దుఃఖం ఎందుకు?
లోకంలోని చింతనాశీలురనూ, తత్వవేత్తలనూ ‘ఈ లోకంలో దుఃఖం ఎందుకు ఉంది?’ అనే ప్రశ్న వేధించినంతగా మరే ప్రశ్నా వేధించి ఉండదనడం అతిశయోక్తి కాదు. ఈ ప్రశ్నకు సమాధానమేమిటో సర్వుల చింతనా శక్తికి అందనిదై ఉంది. బహుశా శ్రీ వివేకానంద స్వామి అన్నట్లుగా, “హిందువు, ‘నాకు తెలియదు’ అని అంటాడు కదా, అంతకు మించి ఏమీ చెప్పలేము’ అన్నదే సముచిత జవాబు ఏమో! కానీ దుఃఖం అనేది ఉంటూ ఉండడం అనుభవైకవేద్యమే. దీనిని ఎవరూ కాదనలేరు. అందువల్లనే మహా త్ములు దుఃఖాన్ని జీవితపు మరోప్రక్కగా స్వీకరిస్తారు. వారు దుఃఖంలో కొట్టుమిట్టా డరు; అటూ ఇటూ పర్వులెత్తి వారినీ వీరినీ సంప్రతించి, పరిస్థితులను మార్చి దుః ఖాన్ని నివారించడానికి ప్రయత్నించరు. వచ్చే దుఃఖాలను యథాతథంగా స్వీక రించి వాటిని తమ జీవిత పురోగమనానికి ఒక సోపానంగా ఉపయోగించు కొంటారు. ఈ లోకమే బ్రహ్మాండమైన నాటకరంగం, మనలో ప్రతి ఒక్కరికీ ఒక పాత్ర కేటాయింపబడింది. సుఖ దుఃఖాలు మనకు గురువులు. ఇందులో సుఖాను భవాలకంటే దుఃఖానుభవాలు ఇచ్చే తర్ఫీదే మనం మన పాత్రను చక్కగా అవ గతం చేసుకొనేలా చేస్తుంది. కనుక కుంతి, ‘భగవంతుడా! మాకు మరిన్ని దుఃఖాలే కలుగుగాక! దుఃఖానుభవాలే మేము నిన్ను స్మరించేటట్లు చేస్తాయి’* అని ప్రార్థన చేసింది. అందువలన దుఃఖాన్ని స్వీకరించడానికి తగిన మనోపరిపక్వ తను రూపొందించుకోవడం ఎంతో అవసరం.
నిజమేమిటంటే, జీవితంలో ఎదురయ్యే కష్టాలను, దుఃఖాలను ప్రశాంతంగా సహించి అవి నేర్పే గుణపాఠాలను మనం స్వీకరించినప్పుడు. అది మనోనిబ్బరతను పెంపొందిస్తుంది, ఆధ్యాత్మిక శక్తిని ప్రసాదించి, ఇతరులు గౌర వించే ఉన్నత స్థితిని మనకు కల్పిస్తుంది. కాబట్టి సహనంతో దుఃఖాలను స్వీకరించడం ఒక మహత్తరమైన తపస్సు అవుతుంది. సన్న్యాసులు ప్రాపంచిక సుఖాలను పరిత్యజించి అనుష్ఠించే తపస్సు కంటే ఈ తపోజీవితాన్ని ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఒక మహాత్ముడు.
మాతృదేవి మహత్తర తపస్సు
గురుదేవిగా జగజ్జననిగా పరిణమింప నున్న మాతృదేవికి ఆధ్యాత్మిక శక్తి ఆవశ్యకత కలిగింది. అందుకే బృందావనం నుండి 1887 ఆగస్టులో తిరిగి వచ్చిన మాతృదేవి ఇలాంటి తపోజీవితానికి తమను అర్పించుకున్నారు. మహిళా లోకానికి వెలుగును ప్రసాదించే దివ్య జ్యోతిగా అవతరించారు మాతృదేవి. అందు వల్ల సామాన్య స్త్రీలు సైతం చేపట్టగల, అదే సమయంలో ఇతర తపస్సులకన్నా ఉన్నతమయినదయిన ఈ దుఃఖపూరిత జీవితమనే తపస్సును చేగొన్నారు. నేటి మహిళ తన జీవితంలో ఎదుర్కోవలసిన ఎలాంటి సమస్య అయినా ఈ కాల ఘట్టంలో మాతృదేవి జీవితంలో చోటు చేసుకోకుండా ఉండలేదు; నేటి మహిళ స్థితిగతులకన్నా ఏ విధంగాను మెరుగ్గా ఉండలేదు. కానీ ఇంతకీ ఆమె తమ స్థితిగతులను విడమరిచి ఎవరి సహాయాన్నైనా యాచించి ఉండాలి కదా! ఎవరి నైనా తప్పుపట్టివుండాలి కదా! ఎవరినైనా దూషిస్తూ పల్లెత్తుమాట ఆమె నోటి నుండి వెలువడివుండాలి కదా! లేనే లేదు. ఎందుకంటే, ఇది తమకు ఆవశ్యకమని తెలుసుకుని ఇచ్ఛాపూర్వకంగా ఆమె ఈ తపోమయ జీవితాన్ని ఎంచుకున్నారు. ఇది నారీలోకానికి ఆదర్శప్రాయంగా వెలుగొందడమే కాకుండా; తమ అవతార కార్యాన్ని నెరవేర్చడానికి కావలసిన శక్తిని కూడా ఆమెకు ఒసగింది.
ఈ దుఃఖమయ జీవి తాన్ని మాతృదేవి కావాలని ఎంచు కోవడం
గురుదేవుల జీవితంలోనూ, మాతృదేవి జీవితంలోనూ, సాధనలనో, తపో పద్ధతులనో వెదుక్కుంటూ వారైవారు వెళ్లలేదు. ఎలాంటి పరిస్థితులనైనా స్వీకరించడానికి వారు సంసిద్ధులై ఉన్నారు; అవి వచ్చేటప్పుడు వాటిని ఉపయోగించుకుని తాము సాధింపదలచుకున్న దానిని సాధించారు. మాతృదేవి ఈ దుఃఖపూరిత జీవి తాన్ని కావాలని ఎంచుకుని, దానిని తపోమయ జీవితంగా మలచుకున్నారు. గురుదేవుల సంకల్పం కూడా అదే. కాశీపూర్ రోజులలో ఆయన ఒక రోజు మాతృదేవిని పిలిచి, ‘నా తదనం తరం నువ్వు కామార్పుకూర్కు వెళ్లి, అక్కడ నివసించు. ఏమైనా ఆకు కూరలు పండించుకో. వట్టి అన్నమో, ఉడకబెట్టిన ఆకుకూరలో, దొరకింది తింటూ, ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించు. కానీ ఒక విషయం. ఒక చిల్లికాసైనా ఎవరి వద్దా చేయిచాచి యాచించవద్దు. చేతులు చాచావంటే నీ తలను కుదువ బెట్టినట్లే. భక్తులెవరైనా ప్రీతితో నిన్ను తమ ఇంటవుండమని ఆహ్వానించవచ్చు. అలాంటి ఆహ్వానాన్ని కూడా మన్నించకు. అంతకంటే బిచ్చమెత్తి జీవించడం ఉత్తమం. కామార్పుకూర్లోని నీ సొంత ఇంటిని వదలవద్దు. తిండితిప్పలకు ఎలాంటి లోటు రాదు’ అని చెప్పి ఉన్నారు. కానీ గురుదేవులు చెప్పినది యథాతథంగా మాతృదేవి స్వీకరించేవారు కారని మునుపే చూశాం. కాలాంతరంలో ఒక సందర్భంలో యోగీన్ మా మాతృదేవితో, “అమ్మా! కొన్ని సమయాల్లో గురుదేవుల సలహాలను సైతం పాటించక దృఢంగా ఉండిపోయారు కదా! అది ఎలానమ్మా?” అని అడిగింది. అందుకు మాతృదేవి చిరునవ్వుతో, “యోగీన్! ప్రతి విషయం లోనూ మరొకరికి తలొగ్గి నడవడం సాధ్యమయ్యే పనేనా?” అంటూ బదులు చెప్పారు. మరొక సందర్భంలో వైవాహిక జీవితం గూర్చి చెబుతూ, “కాలమంతా పూర్తిగా ఒక వ్యక్తికి తలవొగ్గి నడుస్తూ, ఆతడి బలహీనతలనన్నిటికీ తాళం వేస్తూ గడిపే జీవితం, జీవిత మవుతుందా?” అని అన్నారు. అందువల్ల భర్తకు తగిన భార్యగా మాతృదేవి జీవితం గడిపారు అని చెప్పినప్పుడు, భర్త ఏది చెప్పినా, ఆలో చనారహితంగా దానిని తు.చ. తప్పక పాటించారు అని అర్థం కాదు. గురు దేవులు కూడా దానిని ఆకాంక్షించలేదు. “ఇది గురుదేవుల ఆజ్ఞ కాదు. ఇలాంటి జీవితాన్ని మాతృదేవి అనుసరించవచ్చు అని మాత్రం సూచించారు” అంటారు శ్రీ గంభీరానందస్వామి. కనుక కామార్పుకూర్ జీవితాన్ని మాతృదేవి ఇచ్ఛాపూర్వకం గానే స్వీకరించారనడం సబబు.
ఇక రాబోయే రోజులు దుఃఖమయంగా ఉంటవని మాతృదేవికి తెలుసు. గురుదేవులు సజీవులై ఉన్నప్పుడే హృదయ్ ఆమెను అవమానపరచడం విదితమే. రామ్‌లాల్ అర్చకుడుగా నియమితుడయ్యాక గురుదేవులను గౌరవించడం మాను కొన్నాడు. ఇలాంటి బంధువులు కామార్పుకూర్లో మాతృదేవికి ఎలాంటి స్వాగత మిస్తారో ఆమెకు తెలియనిది కాదు. కాశీపూర్ రోజులలో ఒక రోజు గురుదేవులు రామ్‌లాల్‌తో, “ఇదిగో చూడు! నీ పిన్నమ్మ కామార్పుకూర్లో నివసించేలా చూసుకో” అన్నారు. అందుకు రామ్‌లాల్, “ఆమె ఎక్కడైనా వసించనీ” అంటూ పరిహాసపూర్వకంగా బదులు చెప్పాడు. ఆతడి జవాబులోని భావాన్ని గ్రహించిన గురుదేవులు, “ఏం మాట లంటున్నావు? నువ్వు కూడా ఒక మనిషిగా జన్మిం చావే!” అన్నారు ఆవేదనతో. కామార్పుకూర్ రోజుల గురించి మాతృదేవిని ఏదైనా సందేహం ఉన్నా, అది రామ్‌లాల్ సమాధానం విన్న తర్వాత నివృత్తి అయి వుంటుంది. మాతృదేవిపరంగా చూస్తే గురుదేవుల నిర్యాణం కంటే గొప్ప దుఃఖం ఆమె జీవితంలో మరొకటి ఉండదు. అందువల్ల బృందావనంలో అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలను పొందిన మాతృదేవి దుఃఖమయ కాలఘట్టంలో తపోమయ జీవితాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యారు.
రామ్‌లాల్ ‘కైంకర్యం’
మాతృదేవి బృందావనం నుండి తిరిగి రావడానికి ముందుగానే రామ్‌లాల్ తనకు చేతనయినంత చేసేశాడు. మధుర్‌బాబు, రాణీరాస్మణీ చేసిన ఏర్పాటు ప్రకారం గురుదేవులకు నెల జీతంగా ఏడు రూపాయలు చెల్లించేవారు. గురుదేవుల నిర్యాణానంతరం ఆ జీతాన్ని మాతృదేవికి ఇస్తూవచ్చారు. రామ్లాల్తోపాటు ఆలయ నిర్వాహకుడయిన దీనా నాథ్ కలిసి, గురుదేవుల భక్తులు మాతృదేవిని పోషిస్తున్నారు కాబట్టి వారికి డబ్బు ఆవశ్యకత లేదని చెప్పి ఇచ్చే జీతాన్ని ఆపుచేయించారు. మాతృదేవి ఈ విషయం విన్నప్పుడు కించిత్తు కూడా కలత చెందక, “ఆపితే ఆపనీ! ఆయనే వెళ్లిపోయారు! డబ్బుతో నేనేం చేసుకుంటాను?” అని మాత్రం అన్నారు.
కానీ ఈ విషయం తెలుసుకున్న నరేంద్రుడు ఆలయ నిర్వాహకుల వద్దకు వెళ్లి, ఆ జీతాన్ని మునుపటిలా మాతృదేవికి అందజేయమని పరిపరి విధాల ప్రాథేయపడ్డాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఆ తర్వాత గురుదేవుల భక్తు లందరూ సమావేశమై ప్రతి నెలా మాతృదేవికి పది రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఏ కారణం వల్లనో ఆ ప్రతిపాదన అమలుకాలేదు.*
బృందావనం నుండి కలకత్తాకు వచ్చి ఒక వారం రోజులు బలరాంబోసు ఇంట్లో బసచేసి, మాతృదేవి కామార్పుకూర్కు బయలుదేరారు. యోగిన్ మా, గోలాప్ మా, ఇంకా ఒకరిద్దరు భక్తులు ఆమెతోపాటు వెళ్లారు, బయలుదేరడానికి ముందుగా మాతృదేవి దక్షిణేశ్వరం వెళ్లి కాళీమాతను, ఇతర దేవుళ్లను దర్శించి, ఆరాధించారు. గురుదేవులు నివసించిన గది, నహబత్తు, పంచవటి ఇత్యాది చోట్లనూ చూసివచ్చారు. దుఃఖంతో కలగలసిన ఎన్నెన్ని మధుర స్మృతులు ఆమె హృదయంలో జనించి అణగిపోయివుంటాయో! చెరగని
కామార్పుకూర్కు అభిముఖంగా
మధుర స్మృతులతో అక్కణ్ణుండి సెలవు పుచ్చుకొన్నారు. ఆనందమయ కాలఘట్టంలో తమతోపాటు నివసించిన లక్ష్మి ఇప్పుడు తమ్ముళ్లతో దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది. దుఃఖంతో వెంటవచ్చేది ఆ వ్యక్తి నీడ మాత్రమే అన్న మాట ముమ్మాటికీ నిజం.
బర్ద్వాన్ వరకు అందరూ రైలులో పయనించారు. అంత దూరం వెళ్లడానికి సరిపడ డబ్బు మాత్రమే ఉంది. ఆ తర్వాత కాలినడకే. మొదటి ఘట్టంగా పద హారు మైళ్లు నడచి ఉచ్చలన్ అనే చోటికి చేరుకున్నారు. మాతృదేవి బాగా అలసి పోయారు. అందువల్ల అక్కడ కొంత విశ్రాంతి తీసుకున్నారు. గోలాప్ మా తయారుచేసిన కిచ్చడీని బాగా ఇష్టంగా తిన్నారు. పిదప అందరూ కలిసి కామార్పుకూర్ చేరుకున్నారు. గోలాప్ మా తప్ప తక్కిన వారందరూ మాతృదేవితో పాటు మూడు రోజులుండి కలకత్తాకు తిరిగి వెళ్లపోయారు. గోలాప్ మా ఒక నెల రోజులు అక్కడ గడిపింది.
ఆనాటి సమాజం వితంతువుకు గౌరవాన్ని, అంతస్తును కల్పించడానికి తయారై లేదు. వితంతువుకు ఎటువంటి వినోదాలు నిషిద్ధం. ఆమెను ఒక జీవచ్ఛవంలా చూసేవారు. గ్రామాలలో ఈ నియమాలు మరీ విపరీతం. ఇక్కడ ఒక వితంతువు – పూర్తిగా తెలుపు రంగు చీర కాక అందులో ఎఱ్ఱని అంచు చీర ధరించడం, చేతులకున్న బంగారు గాజులు తీసివేయకపోవడం గ్రామస్థులకు ఇంతకన్నా మరేం కావాలి? సానుభూతి కలగడానికి బదులుగా కోపమూ ఉక్రో షమూ కలిగి మాతృదేవిని, ‘ఉల్లాస వితంతువు’ అంటూ చిన్నబుచ్చి మాట్లాడుకో సాగారు. మాతృదేవితో నెలరోజులు ఉన్న గోలాప్ మా గ్రామ ప్రజల అవహేళ నలు మాతృదేవిని సమీపించకుండా జాగ్రత్త వహించింది. ఆమె వెళ్లిపోవడమే ఆలస్యం, గ్రామస్థులు తమ ఏవగింపును నానారకాలుగా వెలిబుచ్చారు. ఏం చేయాలో తోచక మాతృదేవి కలత చెందారు.
కానీ జయరాంబాటిలో ఒక భాను అత్తలా, కామార్పుకూర్లో మాతృదేవికి ఎంతో స్వాంతన నిచ్చిన వ్యక్తి ప్రసన్నమయి. చిన్నతనంలోనే గురుదేవులను భగ వంతునిగా ఎంచి ఆరాధించిన వ్యక్తి ఈమె. వృద్ధురాలైన ఆమె కూడా ఒక వితంతువు. ఆమె భక్తి, పవిత్ర జీవితం గ్రామస్థులకు ఆమె పట్ల గౌరవాన్ని కలిగించాయి. మాతృదేవిని దూషించిన గ్రామ ప్రజలతో ఆమె “గదాయ్ భార్య సామాన్యమైన స్త్రీ కాదు. గదాయ్లా ఈమె కూడా దైవమే” అంటూ పలు విధాలుగా నచ్చజెప్పింది. ఆమె మాటలు విన్న తర్వాత గ్రామ ప్రజల ధోరణి పూర్తిగా మారకపోయినా కొంతలోకొంత మారింది.
ప్రసన్నమయితోపాటు కామార్పుకూర్లో మాతృదేవికి అండగా నిలిచింది ధనీ అనే వృద్ధురాలు.* ఆమె కూడా మాతృదేవిని తన ప్రాణంగా ప్రేమిస్తూ ఆమెకు అండగా నిలిచింది.
దారిద్ర్య దుర్భరత
భగవంతుడు చూపిన దారి అంటూ ఆయన పాదపద్మాల మ్రోల తమను పూర్తిగా సమర్పించుకున్నారు మాతృదేవి. ఆమెవద్ద చిల్లి గవ్వకూడా లేదు. కాసిని ధాన్యం ఉంది. ఆ ధాన్యాన్ని దంపి, దానిని వండి అన్నం మాత్రం గురుదేవులకు నైవేద్యంగా అర్పించేవారు. తాము కూడా అదే తినేవారు. తర్వాత ఒక రోజు తామే ఒక గునపం తీసుకుని తోటను బాగుచేసి తోటకూర విత్తనాలు చల్లారు. ఈ తోటకూర పెరిగే దాకా కేవలం ఒట్టి అన్నం మాత్రమే తిన్నారు. అందులో కలుపుకోవడానికి కావలసిన ఉప్పు కొనడా నికి కూడా డబ్బు లేదు. ధరించిన దుస్తులు చిరిగిపోతే వాటిని ముడివేసి ధరించ సాగారు. దారిద్ర్యం ఆమెను ఎంతగా బాధించిందో తెలుస్తూనే ఉంది కదా!
బంధువుల ఛీత్కారం
సమాజ కట్టుబాట్ల కారణంగా గ్రామస్థులు మాతృదేవిని దూషించారంటే, బంధువులు అంతకంటే ఒక మెట్టు పైకెక్కి ఆమెను ఛీత్కరించారు. ఒక వితం తువు సుమంగళిలా జీవించగోరుతున్నదనే కారణం వల్లనో, లేకపోతే గ్రామస్థులు తమను కూడా వెలివేస్తారనే భయంతోనో బంధుగణం ఇలా ప్రవర్తించిందో తెలియరాలేదు. ఏకాకియైన మాతృదేవికి తోడునీడగా ఉండవలసిన వారు గురు దేవులు అన్న రామేశ్వరుని సంతానమైన లక్ష్మి రామ్‌లాల్, శివరామ్‌లు. కానీ దక్షిణేశ్వర కాళికాలయ ప్రధాన పూజారియైన రామ్‌లాల్ ఎలాంటి సహాయమూ చేయకపోవడమే కాక, మాతృదేవికి ప్రతి నెలా వచ్చే ఏడు రూపాయలను కూడా ఆపించేసిన ప్రబుద్ధుడు. శివరామ్ మాతృదేవి పట్ల ఎంతో ఆప్యాయత చూపాడు. ఉపనయనం తర్వాత ప్రథమ భిక్షను మాతృదేవి నుండే స్వీకరించాడు. కానీ మాతృదేవికి ఎలాంటి సహాయమూ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆతడున్నాడు. ఆతడు తన అన్నతో దక్షిణేశ్వరంలోనే ఉన్నాడు. లక్ష్మి కూడా సోదరులతో పాటు దక్షిణేశ్వరంలోనే ఉండిపోయింది.
ఒకసారి దక్షిణేశ్వరం నుండి వచ్చిన రామ్‌లాల్ తనతోపాటు నలుగురైదు గురు బంధువులను తోడ్కొని వచ్చి కుటుంబ ఆస్తిపాస్తులను త్వరత్వరగా పంపకం చేసి, మాతృదేవి వాటాగా గురుదేవులు జన్మించిన చిన్న గుడిసెను అప్పజెప్పి, కులదైవమైన రఘువీరుని పూజకు, నైవేద్యానికి ఏర్పాట్లు చేసి తిరిగి వెళ్లి పోయాడు.
ఈ పరిస్థితిలో మాతృదేవికి ఒకింత ఊరడింపుగా ఉన్నవారు ఎప్పుడో ఒక సారి వచ్చిపోయే భక్తులు మాత్రమే. పేదరికం కారణంగా భక్తులలో పలువురు కామార్పుకూర్ వెళ్లలేకపోయారు. అరుదుగా వచ్చే భక్తులను ఆహ్వానించి మాతృ దేవి ఉపచరించేవారు. వారికి తమ పేదరికమూ, దుఃఖమూ తెలియరాకుండా జాగ్రత్త వహించేవారు. తమ పరిస్థితిని ఎవరికీ, ఎన్నడూ మాతృదేవి చెప్పుకొన్నది లేదు.
తపోజ్వాల, ఆధ్యాత్మిక ధ్యాస
ఇలా తమంతట తామే ఏర్పరచుకున్న తపోమయ జీవితంలో పూర్తిగా లయమయిపోయారు మాతృదేవి. ఆమె బాహ్యజీవితం పేదరికం, ఆవేదనలతో సమ్మిశ్రితమై తపోజ్వాలలో దగ్ధమయ్యే అదే సమయంలో ఆమె ఆంతరిక జీవితం ఆధ్యాత్మిక అనుభవాలతో ఆనం దంతో తొణకిసలాడసాగింది. గురుదేవుల దర్శనమూ, ఆధ్యాత్మిక దర్శనాలూ, అనుభూతులూ ఆమె ఆంతరిక జీవితాన్ని పరిపూర్ణం చేశాయి. పేదరికమూ, ఒంటరితనమూ తప్ప మాతృదేవి ముఖ్యమైన రెండు సమస్యలు ఆధ్యాత్మిక అనుభవాలతో పరిష్కృతమయ్యాయి. మాతృదేవి వితంతు జీవితాన్ని స్వీరించకపోవడమే గ్రామప్రజల దూషణలకు కారణం. దివ్యమయులైన భర్త తమతోపాటు ఉంటున్నప్పుడు ఆమె ఎలా వింతువవుతారు? – ఇది మొదటి సమస్య. చిన్నతనం నుండే గంగానది పట్ల మాతృదేవికి ఎనలేని భక్తిప్రపత్తులు ఉండేవి. దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు నిత్యమూ ఆ పవిత్ర నదిలో స్నానం చేసి ఆనందించిన వ్యక్తికి ఇక్కడ అది లేకపోవడం పెద్ద లోటు. ఇది రెండవ సమస్య. ఈ రెండు సమస్యలూ అద్భుతమయిన ఒక ఆధ్యాత్మిక దర్శనంతో పరిష్కరింప బడ్డాయి. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు:
గురుదేవ – గంగ
“బృందావనం నుండి తిరిగి వచ్చి నేను కామార్పుకూర్లో ఉంటున్నప్పుడు గ్రామవాసుల నోటికి భయపడి చేతులకు ధరించిన గాజులను తీసివేయడానికి ప్రయత్నించాను. వాటిని వేసుకున్నందుకు ఇప్పటికీ నన్ను దూషించడం మొదలుపెట్టారు. దానితోపాటు గంగలో స్నానం చేయాలని నేను ఎంతగానో అభిలషించాను. కానీ గంగానది చాలా దూరంగా ఉంది. ఏం చేయాలి? ఒక రోజు ఇలా ఆలోచిస్తున్నప్పుడు గురుదేవులు భూతికాల్ వైపునుండి ఇంటి వైపు రావడం చూశాను. నాకు ఆశ్చర్యం వేసింది. ఆయనను వెంబడించి నరేంద్రుడు, రాఖాల్, బాబూరాం ప్రభృత శిష్యులూ భక్తులూ వస్తూవున్నారు. గురుదేవుల దివ్యపాదాల నుండి నీరు ఊటగా విరజిమ్ముతూ, ఆయనకు ముందు అలలలా లేస్తూ ప్రవహిస్తూన్నది. ఈ దృశ్యం చూడగానే, “ఓ! ఆయనే సమస్తమూ అయివున్నారు! ఆయన పాదాల నుండే గంగ పొంగి వస్తున్నది!” అని నాలో నేను చెప్పుకుంటూ రఘువీరుని ఆలయం వద్ద ఉన్న చెట్టు నుండి రెండు చేతుల నిండా పువ్వులు తీసుకువచ్చి ఆ గంగకు అర్పించి ప్రణమిల్లాను.* ఇంతలో నన్ను సమీపించిన గురుదేవులు, “గాజులు తీసే యకు! వైష్ణవతంత్రాల గురించి నీకు తెలుసా?” అని అడిగారు. నేను, “అదేమిటి! నాకు తెలియదే!” అన్నాను. అందుకు ఆయన, “ఈ రోజు మధ్యాహ్నం గౌరీ వస్తుంది. ఆమె ఈ విషయంగా నీకు వివరిస్తుంది” అన్నారు. అంతలో ఆ దృశ్యం చెదరిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం గురుదేవులు చెప్పి నట్లే గౌరీ వచ్చింది. ఆమె నుండి, ‘స్త్రీకి భర్త చిన్మయుడు’* అని తెలుసు కున్నాను.”
ఇలాంటి దృశ్యాల కారణంగా మాతృదేవి అత్యున్నత ఆధ్యాత్మిక స్థితుల లోనే మగ్నులవసాగారు. ఆధ్యాత్మిక శక్తి కూడా వారి నుండి అభివ్యక్తం కాసా గింది.
ఆగు అనగానే ఆగిన వాన
ఈ సమయంలో ఒరిస్సా నుండి ఒక సాధువు అక్కడికి వచ్చి ఒంటరిగా ఒక గుడిసెలో ఉంటూ, తపోమయ జీవితం గడపసాగాడు. ఒక రోజు కొందరు దుష్టులు ఆయన గుడిసెకు వెళ్లి ఆయనను చితకబాది పూజాద్రవ్యాలను ఛిన్నాభిన్నం చేసి, ఆయనను వేధించారు. దాంతో ఆయన కామార్పుకూర్ వదలి వెళ్లిపోవా లని నిశ్చయించుకొన్నాడు. ఆ సంగతి మాతృదేవికి తెలిసింది. తమకు గ్రామస్థులు కలిగిస్తున్న బాధలను గురించి మాతృదేవి అంతగా పట్టించుకోలేదు. ఆ సాధు వుకు ఎలాగైనా సాయపడాలని ఆమెకు అనిపించింది. తమకు తోడుగా కొందరిని తీసుకుని అక్కడికి వెళ్లారు. వారి సహాయంతో హల్దార్పుకూర్కు వాయవ్య తీరంలో ఒక చిన్న గుడిసెను నిర్మించసాగారు. సరిగ్గా అప్పుడే ఆకాశంలో కారు మబ్బులు క్రమ్మాలా! వెంటనే భారీగా వానవచ్చే సూచనలు కనిపించాయి! మాతృ దేవి చేతులు జోడించి, “భగవంతుడా! ఆగాలి! గుడిసె నిర్మాణం పూర్తికాగానే మీ ఇష్టానుసారం వర్షించవచ్చు” అంటూ ప్రార్థించారు. అలాగే గుడిసె మీద ఆకు లన్నీ పరచిన తర్వాతే వర్షం కురిసింది. సాధువును కూడా ఆ గుడిసెలో నివసిం చేలా చేశారు. అటువైపుగా వెళ్లేటప్పుడల్లా, “స్వామీజీ ఎలా ఉన్నారు?” అంటూ క్షేమం విచారించేవారు మాతృదేవి. ఆ సాధువు ఎక్కువ రోజులు జీవించలేదు. గుడిసెలో నివసించడం మొదలుపెట్టిన కొంత కాలానికే ఆయన మరణిం చాడు.
‘ఆగు’ అన్నప్పుడు వర్షం ఆగడమే కాకుండా ‘వర్షించు’ అనగానే వర్షిం చడం కూడా జరిగింది. కాలాంతరంలో ఒకసారి జయరాంబాటిలోనూ, దాని పరిసరాలలోనూ బొత్తిగా వానలు పడకపోవడంతో కరవు విలయ తాండవం చేసింది. ఒక రోజు గ్రామ ప్రజలందరు కలిసి మాతృదేవి వద్దకొచ్చి, “అమ్మా! ఈ సంవత్సరం కూడా వర్షాలు కురవకపోతే అందరూ తప్పక చావాల్సిందే” అంటూ మొరపెట్టుకున్నారు. వారి దుఃఖం చూసి కరిగిపోయిన మాతృదేవి వారితోపాటు పొలాలకు వెళ్లారు. ఎండి బీడుపట్టిపోయిన పొలాలను చూసి ఆమె కన్నీళ్లు ఆపు కోలేకపోయారు. అత్యంత భక్తిశ్రద్ధలతో చేతులు జోడించి, ‘భగవంతుడా! ఇదేం ఘోరం! కాటకంతో అందరూ చావాల్సిందేనా!’ అంటూ హృదయం ద్రవించేలా ప్రార్థించారు. ఆ రాత్రే వాన, వాన, వాన ఎంత వాన కురిసిందంటే దానితో వారి కాటకం తీరిపోయింది.
మృదుత్వం –కాఠిన్యం
ఒరిస్సా సాధువుపై దాడి చేసిన దుష్టులు ఏ సమయంలోనైనా ఒంటరిగా గుడిసెలో వసిస్తూన్న మాతృదేవికి కూడా హాని తలపెట్టవచ్చు. అలా జరిగితే వారిని వారించడానికో ఎందుకని ప్రశ్నించడానికో అక్కడ ఎవ్వరూ లేరు. కానీ కష్టం వారి నుండి కాకుండా గురు దేవుల భక్తుడయిన హరీష్ అనే వ్యక్తి రూపంలో వచ్చింది. ఆతడు గురుదేవుల గృహస్థ భక్తుడు, గురుదేవుల సన్న్యాస శిష్యులు నివసిస్తూ తపస్సు చేసిన వరాహ నగర మఠానికి అప్పుడప్పుడూ వచ్చేవాడు. అతను కూడా సన్న్యాసం పుచ్చుకొంటాడేమోననే భయంతో ఆతడి భార్య అతని మనస్సును తన వైపుకు తిప్పుకోవడానికి గట్టిగా ప్రయత్నించింది. అందు నిమిత్తం మందులూ మాకులూ ఉపయోగించింది; కానీ పర్యవసానం విపరీతమై ఆతడికి మతిస్థిమితం లేకుండాపోయింది. ఆ స్థితిలో అతడు కామార్పుకూర్కు వచ్చాడు. ఆతణ్ణి చూడ గానే ఆతని వల్ల ఏదైనా ప్రమాదం జరగవచ్చునని ఊహించిన మాతృదేవి వెంటనే ఎవరైనా వచ్చి ఆతణ్ణి తీసుకు వెళ్లమని వరాహ నగరానికి జాబు వ్రాశారు. ఆ ఉత్తరం చూసి శరత్, నిరంజన్ బయలుదేరి వచ్చారు. కానీ వారు వచ్చేలోపుగానే పరిస్థితి విషమించింది. ఈ విషయంగా మాతృదేవి ఇలా అన్నారు: “అప్పుడు హరీష్ కొన్ని రోజులుగా కామార్పుకూర్లో ఉండసాగాడు. భార్య కారణంగా ఆతడు మతి స్థిమితం కోల్పోయాడు. ఒక రోజు పొరుగు ఇంటికి వెళ్లి, ఇంట్లోకి వెళుతున్నాను. అప్పుడు ఆతడు నన్ను తరమసాగాడు. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎలా తప్పించుకోవాలో నాకు పాలుబోలేదు. ముందుగా అక్కడి ధాన్యం గాదె వెనుక నక్కాను. అక్కడికి కూడా వచ్చి తరమసాగాడు. నా కాళ్లు అలసిపోయే దాకా ఏడెనిమిదిసార్లు ఆతడి చేతులకు అందకుండా ఆ గాదె చుట్టూ పరు గెత్తాను. ఇక ఆ తర్వాత నేను ఓర్చుకోలేకపోయాను. నా స్వస్వరూపాన్ని ఆవ హింపచేసుకొన్నాను.* ఆతణ్ణి పట్టుకుని చెంపలు ఎడాపెడా వాయించి, క్రిందపడ దోశాను. నా మోకాలును ఆతని ఛాతీ పై ఉంచి, నాలుకను పట్టుకుని బయటికి లాగి, మళ్లీ చెంపలను నా శక్తినంతా ఉపయోగించి వాయించాను. నా రెండు చేతులు ఎర్రబారేదాకా వాడి చెంపలు వాయించాను. ఆతడు ఊపిరాడక గిలగిల్లా డాడు. లజ్జా, వినమ్రత, మూర్తీభవించిన వ్యక్తి మాతృదేవి. కానీ ఆ మృదుత్వం కూడా తన స్త్రీత్వానికి భంగమని తెలుసుకున్నప్పుడు కాఠిన్యమయింది; ఆమె ఒక పురుషుణ్ణే కొట్టి కిందపడవేయగలిగారు.
ఈ సంఘటన* మాతృదేవిని ఎంతగానో ఆలోచింపచేసింది. అప్పుడప్పుడు కనిపించే గురుదేవులు, ఆయన సదా తమతోపాటు ఉంటున్నారనే స్ఫురణ, ఆధ్యా త్మిక అనుభవాలు మాత్రమే ఆమెకు సహాయంగా నిలిచాయి. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు: “కామార్పుకూర్లో ఒంటరిగా తోడూనీడా లేకుండా ఉన్న ఆ కాలంలో, ‘నాకు బిడ్డలు లేరు. సొంతమంటూ పిలవడానికి ఈ లోకంలో ఎవరూ లేరు. ఇక నా గతేమిటి?’ అనే ఆలోచన ఒక రోజు వచ్చింది. వెంటనే గురుదేవులు నాకు కనిపించి, ‘నీకు ఒక కుమారుడు కావాలి? ఆణి ముత్యా ల్లాంటి ఎందరో కుమారులను ఇచ్చివున్నాను కదా! కాలక్రమంలో నిన్ను ‘అమ్మా’ అని పిలువడానికి ఇంకా పలువురు బిడ్డలు వస్తారు’ అని అన్నారు. ఈ సంఘ టనకు తర్వాత మాతృదేవి కామార్పుకూర్ జీవితంలో కొద్దిగా మార్పు వచ్చింది. ఇలాంటి కఠోర తపోజీవితం ఆవశ్యకం లేదని గురుదేవులు కూడా అను కున్నారో ఏమో! మాతృదేవి తమ పరిస్థితిని గూర్చి ఎవరికీ చెప్పలేదు. అయినా కలకత్తాలో ఉంటున్న గురుదేవుల శిష్యులకు ఈ విషయం ఎలాగో తెలియ వచ్చింది.
శ్యామా దుఃఖమూ, ప్రయత్నమూ
ఒకసారి మాతృదేవి ప్రసన్నమయితో, రాత్రి తమకు తోడుగా ఉండడానికి ఒక పని మనిషిని పంపమన్నారు. మాతృదేవికి తోడుగా ఉన్న ఆ పనిమనిషి ఆమె ఉప్పుకూ, తిండికి పడుతున్న ఇబ్బందులను, వేదనను బహిరంగంగా చెప్ప సాగింది. కొన్ని రోజులలో ఈ విషయం జయరాంబాటిలో శ్యామసుందరికి తెలి సింది. ఆమె క్రుంగిపోయింది; వాళ్ల ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే! అయినా తన శారద పేదరి కంతో వాడిపోవడం సహించలేకపోయింది. వెంటనే మాతృదేవిని తీసుకురమ్మని కాళీకుమార్ను పంపింది, కానీ అప్పుడు వెళ్లడానికి మాతృదేవి నిరాకరించారు. తర్వాత ఒక రోజు ఆమే జయరాంబాటికి వెళ్లారు. తన కుమార్తె దారుణ పరిస్థితి చూసి శ్యామసుందరి తట్టుకోలేక బిగ్గరగా విలపించసాగింది, ఇక కామార్పుకూర్కు వెళ్లవద్దనీ జయరాంబాటిలోనే ఉండిపో మనీ ప్రాథేయపడింది. కానీ మాతృదేవి, “ఇప్పుడు నేను కామార్పుకూర్కే తిరిగి వెళతాను. తర్వాత ఆయన చూపించే మార్గంలో పోతాను” అంటూ వెళ్లిపోయారు. ఆ తర్వాత అరుదుగా జయరాంబాటి వెళ్లి వచ్చేవారు.
కానీ శ్యామాసుందరి ఈ విషయాన్ని ఇంతటితో వదలల్లేదు. కలకత్తాలో పౌరోహిత్యం చేసుకొంటున్న తన కుమారుడు ప్రసన్నకు ఈ విషయం చెప్పి పంపారు. ఈ విషయం విన్న ప్రసన్న అమిత కోపంతో దక్షిణేశ్వరంలో రామ్ లాల్‌ను కలుసుకున్నాడు, కుటుంబానికి పెద్దగా మాతృదేవిని పోషింపవలసిన బాధ్యతను గురించి ఆతనికి నొక్కి చెప్పాడు. తన సోదరికి తోడూ నీడా లేకుండా దారిద్ర్యంతో జీవించేలా చేసినందుకు గట్టిగా చీవాట్లు పెట్టాడు. తర్వాత గోలాప్ మాను కలుసుకొని, “శ్రీరామకృష్ణుల శిష్యులయిన మీరు కలకత్తాలో ఉంటూ కూడా ఉప్పు కూడా లేని కేవలం ఆకుకూర తినేటట్లుగా మాతృదేవిని ఎలా వది లేశారు?” అని ఆమెతో వాపోయాడు.
కలకత్తాకు
గోలాప్ మా వెంటనే మాతృదేవిని చూసుకునే బాధ్యతను చేపట్టింది. కల కత్తాలో ఉంటున్న గురుదేవుల సన్న్యాస శిష్యులను, భక్తులను కలుసుకొని వారికి మాతృదేవి శోచనీయ పరిస్థితిని గురించి తెలియజేసి ఎలాగైన సాయపడాలని అందరినీ అభ్యర్థించింది. అందు కోసం డబ్బు కూడా సేకరించింది. శ్రీరామకృష్ణ భక్తుల పేరిట మాతృదేవికి హృదయం హత్తుకుపోయేలా ఒక ఉత్తరం వ్రాసి ఆమెను కలకత్తాకు రావల సిందిగా అభ్యర్థించింది.
ఆ జాబు మాతృదేవికి అందింది. ఆమె ఎంతో కలవరపడ్డారు. కలకత్తాకు వెళ్లాలా వద్దా అనే సందిగ్ధావస్థలో పడిపోయారు. ‘నేను ముప్ఫై నాలుగేళ్ల వయస్కురాలైన వితంతువును, బంధువులే లేని అన్యుల మధ్యలో వెళ్లి ఉండడం అంటే…..’ ఎలాంటి నిర్ణయానికీ రాలేని మాతృదేవి గ్రామస్థుల అభిప్రాయం తెలుసుకోగోరారు.
మాతృదేవి కలకత్తా వెళ్లడం వారిలో పలువురు ఇష్టపడలేదు. అప్పుడు కూడా ప్రసన్నమయి మాతృదేవికి అండగా నిలిచింది; ఆమె గ్రామవాసులతో, “గదాయ్ భార్య గురించి ఈ గ్రామ ప్రజలకు ఏం తెలుసు? గదాయ్ శిష్యులు ఆమెకు బిడ్డలు. బిడ్డల కోరిక మన్నించి కలకత్తా వెళ్లడంలో తప్పేముంది?” అంది ఆమె. ప్రసన్నమయి అనునయ వచనాలతో ధైర్యం పుంజుకొన్న మాతృదేవి, తమ తల్లి అభిప్రాయం తెలుసుకోవడానికి జయరాంబాటి వెళ్లారు. మాతృదేవి కల కత్తాకు వెళ్లడం ముందు శ్యామసుందరి అంతగా ఇష్టపడలేదు. కానీ కామార్పు కూర్ ప్రజలు కనబరుస్తున్న ఏవగింపు, విద్వేషం, దూషణ వీటినన్నిటిని చూసిన శ్యామసుందరి, మాతృదేవి కలకత్తా వెళ్లడానికి సంతోషంగా అనుమతించింది. దాదాపు తొమ్మిది నెలలు కామార్పుకూర్లో గడపిన మాతృదేవి 1888 ఏప్రిల్‌లో కలకత్తాకు బయలుదేరారు.
కామార్పుకూర్ : మాతృదేవి
గురుదేవుల నిర్యాణానంతరం మాతృదేవి ముప్పైమూడేళ్లు జీవించారు; దీన్లో మొదటి పదమూడేళ్లు అంటే, 1898 వరకు మాతృదేవి లోకానికి తెలియ కుండానే జీవితం గడిపారు. కామార్పుకూర్ జయరాం బాటి, కలకత్తా అంటూ ఆమె నివాస స్థానాలు మారుతూ వచ్చాయి. “కామార్పుకూర్లో నీ సొంత ఇంటిని వదలి వేయకు” అంటూ గురుదేవులు చెప్పిన మాటలను ఆమె మరచిపోలేదు. ఆయన చెప్పినట్లే నివసిస్తూ తపోమయ జీవితం గడపాలనే ఆమె ఆశయం. కానీ పరిస్థితులు పూర్తిగా ప్రతికూలమయినందున అక్కణ్ణుండి కలకత్తా వెళ్లవలసి వచ్చింది. తన స్వస్వరూపాన్నీ, తమ అవతార కార్యాన్నీ ఎరుగని వారు కారు మాతృదేవి. భవిష్యత్తులో వందలాది బిడ్డలు తమ వద్దకు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రతికూల వాతావరణం నెలకొన్నట్లయితే, వారినందరిని చేరదీసి పోషించడం ఎలా? వారందరూ ఎలా ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించగలుగుతారు? వీటినన్ని టినీ యోచించే కామార్పుకూర్ను తన నివాస స్థానంగా చేసుకోలేదు. కానీ కలకత్తా నుండి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అక్కడ ఉండసాగారు; కొన్ని సమయాల్లో ఒక సంవత్సరం దాకా కూడా నివసించారు! కానీ ఆ సమయంలో ఆమె దారిద్ర్యంతో పోరాడవలసిన అగత్యం లేదు. భక్తులు ఆమె యోగక్షేమాలు చూసు కొన్నారు. గురుదేవుల భక్తులేకాక, ఇతరులు కూడా మాతృదేవి గురించి తెలుసు కుని ఆమె వద్దకు రాసాగారు. 1898 తర్వాత మాతృదేవి కామార్పుకూర్కు కొన్ని మార్లే వెళ్లారు. శ్యామసుందరి కోరికను మన్నించి, మాతృదేవి జయరాంబాటినే తమ నివాసస్థానంగా చేసుకున్నారు.
భవిష్యత్తులో తీర్థ స్థలాలలో సుప్రసిద్ధమైనది కాబోతున్న కామార్పుకూర్ ఇంటిని పరిరక్షించి రాబోయే తరానికి దానిని అప్పగించే బాధ్యత తనపై ఉన్నట్లు మాతృదేవికి బాగా తెలుసు. అందువల్ల మాతృదేవి ఎక్కడ నివసించినా, గురు దేవులు అవతరించిన ఆ పావన పర్ణశాలను చెక్కుచెదరక పరిరక్షిస్తూ వచ్చారు. తమను ఆశ్రయించే భక్తులకు కామార్పుకూర్ పవిత్రతను గురించి చెప్పి అక్కడ ఒక రోజు బసచేసి వెళ్లమనేవారు. కామార్పుకూర్ గురించి ఎవరూ తప్పుగా దేనిని గురించీ చెప్పడం మాతృదేవికి రుచించేది కాదు. క్రింద సంఘటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఒకసారి శివరామ్ ఊళ్లో లేనప్పుడు ఆతడి భార్య తమ కుమార్తెను తమ కంటే తక్కువ కులస్థుడైన ఒక యువకునికి వివాహం చేసి ఇవ్వాలని నిశ్చయిం చింది. తక్కిన ఎవరికీ ఇది ఇష్టం లేదు. కుమార్తె ఎక్కడికీ పారిపోకుండా ఒక గదిలో ఆమె బంధించింది. ఇంటికి పెద్ద అయిన రామ్‌లాల్‌కు ఇది మరీ అవమానంగా తోచింది. అది చూసిన ఇద్దరు భక్తులు ఆ అమ్మాయిని నిర్బంధం నుండి విడిపించి, తిన్నగా జయరాంబాటిలోని మాతృదేవి వద్దకు తోడ్కొని వెళ్లారు. మాతృదేవి ముందుగా, “ఈ విషయంలో రామ్‌లాల్ అభిప్రాయ మేమిటి?” అని అడిగారు. ఆతనికి కూడా ఈ వివాహం పట్ల ఇష్టం లేదని తెలిసి, “అలా అయితే మీరు కలత పడకండి” అన్నారు. అప్పుడు ఆ భక్తులలో ఒకరు, “కానీ అమ్మా! భవిష్యత్తులో గురుదేవులకు కామార్పుకూర్లో ఆలయం నిర్మించే టప్పుడు, శివరామ్ భార్యకు గ్రామపెద్దలు ఏదైనా ఆటంకం కలిగించవచ్చు కదా!” అంటూ తన నిరాధార సంశయాన్ని వ్యక్తం చేశాడు. అందుకు మాతృదేవి మౌనం వహించారు. ఆ భక్తుడు మళ్లీ, “అయితే ఏమి! గురుదేవులు ఈ ఆల యమూ, స్మారక మండపమూ అంటూ వీటిని గురించి కలత పడేవారు కాదు కదా! అంతే కాకుండా అలాంటివి ఇప్పటికే కావలసినన్ని ఉన్నాయి కూడా” అంటూ ఏదో సర్వజ్ఞుడిలా మాట్లాడాడు. మాతృదేవికి ఈ మాటలు బొత్తిగా రుచించలేదు. అందువల్ల కాస్త కటువుగా, “నువ్వేమంటున్నావు? గురుదేవులు అవతరించిన చోటు చాలా పవిత్రమైనది కదా! ఆయన సదా నెలకొని కటాక్షించే ఆ పుణ్యక్షేత్రం భక్తులకు ఒక తీర్థస్థలం కదా! దానిని గురించి ఇలా మాట్లాడ్డ మేమిటి?” అని అడిగారు. కానీ ఆ భక్తుడు మాతృదేవి మాటలు పట్టించుకున్నట్లు లేదు. మళ్లీ, “కానీ శివరామ్ భార్య ఏం చేస్తుందో తెలియదు! బహుశా ఆ గుడిసె లకు ఆమె నిప్పుపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు” అన్నాడు. ఈ మాటలు విన్న మాతృ దేవికి కోపం ఎక్కువయింది. వారి స్థితే మారిపోయింది. కోపం ధ్వనించే కంఠంతో, “నిప్పు పెడుతుందా! పెట్టిచూడనీ! పెట్టాల్సిందే! గురుదేవులకు అది కూడా ఇష్టమే అయివుండొచ్చు! ఆయన ఎప్పుడూ శ్మశాన వాటికను కోరుకునే వారే కదా! ఆమె నిప్పు పెట్టనీ! ఆ చోటును శ్మశానంగా చేయనీ!” ఇలా మాట్లాడి ఉద్వేగపూరితంగా నవ్వసాగారు. ఆపకుండా నవ్వుతూనే ఉన్నారు. సమయం గడిచేకొద్దీ ఆ నవ్వు ఇంకా ఉద్ధృతం కాసాగింది. తర్వాత ఆ నవ్వు గర్జనగా వినబడిందట! అక్కడ ఒక అసాధారణమయిన దివ్య పరిణామం చోటు చేసు కుంది! సమీపంలో నిలబడి వున్నవారు భయంతో కంపించిపోయారు. చాలా సేపటికి మాతృదేవి శరీరం ఒకసారి కంపించింది. ఆ తర్వాత ఆమె సామాన్య స్థితికి వచ్చారు. కామార్పుకూర్కు అంత ముఖ్యత్వం ఇచ్చారు మాతృదేవి.
ఆ పవిత్ర తీర్థ స్థలాన్ని మానవాళికి సమర్పించడం ద్వారా తమ బాధ్యతను మాతృదేవి తర్వాత తీర్చారు. 1918 వ సం ॥ ఒకసారి మాతృదేవి ఉద్బోధన్లో ఉంటున్నప్పుడు లక్ష్మి, రామ్‌లాల్ అక్కడికి వచ్చారు. గురుదేవులు అవతరించిన ఆ పవిత్ర స్థలంలో ఆలయం కట్టే విషయంగా ఆ రోజుల్లో చర్చలు సాగు తున్నాయి. దానిని సూచిస్తూ లక్ష్మి, మాతృదేవితో, “ఆ దేవాలయం నిర్మించాక అది మన ఆధ్వర్యంలో ఉంటుందా లేక మఠం వారి ఆధీనంలో ఉంటుందా?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “ఖచ్చితంగా అది మఠం వారి ఆధీనంలోనే ఉంటుంది. భవిష్యత్తులో ఇతర కులస్థులూ మతస్థులూ మాత్రమే కాకుండా పరాయి దేశాల నుండి కూడా అనేకమంది భక్తులు ఆ చోటును దర్శించడానికి వస్తారు. కుటుంబం వారి ఆధ్వర్యంలో ఉంటే వారికి కులం ఆచారం మొదలైనవన్నీ పాటించడం కష్టం. వాటిని పాటించకపోతే పిల్లలకు వివాహాలు కానంత సమాజ కఠోర నియమాలు. అందువల్ల అది మఠం వారి అధీనంలో ఉండడం మంచిది” అని చెప్పారు. కానీ కులదైవాలైన రఘువీరుడు, సీతలా ఆలయాలను కుటుంబం వారే నిర్వహించవచ్చు అని కూడా అన్నారు. ఈ ప్రతిపాదనకు అందరూ ఆమోదించారు. ఇందుకు తగ్గట్లు 1918 జూలై 27 వ తేది గురుదేవులు అవతరించిన దివ్యక్షేత్రాన్ని విధివిహితంగా బేలూరు మఠానికి అప్పగించారు. ఇందులో మాతృదేవి, ఇతర భాగస్థులు సంతకాలు చేశారు.*
ఒకసారి జయరాంబాటిలో ఉంటున్నప్పుడు భక్తుడొకడు మాతృదేవిని కామార్పుకూర్లో ఎందుకు నివసించలేదని అడిగాడు. అందుకు మాతృదేవి, “ప్రస్తుతం గురుదేవులు స్థూల శరీరంలో లేరు. నేను అక్కడికి వెళితే ఆయన జ్ఞాప కాలు నన్ను వేధిస్తాయి. కాబట్టి నేను అక్కడికి వెళ్లడం లేదు” అని అన్నారు. ఇతరులను తప్పుపట్టడమో, వారి మనస్సులను బాధపెట్టడమో మాతృదేవి చేయ జాలరు. కానీ కొన్ని సమయాల్లో ఆమెకు తెలియకుండా ఆమె ముఖతా నిజం బయటపడేది. – “బంధువులు, గ్రామ ప్రజలు నన్ను వెలివేశారు. నా పరిస్థితిని చూసిన మా అమ్మ నన్ను జయరాంబాటికి తీసుకువెళ్లింది. అప్పటి నుండి నేను నా సోదరుల యోగక్షేమాలు చూసుకొంటూ వారితో కలిసి ఉంటున్నాను. కానీ వారి కారణంగానే కదా నేను నా సోదరుల దగ్గరికి రావడం జరిగింది! కానీ ఇప్పుడు వారిని పట్టించుకోవడం లేదని నన్నే తప్పుపడుతున్నారు. మనిషి మనస్సు వింతైనది కదా!” అనేవారు.
మాతృదేవి కలకత్తా చేరుకున్నప్పుడు గురుదేవుల శిష్యుల మనస్సులు ఆనందంతో పరవశించాయి. ముఖ్యంగా భక్తురాండ్రు ఎంతో సంతోషపడ్డారు. తమ శ్రేయస్సుకోసం మాతృదేవి యోగక్షేమాలను చూసుకోవడం చాలా ముఖ్యమని వారందరూ గ్రహించారు. ఇంతవరకు గురుదేవుల భక్తులలో కొందరు మాతృ దేవిని గొప్పగా భావించలేదు. ఆమె ఒక స్త్రీ అయినందువల్ల గోలాప్ మా, యోగిన్ మా లాంటి భక్తురాండ్రు ఆమెను ప్రశంసిస్తూ మాట్లాడుతున్నట్లు భావిం చారు. అందులో ఒకడు, ‘నాకు శ్రీరామకృష్ణులు మాత్రమే తెలుసు. ఆయన భార్యా? ఆమెను గురించి నేను అసలు వినలేదే!’ అన్నాడు. తర్వాత యోగిన్, గోలాప్ మా, యోగిన్ మా ప్రభృతులు బృందావనంలోనూ, ఇతర చోట్లా మాతృ దేవిలో తాము చూసిన అత్యుత్తమయిన ఆధ్యాత్మిక స్థితులు, సమాధి మొదలైన వాటిని గురించి చెప్పినప్పుడు, వారిలో పలువురు తమ అభిప్రాయాన్ని మార్చు కున్నారు. వారిని పోషించడం తమ బాధ్యతగా గ్రహించి, తమకు చేతనయినం తగా చేయూత నిచ్చారు. అయినా మాతృదేవిని పోషించే బాధ్యత యోగిన్ మా మీద, గోలాప్ మా మీద పడింది. చివరకు శ్రీ శారదానంద స్వామి స్వకీయ ప్రయత్నంతోనూ, కృషితోనూ మాతృదేవి స్థిరంగా నివసించడానికి 1909 వ సం ॥ కలకత్తా బాగ్‌బజార్‌లో ‘ఉద్బోధన్’ అనే ఇంటిని కట్టించాడు. అంతదాక మాతృ దేవి కలకత్తాకు వచ్చినప్పుడు భక్తుల ఇళ్లలోనే బసచేసేవారు. చాలా రోజులు ఉండాలనుకున్నప్పుడు అద్దె ఇంట్లో ఉండేవారు; కొన్ని రోజులయితే బలరాంబోస్, మహేంద్రనాథ్ గుప్త ప్రభృతుల ఇళ్లలో బస చేసేవారు.
దేహాతీత అనుభవం
ఈ కాలఘట్టంలో కూడా మాతృదేవి జీవితం అత్యున్నత ఆధ్యాత్మిక స్థితు లలో మగ్నమై ఉండేది. ఒకటి తర్వాత మరొకటిగా ఎన్నెన్నో ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలు ఆమెకు దక్కాయి. కామార్పుకూర్ నుండి కలకత్తాకు వచ్చిన మాతృదేవి ముందు బలరాంబోసు ఇంట్లో బసచేశారు. అప్పుడు ఒక రోజు మేడమీద ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు, బాహ్య ప్రపంచాన్ని మరచి సమాధిలోకి వెళ్లిపోయారు. ఆ అనుభవం గురించి మాతృదేవి యోగిన్మాతో కాలాంతరంలో ఇలా చెప్పారు: “నేను ప్రగాఢ సమాధి స్థితిలో సుదూరంలోని ఒక దేశానికి వెళ్లాను. అక్కడ వసిస్తున్న ప్రతి ఒక్కరూ నా పట్ల ఎంతో అభిమానంతో ప్రవర్తించారు. అప్పుడు నా సౌందర్యం వర్ణనాతీతం. గురుదేవులు కూడా అక్కడ ఉన్నారు. ఎంతో ఆప్యాయంగానూ, ప్రేమతోను ఆ భక్తులు నన్ను గురుదేవుల పక్కన కూర్చోబెట్టారు. ఆ సమయంలో నేను అనుభవించిన పరమానందాన్ని వర్ణించలేను. తర్వాత నా మనస్సు ఆ ఉన్నత స్థితి నుండి క్రిందికి దిగివచ్చింది. అప్పుడు నా ఈ శరీరం ఇక్కడ పడివుండడం చూశాను. ‘ఇంతటి వికార శరీరం లోపల నేను ప్రవేశించాలా?’ అని తటపటా యించాను. ప్రవేశించమని మనస్సుకు ఎంతగా నచ్చచెప్పినా ప్రయోజనం లేక పోయింది. చాలాసేపు పోరాడిన తర్వాతే మనస్సు ఈ శరీరంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఈ శరీరంలో బాహ్యస్మృతి కలిగింది.”
నిర్వికల్ప సమాధి స్థితిలో
మరొక రోజు మాతృదేవి నీలాంబర ముఖర్జీ ఇంట్లో* యోగిన్ మా, గోలాప్ మాలతో ధ్యానం చేస్తున్నారు, యోగిన్ మా తన ధ్యానం ముగిసిన తర్వాత మాతృదేవిని చూసింది. ఆమె కదలామెదలక ప్రగాఢ ధ్యానంలో మునిగివున్నారు. చాలాసమయం గడచిన తర్వాత బాహ్యస్మృతి కలిగినప్పుడు, “ఓ యోగిన్! చేతు లెక్కడ? కాళ్లెక్కడ?” అని అడగసాగారు. యోగిన్ మా ఆమె చేతులను కాళ్లను తాకుతూ, “అమ్మా! ఇవిగో మీ చేతులు! మీ కాళ్లు” అన్నారు. అయినా చాలా సేపటి తర్వాతే మాతృదేవికి శరీర స్మృతి కలిగింది. ఇది ఆధ్యాత్మిక జగత్తులో అత్యున్నత అనుభవం; ఈ స్థితిని నిర్వికల్ప సమాధి అంటారు.
తమ ఈ కాలపు ఉన్నత ఆధ్యాత్మిక అనుభవాలను గురించి మాతృదేవి కాలాంతరంలో ఒక భక్తునితో ఇలా అన్నారు: “ఆ రోజులలో నా మనస్సు ఎరుపు, నీలం లాంటి కాంతి పుంజాలలో సదా నెలకొని ఉండేది. ఇలాంటి అనుభవాలు చాలాకాలం కొనసాగివుంటే నా శరీరం తట్టుకొని ఉండేది కాదు.”
పూరీ జగన్నాథ యాత్ర
1888 నవంబరులో మాతృదేవి పూరీ జగన్నాథ యాత్ర చేశారు. ఆమెతో రాఖాల్, యోగిన్, శరత్, యోగిన్ మా, వారి తల్లి, గోలాప్ మా, లక్ష్మీ ప్రభృతులు వెళ్లారు. మాతృదేవి గురుదేవుల పటాన్నొక దానిని తమతోపాటు తీసుకెళ్లారు. ‘వ్యక్తీ, పటమూ వేరు కాదు’ అనేవారు మాతృదేవి. అందువల్ల ఆలయానికి వెళ్లి పూజించి నప్పుడు, గురుదేవుల పటాన్ని బయటికి తీసి వారికి కూడ స్వామి దర్శనం చేయించారు. అక్కడ తమకు కలిగిన దివ్యదర్శనం గురించి మాతృదేవి ఇలా చెప్పారు: “వజ్ర వైడూర్యాలతో పొదుగబడిన సింహాసనంలో పురుష సింహంగా”* ఆసీనులై ఉన్నారు జగన్నాథుడు. నేను ఒక సేవకురాలిగా సపర్యలు చేస్తు న్నాను.”
వందలాది భక్తులు అక్కడికి వచ్చి జగన్నాథుని దర్శించుకునే దృశ్యం మాతృ దేవిని చకితురాలిని చేసింది. “ఆహా! ఏం అద్భుతం! వీరంతా ముక్తి పొందుతారు కదా!” అన్నారు ఆనందబాష్పాలు స్రవిస్తూండగా. కానీ మరుక్షణమే, “ఎక్కడికి వెళ్లి ఆరాధనలు చేసినా వాసనారహితులు* మాత్రమే ముక్తి పొందగలుగుతారు” అని ఆమెకు తెలియజేయబడింది.
తమ దివ్య దృశ్యంలో మాతృదేవి జగన్నాథుణ్ణి శివుని రూపంలో చూశారు. “ఒక లక్ష సాలగ్రామ శిలలతో నిర్మింపబడిన పీఠం మీద పరమశివుడు లింగ స్వరూపంలో కొలువైవుండడం చూశాను అన్నారామె.”*
పూరీలో మాతృదేవి దేవాలయానికి వెళ్లి రావడానికి పల్లకీ ఏర్పాటు చేయ మని ఆలయ పూజారి చెప్పాడు. అందుకు మాతృదేవి, “వద్దు. మీరు దారి చూపుతూ ముందు వెళ్లండి. నేను ఒక పామర స్త్రీలా మిమ్మల్ని వెంబడిస్తాను” అంటూ వినమ్రంగా చెప్పారు. పూరీ జగన్నాథంలోని ఇంతర ఆలయాలకు కూడా వెళ్లి దర్శనం చేసుకున్నారు. మహాలక్ష్మీ సన్నిధిలో చాలాసేపు ధ్యానంలో లయించి పోయారు. పూరీ జగన్నాథ యాత్ర మాతృదేవి మనస్సుకు ఎంతో ఆహ్లాదం కలి గించింది.
1889 జనవరి 12 వ తేది అందరూ కలకత్తాకు తిరిగివచ్చారు. ఫిబ్రవరి 5 వ తేది నరేంద్రుడు, శరత్, యోగిన్, బాబూరాం, మహేంద్రనాథ గుప్త ఇంకా పలువురితో కలిసి మాతృదేవి బాబూరాం జన్మస్థలమైన ఆంట్పూర్కు వెళ్లారు. అక్కణ్ణుండి తిన్నగా కామార్పుకూర్కు వెళ్లి దాదాపు ఒక సంవత్సరం అక్కడ గడిపిన తర్వాత కలకత్తాకు తిరిగి వచ్చారు.