1. ఉద్యానగృహంలో బసచేయడంలో గురుదేవుల ఆనందం
పుష్యమాసంలో నూతన స్థలానికి తరలి వెళ్ళరాదనే సంప్రదాయం కారణంగా ఆగ్రహాయణం పూర్తికావడానికి ఒక రోజు ముందు శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ నుండి, కాశీపూర్‌కు ఏతెంచారని మునుపే చెప్పివున్నాం. జనసందడితో కోలాహలంగా ఉండే బాటపై నెలకొనివున్న శ్యాంపుకూర్ ఇంటి కంటే, కాశీపూర్ ఉద్యాన గృహం ఎంతో విశాలంగా, ఏకాంతంగా ఉంది. ఇక్కడ ఎటు చూసినా కనుచూపు మేర వరకు కానవచ్చే పచ్చని చెట్ల ఆకులు, రంగురంగుల పువ్వులు, ముదురు లేత గడ్డితో కూడిన పచ్చికబయళ్ళు కన్నుల పండువ చేస్తూంటాయి. దక్షిణేశ్వర కాళికాలయ ప్రాంగణ సహజ సౌందర్యంతో పోల్చిచూసినప్పుడు ఈ ఉద్యానం అంతంత మాత్రమే అయినప్పటికీ, నాలుగు నెలలు ఏకబిగిన కలకత్తాలో గడిపిన శ్రీరామకృష్ణులకు ఈ ఉద్యానం ఆహ్లాదకరంగానే తోచడంలో అతిశయోక్తి లేదు. తమకు కేటాయించిన మొదటి అంతస్తులోని విశాలమైన గదిలోకి ప్రవేశించగానే చుట్టూ కానవచ్చిన రమణీయకత ఆయనను ఎంతో ఆకట్టుకొంది. ఆయన దక్షిణం వైపు ద్వారం నుండి గది వెలుపలకు వచ్చి, డాబాపై నిలబడి, ఆ ఉద్యాన సౌందర్యాన్ని తిలకిస్తూ కొంతసేపు గడిపారు. మాతృదేవి కూడా ఈ ఉద్యానగృహాన్ని చూసి శ్యాంపుకూర్ ఇంటి మాదిరి పంజరంలో పక్షిలా ఉండవలసిన అవసరం ఇక్కడ లేదని, గురుదేవులకు ఎంతో చక్కని వాతావరణంలో సేవలు అందించవచ్చునని తలచి ఎంతో ఆనందించారు. కాశీపూర్ ఉద్యాన గృహాన్ని చూసి వారిద్దరూ సంతోషించడంతో గురుదేవుల సేవకులు పొందిన ఆనందం వర్ణనాతీతం.
2. శ్రీరామకృష్ణుల సేవకు మందీమార్బలం, ధనం అవసరమైనాయి
ఆ ఇంట్లో లోటుపాట్లను సరిదిద్దుకొని స్థిరపడడంలో కొద్దిరోజులు గడిచిపోయాయి. కాశీపూర్ ఉద్యానగృహం కలకత్తాకు దూరంగా ఉండడంవల్ల గురుదేవులకు చికిత్స చేస్తున్న డాక్టరు రాకపోకలకు, ఇళ్ళకు దూరంగా ఉండడం చేత అక్కడే బసచేసి స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్న భక్తుల ఖర్చులకు అధికంగా ధనం అవసరమై ఉందనీ, అట్లే మందీమార్బలం కూడా ఉండాలనీ నరేంద్రుడు దీర్ఘంగా యోచించి గ్రహించాడు. ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా యోచించి సముచిత ఏర్పాట్లు చేసుకోకపోతే, రాబోయే రోజుల్లో శ్రీరామకృష్ణులను సేవించడంలో ఇబ్బందులు ఎదురవడం తప్పదనీ నరేంద్రుడు గ్రహించకపోలేదు. మొట్టమొదటనుండి ఆర్థిక బాధ్యతలను చూసుకొంటున్న బలరాం, సురేంద్ర, రాం, గిరీష్, మహేంద్రాదులు ఇప్పుడు చక్కగా ఆ విషయం గురించి పరస్పరం సంప్రతించుకొని ఆర్థిక కొరత రాకుండా తగిన ఏర్పాట్లు చేశారు. మందీమార్బలం విషయం ఇంతకు ముందు మాదిరి నరేంద్రుడే చూసుకోవలసి వచ్చింది. అందువల్ల అతడు ఎక్కువ సమయం కాశీపూర్ ఉద్యానంలోనే గడపవలసి వచ్చింది. అతడు ఈ విషయంలో మార్గదర్శకత్వం వహించకపోతే తల్లితండ్రుల భయంతోనో లేక తమ చదువులకు ఆటంకం కలుగుతుందనో తక్కిన యువశిష్యులు కూడా ముందుకురాని పరిస్థితి ఎదురౌతుంది. ఎందుకంటే శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్లో బసచేసి ఉన్నప్పుడు వారు ఇళ్ళకు వెళ్ళి భోజనాదులు ముగించుకుని తిరిగి వచ్చి గురుదేవుల సేవలో నిమగ్నులయ్యేవారు. కాని కాశీపూర్ కలకత్తాకు దూరంగా ఉండడం వలన అలా చేయడం ఇప్పుడు వారికి సాధ్యం కాదు.
3. ఉద్యానగృహంలోనే బసచేసి గురుదేవులను సేవించాలని నరేంద్రుడు సంకల్పించడం
ఆ సంవత్సరం నరేంద్రుడు న్యాయశాస్త్ర పరీక్షకు చదువుతున్నాడు. కనుక కలకత్తాలోనే ఉంటూ చదువుకోవడం తప్పనిసరైంది. అందుకు తోడు ఉన్నత న్యాయస్థానంలో పూర్వీకుల ఆస్తి విషయంగా తన బంధువులపై వేసిన వ్యాజ్యెం కూడా అతడు స్వయంగా చూసుకోవలసిన అగత్యం ఎదురైంది. అయినప్పటికీ గురుదేవుల సేవకై ఆ అభిప్రాయానికి తిలోదకాలిచ్చేశాడు. న్యాయశాస్త్ర గ్రంథాలు కాశీపూర్‌కు తెచ్చుకొని, వీలు చిక్కితే చదువుకోవాలని నిర్ణయించుకొన్నాడు. ఇలా న్యాయశాస్త్ర పరీక్షలకు ఒక ప్రక్క చదువుకోవడమూ, మరో ప్రక్క గురుదేవులను సేవించడమూ నరేంద్రుడి అప్పటి అభిప్రాయంగా తెలియవస్తున్నది. ఎందుకంటే అతడికి మరో మార్గం కనిపించలేదు. ఎలాగో పరీక్షల్లో ఉత్తీర్ణుడై, కొన్ని సంవత్సరాలు కష్టించి పనిచేసి కొంతసొమ్ము సంపాదించి, తల్లి తమ్ముళ్ళ జీవితాలు తిండితిప్పలకు లోటు రాకుండా జరిగిపోయేలా ఏదో ఒక ఏర్పాటుచేసి, తదనంతరం సంసారాన్ని త్యజించి పూర్తిగా భగవత్సాక్షాత్కారం కోసం తన జీవితాన్ని అర్పించుకోవాలని అతడు భావించాడు. కాని విధివ్రాత మరోలా ఉంది! మనలో అనేకులం అటువంటి సత్సంకల్పాలు చేసుకొంటాం కాని దాన్లో ఎందరం విజయులమవుతున్నాం? సుఖంగా కూర్చుని, ‘ఇంతవరకు మాత్రమే నేను లౌకిక ప్రవాహంలో ఈదులాడతాను; ఆ తరువాత దృఢమైన సంకల్ప శక్తిని చూపి ఎదురీది తిరిగి వస్తాను’ అని ఊహాలోకంలో అంచనాలు వేసుకొంటాం, అనుకొన్న పథకం ప్రకారం పని ప్రారంభిస్తాం. కాని సంసారమనే ఆ సుడిగుండంలో చిక్కువడకుండా ఎందరం ఆవలి తీరాన్ని చేరగలుగుతాం?
1886 సం ॥ లో కాశీపూర్ ఉద్యాన గృహంలో నరేంద్రుడు (స్వామి వివేకానంద).
నరేంద్రుడు అత్యున్నత శ్రేణికి చెందిన ఆధ్యాత్మిక సాధకుడు, పైగా గురుదేవుల అపరిమిత అనుగ్రహానికి పాత్రుడైనవాడు. అటువంటప్పుడు అతడి సంకల్పం నెరవేరుతుందా? లేక కుటుంబ పరిస్థితులలో ఏర్పడే అనూహ్యమైన చిక్కులకు ఎదురొడ్డి తన సంకల్పానుసారం నిలబడగలడా? లేదా రాజీపడి పోతాడా? పాఠకుడా, వేచి ఉండు. అమోఘమైన గురుదేవుల సంకల్పశక్తి అతణ్ణి ఏ మార్గంలో ఏ విధంగా లక్ష్యాన్ని చేర్చగలిగిందో త్వరలోనే చూడగలం.*
4. జగజ్జనని మీద మాత్రమే శ్రీరామకృష్ణులు ఆధారపడి ఉండడం
ఇప్పటి దాకా శ్రీరామకృష్ణులను సేవించడానికి భక్తులు ఏం చేస్తూవచ్చారో మేం తెలియజేస్తూవచ్చాం. ఇప్పుడు మరో ప్రశ్న తలెత్తవచ్చు : “తమను గురించి ఏమీ ఆలోచించ కుండా గురుదేవులు ప్రతి దానికి భక్తుల మీదే ఇప్పుడు ఆధారపడి ఉన్నారా? దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు ఎవరు ఒక వంక వేద వేదాంతాలకు అతీతమైన సత్యాలను సాక్షాత్కరించుకొంటూ, మరో వంక చిన్నచిన్న దైనందిన వ్యవహారాలను, అట్లే ప్రతి భక్తుని లౌకిక ఆధ్యాత్మిక స్థితిగతులను గురించి ఒక కంట కనిపెడుతూ వచ్చారో ఆ గురుదేవులే ఇప్పుడు తమను గురించి ఏమీ ఆలోచించకుండా అన్నిటికోసమూ భక్తులపై ఆధారపడసాగారా?”
కాని అదిసరి కాదు. సదాసర్వవేళలా ఎవరి మీద భారంవేసి, ఎవరి సంకల్పానుసారం ప్రవర్తిస్తూ వచ్చారో, ఇప్పుడు కూడా ఆయన కేవలం ఆ జగజ్జననినే చూస్తూ ఆమె ఒక్కదానిమీదే ఆధారపడసాగారు. ఇదే పై ప్రశ్నకు సమాధానం.
జగజ్జనని సంకల్పానుసారమే తాము భక్తుల నుండి సేవలను స్వీకరిస్తున్నామనీ, అదంతా వారి మేలు కోసమేననీ ఆయనకు ముందే తెలుసు. శ్రీరామకృష్ణుల జీవితగాథను చెప్పేకొద్దీ ఈ ముఖ్యాంశం మరింత తేటతెల్లమౌతుంది.
5. తమ నేతృత్వంలో ఆయన ఏర్పాట్లు చేయించుకోవడం
ఒక్కొక్కప్పుడు శ్రీరామకృష్ణులు తమకు నచ్చని ఏర్పాట్లను భక్తులకు తెలిపిగాని, లేదా తెలిపితే వారు బాధపడతారని భావించి మరికొన్నిసార్లు వారికి తెలుపకుండా గాని మార్చేసేవారు. ఉదాహరణగా, ఆయన చికిత్స నిమిత్తం కలకత్తాకు రాబోతున్నప్పుడు బలరాంను పిలిచి “ఇలా చూడు, చందాలు వేసుకొని రోజూ నా భోజన ఏర్పాట్లు చేయడం నాకు సుతరామూ ఇష్టంలేదు. ఎందుకంటే నేను ఎన్నడు అలా జీవించలేదు. దక్షిణేశ్వర కాళికాలయంలో ఉంటున్నప్పుడు అలా చెయ్యలేదా అని నువ్వు అడగవచ్చు. ఎందుకంటే ఆలయ యాజమాన్యం విడిగా ఉంటున్నప్పటికీ, ఆలయ వ్యవహారాలను సంయుక్తంగా నిర్వహించేవారు. అటువంటప్పుడు ఒక రకంగా చూస్తే నా జీవనం సంయుక్తంగా వారి చందాల మీదనే గడిచిందని నువ్వు వాదించవచ్చు. కాని నిజం అది కాదు. అప్పుడు కూడా చందాలపై జీవించాల్సిన అగత్యం నాకు పట్టలేదు. పూజారిగా నాకు రాస్మణి కాలం నుండే నెలకు ఏడు రూపాయలు, నేను అక్కడ జీవించినంత కాలం నిత్యం ఆలయ ప్రసాదాలు సమర్పించాలనే ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఒక రకంగా చూస్తే నేనక్కడ పెన్షన్* మీద జీవించినట్లే. కనుక చికిత్స నిమిత్తం నేను దక్షిణేశ్వరానికి వెలుపల ఉన్నంత వరకు నా భోజన ఖర్చులు నువ్వే భరించు” అని చెప్పారు.
మళ్ళీ కాశీపూర్ ఉద్యాన గృహాన్ని అద్దెకు తీసుకొన్న తరువాత, ఆయనకు అద్దె చాలా ఎక్కువ అని తెలియవచ్చింది. భక్తులలో అనేకులు ఎంతో కష్టంతో తమ సంసారాలను గడుపుకొస్తున్న తరుణంలో ఇంత అద్దెను వారెలా భరించగలరో అని ఆయన విస్తుబోయారు. ఎట్టకేలకు ఆయన డోస్ట్ కంపెనీలో సూపరింటెండెంట్‌గా ఉంటున్న సురేంద్రనాథ్‌ను పిలిచి “ఇలా చూడు సురేంద్రా! వీరంతా చిన్నచిన్న గుమాస్తాలు, వచ్చే చిరు ఆదాయంతో కష్టం మీద కుటుంబాలను పోషించుకొంటున్నారు. చందాలు వేసుకొని అంత మొత్తాన్ని వారు సేకరించగలరా? కనుక అద్దె మొత్తం నువ్వే చెల్లించు” అని చెప్పారు. సురేంద్ర చేతులు జోడించి, “మీ ఆజ్ఞ” అంటూ సంతోషంగా అందుకు అంగీకరించాడు.
శ్రీరామకృష్ణులు ఒక రోజు బలహీనత వల్ల మలమూత్ర విసర్జన నిమిత్తం ఇకముందు బయటకు పోవడం కూడా కష్టమైపోతుందని మాకు చెప్పారు. శ్రీరామకృష్ణుల ఆ మాటలు విని యువభక్తుడైన లాటూ* ఎంతో బాధపడి, “మహాశయా, మీ ‘పాకీవాణ్ణి’ నేనిక్కడ ఉన్నాను” అని చేతులు జోడించిచెప్పాడు. వచ్చీరాని వంగభాషలో అతడు పలికిన ఆ మాటలు ఆ శోక సమయంలో గురుదేవులతో సహా అందరికీ నవ్వు తెప్పించాయి. ఈ విధంగా ఏర్పాట్లలో సరైన మార్పులను ఆయనే చేస్తూ భక్తులకు అసౌకర్యం కల్పించేవారు కారు.
లాటు, కాలాంతరంలో స్వామి అద్భుతానంద.
పెద్ద గోపాల్ (1829-1909) కాలాంతరంలో స్వామి అద్వైతానంద.
6. భావి సన్న్యాసి బృందం రూపుదిద్దుకోవడం
ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి. ఒక్కొక్కరుగా యువ భక్తులు, అవసరమైన సంఖ్య కంటే ఎక్కువగానే రాసాగారు. నరేంద్రుడు వారిని ధ్యానం, జపం, అధ్యయనం, సత్ప్రసంగాలు, శాస్త్రచర్చలు మొదలైన వాటిలో నిమగ్నులను చేశాడు. వీటిలో లీనమైపోయిన వారికి రోజులు ఎలా గడచి పోతున్నాయో తెలియరావడం లేదు. ఒక వంక గురుదేవుల విశుద్ధ నిస్వార్థప్రేమ, మరోవంక నరేంద్రుని ప్రగాఢ మైత్రి, ఉదాత్త సాంగత్యం ఈ రెండు ఆకర్షణలు ఆ యువకులను మధురకోమలమైన ఎడతెగని బంధంలో పెనవేశాయి. ఒకే కుటుంబంలోని సభ్యుల కంటే కూడా వారు అన్యోన్యంగా మెలుగుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఆ యువభక్తులలో ఎవరైనా దురదృష్టవశాత్తు అత్యవసరమైన పనిబడి ఇంటికి వెళ్ళవలసివస్తే అదే రోజు సాయంత్రమో, తప్పితే మర్నాటి ఉదయమో తప్పకుండా కాశీపూర్‌కు తిరిగి వచ్చేసేవారు. వారి అనుబంధం ఆ మేరకు పెనవేసుకు పోయింది. ఆ యువభక్తులు సంఖ్యలో పన్నెండు మంది* కంటే ఎక్కువ కాకపోయినా, వారంతా శ్రీరామకృష్ణుల అవతార పరిసమాప్తి వరకూ అక్కడే ఉండిపోయి, సంసారాన్ని పరిత్యజించి తమ సేవాదీక్షను పరిపూర్తి చేశారు. వారు గురుదేవులను తమ ప్రాణం కంటే మిన్నగా ప్రేమించిన కర్మకుశలురు.
7. శ్రీరామకృష్ణుల ఆరోగ్యం కించిత్తు మెరుగుపడడం
కాశీపూర్‌కు వచ్చిన కొద్ది రోజుల తరువాత శ్రీరామకృష్ణులు ఒక రోజు క్రిందికి దిగి కొంతసేపు ఇంటి చుట్టూ ఉన్న తోటబాట మీద పచార్లు చేశారు. అది చూసి భక్తులు సంతోషించారు. ప్రతి రోజూ అలా పచార్లు చేయగలిగితే ఆయన ఆరోగ్యం పుంజుకొంటుందని వారు ఆశించారు. ఆరుబయట చలిలో తిరగడం వలన జలుబు చేసిన కారణంగానో లేదా మరేదో కారణంగానో మర్నాడు ఆయన బలహీనపడి కొన్ని రోజుల దాకా పచార్లు చేయలేకపోయారు. రెండు మూడు రోజుల్లో జలుబు నయమైందిగాని, బలహీనత మాత్రం అట్లే ఉండిపోయింది. డాక్టర్లు కూరగాయలతో చేసిన చారును పుచ్చుకోమన్నారు. ఆయన అదే విధంగా పుచ్చుకోవడంతో కొద్ది రోజులలోనే బలహీనత ఎంతో మేరకు తగ్గిపోయింది. ఆయన ఆరోగ్యంలో పురోభివృద్ధి పదిహేను రోజులదాకా కొనసాగింది. ఈ మధ్యలో ఒక రోజు డాక్టర్ మహేంద్రలాల్ సర్కార్ వచ్చి ఆయన ఆరోగ్యం మెరుగుపడడం గుర్తించి ఎంతో సంతోషించాడు.
8. నరేంద్రుడు, యువశిష్యులకు పనులు అప్పగించడం
యువకులైన సేవకులు రోజూ కలకత్తాకు వెళ్ళి శ్రీరామకృష్ణుల ఆరోగ్యం గురించి డాక్టర్‌కు చెప్పి, వచ్చేటప్పుడు ఆయన పథ్యపానాదులకు కావలసిన సరంజామా తీసుకువచ్చేవారు. మొట్టమొదట ఈ రెండు పనులూ ఒకే వ్యక్తికి అప్పగించేవారు. అది ఎంతో అసౌకర్యానికి దారితీసింది. తరువాత ఆ రెండు అత్యవసరమైన పనులకు ఇద్దరిని కేటాయించారు. ఏదైనా మరో పని పడితే మూడో మనిషిని కలకత్తాకు పంపించేవారు. యువభక్తులు వరుస ప్రకారం ఇల్లు ఊడ్వడం, బారానగర్ బజారుకు వెళ్ళి నిత్యావసరాలు కొనుగోలు చేసిరావడం, రేయింబవళ్ళు గురుదేవులకు అవసరమైన సేవలు చేయడం వంటి పనులను నిర్వర్తించసాగారు. వారు చేసే ప్రతి పనిని నరేంద్రుడు పర్యవేక్షించేవాడు. హఠాత్తుగా ఏదైనా పని చేయవలసి వస్తే స్వయంగా తానే ఆ పని చేసేవాడు.
9. వంటలో మాతృదేవికి సోదరి లక్ష్మి సహాయపడడం
గురుదేవుల పథ్యపానాదులను మాతృదేవియే సిద్ధంచేసేవారు. ఏదైనా ప్రత్యేక పథ్యం చేయవలసి వస్తే డాక్టర్ నుండి దానిని తయారుచేసే విధానం ఆమె తెలుసుకొనేవారు. పెద్దగోపాల్ వంటి ఒకరిద్దరు భక్తులతో ఆమె నిస్సంకోచంగా మాట్లాడడం వలన, వారు ఆమెకు పథ్యం తయారుచేసే విధానాన్ని వివరించి చెప్పేవారు. వంట చేయడమే గాక స్వయంగా ఆమే మధ్యాహ్నం, సాయంత్రం గురుదేవులకు భోజనాన్ని తీసుకు వెళ్ళేవారు. ఆయన భోజనం ముగించే వరకు అక్కడే వేచి ఉండి, గిన్నెలు పాత్రలు తిరిగి తీసుకువెళ్ళేవారు. వంటా వార్పులలో మాతృదేవికి సహాయం చేయడానికీ, ఆమెకు తోడుగా ఉండడానికీ లక్ష్మీదేవిని (గురుదేవుల అన్నగారి కుమార్తె) కాశీపూర్‌కు తోడ్కొని వచ్చారు. అంతేగాక తరచు దక్షిణేశ్వరానికి శ్రీరామకృష్ణుల దర్శనార్థం వచ్చే భక్తురాండ్రు అప్పుడప్పుడు కాశీపూర్‌కు వచ్చి కొన్ని గంటలసేపు మాతృదేవికి తోడుగా ఉండి వెళ్ళిపోయేవారు. ఎప్పుడన్నా ఒకటి రెండు రోజులు వారు అక్కడే బస చేసేవారు కూడా. ఆ విధంగా కాలం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోసాగింది.
10. గృహస్థ భక్తులు – ఆర్థిక విషయాలు
గృహస్థ భక్తులు సైతం ఆ సమయంలో నిశ్చింతగా ఉండలేకపోయారు. వారు రాం లేదా గిరీష్ ఇంట్లో సమావేశమై గురుదేవుల సేవాకార్యం సాఫీగా సాగిపోవడం గురించి సంప్రదించుకొనేవారు. ప్రతి నెలా తాము అవసరమైనంత సమయాన్ని లేదా ధనాన్ని వెచ్చించలేరని వారికి తెలుసు; అందుకే నెలకు ఒకటి రెండుసార్లు సమావేశమై ముందుగానే ఆ విషయాల గురించి నిర్ణయాలు తీసుకొనేవారు.
11. భగవత్సాక్షాత్కారం కోసం యువభక్తులను నరేంద్రుడు ప్రేరేపించడం
ప్రతి పనీ క్రమబద్ధంగా సాగేటంత వరకు యువభక్తులలో అనేకులు స్వల్పకాలం ఇళ్ళకు వెళ్ళలేదు. అనివార్య పరిస్థితులలో ఇళ్ళకు వెళ్ళవలసి వచ్చిన వారు, ఇంటికి వెళ్ళి కొన్ని గంటలలోనే తిరిగి వచ్చేసేవారు. పైగా గురుదేవులు కోలుకునేటంత వరకు ఇంటికి రావడం సాధ్యం కాదని కబురు కూడా ఇంటికి పంపేవారు. యువభక్తుల తల్లితండ్రులు ఎవరూ ఈ విషయం తెలియగానే తక్షణమే ఆమోదించలేదని చెప్పడం అనవసరం. కాని వాళ్ళు చేయగలిగింది మాత్రమేముంది? తమ బిడ్డల మెదళ్ళు పాడైపోయాయని వారు అనుకొనేవారు. ప్రత్యక్షంగా ఈ విషయంలో జోక్యం చేసుకొంటే మంచి జరగడానికి బదులు చెడే జరుగవచ్చని వారికి తెలియకపోలేదు. కాబట్టి బిడ్డలను వారి దారిలోనే పోనిస్తూ నెమ్మదిగా పరోక్షంగా ఒత్తిడి, అనునయాలతో వారిని తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించేవారు.
ఆ విధంగా గృహస్థ భక్తులూ, బ్రహ్మచారి భక్తులూ(యువ భక్తులు) కలిసికట్టుగా, హృదయపూర్వకంగా దృఢసంకల్పంతో శ్రీరామకృష్ణుల సేవాదీక్షను పాటిస్తూన్నందున అంతా సవ్యంగా సాగిపోవడం చూసి నరేంద్రుడు నిశ్చింతుడయ్యాడు. తన వ్యవహారం గురించి ఆలోచించడానికి అప్పుడతడికి సమయం చిక్కింది. ఒకటి రెండు రోజులు ఇంటికి వెళ్ళివద్దామనుకొన్నాడు. మా అందరికీ ఆ విషయం తెలిపి రాత్రి పడుకోవడానికి వెళ్ళాడు; కాని నిద్రపట్టలేదు. కాసేపట్లోనే లేచి కూర్చున్నాడు. గోపాల్, మాలో ఒకరిద్దరం మేలుకొని ఉండడం చూసి, “రండి, తోటలో పచార్లు చేస్తూ పొగత్రాగి వద్దాం” అన్నాడు.
పచార్లు చేస్తూ నరేంద్రుడు “గురుదేవులు దుర్భరమైన రోగంతో బాధ పడుతున్నారు. దేహాన్ని త్యజించడానికి ఆయన సంకల్పించుకోలేదని ఎవరు చెప్పగలరు? కాబట్టి సమయం ఉన్నప్పుడే వారిని సేవిస్తూ, జపధ్యానసాధనలు అనుష్ఠిస్తూ ఆధ్యాత్మికంగా పురోగమిద్దాం. ఈ సదవకాశాన్ని జారవిడిస్తే, తరువాత మనం పడే పశ్చాత్తాపానికి అంతువుండదు. కోర్కెలన్ని ఈడేరిన తదుపరి భగవంతుణ్ణి ప్రార్థించడమా! ఇప్పుడు మన సమయమంతా ఇలా గడచిపోవడం లేదా? నానాటికీ మనం కోర్కెల వలలో చిక్కుకోవడం లేదా? ఈ కోర్కెలే ఎట్టకేలకు మన వినాశనానికీ, చావుకూ దారితీస్తాయి. కనుక కోర్కెలను త్యజిద్దాం; అవును, వాటన్నిటిని ఆమూలాగ్రం త్యజించివేద్దాం” అని వారిని ఉత్తేజపరిచాడు.
12. యువభక్తులు మానసికంగా ధునిలో కోర్కెలను దగ్ధం చేయడం
పుష్యమాసపు చలిరాత్రి మహానిశ్శబ్దంలో కునుకులు పడుతున్నది. అనంత వినీలాకాశం నక్షత్రాలనే కన్నులతో ఈ భూతలాన్ని నిశ్చలంగా వీక్షిస్తూన్నది. ప్రచండ సూర్యకిరణాల కారణాన ఎండిపోయిన చెట్ల క్రింద పరిశుభ్రంగా కూర్చోవడానికి అనువుగాఉంది. అనాసక్త వైరాగ్య పూరితమై ధ్యాన సిద్ధమైన నరేంద్రుని మనస్సుకు బాహ్య నిశ్శబ్దం తనలో తాను లీనమై పోతున్నట్లు అనిపించింది. ఇక నడక ఆపి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు. కాస్త దూరంలో ఎండిన గడ్డి, విరిగిన చెట్లకొమ్మల గుట్టను చూశాడు. అప్పుడతడు “వాటిని మండించండి. సాధువులు ఈ సమయంలో చెట్ల క్రింద ధునిని రగుల్చుతారు. మనం కూడా ధునిని రగిలించి, దాన్లో మన కోర్కెలను దగ్ధం చేసివేద్దాం” అని అన్నాడు. అట్లే ధునిని రగిలించారు. అన్ని పక్కల పడి ఉన్న ఎండుగడ్డి, పుల్లలను ఏరి మేం వాటిని అగ్నిలో పడేస్తూ మా హృదయాల్లోని కోర్కెలనన్నింటినీ ఆహుతిస్తూన్నట్లుగా ఎంచి, పరమానందం పొందసాగాం.
మా లౌకిక వాంఛలు అన్నీ దగ్ధమై, మా మనస్సులలో ప్రశాంతత పావనత్వాలు ఇనుమడించినట్లు, భగవంతుని సమీపిస్తున్నట్లు మేం భావించసాగాం. ‘అయ్యో, ఇంతకు మునుపే మేం ఎందుకు ఈ పని చేయలేదు? ఇది ఎంత ఆనందాన్ని కలిగించిందోగదా!’ అని అనుకున్నాం. వీలున్నప్పుడల్లా ఇలా ధునులను రగిలించాలని సంకల్పించుకొన్నాం. రెండు మూడు గంటలు అలా గడిచిపోయాయి. ఎండుకట్టెలు అయిపోయిన తరువాత, మంటను ఆర్పి వెళ్ళి పడుకొన్నాం. అప్పుడు సమయం వేకువజాము నాలుగు గంటలు. ఉదయం లేచిన తరువాత ఈ ధుని కార్యక్రమంలో పాలుపంచుకోలేకపోయిన మా మిత్రులు ఎంతో విచారపడ్డారు. తమను పిలువనందుకు ఎంతో నొచ్చుకొన్నారు. వాళ్ళను అనునయిస్తున్న ధోరణిలో, నరేంద్రుడు ఇలా అన్నాడు : “ముందుగా అనుకొని అలా చేయలేదు. అంత ఆనందం కలుగుతుందని ముందుగానే ఎవరు ఊహించారు? ఇకమీదట వీలున్నప్పుడల్లా మనం అంతా కలిసి ధునిని రగిలించి, ధ్యానం చేద్దాం. కనుక విచారించకండి.”
అనుకొన్న ప్రకారం ప్రొద్దుటే నరేంద్రుడు కలకత్తాకు వెళ్ళాడు; ఒక రోజు అక్కడ గడిపి కొన్ని న్యాయశాస్త్ర పుస్తకాలు పుచ్చుకొని కాశీపూర్‌కు తిరిగి వచ్చేశాడు.