1. నరేంద్రుడు న్యాయవాద వృత్తిలో శిక్షణ పొందడం
నరేంద్రుడు ఏకాంతవాసంలోను, అధ్యయనంలోను, జపతపాదులలోను, దక్షిణేశ్వరానికి వెళ్ళివస్తుండటంలోను కాలం గడపసాగాడు. కుమారుని భవిష్యత్తు గురించి యోచించి నరేంద్రుడి తండ్రి అతణ్ణి న్యాయవాద వృత్తిని నేర్చుకోవడానికి ఆ కాలంలో కలకత్తాలో సుప్రసిద్ధ న్యాయవాదియైన నిమాయ్చరణ్ బసు వద్ద నియుక్తుణ్ణి చేశాడు. లౌకిక జీవితంలో కుమారుణ్ణి స్థిరపరచి, అతడికి వివాహం చేయగోరి వధువు కోసం వెతకసాగాడు. కాని వివాహం చేసుకోనని నరేంద్రుడు భీష్మించుకొని కూర్చోవడంతోనూ, యుక్తమైన వధువు లభించక పోవడంతోనూ నరేంద్రుని వివాహ ప్రయత్నాలు ఆలస్యం కాసాగాయి.
2. జీవితాంతం బ్రహ్మచర్యం పాటించాలన్న నరేంద్రుని తీర్మానం
శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు రాంతను బసు వీథిలోని నరేంద్రుడు అధ్యయనం చేసే గదికి వచ్చి సాధనను గురించి అతడికి వివిధ ఉపదేశాలు ఇచ్చేవారు. తల్లిదండ్రుల శోకపూరిత ప్రోద్బలానికి తలవొగ్గి వివాహబంధంలో ఇరుక్కోకూడదనే ఉద్దేశంతో కఠోర బ్రహ్మచర్యాన్ని పాటించమని ఆయన నరేంద్రుణ్ణి ఉత్తేజపరచడం కద్దు. శ్రీరామకృష్ణులు అతడికి ఇలా చెప్పేవారు : “పన్నెండేళ్ళు అవిచ్ఛిన్న బ్రహ్మచర్యం పాటించిన వ్యక్తిలో ‘మేధానాడి’ తెరచుకొంటుంది. అప్పుడు అతడి బుద్ధి అతి సూక్ష్మ తత్త్వాలలోకి చొచ్చుకొనిపోయి, వాటిని ఆకళింపు చేసుకోగలుగుతుంది. అటువంటి బుద్ధి సహాయంతో మాత్రమే భగవత్సాక్షాత్కారం లభిస్తుంది. అటువంటి శుద్ధబుద్ధికి మాత్రమే భగవంతుడు తనను వ్యక్తపరచుకొంటాడు.”
3. నరేంద్రుడు సన్న్యాసి అవుతాడేమోనని కుటుంబసభ్యులు భయాందోళనలు చెందడం
శ్రీరామకృష్ణులతో గల సన్నిహిత సాంగత్యం కారణంగానే నరేంద్రుడు వివాహానికి అంగీకరించడం లేదని అతడి ఇంట్లోని స్త్రీజనం అభిప్రాయపడసాగారు. దీనిని గురించి నరేంద్రుడు ఇలా చెప్పాడు : “ఒకరోజు శ్రీరామకృష్ణులు నేను చదువుకొంటున్న గదికి వచ్చి జీవితాంతం బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించమని నాకు ఉపదేశిస్తూండగా, బయటి నుండి మా అమ్మమ్మ అంతా విని, నా తల్లితండ్రులకు ఆ విషయం చెప్పేసింది. ఒక సాధువుతో కలసిమెలసి ఉండడం వలన నే నెక్కడ సన్న్యాసిని అయిపోతానేమోనని, ఆనాటి నుండి నా వివాహం కోసం విశ్వప్రయత్నాలు చేయసాగారు. అయినా ఏం ప్రయోజనం? శ్రీరామకృష్ణుల దృఢసంకల్పం ముందు ఆ ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అయినా అంతా నిశ్చయమైపోయిన తరువాత కూడా ఏవో కొన్ని అల్ప విషయాలలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో వివాహాలు ఆగిపోవడం మనం చూస్తున్నాం కదా!”
4. యథాప్రకారం శ్రీరామకృష్ణులను నరేంద్రుడు దర్శిస్తూనే ఉండడం
నరేంద్రుడు తరచు దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను ఆ విధంగా దర్శిస్తూ ఉండడం ఇంట్లో ఎవరికీ నచ్చకపోయినా, ఆ విషయం గురించి అతడితో మాట్లాడడానికి ఎవరూ సాహసించలేదు. తల్లితండ్రులకు అల్లారు ముద్దు బిడ్డడైన నరేంద్రుడు తన ప్రవర్తన పట్ల ఎవరైనా ప్రతిబంధకం కల్పిస్తే, ఏమాత్రం లక్ష్యపెట్టేవాడు కాడు; ప్రతి విషయంలోను తన ఇచ్ఛమేరకే ప్రవర్తించడం నరేంద్రుడికి పరిపాటి. ఒక బాలుణ్ణి లేదా దుర్బల మనస్కుడైన యువకుణ్ణి మందలించి అరికట్టేటట్లు వివేకవంతుడైన నరేంద్రుణ్ణి అదుపులో పెట్టడానికి ప్రయత్నిస్తే తత్ఫలితం తాము ఆశించినదానికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుందని ఇంట్లోని వారందరికీ బాగా తెలుసు. కాబట్టి నరేంద్రుడు నిరాటంకంగా ఎప్పటిలాగే దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులను దర్శించుకొనేవాడు.
5. శ్రీరామకృష్ణుల సాంగత్యంలో నరేంద్రుడు
ఈ కాలఘట్టంలో దక్షిణేశ్వరం వద్ద శ్రీరామకృష్ణులతో గడపిన రోజుల మధురస్మృతులు నరేంద్రుణ్ణి జీవితపర్యంతం పరమానందంలో ముంచివేశాయి అనడం అతిశయోక్తి కాదు. ఆ విషయంగా నరేంద్రుడు ఇలా చెప్పేవాడు: “శ్రీరామకృష్ణుల సహచర్యంలో నేను ఎంత పరమానందభరితుడనై ఆ రోజులు గడిపానో ఇతరులకు వర్ణించి చెప్పడం అసాధ్యం. ఆటపాటల ద్వారా, హాస్యవినోదాల ద్వారా, దైనందిన సంఘటనల ద్వారా నిరంతరం ఉన్నత ఆధ్యాత్మిక తత్త్వాలను మాకు బోధిస్తూ, మాకు ఏమాత్రం తెలియకుండా మా జీవితాలను తదనుగుణంగా ఆయన ఎలా మలచారో తలచుకొంటే ఆశ్చర్యపోక తప్పదు. ప్రావీణ్యుడైన మల్లుడు, ఒక బాలుడికి మల్లయుద్ధం నేర్పుతున్నప్పుడు, మల్లయుద్ధంలో తన నైపుణ్యాన్ని యావత్తు ప్రదర్శించి చూపడు. ఆ కుఱ్ఱవాడు నేర్చుకోవడానికి కావలసినంత మేరకే తన కౌశలాన్ని ప్రదర్శిస్తాడు. కొన్ని సమయాలలో ఆ కుఱ్ఱవాణ్ణి తాను ఎంతో ప్రయాసపడి జయించినట్లుగా, మరికొన్ని సమయాలలో అతడి చేతిలో తాను ఓడిపోయినట్లుగా కనిపిస్తూ, నెమ్మదిగా ఆ కుర్రవాడిలో ఆత్మవిశ్వాసాన్ని జనింపచేస్తాడు. మాకు బోధించడంలో శ్రీరామకృష్ణులు అదే వైఖరిని పాటించేవారు. ఆయన సదా, ‘బిందువులో సింధువును’* గాంచేవారు. మా హృదయాలలో నిబిడీకృతమై ఉన్న ఆధ్యాత్మిక బీజాలు, ఎలా ఒకనాడు ఫలపుష్పభరిత వృక్షాలుగా పెంపొందుతాయో ఆయన భావసమాధ్యవస్థలో చూడగలిగేవారు. కాబట్టే సదా సర్వవేళలా, అన్ని రీతుల్లోను మమ్మల్ని ప్రశంసిస్తూ, ఉత్తేజపరిచేవారు. అయినప్పటికీ మా ప్రతి చర్యనూ సునిశితంగా గమనిస్తూ, మేం ఎక్కడ కోర్కెలనే వలలో చిక్కువడి లక్ష్యభ్రష్టులమౌతామోనని సదా సముచిత ఉపదేశాలనిస్తూ మమ్మల్ని అదుపులో ఉంచడానికి ప్రయత్నించేవారు. కాని ఆయన అలా మమ్మల్ని సునిశితంగా గమనిస్తున్నారనీ, నియంత్రిస్తున్నారనీ మాకు అసలు అప్పుడు తెలియరాలేదు. మాకు అలా బోధించడంలో, మా జీవితాలను సముచిత రీతిలో తీర్చిదిద్దడంలో శ్రీరామకృష్ణులు ప్రదర్శించిన కౌశలం అద్భుతం!
“ధ్యాన సమయంలో మనస్సు ఒకింత ఏకాగ్రతను పొందినప్పటికీ, సముచిత ధ్యేయం కొరవడినందున పరిపూర్ణంగా ఏకాగ్రం అయ్యేది కాదు. అటువంటి సమయంలో మేం ఏం చేయాలో ఆయనను అడిగాం. అందుకు ఆయన అటువంటి పరిస్థితిలో తాము స్వయంగా గతంలో ఏం చేశారో మాకు తెలియచేయడమే కాకుండా, ఉపయోగకరమైన పలు విధానాలను కూడా సూచించారు. ఒకసారి బ్రహ్మముహూర్తంలో ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు ఆలంబజార్లోని జనపనార కర్మాగారం నుండి వెలువడే ఈలవంటి ధ్వని నా మనస్సుకు ఎంతో అవరోధం కలిగించడం నాకు బాగా జ్ఞాపకం. ఈ విషయం గురించి ఆయనతో ప్రస్తావించాను. అప్పుడు ఆయన ఆ ధ్వని మీదనే మనస్సును ఏకాగ్రం చేయమని చెప్పారు. అట్లే చేసి సత్ఫలితాన్ని పొందాను.”
“మరొక సందర్భంలో దేహాన్ని విస్మరించి మనస్సును ధ్యేయం మీద ఏకాగ్రం చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో, ఆయనకు ఆ విషయాన్ని తెలిపాను. తాము వేదాంతమార్గాన్ని అనుసరించి సాధన చేస్తున్నప్పుడు, తమ గురువులైన తోతాపురి ఏం ఉపదేశం చేశారో దాన్ని గుర్తుకు తెచ్చుకొని, నా భ్రూమధ్యంలో తమ గోటితో బాగా గీరి, ఆ నొప్పి మీద మనస్సును ఏకాగ్రం చేయమని ఆయన నన్ను ఆదేశించారు. నిజానికి ఇష్టమొచ్చినంతసేపు ఆ నొప్పి మీద ఒకే రీతిగా మనస్సును కేంద్రీకరించగలిగాను. తత్ఫలితంగా నా శరీరంలోని తక్కిన భాగాల ఉనికే నాకు స్ఫురించలేదు సరికదా, వాటి వల్ల మనస్సుకు ఎలాంటి అవరోధమూ ఏర్పడలేదు.”
“గురుదేవులు సాధనలు చేసిన పంచవటి నిర్జన ప్రాంతం కావడం వలన ఆ చోటు మా ధ్యానసాధనాదులకు ఎంతో అనుకూలమై అమరింది. ఆధ్యాత్మిక సాధనలకు మాత్రమేనని ఎందుకు చెప్పాలి? మేం అక్కడ ఆటపాటల వినోదాలతో ఎంతో సమయం గడపివున్నాం. అటువంటి సందర్భాలలో శ్రీరామకృష్ణులు కూడా మాతో జతకలిసి మా ఆనందాన్ని ఇనుమడింప చేసేవారు. మేం పరుగులు తీసేవారం, చెట్లు ఎక్కేవారం, మాధవీలతల ఉయ్యాలలో ఊగేవారం. కొన్ని సందర్భాలలో అక్కడే వనభోజనాలు చేసేవారం. అటువంటి ఒక సందర్భంలో స్వహస్తాలతో నేను వండిన వంటకాలను స్వయంగా శ్రీరామకృష్ణులు ఆరగించారు. బ్రాహ్మణేతరులు వండిన వంటకాలను ఆయన భుజించరని నాకు తెలుసు. కాబట్టే ఆలయ నైవేద్యాన్ని ఆయన కోసం ఏర్పాటు చేద్దామనుకొన్నాను. కాని అలా చేయవద్దని నన్ను వారించి, “సత్త్వగుణ సంపన్నుడవైన నీ వంటి వ్యక్తి వండిన భోజనం తిన్నా నాకేమీ కాదు” అని చెప్పారు. పదే పదే నేను వద్దంటూవున్నా ఆయన నా విన్నపాలు పట్టించుకోకుండా, నేను వండిన భోజనం ఆరగించారు.”
6. భవనాథ్ ప్రభృత నరేంద్రుని బారానగర మిత్రులు
భవనాథ్ ఛట్టోపాధ్యాయ అనే వ్యక్తి భక్తుడే కాక అందగాడు కూడా. ఒకింత కాలంగా అతడు దక్షిణేశ్వరానికి వస్తూ శ్రీరామకృష్ణులను దర్శించుకోసాగాడు. భక్తి, విశ్వాసం, వినయవిధేయతలు, సరళత్వం వంటి సుగుణాలు సంతరించుకొన్న కారణంగా అతడు శ్రీరామకృష్ణులకు ప్రీతిపాత్రుడయ్యాడు. అతడికి నరేంద్రునితో పరిచయమై, మెల్లగా ఆ పరిచయం స్నేహంగా మారింది. అతడికి గల స్త్రీల వంటి కోమలత్వాన్ని, నరేంద్రుని పట్ల అతడికి ఉన్న అసాధారణ ప్రేమను చూసి శ్రీరామకృష్ణులు కొన్ని సమయాలలో, “బహుశా పూర్వజన్మలో నువ్వు నరేంద్రుడి భార్యవై ఉండి ఉంటావు” అని ఎగతాళిగా అనేవారు. భవనాథ్ బారానగరంలో ఉండేవాడు. అవకాశం దొరికినప్పుడల్లా నరేంద్రుణ్ణి భోజనానికి తన ఇంటికి తోడ్కొని వెళ్ళేవాడు. భవనాథ్ పొరుగింటి వాడైన సత్కారి లాహరికి కూడా నరేంద్రుడితో బాగా పరిచయం ఉంది. అలాగే దాశరథి సన్యాల్, నరేంద్రుడి సహాధ్యాయి, మిత్రుడు. నరేంద్రుడికి తీరిక దొరికినప్పుడు ఈ మిత్రులందరూ రాత్రింబవళ్ళు అతడితో గడపడం కద్దు. కాబట్టి అప్పుడప్పుడు దక్షిణేశ్వరానికి వెళ్ళిన రోజులలోనో లేదా ప్రత్యేక సందర్భాలలో వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొనో ఈ బారానగర మిత్రులతో కొంత సమయం గడపడం నరేంద్రుడికి పరిపాటి.
7. నరేంద్రుని తండ్రి హఠాన్మరణం
1884 వ సం ॥ తొలికాలంలో, బి.ఏ. పరీక్షా ఫలితాలు వెలువడడానికి కొద్దికాలం మునుపు సాఫీగా సాగిపోతున్న నరేంద్రుని జీవితంపై పిడుగు పడింది. అతడి తండ్రియైన విశ్వనాథ్ దత్తాకు అంతకు ముందు పనిఒత్తిడి కారణంగా నాడీవ్యవస్థ దెబ్బతింది. ఒకనాటి రాత్రి దాదాపు పదిగంటలప్పుడు ఆయన హఠాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మిత్రుల ఆహ్వానం మేరకు నాటి మధ్యాహ్నం నరేంద్రుడు బారానగర్కు వెళ్ళి, రాత్రి పదకొండు గంటల దాకా భక్తిగీతాలు ఆలపిస్తూ అక్కడే గడిపి, భోజనం చేసి, మిత్రులతో మాట్లాడుతూ పడుకొన్నాడు. తెల్లవారుజాము రెండు గంటలప్పుడు అతడి మిత్రుడైన హేమాలి అక్కడకు వచ్చి తండ్రి ఆకస్మిక మరణవార్తను నరేంద్రునికి చేరవేశాడు. వెంటనే నరేంద్రుడు ఇంటికి బయలుదేరాడు.
8. నరేంద్రుని లౌకిక పరిస్థితులలో శోచనీయ మార్పు
నరేంద్రుడు ఇంటికి వెళ్ళి తండ్రి అంత్యక్రియలు యథావిధిగా పూర్తి చేశాడు. ఆ తరువాత వాకబు చేయగా కుటుంబ ఆర్థిక పరిస్థితులు కడు శోచనీయ స్థితిలో ఉన్నట్లు నరేంద్రుడికి తెలియవచ్చింది. సంపాదన కంటే అధికంగా ఖర్చు పెట్టడం వల్ల ఆస్తిపాస్తులు మిగల్చకపోగా, అప్పులు మాత్రం మిగిల్చిపోయాడు నరేంద్రుని తండ్రి. నరేంద్రుని తండ్రి సహాయంతో వాళ్ళ బంధువులు తమ ఆర్థిక పరిస్థితులను ఎంతో మెరుగుపరచుకొన్నారు. అందుకు నరేంద్రుని కుటుంబం పట్ల కృతజ్ఞతగా ఉండడానికి బదులు, అప్పటి ఆ కుటుంబ నిస్సహాయ పరిస్థితిని ఎరగా చేసుకొని స్వార్థలాభం పొందగోరారు. వాళ్ళు శత్రుత్వం పూని నరేంద్రుని కుటుంబాన్ని ఇంటి నుండి పారద్రోల కుట్ర కూడా పన్నారు. పైసా ఆదాయం లేకపోయినా ఆ ఇక్కట్లో అయిదారు మందిని పోషించవలసి వచ్చింది. ఉన్నత జీవనప్రమాణాలతో పెరిగి పెద్దవాడైన నరేంద్రుడు అప్పుడు నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కుటుంబాన్ని పోషించడానికి ఏం చేయాలో అతడికి పాలుపోలేదు. ఉద్యోగార్థం గడపలెక్కసాగాడు గాని, ప్రతిచోట చుక్కే ఎదురైంది. దుర్దశ దాపురించినప్పుడు మనిషి చేసే శతకోటి ప్రయత్నాలూ విఫలమే అవుతాయన్నది ముమ్మాటికీ సత్యం. తండ్రి మరణించాక మూడు నాలుగు నెలలు భారంగా గడిచిపోయాయి. కాని పేదరికం, అనిశ్చితి అనే కారుమబ్బులు క్రమ్ముకొన్న నరేంద్రుని జీవిత ఆకాశంలో ఒక్క ఆశాకిరణమైనా పొడచూపలేదు. మళ్ళీ అతడెప్పుడైనా అటువంటి గాఢాంధకార జీవితాన్ని చవిచూసి ఉంటాడా అన్నది సందేహమే! ఆ కాలఘట్టాన్ని గురించి మాట్లాడుతూ అతడు కొన్ని సమయాలలో మాతో ఇలా చెప్పేవాడు :
9. ఆ దుర్దశ వర్ణన
“మైల గడువు పూర్తికాక మునుపే నేను అక్కడా ఇక్కడా ఉద్యోగం కోసం తిరుగాడాను. పస్తు కడుపుతో, ఉత్త కాళ్ళతో ఉద్యోగం కోసం దరఖాస్తు చేతపుచ్చుకొని మధ్యాహ్నపు మండుటెండలో కార్యాలయాల చుట్టూ తిరుగాడాను. ఆప్తమిత్రులు కొందరు సానుభూతితో కొన్ని రోజులు నాతోనే ఉండేవారు, కాని కొన్ని రోజులు నాతో ఉండలేకపోయేవారు. కాని ప్రతిచోట నాకు నిరాశానిస్పృహలే ఎదురైనాయి. ఆ కఠోర లౌకిక వాస్తవాల ప్రప్రథమ అనుభవంతో నిస్వార్థసానుభూతి ఎంతో అరుదైనదనీ, దుర్బలులకూ పేదలకూ ఇక్కడ స్థానంలేదనీ నాకు బాగా అర్థమైంది. ఇదివరలో ఒకటి రెండు రోజులు నాకు సహాయం చేసినందుకు తాము కృతార్థులమైనట్లు భావించిన వారు ఇప్పుడు అందుకు విరుద్ధంగా చేయడమే సబబని భావించసాగారు. సహాయం చేయగల స్థితిలో ఉండి కూడా వాళ్ళు నా పట్ల పెడమొఖం చూపసాగారు. అటువంటి చేదు అనుభవాలు చవిచూసేకొద్దీ, నాకు ఈ లోకం ఒక రాక్షసుని సృష్టిగా అనిపించేది. ఒక రోజు మిట్టమధ్యాహ్నం మండుటెండలో తిరిగి తిరిగి పాదాలు బొబ్బలెక్కాయి; అలసిసొలసి మైదానంలోని ‘ఓక్టెర్లోని’ స్మారకచిహ్న కట్టడం నీడలో విశ్రమించాను. ఆ రోజు ఒకరిద్దరు మిత్రులు నాతోపాటు ఉన్నారు. లేదా అనుకోకుండా అక్కడ కలుసుకోవడమో జరిగింది. వారిలో ఒకడు నన్ను అనునయించడానికి కాబోలు, “కృపాళువైన బ్రహ్మ శ్వాస అనే పిల్ల వాయువు వీచసాగింది….” అనే పాట పాడసాగాడు. ఆ పాట వినగానే అతడు నా తలమీద గట్టిదెబ్బలు కొడుతున్నట్లు భావించాను. నా తల్లి, తమ్ముల నిస్సహాయ స్థితి గుర్తుకు వచ్చి, అవమానంతో నిరాశ నిస్పృహలు ముప్పిరిగొనగా, ‘నోరు ముయ్యి, ఎవరికి ఆకలి బాధతో అలమటించే అవసరంలేదో అటువంటి భాగ్యవంతులకు ఈ కల్పనలు మధురంగా కానరావచ్చు. ఒకప్పుడు నాకూ అలాగే అనిపించేది. కాని ఇప్పుడు కఠోర వాస్తవాలు ఎదురైనప్పుడు ఆ కల్పనలు అపహాస్యంగా తోస్తున్నాయి’ అంటూ అరచాను.
10. కటిక దారిద్ర్యం
“నా మాటలు విని ఆ మిత్రుడు ఎంతో నొచ్చుకొన్నాడేమో! కాని ఎంతటి కటిక దారిద్ర్యం అనుభవిస్తూ ఉంటే ఆ మాటలు నా నోట వెలువడి ఉంటాయో అతడికెలా అర్థమౌతుంది? ఒక్కోరోజు నిద్రలేచి రహస్యంగా ఆరా తీయగా ఇంట్లో అందరికీ చాలినంత ఆహారం లేకపోవడం తెలుసుకొని, చేత చిల్లిగవ్వ లేకపోవడంతో, ‘ఒక మిత్రుడు భోజనానికి తన ఇంటికి ఆహ్వానించా’ డని అమ్మతో చెప్పి, బయటకు వెళ్ళిపోయేవాణ్ణి. అటువంటి సందర్భాలలో ఒక్కొక్కప్పుడు ఏదో కొంత తినేవాణ్ణి; కొన్ని రోజులు ఇంట్లోని తక్కినవారికి సరిపడే ఆహారం ఉంటుందనే ఉద్దేశంతో పస్తులతోనే గడిపేవాణ్ణి. ఇంట్లో వారికి లేదా బయటివారికి ఈ విషయాలు తెలపడానికి అభిమానం అడ్డుపడేది. ఇంతకు ముందు మాదిరే సంపన్నులైన మిత్రులు తమ ఇళ్ళకు లేదా ఉద్యానాలకు వచ్చి నా పాటలతో తమ ఆనందాన్ని ఇనుమడింపచేయమని కోరేవారు. వారి కోర్కెను తిరస్కరించలేక, కొన్ని సమయాలలో వారితోబాటు వెళ్ళి, నా పాటలతో వారిని సంతోషపరచేవాణ్ణి. కాని నా మనస్సులోని భావాలను వారికి వ్యక్తపరచాలని అభిలషించేవాణ్ణి కాను. నా పరిస్థితి గురించి తమకు తాముగా వారెన్నడూ విచారించేవారు కాదు. ఏ ఒకరిద్దరో అప్పుడప్పుడు ఆప్యాయంగా, ‘ఈ రోజు నువ్వెందుకు నిరుత్సాహంగా, బలహీనంగా కనిపిస్తున్నావు? కారణం ఏమిటో దయచేసి చెప్పు’ అని అడిగేవారు. వారిలో ఒక మిత్రుడు, ఇంకొక మిత్రుడి ద్వారా నా పరిస్థితి తెలుసుకొని, అజ్ఞాతంగా మా అమ్మకు ఉత్తరాలు వ్రాస్తూ డబ్బు పంపసాగాడు. ఈ విధంగా అతడు నన్ను శాశ్వత ఋణబద్ధుణ్ణి చేసివేశాడు.
11. స్త్రీల ప్రలోభం
“యౌవనంలో నైతికతను కోల్పోయి మోసంతో ధనం ఆర్జిస్తున్న కొందరు నా బాల్యమిత్రులు నా దారిద్ర్యావస్థను గురించి తెలుసుకొని, ఇదే అదనుగా నన్ను తమతో కలుపుకోవాలని ప్రయత్నించసాగారు. కాని దురదృష్టవశాత్తు అభాగ్యులై మోసంతో జీవనం సాగిస్తున్న కొందరు మాత్రం నా పరిస్థితికి నిజంగానే బాధపడడం నేను గుర్తించాను. “ఇక ‘మహామాయ’ కూడా నా విషయంలో వెనుకంజవేయలేదు. నన్ను ప్రలోభంలో మునిగిపోయేలా చేయడానికి ఆమెకూ ఇదే చక్కని అదను. చాలా కాలం నుంచి ఒక సంపన్నురాలికి నా మీద ఒక కన్ను ఉంది. తనతో పాటు తన యావదాస్తులనూ పరిగ్రహించి నా దారిద్ర్యాన్ని రూపుమాపుకోమని ఆమె ఒక ప్రతిపాదనను పంపింది. అసహ్యంతో నిష్కర్షగా ఆమె ప్రతిపాదనను తిరస్కరించాను. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక స్త్రీ ఇదే విధంగా ఆకర్షిస్తూ నా వద్దకు వచ్చింది. ఆమెతో ఇలా అన్నాను: “అమ్మా, ఈ నిరర్థక శరీర సుఖం నిమిత్తం ఎన్నెన్ని పాపాలకు ఒడిగట్టావో కదా! మృత్యువు సమీపంలోనే ఉంది. ఆ రోజుకు తగిన సన్నాహాలు ఏమైనా చేసివుంచావా? తుచ్ఛమైన కోరికలను విడిచిపెట్టి, భగవంతుణ్ణి ప్రార్థించు.”
12. తల్లి మందలింపు
“అటువంటి కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నప్పటికీ భగవంతుని ఉనికి పట్ల నాకున్న విశ్వాసం సడలిపోలేదు; ‘దేవుడు మంచివాడు కాద’ నీ సందేహించ లేదు. తెల్లవారగానే భగవన్నామాన్ని స్మరిస్తూ నిద్ర నుండి లేచేవాణ్ణి. ఆ తరువాత దృఢనిశ్చయంతో, గంపెడాశతో ఉద్యోగ అన్వేషణకై బయలుదేరేవాణ్ణి. ఈ అలవాటు ప్రకారం ఒక రోజు భగవన్నామాన్ని స్మరిస్తూ నిద్ర నుండి లేవబోతూండగా, మా అమ్మ నా పలుకులు ప్రక్క గది నుండి విని హఠాత్తుగా ఇలా అంది : ‘ఆపరా, ఆపు! చిన్నప్పటి నుండి నువ్వు దేవుడు దేవుడని అఘోరిస్తున్నావే! మరి ఆ దేవుడు నీకు ఏం చేసిపెట్టాడు?’ అమ్మ ఈ మాటలు నన్ను అమితంగా గాయపరిచాయి. బాధతో సతమతమౌతూ నాలో నేనిలా అనుకొన్నాను: ‘దేవుడు నిజంగానే ఉన్నాడా? అలా ఉండివుంటే మనిషి శోకమయ ప్రార్థనను ఆలకిస్తాడా? ఆలకించేవాడే అయితే నేనింతగా ప్రార్థిస్తున్నా ఆయన నుండి ఎలాంటి స్పందనా ఎందుకు రావడంలేదు? కృపాళువైన ఆయన సృష్టిలో ఇంత బాధలు ఎందుకున్నాయి? పరమానందమే మూర్తీభవించిన భగవంతుని రాజ్యంలో ఇంత ఘోరదుర్ఘటనలు, దుఃఖాలు ఎందుకు సంభవిస్తున్నాయి?’ ఇతరుల కష్టాలు చూసి బాధపడ్డ విద్యాసాగర్, ‘నిజంగా దేవుడు దయామయుడూ, మంగళమయుడూ అయితే లక్షలాది జనం కరువుకాటకాల వాతబడి, నాలుగు మెతుకులు దొరక్క చావడం ఎందుకు?’ అన్న మాటలు నా చెవుల్లో మార్మ్రోగాయి. భక్తిభావన చేత గాయపడిన మనస్సు నా హృదయాన్ని తొలిచివేయడమే గాక; భగవంతుని ఉనికి పట్ల సంశయం నా మనస్సును ఆక్రమించింది.
13. గాయపడిన అభిమానం కారణంగా నాస్తికత్వం జనించడం
“దేనినైనా రహస్యంగా చేయడం నా స్వభావానికి విరుద్ధం. చిన్నతనం నుండి భయపడిగాని, మరో కారణం వలన గాని నా ఆలోచనలను దాచుకొనే అలవాటు నాకు లేదు. నన్ను ఆవహించిన ఆ భావోద్వేగంలో భగవంతుడు లేడనీ, ఒకవేళ ఉన్నా ఆయనను ప్రార్థించడం వృథా కనుక ఆ అవసరం లేదనీ ప్రజల ముందు కెళ్ళి నేను ఋజువుపరచడానికి ప్రయత్నించడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. దీనివల్ల నేనొక నాస్తికుణ్ణయ్యాననీ, దుష్టులతో సహవాసం చేస్తున్నాననీ, త్రాగుడికీ, వేశ్యాగృహాలకు వెళ్ళడానికి సైతమూ వెనుకంజ వేయడం లేదనీ ఒక పుకారు బయలుదేరింది. ఆ అసత్య ప్రచారం విని అంతగా మృదువు కాని నా గుండె మరింత కర్కశమైంది. ఫలితంగా అడగని వారిని సైతం పిలిచి, ‘దుఃఖ భూయిష్టమైన ఈ సంసారంలో తమ కష్టాలను క్షణికంగానైనా మరచిపోవడం కోసం ఎవరైనా మధువు గ్రోలి, వేశ్యాగృహాలకు వెళ్ళి తాను సుఖపడుతున్నానని నిజంగా భావిస్తే నా కెలాంటి అభ్యంతరమూ లేదు. పైగా వారి మాదిరిగా సుఖపడగలుగుతానని నిస్సందేహంగా నమ్మిననాడు నేను కూడా అలా చేయడానికి వెనుకాడను’ అని బహిరంగంగా ప్రకటించసాగాను.
14. నరేంద్రుని శీలం పట్ల శ్రీరామకృష్ణుల విశ్వాసం
“వార్తలు వాయువేగంతో పయనిస్తాయి. నా ఈ మాటలు వికృతరూపం దాల్చి దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణులకూ, అలాగే కలకత్తాలోని భక్తులకూ చేరడానికి ఎంతో సమయం పట్టలేదు. నా యథార్థ పరిస్థితిని నిర్ధారణ చేసుకోవడానికి కొందరు నన్ను చూడడానికి వచ్చారు. వీరు నా గురించి ప్రచారంలోకి వచ్చిన వార్తలను కొంతలోకొంత నమ్ముతున్నామని సూచనలతో నాకు తెలియచేశారు. నేనంతగా దిగజారిపోయానని వారు నమ్ముతున్నారని తెలుసుకోగానే నా హృదయం ఎంతో గాయపడింది. అది నన్ను దైవ వ్యతిరేక ప్రచారానికి పురిగొల్పింది. శిక్షిస్తాడనే భయంతో భగవంతుడు ఉన్నాడని అంగీకరించడం మహాదౌర్బల్యం అని ఋజువు పరచ ప్రయత్నించాను. హ్యూం, మిల్, బెన్, కోమ్టే మొదలైన పాశ్చాత్య తత్త్వవేత్తలను ఉదాహరిస్తూ, అసలు భగవంతుని ఉనికికి ఎలాంటి ఋజుమా లేదని వారితో ప్రచండంగా వాదించ నారంభించాను. దానితో నేను పతనమైపోయాననే వారి అభిప్రాయం మరింత రూఢియైంది. వీరి ముఖతా ఈ విషయం విని శ్రీరామకృష్ణులు కూడా బహుశా నమ్ముతారని అనుకొని నేను సంతోషించాను. అలా ఊహించుకొన్న తక్షణం నా హృదయం గాయపడ్డ భావం నుండి జనించిన విషాద భావనతో నిండిపోయింది. ‘గురుదేవులు నన్ను గురించి ఏమైనా అనుకోను గాక! మనుషుల మంచి చెడు అభిప్రాయాలకు అసలు ఏ విలువా లేనప్పుడు వారు ఏం అనుకొన్నా నాకు ఒరగబోయేది ఏమీ లేదు’ అనే నిర్ణయానికి వచ్చాను.
“కాని జరిగింది ఏమిటో ఆ తరువాత విని ఆశ్చర్యచకితుడనయ్యాను. ఆ భక్తుల నుండి నన్ను గురించి విని అవును, కాదు అని ఏమీ చెప్పకుండానే శ్రీరామకృష్ణులు ఊరకనే ఉండిపోయారట. కాని భవనాథ్ విలపిస్తూ, ‘మహాశయా, నరేంద్రుడు ఇంతగా దిగజారిపోతాడని కలలో సైతం ఊహించలేదు’ అని చెప్పినప్పుడు, ఆయన ఉద్రిక్తులై, ‘నోరు ముయ్యి! నరేంద్రుడు ఎన్నటికీ ఆ విధంగా దిగజారడని అమ్మ నాకు చెప్పింది. మళ్ళీ ఇలాంటి మాటలు చెప్పావో, జాగ్రత్త నీ ముఖం కూడా చూడను’ అని అన్నారట.
15. అవిచ్ఛిన్న అశాంతి
“అయినా గర్వాహంకారాలతో నాస్తిక భావాన్ని అలా ఎంత పెంపొందించుకోదలచినా ఏం ప్రయోజనం? చిన్ననాటి నుండీ, ప్రత్యేకించి శ్రీరామకృష్ణులను దర్శించుకొన్నప్పటి నుండీ నాకు కలిగిన అసాధారణ దివ్యానుభూతులు జాజ్వల్యరూపంలో నా మదిలో మెదలగానే నేను ఇలా అనుకొన్నాను : ‘కచ్చితంగా భగవంతుడు ఉన్నాడు, ఆయనను సాక్షాత్కరించుకొనే మార్గాలూ తప్పకుండా ఉండనే ఉన్నాయి. లేకుంటే బ్రతకడం ఎందుకోసం? బ్రతుకుకు విలువ ఏముంది? జీవితంలో ఎన్ని దుర్భర కష్టాలు ఎదురైనా ఆ మార్గాన్ని అన్వేషించి తప్పక కనుగొనాలి.’ ఇలా రోజులు గడవసాగాయి. సంశయాలతో మనస్సు ఊగిసలాడసాగింది. నా లౌకిక కష్టాలు గట్టెక్కే సూచనలే కనుచూపు మేరలో కానరాలేదు.
16. అద్భుత దర్శనంతో నరేంద్రుడు శాంతి పొందడం
“ఎండాకాలం గడిచి, వర్షాకాలం వచ్చింది. ముందుమాదిరే ఉద్యోగం కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నాను. ఒక రోజు పూర్తిగా పస్తుండిపోయి అలసిపోయిన కాళ్ళను ఈడ్చుకొంటూ, అంతకంటే మరింత అలసిన మనస్సుతో వర్షంలో పూర్తిగా తడిసి రాత్రి ఇంటికి తిరిగివస్తున్నాను. అప్పుడు నాలో ఎంత నిస్సత్తువ కలిగిందంటే, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ప్రక్కనే ఉన్న ఒక ఇంటి వసారాలో కట్టెలా పడిపోయాను. కొంతసేపు పూర్తిగా బాహ్యస్మృతి కోల్పోయా నేమో చెప్పలేను. కాని మనస్సులో రకరకాల ఆలోచనలు, రంగుల చిత్రాలు ఒక్కొక్కటి మెదలుతూ మాయమైనట్లు నాకు జ్ఞాపకం. వాటిని పారద్రోలడానికి లేదా ఒకే ప్రత్యేక ఆలోచన మీదే కేంద్రీకరించడానికి నేను అశక్తుణ్ణయ్యాను. ఆ సమయంలో నాకొక విచిత్రానుభూతి కలిగింది.
“ఏదో ఒక దైవశక్తి నా మనస్సు లోపలి తెరలన్నిటినీ ఒక్కొక్కటిగా పైకెత్తుతూ ఉన్నట్లు అనిపించింది. దయాళువైన భగవంతుని సృష్టిలో ఇన్ని దుఃఖాలూ కష్టాలూ ఎందుకు ఉన్నాయి? భగవంతుడి కఠోర ధర్మం, అనంత కరుణల మధ్య సామరస్యం ఎక్కడ? మొదలైన ఏ సంశయాల నివృత్తికై ఇంతకాలం మనస్సు సతమతమైనదో వాటన్నిటికీ హృదయాంతరాళాల్లో పరిష్కారాలు లభించాయి. దాంతో మనస్సు పరమానందభరితమైంది. ఇంటికి తిరిగిపోతున్నప్పుడు శరీరంలో కించిత్తు అలసట కూడా కనిపించలేదు. నా మనస్సు అపార స్థైర్యాన్ని, శాంతిని సంతరించుకొంది. అప్పుడు దాదాపు తెల్లవారబోతున్నది.
17. సన్న్యసించాలనే నరేంద్రుని సంకల్పం
“లోకుల నిందాప్రస్తుతులకు నేను పూర్తిగా ఉదాసీనుణ్ణయ్యాను. సామాన్యుల మాదిరిగా ధన సంపాదనకు, కుటుంబ పోషణకు, సాంసారిక సుఖాలను అనుభవిస్తూ కాలం గడపటానికి నేను జన్మించ లేదనే గట్టినమ్మకం నాలో పాదుకుపోయింది. దాంతో మా తాతగారిలా సర్వసంగ పరిత్యాగం చేసి సన్న్యాసం పుచ్చుకోవాలని గోప్యంగా సంసిద్ధుణ్ణవసాగాను. ప్రయాణపు రోజు కూడా నిర్ణయించుకొన్నాను. ఆ రోజే శ్రీరామకృష్ణులు కలకత్తాలోని ఒక భక్తుని ఇంటికి వస్తున్నారని తెలిసింది. ఇది మంచి అవకాశం, ఇల్లు విడిచిపెట్టి వెళ్ళే ముందు గురుదేవులను దర్శించుకొంటాను అని అనుకొన్నాను. నేను శ్రీరామకృష్ణులను కలుసుకోగానే, ‘ఈ రోజు నువ్వు నాతో దక్షిణేశ్వరానికి రావాలి’ అని పట్టుబట్టారు. నేను రాలేనని ఎన్నో సాకులు చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదు. ఆయనతో పాటు బండిలో వెళ్ళక తప్ప లేదు. దారిలో పెద్దగా ఏమీ మాట్లాడలేదు. దక్షిణేశ్వరం చేరాక ఇతరులతోపాటు నేను కూడా ఆయన గదిలో కొంతసేపు కూర్చున్నాను. ఇంతలో ఆయన భావ పారవశ్యమగ్నులైనారు. మరుక్షణమే హఠాత్తుగా నా దగ్గరకు వచ్చి, నా చేయి పుచ్చుకొని కళ్ళవెంట కన్నీరు స్రవిస్తూండగా పాడసాగారు :
మాట్లాడడానికీ భయమే
ఊరకనే ఉండాలన్నా భయమే
(నా) మనస్సులో అనుమానం
నిన్ను కోల్పోతానేమోనని – కృష్ణా!
18. శ్రీరామకృష్ణుల విన్నపం మేరకు నరేంద్రుని సంకల్పంలో మార్పు
“నా భావోద్వేగాలను అంతదాకా ఎలాగో అణచుకోగలిగాను. కాని ఇక నా కది సాధ్యం కాలేదు. గురుదేవులలా నా ఛాతీ కూడా అశ్రువులతో తడిసిపోయింది. శ్రీరామకృష్ణులకు అంతా తెలిసిపోయిందని నేను గ్రహించాను. మా ఇద్దరి ప్రవర్తనా చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యచకితులైనారు. ఆయన భావావస్థ నుండి మామూలు స్థితికి వచ్చిన తరువాత ఎవరో దీనిని గురించి ఆయనను అడిగారు. ‘ఇది మా ఇద్దరికీ సంబంధించిన విషయం’ అని ఠక్కున జవాబిచ్చారు. వారందరినీ పంపించివేశాక రాత్రి నన్ను ప్రక్కకు పిలిచి, ‘అమ్మ కార్యం నిమిత్తమే నువ్వు ఈ లోకంలోకి వచ్చావని తెలుసుకో. నువ్వు ఎన్నడూ సాంసారిక జీవితం గడపవు. కాని నా కోసం, నేను బ్రతికి ఉన్నంత వరకు నీ కుటుంబంతోనే ఉండిపో’ అని అన్నారు. ఇలా అంటూ ఉండగా ఆయన కళ్ళవెంట అశ్రువులు ధారగా స్రవించాయి, భావోద్వేగంతో ఆయన కంఠం గద్గదమైంది.
19. దారిద్ర్య ఉపశమనం కోసం నరేంద్రుడు శ్రీరామకృష్ణులను ప్రార్థించడం
“గురుదేవుల వద్ద సెలవు పుచ్చుకొని మర్నాడు ఇంటికి తిరిగి వచ్చాను. మరుక్షణమే కుటుంబం గురించిన ఆలోచనలు మనస్సును నింపివేశాయి. ఇంతకు మునుపు మాదిరే కుటుంబ పోషణ నిమిత్తం ఉద్యోగం కోసం వివిధ ప్రయత్నాలూ చేయసాగాను. ఒక న్యాయవాది కార్యాలయంలో పనిచేశాను, కొన్ని పుస్తకాలు కూడా తర్జుమా చేశాను. ఈ విధంగా ఒకింత ధనం సంపాదించాను, దాంతో కుటుంబ పోషణ ఏదో రకంగా జరిగిపోయింది. కాని అవన్నీ తాత్కాలిక ఉద్యోగాలు. శాశ్వతమైన ఉద్యోగం లేనందున, తల్లీ తమ్ముళ్ళ పోషణకు చక్కని ఏర్పాటు ఏదీ చేయలేకపోయాను. కొన్ని రోజులు ఇలా గడిచిన తరువాత, శ్రీరామకృష్ణుల ప్రార్థనలను భగవంతుడు ఆలకిస్తాడనే విషయం చటుక్కున జ్ఞాపకానికి వచ్చింది. ‘నా కోసం ఆయనను ప్రార్థించమని కోరతాను; దాంతో నా తల్లీతమ్ముళ్ళ అన్నవస్త్రాల కొరత తీరిపోతుంది. ఆయన నా మాటను ఎన్నడూ కాదనరు’ అని అనుకొన్నాను. వెంటనే దక్షిణేశ్వరానికి పరుగుతీశాను. నా తల్లీ తమ్ముళ్ళ దారిద్ర్య బాధ తీరేటందుకు నా కోసం అమ్మను ప్రార్థించమని ఆయనను పదేపదే వేడుకొన్నాను. అందుకు శ్రీరామకృష్ణులు ఆప్యాయంగా, ‘నాయనా, నేను అటువంటి ప్రార్థనలు చేయలేనని నీకు తెలుసుకదా! నీ అంతట నువ్వే అమ్మను ఎందుకు ప్రార్థించకూడదు? అమ్మను నువ్వు అంగీకరించవు; అందుకే నీకిన్ని కష్టాలు’ అని అన్నారు. ఆ మాటలు విని నేను ఇలా చెప్పాను : ‘అమ్మ విషయం నా కేమీ తెలియదు; నా కోసం మీరే దయచేసి అమ్మను ప్రార్థించండి. మీరు తప్పక ప్రార్థించాలి; మీరు ప్రార్థించనంత దాకా మిమ్మల్ని విడిచిపెట్టను.’ ఆప్యాయత అనురాగాలు ఉట్టిపడే స్వరంలో శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు: ‘నీ కష్టాలను బాపమని అమ్మను పలుమార్లు ప్రార్థించాను. కాని ఆమెను నువ్వు అంగీకరించనందున ఆమె నా మొరను ఆలకించలేదు. సరే, ఈ రోజు మంగళవారం, అమ్మకు విశిష్టమైన రోజు. ఈ రోజు నువ్వు ఆమెను ఏం కోరితే దాన్ని అమ్మ ప్రసాదిస్తుందని కచ్చితంగా చెప్పగలను. నేటి రాత్రి ఆలయానికి వెళ్ళి ఆమెను మ్రొక్కి, వరం ప్రసాదించమని ప్రార్థించు. అనురాగమయి అయిన నా తల్లి సాక్షాత్తు బ్రహ్మశక్తి; శుద్ధచైతన్యమూర్తి. సంకల్ప మాత్రాన ఈ విశ్వాన్ని సృజించింది. ఆమె సంకల్పిస్తే చేయలేనిది ఏముంది.’
20. నరేంద్రునికి జగజ్జనని దివ్యదర్శనం
“శ్రీరామకృష్ణులు అంత నిశ్చయంగా చెబుతున్నప్పుడు ప్రార్థించిన మరుక్షణమే నా కష్టాలన్నీ తీరిపోతాయనే గట్టినమ్మకం నాలో జనించింది. ఎంతో ఆశతో రాత్రి కోసం నిరీక్షించసాగాను. మెల్లగా రాత్రి అయింది. మొదటి ప్రహారం గడిచి పోగానే ఆలయానికి వెళ్ళమని గురుదేవులు నన్ను ఆదేశించారు. ఆలయానికి వెళుతూన్నప్పుడు ఒక రకమైన మత్తు నన్ను ఆవహించింది; కాళ్ళు తడబడసాగాయి. తల్లిని తప్పక చూడగలననీ, ఆమె వచనాలు వినగలననీ ప్రగాఢ నమ్మకం నాలో జనించింది. తక్కిన విషయాలన్నీ విస్మరించి, అదే ధ్యాసలో మగ్నుడనై పోయాను. ఆలయంలోకి ప్రవేశించగానే నిజంగా తల్లి చిన్మయమై కానవచ్చింది; సజీవ మూర్తిగా కనిపించింది. నిజంగానే అనంతమైన ప్రేమను, సౌందర్యాన్ని వెదజల్లుతున్నట్లు కంట పడింది. నా హృదయం భక్త్యారాధనతో ఉప్పొంగిపోయింది. ఆ తల్లి పాదపద్మాలకు పదేపదే ప్రణమిల్లుతూ, ‘అమ్మా, వివేకాన్ని ప్రసాదించు, వైరాగ్యాన్ని అనుగ్రహించు, భక్తిజ్ఞానాలను ప్రసాదించు; అనవరతం నిన్ను దర్శించ గలిగేటట్లు అనుగ్రహించు’ అని ప్రార్థించాను. నా అంతరంగం యావత్తు శాంతితో పొంగి పొరలింది. విశ్వమంతా కనుమరుగైపోయింది, ఒక్క తల్లి మాత్రమే నా హృదయ సీమను ఆక్రమించివేసింది.
21. జగజ్జననిని సంపదలు అనుగ్రహించమని మూడుసార్లు ప్రార్థించడంలో నరేంద్రుని వైఫల్యం
“శ్రీరామకృష్ణుల వద్దకు తిరిగి రాగానే, ‘నీ దుర్దశను తొలగించమని అమ్మను ప్రార్థించావు కదూ?’ అని ఆయన అడిగారు. ఆ ప్రశ్నకు ఉలిక్కిపడి, ‘లేదండి. అలా అడగడం మరచిపోయాను. కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటారు?’ అని అన్నాను. ‘వెంటనే వెళ్ళి ఆమెను మళ్ళీ ప్రార్థించు’ అని ఆయన చెప్పారు. మళ్ళీ ఆలయానికి బయలుదేరాను; ఆమె సన్నిధిలోకి రాగానే మళ్ళీ అదే మత్తు నన్ను ఆవహించింది. సమస్తం మరచిపోయాను. పదేపదే ఆమెకు ప్రణామాలు చేస్తూ శుద్ధభక్తి జ్ఞానాలను ప్రసాదించమని ప్రార్థించి, తిరిగి వచ్చేశాను. నన్ను చూడగానే శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ‘సరే, ఈసారన్నా నీ దారిద్ర్యావస్థను తొలగించమని ఆమెను అడిగావా?’ అని ప్రశ్నించారు. మళ్ళీ ఉలిక్కిపడి, ‘లేదండి. అమ్మను దర్శించగానే వర్ణనాతీతమైన ఒక దివ్యశక్తి ప్రభావంలో సమస్తం మరచిపోయి, జ్ఞానం, భక్తి ఇమ్మని మాత్రమే అమ్మను అర్థించాను. ఇప్పుడు మార్గాంతరం ఏమిటి?’ అని అన్నాను. అందుకు శ్రీరామకృష్ణులు, ‘ఓరీ అవివేకీ! నిన్ను నువ్వు కాస్త అదుపులో ఉంచుకొని, ఆ ప్రార్థన చేయలేకపోయావా? మరోసారి వెళ్ళి నీ కోర్కెలను ఆమెకు విన్నవించు. త్వరగా వెళ్ళు’ అని అన్నారు. మూడవసారి బయలు దేరాను; కాని ఆలయంలోకి ప్రవేశించగానే చెప్పరాని సిగ్గుతో క్రుంగిపోయాను. ‘ఎటువంటి తుచ్ఛమైన విషయాలు అర్థించడానికి తల్లి వద్దకు వచ్చాను? గురుదేవులు తరచు చెప్పేటట్లు, చక్రవర్తి అనుగ్రహం పొంది గుమ్మడి కాయలు కోరినట్లుగా ఉంది నా ఈ ప్రార్థన. ఎంత తెలివిమాలిన వ్యవహారం ఇది’ అనే ఆలోచన నాలో మెదలింది. సిగ్గు, విరక్తి నన్ను క్రమ్ముకోగా, జగజ్జనని పాదాల మ్రోల వ్రాలి, ‘తల్లీ నాకు ఇంకేమీ వద్దు; కేవలం భక్తిజ్ఞానాలను మాత్రం అనుగ్రహించు తల్లీ!’ అని ప్రార్థించాను.
“ఆలయం నుండి వెలుపలకు రాగానే ఇదంతా గురుదేవుల లీల అని నాకు కచ్చితంగా స్ఫురించింది. లేకపోతే మూడుసార్లు ఆలయానికి వెళ్ళి కూడా ఎందుకు అడగలేకపోయాను? వెంటనే ఆయన వద్ద కెళ్ళి, నా తల్లీతమ్ముళ్ళకు అన్నవస్త్రాలకు కొరత లేకుండా ఉండుటకు హామీ ఇవ్వమని పట్టుబడుతూ, ‘ఆ విధంగా నాలో మత్తు ఆవహింపచేసి, తల్లిని ప్రార్థించకుండా నన్ను నివారించింది కచ్చితంగా మీరే నని నాకు తెలుసు’ అని అన్నాను. నా మాటలు విని ఆయన ఆప్యాయంగా ఇలా అన్నారు : ‘నాయనా, నేనెవరికోసమూ అలా ప్రార్థించలేను; నా నోటి నుండి అటువంటి మాటలు ఎన్నడూ వెలువడవు. నువ్వు కోరినదంతా అమ్మ వద్ద పొందగలవని చెప్పాను కదా! కాని నువ్వే ఆమెను అలా అడగలేక పోయావు. సంసార సుఖాల నిమిత్తం నువ్వు జన్మించలేదు. అటువంటప్పుడు నేను చేయగలిగింది ఏముంది?’ అందుకు నేను, ‘నేను ససేమిరా ఒప్పుకోనండి. నా నిమిత్తం మీరు అలాంటి ప్రార్థన చేయక తప్పదు. ఒక్కసారి మీరు అలా ప్రార్థిస్తే వారి దుర్దశ తొలగిపోతుందని నాకు గట్టి నమ్మకం’ అని అన్నాను. నేను పట్టుపట్టి అలా వేడుకోగా వేడుకోగా చివరికి ఆయన, ‘సరే, సామాన్యమైన అన్నవస్త్రాలకు ఎన్నడూ వారు ఎలాంటి ఇబ్బందీ పడరు’ అని అన్నారు.”
22. విగ్రహారాధనను నరేంద్రుడు విశ్వసించడం
పైన వివరించిన సంఘటన నరేంద్రుని జీవితంలో ఒక గొప్ప మలుపు అని చెప్పవచ్చు. భగవంతుణ్ణి తల్లిగా ఆరాధించడం, అట్లే ప్రతిమల ప్రతీకల ద్వారా భగవంతుణ్ణి అర్చించడంలోని నిగూఢార్థం నరేంద్రుడికి ఇప్పటి వరకు అవగతం కాలేదు. ఈ సంఘటన జరగడానికి మునుపు దేవాలయాలలో ప్రతిష్ఠితమైన దేవతా విగ్రహాలను అతడు ఎంతో చులకనభావంతో చూసేవాడు; ఎన్నడూ భక్తిప్రపత్తులతో చూసి ఎరుగడు. కాని పై సంఘటన అతడి కళ్ళను తెరిపించింది. విగ్రహారాధనలోని నిగూఢత్వం ఇప్పుడు అతడికి స్పష్టంగా అవగతమైంది. ఫలితంగా ఆతడి ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణతను సంతరించుకొంది. అతడిలో అలాంటి పరిణామం కలగడం చూసి శ్రీరామకృష్ణులు వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. ఇది జరిగిన మర్నాడు మా మిత్రుడొకడు* దక్షిణేశ్వరానికి వెళ్ళాడు. ఆ రోజు అతడు చూసింది, విన్నది అతడి మాటల్లో ఇక్కడ పొందుపరిస్తే పాఠకులకు ఆ విషయం చక్కగా విశదమౌతుంది.
23. వైకుంఠనాథ్ సన్యాల్, శ్రీరామకృష్ణులు పొందిన ఆనందం గురించి వివరించడం
“ఒకే కార్యాలయంలో పనిచేస్తున్న కారణంగా తారాపద ఘోష్ అనే వ్యక్తితో నాకు బాగా పరిచయం ఏర్పడింది. నరేంద్రుడు, తారాపదునికి ఆప్త మిత్రుడు. కాబట్టి నరేంద్రుణ్ణి అప్పుడప్పుడు ఆ కార్యాలయంలో చూసేవాణ్ణి. పైగా పరమహంసదేవులు నరేంద్రుణ్ణి అమితంగా ప్రేమిస్తున్నారని తారాపదుడు మాటల సందర్భంలో ఒక రోజు నాతో చెప్పాడు కూడా. అయినప్పటికీ నరేంద్రుని పరిచయం కోసం నేను ప్రయత్నించలేదు. ఒక రోజు మధ్యాహ్నం వేళ నేను దక్షిణేశ్వరానికి వెళ్ళాను. అప్పుడు శ్రీరామకృష్ణులు తమ గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నారు. నరేంద్రుడు గది బయట ఒక ప్రక్క నిద్రపోతున్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణుల ముఖం పరమానందంతో ప్రకాశిస్తూన్నది. నేను ఆయన వద్దకెళ్ళి ప్రణామం చేశానో లేదో, ఆయన నరేంద్రుణ్ణి చూపుతూ ఇలా అన్నారు : ‘అలా చూడు. అతడెంతో సజ్జనుడు. అతడి పేరు నరేంద్రుడు. ఇంతకు మునుపు అతడెన్నడూ జగజ్జననిని అంగీకరించలేదు. నిన్న రాత్రే అంగీకరించాడు. అతడు కష్టదశలో ఉన్నాడు. అందువలన ధనం కోసం అమ్మను ప్రార్థించమని చెప్పాను. కాని అతడు అలా అడగలేకపోయాడు; ఆమెను అలా అడగడానికి సిగ్గుపడ్డాడట. ఆలయం నుండి తిరిగి వచ్చాక అమ్మ మీద ఒక పాటను నేర్పమని నన్ను అడిగాడు. నేను ఈ పాటను నేర్పాను :
నీవే ముక్తిదాయినివి నీవే త్రిగుణాధారిణివి
హే మహితోన్నత మహితా దయనీయా దుఃఖహరా ॥ నీ ॥
నీవే సంధ్యాగాయత్రి నీవే విశ్వాధారిణివి
గతిహీనా నాంగతివి హే మాతా! శివురాణి ॥ నీ ॥
ఉండెదవు భువిలోన ఉండెదవు నీరమున
ఉండెదవు సర్వమున నీవే మూలకందవవు ॥ నీ ॥
నా యందు నీ గృహమె భూతాళి నీ గృహమె
సాకారంబయి నీవు హే మాతా! నిర్గుణవు ॥ నీ ॥
‘రాత్రంతా అదే పనిగా ఆ పాటను పాడుతూ ఉండిపోయాడు. అందుకే ఇప్పుడు నిద్రపోతున్నాడు. (ఆనందంగా నవ్వుతూ) నరేంద్రుడు కాళిని అంగీకరించాడు; ఎంత మంచిదయింది; అవునా కాదా?’ అని సంబరపడ్డారు.
పిల్లవాడిలా ఆయన అలా సంతోషించడం చూసి నేను, ‘నిజమేనండి. చాలా మంచిదే అయింది’ అని అన్నాను. కాసేపయ్యాక చిన్నగా నవ్వుతూ మళ్ళీ ఆయన, ‘నరేంద్రుడు తల్లిని అంగీకరించాడు; చాలా మంచిపనే అయింది; మరి నువ్వేమంటావు?’ అని అడిగారు. పదేపదే అలా అంటూ ఆయన తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
24. నరేంద్రుని తోటి శ్రీరామకృష్ణుల ఆప్త బాంధవ్యం
“మధ్యాహ్నం నాలుగు గంటలకు మేల్కొని నరేంద్రుడు గదిలోకి వచ్చి శ్రీరామకృష్ణుల ప్రక్కన కూర్చున్నాడు. ఆయన వద్ద సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వెళ్ళబోతున్నట్లు కనిపించాడు. కాని అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్య మగ్నులై, దాదాపు అతడి ఒడిలో కూర్చుని ఇలా అనసాగారు : ‘నాకు కనిపిస్తున్నది ఏమిటంటే ఇదీ (తమ శరీరాన్ని చూపుతూ) నేనే, ఇది కూడా (నరేంద్రుని శరీరాన్ని చూపుతూ) నేనే. నిజం చెబుతున్నాను, ఈ రెండింటి మధ్య నాకు ఏ తేడా కనిపించడం లేదు. గంగానది జలాలపై ఒక కర్రను పెడితే గంగానది రెండు భాగాలైనట్లు కనబడుతుంది; కాని నిజానికి భాగాలు లేవు, ఒక్క అఖండ జలరాశి మాత్రమే ఉంది. ఇదీ అటువంటిదే. అర్థమైందా? ఒక్క తల్లి తప్ప మరేముంది? నువ్వేమంటావు?’ అలా అంటూ హఠాత్తుగా, ‘పొగ త్రాగుతాను’ అన్నారు.వెంటనే వెళ్ళి హుక్కా సిద్ధం చేసి ఆయనకు ఇచ్చాను. ఒకటి రెండుసార్లు త్రాగి, హుక్కాను నా కిచ్చి, ‘పాత్ర నుండే త్రాగుతాను’ అని, పాత్రను చేతుల్లోకి తీసుకుని పొగ త్రాగసాగారు. మూడు నాలుగు గ్రుక్కలు పీల్చి పాత్రను నరేంద్రుని నోటి వద్ద పెట్టి, ‘ఒక్క గ్రుక్క, నా చేతుల మీదుగా ఒక్క గ్రుక్క త్రాగు’ అని అన్నారు. కాని నరేంద్రుడు కుంచించుకుపోవడం చూసి శ్రీరామకృష్ణులు, ‘ఎంత అమాయకత్వం! నువ్వూ నేనూ భిన్నులమా? ఇదీ నేనే, అది కూడా నేనే’ అని అన్నారు. అలా అంటూ అతనిచే పొగత్రాగించడానికి తమ రెండు చేతులూ అతడి నోటి వద్దకు తెచ్చారు. అలా గురుదేవులు నిర్బంధించడంతో నరేంద్రుడు ఆయన చేతులగుండా రెండు మూడు గ్రుక్కలు త్రాగి, ఆపేశాడు. అతడు పొగత్రాగడం ఆపగానే, శ్రీరామకృష్ణులు తామే మళ్ళీ పొగత్రాగబోయారు.
ఆ సమయంలో నరేంద్రుడు కంగారుగా, ‘మహాశయా, చేతులు కడుక్కొని తర్వాత త్రాగండి’ అని అన్నాడు. కాని శ్రీరామకృష్ణులు అతడి మాటలు పట్టించుకోలేదు. ‘ఓరీ ధూర్తుడా, భేదబుద్ధి ఎరుక చాలా ఉందే’ అని అన్నారు. నరేంద్రుని నోటిని తాకిన చేతులతోనే ఆయన పొగత్రాగారు. భావావస్థలో అనేక విషయాల గురించి మాట్లాడారు. తమకు సమర్పించడానికి తెచ్చిన ఏ వస్తువు నుండి ముందే కించిత్తు మరెవరికైనా ఇస్తే, ఆ వస్తువును ఎంగిలిగా, దేవునికి అర్పించడానికి అనర్హంగా శ్రీరామకృష్ణులు నిర్ణయించేవారు; అట్టి వస్తువులను స్వయంగా తాము స్వీకరించేవారు కాదు. కాని ఆ రోజు నరేంద్రుని విషయంలో ఆ నియమ భంగం చేయడం చూసి, ఆయనకు అతడెంత ఆప్తుడోననుకొని ఆశ్చర్యచకితుడనయ్యాను.
25. నరేంద్రునితోపాటు వైకుంఠ్నాథ్ కలకత్తాకు తిరిగివెళ్ళడం
“రాత్రి ఎనిమిది గంటలదాకా మేం మాట్లాడుతూ కూర్చున్నాం. అప్పటికి శ్రీరామకృష్ణుల భావపారవశ్యం పూర్తిగా ఉపశమించింది. ఆ తరువాత ఆయన వద్ద సెలవు పుచ్చుకొని కలకత్తాకు నడిచివెళ్ళాం. ఆ తరువాత అనేక సందర్భాలలో నరేంద్రుడు ఇలా చెప్పగా మేం విన్నాం: “మొట్టమొదటిసారి గురుదేవులను దర్శించినప్పటినుండి నాపట్ల వారికున్న విశ్వాసం, నా తల్లి, సోదరులకు కూడా లేదు. ఆ విశ్వాస అభిమానాలు నన్ను ఆయనతో శాశ్వతంగా కట్టిపడేశాయి. ప్రేమించడమంటే ఏమిటో ఒక్క శ్రీరామకృష్ణులకు మాత్రమే తెలుసు; అట్లే ప్రేమించారు కూడా. ఇతరులు తమ స్వార్థం నిమిత్తం ప్రేమను నటిస్తారు.”