మణిమోహన్ ఇంట్లో జరిగిన కీర్తనలో శ్రీరామకృష్ణుల భావపారవశ్యం, పరమానందానుభూతులను చూసి సంతోషపరవశులై క్రొత్త ఆధ్యాత్మిక వైఖరిని సంతరించుకొన్నది మేం ఒక్కరం మాత్రమే కాదు; మా మిత్రుడు వరదా సుందర్ కూడా ఆ ఉత్సవంలో పాల్గొని, అదే అనుభూతిని పొందాడు. మళ్ళీ శ్రీరామకృష్ణులు అటువంటి ఉత్సవ వేడుకలలో ఎప్పుడు పాల్గొంటారో అని ఆరాటంతో వాకబు చేయడం మొదలుపెట్టాడు. త్వరలోనే అతడి పంట పండింది. రెండు రోజుల తరువాత, బుధవారం, నవంబర్ 28 వ తేదీ మేం కలుసుకొన్నప్పుడు “ఈ రోజు శ్రీరామకృష్ణులు కేశవ్బాబు కమల కుటీరానికి వస్తున్నారు. అక్కడ నుండి మథఘాసాలోని జయగోపాల్ సేన్ ఇంటికి సాయంత్రం తరువాత వెళ్ళనున్నారు. మీరు ఆయనను చూడడానికి వెళతారా?” అని అడిగాడు. అప్పుడు కేశవసేన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని మాకు తెలుసు. మా వంటి అపరిచితులు అటువంటి సమయంలో కమల కుటీరానికి వెళితే అక్కడి వారికి చికాకు కలుగుతుందేమోనని ఆలోచించి, శ్రీరామకృష్ణుల దర్శనార్థం సాయంత్రం తరువాత జయగోపాల్ సేన్ ఇంటికే వెళ్ళడానికి నిశ్చయించుకొన్నాం.
1. జయగోపాల్ సేన్ గృహం
మథఘాసా ప్రాంతం, బారాబజార్లో ఒక భాగమే అనుకొని ముందు అక్కడికే వెళ్ళాం. అక్కడ వాకబు చేసి, ఎంతో శ్రమపడి చివరకు సూర్యాస్తమానం తరువాత జయగోపాల్ సేన్ గృహాన్ని చేరాం. ఆ రోజు మధ్యాహ్నం వాన పడింది. ఎందుకంటే వీథుల్లో మేం బురదలో నడిచి వెళ్ళినట్లు మాకు బాగా గుర్తు. జయగోపాల్ బాబు ఇల్లు, మణిమోహన్ ఇల్లు మాదిరే పశ్చిమ ముఖంగా ఉంది; తూర్పు వైపు తిరిగి ఆ ఇంట్లోకి వెళ్ళినట్లు మాకు జ్ఞాపకం. ఇంటి ముఖద్వారాన్ని దాటుతున్నప్పుడు ఒక వ్యక్తి తారసపడ్డాడు; శ్రీరామకృష్ణులు వచ్చారా అని అతణ్ణి అడిగాం. అతడు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి, మేడ మొదటి అంతస్తుకు వెళ్ళమన్నాడు. దక్షిణం వైపునున్న మెట్ల మీదుగా వెళ్ళి విశాలమైన చావడి గదిలో అడుగుపెట్టాం. ఆ గది ఉత్తర దక్షిణాలుగా వ్యాపించివుంది. ఆ గది చాలా శుభ్రంగా ఉంది. నేలమీద విశాలమైన పరుపు, దానిమీద తెల్లని వస్త్రం పరిచి ఉన్నారు. శ్రీరామకృష్ణులు దాని మీద కూర్చుని ఉన్నారు. బ్రహ్మసమాజ భక్తులు ఆయనను పరివేష్టించి ఉన్నారు. వారిలో నవవిధాన్ ఆచార్యులైన చిరంజీవి శర్మ, అమృతలాల్ బసు కూడా ఉన్నారు. ఆ ఇంటి యజమాని జయగోపాల్, అతడి సోదరుడు, ఇరుగుపొరుగునవున్న అతడి స్నేహితులు ఇద్దరు ముగ్గురు, శ్రీరామకృష్ణులతో వచ్చిన ఒకరిద్దరు భక్తులు కూడా అక్కడే ఉన్నారు. ఆ భక్తబృందంలో శ్రీరామకృష్ణులు ముద్దుగా పిలిచే హుట్కో (హఠాత్తుగా వచ్చి, హఠాత్తుగా మాయమయ్యే వ్యక్తి అని అర్థం), చిన్న గోపాల్ కూడా ఉన్నట్లు మాకు జ్ఞాపకం. శ్రీరామకృష్ణులతో అక్కడ పది పన్నెండు మంది దాకా ఉండడం మేం గమనించాం. అది బహిరంగ సమావేశం కాదనీ, అక్కడకు రావడం పొరపాటేమోననీ మేం భావించాం. భోజనానికి రమ్మని పిలుపు వచ్చేముందే మేం అక్కడ నుండి చల్లగా జారుకోవాలనుకొన్నాం.
లోపలకు రాగానే, శ్రీరామకృష్ణుల పాదారవిందాలకు ప్రణమిల్లాం. “మీరెలా ఇక్కడకు వచ్చారు?” అని ఆయన అడిగారు. “నేడు మీరు ఇక్కడకు వస్తున్నట్లు తెలిసింది; మిమ్మల్ని చూడగోరి వచ్చాం” అని జవాబిచ్చాం. మా సమాధానంతో ప్రసన్నులైనట్లున్నారు; మమ్మల్ని కూర్చోమన్నారు. మేం కూర్చున్నాం. ఆదుర్దా తగ్గడంతో పరిసరాలు గమనిస్తూ, ఆధ్యాత్మిక వికాసం కలిగించే ఆయన వచనాలు వినసాగాం.
2. శ్రీరామకృష్ణుల బోధనా విధానం
ఇటీవలే మేం శ్రీరామకృష్ణులను ప్రప్రథమంగా దర్శించుకొనే భాగ్యం కలిగినప్పటికీ ఆయనను కలుసుకొన్న మొదటి రోజే ఆయన వచనామృతం పట్ల మాకు అసాధారణ ఆకర్షణ ఏర్పడింది. అందుకు కారణం అప్పట్లో మేం గ్రహించలేక పోయాం; ఆయన బోధనా విధానం ఎంత అనుపమానమైనదో ఇప్పుడు గ్రహించగలిగాం. దానిలో పాండిత్య ప్రకర్ష, వాక్చాతుర్యం, తర్కాన్ని గుప్పించడం చోటుచేసుకోవు; పద ప్రయోగంలో కృత్రిమత్వం, సాధారణ భావాలకు వాగాడంబరపు ముసుగు, భారతీయ తత్త్వశాస్త్ర సూత్రకారుల మాదిరి నిగూఢ భావనల వ్యక్తీకరణలో పదాల లుబ్ధత్వం ఎంత వెతకినా కానరావు. తాము మాట్లాడే భాష పట్ల శ్రీరామకృష్ణులు పూర్తి శ్రద్ధ వహించేవారో లేదో మేం చెప్పలేం. నిత్యం జరిగే సంఘటనల నుండి సోదాహరిస్తూ తమ భావాలను శ్రోతల మనస్సులలో హత్తుకునేలా చేయడం, ఆయన మాటలు ఒక్కసారి విన్న వారికి సైతం అవగతమౌతుంది. శ్రోతలకు ఎలాంటి సంశయాలు కలుగకపోవడమే కాదు, ఆయన వచనాల్లోని సత్యాన్ని గ్రహించి వారు పూర్తిగా సంతృప్తి చెందుతారు. ఆ సోదాహరణలు తక్షణమే ఆయనకు స్ఫురించడానికి ఆయన అసాధారణ జ్ఞాపకశక్తి, అద్భుత గ్రహణ శక్తి, సునిశిత పరిశీలనాశక్తి, అనుపమాన సమయస్ఫూర్తే కారణాలు. కాని జగజ్జనని అనుగ్రహమే అందుకు కారణం అని సదా శ్రీరామకృష్ణులు చెప్పేవారు. ఆయన తరచు ఇలా “సంపూర్ణంగా ఆమె మీద ఆధారపడిన వ్యక్తి హృదయంలో ఆమె ఆసీనురాలై, అతడు ఏం చెప్పాలో సంజ్ఞలతో అతడికి తెలియచేస్తుంది. జగజ్జనని అటువంటి వ్యక్తి మనస్సును సదా జ్ఞాన భాండాగారంలా మలచి ఉంచుతుంది. అతడు ఎంత వినియోగించుకొన్నా, ఆ జ్ఞానం తరగదు” అని చెప్పేవారు. ఈ విషయం వివరిస్తూ ఒక రోజు ఈ క్రింది సంఘటనను ప్రస్తావించారు:
దక్షిణేశ్వర కాళికాలయానికి ఉత్తరాన ఒక ప్రభుత్వ మందుగుండు కార్ఖానా ఉండేది. సిక్కు మతానికి చెందిన కొందరు సిపాయిలు అక్కడ కావలికాస్తూ, నివసించేవారు. వారందరూ శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తిప్రపత్తులతో ఉండేవారు. కొన్ని సందర్భాలలో వాళ్ళు ఆయనను తమ బసకు తోడ్కొని వెళ్ళి ధార్మిక సందేహాలను నివృత్తి చేసుకోవడం కద్దు. “ ‘సంసారంలో ఉంటూ మనిషి భగవత్సాక్షాత్కారం పొందడం ఎలా?’ అని ఒక రోజు వాళ్ళు, నన్ను అడిగారు. వెంటనే నా మనస్సులో బియ్యం దంపే రోలు, రోకలి మెదలాయి. రోకలి దంపుతూవుంటే ఒక వ్యకి వడ్లను జాగ్రత్తగా రోలులోకి తోస్తూవుంటాడు. ఆ దృశ్యం నా మనస్సులో మెదలగానే, సంసారంలో ఉండే వ్యక్తి కూడా అంత జాగ్రత్తగా మసలుకోవాలని జగజ్జనని వివరిస్తున్నట్లు నేను గ్రహించాను. రోలు వద్ద కూర్చుని వడ్లను రోట్లోకి తోస్తూవున్న వ్యక్తి, రోకలి తన చేతుల మీద పడకుండా ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తాడో, అట్లే సంసారంలో ఉండే వ్యక్తి సంసార లంపటాలలో చిక్కువడకుండా సదా జాగ్రత్త వహించాలి. అటువంటప్పుడు మాత్రమే ఆ వ్యక్తి పతనం చెందకుండా బంధనాల నుండి తప్పించుకో గలుగుతాడు. రోలు, రోకలి చిత్రం మదిలో మెదలగానే, జగజ్జనని ఈ భావనను నాలో ఉత్పన్నం చేసింది; ఇదే ఆ సిపాయిలకు నేను వివరించి చెప్పాను. ఆ వివరణ విని వాళ్ళు ఎంతో తృప్తిచెందారు. లోకులతో మాట్లాడుతున్నప్పుడు అటువంటి దృశ్యాలు నా మదిలో మెదలడం కద్దు”.
3. ఆయన బోధనా విధానంలోని మరో విలక్షణత
అనవసరంగా మాట్లాడి శ్రోతల మనస్సులను ఎన్నడూ గందరగోళపరచక పోవడం శ్రీరామకృష్ణుల బోధనా విధానంలోని మరో విలక్షణత. విషయాంశాన్నీ, ప్రశ్నించే వ్యక్తి ఉద్దేశాన్ని సరిగా వివేచించి, సరళంగా నాలుగు ముక్కల్లో జవాబు చెప్పేవారు. తన నిర్ణయాన్ని పై రీతిలో సోదాహరణతో తెలిపేవారు. అలా నిర్ణయాన్ని ప్రకటించడం ఆయన బోధన పద్ధతిలో విశిష్ట లక్షణమని మేం భావిస్తాం. తన అంతరాంతరాల్లో నిజమని తెలిసిన విషయాన్నే ఆయన జవాబుగా ప్రకటించేవారు. ఆ సమస్యకు మరో పరిష్కారం సాధ్యం కాదని ఆయన పొడిగించి చెప్పరు. తాము వ్యక్తంచేసే భావాల పట్ల గల సంపూర్ణ విశ్వాసం కారణంగా శ్రోతల మనస్సులలో ఆ భావం ప్రగాఢంగా హత్తుకుపోయేది. గత సంస్కారాల పర్యవసానంగా ఎవరైనా ఆయన నిర్ణయాలకు వ్యతిరిక్తంగా వాదనలు, కారణాలు లేవనెత్తి సాధనాఫలితంగా సత్యాలని తెలుసుకొన్న ఆయన నిర్ణయాలను ససేమిరా అంగీకరించకుంటే, ఆయన, “నా మనస్సుకు తోచింది. చెప్పాను; నీకు నచ్చినంతవరకు (అంటే తలా, తోకా తీసివేసి) అంగీకరిస్తే అంగీకరించు” అంటూ ఆ ప్రస్తావనను అంతటితో ముగించే వారు. ఒకరి స్వాతంత్ర్యంలో జోక్యం చేసుకొని వారి ఆధ్యాత్మిక వైఖరికి హాని ఆయన ఎన్నటికీ తలపెట్టరు. భగవత్సంకల్పంతో చర్చిస్తూన్న సమస్యకు నిజమైన పరిష్కారాన్ని ఆ వ్యక్తి ఉన్నత మనోస్థితిని చేరినప్పుడు అవగతం చేసుకోగలడని ఆయన సరిపుచ్చుకొంటారని భావించవచ్చు.
అక్కడితో ఆయన ఆగరు; సుప్రసిద్ధ సాధకులు స్వరకల్పన చేసిన భక్తి గీతాలను, కొన్ని సందర్భాలలో శాస్త్రాల నుండి ఉదాహరణలను జోడించి తన మాటలకు మరింత శక్తిని చేకూరుస్తారు. దాంతో ఆ వ్యక్తి సంశయాలు తొలగి పోతాయి; విషయాంశంలోని సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా తన జీవితాన్ని మలచుకోవడానికి సంసిద్ధుడౌతాడు.
4. అనుభూతిరహిత వచనాలపట్ల ఆయన చిరాకుపడడం
ఇక్కడ మరొక్క మాట చెప్పవలసి ఉంది. భక్తిమార్గగాములు లేదా జ్ఞానమార్గగాములు తమ గమ్యాంతాన ఆరాధనా వస్తువుతో తాదాత్మ్యం చెందినట్లు గ్రహించినప్పుడే ఆ సాధకుడు అద్వైతజ్ఞానాన్ని సంతరించు కొంటాడని పదేపదే శ్రీరామకృష్ణులు మాతో చెప్పేవారు. ‘శుద్ధ భక్తి, శుద్ధ జ్ఞానం రెండు ఒక్కటే’ లేదా అక్కడ (పరాకాష్ఠ స్థితిలో) నక్కలన్నీ ఒక్క విధంగానే ఊళలు వేస్తాయి. జ్ఞానులంతా ఒకే ఆత్మ సాక్షాత్కారం గురించే వచిస్తారు’ అనే ఆయన సూక్తులే పై దానికి తార్కాణాలు. శ్రీరామకృష్ణుల అభిప్రాయంలో అద్వైత జ్ఞానమే పరమసత్యం అయినప్పటికీ ఆయన లౌకిక వస్తువుల పట్ల అత్యాశ గల జనసామాన్యానికి విశిష్టాద్వైతాన్నే సదా నేర్పేవారు; ఎన్నటికీ ద్వైతంలోని భక్తిని కాదు. ఉన్నత ఆధ్యాత్మిక అనుభూతులు పొందని వ్యక్తులు, ఆ మాటకొస్తే భక్తిశూన్యులు అద్వైతానికి లేదా విశిష్టాద్వైతానికి అనుకూలంగా చేసే వాదనలు చూసి ఆయన ఎంతో చిరాకుపడేవారు. అటువంటి సందర్భాలలో వారిని పరుష వచనాలతో గర్హించడానికి సైతం ఆయన సంకోచించేవారు కాదు. ఒక రోజు మా మిత్రుడైన వైకుంఠనాథ్ సన్యాల్ను, పంచదశి మొదలైన శాస్త్రగ్రంథాలను పఠించావా అని శ్రీరామకృష్ణులు అడిగారు. అతడి నుండి లేదు అని జవాబు రాగానే ఆయన ఊపిరిపీల్చుకొని, “నువ్వు చదవకపోవడం మంచిదే. కొందరు యువకులు అటువంటి శాస్త్రగ్రంథాలు కేవలం చదివి ఇక్కడికి వస్తారు. ఏదీ అనుష్ఠించరు, వాదన చేయడానికే వస్తారు. అది నాకు యాతనాభరితంగా ఉంటుంది” అని అన్నారు.
ఆ రోజు జయగోపాల్ సేన్ ఇంట్లో ఒక ఫలానా వ్యక్తి శ్రీరామకృష్ణులను, “సంసారంలో జీవిస్తూ భగవదనుగ్రహం పొందడం ఎలా?” అని అడిగాడు. శ్రీరామకృష్ణులు అతడికి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని, జగజ్జననిపై కొన్ని పాటలు పాడుతూ వివరించారు. ఆయన వివరణ సారాంశాన్ని క్రింద తెలుపుతున్నాం:
5. సంసార జీవితంలో భగవత్సాక్షాత్కారం పొందడం ఎలాగో శ్రీరామకృష్ణులు నేర్పడం
సంసారం అశాశ్వతం అని తెలిసి కూడా సంసారాన్ని ‘నాది’ అని భావించుకొని ఆ ప్రకారం మెలగినంత కాలం అతడు దాన్లో చిక్కువడిపోతాడు. యాతనలు అనుభవిస్తూ, సంసారం నుండి పారిపోగోరినా, అతడికి దారీతెన్నూ కనిపించదు. ఇలా చెబుతూ శ్రీరామకృష్ణులు, “మహామాయ మాయా జగత్తును గొప్ప భ్రాంతిలో ముంచివుంచుతుంది; బ్రహ్మ విష్ణువులు సైతం ఆ భ్రాంతిలో మునిగే ఉంటారు, ఇక జీవుడి విషయం చెప్పాలా!” అనే పాట పాడారు. కాబట్టి ఈ తాత్కాలిక సంసారాన్ని మానసికంగా భగవంతునితో ముడివేసి తదనుగుణంగా ప్రతి పనిని నిర్వర్తించాలి. ఒక చేత్తో భగవంతుని పాదపద్మాలను గట్టిగా పుచ్చుకొని, మరో చేత్తో తక్కిన పనులు చేసుకుంటూపోవాలి; ఈ సంసారంలోని వ్యక్తులూ, వస్తువులూ తన సొంతం కావనీ, ఆయనకే చెందినవనీ సదా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అలా చేయగలిగితే, సంసారానురక్తి వలన కలిగే బాధలుండవు. అప్పుడు తాను ఏం చేసినా అది భగవంతుని నిమిత్తమే అనే భావన ఉదయించి, అతడి మనస్సు భగవంతుని వైపుగా పురోగమిస్తుంది. ఈ భావాన్ని పటిష్టంగా శ్రోత మనస్సులో నాటుకుపోయేలా చేయడం కోసం శ్రీరామకృష్ణులు, “ఓ మనసా! నీకు సేద్యం చేయడం (జీవన సేద్యం) తెలియదు” అనే పాటను పాడారు. పాడటం పూర్తికాగానే ఆయన కొనసాగించారు : “ఆ విధంగా భగవంతుని ఆధారం చేసుకొని జీవితం గడిపితే, ఈ లోకంలోని మనుష్యులూ, వస్తువులు యావత్తూ భగవంతుని అంశలే అనే భావన క్రమంగా జనిస్తుంది. అటువంటప్పుడు సాధకుడు తన తల్లితండ్రులను విశ్వానికి తల్లితండ్రులుగా (బ్రహ్మం, దాని శక్తి) సేవిస్తాడు. తన కొడుకులను, కూతుళ్ళను బాలగోపాలుని, జగజ్జనని అభివ్యక్తీకరణలుగా చూస్తాడు; తక్కిన అందరూ నారాయణుని అంశలుగా తెలుసుకొని, వారి పట్ల భక్తిప్రపత్తులతో మెలగుతాడు. సంసారంలో అట్టి ఆధ్యాత్మిక భావంలో జీవించే వ్యక్తి ఆదర్శప్రాయుడైన గృహస్థు; అతడి మనస్సు నుండి మరణభీతి సమూలంగా తొలగిపోతుంది. అటువంటి వ్యక్తులు ఎంతో అరుదుగా ఉంటారు.” ఆ తరువాత ఆ ఆదర్శాన్ని చేరుకొనే ఉపాయాన్ని తెలిపే ఉద్దేశంతో ఆయన ఇలా అన్నారు : “విచక్షణా జ్ఞానం మీద ఆధారపడి ఉండాలి, అన్ని కార్యాలను ఆ వెలుగులోనే నిర్వర్తించాలి; అప్పుడప్పుడు కోలాహల సంసార వాతావరణం నుండి నిష్క్రమించి, ఏకాంతవాసంలో భగవత్సాక్షాత్కారార్థం ఆధ్యాత్మిక సాధనలు అనుష్ఠించాలి.” తమ జీవితంలో పైన పేర్కొన్న ఆదర్శాన్ని ఈ రీతిలో మాత్రమే ఆచరించగలగాలి. అందుకైన మార్గాన్ని సూచిస్తూ శ్రీరామకృష్ణులు, రాంప్రసాద్ సుప్రసిద్ధ గీతం, “రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు, ప్రోగుచేయు మా చెట్టు క్రిందను నాలుగు పురుషార్థంబులును” ఆలపించారు. ‘విచక్షణా జ్ఞానం’ అన్న ప్రయోగానికి అర్థం ఏమిటో ఆయన తెలిపారు. ఆ విచక్షణాజ్ఞానంతో సాధకుడు, భగవంతుడు ఒక్కడే శాశ్వతుడని, రూపరసాదులు క్షణికమైనవనీ (అశాశ్వతమని) గ్రహించి, సంసార పరిత్యాగం చేస్తాడు. కాని భగవంతుణ్ణి తెలుసుకొన్న తరువాత, అదే జ్ఞానం ఆ పరమాత్మ, తన లీలలతో విశ్వంలోని అనేక వ్యక్తుల, వస్తువుల రూపాలను దాలుస్తాడనీ బోధిస్తుంది. అప్పుడు భగవంతుడు నిత్యమూ, లీలా రెండూ అనే అనుభూతిని సాధకుడు పొంది, తరిస్తాడు.
6. సంకీర్తనానందం
తరువాత ఆచార్య చిరంజీవిశర్మ “ఓ జననీ, నన్ను మత్తిల్లచేయి” అనే పాటను ఆలపించాడు; అందరూ బృందగానం చేశారు. ఆ పాట ప్రారంభం కాగానే శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో లేచి నిలబడ్డారు. అంతా లేచి నిలబడి, ఆయన చుట్టూ చేరి నాట్యం చేస్తూ, పాడసాగారు. ఆ పాట పూర్తిచేసి, చిరంజీవి మళ్ళీ పాడసాగాడు :
ఆహా, దివ్యప్రేమ పూర్ణచంద్రుడు చైతన్య ఆకాశాన ఉదయించాడు.
దయాళువుకు విజయోస్తు!
కాంచండి, దివ్యప్రేమ సాగరం ఉప్పొంగింది! ఓ, ఆ పరమానందం
పరికించండి!
ఆహా, భక్తులు తారలలా, లీలామానుషుడు హరి చుట్టూ
ప్రకాశిస్తూన్నారు!
స్వర్గ ద్వారాన్ని తెరుస్తూ, నవవిధానపు కొంగ్రొత్త మారుతం వీస్తూ,
ఆనందతరంగాలను లేవనెత్తుతూన్నది.
దివ్యప్రేమ అమృత మాధుర్య సువాసన చుట్టూ వేగంగా పరివ్యాపిస్తూ,
పావనధ్యానానందంలో యోగులను మత్తిల్లచేస్తున్నది.
ఆనందమయి జగజ్జనని ఆశీనయైన నవవిధాన పద్మం
తీరంలేని సాగరంలో నృత్యం చేస్తున్నది.
ఆధ్యాత్మిక భావోద్వేగంలో మునిగిపోయిన భక్త భ్రమరాలు
ఆ పద్మంలోని మధువును గ్రోలుతున్నవి.
ఓ! భక్తుల మనస్సులను రంజిల్లచేసే జగజ్జనని అనుగ్రహపూర్ణ వదనం!
భక్తిలో సంలీనమైన సాధుబృందాలు ఆమె పాదారవిందాల వద్ద నృత్యం
చేస్తున్నారు.
ఏమా సౌందర్యం! జీవితం వసంతాన్ని సంతరించుకొంది దాన్నంతా చూసి.
సర్వుల పాదాలు పుచ్చుకొని ప్రేమదాసు జగజ్జననికి విజయోస్తు అని
గానం చేయమని వేడుకొంటున్నాడు.
చాలాసేపు పాటకు అనుగుణంగా నృత్యం కొనసాగింది. తరువాత భగవంతునికి, భక్తులకు ప్రణామాలర్పిస్తూ సంకీర్తన కార్యక్రమం ముగిసింది. అందరూ శ్రీరామకృష్ణుల పాదధూళి స్వీకరించి, కూర్చున్నారు. ఈ సందర్భంలో కూడా ఆయన చాలాసేపు మనోహరంగా నృత్యం చేశారు. కాని మణిమోహన్ ఇంట్లో ఆయన పొందిన ప్రగాఢ పారవశ్యం ఇక్కడ పొందినట్లు కనిపించలేదు. తదనంతరం శ్రీరామకృష్ణులు కూర్చుని, చిరంజీవితో “నీ ఆ పాటను మొట్టమొదటి సారి విన్నప్పుడు, అట్టి జీవితం, అంతపెద్ద పూర్ణచంద్రుడు ఉదయిస్తున్నట్లు నేను కాంచగలిగాను; ఆ తరువాత భావపారవశ్యంలోకి జారుకొన్నాను” అని అన్నారు.
కేశవ్ అస్వస్థత గురించి జయగోపాల్, చిరంజీవి మాట్లాడుకోసాగారు. ఎవరితోనో శ్రీరామకృష్ణులు, రాఖాల్కు ఒంట్లో బాగాలేదని చెప్పినట్లు మాకు గుర్తు. జయగోపాల్ మంత్రదీక్ష పుచ్చుకొన్న బ్రహ్మసమాజ భక్తుడో కాదో మాకు తెలియదు; కాని అతడికి కేశవ్సేన్ పట్లా, బ్రహ్మసమాజ భక్తుల పట్లా ఎంతో భక్తిప్రపత్తులు ఉన్నాయనడం నిజం. కేశవ్ కొన్ని సమయాలలో కలకత్తాకు సమీపాన ఉన్న బేల్ఘరియాలోని జయగోపాల్ ఉద్యానానికి వెళ్ళి, ఆధ్యాత్మిక సాధనలలో కొంత సమయం గడిపి వచ్చేవాడు. అక్కడే కేశవ్, గురుదేవులను మొట్టమొదటిసారి కలుసుకోవడం తటస్థించింది. కేశవ్ జీవితంలో ఆధ్యాత్మికత ప్రగాఢమై, నవవిధాన్ ఆవిర్భావానికి ఆ సమావేశమే నాంది పలికింది. ఆనాటి నుండి జయగోపాల్ కూడా శ్రీరామకృష్ణుల పట్ల అమిత భక్తిశ్రద్ధలు చూపసాగాడు. కొన్ని సమయాలలో దక్షిణేశ్వరానికి స్వయంగా వెళ్ళి, లేదా శ్రీరామకృష్ణులను తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ధార్మిక ప్రసంగాలలో పాల్గొని ఎంతో ఆనందించేవాడు. శ్రీరామకృష్ణులు కలకత్తాకు రావడానికయ్యే బండి బాడుగ ఖర్చులో అధికభాగం జయగోపాలే భరించేవాడని మేం వినివున్నాం. శ్రీరామకృష్ణుల పట్ల ఆయన కుటుంబ సభ్యులందరూ ఎంతో గౌరవం చూపేవారు.
రాత్రి బాగా ప్రొద్దుపోవడంతో, శ్రీరామకృష్ణుల దగ్గర మేం సెలవు పుచ్చుకొని, ఇళ్ళకు బయలుదేరాం.