1. పాఠశాల ప్రధానోపాధ్యాయుడుగా నరేంద్రుడు
నరేంద్రుడు దారిద్ర్యబాధల్ని భరించలేక శ్రీరామకృష్ణులను శరణు పొందడం, సామాన్య అన్నవస్త్రాదులకు ఆ కుటుంబానికి లోటు రాదని ఆయన ఆశీర్వదించడం గురించి ఇంతకు మునుపే చెప్పివున్నాం. అప్పటి నుండి నరేంద్రుని ఇంటి పరిస్థితులు క్రమంగా మెరుగు పడసాగాయి. పెద్దగా శ్రీమంతులు కాకపోయినా వెనుక అనుభవించిన కటిక దారిద్ర్యాన్ని వారు మరెన్నడూ చవిచూడలేదు. ఈ సంఘటన జరిగిన కొద్దికాలంలోనే కలకత్తా చంపాతల పేటలో మెట్రోపోలిటన్ పాఠశాల ఒక శాఖను ప్రారంభించింది. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆదరణతో నరేంద్రుడు ఆ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడుగా నియుక్తుడయ్యాడు. ఆ పాఠశాలలో అతడు బహుశా 1885 వ సం ॥ మే నెల నుండి మూడు నాలుగు నెలలు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు.
2. బంధువుల శత్రుత్వం
నరేంద్రుని కుటుంబ పరిస్థితులు ఒకింత మెరుగుపడినప్పటికీ, బంధువుల శత్రుత్వం వలన అతడు ఎంతో క్షోభకు గురియైనాడు. అవకాశం చూసుకొని ఆ బంధువులు నరేంద్రుని పూర్వీక ఆస్తిపాస్తులలోని మంచి ఇళ్ళను, స్థలాలను ఆక్రమించుకొన్నారు. ఫలితంగా నరేంద్రుడు తన సొంత ఇంటిని వదలిపెట్టి రాంతను బసు వీథిలోని తన అమ్మమ్మ ఇంట్లో నివసించవలసి వచ్చింది. న్యాయంగా తమకు చెందవలసిన ఆస్తికై ఉన్నత న్యాయస్థానంలో దావా వేశాడు. తన తండ్రికి స్నేహితుడైన నిమాయ్ చరణ్ బసు అనే న్యాయవాది ఈ దావాలో నరేంద్రుడికి ఎంతో సహాయం చేశాడు. ఇప్పుడు ఈ దావా వ్యవహారాన్ని చూసుకోవడంలో ఎంతో సమయం గడపవలసి వచ్చినందుకూ, న్యాయశాస్త్ర (బి.ఎల్.) పరీక్షలు సమీపించడం వలనా నరేంద్రుడు తన ఉపాధ్యాయ పదవికి మూడు నాలుగు నెలల తరువాత రాజీనామా చేయవలసి వచ్చింది. అంతేగాక అలా రాజీనామా చేయడానికి మరో ముఖ్యమైన కారణంకూడా ఉంది. ఆ సమయంలోనే శ్రీరామకృష్ణుల కంఠంలో వ్యాధి ప్రారంభమై, క్రమంగా అది ప్రకోపించ సాగింది. అందువలన గురుదేవుల చికిత్స, సేవల ఏర్పాట్లు చేయడానికై ఆయన సమక్షంలో తాను ఉండవలసిన అవసరం ఎంతో ఉంటుందని నరేంద్రుడు భావించి, ఉద్యోగానికి రాజీనామా చేసి ఉంటాడు.
3. శ్రీరామకృష్ణుల వ్యాధి
1885 వ సంవత్సరం విపరీతమైన ఎండల కారణంగా శ్రీరామకృష్ణులు ఎంతో బాధపడడం చూసి భక్తులు ఆయనను మంచుగడ్డను వాడమని ప్రార్థించారు. మంచుగడ్డను తిని ఆయన ఒకింత ఉపశమనం పొందడంతో భక్తులలో అనేకులు దక్షిణేశ్వరానికి వస్తున్నప్పుడు మంచుగడ్డలను తీసుకురాసాగారు. ఆయన కూడా షర్బత్తులలో మంచు ముక్కలను కలిపి త్రాగుతూ పిల్లవాడిలా సంతోషపడేవారు. ఒకటి లేదా రెండు నెలలు మంచుగడ్డలను వాడే సరికి మళ్ళీ కంఠంలో నొప్పి ప్రారంభమైంది. బహుశా ఏప్రిల్ నెలలో మొట్టమొదటిసారి నొప్పి ప్రారంభమై ఉండవచ్చు.
4. అధికంగా మాట్లాడడం, భావసమాధి పొందడం కారణంగా వ్యాధి ప్రకోపించడం
ఒక నెల గడిచిన తరువాత కూడా నొప్పి తగ్గలేదు. మే నెల రాగానే ఆ వ్యాధి క్రొత్త లక్షణాలను దాల్చింది. ఆయన ఎక్కువగా మాట్లాడినా లేదా భావ సమాధి పొందినా వ్యాధి ప్రకోపించసాగింది. జలుబు కారణంగా గొంతు లోపలిభాగం వాచిందని మొదట నిర్ణయించి పట్టీ (ప్లాస్టర్) వేశారు. కాని కొద్దిరోజుల తరువాత దాని వల్ల నయం కాకపోవడంతో, బౌబజార్‌కు చెందిన గొంతురోగ నిపుణుడైన డా ॥ రాఖాల్ చంద్ర హలదార్ను ఒక భక్తుడు తోడ్కొని వచ్చాడు. డాక్టరు పరీక్షించి, రోగ నిర్ణయం చేసి గొంతు లోపల, వెలుపల పూయడానికి ఒక లేపనాన్ని, ఔషధాలను ఇచ్చాడు. శ్రీరామకృష్ణులు ఎక్కువగా మాట్లాడకుండా, భావపారవశ్య స్థితిలోకి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోమని మాతో చెప్పి వెళ్ళాడు.
5. పానీహాటీ మహోత్సవ వృత్తాంతం
మెల్లగా జ్యేష్ఠ మాసంలోని శుక్ల త్రయోదశి సమీపించింది. కలకత్తాకు ఉత్తరంగా గంగాతీరాన కొద్దిమైళ్ళ దూరంలోని పానీహాటీ అనే గ్రామంలో ప్రతి ఏటా వైష్ణవ సంప్రదాయస్థులు ఒక ఉత్సవాన్ని జరుపుతారు. ఈ మహోత్సవం వెనుక ఒక కథ ఉంది. శ్రీ చైతన్య మహాప్రభువుల సహచరులలో ఒకడైన రఘునాథదాస గోస్వామి ఈ గ్రామ వాస్తవ్యుడు. ఈతడి తీవ్ర వైరాగ్య, అనాసక్తతల గురించి వంగ దేశంలో తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తండ్రికి ఏకైక పుత్రుడైన రఘునాథ్ ఒకప్పుడు పరమ సౌందర్యవతియైన భార్యను, అపార సంపదను వదలిపెట్టి శ్రీ చైతన్యుల ఆశ్రయం పొందగోరి శాంతిపూర్‌కు వెళ్ళాడు. అప్పుడు చైతన్యులు, ‘నువ్వీ మర్కట వైరాగ్యాన్ని విడిచిపెట్టి నేను చెప్పేదాకా ఇంట్లోనే ఉండు’ అని అతణ్ణి ఆదేశించి, ఇంటికి పంపివేశారు. చైతన్యుల ఆదేశాన్ని శిరసావహించి రఘునాథ్ ఇంటికి తిరిగి వెళ్ళాడు. కాని సన్న్యసించాలనే తన తీవ్ర ఆకాంక్షను మనస్సులోనే దాచుకొని, తండ్రికి మామకు కుటుంబ వ్యవహారాలలో చేదోడువాదోడుగా ఉండసాగాడు. ఆ విధంగా ఇంట్లోనే కాలం గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు చైతన్యుల సహచరులను చూడకుండా ఉండలేకపోయేవాడు. తండ్రి అనుమతితో వారి సాంగత్యంలో కొద్ది రోజులు గడిపి, తిరిగి ఇంటికి వచ్చేసేవాడు.
రోజులు అలా దొర్లిపోతున్నాయి; రఘునాథ్ ఇంట్లోనే ఉంటూ, సంసార పరిత్యాగానికి ఎదురుతెన్నులు చూడసాగాడు. కాలక్రమంలో చైతన్యులు కూడా సన్న్యాసం పుచ్చుకొని నీలాచలంలో (పూరీ క్షేత్రంలో) నివసించసాగాడు. వైష్ణవమత ప్రచారార్థం తన సహచరుడైన నిత్యానందుణ్ణి నియమించాడు. నిత్యానందుడు, చైతన్యుల ఆదేశం మేరకు గంగాతీరంలోని ‘ఖార్దహ’ అనే గ్రామాన్ని తన ప్రధాన కేంద్రంగా చేసుకొని, అక్కడ నుండి వంగదేశం యావత్తు సంచరిస్తూ అసంఖ్యాకులకు వైష్ణవమత దీక్షను ఒసగుతూ భగవన్నామాన్ని ప్రచారం చేయసాగాడు.
ఒక సందర్భంలో తన మిత్రశిష్య ఆంతరంగిక బృందంతో నిత్యానందుడు పానీహాటగ్రామానికి వేంచేశాడు. రఘునాథ్ ఆయనను దర్శించడానికి వెళ్ళాడు. అటుకులు, పెరుగు, పాలు, బెల్లం, అరటిపళ్ళతో పంచామృతం చేసి భగవంతునికి నివేదించి, ఆ ఆహారాన్ని తమందరికీ సమర్పించమని నిత్యానందుడు అతణ్ణి ఆదేశించారు. ఆ ఆదేశాన్ని తన భాగ్యంగా రఘునాథ్ ఎంచి నిత్యానందుణ్ణి ఆ గంగాతీరాన దర్శింప వచ్చిన వందలాది భక్తులందరికీ కూడా షడ్రసోపేతంగా విందు చేశాడు. ఆ ఉత్సవం ముగిసిన పిదప నిత్యానందునికి మ్రొక్కి సెలవు పుచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు భావావస్థలో ఆయన రఘునాథ్‌ను కౌగిలించుకొని, “సమయం ఆసన్నమైంది. సంసారాన్ని త్యజించి నువ్విప్పుడు పూరీక్షేత్రానికి వెళ్ళు. చైతన్యమహాప్రభువులు ఇప్పుడు నిన్ను అనుగ్రహిస్తారు. నీ ఆధ్యాత్మిక జీవిత పరిపూర్ణతకై నిన్ను సనాతన గోస్వామి శిక్షణలో నియుక్తులను చేస్తారు” అని అన్నాడు. నిత్యానందుని ఆ ఆదేశాన్ని విని రఘునాథ్ సంతోషంతో ఎగిరి గంతు వేశాడు. ఇంటికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి, సంసారాన్ని శాశ్వతంగా పరిత్యజించి, పూరీక్షేత్రానికి వెళ్ళిపోయాడు.
ఈ సంఘటనను కొనియాడే నిమిత్తం ప్రతి ఏటా గంగాతీరంలోని పానీహాటీ గ్రామంలో చైతన్య నిత్యానందుల పేరిట ఒక మహోత్సవాన్ని జరుపు కోవడం వైష్ణవ భక్తులకు ఆనవాయితీ. రఘునాథ్లా భగవదనుగ్రహం పొందగోరే వారు ఆ ఉత్సవాన్ని ఏటా జరుపుకొస్తున్నారు. అప్పటి నుండి ఈ మహోత్సవం ‘పానీహాటీ అటుకుల ఉత్సవం’ గా ఖ్యాతి గాంచింది.
6. ఆ ఉత్సవంలో పాల్గొనాలనే శ్రీరామకృష్ణుల ఆకాంక్ష
శ్రీరామకృష్ణులు పానీహాటీ మహోత్సవంలో పలుమార్లు పాల్గొన్నట్లు మరొకచోట మేం ప్రస్తావించి ఉన్నాం. కాని కారణాంతరాల వలన పాశ్చాత్యరీతిలో విద్యావంతులైన భక్తులు తమ వద్దకు వస్తూవున్నప్పటి నుండి గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఆ ఉత్సవంలో పాల్గొనలేకపోయారు. ఈ సంవత్సరం భక్తులతో కలిసి వెళ్ళి ఆ ఉత్సవంలో పాల్గొనాలని ఆయన తమ ఆకాంక్షను వ్యక్తం చేసి, మాతో “ఉత్సవ దినాన అక్కడ పరమానందం పొంగిపొరలుతుంది. వాస్తవానికి హరినామం సరఫరా చేసే అంగడి ఆ రోజు అక్కడ తెరచి ఉంటుంది. మీ ‘యంగ్ బెంగాల్’ అటువంటిది ఎన్నడూ చూసివుండదు. పోయి చూద్దాం రండి” అని అన్నారు. రామచంద్రదత్త తదితర భక్తులు ఆయన ప్రతిపాదనకు హర్షించినప్పటికీ, శ్రీరామకృష్ణుల గొంతు నొప్పిని జ్ఞాపకం చేసుకొని వారిలో కొందరు అలా వెళ్ళకుండా ఆయనను నివారింప ప్రయత్నించారు. వారిని సంతృప్తిపరచే ఉద్దేశంతో ఆయన “ఉదయానే ఇక్కడ కాస్త తింటాను. అక్కడ ఒకటి రెండు గంటలు గడిపి తిరిగివచ్చేద్దాం. అలా చేస్తే పెద్దగా హాని ఏం జరగదు. భావపారవశ్యం అధికరిస్తే గొంతునొప్పి కూడా అధికమౌతుంది. కనుక ఆ విషయంలో కడుజాగ్రత్త వహిస్తే ఏ బాధా ఉండదు” అని అన్నారు. ఆయన పలుకులతో అన్ని అభ్యంతరాలు గాలికి కొట్టుకుపోయాయి. భక్తులు పానీహాటీ ప్రయాణానికి ఏర్పాట్లు చేయసాగారు.
7. పానీహాటీకి బయలుదేరడం
శుక్లపక్ష త్రయోదశి, పానీహాటీ మహోత్సవ దినం. ఉదయం తొమ్మిది గంటలకు దాదాపు ఇరవై ఐదుమంది భక్తులు రెండు పడవలలో దక్షిణేశ్వరానికి వచ్చారు. కొందరు కాలినడకన వచ్చారు. శ్రీరామకృష్ణుల నిమిత్తం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పడవ ఘట్టం వద్ద ఆగి ఉంది. వేకువ జామునే కొందరు భక్తురాండ్రు కూడా వచ్చివున్నారు. వీరు మాతృదేవితో కలిసి శ్రీరామకృష్ణులకు, భక్తులకు కావలసిన భోజనాదులు ఏర్పాటు చేయసాగారు. అందరూ భోజనాలు ముగించి పది గంటలకు బయలుదేరడానికి సిద్ధమయ్యారు.
8. మాతృదేవి ఆ బృందంతో కలిసి వెళ్ళకపోవడానికి కారణం
శ్రీరామకృష్ణులు భోజనం ముగించాక, తాను కూడా రావచ్చునా అని మాతృదేవి ఒక భక్తురాలి ద్వారా కబురు పంపారు. ఆ భక్తురాలితో ఆయన, “మీరంతా కూడా వస్తున్నట్లున్నారే! ఇష్టమైతే ఆమెను కూడా రమ్మనండి” అని అన్నారు. ఈ జవాబు విని మాతృదేవి “ఆయనతో కలిసి అనేక మంది వెళుతున్నారు, పైగా అక్కడ జనం తండోపతండాలుగా వస్తారు. పడవ నుండి దిగి, ఉత్సవాన్ని తిలకించడం నా కెంతో ఇబ్బందిగా ఉంటుంది. నేను వెళ్ళక పోవడమే మంచిది” అని అన్నారు. వెళ్ళాలనే ఆలోచనను ఆమె విడిచిపెట్టారు. శ్రీరామకృష్ణులతో కలిసి వెళ్ళే ఇద్దరు ముగ్గురు భక్తురాండ్రకు భోజనం పెట్టి, ఆయన వెళ్ళే అదే పడవలోనే వెళ్ళమని వారితో చెప్పారు.
పానీహాటీలోని మణిసేన్ కుటుంబీకులకు చెందిన రాధాకాంత ఆలయం
పానీహాటీలోని ఉత్సవ ప్రాంగణం. శ్రీరామకృష్ణులు ఈ వైష్ణవ ఉత్సవంలో పలుసార్లు పాల్గొన్నారు.
9. ఉత్సవ స్థలంలో భక్తులు చూసిన దృశ్యం
భక్తబృందం దాదాపు పన్నెండు గంటలకు పానీహాటీ చేరింది. అప్పటికే గంగాతీరంలోని పురాతన రావిచెట్టు చుట్టూ వందలాది మంది గుమిగూడి ఉన్నారు. పలుచోట్ల జరుగుతున్న సంకీర్తనానందంలో వైష్ణవ భక్తులు మునిగివున్నారు. కాని అలావున్నప్పటికీ, వారిలో అనేకులు సంకీర్తనలో తన్మయు లైనట్లు కానరావడం లేదు. ప్రతి చోట ఒకరకమైన నిర్జీవ సంకీర్తనగానే కానవస్తున్నది.
పానీహాటీ చేరడానికి ముందు, చేరిన తరువాత కూడా నరేంద్రుడు, బలరాం, గిరీశ్ఘోష్, రాంచంద్ర, మహేంద్రనాథ్ ప్రభృత ప్రధాన భక్తులు ఏ సంకీర్తన బృందంలోను కలిసి భావావేశులు కారాదని గురుదేవులను పదేపదే ప్రాధేయపడ్డారు. ఎందుకంటే ఆయన అలా చేస్తే భావపారవశ్యం కలగడం అనివార్యమై, గొంతు నొప్పి అధికరించడం తథ్యం.
10. మణిసేన్ గృహం
శ్రీరామకృష్ణులు పడవ నుండి దిగి తిన్నగా మణిసేన్ ఇంటికి వెళ్ళారు. ఆయనను చూసి ఇంటిల్లిపాదీ సంతోషంతో ఉప్పొంగిపోయి, ప్రణామాలు చేసి, ఆయనను కచేరి గదిలోకి తోడ్కొనిపోయి అక్కడ సుఖాసీనుని చేశారు. ఆ గది ఆంగ్లేయ పద్ధతిలో మాదిరి బల్లలు, కుర్చీలు, సోఫాలు, తివాచీలు మొదలైన వాటితో అలంకరింపబడి ఉంది. పది పదిహేను నిమిషాలు విశ్రమించాక శ్రీరామకృష్ణులు, మణిసేన్ కుటుంబానికి చెందిన శ్రీరాధాకాంత ఆలయానికి మ్రొక్కడానికి బయలుదేరారు.
11. మణిసేన్ కుటుంబీకుల దేవాలయం
ఆ దేవాలయం కచేరి గదికి సమీపంలోనే ఉంది. మేమంతా కచేరి ప్రక్క వాకిలి గుండా తిన్నగా నాట్యమందిరంలో ప్రవేశించి రాధాకృష్ణుల జంట విగ్రహాలను దర్శించుకొన్నాం. ఆ విగ్రహాలు ఎంతో అందంగా మలచబడి ఉన్నాయి. ఒకింత ఆ విగ్రహాలనే తదేకంగా చూసి అర్ధ బాహ్య దివ్యభావంలో శ్రీరామకృష్ణులు ప్రణామాలు అర్పించారు. నాట్యమందిరం నుండి బయటకు వచ్చి ఐదారు మెట్లు క్రిందికి దిగితే చతుష్కోణ ఆలయ ప్రాంగణంలోకి అడుగిడతాం. ప్రాంగణానికి నలువంకలా చక్కని గదులు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే విగ్రహాలు కానవచ్చే రీతిలో ఆలయ ద్వారం అమరివుంది.
శ్రీరామకృష్ణులు ఆలయంలో మ్రొక్కుతున్నప్పుడు ఒక సంకీర్తన బృందం ద్వారం గుండా ప్రాంగణంలోకి వచ్చి సంకీర్తన ప్రారంభించింది. ఉత్సవానికి వచ్చిన ప్రతీ సంకీర్తన బృందం ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి మొట్టమొదట సంకీర్తన ప్రారంభించి ఆ తరువాత గంగాతీరానికి వెళ్ళి భగవన్నామ సంకీర్తన చేయడం పరిపాటి. ఇంతలో పొడుగ్గా, లావుగా, తెల్లని మేనిచాయ గల మధ్య వయస్కుడైన ఒక వ్యక్తి యజ్ఞోపవీతం, తలపై శిఖ, ఒంటి నిండా చందన పూత, శంఖచక్రాల చిహ్నాలు, చిన్న సంచీలోని జపమాలను తిప్పుకొంటూ ప్రాంగణంలోకి వచ్చాడు. ఉత్తరీయం అతడి భుజం నుండి వ్రేలాడుతున్నది. చక్కగా ఉతికిన తెల్లని ధోవతిని పొందికగా ధరించి ఉన్నాడు. నడుము మడతలలో కొన్ని నాణాలు పెట్టుకొని ఉన్నాడు. అతణ్ణి చూడగానే ఇతరుల విశ్వాసం మీద ధనం సముపార్జించే కపట గోస్వామిగా కానవస్తాడు. సంకీర్తన బృందాన్ని ఉత్తేజపరచడానికో, బహుశా కొత్తగా వచ్చిన వారికి తానొక మహాభక్తుణ్ణని చాటుకోవడానికో అన్నట్లు రాగానే అతడు సంకీర్తన బృందంతో జతకట్టి తానేదో భావపారవశ్యంలో మగ్నుడై ఉన్నట్లు గర్జిస్తూ హావభావాలు ప్రదర్శిస్తూ నృత్యం చేయసాగాడు.
12. భావసమాధ్యవస్థలో శ్రీరామకృష్ణులు నృత్యం చేయడం
భగవంతునికి మ్రొక్కి శ్రీరామకృష్ణులు ఆలయంలో ఒక ప్రక్క నిలబడ్డారు. ఆ గోస్వామి భావసమాధ్యవస్థను నటించడం, అతడి దుస్తులు అలంకరణలు మాత్రం చెక్కుచెదరక సక్రమంగా ఉండడం గమనించి నవ్వుతూ శ్రీరామకృష్ణులు తమ ప్రక్కనే ఉన్న నరేంద్రాది భక్తులతో మెల్లగా, “ఆ కాపట్యం చూడండి” అని అన్నారు. ఆయన ఆ వ్యాఖ్యానంతో అందరి పెదవులపై చిరునవ్వు తాండవించింది. ఆయన ఎటువంటి భావోద్వేగానికీ గురికాకుండా తమను అదుపులో ఉంచుకోవడం చూసి భక్తులంతా నిశ్చింతులయ్యారు. కాని మరుక్షణమే, కన్నుమూసి తెరచేంతలో ఎప్పుడు ఎలా జరిగిందో భక్తులు అవగతం చేసుకోవడానికి మునుపే శ్రీరామకృష్ణులు ఒక్క గెంతుతో సంకీర్తన బృందం మధ్యలో దూకి భావావస్థలోకి జారిపోయి, పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయారు. వెంటనే భక్తులు నాట్యమందిరం నుండి పరుగున వచ్చి ఆయన చుట్టూ నిలబడ్డారు.
ఇక గురుదేవులు మధ్యమధ్యలో పాక్షికంగా బాహ్యస్మృతిని పొంది, సింహం మాదిరి అంగలు వేస్తూ నృత్యం చేయసాగారు. ఇంతలో బాహ్యస్మృతిని మళ్ళీ పూర్తిగా కోల్పోయి నిశ్చేష్టులై నిలబడిపోసాగారు. ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రభావంలో లయానుసారంగా త్వరితగతిలో ముందుకు, వెనుకకు అడుగులు వేస్తూ ఆయన నృత్యం చేయసాగారు. పరమానంద సాగరంలో మహానందంగా ఈదుతున్న చేపలా కనిపించారు. ఆయన ప్రతి అవయవ కదలికా ఆ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నది. సౌందర్యమూ కోమలత్వమూ మధురంగా సామరస్యం పొంది అత్యంత అకృత్రిమంగా అభివ్యక్తమౌతున్న ఆ దివ్యానందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. వివిధ హావభావ సమన్వితమైన స్త్రీల పురుషుల అద్భుత నృత్యాలనెన్నో మేం తిలకించివున్నాం; కాని దివ్యభావావేశంలో తన్మయులై తాండవ నృత్యం చేస్తున్నప్పుడు శ్రీరామకృష్ణుల దేహంలో సౌందర్యమూ శక్తీ ఎలా సమన్వయం చెందివుంటాయో, దాన్లో శతాంశం కూడా మేం మరెక్కడా తిలకించ లేదంటే అతిశయోక్తి కాదు. దివ్యభావోద్వేగంలో జనించిన పరమానందంతో పొంగిపొరలుతున్న ఆయన దేహం సత్వర అంగలతో ముందు వెనుకలకు ఊగుతూ ఉన్నప్పుడు అది ఘనపదార్థంతో తయారుచేయబడింది కాదనీ, బ్రహ్మానంద సాగరంలో ఉవ్వెత్తున లేచి, మరుక్షణమే ఆ సాగరజలాలో లయమైపోయే తరంగమనీ చూపరులకు తోస్తున్నది. అసలు, నకిలీల మధ్యనున్న హస్తిమశకాంతరాన్ని ఎవరూ ఎవరికీ వివరించవలసిన అవసరం లేకపోయింది. ఇక ఆ కీర్తన బృందం ఆ గోస్వామి వైపు కన్నెత్తి అయినా చూడకుండా శ్రీరామకృష్ణులను పరివేష్టించి, నూరింతల సమధికోత్సాహంతో పాడసాగింది.
13. రాఘవ పండితుని ఇంటికి వెళుతున్నప్పుడు శ్రీరామకృష్ణుల భావావస్థ
దాదాపు అరగంటసేపు ఇలా గడిచిన తరువాత శ్రీరామకృష్ణులు దాదాపు మామూలు స్థితికి రావడం గమనించి ఆ సంకీర్తనబృందం మధ్య నుండి ఆయనను తోడ్కొని పోవడానికి భక్తులు ప్రయత్నించారు. శ్రీ చైతన్యుల సహచరుడైన రాఘవ పండితుడు అనునిత్యం తన ఇంట్లో అర్చించిన దైవవిగ్రహాలు, సాలగ్రామం ఆ స్థలానికి ఒక మైలు దూరంలో ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఆ విగ్రహాలను దర్శించుకొని, తదుపరి తమ పడవల వద్దకు వెళ్ళాలని భక్తులు నిర్ణయించారు. అందుకు శ్రీరామకృష్ణులు సమ్మతించి భక్తులతో మణిసేన్ దేవాలయం నుండి బయలుదేరారు. కాని ఆ కీర్తన బృందం మాత్రం విడిచిపెట్టకుండా శ్రీరామకృష్ణుల వెనుకే రాసాగింది. మహోత్సాహంతో భగవన్నామ సంకీర్తన చేస్తూ వారూ ఆయనను అనుసరించారు. శ్రీరామకృష్ణులు కొన్ని అడుగులు ముందుకు వేశారోలేదో, భావావస్థలో మగ్నులై నిశ్చలంగా నిలబడిపోయారు. పాక్షిక బాహ్యస్మృతి పొందిన తరువాత, భక్తులు ఆయనను ముందుకు నడవమని ప్రార్థించారు. నాలుగైదు అడుగులు ముందుకు వేసీవేయగానే మళ్ళీ ఆయన భావపారవశ్యులయ్యారు. పదే పదే ఇలా ఆయనకు భావావస్థ కలగడం వలన భక్తులు అతినెమ్మదిగా ముందుకు కదలవలసివచ్చింది.
14. భావసమాధ్యవస్థలో శ్రీరామకృష్ణుల అలౌకిక సౌందర్యం
భావసమాధ్యవస్థలో ఆ రోజు శ్రీరామకృష్ణుల దేహంలో కానవచ్చిన దివ్యప్రకాశాన్ని, సౌందర్యాన్ని మేం మరెక్కడా చూసినట్లు గుర్తులేదు. ఆ దివ్య పురుషుని అద్భుత సౌందర్యం వర్ణనాతీతం. ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రభావంలో క్షణమాత్రాన మనిషి దేహంలో అటువంటి మార్పు కలుగుతుందని మేం కనీసం ఎన్నడూ ఊహించనైనా ఊహించ లేదు. నిత్యం మేం చూస్తున్న గురుదేవులు నేడు మరింత పొడవరిగా, కలలో కానవచ్చేట్లు అతి తేలిక దేహధారిగా కనిపించారు. ఆయన చామనచాయ వర్ణం గౌరవర్ణంతో ప్రకాశించసాగింది. దివ్యభావంలో తేజరిల్లుతూ, అపూర్వమైన చిరునవ్వుతో గురుదేవుల ముఖారవిందం ఇప్పుడు అలౌకిక శాంత్యానందకారుణ్యాలను సంతరించుకొని దేదీప్యమానంగా ప్రకాశిస్తూ నలువంకలా కాంతిపుంజాలను వెదజల్లుతున్నది. ఆ దృశ్యాన్ని చూసి మంత్రముగ్ధమైన ఆ జనసమూహం ఇతర విషయాలనన్నిటిని మరచిపోయి, అప్రయత్నంగానే ఆయనను అనుసరించసాగింది. ఆయన ధరించిన గౌరవర్ణ పట్టువస్త్రం ఆయన మేనిచాయతో ఒకటైపోయి అగ్నిజ్వాలలు ఆవరించిన వ్యక్తిలా భ్రమింపచేస్తున్నది.
15. శ్రీరామకృష్ణులను తిలకించిన సంకీర్తన బృంద ఉత్సుకత, ఆనందం
శ్రీరామకృష్ణులు మణిబాబు దేవాలయం నుండి వీథిలోకి రాగానే, సంకీర్తన బృందం ఆయన దివ్యసౌందర్యాన్ని, మనోహర నృత్యాన్ని, పదేపదే కలుగుతున్న ప్రగాఢ భావపారవశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం వారి ఉత్సుకతను తారాస్థాయికి కొనిపోగా, వారు పాడనారంభించారు :
“సురనదీ తీరాన ‘హరి’ నామాన్ని గానం చేస్తున్నదెవరో?
ప్రేమప్రదాత నితాయ్ వచ్చినట్లుగా ఉంది,
‘హరి’ అని గానం చేస్తున్నదీ
‘జై రాధ’ అని జయజయధ్వానాలు చేస్తున్నదీ ఎవరో?
ప్రేమ ప్రదాత నితాయ్ వచ్చినట్లుగా ఉంది,
దివ్యప్రేమ ప్రదాత నితాయ్ అరుదెంచినట్లుగా ఉంది,
మన నితాయ్, ప్రేమ ప్రదాత, వచ్చాడు!
అతడు లేకుండా మా మనస్సులు ఎలా ఉపశమిస్తాయి?
ప్రేమప్రదాత మన నితాయ్ ఇక్కడకు వచ్చాడు!”
16. ఎల్లరూ శ్రీరామకృష్ణుల పట్ల ఆకర్షితులవడం
ఆ చివరి చరణాన్ని సంకీర్తన బృందంవారు గానం చేస్తున్నప్పుడు తమ వ్రేళ్ళతో శ్రీరామకృష్ణులను చూపుతూ ‘ఇదుగో మన ప్రేమ ప్రదాత’ అంటూ పదేపదే పాడుతూ మహదానంతో నృత్యం చేయసాగారు. వారి ఉత్సుకత, ఉత్సవాన్ని తిలకింప వచ్చిన యావన్మందినీ ఆకర్షించగా, వారంతా అక్కడకు రాసాగారు. అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణులను చూసిన వారంతా ముగ్ధులై మహోత్సాహంతో సంకీర్తన బృందంతో జతకట్టారు. లేదా వర్ణనాతీతమైన దివ్యభావోద్వేగం తమ హృదయాలలో ఉత్పన్నం కావడంతో విస్మయం చెంది, స్థాణువులై రెప్పవాల్చకుండా ఆయననే చూడసాగారు. ఆ సంకీర్తన బృందం ఉత్సుకత క్రమంగా అక్కడున్న ఎల్లరినీ ఆవరించడమే కాకుండా, కొన్ని సంకీర్తన బృందాలను కూడా ఆకట్టుకొంది. ఆ బృందాలవారూ అక్కడకు వచ్చి, ఈ బృందంతో జతకట్టారు. ఆ విధంగా భావ పారవశ్యమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణులను పెద్ద జనసమూహం పరివేష్టించింది. అందరూ కలసి మెల్లగా రాఘవ పండితుని కుటీరం వైపుగా కదిలారు.
17. పళ్ళెంలో ప్రసాదం
ఈలోగా భక్తురాండ్రు గంగాతీరాన ఉన్న రావిచెట్టు వద్దకు వెళ్ళి శ్రీగౌరాంగ నిత్యానందుల పేరిట కొన్ని పళ్ళెరాలలో మధురభక్ష్యాలు నివేదించి, ఆ ప్రసాదాన్ని గురుదేవుల వద్దకు తీసుకురాసాగారు. వారు రాఘవ పండితుని కుటీరానికి చేరడానికి కాస్త ముందు ఒక సంఘటన జరిగింది. ఎక్కణ్ణుండి వచ్చాడో ఎవరికీ తెలియదు, బైరాగి వేషంలో వికారరూపుడైన వైష్ణవుడొకడు అలా వస్తున్న ఒక భక్తురాలి నుండి ప్రసాద పళ్ళెరాన్ని గబుక్కున లాక్కొని భక్తిభావం పొంగిపొర్లుతున్న వ్యక్తిలా నటిస్తూ కొంత ప్రసాదాన్ని తన చేతులతో శ్రీరామకృష్ణుల నోట్లో పెట్టాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావపారవశ్య ప్రభావంలో నిశ్చల స్థితిలో నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి ఆయనను తాకీతాకగానే ఆయన దేహమంతా కుంచించుకుపోయి ఆయన పారవశ్యస్థితి భగ్నమైంది. ఆ ఆహారాన్ని ఉమ్మివేసి నోటిని కడుక్కున్నారు. ఆ వైష్ణవుడొక మోసగాడని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. అందరూ తన వైపు ఏవగింపుగా చూడడంతో వాడు అక్కణ్ణుండి చల్లగా జారుకొన్నాడు. ఆ తరువాత శ్రీరామకృష్ణులు ఒక భక్తుడి నుండి కించిత్తు ప్రసాదం నోటవేసుకొని, తక్కినదంతా భక్తులకు ఇచ్చివేశారు.
18. నవచైతన్యుని అనుగ్రహించడం
ఒక మైలు దూరంలో ఉన్న రాఘవ పండితుని కుటీరానికి చేరడానికి దాదాపు మూడు గంటలసేపు పట్టింది. శ్రీరామకృష్ణులు ఆలయానికి వెళ్ళి, విగ్రహాలను స్పృశించి, మ్రొక్కి, ఒకింత విశ్రాంతి తీసుకొనేటప్పటికి అరగంట పట్టింది. ఆయనతో పాటు వచ్చిన జనం తమ దారిన తాము వెళ్ళిపోయారు. గుంపు పలచనవడంతో భక్తులు ఆయనను పడవ వద్దకు తోడ్కొని వచ్చారు. కాని ఇక్కడ సైతం ఒక అద్భుత సంఘటన జరిగింది. శ్రీరామకృష్ణులు ఉత్సవానికి వచ్చారని తెలిసి కొన్నగర్ వాస్తవ్యుడైన నవచైతన్య మిత్ర ఆయన కోసం ఆతురతతో అక్కడా ఇక్కడా వెతకసాగాడు. ఇప్పుడు బయలుదేరనున్న పడవలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉండడం చూసి అతడు పిచ్చివాడిలా పరుగెత్తుకొంటూ ఆయన వద్దకొచ్చాడు. ఆయన కాళ్ళమీద పడి, “ప్రభూ, నన్ను అనుగ్రహించు” అంటూ హృదయోద్వేగాన్ని ఆపుకోలేక విలపించసాగాడు. ఆతడి వ్యాకులతకు, హృదయపూర్వక ప్రార్థనకు స్పందించి దివ్యభావంలో ఆయన నవచైతన్యుని స్పృశించారు. ఆ స్పర్శ ఫలితంగా అతడికి ఎటువంటి దివ్యదర్శనం కలిగిందో తెలియ రాలేదుగాని, తృటిలో అతడి ఆవేదన మాత్రం పట్టరాని సంతోషంగా మారిపోయింది. బాహ్యస్మృతిని కోల్పోయిన వ్యక్తిలా ఆ పడవలో నవచైతన్య విశృంఖల నృత్యం చేయసాగాడు. శ్రీరామకృష్ణుల మహత్త్వాన్ని స్తుతుల రూపంలో శ్లాఘిస్తూ పదేపదే ఆయనకు మ్రొక్కసాగాడు. కొంతసేపు ఈ విధంగా గడిచాక గురుదేవులు అతడి వీపును నిమిరి అనునయిస్తూ, అతడికి పలు ఉపదేశాలు ఇచ్చారు.
నవచైతన్య ఇంతకు మునుపు శ్రీరామకృష్ణులను అనేకసార్లు దర్శించాడు గాని, ఆయన అనుగ్రహాన్ని పొందలేదు. నేడు ఆయన అనుగ్రహం పొంది, తరించాడు. ఆ తరువాత అతడు కుటుంబ వ్యవహారాలను తన కుమారునికి అప్పగించి, తన గ్రామంలోనే గంగాతీరాన ఒక కుటీరంలో వానప్రస్థునిలా సాధనలో, భగవన్నామ సంకీర్తనలో, గురుదేవుల మహత్త్వాన్ని కొనియాడడంలో శేషజీవితాన్ని గడిపాడు. నాటి నుండి వృద్ధుడైన నవచైతన్య సంకీర్తన సమయంలో భావపారవశ్యం పొందసాగాడు. భజనానందంలో కలిగే ఆనందాన్ని ఆనందప్రదమైన అతడి రూపాన్ని చూసి జనం అతణ్ణి ఎంతో గౌరవించేవారు. ఆ రీతిలో శ్రీరామకృష్ణుల అనుగ్రహానికి పాత్రుడైన నవచైతన్య తన శేషజీవితంలో ఎంతోమంది హృదయాలలో దైవభక్తిని జాగృతంచేసి, ధన్యుడయ్యాడు.
19. దక్షిణేశ్వరానికి తిరిగి రావడం
నవచైతన్య సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాక శ్రీరామకృష్ణులు పడవను బయలుదేర అనుజ్ఞ నిచ్చారు. కాస్త దూరం మేం వెళ్ళగానే చీకటిపడింది. రాత్రి ఎనిమిదిన్నరకు మేం దక్షిణేశ్వరం చేరుకొన్నాం. తరువాత శ్రీరామకృష్ణులు తమ గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. భక్తులు ఆయనకు ప్రణామాలు చేసి, ఆయన వద్ద సెలవు పుచ్చుకొని కలకత్తాకు బయలుదేరారు. భక్తులందరూ పడవలో కూర్చోబోతుండగా, వారిలో ఒక యువకుడు తాను మరచిపోయిన చెప్పులను తెచ్చుకోవడానికి శ్రీరామకృష్ణుల గదికి పరుగెత్తుకెళ్ళాడు. అతడు తిరిగి ఎందుకు వచ్చాడో ప్రశ్నించి తమాషాగా శ్రీరామకృష్ణులు “పడవ బయలుదేరడానికి ముందే అదృష్టవశాత్తు నీకీ విషయం జ్ఞాపకం వచ్చింది. లేకుంటే ఈనాటి ఆనందమంతా మంటకలిసిపోయేది” అని అన్నారు. ఆ మాటలు విని ఆ యువకుడు నవ్వి, ఆయనకు ప్రణామం చేసి వెళ్ళబోతుండగా ఆయన, “ఈ రోజు ఎలా ఆనందించావు? హరినామ సంత జరిగింది కదా!” అని అడిగారు. ఆ యువకుడు అందుకు తల ఊపగా, ఆ ఉత్సవ స్థలంలో భావ పారవశ్యం పొందిన భక్తులను ఆయన పేర్కొన్నారు. ఆయన చిన్న నరేంద్రుణ్ణి ప్రశంసిస్తూ ఇలా అన్నారు : “ఆ నల్లని పిల్లవాడు ఇక్కడకు కొద్దిరోజుల నుండే వస్తున్నాడు; ఇప్పటికే అతడికి భావపారవశ్య స్థితులు కలుగుతున్నాయి. ఆ రోజు అతడి భావపారవశ్యం ఎంత సేపటికీ తగ్గలేదు. ఒక గంటకు పైగా అతడు బాహ్యస్మృతిని కోల్పోయాడు. ‘నా మనస్సు ఇటీవల భగవంతుని నిరాకారంలో లీనమౌతున్నది’ అని చెబుతూవుంటాడు. చిన్న నరేంద్రుడు సజ్జనుడు; ఏమంటావు? ఒక రోజు అతడి ఇంటికి వెళ్ళి అతడితో మాట్లాడి చూడు. వెళతావు కదూ?”
ఆ యువకుడు ఆయన మాటలన్నిటికీ తన అంగీకారం తెలిపి, “కాని మహాశయా, పెద్ద నరేంద్రుణ్ణి ఇష్టపడినంతగా నేనెవరినీ ఇష్టపడను. కాబట్టి చిన్న నరేంద్రుడి ఇంటికి వెళ్ళడానికి నాకు మనస్కరించడం లేదు” అని చల్లగా చెప్పాడు. అలా చెప్పినందుకు గురుదేవులు అతణ్ణి చీవాట్లు పెట్టి, ఇలా అన్నారు: “కుఱ్ఱ వెధవా, ఎంత పక్షపాతబుద్ధిరా నీది! భగవంతుని పువ్వుల సజ్జెలో వివిధ రకాల పువ్వులు ఉంటాయి. ఆయనకు వివిధ రకాల భక్తులు ఉంటారు. అందరితో కలసిపోయి మెలగుతూ ఆనందించలేకపోవడం, అల్పత్వాన్ని సూచిస్తుంది. నువ్వు ఒక రోజు తప్పక చిన్ననరేంద్రుణ్ణి చూసిరావాలి? సరేనా?” అని గద్దించి చెప్పారు. ఇక తప్పదని, ఆ యువకుడు అందుకు అంగీకరించి, ఆయనకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. గురుదేవుల సలహా మేరకు ఆ యువకుడు కొద్దిరోజులలోనే చిన్న నరేంద్రుని ఇంటికి వెళ్ళినట్లు, అతడితో మాట్లాడిన ఫలితంగా క్లిష్టమైన తన జీవిత సమస్యకు పరిష్కారం పొందినట్లు తరువాత మాకు తెలియవచ్చింది.
20. మాతృదేవి వివేకం గురించి శ్రీరామకృష్ణులు
నాటి రాత్రి పదిగంటలప్పుడు పడవ కలకత్తా చేరుకొంది.
ఆనాటి రాత్రి భక్తురాండ్రు మాతృదేవి వద్దే ఉండిపోయారు. మర్నాడు స్నానయాత్రోత్సవమూ, అట్లే కాళికాలయ ప్రతిష్ఠాపన వార్షికోత్సవమూ కావడం వలన ఆ ఉత్సవ వేడుకలను తిలకించిన తరువాత కలకత్తాకు తిరిగి పోవడానికి వారు నిర్ణయించుకొన్నారు. రాత్రి భోజనం చేస్తూ పానీహాటీ ఉత్సవం గురించి ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఒక భక్తురాలితో ఇలా అన్నారు : “జనం తండోపతండాలుగా వచ్చారు; పైగా భావపారవశ్యం కారణంగా అందరి దృష్టీ నా మీదే ఉండిపోయింది. ఆమె (మాతృదేవి) రాకపోవడం మంచిదే అయింది. ఆమెను జనం నా ప్రక్కన చూసి ఉంటే తప్పకుండా హంస* , హంసి వచ్చారని వ్యాఖ్యానించి ఉండేవారు. ఆమె ఎంతో వివేకవంతురాలు.”
మాతృదేవి అసాధారణ వివేకానికి మరొక ఉదాహరణగా ఆయన ఇలా కొనసాగించారు: “మార్వాడీ భక్తుడు లక్ష్మీనారాయణ పదివేల రూపాయలు కానుకగా ఇవ్వగోరినప్పుడు నా తలను ఎవరో రంపంతో పరపర కోస్తున్నట్లు అనిపించింది. ‘అమ్మా, ఇంతకాలం తర్వాత కూడా నన్ను ప్రలోభానికి గురిచేయ చూస్తున్నావా?’ అని అమ్మను అడిగాను. ఆమె (మాతృదేవి) మనస్సును పరీక్షించే ఉద్దేశంతో ఆమెను పిలిపించి, ‘ఇలా చూడు, అతడు పెద్దమొత్తం ఇవ్వచూస్తున్నాడు. నేను అందుకు అంగీకరించనందున, ఆ మొత్తాన్ని నీకు ఇద్దామనుకొంటున్నాడు. నువ్వు పుచ్చుకోవచ్చు కదా! ఏమంటావు?’ అని అడిగాను. ఆ మాటలు విన్న తక్షణమే ఆమె ఇలా అన్నది : ‘నేనెలా పుచ్చుకొంటాను? ఆ పైకం ఎన్నటికీ పుచ్చుకోను. ఒకవేళ ఆ పైకం నేను పుచ్చుకొన్నా, మీ సేవల, అవసరాల నిమిత్తం మాత్రమే దాన్ని వినియోగించవలసి ఉంటుంది. అంటే ఆ పైకం మీరు పుచ్చుకొన్నట్లే అవుతుంది కదా! మీ వైరాగ్యాన్ని చూసే లోకులు మీ పట్ల భక్తిప్రపత్తులు చెల్లిస్తున్నారు. కాబట్టి ఏ విధంగాను ఆ పైకం పుచ్చుకోవడం అసంభవం.’ ఇలా ఆమె జవాబు విని బ్రతుకుజీవుడా అనుకొన్నాను.”
21. ఈ అంశం గురించి మాతృదేవి వచనాలు
శ్రీరామకృష్ణులు భోజనం చేసిన తరువాత భక్తురాండ్రు నహబత్లోని మాతృదేవి వద్దకు వెళ్ళి గురుదేవులు ఆమెను గురించి చెప్పిన విషయం ఆమెకు తెలిపారు. ఆ విషయం విని ఆమె “ఉదయం ఆయన కబురు పంపిన తీరునుబట్టే నేను పానీహాటీకి వెళ్ళడం ఆయనకు మనస్ఫూర్తిగా ఇష్టం లేదని గ్రహించాను. లేకపోతే, ‘తప్పకుండా రావచ్చు’ అని చెప్పేవారు. కాని వెళ్ళాలా? వద్దా? అనే నిర్ణయాన్ని నాకే వదలివేసి, ‘రాగోరితే రావచ్చు’ అని ఎప్పుడన్నారో అప్పుడే పోవడం సబబు కాదని నిర్ధారణ చేసుకొన్నాను” అని అన్నారు.
22. స్నానయాత్ర పర్వదినం: శ్రీరామకృష్ణుల ఆధ్యాత్మిక భావానికి భక్తులు అంతరాయం కలిగించడం
శరీరంలో విపరీతమైన మంట కారణంగా నాటి రాత్రి శ్రీరామకృష్ణులకు నిద్ర పట్టలేదు. ఉత్సవంలో నానారకాల వ్యక్తులు ఆయన పావన దేహాన్ని తాకినందున అలా జరిగివుండవచ్చు. ఎందుకంటే రోగాలు నయమవాలనో, లేదా మరేదో ఉద్దేశంతోనో కల్మష మనస్కు లైన అపవిత్రులు శ్రీరామకృష్ణుల పాదధూళి స్వీకరించినప్పుడల్లా తరచు ఆయన అటువంటి శారీరకమంటను అనుభవించడం కద్దు.
పానీహాటీ మహోత్సవం జరిగిన మర్నాడు స్నానయాత్రోత్సవం జరిగింది. మేం ఆ రోజు దక్షిణేశ్వరానికి వెళ్ళలేకపోయాం. అనేకులు గురుదేవుల దర్శనార్థం ఆ రోజు దక్షిణేశ్వరానికి వచ్చారని భక్తురాండ్ర నుండి మేం విన్నాం. దర్శనార్థులలో ‘అ’ తల్లి కూడా ఉంది. తన ఆస్తిపాస్తుల పరిష్కారంలో సహాయం చేయమని ఆయనను సతాయించిందనీ, ఆ కారణంగా ఆనాటి ఆయన ఆనందానికి పెద్ద విఘ్నం ఏర్పడిందనీ మేం విన్నాం. మధ్యాహ్న భోజనసమయంలో కూడా వదలి పెట్టకుండా ఆమె, ఆయన దగ్గరే కూర్చుని ఉండడం చూసి ఆయన ఎంతో విసుగుచెంది, ఆ తరువాత ఆమెతో మాట్లాడలేదట. మామూలుగా భోజనం కూడా చేయలేకపోయారట. తదనంతరం మాకు పరిచయస్థురాలైన ఒక భక్తురాలు ఆయన చేతులు కడుక్కోవడానికి నీళ్ళు పోస్తూవుంటే, ఆమెతో ఏకాంతంగా ఆయన ఇలా అన్నారట : “భగవంతుని పట్ల భక్తి ప్రేమలు పొందాలని ఆశించి జనం ఇక్కడకు వస్తారు. తన ఆస్తిపాస్తుల పరిష్కారానికి ఇక్కడికి వచ్చింది ఆ స్త్రీ! ఆ దురుద్దేశంతోనే మామిడిపళ్ళు, మిఠాయిలు తీసుకువచ్చింది; వాటిలో ఒక్క ముక్క కూడా నేను నోటపెట్టలేదు. నేడు స్నానయాత్రోత్సవం. గత స్నానయాత్ర దినాలలో ఎంతటి భావపారవశ్యంలో మునిగి ఉండేవాణ్ణి! ఆ భావపారవశ్యం జనింపచేసిన మత్తు రెండు మూడు రోజుల దాకా కొనసాగేది. ఈ రోజు భావపారవశ్యం కలిగితే ఒట్టు! నానారకాల వ్యక్తుల సంసర్గం, ఇక్కడి వాతావరణం కారణంగా ఉన్నత భావాలు జనించలేదు.”
‘అ’ తల్లి నాటి రాత్రి కూడా దక్షిణేశ్వరంలో ఉండిపోవడంతో శ్రీరామకృష్ణుల విసుగు రాత్రి సైతం ఉపశమించలేదు. రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఒక భక్తురాలితో ఆయన “ఇంతమంది స్త్రీలు ఇక్కడ గుమిగూడడం మంచిది కాదు. మథుర్బాబు కుమారుడు త్రైలోక్యుడు ఇక్కడే ఉన్నాడు. దీన్ని చూసి అతడు ఏమనుకొంటాడు? అప్పుడప్పుడు ఏదో ఒకరిద్దరు వచ్చి ఒకటి రెండు రోజులు బసచేసిపోతే ఫరవాలేదు. కాని గుంపుగా ఉండిపోతే ఎలా? ఆడవాళ్ళ రద్దీని నేను భరించలేను” అని అన్నారు.
తమ కారణంగా శ్రీరామకృష్ణులు బాగా విసుగుచెంది ఉన్నారని గ్రహించి భక్తురాండ్రు ఖీన్నులై, తెల్లవారగానే కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయారు. కాళికాలయంలో విశేషపూజ, యాత్ర, నైవేద్యాదులతో స్నానయాత్రోత్సవం నాడు ఎంతో వైభవంగా జరిగింది; కాని భక్తులు పై కారణంగా పెద్దగా ఆనందించలేక పోయారు.
ఎడతెగకుండా ఉన్నతభావభూములలో నెలకొని ఉంటున్నప్పటికీ, దైనందిన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన ఎంత నిశితంగా గమనించే వారో, భక్తుల హితవు కోసం ఆయన వారిని ఎలా శాసిస్తూ నిర్దేశిస్తూ ఉండేవారో పై సంఘటన నుండి పాఠకులు కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు.