడతెగని సాధనలు ఎంతో ఆవశ్యకం. వారు ఒక క్షణం కూడా సాధన జీవితం నుండి వైతొలగిపోకూడదు. “సన్న్యాసి అనే వ్యక్తి తెల్లగుడ్డ, గృహస్థుడు నలుపుగుడ్డ వంటివారు. నలుపు గుడ్డమీద మరక పడితే అది కానరాదు. కానీ తెల్లగుడ్డ మీద ఒక చుక్క సిరా పడినా చాలు, స్పష్టంగా అందరికీ కనబడుతుంది. సన్న్యాస జీవితం ప్రమాద భరితం. కామం, ధనాశతో నిండింది ఈ లోకం. అందువల్ల సాధువు అనవ రతమూ వివేక వైరాగ్యాలను పాటించాలి” అనేవారు.
కర్మయోగ స్థానం
సాధువులు సమాజాన్ని ఆశ్రయించి పొట్టపోసుకునేవారనే దురభిప్రాయం తొలగిపోయి, వారికి కూడా ఒక అంతస్తు లభించడం మత చరిత్రలో ప్రప్రథ మంగా రామకృష్ణ సంఘ ఆవిర్భావం తరువాతే జరిగింది. అందుకు ముఖ్య హేతువు స్వామీజీ పరిచయం చేసిన కర్మయోగం. దీని మూలంగా సాధువు తన జీవితానికి ఆవశ్యకమయిన వాటిని తానే కృషి చేసి సంపాదించుకోవటంతోపాటు మానవాళికి కూడా సహాయకారి అవుతాడు. చేసే పని భగవంతునికి సమర్పించి భగవంతుని కోసమే దానిని ఆచ రించేటప్పుడు అదొక ఆధ్యాత్మి సాధనగా పరిణమిస్తుంది. జపతపసాధనలలో సంపూర్ణంగా అర్పించుకోలేని సాధువులకు కూడా జీవన విధానంగా కర్మయోగం పరిణమిస్తుంది. కాని సన్న్యాసి అంటే సమాజం నుండి వైదొలగి జీవించాలనే ప్రాచీన అభిప్రాయాన్ని మఠంలో చేరిన తర్వాత కూడా పలువురు వదలుకోలేక పోయారు. “అమ్మా! నివారణ కార్యక్రమాల లాంటి పనులు అన్నీ నిజంగా గురు దేవుల పనులేనా?” అంటూ ఒక శిష్యుడు తన సందేహాన్ని మాతృదేవికి వ్యక్తం చేశాడు. “అవును నాయనా! ఇవన్నీ గురుదేవుల పనులే. ఈ పనుల మూలంగా నీ ఆహారాన్ని నువ్వే కృషితో సంపాదించుకుంటున్నావు. పని చేయకపోతే నీ కెవరు భోజనం పెడతారు? ఇంటింటికీ వెళ్లి బిచ్చమెత్తడం మనో క్లేశానికే దారి తీస్తుంది. పోషక ఆహారం లేకపోతే శరీరం వ్యాధిగ్రస్థమవుతుంది. ఎవరి సంఘ గురువు మాటలూ వినబోకు! చక్కగా పనిచేయి, చక్కగా భుజించు, చక్కగా సాధన చేయి” అంటూ బదులు చెప్పారు మాతృదేవి.
ఇలాంటి నివారణ కార్యక్రమాలను పూర్తిచేసుకొని వచ్చేవారితో ప్రజల బాధలను గురించీ సన్న్యాసులు చేసిన సేవల గురించీ వివరంగా మాతృదేవి అడిగేవారు. అడగడం, చెప్పడం మాత్రమే కాకుండా తాము కూడా ఒక ఆద ర్శంగా మెలిగారు. కాలాంతరంలో మాతృదేవి దర్శనార్థం జయరాంబాటికి వెళ్లే వారిలో డాక్టర్లు కూడా ఉండేవారు. వారితో గ్రామ ప్రజలకు ఉచితంగా చికిత్స చేయమని చెప్పేవారు. మాతృదేవి ఉత్సాహపరచడంతో అనేకసార్లు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం కద్దు.
ఇలా క్రమేణా కోల్పారాలో ఒక ఉచిత వైద్యశాల వెలసింది. అక్కడ ఒక సమస్య ఆ సన్న్యాసులకు ఎదురయింది. డబ్బు చెల్లించి మందులు కొనుక్కునే స్తోమత గలవారు కూడా ఈ ఉచిత వైద్యశాల సదుపాయాన్ని ఉపయోగించు కోవడం మొదలుపెట్టారు. ఇందువల్ల పేదలు అనేకులకు మందులు లభించ కుండాపోతున్నవి. ఈ విషయంగా సన్న్యాసులు మాతృదేవి వద్దకు వెళ్లి, డబ్బు ఉన్న వారికి ఉచితంగా మందులు ఇవ్వవచ్చా, కూడదా అని అడిగారు. సూటిగా బదులు చెప్పారు మాతృదేవి: “నాయనా! చేయి చాపేవాడు ఎవడయినా పేద వాడే. ఉచితంగా మందులు కావాలని ఎవరు అడిగినా వారిని బీదవారిగా భావించి మందులు ఇచ్చేయి. మన వైద్యశాల అందరికీ తెరచేవుండాలి.” ఇలా సేవలందిస్తున్నప్పుడు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించి, సన్న్యాసులకు మార్గ దర్శకులయ్యారు మాతృదేవి.
రోజంతా జపధ్యానాలంటూ ఆధ్యాత్మిక సాధనలలో నిమగ్నమయి ఉండ డానికి తగిన మనోపరిపక్వత గలవారు ఏదో ఒకరిద్దరే ఉంటారు. సోమరియైన మనస్సు సమస్యలను, గందరగోళాన్ని మాత్రమే సృష్టిస్తుంది; సామాన్యులకు ఇలాంటివి చాలా ఆవశ్యకమని మాతృదేవి కచ్చితంగా ఎరిగివున్నారు: “అందు కోసమే నా నరేంద్రుడు ఇలాంటి పనులను ప్రవేశపెట్టాడు. మన సంఘం ఈ మార్గంలోనే పయనిస్తుంది. దీనిని అనుసరించి వెళ్లిలేని వారు వెళ్లిపోతారు. నరేంద్రుడు గురుదేవుల పరికరం. లోకశ్రేయస్సు కోసం తన సంతానం, భక్తుల భవిష్యత్ కర్తవ్యాలను ఆయనే నరేంద్రుని మూలంగా చేస్తున్నారు. ఆతడు చెప్పే వన్నీ సరైనవే. కాలక్రమంలో దాని అద్భుత పరిణామాలను మీరే ప్రత్యక్షంగా చూస్తారు” అన్నారు మాతృదేవి.
అదేసమయంలో పనుల సాకుతో ఆధ్యాత్మిక సాధనలను ఒక్కసారిగా వదలుకోడాన్ని కూడా మాతృదేవి అంగీకరించరు. ఈ విషయంలో ఆమె చాలా కచ్చితంగా ఉంటారు. అలా ఉన్న ఒక సాధువుతో మాతృదేవి సంభాషించిన తీరూ, ఆయనకు మార్గదర్శకత్వం చేసిన విధమూ ప్రతిసాధువుకూ గుణపాఠంగా ఉంటుంది. ఆ సాధువుతో మాతృదేవి, “పులుపు పదార్థాల నుండి విడివడాలని కంకణం కట్టుకొన్న ఒక వ్యక్తి చింతచెట్టు క్రింద ఇల్లు కట్టుకున్న కథలాగుంది నీ ప్రవర్తన. భగవంతుని పవిత్ర నామాన్ని ఆశ్రయించడానికి నువ్వు లోకాన్ని త్యజిం చావు. కానీ ఇక్కడ పనుల సాకుతో మరొక ప్రపంచాన్ని కల్పించి అందులో కూరుకుపోయివున్నావు. కుటుంబాన్నీ, బంధుమిత్రులనూ వదలుకొని మఠంలో చేరతారు. కానీ మఠాన్ని పదిలంగా పట్టుకుని దాని నుండి విరమించుకోవడానికి ఇష్టపడరు! ఏం మాయ! నువ్వు తగరకుండం వెళ్లు. అక్కడ విద్యార్థులకు చదువు నేర్పించు. చేతనయినంత జపధ్యానాలు చేయి” అన్నారు.
తన తప్పును గ్రహించిన ఆ సాధువు వెంటనే సంపూర్ణంగా సాధన జీవితం అనుసరించగోరాడు.
శిష్యుడు: అమ్మా! ఏదైనా ఏకాంత ప్రదేశానికి వెళ్లి పూర్తిగా తపోజీవితం గడపాలనుకొంటున్నాను. కానీ నా ఆరోగ్యం కూడా అంత బాగాలేదు.
మాతృదేవి: ప్రస్తుతానికి చిన్న చిన్న పనులు కూడా చేస్తూవుండు. తీవ్ర మయిన ఆవేగం కలిగినప్పుడు అలాంటి జీవితం గడపవచ్చు.
శిష్యుడు: నేను జపం చేస్తున్నాను. కానీ మనస్సు ఏకాగ్రమవడం లేదు. చంచలమవుతున్నది.
మాతృదేవి: మనస్సు ఏకాగ్రమయినా, కాకపోయినా జపం చేయడం మాత్రం ఆపవద్దు. ప్రతిరోజు నిర్ణీత సంఖ్య జపం చేసేతీరాలి.
సంఘ జీవగర్ర
ఒకే కుటుంబానికి చెందిన వారిలో కూడా మనస్పర్థలు, విభేదాలు సహ జమే. విభిన్నజాతులు, భాషలు, అలవాట్లుగల పలువురు కలిసి జీవిస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాలు తలెత్తడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఒకరినొకరు సర్దుకు వెళ్లకపోతే సంఘ ఐకమత్యం కుంటు పడుతుంది, పెరుగుదల దెబ్బతింటుంది. దీనిని వారించాలి. అంటే అందుకు ముఖ్యంగా కావలసింది ప్రేమ. మాతృదేవి ఈ విషయాన్ని నొక్కి వక్కాణించారు. ఒకసారి కోల్పారా ఆశ్రమంలోని అధ్యక్ష స్వామి మాతృదేవితో, “అమ్మా! ఆశ్రమ సంఘ గురువు సాధువులు మునుపల్లా నేను చెప్పినట్లు వినేవారు. కానీ ప్రస్తుతం అలాకాదు. నేనేమైన చెబితే వెంటనే మిమ్మల్నో, శారదానంద స్వామినో ఆశ్రయిస్తారు. మీరు వారందరికీ చక్కని భోజనం కూడా పెడతారు. మీరిద్దరూ వారి నందరిని మీతో ఉంచుకొని వారికి ఉపదేశాలు చెప్పి నా వద్దకు పంపినప్పుడే నేను వారిని అదు పులో ఉంచుకోగలుగుతాను” అన్నాడు. అందుకు మాతృదేవి హడలిపోయి, “నీకే మయింది? ఏం మాట్లాడుతున్నావో ఆలోచించే మాట్లాడుతున్నావా? ప్రేమ మాత్రమే సారవంతమయినది. మన సంఘం ప్రేమ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతూవుంది. నేను వారందరికీ తల్లిని, వారందరికీ నేను చక్కగా భోజనం పెడుతూన్నానని నాతోనే అనడానికి నీకు సిగ్గుగా లేదా? అదుపులో పెట్టడంవల్లా, కట్టుబాట్ల వల్లా ఆశ్రమం ఎలా అభివృద్ధి పొందుతుంది? ఇలా వారినందరినీ నువ్వు చీవాట్లు పెట్టావంటే నీ సొంత బిడ్డలయినా కూడా పలాయనం చిత్తగిస్తారు కదా!” అంటూ ఆయనకు ఉపదేశించారు.
మరొకసారి ఆ స్వామి అదే ఫిర్యాదుతో మళ్లీ వచ్చాడు. ఆతను చెప్పి నట్లుగా నడచుకోనివారు మాతృదేవిని ఆశ్రయిస్తే, తన దగ్గర మాత్రమే కాదు, మరే ఆశ్రమంలో కూడా ఉంచుకోకుండా చూడాలని అన్నాడు. మాతృదేవి కోపాన్ని ఆపుకోలేకపోయారు. “నా దగ్గరే నా బిడ్డలను గురించి ఇలా అనడానికి నీకెంత ధైర్యం? వారికి ఎక్కడా ఆశ్రయం ఇవ్వకూడదని నేను చెప్పాలి – ఇదే కదా నీకు కావాల్సింది! అలా ఎన్నటికీ నా నోటి నుండి రాదు. ఒక్క విషయం చక్కగా జ్ఞాపకం ఉంచుకో. వారందరూ నా బిడ్డలు, గురుదేవులను ఆశ్రయించిన వారు. వారందరూ ఎక్కడికి వెళ్లినా గురుదేవులు వారిని కాపాడతారు” అన్నారు ఆగ్రహంతో. మాతృదేవి ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె ముఖం చూడడానికే భయంకరంగా ఉండినదట! అంత ఆగ్రహోదగ్రులయ్యారు మాతృదేవి. తన తప్పును చివరకు గ్రహించిన ఆ స్వామి, మాతృదేవి పాదాలమీద పడి క్షమాపణ కోరుకున్నాడు. మఠానికి అధ్యక్షుడూ, ఇతరులూ ఒకరికొకరు సర్దుకుపోవాలి. అన్ని పరిస్థితులలోనూ బ్రతకడం నేర్చుకోవాలి. దానినే మహా తపస్సుగా నొక్కి చెప్పేవారు మాతృదేవి.
ఆదర్శ సమస్య
మఠంలో చేరిన యువకులు పలువురు ఒక సమస్యను ఎదుర్కోవలసి ఉండేది. స్వామీజీని పైపైన చదవడంతో పలువురికి ఎదురయ్యే సమస్యే అది. స్వామీజీ ఒక వ్యక్తికీ, ఒక దేశానికీ అంటూ కాకుండా మానవాళికే ఒక సందేశంతో ఏతెంచిన వారు. అందువల్ల వారి ఉపదేశాలు ఒక మనిషికీ మరో మనిషికీ, ఒక దేశానికీ మరో దేశానికీ భిన్నంగా ఉండవచ్చు. ఈ యువకు లందరూ స్వామీజీ దేశభక్తితో నిండిన, ఉత్తేజపూరితా లయిన ఉపన్యాసాలను చదివి మఠానికి వచ్చి చేరారు. కానీ మఠంలో చేరే వారికందరికీ స్వామీజీ ఆధ్యాత్మికానుభూతినే ఆదర్శంగా ఏర్పరచారు. ఇది పలువురిలో, గురుదేవుల ఇతర శిష్యులలో సైతం గందరగోళం సృష్టించింది. శ్రీ శారదానందస్వామి కూడా ఒకసారి స్వామి యోగానందతో, “యోగిన్, అప్పుడప్పుడూ నేను నరేన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆతను అనేక విషయాలు చెబుతున్నాడు. ఒక్క విషయాన్ని చెప్పేటప్పుడు అది మాత్రమే నిజం అన్నట్లుగా మరీ నొక్కి చెబుతున్నాడు. ఆ క్షణంలో ఆతను చెప్పిన ఇతర విషయాలు అర్థం లేనివిగా అనిపిస్తాయి” అంటూ తన మనస్సులో చెలరేగే పోరా టాన్ని గురించి చెప్పారు. అందుకు యోగానందస్వామి, “శరత్! నీకు ఒక్క విషయం చెబుతాను, నువ్వు మాతృదేవిని అనుసరించు! ఆమె చెప్పింది ఎప్పుడూ సరిగ్గానే ఉంటుంది” అన్నారు.
స్వామీజీ పాశ్చాత్యదేశాల నుండి తిరిగివచ్చి తమ ఆలోచనలకు ఒక స్పష్ట మయిన రూపం కల్పించే దాకా కొట్టుమిట్టాడుతున్న ఓడకు ఒక ఆరితేరిన సరంగులా వ్యవహరించారు మాతృదేవి. ఇలాంటి పోరాటంతోపాటు వచ్చిన సాధువులతో, “నాయనా! కేవలం దేశభక్తి ఏం సాధింపగలుగుతుంది? మన ఆదర్శం గురుదేవులే; గురుదేవులు మాత్రమే. నువ్వు ఏం చేయదలచుకున్నా అది చేయి; కానీ గురుదేవులను పదిలంగా పట్టుకున్నావంటే దారి తప్పిపోవు” అంటూ ఆ సమస్యకు పరిష్కారం చెప్పారు. వారి ఆధ్యాత్మిక శక్తి ఆ సన్న్యాసి జీవన విధా నాన్ని చక్కదిద్దుతుంది.
ఉన్నత ఆదర్శాన్ని ఆమోదించడం
అద్వైత అనుభూతినే ఉన్నతోన్నత ఆధ్యాత్మిక అనుభూతిగా మన ఉప నిషత్తులు వచిస్తాయి. ఆ ఉన్నత ఆదర్శాన్ని గమ్యంగా చేసుకుని, సాకార ఉపాసన లాంటి సాధనలు లేకుండా జ్ఞానయోగ సాధనలు మాత్రమే అనుష్ఠించే విధంగా రామకృష్ణ మఠాలలో ఒకటి నెలకొల్పాలని స్వామీజీ ఆశించారు. అందుకోసం హిమా లయాలలో మాయావతి అనే చోటును ఎన్నుకుని అక్కడ అద్వైత ఆశ్రమం నెల కొల్పారు. అక్కడ సాకార ఉపాసన లాంటిదేదీ ఉండకూడదని నొక్కి చెప్పారు. కాని దానిని కూడా లెక్కపెట్టక అక్కడున్న సాధువులు గురుదేవుల చిత్రపటం ఉంచి పూజ చేయసాగారు. స్వామీజీ ఈ చర్యను అంగీకరించలేదు. వెంటనే పూజను ఆపవలసిందిగా ఆజ్ఞాపించారు. అక్కడి సాధువులు స్వామీజీ ఆజ్ఞను శిరసావహించినా, ఒకరిద్దరికి అది నచ్చలేదు. స్వామీజీ నిర్యాణం తర్వాత మాతృ దేవికి ఈ విషయం తెలిపారు. ప్రతి రోజూ గురుదేవుల పూజ పునస్కారమంటూ గడిపే మాతృదేవి తప్పక తమకు మద్దతు నిస్తారని అనుకున్నారు. కానీ మాతృదేవి “గురుదేవులు ఒక అద్వైతి. వారు అద్వైతాన్నే బోధించారు. వారిని అనుసరించే వారందరూ అద్వైతవాదులే” అని బదులు చెప్పారు. అటు తర్వాత ఎలాంటి ప్రతి ఘటనా లేకుండా ఇప్పటికీ ఆ ఆశ్రమం అద్వైత ఆశ్రమంగానే కొనసాగుతూ వుంది.
వివేకానంద జీవితంలో
ఆదర్శం గురించిన సమస్యలలో మాత్రమే కాకుండా, స్వామి వివేకానంద మొదలైన గురుదేవుల శిష్యుల ప్రతి ఒక్కరి జీవితంలోనూ మాతృదేవి పొందిన చోటు అత్యంత ఉన్నతమైనది. పాశ్చాత్య దేశాలలో వేదాంత దుందుభిని మ్రోగించిన స్వామీజీ మాతృదేవి సమక్షంలో ఒక పసిబిడ్డగా మారిపోవడాన్ని చూచేటప్పుడు మనం ఆశ్చర్యపోతాం. స్వామీజీ లాంటి మహాత్ములు మాతృదేవిని ఆరాధించిన విధం చూసినప్పుడే మాతృదేవి ఔన్నత్యాన్ని మనం గ్రహించగలుగుతాం.
పాశ్చాత్య దేశాల నుండి తిరిగి వచ్చిన స్వామీజీ అక్టోబరు 1898 లో మాతృ దేవిని దర్శించుకోవడానికి వెళ్లారు. అప్పుడే ఆయన కాశ్మీర్ పర్యటించి తిరిగి వచ్చారు. కాశ్మీర్లో జరిగిన ఒక సంఘటన ఆయనను కొద్దిగా కలవరపరచింది. మాతృదేవిని చూసిన వెంటనే, “అమ్మా! మీ గురుదేవుల శక్తి అపారమే. కాశ్మీర్లో ఒక సాధువు ఉండేవాడు. ఆతని శిష్యుడు నా వద్దకు రాసాగాడు. అందువల్ల కోప గించుకున్న ఆ సాధువు నేను కడుపు నొప్పితో బాధపడుతూ మూడు రోజుల్లో అక్కణ్ణుండి వెళ్లిపోతారని శపించాడు. అలాగే జరిగింది కూడా! మీ గురుదేవులు నన్ను కాపాడలేకపోయారు” అన్నారు. అందుకు మాతృదేవి, “నాయనా! ఆ సాధువు పొందిన సిద్ధుల పర్యవసానమే అది. వాటి శక్తిని అంగీకరించే తీరాలి! గురుదేవులు వాటిని విశ్వసించరు. వారు దేనిని విధ్వంసం చేయడానికి రాలేదు. సకల మతాలను ఆయన అంగీకరించారు” అన్నారు. స్వామీజీ ఇక తాను గురు దేవులను అంగీకరింపబోనని అన్నారు. అందుకు మాతృదేవి కొద్దిగా హేళన చేస్తున్న ధోరణిలో, “నాయనా! అది నీ వల్ల జరిగే పనేనా? నీ జుట్టు వారి చేతిలో కదా వుంది!” అన్నారు.
మరొకసారి జరిగిన సంఘటనను గురించి మాతృదేవి ఇలా అన్నారు: ఒక సారి స్వామీజీ మాతృదేవి వద్దకు వెళ్లి “అమ్మా! అన్నీ నా వద్ద నుండి ఎగిరిపోతు న్నాయి. సకలమూ నన్ను వదలి ఎగిరిపోతూవుండడం నేను చూస్తున్నాను” అన్నారు. అందుకు మాతృదేవి చిరునవ్వుతో, “నరేన్ జాగ్రత్తగా ఉండు! నేను కూడా ఎగిరిపోకుండా చూసుకో” అన్నారు. వెంటనే స్వామీజీ, “మీరు నానుండి ఎగురుతూ వెళ్లిపోతే ఇక నా గతి ఏమవుతుంది? గురువు పాదపద్మాల మహ త్వాన్ని ఎరుగని జ్ఞానం జ్ఞానమనిపించుకొంటుందా? అది అజ్ఞానమే. గురువు పాదపద్మాల నుండి కాకుండా మరెక్కడ నుండి జ్ఞానం ఉత్పన్న మవుతుంది?” అంటూ బదులు చెప్పారు.
మాతృదేవి మాటలను వేదవాక్కుగా మారు పలుకక ఆమోదించేవారు స్వామీజీ. బేలూరు మఠంలో పనిచేస్తున్న ఒకణ్ణి దొంగిలించినందుకు బయటికి పంపించేశారు స్వామీజీ. తన తప్పును గ్రహించి క్షమాపణ కోరుతూ అతడు ఉద్బోధన్కు పరుగెత్తి మాతృదేవి పాదాలను ఆశ్రయించాడు. మాతృదేవి ఆతణ్ణి క్షమించకుండా ఉండలేకపోయారు. ఆ రోజు మధ్యాహ్నం ప్రేమానందస్వామి కాకతాళీయంగా మాతృదేవి దర్శనార్థం వచ్చారు. మాతృదేవి ఆయనను పిలిచి, “బాబూరాం! ఇదిగో చూడు, ఈతడు పరమ దరిద్రుడు. దారిద్ర్యమే వాణ్ణి దొంగ లించేలా చేసింది. అందుకోసం నరేన్ ఆతణ్ణి చీవాట్లుపెట్టి బయటికి పంపేయ డమా? ఈ లోకం దుఃఖాలతోనూ, ఆవేదనలతోను నిండినది నాయనా! మీరం దరు సన్న్యాసులు. ఇవన్నీ మీకు ఎలా అర్థమవుతాయి? అది పోనీలే! ఈతణ్ణి తీసు కెళ్లు” అన్నారు. ఆతణ్ణి తీసుకెళితే స్వామీజీ కోప్పడతారని చెప్పడానికి ప్రయ త్నించారు స్వామి ప్రేమానంద. కానీ మాతృదేవి ఆయనను మాట్లాడనివ్వకుండా, కాస్త గంభీర స్వరంలో, “నేను చెబుతున్నాను. నువ్వు తీసుకెళ్లు” అన్నారు. ఇక గత్యంతరంలేక ఆతణ్ణి తమతో తీసుకెళ్లారు స్వామి ప్రేమానంద. ఆతణ్ణి చూడగానే స్వామీజీ, “బాబూరాం తెలివి చూడు! ఆ దొంగను మళ్లీ తీసుకొచ్చాడు” అన్నారు కోపంతో. కానీ ఉద్బోధన్లో జరిగింది వివరించిన తర్వాత స్వామీజీ మారు మాట్లాడక మౌనంగా ఉండిపోయారు.
సన్న్యాసుల జీవితంలో మాతృదేవి స్థానం
స్వామీజీ మాత్రమే కాకుండా గురుదేవుల శిష్యులలో ప్రతి ఒక్కరూ మాతృ దేవిని తమ తల్లిగాను, గురువు గాను, దేవి గానూ చూశారు. వారికి తర్వాత సంఘ గురువు మఠంలో చేరిన మరొక తరం వారికి గురుదేవులను ప్రత్యక్షంగా దర్శించుకునే భాగ్యం లేకపోయింది. అందువలన వారందరూ మాతృదేవినే ఆశ్రయించారు. సన్న్యాస జీవితంలో బోధనలవల్లా, అభ్యాసం వల్లా మాతమ్రే విజయం సాధించడం కఠినం. సాధువు తన జీవితాన్ని ఆదర్శప్రాయంగా మలచుకోవడానికి ఒక ఆదర్శ జీవితం ఆతని కళ్లముందు మెదలాలి. ఆతడు అలసిపోయే సమయాల్లో ఆతడికి నూతనోత్సాహం ఇవ్వడానికి శక్తిమంతుడైన ఒక గురువు కావాలి. గురు దేవులు అస్తమించిన ఆ సమయంలో ఆస్థానాన్ని అలంకరించారు మాతృదేవి. ఉప దేశాలు, మార్గదర్శకత్వాల కన్నా ఇది అత్యంత ముఖ్యమయినది. అలసిసొలసి పోయిన సమయాల్లో వారందరు మాతృదేవిని ఆశ్రయించారు. మాతృదేవి పవిత్ర జీవనం వారందరిలో నూతన శక్తిని నింపింది. అందువల్ల నూతనోత్సాహంతో తీవ్రమైన సాధనలను అనుష్ఠించగలిగారు. కలకత్తాకు వెళ్లినప్పుడు వీలు దొరికి నప్పుడల్లా బేలూరు మఠానికి వెళ్లేవారు మాతృదేవి. కచ్చితంగా దుర్గాపూజ లాంటి పండుగ రోజుల్లో పలుసార్లు వేంచేసి ఉన్నారు. మాతృదేవి రాక సాధువుల సాధనామయ జీవితాలలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఎంతగానో పెంపొందించేది.
సాధువులలో సన్న్యాస ఆదర్శాన్ని చక్కగా రగుల్కొలిపి మాతృదేవి కుటుం బంలోనే జీవించారు. కుటుంబంలో జీవిస్తూనే గృహస్థుల, సన్న్యాసుల ఆధ్యాత్మిక పంధాను ఉజ్వలం చేశారు; ఆధ్యాత్మిక అనుభవాలను విరివిగా పంచిపెట్టారు. ఇది చరిత్ర గాంచిన అద్భుతం.
గురుదేవి స్థితిలో మాతృదేవి కొన్ని తీర్థ స్థలాలను దర్శించడం చూశాం. ఇప్పుడు ఆమె దక్షిణ ప్రాంతాలకు వెళ్లిన వివరాలను పరికిద్దాం.