1. బ్రహ్మసమాజం నుండి కూడా శ్రీరామకృష్ణులు కొంత నేర్చుకోవడం
ఎవరి మతం పట్ల వారికి ఉండవలసిన విశ్వాసం, భగవత్సాక్షాత్కారార్థం సర్వసంగ పరిత్యాగం అనే శ్రీరామకృష్ణుల ఈ రెండు కీర్తనీయ ఆదర్శాలను స్వయంగా చూసి బ్రహ్మసమాజ నాయకులైన కేశవసేన్, విజయకృష్ణ, ప్రతాపచంద్ర, శివనాథ్, చిరంజీవి, అమృత లాల్, గౌరగోవింద మొదలైన వారంతా ఎంతో లబ్ధి పొందినట్లు మేం ఇంతకు మునుపే పాఠకులకు తెలిపివున్నాం. భావముఖంలో సుప్రతిష్ఠితులూ, బ్రహ్మజ్ఞానీ అయిన శ్రీరామకృష్ణులు, కేశవ్ తదితర బ్రహ్మసమాజ నాయకుల పరిచయం వలన ఏదైనా లబ్ధి పొందారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. ఇందుకు శ్రీరామకృష్ణుల భక్తులు అనేకులు తక్షణం “లేదు” అనే సమాధానం ఇస్తారు. కాని ‘ఇచ్చి పుచ్చుకోవడ’ మనే సూత్రం సర్వత్రా వర్తించడం మనం చూడవచ్చు. తెలివితక్కువ, చంచలత్వం గల బాలుడికి బోధించేటప్పుడు మనం కూడా కొంత నేర్చుకోగలుగుతాం. అతడికి తగిన బోధనా పద్ధతి, విషయాంశాన్ని అర్థం చేసుకోవడంలో అతడి గత సంస్కారాలు ఏ మేరకు దోహదం చేస్తాయో లేదా ఆటంకపరుస్తాయో మొదలైన విషయాలు మనకు తెలియవస్తాయి. ఆ ఆటంకాలను తొలగించే విధానం కూడా తెలుసుకోగలం. కాబట్టి పాశ్చాత్య భావాల, ఆదర్శాల ఆధారంగా స్థాపించబడ్డ బ్రహ్మసమాజం నుండి శ్రీరామకృష్ణులు ఎలాంటి లబ్ధీ పొందలేదనడం సబబు కాదు. మా అభిప్రాయం అందుకు భిన్నం. తమ అసాధారణ సాధనా ఫలితంగా సంతరించుకొన్న ఆధ్యాత్మిక అనుభూతులను బ్రహ్మసమాజానికి అందించే ప్రయత్నంలో ఆయన కూడా బ్రహ్మ సమాజం నుండి కొంత నేర్చుకొన్నారని అభిప్రాయపడుతున్నాం. ఆ విషయం గురించి ఇక్కడ ఒకింత చర్చించడం యుక్తముగా భావిస్తున్నాం.
2. పాశ్చాత్య భావాల ప్రభావం భారతీయుల మీద ఏ మేరకు ఉందో గ్రహించగలగడం
బ్రహ్మసమాజస్థులతో పరిచయం కావడానికి మునుపు శ్రీరామకృష్ణులు పాశ్చాత్య భావాల, ఆదర్శాల ప్రభావానికి సుదూరంగా ఉండిపోయి, జీవితం గడిపారు. ఒక్క మథురనాథ్ను మినహాయిస్తే ఆయనకు పరిచయమైన వారంతా సనాతన ‘ధర్మం, మోక్షం’ అనే ఆదర్శాలను పాటించిన వారే. వారిలో కొందరు లోకహితార్థం దానధర్మ కార్యాలను చేయడంలో పాటుపడ్డారు; కొందరు భగవత్సాక్షాత్కారం నిమిత్తం శాశ్వత, కీర్తనీయ సర్వసంగపరిత్యాగ మార్గాన్ని అనుసరించారు. పాశ్చాత్య విధానంలో విద్యావంతుడైన మథుర్ ఆయనకు ఎంతో పరిచయస్థుడైనప్పటికీ, ఆ రీతిలో విద్యావంతులైన అనేకులను చూసే అవకాశమూ, తద్ద్వారా ఆ విద్యావిధానం తెచ్చిన సనాతన హిందూ ఆదర్శప్రాయ జీవితానికి ఎంతో విభిన్నమైన మార్పులను గమనించే సందర్భమూ ఆయనకు కలుగలేదు. పైగా ఆయన పావన సాంగత్యంలో మథుర్బాబు స్వభావం మారి పోయింది కూడా; కాబట్టి అతణ్ణి పరిశీలించి పాశ్చాత్య విద్యావిధానం కొనితెచ్చిన నూతన స్థితిని ఆయన గమనించే అవకాశమూ కలుగలేదు. బ్రహ్మసమాజస్థులతో పరిచయమయ్యాక, వాళ్ళు భగవత్సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేస్తూన్నప్పటికీ, సనాతన జాతీయ ఆదర్శాన్నుండి వైదొలగడం ఆయన స్పష్టంగా గమనించగలిగారు. అందుకు కారణం ఏమిటో కనుగొనే ప్రయత్నంలో ఆయన మనస్సు మగ్నమైపోయింది. ఆ విధంగా పాశ్చాత్య విద్యావిధానం, బోధన కారణంగా జన జీవనంలో చొచ్చుకు పోతున్న విలక్షణ భావాలతో ప్రప్రథమంగా ఆయనకు పరిచయం కలిగింది.
3. ఆధునికుల తూలనాత్మక వైఖరి
తాము ప్రత్యక్షంగా సాక్షాత్కరించుకొన్న ఆధ్యాత్మిక సత్యాలను కేశవ్ తదితర బ్రహ్మసమాజస్థులు సత్వరమే బహిరంగంగా అంగీకరిస్తారని శ్రీరామకృష్ణులు మొదట్లో భావించినట్లు తెలుస్తోంది. కాని రోజులు గడిచినప్పటికీ, తమకు అత్యంత సన్నిహితులవుతూ ఉన్నప్పటికీ, వాళ్ళు పాశ్చాత్య విద్యావిధాన ప్రభావం నుండి విడవడలేదు, తమ ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభూతుల పట్ల పరిపూర్ణ విశ్వాసాన్నీ ప్రకటించలేకపోయారు. కాబట్టి పాశ్చాత్య భావాలు భారతీయ యువతలో పాతుకు పోయాయని ఆయన గ్రహించారు; పాశ్చాత్య చింతనాశీలురు, పండితులు గురు స్థానాన్ని ఆక్రమించారనీ, అదే స్థితి దీర్ఘకాలం కొనసాగుతుందనీ ఆయన అర్థంచేసుకొన్నారు. కనుక భారతీయ ఋషివర్యుల ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభూతులను, పాశ్చాత్య పండితుల భావాలతో తూలనాత్మకంగా పరిశీలన చేస్తేగాని, భారతీయ యువత, ఋషుల అనుభూతులను పరమ సత్యాలుగా అంగీకరించరనీ, లబ్ధిపొందరనీ కూడా శ్రీరామకృష్ణులు తెలుసుకొన్నారు. అందువల్లనే వారికి ఉపదేశం చేసిన మరుక్షణమే, “నా మనస్సుకు తోచింది చెప్పాను; వాటిలో మీకు అనుగుణమైన వాటిని ఎంపిక చేసుకోండి” అని తరచు చెప్పేవారు. లేదా ఆయన మాటల తీరులో చెప్పాలంటే ‘తలా తోకా తీసి వేయండి’ అని చెప్పినట్లు చెప్పవలసి వస్తుంది. ఆయన వాళ్ళకు ఎంపిక చేసుకొనే పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చారు; కనుకనే ఆయన భావాల, అనుభూతులను వాళ్ళు ఇష్టపడినంత వరకు అంగీకరించారని చెప్పడం అనవసరం.
4. జగజ్జనని సంకల్పమని భావించి ఈ విషయంగా శ్రీరామకృష్ణులు నిశ్చింతగా ఉండడం
భారతీయ ఋషుల భావాల, ఆదర్శాల సుసంఘటిత మూర్తులైన శ్రీరామకృష్ణులు వారి ఆ వైఖరికి ఏమాత్రం నిశ్చలతను కోల్పోలేదు. లోకంలో జరిగే రకరకాల సంఘటనలకు జగజ్జనని సంకల్పం మాత్రమే హేతువని ఆయన అంతరాంతరాళాలలో గట్టిగా విశ్వసించడమే అందుకు కారణం; ఆమె ఆదేశం పొంది, సర్వావస్థలలోను ఆ మార్గదర్శకత్వంలో మెలగే వ్యక్తికి ఏ సంఘటనా అవరోధంగా నిలబడదు. అసాధ్యాన్ని సాధ్యం గావించే మాయ తన యథార్థ స్వభావాన్ని అతడికి వెల్లడించి, వివరించి, సదా అతడికి స్థిరమైన శాంతిని ఒనగూరుస్తుంది. కాబట్టే జగజ్జనని సంకల్పం వల్లనే పాశ్చాత్య భావాలూ, ఆదర్శాలూ భారతదేశంలో ప్రవేశించాయనీ, ఆమె సంకల్పం చేతనే బ్రహ్మ సమాజస్థులూ, ఇతర విద్యావంతులూ వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలుగా మారారనీ శ్రీరామకృష్ణులు స్పష్టంగా గ్రహించారు. కనుక వారి బలహీనత పట్ల ఆయన ఎలా విసుగు చెందుతారు? లేదా తమ అనంత అనురాగ ఆప్యాయతలను వారిపై వర్షించకుండా ఎలా ఉండగలరు? ఆయన ఆరాటం చెందక, ఇలా యోచించారు : “ఋషివర్యుల ప్రత్యక్ష జ్ఞానాన్ని వారికి నచ్చిన మేరకు స్వీకరిస్తారు గాక! జగజ్జనని భవిష్యత్తులో అటువంటి వారిని ఇచ్ఛాపూర్వకంగా ఆ జ్ఞానాన్ని స్వీకరించేలా చేస్తుంది గాక!” అని సమాధాన పడినట్లు అనిపిస్తుంది.
5. తమ ఉపదేశాలను పాక్షికంగా బ్రహ్మసమాజస్థులు స్వీకరించడం పట్ల శ్రీరామకృష్ణులు సమాధానపడడం
బ్రహ్మసమాజస్థులు తాము చెప్పినదంతా అంగీకరించక పోయినప్పటికీ, తమ ఆధ్యాత్మికానుభూతులను పాక్షికంగా చెప్పడంతో శ్రీరామకృష్ణులు సంతృప్తి చెందలేదు. ఆయన సదా ఆధ్యాత్మిక జగత్తులోని నిగూఢ సత్యాల నన్నింటిని వారికి వెల్లడించేవారు. ఆ సత్యాలు : “భగవంతునికై సర్వసంగ పరిత్యాగం చేయనిదే ఆయన సాక్షాత్కారం లభించదు.”, “అన్ని సంప్రదాయాలు (నిజమైన) మార్గాలే (భగవత్సాక్షాత్కారానికి)”, “ప్రతి మార్గం చివరన ఉపాసకుడు, ఉపాస్యునితో తాదాత్మ్యం చెందుతాడు.” “మనస్సులోని ఆలోచనలను మాటలద్వారా వ్యక్తపరచడమే నిజమైన సాధన”. భగవంతుని పట్ల పూర్తి విశ్వాసంతో సర్వసమర్పణ భావం కలిగివుండటం సత్యాన్ని అసత్యం నుండి వివేచించడం, లౌకిక కర్తవ్యాలను ప్రతిఫలాపేక్ష లేకుండా నిర్వర్తించడం” ఇవే సాధకుడిని భగవంతుని దిశగా నడిపిస్తాయి.
శరీరం నుండి పూర్తిగా విడివడిపోయి ఆధ్యాత్మిక జగత్తులోని పరమ సత్యాలను అనుభూతం చేసుకోవడం ఎన్నటికీ సాధ్యం కాదని కేశవ్ మొదలైనవారికి ఆయన వివరించి చెప్పేవారు. అలా చేయగోరితే మనసా-వాచా-కర్మణా ఆత్మ సంయమనం పాటించాలి. ఈ ఉపదేశ ఫలితంగా వారు ఆ నియమాన్ని పాటింప ప్రయత్నించ సాగారు. తమ ఉపదేశాలను సమగ్రంగా వారు గ్రహించలేకపోవడం గమనించి, గత సంస్కారాలు వ్రేళ్ళూని పాతుకు పోయినప్పుడు క్రొత్త భావాలను చొప్పించడం దాదాపు అసాధ్యమే అనే నిర్ణయానికి వచ్చారు శ్రీరామకృష్ణులు. అయినప్పటికీ ప్రయత్నించడం చిలుక గొంతు మొద్దుబారిన తరువాత దానితో ‘రాధాకృష్ణా’ అని ఉచ్చరింప చేయడం వంటిదే (చాలా కష్టమైన పని) అని ఆయన ఎరుగకపోలేదు. పాశ్చాత్య భౌతికవాద ప్రభావం చేతనో లేక మరేదో కారణంగానో లౌకిక సుఖభోగాలను అనుభవించాలనే వాంఛలో ఊరిపోయిన వ్యక్తులు భారతదేశం ప్రచారం చేసిన పరిత్యాగ భావాన్ని అవగతం చేసుకోలేరు, ససేమిరా పాటించనూ లేరని శ్రీరామకృష్ణులు అవగతం చేసుకొన్నారు. అందుకే ఆయన జగజ్జననిని వ్యాకులతతో ఇలా అన్నారు: “అమ్మా, సర్వసంగ పరిత్యాగులైన నీ భక్తులను ఇక్కడకు తోడ్కొనిరా, వాళ్ళతో నిస్సంకోచంగా నీ గురించి ముచ్చటిస్తూ ఆనందంగా గడుపుతాను” అని ప్రార్థించారు. ఈ పరిశీలన ఫలితంగా కళంక రహిత మనస్కులైన యువకులే తమ భావాలను, లక్ష్యాలను నిస్సంకోచంగా, సమగ్రంగా అంగీకరించి, గ్రహించి సాహసంతో ఆ భావాలకు, లక్ష్యాలకు ప్రాతినిధ్యం వహించే సత్యాలను ఆవిష్కరించుకోవడంలో పురోగమిస్తారనే నమ్మకం ఆయనలో కలిగిందనుకోవడం అనుచితం కాబోదు.
6. బ్రహ్మసమాజం ద్వారా కలకత్తా వాసులు శ్రీరామకృష్ణుల పట్ల ఆకర్షితులు కావడం
బ్రహ్మసమాజ నాయకులు శ్రీరామకృష్ణుల నూతన ఆధ్యాత్మిక భావాలను ఏ మేరకు అంగీకరించారో, తద్ద్వారా వారిలో ఎలాంటి పరిణామాలు కలిగాయో తెలుసుకోవడానికి కలకత్తా జనసామాన్యానికి ఎంతో కాలం పట్టలేదు. కేశవ్ తదితరులు బ్రహ్మసమాజ పత్రికలలో శ్రీరామకృష్ణుల అసాధారణ ఆధ్యాత్మిక ధోరణులను, ఆయన అమృత వచనాలను గురించి ప్రచురించ నారంభించగానే కలకత్తా జనానీకం వాటి పట్ల ఎంతో ఆకర్షితులైయ్యారు. శ్రీరామకృష్ణుల దర్శనార్థం దక్షిణేశ్వరానికి తీర్థప్రజలా రాసాగారు. ఈ రీతిలో శ్రీరామకృష్ణులు దివ్యదర్శనాలలో గుర్తించిన భక్తులు క్రమంగా దక్షిణేశ్వర కాళికాలయానికి రావడం తటస్థించింది.
రామ్‌చంద్ర దత్త (1851-1899)
మనోమోహన్ మిత్ర (1851-1903)
శ్రీరామకృష్ణుల గృహస్థ భక్తులైన రామచంద్ర దత్త, మనోమోహన్ మిత్ర, కేశవ్ ప్రచురిస్తున్న పత్రికలలో శ్రీరామకృష్ణులను గురించి చదివి, 1879 వ సంవత్సరాంతాన (అంటే శ్రీరామకృష్ణ – కేశవ్‌ల మొదటి సమావేశం జరిగిన దాదాపు నాలుగేళ్ళ తరువాత) శ్రీరామకృష్ణులను కలుసుకొన్నారు. ఈ విషయం మేం వారి ముఖతా విన్నాం. ‘శ్రీరామకృష్ణ పరమహంస దేబెర్ జీవన్ వృత్తాంత’ అనే తన పుస్తకంలో, శ్రీరామకృష్ణుల సాంగత్య భాగ్యంతో తమ జీవితాలలో ఎలాంటి మహత్పరిణామాలు క్రమంగా చోటుచేసు కొన్నాయో రామచంద్ర దత్త వెల్లడించి ఉన్నాడు. వాటిని ఇక్కడ పొందుపరచ నవసరం లేదు. శ్రీరామకృష్ణుల ఆదర్శ మైన భగవత్సాక్షాత్కారార్థం పరిపూర్ణ కామినీకాంచన పరిత్యాగాన్ని వారు పూర్తిగా పాటించలేక పోయినప్పటికీ, ఆయన పట్ల గల భక్తివిశ్వాసాల ప్రభావంలో ఆ పరిత్యాగ మార్గంలో వాళ్ళు ఎంతో దూరం పురోగమించగలిగారని మాత్రం చెప్పక తప్పదు. తన కష్టార్జితాన్ని ఒక సత్కార్యానికై ఖర్చు చేయడంలో ఒక గృహస్థ భక్తుని భక్తిశ్రద్ధల తీవ్రతను మనం గమనించవచ్చు. శ్రీరామకృష్ణులను మొదట తన గురుస్థానంలో, తదనంతరం తన ఇష్టదైవం స్థానంలో నిలుపుకొన్నాడు రామచంద్రదత్త. కలకత్తా సిమ్లా పేటలోని తన ఇంటికి శ్రీరామకృష్ణులను, ఆయన భక్తులను ఉత్సవ సమయాలలో పదేపదే ఆహ్వానించి విరివిగా డబ్బు ఖర్చు పెట్టేవాడు. దీని నుండి ఆతడి భక్తివిశ్వాసాల ప్రగాఢతను మనం సులభంగా గ్రహించవచ్చు. తరచు శ్రీరామకృష్ణులు రామచంద్ర దత్త గురించి “ఇప్పుడు రామచంద్ర ఎంత ఉదారుడో మీరు చూస్తున్నారు. మొదట్లో అతడు ఇక్కడకు వచ్చినప్పుడు ఎంత పిసినారిగా ఉండేవాడో మీకు తెలియదు. ఏలక్కాయలు తెమ్మని అతణ్ణి అడిగాను. ఒక రోజు అతడు ఒక పైస ఏలక్కాయలు నా ముందు పెట్టి, నమస్కరించాడు. అతడి స్వభావంలో ఇప్పుడు ఎంతటి మార్పు వచ్చిందో ఈ సంఘటన నుండి మీరు ఊహించవచ్చు” అని చెప్పేవారు.
7. శ్రీరామకృష్ణుల అద్భుత దర్శనం : రాఖాల్ రావడం
శ్రీరామకృష్ణుల అనుగ్రహం పొంది ఆయన పాదారవిందాలను ఆశ్రయించి శాశ్వతంగా సమస్త భయాందోళనల నుండి విముక్తులైన రామచంద్ర, మనోమోహన్లు ఎంతటి ధన్యులో మాటల్లో చెప్పనలవి కాదు. సంసారంలో ఉంటూ అటువంటి శరణాగతి దక్కుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించి ఉండరనడం అతిశయోక్తి కాదు! ఈ కారణం వల్ల వాళ్ళు తమ బంధుమిత్రులను తాము శరణాగతి పొందిన చోటుకు తోడ్కొని రావడంలో వింత ఏమీలేదు. అనతికాలంలోనే వాళ్ళ కుటుంబాలూ, ఇతర బంధువులూ శ్రీరామకృష్ణుల దర్శనార్థం రాసాగారు. ఈ విధంగా 1881 వ సంవత్సరాంతం నుండి గృహస్థ భక్తులతో పాటు సర్వసంగ పరిత్యాగులూ, శ్రీరామకృష్ణుల లీలలో పాత్రధారులూ అయిన భక్తులు ఆయన వద్దకు రావడం ప్రారంభించారు. ఆ కోవకు చెందిన వారిలో శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన ప్రథముడు స్వామి బ్రహ్మానంద. సన్న్యాసాశ్రమానికి పూర్వం అతడి పేరు రాఖాల్ చంద్ర. అతడు మనోమోహన్ సోదరిని వివాహం చేసుకున్నాడు; తన అత్తగారి కుటుంబం నుండే అతడు మొదటిసారి శ్రీరామకృష్ణుల గురించి విన్నాడు. తన వివాహం జరిగిన కొద్దికాలంలోనే అతడు శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఇలా చెబుతూవుండేవారు : “రాఖాల్ నా వద్దకు రాక పూర్వం, ఒక దివ్యదర్శనంలో జగజ్జనని హఠాత్తుగా ఒక బాలుణ్ణి తీసుకువచ్చి నా ఒళ్ళో కూర్చోపెట్టి, ‘నీ కుమారుడు’ అని చెప్పింది; ఆ మాట విని నేను భయంతో ఉలిక్కిపడ్డాను. ‘అదెలా? నా కెలా కుమారుడు జన్మిస్తాడు?’ అని ఆరాటంతో ఆమెను అడిగాను. ఆమె నవ్వి, ‘అతడు సాధారణ లౌకిక రీతిలో కలిగిన కుమారుడు కాడు; నీ ఆధ్యాత్మిక తనయుడు’ అని వివరించింది. అప్పుడు నా మనస్సు కుదుటపడింది. ఆ దివ్యదర్శనం కలిగిన స్వల్పకాలంలోనే రాఖాల్ వచ్చాడు; అతడే ఆ బాలుడని తక్షణమే నేను గుర్తించాను” అని రాఖాల్ రాక ముందు తమ దివ్య దర్శనాన్ని గూర్చి చెప్పేవారు.
8. రాఖాల్ బాలక స్వభావం
మరో సందర్భంలో శ్రీరామకృష్ణులు, రాఖాల్ గురించి మాతో ఇలా చెప్పారు : “ఆ రోజుల్లో రాఖాల్ మూడు నాలుగేళ్ళ పసిబాలుని స్వభావం కలిగి ఉండేవాడు. నన్ను తన తల్లిలా భావించేవాడు. అప్పుడప్పుడు పరుగున ఆనందంగా వచ్చి నిస్సంకోచంగా నా ఒళ్ళో కూర్చునే వాడు. ఇంటికి వెళ్ళడం మాట అటుంచి, నా ఒళ్ళో నుండి కదలను కూడా కదిలే వాడు కాడు. అతణ్ణి ఇంటికి వెళ్ళిరమ్మని బలవంతపెట్టేవాణ్ణి; అతడు ఇంటికి వెళ్ళకపోతే అతడి తండ్రి ఇక్కడికి అతణ్ణి ఇకమీదట అసలు పంపడేమోనని నా భయం. అతడి తండ్రి సంపన్నుడైన జమీందారు, అదే సమయంలో పిసినారి కూడా. తన కుమారుణ్ణి ఇక్కడకు రానివ్వకుండా మొదట్లో ఎంతో ప్రయత్నించాడు. తరువాత పలువురు సంపన్నులూ, విద్యావంతులూ ఇక్కడకు రావడం తెలుసుకొని, తన కుమారుడు ఇక్కడకు రావడంలో ఎలాంటి ఆక్షేపణా తెలుపలేదు. కొన్ని సందర్భాలలో తన కుమారుణ్ణి కలుసుకోవడానికి అతడే ఇక్కడకు వచ్చేవాడు. రాఖాల్ నిమిత్తం అతడి పట్ల నేను ఎంతో శ్రద్ధ కనబరిచేవాణ్ణి; దాంతో అతడెంతో ప్రసన్నుడయ్యేవాడు.
9. రాఖాల్ భార్య
“కాని అతడి అత్తగారి కుటుంబం వారు అతడి రాక పట్ల ఎన్నడూ ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. మనోమోహన్ తల్లి, సోదరి అందరూ తరచు ఇక్కడకు రావడమే అందుకు కారణం. ఒక రోజు, రాఖాల్ ఇక్కడకు రావడం ప్రారంభించిన మొదట్లో, మనోమోహన్ తల్లి, రాఖాల్ భార్యను తోడ్కొని ఇక్కడకు వచ్చింది. రాఖాల్ దైవభక్తికి అతడి భార్య అడ్డంగా నిలుస్తుందేమోనని ఆరాటం చెందాను. ఆమె ముఖకవళికలను, భౌతిక లక్షణాలను సునిశితంగా పరిశీలించాక, నా ఆరాటానికి అర్థం లేదని తెలుసుకొన్నాను. శక్త్యాంశ ఆమెలో కానరావడం వలన తన భర్త భగవత్సాక్షాత్కార మార్గానికి ఆమె ఎలాంటి అంతరాయం కలిగించదని గ్రహించి, సంప్రీతుడనైనాను. వెంటనే నహబత్కు (మాతృదేవికి) ‘కోడలికి ఒక రూపాయి కానుక ఇచ్చి, ఆమె మేలి ముసుగు ధరించిన ముఖాన్ని* తిలకించమని’ కబురు చేశాను.”
10. బాలక స్వభావాన్ని రాఖాల్ ఎలా కోల్పోతాడు
“నా సాంగత్యంలో ఉంటున్నప్పుడు అతడికి కలిగే ఆనందపారవశ్య బాలక స్వభావాన్ని వర్ణించడం అసాధ్యం; అతడు దాన్లో తన్మయుడైపోయేవాడు. అప్పుడతణ్ణి చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యచకితులయ్యేవారు. ఆధ్యాత్మిక భావోద్వేగ స్ఫూర్తిలో నేనుకూడా అతడికి జున్ను, వెన్న తినిపించి అతడి ముచ్చట్లలో పాల్గొని అతణ్ణి ఉత్సాహ పరిచేవాణ్ణి. అనేక సందర్భాలలో అతణ్ణి నా భుజాల మీద కూర్చోబెట్టుకొనేవాణ్ణి. అలా చేయడంలో నేను కించిత్తు కూడా సంశయించేవాణ్ణి కాను. కాని అప్పుడే, అక్కడే, ‘అతడు ఎదిగి భార్య సహచర్యంలో జీవించ సాగినప్పుడు, ఆ బాలక స్వభావం అంతరించిపోతుంది’ అని ఆలోచించేవాణ్ణి.
11. రాఖాల్కు, శ్రీరామకృష్ణులు గరపిన క్రమశిక్షణ
“పొరపాటు చేసినప్పుడు అతణ్ణి నేను తిట్టడం కద్దు. ఒక రోజు అతడు ఎంతో ఆకలి వేయడంతో కాళికాలయం నుండి వెన్న, ప్రసాదాలను తన చేతులతో తీసుకొని తినేశాడు. అది చూసి నేను ‘ఎంత పేరాశ! పేరాశను అణచుకోవడానికి బదులుగా, నాకు చెప్పనైనా చెప్పకుండా తినేశావు. ఈ విషయం ఇక్కడ నుండి (తమ నుండి) నిన్ను నువ్వు ఎలా నిగ్రహించుకోవాలో నేర్చుకొని ఉండాలి!’ అని అన్నాను. అతడు భయంతో కుంచించుకు పోయాడు; మళ్ళీ ఎన్నడూ అలా ప్రవర్తించలేదు.”
12. రాఖాల్ మనస్సులో ఈర్ష్య : శ్రీరామకృష్ణుల భయసంశయాలు
“అప్పుడు రాఖాల్లో పిల్లలలో ఉండే ఈర్ష్య కూడా ఉండేది. అతణ్ణి తప్ప నేనెవరినైనా ప్రేమిస్తే తట్టుకోలేడు. అతడి మనస్సు గాయపడుతుంది. జగజ్జనని ఇక్కడకు తోడ్కొని వచ్చిన వారిని చూసి అతడు అసూయపడి తనకు హాని తలపెట్టుకొంటాడేమోనని నేనెంతో ఆందోళనపడ్డాను.
13. రాఖాల్ బృందావనానికి వెళ్ళడం
“ఇక్కడకు వచ్చిన మూడేళ్ళ తరువాత రాఖాల్ జబ్బుపడ్డాడు; బలరాంతో కలిసి అతడు బృందావనానికి వెళ్ళాడు. అతణ్ణి ఇక్కడ నుండి జగజ్జనని తీసుకు పోతున్నట్లు, అంతకు కొద్దికాలం మునుపు ఒక దివ్యదర్శనంలో చూశాను. అప్పుడు ఆమెను, ‘తల్లీ, అతడు (రాఖల్) కేవలం బాలుడు, అజ్ఞాని; అందుకే అతడు కొన్ని సమయాలలో కుపితుడౌతాడు. నీ కార్యం నిమిత్తం అతణ్ణి ఇక్కడ నుండి తీసుకొనిపోయి ఉంటే, అతణ్ణి మంచి చోట ఉంచు అని ప్రార్థించాను. ఆ తరువాత అనతికాలంలోనే అతడు బృందావనానికి వెళ్ళాడు.”
14. రాఖాల్ అస్వస్థత గురించి విని శ్రీరామకృష్ణుల భయోద్రేకం
“బృందావనంలో రాఖాల్ అస్వస్థుడైనాడని వినగానే నేను పడ్డ ఆరాటం అంతా ఇంతా కాదు. ఎందుకంటే, నిజానికి రాఖాల్ వ్రజభూమికి చెందిన గోపాలకుడని జగజ్జనని ఇంతకు మునుపే దర్శింపచేసింది. తాను ఎక్కడ నుండి దేహాన్ని ధరించి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళితే తన గత జన్మ జ్ఞాపకానికి వచ్చి, దేహపరిత్యాగం చేసే ఆస్కారం ఎంతో ఉంటుంది. అందుకే అతడెక్కడ బృందావనంలో మరణిస్తాడోనని నేను భయపడ్డాను. కాబట్టే వ్యాకులతతో జగజ్జననిని ప్రార్థించాను. ఆమె అలా జరగదని అభయమిచ్చి, నన్ను ఊరడించింది. రాఖాల్ గురించి అమ్మ నాకెన్నో విషయాలు దర్శింపచేసింది. వాటిలో అనేకం నేను వెల్లడించరాదు.”*
15. రాఖాల్ తదుపరి జీవితం
తమ ప్రప్రథమ యువభక్తుని గురించి శ్రీరామకృష్ణులు వివిధ సందర్భాలలో చెప్పిన విషయాలకు అంతే లేదు. జగజ్జనని అతణ్ణి గురించి దర్శింపచేసింది యథాతథంగా ఋజువైంది. వయస్సు పెరిగేకొద్దీ భగవత్సాక్షాత్కారార్థం సర్వసంగపరిత్యాగం చేసి అతడు ఉత్కృష్ట సాధకుల కోవలోకి చేరాడు. ఇప్పుడు ఆ బాలుడు శ్రీరామకృష్ణ సంప్రదాయంలో అత్యున్నత స్థానాన్ని అలంకరించాడు.*
16. నరేంద్రుని రాక
రాఖాల్ మొట్టమొదటిసారి శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చిన మూడు లేక నాలుగు నెలల తరువాత నరేంద్రుడు గురుదేవుల వద్దకు వచ్చాడు. ఆయన జీవితంలో ముడివడివున్న సంఘటనలను ఇకపై వివరించబోతున్నాం.