1. శ్రీరామకృష్ణులను రెండవసారి కలుసుకోవడంలో నరేంద్రుని జాప్యం
ఆత్మవిశ్వాసం, మహోదార లక్ష్యాలతో ఒప్పారేవారు, ఇతరులలోని మహత్త్వాన్ని కనుగొన్నప్పుడు తక్షణమే దానిని గుర్తించి ఆనందభరితులౌతారు. మళ్ళీ ఎవరిలోనన్నా అసాధారణస్థాయిలో మహత్త్వం అభివ్యక్తమవడం వారు గమనిస్తే, వారి మనస్సులు సదా ఆ భావనలోనే నెలకొని ఉంటాయి; అలా నెలకొని ఉండేకొద్దీ వారి పట్ల ఏర్పడ్డ ప్రశంసాభావ ఆనంద పారవశ్యంలో విభ్రాంతులవడం కద్దు. అయినప్పటికీ ఆ ప్రశంసా ప్రభావంలో పడి స్వకీయ మార్గాన్ని వీడి, తాము ప్రశంసించే వ్యక్తి జీవనాన్ని అనుకరించరు. సుదీర్ఘ సాంగత్యమూ, తద్ద్వారా పెంపొందిన మధురానురాగం మూలంగానే ఆ ప్రశంస, వారి జీవితాలలో ప్రస్ఫుట ప్రభావాన్ని కల్పిస్తుంది. శ్రీరామకృష్ణులను మొదటిసారి దక్షిణేశ్వరంలో కలుసుకొన్నప్పుడు నరేంద్రుడు ఆ స్థితిలో ఉన్నాడు. శ్రీరామకృష్ణుల అద్భుత వైరాగ్యం అతణ్ణి ఎంతగానో ఆకట్టుకొన్నప్పటికీ, నరేంద్రుడు మొదట్లో ఆయనను జీవిత ఆదర్శమూర్తిగా అంగీకరించలేదు. ప్రథమ సమావేశానంతరం దక్షిణేశ్వరం నుండి తిరిగి వచ్చిన తరువాత శ్రీరామకృష్ణుల అద్భుత వ్యక్తిత్వమూ, ప్రవర్తన అతడికి పదేపదే గుర్తుకు వచ్చాయనడంలో ఎలాంటి సందేహమూలేదు. అయినప్పటికీ రెండవసారి తప్పక వస్తానని ఆయనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి అతడు తొందరపడలేదు. తాను అధ్యయనం చేసిన పాశ్చాత్య మనస్తత్త్వశాస్త్ర జ్ఞానం మేరకు శ్రీరామకృష్ణులు ఒక ఏకోన్మాది అని అతడు నిర్ణయించడం, అతడి రెండవసారి దక్షిణేశ్వర రాకను వాయిదా వేయడానికి కారణమైంది. పైగా అతడు అనేక కార్యాలలో నిమగ్నుడవడం కూడా అందుకు ఒక కారణం కావచ్చు. ధ్యానాభ్యాసం, కళాశాల చదువుకు తోడు నరేంద్రుడు ఆ సమయంలో సంగీత, వ్యాయామాలలో శిక్షణ కూడా పొందుతున్నాడు. అంతేకాక బ్రహ్మసమాజ పద్ధతిలో తన మిత్రుల మానసిక, ఆధ్యాత్మిక వికాసం నిమిత్తం అతడు కలకత్తాలోని వివిధ ప్రాంతాలలో ప్రార్థన, చర్చా వేదికలను నిర్వహించసాగాడు. కాబట్టి ఒక నెలపాటు దక్షిణేశ్వరానికి వెళ్ళాలనే ఆలోచన అతడికి రాకపోవడంలో ఆశ్చర్యం ఏముంది? దైనందిన కర్తవ్యాల కారణంగా అతడు దక్షిణేశ్వరానికి వెళ్ళలేకపోయినప్పటికీ, వీలైనంత త్వరలో దక్షిణేశ్వరానికి ఒంటరిగా వస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చమని అతడి సత్యనిష్ఠ, స్మృతి పదేపదే పురికొల్పుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రథమ సమావేశం జరిగిన దాదాపు నెల తరువాత ఒక రోజు నరేంద్రుడు ఒంటరిగా దక్షిణేశ్వరానికి బయలుదేరాడు. ఆనాడు అక్కడ జరిగిన సంఘటనల గురించి మాకు నరేంద్రుడు తెలిపిన వివరాలను పాఠకులకు ఇక్కడ పొందు పరుస్తున్నాం:
2. శ్రీరామకృష్ణుల యోగశక్తి ద్వారా నరేంద్రుడు పొందిన అద్భుతమైన అనుభవం
“కలకత్తా నుండి దక్షిణేశ్వరం బాగా దూరంలో ఉందన్న విషయం నాకు అంతగా తెలియదు. అక్కడకు నేను ఒక్కసారే వెళ్ళాను, అదీ బండిలో వెళ్ళడం తటస్థించింది. బారానగర్లోని నా మిత్రులైన దాశరథి సన్యాల్, శత్కారి, లాహిరి మొదలైన వారి ఇళ్ళకు వెళ్ళేవాణ్ణి; రాణీరాస్మణి ఉద్యానం బారానగర్కు సమీపంలోనే ఉందనుకొనేవాణ్ణి. కాని ఆనాటి నా దక్షిణేశ్వర ప్రయాణానికి ఎడతెరపి లేనట్టే కనిపించింది. అక్కడా ఇక్కడా వాకబు చేసుకొంటూ మొత్తానికి ఎలాగో అలా దక్షిణేశ్వరం చేరుకొన్నాను. తిన్నగా శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళాను. చిన్న మంచం మీద ఆయన తన్మయులై కూర్చుని ఉండడం చూశాను; గదిలో మరెవరూ లేరు. నన్ను చూడగానే నన్ను దగ్గరకు రమ్మని పిలిచి ఆనందంగా ఆ చిన్నమంచం చివర కూర్చోబెట్టుకొన్నారు. నేను కూర్చున్నాను; ఆయన ఒక విచిత్ర భావంలో మగ్నులైవున్నారు. తమలో తామే అస్పష్టంగా ఏదో గొణుక్కొంటున్నారు. తదేకంగా నన్ను చూస్తూ మెల్లగా నా వద్దకు రాసాగారు. మరొక పిచ్చి దృశ్యం చూడబోతున్నా ననుకొన్నాను. అలా అనుకొంటూ ఉండగానే, ఆయన నా వద్దకు వచ్చి తన కుడి పాదాన్ని నా మీద ఉంచారు. తక్షణమే నా కొక అద్భుత అనుభూతి కలిగింది. గదిలోని వస్తువులన్నీ గోడలతో సహా గిరాగిరా తిరుగుతూ ఏదో తెలియరాని ప్రాంతానికి తిరోగమించడమూ, ఈ విశ్వమంతా ‘నేను’ అన్న భావంతో సహా సమస్తాన్ని మ్రింగివేసే మహాశూన్యంలోకి మాయమైపోవడమూ కళ్ళారా చూశాను. అప్పుడు నన్ను విపరీతమైన భయం ఆవరించింది. ‘నేను’ అన్న భావం నశించడం మరణమే అని నాకు తెలియని విషయం కాదు. మరణం నాకు అత్యంత సమీపంలోనే ఉందనుకొన్నాను. నన్ను అదుపులో ఉంచుకోలేక, ‘ఆహా! నాకు మీరు ఏం చేశారు? నాకు తల్లితండ్రులున్నారని మీకు తెలుసా’ అంటూ బిగ్గరగా కేకపెట్టాను. నా మాటలు విని పెద్దగా నవ్వుతూ, తమ చేత్తో నా ఛాతీని నిమురుతూ, ‘సరే, ఇది ఉపశమిస్తుందిలే. మొత్తం ఒకేసారి చేయనవసరం లేదు. కాలక్రమంలో కలుగుతుంది’ అని చెప్పారు. ఆయన అలా చెప్పిన తక్షణమే ఆ అద్భుత అనుభూతి ఎలా కలిగిందో అట్లే క్షణంలో మాయమవడం చూసి ఆశ్చర్యచకితుడనయ్యాను. నేను మామూలు స్థితికి వచ్చి గదిలోను, బయట వస్తువులు నిశ్చలంగానే ఉండడం గమనించాను.”
3. నరేంద్రుని పునరాలోచనలు
“ఆ సంఘటనను వర్ణించడానికి ఒకింత సమయం పట్టినప్పటికీ, నిజంగా అది జరగడానికి అంతకంటే ఎంతో తక్కువసేపే పట్టింది. ఆ సంఘటన నా ఆలోచనా సరళిలో మార్పును తీసుకువచ్చింది. జరిగింది ఏమిటో అర్థంకాక తబ్బిబ్బయ్యాను. ఈ అద్భుత వ్యక్తి శక్తి వలననే ఆ అసాధారణ అనుభూతి హఠాత్తుగా కలగడం, మాయమవడం జరగడం కళ్ళారా చూశాను. పుస్తకాలలో నేను సమ్మోహనశక్తి, వశీకరణశక్తి గురించి చదివివున్నాను. ఈ సంఘటన కూడా అటువంటి కోవకు చెందినదేనా అన్న అనుమానం తలెత్తింది. కాని నా మనస్సు దాన్ని ససేమిరా అంగీకరించలేదు. ఎందుకంటే, గొప్ప సంకల్పశక్తి గల వ్యక్తులు తమ ప్రభావాన్ని దుర్బల మనస్కుల మీద మాత్రమే పరపి అటువంటి స్థితులను కల్పిస్తారు. కాని నేను దుర్బల మనస్కుడను కాను; పైగా తెలివితేటలు, మనోబలం గల వ్యక్తినని నేను గర్విస్తూ ఉంటాను. అసాధారణ వ్యక్తుల ప్రభావంలో పడి వారి చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించే సామాన్యులలా నేను సమ్మోహనానికి గురికావడం జరగలేదు. ఎటువంటి ప్రభావమూ నన్ను నియంత్రించడానికి నేను ఎన్నడూ వీలుకల్పించను. పైగా మొదటి నుండి ఆయన ఒక పిచ్చివాడు అనే కచ్చితమైన నిర్ణయానికి వచ్చినవాణ్ణి. హఠాత్తుగా ఆ స్థితిలో నేను ఎందుకు చిక్కువడిపోయాను? పర్యాలోచించి చూసినప్పటికీ ఏ నిర్ణయానికి నేను రాలేకపోయాను. తీరని సమస్యగా అది నా హృదయంలో అట్లే నిలిచి పోయింది. ఈ సందర్భంలో, ‘నీ తత్త్వశాస్త్రం కనే కలల కంటే స్వర్గంలోను, భువి లోను ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి’ అన్న షేక్స్పియర్ మహాకవి వచనాలు నాకు గుర్తుకొచ్చాయి. ఈ విషయం కూడా అటువంటిదేనేమో అని అనుకొన్నాను. దీన్లోని నిజానిజాలు తేల్చుకోవడం సాధ్యం కాదని నిశ్చయించుకొన్నాను. కాని ఈ అద్భుతమైన పిచ్చి వ్యక్తి ప్రభావంలో ఇకముందు పడిపోకుండా గట్టి జాగ్రత్త తీసుకోవాలని మాత్రం నిశ్చయించుకొన్నాను.”
4. శ్రీరామకృష్ణులను సునిశితంగా పరిశీలించాలని నరేంద్రుడు తీర్మానించుకోవడం
“కాని నా ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి. దృఢసంకల్పం, ప్రగాఢ విశ్వాసాలు సంతరించుకొన్న నా వంటి వ్యక్తి మనోనిర్మాణాన్ని ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురు గావించి, దానిని మట్టిముద్దలా తనకు ఇష్టమైన నమూనాలో మలచగలిగిన వ్యక్తిని పిచ్చివానిగా ఎలా పరిగణించగలను? కాని ఆయన ప్రవర్తన, నన్ను పక్కకు తోడ్కొని వెళ్ళి చెప్పిన పలుకులు – వీటి సంగతి ఏమిటి? వాటిని పిచ్చివాని ప్రేలాపనలా కాకుండా మరెలా తీసుకోవాలి? కాబట్టి పై నా అనుభవానికి కారణం ఏమిటో తెలుసుకోలేక పోయినప్పటికీ, ఈ బాలునివంటి పావన, సరళహృదయుణ్ణి గురించి ఏ నిశ్చితాభిప్రాయానికీ నేను రాలేకపోయాను. ఒక వ్యక్తి గురించి గాని లేదా ఒక ప్రతిపాదన గురించిగాని సరైన పరిశీలన, దర్యాప్తు, యుక్తాయుక్త విచారణ చేయకుండా నేను ఎన్నడూ ఎలాంటి నిర్ణయానికి వచ్చేవాణ్ణి కాను. చిన్నతనం నుండి నేను ఇదే విధంగా వ్యవహరించేవాణ్ణి. ఆ రోజు నా నైజం తీవ్రమైన దిగ్భ్రాంతికి గురికావడంతో నా హృదయం క్షోభించింది. తత్ఫలితంగా, ఆ అద్భుత వ్యక్తి శక్తిని, స్వభావాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకోవాలనే దృఢనిశ్చయం నాలో జనించింది.”
5. చిరకాల పరిచయస్థునిలా నరేంద్రునితో, శ్రీరామకృష్ణులు మెలగడం
“రకరకాల ఆలోచనలతో, తీర్మానాలతో ఆ రోజు అలా గడిపివేశాను. కాని శ్రీరామకృష్ణులు ఆ సంఘటనానంతరం పూర్తిగా విభిన్న వ్యక్తిలా కనిపించారు. ఆప్యాయతతో స్వయంగా తానే నాకు తినిపిస్తూ చిరకాల పరిచయస్థునిలా నాతో మెలగసాగారు. సుదీర్ఘకాల ఎడబాటు తరువాత కలుసుకొన్న ప్రాణస్నేహితుడు లేదా అత్యంత సన్నిహిత బంధువు ప్రవర్తించే తీరులో ఆయన నాతో మెలగసాగారు. నాతో మాట్లాడారు, నాకు తినిపించారు, ఆప్యాయతానురాగాలతో నన్ను ముంచెత్తారు; అయినప్పటికీ వీటితో ఆయన తృప్తి చెందినట్లు కనిపించలేదు. ఆయన అనురాగమయ ప్రవర్తన కూడా నాలో కించిత్తు కూడా ఆతురతను కల్పించలేదు. సాయంత్రం కావడంతో నాటికి ఆయన వద్ద సెలవు పుచ్చుకొన్నాను. మళ్ళీ త్వరలో వస్తానన్న వాగ్దానం తీసుకొన్న తరువాతే ఆయన నాకు వీడ్కోలు తెలిపారు. జరిగిన దానిని గురించి, నాలో చెలరేగిన సమస్యాపరిష్కారం గురించి గాఢమైన ఆలోచనలతో దక్షిణేశ్వరం నుండి వెనక్కు బయలుదేరాను”. ఇలా నరేంద్రుడు గురుదేవులతో తన రెండవ సమావేశ వివరాలను మాకు తెలియజేశాడు.
6. నరేంద్రుని మూడవ సమావేశం
రెండవసారి శ్రీరామకృష్ణులను కలుసుకొన్న తరువాత ఎంతకాలానికి నరేంద్రుడు మళ్ళీ దక్షిణేశ్వరానికి వెళ్ళాడో మాకు తెలియరాలేదు. కాని శ్రీరామకృష్ణుల అద్భుత శక్తిని పరికించిన తరువాత, ఆ శక్తి మూలాధారాన్ని గురించి అవగతం చేసుకోవాలనే ప్రగాఢ ఆకాంక్ష నరేంద్రునిలో జనించడం వలన మూడవసారి దక్షిణేశ్వరం వెళ్ళడంలో నరేంద్రుడు జాప్యం చేసివుండడని భావిస్తాం. ఆ ఆతురత నరేంద్రుణ్ణి, శ్రీరామకృష్ణుల పాదపద్మాల వద్దకు వీలైనంత త్వరలోనే వెళ్ళేలా చేసివుండవచ్చు. బహుశా ఒక వారం తరువాత నరేంద్రుడు మూడవసారి దక్షిణేశ్వరం వెళ్ళివుంటాడు. ఆ వారం రోజులు అతడు కళాశాలకు హాజరవడంలో నిమగ్నుడై ఉండివుంటాడు. ఎందుకంటే ఏదైనా సమస్య ఎదురైనప్పుడు, ఆ సమస్యను పరిష్కరించే దాకా తిండి తిప్పలు, విశ్రాంతి గురించి పట్టించుకోక పోవడం అతడి స్వభావం. కాబట్టి అతడి మనస్సు శ్రీరామకృష్ణులను అవగతం చేసుకోవడంలో నిమగ్నమై ఉండి వుంటుందనడంలో ఎలాంటసందేహమూ లేదు. అంతేగాక మూడవసారి శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన ప్రభావంలో పడిపోకూడదని మనస్సును స్థిరపరచుకొనే వెళ్ళివుంటాడని రూఢిగా చెప్పవచ్చు. కాని అక్కడ జరిగింది అనూహ్యం. శ్రీరామకృష్ణుల నుండి, నరేంద్రుడి నుండి మేం ఈ సందర్భంగా విన్న విషయాలు ఇక్కడ తెలుపుతున్నాం.
7. శ్రీరామకృష్ణుల దివ్యస్పర్శతో నరేంద్రుడు బాహ్యస్మృతిని కోల్పోవడం
ఆ సందర్భంలో కాళికాలయం జనసమ్మర్దంగా ఉండడం వలన కాబోలు శ్రీరామకృష్ణులు, నరేంద్రుణ్ణి సమీపంలోని యదుమల్లిక్ ఉద్యానానికి తనతో కూడా రమ్మన్నారు. లేదా మరేదో కారణం కూడా ఉండి ఉండవచ్చు. యదుమల్లిక్కు, ఆయన తల్లికి శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో భక్తిప్రపత్తులుండేవి. తాము లేనిసమయంలో శ్రీరామకృష్ణులు ఉద్యానానికి వస్తే, గంగాభిముఖంగా ఉన్న చావడిని ఆయన కోసం తెరిచి ఉంచమని తమ ఉద్యానవన సంరక్షకుడికి ఆదేశాలు ఇచ్చివున్నారు. ఆ రోజు శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో కలిసి గంగాతీరాన ఉన్న ఆ ఉద్యానంలో కొంతసేపు పచార్లుచేశారు. నరేంద్రుడితో మాట్లాడుతూ, ఆ చావడిలోకి వచ్చి కూర్చున్నారు; ఆ క్షణంలోనే భావపారవశ్యంలో మగ్నులై పోయారు. నరేంద్రుడు ప్రక్కనే కూర్చుని ఆయన ఆ స్థితిని ప్రశాంతంగా పరిశీలించ సాగాడు. హఠాత్తుగా శ్రీరామకృష్ణులు ఇంతకు ముందులా నరేంద్రుణ్ణి స్పృశించారు. గత అనుభవం గుర్తుంచుకొని నరేంద్రుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ఆ స్పర్శశక్తిని తమాయించుకోలేకపోయాడు. గతంలో జరిగిన విధంగా కాకుండా, ఇప్పుడు ఆ స్పర్శతో నరేంద్రుడు పూర్తిబాహ్యస్మృతిని కోల్పోయాడు. కాసేపటికి బాహ్యస్మృతి వచ్చాక చూస్తే, తమ చేత్తో తన ఛాతీని నిమురుతూ శ్రీరామకృష్ణులు కనిపించారు. నరేంద్రుడు మామూలు స్థితిలోకి రావడం చూసి ఆయన మందహాసం చేశారు.
బాహ్యస్మృతి కోల్పోయిన తరువాత తాను పొందిన అనుభూతిని గురించి నరేంద్రుడు మాతో ఏమీ చెప్పలేదు. గోప్యమైన విషయమై ఉంటుంది కాబట్టి అతడు మాతో దాన్ని గురించి చెప్పలేదని మేం అనుకొన్నాం. కాని ఈ సంఘటన గురించి తదనంతరం ఎప్పుడో మాతో ముచ్చటిస్తూ శ్రీరామకృష్ణులు, నరేంద్రుడు పొందిన అనుభూతిని గురించి సహజంగానే అతడు ఎరిగివుండడని చెప్పినప్పుడు అసలు విషయం మేం గ్రహించగలిగాం. శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు :
8. ఆ బాహ్యచైతన్య స్థితిలో నరేంద్రుణ్ణి శ్రీరామకృష్ణులు ప్రశ్నించడం
“నరేంద్రుడు బాహ్యచైతన్యం కోల్పోయిన స్థితిలో ఉన్న ఆ సమయంలో అతణ్ణి అతడెవరు, ఎక్కణ్ణుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు (జన్మించాడు), ఇక్కడ (ఈ భువిలో) ఎంతకాలం ఉంటాడు వంటి ప్రశ్నలు వేశాను. తన అంతరాంతరాళాల్లోకి పోయి అతడు నా ప్రశ్నలన్నిటికీ సముచిత జవాబులిచ్చాడు. అతడి జవాబులు, నా దర్శనాలలో అతణ్ణి గురించి నేను ఎరిగిన విషయాలను రూఢి పరిచాయి. ఆ విషయాలను వెల్లడించడం నిషిద్ధం. కాని అసలు తానెవరో తెలుసుకొన్ననాడు అతడు ఇక ఈ ఇలలో ఉండడని, తక్షణమే అతడు దృఢసంకల్పంతో యోగం ద్వారా దేహాన్ని పరిత్యజిస్తాడని ఈ విషయాల నుండి నేను గ్రహించగలిగాను; నరేంద్రుడు ఒక గొప్ప ధ్యానసిద్ధుడు” అని ఆ విషయాన్ని గురుదేవులు వివరించారు.
తదనంతరం నరేంద్రుణ్ణి గురించి తాము పొందిన దివ్యదర్శనాలను శ్రీరామకృష్ణులు కించిత్తు మాతో చెప్పారు. పాఠకుల సౌకర్యార్థం వాటిని ఇక్కడ వివరించబోతున్నాం. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి రాక మునుపే శ్రీరామకృష్ణులకు ఆ దివ్యదర్శనానుభూతులు కలిగాయన్న విషయం, ఆ దర్శనాలను ఆయన మాకు వివరించినప్పుడు మాకు అవగతమైంది. శ్రీరామకృష్ణులు మాకు ఇలా వివరించి చెప్పారు :
9. నరేంద్రుణ్ణి గురించిన శ్రీరామకృష్ణుల అద్భుత దర్శనం
“ఒక రోజు సమాధి స్థితిలో నా మనస్సు జ్యోతిర్మండలం గుండా పై పైకి పోవడం నేను చూశాను. సూర్యచంద్ర నక్షత్ర సమేతమైన ఈ స్థూలప్రపంచాన్ని అతిక్రమించి మొట్టమొదట అది భావమయ సూక్ష్మ జగత్తులోకి ప్రవేశించింది. సూక్ష్మ సూక్ష్మతమ భూములను మనస్సు అధిరోహించే కొద్దీ, బాటకు ఇరువంకల సౌందర్యవంతులైన దేవతామూర్తులు కానరాసాగారు. క్రమంగా నా మనస్సు ఆ ప్రాంతం శివార్లను చేరుకొంది. అక్కడ ఖండ, అఖండ జగత్తులను వేరుచేస్తున్న ఒక వెలుగు రేఖను చూశాను. దానిని లంఘించి నా మనస్సు మెల్లగా ఆ అఖండ జగత్తులోకి ప్రవేశించింది. అక్కడ సాకారమయమైనది ఏదీ కనిపించలేదు. దివ్యదేహులైన దేవీదేవతలు సైతం ఆ దిగువ లోకాలలోనే ఆధిపత్యం చెలాయించ గలరు కనుక అక్కడ ప్రవేశించడానికి నేను భయపడ్డాను. కాని మరుక్షణంలోనే దేహధారులూ, దివ్యతేజస్కులూ అయిన సప్తర్షులు అక్కడ సమాధిమగ్నులై కూర్చుని ఉండడం చూశాను. ఆ ఋషులు జ్ఞానంలో, సౌజన్యంలో, ప్రేమపరిత్యాగాలలో దేవతలనే తలదన్నినట్లుగా నాకు కనిపించారు. ఆశ్చర్యచకితుడనై వారి మహత్వం గూర్చి పర్యాలోచిస్తూండగా, నా ముందు ఆ అఖండ జగత్తులోని తేజోరాశిలో కొంతభాగం ఘనీభవించి ఒక దివ్య శిశువుగా రూపొందడం చూశాను. ఆ దివ్యశిశువు మెల్లగా ఒక ఋషి వద్దకు వెళ్ళి తన మృదువైన చేతులను ఆయన మెడచుట్టూ వేసి, మృదుమధుర స్వరంతో పిలుస్తూ ఆయనను సమాధి నుండి మేల్కొల్పడానికి ప్రయత్నించింది. ఆ కోమల హస్త స్పర్శతో ఆ ఋషి జాగ్రదావస్థ లోకి వచ్చి అర్ధనిమీలితనేత్రుడై ఆ అద్భుత శిశువును చూశాడు. ఆ శిశువును చూడగానే ఆయన వదనంలో భాసించిన మహదానందాన్ని చూసి వారి అనుబంధం శాశ్వతమైనదనే తలపు నాలో మెదిలింది. ఆ అసాధారణ దివ్యశిశువు అనంతమైన ఆనందం పొందుతూ ఆ ఋషితో, ‘నేను వెళుతున్నాను, నువ్వు నాతో కూడా రావాలి!’ అని అన్నది. ఆ విన్నపానికి ఆయన ఏం బదులు పలుకలేదు, కాని ఆయన ప్రేమాస్పద నేత్రాలు అందుకు అంగీకారాన్ని తెలుపకనే తెలిపాయి. తరువాత ఆ శిశువును ఆప్యాయంగా చూస్తూ ఆయన సమాధిమగ్నుడైనాడు. ఇదంతా చూసి నేను ఆశ్చర్యపోతూవుండగా, ఆ ఋషి మనశ్శరీరాలలో కొంతభాగం దివ్యప్రకాశంగా మారి భూమి వైపుగా దిగసాగింది. మొట్టమొదటిసారి నరేంద్రుణ్ణి చూసీచూడగానే ఆ ఋషిసత్తముడే నరేంద్రుడని నేను గ్రహించాను”* ఇలా గురుదేవులు తమ జన్మరహస్యాన్ని నరేంద్రుని భూమండలంపై రాకని గురించి మాకు తెలియజేసారు.
10. శ్రీరామకృష్ణుల పట్ల నరేంద్రుని దృఢ విశ్వాసం
రెండవసారి శ్రీరామకృష్ణుల అద్భుతశక్తి ప్రభావం నరేంద్రుడి మానసిక స్థితిలో మార్పును ఉత్పన్నం చేసినప్పుడు అతడు తప్పక ఆశ్చర్యచకితుడై ఉంటాడు. ఆ అనుల్లంఘనీయమైన దివ్యశక్తితో పోలిస్తే తన మనోశక్తి, తెలివి నిరుపయోగాలని నరేంద్రుడు అంతరాంతరాళాల్లో గ్రహించాడు. శ్రీరామకృష్ణులు పిచ్చివారు అనే అతడి గత అభిప్రాయం మారిపోయింది. కాని మొదటి సమావేశంలో ఏకాంతంగా శ్రీరామకృష్ణులు అతడికి చెప్పిన మాటల అర్థం, ఉద్దేశం అవగతం చేసుకొనేవుంటాడని మాత్రం చెప్పలేం. శ్రీరామకృష్ణులు దివ్యశక్తి సంతరించుకొన్న అసాధారణమైన మహనీయులనీ, తనవంటి వ్యక్తి మనస్సును సంకల్పమాత్రాన ఊర్ధ్వదిశకు త్రిప్పగలరనీ మాత్రం నరేంద్రుడు గ్రహించి ఉంటాడు. అంతేకాక శ్రీరామకృష్ణుల సంకల్పం దైవసంకల్పంతో తాదాత్మ్యం చెందివుండడం వలన, ఆనాడు అందరూ పొందలేని అరుదైన అనుగ్రహం ఆయన దాక్షిణ్యం కారణంగానే తనకు లభించిందని కూడా నరేంద్రుడు గ్రహించి ఉంటాడు; కనుక కోరకుండానే అటువంటి లోకోత్తర మహనీయుని అనుగ్రహానికి పాత్రుడవడం తన మహద్భాగ్యమేనని నరేంద్రుడు భావించాడు.
11. గురువు గురించిన నరేంద్రుని భావనలో మార్పు
పై నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో నరేంద్రుడు తన అనేక గత అభిప్రాయాలను మార్చుకోవలసి వచ్చింది. ఒక వ్యక్తిని గురువుగా లేదా ఆధ్యాత్మిక మార్గదర్శిగా అంగీకరించడానికి గతంలో అతడు ఎంతో ఆక్షేపణ తెలిపేవాడు; ఎందుకంటే, స్వల్పశక్తులు, దర్శనాలు సంతరించుకొని తనలాగే బలహీనుడై ఉన్న ఆ వ్యక్తి, తదనంతరకాలంలో విచక్షణా రహితంగా తన ఉత్తరువులను పాటించమనడం అవివేకంగా నరేంద్రుడు భావించడమే ఇందుకు కారణం. బ్రహ్మసమాజంలో చేరినప్పుడు ఆ వైఖరిని నరేంద్రుడు రూఢిపరచుకొన్నాడని చెప్పడం అనవసరం. పై రెండు సందర్భాలలో జరిగిన సంఘటనలు ఆదిలో గురువు పట్ల అతడికిగల భావనను తీవ్రంగా కుదిపివేసాయి. సామాన్యజనుల మనస్సులలోని భగవంతుని భావనను మించిన అసాధారణ ప్రేమ, పావనత్వం, తపస్సు, వైరాగ్యం సంతరించుకొన్న అటువంటి మహనీయులు, ఈ లోకంలో, అరుదుగానే అయినప్పటికీ ఉద్భవిస్తారనే విషయం నరేంద్రుడు అవగతం చేసుకొన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తులను గురువులుగా అంగీకరిస్తే జనసామాన్యం ఎంతో లబ్ధి పొందుతుంది. పర్యవసానంగా శ్రీరామకృష్ణులను గురువుగా అంగీకరించడానికి నరేంద్రుడు సంసిద్ధుడైనాడు; కాని శ్రీరామకృష్ణుల ప్రతి వచనాన్ని గుడ్డిగా, అహేతుకంగా అంగీకరించడానికి మాత్రం అతడు ఇంకా తయారు కాలేదు.
12. శ్రీరామకృష్ణుల పావన సాంగత్యంలో నరేంద్రుని వైరాగ్య వికాసం
వైరాగ్యం సంతరించుకోకుండా భగవత్సాక్షాత్కారం లభించదనే భావన నరేంద్రుడి మనస్సును చిన్ననాటి నుండి ప్రభావితం చేస్తూవచ్చింది. అది అతడిలో స్వతఃసిద్ధంగా నెలకొని ఉన్నదే. అందుకు కారణం అతడి గతజన్మ సంస్కారాలే! అతడు బ్రహ్మసమాజ సభ్యుడైనప్పటికీ వివాహ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలనే వారి సమావేశాల, చర్చావేదికలలో అతడెన్నడూ పాల్గొనలేదనే సంగతి పైన పేర్కొన్న విషయానికి ఋజువుగా భావించవచ్చు. సర్వసంగ పరిత్యాగులైన శ్రీరామకృష్ణుల పరిచయంతోను, ఆయన అసాధారణ శక్తులను పరికించడంతోను వైరాగ్య భావన ఇప్పుడు పూర్తిగా అతడిలో వికసించసాగింది.
13. పరీక్షించకుండా ఉపదేశాలను స్వీకరించరాదనే నరేంద్రుని సంకల్పం
అప్పటి నుండి నరేంద్రుడు ఒకే విషయం గురించిన ఆలోచనలతో సతమతం కాసాగాడు. అటువంటి గొప్ప మహాత్ముల సాంగత్యంతో మనిషి మనస్సు వారి ప్రతి వచనాన్ని సముచిత రీతిలో ఆచితూచి చూడకుండానే విశ్వసిస్తుందని నరేంద్రుడు భావించేవాడు. ఏది ఏమైనప్పటికీ అలా జరగకుండా తాను జాగ్రత్త పడాలని అనుకొన్నాడు. పైన వర్ణించిన రెండు రోజుల సంఘటనల కారణంగా ఇప్పుడు శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో భక్తిప్రపత్తులు నరేంద్రుడు చెల్లిస్తూ ఉన్నప్పటికీ, శ్రీరామకృష్ణుల దర్శనాలను, అనుభూతులను అట్లే విశ్వసించ రాదనే నిర్ణయానికి వచ్చాడతడు; ఆ అనుభూతుల, దర్శనాల గురించి వ్యక్తిగతంగా తాను తెలుసుకోకుండా లేదా ఒకవేళ శ్రీరామకృష్ణులు అసంతుష్టులైనప్పటికీ వాటిని కఠిన హేతువాద పరీక్షకు గురి చేయకుండా నమ్మరాదనుకొన్నాడు; పర్యవసానంగా ఒక వంక ఆధ్యాత్మిక జగత్తులోని నిక్షిప్త సత్యాలను గ్రహించడంలో సదా మనస్సును సంసిద్ధంగా ఉంచినప్పటికీ, మరో వంక అప్పటి నుండి శ్రీరామకృష్ణుల అద్భుత ప్రవర్తన, దర్శనాలను పరీక్షించడంలో నిమగ్నుడయ్యాడు.
14. అప్పటి నుండి నరేంద్రుని ప్రవర్తన
ప్రథమ సమావేశంలో విచిత్ర పదాలతో తనను సంబోధించడంతో నరేంద్రుడు, శ్రీరామకృష్ణులను ఏకోన్మాదిగా పరిగణించాడు. శ్రీరామకృష్ణులను అవతారమూర్తిగా ఎంచి ఆయన వచనాలను పరికిస్తే, నరేంద్రుని కుశాగ్రబుద్ధికి ఆ వచనాల ప్రస్ఫుట అర్థం తోచేది. కాని సత్యాన్వేషితమైన, యుక్తియుక్తమైన ఆలోచన చేసే ఆతడి మనస్సు హఠాత్తుగా ఈ వాస్తవాన్ని ఎలా అంగీకరిస్తుంది? కాబట్టి ఆ వచనాలను, ఆ సంఘటనలను అర్థం చేసుకోగల శక్తిని భగవంతుడు ఎప్పటికైనా ప్రసాదించినప్పుడు వాటిని గురించి చర్చించాలని అతడు నిశ్చయించుకొన్నాడు. ఆ విధంగా ఆ సమస్యను తన మనస్సులో ఒక మూలకు నెట్టివేసి, భగవత్సాక్షాత్కారం ఎలా పొంది తరించాలో శ్రీరామకృష్ణులతో చర్చించడంలో, ఆయన నుండి నేర్చుకోవడంలో అతడు నిమగ్నుడయ్యాడు.
15. అప్పటి నరేంద్రుని మానసిక స్థితి
తన గత నిశ్చితాభిప్రాయాలను మార్చుకొని నూతన సత్యాలను అంగీకరించే సమయంలో దృఢమైన మనస్సు అంతరంగంలో నుండి బలమైన ప్రతిఘటనను ఎదుర్కొనడం సహజం. నరేంద్రుడు ఇప్పుడు ఆ సంకట స్థితిలోనే ఉన్నాడు. శ్రీరామకృష్ణుల అద్భుత శక్తిని కళ్ళారా చూసినప్పటికీ ఆయనను పూర్తిగా అంగీకరించలేదు; ఆయన పట్ల ఆకర్షితుడైనప్పటికీ, ఆయన నుండి దూరంగా ఉండగోరాడు. అతడి ఈ వైఖరి పర్యవసానం ఏ విధంగా పరిణమించిందో ముందు ముందు చూడబోతాం.