తపస్సుతో అంకు రించిన సన్న్యాసుల సంఘం
పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టుకు వచ్చినట్లు మరే శతాబ్దంలోను ఇలా మత సంస్థలు జనించలేదు. కాలప్రవాహానికి ఎదురీదుకొంటూ నేటికీ సుస్థిరంగా ఉన్నవి అతి తక్కువ. కానీ అరచేతిలో చిల్లగవ్వకూడా లేకుండా కొందరు యువ సన్న్యాసులు రామకృష్ణ సంఘం (రామకృష్ణ మఠం – మిషను) ఇంత తక్కువ కాలంలో ఎదిగి ఒక మహోన్నత సంస్థగా రూపుదిద్దుకుంటున్నది. రామకృష్ణ సంస్థ పురోభివృద్ధి బహుశా పరిశోధకులకు అంతుబట్టకపోవచ్చు. ఈ పురోగతికి కారణం ఏమిటి అన్నది సహజంగా తలెత్తే ప్రశ్న. దీనికి తిరుగులేని జవాబు తపస్సు అనే చెప్పాలి. తపస్సు ద్వారా శక్తి పెంపొందుతుంది. ఆ శక్తి ఇతర శక్తుల కంటే శక్తిమంతమయినది. ఆ శక్తి వలన మాత్రమే మహోన్నత కార్యాలు సాధింపబడతాయి. కాలాతీతంగా నిలచిన ప్రతి ఒక్కదాని వెనుకా మహోన్నతమైన తపోశక్తి ఉండడం మనం చూడవచ్చు. లోకాన్నే ఆకట్టుకొన్న బుద్ధుని అవ్యాజకరుణకు, శంకరుని మేధాసంపత్తికి, చైతన్యుని పారవశత్వానికీ తపస్సే ఆధారం. తపోశక్తి వల్లనే బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించాడు. ఉపని షత్తులు కూడ, “సమస్తమూ తపస్సులోనే ప్రతిష్ఠితమై ఉంది”* అంటున్నాయి. గురుదేవులు, మాతృదేవి, స్వామీజీ, వారి శిష్యుల ప్రశిష్యుల మహోన్నత తపో శక్తిని ఆధారంగా చేసుకున్నందువల్లనే రామకృష్ణ సంఘం దినదినాభివృద్ధి గాంచు తున్నది.
గయలో మాతృదేవి ప్రార్థన
గురుదేవుల నిర్యాణానంతరం ఆయన సన్న్యాస శిష్యులు వరాహ నగరంలో ఒక పాడుపడిన ఇంట్లో ఉంటూ తపోమయ జీవితం గడుపసాగారు. “పిశాచాలు సైతం దరిజేరడానికి శంకించే తపోమయ జీవితం మేం అప్పుడు గడుపుతున్నాం” అంటూ కాలాంతరంలో స్వామీజీ ఆ రోజులను జ్ఞాపకం చేసుకోవడం కద్దు. 1887 జనవరి నెలలో వారు హోమాగ్నిని రగిలించి, విధివిహితంగా సన్న్యాసం స్వీకరించారు. కానీ ఒక సంఘంగా కలిసి పనిచేయాలనే ఆలోచన అప్పట్లో వారికి లేదు. అందువల్ల ప్రతి ఒక్కరూ తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాలలో తపోమయ జీవితం అంటూ మొదలుపెట్టారు. వారందరూ సంఘంగా కలిసి జీవించాలి అనే ఆలోచనా బీజం మాతృదేవి చలువే.
సన్న్యాస శిష్యులు వరాహ నగరంలో తపస్సు చేసుకుంటున్న అదేసమ యంలో మాతృదేవి కామార్పుకూర్లో తపోజీవితం గడపడం చూశాం. 1888 లో పూరీ దర్శించివచ్చిన మాతృదేవి దాదాపు ఒక సంవత్సరం కామార్పుకూరులోనే ఉండిపోయారు. గయకువెళ్లి మరణించిన తన తల్లికి పిండ ప్రదానం చేయమని గురుదేవులు ఒకసారి మాతృదేవితో చెప్పారు.* అందుకోసం 1890 మార్చి 25 వ తేది మాతృదేవి పెద్దగోపాల్తో గయకు వెళ్లారు. తర్వాత అక్కడ నుండి బుద్ధ గయకు వెళ్లారు.
బుద్ధ గయలో మాతృదేవి ఒక ప్రసిద్ధ మఠాన్ని చూడడం తటస్థించింది. ఆ మఠంలో చక్కని వసతులు ఉన్నాయి. భోజనానికి, ఇతర అవసరాలకు చక్కని ఏర్పాట్లు చేయబడివున్నాయి. దీనిని చూసిన మాతృదేవి మనసులో ఆవేదనతో కూడిన ఒక దృశ్యం కళ్లముందు నిలిచింది – గురుదేవులనే నమ్ముకుని, వారినే దైవంగా భావించి తమ చదువును, సుఖ సంపదలను, బంధుగణాన్ని త్రోసి రాజని వచ్చిన ఆయన శిష్యులయిన తమ బిడ్డలు దేశమంతటా సంచరిస్తున్నారు. ఈ దృశ్యం మాతృదేవి కళ్లలో నీళ్లు నింపాయి. తన బిడ్డలకు కూడా ఇలాంటి మఠాలు ఏర్పడాలని మాతృహృదయం పరితపించగా, కన్నీరు మున్నీరుగా ప్రార్థిం చారు మాతృదేవి. ఆ ప్రార్థనే ప్రస్తుత రామకృష్ణ మఠాలన్నిటికీ మూలమయింది.
ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు: “ఓ! ఇందు కోసమే నేను గురుదేవులను ఎంతగా కన్నీళ్లతో ప్రార్థించానో తెలుసా? ఆ తరు వాతే ఆయన కృపాకటాక్షం వల్ల ఈ మఠం (బేలూరు మఠం) రూపుదిద్దుకొంది. గురుదేవుల నిర్యాణం తర్వాత ఆయన సన్న్యాస శిష్యులు తమ ఇళ్లను, బంధు బాంధవులను త్యజించి ఒక అద్దె ఇంట్లో నివసించసాగారు. పిదప తపోమయ జీవితం గడుపుతూ, ఏకాకులై అక్కడికీ, ఇక్కడికీ అలమటించసాగారు. ఇది నాకు ఎంతో క్షోభ కలిగించింది. నేను గురుదేవులతో, ‘ఓ భగవంతుడా! మీరు వచ్చారు. వీరిలో కొందరితో లీలావినోదం సలిపి, నిష్క్రమించారు. దాంతో అంతా అయిపో వలసిందేనా? అదే మీ సంకల్పమయితే ఇలలో మీరు అవతరించి ఎందుకు ఇన్ని ఆవేదనలను అనుభవించాలి? వీథులలో బిచ్చమెత్తుకొని తింటూ, చెట్ల క్రింద పడి వుండే సన్న్యాసులను ఎందరినో బృందావనంలోనూ, కాశీలోనూ చూసివున్నాను. అలాంటి సన్న్యాసులకు మన దేశంలో కొదవ లేదే! మీ పేరిట సర్వస్వమూ త్యజించిన నా బిడ్డలు తిండి కోసం బిచ్చమెత్తుకోవడం నేను భరించలేక పోతున్నాను. మీకు నా ప్రార్థన ఇదే: మీ పేరు చెప్పుకుని లోకాన్ని త్యజించే వారికి సాధారణమైన కూడు గుడ్డ నీడ లభించాలి. వారందరూ మీ ఉపదేశా లనూ, ఆదర్శాలనూ కేంద్రంగా చేసుకుని ఒక చోట కలసికట్టుగా నివసించాలి. ప్రాపంచిక జీవితంలో దుఃఖాలననుభవించే ప్రజలు, వారిని ఆశ్రయించి, వచనా మృతాన్ని గ్రోలి ఊరడింపు పొందాలి. అందుకోసమే కదా మీ అవతరణ! వారం దరూ అలమటిస్తూ తిరగడం నేను సహించలేను’ అని ప్రార్థించాను. ఆ తరువాత నరేంద్రుడు క్రమేణా ఇవన్నిటినీ రూపొందించాడు.”
సంఘ సంస్థాపన
ఎలాంటి ఉత్కృష్ట ప్రార్థన! మాతృత్వ సహజమయిన ఉద్వేగపూర్వకంగా వెలువడిన ప్రార్థనే ఇది! రామకృష్ణ ఉద్యమ ఉన్నత ఆదర్శాల మూలం ఎంత సుందరంగా ఈ ప్రార్థనలో చోటు చేసుకొంది! గురు దేవులు తమ యువ శిష్యులను సన్న్యాసులను చేసి భిక్ష తీసుకురావాలని ఆదేశించినప్పుడు, ప్రథమ భిక్ష వారికందరికీ ఇస్తూ, రామకృష్ణ సంఘానికి శ్రీకారం చుట్టారు మాతృదేవి. ఇప్పుడు తమ ప్రార్థన మూలంగా సంఘానికి రూపుదిద్దడం కూడా మాతృదేవి చేశారు. ఇంతే కాదు, ఉద్యమ వ్యాప్తి లోని ప్రతి ముందంజకూ మాతృదేవియే మార్గదర్శకురాలయ్యారు. అందువల్లనే ఆమెను ‘సంఘ జనని’ అంటే సంఘానికి తల్లిగా ఆరాధిస్తూన్నారు.
బుద్ధ గయ నుండి మాతృదేవి కలకత్తాకు తిరిగి వచ్చారు.
నరేంద్రుని పంపించారు
తపోశక్తే రామకృష్ణ సంఘానికి ఆధారభూతమై ఉండడం చూశాం. చరిత్ర కనీవినీ ఎరుగని గురుదేవుల తపస్సువల్ల సంఘం ఆవిర్భవించింది. మాతృ దేవి తపస్సుతో అది అంకురించి పెరగడం మొదలుపెట్టింది. దానిని లోకానికే సంఘ జనని నీడ నిచ్చే మహావృక్షంగా తీర్చిదిద్దే బాధ్యతను గురుదేవుల ప్రధాన శిష్యుడైన నరేంద్రునికి అప్పగించడమైనది. మాతృదేవికి కార్యాన్ని అప్పగించినట్లు గురు దేవులు కాశీపూర్ రోజులలో నరేంద్రునికి కూడా ఆతడు చేయవలసిన కార్యాన్ని అప్పగించారు.* తమ కార్యాన్ని నెరవేర్చడానికైన శక్తిని సముపార్జించడానికి తీవ్రమైన తపోజీవితం చేపట్టడానికి హిమాలయాలకు బయలుదేరాడు నరేంద్రుడు. సెలవు పుచ్చుకోవడానికి అతడు ఒక రోజు మాతృదేవి వద్దకు వచ్చాడు. మాతృదేవికి ప్రణమిల్లి, “అమ్మా! నేను బయలుదేరుతున్నాను. ఒక నిజమైన మనిషిని కాగలిగితే మళ్లీ మిమ్మల్ని దర్శించుకుంటాను. లేకపోతే ఇదే ఆఖరి చూపు” అన్నాడు. నరేంద్రుని మాటలు విని హడలిపోయారు మాతృదేవి. “నాయనా! నువ్వెందుకు అలా అంటున్నావు?” అంటూ మధ్యలోనే ఆతణ్ణి వారించారు. అందుకు నరేం ద్రుడు, “అవును. నేను అలా అనివుండకూడదు. ఎందువల్లనంటే మీ కృపాకటా క్షంతో నేను త్వరలో తిరిగి వస్తాను కనుక” అని అన్నాడు. ఆతనితోపాటు గంగా ధర్ కూడా వెళ్లనున్నాడు. మాతృహృదయం నరేంద్రునికి సెలవివ్వడానికి నిరాక రించినా, కర్తవ్య నిర్వహణ దానిని అడ్డుకొంది. గంగాధర్‌ను పిలిచి, “నాయనా! నా ఐశ్వర్యాన్నే నీకు అప్పజెప్పుతున్నాను. హిమాలయాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో నీకు తెలుసు. నరేంద్రుడు ఆహారం లేకుండా బాధపడకుండా చూసుకో” అంటూ వారిని ఆశీర్వదించి పంపారు మాతృదేవి.
అవతార కార్యపు మరో ఘట్టానికి ఆయత్తం
గురుదేవుల గురువరులనే పరిమాణాన్ని మాతృదేవి రెండు స్థితులలో సంపూర్ణం చేసినట్లు చూశాం. వారు ప్రారంభించిన సన్న్యాసుల సంఘానికి ఒక రూపాన్నిచ్చింది మాతృదేవి మొదటి ఘట్ట కార్యం పూర్వాంగం. ఇప్పుడు ఆమె మంత్రదీక్ష అనే మరొక కార్యాన్ని చేపట్టడానికి ఆయత్తమయ్యారు. అందుకు ముందుగా తమను పంచ తపస్సు అనే కఠోర తపస్సుకు గురిచేసుకొన్నారు.
పంచ తపం
పంచ తపస్సనేది ఐదు అగ్నులకు నడుమ కూర్చొని అనుష్ఠించే తపస్సు. చుట్టూ నాలుగు దిక్కులలోనూ ఆరు అడుగుల నడుమ, నాలుగు చోట్ల పెద్దగా అగ్నిని రగుల్చుతారు. మండిపోయే ఎండలో ఆ అగ్ను లకు నడుమ కూర్చొని తలమీద కాస్తున్న మండెటెండను ఐదవ అగ్నిగా భావించి జపమూ, ధ్యానమూ, ప్రార్థనా చేస్తారు.
మాతృదేవి 1893 లో నీలాంబర ముఖర్జీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఇలాంటి కఠోర తపస్సు అనుష్ఠించారు. ఆమెతోపాటు యోగిన్ మా కూడా ఈ తపో కార్యంలో పాల్గొన్నారు. మాతృదేవి కాలాంతరంలో ఈ విషయం ప్రస్తావిస్తూ ఇలా అన్నారు:
“నాలుగు వైపులా ఆరు అడుగుల దూరంలో పిడకలను పేర్చి అగ్ని ప్రజ్వలింపజేశారు. నడినెత్తిన ప్రచండ సూర్యుని తీక్ష కిరణాలు. ఉదయం స్నానంణ ముగించుకొని అగ్ని దగ్గరికి వచ్చాను. అగ్ని ప్రజ్వలంగా మండుతూవుండడం చూసి కాస్త భయం వేసింది. ‘ఇలా భగభగమని మండుతున్న అగ్నిలో ప్రవేశించ గలనా? సూర్యుడు అస్తమించేదాకా కూర్చోగలుగుతానా?’ అనుకొని తటపటా యించాను. తర్వాత మనస్సును దృఢం చేసుకుని ఆ అగ్నిజ్వాలల నడుమ వెళ్లి కూర్చొని గురుదేవుల పవిత్ర నామాన్ని జపం చేయడం ప్రారంభించగానే అగ్ని తాపం మాయమైపోయింది. ఈ తపస్సును నేను ఏడు రోజులు అనుష్ఠించాను. అందువల్ల ఎర్రనైన నా మేని రంగు ఇలా బొగ్గులా నల్లబడిపోయింది.”
తమ ఆధ్యాత్మిక మహాసామ్రాజ్య సరిహద్దులు వ్యాపింపనున్నవి, పలువురు తమను ఆశ్రయించి మంత్రదీక్ష తీసుకుని తరింపనున్నారని స్పష్టంగా గ్రహించారు మాతృదేవి. వారందరి శ్రేయస్సు కోసమే మాతృదేవి ఈ కఠోర తపస్సును అను ష్ఠించారు. కాలాంతరంలో ఒకసారి ఒక భక్తుడు మాతృదేవిని, “అమ్మా! మీరెం దుకు అలాంటి తపస్సు చేపట్టాలి?” అని అడిగాడు. అందుకు మాతృదేవి, “ఏమిటి? పరమేశ్వరుని పొందడానికి పార్వతి కూడా తపస్సు చేయాల్సి వచ్చింది, తపస్సు అత్యంత ఆవశ్యకమయినది. లేకపోతే, ‘ఆమె ఏమిటి! మనలాగే తిని, నిద్రపోతుంది’ అని అంటారు. ఈ తపస్సు కూడా ఇతర వ్రతాలలా స్త్రీలు ఆచరిం చాలి. గురుదేవులు కూడా ఎంత తపస్సు చేశారు! నాయనా! ఇవన్నీ లోక శ్రేయస్సు కోసమే ఆచరింపబడతాయి” అని బదులు చెప్పారు.
మరొకసారి ఇదే ప్రశ్నను అడిగినప్పుడు, “నాయనా! మీ అందరి కోసమే నేను ఆ తపస్సు చేశాను. బిడ్డలు ఇంత కఠోరతను భరింపగలుగుతారా? అందుకే నేనే అనుష్ఠించాను” అని అన్నారు మాతృదేవి.
ఇందుకు మరొక కారణం కూడా ఉంది. ఒక ప్రేతం బారి నుండి తప్పించుకోవడానికి కూడా మాతృదేవి ఈ తపస్సును అనుష్ఠించినట్లు తెలియ వస్తున్నది. ఆమె కామార్పుకూర్లో ఉంటున్నప్పుడు పది పన్నెండేళ్ల బాలిక ప్రేత మొకటి సదా ఆమెను వెంబడించేది. కాషాయ వస్త్రాలు ధరించి, రుద్రాక్ష మాల వేసుకుని, విరబోసిన శిరోజాలతో కొన్ని సమయాల్లో తమకు ముందుగానూ, కొన్ని సమయాల్లో వెనుకా ఆ ప్రేతం వెళ్లడం మాతృదేవి చూశారు. ఆమె కాశీకి వెళ్లినప్పుడు ప్రేతాలను గురించిన శాస్త్రంలో ఆరితేరిన ఒక నేపాళదేశ సన్న్యాసిని ఒకరిని కలుసుకున్నారు. ఆమె మాతృదేవికి అందుకు పరిహార ఉపాయంగా పంచ తపస్సు చేయమని సలహాయిచ్చారు. కొన్ని సమయాల్లో పొడవైన గడ్డంలో ఒక సన్న్యాసి కూడా కనబడి మాతృదేవిని పంచ తపస్సు చేయమని సలహా ఇచ్చేవాడు. ఈ విషయంగా యోగిన్మాతో ఆలోచించి మాతృదేవి చివరకు ఇద్దరూ కలిసి పంచ తపస్సు చేయాలని తీర్మానించి, ఆచరించారు. ఈ పంచ తపస్సు చేసిన తరువాత ఆ బాలికా, సన్న్యాసీ కనబడలేదు.
షోడశీ పూజతో గురుదేవుల సాధన అధ్యాయం సంపూర్ణమైనట్లు పంచ తపస్సు సాధనతో మాతృదేవి తపోమయ జీవితం కూడా సంపూర్ణమయింది. ఆధ్యాత్మిక సామ్రాజ్య మహారాజ్ఞిగా, రామకృష్ణ సంప్రదాయపు దేవిగా, వివేకా నందస్వామి లాంటి జ్ఞానులకు కూడా గురుదేవిగా, లోకం యావత్తు వ్యాపించిన మాతృత్వ స్వరూపంగా ఆమె అవతార కార్యం ప్రారంభమయింది. మాతృదేవి జీవితంలో ఈ సమయమే ఆమె గురు స్థితి పరిపూర్ణంగా వికసించిన కాలం! యోగీన్కు బృందావనంలో మంత్రదీక్ష ప్రసాదించటంతో ఇది మొదలయినా, కామార్పుకూర్ నుండి కలకత్తాకు తిరిగి వెళ్లిన తర్వాతనే ఆమె జీవితంలో అది ప్రాధాన్యత వహించింది. ఈ సమయంలోనే యోగిన్ మా ప్రభృతులు మాతృదేవి బాహ్యస్మృతి నుండి విడివడి అప్పుడప్పుడు ఉన్నత ఆధ్యాత్మిక స్థితులలో నెలకొన డమూ, బాహ్య జగత్తునే పూర్తిగా మరచిపోవడమూ చూశారు. ఈ జగత్తులో ఎక్కడా కానరాని అవ్యాజ కరుణ, ప్రేమ, మాతృత్వం సమ్మిళితమైన ఒక దివ్య తేజస్సు ఆమె ముఖం నుండి వెలువడతూండడం చూశారు. ఈ రోజులలో మాతృదేవి చూసిన ఒక దివ్యదర్శనం ఆమె అవతార కార్యపు పూర్తి పరిమాణాన్ని విశదీకరిస్తుంది.
మాతృదేవి నీలాంబర ముఖర్జీ ఇంట్లో అప్పుడు వసిస్తున్నారు. ఆ రోజు పౌర్ణమి. పూర్ణచంద్రుని చల్లని కిరణాలు జాలువారి లోకాన్ని స్వప్న ప్రపంచంగా మారుస్తూ, గంగానది చిరు అలల మీద పడి ప్రతిబింబిస్తూ ఉండడంతో, ఆ స్వప్న లోకంలో గంగానది ఒక వెండి నదిలా ప్రవహిస్తూవుంది. ఆ పరిసరాలలో మాతృదేవి మైమరచిపోయి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్లి గంగాతీరంలో మెట్లమీద కూర్చొని ఆ అందాన్ని పరికిస్తున్నారు. అప్పుడు హఠాత్తుగా గురు దేవులు అక్కడ ప్రత్యక్షమై, వెనుకవైపు నుండి వస్తూ, మాతృదేవిని స్పృశిస్తూ ఆమెను క్రిందకు తోసేసేలా వెళ్లి చటుక్కున గంగలోకి దిగారు. అలా నీళ్లలోకి దిగినవారు అందులోనే కరిగిపోయారు. ఆశ్చర్యంతో మాతృదేవి ఆ చోటును అలాగే చూస్తూ కూర్చున్నారు. మరుక్షణం నరేంద్రుడు హఠాత్తుగా అక్కడ కనిపిం చాడు. అతడు ఆ నీటిని చేతులలో తీసుకుని, ‘జై శ్రీరామకృష్ణ!’ అంటూ అసం ఖ్యాక ప్రజానీకంపై చిలకరించాడు. ఈ దృశ్యం మాతృదేవి మనస్సులో గాఢంగా నాటుకుపోయింది. ఈ దృశ్యం తర్వాత చాలాకాలం దాకా ఆమె గంగను చూసి నప్పుడల్లా, అందులో పాదాలు పెట్టడం గురుదేవుల దివ్య శరీరంపై పాదాలు మోపడంలా భావించి వెనుకాడుతూ తీరంలోనే నిలబడిపోయేవారు.
గురుదేవులు గంగానది నీటిలో కరిగిపోయి, ఆ నీటిని నరేంద్రుడు మాన వాళిపై చల్లే దృశ్యం, గురుదేవుల ఉపదేశాలనూ, ఆదర్శాలనూ నరేంద్రుడు వ్యాపింపచేసే కార్యం ప్రారంభంగా అమరింది. మాతృదేవి వరకూ, గురుదేవిగా వారి కార్యం ప్రపంచం దృష్టిలో ఎక్కువగా పడకుండా, అణకువగా జరగబో తున్నట్లుగా కూడా తెలుసుకున్నారు. మాతృదేవి ఎక్కడికీ వెళ్లలేదు. అందుకు బదులు నలు దిశల నుండి వేలాది మంది భక్తులు ఉపదేశానికీ, మంత్రదీక్షకూ బృందాలు బృందాలుగా మాతృదేవి ఉంటున్న చోటికే రాసాగారు.
నరేంద్రునికి ఆశీస్సులు
ఈ దృశ్యంలోని నిజాన్ని నిరూపించడానికా అన్నట్లు నరేంద్రుని నుండి మాతృదేవికి త్వరలో ఒక జాబు వచ్చింది. అమెరికాలో జరుగనున్న సర్వమత మహాసభలో పాల్గొనడానికి తాను వెళ్లదలచుకున్నట్లూ, మాతృదేవి అభిప్రాయం కోరుతున్నట్లూ వ్రాశాడు. ఆమె అప్పటికే చూసిన దివ్యదర్శనం మూలంగా గురుదేవుల అనుజ్ఞను పొందివున్నాడు; దానిని స్పష్టం చేసుకోవడానికి మాతృదేవికి ఉత్తరం వ్రాశారు. ఇందుకు బదులు వ్రాయడానికి మాతృదేవి కించిత్తుకూడా ఆలోచించలేదు, ఆలస్యమూ చేయలేదు. నరేంద్రుడు వేసే ప్రతి అడుగులోనూ గురుదేవుల పవిత్ర హస్తాలనే కదా చూశారు మాతృదేవి! అందువల్ల ఆశీస్సుల నందిస్తూ ఉత్తరం వ్రాశారు.
రామకృష్ణ మిషన్
>పాశ్చాత్య దేశాలలో వేదాంత దుందుభిని మ్రోగించి స్వామీజీ 1897 ఫిబ్ర వరిలో మన దేశానికి తిరిగివచ్చారు. ఒకటి రెండు నెలలు డార్జిలింగ్‌లో గడపి ఏప్రిల్‌లో మాతృదేవి కలకత్తాకు వచ్చినప్పుడు ఆమెను దర్శించడానికి వచ్చారు. తన ముద్దుల తనయుణ్ణి కలుసు కున్నప్పుడు కూడా మాతృదేవి తన లజ్జా తెర నుండి బయటికి రాలేదు. శరీర మంతా కప్పుకుని గదిలో నిలబడ్డారు: ఆయనతో సూటిగా మాట్లాడకుండా గోలాప్ మా ద్వారానే మాట్లాడారు. అంటే మాతృదేవి మెల్లగా చెబితే గోలాప్ మా దానిని బిగ్గరగా స్వామీజీకి తెలియబరిచారు.
స్వామీజీతోపాటు ఆయన పాశ్చాత్య శిష్యులు ఒకరిద్దరు కూడా వచ్చారు. ముందుగా స్వామీజీ సాష్టాంగపడి మాతృదేవికి ప్రణమిల్లారు. కానీ మాతృదేవి పాదపద్మాలను తాకలేదు. తనతోపాటు వచ్చిన వారిని కూడా ఆమె పాదాలను తాకవద్దని చెబుతూ, “ఎవరైనా తమ పాదాలను తాకితే మాతృదేవి తమ అవ్యాజ కరుణతో వారి పాపాలను తాను స్వీకరించి, తత్కారణంగా బాధపడతారు. మాటలు కూడా వద్దు. మీ హృదయాలను తెరచి ఉంచండి, మీ ప్రార్థనలను మౌనంగానే ఆమెకు సమర్పించండి, వారి ఆశీస్సులను కోరండి. అది చాలు. ఎందుకంటే మీ హృదయాంతరాళాలు ఆమెకు తెలియనివి కావు కనుక” అన్నారు స్వామీజీ. తర్వాత మాతృదేవి గోలాప్ మా ద్వారా మాట్లాడారు:
మాతృదేవి: డార్జిలింగ్‌లో నీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏమైనా మెరుగు పడిందా?
స్వామీజీ: అవునమ్మా!
మాతృదేవి: గురుదేవు లెప్పుడూ నీతోపాటు ఉంటున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం నువ్వు ఇంకా ఎన్నో పనులు చేయాల్సి వుంది!
స్వామీజీ: గురుదేవుల చేతులలో నేను కేవలం ఒక ఉపకరణంగా ఉండడం చూస్తున్నాను. పాశ్చాత్య దేశాలలో మహోన్నతమైన సంఘటనలు చాలా జరిగాయి. వందలాది స్త్రీ పురుషులు గురుదేవుల ఉపదేశాలను స్వీకరించి నా కార్యంలో సహాయపడ్డారు. ఇవన్నీ చేస్తూవుంటే నేను ఆశ్చర్యపడలేకున్నాను. మీ ఆశీస్సులతోనే నేను అమెరికా వెళ్లాను. అసాధ్యమైన వాటినన్నిటిని కూడా చేసి చూపించే శక్తి మీ కృపాకటాక్షానికి ఉందనడానికి నా విజయమూ, నాకు లభించిన గౌరవమూ నిదర్శనాలు. గురుదేవులు ‘అమ్మా’ అంటూ ఎవరిని పిలిచారో ఆ దివ్యశక్తే నేను అమెరికాలో ఒంటరిగా అలమటిస్తున్నప్పుడు నన్ను చేరదీసి, దారి చూపించింది.
మాతృదేవి: ఆ దివ్యశక్తీ, గురుదేవులూ భిన్నం కారు. నీ ద్వారా గురుదేవులే ఈ కార్యాల నన్నిటిని చేస్తున్నారు. నువ్వు ఆయన అనుంగు శిష్యుడవు, తనయుడవు కదా! ఆయన నిన్ను ఎంతగా ప్రేమించారు! నువ్వు మానవాళికి ఉపదేశిస్తావని కూడా ఆయన ముందుగానే చెప్పారు.
స్వామీజీ: గురుదేవుల సందేశాన్ని వ్యాప్తి చేయడమే నా జీవితకార్యం. అందుకోసం శాశ్వతమయిన ఉద్యమం ఒకదానిని ప్రారంభించాలని అనుకుంటు న్నాను. కానీ నేను అనుకున్నంత వేగంగా అది జరగనప్పుడు మనస్సు చంచల పడుతుంది.
స్వామీజీ ఇలా అన్న తర్వాత మాతృదేవి సూటిగా, “కలతపడకు. నువ్వు చేస్తున్నవీ, ఇక చేయబోతున్నవన్నీ చిరకాలం స్థిరంగా నెలకొంటాయి. దీనిని చెయ్యడానికే నువ్వు జన్మించావు. దివ్యజ్ఞానాన్ని ప్రసాదించే సద్గురువుగా నిన్ను వేలాదిమంది ఆరాధిస్తారు. నీ ఆశయాన్ని త్వరలోనే గురుదేవులు పూర్తిచేస్తారు. ఇది తథ్యం. నువ్వు చేయదలచుకున్న కార్యం త్వరలోనే జరగడం చూస్తావు” అని చెప్పారు.
మాతృదేవి ఈ చల్లని దీవెనలు స్వామీజీ కళ్లను ఆర్ద్రం చేశాయి. “అమ్మా! నేను ఈసారి ఒక్క గెంతులో సముద్రాన్ని దాటలేదు.* పాశ్చాత్యులు తయారుచేసిన ఓడలోనే వెళ్లాను. గురుదేవుల మహత్త్వాన్నే అక్కడ చూశాను” అన్నారాయన.
రామకృష్ణ మఠం
కాలం గడచింది. 1898 ఫిబ్రవరి 3 వ తేది శ్రీరామకృష్ణ మఠం పరిచాలన మవడానికి బేలూరులో స్థిరమైన ఒక స్థలం కొనుగోలు చేశారు. ఏప్రిల్‌లో మాతృదేవిని మొదటిసారిగా ఆ చోటుకు తీసుకువెళ్లారు. ఆమెతో పాటు స్వామీజీ పాశ్చాత్య శిష్యురాండ్రయిన సోదరి నివేదిత, మిసెస్ ఓల్బుల్,* మిస్. జోసఫిన్ మెక్లవుడ్ కూడా వచ్చారు. మఠం సన్న్యాసులూ, బ్రహ్మచారులూ మాతృదేవికి ప్రణమిల్లి, ఆహ్వానించారు. మాతృదేవి పరమానందభరితు రాలయ్యారు. “ఇప్పుడు నా తనయులు తలదాచుకోవ డానికి ఒక స్థలం లభించింది. చివరకు గురుదేవులు వారిని కృపతో కటాక్షిం చారు” అని ఆనందం ఉప్పొంగుతూండగా అన్నారు. మరొకసారి మాతృదేవి వెళ్లి నప్పుడు స్వామీజీ మాతృదేవితోపాటు వెళ్లి మఠమంతా తిరిగి చూపిస్తూ, “అమ్మా! ఇది మీ స్థలం. ఈ స్థలాన్నంతా చూడండి” అని అన్నారు. కాలాంతరంలో బేలూరు మఠం గురించిన తమ స్మృతులను చెప్పేటప్పుడు మాతృదేవి, “హా! మఠం ఎంత ప్రశాంతమైన చోటు! ధ్యానం సహజంగానే అక్కడ చేకూరుతుంది. అందువలననే నరేంద్రుడు ఆ చోటును ఎంపిక చేశాడు” అన్నారు.
అదే సంవత్సరం కాళీపూజ రోజున (నవంబరు 12) మాతృదేవి అక్కడ గురుదేవులను పూజించి, ఆయన కృపా కటాక్షాన్ని అందరికీ పంచిపెట్టారు. తాము పూజిస్తూ వస్తున్న గురుదేవుల పటం తీసుకువచ్చి, తమ చేతులతోనే ఆ స్థలంలోని ఒక భాగాన్ని శుభ్రం చేసి, అక్కడ ఆ పటాన్ని ఉంచి గురుదేవులను పూజించారు. నిజంగానే గురుదేవులు అక్కడ వెలసి ఉండడాన్ని అప్పటికే ఒక దర్శనంలో చూసినట్లు కూడా కాలాంతరంలో మాతృదేవి చెప్పారు.
ఇలా స్వామీజీ ప్రయత్నాలు మాతృదేవి కృపాకటాక్షం వల్ల ఫలించాయి. రామకృష్ణ మిషన్ వారాంతర సమావేశం ప్రతి ఆదివారం బలరాంబోసు ఇంట్లో జరగడం మొదలయింది. మాతృదేవి భక్తురాండ్రతో చాలాసార్లు ఈ సమావేశా లలో పాల్గొన్నారు. మాతృదేవి సమక్షంలో స్వామీజీ పలుమార్లు గానం కూడా చేశారు.
రామకృష్ణ సంఘ ఆవిర్భావం, దాని పురోగతిలో ప్రతి మెట్టూ మాతృదేవి కృపాకటాక్షంతోనే జరిగాయి. ఇలా తమ అవతార కార్యంలో ఒక భాగమైన రామ కృష్ణ సంఘ ఆవిర్భావ కార్యాన్ని నిర్వర్తించారు సంఘ జనని అయిన మాతృదేవి. ఆ తర్వాత కూడా ఆమె జీవితాంతం దాకా కృపాకటాక్ష అనుజ్ఞానుసారమే సంఘం కార్యోన్ముఖమయింది. సన్న్యాసులు ఈ సంఘ చాలక అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, నిజానికి మాతృదేవియే అధ్యక్షురాలు. ఈ విషయం తర్వాత వివ రంగా చూద్దాం.
ఈ కాలఘట్టంలో జరిగిన సంఘటనలను కాలక్రమంగా వివరించడం సాధ్యం కాదు. 1897 వరకు కామార్పుకూర్, జయరాంబాటి, కలకత్తా అంటూనే మాతృదేవి జీవితం కొనసాగింది. ఇందులో ఆమె ఎప్పుడు ఎక్కడ ఉన్నారు అనే విషయాలకు ప్రాధాన్య మివ్వక, సంఘటనలకూ దాని అంతరార్థాలకూ మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ, ఇచ్చట మనం వాటిని క్రమపరం చేశాం.