గురుదేవు లొసగిన
ఇది మాతృదేవి జీవితంలో ఒక నూతనాధ్యాయం. ఆమె అవతార కార్యంలో మొదటి సోపానమని కూడా చెప్పవచ్చు. ఇతరులకు సేవ చేయడమనే సేవాధర్మా నికి ఒక కొత్త రూపాన్ని ప్రసాదించి సేవనే సాధనగా లోకానికి అందించిన వ్యక్తి భగవాన్ శ్రీరామకృష్ణులు. కాలానుగుణ సాధన ఇతరులను ప్రేమించడం, సేవ చేయడం లాంటివి మని షిగా పుట్టిన ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈ సేవాధర్మాన్నే, ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుని కోసం చేసినప్పుడు అది ఒక ఆధ్యాత్మిక సాధనగా రూపు దిద్దుకొం టుంది. ఒక రోజు పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు, ప్రాణుల పట్ల దయ వహించా లని చెప్పవచ్చిన వారు, “దయ? – దయ చూపడానికి నువ్వెవరివి? నువ్వు ఒక క్షుద్రమైన పురుగువు. ప్రాణుల నందరినీ భగవంతునిగా భావించి సేవ చేయి” అన్నారు. అప్పుడు అక్కడున్న నరేంద్రుడు, “ఈ రోజు నేను ఒక కొత్త పాఠం నేర్చుకున్నాను. భగవంతుని కృప ఉంటే దీనిని ఒక రోజు లోకమంతా ఎరిగేటట్లు చేస్తాను” అన్నాడు. దీనినే ఆయన కర్మయోగం, అనుష్ఠాన వేదాంతం అంటూ పలు రీతులలో లోకానికి అందించాడు.
మాతృదేవి జీవితంలో సేవ – సాధనకు అత్యంత ప్రాధాన్యం వుంది. తొలి రోజుల్లో జయరాంబాటిలో దీని ఒక పరిమాణాన్ని చూశాం. సంసారాన్ని ఎలా ఆధ్యాత్మిక సాధనగా తీర్చిదిద్దాలనే విషయాన్ని అప్పుడు గురుదేవులు శారదకు నేర్పించారు. షోడశీ పూజానంతరం సేవ – సాధనను బోధించారు. పూజకు ఉపయోగించిన వస్త్రాలను ఏం చేయాలని ప్రశ్నించిన మాతృదేవితో, “మీ అమ్మకు ఇవ్వవచ్చు. కానీ ఆమెను సాక్షాత్తూ జగన్మాతగా భావించి మరీ ఇవ్వాలి” అనే గురుదేవుల ప్రత్యుత్తరంలో దాని బీజం గోచరిస్తుంది. ఈ సేవ – సాధనల ప్రపంచ పరిమాణాన్ని వివేకానంద స్వామి బోధించారు. మాతృదేవి జీవితంలో మనకు కనబడేది దాని సరళీకృత పరిమాణం. ఒక కుటంబ స్త్రీ సేవ – సాధనను ఎలా తన దైనందిన జీవితంలో అనుష్ఠించి భగవన్మార్గంలో వెళ్లాలో మాతృదేవి జీవించి చూపించారు.
“ఇతరుల కోసం చేసినప్పుడు మాత్రమే. నువ్వు చాలా చక్కగా పనిచేయ గలుగుతావు” అన్నారు స్వామి వివేకానంద. ఇతరుల కోసం శ్రమించేటప్పుడు లభించే ఆనందం, పూర్ణత్వం, ప్రశాంతత బహుశా మరిదేనివల్లా దొరకదు. దీనిని సరిగ్గా అవగతం చేసుకొని, అనుష్ఠించడానికి ఒక స్త్రీ జీవితంలో కలిగే సంద ర్భాలు కోకొల్లలు. తల్లితండ్రులకు, అత్తమామలకు, భర్తకు – ఇలా ఆమె జీవిత మంతా సేవామయమే. ఇది ఒక పుణ్యకార్యం. ఇతరుల ఆశీర్వచనాలను, శుభా శీస్సులను ప్రాప్తింపచేసే పుణ్య కైంకర్యమే సేవ. కానీ తల్లితండ్రులకు, భర్తకు చేసే సేవలను భగవంతునికి చేస్తున్నట్లుగా భావించి ఆచరించినప్పుడు అది ఆధ్యాత్మిక సాధనగా పరిణమిస్తుంది, జీవితమే ఒక సాధనగా రూపుదిద్దుకొంటుంది. దీనినే మాతృదేవి ఆచరించి చూపారు. ఆమె దక్షిణేశ్వరం రోజుల్లో ఇలాంటి సేవామయ మైన, భక్తిమయమైన జీవితాన్ని మనం చూస్తాం.
నహబత్తులో
మధ్యమధ్యలో జయరాంబాటికి వెళ్లి కొంతకాలం అక్కడ బసచేసింది పోగా దక్షిణేశ్వరంలో శారద సుమారు పదమూడేళ్లు నివసించింది. ఆమె నహ బత్తులో వసించింది. నహబత్తు అంటే వాద్యమండపం. ఆరోజుల్లో ధ్వని పరికరాలు లేనందున ఈ మంటపం మేడ మీద కూర్చొని ఆలయ వాద్య బృందాలు ఉదయ సాయంత్రాలు సంగీత వాద్యాలు వాయించేవారు. దక్షిణేశ్వర ఆలయానికి దక్షిణ, ఉత్తరాభిముఖంగా రెండు నహబత్తులున్నాయి. మాతృదేవి వసించింది ఉత్తరపు నహబత్తులో. చిత్రా లలో చూస్తే ఒక భవనం లాగా కనిపించే ఈ కట్టడం నిజానికి ఎంతో చిన్నది. షడ్భుజాకారంలో నిర్మితమైన ఈ భవనపు ఒక్కో భుజమూ సుమారు 3 అడుగులు వెడల్పు. గోడల మధ్య గరిష్ఠ దూరం సుమారు 8 అడుగులు. మొత్తం విస్తీర్ణం 50 చ.అ. కంటే తక్కువే. చుట్టూ సుమారు 4 అడుగుల వెడల్పైన వసారా గురు దేవుల గదికి ఉత్తరాభిముఖంగా పంచవటికి వెళ్లే దారిలో సుమారు 75 అడుగుల దూరంలో నెలకొని ఉంది ఈ నహబత్తు. ఈ గదికి ఒకే ఒక తలుపు. దక్షిణాభి ముఖంగా ఉండే ఈ తలుపును తెరిస్తే గురుదేవుల గది కనిపిస్తుంది. ఆయన గదికి ఉత్తరాభిముఖంగా ఉండే తలుపు తెరిస్తే అక్కడ జరిగేవన్నీ నహబత్తు నుండి చూడవచ్చు. నహబత్తుకు చుట్టూ ఉన్న వెలుపలి వసారాలో తూర్పున మేడ పైక వెళ్లడానికి మెట్లున్నాయి. ఈ మెట్ల క్రింది భాగమే మాతృదేవి వంట గది, మేడ పైన గురుదేవుల తల్లి వసిస్తున్నారు. దిగువన మాతృదేవి ఉంటున్నారు.
సీత చెరసాల
మాతృదేవి వసించే గదిలో వసతులు బాగా తక్కువ. ఆ గదిలో కాళ్లు బాగా చాచి పడుకోవడం కూడా కష్టమే. ఇది చాలదన్నట్లు, బియ్యం, పప్పుబస్తాలు, కూరగాయల మూటలు అన్నీ అక్కడే నిల్వచేసేవారు. ఇంకా గురుదేవుల కోసం ఆహారం ఉంచిన కడవలున్న ఉట్లు పై నుండి వేలాడుతూంటాయి. మాతృదేవి ఏకాంత జీవితంకోసం వసారా చుట్టూ మనిషి ఎత్తుకు తడికలు కట్టి ఉంచారు. ఇందువల్ల సూర్యరశ్మి లోపలికి రాదు. ఆ రోజులను గురించి మాతృదేవి ఇలా అనేవారు: “ఓహ్! నహబత్తులో ఉంటూ గురుదేవులకు సేవ చేసిన రోజులలో అక్కడ పడ్డ కష్టాలను మాటల్లో వర్ణించలేను. వంట, భోజనం, నిద్ర అంటూ నా ప్రపంచమంతా దాని లోపలనే! అనేక రోజులు ఏకాంతవాసమే. ఏదో కొన్ని రోజులు గోలాప్, గౌరీ అంటూ ఎవ రైనా వచ్చేవారు. గదిలోని వాకిలి తక్కువ ఎత్తులో ఉన్నందువల్ల, అది నా తలకు అప్పుడప్పుడూ తగిలేది. ఒక రోజు గట్టిగా తగిలి వ్రణమైపోయింది. కానీ రోజులు గడిచే కొద్దీ అలవాటయిపోయింది. తలుపుకు దగ్గరకు రాగానే నా తల దానంతట అదే వంగిపోయేది. కలకత్తా నుండి సంపన్నులయిన స్త్రీలు పలువురు నన్ను చూడడానికి వచ్చేవారు. భారీ శరీరాలు గలవారు ఆ గది లోపలికి రాలేరు. అందువల్ల తలుపు పట్టుకొని లోపలికి తొంగిచూచి, “ఆహా! మన మనిషి ఎంత చిన్న గదిలో ఉంటూవుంది! సీత చెరసాలవాసంలా ఉందిది!” అనేవారు. నిజమే. నహబత్తులో ఉంటూ అత్యంత శ్రమతో కూడిన పని ఏమిటో తెలుసా? స్నానం చేయడమూ, కాలకృత్యాలు తీర్చుకోవడమూ!*
‘అతి వేకువనే స్నానం చేసి గదిలోపలికి వెళ్లిపోయానంటే నేను బయటికి రావడమే అరుదు. ఆ రోజుల్లో నాకు చాలా పొడవైన జడ ఉండేది. మధ్యాహ్నం జనసంచారం లేని సమయంలో శిరోజాలను వాకిలి వద్ద కూర్చుని ఆరబెట్టు కునేదాన్ని.’
ఒక రోజు వేకువ కాకమునుపే చీకటిలో మాతృదేవి స్నానానికి గంగా నదికి వెళ్లినప్పుడు, మెట్ల మీద పడివున్న ఒక మొసలి మీద పాదం మోప బోయారు. కానీ అదృష్టవశాత్తూ, అడుగుల సవ్వడి విని మొసలి నీళ్లలోకి వెళ్లి పోయింది. ఆ తర్వాత లాంతరు పుచ్చుకొనే స్నానానికి వెళ్లాలని గురుదేవులు ఆమెకు చెప్పారు.
కాలాంతరంలో తన తమ్ముని కుమార్తెలతో మాతృదేవి దక్షిణేశ్వర జీవితం గురించి చెప్పినప్పుడు, “అలాంటి గదిలో మీరు ఒక్క రోజు కూడా ఉండలేరు” అన్నారు. వారందరూ కూడా, “అవును, నిజమే అత్తా! అన్ని విధాలా మీకు భిన్న మైనవారే” అన్నారు నవ్వుతూ.
మాతృదేవి జీవన విధానం
నహబత్తులో మాతృదేవి జీవితం ప్రతి రోజు ఉదయం మూడు గంటలకే ప్రారంభమయ్యేది. ఆమె జీవన విధానం గురించి యోగిన్ మా కాలాంతరంలో ఇలా చెప్పారు: ‘ఆ రోజుల్లో మాతృదేవి వెడల్పాటి ఎఱ్ఱంచు చీర ధరించేవారు. పాపిట మీద ఎఱ్ఱటి కుంకుమ అలదుకొనేవారు. ఆమె శిరోజాలు మోకాళ్లకు తాకేటంత పొడవుగా, అందంగా, దట్టంగా నల్లని నలుపురంగులో ఉండేవి. బంగారు అడ్డిగ, ముక్కర, దుద్దులు, బంగారు గాజుల లాంటి ఆభరణాలు ధరించి సీతలా నహబత్తులో వసించారు మాతృదేవి. అందరూ నిద్రిస్తూవున్న అతి వేకువ జాముననే లేచి. గంగానదిలో స్నానం చేసి, జన సంచారం ప్రారంభమవ డానికి మునుపే గదికి తిరిగి వచ్చేసేవారు. తర్వాత ధ్యానం చేయడానికి కూర్చునే వారు. ధ్యానం ముగిసిన తర్వాత పూజ, జపం మొదలుపెట్టేవారు. అన్నీ పూర్తి కావడానికి ఒకటిన్నర గంటలు పట్టేది. ఆ తర్వాత మెట్ల క్రింద వంట ప్రారం భించేవారు. వంట పూర్తిచేశాక అవకాశం దొరికితే గురుదేవులు స్నానం చేయ డానికి ముందుగా ఆయన శరీరానికి నూనె రాసేవారు. ఆయన స్నానానికి వెళ్లిన తర్వాత ఆయన కోసం తమలపాకుల చిలకలు సిద్ధం చేసేవారు. గురుదేవులు స్నానం చేసి రాగానే కూర్చోవడానికి ఆసనం పరిచేవారు. ఆయన ఉదయం పదిన్నర గంటల నుండి పదకొండు గంటల లోపుగా భోజనానికి కూర్చునేవారు. మాతృదేవి పళ్లెంలో ఆహారం తీసుకువచ్చి, గురుదేవులకు వడ్డించి, ప్రక్కనే కూర్చొని మాట్లాడుతూండేవారు. ఆయన హఠాత్తుగా ఉన్నత పారవశ్య స్థితిలోకి వెళ్లిపోకుండా జాగ్రత్త వహించేవారు. ఈ విషయంలో మాతృదేవికి ఎవరూ సాటి రారు. గురుదేవులు భోజనం చేసిన తర్వాత తాను కూడా ఆదరాబాదరాగా ఏదో కాస్త తిని, కాసిని నీళ్లు త్రాగేవారు. తర్వాత మళ్లీ తమలపాకు చిలుకలు తయారు చేసేవారు. అలాంటి సమయాల్లో మంద్ర స్వరంలో పాడేవారు. మాతృదేవి కంఠం పుష్పాలు రాలినట్లు మృదుమధురంగా ఉండేది. అయినా ఆమె పాడేటప్పుడు ఎవరూ వినకూడదనే విషయంలో చాలా జాగ్రత్తపడేవారు.
‘ఇంతలో ప్రక్కన నెలకొన్న కర్మాగారం నుండి మధ్యాహ్నం ఒక గంటకు వినవచ్చేది. ఆ తర్వాత భోజనానికి కూర్చునేవారు. భోజనం ముగిసేటప్పటికి ఒకటిన్నర అయ్యేది. తర్వాత కాసేపు విశ్రాంతి. మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు ఆరు బయట కూర్చొని శిరోజాలను ఆరబెట్టుకొనేవారు. తర్వాత సాయంకాలం పనులు ప్రారంభమయ్యేవి. మొదట్లో లాంతరులో వత్తిని సరిచేసి ఇంకేవైనా చిల్లర పనులు చేసేవారు. ఆ తర్వాత నహబత్తులో నిల్వవుంచిన నీళ్లతో ముఖం కడుగుకొని, బట్టలను కూడ తడిపి పెట్టేవారు. సంధ్యాసమయానికి దీపా లను వెలిగించి దేవుని పటాలకు ధూపం చూపించేవారు. తర్వాత ధ్యానానికి కూర్చునేవారు. తదనంతరం రాత్రికి వంట చేసేవారు. అందరూ భోజనం చేసిన తరువాత తాము తినేవారు. కొంతసేపు పడుకునేవారు.’ నహబత్తే మాతృదేవి లోకంగా ఉండడం యోగిన్ మా చెప్పిన మాటల నుండి మనం గ్రహించగలం. ఇతరు లెవ్వరూ ఆమెను చూచి ఎరుగరు. ‘భట్టాచార్య* భార్య ఇక్కడ వసిస్తున్నారని విన్నాం కానీ ఒక్క రోజు కూడా ఆమెను చూడలేదు’ అంటూ ఆలయ సిబ్బంది చెప్పేటంత గోప్యంగా ఎవరికంటా పడకుండా ఆమె జీవించారు.
మాతృదేవి సరళత, మరుగుపరచుకుని జీవించే సహజ గుణం గురుదేవు లకు ఎంతో నచ్చింది. ఈ విషయం ఆయన హృదయ్తో వ్యక్తం చేసిన విషయం గురించి మాతృదేవి ఇలా అన్నారు: “గురుదేవులు హృదయ్తో ‘హృదూ! ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు మొదట్లో నేను చాలా ఆందోళన చెందాను. గ్రామంలో పెరిగింది కదా! ఆమెకు పట్టణ అలవాట్లు ఏమీ తెలియవు కదా! ఆమె పల్లె టూరితనం కారణంగా ఎవరైనా ఆమెను హేళన చేస్తే మనకు ఆవేదనగా ఉండ వచ్చు ననుకున్నాను. కానీ ఉన్న చోటే తెలియకుండా ఆమె ఎలా ఒద్దికగా జీవి స్తూన్నదో చూడు! స్నానం చేయడానికో మరెందుకోసమో ఆమె బయటికి వెళ్లడం నేను కూడా చూడలేదు” అన్నారు. ఈ విషయం విన్నప్పుడు నేను కాస్త కలవర పడ్డాను. జగన్మాతను హృదయపూర్వకంగా, “అమ్మా! నేను సరళంగా, వినయంగా జీవించేటట్లు ఆశీర్వదించు” అని ప్రార్థించాను.
గురుదేవుల కలత, గమనిక
మాతృదేవి ఎదుర్కొంటున్న ఇబ్బందులు గురుదేవులకు తెలియకపోలేదు. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన పట్ల అమిత ఆదరాభిమానా లతో అవసరాలను తీరుస్తూ వచ్చిన మధుర్బాబు జీవించిలేడు. ఆతడు జీవించినప్పుడు మాతృదేవి వచ్చివుంటే అన్ని ఏర్పాట్లనూ ఎంతో శ్రద్ధాభక్తులతో చేసిపెట్టేవాడు. ప్రస్తుతం ఆలయ నిర్వహణ మథుర్నాథ్ కుమారుడైన త్రైలోక్యనాథ్ది. ఆతడు గురుదేవులను గురించి అంతగా శ్రద్ధ వహించలేదు. మొదట్లో మాతృదేవి గురు దేవుల సమక్షంలోకి కూడా మేలి ముసుగు లేకుండా వచ్చేవారు కారు. అంతటి లజ్జాస్వరూపిణి అయిన ఆమె మరుగుగానే జీవించడానికి నహబత్తు తప్ప, దేవా లయంలో వేరే స్థలం లేకపోయింది. ఇవన్నీ కలిసి, మాతృదేవి అనేక ఇబ్బందు లతో నహబత్తులోనే కాలం గడపాల్సి వచ్చింది.
చీకటిమయమైన ఆ చిన్న గదిలో రోజంతా గడిపితే ఆ మాతృదేవి ఆరోగ్యం దెబ్బతింటుందని గురుదేవులు ఎంతో కలత చెందారు. ఆయన భయపడినట్లే ఒకింత కాలం ఆమె ఆ గదిలో నివసించే లోపునే ఆమెకు వాతరోగం క్రమ్మింది. కాలాంతరంలో మాతృదేవి ఇలా అన్నారు: “గురుదేవుల గది సదా నామ సంకీర్తనం, దివ్యసంభాషణలు, పారవశ్య స్థితులతో ఆనందపూరితమై ఉండేది. ఎందరెందరో భక్తులు వచ్చేవారు. వారి గదిలోని ఉత్తరపు వైపు తలుపు తెరచి వుంటే ఆ గదిలో జరిగే సంకీర్తనాదులన్నీ కనబడేవి. అందుకు తగ్గట్లు తడికలలో ఒక చిన్న రంధ్రం ఉండేది. నిలబడే ఆ రంధ్రం గుండా గురుదేవుల పారవశ్య స్థితిలో నృత్యం చేయడాన్ని, పాడడాన్ని చూసి ఆనందించే దాన్ని, ఇలా ప్రతి రోజూ గంటల కొద్దీ నిలబడి ఉండడం వలన ఈ వాతరోగం క్రమ్మింది. ఇలా నేను గంటల కొద్దీ నిలబడడం గురుదేవులకు కూడా తెలుసు. ఇలా చాలాసేపు నిలబడి నా ఆరోగ్యం పాడు చేసుకోకూడదని, “అడవులలో విహరించే పక్షిని గూట్లో బంధించి ఉంచినట్లయితే, దానికి కూడా వాతరోగం క్రమ్ముకొంటుంది. అందువల్ల నువ్వు అప్పుడప్పుడూ బయటికి వెళ్లి కాసేపు నడవడం మంచిది” అని నాతో అన్నారు.”
మధ్యాహ్నం భోజనాలయ్యాక సామాన్యంగా అందరూ నిద్రపోయే సమ యంలో, గురుదేవులు పంచవటికి వెళ్లి చుట్టు పక్కల జనసంచార ముందా అని చూచేవారు. ఎవరూ లేని సమయం చూసి నహబత్తుకు వచ్చి నన్ను పిలిచి, “పంచవటి వైపు ఎవ్వరూ లేరు. ఇప్పుడు అటువైపుగా వెళ్లి కాసేపు నడచిరా” అనేవారు. నేను బయటికెళ్లే వరకు నన్ను చూస్తూ తమ గది బయట నిలబడే వారు. నేను నహబత్తు వెనుకవైపు దారిలో వెళ్లి, రామలాల్ ఇంటికి దగ్గరలో వున్న ప్రాంతంలో పరిచయమున్న కొందరి ఇళ్లకు వెళ్లేదాన్ని. వారితో కొంతసేపు మాట్లాడేదాన్ని. సాయంత్రం అందరూ పూజ కోసం ఆలయానికి వెళ్లిపోతారు. పంచవటివద్దో, ఇతర చోట్లలోనో ఎవరూ ఉండరు. సరిగ్గా ఆ సమయం చూసు కుని నేను నహబత్తుకు తిరిగి వెళ్లిపోయేదాన్ని.”
నహబత్తులో మాతృదేవితోపాటు గురుదేవుల అన్న కుమార్తెయైన లక్ష్మి కూడా ఉండేది. వీరిద్దరినీ గురుదేవులు “గూటి చిలకలు” అంటూ తమాషాగా చెప్పేవారు. కాళికాలయం నుండి ప్రసాదం వచ్చిన వెంటనే వారు రాంలాల్తో, “రాంలాల్! కొద్దిగా పండ్లు తీసుకెళ్లి ఆ గూటి చిలకలకు ఇచ్చిరా” అని పంపే వారు. అక్కడ ఉన్న భక్తులలో కొత్తగా ఉన్నవారు నిజంగా ఏవో చిలుకలను పెంచుతున్నారని అనుకొనేవారు.
మాతృదేవికి నూతన గృహం
కనీస వసతులకు కూడా నోచుకోని ఆ గదిలో మాతృదేవి ఎదుర్కొంటున్న అసౌకర్యాలను గమనించిన గురుదేవుల భక్తులలో కొందరు 1874 లో ఆలయా నికి సమీపంలోనే ఆమెకై ఒక చిన్న ఇల్లును కట్టాలని నిర్ణయించుకున్నారు. మధుర్ బాబు తర్వాత గురుదేవుల సరఫరా బాధ్యతలను శంభుమల్లిక్ అనే భక్తుడు వహిం చాడు. ఆయన, ఆయన భార్య మాతృదేవి పట్ల ఎంతో భక్తి భావంతో మెలిగే వారు. ఆతని భార్య ప్రతి మంగళవారమూ మాతృదేవి పాదాలకు పుష్పాలర్పించి అర్చించేది. శంభుమల్లిక్ రెండు వందల యాభై రూపాయలు వెచ్చించి ఆలయ సమీపంలో ఒక స్థలం కొన్నాడు. ఇల్లు కట్టే పని మొదలయింది. గురుదేవుల భక్తుడూ, భారతదేశంలో నేపాల్ ప్రభుత్వ ప్రతినిధీ అయిన కెప్టెన్ విశ్వనాథ్ నేపాల్ ప్రభుత్వ కలప గిడ్డంగిని కలకత్తాలో నిర్వహిస్తున్నాడు. ఇల్లు కట్టడానికి కావలసిన కలప ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చాడు. అందుకోసం మూడు పెద్ద సాల్ చెట్ల దుంగలను, గంగానది ఆవలి తీరంలో బేలూరులోని తమ కలప గిడ్డంగి నుండి పంపించాడు. కానీ ఆ రోజు గంగానదిలో వరద ఉద్ధృతి కారణంగా ఆ దుంగలలో ఒకటి కొట్టుకుపోయింది. ఇందుకు మాతృదేవి దురదృష్టమే కారణమని ఆమెను దుయ్యబట్టాడు హృదయ్. జరిగిన విషయం తెలిసి కెప్ట్టెను మళ్లీ మరొక దుంగను పంపించాడు. ఇంటి నిర్మాణం పూర్తయి పోయింది.
[ ఆ కొత్త ఇంట్లో మాతృదేవి సుమారు ఒక సంవత్సరం నివసించారు. అక్కడ ఉంటున్నప్పుడు, ఆమెతో పాటు ఉండడానికీ, ఇంటి పనులకై ఓ పని మని షిని నియమించారు. ఆ ఇంట్లో మాతృదేవి గురుదేవుల కోసం ఆహారం తయారు చేసి, ఆలయానికి తీసుకెళ్లి వడ్డించేవారు. గురుదేవులు ప్రతి రోజూ ఒక్కసారైనా ఆ ఇంటికి వచ్చి, కాసేపు గడిపి, మాతృదేవితో ముచ్చటించి సాయంత్రానికి ఆల యానికి తిరిగి వెళ్లేవారు. ఒకసారి ఆయన ఆ ఇంట్లోనే, రాత్రి గడపాల్సి వచ్చింది. ఆ రోజు సాయంత్రం ఆయన వచ్చీరాగానే వర్షం ప్రారంభమైంది. అందువల్ల ఆయన కాళికాలయానికి తిరిగి వెళ్లలేకపోయారు. ఆ రాత్రి తమకు భోజనం వడ్డిస్తూవున్న మాతృదేవితో గురుదేవులు సరదాగా, “కాళికాలయం పూజారులు రాత్రిపూట తమ ఇళ్లకు వెళ్లిపోతారు కదా! అదేలా నేను కూడా ఈ రాత్రి ఇక్కడే ఉండిపోయాను” అన్నారు. ]
కాశీ అమ్మాయి
మాతృదేవి ఆ ఇంట వసిస్తున్నప్పుడు గురుదేవులు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆయనకు నడవడం కూడా కష్టమైపోయింది. ఏం చేయాలో పాలుపోక మాతృదేవి నిర్ఘాంతపోయారు. సాధ్య పడినప్పుడంతా వెళ్లి గురుదేవులకు కావలసిన సపర్యలన్నీ చేసిపెట్టారు. కానీ ఎంత చేసినా ప్రక్కనే ఉండి చూసుకొన్నట్లు కాదు కదా! సరిగ్గా మాతృదేవి ఇలా ఏమీ తోచని స్థితిలో ఉన్నప్పుడు ఒకామె వచ్చింది. కాశీ నుండి వస్తున్నట్లుగా పరిచయం చేసుకొంది. ఆమె గురుదేవులకు కావలసిన పరిచర్య లను మనఃస్ఫూర్తిగా చేసింది. ఆమె ఒక రోజు మాతృదేవితో, “ఆయన ఇలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీరు ఇక్కడ ఉండడం తగదు” అంటూ మాతృ దేవిని మళ్లీ నహబత్తులో నివసించేట్లు చేసింది ఆ స్త్రీ.
అంతవరకూ మాతృదేవి గురుదేవుల సమక్షంలో కూడా మేలిముసుగుతోనే ఉండేవారు. ఒక రోజు రాత్రి కాశీ నుండి వచ్చిన ఆ స్త్రీ మాతృదేవిని గురుదేవుల సమక్షానికి తీసుకువెళ్లి మేలి ముసుగు తొలగించింది. గురుదేవులు అప్పుడు పారవశ్య స్థితిలో ఉన్నారు. పారమార్థిక విషయాలను గురించి ఎడతెరపి లేకుండా మాట్లాడుతున్నారు. సమయం గడచిపోతున్నదనే ఎరుక కూడా వారికి లేదు. చివరకు ఆయన పారవశ్యం ఉపశమించేసరికి వేకువజాము అయింది. అప్పుడే మాట్లాడడం విరమించారు. మంత్రముగ్ధులయిన వారందరూ కూడా అప్పుడే సెలవు పుచ్చుకొన్నారు. ఆ స్త్రీ ఎవరు? ఎలా వచ్చింది? ఎవరికీ తెలియరాలేదు. దీని కోసమే వచ్చినట్లుగా వుంది ఆమె రాక! గురుదేవులకు సపర్యలు చేసింది, ఆయన వ్యాధి నయం కాగానే వెళ్లిపోయింది. ఆ తర్వాత మాతృదేవి ఎంత ప్రయ త్నించినా ఆమెను గురించి ఎలాంటి వివరాలు తెలియరాలేదు.
గురుదేవుల సపర్యల కోసం నహబత్తుకు వచ్చిన మాతృదేవి మళ్లీ ఆ కొత్త ఇంటికి వెళ్లలేదు. అందుకు కారణమేమిటో కూడా తెలియదు.
వంట అనే సాధన
దక్షిణేశ్వరంలో మాతృదేవికి ముఖ్యమయిన పని వంట చేయడం. గురు దేవుల ఉదరం సున్నితమైనది. కొన్ని నిర్దిష్టమైన పద్ధతులలో వండిన ఆహారాన్నే ఆయన జీర్ణం చేసుకోగలిగేవారు. వంట పద్ధతిలో ఏ కొద్ది మార్పు వచ్చినా పొట్ట భరించలేదు. అందువల్ల ఆయన ఆహారం బహు జాగ్రత్తగా తయారు చేయవలసి వుండేది. ఇలా ఆయన శరీరా రోగ్యానికి అవరోధం కలగని రీతిలో నేర్పుగా వండేవారు మాతృదేవి.
తొలి రోజులలో గురుదేవులకు, ఆయన తల్లికి సరిపడేటంత ఆహారం మాత్రమే తయారు చేసేవారు మాతృదేవి. పవిత్ర గంగాతీరంలో వసించాలనే నిర్ణయంతో దక్షిణేశ్వరం వచ్చి, నహబత్తులో మేడ మీద నివసించారు చంద్రమణీ దేవి. క్రింద నహబత్తులో అన్ని పనులలో మునిగివున్నా మాతృదేవి మేడ మీద కూడా దృష్టి ఉంచేవారు. “శారదా” అంటూ చంద్రమణి పిలిచే లోపల అన్ని మెట్లనూ ఎక్కి పరుగెత్తుకుంటూ అత్తగారి ముందు నిలబడేవారు. ఇలా మాతృదేవి ఇంత వేగంగా పరుగెత్తుకుంటూ వెళ్లడం చూసి యోగిన్ మా, “ఇలా కన్ను మిన్ను తెలియకుండా పరుగుతీస్తే, వాకిలికి కొట్టుకొని కిందపడి, మెట్లమీద నుంచి దొర్లవలసి వస్తుంది” అంటూ ఆమెను అడ్డుకునేవారు. కానీ మాతృదేవి ఎంత మాత్రం వెనకాడక, “నేను పడిపోయినా ఫరవాలేదు. ఆమె నా కన్నా పెద్ద వారు. నా తల్లితో సమానురాలు, వృద్ధురాలు. పిలిచిన వెంటనే నేను వెళ్లకపోతే ఆమెకు ఏదైనా అసౌకర్యం కలగవచ్చు. అందుకోసమే ఇంత వేగంగా పరుగెత్తు తున్నాను” అనేవారు.
రోజులు గడిచేకొద్దీ గురుదేవుల భక్తుల సంఖ్య పెరగసాగింది. మాతృదేవికి వంటపని కూడా ఎక్కువయింది. పలువురు భక్తులు అప్పుడప్పుడు గురుదేవులతో పాటు ఉండిపోవడం పరిపాటి అయిపోయింది. వారికందరికీ మాతృదేవి వంట చేయాలి. ఆ రోజులలో తాము ఎదుర్కొన్న అగచాట్ల గురించి మాతృదేవి ఇలా అన్నారు: “గురుదేవులకు ఆహారం నేనే వండేదాన్ని. ఆయన జీర్ణశక్తి బాగా మంద గించింది. కాళికాలయ ప్రసాదాన్ని కూడా స్వీకరించలేకపోయేవారు. గురుదేవుల భక్తులకు కూడా నేనే వండేదాన్ని. లాటు గురుదేవులతోపాటు ఉండేవాడు. రామచంద్ర దత్తా ఇంట్లో పనిచేస్తున్న ఆతడు ఉండలేకుండా గురుదేవుల వద్దకు వచ్చేశాడు. ‘లాటు మంచి అబ్బాయి. చపాతీలకు పిండి సిద్ధం చేయడంలో నీకు సాయపడతాడు’ అంటూ గురుదేవులు ఆతణ్ణి నా వద్దకు పంపారు. రాత్రింబవళ్లు వంట పని ఉంటూనే ఉండేది. రామచంద్ర దత్తా గురుదేవులను చూడడానికి వచ్చేవాడు. బండి నుండి దిగుతున్నప్పుడే, ‘ఈ రోజు నాకు చపాతీ, పప్పు కావాలి’ అని బిగ్గరగా చెబుతూ గురుదేవుల గదిలోకి వెళ్లేవాడు ఆ మాటలు నా చెవిలో పడిన వెంటనే నేను పని మొదలు పెట్టేదాన్ని. రోజుకు రెండు మూడు సేర్ల పిండి కలిపి చపాతీలు చేయాల్సి వచ్చేది.’
‘రాఖాల్ గురుదేవులతో ఉంటున్నప్పుడు ఆతడి కోసం అప్పుడప్పుడు కిచ్చిడీ తయారు చేసేదాన్ని, ఒక రోజు నరేన్ కోసం వండమని గురుదేవులన్నారు. నేను చపాతీలతోపాటు పెసరపప్పు కూర చేశాను. చపాతీలు తిన్న తర్వాత గురుదేవులు ఆతడితో, “ఆహారం ఎలా ఉంది?’ అని అడిగారు. అందుకు నవ్వుకుంటూ అతడు, ‘పథ్యాహారం లాగా చాలా బాగుంది’ అన్నాడు. వెంటనే గురుదేవులు నన్ను పిలిచి, ‘నువ్వేమి వండావు? చపాతీలతో పాటు చిక్కగా పప్పుకూర తయారుచేసి ఉండాల్సింది’ అని అన్నారు. ఆ తర్వాత గురుదేవులు చెప్పినట్లే నేను వండసాగాను. నరేంద్రుడు కూడా వాటిని బాగా ఇష్టపడి తినేవాడు. సురేంద్రనాథ మిత్రా భక్తుల ఆహారం కోసం నెలకు పది రూపాయలు ఇచ్చేవాడు. పెద్దగోపా లుడే వంటసామగ్రి కొని తెచ్చేవాడు.
“రెండు మూడు సేర్ల పిండితో చపాతీలు చేయడంతో పాటు మాతృదేవి కట్టే తమలపాకు చిలకలకు లెక్క లేదు. గురుదేవులకు మీగడపాలంటే ఇష్టం కాబట్టి, చాలాసేపు జాగ్రత్తగా పాలు కాస్తూ ఉండేవారు’ అంటూ యోగీన్ మా ఆ రోజులను గురించి చెప్పేవారు.
ఆహారం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి ఇతర అవసరాలు కూడా గ్రహించి వాటినన్నిటిని చేసిపెట్టేవారు మాతృదేవి. శారదాప్రసన్న తల్లి తండ్రులకు తెలియకుండా గురుదేవుల వద్దకు రావలసి ఉంది. ఒకసారి గురుదేవులు ఆతణ్ణి మాతృదేవి వద్దకు తీసుకెళ్లి, బండి బాడుగ ఒక అణా ఇవ్వమన్నారు. అప్పట నుండి మాతృదేవి శారదాప్రసన్న వచ్చిందే తడవుగా ఒక అణా నహబత్తు ద్వారం వద్ద ఉంచేసే వారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆతను తీసుకెళ్లేవాడు. ఇలా అందరి అవసరాలూ తల్లిలాగా గమనించి చేసిపెట్టేవారు.
మాతృదేవి ఈ పనులన్నిటిలోనూ ప్రేమ మాత్రమే నెలకొనింది. ఒక రోజు ఆమె తమలపాకు చిలకలు తయారు చేస్తున్నారు. కొన్నిటిలో ఏలక్కాయల లాంటి సుగంధ ద్రవ్యాలను వేసీ, కొన్నిటిలో వేయకుండా కట్టారు. అది గమనిస్తూన్న యోగీన్ మా, “అమ్మా! ఇదేమిటి! ఇలా రెండు రకాలుగా ఎందుకు కడు తున్నారు?” అని అడిగింది. అందుకు మాతృదేవి మందహాసంతో, “యోగిన్, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసినవి భక్తుల కోసం. నా ప్రేమతోనూ, ఆప్యాయతతోనూ వారిని నా వారిగా చేసుకోవాలి కదా! మరొకటి గురుదేవులకు. ఆయన ఇప్పటికే నా వారు గదా!” అన్నారు.
మాతృదేవి జయరాంబాటికి వెళ్లిపోతే గురుదేవులకు ఆహారం విషయంలో చాలా ఇబ్బంది కలిగేది. కొన్ని సమయాల్లో మాతృదేవి వద్దకు మనిషిని పంపించి ఆమెను దక్షిణేశ్వరానికి రప్పించుకొనేవారు.
బహిష్టు రోజుల్లో మాతృదేవి వంట చేయరు. అందువల్ల గురుదేవులు కాళికాలయ ప్రసాదాన్ని తీసుకోవాల్సి వచ్చేది. వెంటనే అజీర్ణంతో బాధపడేవారు కూడా. ఒకసారి ఇలా చాలా ఇబ్బంది పడినప్పుడు మాతృదేవి వద్దకు వెళ్లి వంట చేయమని చెప్పారు. అందుకు మాతృదేవి వెనుకాడుతూ, “ఈ రోజుల్లో స్త్రీలు వంట చేయరాదు” అని అన్నారు. వెంటనే గురుదేవులు, “ఎవరు అలా అన్నారు? నువ్వు నా కోసం వంట చేయి. అందువల్ల నీకు ఎలాంటి పాపమూ అంటుకోదు. అవును – నువ్వు బహిష్టు, అశుద్ధం అంటున్నావు కదా! శరీరంలో ఏ భాగం బహిష్టుగా ఉందో చెప్పగలవా? – చర్మమా, మాంసమా, ఎముకలా, లేక మజ్జా? ఇందులో ఏది అశుద్ధమయింది? ఇదిగో చూడు! శుద్ధం, అశుద్ధం ఇవన్నీ మన స్సుకు సంబంధించినవి, బయట ఏదీ లేదు” అన్నారు. ఆచార అనుష్ఠానాలలో ఊరిపోయిన ఒక పల్లెటూరి స్త్రీగా ఉన్నా గురుదేవులు చెప్పింది యథాతథంగా స్వీకరించారు మాతృదేవి. ఆ తర్వాత ఆమే నిత్యం వండడం మొదలుపెట్టారు.
బద్ధకం కూడదు
ఎవరైనా బద్ధకస్థులుగా ఉండడాన్ని గురుదేవులు సుతరామూ ఇష్టపడరు. ఈ విషయంగా మాతృదేవి కాలాంతరంలో ఒక శిష్యురా లితో ఇలా అన్నారు: “గురుదేవులు నాతో, ‘ఎల్లప్పుడూ చురుగ్గా ఉండాలి. ఏ పనీ చేయకుండా ఎప్పుడూ ఉండకూడదు. బద్ధకం చోటు చేసుకుంటే పనికిమాలిన ఆలోచనలు మాత్రమే మనస్సులో తలెత్తుతాయి’ అంటూ అప్పుడప్పుడూ చెప్పేవారు.
‘ఒక రోజు కొద్దిగా జనపనారను తీసుకువచ్చి నాకిస్తూ దానితో ఒక ఉట్టిని కట్టమన్నారు. శిష్యులకు ఇవ్వడానికి తమ గదిలో తీపి పదార్థాలను ఒక కుండలో ఉంచి దానిని వేలాడదీయడానికి ఆ ఉట్టి అవసరం అన్నారు. గురుదేవులు చెప్పినట్లే నేను ఉట్టి తయారు చేశాను. మిగిలిన జనపనారతో ఒక దిండు తయారు చేసుకున్నాను. అప్పట్లో నేను గోనెపట్టాను నేలమీద పరచి, దానిమీద ఒక ముతక చాపను పరచి పడుకునేదాన్ని. ఈ దిండునే తల క్రింద పెట్టుకునే దాన్ని. ఇప్పుడు కదా పరుపులు చూస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ పరుపుల మీద లాగానే ఆ రోజుల్లో బాగా నిద్రపోయాను. నాకు ఎలాంటి తేడా కనబడలేదు.”
ఇలాంటి సమతా స్థితి అందుకున్న వారిగా కనిపించారు మాతృదేవి. ఎలాంటి అసౌకర్యాలలోనూ వారి సమతా స్థితికి భంగం వాటిల్లలేదు. ఇలాంటి సమతా స్థితి మాతృదేవికి సేవ – సాధనల పర్యవసానంగానే కలిగిందని చెప్పనవ సరం లేదు.
ఉత్కృష్ట భక్తికి ఒక ఉదాహరణ
మాతృదేవి దక్షిణేశ్వరం రోజులను గురించి ప్రస్తావిస్తూ ఒక అద్భుత విషయాన్ని చెప్పేవారు శ్రీ తపస్యానంద స్వామి: ‘ప్రస్తుతం మన మందరం మాతృదేవిని ఒక అవతారమూర్తిగా భక్తి నేత్రాలతో చూస్తున్నాం. అందువల్ల వారి దక్షిణేశ్వరం రోజుల నాటి శ్రమ నిజమైన పరిమాణాన్ని మనం తెలుసుకోలేక పోతున్నాం. ఇన్ని శ్రమల నెదుర్కొని జీవితం గడిపి గురుదేవులకు సేవ చేయడం మూలంగా ఉత్కృష్టమైన భక్తికి ఒక ఉన్నత ఆదర్శంగా విరాజిల్లారు మాతృదేవి. గురుదేవుల ఇతర భక్తులెవ్వరూ ఇలాంటి శ్రమలను, అసౌకర్యాలను ఎదుర్కో వలసి రాలేదు. గురుదేవుల చివరి రోజులలో రాత్రింబవళ్లు వారితో పాటే ఉంటూ ఎనలేని సేవలు చేసిన శ్రీరామకృష్ణానంద స్వామి లాంటి ఒకరిద్దరిని కొంత మేరకు చెప్పుకోవచ్చు. మాతృదేవి ఈ సేవాభక్తి సాధనగా పరిణమించింది. తాను పడుతున్న ఇబ్బందులన్నీ తాను ఆకర్షిస్తున్నవారి ఆనందం కోసమే శ్రేయస్సు కోసమే అని గ్రహించే ఆ భక్తుని హృదయం ఆనందసాగరంలో ఓలలాడుతుంది.’ మాతృదేవి కాలాంతరంలో ఇలా అన్నారు: ‘ఆ రోజుల్లో ఎలాంటి బాధా నాకు బాధలా కనిపించలేదు. గురుదేవుల సేవ కోసం అనేటప్పటికి ఎలాంటి అసౌ కర్యమూ నా దరిదాపులను కూడా రాలేదు. ఇన్ని శ్రమల మధ్య నా జీవితం ఆనందంగానూ, ప్రశాంతంగానూ గడిచింది… ఆహా! ఎలాంటి ఆనందమది! ఆ రోజుల్లో దక్షిణేశ్వరం ఒక ఆనంద నిలయంగా అలరారింది.’
భక్తులు రావడం, ఆడడం, పాడడం, పారవశ్య స్థితులలో గురుదేవుల గది ఆనంద నిలయంగా ఉండేది. కానీ ఆయననే భర్తగాను, గురువుగాను, దైవంగాను స్వీకరించిన మాతృదేవి దాన్లో పాలుపంచుకోలేకపోయారు. ‘నేను మాత్రం భక్తు లలో ఒకరిగా ఉండివుంటే సదా ఆయన దగ్గరే ఉండేదాన్ని. వారి అమృత వాక్కులను వినగలిగి ఉండేదాన్ని’ అంటూ తపించిపోయేవారు. కానీ గడ్డిపోచ కన్నా వినమ్రత, భూమికన్నా సహనం సంతరించుకున్న మహోన్నత భక్తురాలయిన మాతృదేవి తమ తపనను బయటికి చూపకుండా, తమకంటూ ఎలాంటి ప్రత్యేక హక్కులనూ ఆశించలేదు. గురుదేవులకు చిన్నచిన్న సేవలను అప్పుడప్పుడూ వెళ్లి అందించడంతోనే ఆమె తృప్తి పడ్డారు. అలాంటి సందర్భాలు దొరకనప్పుడు వాటిని ప్రశాంతంగా సహించారు. ఒకరోజు ఒక స్త్రీ మాతృదేవితో, ‘మీరెందుకు అప్పుడప్పుడు గురుదేవుల వద్దకు వెళ్లాలి?’ అని అడిగింది. ఈ ప్రశ్నకు మాతృ దేవి కోపగించుకోలేదు. బదులుగా, ‘ఈమె గురుదేవులకు సేవ చేయాలను కొంటున్నదేమో!’ అని అనుకుంది ఆమె మనస్సు. అందువల్ల తాను అక్కడ చేస్తూ ఉన్న పనులను ఆ స్త్రీకి అప్పజెప్పేశారు.
భోజనం తీసుకుని వెళ్లే సమయాల్లో మాత్రమే ఇప్పుడు మాతృదేవికి గురు దేవుల సాన్నిధ్య భాగ్యం లభించేది. ఒకసారి గోలాప్ మా తన అమాయకత్వంతో ఈ సందర్భాన్ని కూడా మాతృదేవి కోల్పోయేలా చేసింది. గురుదేవులు తనను ఆహారం వడ్డించమని చెప్పడాన్ని గొప్పగా చేసుకుని, తాను వడ్డిస్తే ఆయన చాలా ఆనందించినట్లుగా చెప్పుకొంది. ఆ తర్వాత ఆమే ప్రతిరోజూ నహబత్తు నుండి గురుదేవులకు భోజనం తీసుకెళ్లసాగింది. మాతృదేవికి దక్కిన ఆ ఒక్కగానొక్క సందర్భం కూడా చేజారిపోయింది. రాత్రి సమయాలో గురుదేవులు ఆలయానికి ఉత్తరాన ఉన్న సరుగుడు తోపుకు నిత్యకృత్యాలను తీర్చుకోవడానికి వెళ్లేటప్పుడూ, తిరిగి వచ్చేటప్పుడూ నహబత్తును దాటి వెళ్లేటప్పుడూ చూసుకునేవారు. గురుదేవు లను చూడలేకపోవడంతో ఎంతో దుఃఖపడినా ఈ విషయంగా ఎవరికీ ఏదీ చెప్ప కుండా తమలోనే అన్నిటినీ ఓర్పుతో సహించారు. ‘భగవంతుడు అందరికీ చెందినవాడు’ అని గురుదేవులు నేర్పించారు కదా, అలాగే గురుదేవులు కూడా అందరికీ చెందినవారని సర్దిచెప్పుకొన్నారు.
కాలాంతరంలో ఈ రోజులను గురించి మాతృదేవి ఇలా అన్నారు: ‘కొన్ని సమయాల్లో వారిని ఒక్కసారి కూడా చూడకుండా, రెండు నెలలు గడచిపోయేవి. అప్పుడు నా మనస్సుకు నేను, ‘మనసా! వారిని నిత్యమూ దర్శించుకోవడానికి నువ్వు ఎంత పుణ్యం సంపాదించావు?’ అంటూ నచ్చజెప్పుకొనేదాన్ని.’ కానీ మాతృదేవి ఆలోచనలు మాత్రం సదా ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి రాసాగాయి. సమయం దొరికినప్పుడల్లా తడికెల సందు నుంచి గురుదేవుల గదిలో జరిగే వాటిని చూస్తూ ఉండేవారు. ‘పక్షులు ఎగిరేటప్పుడూ, ఆకులు రెపరెపలాడి నప్పుడూ నువ్వు వస్తున్నట్లు ఆమె భావిస్తుంది. చెమ్మగిల్లిన కళ్లతో నీ కోసం ఎదురు చూస్తూవుంటుంది’ – కృష్ణుని కోసం విరహంతో రాధ మనఃస్థితిని ఇక్కడ మనం మాతృదేవిలో చూస్తాం!
మాతృదేవి తపన గురుదేవులకు తెలియకపోలేదు. అందువల్ల తమ గదిలో జరిగేవాటినన్నిటినీ మాతృదేవి చూడాలని తమ గది ఉత్తర ద్వారాన్ని ఎప్పుడూ తెరిచే ఉంచేవారట! తడికె రంధ్రం రోజు రోజుకూ పెద్దదవడం చూచిన గురు దేవులు ఒక రోజు తమాషాగా రాంలాల్తో, ‘ఓ రాంలాల్! తడికెలోని రంధ్రం పెద్దదవుతూ వస్తోంది. ఒక రోజు మీ పిన్ని ముసుగువ్రతం గాలిలో ఎగిరి పోతుంది చూడు!’ అన్నారు. అందుకు రాంలాల్, “బాబాయ్! అందుకు కారణం మీరే! నేను ఉత్తరపు వాకిలి మూసినా కూడా మీరే పదే పదే తెరచి ఉంచు తున్నారు’ అన్నాడు.
యోగిని శారద
ఎనలేని భక్తి, సేవ, పవిత్రత – వీటి పర్యవసానంగా మాతృదేవిలో ఈ రోజుల్లో ఉన్నతమైన యోగసిద్ధులూ, సర్వత్రా భగవంతుని ఉనికిని అనుభూతం చేసుకొనే సామర్థ్యం బహిర్గతమయింది. తమ అనుభ వాన్ని కాలాంతరంలో మాతృదేవి, నివేదితకు వ్రాసిన లేఖలో అద్భుతంగా తెలిపారు: ఈ జగత్తుకు ప్రాణనాడి అయిన భగవంతుడు తన మహిమను తానే గానం చేశాడు. ఆద్యంతరహితమయిన, సాటిలేని ఆ సంగీతాన్నే అనిత్యమైన ఈ జగత్తులోని ప్రతి వస్తువులోనూ నువ్వు వింటున్నావు. చెట్టు చేమలూ, కొండలూ పర్వతాలూ, పక్షులూ ఆయన కీర్తిని గానం చేస్తున్నాయి. దక్షి ణేశ్వరంలో దట్టంగా పెరిగి వ్యాపించి మఱ్ఱిచెట్టు ఉంది కదా, అది కాళికాదేవి సామ్రాజ్యాన్ని గానం చేస్తూ ఉంది. దానిని వినగలిగిన చెవులు గల వ్యక్తి పుణ్య పురుషుడు.’
మరొకసారి ఒక భక్తురాలితో ఇలా అన్నారు: “వెన్నెల రాత్రులలో నేను నహబత్తులోని మెట్ల మీద కూర్చొని ధ్యానం చేసేదాన్ని. సర్వత్రా పరమ ప్రశాం తత! గంగానదిలో చేపలు పట్టే జాలరుల పాటలు మాత్రం అప్పుడప్పుడు ఆ ప్రశాంతతను భగ్నం చేసేవి. కొన్ని సమయాల్లో ఎవరో పిల్లనగ్రోవి ఊదేవారు. పిల్లనగ్రోవి నుండి వినవచ్చే మధుర నాదం నన్ను ఆకట్టుకొనేది. ఏమిటో ఆ నాదం భగవంతుని నుండే వస్తున్నట్లు అనిపించేది. ఆ భగవంతుని చూడాలని నా మనస్సు పరితపించేది. అట్లే నేను సమాధిమగ్నురాలనయ్యేదానను.”
ఇలా బహుముఖ పరిమాణాలను ప్రశాంతంగా, గాఢంగా ప్రదర్శిస్తూనే సాగింది మాతృదేవి జీవితం. ఆమె జీవితంలోని ఒక ముఖ్య ఘట్టమయిన దక్షి ణేశ్వర రోజులలో జరిగిన కొన్ని సంఘటనలనూ, ఆమెకూ గురుదేవులకూ మధ్య నెలకొన్న పవిత్ర బంధాన్నీ ఇప్పుడు కాస్త పరికిద్దాం.