1. దివ్యభావంలో శ్రీరామకృష్ణులు
బ్రహ్మజ్ఞాని సర్వజ్ఞుడని వేదాలూ, ఇతర శాస్త్రగ్రంథాలూ వచిస్తున్నాయి. బ్రహ్మజ్ఞానంలో సుప్రతిష్ఠితులైన శ్రీరామకృష్ణుల ప్రవర్తనను చూసినప్పుడు పై శాస్త్రవచనం రూఢి అవుతుంది. ఎందుకంటే ఆయన బ్రహ్మం, బ్రహ్మశక్తియైన మాయ యొక్క నిత్యం, లీలలతో సుపరిచితు లవడమే కాక, సమస్త సంశయాలకూ కళంకాలకూ అతీతమైన పరమానంద స్థితిలో ఓలలాడుతుంటారు. జగజ్జననితో అభిన్నత పొందుతూన్న భావముఖ స్థితిలో సుప్రతిష్ఠితులై ఉండడం వలన, కోరుకొన్న తక్షణమే ఆయన మాయాజగత్తులోని ఏ మర్మాన్నైనా ఇట్టే గ్రహించగలిగేవారు. ఆయన మనోనేత్రం నుండి మాయ తన స్వభావాన్ని ఇక ఏమాత్రం దాచివుంచలేకపోయింది. ఎందుకంటే మాయ మేలిముసుగును చొచ్చుకొనిపోయే సూక్ష్మదృష్టి ఆయన మనోనేత్రం సంతరించుకొంది కనుక. స్వభావసిద్ధంగా చూస్తే అంతేకదా! ఎందుకంటే భావముఖం, విశ్వభావనలు కొన్ని సమయాలలో అభివ్యక్తమవుతూ కొన్ని సమయాల్లో అభివ్యక్తం కాని మాయాతీతుడైన ఈశ్వరుని విశ్వమానసం… ఈ రెండూ ఒక్కటే కదా! విశ్వమానసంలో ఉదయించే భావాలన్నీ, తన చిన్ని–అహం తత్త్వ పరిధిని అధిగమించి విశ్వ–అహంతో తాదాత్మ్యం చెందిన వ్యక్తి కళ్ళెదుట ఈ అభేదం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్థితిని చేరుకొన్నారు కాబట్టే శ్రీరామకృష్ణులు, తమ భక్తులు తమ వద్దకు రాకపూర్వమే వారి గత జన్మలలో జరిగిన సంఘటన లన్నిటినీ తెలుసుకోగలిగారు. విశ్వమానసంలో ప్రత్యేక లీల అభివ్యక్తీకరణకు ఈ ప్రస్తుత దేహధారణ అని వారికి తెలుసు. ఆ లీలలో పాల్గొనడానికి భగవత్ సంకల్పానుసారం కొందరు ఉత్కృష్ట కోవకు చెందిన సాధకులు జన్మించారనీ ఆయనకు తెలుసు. ఆ లీల అభివ్యక్తీకరణలో ఎవరు ఎక్కువగా దోహదం చేస్తారో, ఎవరు తక్కువగా చేస్తారో కూడా ఆయనకు తెలియని విషయం కాదు. అంతేకాదు తద్ద్వారా ఎవరు లబ్ధి పొంది, ఈ జీవితంలోనే పరిపూర్ణత్వాన్ని పొందగలరో కూడా ఆయనకు తెలుసు. వారు వచ్చే సమయం దగ్గర పడిందని తెలిసి, వారి కోసం ఆతురతతో ఆయన ఎదురుచూడసాగారు. మాయారాజ్యంలో జీవిస్తూ, దాని మర్మాలన్నీ ఎరిగిన వ్యక్తిని సర్వజ్ఞుడని కాక మరెలా పరిగణించాలి?
నరేంద్రనాథ్ దత్త (1863-1902), కాలాంతరంలో స్వామి వివేకానంద. ఈ ఛాయాచిత్రాన్ని 1896 సం ॥ లో లండన్‌లో తీసారు.
సురేంద్రనాథ్ మిత్ర (1850-1890)
రాఖాల్ (1863-1922). కాలాంతరంలో స్వామి బ్రహ్మానంద. 1903 సం ॥ లో వారణాసిలో తీసిన ఛాయాచిత్రం.
2. సురేంద్రుని ఇంట్లో శ్రీరామకృష్ణ నరేంద్రుల ప్రథమ సమావేశం
శ్రీరామకృష్ణ-నరేంద్రుల ప్రథమ సమావేశం గురించి కాస్త పరికించి చూస్తే దివ్యభావంలో నెలకొనివున్న శ్రీరామకృష్ణులు, తాము దివ్యదర్శనాలలో గుర్తించిన భక్తులకై ఎలా ఆతురతతో ఎదురుచూస్తున్నారో తెలుసుకోవచ్చు. తాను దక్షిణేశ్వరానికి మొదటిసారి వెళ్ళిన సమయంలోనే కలకత్తాలోని సిమ్లా పేట వాస్తవ్యుడు సురేంద్ర నాథ్ మిత్ర కూడా అక్కడకు వచ్చినట్లు స్వామి బ్రహ్మానంద తెలిపివున్నాడు. సురేంద్రనాథ్ స్వల్పకాలంలోనే శ్రీరామకృష్ణులకు బాగా చేరువయ్యాడు; శ్రీరామకృష్ణులను తన ఇంటికి తోడ్కొని వెళ్ళి ఆనందంగా ఉత్సవ వేడుకలు జరిపించాడు. ఆ సందర్భంలో మంచి గాయకుడు ఎవరూ లభించనందున, తన పొరుగింటి విశ్వనాథ దత్త కుమారుడైన నరేంద్రుణ్ణి ఉత్సవంలో పాల్గొని భక్తిగీతాలు, ముఖ్యంగా శ్రీరామకృష్ణులు ముగ్ధులయ్యేలా పాడమని సాదరంగా ఆహ్వానించాడు. శ్రీరామకృష్ణుల దివ్యలీలలో ప్రధాన పాత్రధారియైన నరేంద్రుడు, శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా కలుసుకోవడం ఆ విధంగా జరిగింది. ఈ సంఘటన బహుశ 1881 నవంబర్ నెలలో జరిగివుండవచ్చు. అప్పుడు నరేంద్రుని వయస్సు పద్ధెనిమిదేళ్ళు, కలకత్తా విశ్వవిద్యాలయ ఎఫ్.ఏ. పరీక్షలకు అప్పుడు సిద్ధమౌతున్నాడు.
3. నరేంద్రుణ్ణి దక్షిణేశ్వరానికి శ్రీరామకృష్ణులు ఆహ్వానించడం
ఆ రోజు నరేంద్రుణ్ణి చూసినప్పటి నుండి శ్రీరామకృష్ణులు అతడి పట్ల అమిత ఆకర్షితులైనట్లు తాను స్పష్టంగా భావించినట్లు రాఖాల్ చెప్పేవాడు. ఎందుకంటే శ్రీరామకృష్ణులు మొదట సురేంద్రను, పిదప రామచంద్రను పిలిచి మధురస్వరంలో పాడిన ఆ యువగాయకుణ్ణి గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. అంతేకాక పాట పూర్తి కాగానే ఆ యువకుడి వద్దకు స్వయంగా ఆయనే వెళ్ళి అతడి ముఖకవళికలను జాగ్రత్తగా గమనిస్తూ ఒకటి రెండు మాటలు అతడితో మాట్లాడి, త్వరలో ఒకసారి దక్షిణేశ్వరానికి రమ్మని ఆహ్వానించారు కూడా.
4. దక్షిణేశ్వరానికి నరేంద్రుడు మొదటిసారి వెళ్ళడం
ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల తరువాత కలకత్తా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఎఫ్.ఏ. పరీక్షలు ముగిశాయి. కలకత్తా వాస్తవ్యుడైన ఒక పెద్దమనిషి విన్నపం మేరకు నరేంద్రుని తండ్రి, ఆ పెద్దమనిషి కుమార్తెతో నరేంద్రుని వివాహం జరిపించడానికి ఏర్పాట్లు చేయసాగాడు. వధువు కాస్త నల్లగా ఉండడం వలన, ఆమె తండ్రి పదివేల రూపాయలు కట్నం ఇవ్వడానికి అంగీకరించాడు. నరేంద్రుని బంధువులు, రామచంద్రదత్త ఆధ్వర్యంలో ఆ వివాహానికి సమ్మతించమని నరేంద్రునికి నచ్చచెప్ప ప్రయత్నించారు. కాని నరేంద్రుడు తీవ్ర అభ్యంతరం తెలపడంతో ఆ వివాహం జరగలేదు. రామచంద్ర, నరేంద్రుని తండ్రికి చాలా దగ్గరి బంధువు. అతడు, నరేంద్రుని తండ్రి ఇంట్లో పెరిగాడు; ఆ సమయంలో కలకత్తాలో వైద్యవృత్తిలో ఉంటున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానోదయ మార్గాన్వేషణ కారణంగా నరేంద్రుడు వివాహానికి సమ్మతించలేదని రామచంద్ర తెలుసుకొని, అతడితో “భగవత్సాక్షాత్కారం పట్ల నీకు నిజమైన అభిలాషే ఉంటే, బ్రహ్మసమాజం తదితర చోట్లకు వెళ్ళడానికి బదులు దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళు” అని సలహా ఇచ్చాడు. ఇదే సమయంలో ఒక రోజు సురేంద్ర తనతో బండిలో దక్షిణేశ్వరానికి రమ్మని నరేంద్రుణ్ణి ఆహ్వానించాడు. నరేంద్రుడు అందుకు సమ్మతించాడు. ఇద్దరు ముగ్గురు మిత్రులతో, సురేంద్ర వెంట దక్షిణేశ్వరం వెళ్ళాడు.
5. నరేంద్రుణ్ణి గురించి శ్రీరామకృష్ణుల ఆలోచనలు
ఆ సందర్భంలో నరేంద్రుణ్ణి చూసినప్పుడు ఆయనలో కలిగిన ఆలోచనలను శ్రీరామకృష్ణులు “ఆ రోజు నరేన్ పశ్చిమద్వారం (గంగకు అభిముఖంగా ఉన్న) గుండా ఈ గదిలోకి వచ్చాడు. తన శరీరం గురించి శ్రద్ధ వహిస్తున్నట్లుగా కనిపించలేదు. జుట్టు దువ్వుకోలేదు, బట్టలు నలిగి ఉన్నాయి. బాహ్యాలంకరణ పట్ల ఇతరులలా అతడికి శ్రద్ధ ఉన్నట్లు లేదు. దేనిపట్లా అనురక్తి కనిపించలేదు. మనస్సు దాదాపు అంతర్ముఖమై ఉన్నట్లు అతడి కళ్ళు సూచించాయి. ఇదంతా చూసి నేను, ‘సత్త్వగుణం సమృద్ధంగా ఉన్న ఈ గొప్ప ఆధ్యాత్మిక సాధకుడు లౌకికులకు నెలవైన కలకత్తాలో జీవిస్తూవుండడం సాధ్యమేనా?’ అనుకొని ఆశ్చర్య పోయాను” అని మాటల సందర్భంలో మాతో చెప్పారు.
“నేలమీద పరుపు పరిచివుంది. దానిపై అతణ్ణి కూర్చోమన్నాను. గంగా జలం ఉన్న కూజా ప్రక్కన అతడు కూర్చున్నాడు. అతడి పరిచయస్థులు కొందరు కూడా ఆ రోజు అతడితో కలిసివచ్చారు. వాళ్ళు స్వభావంలో అతడికి విరుద్ధంగా, సాధారణ లౌకికులలా నాకు కనిపించారు. వాళ్ళ దృష్టి సుఖభోగాలపైనే ఉంది.”
వాకబు చేయగా అతడు రెండు మూడు బెంగాలీ పాటలు మాత్రమే నేర్చుకొన్నట్లు తెలిసింది. వాటిని పాడమని అడిగాను. అతడు బ్రహ్మసమాజ గీతం పాడనారంభించాడు :
మరలు మనసా మన నిజ నికేతనంబునకు
మారువేషముల దాల్చి
పరదేశపు ఈ భువిలో
వ్యర్థముగా ద్రిమ్మదిరుగు
చుండనేల మన మిచట? ॥ మ ॥
పరులు సకల ప్రాణతతులు
పంచమహాభూతములును
గారొక్కరు నీవారలు
వారెల్ల పరాయివారు ॥ మ ॥
పరవారల ప్రేమలోబడి
మరతువు నిన్నేల మనసా
నీ వారల నా రీతిని
ఏల మరచుచున్నావు? ॥ మ ॥
సరి మార్గము గనపరచెడు
కరదీపిక ప్రేమజ్యోతి
ధరియించుచు అధిరోహణ
మొనరింపుము సత్యపథము ॥ మ ॥
నీ దారిన బత్తెముగా
నీ సుగుణములను తెమ్ము
పరుల కంటబడనీయక
భద్రముగా వాని దాచి ॥ మ ॥
ఇరువురు దారిని దోచెడు
దొంగలవలె లోభ మోహ
మనువారలు నీ సంపద
గొనిపోవగ దాగినారు ॥ మ ॥
అనవరతము నిన్నాపద
దరిజేరక రక్షించెడు
శమదమ మను రక్షక
భటవర్గము వెంటగొనుము ॥ మ ॥
సత్పురుషుల సాంగత్యము
స్వాగతమొసగెడు సత్రము
అలసిన నీ అవయవముల
నిట విశ్రాంతిని గొననిమ్ము ॥ మ ॥
సంశయమేదైన నీకు
బొడసూపినచో నచ్చట
సత్రపు సంరక్షకుని
సరిమార్గము నరసికొనుము ॥ మ ॥
దారిలో భయమేర్పడిన
ఈశ్వరు నెలుగెత్తి పిలువు
ఆ దారికి ప్రభుడతడు
మృత్యువు సైతము మ్రొక్కును ॥ మ ॥
ధ్యాన స్థితిలో ఉన్నట్లు అతడు తన మనస్సును హృదయాన్ని లయం చేసి ఆ పాటను గానం చేశాడు. ఆ పాట వినగానే, నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోయాను, భావపారవశ్యంలో మునిగిపోయాను.
6. నరేంద్రుణ్ణి చూడగోరి శ్రీరామకృష్ణులు తపించిపోవడం
అతడు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాక, ఇరవై నాలుగు గంటలూ అతణ్ణి మళ్ళీ చూడగోరి నేను తపించిపోయాను. ఆ తపనను మాటల్లో వర్ణించలేను. తడి తువ్వాలును పిండుతున్నట్లు నా హృదయాన్ని పిండివేస్తున్న బాధను తరచు అనుభవించసాగాను. నన్ను నేను అదుపులో ఉంచుకోలేక దక్షిణేశ్వర ఉద్యానవనానికి ఉత్తరాన ఉన్న దేవదారు వృక్షాల వైపుకు పరుగెత్తికెళ్ళేవాణ్ణి; సామాన్యంగా అక్కడ జనం ఎవరూ సంచరించరు. అక్కడకు పోయి బిగ్గరగా విలపిస్తూ, “నాయనా, రా! నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను’ అని పలికేవాణ్ణి. అలా కాసేపు విలపించిన తరువాతే, నా ఆరాటం కాస్త ఉపశమించేది. ఈ విధంగా ఆరు నెలలపాటు కొనసాగింది. ఇతర బాలుర కోసం కూడా కొన్ని సమయాలలో నా మనస్సు ఆరాటపడిన విషయం నిజమే. కాని నరేన్కై నేను పడిన తాపత్రయంతో పోలిస్తే ఈ ఆరాటం అంతంత మాత్రమే” అని ప్రప్రథమంగా నరేంద్రుని చూసినప్పుడు కలిగిన తమ ఆలోచనలను మాకు గురుదేవులు వివరించారు.
7. శ్రీరామకృష్ణులతో జరిగిన తన ప్రథమ సమావేశం గురించి నరేంద్రుడు
దక్షిణేశ్వరంలో మొదటిసారి నరేంద్రుణ్ణి చూసినప్పుడు తమ మనస్సులో జనించిన అసాధారణ భావోద్వేగాలను గురించిన చాలా విషయాలు శ్రీరామకృష్ణులు మా నుంచి దాచివుంచారని మాకు ఆ తరువాత తెలియవచ్చింది. ఆ విషయాల గురించి ఆయన మాతో కొంత ముభావంగానే మాట్లాడారు. ఆ సందర్భం గురించి ముచ్చటిస్తున్నప్పుడు ఒక రోజు నరేంద్రుడు మాతో ఇలా చెప్పాడు: “నేను పాడడం ముగించాను. వెంటనే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి, తమ చేయి నా మీద వేసి, నన్ను ఉత్తరం వైపు వసారాలోకి తోడ్కొని వెళ్ళారు. అది శీతాకాలం. ఉత్తరం వైపు నుండి వచ్చే చలిగాలి గదిలోకి రాకుండా వసారా స్తంభాల మధ్య చాపలు దించివుంచారు. కాబట్టి వసారాలోకి వచ్చి, గది తలుపు మూసివేస్తే బయటి నుండి లేదా గదిలో నుండి వసారాలో ఏం జరుగుతూన్నదో ఎవరికీ కనిపించదు. వసారాలోకి రాగానే శ్రీరామకృష్ణులు గది తలుపు మూసి వేశారు. వ్యక్తిగతంగా నా కేదో ఉపదేశించబోతున్నారనుకొన్నాను. కాని ఆయన చెప్పింది, చేసింది ఊహాతీతం. హఠాత్తుగా ఆయన నా చేయి పుచ్చుకొన్నారు; ఆయన కళ్ళవెంట ఆనందాశ్రువులు ధారగా స్రవిస్తున్నాయి. ఆప్యాయత ఉట్టిపడే కంఠస్వరంలో ఆయన నాతో ఇలా అన్నారు – ‘ఇంత ఆలస్యంగా నువ్వు రావడం న్యాయమేనా? నీ కోసం నేనెంత పరితపిస్తూ ఎదురుచూస్తూన్నానో ఒకసారన్నా ఆలోచించావా? ఈ లౌకికుల ఉబుసుపోక కబుర్లు వినీవినీ నా చెవులు తూట్లు పడిపోయాయి. నా అంతరాంతర భావనలను పంచుకోవడానికి ఎవరూ లేనందున, నా హృదయం పగిలిపోయే స్థితికి వచ్చింది.’ ఇలా అసంబద్ధంగా మాట్లాడుతూ విలపించసాగారు. మరుక్షణమే నా ముందు నిలబడి భగవంతునికి భక్తిచెల్లించే తీరులో చేతులు జోడించుకొని, ఇలా అన్నారు: ‘నాకు తెలుసు ప్రభూ! సనాతన నరనారాయణ ఋషులలో నువ్వు నరుడవని నేను ఎరుగుదును. నువ్వు మానవాళి కష్టాలను దుఃఖాలను బాప, ఈ రూపంలో ఇప్పుడు అవతరించావు’.
8. మళ్ళీ వస్తానని నరేంద్రుడు వాగ్దానం చేయడం
“నేను విస్తుబోయి ఇలా అనుకొన్నాను – ‘ఎవరిని చూడడానికి వచ్చాను? ఈయన, పూర్తిగా పిచ్చివాడు. లేకుంటే విశ్వనాథ దత్త కుమారుడనైన నాతో ఈ ధోరణిలో మాట్లాడతారా?’ అయినప్పటికీ నేను మౌనంగా ఉండిపోయాను. ఆ పిచ్చివ్యక్తి తన ధోరణిలో తాను మాట్లాడ సాగాడు. మరుక్షణమే ఆయన నన్నక్కడ ఉండమని, తను గదిలోకి వెళ్ళాడు. వచ్చేటప్పుడు వెన్న, పటికబెల్లం, సందేశ్ తీసుకువచ్చి స్వయంగా తన చేత్తో నాకు తినిపించసాగాడు. ఆ తినుబండారాలను నా చేతికిస్తే, నా మిత్రులతో కలిసి తింటానని ఎంత చెప్పినా ఆయన వినిపించు కోలేదు. ‘వాళ్ళు తరువాత తింటారులే! ముందు వీటిని నువ్వు తిను’ అన్నారు. ఇలా అంటూ మొత్తం తీపి తినుబండారాలను నాకు తినిపించే వరకు ఆయన తృప్తిచెందలేదు. ఆ తరువాత నా చేయి పుచ్చుకొని, ‘త్వరలోనే మళ్ళీ ఇక్కడకు ఒంటరిగా వస్తానని వాగ్దానం చెయ్యి’ అని అన్నారు. అలా ఆయన ప్రాధేయ పడడం చూసి ‘వస్తా’ నని వాగ్దానం చేశాను. తరువాత ఆయనతో కూడా గదిలోకి వెళ్ళి, నా సహచరుల ప్రక్కన కూర్చున్నాను.
9. శ్రీరామకృష్ణుల గురించి నరేంద్రుని తొలి అభిప్రాయం
ఆయనను జాగ్రత్తగా గమనించసాగాను. ఇతరులతో ఆయన మాట్లాడేటప్పుడుగాని, వ్యవహరించేటప్పుడుగాని ఆయన వైఖరిలో నాకెలాంటి పిచ్చితనమూ కనిపించలేదు. ఆయన చక్కటి మాటలు, భావ పారవశ్యం నన్ను ఆకట్టుకొన్నాయి; భగవంతునికై సమస్తం త్యజించిన ఈ వ్యక్తి యథార్థమైన పరిత్యాగి అనీ, చెప్పిందే అనుష్ఠిస్తారనీ నేను భావించాను. ‘మిమ్మల్ని చూస్తూన్నట్లు, మీతో మాట్లాడుతూన్నట్లు గానే భగవంతుణ్ణి దర్శించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కాని అలా చేయాలని ఎవరు అనుకొంటారు? జనం భార్యాపుత్రులు మరణించినప్పుడు కడవలకొద్దీ కన్నీరు స్రవించేలా విలపిస్తారు; ధనం, సంపదలకై కూడా అదే రీతిలో ప్రవర్తిస్తారు. భగవత్సాక్షాత్కారం లభించలేదని విలపించేదెవరు? భగవంతుణ్ణి నిజంగా ప్రార్థిస్తూ ఆయనకై వ్యాకులత చెందేవారికి ఆయన తప్పక సాక్షాత్కరిస్తాడు.’ ఆయన ఈ వచనాలు విన్నప్పుడు, ఇవి కేవలం కావ్యాలంకారంతో కూడుకొన్న ఇతర మత ప్రచారకులు చేసే ప్రసంగ పంక్తులు కావని గ్రహించాను. అవి భగవంతునికై సర్వసంగపరిత్యాగం చేసి సంతరించుకొన్న జ్ఞానోక్తులని తెలిసి ఆయన పట్ల నాకు కలిగిన సదభిప్రాయం ఇనుమడించింది.
ఇంతకు ముందు ఆయన నాతో ప్రవర్తించిన తీరుతో, ఈ వచనాలకు సామరస్యం కలిగించ ప్రయత్నించాను. అబక్రోంబి మొదలైన ఆంగ్ల తత్త్వవేత్తలు ప్రస్తావించిన ఏకభావోన్మాదం గల వ్యక్తుల ఉదాహరణలు గుర్తుకు వచ్చి ఈయన వారు పేర్కొన్న ఆ కోవకే చెందుతారని నిర్ణయించుకొన్నాను. ఆ నిర్ణయానికి వచ్చినప్పటికీ, ఆయన అద్భుత పరిత్యాగాన్ని నేను మరచిపోలేను. నోట మాట రాక, నేనిలా ఆలోచించాను : ‘సరే, ఆయన పిచ్చివాడే! కాని అటువంటి అరుదైన వ్యక్తి మాత్రమే అటువంటి పరిత్యాగాన్ని, వైరాగ్యాన్ని పాటించ గలుగుతాడు. అవును పిచ్చే, కాని ఎంత పావనత్వం! ఏం పరిత్యాగం! నిజంగా మానవ హృదయం తప్పక గౌరవించవలసిన, పూజించవలసిన, ఆరాధించవలసిన వ్యక్తి ఆయన.’ అలా ఆలోచిస్తూ, ఆయన పాదాలకు ప్రణమిల్లి, ఆయన నుండి సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వచ్చాను” ఇలా నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో తన ప్రథమ సమావేశాన్ని అభివర్ణించాడు.
10. నరేంద్రుని అప్పటి మతానుష్ఠానం
ఎవరిని చూడగానే శ్రీరామకృష్ణులలో అసాధారణ భావోద్వేగాలు ఉదయించాయో ఆ వ్యక్తి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవాలనే ఉత్సుకత పాఠకులకు కలగడం సహజం. వాటిని గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుపుతాం. మనం ప్రస్తావిస్తున్న సమయంలో నరేంద్రుడు లౌకిక విద్యను, సంగీతాన్ని నేర్చుకొంటున్న కేవలం ఒక విద్యార్థి మాత్రమే కాడు. కఠోర సంయమంతో జీవితం గడుపుతూ, ఆధ్యాత్మిక ప్రేరణ ప్రభావంలో తీవ్ర తపశ్చర్యాదులు అనుష్ఠిస్తూన్నాడు. అతడు పూర్తి శాఖాహారి; రాత్రిపూట కటిక నేలమీద నిద్రించేవాడు. అతడి పూర్వీకుల ఇంటి వద్ద, అతడి అమ్మమ్మకు ఒక అద్దె ఇల్లు ఉంది. ప్రవేశ పరీక్షకు కూర్చున్నప్పటి నుండి అతడు సామాన్యంగా ఆ అద్దె ఇంటి మొదటి అంతస్తులోని ఒక గదిలో నివసించసాగాడు. అక్కడ ఏదో కారణంగా ఇబ్బంది కలిగినప్పుడు, ఆ ఇంటికి సమీపంలోనే ఒక గది అద్దెకు తీసుకొనేవాడు; తన కుటుంబానికి, బంధువర్గానికి దూరంగా ఆ గదిలో విడిగా ఉంటూ తన జీవిత ప్రధాన లక్ష్యమైన భగవత్సాక్షాత్కార అన్వేషణలో పూర్తిగా నిమగ్నుడైపోయేవాడు. ఉదారుడైన అతడి తండ్రీ, ఇతర కుటుంబ సభ్యులూ ఇంట్లో నానారకాల అవరోధాల ఇబ్బందుల కారణంగా చదువు శ్రద్ధగా సాగదని భావించే అతడు గదిలో విడిగా వసిస్తున్నాడని అనుకొన్నారు.
11. బ్రహ్మసమాజంతో నరేంద్రుని సంబంధం
బ్రహ్మసమాజ బోధనలు అనుసరించే నరేంద్రుడు సగుణుడైన నిరాకార బ్రహ్మం ధ్యానంలో ఎక్కువసేపు గడిపేవాడు. ఊహతో, తర్కంతో నిరాకార బ్రహ్మం ఉనికిని ఇట్టే విశ్వసించడంలో అతడు సంతృప్తి చెందడు. గత జన్మల ఆధ్యాత్మిక సంస్కారాల ప్రోద్బలం వలన నిజంగా భగవంతుడు ఉండివుంటే, పరమ వ్యాకులతతో ఆరాటపడే వ్యక్తికి ఆయన ఎన్నటికీ తన స్వకీయ స్వభావాన్ని దాచి ఉంచడు, అది కనుగొనడానికి తప్పక ఏదో ఒక మార్గం ఆవిష్కరించే ఉంటాడని ఆతడి హృదయం సతతం తెలియచేస్తూనే ఉంది. భగవత్సాక్షాత్కారార్థం అన్వేషణ చేయని జీవితం భారమూ, వెట్టిచాకిరీ చేయడంతో సమానమూ అవుతుందని అతడికి స్ఫురించింది. ఒకసారి అతడు మాతో ఇలా చెప్పినట్లు మాకు స్పష్టంగా గుర్తుంది:
12. నరేంద్రుని రెండు అద్భుత భావనలు
“యౌవన అవస్థను చేరుకొన్నప్పటి నుండి, ప్రతి రాత్రి పడుకోగానే నా ముందు రెండు భావాలు ప్రత్యక్షమయ్యేవి. ఒక దర్శనంలో అపార సంపద, అసంఖ్యాక పరివారజనం, గౌరవం, మహద్వైభవం, హోదా, అధికారం గల వ్యక్తిగా భావన కలిగేది. లోకంలోని గొప్ప వ్యక్తులందరిలో అగ్రస్థానాన్ని ఆక్రమించుకొన్నట్లు భావించేవాణ్ణి. దాన్ని సాధించే శక్తిసామర్థ్యాలు నాకు ఉన్నాయనుకొనేవాణ్ణి. మరుక్షణంలోనే సర్వసంగ పరిత్యాగం చేసి, కౌపీనధారినై, దొరికింది తింటూ, రాత్రుళ్ళు చెట్లక్రింద నిద్రిస్తూ, భగవత్ సంకల్పం మీదే పూర్తిగా ఆధారపడి జీవిస్తూన్నట్లు మరో దృశ్యం కానవచ్చేది. కోరుకుంటే ఋషుల, మహర్షులలా జీవించగలననుకొన్నాను. నా జీవితాన్ని ఎలా కావాలంటే అలా మలచుకోగల పరస్పర విరుద్ధమైన ఈ దృశ్యాలు నా మదిలో మెదిలాయి. కాని చివరికి రెండవదే మనస్సును ఆకట్టుకొంది. ఈ మార్గంలోనే మనిషి నిజమైన పరమానందాన్ని పొందగలడనీ, మొదటి మార్గం కాక ఈ మార్గాన్నే నేను అనుసరించాలనీ, అనుకొన్నాను. అటువంటి జీవితం అందించే ఆనందాన్ని గురించి దీర్ఘంగా యోచిస్తూ నా మనస్సు భగవద్ధ్యానంలో లీనమైపోగా నేను నిద్రలోకి జారుకొనేవాణ్ణి. ఎంతో కాలం ప్రతి రాత్రి ఇలాగే జరగడం నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉండేది.”
13. ధ్యానం పట్ల నరేంద్రుని సహజ అభిరుచి
ఆ పిన్నవయస్సులోనే, ఎవరి సలహా లేకుండానే భగవత్సాక్షాత్కారానికి అత్యుత్తమ మార్గం ధ్యానమే అని నరేంద్రుడు కనుగొన్నాడు. అతడి గత జన్మల ఆధ్యాత్మికత, దానినుండి పొందిన సంస్కారాలను ఈ విషయం చెప్పకనే చెబుతూన్నది. నాలుగైదేళ్ళ వయస్సులో ఉన్నప్పుడు అతడు సీత, రాముడు, శివుడు మొదలైన దేవీదేవతల చిన్నిప్రతిమలను బజారునుండి కొనితెచ్చుకొనేవాడు. ఇంట్లో వాటిని చక్కగా అలంకరించి, వాటి ముందు నిశ్చలంగా కళ్ళుమూసుకొని ధ్యానాన్ని అనుకరిస్తూ కూర్చునేవాడు. ఈలోపు కొన్ని చెట్ల ఊడలలా భూమ్మీదకు దిగివచ్చే రీతిలో తన తలనుండి జటలు కట్టిన తన శిరోజాలు వ్రేలాడి నేలమీద పడుతున్నాయేమోనని మధ్యమధ్య కళ్ళు తెరిచి చూసేవాడు. ఎందుకంటే మునులు ఋషులు దీర్ఘకాలం తపస్సు చేస్తూన్నప్పుడు, వారి శిరోజాలు జటలుకట్టి నేలమీద వ్రేలాడేవని ఇంట్లోని వృద్ధ స్త్రీలు చెప్పగా అతడు విని ఉన్నాడు. ఒకరోజు నరేంద్రుడు, పొరుగింటి హరి అనే బాలుడితో ఎవరికీ తెలియకుండా ఇంట్లో ఏకాంతమైన ఒకచోట చాలాసేపు ధ్యానాన్ని అనుకరిస్తూ కూర్చుండిపోయాడు. అతడి కోసం ఇంటిల్లిపాదీ వెతకి వేసారిపోయి, చివరకు ఎక్కడికో బయటకు వెళ్ళి దారితప్పిపోయాడని భావించారు. ఆ తరువాత ఎవరూ వెళ్ళని ఆ ఏకాంతమైన చోటికి తలుపులు పగలగొట్టి వెళితే, అక్కడ నిశ్చలంగా ధ్యానభంగిమలో అతడు కూర్చుని ఉండడం కనిపించింది. పై విషయం పూజ్యురాలైన అతడి తల్లే స్వయంగా చెప్పారు. అతడి ప్రవర్తన బాలుర ఊహలను వ్యక్తంచేసేదిగానే ఉన్నప్పటికీ, ఎటువంటి అద్భుత ఆధ్యాత్మిక సంస్కారాలతో అతడు జన్మించాడో అది చాటి చెబుతోంది. మనం ప్రస్తావిస్తూన్న కాలఘట్టంలో అతడి బంధువు లెవరికీ అతడు అనునిత్యం ధ్యానం చేస్తూన్నట్లు తెలియదు. ఎందుకంటే ఇంట్లోని వారంతా నిద్రపోయిన తరువాతే తన గది తలుపులు బిడాయించి ధ్యానానికి కూర్చునేవాడు. కొన్ని సమయాలలో ధ్యానంలో ఎంతగా లీనమైపోయేవాడంటే, తిరిగి అతడికి మామూలు బాహ్యస్మృతి వచ్చేసరికి భళ్ళున తెల్లవారిపోవడం కూడా కద్దు.
14. మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్ ప్రోత్సాహం
ఈ సమయంలోనే జరిగిన ఒక సంఘటన ఫలితంగా నరేంద్రుని ధ్యానాభిరుచి మరింత ఇనుమడించింది. ఒక రోజు అతడు మిత్రులతో కలిసి బ్రహ్మసమాజం ఆచార్యుడైన మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్‌ను చూడడానికి వెళ్ళాడు. ఆ సందర్భంలో మహర్షి ఆ యువకులను తన చెంత కూర్చోబెట్టు కొని ప్రతి రోజు భగవంతుని గురించి ధ్యానం చేయమని ఉపదేశించారు. నరేంద్రుణ్ణి సంబోధిస్తూ ఆ రోజు ఆయన, “నీలో యోగి లక్షణాలు అభివ్యక్తమౌతున్నాయి; నువ్వు ధ్యానాన్ని అభ్యసిస్తే, యోగశాస్త్రాలు వచించిన అనుభూతులను తప్పక పొందుతావు” అని చెప్పారు. ఆయన పావనత్వం కారణంగా నరేంద్రుడికి అంతకు ముందు నుండే ఆయనంటే అమిత గౌరవం ఉండేది. కాబట్టి ఆయన సలహా మేరకు, ఇంతకు ముందుకంటే అత్యంత ఉత్సాహంతో నరేంద్రుడు ధ్యానం చేయసాగాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
15. నరేంద్రుని బహుముఖ ప్రజ్ఞా పాటవాలు
చిన్ననాటి నుండే నరేంద్రుడిలో బహుముఖ ప్రజ్ఞాపాటవాల సూచనలు కానరాసాగాయి. ముగ్ధబోధ అనే సంస్కృత వ్యాకరణ గ్రంథంలోని సూత్రాలన్నీ అతడికి కంఠోపాఠం. బంధువైన ఒక వృద్ధుడు నరేంద్రుణ్ణి ఒళ్ళో చేరదీసుకొని అతడి వంశంలోని తాతముత్తాతల పేర్లు, దేవీదేవతల స్తుతులు, పై వ్యాకరణ గ్రంథంలోని సూత్రాలు నేర్పేవాడు. ఆరేళ్ళప్రాయంలోనే నరేంద్రుడు గేయరామాయణం కంఠస్థం చేశాడు. ఆ ప్రాంతంలో గేయరామాయణం ఎక్కడ గానం చేసినా నరేంద్రుడు అక్కడ ఉండడం తథ్యం! ఒక రోజు ఆ ప్రాంతాన గేయరామాయణం గానం చేస్తున్న గాయకుడికి రెండు మూడు చరణాలు గుర్తుకు రాలేదు; వెంటనే అక్కడున్న నరేంద్రుడు ఆ చరణాలు అందించి, ఆ గాయకుడి నుండి ప్రశంసతో పాటు కొన్ని మిఠాయిలు కూడా దక్కించుకొన్నాడు. రామాయణ కావ్యాన్ని ఎక్కడ పారాయణ చేస్తూన్నా తాను అక్కడుంటానని హనుమంతుడు వ్రతం పూనాడు. రామాయణ పారాయణ వింటున్నప్పుడల్లా, పై విషయం గుర్తుకు తెచ్చుకొని నరేంద్రుడు హనుమంతుడి కోసం చుట్టూ కలయచూసేవాడు. అతడి అద్భుత జ్ఞాపకశక్తి కారణంగా అతణ్ణి ‘ఏకసంథాగ్రాహి’ అని పేర్కొనడం సముచితం. అతడు చిన్ననాటి నుండి పాఠాలు నేర్చుకొనే విధానం ఈ కారణం వల్లనే ఇతర బాలురకంటే విభిన్నమైనదిగా తోస్తుంది. అతణ్ణి బడిలో చేర్పించగానే, రోజువారీ పాఠాలలో అతడికి తోడ్పడడానికి ఒక బోధకుణ్ణి నియమించారు. ఆ విషయంగా నరేంద్రుడు “అతడు ఇంట్లోకి రాగానే, నేను నా ఆంగ్ల, బెంగాలీ పాఠ్య పుస్తకాలు తెచ్చి, ఆ రోజు ఏ పాఠాలు నేర్పాలో చెప్పి, వాటిని అతడి చేతికిచ్చి, ప్రశాంతంగా కూర్చునేవాణ్ణి. ఆ బోధకుడు రెండు మూడుసార్లు ఆ పాఠాలలోని పదాల ఉచ్చారణ, అర్థం ఇత్యాదులు ఏదో తానే స్వయంగా పాఠం నేర్చుకొంటున్నట్లు వల్లించి, వెళ్ళి పోయేవాడు. అదే చాలు నాకు, వాటిని నేర్చుకోవడానికి” అని చెప్పేవాడు. పెరిగి పెద్దయ్యాక పాఠ్యపుస్తకాలను పరీక్షలకు రెండు మూడు నెలలముందు మాత్రమే చదవడం ప్రారంభించేవాడు. సంవత్సరంలో తక్కిన రోజులు తనకు నచ్చిన ఇతర పుస్తకాలు చదివేవాడు. ఆ విధంగా ప్రవేశ పరీక్షలకు కూర్చోవడానికి మునుపే అతడు ఆంగ్ల, బెంగాలీ భాషలలోని ముఖ్యమైన సాహిత్య గ్రంథాలను, అనేక చరిత్ర పుస్తకాలను దాదాపు చదివేశాడు. ఈ పద్ధతిని అవలంబించడం వలన కొన్ని సమయాలలో పరీక్షల ముందు అతడు ఎంతో కష్టపడి చదవవలసి వచ్చేది. ఒక రోజు ఈ అలవాటు కారణంగా ఎదురైన ఇబ్బందిని ఎలా పరిష్కరించాడో చెబుతూ “ప్రవేశ పరీక్షలకు ఇంకా రెండు మూడు రోజులే ఉన్నాయనగా ‘రేఖాగణితం’ (geometry) పుటలను నేను కనీసం తిరగవేయను కూడా లేదు. దాన్ని అధ్యయనం చేయడానికి ఆ రాత్రి అంతా కూర్చున్నాను. ఇరవై నాలుగు గంటలలో ఆ విషయాంశం మీది నాలుగు పుస్తకాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పరీక్షలకు హాజరయ్యాను” అని చెప్పాడు. అతడు అలా చేయగలిగాడంటే భగవదనుగ్రహం వలన సంతరించుకొన్న దేహదార్యం, అసాధారణ జ్ఞాపకశక్తే అందుకు కారణమని చెప్పనవసరం లేదు.
16. అధ్యయనం పట్ల నరేంద్రుని అభిరుచి
పాఠ్యపుస్తకాలు చదవని సమయాలలో నరేంద్రుడు ఇతర పుస్తకాలు చదివేవాడని చెప్పడం వలన అతడు నవలలు, నాటకాలు చదువుకొంటూ కాలాన్ని వృథాచేశాడని అనుకోరాదు. ప్రత్యేక విషయాంశాల మీది గ్రంథాలను అధ్యయనం చేయాలనే అభిరుచి కొన్ని ప్రత్యేక సమయాలలో అతడి మనస్సులో జనించడం కద్దు. ఆ విషయాంశం మీద లభించే పుస్తకాలన్నీ సేకరించి వాటిని ఔపోసనపట్టేసేవాడు. ఉదాహరణకు, ప్రవేశ పరీక్ష జరిగే 1879 వ సం ॥ లో భారతదేశ చరిత్ర మీద లభించే ముఖ్యమైన గ్రంథాలు చదవాలనే ఉత్సుకత అతడిలో కలిగింది. వెంటనే అతడు మార్ష్‌మాన్, ఎల్ఫెన్స్టోన్ మొదలైన వారి గ్రంథాలను సేకరించి చదివాడు. ఎఫ్.ఏ. పరీక్షలకు సిద్ధమౌతూ విట్లే, జెవాన్స్, మిల్ మొదలైన వారి ఆంగ్ల తర్క గ్రంథాలన్నిటినీ ఒక్కొక్కటీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు; బి.ఏ. పరీక్షలకు చదువుతూ ఉన్నప్పుడు ఇంగ్లండ్ తదితర ఐరోపా దేశాల ప్రాచీన, ఆధునిక చరిత్రలనూ, పాశ్చాత్య తత్త్వశాస్త్ర గ్రంథాలనూ చదవాలనే గొప్పకోర్కె అతడికి కలిగింది. ఇతర విద్యా విభాగాల గ్రంథాలను కూడా చదవాలనే ఉత్సాహం అతడికుండేది.
17. త్వరితంగా చదవగల నరేంద్రుని సమర్థత
అసంఖ్యాక పుస్తకాలు చదివిన ఫలితంగా నరేంద్రునిలో త్వరితంగా చదవగల శక్తి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే కాలం నుండి అసాధారణంగా పెంపొందింది. అతడు ఇలా చెప్పేవాడు : “అప్పటి నుండి ఒక పుస్తకాన్ని పుచ్చుకొన్నప్పుడు, ఆ రచయితను అర్థం చేసుకోవడానికి ప్రతి పంక్తి చదవవలసిన అవసరం నాకుండేది కాదు. ఒక పేరాలోని మొదటి పంక్తి, చివరి పంక్తి చదవగానే ఆ భాగంలోని సారాంశాన్ని నేను గ్రహించేవాణ్ణి. క్రమంగా ఆ శక్తి పెంపొందడంతో పై రీతిలో పేరాలు చదవవలసిన అవసరం కూడా నాకు లేకపోయింది. కొన్ని సమయాలలో ఒక పుటలోని మొదటి పంక్తి చివరి పంక్తి చదవగానే సారం అవగతమయ్యేది. మళ్ళీ రచయిత తర్కాలతో తన ఒక ప్రత్యేక వైఖరిని పుస్తకంలో ఏ భాగంలోనన్నా వివరించేటప్పుడు, పుస్తకంలోని అతడి యావత్తు వాదసరళిని, కేవలం ఆ తర్క ప్రారంభాన్ని చదవగానే అర్థం చేసుకోగలిగేవాణ్ణి” అని వివరించేవాడు.
18. నరేంద్రుని వాదనాసరళి
ఎంతో అధ్యయనం, ప్రగాఢ చింతన ఫలితంగా నరేంద్రుడికి వాదనలో ఎంతో ఆసక్తి ఏర్పడింది. కాని అతడెన్నడూ కుతర్కానికి దిగేవాడు కాడు. తన అంతరాంతరాళాల్లో సత్యమని తెలిసిన విషయాన్నే సదా సమర్థిస్తాడు. కాని తనకు సత్యం అని తెలిసిన విషయానికి వ్యతిరేకంగా ఎవరన్నా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే మాత్రం సాత్త్వికంగా వింటూ ఊరుకోడు. ఆ అంశంపై తిరుగులేని వాదనలు గుప్పించి ప్రత్యర్థిని ఇట్టే నోరు మూయిస్తాడు. అతడి తర్కం ముందు తలవంచని వారు లేరంటే అతిశయోక్తి కాదు. వాదనలో పరాజయం చవిచూసిన అతడి ప్రత్యర్థులు అతడి పట్ల గుఱ్ఱుగానే ఉండేవారని చెప్పనవసరం లేదు. ప్రత్యర్థి మాటలు నాలుగు వినీవినగానే అతడి వాదనా సరళిని గ్రహించి, ముందే తన జవాబుతో సిద్ధంగా ఉండేవాడు. ప్రత్యర్థిని మట్టికరిపించేంత చక్కని వాదనలు ఎలా చటుక్కున స్ఫురిస్తాయని ప్రశ్నించినప్పుడు, ఒకసారి అతడు ఇలా జవాబిచ్చాడు : “ప్రపంచంలో ఎన్ని నూతన భావనలు ఉత్పన్నం కావడంలేదు? ఆ భావనలకు అనుకూల, ప్రతికూల కారణాలతోబాటు, వాటిలో కొన్నింటిని తెలుసుకొనివుంటే, జవాబులకు తడుముకోవలసిన అగత్యం ఉండదు. ఎందుకంటే ప్రత్యర్థి తన వాదనకు అనుకూలంగా ఏ కారణాన్ని దృష్టాంతీకరించినప్పటికీ, అది పైన పేర్కొన్న వాటిలో ఏదో ఒకటి అయితీరాలి. ఏ విషయాంశం మీదనన్నా నూతన భావనలు లోకానికి అందించగల వ్యక్తులు ఎంతో అరుదుగానే ఉంటారు” అని చెప్పాడు.
పుట్టుకతోనే కుశాగ్రబుద్ధి, అసాధారణ జ్ఞాపకశక్తి, ప్రగాఢ చింతన సంతరించుకొన్న నరేంద్రుడు ప్రతి విషయాన్ని స్వల్పకాలంలోనే ఆమూలాగ్రం గ్రహించగలిగేవాడు; అందువలన ఆటపాటలకూ, స్నేహితులతో వినోదంగా ఆనందంగా కాలం గడపడానికీ అతడికి తీరిక కొరవడలేదు. అలా అతడు ఉల్లాసంగా వేడుకలతో ఎంతో సమయం గడపడం చూసి లోకులు అతడు చదువు సంధ్యలను అసలు పట్టించుకోవడం లేదని భావించేవారు. నరేంద్రుని ఈ విధానాన్ని అనుకరించడానికి ప్రయత్నించేవారు.
19. శారీరక వ్యాయామం పట్ల నరేంద్రుని అభిరుచి
జ్ఞాన సముపార్జన పట్ల ఎంత ప్రీతి ఉందో, చిన్ననాటి నుండి నరేంద్రుడికి రకరకాల శరీర వ్యాయామాల పట్ల సైతం అంతే ప్రీతి ఉండేది. అతడు చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు, తండ్రి అతడికి ఒక పొట్టిజాతి గుఱ్ఱాన్ని కొనియిచ్చాడు. తత్ఫలితంగా పెద్దవాడయ్యాక అతడు మంచి రౌతు అయ్యాడు. మల్లయుద్ధం, కత్తిసాము, కసరత్తు, మొదలైన అన్ని శారీరక వ్యాయామాలను అతడు నేర్చుకొన్నాడు. పర్యవసానంగా అతడు దేహదార్యం, క్రియాశీలత సంతరించుకొన్నాడు. పైగా పైన పేర్కొన్న వ్యాయామాలన్నింటిలో కౌశలం కూడా సంపాదించాడు. ఆ రోజుల్లో సాధారణ వ్యాయామ పోటీలు నిర్వహించి విజేతలైన వారికి నవగోపాల్ మిత్ర నెలకొల్పిన ‘హిందూసంత’ లో బహుమతులు కూడా ఇచ్చేవారు. ఆ పోటీలలో కొన్ని సమయాలలో నరేంద్రుడు కూడా పాల్గొన్నాడని మేం విన్నాం.
20. అతడి సాహసం, నెచ్చెలిమి
చిన్ననాటి నుండి అప్రతిహత సాహసం, మిత్రప్రేమలను ప్రకృతి అతడికి ప్రసాదించింది. ఈ గుణాలే అతణ్ణి విద్యార్థి జీవితంలో, తదనంతర జీవితంలోను అగ్రగణ్య నాయకునిగా రూపొందించడంలో దోహదం చేశాయి. ఎనిమిదేళ్ళ ప్రాయంలో ఒకసారి అతడు, మిత్రులతో కలిసి దక్షిణ కలకత్తా మెటియాబుర్జ్లోని, మాజీ లక్నో నవాబు వాజిద్ ఆలీ జంతుప్రదర్శనశాలకు వెళ్ళాడు. కుర్రవాళ్ళే పైకం ప్రోగుచేసుకొని, చంద్పాల్ ఘట్టం వద్ద తమ ప్రయాణానికి రానుపోను ఒక పడవను అద్దెకు తీసుకొన్నారు. వెనక్కు తిరిగి వస్తున్నప్పుడు దారిలో ఒక బాలుడు అనారోగ్యానికి గురియై పడవలో వాంతి చేసుకొన్నాడు. ఆ పడవ మనిషి ఒక మహమ్మదీయుడు; పడవ చంద్పాల్ఘట్టం చేరుకోగానే అతడు ఎంతో కోపంతో, తన పడవను శుభ్రంగా కడిగి వెళ్ళమనీ, లేకపోతే ఎవరినీ పడవ నుండి దిగనివ్వననీ బెదిరించాడు. ఎవరితోనన్నా పడవను శుభ్రం చేయించుకోమనీ, దానికయ్యే కూలీ తాము ఇస్తామనీ బాలురు, పడవ మనిషితో చెప్పారు; అతడు అందుకు ససేమిరా అంగీకరించలేదు. దాంతో వారి మధ్య వివాదం తలెత్తి, కొట్లాటకు దారితీసే పరిస్థితి ఏర్పడింది. చుట్టుప్రక్కల ఉన్న పడవ మనుషులు ఏకమై బాలురను చితకబాదడానికి సిద్ధమైనారు. ఆ పరిస్థితిలో బాలురకు ఏం చెయ్యాలో పాలుబోలేదు. బాలురలో నరేంద్రుడే చిన్నవాడు. ఆ గందరగోళంలో నరేంద్రుడు పడవ నుండి దిగి చల్లగా జారుకొన్నాడు. మరీ చిన్నపిల్లవాడని పడవవాళ్ళు అతణ్ణి అడ్డగించలేదు. నరేంద్రుడు తీరంపై నిలబడి చూడగా ఆ గొడవ చిలికిచిలికి గాలివాన అయ్యేలా కనిపించింది. తన మిత్రులను ఎలా కాపాడాలో అని అతడు ఆలోచిస్తూండగా, ఇద్దరు ఆంగ్లేయ సిపాయిలు తీరంవెంట నడిచిపోతూ ఉండడం కనిపించింది. నరేంద్రుడు ఒక్క పరుగున వారి వద్దకెళ్ళి, వారికి అభివాదం చేసి, వారి చేతులు పుచ్చుకొన్నాడు. వచ్చీ రాని ఆంగ్లంలో, సైగలు చేస్తూ ఆ గొడవ అంతా వాళ్ళకు వివరించి చెప్పాడు. ఆ సిపాయిలు కుర్రవాడి ప్రసన్న దృక్కులకు, ప్రవర్తనకు ముగ్ధులై, వడివడిగా పడవ వద్దకు వచ్చారు; పరిస్థితిని అర్థంచేసుకొన్నారు. చేతుల్లోని బెత్తాలను పైకెత్తి బాలురను వదలిపెట్టమని పడవ వాళ్ళను ఆదేశించారు. సైన్యంలోని తెల్లసిపాయిలుగా వాళ్ళను గుర్తించి, పడవ వాళ్ళందరూ గుట్టుచప్పుడు కాకుండా అక్కడ నుండి వెళ్ళిపోయారు. నరేంద్రుడి మిత్రులు ఊపిరి పీల్చుకొన్నారు. నరేంద్రుడి సమయోచిత సాహసం చూసి ఆ సిపాయిలు ముచ్చటపడి, తమతో నాటకశాలకు రమ్మని అతణ్ణి ఆహ్వానించారు. కాని నరేంద్రుడు వారి ఆహ్వానాన్ని వినయంగా తిరస్కరించి, వారికి కృతజ్ఞతలు తెలిపాడు.
21. సైరాపిస్ అనే ఓడను సందర్శింప అనుమతి పొందడం
అతడి సాహసాన్ని చాటే మరికొన్ని సంఘటనలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటరెండింటిని ఇక్కడ ప్రస్తావించడం అసంగతం కాబోదు. నరేంద్రుడికి పది లేక పన్నెండేళ్ళప్పుడు వేల్స్ రాజకుమారుడు (తదనంతరం 7 వ ఎడ్వర్డ్) భారతదేశానికి రావడం తటస్థించింది. ఆ సందర్భంలో సైరాపిస్ అనే ఆంగ్లేయ యుద్ధనౌక కలకత్తా రేవుకు వచ్చింది. ఆ నౌకను సందర్శింప అనేకులకు అనుమతి కూడా ఇచ్చారు. తన మిత్రులతో ఆ నౌకను సందర్శింపగోరి నరేంద్రుడు ఛౌరంగీలోని ఆ కార్యాలయానికి అనుమతి కోరుతూ దరఖాస్తు పుచ్చుకొని వెళ్ళాడు; కాని ద్వారం వద్దనున్న కావలివాడు మరీ పెద్దమనుషులను తప్ప, ఎవరినీ లోపలకు అనుమతించడం లేదు. లోపలున్న ఆంగ్లేయ అధికారిని ఎలా కలుసుకోవాలో ఆలోచిస్తూ నరేంద్రుడు ప్రవేశ ద్వారం వద్దే నిలబడ్డాడు. అనేకులు కార్యాలయం నుండి అనుమతి పత్రాలు పుచ్చుకుని రావడం అతడు చూశాడు. వారంతా రెండవ అంతస్తులోని ఒక వసారాలోకి వెళ్ళడం గమనించాడు. ఆంగ్ల అధికారి దరఖాస్తులు పుచ్చుకొని, అనుమతి పత్రాలు మంజూరు చేస్తున్న చోటు బహుశా అదేనేమో అనుకొన్నాడు నరేంద్రుడు. కాస్త అన్వేషించి చూడగా ఆ ఆంగ్ల అధికారి సేవకులు మేడపైకి వెళ్ళే ఇనుపమెట్లు ఒక మూలన ఉండడం నరేంద్రుడి కంటబడింది. ఆ మెట్లు సరాసరి ఆ వసారా వెనుకనున్న గది వద్దకు పోవడం కూడా నరేంద్రుడు గమనించకపోలేదు. తాను ఎవరి కంటన్నా పడితే గొప్ప ప్రమాదంలో పడే అవకాశముందని తెలిసీ, ఎంతో సాహసం చేసి ఆ మెట్ల మీదుగా రెండవ అంతస్తును చేరుకొన్నాడు. అధికారి గది గుండా వసారాలోకి వెళ్ళాడు. అక్కడ దరఖాస్తుదారులు గుంపుగా ఆ అధికారి చుట్టూ నిలబడి ఉండడమూ, అతడు దించిన తల ఎత్త కుండా వారి అనుమతి పత్రాలపై సంతకం చేసి ఇస్తూవుండడమూ నరేంద్రుడు చూశాడు. వారి వెనుక నిలబడి, సకాలంలో అనుమతిపత్రం పొంది, అధికారికి అభివాదన తెల్పి, ముందు మెట్ల గుండా అందరిలా దర్జాగా దిగి, బయటకొచ్చాడు.
22. ట్రిపీజ్ సంఘటన
ఆ సమయంలో కలకత్తాలోని సిమ్లా ప్రాంతంలోని బాలుర ఉపయోగార్థం కారన్‌వాలీస్ వీథిలో వ్యాయామం నేర్పే ఒక వ్యాయామశాల ఉండేది. దానిని ‘హిందూసంత’ ను నెలకొల్పిన నవగోపాల్ మిత్ర స్థాపించాడు. అది నరేంద్రుని ఇంటికి సమీపంలో ఉండడం వలన, అతడు ప్రతిరోజు మిత్రులతో కలిసి వెళ్ళి, అక్కడ వ్యాయామం అభ్యసించేవాడు. ఈ బాలురకు నవగోపాల్ బాబుతో బాగా పరిచయం ఉండడం వలన, ఆ వ్యాయామశాల నిర్వహణను ఆయన వారికి అప్పగించాడు. ఇలావుండగా ఒకరోజు ఒక ట్రిపీజ్* అమర్చడం కోసం భారమైన ఒక కలప చట్రం నిటారుగా నిలబెట్ట ప్రయత్నించారు కాని అది వారికి మించిన పనే అయింది. ఇంతలో జనం అక్కడ గుమిగూడారు కాని ఎవరూ సహాయం అందించడానికి ముందుకు రాలేదు. ఆ జనంలో లావైన ఒక ఆంగ్లేయ నావికుడు ఉండడం చూసి, నరేంద్రుడు ఆ వ్యక్తిని సహాయం చేయమని కోరాడు. అతడు సంతోషంగా అందుకు అంగీకరించి, బాలురతో జతకట్టాడు. ఆ తరువాత బాలురు ఆ చట్రం తలభాగాన్ని ఒక తాడు సహాయంతో లేవనెత్తసాగారు; ఆ నావికుడు ఆ చట్రం కాళ్ళను మెల్లగా సాకెట్స్‌లో ప్రవేశించేటట్లు చూసుకోసాగాడు. పని చురుగ్గానే సాగుతోంది. ఇంతలో తాడు తెగి, ఠక్కున ఆ కలపచట్రం నేలమీద పడిపోయింది. ఆ చట్రం కాళ్ళలో ఒకటి హఠాత్తుగా పైకివెళ్ళి ఆ నావికుడి తలకు గట్టిగా తగిలింది. అతడు స్పృహతప్పి పడిపోయాడు. ఆ నావికుడు అలా స్పృహతప్పి పడిపోవడం, గాయం నుండి ధారగా రక్తం స్రవిస్తూవుండడం చూసి అక్కడున్న ప్రతి ఒక్కరు అతడు చచ్చిపోయాడని నిర్ణయించుకొని, పోలీసుల భయంతో నలుదిక్కులా పారిపోయారు. నరేంద్రుడు, అతడి మిత్రులు ఒకరిద్దరు మాత్రం అక్కణ్ణుండి కదలక, నావికుడికి శైత్యోపచారాలు చేయసాగారు. నరేంద్రుడు తన బట్టను చింపి, దాన్ని నీటిలో ముంచి, ఆ గాయం మీద కట్టాడు. మెల్లగా నీరు అతడి ముఖం మీద చిలకరిస్తూ, అతడికి విసరసాగాడు. కాసేపటికి ఆ నావికుడికి స్పృహ రాగానే, అతణ్ణి ప్రక్కనున్న ట్రెయినింగ్ అకాడమీ భవంతిలోకి మోసుకువెళ్ళారు. ఒక వైద్యుణ్ణి తోడ్కొని వెంటనే రమ్మని నవగోపాల్ బాబుకు కబురు వెళ్ళింది. వైద్యుడు వచ్చి, నావికుణ్ణి పరీక్షించి, “గాయం పెద్దదేం కాదు; వారం రోజుల్లో నయమైపోతుంది” అని చెప్పాడు. నరేంద్రుడి ఉపచారాలతో, మందుమాకులు, ఆహారం మొదలైన చక్కని ఏర్పాట్లతో ఆ నావికుడు వారం రోజులలో కోలుకొన్నాడు. ఆ తరువాత నరేంద్రుడు ఆ ప్రాంతంలోని కొందరు పెద్దమనుషుల నుండి కొంత సొమ్ము సేకరించి ప్రయాణ ఖర్చుల క్రింద ఆ పైకాన్ని నావికుడికిచ్చి, అతణ్ణి సాగనంపాడు. క్లిష్టమైన, అపాయకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు బాల్యావస్థలో సైతం నరేంద్రుడు ఎంత ప్రశాంతంగా వ్యవహరించే వాడో సూచించే అనేక సంఘటనలను గురించి మేం వినివున్నాం.
23. నరేంద్రుని సత్యనిష్ఠ
బాల్యం నుండి కూడా నరేంద్రుడు సత్యసంధుడు. యౌవనంలోకి అడుగిడగానే ఆ సత్యసంధత నూరింతలు పెరిగింది. అతడు “నేను ఎన్నడూ భూతాల గురించి చెప్పి పిల్లలను భయపెట్టను, అసత్యదోషం వాటిల్లుతుందనే భయంతో అలా చేసేవాళ్ళను బాగా తిట్టేవాణ్ణి. ఆంగ్ల విద్యా విధానంలో చదివినందున, బ్రహ్మసమాజానికి వెళుతూ ఉన్నందున సత్యాన్ని వాక్రుచ్చాలనే ఆసక్తి అప్పుడు నాలో ఎంతో అధికరించింది” అని చెప్పేవాడు.
24. హాని కలిగించని వినోదాల పట్ల నరేంద్రుని అభిలాష
దేహదార్యం, కుశాగ్రబుద్ధి, అద్భుత జ్ఞాపకశక్తి, పవిత్ర హృదయం – వీటిని సంతరించుకొన్న కారణంగా నరేంద్రుడు సదా మందహాస వదనంతో అలరారేవాడు. నరేంద్రుడు నృత్యం నేర్చుకొన్నాడు, గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం బాగా అలవరచుకొన్నాడు. అతడు మిత్రులతో కలిసి రకరకాల వినోదాలలో, వేడుకలలో సమధికోత్సాహంతో పాల్గొనేవాడు. కాని అవి నైతికత హద్దులను దాటనంత వరకే! సదా అతడు ప్రసన్నంగా ఉండడానికి కారణం తెలుసుకోలేక, బాహ్య పరిశీలకులు తరచు అది అతడి ప్రవర్తన లోపంగా ఎంచేవారు. కాని నరేంద్రుడు లోకుల ప్రశంసనుగాని లేదా నిందనుగాని ఎన్నటికీ లక్షించేవాడు కాడు. వారి అసత్య దూషణలను ఖండింప అతడి హృదయం దిగజారేది కాదు.
పేదల పట్ల కరుణ అతడికి పుట్టుకతో అబ్బిన సుగుణం. చిన్నతనంలో ఎవరైనా భిక్షగాడు ఇంటికి వస్తే, అతడు కోరిందల్లా, విలువైన వస్త్రాలు, పాత్రలతో సహా ఇచ్చివేసేవాడు నరేంద్రుడు. ఆ విషయం తెలుసుకొని కుటుంబ సభ్యులు నరేంద్రుణ్ణి తిట్టి, ఆ భిక్షగాడి నుండి ఆ వస్తువులు తిరిగి తీసుకొని అతడికి కొంత డబ్బు ఇచ్చి పంపేవారు. ఇలాగే కొన్నిసార్లు జరిగిన తరువాత, ఒక రోజు అతడి తల్లి నరేంద్రుణ్ణి మొదటి అంతస్తులో ఒక గదిలో ఉంచి, గదికి గడియ పెట్టింది. అదే సమయంలో ఒక భిక్షగాడు వచ్చి బిగ్గరగా అడుక్కోసాగాడు. వెంటనే నరేంద్రుడు తన తల్లి విలువైన వస్త్రాలను కొన్నిటిని మేడ మీది కిటికీ నుండి క్రిందికి విసిరివేశాడు.
25. నరేంద్రుని కోపం
“చిన్నతనం నుండి నరేంద్రుడిలో ఒక గొప్ప దుర్బలత ఉండేది. ఏ కారణంగానన్నా అతడికి కోపం వస్తే, తనను తాను మరిచిపోయి చేతికి అందిన వస్తువులను ఛిన్నాభిన్నం చేసి ఆ ముక్కలను నాలుగు వైపులా చిందరవందరగా పారేసేవాడు.” “ఒక కుమారుణ్ణి నాకు అనుగ్రహించమని కాశీవిశ్వనాథుణ్ణి మొక్కుకొన్నాను. ఆయన నా మొక్కును తీరుస్తూ తన భూతగణాలలో ఒకరిని నా వద్దకు పంపాడు. లేకపోతే నరేంద్రుడు కోపం వస్తే భూతంలా ఎందుకు ప్రవర్తిస్తాడు?” అని అతని తల్లి తరచూ అనుకొనేదట. కాని ఆమె, కుమారుని ఆ కోపానికి ఒక గొప్ప చికిత్స కనిపెట్టింది. కుమారుడి కోపం ఏ విధంగానూ ఉపశమింపనప్పుడు ఆమె విశ్వనాథుణ్ణి తలచుకొని అతడి తలమీద రెండు మూడు బిందెల నీరు గ్రుమ్మరించేది. ఏం ఆశ్చర్యం, బాలుడి కోపం క్షణంలో ఎగిరిపోయేది. దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులను కలుసుకొన్న అనతికాలంలోనే ఒక రోజు నరేంద్రుడు మాతో “ఈ మతాచరణలో నేనేమీ లబ్ధిపొందక పోవచ్చునేమో; కాని ఆయన అనుగ్రహం వలన నా తారాస్థాయి కోపాన్ని నియంత్రించుకోవడం మాత్రం నిజం. ఇంతకుమునుపు కోపంలో నన్ను నేను అదుపులో ఉంచుకోలేకపోయేవాణ్ణి; తదుపరి అందుగురించి పశ్చాత్తాపం చెందేవాణ్ణి. కాని ప్రస్తుతం ఎవరన్నా నాకు గొప్ప అపకారం చేసినా లేదా నన్ను తీవ్రంగా కొట్టినప్పటికీ నాకు అంతగా కోపం రావడం లేదు” అని చెప్పాడు.
26. నరేంద్రుని మనోబుద్ధుల సమవికాసం
మనోబుద్ధులు సమంగా వికసించిన వ్యక్తులు లోకంలో ఎంతో అరుదు. అటువంటి వ్యక్తులే సమాజంలో గుర్తింపబడతారు. మళ్ళీ, ఆధ్యాత్మిక జగత్తులో తమ అనుపమానతను అభివ్యక్తం చేసేవారు కూడా చిన్ననాటి నుండే మనం ఊహించలేని ఊహాశక్తిని సంతరించుకొని ఉండి ఉంటారు. నరేంద్రుని జీవితం అధ్యయనం చేస్తే ఈ విషయం తేటతెల్లమౌతుంది. ఒకటి రెండు ఉదాహరణలు తెలియజేస్తే పాఠకులకు ఈ విషయం సులభంగా అర్థమౌతుంది.
27. రాయ్‌పూర్ వెళ్ళే దారిలో నరేంద్రుడు ధ్యానమగ్నుడవడం
ఒకప్పుడు ఏదో పనిబడి నరేంద్రుని తండ్రి కొంతకాలం మధ్యభారత దేశంలోని రాయ్‌పూర్‌లో నివసించాడు. అక్కడే మరికొంతకాలం గడపవలసి ఉంటుందని తెలిసి, రాయ్‌పూర్‌కు తన కుటుంబాన్ని రప్పించుకొన్నాడు. వారిని తోడ్కొని వచ్చే బాధ్యత నరేంద్రుడికి అప్పగించాడు. అప్పుడతడి వయస్సు పధ్నాలుగో లేక పదిహేనో. ఆ రోజుల్లో రాయ్‌పూర్‌కు రైలు సౌకర్యం లేదు. కనుక దట్టమైన క్రూరమృగ సంచారమున్న అడవుల గుండా ఎడ్లబండి మీద పదిహేను రోజులు ప్రయాణం చేయవలసి ఉండేది. ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కోవలసి ఉంటుందని అతడికి తెలుసు. అయినప్పటికీ అద్భుత వన్యప్రాంత సౌందర్యాన్ని చూసి ఆనందించే అవకాశం వచ్చినందుకు ప్రయాణంలో ఎదురయ్యే కష్టాల గురించి అతడు లక్షించలేదు. భూమిని సర్వాలంకారశోభితగా అలంకరించిన భగవంతుని అపరిమితశక్తిని, అనంతప్రేమను మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా చవిచూడడంతో నరేంద్రుడు ముగ్ధుడయ్యాడు. అతడు ఇలా అనేవాడు : “అరణ్యాల గుండా పయనిస్తున్నప్పుడు నేను తిలకించింది, అనుభూతం చేసుకొన్నది నా జ్ఞాపకాలలో సదా అట్లే నిలిచిపోయింది, ముఖ్యంగా ఒకరోజు జరిగిన సంఘటన. ఒక రోజు ఒక లోయ గుండా పయనించవలసి వచ్చింది. అంబరాన్ని చుంబించే వింధ్యపర్వత శిఖరాలు మాకు రెండు వైపులా నిలబడి ఉన్నాయి. ఫల పుష్ప భారంతో వంగిన రకరకాల చెట్లు, తీగలు సాటిలేని అందాన్ని సంతరించుకొని పర్వత సానువులను ఆవరించి ఉన్నాయి. పక్షులు ఆహార అన్వేషణకై అటూ ఇటూ ఎగురుతూ చేసే కిలకిలారావాలతో ఆ ప్రాంతం మారుమ్రోగుతున్నది. రెండు పర్వత శిఖరాలు ఆలింగనం చేసుకొన్న రీతిలో ఇరుకైన అడవి మార్గంపై ముందుకు వాలిన ప్రదేశాన్ని ఎడ్లబండ్లు చేరుకొంటున్నాయి. జాగ్రత్తగా పరిశీలించి చూడగా, ఆ శిఖరాలు కలుసుకొన్న చోటు క్రింద, శిఖరం నుండి పాదం వరకు ఒక పెద్ద చీలిక కనిపించింది. ఆ చీలిక అంచువెంట యుగాలపర్యంతం తేనెటీగలు శ్రమించి కట్టిన ఒక బ్రహ్మాండమైన తేనెపట్టు వ్రేలాడుతూండడం నా కంటబడింది. సంభ్రమాశ్చర్యాలతో ఆ తేనెటీగల రాజ్యపు ఆద్యంతాలను పరికిస్తూ, ముల్లోకాలను నియంత్రించేవాడైన భగవంతుని అనంత శక్తిని గురించిన తలపులో ముగ్ధుడనై, పూర్తిగా బాహ్యస్మృతిని కోల్పోయాను. అదే స్థితిలో ఎడ్లబండిలో ఎంత సేపు పడివున్నానో నాకు గుర్తులేదు. బాహ్యచైతన్యం వచ్చాక చూద్దును కదా, ఆ ప్రాంతం దాటి చాలాదూరం వచ్చేసినట్లు గ్రహించాను. బండిలో నేను ఒక్కడినే ఉండడం వలన, దీనిని గురించి ఎవరికీ ఏమీ తెలియరాలేదు” అని తన మొదటి బాహ్యచైతన్యం మరచిన సంఘటనను మాకు వివరించాడు. బలమైన ఊహాశక్తి తోడ్పాటుతో ప్రగాఢ ధ్యానావస్థలోకి జారుకొని, దాన్లో సంలీనమైపోవడం బహుశా నరేంద్రుడికి ఇదే మొదటి అనుభవం అయివుండవచ్చు.
28. సన్న్యాసం పుచ్చుకొన్న నరేంద్రుని తాత
నరేంద్రుని పూర్వీకులను గురించి క్లుప్తంగా ప్రస్తావించి ఈ అధ్యాయాన్ని ముగిస్తాం. అనేక శాఖలుగా విడిపోయిన సిమ్లాపేట దత్త కుటుంబం, కలకత్తాలోని ప్రాచీన కుటుంబాలలో ఒకటి. ఆస్తిపాస్తులలో, హోదాలో, పాండిత్యంలో కలకత్తాలోని మధ్యతరగతి కాయస్థులలో నరేంద్రుని కుటుంబం పేరెన్నికగన్నది. నరేంద్రుని ముత్తాత, రామ్మోహన్ దత్త ఒక న్యాయవాది; అతడు బాగా ఆర్జించాడు; పెద్ద కుటుంబాన్ని పోషిస్తూ, మిత్రులు ఇరుగుపొరుగుల మర్యాద మన్ననలను చూరగొన్నాడు. అతడు సిమ్లాలోని గౌర్మోహన్ ముఖర్జీ వీథిలోని తన స్వార్జిత గృహంలో నివసించేవాడు. ఆతడి కుమారుడైన దుర్గాచరణ్కు, తండ్రి నుండి అపారమైన సంపద సంక్రమించింది. కాని దుర్గాచరణ్కు కాస్త చిన్నవయస్సులోనే సంసారం పట్ల విరక్తి జనించడంతో, సన్న్యాసం పుచ్చుకొన్నాడు. చిన్ననాటి నుండి సాధుసన్యాసుల పట్ల దుర్గాచరణ్కు భక్తిప్రపత్తులుండేవి. ఆ అభిరుచి అతణ్ణి శాస్త్రాధ్యయనానికి దారితీయించి, అనతి కాలంలోనే అతణ్ణి మంచి పండితునిగా తీర్చిదిద్దింది. వివాహం చేసుకొన్నప్పటికీ దుర్గాచరణ్కు సంసారం పట్ల ఎటువంటి అనురక్తీ లేదు. తన సొంత ఉద్యానంలో ఎక్కువ సమయం సాధుసాంగత్యంలో గడిపేవాడు. ఒక కుమారుడు పుట్టిన స్వల్ప కాలంలోనే తన తాతగారైన దుర్గాచరణ్ సంసార పరిత్యాగం చేశారని వివేకానంద స్వామి చెప్పేవారు. కుటుంబాన్ని వీడి వెళ్ళిపోయినప్పటికీ దుర్గాచరణ్ భగవత్ సంకల్పం వల్ల, తదనంతర కాలంలో తన భార్యను బంధువులను రెండుసార్లు కలుసుకొన్నాడు. కుటుంబాన్ని వదలి వెళ్ళిపోయినప్పుడు, ఆయన కుమారుడు విశ్వనాథ్ వయస్సు రెండు లేదా మూడేళ్ళు ఉండవచ్చు. ఆయన భార్య, బంధువులు కాశీకి వెళ్ళి అక్కడ కొంతకాలం బసచేశారు. బహుశా ఆయనను వెతకడానికే కాశీకి వెళ్ళారేమో! అప్పటికి రైలు సౌకర్యం లేనందున, గౌరవనీయ కుటుంబాల వారు కాశీకి పడవల మీద వచ్చేవారు. దుర్గాచరణ్ భార్య కూడా ఒక యాత్రీకుల బృందంతో కలిసి కాశీకి వెళ్ళింది. దారిలో ఒకచోట చిన్ని విశ్వనాథ్ పడవ నుండి గంగాజలాల్లో పడిపోయాడు. తల్లి అది చూసి వెంటనే నీళ్ళలో దూకేసింది. స్పృహతప్పిపోయిన తల్లిని ఎంతో ప్రయాసపడి పడవలోకి చేర్చారు. ఆ స్పృహ తప్పిన పరిస్థితిలో కూడా ఆ తల్లి, బిడ్డడి చేతిని గట్టిగా పట్టుకొనే ఉంది. ఎల్లలెరుగని మాతృప్రేమ ఆ విధంగా బిడ్డడి ప్రాణాన్ని కాపాడింది.
కాశీలో దుర్గాచరణ్ భార్య నిత్యం విశ్వేశ్వరాలయానికి వెళ్ళి వచ్చేది. ఒక రోజు వాన పడినందున వీథిలో దేవాలయం ముందు ఆమె జారి పడిపోయింది. అప్పుడు అటుగా పోతున్న ఒక సన్న్యాసి అది చూసి గబగబా ఆమె వద్దకు వెళ్ళాడు. ఆమెను పైకెత్తి, ఆలయం మెట్లపై కూర్చోబెట్టి, దెబ్బలు తగిలాయేమోనని ఆమెను జాగ్రత్తగా పరీక్షించాడు. కాని ఆ రెండు నేత్ర ద్వయాలూ కలుసుకొన్న క్షణంలోనే దుర్గాచరణ్, అతడి భార్య పరస్పరం గుర్తించారు. ఆ సన్న్యాసియైన దుర్గాచరణ్ ఆమెను రెండవసారి కళ్ళెత్తి చూడనైనా చూడకుండా, అక్కణ్ణుండి కదలి ఎటో వెళ్ళిపోయాడు.
సన్న్యాస సంప్రదాయంలో ప్రతి సన్న్యాసి పన్నెండేళ్ళ కొకసారి తనజన్మ స్థలాన్ని దర్శించాలనే నియమం ఒకటి ఉంది. ఆ నియమం మేరకు దుర్గాచరణ్ పన్నెండేళ్ళ తదనంతరం కలకత్తాకు తిరిగివచ్చి, ఒక పాత మిత్రుడి ఇంట్లో బస చేశాడు. తన రాకను గురించి తన బంధువు లెవరికీ తెలుపవద్దని దుర్గాచరణ్ తన మిత్రుణ్ణి కోరాడు. కాని పరమ లౌకికుడైన ఆ మిత్రుడు, దుర్గాచరణ్ విన్నపాన్ని మన్నించక, రహస్యంగా అతడి రాకను బంధువులకు తెలియచేశాడు. వాళ్ళు గుంపుగా వచ్చి, బలవంతంగా దుర్గాచరణ్‌ను ఇంటికి తోడ్కొని వెళ్ళారు. వారితో ఇంటికి పోయినప్పటికీ, అతడు ఎవరితోను మాట్లాడలేదు. ఒక గదిలోకి వెళ్ళి ఒకమూల కళ్ళుమూసుకొని నిశ్చలంగా కొయ్యదుంగలా కూర్చున్నాడు. బంధువులు గది తలుపు మూసివేశారు. ఆయన అదే భంగిమలో మూడు రాత్రులు, మూడు పగళ్ళు కదలక మెదలక కూర్చుండిపోయాడని తెలియవస్తోంది. ఆయన ఆమరణ దీక్షకు పూనుకొంటాడేమోనని భయపడి బంధువులు ఆ గది తలుపు తెరిచివుంచారు. మర్నాడు ఉదయం ఎవరి కంటా పడకుండా దుర్గాచరణ్ మాయమయ్యాడు.
29. నరేంద్రుని తండ్రి, విశ్వనాథ్ దత్త
దుర్గాచరణ్ కుమారుడైన విశ్వనాథ్ పారశీక, ఆంగ్ల భాషలలో చక్కని పాండిత్యం గడించి, కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాద వృత్తిని అవలంబించాడు. అతడు మిత్రుల పట్ల ఉదారత, ప్రేమగల వ్యక్తి. ఎంతో సంపాదించినప్పటికీ, నిల్వగా ఏమీ వదలి పెట్టిపోలేదు. పొదుపుగా ఉండలేక పోవడమనే లక్షణం బహుశ అతడు, తన తండ్రి నుండి సంక్రమించుకొన్నట్లుంది. విశ్వనాథ్ స్వభావం సాధారణ లౌకికుని కంటే ఎన్నో రీతులలో ఎంతో విభిన్నంగా ఉండేది. ఉదాహరణకు, రేపు అన్న ఆలోచన అతణ్ణి ఎన్నడూ కలవరపరచదు. అర్హతానర్హతల వివక్షత లేకుండానే అతడు ఎందరికో సహాయం చేశాడు. బంధువుల పట్ల ఎంతో ఆప్యాయతతో మసలుకొనేవాడు; అయినప్పటికీ కుటుంబం నుండి దీర్ఘకాలం తను దూరంగా ఉండిపోయినప్పుడు, బంధువుల క్షేమసమాచారాదులు తెలుసుకోవాలని అతడు ఏమాత్రం ఆరాటం చెందేవాడుకాడు.
30. సంగీతం పట్ల విశ్వనాథ్ ప్రీతి
విశ్వనాథ్ తెలివైన వ్యక్తి, గొప్ప గ్రహణశక్తి ఉన్నవాడు. అతడికి సంగీతం పట్లా ఇతర లలితకళల పట్లా ఎంతో అభిరుచి ఉండేది. శాస్త్రీయంగా సంగీతం నేర్చుకొనక పోయినా, తన తండ్రి నిధుబాబు లలిత గీతాలను సుమధురంగా గానం చేసేవాడని నరేంద్రుడు చెప్పేవాడు. నాటి సామాన్య అభిప్రాయానికి విరుద్ధంగా, విశ్వనాథ్ సంగీతాన్ని హానిలేని వినోదంగా పరిగణించేవాడు; తన పెద్ద కుమారుడైన నరేంద్రనాథ్‌కు చదువు చెప్పించినట్లే, శ్రద్ధగా సంగీతాన్ని కూడా నేర్పించాడు. వైష్ణవ బైరాగులు పాడగా కేవలం ఒక్కసారి విని నేర్చుకొన్న భక్తిపాటలను అతడి భార్య భువనేశ్వరీదేవి రాగయుక్తంగా పాడడంలో నేర్పరి.
31. మహమ్మదీయ ఆచార వ్యవహారాల పట్ల విశ్వనాథ్ మక్కువ
విశ్వనాథ్‌కు బైబిల్‌ను, పారశీక కవి హఫీజ్ గీతాలను చదవడం ఎంతో ఇష్టం. ఏసుక్రీస్తు సుమధుర జీవితాన్ని తెలిపే బైబిల్లోని ఒకటి రెండు అధ్యాయాలను విశ్వనాథ్ నిత్యం చదివేవాడు. తన భార్యా పుత్రులకు కూడా ఇవి, హఫీజ్ గీతాలు చదివి ఒకింత వినిపించేవాడు. తను లక్నో, లాహోర్ మొదలైన చోట్ల కొంతకాలం నివసించినప్పుడు కొన్ని మహమ్మదీయ ఆచార వ్యవహారాలను ప్రశంసించటమే కాక స్వయంగా తనుకూడా పాటించేవాడు. ఆ కారణంగానే నిత్యం పులావ్ తినే అలవాటు అతడి కుటుంబంలో చోటుచేసుకొన్నట్లుంది.
32. వినోదాల పట్ల విశ్వనాథ్ అభిలాష
విశ్వనాథ్ ఎంత సరసుడో హాస్యప్రియుడో అంత గంభీరుడు కూడా. తన కుమారులలో, కుమార్తెలలో ఎవరైనా తప్పు చేస్తే వారిని గట్టిగా తిట్టేవాడు కాడు; కాని వారి స్నేహితులకు ఆ విషయం తెలిపేవాడు. దాంతో వారు సిగ్గుపడి మళ్ళీ ఎన్నడూ ఆ తప్పు చేసేవారు కారు. ఒక రోజు నరేంద్రుడు తల్లితో ఏదో విషయంలో ఘర్షణపడి ఆమెను ఒకటి రెండు పరుషవచనాలతో నొప్పించాడు. అయినా కుమారుణ్ణి తండ్రి మందలించలేదు; అందుకు మారుగా నరేంద్రుడి గదిలో అతడి మిత్రులందరికీ కనిపించేటట్లు గోడమీద నరేంద్రుడు, తల్లితో మాట్లాడుతున్నప్పుడు ఫలానా పరుషవచనాలను ఉపయోగించాడని బొగ్గుతో కొట్టొచ్చినట్లు వ్రాసివుంచాడు. నరేంద్రుడు, అతడి మిత్రులు గదిలోకి రాగానే గోడమీది వ్రాతలపై వాళ్ళ దృష్టి పడింది. నరేంద్రుడు తన దుష్ప్రవర్తనను తలచుకొని ఎంతోసేపు కుంచించుకు పోయాడు.
33. విశ్వనాథ్ ఉదారత్వం
దూరపు బంధువులతో కలిపి విశ్వనాథ్ అతిపెద్ద కుటుంబాన్నే పోషించే వాడు. వారి ఆహార, ఇతర అవసరాలు తీర్చడంలో అతడు దుబారా చేసేవాడు. అతడి ఔదార్యం మీద జీవిస్తూన్న ఆ బంధువులలో కొందరు సోమరులుగా తయారయ్యారు. మరికొందరు త్రాగుడు మొదలైన మత్తు పదార్థాలకు అలవడ్డారు. నరేంద్రుడు పెద్దవాడయ్యాక, ఆ బంధువుల పట్ల తండ్రి అపాత్రదానం చేస్తున్నాడని ఆయనను నిలదీసేవాడు. అందుకు విశ్వనాథ్ “మానవ జీవితం ఎంత దుఃఖభూయిష్ఠమైనదో ఊహించడానికి నీకు వయస్సు చాలదు. నీకు అవగతమైనప్పుడు ఈ దుర్భర జీవులు తమ జీవితపు చేదు అనుభవాల నుండి తాత్కాలిక ఉపశమానార్థం త్రాగుతున్నారని గ్రహించి, వారిని క్షమించే దృక్పథం అలవరచుకోగలుగుతావు” అని సమాధానపరచేవాడు.
34. విశ్వనాథ్ మరణం
విశ్వనాథ్‌కు పలువురు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. అందరూ సుగుణవంతులు. కాని కుమార్తెలలో ఎక్కువమంది చిన్నవయస్సులోనే మరణించారు. వరుసగా ముగ్గురు లేక నలుగురు కుమార్తెల తరువాత జన్మించిన నరేంద్రుడంటే తల్లితండ్రులకు ఎంతో ప్రీతి. 1883 వ సం ॥ శీతాకాలంలో నరేంద్రుడు బి.ఏ. పరీక్షలకు తయారవుతున్నప్పుడు హఠాత్తుగా గుండెపోటుతో అతడి తండ్రి మరణించాడు.* అతి ఉదారుడైన విశ్వనాథ్ ఈ హఠాన్మరణం కుటుంబాన్ని నిరుపేదలుగా దిగజార్చింది.
35. నరేంద్రుని తల్లి
నరేంద్రుని తల్లి భువనేశ్వరీదేవి గురించి ఎంతో గొప్పగా మేం విని ఉన్నాం. ఆమె బాహ్యసౌందర్యమే కాక దైవభక్తి వంటి అంతఃసౌందర్యం కూడా సంతరించుకొన్న మహనీయురాలు. మెట్టింటి పెద్ద కుటుంబ బాధ్యతను పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకొని సమర్థతతో ఆ కుటుంబాన్ని నిర్వహించగలగడం ఆమె తెలివితేటలకు నిదర్శనం. ఆమె ఎంత అలవోకగా, దక్షతతో గృహకృత్యాలను నిర్వహించేదంటే, కుట్టు అల్లిక మొదలైన పనులకు ఆమెకు ఎంతో తీరుబాటు కూడా ఉండేదంటే అతిశయోక్తి కాదు. ఆమె అంతగా చదువుకోలేదు; కాని రామాయణ భారతాది ఇతిహాసాలను, తదితర ధార్మిక గ్రంథాలను మాత్రం చక్కగా చదవగలిగేది. కాని భర్త నుండి, కుమారుల నుండి, ఇతరుల నుండి అనేక విషయాలు మౌఖీకంగా నేర్చుకొన్నందున, సంభాషించేటప్పుడు ఆమెను ఉన్నత విద్యావంతురాలుగా పలువురు ఎంచడం కద్దు. ఆమె జ్ఞాపకశక్తి, ప్రతిధారణశక్తి అద్భుతం. ఒక్కసారి విన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఠక్కున పునరుచ్చరించగలిగేది. సామెతలు ఆమె నోట్లో మెదలుతూనే ఉంటాయి.
భర్త మరణానంతరం గడ్డురోజులు ఎదురైనప్పుడు ఆమె సహజ స్థైర్యం పరీక్షకు నిలబడవలసి వచ్చింది. హఠాత్తుగా తారుమారైన పరిస్థితులలో ఆమె అద్భుత సహనాన్ని, ప్రశాంతతను, పొదుపును ప్రదర్శించి మారిన వాతావరణానికి అనుగుణంగా వ్యవహరించగలిగింది. నెలకు వెయ్యి రూపాయలతో కుటుంబాన్ని నిర్వహిస్తూ వచ్చిన ఆమెకు నేడు కేవలం ముఫై రూపాయలతో తనతో బాటు కుమారులను, కుమార్తెలను పోషించుకోవలసిన అగత్యం ఏర్పడింది. ఆ కొద్దిపాటి రాబడితోనే ఆమె చక్కగా ఇంటిని గడుపుతూ వచ్చింది; చూసేవారికి ఆమె గృహ నిర్వహణకు ఎంతో వ్యయం చేస్తున్నట్లు కానవచ్చేది. భర్త హఠాన్మరణానంతరం భువనేశ్వరికి దాపురించిన దుర్భర కష్టాలను గురించి ఆలోచిస్తే ఎవరికైనా వణుకు రాక తప్పదు. కుటుంబ ఖర్చులకై స్థిరమైన ఆదాయం ఏదీ లేదు; అయినప్పటికీ వృద్ధురాలైన తల్లిని, సంతానాన్ని ఉన్నంతలో బాగా చూసుకోవలసిన బాధ్యత తప్పలేదు. తన భర్త ఉదారత్వంతో జీవితంలో బాగా స్థిరపడ్డ బంధువులు ఈ క్లిష్టపరిస్థితుల్లో ముందుకు వచ్చి సహాయం అందించకపోగా, న్యాయంగా ఆమెకు చెందవలసిన ఆస్తిపాస్తులను కూడా ఆమెకు దక్కనీయకుండా చేయాలని ప్రయత్నించసాగారు. సుగుణసంపన్నుడైన ఆమె పెద్దకుమారుడు నరేంద్రనాథ్‌కు శాయశక్తులా ప్రయత్నించినా ఉద్యోగం ఏదీ దొరకలేదు. అంతేగాక అప్పటికే అతడికి సంసారం పట్ల విరక్తి కలిగి, సంసార పరిత్యాగం చేయడానికి సిద్ధం కాసాగాడు. ఈ దుర్భర పరిస్థితులలో సైతం భువనేశ్వరీదేవి తన కర్తవ్యాలను నిర్వర్తించిన తీరుతెన్నులు చూస్తే, ఆమె పట్ల ఎవరికి మాత్రం గౌరవాదరణలు కలుగవు? శ్రీరామకృష్ణులతో నరేంద్రునికి ఏర్పడ్డ సాన్నిహిత్య బాంధవ్యాన్ని గురించి వివరించ బోయేటప్పుడు, ఆ కాలఘట్టంలో నరేంద్రుని కుటుంబ స్థితిని గురించి మళ్ళీ ప్రస్తావించగలం. కనుక ఇప్పుడు నరేంద్రుని రెండవసారి దక్షిణేశ్వర రాక గురించి వివరించబోతున్నాం.