1. ఆ సంఘటన జరిగిన తేదీ నిర్ణయం
మాకు బాగా గుర్తు, అది హేమంత ఋతువు. వానలలో స్నానమాడి ఆనందించిన ప్రకృతి శీతాకాలాన్ని, మంచును చవిచూడ నారంభించింది. హేమంతం దాదాపు గడిచిపోయింది. ఆ సమయంలో ఒక రోజు జరిగిన సంఘటనను వర్ణించబోతున్నాం. ఆ సంఘటన జరిగిన తేదీని, అదృష్టవశాత్తు ఈ క్రింది రీతిలో నిర్ణయించగలిగాం. శ్రీరామకృష్ణుల పరమ భక్తుడూ, మాకు మాననీయుడూ అయిన బలరాం బోస్ ఆ సంఘటన జరిగిన సన్నివేశంలో ఉండడం తటస్థించింది. అతడి అలవాటు ప్రకారం పంచాంగంలో ఆ రోజును గుర్తుపెట్టాడు. దీని నుండి ఆ సంఘటన సోమవారం, నవంబర్ 26, 1883 లో జరిగిందని మేం తెలుసుకొన్నాం.
2. వైకుంఠనాథ్ సన్యాల్తో మా పరిచయం
మేం అప్పుడు కలకత్తాలోని సెయింట్ సేవియర్ కళాశాలలో చదువుకొంటున్నాం. అప్పటికి మేం శ్రీరామకృష్ణులను రెండు మూడుసార్లు మాత్రమే దర్శించుకొన్నాం. ఆ రోజు కళాశాలకు సెలవు. కొమిల్లాకు చెందిన వరదసుందర పాల్, హరిప్రసన్న ఛట్టోపాధ్యాయ్ (కాలాంతరంలో స్వామి విజ్ఞానానంద)తో కలిసి మేం సాయంత్రం శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకొన్నాం. మేం పడవలో దక్షిణేశ్వరానికి పోతున్నప్పుడు, మా మాదిరే మరొక ప్రయాణీకుడు కూడా ఆయన వద్దకే వెళుతున్నానని చెప్పినట్లు మాకు గుర్తుంది. మాటల సందర్భంలో అతడి పేరు వైకుంఠనాథ్ సన్యాల్ అని, అతడు కూడా శ్రీరామకృష్ణులను ఆ మధ్యనే కలుసు కొన్నట్లు తెలియవచ్చింది. మా మాటలలో శ్రీరామకృష్ణుల ప్రస్తావన రావడం విని, పడవలోని మరో ప్రయాణీకుడు ఆయన గురించి పరిహాసంగా ఏదో అన్నాడు. దాంతో వైకుంఠనాథ్ రెచ్చిపోయి, ధిక్కరించి అతగాడి నోరు మూయించాడు. ఈ విషయం కూడా మాకు గుర్తుంది. మేం దక్షిణేశ్వరానికి మధ్యాహ్నం రెండు లేదా రెండున్నరకు చేరాం.
మేం శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్ళి, ఆయనకు పాదాభివందనం చేయగానే, ఆయన “ఇవాళ వచ్చారా! కాస్త ఆలస్యంగా వచ్చివుంటే మనం కలుసుకొనేవాళ్ళం కాము. నేడు నేను కలకత్తాకు వెళుతున్నాను; బండి కోసం వెళ్ళారు. అక్కడ బ్రహ్మసమాజం వారి ఉత్సవం జరుగనున్నది. మనం కలుసుకోవడం మంచిదే అయింది. దయచేసి కూర్చోండి. నన్ను కలుసుకోకుండా మీరు తిరిగి వెళ్ళిపోయి ఉంటే, ఎంత నిరుత్సాహం చెందేవారో కదా!” అని అన్నారు.
3. బాబూరాంతో మా ప్రథమ పరిచయం
గదిలో పరిచిన చాప మీద కూర్చున్నాక, “మీరు పాల్గొనబోయే బ్రహ్మసమాజ ఉత్సవంలో మమ్మల్ని రానిస్తారా?” అని ఆయనను అడిగాం. అందుకు ఆయన “ఎందుకు రానివ్వరు? అక్కడకు వెళ్ళాలని ఉంటే నిర్భయంగా మీరు రావచ్చు. ఆ ఉత్సవం సిందూరియాపటి వాస్తవ్యుడైన మణిమల్లిక్ ఇంట్లో జరుగబోతున్నది” అని చెప్పారు. ఇంతలో మరీ సన్నగాను, ఎరుపురంగు వస్త్రం ధరించిన ఒక యువకుడు గదిలోకి రావడం చూసి శ్రీరామకృష్ణులు, “రా, మణిమల్లిక్ ఇంటి చిరునామా వాళ్ళకు చెప్పు” అని అన్నారు. ఆ యువకుడు వినమ్రంగా, “ 81, చిత్పూర్ వీథి, సిందూరియాపటి” అని ఆ చిరునామా చెప్పాడు. ఆ యువకుడి సరళ ప్రవర్తన, శాంత స్వభావం చూసి, ఆలయంలోని ఒక బ్రాహ్మణ అధికారి కుమారుడేమో అని అనుకొన్నాం. కాని రెండు నెలలు గడిచాక విశ్వ విద్యాలయ పరీక్షా హాల్ నుండి అతడు రావడం చూసి, అతడితో మాట్లాడి, అతణ్ణి గురించి మేం అనుకొన్నది తప్పు అని తెలుసుకొన్నాం. ఆ తరువాత అతడి పేరు బాబూరాం అనీ, స్వస్థలం తారకేశ్వర్ సమీపంలోని ఆంట్పూర్ గ్రామమనీ తెలుసుకొన్నాం. కలకత్తాలోని కోంబు లియటోలా పేటలో ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడనీ, అప్పుడప్పుడు శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళి, ఆయనతో పాటు అక్కడే బస చేయడం కూడా కద్దు అనీ తెలుసుకొన్నాం. అతడే కాలాంతరంలో స్వామి ప్రేమానందగా ప్రథమశ్రేణి శిష్యబృందంలో ఒకడైనాడు.
ఇంతలో బండి వచ్చింది. తువ్వాలు దుస్తులు, సుగంధద్రవ్యాలున్న చిన్ని సంచి తీసుకురమ్మని బాబూరాంకు చెప్పి, జగజ్జననికి ప్రణామం చేసి, శ్రీరామకృష్ణులు వెళ్ళి బండిలో కూర్చున్నారు. బాబూరాం ఆ వస్తువులు పుచ్చుకొని, బండికి అటువైపుగా కూర్చున్నాడు. ఆ రోజు శ్రీరామకృష్ణులతో పాటు కలకత్తాకు మరో వ్యక్తి కూడా వెళ్ళాడు. ఆ తరువాత ఆ వ్యక్తి పేరు ప్రతాపచంద్ర హాజ్రా అని తెలుసుకొన్నాం. శ్రీరామకృష్ణులు కలకత్తాకు బయలుదేరగానే మాకొక పడవ వెంటనే దొరికింది. మేం ఆ పడవలో బయలుదేరి, బారాబజార్ వద్ద దిగాం. ఉత్సవం సూర్యాస్తమయ సమయంలో జరుగుతుందని భావించి, ఒక మిత్రుడి ఇంట్లో ఎదురుచూస్తూ కూర్చున్నాం. మమ్మల్ని ఉత్సవం జరిగేచోట కలుసుకొంటానని చెప్పి మా క్రొత్త పరిచయస్థుడైన వైకుంఠనాథ్ ఏదో పనిమీద వెళ్ళాడు.
మేం సాయంత్రం నాలుగు గంటలకు మణిబాబు ఇంటికి చేరుకొన్నాం. శ్రీరామకృష్ణులను గురించి వాకబు చేయగా, ఎవరో వచ్చి మమ్మల్ని మేడ మీదకు తోడ్కొని వెళ్ళారు. మేడమీది గది తోరణాలతో, పువ్వులతో కళకళలాడుతూ ఉత్సవ సొబగులను సంతరించుకొంది. కొద్దిమంది భక్తులు వాళ్ళలో వాళ్ళు మాట్లాడు కొంటున్నారు. మధ్యాహ్న ప్రార్థన, సంగీత కార్యక్రమం ముగిశాయనీ, మళ్ళీ ప్రార్థన, కీర్తన సాయంత్రం ఉంటాయనీ విచారించగా తెలియవచ్చింది. భక్తురాండ్ర విన్నపం మేరకు శ్రీరామకృష్ణులను లోపల గదిలోకి తోడ్కొని వెళ్ళారని విన్నాం.
4. మణి మల్లిక్ ఇంట్లో అద్భుత సంకీర్తన
ప్రార్థన మొదలవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిసి, మేం బయటకు వెళ్ళాం. మునిమాపు వేళకు తిరిగివచ్చాం. మేం ఆ వీథిలోకి వస్తూ ఉండగానే మృదుమధుర సంగీతం, మృదంగనాదం మాకు వీనుల విందు చేశాయి. సంకీర్తన మొదలైందని గ్రహించి, మేం పరుగున మేడ మీదికి వెళ్ళాం. అక్కడకు వెళ్ళి చూశాం కదా! ఆ హాలు లోపల, బయట జనం గుంపులు గుంపులుగా ఉన్నారు. ప్రతి ద్వారంవద్ద క్రిక్కిరిసి జనం నిలబడివున్నారు. వారిని తోసుకొని లోపలకు వెళ్ళడం దాదాపు అసాధ్యమే! ప్రతి ఒక్కరు మెడలు చాచి కళ్ళార్పకుండా లోపలకు తొంగి చూస్తున్నారు. పక్కన ఎవరు ఉన్నారో ఎవరు లేరో గమనించే స్థితిలో వారు లేరు. ముందు వాకిలి గుండా లోపలకు వెళ్ళడం అసాధ్యం కనుక, మేం అలా తిరిగి పశ్చిమవైపు కప్పును దాటి, ఉత్తరం వైపు వాకిలి వద్దకు చేరుకొన్నాం. ఇక్కడ జనం కాస్త పలచగా ఉన్నందువల్ల, ఏదో విధంగా మెడలు చాచి లోపలకు చూడగలిగాం.
5. శ్రీరామకృష్ణుల అద్భుత నృత్యం
అద్భుత దృశ్యం! పరమానందం అక్కడ పరవళ్ళు త్రొక్కుతూన్నది. కీర్తనానందంలో అందరూ తన్మయావస్థలో ఉన్నారు. కొందరు నవ్వుతున్నారు, కొందరు విలపిస్తున్నారు, మరికొందరు నృత్యం చేస్తున్నారు. తమను అదుపులో ఉంచుకోలేక పలువురు అప్పుడప్పుడు నేలపై పడిపోతున్నారు. భావోద్వేగంలో వారు ఉన్మత్తులలా ప్రవర్తిస్తున్నారు. ఆ భగవదోన్మత్త జనానీకం మధ్య శ్రీరామకృష్ణులు లయకు తగినట్లు నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తూ ఆయన ముందుకు అడుగులు వేస్తూవుంటే, సమ్మోహితులైన భక్తులు ఆయన ధారాళంగా కదలడానికి దారి ఇస్తున్నారు. శ్రీరామకృష్ణుల ప్రతి అవయవంలోను అసాధారణ కోమలత్వం, మాధుర్యం, సింహబలం కానవస్తోంది. అద్భుత నృత్యం! ఆ నృత్యంలో ఎలాంటి కృత్రిమత్వం, అసహజ హావభావాలు, విన్యాసాలు లేవు; అదుపు తప్పడం కూడా కానరాలేదు. మరోవైపు అనుగ్రహం, పరమానందం వెదజల్లుతూన్న అంగభంగిమలు. అంతరంగంలో శ్రీరామకృష్ణులు అనుభవిస్తూన్న పరమానందానికి బాహ్య అభివ్యక్తీకరణే ఆ నృత్యం! అలా నృత్యం చేస్తూ చేస్తూ ఒక్కోసారి ఆయన బాహ్యస్మృతిని కోల్పోతున్నారు, మరో సమయంలో ఆయన పైబట్ట జారిపోగా భక్తులు చటుక్కున దాన్ని ఆయన నడుం చుట్టూ గట్టిగా బిగదీసి కడుతున్నారు. మళ్ళీ కొందరు ఆధ్యాత్మిక భావోద్వేగ కారణంగా బాహ్యస్మృతి కోల్పోవడం చూసి ఆయన వారి ఛాతీని స్పృశించి, మళ్ళీ వారిని మామూలు స్థితికి తీసుకొస్తున్నారు. ఆయనలో నుండి ఉత్పన్నమయ్యే దేదీప్యమానమైన దివ్యానంద ప్రవాహం అన్ని వైపులా పరివ్యాపిస్తూ, భక్తులు భగవంతుణ్ణి ముఖాముఖీ చూసేలా చేస్తున్నది. మందకొడి భక్తులలో కూడ ఆ దివ్యానందం ఆధ్యాత్మిక భావోద్వేగాన్ని తీవ్రతరం చేస్తున్నది; సోమరిపోతుల మనస్సులను ఉత్సాహంతో ఆధ్యాత్మిక జగత్తు వైపుకు ఉరకలు వేయిస్తున్నది; సంసారం పట్ల పరమానురక్తి గల వ్యక్తులలో, తాత్కాలికంగా ఆ అనురక్తిని పూర్తిగా మటుమాయం చేస్తున్నది. ఆయనలో వెల్లువై ప్రవహించే దివ్య భావోద్వేగం అందరినీ ముంచెత్తివేస్తున్నది. ఆయన పావనత్వంతో వికసించిన వారి మనస్సులు తెలియరాని ఉన్నత ఆధ్యాత్మిక భూమిని అధిరోహించాయి. అటువంటి సమయంలో సాధారణ బ్రహ్మసమాజ ఆచార్యుడైన విజయకృష్ణ గోస్వామి అప్పుడప్పుడు సమాధ్యావస్థలోకి పోతూవస్తున్నాడని చెప్పనవసరం లేదు! బ్రహ్మసమాజ భక్తులు పలువురు కూడా అదే స్థితిలో ఉన్నారు. పైగా ‘నృత్యం చేయండి ఓ పిల్లల్లారా, ఆనందమయి జగజ్జనని గురించి, పదేపదే’ అనే గీతాన్ని, సంగీతానికి లయబద్ధంగా చిరంజీవి శర్మ ఆలాపిస్తూ ఆ భావనలో లీనమైపోయి ఆత్మానుభూతి పొందాడు. తదనంతరం రెండు గంటలసేపు కీర్తనానందంలో గడిచిపోయింది. పిదప ఈ క్రింది పాట పాడారు :
దక్షిణేశ్వర కాళికాలయ ప్రాంగణంలో శ్రీరామకృష్ణుల గది.(ఇక్కడ ఆయన 14 సం ॥ నివసించారు)
నితాయ్, హరి నామానికి అంత మాధుర్యం తెచ్చింది ఎవరో
నితాయా లేక గౌరా లేక శాంతిపూర్ అద్వైతుడా?
హరినామ మధువును గ్రోలు, ఓ మనసా, గ్రోలి ఉన్మత్తం చెందు
నేలమీద పొర్లుతూ ‘నాకు శరణాగతి కల్పించు’ అని హరి నామాన్ని
ఉచ్చరిస్తూ విలపించు
హరినామంతో ఆకాశాన్ని నింపివేయి, రెండు చేతులూ
పైకెత్తి నృత్యంచేస్తూ హరినామం గానంచేయి,
ప్రతిఫలరహితంగా హరినామాన్ని ఇంటింటా ప్రచారం గావించు.
హరి భక్త్యానందంలో రోజురోజుకు ఉల్లాసంగా కొట్టుకుపో
హరి నామాన్ని గానం చేయి, నీ జీవిత కాల పర్యంతం,
భక్త్యానందంలో ఉన్మత్తుడవై సమస్త నిమ్నకాంక్షలను ధ్వంసం
గావించు!
ఆ అద్భుత కీర్తన ఉత్పన్నం చేసిన భావోద్వేగ తరంగాలు నెమ్మదిగా ఉపశమించాయి. తరువాత భక్తిమార్గ గురువులకూ, మత సంప్రదాయాలకూ ప్రణామాలు అర్పించారు.
కీర్తన ముగిసి, అంతా కూర్చున్న తరువాత శ్రీరామకృష్ణులు, ఆచార్య నరేంద్రనాథ్ ఛటోపాధ్యాయను “ఓ మనసా! ప్రాణికోటి సారమైన హరినామామృతాన్ని గ్రోలి ఉన్మత్తత పొందు” అనే గీతాన్ని పాడమన్నారని, మాకు గుర్తుంది. వెంటనే అతడు సమధికోత్సాహంతో మృదుమధురంగా ఆ గీతాన్ని రెండు మూడు సార్లు పాడాడు. అందరి మనస్సులు మళ్ళీ సంతోషభరితమయ్యాయి.
తదనంతరం శ్రీరామకృష్ణులు అక్కడ హాజరైన అందరికీ వివిధ ఉపదేశాలు ఇవ్వసాగారు. మనస్సును రూపరసాది విషయాల నుండి ఉపసంహరించి, దానిని భగవదర్పితం చేస్తే జీవుడు కచ్చితంగా పరమశాంతిని పొందుతాడని ఆయన ఉపదేశించారు. ఆ చావడి తూర్పు భాగంలో తెర వెనుక కూర్చునివున్న భక్తురాండ్రు, శ్రీరామకృష్ణులను ఆధ్యాత్మిక విషయాల గురించి అనేక ప్రశ్నలు అడిగారు; అందుకు ఆయన ఇచ్చిన జవాబులు విని వారెంతో ఆనందించారు. అలా వారి ప్రశ్నలకు జవాబులిస్తూ మధ్యమధ్యలో రాంప్రసాద్, కమలాకాంత మొదలైన భక్తసాధకులు జగజ్జననిపై రచించిన కొన్ని పాటలను శ్రీరామకృష్ణులు పాడారు. ఆ అంశం వారి హృదయాలను ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పాటలు పాడారు. ఆయన పాడిన పాటలలో, ఈ క్రింది ఐదు పాటలు మాకు స్పష్టంగా గుర్తున్నాయి :
- నల్లనిదౌ నా మానస మధుపము
ఉల్లాసంబుగ లాగివేయబడె
తల్లి శ్యామ పద నీరజనమునకు
ఉల్లము రంజిలచేయు విధమున. - శ్యామ పద అంబరాన ఎంతో ఎత్తున ఈ మానస గాలిపటం
ఎగురుతోంది. - ఇదంతా ఆ ఉన్మత్త స్త్రీ (జగజ్జనని) లీలయే.
- పాపం ఆ మనస్సు తప్పేమిటి? అతడి నెందుకు తప్పుగా దోషని
నిర్ణయిస్తావు? - ఓ తల్లీ, నేను పూర్తిగా మెలకువతో ఉన్నప్పుడు నా ఇంట్లో
దొంగతనం జరిగినందుకు మాత్రమే నేను విచారిస్తున్నాను, ఓ జననీ
నువ్వు నాకు కావలిగా ఉన్నావు.
6. విజయకృష్ణ గోస్వామితో శ్రీరామకృష్ణుల హాస్యోక్తులు
శ్రీరామకృష్ణులు జగజ్జనని గురించి అలా పాడుతూన్నప్పుడు, విజయకృష్ణ గోస్వామి కొద్దిమంది భక్తులతో మరోగదిలోకి వెళ్ళి వారికి తులసీదాస్ విరచిత ‘రామచరిత మానస్’ చదివి, వివరించసాగాడు. ఇంతలో ప్రార్థన సమయం కావడంతో, చావడిలోకి వచ్చి, ప్రార్థన ప్రారంభించడానికి ముందు, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు. విజయ్ను చూడగానే శ్రీరామకృష్ణులు హాస్యంగా “ఈ మధ్య సంకీర్తనలో విజయ్ ఎంతో ఆనందిస్తున్నాడు. కాని అతడు నృత్యం చేస్తున్నప్పుడు కప్పు విరిగి మీద పడుతుందేమోనని భయం నన్ను ఆవరిస్తోంది!” అని చమత్కరించారు (అంతా నవ్వారు). “అవును, అటువంటి సంఘటన మా ప్రాంతాలలో నిజంగానే జరిగింది. ఇంటి రెండవ అంతస్తును కలపతో, మట్టితో నిర్మిస్తారు. ఒక గోస్వామి తన శిష్యులలో ఒకరి ఇంటికి వెళ్ళి, మొదటి అంతస్తులో కీర్తన ప్రారంభించాడు. కీర్తన రసపట్టులో ఉండగా, నృత్యం మొదలైంది. ఆ గోస్వామి నీ మాదిరి (విజయ్ను చూస్తూ) కాస్త స్థూలకాయుడు. అతడు కాసేపు నృత్యం చేయగానే కప్పు విరిగి, గోస్వామి దభీమని నేలమీద పడిపోయాడు! అందుకే నీ నృత్యం అటువంటి దారుణ పరిణామానికి దారితీస్తుందనే నా భయం” అని వివరించారు (అంతా నవ్వారు). విజయ్ కాషాయాంబరాలు ధరించి ఉండడం చూసి శ్రీరామకృష్ణులు “ఈ మధ్యకాలంలో ఇతడు కాషాయం రంగును ఎంతో ఇష్టపడుతున్నాడు. జనం పైన, క్రింద ధరించే వస్త్రాలకు కాషాయం అద్దకం చేసుకోవడం కద్దు. కాని విజయ్ తన వస్త్రాలను, ఉత్తరీయాన్ని, చొక్కాను, కాన్వాసు పాదరక్షలను సైతం కాషాయంలోకి మార్చుకొన్నాడు. మంచిది. అలా చేయాలనుకొనే ఒక స్థితి వస్తుంది; కాషాయం కాని ఏ వస్త్రాన్నీ వారు ధరించ ఇష్టపడరు. కాషాయం పరిత్యాగానికి గుర్తు; అంటే భగవత్సాక్షాత్కారార్థం సమస్తం త్యజించే వ్రతం పాటిస్తున్నానని సాధకునికి కాషాయం గుర్తుచేస్తూ ఉంటుంది” అని కాషాయాంబర ధారుల గురించి చెప్పారు. విజయ్, శ్రీరామకృష్ణులకు ప్రణామం చేశాడు; “శాంతి, పరిపూర్ణ శాంతి లభిస్తుంది గాక!” అనే అనుగ్రహ వచనాలతో శ్రీరామకృష్ణులు అతణ్ణి ఆశీర్వదించారు.
విజయకృష్ణ గోస్వామి (1841-1899), బ్రహ్మ సమాజ నాయకుడు.
7. భక్తుల పట్ల శ్రీరామకృష్ణుల అవ్యాజ అనురాగం
శ్రీరామకృష్ణులు జగజ్జననిపై పాటలు పాడుతూన్నప్పుడు మరొక సంఘటన జరిగింది. ఆయన సదా అంతర్ముఖావస్థలో నెలకొని ఉంటూవున్నప్పటికీ ఆయన పరిశీలనాశక్తి ఎంత సునిశితమైనదో పై సంఘటన ఋజువు పరుస్తుంది. ఆయన పాడుతున్నప్పుడు బాబూరాం ముఖం వైపు చూడడం తటస్థించింది; బాబూరాం ఆకలి దప్పులతో బాధపడుతున్నాడని ఆయన చప్పున గ్రహించారు. తాము తినకుండా అతడు ఏమీ పుచ్చుకోడని ఆయనకు బాగా తెలుసు. అందువలన శ్రీరామకృష్ణులు తీపి భక్ష్యాలు తెప్పించుకొని కాస్త తిని, మిగిలిన దానిలో అధిక భాగం బాబూరాంకు, తక్కింది భక్తులకు ఇచ్చారు.
కొంతసేపయ్యాక విజయ్ శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి, సాయంత్ర ప్రార్థనకై క్రిందికి దిగివచ్చాడు. శ్రీరామకృష్ణులను రాత్రి భోజనానికై లోపలి గదిలోకి తోడ్కొని వెళ్ళారు. అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటింది. ఈ లోపు మేం ప్రార్థనలో పాల్గొనడానికి క్రిందికి దిగి వచ్చాం. బ్రహ్మసమాజ భక్తులు ప్రాంగణంలో సమావేశమై ఉండడం చూశాం; ఆచార్యుడైన విజయ్ వేదిక నలంకరించాడు. ఆచార్యుణ్ణి అనుసరిస్తూ, వారంతా ‘బ్రహ్మ సత్యం, జ్ఞాన మనంతం’ అనే వేదపాఠం లయయుక్తంగా గానం చేయసాగారు. ప్రార్థన మొదలైంది. కొంతసేపటికి శ్రీరామకృష్ణులు అక్కడకు వచ్చి, ఆసనంపై కూర్చుని ప్రార్థనలో పాల్గొన్నారు. పది పదిహేను నిమిషాలు నిశ్చలంగా కూర్చుని, తరువాత నేలను స్పృశించి ప్రణమిల్లారు. అప్పుడు సమయం పది గంటలు దాటింది. దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళడానికి బండిని ఏర్పాటు చేయమన్నారు శ్రీరామకృష్ణులు. ఆయన చొక్కా వేసుకొని, చలిగాలి చెవులలోకి పోకుండా టోపీ ధరించారు. బండి రాగానే మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళి బండిలో కూర్చున్నారు. బాబూరాం తదితరులు ఆయనను అనుసరించారు. ఆచార్య విజయ్ వేదిక నుండి బ్రహ్మసమాజ భక్తులను సంబోధిస్తూ, ఉపదేశాలిస్తున్నాడు. మేం కూడా ఇళ్ళకు బయలుదేరాం.
8. మణి మల్లిక్ కుటుంబం ఒక భక్త కుటుంబం
బ్రహ్మసమాజ భక్తుల సాంగత్యంలో శ్రీరామకృష్ణులు ఎలా ఆనందించారో ఆ సందర్భంలో మేం కళ్ళారా చూశాం. మణిబాబు మంత్రదీక్ష పుచ్చుకొన్న పరిపూర్ణ బ్రహ్మసమాజ భక్తుడో కాదో మాకు తెలియదు. కాని అతడి కుటుంబంలోని యావన్మందీ బ్రహ్మసమాజ మతాన్ని పాటిస్తూ, సమాజం విధించిన నిత్యప్రార్థనలు తు.చ. తప్పక చేస్తారని మాకు తెలియవచ్చింది. ఆ కుటుంబంలోని ఒక స్త్రీ ప్రార్థనా సమయంలో మనస్సును ఏకాగ్రం చేయలేకపోవడం శ్రీరామకృష్ణులకు తెలియవచ్చింది. “ఆ సమయంలో నీ మనస్సుకు ఎవరు జ్ఞాపకం వస్తారు?” అని ఆయన, ఆమెను ఆప్యాయంగా అడిగారు. తన సోదరుని పిల్లవాణ్ణి ఆమె పెంచుకొంటున్నదనీ, ఆమె మనస్సు ప్రార్థన సమయంలో అతణ్ణే జ్ఞాపకం చేసుకొంటున్నదనీ శ్రీరామకృష్ణులు తెలుసుకొన్నారు. ఆ పిల్లవాణ్ణి, బాలకృష్ణుడిగా భావించి సేవించమని ఆమెకు ఉపదేశించారు. ఈ ఉపదేశాన్ని అట్లే ఆచరించి, అనతికాలంలోనే ఆమె భావ సమాధి స్థితిని పొందగలిగింది. ఈ విషయం మరొకచోట (III.1.27) ప్రస్తావించాం. మరొక సందర్భంలో బ్రహ్మసమాజ భక్తుల సాంగత్యంలో శ్రీరామకృష్ణులు దివ్యానందాన్ని అనుభవించడం మేం కళ్ళారా చూశాం. రాబోయే పుటల్లో ఆ సందర్భాన్ని వివరించాం.