1. కాశీపూర్
కాశీపూర్ ఉద్యాన గృహం ఉత్తర కలకత్తా గుండా వెళ్ళి బారానగర్‌లోని బాగ్బజార్ను కలిపే విశాలమైన మార్గంమీద, కలకత్తా నగరానికి మూడుమైళ్ళ దూరంలో నెలకొని ఉంది. బాగ్‌బజార్ వంతెన ఉత్తరంవైపు నుండి ప్రారంభమై కాశీపూర్‌కు దక్షిణంగా ఉన్న ఆ మార్గం ఇరువైపుల పేద శ్రామికుల గుడిసెలు, నిత్యావసర వస్తువులన్నీ లభించే చిన్న అంగళ్ళు కానవస్తాయి. అంతేకాక అక్కడక్కడ ఇటుక కట్టడాలవంటి జనుపనార మిల్లులు, డోస్ట్ కంపెనీకి చెందిన ఇనుప కర్మాగారం, రాలీ సోదరుల సంస్థ, ఒకటి రెండు ఉద్యానాలు లేదా ఇళ్ళు, పోలీస్ స్టేషన్, అగ్నిమాపకదళం స్టేషన్ మొదలైనవి కూడా కనిపిస్తాయి. పేదల సంపన్నుల జీవన పరిస్థితుల మధ్యవున్న భయంకరమైన తారతమ్యానికి సాక్షిగా ఉన్నట్లు ఈ ప్రాంతానికి ఒకింత పశ్చిమంగా కానవస్తుంది ప్రసిద్ధ సర్వమంగళాదేవి ఆలయం.
సియల్దాహ రైల్వేస్టేషన్ ఆవరణ మరింత విస్తృతించబడడంతో, తగరం కప్పులతో కూడిన చిన్నచిన్న గిడ్డంగులు ఆ మార్గం మీద ఉద్భవించి, గతంలోని ఆ ప్రాంతపు కించిత్తు అందాన్ని పాడుచేశాయి. ఈ పురాతన మార్గం ఆ విధంగా చిత్రకారుని దృష్టికి లేదా కవి దృష్టికి ప్రసన్నంగా కనిపించకపోయినా, చరిత్రకారుని దృష్టిలో కొంత విలువలేకపోలేదు. ఎందుకంటే ఈ మార్గం మీద పురోగమించే ఆంగ్లేయులకు చెందిన గోవిందపూర్ కోటను సిరాజ్ నవాబు* ఆక్రమించాడు. అంతేకాక బాగ్బజార్‌కు అరమైలు దూరంలో ఈ మార్గం మీదనే అపఖ్యాతిపాలైన ద్రోహి మీర్జాఫర్ నవాబు రాజభవనం ఒకప్పుడు ఉండేది. బాగ్‌బజార్ నుండి కాశీపూర్ కూడలి వరకు ఈ మార్గం ఏమాత్రం అందంగా ఉండదు; కాని అక్కడ నుండి బాగ్‌బజార్ వరకు పొడిగించబడ్డ మార్గం ఆకర్షణీయంగా ఉంటుంది.
కాశీపూర్ కూడలికి మరికొంత దూరం ఉత్తరంగా పోతే మతి చెరువు దక్షిణతీరం వస్తుంది. దానికి ఎదురుగుండా మార్గానికి తూర్పువైపు మా సుప్రసిద్ధ మిత్రుడైన మహిమాచరణ్ అందమైన ఇల్లు నెలకొని ఉంది. ఈ ఇంటి చుట్టూ గల ఉద్యానంలో అధికభాగం ఇప్పుడు రైలు కంపెనీ కొనుగోలుచేసి, గంగాతీరం దాకా రైలుపట్టాలు నిర్మించింది. ఈ కారణంగా ఈ ఇంటి పూర్వపు శోభ బాగా తగ్గిపోయింది.
ఇక్కడ నుండి కాస్త దూరం ఉత్తరం వైపుగా వెళితే మతిచెరువు ఉత్తర సరిహద్దు కనిపిస్తుంది. దీనికి ఎదురుగా, మార్గానికి తూర్పు వైపు ఎత్తైన ప్రహరీ గోడ, ఇనుప ద్వారంతో మన కాశీపూర్ ఉద్యానగృహం కనబడుతుంది. మతి చెరువు పశ్చిమ భాగానికి పశ్చిమంగా అనేక అందమైన ఉద్యాన గృహాలను చూడవచ్చు. వాటిలో కొన్ని గంగాతీరాన ఉన్నాయి. వీటి అన్నింటిలో మతిలాల్ సీల్‌కు చెందిన ఉద్యానగృహమే అత్యంత సుందరమైనది, ఆకర్షణీయమైనది. ఇప్పుడు గృహం కలకత్తా విద్యుత్ కంపెనీ అధీనంలోకి రావడం వల్ల గత సౌందర్యాన్ని, ప్రశాంతతను కోల్పోయి ఎడతెగని కోలాహలానికి కేంద్రమైపోయింది.
ఈ ఉద్యానానికి ఉత్తరంగా గంగాతీరాన శిథిలావస్థలోని బాసకుల ఇంటిని చూడవచ్చు. ఈ ఇంటికి దారితీసే బాటకు ఇరువంకలా చింతచెట్లు బారులుతీరి ఉన్నాయి. ఈ సుందర దృశ్యం దర్శనార్థుల మనస్సులను ఆహ్లాద పరుస్తుంటుంది.
మేం శ్రీరామకృష్ణులతో కాశీపూర్ ఉద్యాన గృహంలో బసచేసి ఉన్నప్పుడు గంగలో స్నానం చేయడం కోసం ఈ మతిలాల్ ఉద్యానానికి వెళ్ళేవారం. స్నానం ముగించి, ఘట్టానికి ప్రక్కన పెరుగుతున్న గుల్చి* చెట్ల నుండి సువాసనభరితమైన గుల్చి పుష్పాలను సేకరించి గురుదేవులకు సమర్పించేవారం. ఈ పుష్పాలంటే ఆయనకు ఎంతో ఇష్టం. తరచు ఆ చింతచెట్లున్న దారి గుండా నడిచి, బాసకుల శిథిలావస్థలోని ఉద్యానగృహానికి వెళ్ళి, గంగాతీరాన తాపీగా కూర్చునేవారం. ఈ ఉద్యానానికి ఉత్తరం వైపు కీ.శే. ప్రాణనాథ్ చౌధురికి చెందిన విశాలమైన స్నానఘట్టం ఉంది. ఆ ఘట్టానికి మళ్ళీ ఉత్తరాన సుప్రసిద్ధుడైన లాలాబాబు భార్య రాణీకాత్యాయనికి చెందిన అందమైన గోపాలుని ఆలయం ఉంది. అప్పుడప్పుడు మేం ఆ ఘట్టానికి స్నానార్థం వెళ్ళి, అలాగే ఆలయంలో మ్రొక్కి వచ్చేవారం. ఈ రాణీ కాత్యాయనీ అల్లుడే కీ.శే. గోపాల్ చంద్రఘోష్. అతడిదే కాశీపూర్ ఉద్యానగృహం. భక్తులు ఈ ఇంటిని నెలకు ఎనభై రూపాయల అద్దెకు, ఆరు నెలల కాలానికి పుచ్చుకొన్నారు. పిదప మరో మూడు నెలలకు ఒప్పందం పొడిగించుకొన్నారు. శ్రీరామకృష్ణుల గొప్ప భక్తుడైన సిమ్లాపేట వాస్తవ్యుడు సురేంద్రనాథ్ మిత్ర దస్తావేజు మీద సంతకం చేసి పూర్తి అద్దెను చెల్లించాడు.
2. కాశీపూర్ ఉద్యాన గృహం
పెద్దది కాకపోయినా కాశీపూర్ ఉద్యానగృహం ఎంతో అందమైనది. దాని విస్తీర్ణం నాలుగున్నర ఎకరాల కంటే కాస్త ఎక్కువ. ఈ చతుష్కోణాకృతిలోని ఉద్యానవనం ఉత్తరం నుండి దక్షిణం కంటే తూర్పు నుండి పడమరగా ఎక్కువ పొడవులో ఉంటుంది. నలువైపులా ఎత్తైన ప్రహరీగోడలు ఉన్నాయి. ఉత్తరం వైపు ప్రహరీగోడ మధ్యభాగాన్ని దాదాపు ఆనుకొని వరుసగా మూడు నాలుగు గదులు ఉన్నాయి. ఈ గదులు వంటకు, సామానులు నిల్వ చేసుకోవడానికి వినియోగపడతాయి. ఈ గదులకు ఎదురుగా, ఉద్యానానికి అటు వైపు రెండంతస్తుల నివాసగృహం ఉంది. ఈ ఇంట్లో మేడమీద రెండు గదులు, క్రింద నాలుగు గదులు ఉన్నాయి. క్రింద ఉన్న మధ్య గది ఎంతో విశాలమైనది. దీనికి ఉత్తరం వైపు ప్రక్కప్రక్కన ఉన్న రెండు గదులు చిన్నవి. ఈ గదులలో పశ్చిమంగా ఉన్న గది నుండి మొదటి అంతస్తుకు దారితీసే చెక్కమెట్ల వరుస ఉంది. తూర్పు గది మాతృదేవి కోసం కేటాయించారు. పైన పేర్కొన్న తూర్పు పడమరలుగా విస్తరించిన విశాలమైన గదిని, దానికి దక్షిణాన ఉన్న గదిని, ఆ గదికి తూర్పునున్న వసారాను భక్తులు కూర్చోవడానికి, నిద్రించడానికి ఉపయోగించ సాగారు. క్రిందనున్న విశాలమైన గదికి సరిగ్గా పై అంతస్తులో అంతే పరిమాణంలో చతురస్రాకారంలో ఒక గది ఉంది. శ్రీరామకృష్ణులు ఈ గదిలోనే బసచేశారు. దీనికి దక్షిణంగా పిట్టగోడలతో ఒక చిన్నడాబా ఉంది. అప్పుడప్పుడు ఇక్కడే శ్రీరామకృష్ణులు పచార్లు చేసేవారు, లేదా కూర్చునేవారు. దీనికి ఉత్తరంగా మెట్లకు దారితీసే గది కప్పు, మాతృదేవికి కేటాయించిన గది మీదుగా అంతే పరిమాణంలో ఒక చిన్నగది ఉన్నాయి. ఇక్కడే శ్రీరామకృష్ణులు స్నానాదులు చేసేవారు. రాత్రిపూట ఒకరిద్దరు సేవకులు ఈ గదిని ఉపయోగించేవారు.
ఈ కాశీపూర్ ఉద్యాన గృహానికి తూర్పు, పశ్చిమాలలో క్రిందనున్న విశాలమైన గదికి దారితీసే మెట్లున్నాయి. ఇంటి చుట్టూ ఇటుకలతో నిర్మితమైన వృత్తాకార తోట బాట ఉంది. ఉద్యానానికి నైరుతి మూల పశ్చిమం వైపు ఉన్న ప్రహరీగోడకు ఆనుకొని ద్వారపాలకుడికి చిన్నగది, దానికి ఉత్తరాన ఇనుప ద్వారం ఉన్నాయి. గుర్రపుబళ్ళు పోవడానికి అనువుగా ఒక అర్ధచంద్రాకార తోట బాట ఈశాన్యంగా వెళ్ళి, ఇంటి చుట్టూవున్న వృత్తాకార బాటలో కలుస్తోంది. ఇంటికి పశ్చిమాన చిన్న కొలను ఉంది. ఇంట్లో క్రిందవున్న విశాలమైన గదికి దారితీసే పశ్చిమంవైపు ఉన్న మెట్లకు ఎదురుగా, తోటబాటకు అటువైపు ఈ కొలనుకు దారితీసే మెట్లున్నాయి. ఉద్యానానికి ఈశాన్యం మూల ఒక కొలను ఉంది. ఇది పైన పేర్కొన్న కొలను కంటే నాలుగైదు రెట్లు పెద్దది. ఉద్యానానికి వాయవ్యాన రెండు మూడు గదులు ఉన్నాయి. ఉద్యానం వాయవ్యంలో గుఱ్ఱపుశాల ఒకటి ఉంది. పైన పేర్కొన్న కొలనుకు పశ్చిమాన ఉద్యానం దక్షిణపు గోడ వద్ద తోటమాలి కోసం ప్రక్కప్రక్కన శిథిలావస్థలోని ఇటుకలతో కట్టిన రెండు గదులు ఉన్నాయి. ఉద్యానంలో తక్కిన చోట్ల మామిడి, పనస, లిచీ వంటి పండ్ల చెట్లు ఉన్నాయి. తోట బాటలు రెండు వైపులా పువ్వుల మొక్కలతో అలంకరింపబడి ఉన్నాయి. చిన్న, పెద్ద చెరువుల సమీపంలోని స్థలాలలో వంటకు కావలసిన ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. అలాగే చెట్ల నడుమ పచ్చికను పెంచడం వలన ఉద్యానం రమణీయకత ఇనుమడించింది.
కాశీపూర్ ఉద్యానగృహం శ్రీరామకృష్ణుల అంత్యలీల జరిపిన ప్రదేశం (11 డిసెంబర్ 1885 నుండి 16 ఆగష్టు 1886)
3. శ్రీరామకృష్ణులు కాశీపూర్‌కు వచ్చి తమ యువ శిష్యులకు శిక్షణ గరపడం
శ్రీరామకృష్ణులు ఈ ఉద్యానగృహానికి 1885, డిసెంబర్ 11 వ తేదీన వచ్చారు. గడచిన ఎనిమిది నెలల కాలంలో వ్యాధి బాగా ముదిరిపోవడంతో శ్రీరామకృష్ణుల పొడవైన దృఢకాయం చిక్కి శల్యమైపోయి ఎముకల గూడులా తయారైంది. అయినప్పటికీ పరిపూర్ణ ఆత్మసంయమం సంతరించుకొన్న ఆయన మనస్సు రోగాన్ని, బాధను ఏమాత్రం ఖాతరు చేయలేదు. వ్యక్తిగతంగా, సామూహికంగా ఎడతెగకుండా, అవిరామంగా ఉపదేశాల ద్వారా తమ భక్తులకు శిక్షణ గరపే కార్యం, ఇంతకు మునుపే ప్రారంభమైన ఈ కార్యాన్ని ముగించడం కోసం ఆయన నడుం బిగించారేమో అన్నట్లుగా ఆయన కనిపించసాగారు. పైగా దక్షిణేశ్వరంలో పలుమార్లు ఆయన భక్తులకు చెప్పిన భవిష్యద్వాణి ఇప్పుడు అక్షరాలా జరుగుతూండడం మేం సదా చూస్తూవున్నాం. అనేక సందర్భాలలో ఆయన ఇలా చెప్పేవారు: “నేను చనిపోవడానికి ముందు రహస్యాన్నంతా (తాము భగవదవతారమనే విషయం) బట్టబయలు చేసి పోతాను” ; “అనేకులకు (నా దివ్యత్వం) తెలియవచ్చి, దానిని గురించి చెప్పుకోవడం ప్రారంభించినప్పుడు ఈ తొడుగు (ఆయన దేహం) నిలవదు, అమ్మ సంకల్పంతో ఛిన్నాభిన్నమౌతుంది” ; “ఆ (వ్యాధిగ్రస్థులైన) సమయంలో అంతరంగ భక్తులెవరో, ఎవరు కారో తేలిపోతుంది.”
నరేంద్రాది భక్తుల గురించి ఆయన చెప్పిన భవిష్యద్వాణిని మేము ఇక్కడే అర్థం చేసుకోగలిగాం: “అమ్మ తన విశేష కార్యం నిమిత్తం నిన్ను (నరేంద్రుణ్ణి) ఈ భూమికి కొనివచ్చింది; కనుక నన్ను అనుసరించే తీరాలి; నన్ను విడిచి ఎక్కడకు వెళ్ళగలవు?” ; “వారంతా (యువశిష్యులు) హోమపక్షి వంటి వారు. ఆ పక్షి ఆకాశంలో ఎంతో ఎత్తులో వసిస్తుంది. అది అక్కడే గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లు అత్యంత వేగంతో క్రిందపడసాగుతాయి. అవి నేలను తాకి ముక్కలుముక్కలై పోతాయేమోనని భయం వేస్తుంది. కాని అలా జరగదు. క్రింద పడేలోపే అవి పొదగబడి పక్షికూనలు బయటకు వస్తాయి. క్రింద పడుతూ ఉండగానే వాటికి రెక్కలు మొలుచుకువస్తాయి. తక్షణం అవి రెక్కలు విప్పుకొని, పైకి ఎగిరి వాటి కోసం ఎదురుచూస్తున్న తల్లిని చేరతాయి. అదే విధంగా వీరు (యువ భక్తులు) కూడా కట్టివేయబడడానికి ముందే సంసారాన్ని త్యజించి భగవంతుని వైపుగా మరలుతారు”
పైగా శ్రీరామకృష్ణులు, నరేంద్రునికి విశేష శిక్షణనిచ్చి, మలచి, తన యువభక్తుల బాధ్యతను అతడికి అప్పగించి, వారికి మార్గదర్శకత్వం వహింప ఉపదేశాలిచ్చింది ఇక్కడే. అందుచేత కాశీపూర్‌లో నెరవేర్చిన పని ఎంతో ప్రాధాన్యం వహించిందని ప్రత్యేకంగా చెప్పడం అనవసరం.
4. ఈ ఉద్యానగృహాన్ని సంరక్షించుకోవడంలోని ప్రాముఖ్యత
కనుక శ్రీరామకృష్ణుల జీవితంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకొన్న సంఘటనలు జరిగిన ఈ పావన స్థలాన్ని పదిలపరిస్తే ఆయన ఒనరించిన ఆ కార్యాల పావన స్మృతులు చెక్కు చెదరక తరతరాల దర్శనార్థుల హృదయాలలో స్ఫూర్తిని జాగృతం చేసి వారిలో ఆధ్యాత్మిక ప్రేరణను కలిగిస్తాయనడం తథ్యం. కాబట్టి అందరి మనస్సులలోను ఇటువంటి బలీయమైన కోర్కె జనించడం సహజమే. కాని అప్పట్లో ఈ కోర్కె నెరవేరడంలో (1920 లో) ఒక గొప్ప ఆటంకం కలిగినట్లు, ఆ స్థలాన్ని కైవశం చేసుకోవడానికి రైల్వే కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాగే కనుక జరిగితే గురుదేవుల ఈ దివ్య లీలాస్థానపు రూపం మారిపోయి జనుపనార గిడ్డంగిగానో, రైల్వేదొడ్డిగానో నిలుస్తుంది* . ఇది భగవంతుని అనుజ్ఞ అయితే మానవమాత్రుడు ఏమి చేయగలడు? ఈ విషయాన్ని భగవదాజ్ఞకు వదిలిపెట్టి ఇక్కడతో ముగిద్దాం.