కాశీపూర్‌లో గురుదేవులు
గురుదేవులు శ్యాంపుకూర్‌కు వచ్చి మూడు నెలలయింది. వైద్యుల చికిత్సా, మాతృదేవి పరిచర్యలూ, శిష్యుల సేవలతో కూడా వ్యాధి తగ్గుముఖం పట్టక రోజు రోజుకూ తీవ్రమవసాగింది. మునుపు ఒకింత ఉపశమన మిచ్చిన ఔషధాలు ఇప్పుడు నిష్ప్రయోజన మయినాయి. కలకత్తా కలుషిత వాతావరణం కారణంగానే వ్యాధి తీవ్రరూపం దాలుస్తూందని తీర్మానించిన వైద్యులు, నగర పొలిమేరలలో చక్కని గాలివీచే స్థలానికి ఆయనను తీసుకెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు. అందుకు తగిన ఇంటికోసం వెదకిన భక్తులు కాశీపూర్ అనేచోట ఒక ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకున్నారు. 1885 డిసెంబరు 11 వ తేది ఆ ఇంటికి గురుదేవులను తరలించి తీసుకెళ్లారు.
కాశీపూర్ ఉద్యానగృహం విశాలంగా ఉంది, జన సంచారం లేని చోట ఉంది. ఎటువైపు చూసినా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు విరబూసిన చెట్లు, పసిడి పచ్చని ఆరుబయలు! దక్షిణ్వేరంలోని కాళీమాత ఆలయంలోని సహజ సౌందర్యంతో దీనిని పోల్చలేం, కానీ నాలుగు నెలలు కలకత్తాలో గడిపిన గురుదేవులకు ఈ చోటు చాలా అందంగా కనబడింది. ఉద్యానవనం లోపల ప్రవేశించి, అక్కడ వీచే గాలిని పీల్చగానే ఆయన ఉప్పొంగిపోయి, చుట్టూరా చూస్తూ ఆనందంతో లోపలికి వెళ్లారు. తర్వాత మేడమీద తమకు కేటాయించిన గదికి దక్షిణంగా ఉన్న డాబా మీదకు వెళ్లి నిలబడి తోట అందాన్ని కాసేపు చూసి ఆనందించారు. శ్యాంపుకూర్ ఇంట్లో బందీగా ఉన్నట్లు ఇక్కడ ఉండవలసింది లేదు. కనుక మునుపటిలా కాకుండా మరింత చక్కగా సేవలు చేయవచ్చని మాతృదేవి కూడా సంతోషించి ఉంటారు. వీరిద్దరూ ఆనందించడంతో శిష్యుల మనస్సులు కూడా ఆనందంలో ఓలలాడాయి.
భక్తులు గురుదేవుల ప్రత్యేక చికిత్సకు కావలసిన వసతులన్నింటిని ఏర్పాటు చేశారు. విఖ్యాత వైద్యుడయిన, మహేంద్రలాల్ సర్కార్ గురుదేవులకు చికిత్స చేయసాగాడు. యువ శిష్యులు గురుదేవులతోపాటు ఉంటూ ఆయనకు సేవలు చేస్తూ వేచివుండసాగారు.
మాతృదేవి ఎప్పటిలా పథ్యాహారం తయారుచేసే బాధ్యతను తీసుకున్నారు. పెద్దగోపాల్లాంటి ఒకరిద్దరు భక్తులతో మాత్రమే ఆమె కొద్దిగా మాట్లాడేవారు. పథ్యాహారం మినహాయించి, మరేదైనా ప్రత్యేక ఆహారం డాక్టరు నిర్దేశిస్తే, అలాంటి ఆహారం తయారుచేసే పద్ధతిని వీరి మూలంగా తెలుసుకొని వండే వారు. వంట మాత్రమే కాకుండా ప్రతిరోజూ మధ్యాహ్నానికి మునుపు, సాయంత్ర మయిన కాసేపటికి, గురుదేవులకు తామే ఆహారం వడ్డించి, ఆయన ఆహారం పుచ్చుకొనే దాకా అక్కడే ఉండేవారు. వండడం లాంటి పనులలో సహకరించ డానికీ, మాతృదేవికి సహాయంగా ఉండడానికీ గురుదేవులు అన్నగారి కుమార్తె లక్ష్మిని తీసుకువచ్చారు. దక్షిణేశ్వరానికి వచ్చే కొందరు భక్తురాండ్రు కూడా అప్పు డప్పుడూ ఇక్కడికి వచ్చి కొన్ని గంటలసేపు, వీలునుబట్టి ఒకటి రెండు రోజులు అక్కడే బసచేయడం కద్దు.
అంఘం పుష్పించడం
రామకృష్ణ సంఘ చరిత్రలో కాశీపూర్ శాశ్వత స్థానం వహించింది. గురు దేవుల జీవితంలోని అత్యంత మహత్తర సంఘటనలు ఇక్కడే జరిగాయి. ఇక్కడే ఆయన నరేంద్రుని జీవితాన్ని తీర్చిదిద్ది, యువకులను ఆతడికి అప్పగించి సంఘానికి పునాదులు వేశారు. కాశీపూర్ ఉద్యాన గృహంలో 1886 ఆగష్టు 15 వరకు నివసించారు. ఈ ఎని మిది నెలలలో ఆయనను పీడిస్తున్న వ్యాధి క్రమేణా తీవ్రమవుతూ ఆయన శరీ రాన్ని అస్థిపంజరంగా మార్చేసింది. అయినా సుస్థిరమయిన ఆయన మనస్సు వ్యాధినీ, దాని కారణంగా కలిగిన బాధను త్రోసిపుచ్చింది. తాము అప్పటికే ప్రారంభించిన కార్యాన్ని ఎలాగైనా పూర్తిచేయాలని ఆయన బద్ధకంకణులయినట్లు కనిపించారు. ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా శిష్యులకూ, భక్తులకూ ఆవశ్యక మయిన తర్ఫీదును, ప్రత్యేకించి ఒక్కొక్కరికి, కొన్ని సమయాల్లో అందరినీ కలిపీ ఇవ్వసాగారు. ఒక రోజు నరేంద్రుణ్ణి పిలిచి తక్కిన శిష్యులను చూపిస్తూ, “వీరం దరి బాధ్యత నీకే వదలిపోతున్నాను, వీరందరూ సాధన అనుష్ఠించేటట్లు, ఇంటికితిరిగి పోకుండా చూసుకో!” అంటూ యువకుల బాధ్యతను ఆతడికి అప్పగిం చారు.
ఎంతో ప్రశాంతంగా యువకులందరికీ సన్న్యాస ఆదర్శంలో తర్ఫీదు నిచ్చారు గురుదేవులు. ఒక రోజు వారందరినీ బయటికి వెళ్లి భిక్షాటన చేసిరమ్మ న్నారు. వారిలో పలువురు ధనవంతుల పిల్లలు; పుష్కలంగా ధనంతో పోషింప బడినవారు. అయినా గురుదేవుల ఆజ్ఞను శిరసావహించి ఎంతో సంతోషంగా బయలుదేరారు. వారు మొట్టమొదట భిక్ష యాచించింది మాతృదేవి వద్దనే. వారు వెళ్లి యాచించగానే మాతృదేవి ఒక్క రూపాయి వారి భిక్షాపాత్రలో వేశారు. ఇలా రామకృష్ణ సంఘానికి ప్రప్రథమ కృపాశక్తిని ప్రసాదించారు మాతృదేవి. ఆ తర్వాత వారు భిక్షకై బయటికి వెళ్లారు. లభించిన బియ్యం, కూరగాయలను వండి గురు దేవుల వద్దకు తీసుకువచ్చారు. అందులో కాస్త నోట్లో వేసుకుంటూ గురుదేవులు, “మంచి పని చేశారు. ఈ ఆహారం పరమ పవిత్రమయినది” అన్నారు. ఆ మాట లతో వారి ఆనందం అవధులు దాటింది.
ఒక రోజు పెద్దగోపాల్ కొన్ని కాషాయ వస్త్రాలనూ, రుద్రాక్ష మాలలనూ మూటగా కట్టి గురుదేవుల వద్దకు తీసుకువచ్చాడు; వాటిని ఉత్కృష్టులైన సన్న్యా సులకు పంచిపెట్టమన్నట్లు చెప్పాడు. గురుదేవులు తమ సమక్షంలో ఉంటున్న యువ శిష్యులను చూపిస్తూ, “వీరికంటే శ్రేష్ఠులైన సన్న్యాసులు ఎవరూ ఉండరు. వీరికే వాటిని ఇవ్వు” అన్నారు. పెద్దగోపాల్ మూటను తెచ్చి గురుదేవుల ముందుంచాడు. వాటిని భక్తులైన పన్నెండుమంది యువకులకు పంచిపెట్టారు గురుదేవులు. ఒక రోజు సాయంత్రం సన్న్యాసులకైన అనుష్ఠానము నొకదానిని ఆచరించమని చెబుతూ, ఊళ్లోకి వెళ్లి భిక్ష తీసుకురమ్మన్నారు. ఇలా రామకృష్ణ సన్న్యాస సంఘానికి ఆయన శ్రీకారం చుట్టారు.
ఇంతటితో ఆయన అవతార కార్యం సమాప్తమయిందా? ఎలా సాధ్యం? ఈ యువకులను ఎవరి బాధ్యతలో వదలి వెళ్లగలరు? “వీరందరి బాధ్యతలను నేను స్వీకరిస్తాను” అంటూ దక్షిణేశ్వర రోజులలోనే ఆయనతో చెప్పిన మాతృదేవి తప్ప మరెవరికి అప్పజెప్పి వెళ్లగలరు?
కానీ మాతృదేవి మనోస్థితి వర్ణనాతీతంగా ఉంది. దక్షిణేశ్వరం వదలి ఎప్పుడు గురుదేవులు వెళ్లారో అప్పటి నుండి జరగరానిది జరిగిపోతుందేమో
మాతృదేవి ఆవేదనా జ్వాల
ననే వ్యాకులతతో ఆమె జీవిస్తున్నారు. గురుదేవులకు గొంతులో వ్రణం రావడం మాత్రమే ఇందుకు కారణమని చెప్పలేం. తమ నిర్యాణ సమయానికి సూచనలు అంటూ గురుదేవులు చెప్పిన ప్రతి ఒక్కటీ ఒకటి తర్వాత మరొకటిగా జరగడం ప్రారంభమవడమే మాతృదేవి హృదయాన్ని కలచివేయసాగింది. ఐదవ ఏట పాణిగ్రహణం చేసి, తనను భార్యగా, శిష్యురాలిగా, కుమార్తెగా, అంతెందుకు తల్లిగా కూడా ఆదరించి నిస్వార్థ ప్రేమతో లాలిస్తున్న ఆ ప్రేమమూర్తి నిష్క్రమింపనున్నారా? మాతృదేవి ఆవేదన జ్వాలగా హృదయం లోపల దహింపసాగింది. గొంతులో వ్రణం రావడానికి నాలుగైదు సం ॥ లకు మునుపే గురుదేవులు మాతృదేవితో, “ఎప్పుడు విచక్షణారహితంగా ఎవరు ఇచ్చిన ఆహారాన్నైనాసరే తీసుకుంటానో, ఎప్పుడు రాత్రుళ్లు కలకత్తాలో గడుపుతానో, ఎప్పుడు ఆహారంలో కొంత భాగాన్ని ఇతరుల కిచ్చి మిగిలిన దానిని తీసుకుంటానో, అప్పుడు నేను నిష్క్రమించే రోజు దూరంలో లేదని తెలుసుకో” అని చెప్పారు. గొంతులో వ్రణం రావడానికి కొంత కాలం ముందు నుండి ఇలాగే జరగసాగింది. కలకత్తాలో పలుచోట్ల పలువురు భక్తుల ఆహ్వానాన్ని మన్నించి వారి ఇళ్లకు వెళ్లిన గురుదేవులు, అన్నం మినహా యించి తక్కిన అన్ని రకాల ఆహారాన్ని అందరి వద్ద నుండి స్వీకరించసాగారు. అనుకోకుండా బలరాం ఇంట్లో అప్పుడప్పుడు రాత్రుళ్లు గడపడం కూడా జరి గింది. ఒక రోజు తమకంటూ ప్రత్యేకంగా వండిన అన్నాన్ని ముందుగా నరేం ద్రుని కిచ్చి మిగిలిన అన్నం తాను తిన్నారు. మాతృదేవి దానిని వారించినప్పుడు ఆయన, “మొదట నరేంద్రునికి ఇవ్వడంలో నా మనస్సులో ఎలాంటి నిర్బంధమూ కలుగలేదు. అందులో దోషం కూడా లేదు” అన్నారు. “గురుదేవులు ఇలా అన్నప్ప టికీ, ఆయన ముందు చెప్పిన దానిని గురించి ఆలోచించి నేను మనశ్శాంతి కోల్పోయాను” అంటూ కాలాంతరంలో మాతృదేవి అన్నారు.
శ్యాంపుకూర్ రోజుల్లో దక్షిణేశ్వరంలో జరిగిన ఒక సంఘటన మాతృదేవి మనస్సును ఇంకా కలతపెట్టసాగింది. తమ నిర్యాణ సమయానికి మరొక సూచనగా, “నన్ను ఎప్పుడు భక్తులు దైవంగా ఆరాధించడం మొదలుపెడతారో అప్పుడు నా నిర్యాణ సమయం ఆసన్నమయిందని గ్రహించుకో” అంటూ గురు దేవులు చెప్పివున్నారు. అది కూడా జరిగింది. ఆయన చికిత్సకోసం కలకత్తా వెళ్లా రని తెలియని భక్తులు కొందరు దక్షిణేశ్వరం వెళ్లి విషయం తెలుసుకున్నప్పుడు వారికి చెప్పలేనంత అసంతృప్తి కలిగింది. అయినా ఆయన గదికి వెళ్లి ఆయన చిత్రపటం ముందుగా తాము తెచ్చిన తీపి పదార్థాలను నైవేద్యంగా ఆయనకు అర్పించి వాటిని ప్రసాదంగా స్వీకరించారు. ఈ సంఘటన విన్నప్పుడు మాతృదేవి ఎంతో కలత చెందారు. గురుదేవులు ఆమెను ఓదారుస్తూ, “దీనికోసం ఎందు కిలా కలవరపడుతున్నావు? కాలక్రమంలో నన్ను ప్రతి ఇంటా ఆరాధిస్తారు. ఇది సత్యం. కనుక కలత చెందకు” అన్నారు. మాతృదేవి మనస్సు సాంత్వన పొంద లేదు. అంతే కాకుండా శ్యాంపుకూర్లో ఒకసారి కాళీపూజ రోజు భక్తులు గురు దేవులనే కాళీమాతగా పూజించారు.* వీటినన్నిటిని తలచుకొని మాతృదేవి మనస్సు తీరని ఆవేదనకు గురయింది.
కార్యాన్ని అప్ప జెప్పడం
ఒక రోజు గురుదేవులు మాతృదేవిని చాలాసేపు తేరిపార చూస్తూనే కూర్చొ న్నారు. అది గమనించిన మాతృదేవి, “ఏమైనా చెప్పదలచుకున్నారా? చెప్పండి” అన్నారు. అందుకు గురుదేవులు, “నువ్వు ఏమీ చేయవా? అన్నీ నేనే చేయాలా?” అని అడిగారు. అందుకు మాతృ దేవి, “నే నొక స్త్రీని. నేనేం చేయగలను?” అని ఎదురు ప్రశ్న వేశారు. “నువ్వు చేసే తీరాలి. నువ్వు చేయాల్సింది చాలావుంది” అన్నారు. ఇలా గురుదేవులు తమకు కార్యాన్ని అప్పగించడంలోని అర్థం మాతృదేవికి బాగా తెలుసు కాబట్టి ప్రత్యుత్తర మివ్వకుండా, మౌనం వహించారు. మరొక రోజు కూడా గురుదేవులు యిలాగే, “ప్రజలు అజ్ఞానమనే అంధకారంలో కీటకాల్లా కొట్టుమిట్టాడుతున్నారు. వారిని నువ్వు ఆదుకునే తీరాలి” అన్నారు.
ఈ సంఘటన తర్వాత తమ భక్తురాండ్రను, లాటు, యోగిన్, రాఖాల్, నరేంద్రుడు ఇత్యాది కొందరు భక్తులను మాతృదేవితో కలిసిమెలసివుండేలా చేశారు. ఇలా వారిని మాతృదేవికి అప్పగించారు. యువకులను చేరదీసి సన్న్యాస సంఘాన్ని రూపొందించిన గురుదేవులు వారిని మాతృదేవికి అప్పగించి ఆమెను “సంఘ జనని” గా తీర్చిదిద్దారు. దీనినే కాలాంతరంలో ఉద్వేగపూరితంగా వివేకా నంద స్వామి, “గురుదేవుల ఆదర్శాలను స్వీకరించి మేం కొందరు యువకులం ఆ మేరకు జీవించసాగాం. మమ్మల్ని సమాజం నిరసించింది, ఎదుర్కొంది, ఆ సమయంలో మాకు ఆశాజ్యోతిగా కానవచ్చింది ఒక్కరే ఒక్కరు. వారు ఒక స్త్రీ – అవును, మాతృదేవి మాత్రమే మాకు ఆశ్రితురాలుగా, స్వాంతన నిచ్చే తల్లిగా ఉన్నారు” అని చెప్పారు.
గురుదేవి
మాతృదేవి మహత్తర జీవితంలో మరొక ముఖ్యమయిన కార్యం మంత్రదీక్ష. కాలాంతరంలో, ఇష్టదైవం మంత్రం ప్రసాదించి అసంఖ్యాకుల జీవితాలలో జ్ఞాన జ్యోతి వెలిగించారు. మంత్రదీక్ష మాతృదేవి ఒనర్చిన కార్యం అనడానికన్నా అది ఆమె జీవితంలో విడదీయరాని అంశంగా ఉందని చెప్పడం సమంజసం. దక్షిణేశ్వర రోజులలోనే గురుదేవులు మాతృదేవికి పలుదైవాల మంత్రాలను నేర్పించి, వాటిని వ్యక్తుల మనస్తత్వాలకు తగ్గట్లు ప్రసాదించే విధానాన్ని నేర్పించారు. మాతృదేవి దానిని ఇంతవరకు అమలు చేయలేదు.
ఇప్పుడు గురుదేవులే దానిని మాతృదేవి జీవితంలో ప్రారంభించేశారు. తమ యువశిష్యుడైన శారదాప్రసన్నుని మాతృదేవి వద్ద మంత్రదీక్ష తీసుకోమని చెప్పారు. మాతృదేవి శక్తి తమ శక్తికి దీటయినదని స్ఫురించే ఒక వైష్ణవ గీతాన్ని ఆతడికి చెప్పి, మాతృదేవి వద్దకు పంపారు. ఇలా గురుదేవిగా మాతృదేవి కార్యం మొదలయింది.
ఈ రోజుల్లో మాతృదేవి ఘనతను చాటే ఎలాంటి సందర్భాన్నీ గురుదేవులు వదలుకోలేదు. ఒక రోజు యోగిన్ మా ఆయనను సమీపించి తాము బృందా వనం వెళ్లి తపోమయ జీవితం గడపాలని నిశ్చయించుకున్నట్లు తెలిపింది. అందుకు గురుదేవులు సంతోషంతో, “మంచిది. బృందావనం చక్కని స్థలం. అక్కడ అంతా వుంది” అన్నారు. అప్పుడు గురుదేవులకు ఆహారం ఇవ్వడానికి వచ్చిన మాతృదేవి ఆ గదిలో ఉన్నారు. ఆమెను గమనించిన గురుదేవులు, యోగిన్ మాతో, “అవును, నువ్వు ఈమెతో ఈ విషయం చెప్పావా? ఈమె అందుకు ఏమంది?” అని అడిగారు. అప్పుడు మాతృదేవి, “ఇంక నేను చెప్పా ల్సింది ఏముంది? చెప్పవలసింది మీరు చెప్పేశారు కదా!” అన్నారు. అయినా గురుదేవులు యోగిన్ మా తో, “అమ్మాయీ! ఆమె అనుమతి పొంది వెళ్లు, అంతా సిద్ధిస్తుంది” అన్నారు. మాతృదేవి ఈ మాటలను వినిపించుకోకుండా పళ్లెం తీసు కుని వెళ్లిపోయారు. మర్నాడు యోగిన్ మా వచ్చి మాతృదేవికి ప్రణమిల్లి, అనుమతి కోరింది. మాతృదేవి కూడా ఆమె శిరస్సుపై చేయివుంచి ఆశీర్వదించి పంపారు.
గురుదేవుల నిర్యాణ విషయంలో మాతృదేవి అనుభవాలు
మాతృదేవికి ఒక విషయం స్పష్టంగా తెలిసింది – గురుదేవులు ఇక ఎక్కువ రోజులు జీవించరు. దానిని ధ్రువీకరించేటట్లుగా కొన్ని చేదు అనుభవాలు ఆమెకు కలిగాయి. కాశీపూర్ ఉద్యానంలో ఒక ఈత చెట్టు ఉండేది. ఒక రోజు సాయంత్రం నిరంజన్ ప్రభృత యువ భక్తులు ఈత రసం తాగడానికి ఆ వృక్షాన్ని సమీపిం చారు. అప్పుడు గురుదేవులు పరుపుమీద పడుకుని వున్నారు. తమంతట తాముగా లేవడమో, కూర్చోవడమో చేయలేని మరీ బల హీనమైన స్థితిలో ఉన్నారాయన. కానీ హఠాత్తుగా లేచి బాణంలా దూసుకొంటూ కిందికి దిగి పరుగెత్తారు. మాతృదేవి యాదృచ్ఛికంగా అది చూశారు. గురుదేవులు లేచి పరుగెత్తడాన్ని నమ్మలేని మాతృదేవి, ఆయన గదికి వెళ్లి చూశారు. అక్కడ గురుదేవులు లేరు; కానీ కాసేపటికల్లా తిరిగి వచ్చి, ఏమీ జరగనట్లు, పడు కున్నారు. వీటినన్నిటిని దిగ్భ్రమతో చూస్తున్న మాతృదేవి ఆయన వద్దకెళ్లి వివరాలు అడిగారు. కానీ తాము పరుపు నుండి లేచివెళ్లడాన్నే నిరాకరిస్తూ, “నే నేమిటి? లేచి పరుగెత్తి వెళ్లడ మేమిటి? అంతా నీ భ్రమ. పొయ్యి వద్ద నిలబడి నీ మెదడు వేడెక్కిపోయింది” అని అన్నారు. కానీ మాతృదేవి వదల్లేదు. గుచ్చిగుచ్చి అడగ్గా నిరంజన్ ప్రభృతులు వెళ్లిన ఈత చెట్టున ఒక నాగుపాము ఉన్నట్లు, దానిని తరిమివేయడానికి తాము వెళ్లినట్లు తెలిపారు.
‘ఇక్కడ పడుకున్న ఆయన ఉద్యానవనంలో తారట్లాడే పామును ఎలా చూశారు? అలా అయితే తాము ఇష్టపడితే ఈ వ్యాధిని నయంచేసుకొనే సమ ర్థులు కదా! తాముగానే ఈ వ్యాధిని స్వీకరించారు” అని మాతృదేవి చింతనచేయ సాగారు. కొన్ని రోజుల క్రితం గురుదేవులు మాతృదేవితో, “దుఃఖమనేది ఎంత వుందో, దాన్ని పూర్తిగా నేను అనుభవించి వేశాను. మీరెవరూ ఎలాంటి దుఃఖా లను అనుభవించవలసింది లేదు. లోకంలోని అందరికోసమూ నేను దుఃఖాన్ని అనుభవిస్తున్నాను” అని అన్నారు. దాని నిజమైన అర్థం మాతృదేవి ఆ రోజు ప్రత్యక్షంగా గ్రహించారు.
కాళికాదేవి కూడా కంఠంలో వ్రణం
మరొక రోజు మాతృదేవి ఇవే ఆలోచనలలో మునిగి కూర్చొనివున్నారు. అప్పుడు హఠాత్తుగా ఆమెకు ఒక దృశ్యం కనబడింది – దీర్ఘమైన కేశాలుగల నల్లటి స్త్రీ ఒకరు ప్రత్యక్షమై మాతృదేవి పక్కన కూర్చుంది. ఆమె సాక్షాత్తు కాళికాదేవి అని గ్రహించారు మాతృదేవి. కానీ కాళికాదేవి మెడ కాస్త వంకరగా ఉంది. అది చూసిన మాతృదేవి, “నీ మెడకు ఏమయిందమ్మా?” అని అడిగారు.
కాళికాదేవి: నాకు గొంతులో వ్రణం వచ్చింది.
మాతృదేవి: ఓ భగవంతుడా! గురుదేవులకు గొంతులో వ్రణం. మరి నీకు కూడా వచ్చిందే!
కాళికాదేవి: అవును.
ఇలా గురుదేవులూ, కాళికాదేవీ అభిన్నులని మాతృదేవికి తెలియవచ్చింది. కాళీమాతే తనకు వ్రణం వచ్చిందని స్వయంగా చెప్పినప్పుడు, ఆమె దానిని నయం చేసుకోదనే కదా అర్థం. ఇక మార్గాంతరం లేదని మాతృదేవికి స్పష్టమయి పోయింది.
మాతృదే తుది ప్రయత్నం
తన పసుపు కుంకాలకు భంగం వాటిల్లనున్నది అంటే స్త్రీ హృదయం ఎలా పరితపించిపోతుందో మాటల్లో వర్ణించలేం. గురుదేవుల నిర్యాణం తథ్య మని తెలిసినప్పటికీ మాతృదేవి మనస్సు దానిని స్వీక రించడానికి నిరాకరించింది. చివరి ప్రయత్నంగా తార కేశ్వరంలో వెలసిన శివాలయానికి వెళ్లి, అక్కడ ఒక రోజంతా ఉపవసించారు. శివుని సాన్నిధ్యంలో ధ్యానమగ్నులయ్యారు. ఈ విష యంగా మాతృదేవి కాలాంతరంలో ఇలా చెప్పారు: ‘రెండవ రోజు పగలు గడచి పోయింది. ఆ రాత్రి నేను కళ్లు మూసుకుని పడుకుని ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటిగా కుండలను పేర్చి ఒక్క దెబ్బతో వాటినన్నిటిని పగలగొట్టినట్లు ఒక ధ్వని వినవచ్చింది. ఈ శబ్దం విని నేను హఠాత్తుగా లేచాను. అప్పుడు నా మనస్సులో, “భర్త ఎవరు? భార్య ఎవరు? ఎవరు బంధువులు? ఎవరు బాంధవులు?” అనే ప్రశ్నలు క్రమంగా తలెత్తసాగాయి. సమస్తమూ మాయ అని స్పష్టమయింది. గురు దేవుల పట్ల నాకున్న అనురాగం మాయమయింది. అన్నిటినీ త్యజించి, అత్యున్నత స్థితికి వెళ్లిపోయింది నా మనస్సు. చీకటిలో తడవుకొంటూ వెళ్లి, శివుని అభిషేక తీర్థం తీసుకుని, ముఖం తుడుచుకున్నాను. కాసిని నీళ్లు తాగి దాహం కూడా తీర్చుకున్నాను. నూతనోత్సాహంతో మరుసటి ఉదయం కాశీపూర్ ఉద్యానగృహం చేరుకున్నాను. నన్ను చూడగానే గురుదేవులు నర్మగర్భంగా నవ్వుతూ, ‘ఏమిటి! ఏమైనా దొరికిందా? సకలమూ మాయ, అంతే” అన్నారు.
మాతృదేవి ఎరుక
మాతృదేవి మనస్సుకు స్పష్టమయింది. ఈ సమయంలోనే గురుదేవులు ఒక రోజు మాతృదేవిని పిలిచి, “ఇదిగో చూడు! నాకొక కలవచ్చింది. నాకు ఔషధాన్ని అన్వేషిస్తూ ఒక ఏనుగు వెళ్లింది. ఆ ప్రయత్నంలో అది ఒక పెద్ద గోతిని తవ్వింది. కానీ ముగింపు తెలుసుకునే లోపల కల చెదరిపోయింది. అది సరే! నువ్వు ఇలాంటిది ఏమైనా చూశావా?” అని అడిగారు. తాము కాళీమాతను చూసిన విషయం గురించి చెప్పారు మాతృదేవి. మరొక రోజు గురుదేవులు మాతృదేవిని పిలిచి, “ఇప్పుడల్లా నా మనస్సు సదా బ్రహ్మం గురించిన ఆలోచనలలోనే మునిగివుంటోంది. దీనికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు. నీకు తెలుసా?” అని అడిగారు. అద్వైతమైన పరబ్రహ్మంలో కలిసిపోయే సమయాన్ని ఆయన సమీపిస్తున్నారని మాతృదేవి గ్రహించారు. కానీ దానిని ఎలా చెప్పగలుగుతారు? ఒకటి రెండు అనునయ వచనాలు పలికి పెల్లుబికివచ్చే కన్నీళ్లను ఆపుకుంటూ అక్కడ నుండి లేచి వెళ్లిపోయారు.
గురుదేవుల మహాసమాధి
ఆగస్టు 15. ఎముకల గూడులా అయిపోయారు గురుదేవులు. ఆయన కొన్ని తలదిండ్లను ఉంచుకుని వాటిపై ఆనుకొని వున్నారు. సర్వత్రా నిశ్శబ్దం! అందరిలోనూ విశ్వాసపు చివరి పగ్గం కూడా సడలిపోతూవుంది. ఆయన మాట్లాడలేకపోతున్నారే అనిపించింది. ఆ రోజంతా మాతృదేవికి శకునాలు సరిగ్గా లేవు. కిచ్చడి వండుతూ ఉంటే అది క్రింద మాడిపోయింది. మేడమీద ఆరవేసిన గుడ్డలు కనబడలేదు. నీటితో నిండిన కుండను పైకెత్తారు. అది కిందపడి ముక్కలు ముక్కలయింది. ఎంతో కలతచెంది లక్ష్మీతోపాటు గురుదేవుల గదికి వచ్చారు. అప్పుడు గురుదేవులు, “ఇదిగో చూడు, ఎక్కడ చూసినా జలమయంగావుంది. ఆ జలం మధ్యగా నేను ఎక్కడికో సుదూరంగా వెళ్లుతున్నట్లుంది” అన్నారు. ఇక ఆపుకోలేక మాతృదేవి రోదించసాగారు. గురుదేవులు మళ్లీ, “కలత చెందకు! ఇప్పుడు ఉన్నట్లే ఇకపై కూడా, ఉండబోతున్నావు. నన్ను చూసుకొన్నట్లే వీళ్లందరు (నరేంద్రాదులు) నిన్ను కూడా చూసుకుంటారు. లక్ష్మిని చూసుకో” అన్నారు.
ఆ రోజు అర్ధరాత్రి అందరి హృదయాలను దుఃఖంతో నింపివేసి గురు దేవులు మహాసమాధి చెందారు. మాతృదేవి అప్పుడు ప్రక్కన లేరు. విషయం తెలియగానే పరుపు దగ్గరికి వచ్చి, “అమ్మా! కాళీ! నువ్వు ఎక్కడికి వెళ్లిపోయావు?” అంటూ ఆక్రోశించారు. అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. గురుదేవుల భౌతిక శరీరం కాశీపూర్ శ్మశానవాటికలో అగ్నికి ఆహుతి చేయబడింది. అస్తు లను ఒక ఇత్తడి బిందెలో సేకరించి గురుదేవులు శయనించిన పరుపుమీద ఉంచారు.
నిత్యసుమంగళి
ముప్పై మూడు ఏళ్ల మాతృదేవి వితంతువుగా తన్ను చేసుకున్నారు. భర్త చనిపోతేనే కదా భార్య వితంతవుగా మారాలి! ఆమె భర్త మరణించారా? మరణా తీతులు కదా గురుదేవులు! మాతృదేవి తన బంగారు గాజులను తీసివేయడానికి ప్రయత్నించగానే గురుదేవులు ఆమెకు సాక్షాత్కరించారు. “నేను చనిపోయాననా నువ్వు ఈ సుమంగళీ రూపాన్ని తీసేస్తున్నావు! నేను చనిపోలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నాను” అంటూ మాతృదేవి ప్రయత్నాన్ని వారించారు. మండు టెండలో వీచే ఆహ్లాదకరమైన గాలిలా వచ్చిన గురుదేవుల దర్శనమూ; మాటలూ మాతృదేవి దుఃఖపూరితమైన మనస్సుకు ఎంతో ఊరటను కలుగజేశాయి. అంచులేని తెల్లటి చీర నొకదానిని మాతృదేవికి బలరాంబోస్ తీసుకు వచ్చాడు. దానిని గోలాప్ మాకు ఇస్తూ మాతృదేవికి ఇవ్వ మన్నాడు. “తెల్ల చీరను నేనివ్వడమా?” అంటూ ఆవేదనతో అరిచింది గోలాప్ మా. కానీ ఆ చీరను ఆమె మాతృదేవి వద్దకు తీసుకువెళ్లినప్పుడు, అప్పటికే మాతృదేవి తాము ధరించిన చీరలోని విశాలమయిన ఎరుపు అంచులోని భాగాన్ని చింపివేసి, సన్నని అంచు మాత్రం గల చీరను ధరించివున్నారు.
కాలాంతరంలో మరో రెండుసార్లు తమ గాజులను తీసివేయడానికి మాతృ దేవి ప్రయత్నించారు. అప్పుడు కూడా మునుపటిలా గురుదేవులు ఆమెను వారిం చారు. ఆ తర్వాత గాజులతోనూ, సన్నని అంచుగల చీరతోను నిత్యసుమంగళిగానే జీవించారు మాతృదేవి.
ఎక్కడికి వెళ్లాలి?
అలసి సొలసి పోయిన క్షణాల్లో కనబడి అనునయించడానికి నిష్క్రమించినా నిష్క్రమించని భర్త ఉన్నారు; నోరారా ‘అమ్మా’ అంటూ పిలవడానికి పిల్లలున్నారు. కానీ మాతృదేవి మనస్సు శూన్యంలో పరిభ్రమించింది. లోకంలో జీవించడానికి ఇవి చాలవు కదా! ప్రపంచ దృష్టిలో తామొక వితంతువు. ఇక బిడ్డలా, చిల్లిగవ్వ లేని సన్న్యాసులు! ‘నా తర్వాత నువ్వు కామార్పుకూరుకు వెళ్లి జీవించు. సామాన్య ఆహారాదులతో సాధారణ జీవితం గడుపు. ఎవరి నుండి దేన్నీ ఆశించకు!’ అంటూ ఆప్యాయంగా చెప్పి ఆమె జీవితం గడవడానికి కావలసిన డబ్బుకు కూడా తగిన ఏర్పాట్లు చేసి వెళ్లిన ఆ ప్రేమమూర్తి మధుర స్మృతులు మాతృదేవిని విపరీతంగా వేధించాయి. ‘ఆయన లేకుండా నేను జీవించి తీరాలా?’ అని అనిపించింది ఆమెకు. ‘ఆయన వెళ్లి పోయిన తర్వాత నాకు జీవితం పట్ల అనురక్తి లేకుండా పోయింది’ అంటూ కాలాంతరంలో చెప్పారు మాతృదేవి. సమాధి స్థితిలో మగ్నమై శరీరాన్ని వదలి వేయడం మాతృదేవికి అంత కష్టమైన పని ఏమీ కాదు. కానీ గురుదేవులు అప్ప గించిన కార్యాన్ని వదలిపెట్టి ఎక్కడికి వెళ్లాలి? నూతన సన్న్యాస సంప్రదాయానికి అధ్యక్షురాలుగా, మాతృత్వపు ఔన్నత్యాన్ని లోకానికి చాటి చెప్పే మాతృదేవిగా చేయ వలసిన మహోన్నత కార్యాన్ని వదలి ఎక్కడి వెళ్లాలి? ఆ తర్వాత కూడా మాతృదేవి సందిగ్ధత చెందలేరు. ఆలోచనలు స్పష్టమయ్యాయి. తాము జీవించి తీరాలనే తీర్మానానికి వచ్చేశారు మాతృదేవి.
మాతృదేవి బయలు దేరారు
మాతృదేవి మనోవేదనలు ఒక వైపు ఉండగా, మరోవైపు గురుదేవుల భక్తులు కొందరు తమ వంతుగా ఆవేదనను రగిల్చేలా ప్రవర్తించారు. గురు దేవుల నిర్యాణానంతరం కాశీపూర్ ఇంటిని ఖాళీ చేయ డానికి వారు పూనుకున్నారు. కాని నరేంద్రుడు, ఇతర మాతృదేవి సన్న్యాస పుత్రులు వెంటనే ఇంటిని ఖాళీ చేసి మాతృదేవిని అక్కడ నుండి తీసుకెళ్లడం ఆమెకు ఎంతో ఆవేదనను కలుగజేస్తుం దని వారించారు. కొన్ని రోజుల వరకైనా ఆమె అక్కడే ఉండడానికి ఏర్పాటు చేయాలనీ, అవసరమైతే తాము బిచ్చమెత్తి మాతృదేవిని పోషించగలమనీ చెప్పారు. అందువల్ల మరికొన్ని రోజులు మాతృదేవి కాశీపూర్ ఇంట్లోనే గడి పారు. గురుదేవుల అస్తులున్న కలశం ప్రతిరోజూ నైవేద్యంతోపాటు పూజింప బడుతూ వచ్చింది. కానీ ఇల్లు ఖాళీ చేయాలని భక్తులు పట్టుపట్టారు. అందువల్ల ఐదు రోజుల తర్వాత బలరాంబోసు ఆహ్వానంపై ఆగస్టు 21 వ తేది మాతృదేవి, లక్ష్మితోపాటు వారింటికి వెళ్లారు. మాతృదేవి మౌనంగా అన్నిటినీ సహించారు.
ఇంతలో గురుదేవుల అస్తుల కలశాన్ని ఎవరి బాధ్యతలో ఉంచాలనే విషయం మీద సన్న్యాస శిష్యులకూ, గృహస్థ శిష్యులకూ భేదాభిప్రాయం తలెత్తింది. ఆపై మాతృదేవి ఓర్చుకోలేకపోయారు. “చూడు గోలాప్! అంతటి మహానుభావుణ్ణి కోల్పోయి కూర్చున్నాం! ఇక్కడ వీరందరూ ఆయన అస్తుల కోసం కొట్టుకుంటున్నారు” అంటూ ఆవేదనతో అన్నారు.
తర్జనభర్జనల తర్వాత కలకత్తా పొలిమేరలలోని కాంకూర్గాచ్ఛి అనే చోట రామచంద్రునికి సొంతమయిన తోటలో అస్తులను పదిలపరచి ఒక దేవాలయం నిర్మించడానికి భక్తులు తీర్మానించారు. గురుదేవులు ఒకసారి ఈ తోటకు వెళ్లి వుండడం, వారి ఈ తీర్మానానికి ఒక కారణం. కానీ సన్న్యాస శిష్యులు ఇందుకు సమ్మతించలేదు. అందువల్ల అస్తులలో చాలా భాగం ప్రత్యేకంగా తీసి బలరాం బాబు ఇంటికి మాతృదేవి వెళ్లినప్పుడు ఇచ్చి పంపి అక్కడ సంప్రదాయానుసారం ఆరాధన చేయడానికి ఏర్పాట్లు చేశారు. భవిష్యత్తులో గంగాతీరంలో స్థలం కొను గోలుచేసి గురుదేవులకు అక్కడ చక్కని దేవాలయం నిర్మించాలన్నదే వారి ఆశయం. మిగిలిన అస్తులు కృష్ణజన్మాష్టమి రోజు సంప్రదాయానుసారంగా కాంకూర్గాచ్ఛికి తీసుకుపోయారు. శశి ఈ అస్తుల కలశాన్ని తన తల మీద ఉంచుకుని వెళ్లాడు. సన్న్యాస శిష్యులూ, భక్తులూ వారితో వెళ్లారు. కాంకూర్ గాచ్ఛిలో వాటిని ఉంచి దేవాలయం నిర్మించి సంప్రదాయానుసారం ప్రతి రోజు పూజలు జరగడానికి ఏర్పాట్లు చేశారు.
తాను మధురంగా గడపిన రోజులు ముగింపుకు వచ్చాయని మాతృదేవి గ్రహించారు. ఇక తమ మహత్తర కార్యం పూర్తి అయ్యేదాకా గురుదేవుల పరి కరంగా జీవించాలి. ఆయన ఏమైనా చేసుకోనీ అంటూ తమను పూర్తిగా ఆయ నకు అర్పించుకొని బలరాంబాబు ఇంట రోజులు వెళ్లబుచ్చసాగారు.