1. తమ సూక్ష్మ దేహంలో శ్రీరామకృష్ణులకు పుళ్ళు కానరావడం
శ్యాంపుకూర్లో బసచేసి ఉన్నప్పుడు శ్రీరామకృష్ణులకు ఒక అద్భుత దర్శనం కలిగింది. తమ గదిలో పచార్లు చేస్తున్నప్పుడు తమ స్థూలశరీరం నుండి సూక్ష్మశరీరం వెలుపలకు రావడం ఆయన చూశారు. ఆ సూక్ష్మశరీరం వీపు అంతా, ముఖ్యంగా గొంతు ప్రాంతంలో పుళ్ళు ఆవరించి ఉన్నాయి. ఆ సూక్ష్మశరీరాన్ని చూస్తూ ఆ పుళ్ళు ఏర్పడడానికి కారణ మేమిటోనని ఆశ్చర్యపోయారు. ఎన్నో పాపాలు చేసిన జనులు ఆయనను తాకడంతో పునీతులైనారు; వారి పాపాలు ఆయనకు సంక్రమించడంతో ఆయన సూక్ష్మ శరీరంపై పుళ్ళు ఏర్పడ్డాయని జగజ్జనని ఆయనకు తెలియచేసింది. జీవులను ఉద్ధరించడానికి లక్షసార్లు జన్మనెత్తడానికి కూడా వెనుకాడనని దక్షిణేశ్వరంలో పలుమార్లు ఆయన చెప్పడం స్వయంగా మేం విని ఉన్నాం. కాబట్టి పైన పేర్కొన్న దర్శనాన్ని పొంది ఏమాత్రం దిగులు చెందక సంతోషంగా ఆయన ఆ విషయం తెలుపడం మాకు విచిత్రంగా తోచలేదు. ఆయన అపార కారుణ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని చర్చించుకొంటున్నప్పుడు ముగ్ధులమయ్యేవారం.
శ్రీరామకృష్ణులు పూర్వపు ఆరోగ్యాన్ని పుంజుకొనేటంత వరకు క్రొత్తవారి నెవరినీ ఆయన పాదాలను తాకి ప్రణామం చేయనివ్వరాదని భక్తులు, ముఖ్యంగా యువకులైన భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండసాగారు. అలాగే భక్తులలో కొందరు తమ గత విశృంఖల జీవితాలను తలచుకొని, ఇకపై గురుదేవుల పావన దేహాన్ని తాకరాదని నిశ్చయించుకొన్నారు.
కాని నరేంద్రుని వంటి ఒకరిద్దరు శ్రీరామకృష్ణుల పై దర్శనం గురించి తెలిసి, దాని రహస్యాన్ని పరిశోధించ ప్రయత్నించసాగారు. ఇతరుల కర్మఫలాన్ని కొందరు మహాపురుషులు స్వచ్ఛందంగా స్వీకరించి దానిని స్వయంగా అనుభవించ గలరనే నమ్మకం క్రైస్తవ, వైష్ణవాది మతాలకు మూలాధారంగా ఉంది. శ్రీరామకృష్ణుల పై అనుభవం భక్తులను ఆ పరిశోధనకు ప్రేరేపించింది.
2. క్రొత్త దర్శనార్థుల పట్ల నిబంధనలు
క్రొత్తగా వస్తున్న దర్శనార్థులను శ్రీరామకృష్ణుల వద్దకు పోకుండా అడ్డుకొంటున్న భక్తుల ప్రయత్నం చూసి గిరీష్‌చంద్ర, “ప్రయత్నించి చూడండి, తప్పేమీ లేదు; కాని అది అసాధ్యం. ఎందుకంటే శ్రీరామకృష్ణుల అవతరణ ఇందుకోసమే” అని చెప్పాడు. రోజులు గడిచేకొద్దీ గిరీష్ ఊహ నిజమని తేలింది. పూర్తిగా అపరిచితులైన వ్యక్తులను అడ్డుకోవడం సాధ్యమైనప్పటికీ, భక్తులకు పరిచయస్థులైన క్రొత్తవారిని ఆపడం సాధ్యం కాలేదు. కాబట్టి తొలి నిర్ణయం మార్చుకోవలసి వచ్చింది. పూర్తిగా అపరిచితులైన వ్యక్తులను గురుదేవుల వద్దకు వెళ్ళనివ్వరాదని తీర్మానించారు. పరిచయస్థులైన భక్తులకు గురుదేవుల పాదాలను తాకి ప్రణామం చేయరాదని కట్టడి చేశారు. తీవ్రవ్యాకులత గల పూర్తి అపరిచితులైన వ్యక్తులు వచ్చినప్పుడు ఈ నియమాన్ని కూడా ఉల్లంఘించవలసివచ్చేది.
3. ఒక నటి శ్రీరామకృష్ణులను దర్శించడం
పై నిబంధనను పాటిస్తున్నప్పుడు ఒక తమాషా సంఘటన జరిగింది. శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరంలో నివసిస్తున్నప్పుడు ఒక సందర్భంలో గిరీష్ ప్రదర్శించిన ఒక ధర్మసంబంధమైన నాటకాన్ని* తిలకించడానికి థియేటర్‌కు వెళ్ళారు. ఆ నాటకంలో నాయకిపాత్రను పోషించిన నటిని ఆయన ఎంతో ప్రశంసించారు. నాటకం ముగిశాక భావసమాధిమగ్నులై ఉన్న శ్రీరామకృష్ణుల పాదపద్మాలను అర్చించే భాగ్యం ఆమె పొందింది. ఆనాటి నుండి ఆమె, శ్రీరామకృష్ణులను సాక్షాత్తు భగవంతునిగా ఆరాధించసాగింది. మళ్ళీ ఆయనను దర్శించుకొనే అవకాశం కోసం ఆమె నిరీక్షిస్తూ ఉంది. శ్రీరామకృష్ణుల తీవ్ర అనారోగ్యం గురించి విని, ఆయనను ఒకసారి దర్శించుకోవాలని ఆమె ఆరాటపడసాగింది. కాళీపద ఘోష్ ఆమెకు పరిచయస్థుడు కావడం వలన గురుదేవులను దర్శించుకోవడంలో తనకు సహాయం చేయమని అతణ్ణి పదేపదే బ్రతిమిలాడింది. ఆ భారమంతా అతడి మీదే వేసింది. కాళీపదుడు అన్ని విషయాలలోను గిరీష్ శిష్యుడే. శ్రీరామకృష్ణులు అవతారమూర్తులు కనుక పశ్చాత్తాపం చెందిన పాపులు ఎవరైనా ఆయనను తాకినా ఆయనకు ఎలాంటి హాని వాటిల్లదని గిరీష్ మాదిరే ఇతడూ విశ్వసిస్తాడు. అందువలన గురుదేవుల వద్దకు ఆ నటిని తోడ్కొని పోవడానికి అతడు ఎంత మాత్రం సంశయించలేదు.
వినోదిని (1863 – 1942) శ్రీరామకృష్ణుల ఆశీస్సులు పొందిన ప్రఖ్యాత నటీమణి
కాళీపదఘోష్ (1849 – 1905)
ఒకరోజు రహస్యంగా సంప్రతించి, ఆనాటి బెంగాలీ యువకునిలా పాశ్చాత్య వేషధారణలో ఆ నటిని తోడ్కొని కాళీపదుడు నాటి సాయంత్రం శ్యాంపుకూర్ ఇంటికి వచ్చాడు. ఆమెను తన నేస్తంగా మాకు పరిచయం చేసి, గురుదేవుల వద్దకు ఆమెను తోడ్కొని వెళ్ళి, ఆయనతో నిజం చెప్పేశాడు. ఆ సమయంలో మేమెవరమూ గదిలో లేనందున అతడికి ఏ అడ్డంకీ లేకపోయింది. మా కళ్ళలో దుమ్ముకొట్టడానికి ఆ నటి ఆ వేషధారణలో వచ్చిందని తెలుసుకొని హాస్యప్రియులైన శ్రీరామకృష్ణులు ఆహ్లాదంగా నవ్వుకున్నారు. ఆమె భక్తి విశ్వాసాలను చూసి ప్రసన్నులై ఆయన ఆమె సాహసాన్ని, తెలివితేటలను, భక్తిప్రపత్తులను ప్రశంసించారు. పిదప ఆమెకు ఒకింత ఆధ్యాత్మికోపదేశం చేశారు. ఆనందబాష్పాలు స్రవిస్తూండగా ఆ నటి మహాభక్తితో తలను గురుదేవుల పాదాలపై పెట్టి ప్రణామం చేసి, సెలవు పుచ్చుకొని కాళీపదునితో తిరిగి వెళ్ళిపోయింది. జరిగిన అసలు విషయాన్ని తదనంతరం శ్రీరామకృష్ణుల ద్వారా మేం తెలుసుకొన్నాం. కాని మమ్మల్ని అంత చాకచక్యంతో కన్నుగప్పడం చూసి ఆయన ఎంతో సంబరపడి నవ్వుకోవడం చూశాక, కాళీపదునిపై మేం కోపగించు కోలేకపోయాం.
4. భక్తులలో భావోద్వేగం అధికరించడానికి కారణం
శ్రీరామకృష్ణుల పావన సాంగత్యం, ఆయనకు చేస్తున్న సేవల ఫలితంగా భక్తులలో ఆయన పట్ల ఉన్న భక్తివిశ్వాసాలు ఎన్నోరెట్లు అధికరించిన మాట నిజమే. కాని వారి మనస్సులు ఇప్పుడు యథార్థ ఆధ్యాత్మికతకు పూర్తిగా వ్యతిరేక మార్గంలో పయనించే ప్రమాదంలో పడ్డాయి. తీవ్ర వైరాగ్యం, దుస్సాధ్యమైన ఆత్మసంయమాలకు బదులుగా తాత్కాలిక భావోద్వేగం కొందరు భక్తులకు ప్రియం కాసాగాయి. భావోద్వేగం ఎంత మధురంగా కానవచ్చినా అది కనుక తీవ్రవైరాగ్యం, ఆత్మ సంయమాలకు దారితీయకపోతే, కామక్రోధాది అంతఃశత్రువులను నిర్జించే శక్తిని అందివ్వలేదనే విషయం వీరు అవగతం చేసుకోలేకపోయారు.
ఈ భావోద్వేగం అధికరించడానికి చాలా కారణాలున్నాయి. మొదటి కారణం : సులభమార్గాలను, సత్వర ఫలితాలను పొందగోరడం మానవ నైజం. ఆధ్యాత్మికపరులుగా పరిగణింపబడే అనేకులు భగవంతుణ్ణి, ప్రాపంచికతను అంటే వైరాగ్యాన్ని, సుఖభోగాలను రెండింటినీ ఆకాంక్షిస్తారు. ఇవి రెండు చీకటి వెలుగులలా పరస్పర విరుద్ధాలనీ, రెండింటినీ ఏకకాలంలో పొందడం అసాధ్యమనీ అరుదైన ఏ కొద్దిమందో గ్రహిస్తారు. భగవత్సాక్షాత్కారం కోసం సర్వసంగపరిత్యాగం చేసి పయనం సాగిస్తే తప్ప గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యమనే విషయం వారు గ్రహించలేరు. కాని మూర్ఖులకు కొదవలేదు కదా! రెండు తీరాలను ఏకకాలంలో చేరడమనే అసంభవాన్ని సంభవం చేయబోయి వీరు తమ పడవను ఈ తీరం నుండి ఒకింత దూరం పోనిచ్చి, జీవితాంతం లంగరు వేసిన తీరులో అక్కడే చతికిలపడిపోతారు.
అందువలననే తమ వద్దకు వచ్చే ప్రతి వ్యక్తినీ వివిధ రీతుల్లో పరీక్షించి పైన పేర్కొన్న రెండు కోవల్లో ఆ వ్యక్తి ఏ కోవకు చెందుతాడో శ్రీరామకృష్ణులు తేల్చుకొనేవారు. అలా పరీక్షించి ఆ ఫలానా వ్యక్తి రెండవ కోవకు (అంటే భగవంతుణ్ణీ సంసారాన్నీ రెంటినీ కోరుకొనే వర్గానికి) చెందిన వాడని తేల్చుకొంటే, అతడు అవగతం చేసుకొని జీర్ణించుకోగలిగిన మేరకే పరిత్యాగ ఆదర్శాన్ని ఉపదేశించేవారు. కాబట్టే యోగ్యత ననుసరించి ఆయన వివిధ వ్యక్తులకు విభిన్న రకాల ఉపదేశాలు ఇచ్చేవారు. గృహస్థభక్తులకు, అవివాహిత శిష్యులకు విభిన్నంగా ఉపదేశించేవారు. జనులకు ఉపదేశాలిస్తూన్నప్పుడు భగవన్నామ సంకీర్తనమూ, నారదీయభక్తీ ఈ కలియుగానికి ఉపయుక్తమైనవని ఆయన చెప్పడానికి ఇదే కారణం. ఆ కాలంలో జనసామాన్యంలో మత, శాస్త్ర అధ్యయనాలు ఎంత అడుగంటి పోయాయంటే నూరుమందిలో ఒక్కరికైనా నారదీయ భక్తి అవగతమై ఉంటుందనడం సందేహమే. భగవంతుని నిమిత్తం సర్వసంగ పరిత్యాగం చేయాలనే విషయం నారద మహర్షి బోధించాడని జనానికి తెలియదు. కనుక దుర్బల స్వభావవశవర్తులై ఇహాన్నీ పరాన్నీ సంతరించుకోగోరి, అధికరించిన తాత్కాలిక భావోద్వేగం ఆధ్యాత్మిక అనుభూతికి పరాకాష్ఠగా ఎంచి శ్రీరామకృష్ణుల అజ్ఞానులైన భక్తులు కొందరు తప్పుటడుగులు వేశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఆ పొరపాటుకు భక్తులను దారితీయించిన రెండవ కారణం : శ్రీరామకృష్ణులలో ప్రస్తుతం అభివ్యక్తమౌతున్న అసాధారణ భావ పరవశతకు మూలం మేం ఆయన వద్దకు రావడానికి ముందు ఆయన ఒనరించిన కఠోర సాధనానుష్ఠానాదుల ఫలితమే అని అర్థం చేసుకోలేకపోవడం.
పై పొరపాటుకు భక్తులను దారితీయించిన అత్యంత ముఖ్యకారణం గిరీష్‌చంద్ర ఘోష్ తన ‘ముక్త్యారునామా’ ను గురుదేవులకు సంపూర్ణంగా సమర్పించి, ఆయన యుగావతారులని దృఢంగా విశ్వసించి ఆ విషయం ఆనందంతో ఉత్సాహంతో ఎలుగెత్తి అందరి ముందు చాటడమే అని చెప్పాలి. శ్రీరామకృష్ణులు అవతారమూర్తులని అంతకు ముందు నుండి ఎందరో పరిగణిస్తూ వచ్చినప్పటికీ, ఆయన నిషేధాజ్ఞను శిరసావహించి ఎవరూ ఆ భావాన్ని వెల్లడించలేదు. ఎందుకంటే అసంఖ్యాకులు తమను అవతార పురుషునిగా పరిగణించి ఎప్పుడు తమ చుట్టూ గుమిగూడతారో, అప్పుడు ఈ లోకం నుండి తాము నిష్క్రమించబోతున్నట్లు గ్రహించాలని భక్తులను ఆయన హెచ్చరిస్తూ వచ్చారు.
కాని గిరీష్‌చంద్ర ఆలోచనా ధోరణే వేరు. తన జీవితంలో అతడెన్నడూ తన భావాలనూ లేదా చేతలనూ అవి మంచివైనా చెడువైనా దాచిపెట్టి ఎరుగడు. కాబట్టి అతడు గురుదేవుల నిషేధాన్ని పాటించలేకపోయాడు. పైగా తన మేధస్సు, జీవితానుభవాలు, మహోత్సాహం, ప్రగాఢ విశ్వాసం – వీటి దోహదంతో తాను శ్రీరామకృష్ణుల యథార్థ మహత్త్వాన్ని అవగతం చేసుకొని ఆయనకు సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకోగలిగాననే విషయం అతడు విస్మరించాడు. కనుక విచక్షణారహితంగా అందరినీ తన మాదిరిగానే వ్యవహరించమని ప్రోత్సహించాడు. దాంతో పురుషప్రయత్నం, భక్తిప్రపత్తులు, పరిత్యాగం, తపశ్చర్యల అవసరాన్ని ఉపేక్షించి, ‘ఆయనకు ముక్త్యారునామాను ఇచ్చివేశాం’, ‘ఆయనకు మేం ఆత్మసమర్పణం చేసేసుకొన్నాం’ అంటూ ఉత్తమాటలు వల్లిస్తూ, భగవత్ సాక్షాత్కారమనేది అతి సులభమని జనం అభిప్రాయపడసాగారు. శ్రీరామకృష్ణుల పట్ల గిరీష్‌కు గల అపారభక్తి అతడి మేధస్సు అతణ్ణి తప్పుదారి పట్టించకుంటే, అతడు అలా ప్రచారం చేసివుండేవాడు కాడు. సనాతన ధర్మానికి పట్టిన గ్లానిని తొలగించి మానవాళికి వినూత్న ఆధ్యాత్మిక జాగృతాన్ని కలిగించి, ‘తాపత్రయం’ తో బాధపడుతున్న జీవులు తమను ఆశ్రయించి సులభంగా తరించే నిమిత్తం స్వచ్ఛందంగా జన్మ జరా వ్యాధులను స్వీకరింప శ్రీరామకృష్ణులు మానవదేహం దాల్చారని గిరీష్ ప్రగాఢంగా నమ్మాడు. అటువంటప్పుడు శ్రీరామకృష్ణులు తమ ఉద్యమాన్ని పూర్తిగావించకుండా నిష్క్రమించరని అతడి బుద్ధికి స్ఫురించింది. అందువలన శ్రీరామకృష్ణులను ఆశ్రయించి తనలా శాంతి, దివ్యానందాన్ని పొందమని అతడు ఇతరులను ఆహ్వానించడాన్ని తప్పుపట్టలేం.
5. రామ్, తన ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకొనే ప్రయత్నంలో గిరీష్‌ను అనుకరించడం
రాంచంద్ర వంటి పెద్దలైన భక్తుల తెలివి గిరీష్‌చంద్ర కుశాగ్రబుద్ధి, వాదనాపటిమ ముందు తీసికట్టే. రాంచంద్ర ఒక వైష్ణవ కుటుంబంలో జన్మించాడని ఇంతకు మునుపే తెలిపివున్నాం. కాబట్టి అతడు శ్రీరామకృష్ణులను సాక్షాత్తు శ్రీకృష్ణుని గాను, గౌరాంగునిగాను ఎంచడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. అయినా గిరీష్, గురుదేవుల అవతారతత్త్వాన్ని ప్రకటించడానికి మునుపు రాంచంద్ర తన సిద్ధాంతాలను ప్రకటించడంలో కొంత సంయమనం పాటించాడు. కాని గిరీష్ ప్రకటన అతడి ఉత్సుకతకు అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. శ్రీరామకృష్ణులు కేవలం ఒక అవతారపురుషులని ప్రకటించడంతోనే ఇతడు ఆగిపోలేదు. మరి కాస్త ముందుకు వెళ్ళి శ్రీరామకృష్ణుల పూర్వ అవతారాలైన గౌరాంగ, శ్రీకృష్ణుల భక్తులు, ఇప్పటి శ్రీరామకృష్ణుల ఫలానా ఫలానా భక్తులని గుర్తించే ఊహాకల్పనలలో తేలిపోసాగాడు. తాత్కాలిక భావోద్వేగానికి గురియై ఏ భక్తులు శారీరక మార్పులకు లోనైనారో, కొన్ని సమయాలలో బాహ్యస్మృతిని కోల్పోయారో, ఆ సదరు వ్యక్తులే రాంచంద్ర అంచనాలో ఉత్కృష్టులని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
6. విజయకృష్ణ గోస్వామి ఆ మంటను ప్రజ్వలింపచేయడం
శ్రీరామకృష్ణులు యుగావతారులనే ప్రగాఢ విశ్వాసం కారణంగా భక్తులు భావోద్వేగమనే ఉరవడిలో కొట్టుకుపోతూండగా విజయకృష్ణ గోస్వామి ఢాకా నుండి గురుదేవులను చూడడానికి వచ్చాడు. ఒక రోజు ఢాకాలో తన గదిలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు సశరీరంగా శ్రీరామకృష్ణులు తనకు ఎలా దర్శనం ఇచ్చారో, తాను ఆయన శరీరాన్ని, అవయవాలను ఎలా స్పృశించాడో (IV.5), ఆ వైనాన్ని అందరి ముందు వెల్లడించాడు. అతడు అలా వెల్లడించడం దావాగ్నికి పెనుగాలి తోడైనట్లయింది. ఆ సమయంలో భక్తి సంగీతం వింటూ వింటూ ఐదారుగురు భక్తులు పాక్షికంగా బాహ్యస్మృతిని కోల్పోతూండేవారు. వీరు యుక్తి యుక్తత, నిత్యానిత్య వివేకంతో కూడివున్న ఆధ్యాత్మిక అనుష్ఠానమనే రాజమార్గాన్ని వీడి, అద్భుతాలు జరుగుతాయని పిచ్చిగా ఎదురుచూడడం అలవరచుకొన్నారు. శ్రీరామకృష్ణుల దివ్యశక్తి ఏ సమయంలోనైనా ఏదైనా చేయగలదనే నమ్మకంతో వీరు నిరీక్షించసాగారు.
7. ఈ భావోద్వేగాన్ని అరికట్ట నరేంద్రుని ప్రయత్నాలు
అనారోగ్యకరమైన ఈ తాత్కాలిక భావోద్వేగాన్నే కొందరు భక్తులు ఆధ్యాత్మిక జీవితానికి పరాకాష్ఠగా ఎంచుతున్నారని నరేంద్రుని నిశిత దృష్టి తక్షణం పసిగట్టింది. శ్రీరామకృష్ణులు తమ భక్తులలో నరేంద్రునికి అత్యున్నత స్థానం ఇచ్చేవారు. వైరాగ్యం, ఆత్మసంయమం, ఏకాగ్రభక్తి మొదలైన ఆధ్యాత్మిక ఉన్నత లక్షణాలతో పోల్చి చూస్తే ఈ తాత్కాలిక భావోద్వేగం నిరర్థకమైనదనీ, దానిని ఈ విధంగా వదలి వేస్తే మున్ముందు హాని వాటిల్లే ప్రమాదం కూడా ఉందనీ నరేంద్రుడు గ్రహించాడు. కాబట్టి నరేంద్రుడు దీనిని భక్తులకు విశదీకరించి పరిస్థితిని చక్కబెట్టాలని ప్రయత్నించాడు.
భక్తులు భ్రష్టుపట్టే అవకాశం ఉందని చూసి కూడా శ్రీరామకృష్ణులు నిర్లిప్తంగా ఎందుకు ఉండిపోయారనే ప్రశ్న తలెత్తవచ్చు. అందుకు సమాధానం: ఆయన ఉదాసీన వైఖరిని పాటించలేదు. అసలుసిసలైన భావోద్వేగం భగవత్ సాక్షాత్కారానికి దారితీసే మార్గమని ఆయనకు తెలియకపోలేదు. భక్తులలో నిజానికి ఎవరు ఇందుకు అర్హులో అని గమనిస్తూ అటువంటి వారిని ఆ మార్గంలో నడిపించడానికి ఒక అనుకూల సందర్భం కోసం ఆయన ఎదురుచూడసాగారు. ఎందుకంటే, ‘ఎంతగా కోరుకున్నప్పటికీ సముచిత సమయం ఆసన్నమయ్యే వరకు ఏదీ రాదు’, ‘సాఫల్యం సమయాపేక్షం’, ‘ప్రతిదీ సరైన సమయం కోసం నిరీక్షిస్తుంది’ అని ఆయన అప్పుడప్పుడు అనడం మేం వినివున్నాం. మళ్ళీ, తప్పులు చేస్తున్న భక్తులను సరిదిద్దడానికి నరేంద్రుడు చేస్తున్న ప్రయత్నాన్ని గమనిస్తూ, తత్ఫలితానికి ఆయన ఎదురుచూస్తున్నారేమో ఎవరి కెరుక! లేదా ఈ విషయంలో నరేంద్రుణ్ణి పరికరంగా ఉపయోగించి, భక్తులను సరిగా తీర్చిదిద్దడమే ఆయన ఉద్దేశమేమో ఎవరు చెప్పగలరు?
8. భావోద్వేగం జీవితంలో నిరంతర పరిణామాన్ని ఉత్పన్నం చేయదు
దేహదారుఢ్యాలు, నిశ్చితమైన మనస్సులూ గల యువభక్తులు తన మాటలను అవగతం చేసుకోగలరని తలచి, యుక్తితర్కాలను దృష్టాంతీకరిస్తూ నరేంద్రుడు ఆ భావోద్వేగ వెల్లువకు ఎదురొడ్డి నిలిచాడు. అతడు ఇలా చెప్పాడు : “భావోద్వేగం మానవ జీవితంలో పూర్తి ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడదు. అది క్షణిక కాలంలో భగవత్సాక్షాత్కారం పొంద మనిషిని తహతహ లాడిస్తుంది. కాని మరుక్షణంలోనే కామినీ కాంచనాల ప్రలోభానికి లొంగకుండా ఎదుర్కొనే శక్తిని సడలిపోతుంది. కాబట్టి అది జీవితంలో ఎంతో నిరర్థకమైనది. దాని ప్రభావంలో కొందరికి అశ్రువులు స్రవించడం, గగుర్పాటు, తాత్కాలిక శారీరక మార్పులు కలగడం కద్దు; లేదా తాత్కాలికంగా కొందరు బాహ్యస్మృతి కోల్పోవచ్చు. అయినా ఇవన్నీ నరాల బలహీనత లక్షణాలని నా దృఢనమ్మకం. తన సంకల్పశక్తితో ఇటువంటి భావోద్వేగాన్ని అణచుకోలేని పక్షంలో, పౌష్టిక ఆహారాన్ని తినాలి, అవసరమైతే వైద్యుణ్ణి సంప్రతించాలి.”
9. కన్నీరు స్రవించడంలో, గగుర్పాటులో, శారీరక మార్పులలో కృతిమత్వం హానికరం
నరేంద్రుడు కొనసాగించాడు: “ఈ శారీరక మార్పులలో, బాహ్యస్మృతి కోల్పోవడంలో ఎంతో కృత్రిమత కానవస్తుంది. మనలను మనం అదుపులో పెట్టుకోగల సమర్థత పెంపొందేకొద్దీ, యథార్థమైన భావోద్వేగం ప్రగాఢ తరమౌతుంది. అరుదైన ఏ కొద్ది మందిలో మాత్రమే మహాశక్తిమంతమైన ఈ ఆధ్యాత్మిక భావోద్వేగ తరంగాలు సంయమమనే ఆనకట్టను ఛేదించి శారీరక మార్పులుగా, బాహ్యస్మృతి కోల్పోవడాలుగా అభివ్యక్తీకృతమౌతాయి. మూర్ఖులు ఈ విషయం అర్థంచేసుకోలేక, ఈ ప్రక్రియను తల్లక్రిందులుగా చేస్తారు. ఈ శారీరక వికారాల ద్వారా, బాహ్యస్మృతిని కోల్పోవడం ద్వారా ఆధ్యాత్మిక భావోద్వేగ ప్రగాఢతను సంతరించుకొన్నట్లు వారు భావిస్తారు. కాబట్టి ఆ మార్పులు తమలో ఏర్పడడానికి వీరు ఎరుకతోనే తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. ఆ అభిలాష, ప్రయత్నం క్రమంగా వారిలో అలవాటుగా మారి, రోజులు గడిచేకొద్దీ నరాల దుర్బలతగా పరిణమిస్తుంది. కాలక్రమంలో ఈ తాత్కాలిక భావోద్వేగం కించిత్తు పొడచూపినా ఆ మార్పులు యాంత్రికంగా ఏర్పడడం కద్దు. తత్ఫలితంగా వెఱ్ఱివారు కావడమో లేదా స్వేచ్ఛగా వాటిలో మునిగిపోయి ఎడతెగని రుగ్మతకు గురికావడమో జరుగుతుంది. ధార్మికతను అనుష్ఠించే ప్రయత్నంలో నూటికి ఎనభై శాతం మంది దగాకోర్లుగాను, పదిహేను శాతం మంది పిచ్చివాళ్ళుగాను మారతారు; తక్కిన ఐదు శాతం మంది సత్యసాక్షాత్కారం సంతరించుకొని తరిస్తారు. కాబట్టి అప్రమత్తంగా ఉండండి” అని హెచ్చరించాడు.
10. నరేంద్రుని మాటల పట్ల దృఢ విశ్వాసం ఏర్పడడం
నరేంద్రుని పై మాటలు నిజమని మేం మొదట్లో నమ్మలేదు. కాని ఒకింత కాలంలోనే అతడి మాటలలోని నిజం రూఢి అయింది. ఒక భక్తుడు ఏకాంతంలో కూర్చుని భావోద్వేగాన్ని పురిగొల్పే పాటలు పాడుతూ, దానికి తగిన శారీరక మార్పులను కల్పించుకోవడానికి ప్రయత్నించడం తలవని తలంపుగా కంటబడింది. భావావేశంలో ఒకింత బాహ్యస్మృతిని కోల్పోయి మనోహరంగా నృత్యం చేసే ఒక భక్తుణ్ణి చూసి మరో భక్తుడు అదే రీతిలో నృత్యం అభ్యసించసాగాడు. ఈ రెండవ భక్తుణ్ణి చూసి మూడవ భక్తుడు దానిని అనుకరించసాగాడు. మరొక భక్తుడు తరచు భావోద్వేగపరవశుడు కావడం గమనించి నరేంద్రుడు ఏకాంతంలో అతడి మూర్ఖత్వాన్ని ఎత్తిచూపి, ఆ భావోద్వేగాన్ని అదుపులో ఉంచుకోమనీ పౌష్టికాహారాన్ని పుచ్చుకోమనీ సుతిమెత్తగా సలహా ఇచ్చాడు. నరేంద్రుని సలహాను తు.చ. తప్పకుండా పాటించిన ఫలితంగా ఆ భక్తుడు పదిహేను రోజులలోనే ఆరోగ్యం పుంజుకోవడమే కాక ఆత్మసంయమాన్ని కూడా ఎంతో మేరకు సంతరించుకోగలిగాడు.
నరేంద్రుని వచనాలలోని నిజాలు తమ కళ్ళముందు ప్రత్యక్షంగా ద్యోతకమవడంతో అతడి మాటలలోని సత్యాన్ని నమ్మక తప్పలేదు. పై భక్తులలా తమలో కూడా శారీరక మార్పులు కలుగకపోవడం, బాహ్యస్మృతిని కోల్పోలేకపోవడం తమ దురదృష్టమని వాపోతున్న భక్తులు ఇప్పుడు అలా అనుకోవడం మానుకొన్నారు.
11. భావోద్వేగాన్ని నరేంద్రుడు అపహాస్యం చేయడం
నరేంద్రుడు ఈ విషయాన్ని తర్కవాదాల సహాయంతో మాత్రమే ప్రచారం చేసి ఊరుకోలేదు. ఎవరిలోనైనా కించిత్తు కృత్రిమ భావోద్వేగాన్ని పసిగడితే అందరి ముందు దానిని పరిహసిస్తూ వినోదించేవాడు; దాంతో ఆ భక్తుడు సిగ్గుపడి, చిన్నబుచ్చుకొనేవాడు. ఒక కోవకు చెందిన వైష్ణవులలో బాగా ప్రాబల్యంలో ఉన్న ఒక సాధనానుష్ఠానంలో పురుషుడు స్త్రీల హావభావాలను అనుకరించడం కద్దు. ఆ అనుకరణ ఒక్కొక్కప్పుడు ఎంతో పరిహాసాస్పదంగా పరిణమిస్తుంది. నరేంద్రుడు పై అంశాన్ని ప్రస్తావించి మాకు కడుపుబ్బ నవ్వు పుట్టించేవాడు. మాలో అటువంటి భావోద్వేగం పట్ల మక్కువ గలవారిని ఎగతాళి చేస్తూ వారు, భగవంతుని ‘స్నేహితురాళ్ళ’ కోవకు చెందుతారని చెప్పేవాడు. పురుషసింహుడైన నరేంద్రుడికి, సాధన పేరిట పురుషుడు తన పురుషత్వాన్ని (పౌరుషం), పరిశ్రమను, అసదృశమైన సత్యాన్వేషణను విడిచిపెట్టి స్త్రీల హావభావాలను అనుకరిస్తూ, వైష్ణవ గీతాలు ఆలాపిస్తూ విలపిస్తూండడం జుగుప్సాకరంగా తోచేది. అందుకే వీరభావంతో సాధనలు అనుష్ఠిస్తూ నిత్యానిత్య వివేచనతో కూడిన భక్తిభావాన్ని పొందగోరే వారిని ‘శివుని భూతగణం’ గాను, తద్విరుద్ధమైన సాధన చేసేవారిని ‘స్నేహితురాళ్ళు’ గాను హాస్యగంభీరంగా మారుపేరుతో పిలిచేవాడు.
12. భావోద్వేగ స్థానే నిక్కమైన వైరాగ్యం, దైవభక్తి నెలకొల్ప నరేంద్రుని ప్రయత్నాలు
తన తర్కం, ఎత్తిపొడుపులతో తాత్కాలిక భావోద్వేగపరుల బృందంలో గండు పెట్టడంతో నరేంద్రుడు తృప్తి చెందలేదు. కేవల ప్రచారం వాంఛిత ఫలాన్ని అందివ్వలేదనీ, దాని స్థానే ఒక కొత్త మానసిక వైఖరి పాదుగొల్పనంత వరకూ అది సాధ్యం కాదనీ గట్టిగా నమ్మిన నరేంద్రుడు, దాని కోసం ఎంతో ప్రయత్నించసాగాడు. తీరిక దొరికినప్పుడల్లా యువ భక్తులను చేరదీసి వైరాగ్యం, దైవభక్తి, సంసారంలోని అనిత్యాల గురించి వారి హృదయాలలో జాగృతం కలిగించే పాటలు వారితో కలిసి పాడసాగాడు, వారి హృదయాలలో ఆ ఉత్కృష్ట ఆధ్యాత్మిక భావజ్వాల ప్రజ్వలింప ప్రయత్నించ సాగాడు. శ్రీరామకృష్ణులను దర్శించడానికి వచ్చి, సుమధుర కంఠంతో నరేంద్రుడు పాడిన గీతాలు, స్తోత్రాలు విన్న ఫలితంగా తమ హృదయాలలో జనించిన వైరాగ్య ప్రేరణతో కన్నీరు స్రవిస్తూండగా తిరిగి వెళ్ళినవారు ఎందరో! నరేంద్రుడు పాడిన కొన్ని పాటలు –
ఓ చిద్ఘనుడా, ఓ అమృతసాగరా ।
నీ నామకీర్తనంతో జీవితం మధురమయమౌతూన్నది ।