1. తొలి జీవితంలో నరేంద్రుని అసాధారణ అనుభూతులు
నరేంద్రనాథ్ ఎంతో అరుదైన ఉదాత్త సంస్కారాలతో జన్మించాడు. శ్రీరామకృష్ణులను దర్శించడానికి మునుపే అతడు పొందిన అసామాన్య అనుభూతులు ఈ విషయాన్ని రూఢిచేస్తాయి. అందుకు కొన్ని ఉదాహరణలను ఇక్కడ పొందుపరుస్తున్నాం. నరేంద్రుడు ఇలా చెప్పేవాడు : “నిద్రించడానికి కళ్ళు మూసుకోగానే భ్రూమధ్యంలో ఒక అద్భుతమైన జ్యోతి బిందువును జీవిత పర్యంతం గాంచేవాణ్ణి. ఆ జ్యోతిలో ఏర్పడే వివిధ మార్పులను శ్రద్ధగా గమనించేవాణ్ణి. ఆ జ్యోతిని స్పష్టంగా చూడాలనే ఉద్దేశంతో నేను బోర్లా పడుకొనేవాణ్ణి. ఆ అసాధారణ జ్యోతి బిందువు రంగులు మారుస్తూ, పరిమాణంలో పెద్దదవుతూ కానవచ్చేది; క్రమంగా ఆ బిందువు బంతి పరిమాణానికి పెరిగి చివరకు పగిలిపోయి, నా ఆపాదమస్తకాన్ని ధవళ కాంతితో కప్పివేసేది. అలా జరగగానే నేను బాహ్యస్మృతి కోల్పోయి, నిద్రలోకి జారిపోయేవాణ్ణి. అందరూ అదేవిధంగా నిద్రిస్తారనుకొనే వాణ్ణి. చాలాకాలం అదే అభిప్రాయంలో ఉండిపోయాను. పెరిగి పెద్దవాడినయ్యాక ధ్యానం అభ్యసిస్తూన్నప్పుడు, కళ్ళు మూసుకోగానే ఆ జ్యోతి బిందువు నా ముందు ప్రత్యక్షమయ్యేది; అప్పుడు నా మనస్సును దాని మీద ఏకాగ్ర పరచేవాణ్ణి. మహర్షి దేవేంద్రనాథ్ ఉపదేశానుసారం ఆ రోజుల్లో నేను కొందరు మిత్రులతో నిత్యం ధ్యానం అభ్యసించేవాణ్ణి. మాలో మేం మాకు కలిగిన అనుభూతులు, దర్శనాలను గురించి మాట్లాడుకొనేవారం. ఆ సందర్భంలోనే వారెవరికీ అటువంటి జ్యోతి దర్శనం కలగలేదనీ, వారెవరూ ఆ రీతిలో నిద్రపోయేవారు కారనీ నేను తెలుసుకొన్నాను”
2. ఏదైనా వస్తువునో, ప్రదేశాన్నో చూపిస్తున్నప్పుడు గత జన్మల స్మృతులు గుర్తుకురావడం
“చిన్ననాటి నుండి కొన్ని సమయాలలో నేను ఒక వస్తువునో, ప్రదేశాన్నో లేదా వ్యక్తినో చూసినప్పుడు దానితోనో లేదా ఆ వ్యక్తితోనో నా కెంతో పూర్వ పరిచయం ఉన్నట్లు తోచడం కద్దు; అంతకు పూర్వమే దానినో లేదా ఆ వ్యక్తినో చూసినట్లు నాకు అనిపించేది. ఇలా తరచుగా జరిగేది. బహుశా అప్పుడు నేను మిత్రులతో కలిసి ఏదో ఒక చోట ఏదో అంశం గురించి చర్చిస్తూ ఉండివుంటాను; ఆ సమయంలో ఎవరో ఏదో వ్యాఖ్యానించగానే, తక్షణమే, ‘హా! ఈ అంశంమీదే వాళ్ళతో ఈ ఇంట్లో చాలాకాలం ప్రదేశాన్నో క్రితం ముచ్చటించాను, ఇదే వ్యక్తి ఆ సమయంలో ఇలాగే వ్యాఖ్యానించాడు’ అనే విషయం గుర్తుకొచ్చేది. ఎప్పుడు, ఎక్కడ వాళ్ళతో ఆ విధంగా మాట్లాడానో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను గాని, స్ఫురణకు రాలేదు. పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలిసినప్పుడు, బహుశా ఆ ప్రదేశాల, ఆ వ్యక్తులతో గత జన్మలో పరిచయం ఉండివుంటుందనీ, కొన్ని సమయాలలో ఆ విషయాలు పాక్షికంగా గుర్తుకు వస్తూవుండవచ్చుననీ అనుకొనేవాణ్ణి. ఆ తరువాత అటువంటి నిర్ణయానికి రావడం యుక్తియుక్తం కాదని గట్టి నమ్మకం ఏర్పడింది. నేను జన్మించడానికి పూర్వమే, ఈ జన్మలో పరిచయస్థులు కాబోయే వారిని ఏదో విధంగా చూసివుంటాననీ, నేను జన్మించిన తరువాత అప్పుడప్పుడు వారి జ్ఞాపకాలు నా మనస్సులో మెదలుతున్నవనీ ప్రస్తుతం* నాకు అనిపిస్తున్నది” ఇలా నరేంద్రుడు తన అద్భుత అనుభూతుల గురించి మాకు తెలియజెప్పాడు.
3. శ్రీరామకృష్ణుల దివ్యశక్తుల ప్రత్యక్షానుభూతిని నరేంద్రుడు చవిచూడడం
శ్రీరామకృష్ణుల పావన జీవితం, భావపారవశ్యతల గురించి అనేకుల* నుండి విన్న తరువాతనే నరేంద్రుడు ఆయనను దర్శించడానికి వచ్చాడు. ఆయనను చూసినప్పుడు తనలో మానసికంగా మార్పు వస్తుందని గాని లేదా అద్భుత అనుభూతిని చవిచూస్తాననిగాని అతడు కలలోకూడా ఊహించలేదు. కాని సంఘటనలు మరోవిధంగా జరిగాయి. శ్రీరామకృష్ణులను రెండవసారి, మూడవసారి సందర్శించిన సందర్భంలో కలిగిన అసాధారణ అనుభూతులతో పోల్చిచూసినప్పుడు, నరేంద్రుడు గతంలో పొందిన అనుభూతులు చిల్లిగవ్వకు కొరగావని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీరామకృష్ణుల వ్యక్తిత్వ అగాధాలను తరచిచూడ ప్రయత్నించినప్పుడు అసాధారణమైన అతడి మేధస్సు పరాజయాన్ని చవిచూసింది; ఆ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కానరాలేదు. అగ్రాహ్యమైన శ్రీరామకృష్ణుల దివ్యశక్తి మూలంగానే తనకు అద్భుత అనుభూతులు కలిగాయని విశ్వసించకపోవడంలో కించిత్తు కారణం కూడా అతడు కనుగొనలేకపోవడమే అందుకు హేతువు.దానిని గురించి గాఢంగా ఆలోచించేకొద్దీ అతడి విస్మయం హద్దులు మీరసాగింది.
4. ఆధ్యాత్మిక జీవితానికి నరేంద్రుని అర్హత
శ్రీరామకృష్ణులను దక్షిణేశ్వరంలో రెండవసారి దర్శించినప్పుడు నరేంద్రుడు పొందిన అద్భుత అనుభూతిని గురించి యోచించిన ప్రతి ఒక్కరూ స్తబ్ధులు కావడం అనివార్యం. సుదీర్ఘకాల తపశ్చర్యలు, వైరాగ్యం పాటించిన ఫలితంగా ఒక సామాన్యవ్యక్తి జీవితంలో అటువంటి అనుభూతి కలుగుతుందని శాస్త్రాలు వచిస్తున్నాయి; ఆ అనుభూతి కలిగినప్పుడు ఆ వ్యక్తి పరమానందం చెందడమే కాక, గురువులో భగవంతుని అభివ్యక్తీకరణను గాంచి, ఆయనకు ఆత్మసమర్పణ చేసుకొంటాడు. నరేంద్రుడు అలా చేయకపోవడంలో అంతగా ఆశ్చర్యపోనక్కరలేదు. అతడి అసాధారణ ఆధ్యాత్మిక అర్హత అతడలా చేయకపోవడానికి కారణం. అతడు ఆధ్యాత్మికతలో సమున్నత శ్రేణికి చెందిన వ్యక్తి కావడం వలననే ఆ సమయంలో పూర్తిగా తన్మయత్వంలో మునిగిపోలేదు. ఈ అసాధారణ అర్హత కారణంగానే అతడు తనను అద్భుతంగా అదుపులో ఉంచుకోగలిగాడు. పైగా శ్రీరామకృష్ణుల అసాధారణ వ్యక్తిత్వాన్ని ప్రవర్తనను పరీక్షించడంలోనూ, అందుకు కారణాన్ని కనుగొనడంలోనూ ఎక్కువసేపు గడపడం కూడా అందుకు కారణం కావచ్చు. పూర్తిగా శ్రీరామకృష్ణులకు శరణాగతుడు కానప్పటికీ, అతడు ఆయన పట్ల ఎంతో ఆకర్షితుడైనాడనడంలో ఎలాంటి సంశయమూ లేదు.
5. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణుల ఆకర్షణ
వారిద్దరు కలుసుకొన్న నాటి నుండి శ్రీరామకృష్ణులు, నరేంద్రుని పట్ల ఎంతో ఆకర్షితులైనారు. తమ ఆధ్యాత్మిక జీవితంలో అనుభూతం చేసుకొన్న సమస్తాన్నీ పరమ అర్హుడైన శిష్యుడు తారసపడగానే అతడికి ప్రసాదించాలనే ఆతురతతో ఆ బ్రహ్మజ్ఞానియైన గురువరేణ్యుడు ఆరాటం చెందసాగాడు. ఆ తహతహ వర్ణనాతీతం. ఉద్దేశ రహితమూ, స్వార్థరహితమూ అయిన ఆ ఆరాటం భగవత్సంకల్పాన్ని నెరవేర్చే ఆత్మారాములైన గురువుల మనస్సులలో జనిస్తుంది. ఇటువంటి ఉన్నత మానసిక ప్రేరణకు లోనై జగద్గురువులు అర్హులైన శిష్యులకు జ్ఞానాన్ని అనుగ్రహించి, వారిని సమస్త కామ బంధనాల నుండి విముక్తులను చేసి, పరిపూర్ణత్వాన్ని సంతరించుకొనేలా చేస్తారు.*
6. మొదటి సమావేశంలోనే నరేంద్రునికి బ్రహ్మజ్ఞానం అనుగ్రహింప శ్రీరామకృష్ణులు ప్రయత్నించడం
మొట్టమొదటిసారి నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణులు అతడికి ఏకకాలంలో సమాధి స్థితిని, బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి ఉత్సుకత చూపించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఎందుకంటే, ఇది జరిగిన మూడు లేక నాలుగేళ్ళ తరువాత నరేంద్రుడు పూర్తిగా శ్రీరామకృష్ణులను శరణుజొచ్చి పదేపదే తనకు నిర్వికల్ప సమాధి స్థితిని ప్రసాదించమని ప్రార్థించాడు. అప్పుడు ఆయన ఈ సంఘటనను వ్యంగ్యంగా సూచిస్తూ, మా సమక్షంలో ఎత్తిపొడుపుగా, “ఎందుకు? నాకు తల్లితండ్రులు ఉన్నారని అప్పుడు చెప్పలేదా?” అని అన్నారు. మరో సందర్భంలో ఆయన అతడితో ఇలా చెప్పారు : “ఇలా చూడు. ఒక ఫలానా వ్యక్తి చనిపోయి, దయ్యం అయ్యాడు. అతడు సుదీర్ఘకాలం ఏకాకిగా ఉండిపోవడంతో, ఒక సహచరుడి తోడుకోసం పరితపించిపోయాడు. ఎవరో ఒక వ్యక్తి ప్రమాదంలో మరణించాడని తెలియగానే తన చిరకాల వాంఛయైన తోడు లభిస్తుందనే ఆశతో ఆ ప్రమాదం జరిగిన చోటుకు ఈ వ్యక్తి (దయ్యం) ఒక్క పరుగున వెళ్ళేవాడు. కాని పాపం ఈ దయ్యానికి నిరాశే ఎదురయ్యేది. ప్రమాదంలో చనిపోయిన మనిషి దయ్యంగా రూపాంతరం చెందకుండా గంగాజలం అతడి భౌతిక కాయం మీద చిలకరించే వారు. కాబట్టి ఈ దయ్యం నిరాశానిస్పృహలతో వెనక్కు తిరిగివచ్చి, పూర్వంలా ఏకాకిగానే జీవించసాగింది. తోడు కావాలన్న ఈ దయ్యం కోర్కె ఎన్నటికీ నెరవేరలేదు. నేను కూడా కచ్చితంగా అదే స్థితిలో ఉన్నాను. నిన్ను చూడగానే, ‘ఈసారి అయినా బహుశా నాకు తోడు లభిస్తుంది’ అని అనుకొన్నాను. కాని నువ్వు కూడా నాకు తల్లితండ్రులున్నారని చెప్పావు. కాబట్టి ఇప్పటికీ నా కొక సహచరుడు లభించలేదు” అని ఈ విధంగా శ్రీరామకృష్ణులు ఆనాటి సంఘటనను ప్రస్తావిస్తూ నరేంద్రుణ్ణి ఎగతాళి చేసేవారు.
7. నరేంద్రుడు మొదటిసారి, రెండవసారి పొందిన అద్భుత అనుభవాలలోని తారతమ్యం
సమాధి స్థితిని పొందబోతున్న తరుణంలో నరేంద్రుడి మనస్సును విపరీతమైన భయం ఆవరించడం గమనించిన శ్రీరామకృష్ణులు, అతడి మనస్సును ఆ ఊర్ధ్వస్థితికి అధిరోహింపచేసే ప్రయత్నాన్ని అప్పటికి విరమించారు. అయినప్పటికీ శ్రీరామకృష్ణుల మనస్సును సందేహ మేఘాలు ఆవరించాయి. గతంలో తాము నరేంద్రుణ్ణి గురించి పొందిన దర్శనాల, అనుభూతుల వాస్తవికత పట్ల ఆయనకు సందేహాలు తలెత్తాయి. బహుశా అందుకే ఆయన నరేంద్రుడు మూడవసారి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు తమ శక్తితో అతడి అంతరాంతరాళాల్లో నుండి అతడి జీవిత రహస్యాలను తెలుసుకొన్నారని మా ఊహ. తమ ప్రశ్నలకు నరేంద్రుడు ఇచ్చిన జవాబులు తమ దర్శనాలతో కచ్చితంగా సరిపోవడంతో నిశ్చింతులయ్యారు. మొదటిసారి, రెండవసారి నరేంద్రుడు ఒకే రకమైన భావపారవశ్యం పొందలేదని ఇందుమూలంగా తేటతెల్లమౌతున్నది.
8. నరేంద్రుని గురించి శ్రీరామకృష్ణుల వెరపు
ఆ పరీక్షానంతరం శ్రీరామకృష్ణులు ఒక రకంగా నిశ్చింతులయ్యారు; కాని ఏదో చెప్పరాని వెరపు ఆయన మనస్సులో పొంచివుంది. అందుకు కారణం: నరేంద్రుడిలో సంపూర్ణంగా పద్ధెనిమిది గుణాలు లేదా శక్తి అభివ్యక్తీకరణలు ఉండడం ఆయన చూశారు. ఆ గుణాలలో కేవలం ఒకటో రెండో గుణాలు ఉన్న వ్యక్తి లోకంలో పేరుప్రఖ్యాతులు, అసాధారణ ప్రాబల్యం సముపార్జించుకోగలుగుతాడు. భగవంతుణ్ణి గురించిన, మనిషిని గురించిన, ప్రపంచాన్ని గురించిన పరమ సత్యాలను అనుభూతం చేసుకొనే నిమిత్తం తనలో కేంద్రీకృతమైన శక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నిర్దేశించడంలో నరేంద్రుడు విఫలుడైతే, పర్యవసానంగా అవాంఛనీయ ఫలితాలను చవిచూడవలసి వస్తుందని శ్రీరామకృష్ణులు భయపడ్డారు. అదే కనుక జరిగితే నరేంద్రుడు ఒక సరిక్రొత్త మతశాఖను స్థాపించి, ఇతర ధార్మిక నాయకులలా లేదా ప్రవక్తలలా లోకఖ్యాతి గాంచుతాడు. కాని అలా జరిగే పక్షంలో ముందుగా ఆత్మసాక్షాత్కారం పొందకుండా ఆధ్యాత్మిక జగత్తులోని మహోదార సత్యాలను ప్రచారం చేయడానికి అతడికి సాధ్యం కాదు. ఆ విధంగా లోకం తాను పొందబోయే గొప్ప వరాన్ని కోల్పోతుంది. అందువల్ల నరేంద్రుడు సకల విషయాలలోను తమను అనుసరించాలనే, తమ మాదిరే మహోదార ఆధ్యాత్మిక సత్యాలను ఆకళింపుచేసుకొని వాటిని లోకానికి వెల్లడించాలనే తీవ్ర ఆకాంక్ష శ్రీరామకృష్ణులలో జనించింది. శ్రీరామకృష్ణులు తరచు ఇలా చెప్పేవారు : “నీరు ప్రవహించని చెరువుల, కొలనులలో కలుపు మొక్కలు పెరిగే రీతిలో, మనిషి పాక్షిక ఆధ్యాత్మిక సత్యాలనే పరిపూర్ణ సత్యాలుగా ఎంచి సంతృప్తి చెందినప్పుడు పరిమిత ప్రాంతానికి మాత్రమే వర్తించే మతశాఖలు ఉద్భవిస్తాయి.” పరమసత్యానుభూతిని పొంద నరేంద్రుణ్ణి అర్హునిగా రూపొందించడానికి ఎన్ని విధాల శ్రీరామకృష్ణులు ప్రయత్నించారో యోచిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులౌతారనడం అతిశయోక్తి కాదు. అలా అర్హుని చేయకుంటే అసాధారణ మేధస్సు, మానసిక బలం గల నరేంద్రుడు భ్రష్టుపట్టి, సొంత మతశాఖను రూపొందించడం తథ్యమని ఆయన ఊహించకపోలేదు.
9. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు ఎందుకు ఆకర్షితులైనారు?
పైన పేర్కొన్న రీతిలో భ్రష్టుపట్టే ఆస్కారం నరేంద్రునికి ఇక లేదని ఆయనకు ప్రగాఢ నమ్మకం కలిగేటంత వరకు మొట్టమొదటి సమావేశం నుండి నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులకు ఏర్పడ్డ విచిత్ర, బలీయమైన ఆకర్షణ ఉపశమించలేదు. ఈ అసాధారణ ఘటనను గురించి ఒకింత పునరాలోచించి చూసినప్పుడు అందుకైన కొన్ని కారణాలు నరేంద్రుణ్ణి గురించి శ్రీరామకృష్ణులకు కలిగిన అసాధారణ దర్శనాలలో వ్రేళ్ళూని ఉన్నాయనీ, మిగిలినవి ఆయన భయంలో పాదుకొని ఉన్నవనీ స్పష్టంగా తెలుస్తుంది. ఆధునిక యుగ ప్రభావంలో పడిపోయి అతడు ఇచ్ఛా పూర్వకంగా భార్య, సంపద లేదా పేరుప్రతిష్ఠలు మొదలైన కోర్కెల బంధాలను తగిలించుకొని, తన ఉత్కృష్ట జీవిత పరమ లక్ష్యాన్ని పాక్షికంగానైనా నెరవేర్చక పోతాడేమోననే భయం ఆయనలో లేకపోలేదు.
10. ఈ ఆకర్షణ సహజం మరియు ఆవశ్యకం
శ్రీరామకృష్ణుల సుదీర్ఘకాల సాధన, వైరాగ్యాల ఫలితంగా ‘నేను’, ‘నాది’ అన్న అజ్ఞానపు పొర పూర్తిగా తొలగిపోయింది. మానవాళికి శ్రేయస్సును ఒనరించే భగవత్కార్యం తన సొంత కార్యంగా భావించారు. ఈ ఆధునికయుగంలో ధార్మికత క్షీణించడానికైన కారణాలను తన మనోదేహాలనే పరికరాలతో తొలగించే కార్యసాధన కృపాళుమా, సర్వవ్యాపీయైన భగవంతుని సంకల్పమే అని ఈ జ్ఞానార్జన వలన ఆయన గ్రహించారు. ఈ జ్ఞానం వల్లే ఏదో అల్ప స్వార్థ ధ్యేయం నిమిత్తం నరేంద్రుడు జన్మించలేదనీ, మానవాళికి మేలు చేసే కార్యంలో తనకు దోహదం చేయడానికి తీవ్ర దైవభక్తి కారణంగా ఈ ఇలలో జన్మించాడనీ శ్రీరామకృష్ణులు తెలుసుకొన్నారు. కాబట్టి నిత్యముక్తుడైన నరేంద్రుణ్ణి తన ‘సొంతం’ గా ఎంచి, అతడి పట్ల అత్యంత ఆకర్షితులు కావడంలో ఆశ్చర్యమేముంది? బాహ్య పరిశీలకులకు ఇది వింతగా కనిపించవచ్చు; కాని పైన వర్ణించిన నేపథ్యం గురించి తెలిసిన సునిశిత దృష్టిగల వ్యక్తులకు నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులకు ఏర్పడ్డ ఈ ఆకర్షణ సహజమూ, ఆవశ్యకమూ అని తోచక తప్పదు.
11. నరేంద్రుని పట్ల గల శ్రీరామకృష్ణుల అనురాగం అలౌకికమైనది
మొట్టమొదటిసారి నరేంద్రుణ్ణి కలుసుకొన్నప్పటి రోజు నుండి శ్రీరామకృష్ణులు అతణ్ణి ఏ మేరకు తన సొంతంగా పరిగణించారో, అతణ్ణి ఎంత ప్రగాఢంగా ప్రేమించారో చెప్పడం మా శక్తికి మించిన పని. లోకులు ఇతరులను తమ సొంతంగా ఎంచి ప్రేమించడానికి పురిగొల్పే కారణాలు ఇక్కడ కానరావు. అయినప్పటికీ నరేంద్రుని సాంగత్యంలో ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులు పొందేటంత ఆనందం, అతడి ఎడబాటులో ఆయన పడేటంత ఆరాటం మేం ఎక్కడా, ఎన్నడూ చూడలేదు. ఎటువంటి స్వార్థప్రయోజనమూ లేకుండా ఒక వ్యక్తి మరో వ్యక్తిని ఇంత తీవ్రంగా ప్రేమించగలడనే భావన మేం కలలో సైతం ఊహించలేదు. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు చూపే అద్భుత ప్రేమను చూసినప్పుడు, ఈ లోకం మానవుడిలో మాధవుణ్ణి చూసే రోజును తిలకిస్తుందనీ, ఆ దైవ అభివ్యక్తీకరణకు నిజమైన నిస్వార్థ భక్తిశ్రద్ధలను చెల్లించి తరిస్తుందనీ మాకు ప్రగాఢ విశ్వాసం కలిగింది.
12. ఆ ప్రేమ గురించి బాబూరాం ఉద్ఘాటన
శ్రీరామకృష్ణుల వద్దకు నరేంద్రుడు వచ్చిన కొద్దికాలంలోనే బాబూరాం మొట్ట మొదటిసారి ఆయన వద్దకు వచ్చాడు. అప్పుడు ఏదో కారణంగా నరేంద్రుడు ఒక వారం రోజులు దక్షిణేశ్వరానికి రాలేకపోయాడు. నరేంద్రుని ఎడబాటుకు శ్రీరామకృష్ణులు మానసిక వ్యథను అనుభవించడం చూసి బాబూరాం ఆశ్చర్యచకితుడైనాడు. దానిని గురించి అనేక సందర్భాలలో మాకు వివరించి చెప్పేవాడు.
13. బాబూరాం మొట్టమొదటిసారి దక్షిణేశ్వర సందర్శనం
అతడొకసారి ఇలా చెప్పాడు : “రాఖాల్, నేనూ ఒక సందర్భంలో పడవలో దక్షిణేశ్వరానికి వెళ్ళడానికి హాల్ట్ఖోలా ఘట్టానికి వెళ్ళాం. అక్కడ రామ్ దయాళ్ బాబు కనిపించారు. ఆయన కూడా దక్షిణేశ్వరానికే వెళుతున్నారని తెలుసుకొని మేమంతా ఒకే పడవలోనే బయలుదేరాం. రాణీరాస్మణి కాళికాలయానికి మేం చేరుకొనే సరికి దాదాపు మునిమాపువేళ అయింది. తిన్నగా శ్రీరామకృష్ణుల గదికి వెళ్ళాం. జగజ్జననిని ప్రార్థింప ఆయన కాళికాలయానికి వెళ్ళినట్లు తెలిసింది. మమ్మల్ని అక్కడే వేచివుండమని, రాఖాల్ ఆయనను తోడ్కొని రావడానికి కాళికాలయానికి వెళ్ళాడు. కాసేపటికి శ్రీరామకృష్ణులను జాగ్రత్తగా పట్టుకొని, ‘మెట్లు,…ఇటు రండి, ఇక్కడ దిగండి’ అంటూ ఆయనను నడిపిస్తూ, రాఖాల్ రావడం చూశాను. శ్రీరామకృష్ణులు తరచు భావోద్వేగంలో బాహ్యస్మృతిని కోల్పోతారని నేను ఇంతకు మునుపే వినివున్నాను. కాబట్టి ఆ విధంగా ఆయన త్రాగిన వ్యక్తిలా తూలిపోతూ నడుస్తూ రావడం చూసి, ఆయన భావావస్థలో ఉన్నారని గ్రహించాను. అదే స్థితిలో గదిలోకి వచ్చి, చిన్నమంచం మీద కూర్చున్నారు. కాసేపటికి మామూలు స్థితిలోకి వచ్చాక నన్ను గురించి, నా బంధువులను గురించి కొన్ని ప్రశ్నలడిగారు. తరువాత నా ముఖం, చేతులు, కాళ్ళు మొదలైన వాటి లక్షణాలను పరీక్షించసాగారు. నా ముంజేతిని తమ చేతుల్లోకి తీసుకుని, దాని బరువును తూస్తూన్నట్లు కాసేపు పుచ్చుకొని, ‘భేష్’ అన్నారు. ఆ మాటకు అర్థం ఆయనకు మాత్రమే తెలిసినట్లుంది. ఆ తరువాత నరేంద్రుని ఆరోగ్యం గురించి రాందయాళ్ బాబును వాకబు చేశారు. నరేంద్రుడు బాగానే ఉన్నాడని తెలుసుకొని, ‘అతడు ఇక్కడకు వచ్చి చాలా రోజులు అయ్యింది. అతణ్ణి చూడాలనుకొంటున్నాను. దయచేసి ఇక్కడకు ఒకసారి రమ్మని చెప్పండి’ అని చెప్పారు.
14. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులు చూపే అక్కర గురించి స్వామి ప్రేమానంద ప్రత్యక్ష అనుభవం
“ధార్మిక ప్రసంగాలలో కొన్ని గంటలు ఆనందంగా గడిచిపోయాయి. మేం రాత్రి పది గంటలకు భోజనం చేశాం. కాళికాలయ ప్రాంగణానికి ఉత్తరం వైపున, శ్రీరామకృష్ణుల గదికి తూర్పున ఉన్న వసారాలో మేం నడుంవాల్చాం. గదిలో శ్రీరామకృష్ణులకు, రాఖాల్కి పరుపులు వేశారు. ఒక గంటసేపు కూడా గడవక ముందే శ్రీరామకృష్ణులు తన వస్త్రాన్ని చంకలో ఉంచుకొని గదిలో నుండి బయటకు వచ్చి రాందయాళ్ బాబు వద్దకు వచ్చి ఆప్యాయంగా, ‘నిద్ర పోతున్నావా?’ అని అడిగారు. మేమిద్దరం గబుక్కున లేచి, ‘లేదండి’ అని చెప్పాం. అప్పుడాయన ‘ఇలా చూడండి. నరేంద్రుణ్ణి చాలారోజులుగా చూడకపోవడంతో తడి తువ్వాలులా నా హృదయాన్ని బలవంతంగా పిండుతూన్నట్లు అనిపిస్తోంది. ఒకసారి వచ్చి చూడమని దయచేసి అతడికి చెప్పండి. అతడు సత్త్వగుణ సంపన్నుడు, అతడు సాక్షాత్తు నారాయణుడు; అప్పుడప్పుడు అతణ్ణి చూడకపోతే నాకు మనశ్శాంతి ఉండదు’. గత కొద్ది కాలంగా రాందయాళ్బాబు దక్షిణేశ్వరానికి వస్తూవున్నాడు. శ్రీరామకృష్ణుల బాలక నైజం అతడికి తెలియంది కాదు. శ్రీరామకృష్ణుల ఆ బాలక ప్రవర్తనను చూసి రాందయాళ్బాబు ఆయన భావపారవశ్యంలో ఉన్నారని గ్రహించాడు. తెల్లవారాక నరేంద్రుణ్ణి కలిసి, అతణ్ణి రమ్మనమని చెబుతానని ఆయనను ఊరడించాడు. కాని శ్రీరామకృష్ణుల ఆ భావపారవశ్యం ఆ రాత్రి ఉపశమించలేదు. మాకు విశ్రాంతి ఉండదని గ్రహించి, అప్పుడప్పుడు ఆయన తన గదిలోకి కాసేపు వెళ్ళిపోయేవారు. కాని ఆ విషయం విస్మరించి మళ్ళీ మా వద్దకు వచ్చి నరేంద్రుని సుగుణాలను, అతడి ఎడబాటుకు తాను పడే ఆరాటాన్ని దయనీయంగా మా ముందు వ్యక్తం చేయసాగారు. ఆయన దుర్భర వేదనను చూసి నేను ఆశ్చర్యపోయి, ‘ఈయన ప్రేమ ఎంత అద్భుతమైనది! ఏ వ్యక్తి ఎడబాటుకై ఈయన ఇంత వ్యాకులత చెందుతున్నారో ఆ వ్యక్తి ఎంత కఠిన హృదయుడై ఉంటాడు!’ అని అనుకొన్నాను. ఆ రాత్రి అలా గడిచిపోయింది. ప్రొద్దున మేం కాళికాలయానికి వెళ్ళి జగజ్జననిని అర్చించాం. తరువాత శ్రీరామకృష్ణులకు సాష్టాంగ ప్రణామం చేసి, సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వచ్చేశాం”.
15. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణుల ప్రేమ గురించి వైకుంఠనాథ్ సన్యాల్
1883 వ సం ॥ లో ఒక రోజు మా మిత్రుడైన వైకుంఠనాథ్ సన్యాల్ దక్షిణేశ్వరానికి వచ్చాడు. అప్పుడు నరేంద్రుడు చాలా రోజులుగా రానందు వలన శ్రీరామకృష్ణులు ఎంతో ఆతురత చెందుతూండడం అతడు గమనించాడు. వైకుంఠనాథ్ ఇలా చెప్పాడు : “శ్రీరామకృష్ణుల మనస్సు నరేంద్రుని ఆలోచనలతో పొంగి పొరలుతూన్నది. ఆయన నరేంద్రుని సుగుణాలను తప్ప మరి దేనిని గురించీ మాట్లాడడం లేదు. నన్ను సంబోధిస్తూ, ‘నరేంద్రుడు శుద్ధ సత్త్వమయుడు, అతడు అఖండ స్థితికి చెందిన నలుగురిలో ఒకడు* , మరియు సప్తర్షులలో ఒకడు.* అతడి సుగుణాలకు అంతే లేదు’ అని చెప్పారు. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు దుర్భర క్లేశంతో, బిడ్డను ఎడబాసిన తల్లిలా బోరున విలపించసాగారు. తనను అదుపులో ఉంచుకోలేని ఆయన స్థితిని, ప్రవర్తనను చూసి మాకు ఏం చేయాలో పాలుబోలేదు. అప్పుడే ఆయన వడివడిగా అడుగులు వేస్తూ తమ గదికి ఉత్తరం వైపున ఉన్న వసారాలోకి వెళ్ళారు. అలా కొంతసేపు విలపించి, గద్గదస్వరంతో, ‘హా! అతణ్ణి చూడకుండా నేను ఉండలేను’ అని పలికారు. కాసేపటికి ఒకింత తమాయించుకొని గదిలోకి వచ్చి మా ప్రక్కన వచ్చి కూర్చున్నారు. తరువాత దయనీయంగా ఇలా అన్నారు : ‘ఎంత విలపించినప్పటికీ నరేంద్రుడు రాలేదు. అతణ్ణి చూడాలనే ఆరాటం, తహతహ నా హృదయాన్ని పిండివేస్తూన్న వ్యథను కలిగిస్తూంది; అతడి పట్ల నాకున్న తీవ్ర ఆకర్షణను అతడు గుర్తించినట్లే లేదు.’ ఇలా అంటూ వ్యథతో గదిలో నుండి బయటకు వెళ్ళిపోయారు. కాసేపయాక మళ్ళీ గదిలోకి వచ్చి, ‘వయస్సు పైబడ్డ నేను అలా విలపిస్తూ అతడి కోసం ఆరాటం చెందడం చూస్తే వచ్చిన వాళ్ళు ఏమనుకొంటారు? అయినప్పటికీ నా సొంతవాళ్ళయిన మీ ముందు నేను సిగ్గుపడను. కాని దీనిని చూస్తే ఇతరులు ఏమనుకొంటారు? ఏది ఏమైనప్పటికీ నన్ను నేను అదుపులో ఉంచుకోలేను’ అని అన్నారు. నరేంద్రుని పట్ల శ్రీరామకృష్ణులకు ఉన్న ప్రేమను చూసి మేం స్తబ్ధులమైపోయాం. నరేంద్రుడు భగవంతుని వంటి వాడనుకొన్నాం. లేకపోతే శ్రీరామకృష్ణులు అతడి పట్ల ఎందుకు అంత ఆకర్షితులౌతారు? తరువాత మేం ఆయనను అనునయిస్తూ ‘మహాశయా, అతడు అలా చేయడం తప్పు. తను రాకపోతే మీరు ఎంత బాధపడతారో తెలిసి కూడా అతడు రాకపోవడం బాగాలేదు’ అని చెప్పాం.
“ఈ సంఘటనానంతరం ఒక రోజు ఆయన నరేంద్రుణ్ణి నాకు పరిచయం చేశారు. నరేంద్రుడి సాంగత్యంలో ఎంత ఆనందంగా కనిపించారో, అతడి ఎడబాటులో అంత వ్యథను అనుభవించడం నేను చూడగలిగాను. తరువాత మేం శ్రీరామకృష్ణుల జన్మదినోత్సవ సందర్భంలో దక్షిణేశ్వరానికి వెళ్ళాం. ఆ రోజు భక్తులు ఆయనను నూతన వస్త్రాలతో, పువ్వుల మాలలతో, గంధం అలది ఎంతో అందంగా అలంకరించారు. ఆయన గదికి తూర్పువైపు ఉన్న వసారాలో కీర్తన జరిగింది. భక్తులు తమను పరివేష్టించి ఉండగా కీర్తన వింటూ అప్పుడప్పుడు భావపారవశ్యులవుతూ, ఒకటి రెండు పంక్తులు జోడిస్తూ కీర్తనను మరింత ఆసక్తికరంగా చేస్తూ ఆనందించసాగారు. కాని నరేంద్రుడు హాజరు కానందున ఆయన అమితానందాన్ని చవిచూసినట్లు లేదు. మధ్యమధ్యలో చుట్టూ కలయ చూస్తూ, ‘నరేంద్రుడు ఇంకా రాలేదన్నమాట’ అని మాతో చెప్పసాగారు. దాదాపు మధ్యాహ్న సమయానికి నరేంద్రుడు వచ్చాడు. ఆయన పాదపద్మాలకు ప్రణమిల్లాడు. అతణ్ణి చూడగానే శ్రీరామకృష్ణులు ఎగిరి గంతేసి, అతడి భుజాల మీద ఎక్కి కూర్చుని భావపారవశ్యమగ్నులైనారు. కొంతసేపటికి మామూలు స్థితిలోకి వచ్చి అతడికి తినిపిస్తూ, అతడితో మాట్లాడసాగారు. ఆ పైన ఆయన కీర్తనను వినలేదు”.
16. శ్రీరామకృష్ణులు తనపై వర్షిస్తూన్న ప్రేమకు నరేంద్రుడు చలించకపోవడం
నరేంద్రుడు పొందిన శ్రీరామకృష్ణుల తీవ్ర, అలౌకిక ప్రేమను గురించి ఆలోచిస్తే, తప్పక ఆశ్చర్యచకితులమవుతాం. అసాధారణ, నిస్వార్థ ప్రేమ వర్షం కురుస్తూన్నప్పటికీ నరేంద్రుడు ఏమాత్రం చలించక, అడుగడుగునా శ్రీరామకృష్ణులను పరీక్షింప ముందంజ వేయడాన్ని చూస్తే, సత్యం పట్ల గల నరేంద్రుని ప్రగాఢ ప్రేమ స్పష్టంగా తెలియవస్తుంది. ఇది ఒక వంక ఆశ్చర్యపరుస్తూ ఉంటే, శ్రీరామకృష్ణుల ఉదాత్తత, అహంకార రాహిత్యం మరో వంక ఆశ్చర్యపోయేలా చేస్తున్నది. నరేంద్రుని ఈ వైఖరికి ఆయన నొచ్చుకోలేదు సరికదా, సంతోషంగా ఆ పరీక్షలకు ఆయన లోనైనారు; తద్ద్వారా తన శిష్యుడు ఋజువులతో సహా ధ్రువీకరించుకొని ఆధ్యాత్మిక సత్యాలను సమగ్రంగా అనుభూతం చేసుకోగలుగు తాడని ఆయన ఆశించారు. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ విస్తుపోకుండా ఉండలేరనడం అతిశయోక్తి కాదు. శ్రీరామకృష్ణ–నరేంద్రుల అనుబంధాన్ని అధ్యయనం చేసేకొద్దీ ఒక వంక పరీక్షించకుండా దేనినీ అంగీకరించని నరేంద్రుని దృఢనిశ్చయం, శిష్యునికి ఉన్నత ఆధ్యాత్మిక సత్యాలను అనుభూతం చేయడం కోసం విమర్శలను, చిన్నబుచ్చుకోవడాలను త్రోసిరాజన్న శ్రీరామకృష్ణుల ఆతురత – ఈ రెండూ కానవచ్చి మనలను ముగ్ధులను చేస్తాయి. ఇటువంటి అధ్యయనం ద్వారా నిజమైన గురువు, గొప్ప అర్హతగల శిష్యునికి అతడి ఆధ్యాత్మిక వైఖరులను చెక్కుచెదరనివ్వక ఎలా ఉపదేశిస్తాడో మనకు అవగతమౌతుంది; చివరకు శిష్యుని హృదయంలో శాశ్వతమైన భక్తిప్రపత్తులను ఆ గురువు ఎలా పొందుతాడో కూడా మనం తెలుసుకోగలం.