1. శ్రీరామకృష్ణుల పావన సాంగత్యం ఎంతకాలం నరేంద్రుడికి లభించింది?
శ్రీరామకృష్ణుల పావన సాంగత్యభాగ్యం నరేంద్రునికి ఐదు సంవత్సరాలు లభించింది. ఇందుమూలంగా ఈ ఐదు సంవత్సరాల కాలం నరేంద్రుడు సదా సర్వదా ఆయన పాదపద్మాల సన్నిధిలో గడిపాడని పాఠకులు పొరపడరాదు. కలకత్తా భక్తులందరిలాగానే నరేంద్రుడు కూడా ఇంటి నుండి దక్షిణేశ్వరానికి వచ్చి ఆయనను ఆ కాలఘట్టంలో దర్శించుకొని పోతూవుండేవాడు. మొట్టమొదటి నుండి శ్రీరామకృష్ణుల అనంత ప్రేమకు పాత్రుడు కావడం వలన స్వల్పకాల వ్యవధులలోనే అతడు దక్షిణేశ్వరానికి వెళ్ళివస్తూ ఉండేవాడని కచ్చితంగా తెలియ వస్తోంది. క్రమేణా దక్షిణేశ్వరానికి వారంలో ఒకటి రెండుసార్లు, తీరిక ఉన్నప్పుడు రెండు మూడు అంతకంటే ఎక్కువ రోజులు అక్కడే గడపడం తన కర్తవ్యంగా నరేంద్రుడు భావించసాగాడు. కొన్ని సమయాలలో ఈ నియమాన్ని అతడు ఉల్లంఘించలేదని చెప్పలేం. కాని మొదటి నుండి నరేంద్రుడి పట్ల ఎంతో ఆకర్షితులైన శ్రీరామకృష్ణులు ఆ నియమాన్ని అతడు తరచు ఉల్లంఘించనీయకుండా వ్యవహరించి ఉంటారు. ఏదో కారణంగా నరేంద్రుడు ఒక వారం రోజులు దక్షిణేశ్వరానికి రాకుంటే, ఆయన ఎంతో ఆరాటపడిపోయి, ఎవరి ద్వారానో అతడికి కబురు పంపి, అతణ్ణి తమ వద్దకు రప్పించుకొనేవారు; లేదా కొన్ని గంటలు ఆతడితో గడపడానికి తామే స్వయంగా కలకత్తాకు వెళ్ళేవారు. శ్రీరామకృష్ణులతో పరిచయం కలిగిన తరువాత మాకు తెలిసినంత వరకు నరేంద్రుడు యథావిధిగా దక్షిణేశ్వరానికి రావడంలో పెద్దగా జాప్యం ఎన్నడూ చేసింది లేదు. కాని 1884 వ సం ॥ ప్రారంభంలో బి.ఏ. పరీక్షలు వ్రాసిన స్వల్ప కాలంలోనే తండ్రి హఠాన్మరణం తరువాత కుటుంబ బాధ్యత తన భుజస్కంధాల మీద పడ్డాక ఆ నియమాన్ని అతడు ఉల్లంఘించక తప్పలేదు.
2. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణుల ప్రవర్తనలోని ఐదు ముఖ్యాంశాలు
ఆ ఐదు సంవత్సరాలలో శ్రీరామకృష్ణులు, నరేంద్రునితో వ్యవహరించిన తీరులో ఐదు ముఖ్యాంశాలు ద్యోతకమౌతున్నాయి :
- నరేంద్రుడు తమ వద్దకు రావడం ప్రారంభించినప్పటి నుండి, నరేంద్రుని వంటి అర్హత గల వ్యక్తి ఆధ్యాత్మిక జగత్తులో ఎంతో అరుదు అని ఆయన అంతర్దృష్టితో గ్రహించే ఉన్నారు. అంతేకాదు జగజ్జనని తమకు పురమాయించిన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించి, ఆధునిక కాల ఆవశ్యకతలకు అనుగుణంగా తీర్చిదిద్దే కార్యంలో తమకు ఎంతో దోహదం చేయడానికే నరేంద్రుడు జన్మించాడనీ ఆయనకు తెలియకపోలేదు.
- అనంత ప్రేమ, విశ్వాసాలనే త్రాటితో నరేంద్రుణ్ణి తమతో శాశ్వతంగా కట్టివేశారు.
- తాము అంతర్దృష్టితో గాంచిన నరేంద్రుని మహత్త్వమూ, అతడి జీవిత లక్ష్యమూ వాస్తవమేనని అతణ్ణి అనేక విధాల పరీక్షించి రూఢిపరచుకొన్నారు.
- ఆ మహత్కార్యం నెరవేర్చడానికి యుక్తమైన పరికరంగా తీర్చిదిద్దడానికి అతడికి శిక్షణ నిచ్చారు.
- శిష్యుడు శిక్షణ పూర్తిచేసి బ్రహ్మజ్ఞానం సంతరించుకొన్నాక, సనాతనధర్మ సంస్థాపన కార్యంలో ఎలా ఉపక్రమించాలో అతడికి ఉపదేశించారు. ఈ కార్యనిర్వహణను, తాము స్వయంగా నెలకొల్పిన సన్న్యాస సంప్రదాయ కార్యభారాన్ని నిశ్చింతగా అతడికి అప్పగించారు.
3. అద్భుత దర్శనాలపై ఆధారపడిన శ్రీరామకృష్ణుల వైఖరి
నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాక పూర్వమే అతడి మహత్త్వాన్ని గురించి కొన్ని అద్భుత దర్శనాలను శ్రీరామకృష్ణులు గాంచారని మేం ఇంతకు మునుపే తెలిపివున్నాం. నరేంద్రుడితో పరిచయం ఏర్పడ్డప్పటి నుండి ఆ దివ్యదర్శనాల ప్రభావం కారణంగా నరేంద్రుణ్ణి ఆయన ప్రేమ విశ్వాసాలు సంతరించుకొన్న వ్యక్తిగా పరిగణించేవారు. ఆ ప్రేమ విశ్వాసాలనే ప్రవాహం నరేంద్రుని హృదయంలో శ్రీరామకృష్ణుల జీవిత పర్యంతం ఒకే రీతిలో ప్రవహించి, అతణ్ణి శ్రీరామకృష్ణులతో ప్రేమ అనే త్రాటితో కట్టిపడేసింది. ఈ ప్రేమ విశ్వాసాల నేపథ్యంలోనే శ్రీరామకృష్ణులు కొన్ని సమయాలలో నరేంద్రుణ్ణి పరీక్షించారు కూడా.
4. నరేంద్రుణ్ణి శ్రీరామకృష్ణులు పరీక్షించడానికి హేతువు
“తమ యోగిక దర్శనాల నుండి నరేంద్రుని మహత్త్వం, అతడి అవతరణలోని ఉద్దేశం తెలుసుకొన్న తరువాత కూడా శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి ఎందుకు పరీక్షించారు?” అనే ప్రశ్న తలెత్తవచ్చు. దేహధారులై మాయా జగత్తులో ప్రవేశించినప్పుడు శ్రీరామకృష్ణుల వంటి అవతార పురుషులకు కూడా, దర్శనాలు కించిత్తు అస్పష్టంగా కానరావడం వలన పొరపాటుకు గురికావడానికి కొంత ఆస్కారం ఉంటుంది. కాబట్టే కొన్ని సమయాలలో అటువంటి పరీక్షలు అవసరమై ఉన్నాయి. ఈ విషయాన్ని మాకు విశదీకరిస్తూ శ్రీరామకృష్ణులు, “హీన లోహాలను మిశ్రమం చేయకుండా బంగారు ఆభరణాలు చేయలేరు” అని చెప్పారు. జ్ఞానాన్ని వెల్లడించే అవతార పురుషుల మనోదేహాలు శుద్ధసత్త్వంతో రూపొందలేవు; వాటికి కించిత్తు రజస్సు, తమస్సు కలుపవలసి ఉంటుంది. సాధనలు అనుష్ఠిస్తున్నప్పుడు జగజ్జనని అనుగ్రహంతో శ్రీరామకృష్ణులలో అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం, దర్శనాలు అభివ్యక్తమైనాయి. కొన్ని సమయాలలో ఆ దర్శనాల సత్యాసత్యాల పట్ల ఆయనలో సంశయాలు తలెత్తడం కద్దు; పరీక్షించిన తరువాతే వాటిని పూర్తిగా అంగీకరించే వారు. కాబట్టి నరేంద్రుని విషయంలో తమకు కలిగిన అద్భుత దర్శనాల వాస్తవాన్ని పరీక్షించకుండా ఆయన అంగీకరించకపోవడంలో వింత ఏముంది?
5. నరేంద్రుని ఎడ శ్రీరామకృష్ణులు ఎలా మెలిగారు?
నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు మెలిగిన విధానం పైన ప్రస్తావించిన ఐదు రకాల విధానాలలో, ప్రేమ మిళితమైన విశ్వాసం, పరీక్షించడం, బోధించడం అనే మూడు విధానాలు ఏకకాలంలోనే ప్రారంభమైనాయి. అతడి పట్లగల ప్రేమ విశ్వాసాలతో మెలిగిన రీతి గురించి ఇంతకు మునుపే క్లుప్తంగా ముచ్చటించివున్నాం. దీనిని గురించి తరువాత వివరంగా చెప్పవలసి ఉంది. ఎందుకంటే, ఇంతకు ముందు ఎన్నడూ శ్రీరామకృష్ణుల జీవితం నరేంద్రునితో మాదిరి మరి ఏ భక్తునితోను ఇంత సన్నిహితంగా పెనవేసుకొని ఉండడం తటస్థించలేదు. తన ప్రధాన అంతేవాసులలో ఒకరిని కలుసుకోగానే, “ఈ వ్యక్తి ప్రగాఢ విశ్వాసమనే సుస్థిరమైన, చలించని పునాది మీద నా ఆధ్యాత్మిక ఆలయాన్ని నిర్మిస్తాను” అని ఏసుక్రీస్తు చెప్పాడు. నరేంద్రుణ్ణి కలుసుకొన్న క్షణంలోనే శ్రీరామకృష్ణులలో భగవత్ప్రేరణ వలన అటువంటి దృఢవిశ్వాసం జనించింది. తన పుత్రసమానుడూ, నేస్తమూ అయిన నరేంద్రుడు తన ఆదేశాలను నిర్వర్తింప జన్మించాడనీ, తమ ఇద్దరి జీవితాలు ప్రేమ అనే తెగిపోని త్రాటితో శాశ్వతంగా ముడివేయబడినాయనీ శ్రీరామకృష్ణులు తమ దర్శనాల నుండి గ్రహించారు. అటువంటి ప్రేమ ఉన్నతోన్నతమైన ఆధ్యాత్మిక ప్రేమ. అట్టి ప్రేమలో ప్రేమికుడు తన ప్రేయసికి పరిపూర్ణ స్వాతంత్ర్యాన్ని ఒసగినప్పటికీ, ఆ ప్రేయసి యుగాల పర్యంతంగా తనకు సొంతమైనదనే భావనను మాత్రం కోల్పోడు. అటువంటి ప్రేమలో పరస్పరం తమ సర్వస్వాన్ని, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చివేయడంలో ఆనందిస్తారు. శ్రీరామకృష్ణ నరేంద్రుల మధ్య నెలకొన్న నిస్వార్థ ప్రేమ ఉదంతం వంటి దానిని లోకం ఎన్నడైనా చూసి ఉందో లేదో సందేహమే! ఈ అనుపమాన దివ్యప్రేమను స్పష్టంగా వర్ణించడానికి మేం అసమర్థులం; అయినప్పటికీ సత్యం పట్ల గల ఆసక్తి కారణంగా దానిని గురించి సూచనప్రాయంగా తెలిపి, పిదప నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు మెలగిన తీరుతెన్నులను విశదంగా చర్చిస్తాం.
6. నరేంద్రుని గురించి సామాన్యుల పొరపాటు అభిప్రాయం
మొదటి సమావేశం నుండి శ్రీరామకృష్ణుల పావనత్వం, వైరాగ్యం, ఏకాగ్ర భక్తిని చూసి నరేంద్రుడు ఆకర్షితుడైనట్లే, శ్రీరామకృష్ణులు కూడా నరేంద్రుడి అపార ఆత్మస్థైర్యం, సత్యనిష్ఠ పట్ల ముగ్ధులై ఆనాటి నుండి అతణ్ణి తమ సొంత మనిషిగా పరిగణించారని మాకు తోస్తున్నది. నరేంద్రుడి మహత్త్వం, వైభవాన్విత భవిష్యత్తు గురించి శ్రీరామకృష్ణులకు కలిగిన యౌగిక దర్శనాలను కాస్త పక్కకుపెట్టి, వారి అద్భుత పరస్పర ఆకర్షణకు గల హేతువును కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు, మేం ఇంతకు ముందు చెప్పిన విషయం స్పష్టమౌతుంది. అంతర్దృష్టి రహితులైన జనం నరేంద్రుని అద్భుతమైన ఆత్మస్థైర్యాన్ని అహంకారంగాను; అపార శక్త్యుత్సాహాలను తలపొగరుగాను, సత్యనిష్ఠను నటనగాను లేదా అమాయకత్వంగాను పరిగణించడం కద్దు. జనం ప్రశంసలకు అతడు ఉపేక్ష వహించడాన్ని, అతడు నిర్మొహమాటంగా మాట్లాడడాన్ని, అన్ని విషయాలలోను నిస్సంకోచంగా వ్యవహరించడాన్ని, ఎవరిని గురించో భయపడక దేనినీ మరుగుపరచకపోవడాన్ని చూసి జనం పై నిర్ణయానికి వచ్చి ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నరేంద్రుడితో మాకు బాగా పరిచయం కాక ముందు, అతడి పొరుగింటి వారు అతణ్ణి గురించి మాతో ఇలా చెప్పినట్లు జ్ఞాపకం : “ఆ ఇంట్లో ఒక కుఱ్ఱవాడు ఉన్నాడు; అటువంటి పనికిమాలిన వాణ్ణి నేనెన్నడూ చూడలేదు. బి.ఏ. పట్టా పుచ్చుకొన్నాక అతడు మరింత నిరర్థకంగా తయారయ్యాడు. తండ్రి, ఇతర పెద్దలు ముందు తబలా వాయిస్తూ నిర్లక్ష్యంగా పాటలు పాడడం ప్రారంభిస్తాడు. రోడ్డుమీద నడుస్తూ, పెద్దల సమక్షంలో పొగత్రాగుతుంటాడు. ప్రతి విషయంలోను అతడి ప్రవర్తన ఇలాగే ఉంటుంది.”
7. నరేంద్రుణ్ణి, శ్రీరామకృష్ణులు శ్లాఘించడం – ఈ రచయిత వినడం
ఇది జరిగిన కొద్దికాలానికే నరేంద్రుని విధానాల గురించి విభిన్న వర్ణనను మేం శ్రీరామకృష్ణులను రెండవసారో లేదో మూడవసారో కలుసుకొన్నప్పుడు ఆయన ముఖతా విన్నాం. యదుమల్లిక్ ఉద్యానగృహ నిర్వాహకుడైన రతన్‌తో, మమ్మల్ని చూపుతూ శ్రీరామకృష్ణులు “ఈ కుఱ్ఱవాళ్ళు సజ్జనులు. ఈ కుఱ్ఱవాడు ఒకటిన్నర పరీక్షలలో ఉత్తీర్ణుడైనాడు. (ఆ సంవత్సరం నేను ఎఫ్.ఏ. పరీక్షలకు తయారవుతున్నాను); మర్యాదమన్నన తెలిసినవారు. కాని నేను నరేంద్రుని వంటి మరొక కుర్రవాణ్ణి మాత్రం చూడలేదు. నరేంద్రుడు గాత్ర సంగీతంలో, వాద్యసంగీతంలో కోవిదుడు; జ్ఞాన సముపార్జనలో, సంభాషించడంలో, ధార్మిక విషయాలలో అత్యంత సమర్థుడు. ధ్యానిస్తున్నప్పుడు రాత్రంతా అతడు బాహ్యస్మృతిని కోల్పోతాడు. కల్తీనాణెమో, స్వచ్ఛమైన నాణెమో తెలుసుకోవాలంటే స్వచ్ఛమైన నాణాన్ని దేనికైనా కొట్టి చూస్తే ఖంగున శబ్దం వస్తుంది. అదే స్వచ్ఛమైన నాణెం. నరేంద్రుడు కూడా కల్తీలేని స్వచ్ఛమైన నాణెం. ఇతర బాలురు ఎంతో శ్రమించి ఏదో విధంగా రెండు లేదా మూడు పరీక్షలలో ఉత్తీర్ణులు కావచ్చునేమో! అక్కడితో సరి, వాళ్ళ పని ఖాళీ. కాని నరేంద్రుని విషయం అలా కాదు. ప్రతి పనిని అతడు అలవోకగా చేసివేస్తాడు, పరీక్షలలో ఉత్తీర్ణత పొందడం అతడికి అల్పవిషయం. అతడు బ్రహ్మ సమాజానికి కూడా వెళ్ళి భక్తిగీతాలు ఆలపిస్తాడు; కాని అతడు ఇతర బ్రహ్మ సమాజస్థుల వంటివాడు కాడు. అతడు నిజమైన బ్రహ్మజ్ఞాని. ధ్యాన సమయంలో అతడికి జ్యోతి దర్శనం కలుగుతుంది. ఏమీ లేకుండానే నేను నరేంద్రుణ్ణి అంతగా ప్రేమిస్తున్నానా ఏమిటి?” అని చెప్పారు. ఆ పలుకులకు ముగ్ధులమై, నరేంద్రుని పరిచయం పొందగోరి, “మహాశయా, నరేంద్రుడు ఎక్కడ ఉంటున్నాడు?” అని అడిగాం. అందుకు ఆయన, “కలకత్తాలోని సిమ్లా పేట వాస్తవ్యుడైన విశ్వనాథ్ దత్త కుమారుడు నరేంద్రుడు” అని చెప్పారు. ఆ తరువాత మేం కలకత్తాకు తిరిగివచ్చి వాకబు చేయగా, శ్రీరామకృష్ణులు ఎంతగానో శ్లాఘించిన ఆ నరేంద్రుడు మరెవరో కాదు, తన పొరుగింటి, ఏ యువకుణ్ణి మా మిత్రుడు తీవ్రంగా విమర్శించాడో అతడే అని తెలియవచ్చింది. ఇటువంటి వ్యక్తుల వ్యాఖ్యానాలను బట్టి ఇతరుల ప్రవర్తనను అంచనా వేయడం ఎంత అనుచితమో అనుకొని మేం ఆశ్చర్యచకితులమైనాం.
8. నరేంద్రుణ్ణి మొదటిసారి కలుసుకొన్నప్పుడు రచయితకు కలిగిన పొరపాటు అభిప్రాయం
ఈ విషయానికి సంబంధించిన మరొక సంఘటనను ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. పై విధంగా నరేంద్రుని సుగుణాలను శ్రీరామకృష్ణులు మాకు వర్ణించి చెప్పడానికి కొన్ని నెలల ముందు అతణ్ణి ఒక మిత్రుడి ఇంట్లో కలుసుకొనే భాగ్యం మాకు కలిగింది. ఆ రోజు అతణ్ణి చూశాం కాని పొరపాటు అభిప్రాయం ఉన్నందువలన అతడితో ఏమీ మాట్లాడలేదు. కాని ఆ రోజు అతడు మాట్లాడిన వచనాలు, అనేక దశాబ్దాల తరువాత కూడా నిన్న మొన్న విన్నట్లుగా మాకు అనిపించే రీతిలో మా జ్ఞాపకాలలో బలంగా పాదుకుపోయాయి. వాటిని గురించి తెలిపే ముందు, ఏ పరిస్థితుల్లో మేం ఆ వచనాలు విన్నామో తెలుపవలసి ఉంది; లేకుంటే ఆ సందర్భంలో నరేంద్రుని గురించి పొరపాటు అభిప్రాయం మాలో ఎందుకు చోటుచేసుకొన్నదో మీరు అవగతం చేసుకోలేకపోవచ్చు.
9. ఒక మిత్రుని ఇంట్లో నరేంద్రుణ్ణి, రచయిత మొట్టమొదటిసారి కలుసుకోవడం
ఏ మిత్రుని ఇంట్లో ఆ రోజు నరేంద్రుణ్ణి చూశామో, ఆ మిత్రుడు గౌర్ మోహన్ ముఖర్జీ వీథిలోని నరేంద్రుని ఇంటికి ఎదురుగా ఒక రెండంతస్తుల మేడను అద్దెకు తీసుకొని ఉన్నాడు. నాలుగైదు సంవత్సరాలు మేం పాఠశాలలో సహాధ్యాయులం. ప్రవేశ పరీక్షకు కూర్చోవడానికి రెండేళ్ళ ముందు మా మిత్రుడు ఇంగ్లండుకు బయలుదేరాడు. కాని కారణాంతరాల వలన బొంబాయి దాటి పోలేకపోయాడు. తన లక్ష్యం నెరవేరకపోవడంతో, అతడు ఒక వార్తా పత్రికకు సంపాదకుడైనాడు; బెంగాలీలో కవితలు, వ్యాసాలు రచించి క్రమంగా కొన్ని పుస్తకాలు కూడా రచించాడు. ఒకింత కాలం క్రితమే వివాహం చేసుకొన్నాడు. ఆ తరువాత అతడు నీతిబాహ్య జీవితం గడుపుతున్నాడనీ, డబ్బు సంపాదించడానికి మోసాలకు కూడా వెనుకాడడం లేదనీ వినికిడి. దాన్లోని నిజానిజాలు తెలుసుకోగోరి ఒక రోజు చెప్పాపెట్టకుండా హఠాత్తుగా అతడి ఇంటికి వెళ్ళాం.
10. ఆ సమయంలో నరేంద్రుని బాహ్య ప్రవర్తన
మా రాక గురించి ఒక సేవకుడి ద్వారా కబురు పంపి, చావడి గదిలో కూర్చున్నాం. ఇంతలో ఒక యువకుడు ఆ గదిలోకి వచ్చాడు. కూనిరాగంలో హిందీ పాటను పాడుకోనారంభించాడు; ఆ ఇంటి యజమానితో అతడికి బాగా పరిచయం ఉన్నట్లు దీనిని బట్టి తెలియవస్తోంది. అతడు పాడిన పాటలు శ్రీకృష్ణుని గురించినవని మాకు జ్ఞాపకం; ఆ పాటలలో ‘కనాయ్’, ‘పిల్లనగ్రోవి’ అనే పదాలు మాకు స్పష్టంగా వినిపించాయి. అతడు పాడిన ‘నీలమేఘశ్యాముని పిల్లనగ్రోవి’, నవనాగరికం కాకపోయినా అతడు వస్త్రధారణలో చూపిన శ్రద్ధ, చక్కగా దువ్వుకొన్న శిరోజాలు, ఉదాసీనతకు దారితీస్తున్న అతడి అన్యమనస్కత – ఇవి, నీతిబాహ్యుడైన మా మిత్రుడితో అతడికి ఉన్న సన్నిహిత పరిచయం కలగలసి అతడి పట్ల మాకు ప్రతికూల అభిప్రాయాన్ని కలిగించాయి. మేం ఉన్నామనే ధ్యాసే లేకుండా అతడలా సిగ్గులేకుండా ప్రవర్తించడం, పిదప పొగత్రాగడం చూసి, మా నీతిబాహ్యుడైన మిత్రుడికి ఇతగాడు విశ్వాసపాత్రుడైన అనుయాయి అని మేం నిశ్చయించుకొన్నాం. ఇటువంటయువకులతో మెలగుతున్నందువల్లే మా మిత్రుడు మోసాలకు పాల్పడుతున్నాడని మాకు గట్టి నమ్మకం ఏర్పడింది. మమ్మల్ని గమనించినప్పటికీ ఉదాసీన వైఖరిని అతడు అవలంబించడం వలన మేం అతణ్ణి పరిచయం చేసుకోవాలని ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు.
11. మా మిత్రుడితో నరేంద్రుని సాహిత్య చర్చ
కాసేపటికి మా బాల్యమిత్రుడు రానేవచ్చాడు. చాలాకాలం తరువాత మేము కలుసుకొంటున్నప్పటికీ, మాతో ముక్తసరిగా ఏవో రెండు మాటలు మాట్లాడాడు. మమ్మల్ని విడిచిపెట్టి, పైన ప్రస్తావించిన యువకుడితో ఆనందంగా వివిధ విషయాల గురించి మాట్లాడసాగాడు. అతడి ప్రవర్తన అవమానకరంగా తోచినప్పటికీ, సభ్యత అడ్డువచ్చి మేం తక్షణమే సెలవు పుచ్చుకొని వెళ్ళలేకపోయాం. కాబట్టి వారిద్దరి మధ్య ఆంగ్లంలోను, బెంగాలీలోను జరుగుతున్న సంభాషణను వింటూ అక్కడే కూర్చున్నాం. మానవ భావనా వైఖరులను సరిగా వెలిబుచ్చడమే ఉన్నత సాహిత్య కర్తవ్యమని వారిద్దరూ దాదాపు అంగీకరించినప్పటికీ, ప్రతి మానవ భావనా వైఖరికి సరిగా ప్రాతినిధ్యం వహిస్తూ అభివ్యక్తం చేసే రచనను సాహిత్యం క్రింద పరిగణించవచ్చా? అనే అభిప్రాయభేదం వారి మధ్య తలెత్తింది. మా మిత్రుడు అందుకు అనుకూలంగాను, ఆ యువకుడు తద్విరుద్ధంగాను తమ అభిప్రాయాలను వెలిబుచ్చినట్లు మాకు గుర్తు. భావనా వైఖరిని, అది మంచిదైనా లేదా చెడుదైనా సరిగా వ్యక్తం చేసినంత మాత్రం చేత ఆ రచన ఉన్నత సాహిత్యం కాదనీ, చక్కని అభిరుచిని, ఉన్నత ఆదర్శాన్ని అభివ్యక్తం చేసే రచనే ఉన్నత సాహిత్యం క్రిందికి వస్తుందనీ ఆ యువకుడు మా మిత్రుడి అభిప్రాయాన్ని ఖండిస్తూ, అతణ్ణి తన అభిప్రాయంతో ఏకీభవించేలా చేయ ప్రయత్నించ సాగాడు. తన వాదనకు మద్దతుగా ఆ యువకుడు సుప్రసిద్ధ ఆంగ్ల సాహిత్యవేత్త ఛాసర్ నుండి ప్రసిద్ధ బెంగాలీ సాహిత్యకారుల రచనల వరకు ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ ఉన్నత ఉదాత్త సిద్ధాంతాన్ని అంటి పెట్టుకొని ఎలా అమరత్వం సాధించారో చక్కగా విశదీకరించి చెప్పాడు. చివరికి ఆ యువకుడు తన వాదనను “మంచి చెడు భావనా ధోరణులను మనిషి వ్యక్తం చేస్తూన్నప్పటికీ, అతడు సదా ఏదో ఒక ప్రత్యేక ఆదర్శాన్ని వెలిబుచ్చాలనే ప్రయాస పడుతూ ఉంటాడు. మనిషికి మనిషికి మధ్యనున్న తారతమ్యం ఆ ప్రత్యేక ఆదర్శాన్ని గ్రహించుకోవడంలోను, దానిని అభివ్యక్తీకరించడంలోను ఉంటుంది. రూపరసాది భోగాలు శాశ్వతమనీ, యథార్థమనీ సామాన్య జనులు ఎంచి, వాటినే తమ జీవిత ధ్యేయంగా పరిగణిస్తారు. They idealize what is apparently real* (చూపులకు వాస్తవంగా కనబడేదంతా వారు ఆదర్శనీయం చేసుకొంటారు.) పశువులకు, అటువంటి వ్యక్తులకూ ఎలాంటి తేడా ఉండదు. ఈ రకం వ్యక్తులు ఎన్నటికీ ఉదాత్త సాహిత్యాన్ని సృష్టించలేరు. మరొక కోవకు చెందిన వ్యక్తులున్నారు; చూపులకు వాస్తవంగా కనిపించే సుఖభోగాలతో సంతృప్తి చెందని వీరు, తమ అంతరాంతరాళాలలో ఉన్నతోన్నత ఆదర్శాలను భావన చేసుకొంటూ, ఆ ఆదర్శాల మేరకు బాహ్య వ్యవహారాలన్నీ మలచుకోవడానికి ఆతురత చెందుతారు – They want to realize the ideal.* (ఆ ఆదర్శాన్ని అనుభూతం చేసుకోగోరతారు.) ఈ కోవకు చెందిన వ్యక్తులు మాత్రమే నిజమైన సాహిత్యాన్ని సృష్టించగలరు. మళ్ళీ, వారిలోనే అటువంటి ఆ అత్యున్నత ధ్యేయం వైపుకు తిరిగి, ఈ జీవితంలోనే దానిని అనుభూతం చేసుకోవడానికి ప్రయత్నించేవారు, సర్వసామాన్యంగా లౌకిక జీవితానికి వెలుపలే ఉండిపోతారు. దక్షిణేశ్వరంలో వసిస్తూన్న పరమహంసదేవులు ఒక్కరే ఆ ఆదర్శాన్ని అనుభూతం చేసుకోవడం నేను కళ్ళారా చూశాను” అని చెబుతూ ముగించాడు.
12. శ్రీరామకృష్ణుల ద్వారా నరేంద్రుని మహత్వాన్ని రచయిత తెలుసుకోవడం
ఆ యువకుని పాండిత్యాన్ని, ఆ విస్తార భావాలను సమర్థించడంలో అతడు ప్రదర్శించిన వాదనా పటిమను చూసి మేం ఆశ్చర్యచకితులమైనాం. కాని అతడి వచనాలకూ, అతడి జీవన వైఖరికీ ఎటువంటి పొంతన లేదని తలచినప్పుడు నిజానికి మేం నిస్పృహ చెందాం; ఎందుకంటే, మా మిత్రుడి వంటి నీతిబాహ్యునితో అతడికెలా సన్నిహిత సాంగత్యం కలిగింది? ఆ తరువాత మా మిత్రుడి నుండి సెలవు పుచ్చుకొన్నాం. ఇది జరిగిన కొన్ని నెలల తరువాత నరేంద్రుడి సుగుణాలను శ్రీరామకృష్ణులు శ్లాఘించడం మేం వినడం తటస్థించింది; దాంతో నరేంద్రుణ్ణి కలుసుకొని అతడితో పరిచయం పొందాలని నిశ్చయించుకొన్నాం. శ్లాఘనీయుడైన ఆ నరేంద్రుడు మరెవరో కాదు, ఆనాడు మా బాల్యమిత్రుడి ఇంట్లో చూసిన యువకుడే అని తెలిసినప్పుడు మేం పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు.
13. ఆది నుండి శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి గుర్తించడం
సామాన్య జనం నరేంద్రుని బాహ్యప్రవర్తనను చూసి అతణ్ణి అహంకారిగా, పొగరుబోతుగా పరిగణించడం కద్దు. కాని శ్రీరామకృష్ణులు ఆ పొరపాటుకు లోనుకాలేదు. పరిచయమైనప్పటి నుండి, ‘అహంకారం, గర్వం’ అతడి అద్భుతమైన ఆత్మస్థైర్యం నుండి జనించాయనీ, ఆ ఆత్మస్థైర్యం అతడిలో మరుగున ఉన్న అనుపమాన మానసికశక్తి ఫలితంగా ఏర్పడిందనీ శ్రీరామకృష్ణులు అవగతం చేసుకొన్నారు; అతడి స్వేచ్ఛామయ ప్రవర్తన స్వాభావికమైన అతడి ఆత్మసంయమాన్ని సూచిస్తుందనీ, తనను గురించి ఇతరుల అభిప్రాయం పట్ల అతడి ఉదాసీన వైఖరి, స్వకీయ పావనత్వం గురించిన ఆత్మతృప్తి నుండి జనించిందనీ ఆయన గుర్తించారు. కాలక్రమంలో అసాధారణమైన నరేంద్రుని నైజం సహస్రదళ పద్మంలా పరిపూర్ణంగా వికసించి అనుపమాన మహత్త్వంలో సుస్థాపితమౌతుందనీ, లోకులు అనుభవిస్తూన్న యాతనలను, క్లేశాలను చూసి అతడి అహంకారం, గర్వం అనంత కరుణగా ద్రవిస్తుందనీ ఆయన ఎరుగకపోలేదు. అతడి అసాధారణ ఆత్మస్థైర్యం క్రుంగిపోయిన హృదయాలలో ఆశలను చిగురిస్తుందనీ శ్రీరామకృష్ణులు గ్రహించే ఉన్నారు; విశృంఖలం కాని అతడి స్వేచ్ఛాయుత ప్రవర్తన, ఆత్మసంయమంలోనే నిజమైన స్వేచ్ఛ ఉందని ఇతరులకు తేటతెల్లం చేస్తుందనీ ఆయనకు తెలియకపోలేదు.
14. బహిరంగంగా శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి ప్రశంసించడం: అందుకు హేతువు
శ్రీరామకృష్ణులు అంతగా నరేంద్రుణ్ణి ప్రశంసించడానికి అదే కారణం; నరేంద్రుని సుగుణాలను శ్లాఘించడానికి ఒక్క నోరు సరిపోదని ఆయన భావించడం అతిశయోక్తి కాబోదు. బహిరంగంగా ప్రశంసలందుకొన్న దుర్బల మనస్సు క్రమంగా అహంకారపూరితమై పతనం చెందుతుందని ఆయనకు తెలిసినప్పటికీ, నరేంద్రుని విషయంలో ఆ హెచ్చరికకు అవసరం ఉండదని ఆయన గ్రహించకపోలేదు. ఆ దుర్బలత్వానికి నరేంద్రుని మనస్సు ఎంతో ఎత్తులో సంచరిస్తూ ఉంటుందనే గట్టి నమ్మకం కుదిరినందుననే ఆయన అతణ్ణి బహిరంగంగా ప్రశంసించారు. కొన్ని ఉదాహరణలు చూస్తే ఈ విషయం పాఠకులకు బాగా అవగతమౌతుంది.
15. నరేంద్రునిలో అంతర్గతమై ఉన్న శక్తుల గురించి శ్రీరామకృష్ణులు
ఒకరోజు సుప్రసిద్ధ బ్రహ్మసమాజ నాయకులైన కేశవచంద్ర సేన్, విజయకృష్ణ గోస్వామి, తదితరులు శ్రీరామకృష్ణుల సమక్షంలో కూర్చుని ఉన్నారు. యువకుడైన నరేంద్రుడు కూడా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో శ్రీరామకృష్ణులు భావ సమాధిమగ్నులై, కేశవ్‌ను విజయ్ను అనుగ్రహ దృక్కులతో వీక్షించారు. పిదప ఆయన దృష్టి నరేంద్రునిపై పడింది. శ్రీరామకృష్ణుల మనోఫలకంపై నరేంద్రుని తేజోమయ భావిజీవిత చిత్రం కదలాడింది. తక్షణం కేశవాదుల పూర్తిగా వికసించిన జీవితాలతో నరేంద్రుని భావి జీవితాన్ని పోల్చుకొని, నరేంద్రుణ్ణి ఆప్యాయంగా పరికించారు. ఆ సమావేశం పూర్తికాగానే ఆయన “సమృద్ధంగా ఉన్న ఒక్క శక్తి కారణంగా కేశవ్ లోకప్రసిద్ధుడైనాడు; కాని నరేంద్రునిలో అటువంటి శక్తులు పద్ధెనిమిది ఉన్నాయి. కేశవ్, విజయ్‌ల హృదయాలు దీపశిఖ వంటి జ్ఞానజ్యోతితో ప్రకాశవంతమైనాయి; కాని నరేంద్రుని హృదయంలో సాక్షాత్తు జ్ఞానభాస్కరుడే ఉదయించి, ఆ శక్తితో అతనిలో కించిత్తు మాయాభ్రాంతులను సైతం సమూలంగా రూపుమాపినట్లు నేను కనుగొన్నాను.”
అంతర్దృష్టిరహితుడైన ఒక దుర్బల మనస్కుడు తనను శ్రీరామకృష్ణులే స్వయంగా ప్రశంసిస్తే గర్వంతో ఉప్పొంగిపోయి, తన్మయుడైపోవడం తథ్యం. కాని అటువంటి ప్రశంసకు నరేంద్రుని మానసిక ప్రతిస్పందన పూర్తి విరుద్ధం. అసాధారణ అంతర్దృష్టిని సంతరించుకొన్న నరేంద్రుడి మనస్సు, కేశవ్, విజయ్‌ల సుగుణాలతో స్వకీయ గుణాలను నిష్పక్షపాతంగా పోల్చుకొన్నది. తనను ఆ విధంగా శ్రీరామకృష్ణులు ప్రశంసించడాన్ని నరేంద్రుడు తీవ్రంగా నిరసిస్తూ, “మహాశయా, మీరు ఏమంటున్నారు? ఈ మాట వింటే జనం మిమ్మల్ని పిచ్చివాడి క్రింద జమకడతారు. లోకప్రసిద్ధుడైన కేశవ్, ఉదారుడైన విజయ్ ఎక్కడ, మామూలు పాఠశాల విద్యార్థినైన నేను ఎక్కడ? మా మధ్య హస్తిమశకాంతరం ఉంది! దయచేసి మళ్ళీ అలా ఎన్నడూ పోల్చకండి” అని వేడుకొన్నాడు. అతడి నిరసనను విని శ్రీరామకృష్ణులు ప్రసన్నులై, ఆప్యాయత ఉట్టిపడే కంఠంతో ఇలా అన్నారు : “నేను ఏం చేయాలి, నాయనా? నేనే అలా పలికానని అనుకొంటున్నావా? తల్లి ఇదంతా నాకు దర్శింపచేసింది; అందుకే అలా చెప్పాను. తల్లి నా కెప్పుడు సత్యాన్నే దర్శింపచేస్తుంది, ఎన్నటికీ అసత్యాన్ని చూపదు. అందువలననే నేను అలా మాట్లాడాను.”
16. అందుకు నరేంద్రుని నిరసన
తల్లి (జగజ్జనని) తమకు ఇది దర్శింప చేసిందనీ లేదా అలా వచించిందనీ చెప్పి నరేంద్రుణ్ణి సదా శ్రీరామకృష్ణులు సంతృప్తి పరచలేకపోయేవారు. శ్రీరామకృష్ణుల దర్శనాలలోని నిజానిజాలను సంశయిస్తూ నిర్మొహమాటంగా మాట్లాడే ధైర్యశాలియైన నరేంద్రుడు తరచు ఇలా అనేవాడు : “మీకు ఇవన్నీ తల్లియే దర్శింప చేస్తున్నదని ఎవరు చెప్పగలరు? మీ మెదడులో జనించే కల్పనలు కావచ్చునేమో! నాకే అటువంటి అనుభవాలు కలిగితే, తప్పకుండా వాటిని నా మెదడు కల్పించే వెఱ్ఱితలంపులుగా పరిగణిస్తాను. మన కళ్ళు, చెవులు, తక్కిన ఇంద్రియాలు, విశేషంగా ఒక విశిష్ట గుణం గల ఒక ప్రత్యేక వస్తువును చూడాలనే కోర్కె కలిగినప్పుడు, తరచు మనలను మోసపుచ్చుతాయని విజ్ఞానశాస్త్రం, తత్త్వశాస్త్రం నిర్వివాదాంశంగా ఋజువుచేసి ఉన్నాయి. నేనంటే మీ కెంతో ఆప్యాయత ఉంది, ప్రతి విషయంలోను నేను ఘనత వహించాలని ఆశిస్తున్నారు. అందుకే కాబోలు మీకు అటువంటి దర్శనాలు కలుగుతున్నాయి.”
17. నరేంద్రుని వాదనా పటిమ
ఆధునిక పాశ్చాత్య శరీరధర్మశాస్త్ర, మనస్తత్త్వశాస్త్ర పరిశోధకులు మార్మికులుగా పరిగణింపబడే ఒక కోవకు చెందిన వ్యక్తులు పొందే దర్శనాలను భ్రమలుగా చూపినట్లు సముచిత దృష్టాంతాల సహాయంతో నరేంద్రుడు తరచు శ్రీరామకృష్ణులకు విశదీకరింప ప్రయత్నించసాగాడు. శ్రీరామకృష్ణుల మనస్సు ఉన్నత భావభూములలో నెలకొని ఉన్నప్పుడు, నరేంద్రుని ఆ కుఱ్ఱతనపు ప్రయత్నాన్ని సత్యం తెలుసుకోవాలనే అతడి ప్రగాఢ వాంఛగా ఎంచి, అతడి పట్ల మరింత ప్రసన్నులవసాగారు. కాని మామూలు బాహ్యచైతన్య స్థితిలో ఉన్నప్పుడు బాలక మనస్కులైన శ్రీరామకృష్ణులు అతడి కుశాగ్ర వాదనలు విని ఆరాటం చెందేవారు. అప్పుడాయన సందిగ్ధావస్థలో పడిపోయి, ఇలా ఆలోచించే వారు : ‘ఆహా! నరేంద్రుడు త్రికరణశుద్ధిగా సత్యసంధుడు, అసత్యమాడడు. సత్యమైన భావనలు మాత్రమే నరేంద్రుని వంటి సత్యసంధుల మనస్సులలో జనిస్తాయని శాస్త్రాలు నొక్కివక్కాణిస్తున్నాయి. అటువంటప్పుడు నా దర్శనాలు పొరపాటు అయ్యే ఆస్కారం ఉందా? కాని అనేక విధాల నా దర్శనాలను ఇంతకు మునుపు పరీక్షించి, తల్లి ఏది సత్యమో దానినే నాచే దర్శింపచేసిందని రూఢిపరచుకొనే ఉన్నాను. పైగా అవి సత్యాలే అని ఆమె ముఖతా పదేపదే విన్నాను కూడా. అటువంటప్పుడు సత్యమే జీవితంగా గడిపే నరేంద్రుడు ఆ దర్శనాలను నా మనోకల్పనలని ఎందుకు చెబుతున్నాడు? నా దర్శనాలను గురించి తెలుపగానే అవి సత్యాలే అని ఎందుకతడు అంగీకరించడం లేదు?’ ఇలా కలత చెంది చివరికి ఆయన ఈ విషయాన్ని అమ్మకు నివేదించారు. “అతడి మాటలు ఎందుకు వింటావు? ఇదంతా సత్యమేనని స్వల్పకాలంలోనే అతడు అంగీకరిస్తాడు” అనే అమ్మ అభయవచనాలు విన్న తరువాత శ్రీరామకృష్ణులు నిశ్చింతులైనారు. పైన చెప్పిన దానిని మరింత బాగా అర్థం కావడానికి ఉదాహరణగా ఇక్కడ ఒక సంఘటనను పొందుపరుస్తున్నాం –
18. నరేంద్రుణ్ణి చూడగోరి శ్రీరామకృష్ణులు సాధారణ బ్రహ్మ సమాజానికి వెళ్ళడం
అప్పటికి కూఛ్బిహార్ వివాహం కారణంగా బ్రహ్మసమాజం రెండుగా చీలిపోయింది. సాధారణ బ్రహ్మసమాజం అంతకు కొన్ని ఏళ్ళ మునుపు స్థాపించబడింది. నరేంద్రుడు అప్పుడప్పుడు కేశవ్ వద్దకు పోతూవున్నప్పటికీ, క్రమం తప్పకుండా సాధారణ బ్రహ్మసమాజ ఆదివార ప్రార్థనా సమావేశాలలో పాల్గొంటూ, అక్కడ భక్తిగీతాలు పాడేవాడు. ఒక సందర్భంలో నరేంద్రుడు ఒక వారమో లేదా రెండు వారాలో శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరానికి వెళ్ళలేక పోయాడు. అతడి కోసం శ్రీరామకృష్ణులు ఎదురుతెన్నులు చూసి, చివరకు స్వయంగా తామే కలకత్తాకు పోయి నరేంద్రుణ్ణి చూడ నిశ్చయించారు. ఆ రోజు ఆదివారం కావడం వలన, నరేంద్రుడు ఎవరినన్నా చూడడం కోసం బయటకు వెళ్ళివుంటాడనీ, కాబట్టి తాము కలకత్తాకు వెళ్ళినా ప్రయోజనం ఉండదనీ ఆయనకు గుర్తుకువచ్చింది. తాము సాధారణ బ్రహ్మసమాజానికి పోతే, నాడు ఆదివారం కాబట్టి అక్కడ తప్పకుండా నరేంద్రుణ్ణి చూడవచ్చునని చివరకు శ్రీరామకృష్ణులు నిర్ణయించారు. తాము ఇలా హఠాత్తుగా అక్కడకు వెళితే బ్రహ్మసమాజస్థులకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న ఆలోచన ఆయన మదిలో మెదలకపోలేదు. కాని మరుక్షణంలోనే మళ్ళీ ఇలా ఆలోచించారు : “ఎందుకు అలా అనుకోవాలి? కేశవ్ సమాజానికి అలాగే అనేకసార్లు వెళ్ళాను, నా రాక పట్ల వారు ఆనందాన్నే వ్యక్తపరిచారు. సాధారణ బ్రహ్మసమాజ నాయకులైన విజయ్, శివనాథ్ మొదలైన వారు కూడా తరచు దక్షిణేశ్వరానికి వస్తూనే ఉన్నారు కదా!” ఇలా ఆలోచించినప్పటికీ సరళహృదయులైన శ్రీరామకృష్ణులకు ఒక ముఖ్య విషయం జ్ఞాపకం రాలేదు. శ్రీరామకృష్ణులతో సాంగత్య లబ్ధిపొందిన తరువాత కేశవ్, విజయ్‌ల ధార్మిక వైఖరులలో మార్పు రావడం గమనించి, శివనాథ్ తదితర సాధారణ బ్రహ్మసమాజస్థుల దక్షిణేశ్వర రాకలు క్రమంగా తగ్గిపోవడం శ్రీరామకృష్ణులకు స్ఫురించలేదు. అలా గమనించలేకపోవడం ఆయనకు స్వాభావికమే కదా! ఎందుకంటే, మనిషి ధార్మిక భావాలు అతడి మనస్సు ఉన్నతోన్నత ఆధ్యాత్మిక భావభూములను అధిరోహించి, భగవదనుగ్రహం పొందినప్పుడు సమూల మార్పులకు లోనవుతుందనే భావన సదా ఆయన హృదయాంతరాళాల్లో కలుగుతూండేది. కాబట్టి సత్యం పట్ల అనురక్తి గల బ్రహ్మసమాజస్థులు ఇప్పుడు మరో త్రోవపట్టి ఆధ్యాత్మిక అనుభవాలకు పరిమితిని కల్పిస్తారని ఆయన ఎలా అనుకోగలరు?
19. ఆయన రాకకు ఫలితం
అప్పుడు మునిమాపువేళ. వందలాది బ్రహ్మసమాజస్థుల పావన హృదయాలు, ‘బ్రహ్మ సత్యం జ్ఞానం అనంతం’ మొదలైన మంత్రోచ్చారణల మూలంగా జనించిన ఉద్వేగంతో ఉప్పొంగి, భగవత్ పాదపద్మాలలో లయమై ఉన్నాయి. మెల్లగా ప్రార్థన, ధ్యానం ముగింపుకు వచ్చాయి. పిదప ఆచార్యుడు పీఠాన్ని అలంకరించి, అక్కడ సమావేశమై ఉన్న సమాజ సభ్యులకు దైవభక్తిని పెంపొందించే ఉపదేశాలు ఇవ్వసాగాడు. అదే సమయంలో అర్ధబాహ్య చైతన్యంలో ఉన్న శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజ మందిరంలోకి ప్రవేశించి, తిన్నగా పీఠంమీద ఆసీనుడై ఉన్న ఆచార్యుని వద్దకు వెళ్ళారు. అక్కడ సమావేశమైవున్న వారిలో అనేకులు ఆయనను ఇంతకు మునుపే చూసివున్నారు. కాబట్టి శ్రీరామకృష్ణుల రాక అక్కడున్న అందరికీ క్షణంలో తెలిసిపోయింది. ఇంతకు మునుపు శ్రీరామకృష్ణులను చూడనివారు ఆయనను చూడగోరి నేల మీద, బల్లల మీద లేచి నిలబడ్డారు. దాంతో అక్కడ ఒకింత గడబిడ పరిస్థితి నెలకొనడంతో, ఆచార్యుడు ఉపదేశ ప్రసంగాన్ని ముగించవలసి వచ్చింది. భక్తిగీతాలు ఆలాపించే బృందంలో కూర్చున్న నరేంద్రుడు, శ్రీరామకృష్ణులు హఠాత్తుగా అలా రావడానికి కారణం గ్రహించి, ఆయన వద్దకు వచ్చాడు. కాని విజయ్ తదితర బ్రహ్మసమాజ నాయకులలో భిన్నాభిప్రాయం కలగడానికి కారకులైన వ్యక్తి శ్రీరామకృష్ణులే అని నిశ్చయించుకొన్న ఆచార్యుడు, తక్కిన ముఖ్యులు, ఆయన పట్ల ఉదాసీనంగా వ్యవహరించారు. కనీస మర్యాదను సైతం వారు పాటించలేదు.
20. జనాన్ని చెల్లా చెదరు చేయడానికి దీపాలు ఆర్పివేయడం
ఏ ప్రక్కకు చూడకుండా శ్రీరామకృష్ణులు తిన్నగా పీఠం వద్దకు వచ్చారు; అప్పుడు ఆయన భావపారవశ్యంలో ఉన్నారు. ఆయన ఆ భావసమాధ్యవస్థను చూడగోరిన జనసమూహంలో గడబిడ మరింత అధికరించి, గందరగోళ పరిస్థితి అక్కడ నెలకొంది. ఆ గడబిడ తగ్గే సూచనలు ఏవీ కనిపించక పోవడంతో, జనాన్ని చెల్లాచెదరు చేయడానికి ఆ సమావేశ సభామంటపంలోని దీపాలను ఆర్పివేశారు. ఆ చీకటిలో ప్రతి ఒక్కరూ ద్వారం వైపుకు పరుగెత్తడంతో ఆ గందరగోళం తీవ్రస్థాయికి చేరుకొంది.
21. శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరానికి నరేంద్రుడు తోడ్కొని వెళ్ళడం
శ్రీరామకృష్ణులను సమాజ సభ్యులు ఎవరూ పట్టించుకోకపోవడం చూసి నరేంద్రుడు స్వయంగా తానే ఆయనను ఆ చీకటిలో నుండి బయటకు తోడ్కొని రావడంలో నిమగ్నుడైనాడు. శ్రీరామకృష్ణుల భావపారవశ్యం తగ్గిపోగానే, నరేంద్రుడు ఆయనను వెనుక ద్వారం గుండా ఎంతో కష్టంమీద బయటకు తోడ్కొని వచ్చాడు. తరువాత ఆయనను ఒక బండిలో దక్షిణేశ్వరానికి తోడ్కొని వెళ్ళాడు. ఆ సంఘటన గురించి నరేంద్రుడు ఇలా చెప్పాడు : “ఆ రోజు నా గురించి ఆయన ఎంతటి నిరాదరణకు గురైనారో తలచుకొంటే ఎంతో బాధగా ఉంది. ఆ రోజు ఆ ప్రవర్తనకు ఆయన్ని ఎంతగా నిందించానో కదా! కాని ఆయనో! ఆ అవమానానికి బాధ పడలేదు, సరికదా నా నిందాలాపాలకు చెవి ఒగ్గనూ లేదు. ఆయన ప్రక్కన నేను ఉండడంతో ఆయన ఎంతో సంతృప్తి చెందారు.”
22. తనను అంతగా ప్రేమిస్తూన్నందుకు నరేంద్రుడు, శ్రీరామకృష్ణులను నిరసించడం
“నా పట్లగల ప్రేమతో తమను గురించి ఆయన బొత్తిగా శ్రద్ధవహించక పోవడం చూసి, ఆయనతో కొన్ని సందర్భాలలో పరుషంగా మాట్లాడడానికి కూడా నేను సంకోచించలేదు. నేను ‘జడభరతుడు సదా ఒక లేడిని గురించే చింతనచేస్తూ ఉండడం వలన మరుజన్మలో లేడిగా జన్మించాడని పురాణాలలో చెప్పబడింది. అదే నిజమైతే, సదా నా గురించే చింతన చేస్తూన్న మీరు కూడా పర్యవసానం ఏమిటో కాస్త ఎరిగి, అప్రమత్తంగా ఉండండి.’ అని హెచ్చరిక ధోరణిలో చెప్పేవాణ్ణి. బాలక మనస్తత్త్వంగల శ్రీరామకృష్ణులు ఆ మాటలు విని ఆందోళన చెందారు. పిదప, ‘నువ్వన్నది నిజమే, నాయనా! అలా జరగడం ఎంతటి దుర్ఘటన! కాని నిన్ను చూడకుండా నేను ఉండలేను. ఏం చేయాలి?’ అని అన్నారు. భయవిషాదాలు పెనుగొనగా శ్రీరామకృష్ణులు ఈ విషయాన్ని నివేదించడానికి జగజ్జనని వద్దకు వెళ్ళారు. కాసేపట్లో తిరిగి వచ్చి, ఆనందంగా ఇలా చెప్పారు: ‘వెళ్ళిపో ధూర్తుడా! మళ్ళీ ఎన్నడూ నీ మాటలకు చెవి ఒగ్గను. నాకు అమ్మ ఇలా చెప్పింది: ‘నువ్వు అతణ్ణి ప్రేమిస్తున్నావు. అతడిలో ఏ రోజు అయితే నారాయణుణ్ణి చూడలేవో, ఆనాటి నుండి నువ్వు అతడి వైపు క్షణం కూడా దృష్టిని సారించవు’ అని చెప్పి సంశయం నివృత్తి చేసుకున్నారు. నాపై ఆయన చూపుతున్న అసాధారణ ప్రేమ పట్ల నేను లేవనెత్తిన అభ్యంతరాలను ఒక్క మాటతో ఆయన కొట్టిపడేశారు.”