1. శ్రీరామకృష్ణుల పట్ల బ్రహ్మసమాజస్థుల భక్తిప్రపత్తులు
బ్రహ్మసమాజ నాయకుడైన కేశవచంద్ర సేన్ శ్రీరామకృష్ణులను కలుసుకొన్న తరువాతే కలకత్తా జనసామాన్యానికి శ్రీరామకృష్ణుల గురించి తెలియవచ్చింది. యోగ్యతకు అగ్రతాంబూలమిచ్చే కేశవసేన్, శ్రీరామకృష్ణులను చూసిన మొదటి రోజు నుండే ఆయన పట్ల అమిత ఆకర్షితుడైనాడని మేం ఇంతకు మునుపే చెప్పి ఉన్నాం. పాశ్చాత్య భావాల, ఆదర్శాలతో స్ఫూర్తి చెందినప్పటికీ కేశవ్ హృదయం భగవంతుని పట్ల భక్తితో పరిపూర్ణమై ఉండేది; తన మటుకు తానే భక్తి అనే అమృతాన్ని గ్రోలి ఆనందించడం అతడికి సాధ్యం కాదు. శ్రీరామకృష్ణుల వచనాలు విరజిమ్మే భక్తి తరంగాలు అతడి జీవన పథంలో మరింత వెలుగును ప్రసారం చేసేకొద్దీ, కేశవ్ బాహాటంగా జనాన్ని శ్రీరామకృష్ణుల పావన సాంగత్య సుధను తనతోబాటు వచ్చి గ్రోలి తరించమని ఉత్సాహంగా ఆహ్వానించసాగాడు. కాబట్టి సులభ సమాచార, సండే మిర్రర్, థీయిస్టిక్ క్వార్టర్లీ రిమ్యా మొదలైన అప్పటి బ్రహ్మసమాజ బెంగాలీ, ఆంగ్ల వార్తాపత్రికలు శ్రీరామకృష్ణుల పావనత్వాన్ని, వచనామృతాన్ని, మహోదార ధార్మిక సిద్ధాంతాలను గురించిన చర్చలతో నిండి ఉండడం చూడవచ్చు. బ్రహ్మసమాజ ప్రార్థనాసభలలో కేశవ్, తదితర బ్రహ్మ సమాజ నాయకులు అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణుల వచనాలను పదేపదే ఉదహరించడం పరిపాటి అయిపోయింది. తీరిక సమయాలలో కొద్దిమంది ఆంతరంగిక సభ్యులతోను, కొన్ని సమయాలలో సభ్యుల బృందంతోను ఆ నాయకులు దక్షిణేశ్వరానికి వెళ్ళి శ్రీరామకృష్ణులతో కొంతసేపు ధార్మిక ప్రసంగాలలో గడిపిరావడం కద్దు.
2. వారితో శ్రీరామకృష్ణుల అనురాగ బాంధవ్యం
ఆ బ్రహ్మసమాజ నాయకులలో కానవచ్చే ఆధ్యాత్మిక దప్పిక, భగవంతుని పట్ల వారికి గల భక్తి చూసి శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించారు; సాధన సంద్రంలో లోతుగా మునిగి, దివ్యజ్ఞానం పొంది తరింప వారిని ప్రోత్సాహ పరచడంలో శ్రీరామకృష్ణులు ఎలాంటి ప్రయత్నలోపం చేయలేదు. వారితో కలిసి భగవత్సంకీర్తనలు, ధార్మిక ప్రసంగాలు చేస్తూ, వాటి నిమిత్తం తరచు కేశవ్ ఇంటికి ఆహ్వానం లేకపోయినప్పటికీ వెళ్ళి పరమానందభరితులయ్యేవారు. ఆ విధంగా శ్రీరామకృష్ణులకు, నిజమైన సత్యాన్వేషకులైన పలువురు బ్రహ్మసమాజస్థులకు మధ్య అత్యంత సన్నిహిత బాంధవ్యం నెలకొనసాగింది. కొన్ని సమయాలలో శ్రీరామకృష్ణులు కేశవ్ ఇంటికే కాక ఇతర బ్రహ్మసమాజస్థుల ఇళ్ళకు కూడా వెళ్ళి వారిని ఆనందపరచి, తరింప చేసేవారు. బ్రహ్మసమాజస్థులైన సిందూరియాపటి వాస్తవ్యుడైన మణిమోహన్ మల్లిక్, మాథఘాస వీథిలోని జయగోపాల్ సేన్, బారానగర్ సింథి వాస్తవ్యుడైన వేణీమాధవ్ పాల్, నందన్బాగన్కు చెందిన కాశీశ్వర్ మిశ్రా ఇళ్ళకు శ్రీరామకృష్ణులు తరచు ఉత్సవ దినాలలో వెళ్ళి వచ్చేవారు. కొన్ని సందర్భాలలో శ్రీరామకృష్ణులు అకస్మాత్తుగా బ్రహ్మసమాజ ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు, కేశవ్ తను ఇస్తున్న ధర్మోపదేశాన్ని అర్ధంతరంగా ముగించి, వేదిక దిగి, స్వయంగా ఆయనను హార్దికంగా ఆహ్వానించేవాడు; ఆయన వచనామృతాన్ని గ్రోలడానికి, ఆయన సంకీర్తనను విని ఆనందంలో తరించిపోవడానికి కేశవ్ తహతహలాడేవాడు.
3. శ్రీరామకృష్ణుల పట్ల బ్రహ్మసమాజస్థులకు గల ప్రగాఢ ఆకర్షణ
తమ భావనాధోరణి, జీవన సరళి గల వ్యక్తులతో ధారాళంగా, నిస్సంకోచంగా మెలగవచ్చు. తమతో ధారాళంగా మెలగుతూ ఆనందిస్తూన్న శ్రీరామకృష్ణులను చూసి బ్రహ్మసమాజస్థులు ఆయనను కూడా తమ మతభావనా ధోరణులున్న వ్యక్తిగా నిర్ణయించుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. అనేక సందర్భాలలో తమ ఆరాధనా వేడుకలలో శ్రీరామకృష్ణులు పాల్గొనడం చూసి శాక్తులు, వైష్ణవులు మొదలైన హైందవ సంప్రదాయస్థులు కూడా ఇదే నిర్ణయానికి రావడంలో విడ్డూరం లేదు. శ్రీరామకృష్ణులు సదా భావముఖంలో సుప్రతిష్ఠితులై ఉన్నందువల్ల ఆయన ఏ సంప్రదాయం లేదా మతశాఖతోనైనా సహజంగా ఇట్టే కలిసిపోయేలా ప్రవర్తించగలరు. ఆ విషయం అప్పుడు ఎవరికి మట్టుకు అవగతమైంది కనుక? శ్రీరామకృష్ణులు బ్రహ్మసమాజస్థుల కీర్తనలలో, ధ్యాన సమావేశాలలో పాల్గొని, వారి భక్తి విధానంతో పరిపూర్ణంగా తాదాత్మ్యం చెందినందు వలన, బ్రహ్మసమాజస్థులు ఆయన మనస్సు నిరాకార బ్రహ్మంలో పూర్తిగా లీనమైపోయిందని భావించారు; అంతేకాక ఆయన తమ కంటే అత్యధికానందాన్ని పొందుతున్నారనీ, ధ్యానంలో తమలా కేవలం అంధకారాన్ని మాత్రమే దర్శించడం లేదనీ, అసాధారణ జ్యోతి దర్శనాన్ని పొందారనీ వారు భావించారు. తమ సమస్తాన్ని భగవదర్పితం చేసి, ఆయనలో శ్రీరామకృష్ణుల్లా లీనం కాకపోతే, అటువంటి పరమానందం, జ్యోతిదర్శనం చవిచూడడం తమకు ఎండమావిగానే మిగిలిపోతుందని బ్రహ్మసమాజస్థులు అనుకోసాగారు.
4. సాధనలో బ్రహ్మసమాజస్థులకు శ్రీరామకృష్ణుల తోడ్పాటు
బ్రహ్మసమాజస్థులలోని సత్యం పట్ల ఆసక్తి, పరిత్యాగం, ఆధ్యాత్మిక తృష్ణ మొదలైన సుగుణాలను చూసి, శ్రీరామకృష్ణులు వారు సాధనామార్గంలో ముందుకు పోవడానికి సహకరించారు. భగవద్భక్తులను, ఏ సంప్రదాయానికి చెందినప్పటికీ శ్రీరామకృష్ణులు వారిని తమకు అత్యంత ఆప్తులుగా పరిగణించేవారు; అంతేగాక ఆధ్యాత్మిక అన్వేషణలో వారికి దోహదపడి, వారు అనుసరించే ఆ పథంలో పరిపూర్ణులను చేయడంలో శ్రీరామకృష్ణులు ఎంతో కృషి చేసేవారు. నిజమైన భక్తులు ఒక ప్రత్యేక కోవకు చెందినవారని శ్రీరామకృష్ణులు సదా చెప్పేవారు. వారితో కలిసి తినడానికీ, త్రాగడానికీ వారెన్నడూ సంకోచించేవారు కాదు. కాబట్టి కేశవ్, అతడి బృందంలోని విజయకృష్ణ గోస్వామి, ప్రతాపచంద్ర మజుందార్, చిరంజీవి శర్మ, శివనాథ్ శాస్త్రి, అమృతలాల్ బోస్ తదితరులను శ్రీరామకృష్ణులు అభిమానించేవారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారితో అంత సన్నిహితంగా మెలగడం వలన, పాశ్చాత్య విద్యాప్రభావం వారిని భారతీయ మతాదర్శానికి సుదూరంగా తీసుకుపోయిందని శ్రీరామకృష్ణులకు అవగతం కావడానికి ఎంతో సమయం పట్టలేదు; పైగా సంఘసంస్కరణనే తమ మతాచరణకు పరాకాష్ఠ అని వారు పరిగణించడం కూడా ఆయన గుర్తించకపోలేదు. కాబట్టి భగవత్సాక్షాత్కారమే జీవిత పరమావధి అని వారిని అంగీకరించేలా చేయడానికి ఆయన ప్రయత్నించారు; వారి సమాజం ఆ మేరకు వారిని అనుసరించకపోయినా ఫరవాలేదన్నారు. తత్ఫలితంగా కేశవ్, అతడి బృందం శ్రీరామకృష్ణులు చూపిన మార్గంలో ఎంతో పురోగమించారు. భగవంతుణ్ణి మధురమైన జగజ్జనని నామంతో సంబోధించే సంప్రదాయం, భగవంతుణ్ణి జగజ్జననిగా ఆరాధించడం బ్రహ్మ సమాజంలో చోటుచేసుకొన్నాయి; శ్రీరామకృష్ణుల భావనలు, ఆదర్శాలు బ్రహ్మ సమాజ సంగీతసాహిత్యాలలో ప్రవేశించి, సమాజాన్ని మధురమయం గావించాయి. అంతే కాదు, శ్రీరామకృష్ణుల జీవితం నుండి ఎంతో నేర్చుకోవలసింది ఉందని సమాజ నాయకులు గ్రహించారు; ఏ ఆదర్శాలు, అనుష్ఠానాలు మూఢ నమ్మకాలని ఎంచి బ్రహ్మసమాజం హిందూమతం నుండి విడివడిందో, వాటిని గురించి పర్యాలోచించవలసింది ఎంతో ఉందని కూడా వారు తెలుసుకొన్నారు.
5. తమకు ఆచరణీయాలైన ఉపదేశాలనే ధారాళంగా స్వీకరించమనడం
పాశ్చాత్య భావాలలో ఊరిపోయిన కేశవ్, అతడి సహచరులు తమ భావనలను, ఉపదేశాలను సరిగా అర్థం చేసుకోలేదని ప్రారంభం నుండే శ్రీరామకృష్ణులు గ్రహించే ఉన్నారు; పైగా వారు అర్థం చేసుకొన్నది కూడా వారికి అంతగా రుచించలేదనీ ఆయనకు తెలుసు. ఈ విషయం జ్ఞప్తిలో ఉంచుకొనే, వారికి ఉపదేశించేటప్పుడు ఆయన తరచు, “నా మనస్సుకు తోచింది మీకు చెప్పాను. దాని ‘తలా తోక’ తీసివేసి మీరు స్వీకరించవచ్చు” అని చెప్పేవారు. అంతేకాక సంఘసంస్కరణ, లౌకిక సుఖభోగాల పట్ల కోర్కె బ్రహ్మసమాజస్థులలో అనేకులకు జీవిత లక్ష్యమనే విషయం గ్రహించడానికి ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. ఈ విషయం గురించి అనేక సందర్భాలలో పరిహాసపూర్వకంగా ఈ క్రింది విధంగా చెప్పేవారు.
6. శ్రీరామకృష్ణులు హాస్యోక్తుల ద్వారా బోధిస్తారు
“వారి ఉపాసనను తిలకించడానికి కేశవ్ ఇంటికి వెళ్ళాను. భగవంతుని దివ్యశక్తులను చాలాసేపు స్తుతించిన తరువాత, పురోహితుడు, ‘భగవంతుణ్ణి ఇక ధ్యానిద్దాం’ అని అన్నాడు. వాళ్ళు ఎంతసేపు ధ్యానం చేస్తారో అని ఆశ్చర్యపోయాను. కాని, రెండు నిమిషాలు కళ్ళు మూసుకొన్నారోలేదో ధ్యానం పూర్తయి పోయింది! ఆ విధంగా ధ్యానించి భగవంతుణ్ణి సాక్షాత్కరించు కోగలరా? ధ్యానం చేస్తున్నప్పుడు వారందరి ముఖాలను పరిశీలించి చూశాను. ఆ తరువాత కేశవ్‌తో ఇలా చెప్పాను : ‘ధ్యానిస్తున్నప్పుడు మీ అందరినీ చూశాను. అప్పుడు నాకు ఏమనిపించిందో మీకు తెలుసా? దక్షిణేశ్వరంలో చెట్ల మీద ఒక్కొక్కప్పుడు కోతులు గుంపులుగా, అమాయకంగా పెద్దమనుషులలా కూర్చునివుంటాయి. కాని అవి అంత అమాయకమైనవేం కావు; అవి అలా కూర్చుని ఏ ఇంటి కప్పుల మీద సొరకాయలు, గుమ్మడికాయలు ఉన్నాయో అనీ లేదా ఏ తోటలలో అరటి గెలలు లభిస్తాయో అనీ ఆలోచిస్తూ ఉంటాయి. కాసేపట్లో గావుకేకలేస్తూ చెట్ల నుండి తోటలోకి దూకి పళ్ళను, కాయగూరలను కడుపార మెక్కుతాయి. అనేకులు ఆ తీరులో ధ్యానం చేయడం నేను చూశాను.’ నా మాటలు విని వారంతా నవ్వుకున్నారు” అని చెప్పారు.
శ్రీరామకృష్ణులు మాకు కూడా ఆ విధంగా హాస్యోక్తులతో బోధించేవారు. ఒక రోజు నరేంద్రుడు ఆయన ముందు భక్తి గీతాలు ఆలాపించడం మాకు గుర్తుంది. ఆ రోజులలో నరేంద్రుడు తరచు బ్రహ్మసమాజానికి వెళ్ళి అక్కడ ధ్యానం, ప్రార్థనలు రెండు పూటలా చేసేవాడు. భక్తితో, ఏకాగ్రతతో అతడు బ్రహ్మం గురించిన, ‘ఆ కళంకరహిత పురుషునిపై నీ మనస్సును కేంద్రీకరించు’ అనే పాటను పాడసాగాడు. ఆ పాటలో, ‘సదా ఆయనను ఆరాధించు, ఆయన సాక్షాత్కారానికై సదా పాటుపడు’ అనే ఒక చరణం ఉంది. స్వామీజీ మనస్సులో ఈ మాటలు నాటుకుపోయేటట్లు చేయాలని హఠాత్తుగా శ్రీరామకృష్ణులు, “కాదు, కాదు. ‘ఆయనను రోజుకు రెండుసార్లు ఆరాధించు, ప్రార్థించు’ అని చెప్పు. నువ్వు ఆచరించని దానిని పదేపదే ఎందుకు వ్యర్థంగా పలుకుతావు?” అని అన్నారు. అంతా పెద్దగా నవ్వారు. నరేంద్రుడు చిన్నబుచ్చుకొన్నాడు.
7. కేవలం భగవంతుని శక్తులను వర్ణించినంత మాత్రాన ఆయనను తెలుసుకోలేం
ఆరాధన గురించి మరో సందర్భంలో కేశవ్, తదితర బ్రహ్మసమాజస్థులకు శ్రీరామకృష్ణులు ఇలా చెప్పారు : “ఆయన శక్తులను ఎందుకు అంతగా మీరు వర్ణిస్తారు? తండ్రి ముందు పిల్లవాడు కూర్చుని, ‘నా తండ్రికి ఎన్ని ఇళ్ళున్నాయి, ఎన్ని గుఱ్ఱాలున్నాయి, ఎన్ని ఆవులున్నాయి, ఎన్ని తోటలున్నాయి’ అని ఆలోచిస్తాడా? లేదా తండ్రి తన పట్ల ఎంత ప్రేమగా ఉంటున్నాడో, తనను ఎంత ఆప్యాయంగా చూసుకొంటున్నాడో అని ఆలోచిస్తాడా? తండ్రి తన పిల్లవాడికి తిండి, బట్ట లోటులేకుండా చూస్తాడు; అయితే ఏమిటి? మనం, నిజానికి ఆయన బిడ్డలం, అవన్నీ ఆయన మనకు సమకూరుస్తే, దానిని గురించి ఎందుకింత ఆర్భాటం? అలా ఆలోచించడానికి బదులుగా నిజమైన భక్తుడు ప్రేమతో ఆయనను తన సొంతం చేసుకోవాలి; తన ప్రార్థనలను ఈడేర్చమని, ఆయన దర్శన ప్రాప్తి కలిగించమని వేధించాలి, సాధికారంతో అడగాలి. ఆయన శక్తుల గురించి ఆలోచించేకొద్దీ, తన ప్రార్థనలను ఈడేర్చమని సాధికారంతో అడగలేరు. ఆయన ఘనత గురించిన ఆలోచనే, ఆయనకూ భక్తుడికీ మధ్య ఎంతో అంతరాన్ని కల్పిస్తుంది. నీ సొంత మనిషిగా ఆయనను భావించు. అటువంటప్పుడు మాత్రమే ఆయన సాక్షాత్కారం లభిస్తుంది” అని భగవంతుని ఎలా ప్రార్థించాలో చెప్పారు.
8. ‘భగవంతుని స్వభావానికి పరిమితిని నిర్ణయించకండి’
భగవత్సాక్షాత్కారార్థం సమస్తం త్యజిస్తూ, అందుకై గట్టిగా శ్రమించడం నేర్చుకొంటూ, కేశవ్ తదితర బ్రహ్మ సమాజస్థులు శ్రీరామకృష్ణుల నుండి మరింత నేర్చుకోసాగారు. పాశ్చాత్య మతప్రచారకుల నుండి, ఆంగ్ల పుస్తకాల నుండి భగవంతుడు ఎన్నడూ సాకారుడు కాడని వాళ్ళు తెలుసుకొన్నారు. కాబట్టి భగవంతుడు విగ్రహాలలో నెలకొని ఉన్నాడని విశ్వసిస్తూ, విగ్రహారాధన చేయడం వారి దృష్టిలో మహాపాపం. “ఆకారం లేని నీరు శీతలం కారణంగా ఘనీభవించి రూపం పొందే విధంగా, నిరాకారమైన సచ్చిదానందం భక్తి కారణంగా ఘనీభవించి విభిన్న రూపాలను దాలుస్తుంది”. “బొమ్మ సీతాఫలాన్ని చూస్తే నిజమైన సీతాఫలం జ్ఞాపకం వచ్చేటట్లు; విగ్రహం వైపుకు తిరగగానే, భగవంతుని యథార్థ నైజం తెలియవస్తుంది” – ఇటువంటి శ్రీరామకృష్ణుల ఉక్తులు వారి మనస్సులపై ప్రభావం కలిగించాయి; దాంతో వారు తాము తర్కరహితమైనదనీ, తిరస్కారయుతమైనదనీ పేర్కొనే ‘విగ్రహారాధన’ గురించి మరింత పర్యాలోచన చేయవలసిన అవసరం ఎంతో ఉందని గ్రహించారు. బ్రహ్మం, దాని శక్తి (ఈ విశ్వం ఆ శక్తి యొక్క అభివ్యక్తీకరణే), అగ్ని, దాని దాహకశక్తిలా అభిన్నమైనవని శ్రీరామకృష్ణులు ఋజువు చేసిన నాటి నుండి కేశవ్, తదితర బ్రహ్మసమాజస్థులు సాకార భగవదారాధనను సరిక్రొత్త వెలుగులో చూడసాగారనడంలో ఎలాంటి సందేహానికీ తావులేదు. భగవంతుడు నిరాకారుడు కాని సగుణుడు అని తర్కించడం ఎంత పొరపాటో; భగవంతుడు సాకారుడేకాని నిర్గుణుడని వాదించడమూ అంతే పొరపాటని వారిప్పుడు గ్రహించగలిగారు. ఎందుకంటే రూపం, గుణం రెండూ ఏకకాలంలో ఉంటాయి కదా! అంటే దేనికైనా ఒకటి ఉందని అంగీకరిస్తే, రెండవది కూడా ఉన్నట్లే. ఆయన అభివ్యక్తీకరణయే వివిధ రూపాలు గల ఈ విశ్వం, ఆయనను సాకారునిగా అభివ్యక్తం చేస్తుంది; నిరాకార సగుణ బ్రహ్మంగా ఈ విశ్వాన్ని నియంత్రిస్తాడు; గుణాలకు అతీతుడైనప్పుడు నామరూపాదుల సమస్త అభివ్యక్తీకరణలకు శాశ్వత అంతర పొరగా ఆయన వ్యవహరిస్తాడు. “భగవంతుని నైజానికి పరిమితిని నిర్ణయించ కూడదు. ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా; సగుణుడు, నిర్గుణుడు కూడా. అవే కాక ఇంకా ఏమేమిగా ఉన్నాడో ఎవరి కెరుక” అన్న శ్రీరామకృష్ణుల సామాన్య సూక్తిలోని గూఢార్థాన్ని విని కేశవాదులు నాడు విస్మితులయ్యారు.
9. భారతదేశ బ్రహ్మసమాజంలో వచ్చిన మార్పు
1875 వ సంవత్సరంలో కేశవ్, శ్రీరామకృష్ణులను కలుసుకొన్న దాదాపు మూడు సంవత్సరాల తరువాత బ్రహ్మసమాజం కేశవ్ సమర్థ నేతృత్వంలో పాశ్చాత్య భావనల, ఆదర్శాల పట్టును బాగా సడలించుకొని, క్రొత్త రూపాన్ని సంతరించుకో సాగింది. ఆధ్యాత్మిక సాధనల పట్ల అభిమానం పెరగడం ఈ క్రొత్త పరిణామంలోని ఒక ప్రధానాంశం; ఈ అంశం సత్వరమే జనాకర్షణను పొందిందనడంలో అతిశయోక్తి లేదు. తదనంతరం, 1878 వ సం ॥ మార్చ్ 6 వ తేదీ కేశవ్ తన కుమార్తెను, కూఛ్బిహార్ రాజకుమారునికిచ్చి వివాహం చేశాడు. బ్రహ్మసమాజం నిర్ణయించిన వివాహయోగ్యమైన వధువు వయస్సు కంటే, కేశవ్ కుమార్తె వయస్సు కాస్త చిన్నదవడం వలన సమాజంలో ఈ వివాహం విమర్శా దుమారాన్ని లేవదీసింది; సంఘ సంస్కరణల విషయంలో పాశ్చాత్యాన్ని గుడ్డిగా అనుకరించడంలో మహోత్సాహం చూపే ఈ సమాజం, తత్ఫలితంగా రెండుగా, భారతదేశ బ్రహ్మ సమాజంగానూ, సాధారణ బ్రహ్మసమాజంగానూ విడిపోయింది. కాని ఈ సంఘటన వలన బ్రహ్మసమాజం మీద శ్రీరామకృష్ణుల ప్రాబల్యం చెక్కుచెదరలేదు. ఆయన ఆ రెండు వర్గాలనూ అభిమానించారు; ఆ రెండు వర్గాలలోని నిజమైన సత్యాన్వేషకులు ఇంతకు మునుపులా ఆయన వద్దకు వచ్చి, ఆధ్యాత్మికపరమైన తోడ్పాటు ఎప్పటిలానే పొందసాగారు.
10. కేశవ్ స్థాపించిన ‘నవవిధాన్’ లో శ్రీరామకృష్ణుల ఉపదేశాలను పాక్షికంగా ఆమోదించడం
ఈ సంఘటనానంతరం భారతదేశ బ్రహ్మసమాజ నాయకుడైన కేశవ చంద్రసేన్, శ్రీరామకృష్ణుల అనుగ్రహంతో తన సాధనాపథంలోను, ఆధ్యాత్మిక జీవితంలోను శరవేగంతో పురోగమించాడు. నైవేద్యాదులు అర్పించడం, పవిత్ర జలాలలో స్నానం ఆచరించడం, శిరోముండనం చేయించుకోవడం, కాషాయాంబరాలు ధరించడం వంటివి చేయడం వలన మనస్సు ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నత భూములకు అధిరోహిస్తుందని కేశవ్ విశ్వసించసాగాడు, దాదాపు వాటిని స్వయంగా తాను పాటించాడు కూడా. గౌరాంగుడు, ఏసుక్రీస్తు మొదలైన మహా పురుషులు వివిధ ఆధ్యాత్మిక భావాలకు మూర్తిమత్వాలుగా జ్యోతిర్మయ దేహాలతో విరాజిల్లుతున్నారనే ప్రగాఢ విశ్వాసాన్ని పెంపొందించుకొంటూ వారి ఆధ్యాత్మిక లక్షణాలను సరిగా గ్రహించడానికి అప్పుడప్పుడు వారిని ప్రగాఢంగా ధ్యానిస్తూ రాసాగాడు. శ్రీరామకృష్ణులు ఒక ప్రత్యేక సంప్రదాయ సాధనను అనుష్ఠిస్తున్నప్పుడు, ఆ సంప్రదాయస్థులు ధరించే చిహ్నాలను తామూ ధరించేవారు. ఈ విషయం ఆయన నుండి వినడం వలన పైన పేర్కొన్న సాధనలను ఆయన అనుష్ఠించారని చెప్పడం అవసరంలేదు. పైన పేర్కొన్న సాధనానుష్ఠానాల సహాయంతో కేశవ్, శ్రీరామకృష్ణులు క్రొత్తగా ఆవిష్కరించిన “మతాలెన్నో మార్గాలన్ని” అనే మహాసత్యాన్ని అవగతం చేసుకోవడానికి ప్రయత్నించాడు. తత్ఫలితంగా కూఛ్బిహార్ వివాహం జరిగిన రెండు సంవత్సరాల లోపే కేశవ్ ‘నవవిధాన్’ స్థాపించి, ఆ వేదిక ద్వారా తాను గ్రహించిన మేరకు ఆ మహాసత్యాన్ని లోకులకు ప్రచారం చేశాడు. శ్రీరామకృష్ణుల పట్ల ఎంత భక్తివిశ్వాసాలు కేశవ్‌కు ఉండేవో మేం మాటలలో వ్యక్తం చేయలేం. దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించి, ఆయన పాదధూళి స్వీకరించి పదేపదే ‘నవవిధాన్కు జయం’ అంటూ నినదించడం మాలో అనేకులం చూసివున్నాం. ‘నవవిధాన్’ సిద్ధాంతాల ప్రచారం ప్రారంభించిన నాలుగేళ్ళకే అతడు కాలధర్మం చెందకుంటే, అతడి ఆధ్యాత్మిక జీవితం ఏ మేరకు పురోగమించి ఉండేదో ఎవరు చెప్పగలరు?
11. కేశవ్ పట్ల శ్రీరామకృష్ణుల ప్రగాఢ ప్రేమాభిమానాలు
కేశవ్‌ను, శ్రీరామకృష్ణులు అత్యంత ఆప్తునిగా పరిగణించేవారు. ఒక సందర్భంలో కేశవ్ జబ్బుపడ్డాడని వినగానే, కేశవ్‌కు నయంకావాలని ప్రార్థిస్తూ, జగజ్జననికి కొబ్బరి బొండాం, చక్కెర సమర్పిస్తానని శ్రీరామకృష్ణులు మొక్కుకొన్నారు. అతణ్ణి చూడడానికి వెళ్ళి, ఎంతో బలహీనంగా ఉన్న కేశవ్‌ను చూసి శ్రీరామకృష్ణులు కంట తడిపెట్టుకొన్నారు. అప్పుడు అతడితో “తోటమాలి కొన్ని సందర్భాలలో గులాబి మొక్క కొమ్మలను మాత్రమే కత్తిరించడు; మొక్క వ్రేళ్ళను పెకలించి సూర్యరశ్మి, మంచు ఆ వ్రేళ్ళమీద పడేటట్లు చేస్తాడు; అప్పుడు ఆ గులాబిమొక్క చక్కని పెద్ద పువ్వులను పూస్తుంది. ఆ ఉద్దేశం నిమిత్తమే తోటమాలి నీ దేహానికి ఈ స్థితి కల్పించాడు” అని అన్నారు. 1884 వ సం ॥ కేశవచంద్రసేన్ మరణవార్త వినగానే శ్రీరామకృష్ణులు దుఃఖసాగరంలో మునిగిపోయి మూడు రోజులపాటు మంచం మీద నుండి లేవలేదు, ఎవరితోను మాట్లాడనూ లేదు. ఆ తరువాత ఆయన, “కేశవ్ మరణ వార్త వినగానే, నా అవయవాలలో ఒకటి పక్షవాతంతో పడిపోయినట్లు అనిపించింది” అని అన్నారు. కేశవ్ కుటుంబంలో ఆడ, మగ యావన్మందీ శ్రీరామకృష్ణుల పట్ల ఎంతో భక్తిప్రపత్తులు ప్రదర్శించేవారు. కొన్ని సందర్భాలలో వారు శ్రీరామకృష్ణులను ‘కమల్ కుటీర్’ అనే తమ గృహానికి తోడ్కొని వెళ్ళేవారు; మరికొన్ని సమయాలలో ఆయన ముఖతా ఆధ్యాత్మిక ఉపదేశాలు వినడానికి దక్షిణేశ్వరానికి స్వయంగా వచ్చేవారు. కేశవ్ జీవించి ఉన్నంత వరకు ‘నవవిధాన్’ బ్రహ్మసమాజస్థులకు అనివార్యమైన మాఘమాస ఉత్సవాలలో కనీసం ఒక రోజు శ్రీరామకృష్ణుల పావన సాంగత్యంలో, కీర్తనానందంలో వారు గడిపేవారు. పైగా అప్పుడప్పుడు కేశవ్ తన బృందంతో నౌకలో దక్షిణేశ్వరానికి వచ్చి శ్రీరామకృష్ణులను నౌకావిహారానికి తోడ్కొని వెళ్ళేవాడు. నౌకలో శ్రీరామకృష్ణుల సంకీర్తనలతో, పావన ప్రసంగాలతో కేశవ్ బృందం యావత్తు తన్మయులైపోవడం కద్దు.
12. విజయకృష్ణ గోస్వామిపై శ్రీరామకృష్ణుల ప్రభావం
కూఛ్బిహార్ వివాహానంతరం రెండుగా విడిపోయిన బ్రహ్మసమాజంలోని, సాధారణ బ్రహ్మసమాజానికి విజయకృష్ణ గోస్వామి, శివనాథశాస్త్రి ఆచార్యులైనారు. సత్యనిష్ఠ, సాధన పట్ల ఆసక్తిగల విజయకృష్ణ గోస్వామి, కేశవ్‌కు ఎంతో ప్రియమైన వ్యక్తి. శ్రీరామకృష్ణులను కలుసుకొన్న తదనంతరం, కేశవ్సేన్లా, విజయకృష్ణ గోస్వామిలో కూడా సాధనల పట్ల ఆరాటం అధికమైంది. ఆ మార్గంలో పురోగమించేకొద్దీ, స్వల్ప కాలంలోనే అతడికి వివిధ దివ్యదర్శనాలు కలుగసాగాయి; ఫలితంగా భగవంతుని సాకార అభివ్యక్తీకరణ పట్ల అతడు విశ్వాసం సంతరించుకొన్నాడు. సంస్కృత కళాశాలలో అధ్యయనం చేయడానికి విజయకృష్ణ గోస్వామి మొట్టమొదట కలకత్తాకు సనాతన బ్రాహ్మణునిలా పిలక, జంధ్యంతో వచ్చాడు. బ్రహ్మసమాజంలో చేరిన తరువాత ఒక రోజు బ్రహ్మసమాజస్థులు భావించే సత్యం పట్లగల మర్యాదను మన్నించి వాటినన్నిటినీ విసర్జించాడు. తనకు గురువువంటి కేశవ్‌ను, అదే సత్యం కారణంగా, కూఛ్బిహార్ వివాహానంతరం బహిష్కరించాడు. మళ్ళీ అదే సత్యం పట్ల గల గౌరవాన్ని పురస్కరించుకొని సాకార భగవంతుని పట్ల తనకు గల విశ్వాసాన్ని దాచుకోలేక, బ్రహ్మసమాజం నుండి వైదొలగాడు. ఈ కారణంగా జీవనాధారం కోల్పోవడంతో కొంతకాలం అతడు కష్టాలు పడవలసివచ్చింది. కాని అందుకై అతడు నిరుత్సాహం చెందలేదు. ఆధ్యాత్మికపరమైన తోడ్పాటును శ్రీరామకృష్ణుల నుండి పొందాననీ, కొన్ని సమయాలలో విచిత్ర రీతులలో ఆయన దివ్యదర్శనాలను పొందాననీ అతడు మాతో ఎన్నోసార్లు చెప్పాడు. కాని అతడు శ్రీరామకృష్ణులను ఉపగురువుగా భావించి గౌరవించాడో లేక మరో విధంగా భావించి ఆదరించాడో మేం చెప్పలేం; ఎందుకంటే, ఒక సందర్భంలో గయలోని ఆకాశగంగ పర్వతం మీద ఒక సాధువు కరుణించి యోగశక్తితో తనకు అకస్మాత్తుగా భావపారవశ్య స్థితిని కలిగించడంతో, అతడు తనకు గురువు అయినాడని విజయ్‌కృష్ణ గోస్వామి చెప్పడం మేం వినివున్నాం. కాని విజయ్‌కు, శ్రీరామకృష్ణులు అంటే ఎంతో ఉన్నతాభిప్రాయం ఉందనడంలో ఎలాటి సందేహమూ లేదు. విజయ్ నుండి స్వయంగా మేం విన్న విషయం ఈ పుస్తకంలో మరొకచోట (IV.5) వివరించాం.
13. అప్పటినుండి సాధనపథంలో ఏ మేరకు విజయ్ పురోగమించాడు?
బ్రహ్మసమాజం నుండి వైదొలగిన తరువాత రోజులు గడిచేకొద్దీ విజయ్ ఆధ్యాత్మిక జీవితం ప్రగాఢతరం కాసాగింది. కీర్తనానందంలో విజయ్‌కృష్ణ గోస్వామి పొందే భావపారవశ్యం, చేసే విశృంఖల నృత్యం చూసి జనం ముగ్ధులయ్యేవారు. అతడి ఆధ్యాత్మిక స్థితిని గురించి స్వయంగా శ్రీరామకృష్ణులు మాతో “ఆధ్యాత్మిక సాక్షాత్కార పరాకాష్ఠకు ప్రక్కనున్న గదిని విజయ్ చేరుకొన్నాడు; ఆ గది తలుపులు తడుతున్నాడు” అని చెప్పివున్నారు. ఆధ్యాత్మిక లోతుపాతులను అనుభూతం చేసుకొన్న తరువాత విజయ్ అనేకులకు మంత్రదీక్ష నొసగాడు. శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందిన పధ్నాలుగు సంవత్సరాల తరువాత విజయకృష్ణ గోస్వామి పూరీలో పరమపదించాడు.
14. కేశవ్, విజయ్‌ల మధ్యనున్న అపార్థాన్ని తొలగించడం
కూఛ్బిహార్ వివాహానంతరం రెండు బ్రహ్మసమాజాలు, అంటే భారతదేశ బ్రహ్మసమాజం, సాధారణ బ్రహ్మసమాజం మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. రెండు సమాజాలవారి మధ్య మాటలు కూడా కరువయ్యాయి. కాని మేం ఇంతకు మునుపే ప్రస్తావించినట్లు రెండు సమాజాలకు చెందిన సభ్యులూ సాధన పట్ల ఆసక్తి ఉన్నవారవడం వలన, మామూలుగా దక్షిణేశ్వరానికి రాసాగారు. ఇలా ఉండగా ఒక రోజు హఠాత్తుగా కేశవ్, విజయ్ తమ ఆంతరంగిక అనుయాయులతో శ్రీరామకృష్ణుల వద్దకు ఒకేసారి రావడం తటస్థించింది. ఒక బృందం దక్షిణేశ్వరానికి వస్తున్నట్లు రెండవ బృందానికి తెలియనందున ఇది జరిగింది. వారందరి ముఖాలలో ఇబ్బంది, చిరాకు ప్రస్ఫుటంగా కానవచ్చాయి. కేశవ్, విజయ్‌ల ముఖాలలో కూడా ఆ ఇబ్బంది ద్యోతకమవడం చూసి శ్రీరామకృష్ణులు, రాజీ చేసే ధోరణిలో ఇలా అన్నారు : “ఇలా చూడండి. ఒకానొకప్పుడు శివుడికి, రాముడికి మధ్య ఒక తగాదా తలెత్తి, వారి మధ్య గొప్పయుద్ధం కూడా జరిగింది. శివుని గురువు రాముడన్న సంగతి, రాముని గురువు శివుడన్న విషయం లోకవిదితమే. అందువలన అనతికాలంలోనే ఆ తగాదా పరిష్కారమైంది. కాని శివుని భూతగణాలకూ, రాముని శిష్యులైన వానరులకూ మధ్య మాత్రం సఖ్యత ఎన్నటికీ కుదరలేదు. భూతగణాలకూ, వానరులకూ మధ్య ఘర్షణ సదా సర్వదా కొనసాగుతూనే వచ్చింది.” పిదప కేశవ్, విజయ్‌లను సంబోధిస్తూ ఆయన “జరిగింది ఏదో జరిగిపోయింది. మీ మధ్య ఇకపై మనస్పర్ధ ఉండకూడదు; అది భూతగణాలకూ, వానరులకూ పరిమితమై ఉండనివ్వండి” అని చెప్పారు. ఈ సంఘటన తరువాత కేశవ్, విజయ్‌లు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.
15. శివనాథ్ దక్షిణేశ్వర సందర్శన మానుకోవడం
తన ప్రత్యక్ష ఆధ్యాత్మిక అనుభూతుల కారణంగా విజయకృష్ణ గోస్వామి సాధారణ బ్రహ్మసమాజాన్ని విడిచిపెట్టిపోగానే, అతడి పట్ల భక్తివిశ్వాసాలున్న వారంతా కూడా సమాజం నుండి వైదొలగారు; పర్యవసానంగా సమాజం తేజోవిహీనమైంది. అప్పుడు శివనాథ్ శాస్త్రి సమాజ నాయకత్వం వహించి, కొంతలో కొంత సమాజాన్ని ఆదుకొన్నాడు. అంతకు ముందు అతడు శ్రీరామకృష్ణులను భక్తిప్రపత్తులతో పలుమార్లు దర్శించి ఉన్నాడు. శ్రీరామకృష్ణులు కూడా శివనాథ్ పట్ల అవ్యాజానురాగాలు చూపేవారు. కాని విజయ్ సమాజం వదిలిపెట్టి పోయిన తరువాత శివనాథ్ పెద్ద చిక్కులో పడ్డాడు. విజయ్ ఆధ్యాత్మికపరమైన అభిప్రాయాలు శ్రీరామకృష్ణుల ప్రభావం వలన మారిపోయాయనీ, అందువల్లే విజయ్ సమాజాన్ని వదలి వెళ్ళాడనీ శివనాథ్ భావించి, శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళడం మానుకొన్నాడు.
నరేంద్రుడు అంతకు కొద్దికాలం క్రితమే సాధారణ బ్రహ్మసమాజంలో చేరాడు; శివనాథ్ తదితరులకు ప్రీతిపాత్రుడయ్యాడు. సాధారణ బ్రహ్మసమాజంలో చేరినప్పటికీ, నరేంద్రుడు అప్పుడప్పుడు కేశవ్ వద్దకు, దక్షిణేశ్వరంలోని శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళివచ్చేవాడు. స్వామి వివేకానంద ఇలా చెప్పారు : “శ్రీరామకృష్ణుల వద్దకు వెళ్ళడం ఎందుకు మానుకొన్నారని అడిగినప్పుడు, శివనాథ శాస్త్రి, ‘తరచు నేను అక్కడకు వెళితే, నన్ను అనుకరించి తక్కిన బ్రహ్మసమాజస్థు లందరు కూడా అక్కడకు పోతారు; ఫలితంగా సమాజం మూతపడుతుంది’ అని జవాబిచ్చాడు.” తనను కూడా దక్షిణేశ్వరానికి వెళ్ళవద్దని శివనాథ్ సలహా ఇచ్చాడని కూడా స్వామీజీ చెప్పారు. అంతేగాక, “శ్రీరామకృష్ణుల భావపారవశ్యం వగైరాలన్నీ నరాల బలహీనత ఫలితాలే; భౌతికపరమైన కఠోర శ్రమ కారణంగానే ఆయనకు మతిచెడింది” అని కూడా శివనాథ్ చెప్పాడట. శ్రీరామకృష్ణులకు ఈ విషయం తెలిసినప్పుడు, ఆయన ఏమన్నారో మరొకచోట (IV.2.30-32) ప్రస్తావించాం.
16. బ్రహ్మసమాజంపై శ్రీరామకృష్ణుల ప్రభావం గురించి ప్రతాపచంద్ర మజుందార్ వెలిబుచ్చిన అభిప్రాయం
ఏది ఏమైనప్పటికీ శ్రీరామకృష్ణుల ప్రభావం వలన సాధనల పట్ల ఆసక్తి బ్రహ్మసమాజంలో జనించింది; నవవిధాన్, సాధారణ బ్రహ్మసమాజంలోని సత్యాన్వేషకు లందరూ భగవత్సాక్షాత్కారార్థం తమ జీవితాలను మలచుకొనే ప్రయత్నంలో మునిగిపోయారు. ఒకసారి ప్రతాపచంద్ర మజుందార్ శ్రీరామకృష్ణుల సాంగత్యం కోరి దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు, బ్రహ్మ సమాజస్థులు శ్రీరామకృష్ణుల సాంగత్యలబ్ధి పొందిన తరువాత సమాజ ఆధ్యాత్మిక భావాల పురోగతి, నైజం గురించి చెప్పమని మేం అతణ్ణి ప్రశ్నించాం. అందుకు అతడు, “ఆయనను దర్శించుకోవడానికి ముందు మతం అంటే ఏమిటో మాకు అవగతం అయిందా? ఉత్త డాబులరాయుళ్ళం. ఆయనను చూసిన తరువాతే నిజమైన ధార్మిక జీవితం అంటే ఏమిటో మాకు అర్థమైంది” అని అన్నాడు. అప్పుడు ఆచార్య చిరంజీవి శర్మ (త్రైలోక్యనాథ్ సన్న్యాల్) కూడా అక్కడే ఉన్నాడు.
17. సాధారణ బ్రహ్మసమాజంపై శ్రీరామకృష్ణుల ప్రభావం
నవవిధాన్పై శ్రీరామకృష్ణుల ప్రభావం స్పష్టంగా తెలియవస్తుంది. విజయకృష్ణ గోస్వామి ఆచార్య పదవిలో ఉన్నంత వరకు సాధారణ బ్రహ్మ సమాజంపై శ్రీరామకృష్ణుల ప్రభావం కొంతలో కొంత ఉంటూనే వచ్చింది. కాని విజయ్, తదితరులు సాధారణ బ్రహ్మసమాజాన్ని వదలిపెట్టి పోయాక, పై ప్రభావం తగ్గి పోయింది; ఆ సమాజం ఆధ్యాత్మికతను కోల్పోయి, సంఘ సంస్కరణాది కార్యాలలో నిమగ్నమైంది. పైన పేర్కొన్న ప్రభావం తగ్గినప్పటికీ, ఆ ప్రభావం పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు; యోగాభ్యాసం, వేదాంత అధ్యయనం అక్కడి కొందరి సభ్యులలో కొనసాగడమే ఇందుకు తార్కాణం. వారిలో కొందరు, కర్తాభజా సంప్రదాయస్థులు పాటించే వైదిక సూత్రాలను అనుసరించి, ధ్యానం సహాయంతో భౌతిక రుగ్మతలను నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా మాకు తెలియవచ్చింది.
18. బ్రహ్మసమాజ సంగీతంపై శ్రీరామకృష్ణుల ప్రభావం
నవవిధాన్ ఆచార్యుడైన చిరంజీవి శర్మ, బ్రహ్మసమాజ సంగీత పురోభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. కాని శ్రీరామకృష్ణుల భావపారవశ్యతలు సమాధులు చూసీ, దివ్యదర్శనాదుల గురించి విన్న తరువాతే ఉన్నత భావాలను జాగృతం చేసే గీతాలకు స్వరకల్పన చేశాడని తెలియ వస్తున్నది. అతడి కొన్ని పాటలలో మొదటి చరణాలను ఈ క్రింద పొందుపరుస్తున్నాం.
- ఓ జననీ! నీ నిరాకార సౌందర్యం చిమ్మచీకట్లో ప్రకాశిస్తూన్నది…
- అగాధ సమాధి సాగరం ఎల్లలు లేనిది…
- ఆహా! చైతన్య గగనాన దివ్యప్రేమ చంద్రుడు ఉదయించాడు…
- పరమానంద సాగర జలాలలో దివ్యప్రేమానందపు తరంగాలు…
- ఓ జననీ! దివ్యోన్మత్తత నాకు ప్రసాదించు…
ఈ అద్భుత గీతాలకు స్వరకల్పన చేసిన చిరంజీవి శర్మకు వంగ ప్రజలు యావన్మందీ, దేశం మొత్తంలోని సాధకులందరూ ఎంతో ఋణపడి ఉన్నారనడం అతిశయోక్తి కాదు. కేవలం శ్రీరామకృష్ణుల భావపారవశ్యాన్ని మాత్రమే చూసి ఈ పాటలను రచించాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. చిరంజీవి శర్మది మృదుమధుర కంఠస్వరం. అతడి సంగీతాన్ని వింటూ శ్రీరామకృష్ణులు భావ పారవశ్యమగ్నులవడం మేం అనేక పర్యాయాలు చూసివున్నాం.
19. బ్రహ్మసమాజానికి శ్రీరామకృష్ణుల గుర్తింపు
ఆ కాలఘట్టంలో శ్రీరామకృష్ణుల అసాధారణ ఆధ్యాత్మిక ప్రభావంతో ఆ రీతిలో బ్రహ్మసమాజం స్ఫూర్తి పొందింది. బ్రహ్మసమాజం ప్రచారం చేసే నిరాకారోపాసన అపక్వ రకానికి చెందిందని శ్రీరామకృష్ణులు చెప్పినప్పటికీ (III.2.54-57), హృదయపూర్వక విశ్వాసంతో ఒక సాధకుడు నిరాకారోపాసన ద్వారా భగవత్సాక్షాత్కారం పొందగలడని ఆయన స్వయంగా చెప్పడం మేం వినివున్నాం. సంకీర్తన తరువాత భగవంతుడికీ, అన్ని సంప్రదాయాలకు చెందిన భక్తులకూ ఆయన వంగి నమస్కరించేటప్పుడు, “బ్రహ్మజ్ఞానులైన ఆధునికులకు నమస్కరిస్తున్నాను” అంటూ బ్రహ్మసమాజస్థులకు నమస్కరించడం ఎన్నడూ మరచిపోలేదు. బ్రహ్మసమాజ మతం భగవత్సాక్షాత్కార స్థితికి చేర్చే ఒక మతమని ఆయన నిజంగానే నమ్మారనడం ఇందుమూలంగా స్పష్టమౌతున్నది. కాని బ్రహ్మసమాజస్థులు పాశ్చాత్య ప్రభావం నుండి బయటపడి, నిజమైన ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలనే ప్రగాఢ ఆకాంక్ష ఆయనకు ఉండేది. అందుకోసం ఎంతో శ్రమించారు కూడా. సంఘసంస్కరణలు, లోకోపకార కార్యాలు చేయడం ఎంతో శ్లాఘనీయమైనప్పటికీ, అవే మానవ జీవిత లక్ష్యాలు కావని ఆయన పదేపదే బ్రహ్మసమాజస్థులకు చెప్పేవారు; అదే సమయంలో భగవత్సాక్షాత్కారార్థం ఒనరించే పూజాది కార్యకలాపాలను నిరుపయోగంగా పరిగణించరాదనీ ఆయన వారికి తెలిపేవారు. శ్రీరామకృష్ణుల అసాధారణ ఆధ్యాత్మిక జీవితం గురించి ప్రప్రథమంగా బ్రహ్మసమాజమే బహిరంగంగా చర్చించింది; తద్ద్వారా కలకత్తావాసుల మనస్సులు దక్షిణేశ్వరం వైపుకు ఆకర్షింప బడ్డాయి. శ్రీరామకృష్ణుల పాదపద్మాల వద్ద కూర్చుని ఆధ్యాత్మిక శక్తిని, చిరశాంతిని సంతరించుకొని తరించిన ప్రతి ఒక్కరు నవవిధాన్కూ, సాధారణ బ్రహ్మసమాజానికీ ఎంతో ఋణపడి ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ రచయిత కూడా ఆ రెండు సమాజాలకు ఎంతో ఋణపడి ఉన్నాడు; ఎందుకంటే, యౌవన ప్రారంభంలో ఆ రెండు సమాజాలు అతడిలో ఉన్నతాశయాలు పాదుగొలిపి, అతడు తన ఆధ్యాత్మిక జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో ఎంతో దోహదం చేశాయి. భక్తితో, కృతజ్ఞతతో మేం ఆ సమాజానికి, వాటి మణిపూసలైన బ్రహ్మం, బ్రహ్మసమాజం, బ్రహ్మసమాజ బృందానికి – వారంతా యథార్థ ప్రకృతిపరంగా ఒక్కరే అని గ్రహించి – పదేపదే ప్రణామాలర్పిస్తున్నాం. శ్రీరామకృష్ణులు, బ్రహ్మసమాజస్థుల సాంగత్యంలో బ్రహ్మానందం పొందిన, కళ్ళారా మేం చూసిన రెండు సమావేశాల వివరణను పాఠకులకు అందిస్తున్నాం.