1. తమలో స్త్రీ నైజం, నరేంద్రునిలో పురుష నైజం అభివ్యక్తమౌతూ ఉందన్న శ్రీరామకృష్ణుల వచనానికి అర్థం
తమ నైజాన్ని నరేంద్రుని నైజంతో పోల్చుతూ శ్రీరామకృష్ణులు అప్పుడప్పుడు మాతో, “దీన్లో (తమలో) ఉంటున్న వ్యక్తిలో స్త్రీ నైజం అభివ్యక్తమౌతూ ఉంటుంది, నరేంద్రునిలో పురుషభావం అభివ్యక్తమౌతూ ఉంటుంది” అని చెప్పేవారు. ఈ మాటలు ఆయన ఏ అర్థంలో చెప్పారో చెప్పడం కష్టం. కాని భగవత్సాక్షాత్కారార్థం వారిద్దరూ ఏ మార్గాలను అనుసరించారో, అంటే ఏ ముఖ్య విధానాలు అవలంబించారో వాటిని అధ్యయనం చేస్తే పై వచనానికి యుక్తియుక్తమైన అర్థం మనకు ద్యోతకమౌతుంది. ఎందుకంటే, భగవత్సాక్షాత్కారార్థం ఏ సాధనలు అనుష్ఠించాలని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయో వాటిని గురుముఖతా వినగానే వాటి పట్ల పరిపూర్ణ విశ్వాసం వహించి, వెంటనే వాటిని శ్రీరామకృష్ణులు అనుష్ఠించారు. కాని ఈ విషయంలో నరేంద్రుని వైఖరి పూర్తి విరుద్ధం. వినగానే అతడు దేనినీ విశ్వసించేవాడు కాడు. శాస్త్రాలూ, గురువులూ వచిస్తున్న దాన్లో ఏవైనా పొరపాట్లు ఉన్నవేమోనని అతడు వివేచించి వాటి యుక్తియుక్తతను తేల్చుకొనేవాడు. ఆ తరువాతే వాటిని అనుష్ఠానంలో పెట్టేవాడు.
భగవంతుని ఉనికిని నరేంద్రుడు గట్టిగా నమ్ముతూ ఉన్నప్పటికీ, ప్రతివ్యక్తీ పొరబాట్లకూ మూఢనమ్మకాలకూ ఎప్పుడో ఒకప్పుడు లోను కాకుండా ఉండలేడనే భావం అతడిలో జీవిత పర్యంతం మెదలుతూనే ఉండేది. అనాలోచితంగా ఎవరి మాటను మాత్రం ఎందుకు అంగీకరించాలనే భావం కూడా అతడిలో పాదుకు పోయింది. భక్తివిశ్వాసాల మాటలను హేతువాద దృష్ట్యా పరికించి, ఆ మనోవైఖరితోనే జీవితంలోని లౌకిక, ఆధ్యాత్మిక వ్యవహారాలను నిర్వహించడాన్ని ఈ ఆధునిక యుగంలో పురుషోచిత లక్షణంగా పరిగణిస్తారు.
2. నరేంద్రుడు స్వతంత్ర చింతనాశీలి
సర్వకాలాలలో, సకల ప్రాంతాలలో మానవ జీవితాన్ని ప్రభావితం చేయడంలోను, మలచడంలోను బాహ్యపరిస్థితులు ప్రముఖపాత్ర వహిస్తాయనడం అతిశయోక్తి కాదు. కాబట్టి వాటి శక్తి, ప్రభావం నరేంద్రుని జీవితంలో సైతం కానరావడం ఏమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి చాలాకాలం ముందే అసాధారణ ప్రతిభావంతుడైన నరేంద్రుడు ఆంగ్ల సాహిత్యాన్ని, ఐరోపా, భారతదేశ చరిత్రలను, పాశ్చాత్య తర్కశాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు; పరిశోధన, స్వతంత్ర చింతనే ప్రాతిపదికాలైన పాశ్చాత్య భావాలు అతడి నరనరాల్లో ఎన్నడో జీర్ణించుకుపోయాయి. కాబట్టి మన శాస్త్రవచనాల పట్ల అనేక సందర్భాలలో సంశయం వ్యక్తం చేయడం అతడికి స్వాభావికమే; అనుభవజ్ఞుడైన మనిషిగానే తప్ప ఏ వ్యక్తినీ గురువుగా స్వీకరించడానికి అతడు తటపటాయించడం కూడా అతడికి స్వభావసిద్ధమే.
3. తన తండ్రి జీవితం, సమాజ పరిస్థితులు నరేంద్రునిపై చూపిన ప్రభావం
నరేంద్రుడి తండ్రి, బంధువుల జీవిత ఆదర్శాలు, నాటి కలకత్తా సమాజపు పరిస్థితులు నరేంద్రుడి పై వైఖరిని మరింత పటిష్ఠం చేశాయి. అతడి తాత జీవిత పర్యంతం హైందవ శాస్త్రాల పట్ల అపరిమిత విశ్వాసం కలిగివుండి, సన్న్యాసియైనాడు. కాని నరేంద్రుడి తండ్రి తన పాశ్చాత్య విధాన విద్యాభ్యాసం మూలంగా ఆ విశ్వాసాన్ని కోల్పోయి, స్వతంత్ర చింతనా శీలుడైనాడు. పారశీక కవి హఫీజ్ కవితలను, బైబిల్లో నమోదైన ఏసుక్రీస్తు ఉపదేశాలను నరేంద్రుని తండ్రి ఆధ్యాత్మిక భావాల పరాకాష్ఠగా పరిగణించేవాడు. ఆయనకు సంస్కృతం రానందున భగవద్గీత మొదలైన హిందూశాస్త్రాలు చదవలేదు. కాబట్టే పైన పేర్కొన్న వాటినే ఆధ్యాత్మికతకు అత్యున్నత హద్దుగా పరిగణించాడు. ఒక రోజు నరేంద్రుడు ధార్మిక గ్రంథాలను చదువుతూ ఉండడం చూసి, అతడికొక బైబిల్ ప్రతిని బహూకరించి, “మతం అన్నది ఏదైనా ఉన్నదంటే, అది దీన్లోనే ఉంది” అని చెప్పాడు. నరేంద్రుని తండ్రి బైబిల్ను, హఫీజ్ కవితలను అలా తెగ మెచ్చుకొన్నప్పటికీ, ఆ పుస్తకాలలో ఉన్న భావాలకు అనుగుణంగా ఆయన జీవితం ఆధ్యాత్మికంగా మలచబడలేదు. ఆయన నైజానికి ఆధ్యాత్మికత అంతుబట్టని విషయంగా కానవస్తున్నది. ఆ పుస్తకాల పట్ల ఆయన వ్యక్తం చేసే ప్రశంస కూడా నోటిమాటే! ధన సంపాదన, సుఖంగా ఆనందంగా జీవించడం, ఇతరుల సుఖ సంతోషాలకు చేతనైనంత సహాయం చేయడం – ఇదే ఆయన జీవితలక్ష్యం. దీనిని, ఆయన దైనందిన జీవితాన్ని అధ్యయనం చేసినప్పుడు భగవంతుడు, ఆత్మ, పరలోకం వంటి వాటిపై ఆయనకు ఎటువంటి నమ్మకం లేదని తేటతెల్లమౌతుంది. పాశ్చాత్య జడవాద ప్రభావం, అంటే ఉన్నదంతా ఈ ప్రపంచం ఒక్కటే మరేమీ లేదనే వాదం నరేంద్రుని తండ్రివంటి వ్యక్తుల మనస్సులలో అతీంద్రియ సత్యాలను గురించి భయంకరమైన అనుమానాలను ఉత్పన్నం చేసింది. అనేకులలో నాస్తిక బీజాలను మొలకెత్తింప చేసింది. ప్రాచీన ఋషిసత్తముల, శాస్త్రాల నుండి నేర్వవలసింది ఏమీ లేదనీ, అవి మూఢనమ్మకాలకు, బలహీనతలకు మూలమనీ వారు గట్టిగా నమ్మసాగారు. పర్యవసానంగా ఆధ్యాత్మికత అనే వెన్నెముక, మతం పట్ల విశ్వాసం లోపించినవారై అంతరాన ఒక తీరులో భావిస్తూ, బాహ్యంగా మరో విధంగా ప్రవర్తిస్తూ క్రమేణా స్వార్థపూరితులూ, నయవంచకులూ కాసాగారు. మహామేధావియైన రాజారామమోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజం దేశవ్యాప్తంగా ప్రాకిపోతున్న జడవాదాన్ని, నాస్తికత్వాన్ని ఒకింతకాలం అరికట్టడానికి ప్రయత్నించింది. కాని పాశ్చాత్య నాగరికతా ప్రాబల్యంలో ఆ సమాజం అంతఃకలహాల కారణంగా రెండుగా చీలిపోయి అచిరకాలంలోనే గత ప్రాభవాన్ని కోల్పోయింది. ఆ రెండు వర్గాల అనుయాయులూ క్రమంగా పాశ్చాత్య భౌతికవాద చింతనాప్రవాహంలో కొట్టుకుపోయే లక్షణాలు ఆ సమయంలో కొట్టవచ్చినట్లు కనబడసాగాయి.
4. పాశ్చాత్య చింతనాధోరణి పట్ల నరేంద్రుడి అసంతృప్తి
1881 వ సం ॥ లో ఎఫ్.ఏ. పరీక్షల అనంతరం నరేంద్రుడికి పాశ్చాత్య విజ్ఞాన తత్త్వశాస్త్రాలతో బాగా పరిచయం ఏర్పడింది. అతడు అప్పటికే పాశ్చాత్య తార్కికులైన మిల్ ఇత్యాదుల సిద్ధాంతాలను ఔపోసన పట్టేశాడు. డికార్ట్ ‘అహంవాదాన్ని’, హ్యూం, బెన్థాంల ‘నిరీశ్వరవాదాన్ని’, స్పినోజ్ ‘సర్వేశ్వరవాదాన్ని’ డార్విన్ ‘పరిణామవాదాన్ని’, కోమ్టే ‘రూఢివాదాన్ని’, స్పెన్సర్ ‘అజ్ఞేయవాదాన్ని’ – ఇలా వివిధ పాశ్చాత్య దార్శనికుల విభిన్న తాత్త్విక సిద్ధాంతాలను ఔపోసన పట్టి పరమసత్యపు నైజాన్ని ధ్రువీకరించు కోవాలనే ప్రగాఢ ఆరాటం నరేంద్రుడిలో చెలరేగింది. అట్లే జర్మన్ దార్శనికుల ఘనత గురించి విని కాంట్, ఫిక్టే, హెగల్, షోపన్హోర్ వంటి దార్శనికుల తాత్త్విక చింతనా ధోరణులనూ అధ్యయనం చేయసాగాడు. అలాగే స్నాయువులు, మెదడు ఎలా రూపొందుతాయో, ఎలా పనిచేస్తాయో తెలుసుకోగోరి అప్పుడప్పుడు స్నేహితులతో కలకత్తా వైద్యకళాశాలకు వెళ్ళి శరీర ధర్మశాస్త్రాధ్యయనంలో మనస్సును లగ్నం చేసి, ఆ విషయాంశాల మీద ఇవ్వబడే ప్రసంగాలను కూడా వినసాగాడు. తత్ఫలితంగా 1884 వ సం ॥ లో బి.ఏ. పరీక్షలలో ఉత్తీర్ణుడు కావడానికి మునుపే పాశ్చాత్య తత్త్వశాస్త్రంపై ఎంతో జ్ఞానం సముపార్జించాడు. అతడు ఈ జ్ఞానాన్ని ఎంత అధికంగా పొందసాగాడో అంత ఎక్కువగా మనిషి మనస్సు, బుద్ధుల పరిమితులు అతడికి అవగతం కాసాగింది. ఇంద్రియ అతీతమైన ఆ పరమ సత్యాన్ని, భగవత్సాక్షాత్కారాన్ని పొందడానికి ఇవి చాలవని గ్రహించాడు. కనీసం ఏ మార్గాన్ని అనుసరిస్తే ఆ సాక్షాత్కారం లభిస్తుందో ఆ మార్గం గురించి కించిత్తు కూడా అవి వెల్లడించలేవనే విషయమూ అతడికి స్పష్టమైంది. ఈ విషయం ఎంత అధికంగా స్పష్టం కాసాగిందో నరేంద్రుడి మనస్సు అంత అశాంతిని పొందసాగింది.
5. ప్రాచ్య, పాశ్చాత్య చింతనాధోరణుల మధ్య నరేంద్రుడు ఊగిసలాడడం
ఇంద్రియాల ద్వారా మెదడుకు చేరే బాహ్యస్పందనలు, వివిధ ప్రతిస్పందనలను ఉత్పన్నం చేసి అనుక్షణం మనిషి మనస్సులో సతతం మార్పులు కలిగిస్తూ సుఖదుఃఖ అనుభవాలను జనింప చేస్తుంటాయనే విషయాన్ని పాశ్చాత్య విజ్ఞాన తత్త్వశాస్త్ర తోడ్పాటుతో నరేంద్రుడు అర్థం చేసుకొన్నాడు. దేశకాలాల సహాయంతో మనస్సులో కలిగే పరిణామాలు మాత్రమే మనిషి ప్రత్యక్ష అనుభవానికి కారణాలు. అంతేగాని మనస్సులో ప్రతిస్పందన, మార్పులు జనింపచేసే ఆ బాహ్య మూలస్థానం అసలు స్వరూపం మనిషికి ఎప్పుడూ అజ్ఞాతంగానే, అజ్ఞేయంగానే ఉండిపోతుంది. ఈ పరిమితి మనిషి అంతరంగము, ఆత్మకు కూడా అన్వయిస్తుంది. (అంటే ఇవి కూడా అజ్ఞాతం, అజ్ఞేయంగానే ఉండిపోతాయన్నమాట.) అంతర జగత్తులో (అంతఃకరణంలో) కూడా అజ్ఞాతమైనది ఏదో ఒకటి తన శక్తితో మనిషి మనస్సులో ‘నేను’, ‘నాది’ మొదలైన భావాలు ఉత్పన్నం చేస్తూవుంటుంది. ఈ అజ్ఞాతశక్తి దేశకాలాలకు అతీతమైనది కావడం వలన దాన్ని గుర్తించడం మనిషికి అసాధ్యం. అలా దేశ కాలాలలనే దుర్భేద్యమైన గోడలు అడ్డు తగలడం వలన లోపలకు లేదా బయటకు, ఏ దిక్కుకు పోయి ఆ పరమ సత్యాన్ని అన్వేషిస్తున్నప్పటికీ మనిషి మనస్సు నిస్సహాయ స్థితినే చవిచూస్తుంది.
పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి సహాయంతో మనిషి ఈ విశ్వరహస్యాన్ని కనుగొనడానికి, దాని మూలాన్ని చేరడానికి ఎంత ప్రయత్నించినా తెలుసుకోవడం అసాధ్యమని నరేంద్రుడు గుర్తించాడు. ఏ ఇంద్రియజ్ఞానం ద్వారా మనిషి తన తర్కాన్ని నిర్మించి, నిర్ణయాలకు వస్తున్నాడో ఆ ఇంద్రియజన్య జ్ఞానమే తప్పుల కుప్ప అని అతడు చక్కగా గ్రహించాడు. ఆ కారణంగానే దేహానికి భిన్నంగా ఆత్మ అనే మరొకటి ఉందని ఇంద్రియ జ్ఞానం ద్వారా నిరూపింప పాశ్చాత్య విద్వాంసులు చేస్తూన్న ప్రయత్నాలు విఫలంకాక తప్పదు. కాబట్టి పారమార్థిక సత్యాలను గురించిన పాశ్చాత్యుల అంతిమ నిర్ణయాలు నరేంద్రునికి యుక్తియుక్తంగా తోచలేదు. సదా రూపరసాది భోగాల పట్ల ఆసక్తులైన సామాన్య జనుల అనుభవాలే సహజం, స్వాభావికం అని అంగీకరించి పాశ్చాత్యాన్ని అనుకరిస్తూ ఆ అనుభవాల పునాది మీద దర్శనశాస్త్రాన్ని నెలకొల్పడం సబబా? లేక ప్రాచ్యాన్ని అనుసరించి సామాన్యుల అనుభవాలకు పూర్తి విరుద్ధంగా ఉన్నా కూడా ఋషులు, బుద్ధుడు వంటి మహనీయుల అసాధారణ అనుభూతుల పునాది మీద దార్శనిక సత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నించడం సముచితమా? ఈ సందేహం నరేంద్రుని మనస్సును తొలిచివేయసాగింది.
6. నరేంద్రుని భగవత్సాక్షాత్కార సంకల్పంలో ఎలాంటి మార్పులేకపోవడం
ఆధ్యాత్మిక పరమైన పాశ్చాత్య తత్త్వశాస్త్ర నిర్ణయాలు చాలా మేరకు యుక్తియుక్తంగా నరేంద్రుడికి తోచకపోయినప్పటికీ, పాశ్చాత్య భౌతికశాస్త్ర ఆవిష్కరణలను, పాశ్చాత్యుల పరిశీలనా ప్రయోగాల వైజ్ఞానిక విధానాలను నరేంద్రుడు ఎంతో ప్రశంసించేవాడు. మనస్తత్వ శాస్త్ర, ఆధ్యాత్మిక సత్యాలను పరీక్షించడంలో నరేంద్రుడు ఆ పాశ్చాత్య వైజ్ఞానిక ఆవిష్కరణల, వైజ్ఞానిక విశ్లేషణా విధానాల తోడ్పాటును సదా తీసుకొనేవాడు.
అప్పటి నుండి నరేంద్రుడు ఆ విధానాల ద్వారా శ్రీరామకృష్ణుల అసాధారణ అనుభూతులను విశ్లేషించ ప్రయత్నించసాగాడు. ఆ విధంగా ఏ అనుభూతులు ఆ విశ్లేషణకు నిలబడగలిగాయో వాటిని మాత్రమే సత్యాలుగా అంగీకరించి నిర్భయంగా వాటిని అనుష్ఠించేవాడు. సత్యసాక్షాత్కారార్థం అతడి హృదయం ఎంత తపిస్తూన్నప్పటికీ అవివేకంగా దేన్నైనా చేయడం, భయంతో ఎవరినైనా గౌరవించడం నరేంద్రుడి నైజానికి పూర్తిగా విరుద్ధం. తన వివేచన అనివార్యంగా నాస్తికవాదానికే దారితీసే పక్షంలో, నరేంద్రుడు నాస్తికతను అంగీకరించడానికి కూడా సిద్ధమయ్యాడు. ఈ మానవ జీవిత రహస్యాన్ని కనుగొనడానికి సత్యసాక్షాత్కారం పొందడానికి కేవల సాంసారిక సుఖభోగాలనే కాక తన ప్రాణాన్ని సైతం త్యజించడానికీ అతడు తయారయ్యాడు.
కాబట్టి పరమసత్యాన్ని అన్వేషించడంలో దృష్టిని నిలిపి, పాశ్చాత్య చింతనా ధోరణులను అధ్యయనం చేస్తూ వాటిలోని ఆరోగ్యకరమైన అంశాలను మాత్రమే స్వీకరించడంలో ప్రస్తుతం నరేంద్రుడు నిమగ్నుడయ్యాడు. ఆ పాశ్చాత్య భావ ప్రభావంలో నానా సందేహాలకూ లోనై అప్పుడప్పుడు భక్తివిశ్వాసాలనే సరళ మార్గాన్ని అతడు విడిచిపెట్టడం కూడా తటస్థించింది. అయినప్పటికీ అతడి అసాధారణమైన మేధాసంపత్తి, పట్టుదలదే పైచేయి అయింది. సత్యసాక్షాత్కారంలో అతడు కృతకృత్యుడు కావడానికి చివరికి అవి దోహదం చేశాయి. ఈ విషయాలు ఏవీ సరిగా అర్థం చేసుకోలేని అనేకులు పాశ్చాత్య గ్రంథాలలోని అభిప్రాయాలను వివేచించకుండానే నరేంద్రుడు ఒంటపట్టించుకొంటున్నాడని పొరబడ్డారు. నరేంద్రుడు పాశ్చాత్య తత్త్వ పక్షపాతి అనే అభిప్రాయం అతడి మిత్రవర్గంలో ఎంత బలపడిందంటే, ఒక రోజు అతడు భగవద్గీతను పఠించి దానిని ఎంతో ప్రశంసించడాన్ని చూసి అతడి మిత్రులు నివ్వెరపోయి ఆ సమాచారాన్ని గురుదేవులకు తెలిపారు. అప్పుడు ఆయన, “కొందరు పాశ్చాత్య విద్వాంసులు గీతను ప్రశంసించడం చూసి అతడలా చేయలేదనుకుంటాను” అని చెప్పారు.
7. నరేంద్రుడి భగవద్విశ్వాసం చెక్కుచెదరలేదు
ఒక్క విషయం మాత్రం ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. పాశ్చాత్య చింతనా ధోరణుల ప్రభావం అతడిలో గొప్ప విప్లవాన్ని తీసుకురావడానికి మునుపే నరేంద్రుడు శ్రీరామకృష్ణులను దర్శించాడు, కొన్ని అసాధారణ ఆధ్యాత్మిక అనుభూతులు పొందాడు కూడా. ఆ అనుభూతులను గురించి ఇంతకు మునుపే పాఠకులకు తెలిపివున్నాం. భగవంతుని ఉనికి పట్ల ప్రగాఢ విశ్వాసాన్ని అతడిలో పాదుగొల్పడానికి అవి దోహదం చేశాయన్న విషయం నిర్వివాదాంశం. లేకపోతే జగత్కారణుడైన భగవంతుడు అజ్ఞేయుడని వచించే పాశ్చాత్య భావాల, సిద్ధాంతాలలో మునిగి నరేంద్రుడు ఎంత దూరం కొట్టుకొనిపోయి ఉండేవాడో అంచనా వేయడం కష్టం. ఆ భావాలు భగవంతుని ఉనికి పట్ల నరేంద్రునికి గల విశ్వాసాన్ని, బలీయమైన అతడి గత ఆధ్యాత్మిక సంస్కారాల కారణంగా సమూలంగా నాశనం చేయలేకపోయినా, వాటి తాకిడి వలన అతడి భగవద్విశ్వాసం కొంతమేరకు సడలిపోయే ఆస్కారం ఉందనే చెప్పాల్సివస్తుంది. కాని విధి నిర్ణయం వేరుగా ఉంది. భగవత్సంకల్పంతో నరేంద్రుడు ఈ భువిలో జన్మించడం ఒక విశిష్ట కార్యసాధన కోసమే కదా! భగవదనుగ్రహంతో అతడు ఏ సద్గురువరేణ్యుల ఆశ్రయం పొందాడో ఆయనే పదే పదే “ఆర్తితో చేసిన ప్రార్థనను భగవంతుడు తప్పక ఆలకిస్తాడు. మనం కూర్చుని ఎలా మాట్లాడుకొంటున్నామో అంతకంటే సన్నిహితంగా ఆయనతో మాట్లాడవచ్చు, ఆయన పలుకులు వినవచ్చు, ఆయనను స్పృశించవచ్చునని నేను ప్రమాణం చేసి చెబుతున్నాను.” అని భరోసా ఇచ్చేవారు. మరో సందర్భంలో శ్రీరామకృష్ణులు, నరేంద్రుడితో “సామాన్యంగా భగవంతుణ్ణి పూజించే రూపాలు, భగవంతుడు ఇటువంటి వాడని ఆయనను గురించిన అభిప్రాయాలు మానవ కల్పితాలే కదా అని నువ్వు వాటిని స్వీకరించకపోయినా ఫరవాలేదు. కాని జగన్నియామకుడైన భగవంతుడు ఒకడు ఉన్నాడనే విశ్వాసం ఉంటే చాలు. అప్పుడు, ‘ఓ దేవుడా, నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలియదు. కాని ప్రభూ, దయచేసి నీ యథార్థ స్వరూపాన్ని నాకు అభివ్యక్తం చేయి’ అని ఆర్తితో ప్రార్థిస్తే, తప్పకుండా ఆయన నీ మొరను ఆలకించి, నిన్ను అనుగ్రహిస్తాడు” అని చెప్పేవారు.
శ్రీరామకృష్ణుల ఈ అభయవాణి నరేంద్రుడిలో సాధనల పట్ల ఇంతకు ముందెన్నడూ లేని అత్యుత్సాహాన్ని జనింప చేసింది.
8. నరేంద్రుని సాధన
సుప్రసిద్ధ పాశ్చాత్య దార్శనికుడైన హామిల్టన్ తన దర్శన గ్రంథం ముగింపులో “మానవుడి మేధస్సు జగన్నియామకుడైన భగవంతుడు ఒకడున్నాడనే సత్యాన్ని చూచాయగా మాత్రం తెల్పి ఊరకొంటుంది. అంతేగాని ఆ భగవంతుని స్వరూపం ఏమిటో వ్యక్తం చేయడం దానికి సాధ్యం కాదు. కాబట్టి దర్శనశాస్త్రాలు ఇక్కడితో ఆగిపోతాయి. దర్శనాలు ఎక్కడ ఆగిపోతాయో ఆధ్యాత్మికత అక్కడ ప్రారంభమౌతుంది” అని వ్రాశాడు. హామిల్టన్ పై వచనాలు నరేంద్రుడికి ఎంతో నచ్చాయి. మాటల సందర్భంలో అనేకసార్లు అతడు వాటిని ఉదహరించేవాడు. సాధనలలో నిమగ్నుడైనప్పటికీ నరేంద్రుడు తత్త్వశాస్త్ర అధ్యయనాన్ని విరమించలేదు. తన సమయాన్ని సంగీతం, ధ్యానం, అధ్యయనంలో గడపసాగాడు.
9. ధ్యానాభ్యాసం పట్ల నరేంద్రుడి అభిలాష
అప్పటి నుండి నరేంద్రుడు ఒక నూతన విధానంలో ధ్యానం అభ్యసించసాగాడు. భగవంతుణ్ణి సాకారునిగా లేదా నిరాకారునిగా ఎలా భావించినా సరే మానవ భావాలను ఆరోపించే ఆయనను భావించక తప్పదు. ఈ విషయం ఇంతకు మునుపే తెలిపాం. ఈ విషయం అవగతం చేసుకోవడానికి మునుపు నరేంద్రుడు బ్రహ్మసమాజం నిర్దేశించిన తీరులో భగవంతుణ్ణి నిరాకార సగుణునిగా ఉపాసించేవాడు. కాని అది కూడా ఒక రకంగా మానవభావమే అని ఇప్పుడు గ్రహించి ఆ పద్ధతిని విడిచిపెట్టాడు. ఇప్పటి నుండి, “హే భగవాన్, నీ యథార్థ స్వరూపాన్ని దర్శించే యోగ్యతను నాకు ప్రసాదించు” అని ప్రార్థిస్తూ, మనస్సును ఆలోచనారహితం చేసి, దానిని గాలి వీచని చోట ఉన్న దీపశిఖలా నిశ్చలంగా ఉంచడానికి ప్రయత్నించసాగాడు. మొదటి నుండి అతడి మనస్సు కట్టుబాటులో ఉండడం వలన ఒకింతకాలం ఈ విధంగా అభ్యాసం చేశాడో లేదో అతడి మనస్సు ఎంతగా తన్మయం చెందేదంటే అప్పుడప్పుడు అతడిలో దేహస్మృతి, కాలస్ఫురణ అదృశ్యమైపోయేవనడం అతిశయోక్తి కాదు. ఇంట్లో అంతా నిద్రకు ఉపక్రమించిన తరువాత, తన గదిలో ధ్యానానికి కూర్చునేవాడు; అనేక సందర్భాలలో ఆ ధ్యానం రాత్రంతా కొనసాగడం కద్దు.
పై ధ్యానాభ్యాస ఫలితంగా నరేంద్రుడికి ఒక రోజు అద్భుత దర్శనం ఒకటి కలిగింది. మాటల సందర్భంలో ఆ దర్శనం గురించి మాకు ఇలా వర్ణించి చెప్పాడు : “మనస్సును నిశ్చలమూ ఆలోచనారహితమూ చేయగానే దానిలో ప్రశాంత పరమానంద వాహిని ప్రవహించేది. ధ్యానానంతరం సైతం దాని ప్రభావం వలన ఒక రకమైన మత్తు చాలాసేపటి వరకూ నాలో ఉండిపోవడం కద్దు. కాబట్టి కూర్చున్న చోటు నుండి వెంటనే లేవాలని నాకు అనిపించేదికాదు.
10. బుద్ధుని దర్శనం కలగడం
ఒక రోజు ధ్యానం ముగించి అలా కూర్చుని ఉన్నప్పుడు దివ్య తేజస్సుతో గదినంతా దేదీప్యమానం చేస్తూ ఒక అపూర్వ సన్న్యాసమూర్తి ఎక్కడ నుండో హఠాత్తుగా వచ్చి నా ముందు, కాస్త దూరంలో నిలబడ్డాడు. ఆయన కాషాయాంబరాలు ధరించి, చేత కమండలం పుచ్చుకొని ఉన్నాడు. ఆయన వదనం అనిర్వచనీయమైన ప్రశాంతతకు ఆలవాలమై ఉంది. సమస్త విషయాల పట్ల కానవచ్చే నిర్లిప్త వైఖరి నుండి జనించిన ఆయన అంతర్ముఖత్వం నన్నెంతో విస్మయుణ్ణి చేసి, ఆకట్టుకొంది. ఏదో చెప్పదలచుకొన్నట్లుగా నా వైపే తదేకంగా చూస్తూ ఆ మూర్తి నా వైపు మెల్లగా అడుగులు వేశాడు. అప్పుడు నే నెంతో భయపడ్డాను, స్థిరంగా ఉండలేకపోయాను. వెంటనే ఆసనం మీద నుండి లేచి గది తలుపు తెరిచి గబగబా బయటకు వెళ్ళిపోయాను. మరుక్షణమే ‘ఎందుకు అంత భయపడ్డాను?’ అనుకొన్నాను. ధైర్యం తెచ్చుకొని ఆ సన్న్యాసి చెప్పగోరుతున్నదేదో వినాలనే ఉద్దేశంతో మళ్ళీ గదిలోకి వెళ్ళాను. కాని ఆయన కనిపించలేదు. గదిలో చాలాసేపు ఎదురు చూశాను కాని ఫలితం లేకపోయింది. ఆయన మాటలు వినకుండా అలా పారిపోవాలనే మూర్ఖత్వం నా కెందుకు కలిగిందా అనుకొంటూ పశ్చాత్తాపంతో కుంగిపోయాను. నేను అనేకమంది సన్న్యాసులను చూశాను కాని అటువంటి అద్భుత ముఖవైఖరి ఎన్నడూ ఎవరిలోను చూడలేదు. ఆ ముఖారవిందం నా హృదయంలో పాదుకు పోయింది. అది నా భ్రమ కావచ్చునేమోగాని, ఆ నాడు నేను భాగ్యవశాత్తు చూసిన ఆ మూర్తి బుద్ధ భగవానుడేనని నా దృఢ విశ్వాసం.”