అన్నిటికీ గురువు
శారద తన జీవితంలో పారమార్థిక శిక్షణ, గార్హస్థ్య శిక్షణ చేపట్టవలసివచ్చిందని చూశాం. ఈ రెండింటికీ ఆమెకు గురువు అద్భుత గురుదేవులే! రెండవ శిక్షణను ఆమె జయరాంబాటిలోనే మొదలుపెట్టారు. అది ఇక్కడ కూడా కొనసాగింది. ఇక్కడ ముఖ్యంగా ఆయన పార మార్థిక సాధనలలో శిక్షణ నిచ్చారు. అందువల్ల మొదట ఈ విషయం పరికిద్దాం.
గురుదేవులు శారద కిచ్చిన పారమార్థిక శిక్షణలో భక్తిధ్యానాలు ప్రాధాన్యం వహించాయి. ఆమె ఆచరణలో పెట్టవలసింది, ఆయనకు శిష్యురాలిగా ఉండి గురుదేవులలో ప్రజ్వలిస్తూన్న సర్వసంగ పరిత్యాగ హృదయాన్నీ, తీరని ఆర్తితో భగవంతుని అన్వేషిస్తూ వెళ్లే తీవ్ర అనురక్తినీ యథాతథంగా తన జీవితంలో మిళితం చేసుకోవడం.
ఒక రోజు గురుదేవులు శారదను పిలిచి ఆకాశంలోని చంద్రుణ్ణి చూపిస్తూ, “ఇదిగో చూడు, పిల్ల లందరూ చంద్రుణ్ణి చందమామ అంటూ బంధుత్వం కలుపు తారు. ఆ చంద్రునిలాగే భగవంతుడు కూడా అందరికీ సొంతమైనవాడు. వీరు, వారు అనే విచక్షణ లేకుండా, అందరికీ ఆయనను ప్రార్థించే హక్కు ఉంది. ఉత్సాహంతో పిలిచే వారికందరికీ ఆయన అనుగ్రహం లభిస్తుంది. నువ్వు కూడా నీ మనస్సును భగవంతుని వైపు మళ్లించి, నిండు మనస్సుతోనూ, బంధుత్వం తోనూ ఆయనను ప్రార్థించు. అప్పుడు ఆయనను పొందగలవు” అన్నారు. ఈ ఉపదేశాన్ని షోడశీపూజకు కొన్ని రోజుల ముందే శారదకు చెప్పారు. ఆయన ఉపదేశం చేసిన పద్ధతీ, ఆ సమయంలో శారదలో నెలకొన్న సమున్నతమైన మనః స్థితీ, ఈ ఉపదేశం ఆమె మనస్సులో చెక్కు చెరగని ముద్ర వేశాయి.
మరొక రోజు రాత్రి, శారద గురుదేవులకు ఒక పళ్లెంలో ఆహారం తీసు కొని, మరొక భక్తురాలితో ఆయన గదిలోకి వెళ్లింది. గురుదేవుల సమక్షంలో సైతం మేలిముసుగు ధరిస్తుంది శారద. ఆ రోజు కూడా అలాగే మేలిముసుగు తోనే గదిలోకి ప్రవేశించినప్పుడు గురుదేవులు దివ్యపారవశ్య స్థితిలో ఉన్నారు. శారదను చూడగానే సమధికోత్సాహంతో భగవద్విషయాలు గురించి చెప్ప సాగారు. చాలాసేపు మై మరచి మాట్లాడుతూనే ఉండిపోయారు. శారద కూడా ఆ దివ్య పారవశ్యం వల్ల ఆకర్షితురాలై పరిసరాలను కూడా మరచి, మంత్ర ముగ్ధయై గురుదేవుల మాటలను ఉత్సాహంతో వింటూ ఉండిపోయింది. రాత్రంతా గడిచి తెల్లవారసాగింది. అప్పుడే తాను రాత్రి నుండి గురుదేవుల సమక్షంలో నిలబడి ఉండడాన్నీ, మేలి ముసుగు తొలగిపోవడాన్నీ గమనించింది. వెంటనే ఆదరాబాదరాగా ముసుగు సర్దుకొని నహబత్తుకు వెళ్లిపోయింది.
ఉన్నతమైన సత్యాలను చెప్పడంతోపాటు, వాటిని ఆలోచించి చూడమనే వారు గురుదేవులు. ఒక రోజు వారు శారదకు లక్ష్మి, శ్రీకృష్ణుల చరిత్రను చెప్పారు. తర్వాత ఆమెతో, “పశువులు పగటి వేళలో తిన్న ఆహారాన్ని రాత్రి నెమరువేస్తాయి. మీరు కూడా నేను చెప్పిన విషయాలు మీలో మీరు చర్చించు కోవాలి. అప్పుడే వాటిని మరిచిపోరు” అన్నారు.
పారమార్థిక సాధనలు
ఇలా సామాన్యమయిన పారమార్థిక ఉపదేశాలను, సలహాలను అప్పుడప్పుడు ఇవ్వడంతోపాటు గురుదేవులు శారదకు మంత్రోపదేశం చేసి, పారమార్థిక జీవితా నికి పట్టుగొమ్మలైన జపం, ధ్యానం ఇత్యాదులలో శిక్షణ కూడా గరపారు. ఆమె కామార్పుకూరులో ఉంటున్న ప్పుడు పూర్ణానందుడనే సన్న్యాసి ఆమెకు శక్తి మంత్రదీక్ష ఇచ్చాడు. గురుదేవులు మళ్లీ ఆమెకు శక్తి మంత్రదీక్షను ప్రసాదిస్తూ, బీజ మంత్రాన్ని ఆమె నాలుకపై వ్రాశారు. మంత్రజపమనేది శారద నిత్యజీవితంలో కలిసిపోయిన సాధన పద్ధతిగా ఒప్పారింది. గురుదేవులకూ, ఆయన భక్తులకూ రోజంతా చేయవలసిన సేవల నడుమ చాలాసేపు ఆమె జపంలోనూ ధ్యానంలోనూ గడిపేది. ఒకసారి తన తమ్ముడి కుమార్తె నళినితో, “నీ వయస్కురాలినై ఉన్నప్పుడు, రోజంతా ఎన్ని పనులు చేసే దాన్నో తెలుసా? అప్పటికీ ప్రతి రోజూ ఒక లక్ష జపం చేయడానికి సమయాన్ని కేటాయించుకొనేదాన్ని” అంటూ కాలాంతరంలో చెప్పేవారు.
ఉన్నతమైన దివ్య పారవశ్యస్థితి నుంచి మామూలు బాహ్యస్థితికి వచ్చే టప్పుడు గురుదేవులు కొన్ని సమయాల్లో పరాశక్తి భావంలో లీనమై ఉండడం కద్దు. ఆ సమయాల్లో తమను దేవి సేవకురాలిగా భావించేవారు. అంతేకాకుండా, శారదను ఇతరులను కూడా అలాగే చూసేవారు, అప్పుడు శారద ఆయనను స్త్రీగా అలంకరించేది. తర్వాత తనను కూడా దేవి సేవకురాలిగా పరిగణించుకొని దేవి చింతనలో మగ్నమయ్యేది.
రాజయోగంలో కూడా ఆమెకు తర్ఫీదు నిచ్చారు గురుదేవులు. మానవ శరీరంలోని ఆరు చక్రాలనూ, కుండలినీ శక్తి మొదలైన వాటిని చిత్రాలుగా గీచి ఆమెకు విశదీకరించారు.
భగవంతుని అనుభూతి ఒక్కటే ఆమెకు లక్ష్యంగా ఉండాలి. రోగాలు నయం చేయడం లాంటి సిద్ధుల వెంట ఆమె మనస్సు వెళ్లకూడదని ఎంతో జాగ్రత్త వహించారు గురుదేవులు. రోగాలు నయం చేసే ఒక మంత్రాన్ని ఆమె అప్పటికే నేర్చుకొంది. దక్షిణేశ్వరం వచ్చిన తర్వాత ఈ విషయం గురుదేవులతో చెప్పింది. అందుకు గురుదేవులు, “ఫరవాలేదు. నేర్చుకోవడంలో తప్పు లేదు. ఇక దానిని నీ ఇష్టదైవం పాదాల మ్రోల సమర్పించేయి” అన్నారు.
ఈ కాలఘట్టంలోనే పలుదేవతా మంత్రాలనూ, వాటిని ఇతరులకు ఇవ్వ వలసిన విధానాన్నీ గురుదేవులు శారదకు నేర్పించారు.
ఈ రోజులలో* సావిత్రీ వ్రతాన్ని శారద చేపట్టినట్లు శ్రీ శారదానంద స్వామి, మహేంద్రనాథ గుప్తాలు వ్రాసి ఉన్నారు. కానీ ఈ వ్రతం గురించి తక్కిన వివరాలేవీ లభించలేదు.
ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు తప్ప గురుదేవులు శారదకు ఇచ్చిన పారమార్థిక తర్ఫీదును గురించి వివరాలు తక్కువగానే లభించాయి. మాతృదేవి కూడా చాలా అరుదుగా వీటిని గురించి చెప్పేవారు. కాలాంతరంలో ఒకసారి తమ శిష్యునితో పారమార్థిక సాధనల గురించి ప్రస్తావించినప్పుడు మాతృదేవి, “ఆ రోజుల్లో నేను ప్రతిరోజూ వేకువజామునే మూడు గంటలకు లేచి ధ్యానానికి కూర్చొనేదాన్ని. చాలా రోజులు మైమరచి ధ్యానంలోనే లీనమైపోయేదాన్ని. ఒక రోజు రాత్రి ఆహ్లాదకర వెన్నెల కాస్తూన్నది. సర్వత్రా, పరమ ప్రశాంతత నెలకొంది. అప్పుడు నహబత్తు గుమ్మం వద్ద కూర్చొని ధ్యానంలో మగ్నమైపోయాను. గురుదేవులు అటువైపు వెళ్లినప్పుడు పాదరక్షల సవ్వడి వినబడేది. ఆ రోజు అలాంటివేవీ వినబడలేదు. ఆ రోజుల్లో నేను ఇలా ఉండేదాన్ని కాను. బాగా అందంగా ఉండేదాన్ని. ఎన్నో నగలు ధరించేదాన్ని. ఎర్రంచు చీర కట్టుకునేదాన్ని. ఆ రోజు మేలి ముసుగు కూడా గాలికి జారి కిందపడిపోయినట్లూ, ఆ ధ్యాస కూడా లేకుండా నేను ధ్యానంలో మగ్నమై ఉన్నట్లూ, గురుదేవులకు నీళ్లు తీసుకువెళ్లే యోగిన్ తర్వాత చెప్పాడు. ఆహా! ఆ రోజుల్లో ఆనంద సాగరంలో ఓలలాడేదాన్ని. వెండి వెన్నెల రాత్రులలో చంద్రుణ్ణి చూస్తూ, ‘భగవంతుడా! చంద్రునిలా నా మనస్సు కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి. చంద్రునిలో కూడా కొన్ని మచ్చలున్నాయి. నా మనస్సులో అవి కూడా ఉండకూడదు’ అంటూ భగ వంతుణ్ణి ప్రార్థించేదాన్ని. ధ్యానంలో నెలకొన్న వ్యక్తి హృదయంలో భగవంతుణ్ణి స్పష్టంగా దర్శింపగలుగుతాడు. ఆయన కంఠం వినగలుగుతాడు. అలాంటి వారి మనస్సులో ఎలాంటి భావన ఉదయించినా, అది తక్షణమే నెరవేరుతుంది. గాఢమైన ప్రశాంతతలో వారు మునిగి లేస్తారు.
‘ఆహా! ఆ రోజుల్లో నా మనస్సు ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండేది! ఒక సారి పని మనిషి బృంద తెస్తున్న పెద్ద పళ్లెం చేజారి నా సమక్షంలో క్రింద పడింది. ఆ శబ్దం నా హృదయాన్ని బద్దలు చేసినట్లయింది.
ఆధ్యాత్మిక అనుభూతి పరిపూర్ణత్వం సంతరించుకున్నప్పుడు ఒక వ్యక్తి తన హృదయంలో నెలకొన్న అదే భగవంతుడు, సమాజంలో నిమ్నజాతివారు, అంట రానివారు, దుఃఖాలకు లోను చేయబడినవారు, అల్పులుగా చేయబడినవారు మొదలైన వారి హృదయాలలోనూ నెలకొనివుండడం స్పష్టంగా చూస్తాడు. ఈ అనుభూతి నిజమైన వినమ్రతను ప్రసాదిస్తుంది.’
పారమార్థిక సాధనలను శారద తు.చ. తప్పక పాటించే విషయంలో గురు దేవులు ఎంతో జాగ్రత్త వహించారు. సామాన్యంగా ఉదయం మూడింటినీ మేల్కొని, కాలకృత్యాలు తీర్చుకొని జపం చేయడానికి కూర్చోవడం శారద అలవాటు. ఎప్పుడైనా అలా చేయనప్పుడు అటువైపు వెళుతున్న గురుదేవులు, “మేలుకో, మేలుకో” అంటూ బిగ్గరగా అరుస్తూ నహబత్తు తలుపుల గుండా లోపలికి నీళ్లు పోసేవారట.
ఆధ్యాత్మిక అనుభూతలు
దక్షిణేశ్వరంలో గడిపిన ఈ రోజుల్లో శారద అత్యంత ఉన్నత ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించారని చెప్పడానికి అనేక ప్రమాణాలున్నాయి. ఆమె లజ్జా స్వరూపిణి. ఏ విషయంలోనూ తనను వ్యక్తం చేసుకోదు. అలాంటి వ్యక్తి ఆధ్యాత్మిక అనుభూతులను వెల్లడిస్తారని ఎలా ఆశించగలం? కానీ కొన్ని సమయాల్లో ఆమెను అతిక్రమించి అవి బయటికి వచ్చేవి. ఇందువల్లనే ఆమె ఉన్నత అనుభూతుల్లో ఏదో ఒకటి రెండింటిని మాత్రమే లోకం తెలుసుకోగలిగింది. యోగిన్ మా తాను చూసిన ఒక సంఘటనను గురించి ఇలా చెప్పింది:
“మాతృదేవి మొదటిసారిగా దక్షిణేశ్వరం వచ్చినప్పుడు సమాధి స్థితిని అనుభవించి ఉండలేదు. శ్రద్ధగా ఆమె జపమూ, ధ్యానమూ చేసుకునే వారు. అయిన సమాధిలో మగ్నమయినట్లు మేం విన్నది లేదు. మారుగా ఆమె గురు దేవులతో ఒకే గదిలో నివసించిన రోజుల్లో వారి సమాధి స్థితులను చూసి భయభరితురాలవడం మాకు తెలుసు. నేను ఆమెకు పరిచయమయిన తర్వాత ఒక రోజు నాతో, ‘యోగిన్! నువ్వు నాకు ఒక సాయం చేసిపెట్టాలి, నాకు సమాధి స్థితిని అనుగ్రహించమని గురుదేవులకు విన్నవిస్తావా? ఆయన చుట్టూ భక్త బృందం సదా ఉంటూనే వుంది. అందువల్ల ఈ విషయం ఆయనతో అసలు మాట్లాడలేకపోతున్నాను’ అని అన్నారు. మాతృదేవి ప్రార్థన చాలా సమంజసమైన, దేననీ గురుదేవులతో ఈ విషయం మాట్లాడాలనీ తీర్మానించుకొన్నాను. ‘మర్నాడు గురుదేవుల దర్శనం కోసం వెళ్లాను. అప్పుడు ఆయన తమ మంచం మీద కూర్చొని ఉన్నారు. మరెవ్వరూ అక్కడ లేరు. ఎప్పటిలా ఆయనకు ప్రణమిల్లిన తర్వాత మాతృదేవి ప్రార్థనను విన్నవించాను. ఆయన శ్రద్ధగా విన్నారు. కానీ బదులేమీ చెప్పలేదు. హఠాత్తుగా గంభీరముద్ర వహించారు. అలాంటి మనో భావంలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు. అందువల్ల నేను కాసేపు మౌనంగా వుండి, మెల్లగా బయటికి వచ్చేశాను. అక్కణ్ణుండి నహ బత్తు చేరుకుని తలుపులు కొద్దిగా తెరచి లోపలికి తొంగి చూచాను. మాతృదేవి ఎప్పటిలా ఉదయం పూజ కోసం కూర్చొని ఉన్నారు. అక్కడ నేను చూసిన దృశ్యాన్ని నమ్మలేకపోయాను. మాతృదేవి అత్యంత ఉన్నతమైన పారవశ్య స్థితిలో ఉన్నారు. ఒకసారి విరగబడి నవ్వుతున్నారు. ఇంకొంకసారి భోరున విలపిస్తు న్నారు. ఇలా నవ్వడం, ఏడవడం కొంతసేపు సాగింది. ఆమె కళ్ల నుండి ధార లుగా నీరు స్రవిస్తున్నది. మెల్లమెల్లగా ఆమె బాహ్యస్మృతిని కోల్పోయి అంత ర్ముఖులైపోయారు. ఆమె ప్రగాఢ సమాధి స్థితిలో నెలకొనివున్నారని నేను గ్రహించగలిగాను. మెల్లగా తలుపులు మూసి బయటికొచ్చేశాను.
“చాలాసేపు గడచిన తర్వాత నేను ఆమె గదికి వెళ్లాను. నన్ను చూడగానే, ‘ఇప్పుడే గురుదేవులను చూసి వస్తున్నావా?’ అని అడిగారు మాతృదేవి. “అమ్మా! ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితులనో సమాధినో అనుభవించలేదని చెప్పి నన్ను మోస పుచ్చారు” అన్నాను నేను. మాతృదేవి వదనారవిందంలో లజ్జాశ్రిత దరహాస చంద్రికలు వెల్లివిరిశాయి.
కొన్ని రోజులు నేను రాత్రులు దక్షిణేశ్వరంలో గడిపేదాన్ని. అలాంటప్పుడు నేను ఒంటరిగా పడుకోవడానికి ప్రయత్నిస్తే మాతృదేవి వదలేవారు కారు. నన్ను తమ పక్కననే పడుకోమనేవారు. ఒకరోజు రాత్రి ఎవరో పిల్లనగ్రోవి ఊదే మధుర నాదం వినవచ్చింది. ఆ మధురనాదం విని మాతృదేవి పారవశ్య స్థితిలోకి వెళ్లిపోయారు. మధ్య మధ్య మైమరచి నవ్వసాగారు. ఈ స్థితిలో ప్రాపంచిక వ్యక్తినైన నేను ఆమెను స్పృశించరాదని పడక మీద ఒక మూలన ముడుచుకొని కూర్చున్నాను. మాతృదేవికి మళ్లీ బాహ్యస్పృహ కలగడానికి చాలాసేపు పట్టింది.’
గురుదేవుల నిర్యాణానంతరం, శారదకు ఇలాంటి సమాధి స్థితులు పదే పదే కలగసాగాయి. ఈ విషయం ముందు ముందు వివరంగా చూద్దాం! ఇక్కడ ఒక నిజాన్ని మనం జ్ఞాపక ముంచుకోవాలి. ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవిత పర్యవ సానంగా పరవశ స్థితులూ, దివ్యదృశ్యాలు అన్యమవడం నిజమే. కానీ ఇవి దొరికినప్పుడు మాత్రమే ఆధ్యాత్మికపరంగా ఉన్నతుడని మనం పరిగణించ కూడదు. సాధకుని స్వభావానికి తగినట్లు కొందరికి ఇవి సిద్ధించవచ్చు, ‘కొందరికి ఇవి కలుగక కూడా పోవచ్చు. కానీ యథార్థమైన ఆధ్యాత్మిక ఉన్నతి సారం, వారి ఆంతరిక జీవితం పూర్తిగా మారిపోయి ఉన్నతమైన చైతన్య స్థితులను చేరుకోవ డమే. అనుభవపూర్వకమైన వచనాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. ‘ఒకతనికి భగ వంతుని అనుభూతి కలిగితే ఏం లభిస్తుంది? ఆ వ్యక్తికి రెండు కొమ్మలు మొలు స్తాయా ఏమిటి? లేదు. ఆతడి మనస్సు పరిశుద్ధమవుతుంది. పవిత్రమైన మనస్సు ద్వారా జ్ఞానం సిద్ధిస్తుంది.’
గృహస్థ జీవిత తర్ఫీదు
ఆధ్యాత్మికపరమైన తర్ఫీదుతోపాటు నిత్యజీవితంలో అనుసరించవలసిన విషయాలను కూడా గురుదేవులు శారదకు బోధించారు. వారొసగిన ఒకటి రెండు ఉపదేశాలను చెబితే ఈ సత్యం బోధపడుతుంది. గృహస్థ జీవితంలోని అతిమామూలు విషయాలను కూడా ఆయన తృణీకరించలేదు – ‘ఏ వస్తువునైనా ఉపయోగించిన తర్వాత అలక్ష్యంగా అటూ ఇటూ పడేయకూడదు. దానికంటూ నిర్దేశింపబడిన చోటనే ఉంచాలి. అప్పుడప్పుడు మనం వాడుకొనే వస్తువులను మన చేతులకు సులభంగా అందేలా దగ్గరగా ఉంచుకోవాలి. ఎప్పుడో ఒకసారి పనికి వచ్చే వస్తువులను దూరంగా ఉంచవచ్చు. ఒక చోటు నుండి ఒక వస్తువును తీస్తే మళ్లీ ఆ వస్తువును అదే చోట ఉంచాలి. ఇలా చేసినట్లయితే చీకటిలో కూడా తడుముకోకుండా ఆ వస్తువును అందుకోగలం.
‘ప్రయాణ సమయాల్లో పడవలోనో, బండిలోనో ఎక్కేటప్పుడు ముందుగా ఎక్కాలి. దిగేటప్పుడు చివరగా దిగాలి. అప్పుడే సామానులన్నీ సరిగ్గా ఎక్కించామా దింపామా అనే విషయాలన్నిటినీ గమనించడం సాధ్యమవుతుంది.’
గృహస్థ జీవితంలోనయినా, సమాజ జీవితంలోనయినా, మన విజయ రహస్యం మన చేతిలోనే ఉంది. మనం మన చుట్టు పక్కల ఉంటున్న వారిలో ఎలాంటి సంబంధాలు ఉంచుకున్నాం, ఎలా మెలగుతున్నాం అనే విషయంలోనే వుంది; ప్రతి వ్యక్తి మనోభావం, చోటు, కాలం, పరిస్థితి, గుణం, ఆచార వ్యవహా రాలు ఇవన్నిటినీ అనుసరించి నడచుకోవడంలోనే ఉంది. స్థూలదృష్టిలో అందరూ ఎముకలు, కండరాలూ గల మనుష్యులే, కానీ ప్రతి ఒక్కరి మనస్సూ పూర్తిగా భిన్నం. అందువల్ల స్నేహితులను ఎన్నుకునేటప్పుడు, వారితోపాటు మెలిగే విషయంలోనూ ఎంతో జాగ్రత్త పడాలి, కొందరితో గాఢంగా కలిసి మెలసి వుండ వచ్చు. మరి కొందరిని చూచినప్పుడు ‘ఏమిటి! క్షేమమేనా!’ అని అడగడంతో సరిపెట్టుకోవాలి. మరికొందరితో అంతమాత్రం కూడా మంచిదికాదు’
తన సహధర్మచారిణి గృహస్థ జీవితానికీ, ఆధ్యాత్మిక జీవితానికీ ఆదర్శ ప్రాయంగా ఉండాలనే ఆమెకు గురుదేవులు ఎలాంటి ఉత్కృష్టమైన తర్ఫీదు నిచ్చారో కదా!