కుటుంబ కదంబం
ఇంతదాకా మాతృదేవి వ్యక్తిగత జీవితాన్నీ, గురుదేవులతో ఆమెకున్న సంబం ధాన్ని గురించి మామూలుగా చూశాం. ఒక కుమార్తెగా, సోదరిగా, ఆమె జీవి తాన్ని ఇప్పుడు పరికిద్దాం. ఇంటికి జ్యేష్ఠురాలు మాతృ దేవి. ఆమె తరువాత జన్మించిన ఏకైక సోదరి కాదంబిని వివాహం చేసుకొన్న కొంతకాలానికే మరణించింది. ఆమెకు సంతానం కలుగ లేదు. కాదంబిని తర్వాత ప్రసన్న కుమార్, ఉమేశ చంద్ర, కాళీ కుమార్, వరదా ప్రసన్న, అభయచరణ్ అనే ఐదుగురు సోదరులు జన్మించారు. వీరిలో ఉమేష్ తన పద్దెనిమిదవ ఏట మరణించాడు. ప్రసన్నుని భార్య రాంప్రియాదేవి. వారికి నళిని, సుశీలా (మాకూ) కుమార్తెలు. రాంప్రియాదేవి చనిపోయాక ప్రసన్నుడు సువాసినీ దేవిని వివాహం చేసుకొన్నాడు. వారికి కమల, విమల అని ఇద్దరు కుమార్తెలు, గణపతి* అనే కుమారుడు పుట్టారు. కాళీకుమార్ సుబోధ్ బాలాదేవిని వివాహం చేసుకుని భూదేవ్, రాధారమణులనే కుమారులకు తండ్రి అయ్యాడు. అభయ చరణ్ భార్య సురబాల; వీరి ఏకైక పుత్రిక రాధారాణి, ముద్దుగా రాధూ అనీ రాధీ అనీ ఈమెను పిలిచేవారు. ఈమె మాతృదేవి భవిష్యత్ జీవితంలో ముఖ్య భూమికను పోషించింది. తల్లితండ్రులు, సోదరులు, బంధువులు* అంటూ కుటుంబంలో ప్రతి ఒక్కరి శ్రేయస్సులోనూ మాతృదేవి ఎంతో శ్రద్ధ చూపించారు.
రామచంద్రుని మరణం – కుటుంబ పరిస్థితులు
మాతృదేవి దక్షిణేశ్వరంలో జీవించిన పదమూడేళ్లలో ఏడు సార్లయినా జయరాంబాటికి వెళ్లి కొంతకాలం గడపి వచ్చారు. మొదటిసారిగా ఆగస్టు 1873 లో వెళ్లి ఒకటిన్నర సంవత్సరాలు అక్కడ గడపి తిరిగి వచ్చారు. ఏప్రిల్ 26, 1874 లో మాతృదేవి తండ్రియైన రామచంద్ర పరమపదించారు. ఆయన మరణం మాతృదేవి కుటుంబాన్ని దారిద్ర్యంలో ముంచెత్తింది. ఎందుకంటే ఆ కుటుంబ పోషణ ఆయన సంపాదన పైనే ఆధారపడి ఉంది కనుక. పొలం మీద వచ్చే కొద్దిపాటి రాబడి కూడా వ్యవసాయాన్ని చూసుకోవడానికి సరైన వ్యక్తి లేనందువల్ల తగ్గిపోయింది. ప్రసన్నతోపాటు ముగ్గురు తమ్ముళ్లూ బాగా చిన్నవారు. ప్రసన్న పౌరోహిత్యానికి అవసరమయిన చదువు పూర్తిచేయలేదు. అందువల్ల కుటుంబ భారమంతా భర్తను కోల్పోయిన శ్యామసుందరి మీద పడింది. మనోస్థైర్యం గల ఆమె కుంగిపోలేదు. సమీపంలోని బెనర్జీ కుటుంబం వారికి వడ్లు దంచి ఇవ్వడం, వంటపని చేయడంతో సంపాదించిన డబ్బుతో కుటుంబం గడపసాగారు. పిల్లల చదువు పాడవ కూడదని, వారిలో ముగ్గురిని తన బంధువుల ఇళ్లకు పంపించారు. ఆ బంధువులు పిల్లల చదువు బాధ్యతలను తీసుకున్నారు.
ఇలాంటి శోకమయ కాలఘట్టంలో మాతృదేవి తమ తల్లికి ఎంతో చేదోడు వాదోడుగా నిలబడ్డారు. భర్తను కోల్పోయిన తల్లికి అండగా ఉంటూ, ఆమెను ఓదారుస్తూ, వడ్లు దంచడం లాంటి కాయకష్టపు పనులలో పాలుపంచుకుని ఇంటి సంపాదనను పెంచడానికి సాయపడ్డారు. క్రమేణా పరిస్థితులు కొంతలో కొంత చక్కబడ్డాయి. ప్రసన్న చదువు పూర్తిచేసి కలకత్తాకు వెళ్లి పౌరోహిత్యం చేస్తూ కొంత సంపాదించసాగాడు. కాళీ, వరద పొలం పనులు చూసుకోసాగారు. అందరికన్నా చిన్నవాడూ బుద్ధిమంతుడూ అయిన అభయ్ కొందరు మిత్రుల సహా యంతో వైద్య విద్య కోసం కలకత్తాకు వెళ్లాడు. చదువును పూర్తిచేసిన అభయ్ దురదృష్టవశాత్తూ యుక్తవయస్సులోనే అకాల మరణం చెందాడు. తన సోదరు లను మాతృదేవి ఎంతగానో ప్రేమించారు. ఆమె అండదండలతో పెరిగిన ఆ సోద రులు, పెద్దవారయ్యాక కూడా ఆమె సహాయసహకారాలను ఆశించారు.
జగద్ధాత్రీ పూజ
జగత్తును ధరిస్తున్న జగద్ధాత్రీదేవిని ఆరాధించడం కూడా కుటుంబంలో తాండవిస్తున్న దారిద్ర్యం తొలగిపోవడానికి ఒక కారణమయింది. ఆ సంవత్సరం కాళీపూజ వచ్చింది. పేదరికం కారణంగా శ్యామాదేవి ఇంట్లో కాళీపూజ జరుపుకో లేకపోయింది.* అందువల్ల ఆ ఊళ్లో నవముఖర్జీ అనే వ్యక్తి జరిపిన పూజకు తనవంతుగా కొంత బియ్యమూ, మరికొన్ని పదార్థాలను తీసుకెళ్లి ఇచ్చారు. ఇంత పేదరికంలోనూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆమె వీటిని సేకరించి పెట్టుకున్నారు. కానీ శ్యామాదేవి కుటుంబంతో ఏర్పడ్డ చిన్న మనస్తాపం కారణంగా ఆ వస్తువులను తీసుకోవడానికి నవ ముఖర్జీ నిరాకరించాడు. శ్యామాదేవి మనస్సు క్షోభించింది. ఆ రాత్రి ఆమెకు ఒక అద్భుత మైన కల వచ్చింది. అందులో ఎరుపు మేనిఛాయ గల ఒక దేవి దర్శనమిచ్చింది. కాలు మీద కాలు వేసుకుని తలుపు దగ్గర కూర్చొని వున్న ఆ దేవి, శ్యామాదేవితో, “నువ్వెందుకు ఏడుస్తున్నావు? కలత చెందకు! నువ్వు కాళి కోసం సేకరించిన వాటిని నేను స్వీకరిస్తాను” అని చెప్పింది. మహదానందంతో శ్యామాదేవి, “అవును, నువ్వెవరివి?” అని అడిగింది. “నేను జగతిని ధరించే జగద్ధాత్రిని” అంది దేవి. ఇంతలో కల చెదరిపోయింది.
తెల్లవారగానే ఆమె మాతృదేవిని పిలిచి, “శారదా! కాలుమీద కాలు వేసుకుని ఎరుపు మేని ఛాయతో దర్శనమిచ్చే ఆ దేవి ఎవరు?” అని అడిగింది. అందుకు మాతృదేవి, “జగద్ధాత్రి” అని ఠక్కున చెప్పారు. “నేను మన ఇంట్లో జగద్ధాత్రి పూజ చేయబోతున్నాను” అంటూ అందుకోసం ఏర్పాట్లు చేయసాగారు. ఎలాగో శ్రమపడి, అప్పు చేసి, పూజ కోసం ఏర్పాటు చేశారు.* ప్రసన్న దక్షి ణేశ్వరం వెళ్లి గురుదేవులను పూజలో పాల్గొనమని ప్రార్థించాడు. గురుదేవులు అమితానందంతో, “ఓహో! దేవి వస్తున్నదా! రానివ్వు రానివ్వు! చాలా మంచిది! నేను అక్కడ ఉన్నట్లే పూజలన్నీ జరుగుగాక! అది కుటుంబానికి శ్రేయస్సును ఒనగూరుస్తుంది” అని చెప్పి ప్రసన్నుని పంపించేశారు. ఆయన పూజకు రాలేదు. నిశ్చయించిన రోజున పూజ చక్కగా జరిగింది.
మరుసటి ఏడాది కూడా జగద్ధాత్రీ పూజ చేయాలని ఆశించింది శ్యామా దేవి. అందుకు ఏర్పాట్లు చేయమని చెప్పినప్పుడు మాతృదేవి, “ఒకసారి చేశాం కదా! అదే చాలు! ప్రతి సంవత్సరమూ నేను శ్రమపడలేను” అని చెప్పేశారు. ఆ రాత్రి మాతృదేవికి ఒక కల వచ్చింది. కాలాంతరంలో ఈ విషయం ప్రస్తావిస్తూ మాతృదేవి ఇలా చెప్పారు: “జగద్ధాత్రీదేవితోపాటు ఆమె సఖులైన జయా, విజయా ఇద్దరూ కూడా నాకు కలలో కనిపించారు. ఆ దృశ్యం నా మనస్సులో నేటికీ చెక్కుచెదర లేదు. వారు నాతో, ‘అలా అయితే మేమందరమూ వెళ్లిపోవల సిందేనా?’ అది అడిగారు. ‘మీరెవరు?’ అని అడిగాను. ‘నేనే జగద్ధాత్రిని’ అంటూ వారిలో ఒకరు జవాబిచ్చారు. వెంటనే నేను, ‘వద్దు, వద్దు! మీరెందుకు వెళ్లి పోవాలి? ఇక్కడే ఉండండి! మిమ్మల్ని వెళ్లిపొమ్మని నేను చెప్పలేదే!’ అని బదులు చెప్పాను.”
అప్పటి నుండి ప్రతి సంవత్సరమూ మాతృదేవి ఇంట్లో జగద్ధాత్రీ పూజ వైభవోపేతంగా జరుగుతూ వచ్చింది. తాము దక్షిణేశ్వరంలో ఉంటున్నా, పూజా సమయంలో జయరాంబాటికి వచ్చి పూజ ఏర్పాట్లను స్వయంగా మాతృదేవియే చూసుకునేవారు. పాత్రలను కడగడం నుండి ఇతర ఏర్పాట్లనన్నిటినీ ఆమే పర్య వేక్షించేవారు. ఆ రోజుల్లో పనులలో ఆమెకు సహకరించడానికి కూడా ఎవరూ లేరు. కాలాంతరంలో మాతృదేవి పాత్రలు కడిగి కష్టపడడం చూసిన యోగిన్ మట్టిపాత్రలకు బదులు చెక్క పాత్రలు కొని ఇచ్చారు. దానితోపాటు పూజకు అవసరమైన ధాన్యం పండే చిన్న పొలం కూడా ఒకటి కొని ఇచ్చారు.
పన్నెండు సంవత్సరాల తర్వాత జగద్ధాత్రీ పూజను ఆపివేయాలని మాతృ దేవి అనుకున్నారు. కానీ జగద్ధాత్రీదేవి మళ్లీ కలలో కనిపించి మునుపటిలాగే అడిగింది. మాతృదేవి జగద్ధాత్రి తల్లి పాదాలను పుచ్చుకొని, “వద్దమ్మా! ఇక నువ్వు ఎక్కడికీ వెళ్లవద్దు. ప్రతి సంవత్సరమూ నిన్ను నేను ఆరాధిస్తాను’ అని చెప్పారు.*
కడుపు నొప్పి – దేవి చికిత్స
తమ తండ్రి పరమపదించిన తర్వాత 1874 ఏప్రిల్‌లో మాతృదేవి దక్షి ణేశ్వరం వచ్చారు. ఈ సమయంలోనే ఆమెకు శంభుమల్లిక్ కొత్త ఇల్లు కట్టించి ఇచ్చాడు. ఒక సంవత్సరం ఆ ఇంట్లో నివసించిన తర్వాత మాతృదేవి మళ్లీ నహబత్తుకు తిరిగి రావాల్సి వచ్చిందని మునుపే తెలుసుకున్నాం. గురుదేవుల వ్యాధి నయమయి నప్పుడు మాతృదేవి కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడ్డారు. శంభుమల్లిక్ ఆమె చికిత్సకు చక్కని ఏర్పాట్లు చేయడం వల్ల ఆమె కోలుకొన్నారు. బాగా కోలుకున్న తర్వాత 1875 సెప్టెంబర్‌లో జయరాంబాటికి వచ్చారు.
గ్రామానికి వెళ్లిన వెంటనే దురదృష్టవశాత్తూ ఆ కడుపునొప్పి తిరగబెట్టి మాతృదేవిని వేధించసాగింది. మాతృదేవి తల్లి, సోదరులు తమకు చేతనయినంత వరకు చికిత్సలు చేయించారు. అయినా బాధ ఉపశమించలేదు. ఆమె బ్రతికి బట్ట కడతారా అనిపించింది. ఈ విషయం తెలుసుకున్న గురుదేవులు ఎంతో ఆవేదన పడ్డారు. “మానవ జన్మ పరమావధిని సాధించకుండానే ఆమె చనిపోతుందా? ఇలా అకాల మరణానికా ఆమె జన్మించింది!” అంటూ హృదయ్‌తో పదే పదే చెబుతూ దుఃఖపడసాగారు.
మాతృదేవి ఆరోగ్యం మరీ దిగజారింది. శరీరమంతా వాచిపోయింది. కళ్ల నుండి ఎడతెగక స్రవించే నీళ్ల వలన చూపు మందగించింది. పున్నమిచంద్రుని వెలుతురు కూడా అప్పుడు తమకు కారుచీకటిగా కనిపించినట్లు కాలాంతరంలో మాతృదేవి తెలిపారు. నిరంతర విరేచనాల వల్ల ఆమె సదా కొలను దరిదాపుల్లోనే ఉండవలసి వచ్చింది. కృశించిపోయి చర్మం ఎముకలతో మాత్రమే ఉన్న తమ శరీర ప్రతిబింబాన్ని కొలను నీళ్లలో చూసిన మాతృదేవి, ‘ఛీ! సిగ్గుచేటు! శరీర మనేది ఇదే! దీనిని ఇంత గొప్ప చేయడమెందుకు? దీనిని వదిలేసుకుందాం’ అని అనుకున్నారు. అప్పుడు ఆమె తమ్ముడయిన ఉమేష్, సింహవాహిని ఆలయానికి వెళ్లి ప్రాయోపవేశ వ్రతం చేపట్టమని ప్రాథేయపడ్డాడు. మానవ ప్రయత్నాలన్నిటి ద్వారా తన వ్యాధి నయం కాదని మాతృదేవి గ్రహించారు. తమ్ముడు చెప్పినట్లు ఇక భగవంతుని కృపాకటాక్షం మాత్రమే తమను కాపాడగలుగుతుందనే దృఢనిశ్చ యానికి వచ్చిందామె. సింహవాహిని ఆలయానికి వెళ్లి, మరణమే సంభవించినా కూడా, దేవి కృపాకటాక్షం కలిగేదాకా ఆహారమో, జలమో సేవించకుండా ప్రాయోపవేశమనే కఠోరమైన వ్రతాన్ని ఆచరించాలని తీర్మానించారు.
తల్లి, సోదరులకు తెలియకుండా ఒక స్నేహితురాలి సహాయంతో సింహ వాహిని సన్నిధికి వెళ్లారు. ప్రాయోపవేశమనే వ్రతాన్ని ఆచరించి సింహవాహిని సన్నిధిలో పడిపోయారు. విరేచనాల కారణంగా శరీరం శక్తిని కోల్పోయి, కొలను దగ్గరికి వెళ్లడానికి ప్రాక్కుంటూ వెళ్లవలసివచ్చింది, ఇంత జరిగాక సింహవాహిని ఇక ఆలస్యం చేయలేదు. కడుపు నొప్పికి ఔషధాన్ని శ్యామసుందరీ దేవికీ, కంటిజబ్బుకు మందును తమకూ తెలియజేసినట్లు మాతృదేవి చెప్పారు,* ఆ రెండు ఔషధాలనూ మాతృదేవి పుచ్చుకొన్నారు. కంటిచూపు ఆ రోజే మెరుగు పడసాగింది, ఇతర జబ్బులు కూడా త్వరలోనే సమసిపోయాయి.*
పువ్వు – వజ్రం
మరుసటి సంవత్సరం మాతృదేవి మలేరియా జ్వరంతో బాధపడ్డారు. ఆ కారణంగా పేగులు ఉబ్బి ఎంతో కష్టపడసాగారు. చికిత్స కోసం పక్క గ్రామమైన కోమోపట్–ఎదన్గంజ్కు ఆమెను తీసుకువెళ్లారు. అక్కడి చికిత్స వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. కానీ చికిత్సా విధానం కఠోరమైనది. శరీరంలో వాపు ఉన్నచోట ఒక అరటి ఆకును ఉంచి, దానిమీద బాగా మండుతున్న ఒక రకమైన కఱ్ఱతో వాతపెడతాడు వైద్యుడు. ఆ చోట చర్మం వేడివల్ల సంకోచిస్తుందట. అక్కడి శివాలయంలో ఈ చికిత్స జరుగుతుంది. వాత పెట్టేటప్పుడు వ్యాధిగ్రస్థులు ఆ బాధను ఓర్చుకోలేక లేచి పరుగులు తీస్తారు కాబట్టి వారి కాళ్లు చేతులను కొందరు గట్టిగా అదిమి పట్టుకుంటారు. ఆ తర్వాతే చికిత్స మొదలవుతుంది, కానీ పువ్వు కన్నా మృదులమైన మాతృదేవి అవసర మయితే వజ్రం కంటే కఠినంగా ఉండగలరని నిరూపించింది ఈ చికిత్స. తమను ఎవరూ పట్టుకోనక్కర లేదని చెప్పి, కఠోరమైన ఆ చికిత్స కల్పించే బాధను ప్రశాంతంగా ఓర్చుకున్నారు. కొన్ని రోజులకు ఆమె వ్యాధి నయమయింది. గురుదేవులు కూడా ఒకసారి ఈ చికిత్స చేయించుకున్నట్లు తెలియవస్తున్నది.
మూడవసారిగా 1877 జనవరిలో మాతృదేవి జయరాంబాటికి వచ్చారు. ఆమె దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చేలోపుగా గురుదేవుల తల్లి చంద్రమణీదేవి పరమ పదించారు.
ఒకసారి గురుదేవులూ, మాతృదేవీ కలిసే దక్షిణేశ్వరం వచ్చినట్లు తెలియ వస్తున్నది. 1880 వ సం ॥ వరకు గురుదేవులు ప్రతి ఏడాది కామార్పుకూర్కు వచ్చి కొన్ని నెలలు ఉండడం రివాజు. ఈసారి మాతృదేవీ, హృదయ్ ఆయనతో ఉన్నారు. పడవలో ఆరాంబాగ్ వెళ్లే దారిలో కామార్పుకూర్కు దక్షిణంగా కొంత దూరంలోని బాలిదేవన్ గంజ్ అనే చోటికి వచ్చారు. అక్కడికి రాగానే భారీవర్షం మొదలయింది. ఆ ఊళ్లోని ఒక వ్యాపారస్థుడు, ఒక మహాత్ముణ్ణి తమ కొత్త ఇంట్లో మూడు రోజులు బస చేయించాలని ఎంతగానో ఆశించాడు. అందువల్ల ఆ వ్యాపారి ఇంట్లో మూడు రోజులు బస చేసిన తర్వాత కామార్పుకూర్ వెళ్లారు. ఆ వ్యాపారస్థుని కోర్కె కూడా ఈ రకంగా నెరవేరింది.
మాృదయ్ అహం –పర్యవసానం
జయరాంబాటి నుండి నాలుగవ సారిగా 1881 మార్చిలో దక్షిణేశ్వరానికి తిరిగి వచ్చారు మాతృదేవి. అప్పుడు హృదయ్ అహంకారం వల్ల మాతృదేవి మనస్సు క్షోభించే సంఘటన ఒకటి జరిగింది. గురు దేవుల సాధన సమయంలో నీడలా ఆయన వెంటే ఉంటూ సేవలు చేసినవాడు హృదయ్. అందువల్ల ఆలయ సిబ్బందీ, ఇతరులూ ఆతడి పట్ల ఎంతో మర్యాద కనబరచేవారు. ఇది ఆతడి మనస్సులో అహంకారాన్ని రేకెత్తించింది. తన సహాయం లేనిదే గురు దేవులు కూడా ఏమీ చేయలేరనే గర్వంతోనూ, అహంకారంతోనూ విఱ్ఱవీగ సాగాడు హృదయ్. ధనాశతో ఆతడు గురుదేవుల దర్శనార్థం వచ్చే వారందరికీ తనను ఒక గొప్ప మహాత్మునిగా ప్రదర్శించుకోసాగాడు. కరకుతనమూ, అందరూ తనకు లోబడి ఉండాలనే గర్వంతో విఱ్ఱవీగిన హృదయ్ ఇతరులను అల్పంగా మాట్లాడడం, వారి మనస్సులు బాధపడేలా చేయడం లాంటివి చేయసాగాడు. గురుదేవులు కూడా ఈ దుర్భరత నుండి తప్పించుకోలేకపోయారు. ఆయనను అజమాయిషీ చేయడమే కాకుండా, గద్దించడం, భయపెట్టడం పలువురి సమ క్షంలో లోకువచేసి మాట్లాడడం, దుర్భాషలాడడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆతడికి గురుదేవుల పట్ల ఉన్న ప్రేమ, భక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మార్వాడీ భక్తుడైన లక్ష్మీనారాయణ ఇవ్వాలనుకున్న పదివేల రూపాయలను గురు దేవులు నిరాకరించడంతో ఆతడిలో ఏవగింపు, అసంతృప్తి పెరిగిపోయాయి. ఇందువల్ల ఆయనను పలు రకాలుగా వేధించడంతోపాటు పలువురి సమక్షంలో ఎగతాళి చేయడం కూడా మొదలుపెట్టాడు. తమ ఆధ్యాత్మిక సాధనల సమ యంలో ఆతడు చేసిన సేవలను మనస్సులో ఉంచుకున్న గురుదేవులు హద్దు మీరిన హృదయ్ అవకతవక లన్నిటినీ మౌనంగా సహించారు. ఇలాంటి సందర్భంలోనే మాతృదేవి నాలుగవసారిగా దక్షిణేశ్వరం వచ్చారు. అప్పుడు హృదయ్ ప్రవర్తించిన తీరు గురించి మాతృదేవి ఇలా చెప్పారు:
“నేను నాలుగవసారి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు లక్ష్మితోపాటు మా అమ్మ ఇంకా పలువురు స్త్రీలు కూడా వచ్చారు. క్రితంసారి నేను వ్యాధిగ్రస్థురాలనయి నప్పుడు తారకేశ్వరంలో వెలసిన శివునికి నా శిరోజాలనూ, గోళ్లను సమర్పిస్తానని మ్రొక్కుకొన్నాను. అక్కడికి వెళ్లి నా మ్రొక్కు తీర్చుకొని, దారిలో కలకత్తాలో ఒక రాత్రి బసచేసి, మర్నాడు ఉదయం తిరిగి వచ్చాం. మమ్మల్ని చూడగానే హృదయ్ అసహ్యంతో, “మీరెందుకు ఇక్కడికి వచ్చారు? మీకు ఇక్కడ పనేమిటి?” అని అరుస్తూ హేళనగా మాట్లాడసాగాడు. మా అమ్మా, ఆతడూ ఒకే గ్రామానికి చెందినవారు. ఎలాంటి కారణమూ లేకుండా మా అమ్మను లోకువ చేసి మాట్లా డాడు. దాంతో ఎంతో బాధపడ్డ మా అమ్మ, “మనం తిరిగి వెళ్లిపోదాం. ఇక్కడ ఎవరివద్ద నా కుమార్తెను వదిలి వెళ్లను?” అంది ఆవేదనతో. గురుదేవుల సమక్షం లోనే ఇదంతా జరిగింది. హృదయ్‌కు భయపడ్డ ఆయన మమ్మల్ని ఉండమనో, వెళ్లిపోమనో ఒక్కమాట కూడా చెప్పలేదు. ఆయన మౌనాన్ని చూసి మేం మరో మార్గంలేక ఆ రోజే జయరాంబాటికి బయలుదేరాం. బయలుదేరడానికి ముందు నేను కాళీమాతతో, “అమ్మా! నేను ఇక్కడికి రావాలని నువ్వు ఎప్పుడు సంకల్పి స్తావో అప్పుడు వస్తాను” అంటూ మనసులో నిశ్చయించుకొని బయలు దేరాను.
గురుదేవులు ఎందుకిలా ప్రవర్తించారో అర్థంకాదు. శ్రీతపస్యానంద స్వామి ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు. హృదయ్ కోర్కెకు విరుద్ధంగా మాతృ దేవీ, ఇతరులూ అక్కడ ఉండడం జరిగితే వారందరితోనూ చీటికీమాటికీ దెబ్బ లాడుతూ, వారిని అతడు బాధిస్తాడు. ఇంతకంటే వారు తిరిగి వెళ్లిపోవడమే నయ మని ఆయన భావించివుండవచ్చు. పైగా భవిష్యత్తు ఎరిగిన గురుదేవులు, హృదయ్‌కు దక్షిణేశ్వరం నుండి ఉద్వాసన అనతికాలంలోనే రానున్నదని గ్రహించి, అలా ప్రవర్తించి ఉండవచ్చు.
మాతృదేవి తిరిగి వెళ్లిపోయిన కొద్ది రోజుల లోపునే, మథుర్బాబు కుమారు డైన త్రైలోక్యుని కుమార్తె (బాలిక)ను పూజించిన తప్పిదానికై హృదయ్‌కు దక్షి ణేశ్వరం నుండి ఉద్వాసన జరిగింది.*
మాతృదేవికి పిలుపు
ఆ తర్వాత హృదయ్ చేస్తూవున్న పనులన్నీ రామ్‌లాల్‌కు అప్పజెప్పారు. పదవి రాగానే ఆతడు కూడా విర్రవీగసాగాడు, “నేను కాళికాలయం పూజారి” అంటూ గర్వంతో గురుదేవులను అశ్రద్ధ చేయసాగాడు. ఆయనను చూసుకొంటూ నియమిత సమయాలలో ఆహారం పెట్టడానికి ఆతడు తటపటాయించాడు. గురుదేవులు అప్పుడప్పుడు పారవశ్య స్థితులలో మగ్నులవుతూ ఆహారాది విషయాలను విస్మరిస్తారు. ఆ సమ యాలలో ఆయనను శ్రద్ధగా కనిపెట్టి ఆహారం ఇవ్వాలి. రామ్‌లాల్ ఈ పని చేయ లేదు. అందువల్ల ఆయన కోసం కేటాయించిన ఆహారం, సరైన సమాయానికి అందించేవారు లేకపోవడంతో, ఆయన శుష్కించసాగారు.
అందువల్ల గ్రామానికి వెళ్లేవారితో మాతృదేవిని రమ్మని గురుదేవులు కబురు పంపించారు. కామార్పుకూర్కు చెందిన లక్ష్మణునితో, “నేను ఇక్కడ చాలా ఇబ్బందిపడుతున్నాను. పూజారిగా నియమితుడయ్యాక రామ్‌లాల్, ఇతర పూజారులతో కలిసిమెలసిపోయి నావైపు తిరిగికూడా చూడడం లేదు. కనుక దయచేసి నువ్వు సత్వరమే ఇక్కడకు రావడం మంచిది. మామూలు పల్లకీ లేదా కప్పువున్న పల్లకీ లేదా ఏ వాహనం దొరికినా వెంటనే బయలుదేరి రావలసింది! డబ్బు పదో, ఇరవయ్యో ఇంకా ఎక్కువయినా ఫరవాలేదు, నేను చూసుకొంటాను” అంటూ మాతృదేవికి కబురు పంపారు. బహుశా ఒక సంవత్సరం తర్వాత, అంటే 1882 ఫిబ్రవరిలో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చారు. ఆ తర్వాత గురుదేవులు జీవించిన కాలంలో 1884 వ సం ॥ రామ్‌లాల్ వివాహానికి ఒకసారి, తర్వాత 1885 లో మరొకసారి మాతృదేవి జయరాంబాటికి వెళ్లివచ్చారు.
1885 ప్రారంభంలో మాతృదేవి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు గురుదేవులకు చిన్న ప్రమాదం వాటిల్లింది. కుడిభుజం గూడు జారింది. మాతృదేవి వచ్చినప్పుడు గురుదేవులు, “అవును, నువ్వు ఏ రోజు బయలుదేరావు?” అని అడిగారు. “గురు వారం మధ్యాహ్నం” అని ఆమె బదులు చెప్పారు. వెంటనే గురుదేవులు “ఓహ్! అందుకే నాకు ఈ ప్రమాదం జరిగింది.* నువ్వు ఇప్పుడు వెళ్లిపోయి మళ్లీరా” అన్నారు. మాతృదేవి ఆ రోజే బయలుదేరాలనుకున్నారు. ఒక రోజు అక్కడుండి తర్వాత వెళ్లమని గురుదేవులు చెప్పినందువల్ల అలాగే చేశారు. తర్వాత ఒక మంచి రోజున తిరిగి వచ్చారు. ఆ తర్వాత గురుదేవులు జీవించినంత కాలమూ మాతృదేవి జయరాంబాటికి వెళ్లలేదు.
ప్రేమకున్న శక్తి
ఇలా ఒకసారి జయరాంబాటి నుండి దక్షిణేశ్వరానికి వెళ్లే దారిలో జరిగిన సంఘటన మాతృదేవి ప్రేమకున్న అపార శక్తిని సూచిస్తుంది. పొదుపుగా ఖర్చు పెట్టే స్వభావం కారణంగానో, డబ్బు కొరత కారణంగానో, మరే ఇతర కారణాల వల్లనో మాతృదేవి పలుసార్లు జయరాంబాటి, కామార్పుకూర్ల నుండి దక్షిణేశ్వరానికి కాలినడకనే వెళ్లాల్సి వచ్చింది. ఇలా నడచి వెళ్లేటప్పుడు ముందుగా ఆరాంబాగ్ను చేరుకోవాలి. తర్వాత ఎనిమిది, పది మైళ్ల విస్తీర్ణం గల తేలో భేలో పచ్చిక మైదానాన్ని దాటి తారకేశ్వరం చేరాలి. ఆ తర్వాత కైకలాల్ మైదానం దాటి వైద్యవాడి చేరుకుని, గంగానదిని దాటాలి. ఆ రెండు మైదానాలూ బందిపోటు దొంగలకు ఆలవాలం. ఉదయం, పగలు, మధ్యాహ్నం, సాయంత్రం అంటూ వేళాపాళా లేకుండా బాట సారులు వీరి చేతుల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రజలు నేటికీ చెప్పు కొంటారు. తేలో, భేలో అనే రెండు సమీప గ్రామాలకు సుమారు రెండు మైళ్ల దూరంలో ఆ ఆరు బయలు నడుమ తన కోరలను బయటికి చాచి ఒక భయం కరమైన కాళికాదేవి విగ్రహం వెలసివుండడం నేటికీ చూడవచ్చు. ఈ కాళికను తేలో, భేలో వాసులు, “బందిపోట్ల కాళి” అని పేర్కొంటారు. బందిపోట్లు ఈ కాళికను పూజించిన తర్వాతే దోపిడీలు హత్యలు ఇత్యాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వారి బారి నుండి తప్పించుకోవడానికి ఆ రెండు ప్రాంతాలలోను ప్రజలు గుంపులు గుంపులుగానే వెళతారు.
ఒకసారి లక్ష్మి, శివరాం మరికొందరితో మాతృదేవి కామార్పుకూర్ నుండి దక్షిణేశ్వరానికి బయలుదేరారు. అందరూ ఆరాంబాగ్ చేరుకున్నారు. ఇంకా రాత్రి కాలేదు. అంతలోపునే తేలో భేలో మైదానాన్ని దాటి వెళ్లిపోవచ్చునని వారు రాత్రికి అక్కడ బసచేయకుండా ముందుకు సాగారు. నడచి నడచి మాతృదేవి బాగా అలసిపోయారు. అయినా ఆగకుండా నడుస్తూనే ఉన్నారు. నాలుగు మైళ్లు నడి చిన తర్వాత, ఇక నడవలేక వెనుకబడిపోయారు. ఆమె వెంట వచ్చినవారు కాసేపు వేచివుండి మాతృదేవి తమను చేరుకోగానే త్వరగా నడవమని చెప్పి ముందుకు వెళ్లిపోయారు. ఆ మైదానం మధ్యకు చేరుకునేసరికి మాతృదేవి బాగా వెనుకబడిపోయారు. దాంతో వారందరూ మళ్లీ మాతృదేవికోసం వేచివుండి ఆమె వచ్చిన వెంటనే, “ఇంత నిదానంగా నడిస్తే చీకటిపడక ముందే ఈ మైదానాన్ని దాటలేం. అందరూ బందిపోట్ల వాతబడవలసిందే” అన్నారు. వారిలో అసందిగ్ధత, భయమూ కలగడానికి తాము కాణమయ్యామని గ్రహించిన మాతృదేవి వారితో తమకోసం వేచివుండవద్దని చెప్పి “మీరందరూ తిన్నగా తారకేశ్వరం వెళ్లి విశ్రాంతి తీసుకోండి. వీలయినంత త్వరలో నేను మిమ్మల్ని కలుసుకుంటాను” అని అన్నారు. సమయం గడచిపోతూవుండడంతో వారంతా మాతృదేవి సలహా మేరకు వేగంగా ముందు నడవసాగారు. కాసేపటికల్లా వారు మాతృదేవికి కనుమరుగైపోయారు.
మాతృదేవి వీలయినంత వేగంగా నడచినా కూడా, అలసట కారణంగా బాగా వెనుకబడిపోయారు. మైదానం మధ్యభాగం చేరుకున్న కాసేపట్లోనే చీకటి పడసాగింది. ఏం చేయాలో పాలుబోక మథనపడుతున్నప్పుడు నల్లటి ఆకృతిలో ఒక దృఢకాయుడు భుజంపై ఒక దుడ్డుకర్ర పెట్టుకుని వేగంగా తమవైపు రావడం చూశారు. ఆతనికి వెనుక కాస్త దూరంలో మరొక వ్యక్తి కూడా రావడం కంట బడింది. పరుగెత్తడమూ, అరవడమూ ఎందుకూ పనికిరావని గ్రహించిన మాతృ దేవి తటపటాయిస్తూ అక్కడే నిలబడిపోయారు.
కొంతసేపటికి ఆ వ్యక్తి మాతృదేవిని సమీపించి, “ఏయ్! ఎవరది? ఈ సమయంలో ఇక్కడ ఎందుకు నిలబడివున్నావు?” అంటూ గర్దించాడు. మాతృదేవి ఆతణ్ణి ఆశ్రయించి, ఆతణ్ణి తన తండ్రిగా భావించి, “నాన్నా! నాతోపాటు వచ్చిన వారంతా ముందుకు వెళ్లిపోయారు. నేను దారి కూడా తప్పిపోయానేమో అని పిస్తున్నది. నన్ను వారి దగ్గరికి చేరుస్తారు కదా! మీ అల్లుడు దక్షిణేశ్వరంలో రాణీ రాస్మణి ఆలయంలో ఉంటున్నారు. నేను ఆయన వద్దకే వెళుతున్నాను. నన్ను అక్కడికి తీసుకెళితే ఆయన ఎంతో సంతోషిస్తారు” అని అన్నారు. ఇలా మాట్లాడు తున్నప్పుడే వెనుక వస్తున్న వ్యక్తి కూడా అక్కడకు వచ్చాడు. ఆ వ్యక్తి మగవాడు కాదు, ఒక స్త్రీ. ఆ దృఢకాయుని భార్య అని మాతృదేవి గ్రహించారు. ఒక స్త్రీని చూడగానే మాతృదేవి మరింత ధైర్యం పుంజుకొని ఆమె చేతులు పట్టుకుని, “అమ్మా! నేను నీ కుమార్తె శారదను! నాతోపాటు వచ్చిన వారందరూ ముందుగా వెళ్లిపోవడంతో ప్రమాదంలో చిక్కుకొన్నాను. అదృష్టవశాత్తు నుమ్వా, నాన్నా కని పించారు. లేకపోతే ఏం చేసేదాన్నో నాకే తెలియదు” అని అన్నారు.
మాతృదేవి సరళత, నిస్సంకోచ వైఖరి, విశ్వాసం, తియ్యని మాటలు ఆ బందిపోటు దంపతులను అమితంగా ఆకట్టుకున్నాయి. కులం, జాతి వంటి సాంఘిక ప్రతిబంధకాలను మరచిపోయి, వారు మాతృదేవిని తమ సొంత కుమార్తెగా భావించి ఊరడించారు. మాతృదేవి అలసిపోయి ఉండడం గమనించి, తేలో భేలో గ్రామంలోని ఒక చిన్న దుకాణానికి తీసుకెళ్లి, రాత్రి అక్కడ బస చేయ డానికి తగిన ఏర్పాట్లు చేశారు. బందిపోటు భార్య తనవద్ద నున్న గుడ్డలను నేలపై పరచి పరుపులా తయారుచేసింది. ఆ బందిపోటు బొరుగులు కొనితెచ్చి తిన డానికి ఇచ్చాడు. ఇలా తల్లితండ్రులలా ప్రేమతో లాలించి, మాతృదేవిని నిద్రపుచ్చి, ఆ దంపతు లిద్దరూ కాపలాకాస్తూ కూర్చున్నారు.* తెల్లవారగానే వారు మాతృ దేవిని లేపి సూర్యోదయానికి ముందుగా తారకేశ్వరం చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న దుకాణంలో విశ్రమించమన్నారు. ఆ స్త్రీ తన భర్తతో, “నా కుమార్తె నిన్న రాత్రి ఏమీ తినలేదు. నువ్వు తారకేశ్వర స్వామిని దర్శించి, వచ్చేటప్పుడు చేపలు, కూరగాయలు తీసుకురా! ఈ రోజు ఆమెకు సుష్టుగా తినిపించాలి!” అని చెప్పింది.
ఆ బందిపోటు దొంగ వెళ్లిన కాసేపటికే, మాతృదేవితో వచ్చిన వారందరూ ఆమెను వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు. సురక్షితంగా మాతృదేవి చేరుకోవడం చూసి వారందరూ ఎంతో సంతోషించారు. అప్పుడు మాతృదేవి తనకు రాత్రి ఆశ్రయమిచ్చిన ఆ ‘తల్లితండ్రులను’ వారి కందరికీ పరిచయం చేస్తూ, “వీరు మాత్రం నాకు నిన్న రాత్రి ఆశ్రయం ఇవ్వకపోతే నా గతి ఏమయివుండేదో తెలియదు” అన్నారు. పూజ, వంట, భుజించడం అంతా పూర్తయ్యాక కాసేపు అందరూ విశ్రమించారు. తర్వాత అందరూ వైద్యవాటికి బయలుదేరారు. మాతృ దేవి ఆ దంపతులకు తమ కృతజ్ఞతలను చెప్పుకుంటూ సెలవు ఇప్పించమని అర్థించారు. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు: “ఒక్క రాత్రిలో మేం ఎంత ఆత్మీయులమైనామంటే వారి నుండి సెలవు తీసుకున్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు ధారకట్టాయి. అవకాశం చూసుకొని దక్షిణేశ్వరానికి తప్పకుండా రావలసిందిగా వారిని బ్రతిమిలాడాను. అందుకు సమ్మతించిన తర్వాతే, ఎంతో కష్టం మీద నేను బయలుదేరాను. వారు కూడా మాతోపాటు చాలాదూరం దాకా వచ్చారు. ఆ స్త్రీ దారిప్రక్కనున్న చేలలోని పచ్చి సెనగలను కోసి నా కొంకుకు ముడికట్టి ఏడుస్తూ నాతో, ‘శారదా! నా తల్లీ! రాత్రి బొరుగులు తినేటప్పుడు వీటిని కూడా తిను’ అని చెప్పింది. ఇచ్చిన మాటను ఆ దంపతులు నిలబెట్టుకున్నారు. నన్ను చూడడానికి పలుమార్లు తీపి పదార్థాలతో దక్షిణేశ్వరానికి వచ్చారు. అన్ని వివరాలు తెలుసు కొని గురుదేవులు కూడా వారు వచ్చినప్పుడు ఆప్యాయంగా వారిని ఆహ్వానించి, ఉపచర్యలు చేసి ఒక అల్లునిలా ప్రవర్తించారు. ప్రస్తుతం సామాన్యులూ, మంచి వారుగానూ ఉన్న నా బందిపోటు తండ్రి గతంలో ఎన్నో దోపిడీలు చేసివుంటాడని అనుకుంటాను.”
ప్రేమకు ఉన్న శక్తి అటువంటిది. ప్రేమలో ప్రతిష్ఠితమైన ఒక వ్యక్తి సమ క్షంలో వైరుధ్య భావాలు తొలగిపోతాయని యోగసూత్రం వచిస్తుంది.* ‘అలాగే ప్రేమ స్వరూపిణి అయిన మాతృదేవి సాన్నిధ్యంలో బందిపోట్లు తమ క్రూరత్వాన్ని కోల్పోయి సంస్కారవంతులయ్యారు.
ఈ సంఘటనను గురించి చెప్పడానికి మాతృదేవి తటపటాయించారు. అందుకు కారణం ఎంతో ఉన్నతమయినది. కాలాంతరంలో ఒకసారి ఎవరో ఈ సంఘటనను గూర్చి అడిగినప్పుడు మాతృదేవి ఇలా అన్నారు: “ఈ సంఘటనను పదేపదే అడిగి ఎంత గొప్పగా చేసేస్తున్నారో చూడు! దానిని గురించి నేను ఏమీ చెప్పదలచుకోలేదు. అప్పుడు నాతోపాటు లక్ష్మీ, శివరాం తదితరులు ఉన్నారు. ఈ సంఘటన గురించి చెబితే వారు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయిన విషయం కూడా చెప్పాల్సివస్తుంది. అప్పుడు వారి మనస్సు ఎంత ఆవేదన చెందు తుంది? ఎంతయినా వారు కూడా నా బిడ్డలే కదా! వారిని కించపరచడం న్యాయమా? అందువల్లనే ఈ సంఘటనను గురించి చెప్పడం లేదు. దీనిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు.” ఇతరుల మనస్సులను బాధపెట్టకూడదనే విషయంలో మాతృదేవి శ్రద్ధ తీసుకోవడం ఎంత ఆదర్శప్రాయమో కదా!
మాతృదేవి జీవితంలో ఈ పదమూడు సంవత్సరాలలో జరిగిన సంఘటన లను శక్తిమేరకు పొందుపరచాం. మళ్లీ వారి జీవితం గురించి ముచ్చటిద్దాం.