జయరాంబాట
పశ్చిమ వంగదేశంలోని బాంకూరా జిల్లా ఆగ్నేయ మూలలో ఉన్న కుగ్రామం జయరాంబాటి. కలకత్తా నుండి దాదాపు అరవై మైళ్ల దూరంలో నెలకొని ఉంది ఈ గ్రామం. ఎటువైపు చూసినా పచ్చని పొలాలు, మధ్యలో తామర కొలనులతో శోభిస్తూ ఉంటుంది జయ రాంబాటి. తామర కొలనులలో ఈదుతూ ఆనందించే చేపలు కనులపండువ చేస్తూంటాయి. దట్టంగా పెరిగిన చెట్టుచేమలు, వాటి కొమ్మలపై వాలి కమ్మగా రాగాలాలపించే పక్షులు, చెట్లకు నడుమ గడ్డి కప్పులతో కూడిన గుడిసెలు ఒక వినూత్న సోయగాన్ని ఆ గ్రామానికి సంతరించిపెడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంటి అరుగుల మీద కూర్చునివున్న వృద్ధులూ, వీథులలో ఆడుకొంటూ ఆనందిస్తూన్న పిల్లలూ – నేడు కూడా నిరాడంబరత ఉట్టిపడే ఒక విశిష్టతను మనం చూడవచ్చు. దాదాపు 150 సంవత్సరాలకు మునుపు, అంటే ఈ చరిత్ర ప్రారంభ కాలానికి ముందు ఇంకా ఎంత శోభస్కరంగా ఉండేదో ఊహించుకో వచ్చు.
పచ్చని పొలాలతో ఆవృతమైన ఈ గ్రామం దాదాపు అర చదరపు మైలు విస్తీర్ణం గలది. వరి, కాయధాన్యాలు, మిరప, పసుపు, కాయగూరలు సమృద్ధిగా ఇక్కడ పండేవి. పత్తి కూడా పండించేవారు. ఆ కాలంలో దుకాణాలు ఉండేవి కావు. అయినప్పటికీ జయరాంబాటి ప్రజలు ఇతర గ్రామాలపై ఆధారపడవలసిన అగత్యం ఉండేది కాదు. లభించిన దానితో తృప్తిపడి జీవించే సుగుణం ఆ గ్రామస్థులు సంతరించుకొన్నారు. మరీ అత్యవసర పరిస్థితులలో సమీపంలోని పెద్ద గ్రామాలైన కామార్పుకూర్, కోతుల్పూర్, కోయాపట్ – పతన్గంజ్, సిహోర్ లాంటి చోట్లకు వెళ్లి తమకు కావలసినవి కొనుగోలు చేసుకొనేవారు.
ఆమోదర్
జయరాంబాటి సోయగాలకు మరింత వన్నె తెస్తూ, ఆ గ్రామ ఉత్తర సరి హద్దును నిర్దేశిస్తూ ప్రవహిస్తూవుంది ఆమోదర్ అనే అందమైన ఏరు. స్ఫటికంలా నిర్మలమైన నీటితో ఏదో సంకేత భాషలో మాట్లాడుతూన్నట్లు మర్మర ధ్వనులతో మెలికలు తిరిగి ప్రవహించే ఆ ఏరు చూపరులకు కనువిందు చేస్తుంది. దానో ఈదుతూన్న అసంఖ్యాకమైన చేపల ఆకర్షణతో కొన్ని సందర్భాలలో మొసళ్లు కూడా ఆ ఏటిలోకి రావడం కద్దు. చమటోడ్చి రోజంతా పనిచేసిన పేద రైతులు సాయంత్రం అందులో స్నానంచేసి, ఏటిగట్టున కాసేపు సేదతీర్చుకొని, మెల్లగా ఏటి మీదుగా వీచే ఆహ్లాద వాయువుల వినూత్న సుఖాన్ని చూరగొని ఇంటికి తిరిగి వెళ్లడం పరిపాటి.
ఆ ఆమోదర్ ఏటి రెండు తీరాల వెంబడి చెట్లు దట్టంగా పెరిగి ఉండడం వలన పగటి వేళల్లో సైతం ఆహ్లాదకర వాతావరణం అక్కడ నెలకొని ఉండేది. ఆ చల్లదనంతోపాటు, అందమైన పువ్వులు చక్కగా వికసించి చుట్టూ పరిమళాన్ని వ్యాపింపజేయడమూ, జనసంచారం బొత్తిగా లేనందున నెలకొన్న ప్రశాంతతా, కొన్ని సమయాలలో ఆ ప్రశాంత వాతావరణానికి కించిత్తు భంగం కలిగించే వివిధ పక్షుల కిలకిలారావాలూ, వాటికి తాళగతి సమకూర్చుతూన్నట్లు ప్రవహించే ఏటి మర్మర ధ్వనీ ఆ ప్రాంతానికి ఒక అద్భుత రామణీయకతను సంతరించి పెడుతున్నాయనడం అతిశయోక్తి కాదు. నేటికీ ఆ ప్రకృతి శోభకూ, ప్రశాంతతకూ ఎలాంటి భంగమూ వాటిల్లలేదు.
జయరాంబాటి ఉత్తర సరిహద్దులో ప్రవహిస్తూన్న ఆమోదర్ ఆగ్నేయంగా తిరిగి ముకుందపూర్ మార్గంలో దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ప్రవాహ గతిలో జయరాంబాటి ఉత్తర సరిహద్దున ఒక త్రిభుజాకార ద్వీపకల్పాన్ని కల్పిస్తూన్నది. ‘కూర్మపృష్టా’ అంటే తాబేలు వీపులా మధ్యలో కాస్త ఎత్తుగా ఉండడమూ, ఆ త్రిభుజాకార ద్వీపకల్ప మధ్యభాగాన నిలిచివున్న ఉసిరి చెట్టూ, పక్కనే నెల కొన్న శ్మశానమూ ఆ ద్వీపకల్పాన్ని ఆధ్యాత్మిక సాధనానుష్ఠానానికి సముచితమైన చోటుగా తీర్చిదిద్దాయి. కాలాంతరంలో స్వామి శారదానంద, యోగీన్ మా, గోలాప్ మా లాంటివారు ఆమోదర్ ఏటిలో స్నానమాచరించి, ఉసిరిచెట్టు క్రింద కూర్చుని జపతపాదులు చేయడం జరిగింది. ఈ ద్వీపకల్పాన్ని దాటి ఆమోదర్ తీరం వెంబడి వాయవ్య దిశగా నడుస్తూ వెళితే చిన్నమెట్లున్న ఘట్టం తారస పడుతుంది. దాని తీరం శ్మశానభూమి. శ్రీ శారదాదేవి బంధువులలో కొందరి సమాధులు అక్కడ కానవస్తాయి.
మాతృదేవి ఆమోదర్ను ‘నా గంగ’ అని ప్రశంసించడమే గాక, పర్వదినా లలో మెట్లున్న ఘట్టం వద్ద స్నానం చేసేవారు కూడా.
ఆమోదర్ తీరం వెంబడి కాస్త దూరం వెళ్లి రహదారి మార్గంగా చుట్టుతిరిగో లేకపోతే దక్షిణాభిముఖంగా పొలాలను దాటుకొంటూ దగ్గరదారిలో దాదాపు ఒక కిలోమీటరు నడిచి వెళితే మాతృదేవి ఇంటిని చేరుకో వచ్చు.
మాతృదేవి ఇల్లు: పరిసరాలు
మాతృదేవి పుట్టిల్లు జయరాంబాటి ఊరికి మధ్యన ఉండేది. ఆ ఇల్లు ఉండిన చోట ప్రస్తుతం మాతృదేవి పేరిట ఒక చక్కని ఆలయం, ‘మా’ అనే పతకాన్ని ఎగురవేసుకొంటూ ఠీవిగా వెలసివుంది. బస్సు నుండి దిగే ప్రతి వ్యక్తికీ మొట్టమొదట కనిపించేది ఈ పతాకమే. ‘సంసారమనే మండుటెండలో వాడిపోయి వస్తున్న నా బిడ్డలారా! త్వరగా రండి! ఇదుగో మీ అమ్మ మీ కోసం వేచి ఉంది’ అంటున్నట్లు ఆ పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆలయంలో పాలరాతితో మల చిన చక్కని మాతృదేవి విగ్రహం ప్రతిష్ఠితమై ఉంది. మనలను ఆప్యాయతానురాగా లతో తిలకించే రీతిలో ఆ విగ్రహం అమరివుంది. రోజంతా తదేకంగా మాతృదేవి పాలరాతి ప్రతిమను చూస్తూ ఉండిపోవాలనే ఆకాంక్ష మనలో జనిస్తుందనడం అతిశయోక్తి కాదు.
ఆలయానికి ఎదురుగా పుణ్యపుకూర్ కొలను మనకు దర్శనమిస్తుంది. మాతృదేవి జీవితంతో ఈ కొలను ఎంతగానో ముడిపడివుంది. మాతృదేవి కొత్త ఇల్లు దీనికి నైరుతి దిశలో ఉంది. ఆ ఇంటిని 1916 లో స్వామి శారదానంద కట్టించారు. ఆ ఇంట్లో రెండు వైపులా ఐదేసి గదులున్నాయి. కుడివైపు ఉన్న మొదటి గదిలో ప్రస్తుతం మాతృదేవి చిత్రపటం అలంకరింపబడి ఉంది. తీర్థ యాత్రకు వచ్చిన భక్తులు బసచేయడానికి తక్కిన గదులు కేటాయించబడి వున్నాయి. ఆ కొత్త ఇంట్లో మాతృదేవి దాదాపు నాలుగేళ్లు నివసించారు.
పుణ్యపుకూర్ ఉత్తర తీరాన చిన్న గుడిసె లాంటి ఆలయం ఉంది. జయరాంబాటి వాస్తవ్యులైన ముఖర్జీ వంశీయుల ప్రాచీన ఆలయం అది. దాన్లోని ఒకగదిలో సుందరనారాయణుడనే పేరిట కూర్మరూపంలో ధర్మదేవత ఆరాధింప బడుతున్నాడు.* ఆ ప్రక్క గదిలో ప్రతి ఏటా కాళీపూజ జరిపించేవారు. కాలాంత రంలో కుటుంబ గొడవల కారణంగా ఈ పూజ ఆగిపోయింది. గ్రామంలోని పిల్లలకు ఈ గది బడిగా కూడా ఉపయోగపడింది. గది ఈశాన్య మూలలో నల్లటి రాయి షష్ఠీదేవిగా ప్రతిష్ఠితమై పూజింపబడుతూ వచ్చింది. షష్ఠీదేవి సంతాన వరం ప్రసాదించే దేవత. అందువలన నూతన దంపతులు తప్పక ఆమెను పూజించడం కద్దు. ప్రస్తుతం షష్ఠీదేవి కూడా సుందరనారాయణ స్వామి గదిలోనే ప్రతిష్ఠింప బడి, పూజలు అందుకొంటున్నది.
కొత్త ఇంటిని దాటి కాస్త దూరం దక్షిణంగా నడిస్తే దారికి పశ్చిమాన కొన్ని గుడిసెలు కలిసికట్టుగా కనిపిస్తాయి. అవి మాతృదేవి సోదరులవి. మాతృదేవి సోదరులలో ఒకరైన ప్రసన్న ఇంట్లోనే క్రొత్త ఇల్లు నిర్మాణం జరిగేదాక మాతృదేవి నివసించారు.*
వీథిలో ఇంకా ముందుకు దక్షిణాభిముఖంగా పోతే కుడివైపు మెలికలు తిరుగుతూ పోతున్న సన్నని బాట సింహవాహినీ ఆలయానికి దారితీస్తుంది. ఆ దేవి జయరాంబాటి అధిష్ఠాన దైవం. మాతృదేవి జీవితంలో కూడా ఈ ఆలయం చోటుచేసుకొంది. సింహవాహినీదేవితో పాటు ఒక పీఠంలో ఆమె సఖురాండ్రయిన చండీదేవి, మహామాయ ఆసీనులై ఉన్నారు. మరొక పీఠంలో నాగదేవతయైన మనసాదేవి కొలువై ఉంది. ఈ దేవతలు కాక గ్రామం పశ్చిమ సరిహద్దులో యాత్ర సిద్ధిరాయుని పేరిట ధర్మదేవత ఆరాధింపబడుతున్నాడు.
వీథిలో ఇంకా ముందుకు పోతే దక్షిణ సరిహద్దులో బడుజ్యేపుకూర్* వస్తుంది. దీని తీరంలో అనేక తాటిచెట్లు ఉండడం వలన దీనిని తాల్పుకూర్* అని కూడా పేర్కొంటారు. స్నానానికి, త్రాగడానికి కూడా ఈ నీరు ఉపయోగింప బడేది. ఎన్నోసార్లు మాతృదేవి ఈ కొలను నీరు తీసుకువెళ్లారు! ఊరికి పశ్చిమాన ఉన్న అహోర్ అనే కొలనులోని నీటిని సామాన్యంగా వ్యవసాయానికి ఉపయో గించేవారు. మాతృదేవి జీవితంతో సంబంధమున్న సిహోర్, కోల్పారా లాంటి చోట్లు జయరాంబాటి నుండి నాలుగైదు మైళ్ల దూరంలోనివే.
పూర్వీకులు
జయరాంబాటిలో ముఖర్జీ, బెనర్జీ అనే రెండు శాఖల బ్రాహ్మణులు ప్రధా నంగా నివసిస్తూ వచ్చారు. వీరితోపాటు ఇతర కులస్థులు కూడా నివసించే వారు. ముఖర్జీలు సామాన్యంగా పౌరోహిత్యం చేసేవారు. వంశపారంపర్యంగా ముఖర్జీలు, బెనర్జీల మధ్య వైవాహిక సంబంధాలు నెలకొని ఉండేవి. వారి ఇష్ట దైవం శ్రీరామచంద్రుడు. వేర్వేరు కులాలవారు నివసిస్తూన్నప్పటికీ జయరా బాటి గ్రామస్థులు ఐకమత్యంగా ఉండేవారు. పందొమ్మిదవ శతాబ్దాంతంలో మలేరియా రోగం తాండవించి పీడించ డానికి మునుపు వారి జీవితాలు సాఫీగా సాగిపోయేవనే చెప్పాలి.
సంవత్సరం పొడవునా ఆ గ్రామంలో ఉత్సవాలూ పూజలూ జరుగుతూ ఉండేవి. దుర్గాపూజ, కాళీపూజలతో పాటు సింహవాహిని లాంటి గ్రామదేవతలకు కూడా విశేషంగా పూజలు జరిపించేవారు. శివరాత్రి నాడు జయరాంబాటి ప్రజలు సిహోర్లో నెలకొనివున్న శాంతినాథ శివాలయానికి వెళ్లి పూజలు నిర్వ ర్తించేవారు. కీర్తనలు, రేయింబవళ్లు వీథినాటకాలు నిర్వహించేవారు. నిరాడంబర తతో పాటు దివ్యత్వాన్ని కలగలుపుకొని జీవించేవారు.
రామచంద్ర్
ముఖర్జీల వంశంలో వచ్చిన వ్యక్తి రామచంద్ర. నిరాడంబరత, ప్రశాంతత, పవిత్రత లాంటి సుగుణాల నెలవు ఆయన. ఆయన సద్గుణ సంపత్తిని గ్రామస్థు లందరూ గౌరవించేవారు. ఆయనకు త్రైలోక్యనాథ్, ఈశ్వరచంద్ర, నీలమాధవ్ అనే ముగ్గురు తమ్ముళ్లు. త్రైలోక్యనాథ్ ఆరితేరిన సంస్కృత పండితుడు. కానీ యువప్రాయంలోనే చని పోయాడు. ఈశ్వరచంద్ర, నీలమాధవ్లు వివాహం చేసుకోలేదు. సోదరులంతా ఉమ్మడి కుటుంబంగా జీవించేవారు. వ్యవసాయం, పౌరోహిత్యం ద్వారా లభించే ఆదాయంతో గుట్టుగా కుటుంబ పోషణ జరిగిపోయేది. వారు కుటుంబ ఖర్చు లను తట్టుకోగలిగారేగాని జీవన ప్రమాణాన్ని పెంచుకోలేకపోయారు.
పేదవాడే అయినప్పటికీ రామచంద్ర ధర్మాన్ని పాటిస్తూ, బ్రాహ్మణ ఆదర్శాల నుండి వీసమెత్తయినా వైదొలగక జీవించాడు. తమ తండ్రిని గురించి మాతృదేవి కాలాంతరంలో ఇలా వ్యాఖ్యానించారు: “ఆయన ఉత్తముడు, శ్రీరామచంద్రుని ఆదర్శ భక్తుడు. బ్రాహ్మణ ఆదర్శాల నుండి కించిత్తు కూడా దిగజారక జీవిం చాడు. ఎవరు ఏమిచ్చినా చటుక్కున పుచ్చుకొనేవాడు కాదు. హుక్కా త్రాగడం ఆయనకు ఎంతో ప్రీతి. ఇంటి అరుగు మీద కూర్చుని హుక్కా త్రాగుతూన్నప్పుడు ఎవరైనా అటువైపుగా వస్తే, ‘తమ్ముడూ! ఒకసారి హుక్కా త్రాగి వెళ్లరాదా!’ అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు. ఆ వ్యక్తి రాగానే హుక్కాలో పొగాకు దట్టించి, ఆతడితో హుక్కా త్రాగించేవాడు.”
కరవు సమయంలో రామచంద్ర సహాయ సహకారాలు
సామాన్యంగా గ్రామప్రజలలో కానవచ్చే సంతృప్తీ, అతిథి సత్కారం లాంటివి రామచంద్రలో అధిక పాళ్లలో ఉండేవి. ఇందుకు ఉదాహరణగా ఒక్ సంఘటనను పరికిద్దాం. 1864వ సంవత్సరం వంగదేశం భయంకరమైన కరవు వాతబడింది. ఎక్కడ చూసినా కరవు విలయతాండవ దృశ్యాలే! రామచంద్ర పేదవాడే; వ్యవసాయం, పౌరోహిత్యం, జంధ్యాలు వడకి అమ్మడం – వీటి ద్వారా లభించే రాబడితో కుటుంబ ఖర్చులన్నీ సర్దుకొని, ఏదో కొంత పొదుపు చేసేవాడు. ఇతరులు ఆకలితో అలమటించిపోవడం చూసి ఆయన హృదయం ద్రవించిపోయింది. గత ఏడాది పొదుపు చేసివుంచిన ధాన్యాన్ని ఆకలితో అలమటించిపోతున్న పేదలకు పంచిపెట్టసాగాడు.
ఈ సంఘటన జరిగిన సమయంలో శారదకు పదేళ్లు. కానీ ఈ సంఘటన ఆమె హృదయంలో గాఢంగా హత్తుకుపోయింది. కాలాంతరంలో మాతృదేవి ఈ సంఘటన గురించి ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: “ఒకసారి భయంకరమైన కరవు జయరాంబాటిని పీడించింది. మా వద్ద నిరుటి ధాన్యం నిల్వ ఉన్నందువలన ఆకలితో అలమటించిన యావన్మందికీ ఆహారం సమకూర్చగలిగాం. ఎందరో మా ఇంటికి వచ్చి భోజనం చేశారు. బియ్యం, పప్పు కలిపి కిచ్చిడీ తయారుచేసి పెద్ద కుండలలో మా నాన్న ఉంచేవాడు. మా ఇంట్లోని వారికి కూడా ఆహారం అదే! కానీ నాకు మాత్రం ప్రత్యేకం! ‘నా ముద్దుల కుమార్తెకు ఇది వద్దు. ఆమె కోసం కొంచెం అన్నమూ, కాయగూరలతో కూర వండండి’ అనేవారు. ఓహ్! ఆకలితో అలమటించే అసంఖ్యాక జనం మా ఇంటికి వచ్చేవారు. కొన్ని సందర్భాలలో కిచ్చిడీ నిండుకొనేది. వెంటనే మా నాన్న వండించేవారు. సత్వరమే చల్లారడానికి పెద్ద కుండలలో పోసి ఉంచేవారు. నేను కూడా నా వంతుగా విసనకర్రతో వీస్తూ దానిని చల్లబరచే దానిని.
ఇలా ఒక రోజు ఒక నిమ్నకులస్థురాలు ఆకలితో అలమటిస్తూ అంతా మరచిపోయి పిచ్చిదానిలా వచ్చింది. కళ్లు ఎర్రబారి, జుట్టు విరబోసుకొని పిచ్చి దానిలాగే కనబడింది. గబగబా వచ్చిన ఆమెకు ముందు కనిపించింది తొట్టిలో పశువుల కోసం కలిపి ఉంచిన తవుడు. అంతే! వెంటనే దాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఆవురావురని తినసాగింది. ‘అమ్మా, దాన్ని తినకు. లోపల కిచ్చిడీ ఉంది. వెళ్లి తిను’ అంటూ మే మెంత మొత్తుకొన్నా ఆమె వింటే కదా! ఆ తవుడు కాస్త తిన్న తరువాత ఆమెకు బాహ్యప్రపంచ స్పృహ వచ్చింది. ఆకలి బాధ సామాన్యమైనదా ఏమిటి?”
శ్యామసుందరీ దేవి
భర్త ఉదాత్త గుణాలకు దీటుగా, ఆయనకు తగిన భార్యగా వ్యవహరించింది శ్యామసుందరీదేవి. సిహోర్కు చెందిన హరిప్రసాద్ మజుందార్ కుమార్తె ఆమె. అరమరికలు లేకుండా అందరితో సహజంగా మెలగే స్వభావమూ, కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకొనే సమర్థతా ఆమె పుణికి పుచ్చుకొన్న సుగుణాలు. కాలాంత రంలో తమ తల్లిని గురించి మాతృదేవి ఇలా చెప్పారు: “మా అమ్మ నిరాడంబరురాలు. ఆప్యాయత ఉట్టిపడే వ్యక్తి. ఏదీ దుబారా చేయకుండా శ్రద్ధగా సేకరించి ఉంచుకొనేవారు. భక్తులు వస్తే చాలు, ఆమె ఆనందం అవధులు దాటిపోయేది. ‘ఆహా! నా మనుమడు వచ్చే శాడు, మనుమరాలు వచ్చేసింది’ అంటూ ఆనందపరవశురాలయ్యేది. ‘ఈ కుటుంబమే భగవంతునికీ, భక్తులకూ సంబంధించింది’ అనేవారామె.”