మాతృదేవి భావి జీవితం –ఒక పరిశీలన
సంఘ జననిగా తమ కార్యం ప్రారంభించిన తర్వాత మాతృదేవి ఈ ఇలలో దాదాపు ఇరవై సంవత్సరాలు జీవించారు. ఈ కాలంలోనే ఆమెను గురించి ప్రజానీకానికి తెలియవచ్చింది. పండితులు – పామరులు; ధనికులు – పేదలు; వృద్ధులు – యువకులు; స్త్రీలు – పురుషులు అనే తారతమ్యం లేక అసంఖ్యాకులు ఆమెను ఆశ్రయించి రాసాగారు. వచ్చిన వారందరూ ఆమె ప్రేమ వృష్టిలో తడిసిపోయారు; ఆధ్యాత్మికంగా పురోగతి పొందారు: ఇలా గురుదేవిగా ఒక వైపు; ఈ ప్రేమనో, ఆధ్యాత్మిక ఉన్నతినో కాంక్షించకుండా ఎంత ధనం లభి స్తుందా అంటూ పోటీ లుపడుతూ ఆమెను అంటిపట్టుకునివున్న కుటుంబం పెద్దగా మరోవైపు. ఇక దేనిని గురించీ, ఎవరిని గురించీ పట్టించుకోకుండా ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో మార్పులను తెస్తూ పరుగులు తీసే కాలం ఆమె జీవితంలో కల్పించిన సంఘటనలు ఒక వైపు. ఇలా ముక్కోణంగా సాగింది మాతృదేవి జీవితం. కానీ వీటిలో దేనివల్ల నైనా స్వల్పంగా కూడా బాధింపబడకుండా వీటి నన్నిటికి అతీతంగా నిలిచారు మాతృదేవి. ఒక గోపురం మీద నిలబడి అన్నిటిని సమంగా చూసే* వ్యక్తిలా ఎప్పుడూ సమతా స్థితిలో నెలకొన్న యోగినిగా, శ్రీరామ కృష్ణులలో నెలకొన్న జ్ఞానిగా, శ్రీరామకృష్ణుల చింతనలతో ఆనందించే భక్తు రాలిగా, ఒక్క క్షణం కూడా వ్యవధి లేకుండా పనిచేసే కర్మయోగిగా, అంతటికీ పరాకాష్టగా ఇప్పటి దాకా మానవాళి కనీవినీ ఎరుగని మాతృమూర్తిగా జీవిం చారు మాతృదేవి.
ఇలాంటి ఒక మహోన్నత జీవితాన్ని అన్ని పరిమాణాలతో వివరించడం మానవప్రయత్నానికి మించిన పని. అందువల్ల ఇప్పుడు మనం చూసిన ముక్కో ణపు జీవితాన్నీ, అది మనకు అందించే సందేశాన్ని మాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మాతృదేవి ముక్కోణపు జీవితంలో ఒక్కదాన్ని మాత్రం ప్రత్యేకంగా తీసుకొని పరిశీలించడం కష్టం. ఎందుకంటే జీవితంలో చోటుచేసుకున్న సంఘ టనలు, కుటుంబ పెద్దగా మహిళా లోకానికి ఆదర్శప్రాయంగా జీవితం గడప డమూ, గురువుగా ఉంటూ సన్న్యాసులకూ, గృహస్థులకూ మార్గదర్శకత్వం వహిం చడం – ఏకకాలంలో జరిగినవి; ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవి. కానీ మనం అర్థం చేసుకోవడానికి వాటిని విభజించి చూడవలసివుంది.
ఇంతదాకా గురుదేవులతో మాత్రమే ముడిపడివున్న మాతృదేవి జీవితం ఈ కాలఘట్టంలో భక్తులు, శిష్యులు, బంధువులు అంటూ పలువురితో పెనగొని ఉంది. ఈ కొందరు లేకపోయివుంటే మాతృదేవి జీవితం అందించే సందేశం, దాని పలు పరిమాణాలు మనకు మృగ్యమై ఉండేవి. వారిలోని భక్తులు కొందరిని ఈ అధ్యాయంలో చూద్దాం. వీరిలో ఒకరు ఈ జీవిత చరిత్రలో ఇప్పటికే కొన్నిచోట్ల తారసపడ్డారు. ఇక్కడ కొంత వివరంగా తెలుసుకుందాం.
మాతృదేవి భారవాహకుల
భగవంతుడు అవతరించేటప్పుడు, వారి లౌకిక జీవన బాధ్యతను తీసుకోవ డానికి కొన్ని ఉన్నతాత్మలు కూడా వారితోబాటు జన్మిస్తాయి. అవతార పురుషుల జీవితాన్ని పైపైన చూసినప్పుడు మన జీవితాలలా సాధార ణంగా కనిపిస్తాయి. కానీ ఈ రెండింటికి హస్తిమశ కాంతరం ఉంటుంది. అనేక ఆధ్యాత్మిక సాధనల మూలంగా ఉన్నత స్థితికి చేరుకున్నవారే అవతార పురుషులకు సేవ చేయ గలుగుతారు. అందువల్ల ఈ ఉన్నతాత్మలు అవతార పురుషులతోపాటు జన్మించి వారి లౌకిక జీవితాన్ని సులభతరం చేయడంతోపాటు వారి అవతార కార్యంలో పాలుపంచుకుని వారి సందేశాన్ని కూడా మానవాళికి వ్యాపింపచేస్తారు. ఇలా గురుదేవులతో వచ్చిన కొందరు మాతృదేవి జీవితంతో కూడా అనుబంధం ఏర్పరచుకొన్నారు.
మాతృదేవికి సేవ చేయడం ఒక రకంగా గురుదేవులకు సేవ చేయడం కంటే కష్టం. మాతృదేవికి సంబంధించినంతవరకు ఆమెకు సేవ చేయడంలో ఎలాంటి ఇబ్బందీ లేదు. కానీ ఆమెను చుట్టుముట్టివున్న బంధుగణాన్ని మేపడం ఎంతో కష్టం. సగం పిచ్చి, ముప్పావు పిచ్చి అంటూ ఒక్కొక్కరు ఒక్కో రకం! మాతృదేవి జయరాంబాటి నుండి కలకత్తాకో, లేకపోతే కలకత్తా నుండి జయ రాంబాటికో వెళ్లాలంటే ఈ పరివారమంతా కలిసి వెళ్లడానికి కనీసం నాలుగు ఎడ్లబండ్లు కావాల్సి వచ్చేదట! ఈ పరిస్థితిలో మాతృదేవికి సేవ చేయడం అంత సులభమయిన పనా? ఒక శిష్యునితో మాతృదేవి, “నాకు సేవ చేయడానికి మంచి సాధువుగా ఉన్నంత మాత్రాన సరిపోదు, కార్యశూరులై ఉండాలి” అని అన్నారట. అలాంటి కార్యశూరులైన ఇద్దరు సన్న్యాసులను మాత్రమే తమ ‘భారవాహకులు’ గా పేర్కొన్నారు. వారు శ్రీ యోగానందస్వామి, శ్రీ శారదానంద స్వామి.
స్వామి యోగానంద
స్వామి యోగానంద యోగిన్ అనే పేరిట ఇప్పటికే పరిచయమయినారు. ఈయన మాతృదేవికి ప్రథమ శిష్యుడు. దక్షిణేశ్వర రోజుల నుండే మాతృదేవికి పనులలో సాయపడిన ఈయన తన అంతిమకాలం వరకు మాతృదేవిని భక్తిప్రపత్తులతో సేవించాడు. మాతృ దేవి బృందావనం నుండి కామార్పుకూర్కు వెళ్లినప్పుడు ఆమెతో పాటు వెళ్లి, తర్వాత కాశీకి పోయి కఠోరమైన తపోజీవితం గడిపారు. పిదప తిరిగివచ్చి బలరాంబోస్ ఇంట్లో నివసించారు. మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడల్లా, ఆమెకు అవసరమైన సేవలు చేశారు. మాతృదేవి నివసిస్తున్న ఇంటికి బయట ఒక గదిలో ఉంటూ, భక్తులు తీసుకువచ్చే కానుకలను తీసి పదిలపరచడమూ, మాతృదేవికి అనుకూలపడిన సమయంలో భక్తులను ఆమె దర్శనానికి పంపడమూ చేస్తూ, మాతృదేవి కలకత్తా జీవితం నిరాటంకంగా సాగడానికి తన శక్తిమేరకు కృషి చేశారు. తీవ్ర వ్యాధిగ్రస్తులై ఉన్నప్పుడు సైతం ఈ సేవలను ఆపకుండా చేశారు.
స్వామి యోగానంద పట్ల మాతృదేవి కున్న వాత్సల్యాన్ని తెలిపే ఒక సంఘటనను ఇక్కడ పేర్కొనవచ్చు. మాతృదేవికి పత్తితో తయారుచేసిన ఒక దళసరి రజాయిని స్వామి యోగానంద ఇచ్చారు. మాతృదేవి ఆ దుప్పటిని అనేక సంవత్సరాలు వాడడం వల్ల అది పిగిలిపోయి, చిరిగిపోయింది. అందువల్ల దానిని విప్పి కొత్తగా పత్తిని కలిపి కుట్టడానికి ఏర్పాటు చేశారు. కానీ కాసేపటికల్లా అలా చెయ్యవద్దని వారించి, చిరిగిపోయిన ఆ దుప్పటిని తీసుకుని వాత్సల్యంతో తన వద్దే ఉంచుకున్నారు. “నా తనయుడు యోగిన్ ఇచ్చిన రజాయి ఇది. ఇది ఎప్పుడు అతణ్ణి జ్ఞాపకం చేస్తూ వుంటుంది” అన్నారు. తమ ప్రేమకు అర్హులైన వారు ఇచ్చే చిన్న వస్తువును కూడా వాత్సల్యంతో దాచి పెట్టుకోవడం మాతృదేవి నైజం.
తనకు లభించే స్వల్ప పైకాన్ని కూడా మాతృదేవి కోసం కేటాయించే వాడు యోగిన్. జగద్ధాత్రీ పూజ లాంటి పర్వదినాలలో మాతృదేవి పాత్రలు తోముతూ శ్రమపడడం చూసిన యోగిన్, చెక్క పాత్రలను కొనిచ్చాడు.
కానీ మాతృదేవి విలపించి కుమిలిపోయేటట్లు స్వామి యోగానంద 1899 మార్చి 23 వ తేది చిన్నవయస్సులోనే కన్నుమూశాడు. అప్పుడు మాతృదేవి కుమిలి పోతూ, “కట్టడంలోని ఒక రాయి పడిపోయింది. తక్కినవి కూడా ఇక పడిపోవడం ప్రారంభమవుతుంది” అన్నారు.
కాలాంతరంలో మాతృదేవి అప్పుడప్పుడూ యోగానంద స్వామిని తలచు కుంటూ, “యోగిన్లా నాపట్ల ఆప్యాయంగా ఉన్నవారు ఎవరూ లేరు. ఆతనికి ఎవరైనా ఎనిమిది అణాలిస్తే దానిని ఖర్చు పెట్టకుండా, ‘మాతృదేవి ప్రయాణా లకు కావలసి వస్తుంది’ అంటూ దానిని విడిగా ఉంచేవాడు. ఏ సమయంలోనైనా నాకు సేవ చేస్తూనే ఉండేవాడు. ఆతడు నాతోనూ, నా కూడా ఉన్న ఇతర స్త్రీల తోనూ ఉంటున్నప్పుడు – చూసి, గురుదేవుల ఇతర శిష్యులు ఆతణ్ణి ఎగతాళి కూడా చేసేవారు” అన్నారు.
స్వామి త్రిగుణాతీతానంద
యోగానంద స్వామి తర్వాత శారదానంద స్వామి బాధ్యతలను తీసుకోవ డానికి ముందు బ్రహ్మచారి కృష్ణలాల్, స్వామి త్రిగుణాతీతానంద కొంతకాలం మాతృదేవికి సేవలు చేశారు. తర్వాత కాశీపూర్ రోజుల లోనే మంత్రదీక్ష కోసం మాతృదేవి వద్దకు పంపబడ్డారు. యోగానంద మరణానంతరం 1902 వ సం ॥ వేదాంత ప్రచారం కోసం అమెరికాకు వెళ్లే దాకా మాతృదేవికి సేవలు చేశారు. మఠ వంగ భాష మాసపత్రికయైన ఉద్బోధన్కు సంపాదకునిగా వ్యవహరిస్తూ మాతృదేవికి సేవలను కూడా ఆయన అందించడం గమనార్హం.
త్రిగుణాతీతానంద మాతృదేవి పట్ల ప్రదర్శించింది ఒక రకమైన మొరటు భక్తి అనవచ్చు. ఉదాహరణకు ఒకటి రెండు సంఘటనలు చూద్దాం. ఒకసారి మాతృదేవి బర్ద్వాన్ నుండి జయరాంబాటికి తమ పరివారంతో ఎడ్ల బండిలో వెళుతున్నారు. బండికి ముందు త్రిగుణాతీతానంద భుజం మీద ఒక కఱ్ఱ ఉంచు కుని ఒక భటునిలా నడుస్తున్నాడు. అది వానాకాలం. రాత్రి మూడవయానం అయివుంటుంది. ఆ దారి వర్షం వల్ల కోతకు గురియై మధ్య మధ్య గుంటలు పడ్డాయి. అలాంటి ఒక గుంట దగ్గరికి బండి వచ్చింది. బండి గుంటలోకి దిగితే ఆ కుదుపుకు మాతృదేవికి నిద్రాభంగం కలుగవచ్చు. అది గుర్తించి స్వామి ఆ గుంటలో తాను వెళ్లి పడుకుని తనపై బండిని నడపమని బండి వాడితో చెప్పాడు. కానీ మేలుకునేవున్న మాతృదేవి త్రిగుణాతీతానంద చేయబోయే పని గమనిం చారు. వెంటనే బండి నుండి దిగి ఇలాంటి మొరటు పనులకు దిగవద్దని గట్టిగా చెప్పారు.
త్రిగుణాతీతానంద మాతృదేవి పట్ల కనబరచిన మొరటు భక్తికి మరొక ఉదాహరణ: ఒకసారి గోలాప్ మా మాతృదేవి కోసం బాగా కారంగా ఉన్న మిరపకాయలు కొనుక్కురమ్మన్నారు. స్వామి బజారు వీథిలో సుమారు మూడు మైళ్లు నడచి ప్రతి అంగడికీ వెళ్లి ఒక మిరపకాయను కొరికి చూసి బాగా కారంగా ఉన్న మిరపకాయలు కొనుక్కువచ్చారు. అనేక మిరపకాయలు కొరికినందున ఆయన నాలుక, పెదవులు చెప్పలేనంత మంటలతో వాచిపోయాయి. అవి నయ మవడానికి కొన్ని రోజులు పట్టింది.
స్వామి శారదానంద
అమెరికా వెళ్లిన తరువాత ప్రతి నెలా ఆయన మాతృదేవికి డబ్బు పంపే వారు. స్వామి శారదానంద తమ పేరుకు తగ్గట్లు శారదా – ఆనందులై ఉన్నారు. మాతృదేవి సేవకు తమను పూర్తిగా అంకితం చేసు కొన్నారు. మాతృదేవి జయరాంబాటిలో ఉన్నా కలకత్తాలో ఉన్నా ఆమె యోగక్షేమాలను చూసుకోవడం ఆయన ప్రథమ కర్తవ్యం. మాతృదేవి పట్ల ఆయనకున్న భక్తిప్రపత్తులు వర్ణనాతీతం. ఉద్బోధన్ ఇంట్లో ప్రవేశ ద్వారం దగ్గరున్న చిన్న గదిలో కూర్చొని మాతృదేవిని దర్శించడానికి వచ్చే భక్త సమూ హాన్ని వరుస ప్రకారం పంపించేవారు. కొత్తగా వచ్చేవారికి ‘మాతృదేవి ద్వార పాలకుడు’ అని తనను పరిచయం చేసుకునేవారు. ఎలాగైనా దేని ద్వారానైనా మాతృదేవికి సేవ చేయడం మహాభాగ్యమని వ్యక్తపరచేదిగా ఉండేది ఆయన ప్రవర్తన. ఒక రోజు భక్తుడొకడు మేడమీద ఉంటున్న మాతృదేవిని దర్శించిన తర్వాత క్రింద శారదానంద వద్దకొచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు. కార్య నిమగ్నులైవున్న స్వామి తలెత్తి, “ఏమిటయ్యా! ఎందుకు ఇంత పెద్ద నమస్కారం?” అని అడిగారు. అందుకు ఆ భక్తుడు, “మీకు తప్ప మరెవరికి ప్రణమిల్లాలి స్వామి?” అన్నాడు. వెంటనే ఆయన అమిత వినమ్రతతో, “అలా అనకు! నువ్వు ఎవరి ఆశీస్సులను పొంది వస్తున్నావో, వారి ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్న వాణ్ణి నేను. ఆ మాతృదేవి తలచుకున్నారంటే ఈ క్షణమే నిన్ను నా స్థానంలో కూర్చోపెట్టగలరు” అన్నారు. ఇట్లే మాతృదేవి కూడా శారదానంద పట్ల అత్యంత ప్రేమాభిమానాలతో మెలగారు. క్రింది సంభాషణ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఒక రోజు మాతృదేవి స్వామి అరూపానందతో, “శరత్, ఉన్నంతవరకే నేను ఉద్బోధన్లో నివసింపగలుగుతాను. నా బాధ్యతలను గ్రహించి నిర్వహించగల వారు ఆతడు తప్ప మరెవరూ లేరు. నా భారాన్ని వహింపగలవాడు శరత్ ఒక్కడే” అన్నారు.
అరూపానంద: స్వామి బ్రహ్మానంద ఉన్నారు కదా!
మాతృదేవి: ఆతను చేయలేడు. ఆతని మనోవైఖరి వేరు.
అరూపానంద: స్వామి ప్రేమానంద?
మాతృదేవి: ఆతను చేయలేడు.
అరూపానంద: కానీ ఆయన బేలూరు మఠాన్ని నిర్వహిస్తున్నారు కదా!
మాతృదేవి: కావచ్చు. కానీ ఒక స్త్రీ అవసరాలను గ్రహించి తదనుగుణంగా వ్యవహరించడం ఎంతో కష్టం. శరత్ మాత్రమే అందుకు సమర్థుడు.
మాతృదేవి సేవకు డబ్బు ఖర్చు ఒక వైపు వుండగా, అప్పుడప్పుడూ కోప గించుకునీ, మాతృదేవినే తప్పులు పట్టే బంధువులకు గూడా ప్రేమతో సేవ చేయడం సామాన్యమయిన పనికాదు. శారదానంద ఇలాంటి పనులన్నిటినీ ఎంతో సంతోషంతోనూ, అక్కర సమర్థతలతోనూ నిర్వహించారు. ఆ కారణంగా మాతృదేవి అవ్యాజ ప్రేమను, విశ్వాసాన్ని చూరగొన్నారు. శారదానంద కలకత్తాలో లేనప్పుడు మాతృదేవి అక్కడికి వెళ్లేవారు కారు. “శరత్ కలకత్తాలో లేనప్పుడు నేను అక్కడికి వెళ్లే ప్రసక్తే లేదు, ఎవరిని నమ్ముకుని నేను వెళ్లను? కలకత్తాలో నేను ఉంటున్నప్పుడు శరత్ బయటమారికి వెళుతున్నట్లు నాతో చెబితే, నేను అతనితో ఏమంటానో తెలుసా? ‘నాయనా! కాసేపుండి నన్ను ముందుగా ఇక్క ణ్ణుండి పంపించేయి. ఆ తర్వాత నువ్వు ఎక్కడకు కావలసినా వెళ్లు’ అని అంటాను” అనేవారు.
ఒకసారి రాంచీకి చెందిన భక్తుడొకడు మాతృదేవిని తమ ఊరికి రమ్మని ఆహ్వానించారు.
మాతృదేవి: శరత్‌కు ఈ విషయం తెలుసా?
భక్తుడు: తెలియదు.
మాతృదేవి: అలా అయితే నేను రాలేను. నేను కలకత్తాకు వెళుతున్నాను, ఆతడు అంగీకరిస్తే తరువాత చూద్దాం!
భక్తుడు: అమ్మా! మీరు బసచేయడానికి తగిన ఏర్పాట్ల నన్నిటిని చేశాం.
మాతృదేవి: నాకు చెప్పకుండా ఎందుకు చేశారు?
మాతృదేవి చాలా పట్టుదలగా ఉండడం చూసిన భక్తుడు ఇక చేసేదిలేక వెళ్లిపోయాడు. ఆతను వెళ్లిపోయిన తర్వాత మాతృదేవి అక్కడ ఉన్న ఒక భక్తురాలితో, “ఇదిగో చూడమ్మా! నన్ను తీసుకెళ్లడం అంత సులభం అనుకుంటారు. నాకు చెప్పకుండానే ఢాకాలో ఒకసారి కరపత్రాలు ముద్రించి నేను వస్తున్నట్లుగా ప్రకటించారు. నలుగురు కలిసి, సమావేశం జరిపి హంగామా చేసేస్తే అంతా అయిపోయినట్లుగా భావిస్తారు. రెండు మూడు రోజులు అందరూ సేవ చేయవచ్చు. కానీ నా బాధ్యతను తీసుకోవడం అంత సులభమయిన పనా ఏమిటి? శరత్ తప్ప మరెవరూ దీనిని నిర్వహించలేరు. ఆతడు నా వాసుకి.* వేయి పగడలతో ఆతడు ఎన్ని పనులను చేస్తున్నాడు! ఎక్కడ ఒక బొట్టు నీరు పడినా అక్కడ గొడుగుతో సిద్ధంగా ఉంటాడు” అని చెప్పారు.
ఉద్బోధన్ గృహం
రామకృష్ణ మఠంలోని సాధువులకూ, బ్రహ్మచారులకూ, ఇతర భక్తులకూ ఆశీస్సులందించడానికి మాతృదేవి అప్పుడప్పుడూ కలకత్తా వచ్చేవారు. అక్కడ ఆమె బసచేయడానికి ఒక స్థిరమైన నివాసం లేదు. ఆమెకు ఒక ఇల్లు నిర్మించడానికి శారదానంద ఎంతో శ్రమపడ్డారు. మఠ ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. అయినా అప్పు చేసి అయినా మాతృదేవి కంటూ ఒక ఇల్లు కట్టాలని తీర్మానించారు. అలాగే తమ సొంతబాధ్యత మీద అప్పుచేసి ఒక ఇల్లు కట్టారు. కొత్తగా కట్టిన ఇంటి మేడ మాతృదేవి కంటూ ప్రత్యేకింపబడింది. 1909 మే 23 వ తేది మాతృదేవి ఆ ఇంటికి ప్రప్రథమంగా వచ్చి అనుగ్రహించారు. మఠ వంగభాష మాసపత్రిక ‘ఉద్బోధన్’ కార్యాలయానికి కూడ చోటు కావాల్సి వచ్చింది. అందువల్ల పత్రిక కార్యాలయం కొత్త ఇంట్లో క్రింద భాగంలో పనిచేయసాగింది. ఆ ఇంటిని భక్తులు ‘మాయేర్ బాడి’ (మాతృదేవి ఇల్లు) అని పిలుస్తారు. ప్రజలు దానిని ఉద్బోధన్ అని పిలిచేవారు. ఇల్లు కట్టి ముగించిన తర్వాత అప్పు తీర్చడానికి గురుదేవుల జీవిత చరిత్రను* రచించి ప్రచురించారు శారదానంద.
తాను వంగ భాషలో వ్రాసిన ‘శక్తి పూజ’ అనే పుస్తకాన్ని మాతృదేవికే అంకితం చేసి, “ఎవరి అవ్యాజ కరుణవల్ల స్త్రీలందరిలోనూ జగన్మాతను దర్శించే భాగ్యాన్ని ఈ గ్రంథ రచయిత పొందాడో, ఆ మాతృదేవికి ఈ గ్రంథాన్ని శ్రద్ధా భక్తులతో అంకితం చేస్తున్నాను” అంటూ వ్రాశారు.
అవసానకాలంలో మాతృదేవి ఒక రోజు, “ఈ జీవితంలో నేను బాగా అలసిపోయాను. నేను వెళ్లిపోదలచుకొన్నాను. నా తనయుడు శరత్‌ను నా చేతు ల్లోకి తీసుకుని నేను వెళ్లే లోకాలన్నిటికి ఆతణ్ణి కూడా తీసుకెళతాను” అన్నారు. ఎన్నడూ ఉద్రేకపూరితులు కాని శారదానంద, మాతృదేవి మాటలు విని పసిబాలు నిలా కూర్చొని చాలాసేపు వెక్కివెక్కి ఏడ్చారట.
భక్తురాండ్రు
శ్రీరామకృష్ణుల ఈ సన్న్యాస శిష్యులతోపాటు ఆయన శిష్యురాండ్రు పలు వురు కూడా మాతృదేవి జీవితాంతం ఆమెకు సహాయంగా నిలబడ్డారు. వారిలో గోలాప్ మా, యోగిన్ మా, గౌరీమా, లక్ష్మీదేవి, గోపాలేర్మా ప్రభృతులు ముఖ్యులు. వీరిలో సన్న్యాసం స్వీకరించిన గౌరీమా తప్ప ఇతరులు వితంతువులు. వారందరూ జపం, ధ్యానం, సేవతో కూడిన పవిత్ర జీవితం గడిపినవారు.
గోలాప్ మా
గోలాప్ మా మాతృదేవికి సహాయంగా ఉండడం మాత్రమే కాక చాలా సన్నిహితంగా కూడా ఉన్నారు. దాదాపు ఆమెకు సంరక్షురాలనవచ్చు. ఆమె కులీన కుటుంబంలో జన్మించారు. అయినా పేదవారు, బ్రాహ్మణులు. ధనవంతుల ఇంట్లో తన కుమార్తెను ఇచ్చి, తర్వాత ఆమెను కోల్పోయిన దుఃఖం నుంచి బయటపడడానికి, గురుదేవులను ఆశ్రయించారు. గురుదేవులు ఈమెను మాతృదేవికి పరిచయం చేస్తూ, “ఈమెను జాగ్రత్తగా చూసుకో జీవిత మంతా నీతోపాటు ఉంటుంది” అన్నారు. గురుదేవులు చెప్పినట్లే, మాతృదేవి ఎక్కడికి వెళ్లినా నీడలా ఆమెను అనుసరించి ఉండేవారు. మాతృదేవి చేసిన తీర్థయాత్ర లన్నిటిలోనూ పాల్గొన్నారు. మాతృదేవి కలకత్తాలో ఉంటున్నప్పుడు ఆమెతోపాటే ఉండి ఇంటి బాధ్యతలనన్నిటిని నిర్వహించారు. అంతేకాక ఇబ్బందులు కలిగించే మతిలేని భక్తుల బారి నుండి మాతృదేవిని పరిరక్షించే కర్తవ్యం కూడా ఆమెదే. మాతృదేవి సామాన్యంగా భక్తులతో (పురు షులు) సూటిగా మాట్లాడరు. చీరకొంగుతో ముఖం కప్పుకుని కాస్త దూరంలో నిలబడి అతిమెల్లగా మాట్లాడతారు. అప్పుడు గోలాప్ మా మాతృదేవి ఆశీస్సు లను, ప్రశ్నలకు ప్రత్యుత్తరాలను ఆ భక్తులకు బిగ్గరగా చెప్పేవారు. వృద్దాప్యంలో మాతృదేవి బండిలో ఎక్కడానికి, దిగడానికి గోలాప్ మా సహాయపడేవారు. నడుచుకుంటూ వెళ్లేటప్పుడు మాతృదేవి గోలాప్ మాను వెంబడించేవారు. భక్తుల ఇళ్లకు వెళ్లేటప్పుడు తప్పకుండా గోలాప్ మాను తమ వెంట తీసుకెళ్లేవారు. ఆమె లేకుండా వెళ్లేవారు కారు. “ఆమె లేకపోతే నేను ఎలా వెళ్లగలను? ఆమె నాతో ఉంటే నాకు కొండంత ధైర్యం” అనేవారు మాతృదేవి.
గోలాప్ ఆదర్శప్రాయురాలైన ఆధ్యాత్మిక సాధకురాలు; ఉన్నతమైన ఆధ్యా త్మిక అనుభవాలు పొందిన వ్యక్తి. ఉదయం, సాయంత్రం కొన్ని గంటలు ధ్యానంలో గడిపేవారు. మాతృదేవి ఆమె పావన మానసాన్ని శ్లాఘించేవారు. జపం చేయడంలో పూర్ణమైన స్థితిని ఆమె సంతరించుకొన్నట్లు చెప్పేవారు. కొందరు స్త్రీలలో అతిగా కనబడే లజ్జ ఆమెలో లేదు. అందువల్ల లజ్జాస్వరూపిణి అయిన మాతృదేవికి, భక్తులకు మధ్య ఒక వారధిగా ఆమె మనగలిగారు.
ఏ విషయాన్నైనా ఉన్నదున్నట్లు మాట్లాడే స్వభావురాలు గోలాప్ మా. అది ఎవరయినా సరే, చెప్పవలసిన దానిని ముక్కుసూటిగా చెప్పేస్తారు. ఇందుకోసం మాతృదేవి ఆమెను కొన్నిసార్లు కోప్పడడం కూడ కద్దు. గోలాప్ మా మాటలు నిజమే అయినా, “ఇతరుల మనస్సుకు బాధ కలిగించే నిజాన్ని సైతం చెప్ప కూడదు. అలాంటి నిజాలను చెప్పడం కొన్ని సమయాలలో పాపం క్రిందే లెక్క” అని గట్టిగా చెప్పేవారు. గోలాప్ మా ముక్కుసూటిగా చెప్పేస్తుంది; అందరిమీద అధికారం చలాయిస్తుంది. కానీ ఆమె మనస్సు సున్నితమని అందరికీ తెలుసు. ఆమె సేవానిరతి అద్భుతమైనది. స్నానం చేసే గట్లమీద ఎవరైనా మలిన పరచివుంటే వెంటనే అక్కడ కడిగి శుభ్రం చేసేవారు.
గోలాప్ మా తన మనుమడి నుండి ప్రతినెలా కొంత డబ్బు సహాయంగా పుచ్చుకొనేది. అందులో సగం తమ ఖర్చులకోసం ఉద్బోధన్ కార్యాలయంలో వెల్లించేది. మిగిలిన డబ్బును పేదవారికి పంచిపెట్టేది. మాతృదేవికి భక్తులైన వైద్యులను నిరుపేద రోగుల ఇళ్లకు తీసుకెళ్లి ఉచితంగా చికిత్సలు చేయించేది.
ఉద్బోధన్లో ఆమె దైనందిన జీవితం ఇలా ఒక మహోన్నత సేవగా సాగింది. ఇంటి పనులనన్నిటినీ ఆమె చూసుకొనేది. భక్తులకు ప్రసాదాలు పంచి పెట్టేవారు. మాతృదేవితోపాటు ఉంటున్న సాధువులకు తల్లిలా కావలసింది సమ కూర్చేవారు. మాతృదేవి మీద అత్యంత ప్రేమతో, మాతృదేవి కోసమే జీవించిన ఆమె, మాతృదేవి నిర్యాణానికి నాలుగు సంవత్సరాల తర్వాత, 1924 డిసెం బరులో కన్నుమూశారు.
యోగిన్ మా
మాతృదేవికి సహాయకురాలిగా జీవించిన వారిలో సన్నిహితులైన మరొకరు యోగిన్ మా. ఈమె కూడా మొదటి నుంచీ మాతృదేవితోపాటు ఉన్నారు. “యోగిన్, గోలాప్ నా జీవితంలో ప్రతి పరిస్థితినీ ఎరుగుదురు” అని మాతృదేవి అనేవారు. మాతృదేవి సహాయకు రాళ్లలో యోగిన్ మా బాగా గాంభీర్యంగా ఉండేవారు. ఆధ్యాత్మికంగా కూడా అత్యున్నతి పొందిన వ్యక్తి, “స్త్రీలలో యోగిన్ జ్ఞాని, క్షణంలో వికసించి వాడిపోయే మామూలు పుష్పం కాదామె. మెల్లగా వికసించి చాలాకాలం పరిమళాన్ని వెదజల్లే వేయిరేకుల పద్మం” అంటూ ఆమెను గూర్చి గురుదేవులు అన్నారు. బృందా వనంలో మాతృదేవితోపాటు ఉంటున్నప్పుడు అప్పుడప్పుడు ఆమెకు సమాధి అనుభవం కలిగింది. ఒక రోజు బృందావనంలో లాలాబాబు ఆలయంలో ధ్యానం చేస్తున్నప్పుడు ప్రగాఢ సమాధిలోకి వెళ్లిపోయింది. ఆలయం మూయడానికి రాత్రి పూజారి వచ్చినప్పుడు కూడా ఆమెకు బాహ్యస్మృతి కలుగలేదు. తర్వాత ఈ అనుభవాన్ని గురించి ఆమె, “ఆ స్థితిలో ప్రపంచం అనే దొకటి ఉందనే స్ఫురణే నాకు లేదు” అని అన్నారు. మరొకసారి తన అనుభవం గురించి చెబుతూ, “అప్పుడు నా చుట్టూవున్న వస్తువులన్నింటిలోనూ నా ఇష్టదైవాన్ని చూశాను. ఈ స్థితి మూడు రోజులు కొనసాగింది” అంది.
ఒక జమీందారు ఆమెను వివాహం చేసుకున్నాడు. కానీ వారి దాంపత్య జీవితం సంతోషంగా గడవలేదు. అందువల్ల చిన్నతనం నుండే దుఃఖభరిత పరిస్థితులలో తన తల్లితండ్రుల వద్దనే ఉండసాగింది. ఆమెను బలరాంబోస్ గురు దేవుల సాన్నిధ్యానికి తీసుకువచ్చాడు. మాతృదేవికి సమ వయస్కురాలు కాబట్టి అప్పటి నుండి మాతృదేవికి విశ్వసనీయమైన చెలికత్తెగా ఉండిపోయింది. దక్షిణేశ్వర రోజులలో మాతృదేవి శిరోజాలను అల్లి, జడవేయడం ఈమె పనే. ఆమె అల్లడం మాతృదేవికి ఎంతో ఇష్టం.
మాతృదేవి తీర్థయాత్రలలో యోగిన్ మా కూడా పాల్గొనేవారు– వృద్ధురాలైన తన తల్లిని, ఇద్దరు మనవళ్లను చూచుకోవాల్సివున్నందున ఆమె బాగ్ బజారులోని తన ఇంట్లోనే నివసించేది. కానీ ప్రతిరోజూ ఉదయం మాతృదేవిని దర్శించుకోవ డానికి వచ్చేది. వంటకు కావలసిన కూరగాయలు తరిగి ఇచ్చి, ఇంకా చిల్లర పనులు చూసుకొనేది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి ముసలి తల్లికి, మనవళ్లకూ వంట చేసేది. మళ్లీ మాతృదేవి వద్దకు వచ్చి తన చేతనయినంత సేవచేసి రాత్రికి ఇంటికి వెళ్లిపోయేది.
యోగిన్ మా కుటుంబంతోపాటు నివసిస్తూవున్నా, తంత్రశాస్త్రం నిర్దేశించే పూర్ణాభిషేకం, వేదాలు నిర్దేశించే విరజాహోమం మొదలైనవి అనుష్ఠించి సంప్రదాయానుసారం సన్న్యాసం స్వీకరించారు. ప్రతి రోజూ గంగలో స్నానం చేసిన తర్వాత ఆ పవిత్ర తీరంలో రెండు గంటలసేపు కూర్చొని వర్షం పడినా, ఎండగావున్నా మైమరచి ధ్యానంలో మగ్నమయిపోయేది. శాస్త్రానుసారం నిర్వహించే పూజలలో ఆమె నిష్ణాతురాలు. దానితోపాటు ఎంతో భక్తి భావంతో ఆమె పూజలు చేసేది. సమయాన్ని వ్యర్థం చేయదు. తీరిక సమయంలో గీత, భాగవతం, చైతన్య చరితామృతం, గురుదేవుల గురించిన పుస్తకాలు మొదలైనవి చదువుకొనేది. ఆమె జ్ఞాపక శక్తి అద్భుతం. పురాణ కథలను చదివింది చదివినట్లు చెప్పేది. చైతన్య చరితామృతం నుండి కొన్ని భాగాలను కంఠస్థం చేసి ఒప్పగించేది. ఆమె కూడా 1924 వ సం ॥ తన డెబ్భై మూడవ ఏట మరణించింది.
గౌరీమా
మాతృదేవితో సన్నిహితంగా ఉన్న మరొక వ్యక్తి గౌరీమా. ఆధ్యాత్మికతతో పాటు ప్రగాఢ శాస్త్రజ్ఞానమూ, సాహసమూ, సంస్థలను నెలకొల్పి వాటిని చక్కగా నిర్వహించే సామర్థ్యమూ ఆమెకు ఉన్నాయి. చిన్నతనం నుండే ఆధ్యాత్మిక జీవితం పట్ల తీవ్ర ఆకర్షణ కలగడం వలన వివాహ ఏర్పాట్ల నన్నిటిని వమ్ముచేసి గురుదేవులను శరణు జొచ్చింది. హిమాలయాలకు వెళ్లి తీవ్ర తపోసాధనలో మగ్నురాలైంది. 1882 వ సం ॥ తర్వాత దక్షిణేశ్వరంలో గురుదేవులకు తమ శక్తిమేరకు సేవ చేస్తూ, మాతృదేవితో పాటు నహబత్తులో ఉంటూ వచ్చింది.
గౌరీమా సామర్థ్యంపై గురుదేవులకు ఎంతో విశ్వాసం. అందువల్ల ఆమెను స్త్రీలలో ఆధ్యాత్మిక స్ఫూర్తిని పెంపొందించడానికి పంపేవారు. స్త్రీల ప్రగతి కోసం తనను అంకితం చేసుకోమని ఉద్బోధించేవారు. గురుదేవుల నిర్యాణానంతరం కొంతకాలం బృందావనంలో కఠోర తపోజీవితం గడిపింది. తర్వాత కలకత్తాకు తిరిగివచ్చి స్త్రీల కోసం ‘శారదేశ్వరీ ఆశ్రమం’, ఒక పాఠశాలను మాతృదేవి జ్ఞాపకార్థం నెలకొల్పింది. కలకత్తాలో స్థాపితమైన ఆ పాఠశాల ఎంతో ఆదర్శప్రాయంగా నిర్వహించబడుతూన్నది. స్త్రీలకు ఈ పాఠశాల మామూలు చదువు చెప్పడమేకాక హిందూధర్మానుసారం పవిత్రత, సేవ, భక్తి మొదలైన వాటిని గురించి కూడా బోధిస్తుంది. తర్ఫీదు పొందిన సన్న్యాసినులు ఆ పాఠశాలను నిర్వహిస్తున్నారు.
మాతృదేవికి, గౌరీమాకు మధ్య ప్రగాఢ ప్రేమ, పరస్పరాభిమానం నెల కొన్నవి. ఒక సమయంలో ఆమె నహబత్తులో ఉంటున్నప్పుడు గురుదేవులు అక్క డికి వెళ్లారు. మాటవరుసగా గౌరీమాను ఉద్దేశించి, “గౌరీ! మా ఇద్దరిలో నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు? నన్నా? ఆమెనా?” అని అడిగారు. అందుకు గౌరీమా సూటిగా బదులు చెప్పకుండా, ఒక మధురగేయం ఆలాపించారు:
“కృష్ణా! నువ్వేమీ రాధకంటే ఘనుడవు కావు,
దుఃఖంలో ప్రజలు నిన్ను ప్రార్థిస్తారు
నీకు కష్టం కలిగితే
‘ఓ రాధే!’ అంటూ నువ్వు ఆమెను పిలుస్తావు.”
ఈ పాట ద్వారా తాను మాతృదేవినే ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు చెప్పింది.
“మాతృదేవి గురుదేవుల సహధర్మచారిణి మాత్రమే కాదు, ఆయన ఆరా ధనకు పాత్రమయినవారూ, జగద్ధాత్రీ అయిన జగజ్జనని కూడా. సహధర్మచారిణిని జగజ్జననిగా పూజించడం లోకం ఇంత దాకా కనీవినీ ఎరుగదు. మాతృదేవిని ఇంకా మానవాళి అర్థం చేసుకోలేదు. ఆమె జీవితాన్ని పూర్తిగా అవగతం చేసు కున్నప్పుడు లోకం ఉన్నత స్థితి పొందుతుంది” అనేవారు గౌరీమా.
గౌరీ మా మాతృదేవి పట్ల ఎంతో వినమ్రంగా, భక్తిప్రపత్తులతో మెలిగినప్ప టికీ, మాతృదేవి ఆమెతో తమాషాగా నవ్వుకొంటూ సహజంగా మెలగేవారు. ఆమెను ‘గౌర్ దాసి’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. గౌరీ మా వ్యాధిగ్రస్థురా లయినప్పుడు మాతృదేవి ఆమెకు కొన్ని రాత్రుళ్లు మేల్కొని సేవ చేశారు. గౌరీమా శాస్త్రజ్ఞానాన్నీ, అనేక రంగాలలో ఆమెకున్న సామర్థ్యాన్నీ శ్లాఘించేవారు మాతృ దేవి. “మహత్త్వపూర్ణమయిన వ్యక్తి జన్మించడం ఎల్లప్పుడూ జరగదు. అలా జన్మిం చిన వ్యక్తి గౌర్ దాసి” అనేవారు మాతృదేవి. మద్రాసుకు వచ్చినప్పుడు అనుగ్రహ భాషణ చేయాల్సిందిగా మాతృదేవిని అభ్యర్థించారు. అందుకు మాతృదేవి, “నాకు ఉపన్యాసాలివ్వడం రాదు. గౌర్ దాసి నాతోపాటు వచ్చివుంటే చక్కగా ఉపన్యాసం చేసివుండేది” అన్నారు.
గౌరీమా చేసిన సామాజిక సేవ లన్నింటికీ మాతృదేవి తమ హృదయ పూర్వక ఆశీస్సులను అందించారు. ఆమె తన పాఠశాలను మాతృదేవి ఆశీస్సుల తోనే ప్రారంభించింది. మాతృదేవి ఆ పాఠశాలకు అప్పుడప్పుడూ వెళ్లేవారు. అక్కడ బోధింపబడుతున్న విద్యావిధానాన్ని ఎంతగానో మెచ్చుకొనేవారు. ఆశ్రమం, పాఠశాలలను నెలకొల్పిన తర్వాత వాటి నిర్వహణ కారణంగా ముందులా ఆమెకు మాతృదేవితో ఎక్కువసేపు గడపడం సాధ్యపడలేదు. కానీ అప్పుడప్పుడు వచ్చి మాతృదేవిని దర్శించుకొనేవారు. విద్యార్థినులను కూడా తీసుకువచ్చి వారికి దీక్ష ఇప్పించేది.
లక్ష్మీదేవి
లక్ష్మీదేవి గురుదేవుల అన్నగారైన రామేశ్వర్ కుమార్తె. ఈ పుస్తకంలో ఈమె పలుచోట్ల తారసపడతారు. ఈమె పుష్పవతి కాకముందే వితంతువు అయింది. వయస్సులో మాతృదేవి కన్నా చిన్నది. మాతృదేవి దక్షి ణేశ్వరంలో నివసిస్తున్నప్పుడు ఆమెకు సహాయంగా చాలా కాలం అక్కడే ఉండి ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠిస్తూ వచ్చింది. కాలాంతరంలో మాతృదేవి కలకత్తాలో నివసించినప్పుడు, ఆమె ఎక్కువ కాలం తమ బంధు వులతో దక్షిణేశ్వరంలోనో లేకపోతే స్వగ్రామంలోనో పుణ్యక్షేత్రాలలోనో గడిపింది. చక్కని వాక్చాతుర్యం గలది. వినేవారు మైమరచిపోయేలా గురుదేవుల జీవితం గురించి విశదీకరించగలిగేది; గురుదేవుల మాటలను, నవ్వును యథాతథంగా అనుకరించి చూపించేది. దివ్యత్వం ఉట్టిపడే గీతాలను పాడుతూ అద్భుతంగా నృత్యం కూడా చేసేది. అలా పాడేటప్పుడూ నృత్యం చేసేటప్పుడూ పారవశ్య స్థితిని పొందడం కద్దు. చక్కని జ్ఞాపకశక్తి, పురాణ కథలను ఆసక్తికరంగా చెప్పగల నేర్పు ఆమెకు ఉంది. కాలాంతరంలో ఆమె అనేకులకు మంత్రదీక్ష నిచ్చింది. చివరి రోజుల్లో పూరీలో నివసిస్తూ అక్కడే పరమపదించింది.
గోపాలేర్ మా
గోపాలేర్ మా వయస్సులో మాతృదేవి కంటే బాగా పెద్దది. ఈమె కూడా ఒక వితంతువు. బాలగోపాలుని తన ఇష్టదైవంగా ఆరాధించింది. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందింది. గురుదేవులను బాలగోపాలుని గాను, తనను ఆయన తల్లిగాను భావిం చింది. అందువల్ల మాతృదేవిని కోడలిగా ఆరాధించింది. దక్షిణేశ్వరానికి వచ్చి నప్పుడు మాతృదేవితోపాటు ఉండేవారు. మాతృదేవి కలకత్తాలో ఉన్నప్పుడు అక్క డికి వెళ్లి దర్శించుకునేది.* వీరేకాక గురుదేవుల గృహస్థ భక్తులైన బలరాంబోస్, మహేంద్రనాథ్ గుప్త మొదలైన వారి భార్యలతోను మాతృదేవి సన్నిహితంగా ఉండే వారు.
వీరందరు మాతృదేవిని సాక్షాత్తూ జగన్మాతగానే చూశారు. మాతృదేవి పట్ల భక్తి ప్రపత్తులు కలిగివుండేవారు. మాతృదేవి కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు. ఆమె కృపాకటాక్షం వల్ల ఆధ్యాత్మిక జీవితంలో పురోగమించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మాతృదేవి అనే మహోజ్వల జ్యోతి సమీపంలో చిన్నచిన్న దీపాలుగా వెలుగొందారు. కానీ చీకటి తెరలోనే కదా వెలుతురు అందం మన కళ్లను ఆకర్షిస్తుంది! మాతృదేవి అనే మహోజ్వల జ్యోతికి అలాంటి ఒక లౌకికమయిన చీకటి తెరగా నెలకొన్నారు ఆమె కుటుంబీకులు, డబ్బే లక్ష్యంగాగల వారందరితో సర్దుకుపోతూ ఒక ప్రియ సోదరిగా, అత్తగా, తల్లిగా మాతృదేవి జీవించిన విధానాన్ని ఇప్పుడు చూద్దాం!